చంద్రబాబు నాయుడు చొరవ అభినందనీయం

 

ఫీజు రీయింబర్స్ మెంట్ అంశంపై తెలంగాణా ప్రభుత్వం పెట్టిన స్థానిక మెలికతో ఇంజనీరింగ్ కౌన్సిలింగు చాలా గందరగోళంగా మారింది. ఆంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కౌన్సిలింగుకు తెలంగాణా విద్యార్దులెవరూ వెళ్ళవద్దని స్వయంగా తెలంగాణా విద్యాశాఖ మంత్రే పిలుపునీయడంతో లక్షలాది విద్యార్ధులు అయోమయంలో పడ్డారు. తెలంగాణా ప్రభుత్వం 1956సం.ను స్థానికతకు ప్రతిపాదికగా తీసుకోవడంతో తెలంగాణాలో పుట్టిపెరిగిన ఆంధ్రా విద్యార్ధులే కాక, తెలంగాణా విద్యార్ధులు కూడా అయోమయంలో పడ్డారు. కౌన్సిలింగుకు వెళితే ఒక సమస్య వెళ్ళకపోతే మరొక సమస్య అన్నట్లు తయారయింది వారి పరిస్థితి.

 

తెలంగాణా ప్రభుత్వం ఈ సమస్యలను సామరస్య ధోరణితో పరిష్కరించుకొనే ప్రయత్నం చేయకపోగా, ఆంద్ర ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగి సమస్యను మరింత జటిలం చేస్తోంది. ఆంధ్రరాష్ట్ర మంత్రులు కూడా వారి విమర్శలకు అంతే ధీటుగా బదులిస్తున్నారు. అయితే ఈ వివాదాల వలన లక్షలాది విద్యార్ధుల జీవితాలు అస్తవ్యస్తమవుతాయనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా చొరవ తీసుకొని, జనాభా ప్రాతిపదికన 52:48 నిష్పత్తిలో ఇరు ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్ మెంట్ ఖర్చు భరిద్దామని ప్రతిపాదించారు. ఉన్నత విద్యామండలి అంచనా ప్రకారం ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం మొత్తం రూ.4000 కోట్లు అవసరం ఉంటుందని, దానిలో తమ ప్రభుత్వం 52శాతం భరించేందుకు సిద్దంగా ఉందని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమస్యను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు తెలంగాణా ప్రభుత్వం కూడా ముందుకు రావాలని చంద్రబాబు కోరారు. ఆయన ఈవిధంగా చొరవ చూపడం చాలా అభినందనీయం. తెలంగాణా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఈ సమస్యకు బహుశః ఇదే పరిష్కారం సూచించవచ్చును. అందువల్ల తెలంగాణా ప్రభుత్వం మొండి పట్టుదలకు పోకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన విధంగా ఫీజు రీయింబర్స్ మెంట్ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకొంటే అందరూ హర్షిస్తారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu