సీఐడీ అధికారులా.. రౌడీలా! వారెంట్ లేకుండానే అరెస్ట్? 

కోర్టులకు వరుసగా మూడు రోజు సెలవులు.. రఘురామ కృష్ణం రాజు పుట్టిన రోజు... ఇకేం తమ కక్ష తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ సమయం అనుకున్నారో ఏమో పక్కాగా స్కెచ్ వేశారు వైసీపీ నేతలు. ఏపీ సీఐడీ  పోలీసులను రంగంలోకి దింపారు. జగన్ రెడ్డి సర్కార్ అదేశాలతో హైదరాబాద్ లోని ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఇంటికి చేరుకున్న ఏపీ సీఐడీ పోలీసులు... ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడ తీసుకెళ్లారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. అయితే మొదట్లో వారిని సీఆర్పీఎఫ్ పోలీసులు అడ్డుకున్నారు. తమ ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే అదుపులోకి తీసుకునేందుకు ఒప్పుకుంటామని తేల్చి చెప్పారు.  రఘురామకృష్ణరాజుపై 124/ఏ, 153/బీ, 505 ఐపీసీ, 120(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం. సెక్షన్ 50 కింద రఘురామ భార్య రమాదేవికి సీఐడీ నోటీసులు ఇచ్చింది ఏపీ సీఐడీ. 

గత కొంతకాలంగా ఏపీ సర్కార్‌పై రఘురామ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.  సీఎం జగన్, సజ్జల, వైవీ సుబ్బారెడ్డి తదితరులపై ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ తప్పులను ఎండగడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు రావడం.. అరెస్ట్ చేయడం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని లేపుతోంది. పుట్టినరోజునే రఘురామ కృష్ణం రాజును అరెస్ట్ సంచలనంగా మారింది. 

నర్సాపురం ఎంపీ రఘురామ అరెస్టుపై ఆయన కుమారుడు భరత్ స్పందించారు. వారెంట్‌ లేకుండా తన తండ్రిని అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. రఘురామకృష్ణరాజు అరెస్ట్‌కు కారణాలు కూడా చెప్పకుండా.. కోర్టులో చూసుకోండని సీఐడీ అధికారులు అన్నారని భరత్‌ చెప్పారు. ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదని, అధికారం చేతిలో ఉందని ఏమైనా చేస్తారా? అని ప్రశ్నించారు. పుట్టినరోజు నాడే అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.‘‘కరోనా సమయంలో ఒక ఎంపీని ఎలా అరెస్ట్‌ చేస్తారు? రఘురామకు ఆరోగ్యం కూడా బాగాలేదు. ఆయనకు మూడు నెలల కిందటే గుండె శస్త్రచికిత్స జరిగిందని చెప్పారు. ఇదంతా ఓ స్కెచ్. వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో అర్థం కావడం లేదన్నారు.  కనీసం న్యాయవాదితో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని తెలిపారు. ఈ అరెస్ట్ అన్యాయం అని, కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తామని భరత్ వెల్లడించారు.