త‌గ్గేదేలే.. పీఆర్సీ జీవోలకు కేబినెట్ ఆమోదం.. ఉద్యోగుల స‌మ్మె సైర‌న్‌..

ప్ర‌భుత్వం పీఆర్సీ పంతం వీడ‌ట్లేదు. ఉద్యోగులు పీఆర్సీపై ప‌ట్టు వీడ‌ట్లేదు. ఎవ‌రికి వారే త‌గ్గేదేలే అంటూ స‌త్తా చాటుతున్నారు. పీఆర్సీ జీవోల‌తో ఉద్యోగుల జీతాల‌కు భారీ చిల్లు ప‌డుతోంది. ఆ జీవోలు వెంట‌నే ర‌ద్దు చేయాలంటూ ఉద్యోగులు రోడ్డెక్కి పోరాడుతున్నారు. అయినా, పీఆర్సీలో ఎలాంటి మార్పు లేదంటూ.. ఆ జీవోల‌కు ఏపీ మంత్రివ‌ర్గం ఆమోద ముద్ర వేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలను యథాతథంగా అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు, కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు, జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు 20 శాతం రిబేట్‌.. పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. 

పీఆర్సీపై ఉద్యోగులు మండిప‌డుతున్నారు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి సహాయ నిరాకరణ.. 7 నుంచి సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ పీఆర్సీ సాధన సమితి సమావేశమైంది. విజయవాడలోని ఎన్జీవో హోంలో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భేటీ అయ్యారు. పీఆర్సీ పోరాట కార్యాచరణపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 24న సమ్మె నోటీసు ఇవ్వాలని తీర్మానించాయి. 

సీఎస్‌ సమీర్‌శర్మను కలిసి పాత జీతాలే ఇవ్వాలని కోర‌డం.. ఈ నెల 23న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, 25న ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ నెల 26న అన్ని తాలూకా కేంద్రాల్లో అంబేడ్కర్‌ విగ్రహాలకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వనున్నారు. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు తీర్మానించాయి. ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాలని కార్యాచరణ ప్రకటించారు. 

మరోవైపు, ట్రెజరీ డైరెక్టర్‌కు పే అండ్‌ అకౌంట్స్‌ ఉద్యోగుల సంఘం లేఖ రాసింది. వేతన బిల్లులు ప్రాసెస్ చేయబోమని చేతులెత్తేసింది. బిల్లులు ప్రాసెస్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని.. తాము మాత్రం పీఆర్సీ ఉద్యమంలో పాల్గొంటున్నామని స్పష్టం చేసింది. కొత్త పీఆర్సీ ప్ర‌కారం బిల్లులు రెడీ చేయాల్సిన ట్రెజ‌రీ ఉద్యోగులే అందుకు నిరాక‌రించ‌డంతో ఏపీ స‌ర్కారు సందిగ్థంలో ప‌డింది. పీఆర్సీపై ఎలా ముందడుగు వేయాల‌ని మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది.