4 లక్షల హార్డ్ క్యాష్ తో అడ్డంగా బుక్కయిన ఎమ్మార్వో

ఎన్ని ఏసీబీలు ఉన్నా, ఇంకెన్ని విజిలెన్స్ టీంలు పనిచేస్తున్నా ప్రభుత్వాధికారుల్లో లంచావతారుల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు వస్తున్నారు.. పోతున్నారు. కానీ ప్రజారంజకమైన పాలన మాత్రం అందించలేకపోతున్నారు. ప్రజల కష్టార్జితం మీద కన్నేసిన ప్రభుత్వాధికారులకు ధనదాహం తీరడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి తహసీల్దార్ నాగభూషణం లంచతంత్రం బయటపడింది. రూ. 4 లక్షల నగదు క్యాష్ పుచ్చుకుంటున్న ఎమ్మార్వోను శ్రీకాకుళం జిల్లా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పలువురు ఆసాములు దక్కించుకున్న షాపులకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి జరిగిన బేరసారాల్లో రూ. 4 లక్షలు ఇవ్వడానికి ఆసాములు అంగీకరించారు. అయితే అప్పటికే తమ పని జరగడానికి రెవెన్యూ కార్యాలయ సిబ్బంది కొర్రీలు వేయడం, తీరా పని జరిగేటప్పుడు కూడా ఎక్కడా కనికరం చూపకపోవడంతో ఆసాములంతా తెలివిగా ఏసీబీని ఆశ్రయించారు. 

ముందుగా అనుకున్న పథకం ప్రకారం ఒకరిద్దరు ఆసాములను రంగ ప్రవేశం చేయించిన ఏసీబీ అధికారులు.. డబ్బు ముట్టజెపుతుండగా నాగభూషణాన్ని చుట్టుముట్టారు. భారీ మొత్తంలో డబ్బు చేతులు మారుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. టెక్కలిలోని వెలుగు కార్యాలయం పక్కన గల షాపులను పలువురు ఆసాములకు హ్యాండోవర్ చేసే క్రమంలో ఎమ్మార్వో భారీ మొత్తాన్ని డిమాండ్ చేశారు. అసలే కోవిడ్ అవస్థల్లో వ్యాపారమంతా అస్తవ్యస్తమైపోగా షాపులు నడవడమే గగనమైపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కో షాపు నుంచి రూ. 50 వేల నుంచి రూ. లక్ష దాకా డిమాండ్ చేసినట్టు షాపులు దక్కించుకున్న యజమానులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని షాపులు దక్కించుకోవాలంటే డిపాజిట్లు కూడా భారీ స్థాయిలో ఉంటున్నాయి. షాపులు నడిచినా, నడవకపోయినా నెలనెలా అద్దెలు, కరెంటు బిల్లులు కట్టి తీరాల్సిందే. వరుసగా 3 నెలలు అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆ షాపులను సీజ్ కూడా చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో షాపులు నడుస్తాయో, నడవవో తెలియని క్రమంలో ఎమ్మార్వో నాగభూషణం షాపు యజమానుల నుంచి భారీ ఎత్తున సొమ్ము గుంజేందుకు పథకం సిద్ధం చేశారు. ఎమ్మార్వో ఒత్తిడితో విసిగిపోయిన పలువురు షాపు ఓనర్లు తెలివిగా ఏసీబీని ఆశ్రయించడంతో నాగభూషణం గుట్టు రట్టయింది. 

ఎమ్మార్వో లంచావతారం బయటపడడంతో ఆంధ్రాలో  యావత్ రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. రెండేళ్ల క్రితం తెలంగాణలో అబ్బుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి దారుణ హత్య జరిగింది. ఆ తరువాత తెలంగాణ ప్రబుత్వం పలు సంస్కరణలు ప్రవేశపెట్టింది. కొన్ని వైఫల్యాలున్నప్పటికీ పకడ్బందీగా నిర్వహించే కసరత్తు మాత్రం జరుగుతోంది. అయితే ఆంధ్రాలో కూడా అలాంటి ఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయడం లేదా వ్యవస్థలో  అవినీతిని అంతం చేయడానికి జగన్ సర్కారు పూనుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కయిన స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీపీ, జడ్పీటీసీ వంటి కీలక పదవుల్లో ఉన్నవారి జోక్యాన్ని కూడా తగ్గిస్తే తప్ప రెవెన్యూ విభాగంలో అనుకున్న ఫలితాలు రాబట్టలేమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి జగన్ సర్కారు  ఆ దిశగా చర్యలు చేపడుతుందో లేదో చూడాలి.