విజయవాడకు మరో ఫ్లై ఓవర్ .. 500 కోట్ల వ్యయం!
posted on Dec 3, 2025 1:10PM

విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి ఎన్‌హెచ్ 65ను సిక్స్ లేన్ గా విస్తరించడంలో భాగంగా నగర పరిధిలో మరో భారీ ఫ్లై ఓవర్ నిర్మాణం జగరనుంది. గొల్లపూడి నుంచి కనకదుర్గ వారధి వరకు 5 కి.మీ. మేర ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం కానుంది. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి దాదాపు 500 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందనిఅంచనా. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయితే.. హైదరాబాద్ నుంచి విజయవాడ ట్రాఫిక్ కష్టాలు దాదాపుగా తీరిపోయినట్లేనని చెబుతున్నారు.
ఇంతకీ ఈ ఫ్లై ఓవర్ ఎందుకంటే.. ఎన్ హెచ్ 65ను ఆరు లేన్ల రహదారిగా విస్తరించడానికి భూమి ఆర్‌ఓడబ్ల్యూ 60 మీటర్లు ఉండాలి. అయితే గొల్లపూడి, కనకదుర్గ వారథి మధ్య అంత వెడల్పు స్థలం లేదు. రహదారి పక్కన స్థల సేకరణ భారీ వ్యవంతో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే మార్కెట్ ధర ప్రకారమే ఇక్కడ గజం రమారమి లక్ష రూపాయలు ఉంటుంది. అంటే ఈ ఐదుకిలోమీటర్లూ రహదారి విస్తరణకు వెయ్యి కోట్ల రూపాయలు కేవలం భూసేకరణకే అవసరమౌతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఐదు కిలోమీటర్ల మేర ఫ్లై ఓవర్ నిర్మాణం తెరపైకి వచ్చింది. భూసేకరణకు వెచ్చించాల్సిన మొత్తంలో సగం ఖర్చు పెడితే చాలు ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తవుతుంది.
ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో భారీ పైవంతెన నిర్మాణం కష్టమని భావించినప్పటికీ ఒకవైపు ట్రాఫిక్ వదిలి మరోవైపు నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుత డీపీఆర్ ప్రాజెక్టు అప్రైజల్ అండ్ టెక్నికల్ స్క్రూటినీ కమిటీ వద్ద ఉంది. అక్కడ ఆమోదం లభించగానే.. మిగిలిన దశల్లో పరిశీలన పూర్చి చేసి వచ్చే ఏడాది నాటికి పనులు మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ -హైదరాబాద్ మార్గంలో మొత్తం 221.5 కిలోమీటర్ల రోడ్డును ఆరు లేన్లుగా విస్తరించాలన్నది ఎన్ హెచ్ ఏఐ ప్రణాళిక. అందుకు అనుగుణంగా తొలుత ఈ రహదారిలో కేవలం హైదరాబాద్ సమీపంలోని దండు మల్కాపూర్ నుంచి జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వరకూ విస్తరించాలని తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సవరించి, అనుమంచిపల్లి నుంచి గొల్లపూడి వరకూ రోడ్డు విస్తరణకు ఆదేశించింది.