మరో వివాదం..మరో ప్రమాదం!

మత సంబందమైన సున్నిత అంశాలకు సంబందించి మాట్లాడే సమయంలో ఎవరైనా, కొంత జాగ్రత్త వహించడం అవసరం. అయితే, ఈ మధ్య కాలంలో  దేశంలో, ఇలాంటి అంశాలు వివాదం అవుతున్నాయి. వివాదం అవడమే కాదు, విషాద పరిణామాలకు దారి తీస్తున్నాయి. అయినా, రాజకీయ ప్రముఖులు. మీడియా, చివరకు నాయవ్యవస్థ, న్యాయమూర్తులు కూడా,లక్ష్మణ రేఖ, దాతుతున్నారనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. భావప్రకటన స్వేచ్ఛ పేరిట చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పరస్పర విరుద్ధ వాదనలు, వివాదాలు టీవీ చానల్స్ స్టూడియోలో పురుడు పోసుకుంటున్నాయి. 

ఇప్పుడు ఇదే క్రమంలో మరో వివాదం తెర మీదకు వచ్చింది. ఒక ప్రముఖ టీవీ చానల్ నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా, కాళీమాత గురించి వ్యక్తపరిచిన అభిప్రాయలు, ఆమె   చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి. ప్రముఖ దర్శకురాలు, రచయిత్రి, నటి లీనా మణిమేగలై కాళీ పేరిట ఒక లఘు చిత్రం తీశారు. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్‌’ ను విడుదల చేశారు. ఈ పోస్టర్’లో కాళీ మాత ధూమపానం చేస్తునట్లు చూపించడం వివాదంగా మారింది. ఓ వంక ఆ వివదం అలా నడుస్తున్న సమయంలోనే, జాతీయ టీవీ చానల్ ‘ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న, మహువా వివాదానికి రాజకీయ వివాదానికి తెర తీశారు.  

అఫ్కోర్స్,  టీవీ యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగానే ఆమె స్పందించారు. అయితే,ఇప్పటికే దేశంలో ఒక విధమైన మత ఉద్రిక్తలకు పురిగొలిపే, వాతావరణం నెలకొన్న నేపధ్యంలో, ఆమె సమాధానాన్ని దాటవేసి ఉంటే. లేదా మరికొంత సున్నితంగా జవాబు ఇచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ, ఆమె  అదేమీ పట్టించుకున్నట్లు లేదు. ఆమె తమ సహజ ధోరణిలో స్పందించారు. ఆమె స్పందించిన తీరుకు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సొంత పార్టీ టీఎంసీ కూడా ఆమె మాటలపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఆమె వ్యాఖ్యలతో, పార్టీకి సంబంధం లేదని, అధికారికంగా ప్రకటించింది. అయినా, మహువా మాత్రం తమ వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని అంటూనే వివరణ ఇచ్చారు. ఏ చిత్రానికి, ఏ పోస్టర్‌కు మద్దతు ఇవ్వలేదన్నారు. అలాగే, ధూమపానం అనే పదాన్ని వాడలేదని అన్నారు. అదే సమయంలో ఆమె, ఈ పరిణామాల మధ్యనే ఆమె టీఎంసీ అధికారిక ట్విటర్ ఖాతాను అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది.
మరోవంక మతపరమైన వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై కేసు నమోదైంది. సినిమా పోస్టర్‌ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసిన నేపధ్యంలో ఆమెను అరెస్టు చేయాలని బీజేపీ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు, పోలీసులు ఆమె ఆపై కేసు నమోదు చేశారు. 
మరోపక్క తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడానికి మహువా నిరాకరించారు. బెంగాలీలు ఆరాధించే దేవతామూర్తి నిర్భయమైందంటూ ట్వీట్ చేశారు.‘నేను కూడా కాళీ మాత ఆరాధకురాలినే. మీ గుండాలకు, మీ పోలీసులకు, మరీ ముఖ్యంగా మీ ట్రోల్స్‌కు..  దేనికీ నేను భయపడను. నిజం చెప్పేందుకు ఇతర శక్తుల మద్దతు అవసరం లేదు’ అంటూ గట్టిగా బదులిచ్చారు.

ఇప్పటికే, బీజేపీ మాజీ నేత నృపూర్ శర్మ, ముహ్మద్ ప్రవక్తకు సంబంధించి  చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ఉద్రిక్తతలు సృష్టిస్తున్న నేపధ్యంలో, మహువా వ్యాఖ్యలు ఎటు దారి తీస్తాయి అనేది సామాన్యుల నుంచి మేథావుల వరకు అందరినీ ఆందోళనకు గురిచేస్తోందని అంటున్నారు.