అంజన్ కుమార్ యాదవ్ అలక.. టీకప్పులో తుపాన్

జూబ్లీహిల్స్ బైపోల్ లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అలకబూనారు. ఎన్నడూ లేని విధంగా జూబ్లీ బైపోల్ విషయంలో టికెట్ ఇవ్వడానికి లోకల్, నాన్ లోకల్ అన్నచర్చను తెరపైకి తెచ్చి తనను పక్కన పెట్టడం వెనుక ఎవరి హస్తం ఉందో తనకు తెలుసుననీ, త్వరలోనే ఆ పేరు బయటపెడతానంటూ మీడియా ముందుకు వచ్చారు. గతంలో  ఒక కాంగ్రెస్ నేత ఇటు మల్కాజ్ గిరి, అటు కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు లోకల్, నాన్ లోకల్ అన్న మాట ఎందుకురాలేదని ప్రశ్నించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్  కష్టకాలంలో ఉన్న సమయంలో నిలబడి, కష్టపడి పని చేసిన తనకు టికెట్ రాకుండా చేశారనీ, అలా చేసిందెవరో త్వరలోనే బయటపెడతాననీ అజంన్ కుమార్ యాదవ్ అన్నారు. వాళ్లు నన్ను తొక్కుకుంటూ పోదామనుకుంటే.. నేను ఎక్కుకుంటూ పోతానని సవాల్ విసిరారు. తాను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నని గుర్తు చేసిన అంజన్ కుమార్ యాదవ్.. జూబ్లీహిల్స్ కు పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసేటప్పుడు కనీసం తనను సంప్రదించలేదన్నారు. త్వరలోనే కార్యకర్తలతో భేటీ అవుతాననీ, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాననీ, పార్టీ వీడే ఉద్దేశంలో ఉన్నట్లు సూచన ప్రాయంగా తెలిపారు. అయితే అంజన్ కుమార్ యాదవ్ అలక టీకప్పులో తుపాను గా తేలిపోయింది. ఆయనను బుజ్జగించడానికి కాంగ్రెస్ సీనియర్లంతా కలిసి వచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ ఇన్ చార్జి కార్యదర్శి విశ్వనాథన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి అంజన్ కుమార్ యాదవ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా అంజన్ కుమార్ యాదవ్ తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది.

అయితే భేటీ తరువాత  పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీ బైపోల్ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలోనే జరుగుతుందని చెప్పారు. అంజన్ కుమార్ యాదవ్ పార్టీ సీనియర్ నాయకుడనీ, జూబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన భావించారనీ చెప్పిన పొన్నం, పార్టీ అధిష్టానం నిర్ణయం మరో లా ఉందనీ అన్నారు. ఈ విషయంలో అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తికి గురైన మాట వాస్తవమేననీ, అయితే ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా అజంన్ కుమార్ యాదవ్ తో మాట్లాడి.. జూబ్లీహిల్స్ టికెట్ విషయంలో అధిష్ఠానం నిర్ణయాన్ని, ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణాలను వివరించి సముదాయించారనీ పొన్నం చెప్పారు. 

 పార్టీలో సీనియర్ నేత, రెండు సార్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, రెండుసార్లు ఎంపీగా పని చేశారనీ, ఆయన హైదరాబాద్ లో పార్టీకి పెద్దదిక్కనీ చెప్పిన పొన్నం.. జూబ్లీ బైపోల్ అంజన్ కుమార్ యాదవ్ సారథ్యంలోనే  జరుగుందని చెప్పారు.  అంజన్ కుమార్ యాదవ్ పరిస్థితి అర్ధం చేసుకున్నారనీ, జూబ్లీ ఎన్నికలలో దగ్గరుంచి పార్టీ అభ్యర్థిని గెలిపిస్తానని మాటిచ్చారనీ తెలిపారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu