బెజవాడ్ బుక్ ఫెయిర్ లో పవన్ కల్యాణ్.. రూ.10లక్షల విలువైన పుస్తకాల కొనుగోలు
posted on Jan 11, 2025 2:29PM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుస్తక ప్రియుడు అన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలు సందర్భాలలో వెల్లడించారు. ఇటీవల అంటే ఈ నెల 2వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో బుక్ ఫెయిర్ ప్రారంభమైంది. ఈ బుక్ ఫెయిర్ ను ప్రారంభించిన పవన్ కల్యాణ్ ఆ సందర్భంగా పుస్తకపఠనం తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఎవరికైనా పెద్ద మొత్తంలో సొమ్ములు ఇవ్వడానికి క్షణం కూడా ఆలోచించను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే వంద సార్లు ఆలోచిస్తానని ఆయనా సందర్భంగా చెప్పారు.
అది పక్కన పెడితే పవన్ కల్యాణ్ శనివారం (జనవరి 11) విజయవాడ బుక్ ఫెయిన్ ను సందర్శించారు. ఒక పుస్తక ప్రియుడిగా ఆయన బుక్ ఫెయిర్ అంతా కలయతిరిగారు. పలు స్టాల్స్ సందర్శించారు. పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన దాదాపు పది లక్షల రూపాయల విలువైన పుస్తకాలను కొనుగోలు చేశారు. ఆ బిల్లును తన వ్యక్తిగత ఖాతా నుంచి చెల్లించారు.
అంతకు ముందు అంటే శుక్రవారం పవన్ కల్యాణ్ పిఠాపురంలో పర్యటించారు. ఆసందర్బంగా ఆధునిక వసతులతో పిఠాపురంలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కొన్న పుస్తకాలన్నీ ఆ లైబ్రరీ కోసమేనని తెలుస్తోంది. ఆయన కొనుగోలు చేసన పుస్తకాలలో అనువాద సాహిత్య పుస్తకాలు, నిఘంటువులు, ఆధ్యాతిక సంబంధిత రచనలు ఉన్నాయి.