ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక రైల్వే జోన్ ఈ నెల26న?
posted on May 20, 2015 1:16PM
.jpg)
విశాఖ కేంద్రంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రజల చిరకాల డిమాండ్ త్వరలో నెరవేరబోతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ నెల26న మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవబోతోంది కనుక ఆరోజునే ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రకటించే అవకాశం ఉంది. దీని గురించి గట్టిగా కృషి చేస్తున్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు మరియు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు ఇరువురు సురేష్ ప్రభును కలిసినప్పుడు వారికి ఆయన ఈ విషయం గురించి తెలియజేసినట్లు సమాచారం.
ఈనెల 26న విశాఖపట్నంలో బీజేపీ ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటుచేసి, దానికి సురేష్ ప్రభును ముఖ్య అతిధిగా ఆహ్వానించి ఆయనచేతనే ప్రకటన చేయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా తమ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకొంటోందనే గట్టి సందేశం ప్రజలకు ఇచ్చి తమ పార్టీపై, కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు అయినట్లయితే రాష్ట్ర ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. అదేవిధంగా రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో ఉన్న అనేక రైల్వే ప్రాజెక్ట్ లు అన్నీ మరింత వేగంగా పూర్తయ్యే అవకాసహం కలుగుతుంది.