అనంతబాబు.. తండ్రి బాటలోనే..దోపిడీలూ అరాచకాలూ!

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు.. ఇప్పుడు ఆయన పరిచయం అక్కర్లేని పేరు. కానీ కొద్ది రోజుల కిందటి వరకూ ఆయన తూర్పుగోదావరి జిల్లా.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తూర్పు మన్యంకు మాత్రమే పరిచయమైన పేరు.. కానీ తన మాజీ డ్రైవర్ హత్య కేసుతో అనంత బాబు రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు.

ఇంత కాలం ఏజెన్సీకే పరిమితమైన అనంత బాబు గుర్తింపు ఏమీ మంచి పనులు చేసినందుకు వచ్చింది కాదు. తండ్రి అడుగు జాడల్లో గిరిజనులను దోచుకోవడంలోనూ, వారిని వేధింపులకు గురి చేయడంలోనే. అంతా తండ్రి చూపిన బాటే అంటారు అనంతబాబు కుటుంబ నేపథ్యం తెలిసినవారు. ఇంతకీ అనంత  బాబు తండ్రి ఎవరంటే.. ఆయన పేరు  అనంత చక్రరావు. అడ్డతీగల పూర్వ సమితి అధ్యక్షుడు. ఇప్పుడు అనంతబాబు ఏం చేశాడో.. గతంలో ఆయన తండ్రి చక్రారావు కూడా అదే చేవావాడు.  ఏజెన్సీ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయిస్తూ  గిరిజనం భూములను కబ్జా చేశాడు.. ఆయన  ధాష్టీకం, దౌర్జన్యాలకారణంగా  నక్సలైట్లు చక్రారావును 1986లో కాల్చి చంపారు.

ఆయన తరువాత అనంత ఉదయభాస్కర్ అలియాస్ అనంత బాబు  తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. ఏజెన్సీలో దొరికే అత్యంత విలువైన రంగురాళ్ల   స్మగ్లింగ్ లో అనంత బాబు ఆరితేరాడు. ఈ స్మగ్లింగ్ కేసులతోనే అనంతపై పోలీసులు రౌడీషీట్ కూడా తెరిచారు. రంగురాళ్ల స్మగ్లింగ్ నుంచి హత్య వరకూ రాజకీయం అండతోనే ఎదిగాడు అనంతబాబు.  ఆయనపై  ఏజెన్సీ మహిళలను వేధించిన ఆరోపణలు  సహా పులు ఆరోపణలు ఉన్నప్పటికీ కేసులు మాత్రం నమోదైన దాఖలాలు లేవు.  తనకున్నరాజకీయ పలుకుబడి, అంగ, అర్ద బలంతో సువువుగా సుబ్రహ్మణ్యం హత్య కేసు నుంచి బయటపడొచ్చని అనంత బాబు భావించినా సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, భార్య న్యాయం కోసం గట్టిగా నిలబడటంతో కుదరలేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

సుబ్రహ్మణ్యంను హత్య చేసి, ఆ పై తాపీగా తన కారులోనే అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యుల వద్దకు తీసుకువెళ్లేంత ధైర్యం అనంత బాబుకు రావడానికి కారణం అసలు కేసే లేకుండా వారిని బెదరించే బెల్లించో తన దారికి తెచ్చుకోగలనన్న నమ్మకమే. అయితే కుటుంబ  సభ్యులు తిరగబడటంతో ఆయన కారును మృతదేహంతో సహా వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తరువాత కూడా కేసు కూడా లేకుండా బయటపడగలనన్నదే అనంత బాబు ధైర్యం, ఆ ధైర్యంతోనే అనంత బాబు వివాహ కార్యక్రమాలకు హాజరయ్యారు, మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే హతుడి కుటుంబ సభ్యులు న్యాయం కోసం గట్టిగా నిలబడటంతో అనంత బాబు పప్పులుడకలేదు. సుబ్రహ్మణ్యం కుటుంబ  సభ్యులపై సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగించినా వారు దిగిరాలేదు. డబ్బుకు లొంగలేదు, ప్రలోభాలకు తలవంచలేదు. చివరికి పోలీసుల ద్వారా బెదరించి బలవంతంగా ఒప్పించడానికి చేసిన ప్రయత్నమూ ఫలించలేదు. పైగా పోలీసులు తనను పోస్టు మార్టం రూంకు తీసుకు వెళ్లి    బెదరించి, కొట్టి భర్త మృతదేహానికి పోస్టుమార్టం కు అనుమ తిస్తున్నట్లుగా సంతకం చేయాలని ఒత్తిడి తెస్తున్నారంటూ అక్కడి నుంచే ఆడియో క్లిప్పింగ్ వాట్సప్ ద్వారా బయటకు పంపడంతో పోలీసులూ వెనక్కు తగ్గారు. గత్యంతరం లేక సుబ్రహ్మణ్యంపై కేసు నమోదు చేసి అరెస్టు చూపారు.