నియోజక వర్గాల సంఖ్య డ‌బుల్ కానున్నాయా?.. అమిత్‌షా సిగ్న‌ల్ ఇచ్చేశారా?

ఉభయ తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ, లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజన అంశం మరో మారు చర్చకు వచ్చింది. జమ్మూ కశ్మీర్’ పర్యటనలో భాగంగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఇటీవ‌ల శ్రీనగర్ బహిరంగ సభలో జమ్మూ కశ్మీర్’లో   నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ సాగుతోందని, అది పూర్తయిన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. అమిత్ షా అలా ప్రకటన చేశారో లేదో ఇలా, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ, బోయినపల్లి వినోద్ కుమార్ ఆ చేత్తోనే మా సంగతి చూడండి అంటూ తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాల పునర్విభజన అంశాన్ని మరో మారు తెరమీదకు తెచ్చారు. జమ్మూ కశ్మీర్’తో పాటుగానే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభించాలని  అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచాలని, అందుకోసంగా జమ్మూకశ్మీర్’తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల పునర్విభజన జరపాలని వినోద్ కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
 
అదలా ఉంటే, ముందునుంచి కూడా  ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 (రాష్ట్ర విభజన చట్టం) దేశంలో నియోజక వర్గాల పునః విభజన ప్రక్రియతో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాలలో నియోజక వర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించిందనే అభిప్రాయాన్ని తెరాస సహా ఇతర పార్టీలు వ్యక్త పరుస్తున్నాయి. ఆ ప్రకారంగా  ఆంధ్ర ప్రదేశ్’లో ప్రస్తుతమున్న 175 అసెంబ్లీ నియోజక వర్గాలను 225కు తెలంగాణలో ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ నియోజక వర్గాలను 153కు పెంచుకోవచ్చని విభజన చట్టం సూచించిందని, రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే ఉభయ తెలుగు రాష్ట్రాలలో నియోజక వర్గాల పునర్విభజన అంశం తరచు చర్చకు వస్తోంది. అయితే, విభజన చట్టం సీట్ల సంఖ్యను ఎంత వరకు పెంచుకోవచ్చో సూచించిందే, కానీ, ఎప్పటిలోగా అనే విషయంలో స్పష్టంగా చెప్పలేదని, కేంద్ర ప్రభుత్వ వర్గాలు తమ భాష్యం తాము వినిపిస్తున్నాయి. 

అయితే, ఈ అంశం తెర మీదకు రావడం, మీడియాలో చర్చలు జరగడం ఇదే తొలిసారి కాదు. కొద్ది నెలల క్రితం  జమ్మూ కశ్మీర్’కు  రాష్ట్ర హోదా పునరుద్ధరణలో భాగంగా నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబదించి ప్రదాని మోడీ లోక్ సభలో ప్రకటన చేశారు.  తెలుగు రాష్ట్రాలలో తేనే తుట్టె కదిలింది, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్తీకరణ చట్టం 2014 లో  పొందుపరిచిన విధంగా, ఉభయ రాష్ట్రాలలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాల సంఖ్యను పెంచాలని పార్లమెంట్ లోపల, వెలుపల కూడా చర్చ జరిగింది. ఇప్పటిలానే అప్పుడు కూడా వినోద్ కుమార్ ఇదే డిమాండ్ చేశారు. కేంద్రం పట్టించుకోలేదు. కానీ, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇదే అంశానికి సంబంధించి లోక్ సభలో వేసిన  ప్రశ్నకు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, ఉభయ తెలుగు రాష్టలలోనూ 2026 తర్వాతనే నియోజక వర్గాల పునర్విభజన ఉంటుందని, అంతవరకు ప్రస్తుత స్థితే యథాతథంగా కొనసాగుతుందని లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేశారు. అంతే కాకుండా రాష్ట్ర విభజన చట్టం సూచించిన విధంగా నియోజక వర్గాల పునర్విభజన చేపట్టాలంటే, రాజ్యాంగ సవరణ అవసరం అవుతుందని గతంలో చెప్పిన  విషయాన్నే కేంద్ర మంత్రి  మరోమారు స్పష్టం చేశారు. కాబట్టి, 2023లో జరిగే తెలంగాణ శాసన సభ ఎన్నికల నాటికి లేదా 2024లో సార్వత్రిక ఎన్నికల నాటికి తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం లేదని, రాజకీయ పార్టీలు కూడా ఒక నిర్ణయానికి వచ్చాయి. అయితే, రాజకీయ పార్టీలు, ముఖ్యంగా తెరాస దీన్నొక రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుంటూనే ఉంటాయి. 

అదలా ఉంటే, దేశవ్యాప్తంగా అసెంబ్లీ. లోక్ సభ స్థానాల పునర్విభజన  సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొంత కసరత్తు చేసిందని కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంపీ మనీష్ తివారి  ట్వీట్ చేశారు. ఈ ట్వీట్’ దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. మనీష్ తివారీ  ట్వీట్  ప్రకారం  ప్రస్తుతం 543 ఉన్న లోక్ సభ స్థానల సంఖ్య రెట్టింపు గీతను కూడా దాటి ఏకంగా 1200 ప్లస్ సంఖ్యకు చేరుకుంటుంది. అలాగే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా లోక్ సభ స్థానాల సంఖ్య రెట్టింపు గీతను దాటేస్తుంది. ఆంధ్ర ప్రదేశ్’లో ప్రస్తుతమున్న 25 స్థానాలు 52, తెలంగాణలో ప్రస్తుతమున్న 17 స్థానాలు 39కి చేరుకుంటాయి. అయితే, 2026లో చేపట్టే నియోజక వర్గాల పునర్విభజన కసరత్తులో భాగంగా  కేంద్ర హోమ్ శాఖ సిద్దం చేసిన  బ్యాక్ పేపర్స్ ఆధారంగా మనీష్ తివారీ ట్వీట్ చేశారని, ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో 2026లోనూ నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ ఉండక పోవచ్చని అధికార వర్గాల సమాచారం. కొవిడ్ కారణంగా 2021లో జరగవలసిన జనగణన జరగలేదు.ఆ కారణంగా నియోజక వర్గాల పునర్విభజన ఇంకొంత ఆలస్యం అయినా అవుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
  
ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితులు, రాజకీయ సమీకరణలను పరిగణనలోకి తీసుకుంటే  కారణాలు ఏవైనా, అవి సహేతుకం అయినా కాకున్నా, ఇప్పట్లో తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ, లోక సభ స్థానాల సంఖ్య పెరగదు. తెలంగాణ, ఏపీ అసెంబ్లీలలో వరసగా 119, 175, లోక్ సభలో ఏపీకి 25, టీఎస్ 17...అంతే, మరో ఎన్నిక వరకు సీట్ల సంఖ్యఇంతే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.