పంచ్ డైలాగుల నుంచి పలాయనం వరకూ వైసీపీ ప్రస్థానం!

పంచ్ డైలాగుల నుంచి పలాయనం దాకా వైసీపీ తిరోమన ప్రస్ధానం చేరుకుందా అంటే కడప జిల్లా రాజకీయాలలో జరుగుతున్న లేదా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానం వస్తోంది. పులివెందుల పులి, సింహం సింగిల్ ఎంట్రీ వంటి  డైలాగుల నుంచి తమపై ఎవరూ ఆరోపణలూ విమర్శలూ చేయకూడదంటూ కడప కోర్టు నుంచి తెచ్చుకునే వరకూ వైసీపీ వచ్చింది.  కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల రంగంలోకి దిగడం ఖాయమైన క్షణం నుంచే వైసీపీలో గాభరా ప్రస్ఫుటంగా కనిపించింది. వైఎస్ బిడ్డగా ఆమె కడప బరిలో అడుగుపెట్టడమే వైసీపీకి కాళ్ల కింద భూమిని తొలిచేసినట్లైంది. దీనికి తోడు ఆమె దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతతో కలిసి ప్రచార సభల్లో వైఎస్ జగన్ ను నిలదీస్తూ చేస్తున్న ప్రసంగాలకు కడప వాసుల నుంచి ఆమోఘమైన స్పందన లభించడంతో వైసీపీ అప్రమత్తమైంది. ప్రచారానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా ప్రజా మద్దతుతో షర్మిల వాటన్నిటినీ అధిగమించి ప్రచారాన్ని కొనసాగించడంతో వేసవి హీట్ ను మించి వైసీపీ టెంపరేచర్ పెరిగిపోయింది.  ఆమె సూటిగా సుత్తి లేకుండా, శషబిషలకు తావు లేకుండా వైఎస్ హంతకులకు కొమ్ము కాస్తున్న జగన్ కు, ఆయన పార్టీకీ ఓటువేయవద్దంటూ ఇచ్చిన పిలుపు జిల్లాలో రాజకీయ ఈక్వేషన్లను ఒక్క సారిగా మార్చేసింది. ఇక వైఎస్ సునీత అయితే అవినాషే మా నాన్న హంతకుడు అని ప్రకటించి మరీ జగన్ కు ఓటేయద్దని కోరుతున్నారు. సీబీఐ చార్జి షీట్ లోని అంశాలను పూసగుచ్చినట్లు ప్రజలకు వివరిస్తూ వివేకా హత్య ను కడప ఎన్నికల అజెండాగా మార్చేశారు.   మరో వైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ను చెళ్లెళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పు జగన్ అంటూ.. హే కిల్డ్ బాబాయ్  అంటూ నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కడపలో పట్టు జారిపోతోందని భయపడిన జగన్ అండ్ కో వివేకా హత్య కేసు గురించి ఆ ఏడుగురూ  మాట్లాడకూడదంటూ గాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ ఏడుగురూ ఎవరంటే షర్మిల, సునీత, తెలుగుదేశం అధినేత అధినేత చంద్రబాబునాయుడు, జనసేన దళపతి పవన్‌కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి,  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, తెలుగుదేశం పులివెందుల అభ్యర్ధి బీటెక్ రవి.  అయితే ఈ గాగ్ ఆర్డర్ పై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ఇప్పటికే సునీత ప్రకటించారు. అయితే ఈ తీర్పును బట్టి చూస్తే ఆ ఏడుగురు వినా ఇంకెవరైనా వివేకా హత్య కేసుపై మాట్లాడొచ్చు అన్నట్లుగానే ఉంది. ఈ విషయాన్నే ఇటీవలే వైసీపీ నుంచి తెలుగుదేశం గూటికి చేరిన రఘురామకృష్ణం రాజు వంటి వారు ఎత్తి చూపుతూ షర్మిల సునీతల తరఫున ప్రచారం చేసే ఎవరైనా వివేకా హత్య కేసుకు సంబంధించిన ఆరోపణలు చేయవచ్చని అంటున్నారు. అసలు ఏకపక్షంగా ఓ ఏడుగురు ఫలానా అంశంపై మాట్లాడకూడదంటూ వెలువడిన తీర్పు ఉన్నత న్యాయస్థానంలో నిలిచే అవకాశలు లేవని కూడా అంటున్నారు.  ఏపీలో గాగ్ ఆర్డర్లన్నీ వైసీపీ వారే తెచ్చుకుంటుండటం గమనార్హం. గతంలో మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఓ మహిళతో మాట్లాడిన ఆడియో లీక్ సంచలనం సృష్టించింది. ఆ ఆడియో సోషల్‌మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో  ఆయన హైకోర్టుకు వెళ్లి, దానిని ప్రచురించి-ప్రసారం చేయకుండా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత పులివెందులలోని తన సొంత ఇంట్లో మాజీ మంత్రి, వైఎస్ వివేకానంద దారుణహత్యకు గురయ్యారు. జగన్‌కు చెందిన సొంత మీడియాతోపాటు, ఎంపి విజయసాయిరెడ్డి, అవినాష్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ వంటి నేతలు.. అప్పుడు దానిని గుండెపోటు అని ప్రకటించారు. తర్వాత రక్తపువాంతులన్నారు. ఆ తర్వాత హత్య అన్నారు. చివరకు దానిని చంద్రబాబునాయుడు చేయించారని ఆరోపించారు. వైసీపీ మీడియాలో నారాసుర రక్త చరిత్ర అని రాశారు. ఆ తర్వాత దానిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తి టీడీపీ నాయకులు, తెలుగు మీడియా చర్చించడం ప్రారంభించింది. దానితో భయపడిన వైసీపీ వివేకా హత్యపై ఎవరూ రాయవద్దని గ్యాగ్ ఆర్డరు తెచ్చుకుంది. దానితో ఆ ఎన్నికల్లో వివేకా హత్య సానుభూతితో వైసీపీ ఓట్లు కొల్లగొట్టింది. ఐదేళ్ల తర్వాత.. మళ్లీ తన తండ్రి-చిన్నాయన హత్యపై, సునీత-షర్మిల  కడప పార్లమెంటు పరిథిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గళం విప్పుతున్నారు. నేరుగా అవినాషే హంతకుడు అని ఆరోపిస్తూ ప్రచారం చేస్తున్నారు.  వారి ప్రచారం కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలోనిన ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ప్రభావం చూపుతుండటంతో  జగన్ ఆందోళనతోనే గాగ్ ఆర్డర్ ద్వారా చెల్లెళ్ల నోరు మూయించే యత్నం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.   ఫలానా వ్యక్తులు వివేకా హత్యపై మాట్లాడవద్దని ఆర్డరు తెచ్చుకున్న వైసీపీ.. మరి తన మీడియాలో అదే వ్యక్తులపై చల్లుతున్న బురద-చేస్తున్న విమర్శల సంగతేమిటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అప్పుడు వివేకా హత్యపై నారాసురరక్త చరిత్ర, ఇప్పుడు బెజవాడ రాయి దాడిపై చేస్తున్న ఆరోపణలపైనా.. ఇలాగే కోర్టుకు వెళ్లి ఆర్డరు తెచ్చుకోవ చ్చా? అని మరికొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు.
Publish Date: Apr 20, 2024 3:43PM

హమ్మ రోజా.. నువ్వూ మార్గదర్శిలో చేరావా?

ఏపీకి మాజీ కాబోతున్న ముఖ్యమంత్రి జగన్ ఆమధ్య మార్గదర్శి సంస్థ మీద పగబట్టి, ఏదో ఒక సంబంధం లేని దిక్కుమాలిన కేసు పెట్టించి సంస్థ అధినేత రామోజీరావు తదితరుల మీద విచారణ ప్రారంభించారు. అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్న రామోజీరావును వేధించారు. ఆ తర్వాత ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడంతో జగన్ అండ్‌ కో శాంతించక తప్పలేదు. ఆవు చేలో మేస్తే దూడ మాత్రం గట్టున మేస్తుందా అన్నట్టు.. జగన్ ఆశయాలకు అనుగుణంగా అప్పట్లో వైసీపీ నాయకులు రామోజీరావు మీద, మార్గదర్శి సంస్థ మీద నిప్పులు చెరిగారు.  ‘‘నేనూ మార్గదర్శలో చేరాను.. ఒక మోపెడ్ కొనుక్కున్నాను’ అనే యాడ్ అందరికీ గుర్తుండే వుంటుంది. ఇప్పుడు లేటెస్ట్.గా ఆ ప్రకటన షూట్ చేయాలంటే రోజాని మించిన యాక్టర్ మరొకరు వుండరు. ఎందుకంటే, రోజా కూడా మార్గదర్శిలో చేరారు. శుక్రవారం నాడు కదిరి స్థానానికి నామినేషన్ సమర్పించిన సందర్భంగా ఆమెకి సంబంధించిన ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడయ్యాయి. వీటిలో చెప్పుకోవల్సింది ఏంటంటే, రోజా మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థలో సభ్యురాలు. 2020లో ఆమె 40 లక్షల రూపాయల చిట్‌లో చేరారు. 2020 ప్రాంతం అంటే, వైసీపీ నాయకులు మార్గదర్శి మీద పగబట్టి వేధింపులు జరుపుతున్న సమయం. ఒకవైపు జగనన్న మార్గదర్శి మోసకారి సంస్థ అని శాయశక్తులా దుష్ప్రచారం చేస్తుంటే, జగనన్న బాటలో నడిచే రోజా మాత్రం మార్గదర్శి చిట్‌ఫండ్‌లో చేరడం మాత్రం నిజంగానే ఒక వింత. మరి రోజా మార్గదర్శిలో చేరారన్న విషయం తెలిస్తే జగనన్న ఎలా ఫీలవుతారో ఏంటో. రోజా మార్గదర్శిలో చేరిన అంశాన్ని రాజకీయాలు రాజకీయాలే, వ్యక్తిగతం వ్యక్తిగతమే అన్నట్టుగా చూడాలా.. లేక.. అవసరమైతే కస్టమర్ హోదాలో మార్గదర్శి మీద విరుచుకుపడటానికి అలా గ్రౌండ్ ప్రిపరేషన్ ఏమైనా చేసి వుంటారా అన్నట్టు చూడాలా?
Publish Date: Apr 20, 2024 3:06PM

బీఆర్ఎస్ గాలి తీసేసిన గుత్తా ఆయనా ‘చే’యందుకుంటున్నారా?

బీఆర్ఎస్ గాలి తీసేయడానికి ఆ పార్టీ నేతలే పోటీ పడుతున్న విచిత్ర పరిస్థితి ఆ పార్టీ అధినేత  కేసీఆర్ ను ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీని వదిలిపోతుండటం, కుమారుడి బావమరిది సైతం కారు దిగి చేయి అందుకోవడంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన బీఆర్ఎస్ కు ఇఫ్పుడు పార్టీలో ఉన్న అగ్రనేతలు కూడా తమ వ్యాఖ్యలతో పార్టీ ప్రతిష్టను, పార్టీ అధినేత ప్రతిష్టను దిగజారుస్తున్నారు. తాజాగా శాశనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ నుంచి వలసలపై చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ ప్రతిష్టను పూర్తిగా దిగజార్చేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఓటమి పరాభవాన్ని దిగమింగుకుని పార్టీ ఉనికిని కాపాడుకోవాలంటే లోక్ సభ ఎన్నికలలో సత్తాచాటడమే మార్గమని భావించి సర్వశక్తులూ కూడగట్టుకుని లోక్ సభ ఎన్నికల ప్రచారానికి బస్సు యాత్ర ద్వారా కేసీఆర్  శ్రీకారం చుట్టడానికి సర్వం సిద్ధం చేసుకున్న వేళ ఆ పార్టీ సీనియర్ నాయకుడు, శాశనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు పార్టీలో కలకలం సృష్టించాయి. తలెత్తుకోలేనంతగా పార్టీ అధిష్ఠానం పరువును గంగలో కలిపేశాయి. ఇంతకీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏమన్నారంటే పార్టీ నుంచి వలసలకు   పార్టీ నాయకత్వంపై నేతలు విశ్వాసం కోల్పోవడమే కారణమని కుండబద్దలు కొట్టేశారు. శనివారం (ఏప్రిల్ 19) విలేకరులతో మాట్లాడిన ఆయన పార్టీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలు కావడానికి పార్టీ హైకమాండ్ తో పాటు మంత్రుల వ్యవహారశైలి కూడా కారణమన్నారు. అహంకారం తలకెత్తినందునే పార్టీ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఇప్పటికి కూడా పార్టీ పరిస్థితిని సమీక్షించుకోవడానికి పార్టీ అగ్రనాయకత్వం ముందుకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా పార్టీ హైకమాండ్ తీరు మారకుంటే భవిష్యత్ లో  పార్టీ ఉనికి కూడా ప్రమాదంలో పడుతుందని చెప్పారు.  అంతే కాదు.. నాడు తాను బీఆర్ఎస్ లో చేరడానికి కారణాలను కూడా ఆయన ఈ సందర్భంగా తెలిపారు. నాడు తనను 16 సార్లు కలిసి బతిమలాడితే తాను పార్టీ మారాననీ, కేబినెట్ లోనికి తీసుకుంటామన్న హామీ ఇచ్చిన తరువాతే కారెక్కాననీ వివరించారు. ఆ తరువాత పరిస్థితి మారిపోయిందనీ, గత ఎన్నికలకు ముందు కేసీఆర్ ఎవరికీ అప్పాయింట్ మెంటే ఇవ్వలేదనీ అన్నారు,  పార్టీని అడ్డుపెట్టుకుని ఉద్యమ కారుల ముసుగులో కోట్ల రూపాయలు సంపాదించారనీ, ఒక నాడు జేబులో వందల రూపాయలు కూడా లేని వ్యక్తులు ఈ రోజు కోట్లకు పడగలెత్తారంటే ఏ రీతిన సంపాదనకు మరిగారో అర్ధం చేసుకోవచ్చన్నారు. తన కుమారుడు అమిత్ పోటీకి వెనుకడుగు వేయడానికి పార్టీలోని కొందరు సహకరించకపోవడమే కారణమన్నారు. ఇక ఇటీవలి కాలంలో పార్టీ మారిన బీఆర్ఎస్ సిట్టుంగులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గుత్తా శుఖేందర్ రెడ్డి చెప్పారు.  గుత్తా వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన కూడా కారు దిగడానికి నిర్ణయించుకున్నారా అన్న అనుమానాలు బీఆర్ఎస్ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. ఆయన కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయంటున్నారు. ఇప్పటికే ఆ దిశగా ఆయన నిర్ణయం తీసుకుని ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ మారుతున్నాననే సంకేతాలను ఆయన నేరుగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై విమర్శలు గుప్పిస్తూ మాట్లాడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ నుంచి వలసలు ఆ పార్టీని గాభరాపెడుతున్నాయి. పార్టీ నుంచి వలసల  నిరోధం విషయంలో పార్టీ హైకమాండ్ చేతులెత్తేసినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
Publish Date: Apr 20, 2024 2:54PM

తెలంగాణలో వాతావరణం కూల్ కూల్!

తెలంగాణకు భానుడి భుగభగల నుంచి ఉపశమనం లభించింది. నిన్నటి వరకూ అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన తెలంగాణ వాసులు శనివారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచీ ఆకాశం మేఘావృతమై చల్లటి గాలులతో తెలంగాణ ఎండ వేడిమి నుంచి సేద తీరింది. హైదారబాద్,  హైదరాబాద్‌, నిజామాబాద్‌, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో  ఓ మోస్తరు వర్షం కురిసింది. మరి కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.   నిజామాబాద్‌ జిల్లాలో వర్షం కారణంగా భారీగా పంటనష్టం జరిగింది. సిద్దిపేట, దుబ్బాకలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోయింది.  
Publish Date: Apr 20, 2024 12:05PM

ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా.. ఆంధ్రులు హ్యాపీ!

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఈ నెలలో భారత్ లో పర్యటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల మస్క్ ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ నెల 21, 22 తేదీలలో భారత్ లో పర్యటించాల్సిన మస్క్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. అయితే ఈ ఏడాది చివరిలో మాత్రం తప్పకుండా ఇండియాలో పర్యటిస్తానని మస్క్ తన పర్యటన వాయిదా ప్రకటన సందర్భంగా చెప్పారు. ఈ వార్త వినగానే ఏపీ ప్రజలలో ఆనందం, హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. ఎలాన్ మస్క్ పర్యటన వాయిదాకు, ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేయడానికి ఏమిటి సంబంధం అంటారా? అక్కడికే వద్దాం ఆగండి!  ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇప్పటి వరకూ ప్రపంచంలోనే అతి వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన భారత్ లొ ఇన్వెస్ట్ చేయలేదు. ఇందుకు కారణం దేశంలో అధికంగా ఉన్న పన్నులే కారణమని ఇప్పుడు కాదు ఎప్పుడో 2021లోనే చెప్పారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. భారత్ ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించింది.  స్థానికంగా పెట్టుబడులు పెట్టి ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని దేశంలో ప్రారంభించే సంస్థలను ఆహ్వానించడం, ప్రోత్సహించడం కోసం ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎలాన్ మస్క్ దేశంలో  పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నారు.  అందుకే ఆయన భారత పర్యటన పెట్టుకున్నారు. ఈ సంగతి తెలియగానే పలు రాష్ట్రాలు టెస్లాను తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించేందుకు సన్నాహాలు ఆరంబించేశాయి. దేశంలో ఎన్నికల హీట్ పీక్స్ లో ఉన్నా.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచార హడావుడిలో నిండా మునిగిపోయి ఉన్నా.. రాష్ట్ర ప్రగతి కోసం మస్క్ పర్యటన సందర్భంగా టెస్లాతో ఒప్పందం కోసం సన్నాహాలు ప్రారంభించేశారు.  అయితే ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం అందుకు సంబంధించి ఇఫ్పటి వరకూ ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. కనీసం రాష్ట్రంలోని టెస్లాను ఆహ్వానించే విషయంలో సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదు. దీంతో ఎలాన్ మస్క్ పర్యటన సందర్భంగా ఏపీ వైపు ఆయన దృష్టి సారించే అవకాశాలు దాదాపు మృగ్యం అన్న భావనకు అంతా వచ్చేశారు. ఈ సందర్భంగా జగన్ హయాంలో రాష్ట్రం వైపు చూడటానికే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడి దారులు భయపడిన వైనాన్ని పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. దీంతో  ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా పడటం సహజంగానే ఏపీ వాసులకు ఆనందం కలిగించింది. ఈ ఏడాది చివరిలో ఎలాన్ మస్క్ భారత పర్యటనకు రానున్నారు. అంటే అప్పటికి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. వచ్చే నెల 13న రాష్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలలో జగన్ పార్టీ పరాజయం పాలై తెలుగుదేశం అధికారంలోకి వస్తే.. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు సీఎం అయితే టెస్లా పెట్టుబడులు ఏపీకి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. కియా మోటార్స్ ను ఏపీకి తీసుకువచ్చిన చంద్రబాబు.. టెస్టాను కూడా ఏపీకి తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎలాన్ మస్క్ ఇండియా పర్యటన ఈ ఏడాది చివరకు వాయిదా పడటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.  
Publish Date: Apr 20, 2024 11:49AM

అవినాష్ రెడ్డి అఫిడవిట్ లో వివేకా హత్య కేసు

ఒక వైపు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిపై విమర్శలు చేస్తూ మాట్లాడకూడదంటూ కడప కోర్టు గాగ్ ఆర్డర్ ఇచ్చింది. మరో వైపు కడప లోక్ సభ వైసీపీ అభ్యర్థిగా  శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన అవినాష్ రెడ్డి తన అఫడివిట్ లో   వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి తనపై  రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. వాటిలో ఒకటి హత్య, రెండు సాక్ష్యాల విధ్వంసం కేసులు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఈ కేసులు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ లో తాను ఏ8 అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కేసు విచారణ సీబీఐ కోర్టులో కొనసాగుతోందని వివరించారు.   ఈ రెండు క్రిమినల్ కేసులూ కాకుండా అదనంతా తనపై మైదకూరులో మరో కేసు ఉందని అవినాష్ రెడ్డి అఫిడవిట్ లో పేర్కొన్నారు.  ఇక ఆస్తుల విషయానికి వస్తే  తనకూ తన భార్యకూ కలిపి 25.51 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు. అలాగే 32.75లక్షల రూపాయల విలువ చేసే ఇన్నోవా కారు ఉందని,  అలాగే వెలమవారి పల్లె, భకరాపురం,అంకాలమ్మగూడూరులలో తన పేరుపై 27.04 ఎకరాలు ఉన్నాయని అఫిడవిట్ లో వివరించారు.  ఇవి కాకుండా తన భార్యపేరుపై విశాఖ పట్నంలో, కడప జిల్లాలోని వల్లూరు, ఊటుకూరు, పొనకామిట్టలో  33.90 ఎకరాల భూమి  ఉందని పేర్కొన్నారు. ఎవరి నోటీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి మాట రాకూడదని కోర్టు ఆదేశాలున్నప్పటికీ, అవినాష్ రెడ్డి అనివార్యంలో తన ఎన్నికల అఫిడవిట్ లో  ఆ హత్య కేసుకు సంబంధించి తాను ఏ8గా ఉన్నాననీ, రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయనీ పేర్కొనక తప్పలేదు. మొత్తం మీద అనివాష్ ఎన్నికల అఫిడవిట్ ఇప్పుడు కడప వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 
Publish Date: Apr 20, 2024 11:07AM