సుప్రీం కోర్టుకు అమరావతి రైతులు

అమరావతి రైతులు తమ పోరాటాన్ని సుప్రీం కోర్టు వరకూ తీసుకువెళ్లారు. హైకోర్టు తీర్పును ధిక్కరించి ఏపీ సర్కార్ వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ అమరావతి రైతులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు విస్పష్ట తీర్పు ఇచ్చినా ఏపీ సర్కార్ ఖాతరు చేయడం లేదనీ, కోర్టు తీర్పు మేరకు పనులు చేపట్టకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తోందనీ వారా పిటిషన్ లో పేర్కొన్నారు.

న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ అమరావతి చేసిన పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో ప్రభుత్వ నిర్వాకం పట్ల ఆగ్రహావేశాలు వెల్లువెత్తేలా చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత హైకోర్టు తన తీర్పులో ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టింది. అమరావతి రైతుల పక్షానే న్యాయం ఉందని విస్పష్ట తీర్పు ఇచ్చింది. హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కు వెళతామని ఏపీ సర్కార్ లీకులు ఇచ్చినప్పటికీ ఆ దిశగా ఇప్పటి వరకూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.

పైపెచ్చు కోర్టు తీర్పు మేరకు పనులు చేయకుండా ధిక్కార ధోరణితో వ్యవహరిస్తోంది. ప్రభుత్వ తీరు వల్ల వందల కోట్ల రూపాయల సంపద నాశనం అవుతోందని అమరావతి రైతులు ఆరోపిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులతో గత ప్రభుత్వం పలు హామీలు ఇచ్చి ఒప్పందం కుదుర్చుకుంది. పైసా నష్ట పరిహారం కోరకుండా రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను వైకాపా సర్కార్ నిలువునా ముంచేసింది.

గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం చేయాల్సిన పనులను చేయలేదు సరికదా, రైతులకు కనీసం కౌలు కూడా ఇవ్వకుండా తాత్సారం చేసింది. దానికి తోడు రాజధానిని పట్టించుకోకుండా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటకు తెరతీసింది. దీనిని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చారిత్రాత్మక ఆందోళన చేపట్టారు. న్యాయపోరాటంలో విజయం సాధించారు.

గత ప్రభుత్వ ఒప్పందం ప్రకారం రైతుల కు ప్రయోజనాలు చేకూర్చాల్సిందేనని కోర్టు తీర్పు ఇచ్చింది. అమరావతిని నిర్మించాల్సిందేనని తన తీర్పులో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కోర్టు తీర్పు తరువాత కూడా జగన్ సర్కార్ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని చెబుతో అమరావతిని నిర్లక్ష్యం చేస్తోంది.దీనిని సవాల్ చేస్తూ అమరావతి రైతులు దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టు త్వరలో విచారణ చేపట్టనుంది.