మహానాడుకు తరలుతున్న ప్రభం‘జనం’- రోడ్లపై బంతిపూల వనం

ఏపీలో రోడ్లన్నీ పసుపు పచ్చటి శోభ సంతరించుకుని బంతి పూల వనంలా ఒంగోలు వైపు ప్రవహిస్తున్నాయి. తెలుగుదేశం మహానాడుకు జగన్ సర్కార్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా లెక్క చేయక రెట్టించిన ఉత్సాహంతో తెలుగు తమ్ముళ్లు ఒంగోలుకు కదం తొక్కుతున్నారు. మహానాడుకు ఒక రోజు ముందు నుంచే వారు ఒంగోలు బాట పట్టారు.

నాలుగు దశాబ్దాల తెలుగుదేశం ప్రస్థానంలో అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా తెలుగుదేశం మహానాడు ఉత్సాహం ఏ ఏటి కాయేడు పెరుగుతూనే ఉంది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లుగా భావించే తెలుగుదేశం పార్టీకి జనం గుండెల్లో గుడి కట్టారనడానికి ఇదే నిదర్శనం. గత మూడేళ్లుగా రాష్ట్రంలో జగన్ పాలన తెలుగుదేశం పార్టీని అణచి వేయడానికి ఎంతగా ప్రయత్నిస్తే అంతకు రెట్టింపు కసితో తెలుగు తమ్ముళ్లు జగన్ సర్కార్ అరాచకాలను అడ్డుకుంటూ జనంలో మమేకమై పార్టీని బలోపేతం చేశారు.

మహానాడుకు జనం తరలి రాకుండా ఉండాలన్న కుట్రతో జగన్ సర్కార్ ప్రైవేటు ఆపరేటర్లు, స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలను బెదరించి బస్సులు అందకుండా చేస్తే.. తెలుగు తమ్ముళ్లు కార్లు, బైకులు, సకిళ్లపై ఒంగోలు బాట పట్టారు. బస్సులు ఉంటే ఏ ఊరు నుంచి ఆ ఊరు వాళ్లు బస్సుల్లో వచ్చేసే వారు. కానీ బస్సులను అందకుండా చేయడంతో ఊళ్లన్నీ ఏకమయ్యాయా అన్నట్లు ఏక్కడ చూసినా పసుపు పచ్చటి ర్యాలీలే దర్శన మిస్తున్నాయి.రాష్ట్రం నలుమూలల నుంచీ ఒంగోలుకు బయలుదేరిన ర్యాలీలే దర్శనమిస్తున్నాయి. ఒంగోలులో 27, 28 తేదీలలో జరిగే మహానాడుకు 26వ తేదీ నుంచే జనం కదం తొక్కుతూ బయలుదేరారు. అరచేతిని అడ్డు పెట్టి సూర్య కాంతిని ఆపడం ఎలా సాధ్యం కాదో అలాగే బస్సులు అందకుండా చేసి తెలుగుదేశం ప్రభం‘జనా’న్ని ఆపడం కూడా అలాగే అసాధ్యమని జగన్ సర్కార్ కు అర్ధమయ్యేలా చేశారు. మూడేళ్లుగా కేసులు, దాడులు, వేధింపులతో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలనూ జగన్ సర్కార్ ఎంతగా వేధించినా లెక్క చేయని తెలుగుతమ్ముళ్లు   మహానాడును విజయవంతం చేసి తెలుగుదేశం సత్తా చాటాలన్న కసితో ఒంగోలుకు కదం తొక్కుతున్నారు.

ఇలా ఉండగా తెలుగుదేశం మహానాడుకు ఒంగోలులో సర్వం సిద్ధమైంది. తొలుత ఒంగోలు స్టేడియంను మహానాడు వేదికగా అనుకుని అందుకోసం కార్పొరేషన్ లో చలాన కట్టి ఏర్పాట్లు ప్రారంభించినా, చివరి నిముషంలో స్టేడియంలో మహానాడు నిర్వహణకు అనుమతి నిరాకరించి సంబరపడిన జగన్ సర్కార్ దిమ్మతిరిగేలా రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మహానాడు నిర్వహణకు స్థలం ఇచ్చారు.   శుక్రవారం నుంచి  మహానాడు ప్రారంభంకానుంది. మహానాడులో పాల్గొనేందుకు పార్టీ కార్యకర్తలు భారీగా తరలివెళ్తున్నారు. అన్ని జిల్లాల నుంచి  నేతలు, కార్యకర్తలు ఒంగోలు బాట పట్టారు. ఇటు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, ఇతర నేతలు భారీ ర్యాలీగా ఒంగోలు చేరుకున్నారు.

అమరావతి నుంచి  మంగళగిరి, చిలకలూరిపేట, మార్టూరు, అద్దంకి ఇలా తెలుగుదేశం ర్యాలీ ఒంగోలుకు దారితీసింది. ఎక్కడికక్కడ కార్యకర్తలు కార్లు, బైకులు, సైకిళ్లతో చేరుతూ కనుచూపు మేరంతా తెలుగుదేశం జెండాల రెపరెపలే కనిపిస్తున్న దృశ్యం శోభాయమానంగా ఉందని జనం మైమరచిపోతూ చెబుతున్నారు. జనం అవధులు లేని ఉత్సాహంతో మహానాడుకు ర్యాలీ కడుతున్నారు. ఇక గురువారం ఒంగోలులో జరిగిన మహానాడులో పార్టీ అధినేత చంద్రబాబు ఉద్వేగ పూరిత ప్రసంగంతో నాయకులలో ఉత్సాహం నింపారు.  భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. అంతకు ముందు ఒంగోలుకు ర్యాలీగా బయలు దేరిన చంద్రబాబు మార్గ మధ్యంలో చిలకలూరి పేట వద్ద పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ జగన్ పార్టీకి ఘాటు హెచ్చరికలు చేశారు. ఒంగోలులో మహానాడు నిర్వహణకు మైదానం ఇవ్వరా, తెలుగుదేశం ఫ్లెక్సీలు చించేస్తారా ఇలా చేసి మహానాడును ఆపగలమని అనుకుంటున్నారా అని ప్రశ్నల వర్షం కురిపించారు.

మహానాడు ఒక ప్రభంజనం అడ్డుకోగలిగే వారెవరూ లేరని అన్నారు. మర్యాదగా ఉండకపోతే తోకలు కత్తిరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో జగన్ వంటి పనికి మాలిన సీఎంను చూడలేదని చంద్రబాబు అన్నారు. ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా వైసీపీ ఓటమి ఖాయమని చెప్పారు. ఇసుక నుంచి చమురు తీయడం ఎలా సాధ్యం కాదో..టీడీపీ శ్రేణులను కేసులతో భయపెట్టాలని చూడటం కూడా అలాంటి వృధా ప్రయాసేనన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచీ మహానాడుకు కదలి రావాలని పిలుపునిచ్చారు.

గత కొన్ని రోజులుగా ఒంగోలులోనే మకాం వేసి మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ.. మహానాడును అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్ని అడ్డంకులు సృష్టించిందన్నారు. మహానాడును విఫలం చేయడం ఎవరి వల్లా కాదన్నారు.  తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో మహానాడు ఏర్పాట్లు పూర్తయ్యాయని అచ్చెన్నాయుడు వివరించారు.