సీఎం చెప్పినా న్యాయం జ‌ర‌గ‌దా? అక్బ‌ర్‌బాషా కుటుంబం ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

ముఖ్య‌మంత్రి అంటే రాష్ట్రానికే రాజు. ఆయ‌న చెప్పిందే వేదం. చేసిందే శాస‌నం. అలాంటి సీఎం జ‌గ‌నే ఓ కుటుంబానికి న్యాయం చేయ‌లేక‌పోయారంటే ఏమ‌నాలి? ముఖ్యమంత్రి త‌ర‌ఫున సీఎం కార్యాల‌యం రంగంలోకి దిగి నేరుగా జోక్యం చేసుకున్నా.. జిల్లా ఎస్పీనే స్వ‌యంగా ఆ కేసును ప‌ర్య‌వేక్షిస్తున్నా.. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఓ మైనార్టీ కుటుంబానికి మాత్రం న్యాయం జ‌ర‌గ‌లేదు. వైసీపీ నేత‌ల బెదిరింపులు ఆగ‌లేదు. దీంతో తీవ్ర‌మ‌న‌స్థాపంతో అక్బ‌ర్‌బాషా కుటుంబం ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. ముఖ్య‌మంత్రే న్యాయం చేయ‌లేక‌పోతే.. సీఎం సొంత‌జిల్లాలోనే ఇలా జ‌రిగితే.. ఏపీలో ఇక వైసీపీ నాయ‌కుల నుంచి సామాన్యుల‌కు ర‌క్ష‌ణ ఏముంటుందంటూ ఆందోళ‌న చెందుతున్నారు ప్ర‌జ‌లు. 

పొలం విషయంలో సీఎం కార్యాలయం హామీ ఇచ్చినప్పటికీ... తమకు న్యాయం జరిగేలా లేదని ఆందోళనకు గురైన అక్బర్‌ బాషా కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. అక్బర్‌తోపాటు భార్య ఖాసీంబీ, కుమార్తెలు ఆసిఫా, ఆసిన్‌ పురుగుల మందు తాగారు. రాత్రి పది గంటల సమయంలో వారి పరిస్థితిని గుర్తించిన బంధువులు చాగలమర్రిలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగానే ఉంది. 

భూమి విషయంలో అన్యాయం జరుగుతోందని పోలీసులను ఆశ్రయిస్తే.. ఎన్‌కౌంటర్‌ చేస్తామని బెదిరిస్తున్నారంటూ అక్బర్‌బాషా ఈనెల 11న పోస్ట్‌ చేసిన సెల్ఫీ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీఎం కార్యాలయ అధికారులు స్పందించి.. హామీ ఇచ్చినా, తమకు న్యాయం జరిగేలా లేదని సోమవారం అక్బర్‌ కుటుంబీకులంతా పురుగుమందు తాగారు. 

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అక్బర్‌బాషా మాట్లాడుతూ.. ‘మా భూమి మాకు ఇస్తామని సీఎం హామీ ఇచ్చినా కొందరు అడ్డుపడుతున్నారు. దిక్కున్న చోట చెప్పుకోండని దువ్వూరుకు చెందిన తిరుపేలరెడ్డి, మేయర్‌ సురేష్‌బాబు హెచ్చరించారు. పంచాయతీ చేసి రూ.10 లక్షలు కడితే నీ పత్రాలు నీకిస్తామంటూ చెప్పారు. గడువులోగానే డబ్బులను సమకూర్చుకుని వారి దగ్గరికి వెళ్లగా నాలుగైదు రోజులుగా ముఖం చాటేస్తున్నారు’ అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు అక్బ‌ర్‌బాషా. ఇక త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌ద‌నే ఉద్దేశ్యంతోనే కుటుంబ స‌మేతంగా ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన‌ట్టు చెప్పారు.