కరోనా విజృంభణకు కారణాలివే! 

దేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. రోజురోజుకు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ నిల్వలు నిండుకుంటున్నాయి. కరోనా రోగులకు బెడ్లు లేకపోవడంతో హాస్పిటల్స్ లో దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మరో ఆరు వారాల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా కేసుల ఉద్ధృతిపై  ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా కీలక ప్రకటన చేశారు. కేంద్రం జారీ చేసిన కొవిడ్ మార్గదర్శకాలను ప్రజలు పాటించకపోవడం, రూపు మార్చుకున్న వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం దేశంలో కేసుల పెరుగుదలకు ప్రధాన కారణాలని  తెలిపారు. 

వ్యాక్సినేషన్ జరుగుతోందన్న ధీమాతో ప్రజలు ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నారని డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. కరోనా విస్తరిస్తుంటే దేశంలో మత సంబంధ కార్యక్రమాలు, ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి ఎన్నికలు, మత కార్యక్రమాలను ఆంక్షలు పాటిస్తూ జరుపుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్ వయోపరిమితిని సడలిస్తూ వెళ్లాలని, తద్వారా అత్యధికులకు వ్యాక్సిన్ అందించేందుకు వీలవుతుందని తెలిపారు. 

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో రెమ్ డెసివిర్ ఔషధానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ధరలు మరీ అధికం కాకుండా కేంద్రం చర్యలు తీసుకుంది. రెమ్ డెసివిర్ అందరికీ అందుబాటులో ఉండేలా ధరలు నిర్ణయించాలని ఫార్మా సంస్థలను కోరింది. కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తికి ఫార్మా సంస్థలు రెమ్ డెసివిర్ ధరలను తగ్గించాయి.రెమ్ డాక్ బ్రాండ్ ధర రూ.2,800 నుంచి రూ.899కి తగ్గించగా, రెమ్ విన్ బ్రాండ్ రూ.3,950 నుంచి రూ.2,450కి తగ్గించారు. రెడిక్స్ బ్రాండ్ ధర రూ.5,400 నుంచి రూ.2,700కి తగ్గింది. సిప్ రెమీ బ్రాండ్ ధర రూ.4 వేల నుంచి రూ.3 వేలకు... డెస్ రెమ్ బ్రాండ్ ధర రూ.4,800 నుంచి రూ.3,400కి తగ్గింది. ఇక జుబీ-ఆర్ బ్రాండ్ ధర రూ.4,700 నుంచి రూ.3,400కి... కోవిఫర్ బ్రాండ్ ధర రూ.5,400 నుంచి రూ.3,490కి తగ్గించారు.