ఆధార్ లింక్డ్ టీషర్టులెక్కడైనా చూశారా!?
posted on Oct 22, 2025 2:00PM

ఒకడే ఒక్కడు మొనగాడు.. ఊరే మెచ్చిన పనివాడు.. అన్న ముత్తు సినిమాలోని పాట వినే ఉంటాం. అయితే ఇక్కడ అందరూ మొనగాళ్లే. అందరూ పనివాళ్లే.. కావాలంటే ఈ ఆధార్ ముద్రిత టీషర్టును చూడండీ.. మీకిట్టే తెలిసిపోతుంది.
అరే ఇదేదో భలేగుందే.. అని మీకూ అనిపించింది కదూ.. అయితే మీరీ స్టోరీ తప్పక తెలుసుకోవల్సిందే. ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కలపల్లి మండలంలోని.. రాజయ్య పేట గ్రామంలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వ్యతిరేక ఉద్యమం జరుగుతోంది. మొన్నామధ్య వీరు హోం మంత్రి అనితను అటకాయించడంతో పాటు.. జిల్లా కలెక్టర్ని సైతం తమ ఊరికే రప్పించిన ఘనులు.
అయితే ఈ గ్రామ ఆందోళనకారులు.. తమ ఊరిలోకి మరెవరూ రాకూడదన్న నిబంధన పెట్టుకున్నారు. అంటే ఈ గ్రామ ఉద్యమంలో మరే ఇతర అసాంఘిక, రాజకీయ శక్తులు లోపలకు రాకూడదనుకున్నారో ఏమో.. మా మూమెంట్ ఎక్స్ క్లూజివ్ అన్న ముద్ర వేయాలనే అనుకున్నారో తెలీదు గానీ, ఒక రూలైతే పెట్టుకున్నారు.
అంతా బాగుంది కానీ.. ప్రతి సారీ వీడు మనూరోడూ.. వీడు మనూరోడు కాడని ఎలా తెలుసుకోవడం?.. అన్న ప్రశ్న తలెత్తింది. అరెరే పెద్ద చిక్కే వచ్చిందే అని బ్రహ్మానందంలా ఫీలయ్యి.. ఎట్టకేలకు ఇదిగో ఈ టీషర్టు ఐడియా అమలు చేశారు. దీంతో ఎస్ ఇలాంటి ఆధార్ ప్రింటెడ్ టీషర్టు మనం తప్ప మరే ఊరోళ్లూ వేస్కోరని క్రేజీగా ఫీలయ్యి.. ఇదిగో ఇలా తమ టాలెంట్ చూపించారన్నమాట.
అయితే ఇప్పటి వరకూ ఆధార్ లింక్డ్ బ్యాంకు అకౌంట్లు, ఔటర్ ఐడీలు మాత్రమే చూసిన జనం.. ఇదిగో ఈ ఊరోళ్లు ఆధార్ లింక్డ్ టీషర్టులను చూసి.. ఈ ఊరోళ్లంతా భలే టాలెంటెడ్ గా ఉన్నారే.. అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు ఈ పరిసర ప్రాంత వాసులు.