ఇప్పటిదాకా రఘురామ.. ఇకపై ఏబీ! జగనన్నకు తీన్మారేనా? 

అదేంటో గాని ఎంపీ విజయసాయిరెడ్డి ఎవరిని గట్టిగా తొక్కాలనుకుంటాడో.. వాళ్లు స్ప్రింగుల్లా పైకి లేసి మరీ చాచి పెట్టి కొడుతున్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు కీలక పదవులు రాకుండా అడ్డుకున్న విజయసాయిరెడ్డి.. ఆయనను పార్టీకి శత్రువుగా తయారు చేసుకున్నారు. ఇప్పటికీ ఆ తలనొప్పి ఎలా బయటపడాలో అర్ధం కాక సతమతమవుతున్నారు. పైగా జగన్ బెయిల్ కే ఎసరు పెట్టిన పరిస్ధితి కనపడుతూనే ఉంది. ఇప్పుడు మరో తలనొప్పి మొదలైంది. ఆ తలనొప్పి2 పేరు ఏబీ వెంకటేశ్వరరావు. అవును ఈయనను కూడా వైసీపీ వెంటాడి వేటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టింది. బహుశా రఘురామ ఇన్ స్పిరేషన్ అనుకుంట... ఆయన కూడా అటాకింగ్ గేమ్ మొదలెట్టాడు.. అది కూడా రివర్స్ గేర్ లో.

ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు టార్గెట్ ఏ1, ఏ2లే నని చెప్పుకుంటున్నారు. అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలే. జూలై 19నే విజయసాయిరెడ్డికి ఏబీ లీగల్ నోటీసు పంపించినట్లు ఇప్పుడు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో అర్ధరాత్రి ఎన్నికల కమిషన్ ద్వారా ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి నుంచి తొలగించారు. అలా తొలగించడానికి కారణం..విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదు. అదేంటంటే అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని.. టీడీపీ తరపున డబ్బుల పంపిణీ చేస్తున్నారని. ఇదే సాక్షిలో కూడా బ్యానర్ స్టోరీ వేశారు. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి, సాక్షి.. అప్పుడు సాక్షిలో కీలకంగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, రామచంద్రమూర్తితో సహా మొత్తం ఏడుగురికి పరువు నష్టం కేసు కింద నోటీసులు పంపించారు.

ఒకప్పుడు సిన్సియర్ అధికారిగా, సమర్ధుడిగా పేరు తెచ్చుకున్న ఏబీ కెరీర్ నే అధ:పాతాళానికి తొక్కేసిన వారిపై యుద్ధం ప్రకటించారు. ఎన్ని బెదిరింపులొచ్చినా..వాళ్లేం చేయాలనుకున్నాసరే..ఈ విషయంలో తగ్గేదే లే అంటున్నారాయన. ఇప్పటికే తనపై విచారణ జరిపించడానికి ప్రభుత్వమే తప్పుడు పత్రాలను సమర్పించిందని.. ప్రకటించారు. వాటిపై క్రిమినల్ కేసులు పెడతానని కూడా ఇప్పుడు అంటున్నారు.
అటు తిప్పి.. ఇటు తిప్పి... జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు కోసం ఈయన కూడా పిటిషన్ వేసేట్టున్నారు. అంటే ఒకవేళ రఘురామ వేసిన పిటిషన్ తప్పినా.. మళ్లీ ఏబీ పిటిషన్ రెడీగా ఉంటుందన్నమాట. అధికారం ఉంది కదాని చెలరేగిపోతే... ఇష్టమొచ్చినట్లు తొక్కేయాలని చూస్తే... అవే ఎదురొచ్చి మరీ ఇబ్బంది పెడతాయని మరోసారి ప్రూవ్ అయింది. మరి జగన్ అండ్ కో ఏబీ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.