ఆధార్ గుర్తింపు కార్డు కాదంట..? కేరళలో ఓటు వేయనివ్వని అధికారులు..
posted on May 16, 2016 4:33PM

భారత దేశం మొత్తానికి కలిపి యూనిక్ ఐడెంటి కార్డ్ ఆధార్..అలాంటి ఆధార్ కార్డు గుర్తింపు కార్డు కాదన్నారు. కేరళలో పోలింగ్ సందర్భంగా ఆధార్ వివాదం రాజుకుంది. ఎలక్షన్ సందర్భంగా ఓటరు కార్డు లేనివారు తమ గుర్తింపును చూపడానికి గ్యాస్ కనెక్షన్, బ్యాంక్ అకౌంట్, పాస్‌పోర్ట్ ఇలా ఎన్నికల సంఘం పలు రకాల కార్డులను చూపాలని ప్రజలను ఆదేశించింది.
దానిలో భాగంగా పొన్నై నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లో ఓటేసేందుకు ఓటర్లు క్యూలో నిలుచున్నారు. అయితే చాలామంది ప్రజలు గుర్తింపు కార్డుగా ఆధార్‌ను చూపించడంతో అది ఐడీ కార్డుగా పనిచేయదని, ఓటర్ గుర్తింపు కార్డు తీసుకురావాలని అధికారులు వారిని తిప్పి పంపారు. దీంతో అధికారులకు, ఓటర్లకు వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి పనికి ఆధార్ కార్డు అడుగుతుంటే..ఎన్నికల అధికారులు ఎందుకు దీనిని అంగీకరించడం లేదని వారు ప్రశ్నించారు. దీంతో ఎన్నికల సంఘం జారీ చేసిన 12 డాక్యుమెంట్లలో ఆధార్ కార్డుకు స్థానం దక్కలేదని, అందుకే దీనికి గుర్తింపు లేదని అధికారులు జవాబివ్వడంతో అక్కడి వారు అవాక్కయ్యారు.