కోనసీమ అల్లర్లకు 30 రోజులు.. పేరు నిర్ణయంపై ఉత్కంఠ!

ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరును నిర్ణయించడాన్ని నిరసిస్తూ అమలాపురంలో జరిగిన విధ్వంసానికి నేటితో 30 రోజులు పూర్తయ్యింది.  విధ్వంసం తరువాత తీరిగ్గా రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆంక్షల పేరుతో స్థానికులను నానా యాతనా పెట్టారు. దాదాపు పక్షం రోజులు అమలాపురం పట్టణ వాసులకు అంతర్జాత సేవలు అందుబాటులో లేకుండా పోయాయి.  కోనసీమ పరిరక్షణ సమితి నేతృత్వంలో జరిగిన ఆందోళనలో నిరసనకారులు పలు ప్రైవేటు, ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలను దగ్ధం చేశారు.  

రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్,ముమ్మిడివరం  ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇళ్లకు నిప్పు పెట్టారు. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు   పోలీసులు 217 మందిని అరెస్టు చేశారు. కేసును త్వరగా దర్యాప్తు చేయడానికి పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేయడానికి ప్రత్యేక పోలీసుల బృందాలను సైతం ఏర్పాటు చేశారు. అలాగే నిందితులపై రౌడీషీట్లు ఓపెన్ చేయాలని నిర్ణయించారు.  ఇప్పటికి అక్కడ 144 సెక్షన్ 30 సెక్షన్ కింద ఆంక్షలు   మరోవైపు మే 18 నుంచి జూన్ 18 వరకు కోనసీమ జిల్లా పేరు మార్పుకు సంబంధించి అభ్యంతరాల స్వీకరణకు ప్రభుత్వం విధించిన గడువు కూడా పూర్తియ్యింది.  కోనసీమ జిల్లాలోని 22 మండలాల్లో ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. దాదాపు ఆరు వేల మంది అభిప్రాయాలు, సలహాలూ, సూచనలు జిల్లా అధికారులకు పంపినట్టు సమాచారం.

  ఈ నేపథ్యంలో జూన్ 24న   ఏపీ మంత్రివర్గ సమావేశంలో కోనసీమ జిల్లా పేరు మార్పు అంశాన్ని చర్చించి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. సున్నితమైన అంశం కావటంతో ప్రభుత్వం జిల్లా అధికారుల నివేదిక ఆధారంగా..మెజార్టీ అభిప్రాయం మేరకు పేరును ప్రకటిస్తుందా..లేక ఎటువంటి వివాదం లేకుండా ఈ సమస్య పరిష్కరించేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తుందా అనే విషయంపై కోనసీమ వాసుల్లో ఉత్కంఠ నెలకొని ఉంది.

అయితే.. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు ఏవైనా ప్రభుత్వం మాత్రం కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరును ఖరారు చేసే ఉద్దేశంతోనే ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అల్లర్లు విధ్వంసం చోటు చేసుకున్ననాటి నుంచే ప్రభుత్వం వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు మంత్రులు కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరే కొనసాగుతుందని చెబుతున్నారు. అసలు ఈ విధ్వంసం వెనుక ఉన్నది వైసీపీ వర్గీయులేననీ, పేరు మార్పును వ్యతిరేకిస్తూ విధ్వంసం అంటూ ప్రభుత్వం చెబుతున్నదంతా నెపం విపక్షాలపై వేయడానికేననీ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.

 ప్రభుత్వం కోససీమకు అంబేడ్కర్ పేరు పెట్టాలన్న చిత్తశుద్ధి ఉంటే... కోనసీమ పేరు ప్రకటించడానికి ముందే ఆ పని చేసి ఉండాల్సిందని స్థానికులు అంటున్నారు. అలా చేయకుండా అప్పుడు వచ్చిన విజ్ణప్తులను పక్కన పెట్టేసి ఒక నిర్ణయం తీసుకుని.. ఆ తరువాత తీరిగ్గా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పక్క తోవ పట్టించేందుకు కోనసీమలో కుల చిచ్చుకు కారణమైందన్న విమర్శలు ఉన్నాయి. ఈ అల్లర్లకు సంబంధించి అరెస్టయిన వారిలో అత్యధికులు వైసీపీ వారే కావడంతో ఈ విమర్శల్లో వాస్తవముందని స్థానికులు కూడా విశ్వసిస్తున్నారు. ఏది ఏమైనా విధ్వంసం తరువాత నెల రోజుల పాటు ప్రశాంతంగా ఉన్న కోనసీమ.. మంత్రివర్గ నిర్ణయం తరువాత  అదే పరిస్థితి ఉంటుందా అన్న ఆందోళన పట్టణ వాసుల్లో వ్యక్తమౌతున్నది. కాగా కేబినెట్ లో చర్చించి జిల్లా పేరుపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా కోనసీమ వ్యాప్తంగా, ముఖ్యంగా అమలాపురం పట్టణంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.