18 ఏనుగులు మృతి.. 

ఒకేసారి 18 ఏనుగులు మృత్యువాత పడ్డాయి.  అక్కడి అటవీ అధికారుల సమాచారం ప్రకారం, కత్తైటోలి రిజర్వ్‌ ఫారెస్ట్‌ సమీపంలో ఏనుగుల సమూహాలు విగత జీవులుగా పడివుండడాన్ని గుర్తించిన స్థానిక ప్రజలు అధికారులకు సమాచారమిచ్చారు. కొండ ప్రాంతంలో ఒకచోట 14 ఏనుగులు, మరోచోట నాలుగు ఏనుగులు మృత్యువాతపడ్డట్లు అధికారులు గుర్తించారు. పిడుగుపాటు వల్ల ప్రాణలు కోల్పోయి ఉండవచ్చని అనుమానిస్తున్నప్పటికీ.. పోస్టుమార్టంలోనే పూర్తి కారణాలు తెలుస్తాయన్నారు. అయితే, అక్కడి ఏనుగుల నిపుణులు మాత్రం విషప్రయోగం వల్లే 18 ఏనుగులు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఏదేమైనా, పోస్టుమార్టం నివేదికలో పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. ఈ స్థాయిలో ఒకేసారి 18 ఏనుగులు మృత్యువాతపడడం దేశంలో ఇదే తొలిసారి అని అటవీశాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటన అస్సాంలోని నాగావన్‌ జిల్లాలో చోటుచేసుకుంది. 
 

ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ.. ఏనుగుల మృతికి గల కారణాలపై పూర్తి దర్యాప్తు జరపాలని అటవీశాఖ మంత్రి పరిమల్‌ శుక్ల బైద్యకు సూచించారు. సీఎం ఆదేశాల ప్రకారం ఘటనా ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకుంటామని మంత్రి వెల్లడించారు. మరోవైపు, దేశంలో ఏనుగుల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక తొలిస్థానంలో ఉండగా, అస్సాం రెండో స్థానంలో ఉంది. 2017 లెక్కల ప్రకారం, అస్సాంలో దాదాపు 5700 ఏనుగులు ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఏనుగులను వేటాడడం, రైలు ప్రమాదాలు, విష ప్రయోగంతో పాటు విద్యుదాఘాతం వంటి కారణాల వల్ల ఏనుగుల ప్రాణాలు కోల్పోవడం గతకొన్నేళ్లుగా పెరిగిపోయింది.