ఆ జిల్లాల్లో మరణ మృదంగం

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం వద్ద ఈ ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గృహప్రవేశ వేడుకలో పాల్గొనేందుకు తాళ్లరేవు మండలం పెద్దవలస నుంచి రాజమహేంద్రవరానికి తొమ్మిది మంది కుటుంబసభ్యులు ఓ కారులో బయలుదేరారు. పెద్దాపురంలోని ఏడీబీ రోడ్డుపై ఉన్న రుచి సోయా పరిశ్రమ వద్దకు చేరుకునేసరికి డ్రైవర్‌ నిద్రమత్తులో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతిచెందిన వారిలో ఐదు నెలల చిన్నారి ఉంది. సమాచారం అందుకున్న పెద్దాపురం సీఐ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘ‌ట‌నపై కేసు  న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.   

ప్రకాశం లో మరో ఇద్దరు కూలీలు 

ప్ర‌కాశం జిల్లా అద్దంకి స‌మీపంలోని గ‌రిట‌య్య కాల‌నీ వ‌ద్ద కూలీల ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతిచెంద‌గా మ‌రో ప‌ది మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. అద్దంకి నుంచి ఇంకొల్లు మండ‌లం కొనంకికి కూలీలు మిర‌ప‌కాయ‌ల కోత‌కు వెళుతుండ‌గా.. ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. మృతులు అద్దంకి మౌలా న‌గ‌ర్‌కు చెందిన అన‌సూయ‌మ్మ‌, షేక్ క‌రీమూన్‌గా గుర్తించారు. గాయ‌ప‌డిన వారిని అద్దంకి ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.   
 
మ‌హ‌బూబాబాద్ జిల్లాలో ఒకే కుటుంబం లో నలుగురు..

మ‌హ‌బూబాబాద్ జిల్లా నెల్లికుదురులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని క‌రోనా మ‌హమ్మారి క‌బ‌లించింది. 11 రోజుల వ్యవధిలో ఇద్ద‌రు కుమారుల‌తో పాటు త‌ల్లిదండ్రులు చ‌నిపోయారు.   

ఈ నెల 2న తండ్రి, నాలుగో తేదీ పెద్ద కుమారుడు మృతిచెంద‌గా.. 11న చిన్న‌కుమారుడు చ‌నిపోయారు. హైద‌రాబాద్‌లోని ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఇవాళ త‌ల్లి(60) మ‌ర‌ణించారు. ఒక కుటుంబానికే చెందిన న‌లుగురు చ‌నిపోవడంతో నెల్లికుదురులో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.  

జగిత్యాలలో మరో ఇద్దరు 

జగిత్యాల పట్టణంలో కరోనా కాటుకు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల బలయ్యారు. ఎల్జీ రామ్ లాడ్జి వద్ద గల రాఘవేంద్ర మ్యూజిక్ సెంటర్ నిర్వహిస్తున్న రవి నిన్న మృతి చెందగా.. అతని సోదరుడు ఈరోజు కరీంనగర్‌లో చికిత్స పొందుతూ మరణిచారు. అన్నదమ్ముల మృతితో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.