ఒక్కరోజే 10వేల కేసులు.. ఏపీలో డేంజ‌ర్ బెల్స్‌..

సంక్రాంతి త‌ర్వాత కరోనా కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి. మూడు రోజుల వేడుక‌లతో.. క‌రోనా పండుగ చేసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ విజృంభిస్తోంది. ఒక్కరోజే 10వేలకు పైగా కేసులు నమోదవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. అధికారికంగానే 10వేల కేసులంటే.. ఇక అన‌ధికారికంగా లెక్క‌లోకి రాని కేసులు ఇంత‌కు ప‌దింత‌లు ఉండే అవ‌కాశం ఉంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. 

ఏపీలో గడచిన 24 గంటల్లో 41,713 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 10,057 కరోనా కేసులు వ‌చ్చాయి.  కొవిడ్‌ వల్ల రాష్ట్రంలో 8 మంది చ‌నిపోయారు. విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. 

ఏపీలో ప్రస్తుతం 44,935 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,827, చిత్తూరు జిల్లాలో 1,822 కేసులు నమోదయ్యాయి.  

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోజూవారీ కేసులు భారీగా పెర‌గ‌డం క‌ల‌వ‌ర పెడుతోంది. ఇప్ప‌టికే సంక్రాంతికి సొంతూళ్ల‌కు వ‌చ్చిన వారంతా వారి వారి ప్రాంతాల‌కు తిరిగి వెళ్లిపోయారు. ఒక‌వేళ వారికి కొవిడ్ సోకి ఉంటే.. వారి ద్వారా ఆయా ప్రాంతాల్లోనూ వైర‌స్ వ్యాప్తి చెందే ప్ర‌మాదం లేక‌పోలేదు. అందుకే, ఎందుకైనా మంచిది.. పండ‌గ‌కి ఊరెళ్లి వ‌చ్చిన వారంతా రెండు మూడు రోజులు హోం ఐసోలేష‌న్‌లో ఉంటే మంచిద‌ని సూచిస్తున్నారు.