వ్యాక్సినేషన్ లో భారత్ బాహుబలి.. అడుగు దూరంలో వంద కోట్ల టీకాలు.. 

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన,చేస్తున్న కరోనా మహమ్మారిని అణచివేసే శక్తి ఒక్క వాక్సిన్ కు మాత్రమే ఉందని ప్రపచ దేశాలన్నీ గుర్తించాయి. ఏ దేశానికి అ దేశం ఎవరి ప్రయత్నాలు చేశారు. మన శాస్త్రవేత్తలు ప్రపంచ దేశాలతో పోటీ పడ్డారు ... అంతిమ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పడు మన దేశం కరోనా మహమ్మారి కోరలను అణచివేసే వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉంది. 

దేశంలో ఇప్పటివరకు 99కోట్లకు పైగా వాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఈ రోజు (మంగళవారం) తెలిపింది.ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, మన దేశం  ‘‘వాక్సిన్ డోసుల పంపిణీలో 99కోట్ల మార్క్’ను దాటాం. 100కోట్ల డోసుల మైలురాయి దిశగా భారత్ వేగంగా కదులుతోంది’’  అని మంత్రి ట్వీట్ చేశారు.  కరోనా వైరస్‌ను అరికట్టేందుకు బృహత్తర టీకా పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 16న ప్రారంభించింది. తొలినాళ్లలో డోసుల కొరత, ఇతరత్రా కారణాల వల్ల నెమ్మదిగా సాగిన వ్యాక్సినేషన్‌.. కరోనా రెండో దశ నుంచి ఊపందుకుంది. ఇటీవల సెప్టెంబరు 17న మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక్క రోజులోనే 2.5కోట్ల మందికి టీకాలు వేసి అరుదైన రికార్డు సృష్టించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ 99కోట్లు దాటగా.. బుధవారానికి 100కోట్ల మైలురానికి చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే జరిగితే చైనా తర్వాత 100కోట్ల డోసులు పంపిణీ చేసిన రెండో దేశంగా భారత్‌ అరుదైన గుర్తింపు సాధించనుంది.

టీకా పంపిణీలో ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 12కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశారు. ఆ తర్వాత 9.21కోట్ల డోసుల పంపిణీతో మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది. పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, కర్ణాటక, రాజస్థాన్‌లలోనూ 6 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశారు.వాక్సినేషన్ వేగం పెరిగే కొద్దీ దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టిన కొత్త కేసులు.. తాజాగా 13 వేలకు పడిపోయాయి. కొత్త కేసులు 231 రోజులు, క్రియాశీల కేసులు 227 రోజుల కనిష్ఠానికి క్షీణించాయి. మరణాల సంఖ్య 200 దిగువనే నమోదైంది. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. 

సోమవారం 11,81,314 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 13,058 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. అంతక్రితం రోజుకంటే కొత్త కేసులు 500 మేర తగ్గాయి. నిన్న 19,470 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 3,40,94,373 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అందులో 3,34,58,801 మంది వైరస్‌ను జయించారు. ఇటీవల కాలం వైరస్ వ్యాప్తి అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 1,83,118గా ఉంది. క్రియాశీల రేటు 0.54 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు  98.14 శాతానికి పెరిగింది. నిన్న 164 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 4,52,454 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.