సంతాప దినాలు ప్రకటించని ఏపీ! రోశ‌య్య చావులోనూ జగన్ క‌క్ష సాధింపులా?

కొణిజేటి రోశ‌య్య‌. మంత్రిగా, ముఖ్య‌మంత్రిగా తెలుగునేల‌తో విడ‌దీయ‌రాని బంధం. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి రాజ‌కీయాల్లో కొన‌సాగిన వైనం. సుదీర్ఘ‌కాలం ఆర్థిక మంత్రిగా.. 15సార్లు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన వ్య‌క్తిగా.. రాష్ట్ర ఆర్థిక సుస్థిర‌త‌లో రోశ‌య్య పాత్ర ఎన‌లేనిది. క‌రుడుగ‌ట్టిన‌ కాంగ్రెస్ నేత‌గా.. వైఎస్సార్‌కు చాలా స‌న్నిహితుడుగా.. ఉన్నారు. వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత కాంగ్రెస్‌కు చుక్కానిలా మారారు. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి స్థానంలో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించి.. రాష్ట్రంలో రాజ‌కీయ, పాల‌నా సంక్షోభం త‌లెత్త‌కుండా మేనేజ్ చేశారు. క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌గా సేవ‌లు అందించారు. తెలుగు రాజ‌కీయాల్లో రోశ‌య్య ఓ మేరుప‌ర్వ‌తం అంటారు. అలాంటి రోశ‌య్య మ‌ర‌ణంతో తెలుగుజాతి ఓ రాజ‌కీయ కుర‌వృద్ధిడిని కోల్పోయింది. రోశ‌య్య మృతికి సంతాపంగా తెలంగాణ స‌ర్కారు మూడు రోజులు సంతాప దినాలు ప్ర‌క‌టించింది. కానీ..  గుంటూరు జిల్లా వాస్త‌వ్యుడైన రోశ‌య్య మ‌ర‌ణించినా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మాత్రం ఇప్పటివరకు సంతాప దినాలు ప్రకటించకపోవడం విమ‌ర్శ‌ల‌పాల‌వుతోంది. 

ఓవైపు తెలంగాణ గ‌వ‌ర్న‌మెంట్ అధికారికంగా అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాట్లు చేయ‌డంతో పాటు సంతాప దినాలు ప్ర‌క‌టించింది. సీఎం కేసీఆర్.. రోశయ్య పార్ధీవదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. రోశయ్య మరణంపై ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు పార్టీలకతీతంగా నేతలు స్పందించారు. కాని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ప‌ట్టించుకుంటున్న‌ట్టు లేదు. రోశయ్య లాంటి సీనియర్ నేత చనిపోతే.. సొంత రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు నివాళి అర్పించేందుకు రాకపోవడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.  బ‌హుశా.. జ‌గ‌న్‌రెడ్డికి రోశ‌య్య‌పై ఇంకా కోపం త‌గ్గిన‌ట్టు లేదంటున్నారు.  రోశయ్య నివాసంలో ఏర్పాట్లన్ని వైఎస్సార్ ఆత్మగా చెప్పుకునే కేవీపీనే చూస్తున్నారు. రోశయ్య మరణవార్త తెలియగానే... మొదట హాస్పిటల్ కు వెళ్లింది కూడా కేవీపీనే. బహుశా ఇది కూడా జగన్ రాకపోవడానికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

2009, సెప్టెంబ‌ర్ 2.. పావురాల‌గుట్ట‌లో హెలికాప్ట‌ర్ కూలి అప్ప‌టి ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. యావ‌త్ రాష్ట్రం ఒక్క‌సారిగా షాక్‌. వైఎస్సార్ ఆక‌స్మిక మ‌ర‌ణం ప్ర‌భుత్వాన్ని, ప్ర‌జ‌ల‌ను ఉలిక్కిపాటుకు గురి చేసింది. అయితే, ఎలాంటి ప‌రిపాల‌నా సంక్షోభం త‌లెత్త‌కుండా కాంగ్రెస్ పార్టీ వేగంగా స్పందించింది. ముఖ్య‌మంత్రి పీఠంపై పార్టీలో సీనియ‌ర్ నాయ‌కుడు, వివాదర‌హితుడు, మంత్రిగా సుదీర్ఘ అనుభ‌వం ఉన్న రోశ‌య్య‌ను కూర్చోబెట్టింది. ఈ ప‌రిణామం దివంగ‌త వైఎస్సార్ త‌న‌యుడు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి అస‌లేమాత్రం మింగుడుప‌డ‌లేదని అంటారు. రాచ‌రిక వార‌స‌త్వ‌ పాల‌న త‌ర‌హాలో తండ్రి త‌ర్వాత త‌న‌నే ముఖ్య‌మంత్రిని చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. తండ్రి డెడ్‌బాడీ సాక్షిగానే త‌నకు సీఎం ప‌ద‌విపై సంత‌కాలు సేక‌రించార‌ని కూడా అంటారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం జ‌గ‌న్‌రెడ్డిని డోంట్‌కేర్ అంది. జ‌గ‌న్‌ను ప‌క్క‌న‌పెట్టి.. అనుభ‌వ‌జ్ఞుడైన రోశ‌య్య‌నే అంద‌ల‌మెక్కించింది. అప్ప‌టి నుంచి రోశ‌య్య‌పై జ‌గ‌న్‌రెడ్డి ర‌గిలిపోతుంటార‌ని అంటారు.

వైఎస్సార్‌కు రోశ‌య్య ఎంతో స‌న్నిహితుడైనా.. వైఎస్‌కు చేదోడువాదోడుగా ఉంటూ ద‌న్నుగా నిలిచినా.. జ‌గ‌న్‌రెడ్డి మాత్రం రోశ‌య్య సీఎం కావ‌డాన్ని త‌ట్టుకోలేక‌పోయార‌ని చెబుతుంటారు. బ‌హుషా ఆ కోపంతోనే కాబోలు.. రోశ‌య్య మ‌ర‌ణం త‌ర్వాత ఏపీ ప్ర‌భుత్వం క‌నీసం సంతాప దినాలు కూడా ప్ర‌క‌టించ‌లేని అంటున్నారు. ఆంధ్రులంతా గ‌ర్వ‌ప‌డే స్థాయిలో రాజ‌కీయాల్లో రాణించిన రోశ‌య్య మ‌ర‌ణంతోనూ జ‌గ‌న్‌రెడ్డి రాజ‌కీయం చేస్తుండ‌టాన్ని అంతా త‌ప్పుబ‌డుతున్నారు. క‌నీసం, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను చూసైనా.. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం సంతాప దినాలు ప్ర‌క‌టిస్తే బాగుంటుంద‌ని సూచిస్తున్నారు.