Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బెంగాల్, కేరళలో బీజేపీ రాజకీయ ప్రస్థానం.. సవాళ్లు, విజయాలు
posted on: May 7, 2026 10:49AM

భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో పటిష్టమైన శక్తిగా ఎదిగినప్పటికీ, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రయాణం అనేక ఒడిదుడుకులతో కూడుకుని ఉంది. విజయాల కంటే పరాజయాలనే ఎక్కువగా చవిచూసిన చరిత్ర ఉన్నప్పటికీ.. పట్టువదలకుండా తన ఉనికిని చాటుకోవడం ద్వారా ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఒక కీలక రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా కేరళలో పరిమిత విజయాలు ఉన్నప్పటికీ, బెంగాల్‌లో సాధించిన విజయం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నది. దక్షిణ రాష్ట్రమైన కేరళలో బీజేపీకి అధికార పీఠం ఇప్పటికీ అందనంత దూరంలోనే ఉంది. అయినప్పటికీ, గత కొన్ని ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే అక్కడ పార్టీ ఓటు శాతం క్రమంగా పెరుగుతోంది.
వామపక్షాలు, కాంగ్రెస్ కూటములు బలంగా ఉన్న కేరళలో, మైనారిటీ ఓట్ల సమీకరణలు, స్థానిక సామాజిక పరిస్థితులు బీజేపీకి పెద్ద సవాలుగా మారాయి. కానీ.. వ్యవస్థలోని అన్ని శక్తులు తమకు వ్యతిరేకంగా ఉన్నా.. ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగామనే వాదనను పార్టీ బలంగా వినిపిస్తోంది. సున్నా నుంచి మొదలైన తమ ప్రయాణం.. భవిష్యత్తులో కేరళ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పునకు సంకేతమని ఆ పార్టీ భావిస్తోంది. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే, అక్కడ బీజేపీ సాధించిన వృద్ధి రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. దశాబ్దాల పాటు సాగిన వామపక్షాల పాలన, ఆ తర్వాత మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ హవాను తట్టుకుని బీజేపీ తాజా ఎన్నికలలో విజయం సాధించింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 4 శాతం ఓట్లతో ఒక్క సీటు కూడా గెలవలేని స్థితి నుంచి.. 2021 నాటికి 38 శాతం ఓట్లు, 77 సీట్లను కైవసం చేసుకున్న బీజేపీ.. 2026 అసెంబ్లీ ఎన్నికలలో అధికారాన్ని చేజిక్కించుకోవడం ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందనడంలో సందేహం లేదు.
ఈ ఎదుగుదల కేవలం రాజకీయ పోరాటం మాత్రమే కాదనీ, బెంగాలీ ప్రజల ఆత్మగౌరవం మరియు దేశ భద్రతకు సంబంధించిన విషయమనీ బీజేపీ ప్రచారం చేస్తోంది. బెంగాల్ రాజకీయాల్లో హింస అనేది ఒక విడదీయలేని భాగంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. కమ్యూనిస్టుల హయాం నుండీ రాజకీయ ప్రత్యర్థులపై దాడులు, బూత్ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని, కేవలం పార్టీల పేర్లు మాత్రమే మారాయని బీజేపీ విమర్శిస్తోంది. 2021 ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే, బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే ఈ హింసను అతిశయోక్తిగా చూపించిందని తృణమూల్ కొట్టిపారేసింది. బెంగాల్ రాజకీయ సంస్కృతిలోనే హింస పాతుకుపోయిందని, దీనికి అన్ని పార్టీలు బాధ్యత వహించాలని స్వతంత్ర విశ్లేషకులు అభిప్రా యపడుతున్నారు.
ఈ రెండు రాష్ట్రాలలోనూ కూడా బీజేపీ ఎదుగుదల వెనుక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పాత్ర అత్యంత కీలకంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో నిశ్శబ్దంగా పని చేయడం.. బూత్ స్థాయి కార్యకర్తలను తయారు చేయడం, సామాజిక-సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరవ్వడం వంటి వ్యూహాలను ఆర్ఎస్ఎస్ అమలు చేస్తోంది. ముఖ్యంగా బెంగాలీ ఐడెంటిటీని పెంచేలా శ్యామ ప్రసాద్ ముఖర్జీ వారసత్వాన్ని గుర్తు చేస్తూ ప్రజల్లో భావోద్వేగాలను రేకెత్తించి దగ్గరైంది. అయితే.. ఇటువంటి చర్యలు సమాజంలో మతపరమైన ధ్రువీకరణకు దారితీస్తాయనే విమర్శలు వినవస్తున్నాయి. అది వేరే సంగతి.
బీజేపీ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వినిపించిన సోనార్ బంగ్లా (బంగారు బెంగాల్) నినాదం ప్రజల్లో భారీ అంచనాలను పెంచింది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల సృష్టి, చొరబాటుదారుల నియంత్రణ వంటి అంశాలతో కూడిన ఈ వాగ్దానం ఓటర్లను ఆకర్షించింది.అధికారంలోకి రావడానికి దోహదం చేసింది. అయితే ఈ భారీ వాగ్దానాల అమలు బీజేపీ ఇప్పుడు బీజేపీ ముందున్న అతిపెద్ద సవాలు అనడంలో సందేహం లేదు. మొత్తంగా చూస్తే.. బెంగాల్, కేరళలో బీజేపీ ఎదుగుదల అనేది భారత రాజకీయాల్లో ఒక కీలక పరిణామం.
భావోద్వేగపూరితమైన నినాదాలు ఒకవైపు శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుంటే.. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన అందించడం, హింసకు తావులేని రాజకీయ వాతావరణాన్ని నిర్మించడం అనేది అసలైన పరీక్షగా మారుతుంది. కేవలం ఎన్నికల్లో సీట్లు పెంచుకోవడమే కాకుండా.. ఆయా రాష్ట్రాల రాజకీయ సంస్కృతిలో సానుకూల మార్పులు తీసుకురాగలిగితేనే ఈ ప్రస్థానానికి సంపూర్ణ అర్థం లభిస్తుంది. భవిష్యత్తులో ఈ రాష్ట్రాల్లో బీజేపీ తన ప్రభావాన్ని ఎలా కొనసాగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
- సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ నచ్చినట్లైతే https://www.teluguone.comను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు తెలియజేయండి.



.webp)


