పిల్లలు అబద్ధం చెబుతుంటే!

 

ప్రపంచంలో పిల్లల్ని పెంచడం అంత నైపుణ్యమైన పని మరొకటి ఉండదేమో! ఒక పక్క వారి ఆలనాపాలనా చూసుకుంటూ... మరో పక్క వారి వ్యక్తిత్వాన్ని గమనిస్తూ సాగే ఈ ప్రయాణం ఏమంత సులువైంది కాదు. అలాంటి సమయంలో పిల్లలు అబద్ధం చెబుతున్నారని తేలిందనుకోండి... అంతే! తల్లిదండ్రుల ప్రతిస్పందన అసాధారణంగా ఉంటుంది. తమ పెంపకంలో ఏదో లోటు జరిగిపోయిందనో, పిల్లలు సరిగా ఎదగడం లేదనో తెగ బాధపడిపోతారు. శాశ్వతంగా పిల్లల పట్ల అనుమానపు దృక్పథాన్ని అలవర్చుకుంటారు. కానీ అంత అంతర్మధనం అవసరం లేదంటున్నారు నిపుణులు. ఈ విషయంలో వారేం చెబుతున్నారంటే...

విశ్వాసం పెరిగితే

 

నిజం చెబితే తల్లిదండ్రుల ప్రతిస్పందన ఎలా ఉంటుందో అన్న భయమే చాలా అబద్ధాలకి కారణం అవుతుంది. ఈ భయాన్ని పోగొట్టాలంటే మనపట్ల వారికి తగిన నమ్మకాన్ని కలిగించాల్సిందే! మనతో వారు ఎలాంటి సమస్యని అయినా చెప్పుకోవచ్చుననీ... దానికి తగిన పరిష్కారం, సాంత్వన లభిస్తాయనీ నమ్మకం కలిగిన రోజున అబద్ధం చెప్పాల్సిన అవసరమే రాదు.

 

కారణాన్ని గ్రహించండి

 

ప్రతీ అబద్ధం వెనుకా ఏదో ఒక కారణం ఉండవచ్చు. దాన్ని గ్రహించే ప్రయత్నం చేయమంటున్నారు. పిల్లలు సిగ్గుతోనో, భయంతోనో, అలవాటుగానో, ఎవరూ తెలుసుకోలేరనే ధీమాతోనో అబద్ధం చెప్పి ఉండవచ్చు. కారణం ఏమిటని కనుక గ్రహిస్తే వారి ఎదుగుదల గురించి విలువైన విషయాలు తెలుస్తాయి. మున్ముందు వారితో ఎలా మెలగాలో సూచన వినిపిస్తుంది.

 

వయసుని బట్టి అబద్ధం

 

‘మా ఇంట్లో రివాల్వర్ ఉంది!’ అని ఓ పసిపిల్లవాడు అబద్ధం చెప్పాడే అనుకోండి. అది కేవలం గొప్ప కోసం చెప్పిన విషయం కావచ్చు. ‘మా కుక్క మాట్లాడుతుంది!’ అని ఓ 18 ఏళ్ల కుర్రవాడు చెబితే అతను సరదా కోసం చెప్పిన సంగతి కావచ్చు. పిల్లల వయసుని బట్టి వారు చెప్పే సందర్భాన్ని బట్టి ఒక విషయం అబద్ధమా కాదా అని తేల్చుకోవాల్సిందే కానీ ప్రతి విషయానికీ చిందులు వేయడం తగదు.

 

విలువలు తెలిస్తే సరి

 

నిజాయితీగా ఉండటం, చేసిన పనికి బాధ్యతని స్వీకరించడం, ఎలాంటి సవాలుకైనా సిద్ధంగా ఉండటం... వంటి విలువలు పిల్లలకి తెలిస్తే వారి వ్యక్తిత్వం దృఢపడుతుంది. అబద్ధాలు చెప్పడం, పుకార్లు సృష్టించడంలాంటి పనులకు పాల్పడరు. మన ప్రవర్తన, వ్యక్తిత్వం ద్వారానే పిల్లలకి ఇలాంటి విలువలు తెలుస్తాయి. మనమే వారి ముందు అబద్ధాలు చెబుతూ ఉంటే వారి ప్రవర్తన మరో రకంగా ఎలా ఉంటుంది?

 

సమయం కేటాయించాలి

 

పిల్లలు ఏం చెప్పినా ఓపికగా వినేందుకు సిద్ధంగా ఉండాలి. వారితో గడిపేందుకు, వాళ్లు చెప్పే విషయాలు వినేందుకు తగిన సమయాన్ని కేటాయించాలి. వారి మాటల్ని ఏవో పిల్ల మాటలుగా సరిపెట్టేయకుండా... ఓపికగా వారి ప్రశ్నలకు తిరిగి జవాబు చెప్పాలి. అప్పుడే వారికి మనం విలువనిస్తున్న విషయం అర్థమవుతుంది. తమకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకునేందుకు తగిన స్వేచ్ఛ లభిస్తుంది.

 

అన్నింటికీ మించి అబద్ధం చెప్పడం సహజమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అబద్ధం చెప్పకుండా ఏ మనిషీ ఎదగడు. అది తప్పని తెలుసుకోకపోవడమే అసలు సమస్య! పై జాగ్రత్తలు పాటిస్తే ఆ సమస్య రానే రాదని భరోసా ఇస్తున్నారు నిపుణులు.

- నిర్జర.