Read more!

పవన్ తొలి విడత   ఎన్నికల షెడ్యూల్ ఖరారు 

Publish Date:Mar 29, 2024

జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 30 నుంచి ఆయన ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు. ఈ ప్రచార కార్యక్రమానికి 'వారాహి విజయభేరి' అని నామకరణం చేశారు. తాను అసెంబ్లీకి పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే పవన్ తన వారాహి విజయభేరి ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. తొలి సభ ఈ నెల 30న చేబ్రోలు రామాలయం సెంటర్ లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది.  కాగా, పవన్ ప్రచార కార్యక్రమాల్లో భద్రతా వ్యవహారాల సమన్వయకర్తలుగా అందె నరేన్, మిథిల్ జైన్ లను నియమించారు. వీరి నియామకానికి పవన్ ఆమోద ముద్ర వేశారు.  జనసేన ఈ ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో, మూడు విడతల్లో పవన్ ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ ఎన్నికల ప్రచార బరిలో కత్తులు దూస్తుండగా, ఇక పవన్, నారా లోకేశ్ ఎంట్రీ ఇవ్వడమే మిగిలుంది. చంద్రబాబు ప్రజాగళం యాత్ర పేరిట ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుండగా, సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరిట సభలకు హాజరవుతున్నారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు  పిఠాపురంలో పవన్ పర్యటించనున్నారు.  మళ్లీ వచ్చే నెల 9వ తేదీన పిఠాపురానికి  పవన్ రానున్నారు. ఏప్రిల్ 3 - తెనాలి, ఏప్రిల్ 4 - నెల్లిమర్ల, ఏప్రిల్ 5 - అనకాపల్లి, ఏప్రిల్ 6 - యలమంచిలి, ఏప్రిల్ 7 - పెందుర్తి,ఏప్రిల్ 8 - కాకినాడ రూరల్ ,ఏప్రిల్ 10-రాజోలు, ఏప్రిల్ 11 - పి.గన్నవరం, ఏప్రిల్ 12 - రాజానగరం లో పవన్ పర్యటించనున్నారు. 

మనిషి జీవితంలో గురువు ప్రాధాన్యత తెలిపే కథనం!!

Publish Date:Oct 9, 2023

సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.

చంద్రబాబుకు సీఐడీ నోటీసులు

Publish Date:Mar 15, 2021

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సిఐడి అధికారులు..ఆయన నోటీసులు ఇచ్చారు. అమరావతి రాజధానిలో అసైన్డ్ భూములు కొనుగోలు అమ్మకాలపై చంద్రబాబుపై కేసు నమోదు అయింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది.  41సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారని చెబుతున్నారు. నోటీసులు  ఇచ్చాక ఇన్వెస్టిగేషన్ కు పిలుస్తామని ఏపీ సీఐడీ అధికారులు చెబుతున్నారు. అమరావతి నుంచి రెండు సీఐడీ బృందాలు హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై 120బి, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులుకూ సీఐడీ నోటీసులు  అందాయి. 41 సీఆర్పీసీ కింద మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. 

అంతర్గత శక్తులను బయటకు తీయడం ఎలా?  నిపుణులు చెప్పిన మార్గాలేంటో తెలుసుకోండి!

Publish Date:Mar 29, 2024

  సినిమాల్లోని సూపర్‌హీరోల మాదిరిగానే మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అంతర్నిర్మితమై ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి శరీరానికి ఎదురయ్యే అనారోగ్యాలు, గాయాలతో పోరాడుతూ ఉంటుంది.  ఇలా కేవలం శరీరమే కాదు.. మనిషి మనసు కూడా ప్రత్యేక సామర్థ్యాలు కలిగి ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి  మనసు, శరీరం రెండూ కలసి ఎలా పనిచేస్తాయో..  మనిషిలో ఉన్న అంతర్గత శక్తులను బయటకు తీయడం ఎలాగో తెలుసుకుంటే.. బాల్యం.. బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం. పెద్దయ్యాక ప్రతి ఒక్కరూ బ్యాలంలోకి వెళ్లిపోవాలని అంటుంటారు. అదొక అందమైన దశ. అమాయకత్వం, ప్రేమ, సంతోషం, కల్మషం లేని వ్యక్తిత్వం బాల్యంలో ఉంటుంది. ఒకవేళ ఇలా ప్రేమ, ఆప్యాయతల మధ్య కాకుండా నిర్లక్ష్యం చేయబడటం, హింసకు గురికావడం వంటివి బాల్యంలో జరిగి ఉంటే అవి మానసికంగా చాలా బాధపెడతాయి. బాల్యంలో ఏం జరిగిందో అర్థం చేసుకోవడం వల్ల భవిష్యత్తును ఆశాజనకంగా తీర్చిదిద్దుకోవచ్చు. తప్పులను సరిదిద్దుకోవచ్చు. బాద్యత కలిగిన పెద్దలుగా ఎదగవచ్చు. ట్రీట్మెంట్..  చాలామందిలో చిన్నతనంలో జరిగిన ఎన్నో అనుభవాలు మనసులో పాతుకుపోయి ఉంటాయి.  వర్తమానానికి తగినట్టు కాకుండా మనసులో పాతుకుపోయిన విషయాలకు అనుగుణంగా నటిస్తుంటారు. దానికి తగినట్టు ప్రవర్తిస్తుంటారు. అయితే మనసులో ఉన్న ఈ పాత విషయాలను మార్చేయడం ద్వారా మనసులో ఉన్న అంతర్గత శక్తులను బయటకు తీయగలరని అంటున్నారు నిపుణులు. తద్వారా జీవితాన్ని ఉన్నతంగా మార్చుకునే అవకాశం పొందగలం. చిత్తశుద్ది.. వర్తమానం గురించి తెలుసుకోవడం కోసం సమర్థవంతమైన మార్గాలలో మైండ్‌ఫుల్‌నెస్ ఒకటి. అంటే ప్రస్తుతం జరుగుతున్నవాటిని జడ్జ్ చేయకుండా వాటిని నిశితంగా గమనించడం.  వర్తమానంలో భావాలు, అనుభూతులు, ఆలోచనలు, చుట్టూ జరుగుతున్న విషయాలు మొదలైనవాటిని గమనించాలి. మైండ్‌ఫుల్‌నెస్ పాత బాధలను నయం చేయడంలో సహాయపడుతుంది. ప్రస్తుత క్షణంపై దృష్టి కేంద్రీకరించినప్పుడు పాత విషయాలను బాగా అర్థం చేసుకోవచ్చు. వాటిని అంతే ధీటుగా ఎదుర్కోవచ్చు. తద్వారా మనసుకు చికిత్స చేయవచ్చు. క్షమాపణ.. క్షమాపణ అడగడం, ధన్యవాదాలు చెప్పడం, ప్రేమను హృదయపూర్వకంగా వ్యక్తం చేయడం వంటివి వ్యక్తిలో ఉండే ప్రతికూల శక్తులను బయటకు విడుదల చేస్తాయి.  ప్రతికూల ప్రభావాలకు బాధ్యత వహించడం, పశ్చాత్తాపాన్ని, కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయడం ద్వారా వ్యక్తిలో అంతర్గత శాంతి నెలకొంటుంది. ఇది వ్యక్తిగతంగానూ, ఇతరులతోనూ సామరస్యాన్ని నెలకొల్పుతుంది. శ్వాస ఉపయోగించడం.. గతాన్ని నయం చేయడానికి శ్వాసను ఉపయోగించడం చాలా గొప్ప మార్గం. పాత జ్ఞాపకాలను, మనసులో ఉన్న విషయాలను వదిలించకోవడానికి శ్వాసమీద దృష్టి పెట్టడం, నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకోవడం ద్వారా మనస్సును, శరీరాన్ని  శాంతపరచవచ్చు. ఇది గతంలో ముడిపడిన భావోద్వేగాలకు విశ్రాంతి ఇవ్వడానికి, వాటిని విడుదల చేయడానికి సహాయపడుతుంది. జర్నలింగ్.. రిఫ్లెక్షన్స్.. ఆలోచనలను, భావాలను రాయడం వల్ల గతాలకు సంబధించిన గాయాలను, భావోద్వేగాలను నయం చేయడం సులువుగా ఉంటుంది. వ్యక్తులు తమను తాము అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ప్రతికూల విధానాలను విడిచిపెట్టి, ఆరోగ్యకరమైన మార్గంలోకి మెదడును, ఆలోచనలను  తీసుకెళ్లడంలో ఇది సహాయపడుతుంది. సపోర్ట్.. ఏ విషయంలో అయినా స్వంతంగా చేసే ప్రయత్నాల కంటే ఒకరి మద్దతుతో చేసే ప్రయత్నాలు ఎప్పుడూ మంచి ఫలితాలు ఇస్తాయి. భావోద్వేగాలకు సంబంధించిన గాయాలు నయం చేయడంలో సామాజిక మద్దతు కీలకపాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరికి వ్యక్తి గురించి ఆలోచించేవారు, అన్ని విషయాలలో మద్దతు ఇచ్చే వారుంటే తప్పొప్పుల గురించి చర్చించి మాట్లాడటం, అర్థం చేసుకోవడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే గతాన్ని వదిలించుకునే క్రమంలో ఎప్పుడూ ఒంటరితనం వేధించదు. మనస్సు, శరీరం రెండూ ఏకమైనప్పుడు , అవి రెండూ కలిస్తే ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకున్నప్పుడు స్వతహాగానే మనిషిలో అంతర్గత శక్తులు బయటకు వస్తాయి.                                          * నిశ్శబ్ద.
[

Health

]

రోజూ దాల్చిన చెక్క నీరు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Publish Date:Mar 29, 2024

  భారతీయుల వంటింట్లో తప్పనిసరిగా మసాలా దినుసులు ఉంటాయి. ఈ మసాలా దినుసుల్లో  దాల్చిన చెక్క ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. రుచికి కారంగా, తియ్యగా ఉండే దాల్చిన చెక్క వంటకు రుచిని, సువాసనను ఇవ్వడంలో ముఖ్యమైనది. బిర్యానీ నుండి సాధారణ మసాలా వంటకాల వరకు ఏదైనా సరే.. దాల్చిన చెక్క లేకుండా సంపూర్ణం కాదు. అయితే చాలామంది ఈ మధ్య కాలంలో దాల్చిన చెక్కను   టీగానూ, పాలలోనూ, ఆహార పదార్థాల మీద చల్లుకుని తీసుకుంటున్నారు. దాల్చిన చెక్క నీటిని రోజూ తాగితే ఆరోగ్య పరంగా ఏ మార్పులు ఉంటాయి? దాని వల్ల కలిగే లాభాలేంటి? పూర్తీగా తెలుసుకుంటే.. జీవక్రియకు మంచిది.. దాల్చిన చెక్క నీరు జీవక్రియకు చాలామంచిది. బరువు తగ్గాలని అనుకునేవారు, బరువును నియంత్రణలో ఉంచాలని అనుకునేవారు దాల్చిన చెక్క నీరు తప్పనిసరిగా తీసుకోవాలి.  ఎందుకంటే దాల్చిన చెక్క నీరు శరీరంలో గ్లూకోజ్, కొవ్వు కణాల జీవక్రియను పెంచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది.  ఉదయాన్నే ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల  జీవక్రియ వేగాన్ని పెంచుకోవచ్చు. బరువు కూడా సులువుగా తగ్గవచ్చు. మంట తగ్గిస్తుంది.. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.  దీర్ఘకాలిక మంట, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ తో పాటూ కొన్ని రకాల క్యాన్సర్ తో సహా బోలెడు ఆరోగ్య సమస్యలకు దాల్చిన చెక్క మంచిది. ఉదయాన్నే దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల పై ప్రయోజనాలు లభిస్తాయి. జీర్ణ ఆరోగ్యం.. దాల్చిన చెక్క నీరు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గించడం ద్వారా జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్కను సాంప్రదాయకంగా జీర్ణశయాంతర అసౌకర్యాన్ని తగ్గించడంలో ఉపయోగిస్తారు.  ఉదయాన్నే దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. కడుపు లైనింగ్ ను ఉపశమనం చేస్తుంది. సాధారణ ప్రేగుల కదలికలను ప్రోత్సహిస్తుంది. చక్కెర స్థాయిలు.. దాల్చిన చెక్క నుండి లభించే అతి పెద్ద ప్రయోజనాలలో రక్తంలో చెక్కర స్థాయిలు తగ్గించడం ముఖ్యమైనది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచే సమ్మేళనాలు దాల్చిన చెక్కలో ఉన్నాయి. కణాలు ఇన్సులిన్ కు మెరుగ్గా స్పందించడానికి, రక్తప్రవాహంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలోనూ సహాయపడతాయి. ఉదయాన్నే దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల రోజంతా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.  ఇది ఇన్సులిన్ నిరోధకతను, టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మెదడు పనితీరు.. దాల్చిన చెక్కలో మెదడు పనితీరును, అభిజ్ఞా సామర్థ్యాన్ని మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది.  జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను, మొత్తం అభిజ్ఞా పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుందని పరిశోధనలు కూడా సూచిస్తున్నాయి. ఉదయాన్నే దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల మెదడును సహజంగా బూస్టింగ్ చేయవచ్చు. రోజంతా ఏకాగ్రతతో పనిచేయవచ్చు.                                                   *నిశ్శబ్ద.  

కండ్ల ముందే ప్రపంచం.. కళ్లజోడు లోనే సమస్తం

Publish Date:Jul 17, 2020

సాంకేతిక రంగంలో మరో విప్లవానికి రిలయన్స్ సంస్థ తెరతీసింది. జియో ఇంటర్నెట్ తో లక్షలాది మంది వినియోగదారులను తన ఖాతాలో జమచేసుకున్న ఈ సంస్థ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన జియో గ్లాసెస్ డిజిటల్ ప్రపంచాన్ని కొత్త కోణంలో చూపించబోతున్నాయి. రిలయన్స్ సంస్థ 43న వార్షికోత్సవంలో జియో గ్లాస్ ను ఆవిష్కరించారు. ఈ కళ్లజోడుతో ఇప్పటివరకు అరచేతిలో ఇమిడిన ప్రపంచం ఇంక కంటి ముందు సాక్షాత్కరించబోతుంది. కరోనా వ్యాప్తి కారణంగా ప్రపంచమంతా డిజిటలైజ్ అయ్యిన తరుణంలో ఆన్ లైన్ క్లాస్ లు, వీడియా కాన్ఫరెన్సులు, జూమ్ మీటింగ్ లు సగటు మనిషి జీవితంలో సాధారణమైన తరుణంలో ఈ జియో గ్లాస్ లు ఎంతో ఉపయోగకరంగా ఉండ బోతున్నాయి. అయితే వీటి ధరను మాత్రం ఇంకా ప్రకటించలేదు. జియో గ్లాస్ ఫీచర్స్ - నల్లని రంగు..కాస్త మందంగా.. కూలింగ్ గ్లాసెస్ లను పోలిన వీటి బరువు కేవలం 75 గ్రాములు మాత్రమే. - ఈ గ్లాసెస్ ద్వారా మన స్మార్ట్ ఫోన్ నుంచి 25 మిక్సిడ్ రియాలిటీ యాప్స్ పనిచేసేలా సెట్టింగ్ చేసుకోవచ్చు. - ప్రత్యేకంగా పొందుపరిచిన 3 డి హోలో గ్రాఫిక్ డిజైన్ ద్వారా వర్చువల్ రియాల్జీలో మీటింగ్స్ నిర్వహించుకోవచ్చు. - ఇందులో అమర్చిన సెన్సార్లు, హార్డ్ వేర్ అధునాతన టెక్నాలజీలో పనిచేస్తాయి. ఎక్స్ ఆర్ సౌండ్ సిస్టం ద్వారా ఎలాంటి కేబుల్ అటాచ్ మెంట్ లేకుండా మీకు ఇష్టమైన మ్యూజిక్ వినవచ్చు. ఆన్ లైన్ క్లాస్ లు వినవచ్చు. అన్ని రకాల ఆడియో ఫార్మెట్లను సపోర్ట్ చేసే టెక్నాలజీ ఇందులో ఉంది. - హై రిజల్యూషన్ లో ఉండే డిస్ ప్లే ద్వారా గేమింగ్, షాపింగ్ ఎంజాయ్ చేయవచ్చు. - ఇందులోని హోలా గ్రాఫిక్ వీడియో కాల్ ద్వారా పెద్ద స్క్రీన్ పై ప్రజెంటేషన్లు ఇవ్వచ్చు. - అంతేకాదు 3డీ వర్చువల్ అవతార్, 2డి వర్చువల్ ఇంటరాక్షన్ ద్వారా కూడా మీకు కావల్సిన విధంగా ఈ కళ్లజోడు పనిచేస్తుంది. - జియో మిక్స్ డ్ రియాలిటీ క్లౌడ్ అందుబాటులో ఉండటంతో ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహించేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. - ప్రపంచాన్నిసుందరంగా చూపించగల టెక్నాలజీని ఈ కళ్లజోడుతో అందిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపార వేత్తలు ఇలా అన్నిరంగాల వారికి ఉపయోగపడేలా ప్రపంచాన్ని అరచేతిలో నుంచి కండ్లముందుకు తీసుకువస్తున్నారు.