తెలంగాణలో విద్య- ఇకనైనా బాగుపడేనా!

2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అక్షరాస్యత శాతం 66.5 శాతం. ఇదే కనుక వాస్తవమైతే మన దేశంలో బిహార్‌ తప్ప మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా తెలంగాణకంటే మెరుగైన అక్షరాస్యత ఉన్నట్లు లెక్క! ఈ దుస్థితికి కారణాలు చాలానే ఉండవచ్చు. ఇంటిల్లపాదీ కష్టపడితే తప్ప తిండి గింజలు దక్కని ప్రాంతాలు తెలంగాణలో చాలానే ఉన్నాయి. పిల్లలు సైతం పనిచేస్తే తప్ప మొలకెత్తిన బీడు భూములు ఇక్కడ అడుగడుగునా కనిపిస్తాయి. వీటికి తోడు తరతరాలుగా విద్య పట్ల ఉండే నిస్తేజం, ప్రభుత్వం తరఫు నుంచి వైఫల్యం కూడా తెలంగాణలోకి నిరక్షరాస్యతకి ముఖ్యకారణాలే! అంధ్రప్రదేశ్ విభజన జరిగిన తరువాత అధికారాన్ని చేపట్టిన తెరాస ప్రభుత్వమన్నా ఈ పరిస్థితి గురించి కొంత దృష్టి సారించడం సంతోషించదగ్గ విషయం.   వైద్యం, వ్యవసాయం మినహా మిగతా విద్యనంతా ఏకీకృతం చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం అంత తేలికైంది కాదు. ఇప్పటికే పదుల కొద్దీ సంస్థలు తమకి అనుగుణమైన విద్యావిధానాన్ని అనుసరిస్తున్నాయి. బి.సి.స్టడీ సర్కిళ్లు, కార్మిక సంక్షేమ శాఖ కింద నడిచే పాఠశాలలు, ఎస్‌.సి. కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలు... ఇలా ఒకో శాఖా ఒకో తరహాలో విద్యని నడిపిస్తోంది. వీటిలో చాలా సంస్థలు నిధులని ఖర్చుచేయడంలో చూపించే శ్రద్ధని విద్యని అందించడంలో చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమ మీద సరైన నియంత్రణ లేకపోవడంతో ఆయా సంస్థల ఇష్టారాజ్యంగా విద్య సాగుతోంది.   కేవలం విద్యిను ఏకీకృతం చేయడంతోనే అంత ఉపయోగం ఉండదు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యని బోధించే తీరు; పాఠశాలల్లోని పరిస్థితులు; ఉద్యోగ ఆధారిత విద్యకు సంబంధించి కూడా ప్రభుత్వం కఠిన నిర్ణయాలను తీసుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం ప్రతి ఒక్క విద్యాసంస్థ తనకు అనుగుణమైన పాఠ్య పుస్తకాలను రూపొందించుకునేంత స్థాయిలో ఉంటోంది. ఆటస్థలాల వంటి సౌకర్యాల లేనిదే పాఠశాలలను నిర్వహించకూడదన్న నిబంధనలు ఉన్నప్పటికీ... కంటి ముందే అలాంటి సంస్థలు వందలు వేలుగా కనిపిస్తున్నాయి. ఆరో తరగతి నుంచే ఐ.ఐ.టి శిక్షణ అంటూ పిల్లల మీద మోయలేనంత భారం మోపే పరిస్థితులు ఉన్నాయి. ఏటా వేలాదిమంది గ్రాడ్యుయేట్లు పట్టాలను పట్టుకుని రోడ్డు మీదకు చేరుకుంటున్నారు. విద్యను వ్యాపారస్థాయి నుంచి విజ్ఞానపు స్థాయికి తీసుకురావల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. పిల్లలను అమెరికా పౌరులుగా కాకుండా మన దేశపు భావితరాలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదా ఉంది. అటు ప్రభుత్వమూ, ఇటు తల్లిదండ్రులూ విద్య ఎందుకు అవసరం? ఆ విద్య ఎలా ఉండాలి? విద్యతో తమ పిల్లలలో ఎలాంటి మార్పు రావాలి? అన్న విషయంలో ఖచ్చితమైన అభిప్రాయాలు కలిగి ఉంటే రానున్న దశాబ్దాలలో తెలంగాణ దిగువ నుంచి కాకుండా ఎగువ నుంచి తొలిస్థానాలలో నిలుస్తుంది.

చంద్రబాబుకి సమస్యలే సమస్యలు!

తెరాస ఉద్యమం కారణంగానో, కాంగ్రెస్ వ్యూహం కారణంగానో... ఆంధ్రప్రదేశ్ ఆగమఘాల మీద చీలిపోయింది. ఒక రాష్ట్రాన్ని ఎలా విభజించకూడదో అలా విభజించి చూపారు దిల్లీ పెద్దలు. అలాంటి కొత్త రాష్ట్రానికి రాజధాని దగ్గర నుంచీ రవాణా దాకా అన్నీ ఏర్పరుచుకోవలసిందే! అందుకోసం కేంద్రం నుంచి అద్భుతమైన సాయం లభిస్తుందంటూ ఎదురుచూసిన వారికి ‘ప్రత్యేక ప్యాకేజీ’లేవీ కనుచూపు మేరలో కనిపించడం లేదు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన దిల్లీ పెద్దలు నిండుమనసుతో ఆశీర్వదించారే కానీ, నిండైన ప్యాకేజీలు ఏవీ ప్రకటించలేదు. కొత్త రాజధానినీ, అందులో సచివాలయాన్ని ఏర్పాటు చేయడం ఒక ఎత్తైతే... అక్కడికి ఉద్యోగులని రప్పించడం మరో ఎత్తుగా ఉంది. హైదరాబాదు నుంచి అమరావతికి తరలివచ్చే విషయంలోనూ, తమకి జీతాలు పెంచుతామని ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలోనూ... ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఇక మొన్నటికి మొన్న వెలువడిన గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలలో తెదెపాకి ఘోర పరాజయమే మిగిలింది. ప్రత్యర్థులని మట్టికరిపించి నెం.1గా నిలుస్తామని ఊహించిన తెదెపా శ్రేణులు, 1 నెం. సీటుతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది. దాంతో చంద్రబాబు తెలంగాణ మీద తగిన శ్రద్ధని చూపడం లేదనీ, ఆ విషయాన్ని గ్రహించిన ఓటర్లు తెదెపాను పక్కన పెట్టారనీ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాను ఎక్కడికీ వెళ్లలేదని చంద్రబాబు గ్రేటర్‌ ఓటర్లకు చెప్పినా... అలా చెప్పాల్సి రావడమే ఆయన పట్ల ఓటర్లకి ఉన్న అభిప్రాయానికి నిదర్శనంగా నిలుస్తోంది. తెలంగాణ విషయంలో చంద్రబాబు చురుకుగా లేకపోవడంతో, ప్రజలని ఎలా కన్విన్స్‌ చేయాలో అక్కడి క్యాడర్‌కి పాలుపోవడం లేదు. తెదెపా, తెలంగాణలో తిరిగి పుంజుకోవాలంటే చంద్రబాబు భారీ కసరత్తే చేయవలసి ఉంటుంది. ఒక పక్క చంద్రబాబు రకరకాల సమస్యలతో సతమతం అవుతుంటే, గోరుచుట్టు మీద రోకటి పోటులా తుని సంఘటన వచ్చిపడింది. ఒక వర్గం తన కోసం రిజర్వేషన్లను సాధించుకునే క్రమంలో, ముద్రగడ దానికి ‘అనుకోకుండా’ ఉద్యమ నాయకుడైపోయారు. ఒక పక్క ఉద్యమాన్ని తనదైన శైలిలో నడిపిస్తూనే, చంద్రబాబు మీద వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతున్నారు ముద్రగడ. ఉద్యమం పట్ల చంద్రబాబు సానుకూలంగా మారుతున్న కొద్దీ అది మరింత జటిలంగా మారడం రాజకీయ విశ్లేషకులని సైతం ఆశ్చర్యపరుస్తోంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఇంతదాకా తగిన అవకాశం దక్కని జగన్‌కు కూడా ఈ ఉద్యమం బాగానే కలిసి వస్తున్నట్లుంది. మరి సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు, ఇన్ని సమస్యలనూ ఒక్కసారిగా ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే!

కాంగ్రెస్‌ నేతలే వారి కొంప ముంచారా!

  గ్రేటర్‌ ఎన్నికలలో తాము అద్భుతాలని సృష్టిస్తామని కాంగ్రెస్‌లో ఎవరికీ ఆశ లేని మాట వాస్తవమే! కానీ, ఓ పదిహేను సీట్లన్నా దక్కించుకుందామని అనుకున్నారు. అదృష్టం మరీ బాగుంటే మూడో స్థానాన్ని కూడా చేరుకుంటామని ఆశించారు. కానీ ఆది నుంచి తుది దాకా కాంగ్రెస్‌కి ఏదో ఒక రూపంలో ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. ఒక పక్క ఎన్నికల నగారా మోగుతుంటే మరో పక్క అసలు పార్టీలో ఎవరు ఉంటారో, ఎవరు తూచ్‌ అంటారో తెలియని పరిస్థితి. దానం నాగేందర్‌ వంటి కీలక నేతలు పార్టీలో ఉంటున్నట్లా తెరాసలో చేరుతున్నట్లా అన్న అయోమయంలో కార్యకర్తలు ఉండిపోయారు.   ఇక అభ్యర్థులుగా ఎవరిని నిర్ణియించాలన్న విషయంలో కూడా అగ్రనేతలు కావల్సినంత అలసత్వాన్ని ప్రదర్శించారు. బీ.ఫారాలు ఎవరికి ఇవ్వాలి? ఇస్తే మిగతా ఆశావహులని ఎలా బుజ్జగించాలి?... అన్న సందిగ్ధంలో పుణ్యకాలం కాస్తా పుచ్చిపోయింది. టికెట్లు దక్కని ఆశావహులని తృప్తి పరిచేందుకు నేతలు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు సరికదా, గాంధిభవన్‌కు తాళాలు వేసుకుని అంతా అదృశ్యమైపోయారు! ఇక ప్రచారం కూడా అంతంత మాత్రంగానే సాగింది. ఉద్దేశ్యం ఏమైనా కానీ… తెలంగాణ అప్పటికప్పుడు వచ్చేందుకు కారణం కాంగ్రెసే! అయినా ఆ విషయాన్ని ప్రజలకి తెలియచేయడంలో కాంగ్రెస్‌ నాయకత్వం విఫలమైంది. ఒకవైపు తెరాస నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు అందరూ కలిసి కట్టుగా ఒక్క జట్టుగా ప్రచారంలో దూసుకుపోతుంటే… కాంగ్రెస్‌ మాత్రం ప్రచారంలో వెనుకబడిపోయింది. ఎవరో కొద్దిమంది అగ్రనాయకులు తప్ప వేరెవ్వరూ దూకుడుగా ప్రచారాన్ని సాగించలేకపోయారు. అంతగా ప్రజాకర్షణ లేని దిగ్విజయ్‌ సింగ్‌ వంటి నేతలు ప్రచారానికి వచ్చినా వారి వల్ల పెద్దగా లాభం లేకపోయింది. ఎన్నికల సమయంలో రాహుల్‌ గాంధి రెండుసార్లు హైదరాబాదుకి వచ్చినప్పటికీ… ప్రచారానికి దూరంగానే ఉండిపోయారు.   ఎన్నికల ప్రచారం మంచి వేడిలో ఉండగా జానారెడ్డి చేసిన పని, ఆ పార్టీని విజయాలను మరింత దెబ్బ తీసింది. ఒక పక్క సాటి నేతలంతా ప్రభుత్వాన్ని ఎండగడుతుంటే… పనిగట్టుకుని మరీ ప్రభుత్వం అందిస్తున్న 5 రూపాయల భోజనం భలే ఉందంటూ కితాబునిచ్చారు. ఇలాంటి కీలక సమయంలో జానారెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటో ఆయనకే తెలియాలి. ఈ మాటలు ప్రతిపక్షాల విజయానికి గొప్ప బలాన్నిచ్చాయని ఆయన సహచరులే సణుక్కున్నారు. ఫలితం! 2009లో 52 సీట్లను గెలుచుకుని మేయర్ పదవిని సైతం సాధించిన కాంగ్రెస్‌, ఇప్పుడు 2 స్థానాలకే పరిమితమైంది. ఆ పార్టీ మేయర్ బండ కార్తీకరెడ్డి సైతం ఓటమి పాలయ్యారు. మరి ఈ పరాజయం గురించి కాంగ్రెస్‌ పెద్దాయన జానారెడ్డి ఎలా స్పందిస్తారో!  

తిరుగులేని విజయం!

  గ్రేటర్‌ ఎన్నికలలో తెరాస వీరాభిమానులు కూడా ఊహించని విధంగా ఆ పార్టీ ఇప్పడు దాదాపు 110 స్థానాలకు చేరువకు వచ్చేసింది. 30కి పైగా స్థానాలతో మజ్లిస్‌ రెండో స్థానాన్ని కైవలం చేసుకుంది. ఇక బీజేపీ, తెదేపా, కాంగ్రెస్‌లకు ఘోర పరాజయమే మిగిలింది. తెరాస, మజ్లిస్‌ మినహా మరే పార్టీ కూడా రెండంకెలను చేరుకోలేని దీన పరిస్థితిలో ఉన్నాయి. తెరాస తప్ప తమకు మరో దారి లేదనుకున్నారో, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం అనుకున్నారో, కాంగ్రెస్‌ను నమ్ముకుని ఉపయోగం లేదనుకున్నారో… ప్రజలు ఏమనుకున్నా కానీ ఫలితాలు మాత్రం స్పష్టంగానే కనిపిస్తున్నాయి. ఇక ఈ విజయాన్ని తెరాస ఎలా భావిస్తుందన్నదే అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం. తమకు తిరుగులేదు కాబట్టి నిరంకుశ ధోరణితో ముందుకు వెళ్తుందా? లేకపోతే ఎదుగుదలతో ప్రజల పట్ల ఒదిగి ఉంటుందా?... అన్నది కొద్ది నెలలలోనే తేలిపోతుంది. హైదరాబాద్‌ ప్రజలు ఈ విజయాన్ని ఎప్పటి నుంచో ఊహిస్తూనే ఉన్నారు. అయితే గ్రేటర్‌ పీఠం మీద బలమైన అధికార పక్షం ఉండటం వల్ల వారికి ఎంత ఉపయోగం ఉంటుందో అసలు ప్రతిపక్షమే లేని పరిస్థితి కూడా అంత క్షేమకరం కాదు. మరి ఇలాంటి సందర్భంలో ప్రజల తరఫున ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మజ్లిస్‌ ఒక బలమైన ప్రతిపక్షంగా నిలబడుతుందా లేక పాతబస్తీకే అది పరిమితమవుతుందా అన్నది కూడా వేచిచూడాల్సిందే. గ్రేటర్‌ ఎన్నికలలో ఒక్కటి మాత్రం స్పష్టంగా తేలిపోయింది. హైదరాబాదు ప్రజలంతా కూడా ముక్తకంఠంతో తమకు తెరాస వస్తేనే ప్రయోజనం అన్న అభిప్రాయాన్ని తెలియచేశారు. మరి ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవల్సిన బాధ్యత అధికార పార్టీకి ఎంతైనా ఉంది. హైదరాబాదు ప్రజలకు ఉన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. తాగునీరు, రోడ్లు, విద్యుత్‌ వంటి మౌలికమైన సదుపాయాలు కూడా వారికి ఇప్పుడు అందుబాటులో లేకుండా పోయాయి. వీటన్నింటినీ తెరాస ఎంతవరకూ పరిష్కరించగలుగుతుందో చూడాలి. మరోవైపు తమ పరిస్థితి ఎందుకు ఇంత దయనీయంగా మారిపోయిందో ఆత్మపరిశీలన చేసుకోవల్సిన అవసరం ప్రతిపక్షాలకి ఏర్పడింది.  

పురానాపూల్‌లో ఏం జరిగింది?

ఈ నెల రెండో తేదీన గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ చాలా వరకూ ప్రశాంతంగానే జరిగింది. కానీ చివరి దశలో అనూహ్యంగా జరిగిన సంఘటన వల్ల కౌంటింగ్‌ను కూడా వాయిదా వేసి మళ్లీ ఒకచోట రీపోలింగ్‌ నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. పురానాపూల్‌లో కాంగ్రెస్‌ తరఫున అభ్యర్థిగా నిలిచిన మహమ్మద్‌ గౌస్ ఒకప్పుడు మజ్లిస్‌లో కీలక నేత. కానీ తనకు మజ్లిస్‌ నుంచి సీటు దక్కకపోవడంతో కాంగ్రెస్‌ పక్షాన పోటీకి దిగారు. ఈ విషయంలో మజ్లిస్ కార్యకర్తలు మొదటి నుంచీ ఆయన మీద కోపంతో ఉన్నారు. స్థానిక మజ్లిస్‌ ఎమ్మెల్యే పాషాఖాద్రీ, గౌస్‌లకు మధ్య పోలింగ్‌నాటి ఉదయమే గొడవ జరగడంతో గౌస్‌ను అరెస్టు చేసి పోలిస్‌స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్‌ నాయకులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సాయంత్రం వేళకి గౌస్‌ను విడిపించుకుని తీసుకువెళ్లే ప్రయత్నంలో ఘర్షణ మొదలైంది. మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఓవైసీ వెంట వందలాది మంది మజ్లిస్ కార్యకర్తలు ఒక్కసారిగా పురానాపూల్‌కి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేయడమే కాకుండా, లోపల ఉన్న షబ్బీర్‌ అలీ మీద కూడా దాడి చేశారు. ఈ విషయంలో పరస్పర కేసులు నమోదు కావడంతో అక్కడ రీపోలింగ్‌ను నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. నిజానికి మిగతా ప్రాంతాలతో పోలిస్తే పురానాపూల్‌లో ఓటింగ్‌ శాతం చాలా మెరుగ్గా ఉంది. అక్కడ 54 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇప్పడు వారంతా మళ్లీ ఓటు వేయాల్సి రావడంతో స్థానికంగా తిరిగి సెలవుని ప్రకటించారు. ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పురానాపూల్‌లో జరిగిన ఘటనకి పోలీసు వైఫల్యం కూడా కొంత కారణంగా కనిపిస్తోంది. ఉదయం నుంచి ఘర్షణ వాతావరణం నెలకొన్నా కూడా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కానీ, నేతల మీద దాడి జరుగుతున్నప్పడు అడ్డుకోవడం కానీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. అక్కడ డిసిపిగా విధులను నిర్వహిస్తున్న సత్యనారాయణ చోద్యం చూస్తూ నిల్చున్నారని విపక్షాలు మండిపడ్డాయి. దాంతో ఆయనను విధుల నుంచి తప్పిస్తూ, ఈసారి పురానాపూల్‌ పోలింగ్‌ బాధ్యతను వేరొకరికి అప్పగించింది ఎన్నికల కమిషన్‌! ఎన్నికల సమయంలో పరస్పర దాడులు జరగడం కొత్త కానప్పటికీ… నేతలే తమ కార్యకర్తలను దగ్గరుండి ఉసిగొల్సడం, సాటి ప్రజాప్రతినిధుల మీద దాడి చేయించడం ఇప్పుడు సరికొత్త ఆనవాయితీకి దారి తీసింది. ఓటర్లు మాత్రం ప్రజాస్వామ్యం ఇంతకంటే మరింత దిగజారకుండా ఉండాలని ఆశిస్తున్నారు.

గ్రేటర్ ఎన్నికలతో ఎవరేంటో తేలిపోయిందా..?

రాజకీయాల్లో కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానాలు చెబుతుంది. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలను చూస్తుంటే కూడా అలానే అనిపిస్తుంది. ఎప్పటినుండో వీడని కొన్ని ప్రశ్నలకు ఈ గ్రేటర్ ఎన్నికల కారణంగా సమాధానం దొరికింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే..పార్టీల్లో అధినేత కాకుండా.. వారి తరువాత స్థానం ఎవరిది అనే విషయంపై ఒక స్పష్టత వచ్చినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రేపటి తరాల భవిష్యత్ రాజకీయ ప్రతిబింబాలు ఈ గ్రేటర్ ఎన్నికల ద్వారా తెలిసినట్టయింది. మొట్టమొదటిగా టీఆర్ఎస్ పార్టీ విషయానికే వస్తే.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ కాబట్టి తనకు మొదటి స్థానం ఎలాగూ ఉంటుంది. అయితే కేసీఆర్ తరువాత ఎవరూ..? అంటే గతంలో అయితే కేసీఆర్ తరువాత అంతటి నాయకత్వపు లక్షణాలు ఉంది హరీశ్ రావుకే కాబట్టి వెంటనే అతని పేరు చెప్పేవారు. అందులోనూ హరీశ్ రావుకి కూడా కాస్త జనాదారణ ఎక్కువ కాబట్టి.. ఎలాంటి సందేహం లేకుండా కేసీఆర్ తరువాతి స్థానం హరీశ్ రావుదే అని అనుకునేవారంతా. కానీ కాలంతో పాటు అన్నీ మారుకుంటూనే వస్తున్నాయి. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం టక్కున చెప్పాలంటే కాస్త ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే హరీశ్ రావు స్థానాన్ని కేటీఆర్ ఆక్రమించారనిపిస్తోంది. దీనికి గ్రేటర్ ఎన్నికలే నిదర్శనం. గ్రేటర్ ఎన్నికల భాద్యతను మొత్తం తన భుజాలపై వేసుకొని.. తన వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకున్నారనే చెప్పొచ్చు. అటు తెలంగాణ వాదాన్ని వినిపిస్తూనే.. ఇటు సీమాంధ్రులను కూడా మెప్పించే విధంగా మాట్లాడుతూ బానే మార్కులు కొట్టేశారు. దీంతో కేసీఆర్ తరువాత రాజకీయ వారసుడిగా కేటీఆర్ అనే విషయం అందరికి అర్ధమయిపోయింది. ఇక టీడీపీ విషయానికొస్తే పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినప్పటికీ ఆయన ఏపీ బాధ్యతను చూసుకోవాల్సి వుంటుంది. నారా లోకేశ్ ఎలాగూ జాతీయ ప్రధాన కార్యదర్సిగా ఉన్నారు. ఇక తెలంగాణలో పార్టీ బాధ్యతలు చూసుకోవడానికి చాలా మంది సీనియర్ నేతలు ఉన్నా కానీ.. వారందరి కంటే రేవంత్ రెడ్డే పార్టీకి పెద్ద దిక్కు అని తేలిపోయింది. ఎర్రబెల్లి, ఎల్.రమణ వంటి సీనియర్ నేతలు ఏదో ఉన్నామంటే ఉన్నాం అన్న చందాన అయిపోయింది వారి పరిస్థితి. ఇక మిగిలిన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, ఐంఎఐం పరిస్థితి అయితే ఎప్పటిలాగే ఉంది. రాష్టం విడిపోయి 19 నెలల అవుతున్నా ఇప్పటికీ సరైన నాయకత్వం లేదు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యకు ఇంకా పరిష్కారాన్ని చూడకపోవడం ఆశ్చర్యకరం. ఇక బీజేపీ విషయానికొస్తే ఆ పార్టీలో కూడా చరిష్మాకలిగిన నేతలు ఒక్కరూ కూడా లేరు. ఏదో సంప్రదాయబద్ద నేతలు తప్ప.. నాయకత్వంగా ఉండి పార్టీని ముందుకు నడిపించే నేతలు లేరు. ఎంఐఎం పార్టీ పాతబస్తీకే పరిమితం అని తేలిపోయింది. వైసీపీ పార్టీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్టు ఉంది. మొత్తానికి గ్రేటర్ ఎన్నికల్లో కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరికింది. ఇక ఎన్నికల ఫలితాలు కూడా వస్తే ఎవరి భవిష్యత్ ఎంటో.. ఇంకా మరెన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని భావిస్తున్నారు. మరి అది తెలియాలంటే రేపు ఎన్నికల ఫలితాల వరకూ ఆగాల్సిందే.

పోలింగ్‌ 45 శాతమే… కానీ ఎందుకు?

  నెలరోజులుగా సందడిసందడిగా సాగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల క్రతువు ముగిసింది. 2009లో జరిగిన స్థానిక ఎన్నికలతో పోలిస్తే పోలింగ్‌ శాతం కాస్త మెరుగుపడిందంటూ ఎన్నికల అధికారులు మురిసిపోయారు. కానీ తామ ఆశించినంతగా పోలింగ్‌ జరగలేదని ఎన్నికల అధికారి జనార్దన్‌రెడ్డి సైతం ఒప్పుకోక తప్పలేదు. ఓటు వేసేందుకు తరలిరమ్మంటూ నగర వాసులను ఎంతగా వేడుకున్నా వారు ముందుకు రాలేదని ఆవేదన చెందారు ఆయన. నగరవాసులో ఈ జడత్వం సాధారణమేననీ ఇందుకోసం మరింత కృషి చేయాల్సి ఉంటుందనీ జనార్దన్‌రెడ్డి అంటున్నారు. నిజంగానే నగరవాసులలోని జడత్వం వల్ల ఇంత దారుణమైన పోలింగ్‌ శాతాలు నమోదయ్యాయా. మరైతే విద్యావంతులు తక్కువగా ఉండే చోట కూడా 20 శాతం కంటే ఓట్లు ఎందుకు నమోదైనట్లు! పోలింగ్‌ ఇంత తక్కవగా నమోదవడానికి కారణం ఒకటో రెండో కాదు…. వెతికితే చాలా కారణాలే వెక్కిరిస్తున్నాయి. - ఎన్నికల నగారా మోగినప్పటి నుంచీ తెరాస గ్రేటర్‌ పీఠాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.   ఎలాగైనా నెగ్గితీరాలనుకుంటూ దూకుడుగా ముందుకు సాగిపోయింది. ప్రచారంలో ఒకో రోజూ గడిచేకొద్దీ తెరాస వేగానికి అల్లంత దూరంలో మిగతా పార్టీలు నిలిచిపోయాయి. ఓటర్లు సైతం ఈ ఎన్నికలలో తెరాస తప్ప మరో పార్టీ రాదన్న అవగాహనకు వచ్చేశారు. తాము ఓటు వేసినా వేయకున్నా అధికార పార్టీదే మేయర్‌ పీఠం అన్న అభిప్రాయంతో ఉన్నారు. పోలింగ్‌ శాతం తగ్గడం వల్ల కొన్ని ప్రాంతాలలోనే బలంగా ఉండే మజ్లిస్‌ వంటి ప్రతిపక్షాలు నష్టపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. - ఎన్నికల కమిషన్‌ ఎంతగా మొత్తుకున్నా, ఓటు వేయమంటూ ఎంతమంది ప్రముఖులు అభ్యర్థించినా విద్యావంతులు ఎప్పటిలాగానే పోలింగ్‌కు దూరంగా ఉండిపోయారు. ఏ ప్రభుత్వం వస్తే తమకేం ఒరుగుతుందనే నిరాశ ఒకవైపు, రాజకీయాలంటే ఉన్న నిరాసక్తత మరోవైపు వారిలో జడత్వాన్ని బలపరిచాయి. - పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ చాలా సంస్థలు వాటిని అమలుపరచలేదు. ఐటీ ఉద్యోగులు నేరుగా వెళ్లి ఎన్నికల కమీషన్‌ను సంప్రదించినా లాభం లేకపోయింది. పోలింగ్‌ రోజున చాలా చాలా సంస్థలు యథావిధిగానే పనిచేశాయి. - ఎన్నికలకు ముందు పోలింగ్‌ డివిజన్లను ఇష్టారాజ్యంగా చీల్చడంతో తమ ఓటు ఎక్కడ ఉందో తెలియని గందరగోళం కొందరు ఓటర్లలో నెలకొంది. తాము ఒకచోట నివసిస్తుంటే ఓటు మరెక్కడో ఉండటంతో మరికొందరు ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు. - ఓట్లు వేసేందుకు కదలి రమ్మంటూ ఎన్నికల కమిషన్‌ తెగ ఊదరగొట్టింది. కానీ ఓటు హక్కును కల్పించేందుకు అందులో నాలుగో వంతు ప్రయత్నం చేసినట్లు కూడా కనిపించలేదు. ఫలితం వేలాది ఓట్లు గల్లంతైపోయాయి.   పైగా ఇంటింటికీ తిరిగి కొత్త ఓటర్లను నమోదు చేయడంలో కానీ, ఓటరుగా నమోదు చేసుకునేందుకు అందిన రాతపూర్వక దరఖాస్తులను పరిశీలించడంలో కానీ ఎన్నికల కమిషన్‌ ‘జడత్వాన్ని’ ప్రదర్శించిందన్న ఆరోపణలు ఉన్నాయి. అన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తులకి మాత్రం సత్వర పరిష్కారం లభించింది. - ఓటర్లకు సంబంధించి దాదాపు 90 శాతం ఓటరు స్లిప్‌లను పంపిణీ చేశామని ఎన్నికల కమిషన్‌ చెబుతోంది. కానీ వాస్తవం వేరే విధంగా ఉంది. ఒకప్పుడు ఎన్నికల పార్టీలు కూడా ఓటర్లకు స్లిప్‌లను పంచిపెట్టేవి. ఇప్పుడు ఈ భారమంతా ఎన్నికల యంత్రాంగం తమ భుజస్కంధాల మీద తీసుకోవడంతో తానూ పని చేయక, ఇతరుల పనీ చెడగొట్టినట్లు అయ్యింది. - ఇంతకుముందు ఎన్నికలలో ఉన్న పార్టీలన్నీ చివరి నిమిషం వరకు తమ పార్టీ వర్గాలను సమీకరించి పోలింగ్‌కు సిద్ధంగా ఉంచేవి. కానీ ఈసారి పోలింగ్‌ రోజున అలాంటి హడావుడి కనిపించలేదు. వచ్చే సీట్లు వస్తాయిలే అన్న నిరాశలో ప్రతిపక్ష పార్టీలు కూడా మునిగిపోయినట్లున్నాయి. తవ్వుకుంటూ పోతే తక్కువ పోలింగ్ మందకొడిగా సాగడానికి ఇలాంటి కారణాలు ఎన్నో కనిపిస్తాయి. ఈసారి బ్యాలెట్‌లో None of the above (NOTA) ఎంపికను ఉంచకపోవడం కూడా పోలింగ్‌ మీద కొంత ప్రభావం చూపిందంటున్నారు విశ్లేషకులు. వీటన్నింటి వల్లా జనాభాలో 50 శాతం మంది మాత్రమే ప్రజలు తమ నిర్ణయాన్ని చెప్పగలిగారు. మరి మిగతా సగం ప్రజల మనసులో ఏమున్నట్లు. మంగళవారం సెలవు వచ్చింది కదా అని సోమవారం కూడా సెలవు పెట్టుకుని నగరజీవితం నుంచి విశ్రాంతి తీసుకున్నారా? లేకపోతే ప్రస్తుత రాజకీయాలలో విసిగిపోయారా? లేక తమకంటూ ఓ నిర్ణయమే లేని జడత్వంలో మునిగిపోయారా?

మనకి కావల్సిందల్లా ‘భాగ్య’నగరమే!

ఎట్టకేళకు పోలింగ్ క్షణాలు వచ్చేశాయి. హైదరాబాద్‌ నగరపాలక సంస్థకు జరిగే ఎన్నికలలో 70లక్షల మందికి పైగా ఓటర్లు తమ నిర్ణయాన్ని తెలుపబోతున్నారు. 1300మందికి పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇన్నాళ్లూ ఎన్నికల వాగ్దానాలతో, ప్రతిపక్షాల మీద ఆరోపణలతో పార్టీలన్నీ నగరాన్ని హోరెత్తించాయి. చాలా పార్టీలు నమ్మశక్యం కాని వాగ్దానాలను చేశాయి. పార్టీలు, తాము ఇచ్చే హామీల గురించిన సాధ్యాసాధ్యాలను పట్టించుకునే సంప్రదాయం ఎప్పుడో కొట్టుకుపోయింది. ఓటరుని ఆకర్షించడంలోనే ఇప్పుడు వారికి ఆసక్తి. ఓటరు కూడా హామీల గురించి కాకుండా, ఎవరిని ఎన్నుకుంటే తమకు ఎక్కువ లాభం అన్న దిశగానే ఆలోచిస్తున్నాడు. ఓటు కోసం డబ్బు తీసుకునేవారు సైతం అంతిమంగా తనకి నచ్చినవారికే ఓటు వేస్తున్నారు. ‘ఇంతకీ హైదరాబాదులో నివసించే ప్రజలకి కావల్సింది ఏమిటి?’ అని మేయర్‌ పీఠాన్ని చేజిక్కించుకునే పాలకులు ఆలోచిస్తే జవాబు ఏమంత కష్టం కాదు. ఆ జవాబులని అమలు చేయడమే అసలైన కష్టం. ఈ మహానగరంలో ఇప్పటికీ జనం నీటి కోసం కోసం అల్లాడుతున్నారు. వేసవి వస్తే చాలు బోర్లు ఎండిపోతాయి, నీటి సరఫరా నిలిచిపోతుంది. పిల్లలకి మినరల్‌ వాటర్‌ క్యాన్లతో స్నానాలు చేయించాల్సిన పరిస్థితి. భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ కూడా కఠినమైన నిర్ణయాలను తీసుకోలేకపోయింది. అటు నగరానికి తాగు నీటికి తెచ్చేందుకు ఇంకా పక్క రాష్ట్రాల వైపు చూడాల్సి వస్తోంది. ఇంట్లోకి ఎలాగొలా నీరు వస్తోంది సరే! ఆ నీటిని వాడాక మిగిలిన మురుగు బయటకి వెళ్లేందుకు చాలా ఇళ్లలో డ్రైనేజి సదుపాయం లేదు. నగరంలో అపార్టుమెంటులకి అపార్టుమెంటులే ఎలాంటి డ్రైనేజీ వ్యవస్థా లేకుండా బతికేస్తున్నాయి. ఇంట్లో మాత్రమే కాదు, బయట రోడ్డు మీదకి అడుగుపెట్టినా సమస్యలే! మెట్రో పనుల వల్లో లేకపోతే ఇరుకు రోడ్ల కారణంగానో నగరంలోని ఒక చోట నుంచి మరో చోటకి వెళ్లడమంటే పొరుగూరికి ప్రయాణం చేసినట్లుగానే ఉంటోంది. నగరంలో ట్రాఫిక్ సమస్య ‘గంటటంటకీ’ పెరుగుతోందే కానీ తగ్గే సూచనలు కల్పించడం లేదు. పెరుగుతున్న జనాభాకీ, వాహనాలకీ అనుగుణంగా ట్రాఫిక్‌ని వేగవంతం చేయడం కోసం కానీ, గతుకులు లేని రోడ్లని నిర్మించడం కోసం కానీ ఏదైనా సత్వర ప్రణాళికని అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీరు, తాగునీరు, నిరంతర విద్యుత్తు, రోడ్లు, డ్రైనేజి, ట్రాఫిక్‌, కాలుష్యం… ఇలాంటి ప్రధాన సమస్యలకే ఇప్పుడు ప్రభుత్వాలు పరిష్కారం చూపాల్సి ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే- ‘వేసవిలో ఒక రోజు హైదరాబాదులోని ఓ మధ్య తరగతి వ్యక్తి హయత్‌నగర్‌ నుంచి కూకట్‌పల్లికి హాయిగా వెళ్లి రావడం అనేది అసాధ్యమైన కలగా మిగిలిపోకూడదు. సదరు వ్యక్తి ఇంటికి వచ్చిన తరువాత కాసేపు పంకా కింద కూర్చునే సౌలభ్యం, కాస్త కాళ్లూ చేతులూ కడుకున్నే సదుపాయాలు కూడా విలాసాలుగా మిగిలిపోకూడదు. ఒక మనిషి సౌకర్యంగా జీవించేందుకు కావల్సిన ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పించడమే ప్రభుత్వం నెరవేర్చాల్సిన తొలి హామీ!

తుని ధ్వంస రచన ఎవరి పాపం?

గోదావరి జిల్లా అంటేనే ప్రశాంతతకు మారుపేరుగా కనిపిస్తుంది.  ఆ ప్రశాంతత కాస్తా ఆదివారం భగ్నమైంది. సామాన్య జనంలో బీభత్సం  నింపింది. ఒక వర్గాన్ని బీసీల్లోకి చేర్చాలన్న ర్యాలీ కాస్తా హింసాత్మకంగా మారింది. పోలీసులు పాటించిన సంయమనం వారి అసమర్ధతగా మారింది. జాతీయ రహదారికీ, రైల్వేప‌ట్టాల‌కీ దగ్గరలోకి సభ వేదిక ఎవరి సలహా మీదనో  చివరి క్షణంలో మారింది. ఈ మార్పు వెనుక ఉద్దేశం ఇదేనని అన్ని వర్గాలూ ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాయి. ఉద్రిక్తతని కొనసాగించేందుకు, ధ్వంసరచన  చేసేందుకు కాకినాడ కంటే ఇది అనువైన వేదిక అయ్యింది. ఆందోళనకారులకి తగిన అవకాశాలు చిక్కాయి. విజయవాడకి వెళ్తున్న  రత్నాచల్ ఎక్స్ ప్రెస్‌ అప్పుడే అక్కడికి చేరుకోవడంతో, ఉద్యమకారుల కోపానికి అది బలైంది. అయితే నిజానికి ఇది ఉద్యమకారుల  మనోగతం కాదని, ఏడెనిమిది వాహనాల్లో వచ్చిన ముష్కరుల అఘాయిత్యమని ఒక్కటొక్కటే వాస్తవాలు బయటకు వస్తున్నాయి.  అదృష్టం  కొద్దీ ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు.  ఏం జరుగుతోందో తెలియని పిల్లలు, ఏం జరగబోతోందో అన్న భయంతో మహిళలు  కళ్లనీళ్లు కుక్కుకుని నిస్సహాయంగా ఉండిపోయారు. రత్నాచల్ కాలి బూడిదైనా ఉద్యమకారుల  ముసుగులోని ముష్కరుల ఎజెండా అక్కడితో  పూర్తి కాలేదు.  ఊరిలో ఉన్న పోలీస్స్టేషన్లను తగలబెట్టుకుంటూ ముందుకు సాగిపోయారు.   త‌మ‌ను బీసీలలో చేర్చే విషయంలో అధికార పక్షం ప్రదర్శించే నాన్చుడు ధోరణి ప్రద‌ర్శిస్తోంద‌న్నది  ఒక వ‌ర్గ నాయ‌కులు చేస్తున్న ప్రధాన  ఆరోప‌ణ‌. వారిలో ఇలాంటి అసంతృప్తి మొదలైన ప్రతిసారీ కొంద‌రు నేతలు దానిని ఉద్యమస్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తూనే  వ‌చ్చారు. అయితే ఈసారి అదే స్ఫూర్తితో మొద‌లైన స‌భ‌ కాస్తా నిమిషాల్లో ఉద్రిక్తంగా మారిపోయింది. మైకు అందుకున్న కొద్ది నిముషాల్లోనే  నేతల స్వరం మారిపోయింది. ప్రభుత్వం దిగివచ్చే దాకా రైలు పట్టాల మీద నుంచి కదలవద్దంటూ ముద్రగడ అందరినీ రైలు  పట్టాల వైపుకి బయల్దేరదీశారు. రైలుపట్టాల మీద బైఠాయిస్తే ఆ ప్రభావం మొత్తం దేశం అంతటా ఉంటుంది. రాజస్థాన్లోని గుర్జర్లనే కులంవారు  కూడా ఇలాగే రైళ్ల రాకపోకలని నిలిపివేసి దేశం దృష్టిని ఆక‌ర్షించారు. అయితే వారు హింసకు పాల్పడలేదు. ఏ ఉద్యమం అయినా హింసతో తమ లక్ష్యం సాధించుకున్న దాఖలాలు మనకు దేశంలో ఎక్కడా కనిపించవు. కాబట్టి ఉద్యమం హింసాబాట పడితే అది ఆ వర్గం వారి ప్రయోజనలనే దెబ్బ తీస్తుంది.  పద్మనాభంగారు ఈ వాస్తవం నేడు కాకున్నా రేపైనా గుర్తిస్తారని కోరుకుందాం. నిజానికి నిన్నటి సంఘ‌ట‌న‌ వెనుక ఉన్నది.. దీన్నంతటినీ స్వార్థ రాజకీయాలకు వాడుకోవాలన్న కుతంత్రంతో ఉన్న  దుర్మార్గులేనని ప్రత్యక్ష సాక్షుల క‌థ‌నం. రిజ‌ర్వేష‌న్ల ఆందోళ‌నకు దిగిన వ‌ర్గం రోజురోజుకీ అధికార టిడిపీకి  ద‌గ్గర‌వుతోంద‌నీ, వాళ్లని అధికార ప‌క్షం నుంచి దూరం చేసేందుకు ప్రతిపక్ష వ‌ర్గాల‌న్నీ ప్రయ‌త్నిస్తున్నాయ‌నేది ఒక అనుమానం. పైగా  హామీ గురించి ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులూ జర‌ప‌కుండా, ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని తెలుసుకోకుండా ఒక్కసారిగా  విధ్వంసాన్ని సృష్టించ‌డంలో ఆంత‌ర్యం ఏమిట‌న్నదే అందిరిలో మెదుల్తున్న అనుమానం. ఇప్పటి వ‌ర‌కు ఓసీల‌లో ఉన్న  వ‌ర్గాన్ని  బీసీల‌లో చేర్చడం అస్నది అంత సుల‌భ‌మైన ప్రక్రియ కాదు. అందుకోసం ఒక క‌మీష‌న్‌ను ఏర్పాటు చేయాలి. ఆ క‌మీష‌న్ సూచ‌న‌ల  ఆధారంగా రాజ్యంగాబ‌ద్ధంగా రిజ‌ర్వేష‌న్ల‌ను క‌ల్పించాలి.  నిజానికి ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కమిషన్ ఏర్పాటు కూడా చేసింది.. అలా కాకుండా ఏక‌పక్షంగా నిర్ణయం తీసుకుంటే  అది ఉన్నత  న్యాయ‌స్థానంలో వీగిపోయే అవకాశం ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో ఇలా హడావుడిగా కేవలం రాజకీయ లబ్ధి కోసం  క‌ల్పించిన రిజ‌ర్వేష‌న్ లను  న్యాయ‌స్థానాలు కొట్టివేసి, ప్రభుత్వాలకు ముక్కచివాట్లు పెట్టిన సంద‌ర్భాలు కోకొల్లలు.. ఇదంతా కూడా ప్రజలకు, ఉద్యమ నాయ‌కుల‌కు, ఇతర ప్రతిపక్షాలకూ  తెలియ‌కుండా ఉండి ఉంటుందా! లేక తెలిసి కూడా తమ ప్రాభ‌వాన్ని పెంచుకోవ‌డం కోసం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఈ చర్యకు పాల్పడ్డారా అనేది వారికే  తెలియాలి.  ఏమైనా ఇలా కుల ప్రాతిపదికన సమాజాన్ని విడదీయడం నిప్పుతో చెలగాటమాడటమే. కులమతాల ప్రాతిపదికన సమాజాన్ని విభజించి పబ్బం గడుపుకునే కుటిల రాజకీయం  దేశ‌ స‌మైక్యతనే దెబ్బతీసే ప్రమాదం ఉంది. సున్నిత‌మైన కులాల‌,  మ‌తాల ప్రస్తావ‌న  అమాయ‌క‌ ప్రజల జీవితాల్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. అలాంటి ప‌రిస్థితి రాకముందే స్థానిక నేత‌లు,  కుల‌పెద్దలు సమస్యను వివేకంతో పరిష్కరిస్తారని ఆశిద్దాం..

రాష్ట్రపతి పాలన సరైన నిర్ణయమేనా!

మన దేశం ఈ నెల 26న తన 67వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంది. అయితే ఇదే రోజున అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలను విధిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఒక ప్రాంతంలో రాష్ట్రపతి పాలనను విధించడం మన దేశంలో కొత్తేమీ కాదు. ఇప్పటికి దాదాపు 90 సార్లు మనం ఆ పరిస్థితిని చూశాము. కానీ అలాంటి పాలనను విధించిన ప్రతిసారీ ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరించిందన్న అపకీర్తిని ఎదుర్కోవడమే బాధాకరం! రాష్ట్రపతి పాలనను దుర్వినియోగపరచకుండా ఉండేందుకు సుప్రీం కోర్టు 1994 సంవత్సరంలో ‘S.R. Bommai v. Union of India’ కేసులో కొన్ని సూచనలు చేసింది. అప్పటి నుంచీ కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా రాష్ట్రపతి పాలనను విధించిన సందర్భాలు తగ్గిపోయాయి. ఇప్పుడు అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను విధించడంతో ఇలాంటి నిర్ణయాల వెనుక ఉండే న్యాయాన్యాయాల చర్చ మళ్లీ మొదలైంది. సుదీర్ఘ కాలం ఈ దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సందర్భాలలో అతి సులువుగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356ని ఉపయోగించి రాష్ట్రపతి పాలనను విధించేది. కేంద్రానికి అనుకూలం కాని ప్రభుత్వం ఏమున్నా సరే, 356 అధికరణాన్ని ఉపయోగించి తొలగించి వేసే పరిస్థితులు ఉండేవి. ఒక్కసారి వెనక్కి తిరిగి రాష్ట్రపతి పాలనను విధించిన సందర్భాలను పరిశీలిస్తే, ఈ విషయం స్పష్టమైపోతుంది. శాసనసభలో పరిపూర్ణమైన మెజారిటీ ఉండి, రాష్ట్రంలోని శాంతిభద్రతలు హాయిగా ఉన్న సందర్భాలలో కూడా రాష్ట్రపతి పాలన విధించడం తప్పకుండా కేంద్ర ప్రభుత్వ వైఖరిని వెల్లడిస్తుంది. ఇప్పడు అరుణాచల్‌ ప్రదేశ్‌ విషయంలో కూడా సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో కేంద్ర ప్రభుత్వానికి సంజాయిషీ చెప్పుకోవల్సిన పరిస్థితులు వచ్చాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌ చిన్న రాష్ట్రమే అయినా చాలా కీలకమైన ప్రదేశం. ఈ రాష్ట్రం మీ పట్టు సాధించేందుకు ఇటు ఉల్ఫా వంటి తీవ్రవాద సంస్థలూ, అటు చైనా వంటి సరిహద్దు దేశాలూ సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో గవర్నరు రాజ్‌కొవా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ నివేదికలు ఇవ్వడం, వాటిని కేంద్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద ఆమోదించి రాష్ట్రపతి పాలనను విధించడం జరిగిపోయాయి. నిజానికి గవర్నరు మీద ‘పరిపాలనలో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నా’రంటూ ఆరోపణలు వచ్చాయి. గవర్నరే స్వయంగా అధికార పార్టీ సభ్యులలో చీలిక తెచ్చి, ముఖ్యమంత్రి మీదకు ఉసిగొలిపేందుకు ప్రయత్నాలు చేశారంటారు. ఇలా గవర్నరుకీ, ముఖ్యమంత్రికీ మధ్య మొదలైన వివాదం కాస్తా ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వానికే ఎసరు పెట్టింది. ఇందులో కేంద్ర ప్రభుత్వపు తప్పు ఉన్నా లేకున్నా గవర్నరు పాత్ర మాత్రం వివాదాస్పదంగా మారుతోంది. మరి ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పడు ఆసక్తికరమైన ప్రశ్న! భవిష్యత్తులో రాష్ట్రపతి పాలనను విధించే ముందు కేంద్రం మరింత జాగ్రత్తగా ఉండాలన్నదే ఈ సమస్య నేర్పే పాఠం. అక్కడ తమకు అనుకూలం కాని ప్రభుత్వం ఉందనో, గవర్నరుగారికి అక్కడి పరిస్థితులు నచ్చలేదనో కాకుండా నిజంగా అక్కడి శాంతిభద్రతలను, ప్రభుత్వపు నిలకడను పరిశీలించి… పరిస్థితులను చక్కదిద్దలేని సందర్భాలలో మాత్రమే రాష్ట్రపతి పాలనను విధించడం దేశానికి శ్రేయస్కరం! లేకపోతే ఇలాంటి నిర్ణయాలు దేశ సార్వభౌమాధికారానికే ముప్పు తెచ్చే ప్రమాదం ఉంటుంది.

ప్రణబ్‌జీ మనసులో ఉన్న రహస్యాలు వేటి గురించి!

కాంగ్రెస్‌లో నెహ్రూ వారసులకు దీటుగా నిలబడి మనగలిగిన నేతలు అతి కొద్దిమంది. ఆ జాబితాలోని ముందంచెలో ఉంటారు ప్రణబ్ ముఖర్జీ! ఈ 80 ఏళ్ల కురువృద్ధుడు కాంగ్రెస్ పార్టీలోనే కాదు దేశ రాజకీయాలోనే ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒక పక్క తనదైన ముద్రని నిలబెట్టుకుంటూనే, ఇందిర నుంచి సోనియా వరకూ పార్టీ అగ్రనాయకత్వానికి విధేయుడిగా కూడా పేరు పొందారు. అలాంటి ప్రణబ్‌ ఇప్పుడు తన రాజకీయానుభవం గురించి మరో పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఈ పుస్తకానికి ముందు ప్రణబ్‌ రాసిన ‘The Dramatic Decade: The Indira Gandhi Years’ పెద్దగా సంచలనం సృష్టించలేకపోయింది. ఎమర్జన్సీ గురించి ప్రణబ్‌ తన పుస్తకంలో ఆశ్చర్యకరమైన నిజాలు ఎన్నో వెల్లడిస్తారని అంతా ఊహించారు. కానీ ఈ పుస్తకం సాదాగా సాగిపోయింది. ప్రణబ్‌ తన మనసులో ఎన్నో రహస్యాలను దాచుకునే ఉన్నారని పాఠకులు అప్పుడే ఊహించారు. ఈసారి ప్రణబ్‌ తన రెండో పుస్తకమైన ‘The Turbulent Years: 1980 – 1996’ అనే పుస్తకాన్ని రాశారు. అయితే ఇందులో కూడా ప్రణబ్‌ ఆచి తూచి తన పదాలను ప్రయోగించినట్లు కనిపిస్తోంది. ఇందిరా గాంధి మరణం తరువాత ప్రణబ్‌ ముఖర్జీ ప్రధానమంత్రి పదవిని ఆశించారని చెబుతారు. అయితే తనకు అలాంటి ఆశ ఏమీ లేదని ఈ పుస్తకంలో తేల్చి చెప్పారు ప్రణబ్‌. అయితే మరి రాజీవ్‌ గాంధి నుంచి దూరమై, పార్టీని సైతం వీడి వేరు కుంపటి ఎందుకు పెట్టుకున్నారన్న దానికి స్పష్టమైన జవాబులు కరువయ్యాయి. ఇతర సంప్రదాయ కాంగ్రెస్‌ నేతలలాగానే బాబ్రీమసీదు విధ్వంసానికి తెలుగువాడైన పి.వి.నరసింహరావుని తన పుస్తకంలో దోషిగా తేల్చారు ప్రణబ్‌. నిజానికి 1980-1996 మధ్య కాలంలో దేశంలో చాలా ఉపద్రవాలే సంభవించాయి. 1984లో ఇందిరా గాంధీ హత్య తరువాత దేశవ్యాప్తంగా దాదాపు 3000 మంది సిక్కులను ఊచకోత కోశారు. ఒక్క దిల్లీలోనే రెండు వేల మందికి పైగా సిక్కులు మృత్యువాత పడ్డారు. ఇప్పటికీ కాంగ్రెస్‌ను వెంటాడుతున్న బోఫోర్సు కుంభకోణానికి అంకురార్పణ జరిగింది కూడా ఆ సమయంలోనే. అయితే ప్రణబ్‌ వీటి గురించి ఆచితూచి స్పందించారు. ‘The Turbulent Years: 1980 – 1996’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ప్రణబ్‌ కొన్ని రహస్యాలు తనతోనే సమాధి అయిపోతాయని చెబుతారు. తనకి రోజూ డైరీ రాసే అలవాటు ఉందనీ, భవిష్యత్తలో వచ్చే ప్రభుత్వాలు కావాలనుకుంటే వాటిని ప్రజలకు వెల్లడించవచ్చనీ చెప్పారు. రక్షణ మంత్రిగా, ఆర్ధిక శాఖా మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా… కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రణబ్‌ వివిధ ఉన్నత పదవులని అలంకరించారు. అన్నింటికీ మించి ఆ పార్టీకీ, అందులోని నాయకత్వానికీ వీరవిధేయుడిగా పేరుగాంచారు. మరి ఎమర్జెన్సీ, బోఫార్సు, సిక్కుల అల్లర్లు, శ్రీలంకలో భారతేదేశపు జోక్యం… ఇలా చాలా విషయాలకు సాక్షిగా ఉన్న వ్యక్తి మనసులో రహస్యాలకు కొదవేముంటుంది. ప్రణబ్‌ ఆశించినట్లు రాబోయే ప్రభుత్వాలు వాటిని వెల్లడిస్తే బాగుండు.

ముఖ్యమంత్రులే దోషులుగా నిలిస్తే!

మన దేశంలో ఏ రాష్ట్రానికైనా పెద్దదిక్కుగా భావించేది అక్కడి ముఖ్యమంత్రినే. కానీ ఇప్పుడు ఆ ముఖ్యమంత్రులే పలు ఆరోపణల్లో కూరుకుపోతున్నారు. ఈశాన్యంలో అరుణాచల్‌ ప్రదేశ్‌, మధ్య భారతంలోని ఉత్తర్‌ప్రదేశ్‌, దక్షిణాదిన కేరళ ముఖ్యమంత్రులు తమ ప్రభుత్వాలనే ప్రశ్నార్థకం చేసే స్థితిలో ఉన్నారు. ఒకే సమయంలో మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు సందిగ్ధంలో పడిపోవడం ఒక అనూహ్యమైన పరిణామం… మన దేశ సరిహద్దుల్లో ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ రక్షణపరంగా చాలా కీలకమైన రాష్ట్రం. ఆ ప్రదేశాన్ని ఎప్పుడెప్పుడు కబ్జా చేద్దామా అని చైనా కాచుకుని కూర్చుని ఉంది. అలాంటి అరుణాచల్ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ‘నబామ్ టుకి’ రాష్ట్రంలోని శాంతిభద్రతలను కాపాడలేకపోతున్నారంటూ గవర్నర్‌ రాజ్‌కొవా కేంద్రానికి నివేదికలను అందించారు. గవర్నరు నివేదికను కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించడంతో ఇప్పడు అక్కడ గవర్నరు పాలన మొదలైంది. గవర్నరు పక్షపాతంతో వ్యవహరించారన్న ప్రతిపక్షాల విమర్శలో నిజం లేకపోలేదు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి నబామ్‌ తన సహచరులను అదుపు చేయడంలో కానీ, శాసనసభలో సరిగా నిర్వహించడంలో కానీ పూర్తిగా విఫలమయ్యారన్నది మాత్రం స్పష్టంగా కనిపించే వాస్తవం. పైగా నబామ్‌ కొన్ని తీవ్రవాద సంస్థలతో సంబంధం కలిగి ఉన్నారనీ, మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిచారనీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక కేరళ ముఖ్యమంత్రి పదవి కూడా ఇప్పుడో అప్పుడో అన్నట్లు మారిపోయింది. ‘సోలార్‌ స్కామ్’లో పీకలోతు మునిగిపోయిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ నిజంగానే దోషి అనేందుకు రోజుకో కొత్త సాక్ష్యం బయటకి వస్తోంది. సౌర విద్యుత్తు పేరుతో సరిత నాయర్‌ అనే వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలను ప్రజల నుంచి దండుకున్నారన్నది ఈ కుంభకోణం. ఇందులో ఉమెన్‌ చాందీకి కూడా వాటాలు అందాయన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి. దాంతో న్యాయవిచారణని ఎదుర్కొన్న తొలి కేరళ ముఖ్యమంత్రిగా ఆయన రికార్డుని స్థాపించారు. సరిత నేరుగా ముఖ్యమంత్రితో సంభాషించేదనీ, ఆయన మంత్రివర్గ సహచరులతో కూడా ఆమెకు సంబంధాలు ఉన్నాయని ఆమె ఫోన్‌ రికార్డులు స్పష్టం చేయడంతో తాను నిర్దోషినని గట్టిగా చెప్పేందుకు ఉమెన్‌ చాందీకి కూడా ధైర్యం చాలడం లేదు. డబ్బు, అక్రమ సంబంధాలు, అధికార దుర్వినియోగం, హత్యలు… ఇలా ఒక బ్లాక్‌బస్టర్ సినిమా తీసేందుకు తగినంత ముడిసరుకంతా ఈ సోలార్‌ స్కాంలో బయటపడుతోంది. కాకపోతే దురదృష్టమల్లా కథానాయకులుగా ప్రజలను కాపాడాల్సినవారు కాస్తా దోషులుగా నిలవడమే! ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ది మరో వింత కథ. తండ్రి నుంచి వారసత్వంగా ముఖ్యమంత్రి పీఠాన్ని సైతం దక్కించుకున్నారు కానీ, ఆది నుంచి అంతం దాకా అన్నీ హంసపాదులే ఎదురవుతున్నాయి. సాక్షాత్తూ హైకార్టు న్యాయమూర్తి మాటలని సైతం కాదని తనకి సన్నిహితుడైన వ్యక్తికి అఖిలేష్‌ ‘లోకాయుక్త’ పీఠాన్ని కట్టబెట్టారు. అవినీతిని అడ్డకట్టవేసే లోకాయుక్తగా తన మనసునెరిగిన వాడు ఉంటే, పెద్దగా ఇబ్బందులు ఉండవన్నది అఖిలేష్‌ అభిమతం కావచ్చు. సుప్రీం కోర్టు కనుక అడ్డుపడకపోతే ఆయన పంతం నెరవేరి ఉండేదేమో! కానీ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం అఖిలేష్‌ నియమించిన లోకాయుక్తని తప్పించి ఆ స్థానంలో ఒక సమర్థవంతమైన వ్యక్తిని నియమించింది. న్యాయస్థానాల నుంచి అఖిలేష్‌కు అక్షింతలు కొత్త కాదు కానీ, ఈ లోకాయుక్త వ్యవహారం మాత్రం ఆయన మెడకి చుట్టుకునేట్లే కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఆయన ప్రభుత్వం కూలిపోకున్నా అఖిలేష్‌ రాజకీయ జీవితంలో ఇదొక మచ్చగా మాత్రం మిగిలిపోనుంది. ఈ వారం వార్తల్లో నిలిచిన ముగ్గురు ముఖ్యమంత్రుల కథ ఇది. అలాగని మిగతావారు ఏమంత సమర్థంగా పాలిస్తున్నారని కాదు. అలాంటి భ్రమలు కూడా ప్రజలకు లేవు. కానీ ఒకో రాష్ట్రం పై జాబితాలో చేరుతూ పోతుంటే దేశం ఏమైపోతుందన్నదే ఇప్పటి ప్రశ్న!

సారే జహాసే అచ్ఛా!

67 సంవత్సరాలు! ఒక మనిషి జీవితంలో సుదీర్ఘమైనవి కావచ్చు. కానీ ఒక దేశ చరిత్రలో ఇవి తొలి అడుగులే! ఆ తొలి అడుగులలోనే తనదైన ముద్రను వేసుకున్న దేశం మనది. సరిగ్గా 67 సంవత్సరాల క్రితమే మన దేశం అతి పెద్ద ప్రజాస్వామ్యంగా అవతరించింది. స్వేచ్ఛ, సమానత్వాలకు పెద్ద పీట వేస్తూనే ప్రభుత్వం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అన్న మౌలిక అంశాల మీద రాజ్యాంగాన్ని రూపొందించుకుంది. రాజ్యాంగాన్ని రూపొందించుకున్ననాటి నుంచీ ఇప్పటి వరకూ దేశం ఎన్నో ఆటుపోట్లను తట్టుకుంది. ఎన్నో వెన్నుపోట్లని ఎదుర్కొంది. అయినా దేశం చలించలేదు. దేశంలో పదుల కొద్దీ రాష్ట్రాలు ఉండవచ్చు, వందలకొద్దీ భాషలు ఉండవచ్చు, వేల కొద్దీ కులాలు ఉండవచ్చు… అయినా సందర్భం వస్తే అంతా ఒక్కటవుతామని నిరూపించేందుకు కార్గిల్‌ వంటి ఉదంతాలు చాలానే కనిపిస్తాయి. ప్రతి గణతంత్రమూ మనకి ప్రత్యేకమే అయినా ఈ గణతంత్రపు సంబరాల్లో భిన్నంగా కనిపించే కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే అవి కేవలం యాదృచ్ఛికం కాదు! ఫ్రాన్స్‌ దేశపు అధ్యక్షుడైన హోలన్‌ ఈసారి మన గణతంత్ర దినోత్సంలో పాల్గొనేందుకు వస్తున్నారు. ఏకంగా ఆ దేశానికి చెందిన ఒక రెజిమెంట్‌ మన దేశపు సైనికులతో పాటు కవాతులో పాల్గొనబోతోంది. ఒకప్పుడు ఫ్రాన్స్‌ దేశపు పాలనలో మగ్గిన మన దేశం అదే దేశపు అధ్యక్షునితోనూ సైనికులతోనూ కలిసి గణతంత్ర వేడుకలని నిర్వహించుకోగలగడమే మనం సాగించిన స్వతంత్ర ప్రయాణానికి నిదర్శనం. అలాగే ఈసారి ద్విచక్ర వాహనాల మీద విన్యాసాలు చేయడానికి 120 మంది మహిళా సైనికులు సిద్ధమవుతున్నారు. నిరంతర వివక్షలతోనూ, వేధింపులతోనూ విసిగి వేసారిన స్త్రీలు సాధించిన పురోగతి ఇది. తాము మగవారికంటే ఏ విషయంలోనూ తక్కువ కాదని జాతీయ జెండా సాక్షిగా చేస్తున్న నినాదమిది. భారతదేశం తన రాజ్యాంగాన్ని రాసుకునేనాటికి దేశంలో అయోమయం నెలకొని ఉంది. నిరంతరం వేధించే కరువులు, పరాయి పాలనలో దివాళా తీసిన పరిశ్రమలు, నిరుద్యోగం, నిరక్షరాస్యత… వీటన్నింటికీ తోడు సాంఘిక దురాచారాలు. ఇప్పటికీ ఈ సమస్యలు లేవని కావు! కానీ నెమ్మది నెమ్మదిగా వాటిని అధిగమిస్తూ దేశం సాధించిన పురోగతి కూడా ఏమంత సామాన్యమైనది కాదు. అగ్గిపెట్టి కోసం కూడా పరాయి దేశం మీద ఆధారపడే పరిస్థితి నుంచి అణువుని సైతం ఛేదించగలిగే సామర్థ్యాన్ని పొందగలిగాం. అణా కాసుల కోసం చేయి చాచే స్థితి నుంచి అమెరికాకే నిపుణులని అందించే స్థితికి ఎదిగాం. అంటరాని తనం నుంచి ఆనకట్టలను దేవాలయాలుగా భావించే ఔన్నత్యానికి చేరుకున్నాం. ప్రపంచమంతా అమెరికావైపా, రష్యావైపా అని కొట్టుకు చస్తుంటే అలీనోద్యమం పేరుతో లోకానికి ఒక కొత్త ఉనికినిచ్చాం. నిజమే! ఇంకా మన దేశం సాధించాల్సింది చాలానే ఉంది. అసమానతలు ఉన్నాయి, అసహనమూ ఉంది. కులాల మౌఢ్యం, పేదరికపు జాడ్యం అలానే ఉన్నాయి. నిరక్షరాస్యత, నిరుద్యోగం మన తలరాతలను శాసిస్తేనే ఉన్నాయి. అయినా వెనుకడుగు వేసేది లేదు. ఇన్ని సాధించిన దేశం ఇప్పుడు బేలతనంతో ఊరుకునేదీ లేదు. ఒక్కో గణతంత్రం దినోత్సంతో మన దేశం మరో అడుగు ముందుకు వేస్తూనే ఉంటుంది. ఎప్పుడూ అడుగు ముందుకు వేస్తూనే ఉంటుంది. అందుకే ప్రపంచం చూపంతా ఇప్పుడు ఇండియా వైపే!

వారసత్వపు రాజకీయం కాదు-వావి వరసలు లేని రాజకీయం

వంకాయ కడుపున వంకాయే పుడుతుంది కానీ..దొండకాయ పుడుతుందా.. ఛాన్సేలేదు. ఇదీ అంతే. ఎక్కడోచోట పొరపాటున వంకాయ చెట్టుకు బీరకాయ కాయొచ్చేమో కానీ.. 99.99 శాతం ఇలా జరగనే జరగదు. పాలిటిక్స్‌లో కూడా అంతే.. ఒక్కసారి రాజకీయాల్లోకి ఎంటరైతే ఇంత తాత ముత్తాతల దగ్గరి నుంచీ.. తండ్రీ కొడుకు, కూతురు, మనవళ్లు, మనవరాళ్ల వరకు ఆ వారసత్వం రాజకీయం అలా కొనసాగాల్సిందే.. గ్రేటర్‌ ఫైట్‌లోను అదే జరుగుతోంది.. ఎన్నేళ్లు కాదు. ఎన్ని దశాబ్ధాలు రాజకీయాల్లో ఉన్నా వీళ్లు అలసిపోరు.. ఎందుకంటే పెజాసేవంతో వీళ్లకు కసి.. మున్సిపల్‌ ఎన్నికల్లో నిజమైన, నిఖార్సైన ప్రజా నాయకులు ఎంతమందున్నారో వేళ్లమీద కూడా లెక్కపెట్టలేమేమో.. అంతలా వేళ్లూనుకుపోయింది వారసత్వ రాజకీయం.. ఉన్న పదవులు చాలవో.. లేక బ్యాంకుల్లో లాకర్లు ఎక్స్‌ట్రాగా ఏర్పాటు చేసుకున్నారో తెలియదు కానీ.. పెద్దల పిల్లలు మాత్రం చదువును అటకెక్కించి.. ప్రజలన్నా, ప్రజాసేవన్నా పడి చస్తున్నారని పబ్లిక్‌ కామెంట్.. మీరే చూడండి.. రాజ్యసభ సభ్యుడు కేశవరావు కుమార్తె గద్వాల్‌ విజయలక్ష్మి బంజారాహిల్స్‌ నుంచి బరిలో దిగారు.. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస రెడ్డి రామ్‌నగర్‌ డివిజన్‌ నుంచి రంకెలేస్తున్నారు. మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి ఆర్‌కెపురం డివిజన్‌ నుంచి సై అంటున్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి రెడ్డి అల్వాల్‌ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దివంగత కేంద్ర మాజీ మంత్రి ఆలె నరేంద్ర సతీమణి లలిత గౌలీపుర నుంచి పోటీ చేస్తున్నారు.  కూకట్‌పల్లి శాసన సభ్యుడు మాధవరం కృష్ణారావు అత్త లక్ష్మీబాయి, ఆయన బావ జూపల్లి సత్యనారాయణతో పాటు, కృష్ణారావు బంధువు కూడా కూకట్‌పల్లి డివిజన్‌ నుంచి కేకలేస్తున్నారు. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత కూడా అప్పుడే ప్రచారం మొదలుపెట్టారు. ఇక గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసిన పిజెఆర్‌ కూతురు విజయారెడ్డి.. ఇప్పుడు టిఆర్ఎస్‌ నుంచి ఖైరతాబాద్‌ డివిజన్‌ నుంచి గెలిచేస్తా అంటున్నారు. అంతేనా గతంలో జిహెచ్‌ఎంసిలో టిడిపి ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేసిన సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి భార్య ఇప్పుడు స్వర్ణలతా రెడ్డి ఇప్పుడు సైదాబాద్‌ నుంచి సై అంటే సై అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఒకే దెబ్బకు ఐదారు పిట్టలు అన్నట్లు.. ఒకే ఇంట్లో, ఒకే కుటుంబంలో కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్‌..టిడిపి లనుంచి పోటీ చేస్తున్న వారూ లేకపోలేదు. వీరికి రాజకీయాలంటే ఎంతిష్టమో.. పెజా సేవంటే ఎంత ప్రాణమో.. ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మరి వారసులను గెలిపించుకోవాలంటే, నేతలకు పాట్లు తప్పవు కదా.. మంచినీళ్ల దగ్గరి నుంచీ, మటన్‌ బిర్యానీ వరకు, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ నుంచీ.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే వరకు, ఎన్ని తిప్పలు పడుతున్నారో.. పాపం.. కదా.. వీళ్లను చూస్తుంటే జాలేస్తోందని.. నగర జనమే కోడై కూస్తున్నారు. ఎన్నికలప్పుడు కన్నబిడ్డలకంటే ఎక్కువగా గుర్తుకొచ్చే ఓటర్లు..  ఎన్నికల తంతు ముగిశాక ఎవడ్రా నువ్వు అని అనకున్నా.. అంతకుమించి అవమానిస్తారు. అప్పుడే కదా వారసులు కూడా వారసత్వపు రాజకీయాలను పుణికిపుచ్చుకునేది. ఓట్ల కోసం ఎన్ని జాతరలు చేసినా.. ఎన్ని కోటలు దాటే మాటలు చెప్పినా..సామాన్యుడు మాత్రం మేల్కొనకపోతే.. ఈ ప్రస్థానం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. అందుకే ఓటు అనే ఆయుధాన్ని.. అంకుశంగా మలుచుకుని, సరైన లీడర్‌ను ఎన్నుకోకపోతే.. ఐదేళ్లవరకు ఇవే రోడ్లు, ఇవే గుంతలు, ఇవే ట్రాఫిక్‌ జామ్‌లు, ఇవే సమస్యలు.. మీతో చెలిమి చేస్తూనే ఉంటాయి. మీరు వద్దన్నా.. ఎన్నిసార్లు కటీఫ్‌ చెప్పినా.. అవి మాత్రం ఒక్కసారి కమిట్‌ అయ్యాక మా మాట మేమే వినము.. అనేలా మీతో అంటిపెట్టుకు తిరుగుతాయి.. ఇప్పుడు చెప్పండి.. సమస్యలతో సావాసం చేద్దామా.. పరిష్కారమార్గాలను వెతుకుదామా.. లీడర్లు మామూలే.. వస్తారు.. పోతారు.. కానీ సమస్యలు మాత్రం ఒక్కసారి వస్తే.. అవి రోజురోజుకూ గ్యాంగ్రిన్‌లా పెరుగుతూ పోతాయే కానీ.. కరిగిపోయేవి కాదు.. అందుకే ఆలోచించండి.. వారసత్వపు రాజకీయాలైనా, వావివరసలు లేని రాజకీయాలైనా సరే.. మీకు నచ్చినవారికి ఓటేయడం కన్నా.. పని చేయగలరు అన్నవారినే ఎన్నుకోండి.. అప్పుడే మన హైదరాబాద్‌.. మన భాగ్యనగరం మరింత అందంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

రోహిత్ ఆత్మహత్య రచ్చ వెనుక అసలు నిజాలు ఏంటి..?

దేశంలో ఇప్పుడు అతిపెద్ద పండుగ జరుగుతోంది. ఆ పండుగలో పెద్ద పెద్ద మేధావులంతా పాల్గొంటున్నారు. ఎవరికి నచ్చిన రీతిలో వాళ్లు పండుగను చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే  మేమంటే మేమని ..పోటిపడుతూ సానుభూతి కురిపించటానికి , కులాల పేర్లతో మరోసారి చిచ్చు పెట్టడానికి వాళ్ళకో .." కారణం "  దొరికింది. .. ఆ కారణమే రోహిత్‌..  బయటకు బస్తాలకొద్దీ డైలాగులు చెబుతున్న పొలిటికల్‌ పెద్దలు.. లోలోపల రోహిత్‌కు కోటాను కోట్ల థ్యాంక్స్‌ లు చెప్పుకుంటున్నారేమో కూడా .  ఎందుకంటే.. ప్రస్తుతం ఏ పనీ పాట లేని రాజకీయ పార్టీలకు రోహిత్‌.. ఎడారిలో గోదారిలా దొరికాడు.. ఇంకేముందీ.. బ్యాండ్‌ బజాయిస్తున్నాయి. దళితుడు అన్న నాలుగు అక్షరాలతో రాజకీయ చదరంగం ఆడుతున్నారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఎవరికి ఎలా చెక్‌ పెట్టాలోనని, వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మీడియా కూడా తన వంతు పాత్ర పోషించకుండా.. గానాబజానాలో నేను సైతం అంటోంది.. ఏ లీడర్‌ ముందొచ్చి రోహిత్‌ చావును క్యాష్‌ చేసుకుంటాడోనని.. అన్ని పార్టీల లీడర్లు సెంట్రల్‌ యూనివర్సిటీకి క్యూ కట్టాయి. ఇంకా కడుతూనే ఉంటాయి. ఈ ఆరనిమంట చల్లారేదేప్పుడో  పొలిటికల్‌ పెద్దలకే తెలియాలి.. అసలీ కులాల గొడవ ఏంటి ?  .. ఇంత స్పీడు యుగంలో కూడా కులాల కురుక్షేత్రం అవసరమా..? ఎక్కడున్నాం మనం.. ? ఏమైపోతున్నాం..? ఏ దిశగా అడుగులు వేస్తున్నాం.. సభ్య సమాజానికి ఏం చెబుతున్నాం.. ? ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌..లాంటివి వచ్చి ప్రపంచం లో ని మనుషులని దగ్గర చేస్తుంటే  ఈ కులాలు  పక్కపక్కన వున్న వ్యక్తులని దూరం చేస్తున్నాయి. నిజానికి ఈ ప్రపంచం లో ఉన్నది రెండే కులాలు.. ఒకటి ఉన్నవాడు, .. రెండు లేనివాడు . ఈ రెండు కులాల మధ్యే అనాదిగా పరోక్ష  యుద్ధం జరుగుతోంది. .ఆ విషయాన్ని గ్రహించకుండా   దళిత  కులం.. అగ్రవర్ణం అనేవే స్పర్దకు  ప్రధాన కారణాలు గా ఇప్పటికి నిలుస్తున్నాయంటే  మన అడుగులు పురోగమనాని ? తిరోగామనానికా ?.... రోహిత్‌ చావుకు కారణాలు ఏవైనా కావొచ్చు. కానీ.. కేవలం దళితుడు అన్న పదమే.. ఇంత కదం తొక్కుతోందంటే.. ఆ పదానికి పట్టం కట్టడానికి దేశ రాజకీయ నాయకులంతా పోటి పడుతున్నారు అంటే ..ఇంత కంటే  రాజకీయ దారుణ మేముంటుంది ? . దేశ రాజధానిలో  జరిగిన నిర్భయ ఉదంతంపై కూడా ఈ స్థాయిలో రాజకీయ నాయకులు ముందుకు రాలేదు అని సోషల్ మీడియా లో ఘాటుగా విమర్శలు వినిపించటం చూస్తుంటే , ఈ పరిణామాల పట్ల , రాజకీయ నాయకుల ఈ అత్యుత్సాహం పట్ల సామా న్యులెంత విసిగి వున్నారో తెలుస్తోంది. మొన్నటికి మొన్న పఠాన్‌కోట్‌లో ఎంతోమంది సైనికులు దేశంకోసం ప్రాణాలు వదిలారు. . వాళ్లకోసం ఒక్క కొవ్వొత్తి వెలిగించారా.. ? ఒక్క నిమిషం మౌనం పాటించారా.. ? కనీసం ఒక్కరన్నా స్మందిన్చారా ? . పోనీ చనిపోయిన వీరసైనికుల కుటుంబాలను రాహుల్‌కానీ, కేజ్రీవాల్‌ కానీ . పరామర్శించారా. ?  ఈ సానుభూతి అప్పడేమయ్యింది ?  అందులో రాజకీయంగా కలిగే లబ్ది ఏముందనుకున్నారో ఏమో.. పఠాన్‌కోట్‌ను అస్సలు పట్టించుకోలేదు. కానీ.. రోహిత్‌ విషయాన్ని మాత్రం తమకు అనుకూలంగా మల్చుకునేందుకు రాహుల్‌, కేజ్రీవాల్‌..ఇంకా ఎందఱో నాయకులు పరుగులు పెడుతూ వచ్చి వాలారు .. రోహిత్ చావుకు కుమిలి పోయారు పాపం. . క్రేజీ పాలిటిక్స్‌.! దళితుల కోసం ఏమైనా చేస్తామని చెబుతున్న వాళ్లంతా.. రోహిత్‌ మరణానికి ముందే వచ్చి.. ఆ స్టూడెంట్స్ధ తరుపున నిలబడి వుంటే , వాళ్ళకి మానసిక దైర్యాన్ని ఇచ్చి వుంటే , వారుచేసిన దర్నాలు, ఆందోళనలు కు మద్దతు పలికి వుంటే ? ఓ నిండు ప్రాణం నిలిచేది . భావి భారత విజ్ఞాన ఖని ప్రయాణం కొనసాగి వుండేది ... ఇలా అర్దాంతరం గా ముగిసేది కాదు. మనిషి బతికుండగా  సహాయపడేది  రాజకీయం అనిపించుకోదు.. చచ్చిన తర్వాత చేయకపోతే అది రాజకీయమే కాదు..అనిపిస్తోంది వీరి వరస చూస్తుంటే . శవంపై రాజకీయం చేస్తున్నారో... రాజకీయం కోసం చావును వాడుకుంటున్నారో   లీడర్లకే తెలియాలి. ఏది ఏమయినా ఈ మొత్తం వ్యవహారం లో అన్యాయం జరిగింది రోహిత్ కే. నిండు జీవితాన్ని పోగొట్టు కోవటమే కాదు , ఈ రోజున తన పుట్టుక నుంచి, తన తల్లి తండ్రి మూలల నుంచి, తన గత జీవితం , తన మాటలు, తన ఆశయాలు, అన్ని , అన్ని ఈ రోజు వీధి కెక్కి పదిమంది నోళ్ళల్లో , పది రకాలుగా నానుతున్నాయి. ఒక్కసారి" తను " కు మాత్రమే పరిమితమయిన " తను " ని రోహిత్ పోగుట్టుకున్నాడు. కేవలం స్వార్ధం తో అతని మరణానికి కులం రంగు పులమాలను కున్న  కొందరి వల్ల. చదువు లమ్మ వడిలో ఇంత కుటిల రాజకీయ క్రీడకి తెరతీసిన నాయకులను సోషల్ మీడియా లో , ఓ రకం గా ఉతికి ఆరేస్తున్నారు . ఎప్పుడెప్పుడు ఓదార్చడానికి ఓ మనిషి దొరుకుతాడా ! ఓ చావు కనబడుతుందా అని వెదికే నాయకుడు ఒకడైతే , ఖాళీగా , టైం పాస్ కాక ప్రత్యెక విమానాలలో వాలిపోయే వాడు ఒకడు, బోడుగుండుకి మోకాలికి ముడిపెట్టి మాట్లాడేవాడు మరొకడు ..ఇలా ఒకొక్కరు ఒకో రకం...కాని  వీళ్ళందరి లక్ష్యం ఒక్కటే .దీని నుంచి ఎవరెంత మైలేజి సంపాదించగలరో అన్న తాపత్రయం...అందుకే సమస్య పరిష్కారం కోసం కాక , దానికి బాధ్యులని వేలెత్తి చూబించ టానికే వీళ్ళ ప్రయత్నిస్తున్నారు.   సమస్య పూర్వాపరాలు , వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయటం లేదు . నోటికి వచ్చింది మాట్లాడి ఆవేశాలు రగులుస్తున్నారు..ఆ ఆవేశాలు విద్యార్దుల మనస్సుల పై చూబించే ప్రభావమెంతో , వాటి ఫలితమెంతో వారికి తెలియనిది కాదు. ఇదో వికృత క్రీడ ...ఆడేవారికి సరదా, అనుభవించే వాడికి బాధ...కాస్త పరిస్తితులు చల్లరగానే ..అందరు చల్లగా జారుకుంటారు ..మరో కారణాన్ని వెతుక్కుంటూ ...ఇందులో మోసపోయేది మనమే ...సామన్యులమే.

జయరామ్‌ కోమటికి పదవి.. కష్టానికి ఫలితం దక్కింది

కొంత మంది పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పని చేస్తారు.. పార్టీ అభివృద్దిలో కాని.. పార్టీకి సంబంధించిన ఏ విషయంలోనైనా కానీ తామున్నామంటూ ఎప్పుడూ ముందుండి నడిపిస్తుంటారు. కానీ అలాంటి వారికి కూడా అప్పుడప్పుడు ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. ఎంత కష్టపడి పార్టీకోసం పనిచేసిన వారిని గుర్తింపురావడానికి.. పదవులు దక్కడానికి మాత్రం కొంచెం సమయం పడుతుంది. కానీ అలాంటి వారికి మాత్రం ఎప్పటికైనా మంచి జరుగుతుందని వేరే చెప్పనవసరం లేదు. అలాంటి కోవకు చెందిన వారే జయరామ్‌ కోమటి. జయరామ్ కోమటి.. గత 35 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటూ.. అక్కడి టీడీపీ కోసం ఎనలేని కృషి చేసిన వారిలో ముందు స్థానం ఎవరిదైనా ఉందంటే అది జయరామ్ కోమటిదే. తానా (అమెరికా తెలుగు సంఘం) నాయకుడిగా ఉంటూ.. కమ్యూనిటీ అభివృద్ధికి పాటుపడుతూ.. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ అక్కడి  టీడీపీ అభివృద్ధికి కృషిచేసున్నారు. అంతేకాదు మన దేశం నుండి  టీడీపీ పార్టీ తరుపున ఎంత మంది అమెరికా వెళ్లినా వారిని కోఆర్డినేట్ చేయడంలో జయరామే సాటి. చంద్రబాబు నాయుడి దగ్గర నుండి.. కొడుకు లోకేశ్ వరకూ అమెరికా వెళ్లి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనాలంటే జయరామే అన్ని వ్యవహారాలు చూసుకుంటారు. అంతేకాదు తెలుగు సేవా సంస్థలకు, స్వచ్ఛంద సంస్థలకు, వైద్య సంస్థలకు, దేవాలయాల నిర్మాణాలకు విరాళాలు ఇవ్వడమే కాకుండా, తోటివారితో కూడా విరాళాలను ఇప్పించిన ఘనత జయరామ్ దే. వీటన్నింటికి మెచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు జయరామ్ కోమటి లాంటి వారు ఏపీ అభివృద్ధిలో ఉండాలని.. ఆయన సేవలు నవ్యాంధ్ర అభివృద్ధికి అవసరమని  భావించి ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జయరామ్‌ కోమటిని నియమించారు. అయితే జయరామ్ కోమటికి ఈ పదవి ఎప్పుడో రావాల్సింది కాని కొన్ని కారణాల వల్ల కాస్త ఆలస్యంగా వచ్చింది. గతంలో చంద్రబాబు ఏపీ ప్రభుత్వ సలహాదారునిగా వేమూరి రవిని నియమించారు. అయితే అప్పుడు అతని నియామకంపై పలువురు టీడీపీ నేతలు పెదవి కూడా విరిచారు. ఎప్పటి నుండో పార్టీ కోసం కృష్టి చేస్తూ.. అమెరికా టీడీపీ అభివృద్దికి పాటుపడుతున్న జయరామ్ కి కాకుండా వేమూరి రవికి ఇస్తారా అని అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. కాని జయరామ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా పార్టీ అభివృద్ధికి దోహదపడుతూనే ఉన్నారు. ఇప్పుడు అతని శ్రమను గుర్తించిన చంద్రబాబు.. అతని శ్రమకు ఫలితంగా ఈ పదవిని కట్టబెట్టారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు తనను నమ్మి తనకు ఈ పదవి ఇచ్చిన చంద్రబాబుకు జయరామ్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై చంద్రబాబు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని.. నవ్యాంధ్ర రాజధాని అభివృద్ధికి తాము కూడా పాల్గొంటామని ఆయన అన్నారు. మొత్తానికి ఇంతకాలానికి జయరామ్ కోమటి శ్రమకు ఫలితం దక్కింది.

ప‌వ‌న్ నోరు విప్పేది కోట్ల కోస‌మేనా?

  ప‌వ‌న్ క‌ల్యాణ్‌... మూడొచ్చిన‌ప్పుడు పూన‌కం వ‌చ్చిన‌ట్టు మాట్లాడేస్తుంటాడు. కానీ.... మిగిలిన స‌మ‌యంలో మైకు ముందు మ‌హా సిగ్గు. మీడియాతో అస్స‌లు ఇంట్రాక్ట్ అవ్వ‌డు. ఇంట‌ర్వ్యూలు ఇచ్చిన దాఖ‌లాలు చాలా త‌క్కువ‌. అలాంటిది ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ టీవీ ఛాన‌ల్‌లో టాక్ షో నిర్వ‌హించ‌బోతున్నాడ‌న్న టాక్ ప‌వ‌న్ అభిమానుల్ని కూడా విస్మ‌ర‌ప‌రుస్తోంది.   బాలీవుడ్ దిగ్గ‌జం.. అమీర్ ఖాన్ స‌త్య‌మేవ జ‌య‌తే అంటూ.. ఓ టాక్ షో నిర్వ‌హించాడు. సినీ గ్లామ‌ర్‌కు దూరంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాట‌మే అజెండాగా సాగిన కార్య‌క్ర‌మం ఇది. ఈ షో ద్వారా.. అమీర్‌... సామాన్యుల అభిమానం కూడా సొంతం చేసుకొన్నాడు. ఇప్పుడు ప‌వ‌న్ నిర్వ‌హించే టాక్ షో ఉద్దేశం కూడా అదేన‌ట‌. ఎలాగూ ప‌వ‌న్ పాలిటిక్స్‌తో బిజీ కాబోతున్నాడు. ప్ర‌జ‌ల మ‌న‌సు గెలుచుకోవాలంటే ఓ ఫ్లాట్‌ఫామ్ కావాలి. జ‌న సేన ఉద్దేశాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌న్నా, ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త‌ను ఎండ‌గ‌ట్టాల‌న్నా, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవాల‌న్నా.. ఓ వేదిక ఉండాలి. అందుకే.. ఈ టాక్ షో నిర్వ‌హించ‌డానికి ఓకే అనేశాడ‌ని తెలుస్తోంది. అంతేకాదండోయ్‌... వీట‌న్నింటి వెనుక `కోట్ల‌` ఆలోచ‌న‌లూ ఉన్నాయి. ఈ షో ద్వారా... భారీగా ఆదాయాన్ని వెన‌కేసుకోవాల‌ని చూస్తున్నాడు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా వ‌చ్చే టోట‌ల్ రెవిన్యూలో స‌గం.. ప‌వ‌న్ ఖాతాలోకి వెళ్తుంద‌ట‌. ప‌వ‌న్ షో అంటే.. అభిమానులంతా టీవీల‌కు అతుక్కుకోవ‌డం ఖాయం. టీఆర్‌పీ రేటింగ్స్ పెరుగుతాయి. యాడ్స్ రూపంలో కోట్ల‌లో ఆదాయం వ‌స్తుంది. ఆ ఆదాయంలో స‌గానికిపైగానే ప‌వ‌న్‌కి చేరుతుంది. అటు.. ప్ర‌జల్లో ఉంటూనే కోట్లు సంపాదించొచ్చ‌న్న‌మాట‌. ప‌వ‌న్ ప్లాన్ అదిరిపోయింది క‌దూ.

పొలిటికల్ స్టార్ డమ్ కోసం 'నారా లోకేష్' ఆరాటం..!!

  పొలిటికల్ స్టార్ డమ్ కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరాటపడుతున్నాడట. టిడిపి పార్టీలో తెరవెనుక ఎన్నో పనులు చక్కబెడుతున్న..తనకు అంతగా మీడియాలో గానీ, ప్రజల్లో గానీ పబ్లిసిటీ రావడం లేదని ఆవేదన చెందుతున్నాడట.   ఒకపక్క తెలంగాణ ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా... రాష్ట్రంలో జరిగే ప్రతి కార్యక్రమంలో కీలకపాత్ర పోషిస్తూ..టీఆర్‌ఎస్‌లో కీలకనేతగా ఎదిగారు. పత్రిక, ప్రసార సాధనాలు కూడా ఆయనకు ప్రాధాన్యతనిస్తున్నాయి.దీంతో జాతీయ స్థాయిలో పేరు, రాష్ట్రంలో తగిన గుర్తింపు తెచ్చుకునేందుకు ఎక్కడో ఓ చోట మంత్రిగా చేరటమే మంచిదని లోకేష్ భావిస్తున్నాట్టు రాజకీయ వర్గాల టాక్.   ప్రస్తుతానికి ఎమ్మెల్సీ ఎన్నికలు లేవు. ఎమ్మెల్యేగా వుండాలంటే..ఎవరితోనైనా రాజీనామా చేయించాలి. అందుకని లోకేష్ కన్ను రాజ్య సభపై పడినట్టు రాజకీయ వర్గాల సమాచారం. కేంద్ర మంత్రి సుజనా చౌదరికి పదవీ గండం పొంచి వుందంటూ చాలాకాలంగా రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. త్వరలో రాజ్యసభ పదవీ కాలం ముగియనున్నందున పార్టీకి సంబంధించిన ముఖ్యమైన పదవి ఏదో ఒకటి ఆయనకి ఇచ్చి.. నారా లోకేష్‌ని కేంద్రమంత్రిగా చేయాలని చంద్రబాబు కూడా భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో గుసగుసలు గుప్పుమంటున్నాయి.   మరోపక్క సంక్రాంతి తర్వాత ఏ నిమిషంలో అయినా కేంద్ర మంత్రి వర్గ విస్తరణ వుంటుందన్న సంకేతాలు జాతీయ రాజకీయాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఏపీకి సుజనా చౌదరి స్థానంలో మరొకరికి కేంద్ర మంత్రి పదవి దక్కించుకోవాలని చూస్తున్న చంద్రబాబు, తెలంగాణలో అదనంగా ఇంకో కేంద్ర మంత్రి పదవీ.. అదీ తన కొడుక్కి ఆశిస్తున్నారంటూ మరో గాసిప్ ప్రచారం చేస్తోంది.   మూడు కేంద్ర మంత్రి పదవులు కావాలని గతంలోనే  బాబు బీజేపీ అధిష్టానానికి అప్లికేషన్‌ పెట్టుకున్నారట. అలాగే తెలంగాణ కోటాలోనే నారా లోకేష్‌కి కేంద్ర మంత్రి పదవి వస్తే పార్టీకి లాభమని టిడిపి తెలంగాణ నేతలు భావిస్తున్నారట. మొత్తం మీద చిన్నబాబు కోరిక, కేంద్రంలో మంత్రి వర్గ విస్తరణ ఊహాగానాలు..టిడిపిలో ఎలాంటి మార్పులు తెస్తాయోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.   

జల్లికట్టుకు కంటే కోడి పందేలు ప్రమాదకరమైనవా?

  తమిళనాడులో సంప్రదాయ క్రీడగా పేరొందిన జల్లికట్టుకు కేంద్రం గ్రీన్‌ స్నిగల్‌ ఇవ్వడంతో అక్కడి ప్రజల్లో సంబరాలు మిన్నంటుతున్నాయి. తమిళనాడుకు కేంద్ర౦ ఇచ్చిన బహుమతిగా అక్కడి ప్రజలు దీనిని భావిస్తున్నారు. ఎద్దుల్ని వదిలి, వాటితో తలపడటమే జల్లికట్టు. ఎందరో ఈ జల్లికట్టు కారణంగా ప్రాణాలు కోల్పోయారు, కోల్పోతూనే వున్నారు. అయిన ప్రభుత్వం ఈ క్రీడను అక్కడి సంప్రదాయ౦గా భావించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.     జల్లికట్టు తరహాలోనే మన ఆంధ్రప్రదేశ్‌లోనూ కొన్ని సంప్రదాయాలున్నాయి. సంక్రాంతి పండుగ తెలుగునాట అత్యంత ప్రాధన్యత కలిగినది. తెలుగువారి జనజీవన స్రవంతిలో ఒక భాగమైన అందరికీ ఇష్టమైన సంబరాల పండుగ ఇది. ఈ పండుగలో ముఖ్య ఘట్టం కోడి పందేలు..ఎడ్ల పందేలు. కోస్తాంధ్రల్లోని వివిధ పల్లెలు ఎడ్ల పందేలతో.. కోడి పందేలతో సందడిగా మారుతాయి. మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే ఈ పోటీలను పల్లెసీమల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఈ పోటీల కోసం ఎక్కువగా ఒంగోలు జాతి పశువులను సంక్రాంతి పందేల కోసం శిక్షణనిచ్చి సిద్ధం చేసేవారు. బండలాగుడుతో పాటు ఎద్దులకు అందాల పోటీలు కూడా నిర్వహించేవారు. అయితే వాటిపై ప్రభుత్వాలు నిషేధం విధించడంతో..వీటిని పెంచే ధనిక వర్గాలు కూడా ఆసక్తి చూపించడం మానేసారు. అలాగే ఈ ఎడ్లను పెంచేవారు కూడా చాలా తగ్గిపోయారు. కొన్ని సంవత్సరాలు తరువాత ఈ జాతి కూడా అంతరించిపోయే ప్రమాదంలో వుందని ఓ సర్వే చెప్పినట్టు సమాచారం. ఇక కోడి పందాలు.. సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్‌లో ఇవే స్పెషల్‌ ఎట్రాక్షన్‌. తరతరాలుగా సంక్రాంతి పండుగకు కోడి పందేలు నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. పండుగ మూడు రోజులు ఇవి బరిలో నిలిచి పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. అయితే ఈ సంప్రదాయాలపై కోర్టులు, ప్రభుత్వాలు నిషేధం విధించడంపై కోస్తా జిల్లాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి వస్తుందంటే వారి ఆనవాయితీ కోసం ముందుగానే కోళ్ళను ఎన్నో వేళ రూపాయలు ఖర్చు పెట్టి వాటిని రెడీ చేస్తారు...ఇదంతా పందేళ్ళలో డబ్బుల కోసం కాదని..తరతరాలుగా వస్తున్న తమ ఆచారాన్ని బతికి౦చుకోవడం కోసమని వారు అంటున్నారు. డబ్బు కోసమే అనుకుంటే ..ఒక్కో కోడికి నెలకీ ఐదు నుంచి ఎనిమిది వేల రూపాయలు పెట్టి ఎలా పెంచుతామని ప్రశ్నిస్తున్నారు? రోజు కోసుకొని తినే కోళ్ళకు అనుమతి ఇచ్చిన జంతుసంరక్షకులు, కోర్టులు మూడు రోజులు జరుపుకొనే ఆనవాయితికి ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు?   మరోవైపు గతంలో జల్లికట్టుపై నిషేధం విధించిన కేంద్ర౦పై ఒత్తిడి తెచ్చి తమ ఆచారాన్ని కాపాడుకున్నారు తమిళ నేతలు. దీనిపై వెంటనే జీవో తెచ్చుకోవడంలో కూడా వారు సక్సెస్ అయ్యారు. మరి మన నేతలు మన ఆచారాలను ఎందుకు పట్టించుకోవడం లేదు? జల్లికట్టు  కంటే కోడి పందేలు ప్రమాదకరమైనవా? తమిళ నేతలు తెచ్చిన ఒత్తిడి మన నేతలు తెలేకపోతున్నారా? అనే ప్రశ్నలు ఆంధ్ర ప్రజల్లో హాట్ టాక్ గా నడుస్తున్నాయి.