దీటుగా... ఘాటుగా..... మోదీ చాయ్‌!

  బహిరంగ వేదికల మీద మాట్లాడేందుకు ఆవేశం మాత్రమే ఉంటే సరిపోదు. దానికి తగిన వాక్పటిమ కూడా ఉండాలి. అది సుదీర్ఘకాలం అనుభవం ద్వారా మాత్రమే వస్తుంది. ఆ అనుభవంతో మాట్లాడటం మొదలుపెడితే, అవతలివారికి వాగ్బాణాలు గుచ్చుకోక తప్పవు. నిన్న ప్రార్లెమెంటులో మోదీ ప్రసంగాన్ని చూసినవారు ఎవరికైనే వచ్చే అభిప్రాయం ఇదే! గత కొద్ది రోజులుగా ప్రార్లమెంటులో తనమీదా, ప్రభుత్వం మీదా వస్తున్న ఆరోపణలకు మోదీ ఘాటుగానే జవాబు ఇవ్వనున్నారని అందరూ ఊహిస్తూనే ఉన్నారు. అదే జరిగింది....   ఒక పక్క నేరుగా తన మీద విమర్శలు చేసిన రాహుల్‌గాంధిని నేర్పుగా దుయ్యపడుతూనే ప్రతిపక్షాలకి స్నేహహస్తాన్ని చాచారు మోదీ. ఒకవైపు పథకాల అమలుతీరులో లోపాలున్నాయని అంగీకరిస్తూనే ఇన్నాళ్లూ మీరేం చేశారని జవాబులేని ప్రశ్నని వేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఆత్మన్యూనతతో కొట్టుకుపోతోందనీ, అందుకే ఆ పార్టీ పదేపదే విమర్శలు చేస్తోందని అన్నారు. రాహుల్‌ గాంధిని ప్రోత్సహించేందుకు... కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతిభావంతులని, వాగ్ధాటి కలిగినవారినీ అణగదొక్కేస్తున్నారని విమర్శించారు. బుద్ధి పెరిగేందుకు బాదం పప్పుని తింటారనీ, కానీ కొంతమంది ఎన్ని బాదంపప్పులు తిన్నా బుద్ధిలో మాత్రం మార్పు ఉండదని దుయ్యబట్టారు. మోదీ ప్రసంగంలో పదేపదే తన మీద వస్తున్న ఛలోక్తులను తట్టుకోలేకనేమో, ఒకానొక సందర్భంలో రాహుల్‌ గాంధి సభను విడిచి వెళ్లేందుకు సైతం సిద్ధపడ్డారు. కానీ తన చర్య మరిన్ని విమర్శలకు దారి తీస్తుందనుకున్నారో ఏమో, తిరిగి వెనక్కి వచ్చి మరన్ని చెణుకులు వినక తప్పలేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఓ ప్రభుత్వ ఆర్డినెన్సుని చించేసి హడావుడి చేసిన రాహుల్‌ దుండుకుతనం మీద సైతం మోదీ అస్త్రం సంధించారు. ‘అమెరికా అధ్యక్షుడు ఒబామాను కలుసుకునేందుకు మన దేశ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సిద్ధపడుతున్న సమయంలో ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్సుని చించి ముక్కలు చేశారు. దయచేసి పెద్దలను గౌరవించండి’ అంటూ నేరుగానే హితవు పలికారు.   పార్లమెంటులో కార్యకలాపాలను ప్రతిపక్షాలు పదేపదే అడ్డుకోవడం వల్ల కీలకమైన బిల్లులు చాలా నిలిచిపోతున్నాయని మోదీ ఆవేదన చెందారు. ఈ సందర్భంగా పార్లమెంటు సజావుగా సాగాలన్న రాజీవ్ ఆకాంక్షను ఉట్టంకించారు. పేదరికాన్ని తన ప్రభుత్వం నిర్మూలించలేకపోతోందని పదే పదే కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలకు కూడా మోదీ బదులిచ్చారు. కాంగ్రెస్‌ కనుక తన 60 ఏళ్ల అధికారంలో సజావుగా పాలించి ఉంటే, అసలు పేదరికం ఎందుకు ఉండేదని ఎదురు ప్రశ్నించారు. అన్నాళ్లు పెంచిపోషించిన పేదరికాన్ని నిర్మూలించడం తనకి చాలా కష్టమవుతోందని వ్యాఖ్యానించారు. ఉపాధి హామీ పథకం మీద కాంగ్రెస్‌ చేసిన అవినీతి ఆరోపణలకి కూడా మోదీ ప్రత్యుత్తరం ఇచ్చారు. ఆ పథకంలో అవినీతి జరిగిన మాట వాస్తవమేనని తాను వెయ్యి శాతం అంగీకరిస్తున్నాననీ, అయితే ఆ అవినీతి ఎవరి హయాలో సాగిందో ఓసారి కాగ్‌ నివేదిక చూస్తే అర్థమవుతుందన్నారు.ఒకపక్క ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఒక్కొక్కటిగా తిప్పికొడుతూనే తనకు విమర్శలు కొత్తేమీ కాదని చెప్పుకొచ్చారు.   14 సంవత్సరాలుగా తాను విమర్శలను ఎదుర్కొంటూనే ఉన్నాననీ, కానీ మరికొందరు ఉన్నారంటే వారిని ప్రశ్నించేందుకు ఎవరూ సాహసించలేరంటూ పరోక్షంగా కాంగ్రెస్‌ అధినాయకత్వాన్ని దెప్పిపొడిచారు. పదే పదే ఆత్మన్యూనతతో ప్రభుత్వాన్ని విమర్శించేకన్నా, ఆచరణాత్మక సూచనలు ఇవ్వాలంటూ ప్రతిపక్షానికి సూచించారు. ప్రపంచం ముంగిట మన పరువు మనమే తీసుకోకూడదంటూ, ఇందిరాగాంధి వ్యాఖ్యలనూ ఉట్టంకించారు. మరి మోదీ సూచనను ప్రతిపక్షాలు ఏమేరకు వింటాయో వేచి చూడాల్సిందే!

తమిళనాట మళ్లీ జయలలిత!

  తమిళనాడులో ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల తేదీలు ప్రకటించడమే ఆలస్యం, హామీలతో మోత మోగించేందుకు పార్టీలన్నీ సిద్ధంగా ఉన్నాయి. తమిళ ప్రజలు చాలా ఉదారులు! డి.ఎం.కె, అన్నా డి.ఎం.కె... ఈ రెండు పార్టీలకీ వాళ్లు సరిసమానంగా అవకాశాలు ఇస్తూ ఉంటారు. అందుకే ఒక దఫా డి.ఎం.కె అధికారంలో ఉంటే, మరో దఫా అన్నా డి.ఎం.కె చెన్నై పీఠాన్ని చేజిక్కించుకుంటుంది. ఐదేళ్లపాటు ఓ పార్టీని నెత్తినెక్కించుకున్న ఓటర్లు, మళ్లీ ఎన్నికలు రాగానే అదే పార్టీని నేలకేసి కొడుతూ ఉంటారు. కానీ పరిస్థితులు చూస్తుంటే ఈసారి ఆ సంప్రదాయం మారేట్లు కనిపిస్తోంది.   డి.ఎం.కే కురువృద్ధుడు కరుణానిధికి ఇప్పుడు 91 సంవత్సరాలు. గత పదేళ్లుగా ఆయన కుర్చీకే అంకితమై ఉన్నారు. చెప్పుకోవడానికి నలుగురు కొడుకులు ఉన్నా వారిలో స్టాలిన్‌, అళగిరులకు తప్ప మిగతావారికి అంతగా రాజకీయ చతురత లేదు. మధురైలో తిరుగులేని నేతగా ఉన్న అళగిరి దాతృత్వానికంటే, దాష్టీకానికే ఎక్కువ ప్రసిద్ధి. అందుకే కరుణానిధి అళగిరికంటే చిన్నవాడైన స్టాలిన్‌కే అధిక ప్రాధాన్యతని ఇచ్చేవారు. గత ప్రభుత్వ హయాంలో స్టాలిన్‌ను ఉపముఖ్యమంత్రిగా కూడా నియమించారు. ఇక కరుణానిధి వారసుడు స్టాలినే అంటూ వార్తలు గుప్పుమనడంతో, అళగిరి తనదైన శైలిలో ఆందోళనలను నిర్వహించారు. దాంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి కరుణానిధి మళ్లీ ముఖ్యమంత్రి బాధ్యతలను స్వీకరించే పరిస్థితుల్లో లేరు కాబట్టి, డిఎంకే తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్టాలిన్‌ను ప్రజలు ఏమాత్రం అంగీకరిస్తారన్నది చూడాలి.   మరోపక్క 2011 అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకేకు తోడుగా ఉండి, ఆ తరువాత విడాకులు పుచ్చుకున్న విజయ్‌కాంత్‌ పరిస్థితి కూడా ఏమంత గొప్పగా లేదు. 2005లో డిఎండీకే పేరుతో పార్టీని ప్రజలు తనని ఆదరించేందుకు ఓపికగా ఎదురుచూసిన విజయ్‌కాంత్‌, తరువాతి కాలంలో తన అసహనాన్ని కూడా జనానికి రుచి చూపించడం మొదలుపెట్టారు. మీడియా మీదా, కార్యకర్తల మీదా, ఆఖరికి పార్టీ సహచరుల మీదా విజయ్‌కాంత్ తరచూ నోరు పారేసుకుంటూ ఉంటారని ఓ అపవాదు. మైకంలో వింతగా ప్రవర్తిస్తున్నట్లు కనిపించే ఆయన వీడియోలు కూడా యూట్యూబ్లో హల్‌చల్‌ చేస్తూ ఉంటాయి. కారణమేదైతేనేం, 2011 ఎన్నికలలో 29 మంది ఎమ్మెల్యేలను సాధించిన ఆ పార్టీ నుంచి ఏకంగా ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో, డిఎండికెకు ఒక్కసారిగా గాలితీసినట్లు అయిపోయింది.   ఇక మిగిలిందల్లా అన్నాడిఎంకె! 2011లో ల్యాప్‌టాప్‌లు మొదలుకొని మిక్సీల దాకా ఉచితంగా అందిస్తామని హామీలు గుప్పిస్తూ అధికారంలోకి వచ్చిన అమ్మ, ఎలాగొలా ఈ ఐదేళ్లు లాగించేసిందన్న వాదన వినిపిస్తోంది. పార్టీ సహచరులు ఆమె పట్ల చూపించే వీర విధేయతా, వరదల్లో అందించే ఆహారపొట్లాల మీద సైతం అమ్మ బొమ్మని ముద్రించే వీరభక్తిని చూసి సోషల్ మీడియాలో జనం తెగ నవ్వుకున్నా... తమిళనాట ఇప్పటికీ తిరుగులేని మహిళానేత జయలలితేనన్నది వాస్తవం.   పైగా ప్రస్తుత పార్లమెంటు సమావేశాలని గమనిస్తుంటే, ఎన్నికల నేపథ్యంలో అన్నాడిఎంకే చాలా తెలివిగా పావులు కదుపుతున్న విషయం అర్థమవుతుంది. 2011 ఎన్నికలలో డిఎంకె ఘోర పరాజయం కావడానికి ఒకానొక కారణమైన 2G స్కాంను తిరిగి అన్నాడిఎంకె లేవనెత్తుతోంది. కరుణానిధి ముద్దుల కుమార్తె కనిమొళి రాజకీయ జీవితానికి ఇంచుమించు ఫుల్‌స్టాప్‌ పెట్టిన ఆ కుంభకోణాన్ని ఇప్పుడు మళ్లీ తవ్వుతోంది. కాకపోతే ఈసారి చిదంబరం పాత్రని కూడా ఇందులో రుజువు చేసేందుకు ప్రయత్నిస్తోంది. తద్వారా డిఎంకేను, రానున్న ఎన్నికలలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోనున్న కాంగ్రెస్‌నూ ఒకేసారి ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఒకప్పుడు జయలలితను ఉక్కిరిబిక్కిరి చేసిన అక్రమార్జన కేసులు కూడా ప్రస్తుతం నిద్రాణంగా ఉన్నాయి. కాబట్టి ఎటు చూసిన జయ విజయానికి శుభసంకేతాలే కనిపిస్తున్నాయి.

అడగందే కేంద్రమయినా పెట్టదు!

  కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఓ కొలిక్కి తీసుకురావడమంటే, ఏదో మీట నొక్కితే జరిగిపోయే వ్యవహారం కాదు. ఆ రాష్ట్రంలోని అధికారులు, నేతలు, ప్రజలు దశాబ్దాల తరబడి నిబద్ధతతో కృషి చేస్తే కానీ సాధ్యమయ్యే విషయం కాదు. అంతిమంగా కేంద్రం నుంచి ఆసరా లేనిదే, అభివృద్ధి అడుగు కూడా ముందుకు సాగదు. ఇలాంటి సందర్భంలో, నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమేరకు చేయూతని అందిస్తోంది అంటే... ఠక్కున ఏదీ గుర్తుకురాని పరిస్థితి. 2014లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) అధికారంలోకి వచ్చేందుకు తెలుగుదేశం ఇచ్చిన సహకారం అంతా ఇంతా కాదు. 16 సీట్లతో ఆ కూటమిలో మూడో అతి పెద్ద పార్టీగా తెలుగుదేశం ఉంది. ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ వంటి పెద్దపెద్ద నేతలే, విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్రంగా అన్యాయం జరిగిందనీ, దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సరిదిద్ది తీరతామని హామీని ఇచ్చారు. అసలే విభజన గురించి కోపంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మీద ఈ హామీలు బాగానే పనిచేశాయి. తమ ఓట్లన్నింటినీ తెదెపా, వైకాపాలకు మాత్రమే వేశారు. 2009లో 33 లోక్‌సభ స్థానాలు కలిగిన కాంగ్రెస్‌కు గుండుసున్నా మిగిల్చారు.   పాలనలో ఒకో రోజూ గడుస్తున్న కొద్దీ, ఒకో బడ్జెట్‌ వెలువడుతున్న కొద్దీ, ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనే కనిపించకుండా పోతో్ంది. చిన్నపాటి హామీలు సైతం వినిపించడం లేదు. ఉదాహరణకు, విశాఖ రైల్వేను ఒక ప్రత్యేక జోన్‌గా ప్రకటించాలని ఎప్పటినుంచో అక్కడి ప్రజలు కోరుతున్నారు. తూర్పుతీరంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన విశాఖను ప్రత్యేక జోన్‌గా ప్రకటిస్తే, పాలనాపరమైన సౌలభ్యంతో పాటుగా, రద్దీని నియంత్రించేందుకు అవసరమయ్యే చర్యలన్నింటినీ తీసుకునే అవకాశం ఉంది. ఇంత చిన్న హామీని కూడా రైల్వే బడ్జెట్‌ తీర్చలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక జోన్‌ను అందిస్తామని ‘ఆంధ్రప్రదశ్‌ పునర్విభజన చట్టం’లో పేర్కొన్నప్పటికీ ఈ కల నెరవేరలేదు.   ఇక మొన్నటికి మొన్న ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో గణాంకాలు కూడా, ఆంధ్రప్రదేశ్‌కు అంత అనుకూలంగా లేవు. ప్రత్యేక ప్యాకేజీ ఊసు కానీ, లోటు బడ్జెటును పూడుస్తామన్న హామీ కానీ నెరవేరలేదు. వేల కోట్లు అవసరమయ్యే పోలవరం వంటి ప్రాజెక్టులకి నామమాత్రంగా 100 కోట్లను కేటాయించి ఊరుకున్నారు. మిత్రపక్షం, అందులోనూ కష్టాల్లో ఉంది కాబట్టి పెద్దగా ప్రతిఘటించదులే అన్న ఆలోచనలో అరుణ్‌జైట్లీ ఉన్నారేమో తెలియదు. అందుకే బడ్జెట్లో కనిపించిన చిత్రాలకు బిత్తరపోయిన చంద్రబాబు, ఆర్థికమంత్రికి ఫోన్‌ కలిపి తన కోపాన్ని వెలిబుచ్చిన తరువాత కానీ పరిస్థితిలో మార్పు కనిపించలేదు. కేంద్ర మంత్రి ఉమాభారతి హడావుడిగా తాము 100 కోట్లు కాదు, 1600 కోట్లు కేటాయించనున్నట్లు పత్రికా ముఖంగా ప్రకటించారు.   ఈ సంఘటనతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రికి ఓ విషయం అర్థమై ఉంటుంది. వడ్డించేవాడు మనవాడే అయితే... అన్న సామెతను పక్కన పెట్టి, రాష్ట్రానికి రావల్సిన వాటాల విషయంలోనూ, తీరాల్సిన హామీల విషయంలోనూ గట్టిగా పట్టుపట్టి, అవసరమైనప్పుడు గొడవపడితే కానీ పనులు జరిగేట్లు లేవు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం నిలదొక్కుకోవాలంటే ఈ సూత్రం పాటించక తప్పదు మరి!

ఇది వ్యవసాయ బడ్జెట్!

  కొన్ని బడ్జెట్లు సంచనాలకు దారితీస్తాయి. కొన్ని బడ్జెట్లు చాలా సాదాసీదాగా కనిపిస్తూనే పెనుమార్పులను కలిగిస్తాయి. నిన్న జైట్లీ రూపొందించిన బడ్జెట్ కూడా అదే కోవకు చెందినట్లుగా కనిపిస్తుంది. ప్రజాకర్షణకంటే దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్యమని గత వారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ చెప్పకనే చెప్పింది. ఇప్పుడు సాధారణ బడ్జెట్ కూడా అదే పట్టాల వెంట నడిచింది. ఇన్నాళ్లూ రైతే రాజు, రైతు దేశానికి వెన్నెముక లాంటి ఉపమానాలు వినిపించి ఉసూరుమనిపించిన బడ్జెట్లకు భిన్నంగా అరుణ్‌జైట్లీ వ్యవసాయానికి, వ్యవసాయాన్ని వెన్నంటి ఉండే గ్రామీణానికీ లక్షల కోట్లను అందించారు.   వ్యవసాయం, గ్రామీణ రంగం తదితర తొమ్మిది రంగాలను తాను అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగం ఆరంభంలోనే చెప్పారు. దానికి అనుగుణంగానే వ్యవసాయానికి 9 లక్షల కోట్ల రుణాలను అందించాలనీ, సేంద్రీయ పద్ధతులలో సాగుని ప్రోత్సహించేందుకు ‘పరంపరాగత్ కృషి వికాస్ యోజన’  పేరుతో 5 లక్షల ఎకరాలకు చేయూతనివ్వాలనీ చెప్పుకొచ్చారు. ఒకపక్క వ్యవసాయానికి నేరుగా చేయూతని అందిస్తూనే...  భూగర్భ జలాలను పెంపొందించడం, పశువులకు హెల్త్ కార్డులు రూపొందించడం, పంటలకు బీమా సౌకర్యాన్ని కల్పించడం వంటి చర్యల ద్వారా సాగుకి అవసరమయ్యే పరిస్థితులను కల్పించినట్లు అయ్యింది. ఇక రైతులు ఎక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాన్ని బలపరిచేందుకు కూడా మంత్రి తగిన ప్రధాన్యతని ఇచ్చారు. దానికి అనుగుణంగానే గ్రామపంచాయితీలకు 2.87 లక్షల కోట్లను అందచేస్తున్నట్లు తెలిపారు.   అరుణ్జైట్లీ వ్యవసాయానికి, గ్రామీణానికి ప్రకటించిన లక్షల కోట్లు క్షేత్ర స్థాయి వరకూ చేతులు మారకుండా వెళ్తాయా లేదా అన్నదే మొదటి ప్రశ్న! అర్హులైనవారికి ఈ నిధులు చేరతాయా అన్నదే మొదటి సందేహం! పైగా వ్యవసాయానికి ఉన్న ఇబ్బంది కేవలం నీరు, విద్యుత్తు మాత్రమే కాదు. నాసిరకం విత్తనాలు, ఎరువులు; అయినాకాడికి దోచుకునే దళారీ వ్యవస్థ; ఉత్పత్తులను నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడం; వ్యవసాయ అధికారుల నుంచి సరైన దిశానిర్దేశం లేకపోవడం... ఇవన్నీ కూడా రైతు నడ్డి విరిచే సమస్యలుగా ఉన్నాయి. పంట నాసిరకంగా ఉన్నా, టమాటా వంటి పంటలు ఒకేసారి వెల్లువలా పండినా.... అటు రైతుకీ నష్టం కలగకుండా, ఇటు పంట వృధా కాకుండా ఏ ఉత్పత్తిని ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న విషయంలో ఎవరికీ ఎలాంటి అవగాహనా లేదు.   అన్నింటికీ మించి... తక్కువ రసాయనిక ఎరువులను ఉపయోగించి, ఎక్కువ పంటను సాధించగలిగే విధంగా రైతులను నిర్దేశించలేకపోవడం. విచక్షణారహితంగా రసాయనికి ఎరువులను ఉపయోగించడం వల్ల రైతు అన్ని విధాలా నష్టపోతూనే ఉన్నాడు. ఎరువుల వాడకం వల్ల అతని జేబుకి ఎలాగూ చిల్లు పడుతుంది, వాటిని ఎడాపెడా వాడితే భూసారమూ తగ్గిపోతోంది, తినే ఆహారమూ విషమైపోతోంది, ఒకవేళ ఎరువులు కల్తీవని తేలితే పంటే నాశనమైపోతుంది. కేంద్ర మంత్రి తన బడ్జెట్లో, సేంద్రీయ పద్ధతిని ప్రోత్సహించేందుకు 5 లక్షల ఎకరాల వరకూ సాయం చేస్తామని చేసిన ప్రకటన బాగానే ఉన్నా కోట్ల కొద్దీ ఉన్న మన వ్యవసాయ భూముల్లో 5 లక్షల ఎకరాలు చాలా తక్కువన్న లెక్కని ఎవరైనా తేల్చగలరు. ఇక హోల్‌సేల్‌ మార్కెట్లలో అమ్మకాలన్నింటినీ కేంద్రీకృతం చేయడం వల్ల రైతులు అధికంగా లాభపడతారన్న జైట్లీ వాదన కూడా ఆచరణలో ఏ మేరకు సాధ్యమో వేచి చూడాల్సిందే!   ఎలా చూసినా 2016-17 బడ్జెట్ వ్యవసాయిక బడ్జెట్‌ అని చెప్పుకోక తప్పదు. ఇందులో పేర్కొన్న గణాంకాలు, కేటాయించిన నిధులు వ్యవసాయ రంగంలో అద్భుత మార్పులు తీసుకువస్తాయో రావో ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ ప్రజాకర్షణకు విరుద్ధంగా వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ కనీసం డీలా పడిపోతున్న రైతన్నకి బాసటగా అరుణ్‌జైట్లీ నిలిచారనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు.

ఊరిస్తున్న బడ్జెట్!

మన దృష్టిలో ఆర్థికశాఖామంత్రి అంటే ఓ అద్భుత మేధావి. ఆయన ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్‌ అంటే ఓ మంత్రదండం. ఆ మంత్రందండంతో మన జీవితాలు ఒకంతైనా మారతాయని చిన్న ఆశ. మంచికో చెడుకో కానీ... నిజంగానే కొన్ని బడ్జెట్లు మన దేశాన్ని మార్చివేసిన సందర్భాలు ఉన్నాయి. విదేశీ పెట్టుబడులు, ఆర్థిక సరళీకరణలు, ఆదాయపు పన్ను రాయితీలు మన మీద గణనీయంగా ప్రభావం చూపించాయి. అందుకే నేడు మన ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కూడా ఎలా ఉండబోతోందా అంటూ దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.   బడ్జెట్ అనగానే వేతనజీవులు ముందుగా ఎదురుచూసేది, ఆదాయపు పన్నుకి సంబంధించిన పరిమితినే. అందుకు అనుగుణంగానే ఈసారి 3,00,00 వరకూ ఆదాయం కలిగి ఉన్నవారిని ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలని అరుణ్‌ జైట్లీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఒక్క మాటా ఆర్థిక శాఖ మంత్రి నోట వెలువడితే చూద్దామని మధ్యతరగతి వర్గాల ఆశ. అంతేకాదు! ఏడవ పే కమీషన్‌ చేసిన సిఫారుసులను ఆర్థిక మంత్రి ఆమోదించవచ్చన్న సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఇదే కనుక జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగే!   వ్యాపారస్తులకు, పెట్టుబడిదారులకు కూడా అరుణ్‌జైట్లీ కొన్ని రాయితీలు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా కార్పొరేట్‌ పన్నుని ప్రస్తుతం ఉన్న 30 శాతం నుంచి ఎంతో కొంత తగ్గించే ప్రతిపాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రపంచస్థాయిలో తనకంటూ ఓ స్థానం ఏర్పరుచుకుంటుంన్న ఔషధ రంగానికి కూడా ఆర్థిక మంత్రి కొన్ని వరాలను ప్రకటించవచ్చు. ఇక కాలుష్యాన్ని నియంత్రించే చర్యలలో భాగంగా సాంప్రదాయేతర ఇంధన వనరులైన సౌర, పవన విద్యుత్తులకు తగిన విధంగా ప్రోత్సహిస్తారని అంతా ఆశిస్తున్నారు. ఇందులో భాగంగానే విద్యుత్‌తో నడిచే వాహనాలకి సంబంధించిన ముడిభాగాల మీద తగిన రాయితీలను ఇవ్వనున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.   ఇక దేశం ఎంతగా వెలిగిపోతున్నా, నానాటికీ క్షీణించిపోతున్న వ్యవసాయ రంగానికి ఆర్థిక మంత్రి ఏం చేయనున్నారన్నది ఆసక్తికరమైన అంశం. కరవుకాటకాలు, అప్పులు, తగ్గిపోతున్న జలవనరులు, దళారుల పీడన, రియల్‌ ఎస్టేట్... ఇలా వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తున్న చీడ సామాన్యమైనది కాదు. దేశం వెన్నెముకగా చెప్పుకునే రైతే ఇప్పుడు డీలాపడిపోయి ఉన్నాడు. ఏదో తూతూమంత్రంగా చర్యలు కాకుండా వ్యవసాయరంగానికి జవసత్వాలు అందించే పక్కా ప్రణాళికలు ఈ బడ్జెట్‌లో లభించున్నాయో లేదా చూడాల్సిందే!   ఒకపక్క దేశ ఆర్థిక లక్ష్యాలను సాధించడంతో పాటు క్యాబినెట్ కలలను నెరవేర్చే బాధ్యత కూడా అరుణ్ జైట్లీ భుజస్కంధాల మీద ఉంది. స్వచ్ఛ భారత్‌, మేకిన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా... వంటి పథాకలన్నింటికీ ఊపునిచ్చేందుకు ఈ బడ్జెట్ ఎంతమేరకు ప్రయత్నిస్తుందో చూడాలి.ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రజల మీద పెనుభారాన్ని మోపకుండానే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను కూడా ఆర్థికమంత్రి అన్వేషించాల్సి ఉంటుంది. ఇందుకోసం పెట్టుబడుల ఉపసంహరణ, విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం, పరోక్ష పన్నుల పెంపు, విలాస వస్తువుల మీద పన్నుల పెంపు... తదితర మార్గాలు ఉండనే ఉన్నాయి. మన ఊహలన్నీ ఏ మేరకు నిజం కానున్నాయో త్వరలోనే తేలిపోనుంది.

సంజయ్‌దత్‌ అదృష్టవంతుడా!

  1994- ముంబై ఎయిర్‌పోర్టులో ఉన్న పోలీసులు సంజయ్‌దత్‌ను టాడా చట్టం కింద అరెస్టు చేయడం విని ప్రపంచమంతా ముక్కున వేలేసుకుంది. బాలీవుడ్‌ ప్రేమ జంట సునీల్‌దత్- నర్గీస్‌ల గారాల పుత్రుడైన సంజయ్ ఏమంత మంచి బాలుడు కాదని దేశానికి తెలుసు. కానీ తీవ్రవాదులతోనే దోస్తీ కట్టి, వారి ఆయుధాలను దాచిపెట్టేందుకు ఉపయోగపడతాడని ఏనాడూ ఊహించలేదు. 1993లో ఆ తీవ్రవాదులు ముంబైలో మారణహోమాన్ని జరిపి వందలాది మంది ప్రాణాలను హరించి ఉండకపోతే, బహుశా ఈ విషయం సద్దుమణిగిపోయేదేమో. కానీ సంజయ్‌కు ఆ తీవ్రవాదులకూ సంబంధాలు హద్దులు దాటి ఉన్నాయనే విషయం సుస్పష్టంగా తేలిపోవడంతో అతన్ని అరెస్టు చేయక తప్పలేదు. పైగా అప్పటికి కఠినమైన టాడా చట్టం అమల్లో ఉండటంతో సంజయ్‌ తప్పించుకోవడం అంత తేలిక కాలేదు. అయినా సంజయ్‌దత్‌ అదృష్టవంతుడే అంటారు చాలామంది. ఎందుకంటే...   సంజయ్‌దత్‌ యవ్వనంలోకి అడుగుపెడుతూనే మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. పాపం తల్లి చనిపోయిన బాధలో ఆ వ్యసనానికి లోనయ్యాడని ప్రపంచమంతా జాలిపడింది. సామాన్యులు ఏదన్నా వ్యసనంలో ఇరుక్కుంటే ఇలాంటి జాలిని పొందడం కష్టమే! తరువాత ఆయనను ముంబై పేలుళ్ల సందర్భంగా అరెస్టు చేస్తే బాలీవుడ్ అంతా కంటతడి పెట్టింది. సంజయ్‌ను విడుదల చేసేందుకు ఏకంగా పార్లమెంటు స్థాయిలోనే పైరవీలు జరిగాయి. సంజయ్‌ తండ్రి సునీల్‌ దత్‌ కాంగ్రెస్‌ నేత అయినా కూడా పార్టీలకు అతీతంగా బాల్‌థాకరే, శతృఘన్‌ సిన్హా వంటి వారు ఆయనకు ఈ విషయంలో మద్దతుగా నిలిచారు. సంజయ్‌దత్‌ కేవలం తన కుటుంబ రక్షణ కోసమే అక్రమ ఆయుధాలను కలిగి ఉన్నాడనీ... అభంశుభం ఎరుగని ఆ పసివాడు, అబూసలీం వంటి తీవ్రవాదుల ఉచ్చులో చిక్కుకున్నాడనీ పెద్దలంతా తెగ బాధపడిపోయారు.   నిజానికి తన కుటుంబ రక్షణ కోసం ఆయుధాలను కలిగి ఉన్నాని చెప్పడం అంత హాస్యాస్పదం మరొకటి ఉండదు. ఎందుకంటే అతని కుటుంబానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఒకవేళ అలాంటి ప్రమాదం ఉంటే పోలీసులను ఆశ్రయించాలి కానీ తీవ్రవాదులని కాదు. ఒకవేళ ఆశ్రయించినా మరీ మూడు AK-56 తుపాకులూ, 20 గ్రైనేడులూ, 450 బుల్లెట్లూ... కలిగి ఉండాల్సిన అవసరం అసలే లేదు. ఈ జాబితాను చూస్తే ఒక యుద్ధానికి సరిపడా మందుగుండుని సమకూర్చుకున్నట్లు కనిపిస్తోంది. ఆ యుద్ధం ఎలాంటిదో వేరే చెప్పనవసరం లేదు! ఇంతజరిగిన తరువాత కూడా, సంజయ్‌దత్‌కు ఆయుధాలను అందచేసిన డెలివరీ బాయ్‌కి ఎంత శిక్ష పడిందో ఆయనకు కూడా అంతే తేలికపాటి శిక్ష పడింది.   తీవ్రమైన నేరంలో ఇరుక్కున్న సంజయ్‌దత్‌ తేలికపాటి శిక్షతో తప్పించుకున్నందుకు ఇటు ప్రభుత్వం కానీ, అటు కేసుని విచారిస్తున్న సీబీఐ కానీ ఎలాంటి అప్పీలూ చేయలేదు. కేసుని తిరిగి ఎక్కడా దాఖలు చేయలేదు. పైగా సీబీఐ సంజయ్‌దత్‌ కేసులో తన నివేదికను చాలా తేలికపాటి పదాలతో కూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంజయ్‌దత్‌ని విచారించిన న్యాయమూర్తులు కూడా స్వల్పకాల శిక్షతో సరిపెట్టేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటో కూడా ఎవరికీ అంతుపట్టదు. సంజయ్‌కు విధించిన తేలికపాటి శిక్ష తనని సైతం ఆశ్చర్యానికి గురిచేసిందని అతని న్యాయవాది సతీష్‌ తరువాత కాలంలో పేర్కొన్నాడు.జైల్లో ఉన్నప్పుడు కూడా సంజయ్‌కి ప్రత్యేకమైన సదుపాయాలను కల్పించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవి ఎంతవరకూ నిజమో కానీ ఆయన తరచూ పెరోల్‌ మీద నెలల తరబడి బయటకు వచ్చిన మాట వాస్తవం. ఈ విషయమై సాక్షాత్తూ ముంబై హైకోర్టు ప్రభుత్వాన్ని మందలించాల్సి వచ్చింది.   ఇప్పుడు కూడా సంజయ్‌దత్‌ను ‘సత్ప్రవర్తన’ ఆధారంగా ఎనిమిది నెలల ముందుగా విడుదల చేసింది ప్రభుత్వం. ముంబై పేలుళ్ల సందర్భంగా సంజయ్‌దత్‌లాగానే అక్రమ ఆయుధాలను కలిగి ఉన్నందుకు జైబున్నీసా అనే విధవరాలికి కూడా ఐదేళ్ల శిక్షను విధించారు. ఆమె వయసు 70 సంవత్సరాలు, క్యాన్సర్‌ రోగి, కిడ్నీలు పాడైపోవడంతో ఈమధ్యే ఆపరేషన్ జరిగింది, ఆమెకు అయిదుగురు కుమార్తెలు.... తన తల్లిని విడుదల చేయమంటూ ఆమె కుమార్తెలు ఎందరి చుట్టూనో తిరుగుతున్నారు. ఇప్పటికీ ఆమె జైళ్లోనే ఉన్నారు. ఇప్పుడు చెప్పండి... సంజయ్‌దత్‌ అదృష్టవంతుడా కాదా!

రైల్వే బడ్జట్‌ నిజంగా విఫలమైందా!

  రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు నిన్న ప్రవేశపెట్టిన బడ్జట్‌ను ప్రతిపక్షాలన్నీ ఏకగ్రీవంగా పనికిమాలినదంటూ తేల్చిపారేశాయి. ఇలాంటి సీదా బడ్జట్‌ను ఇంతవరకూ చూడలేదంటూ అటు ఉద్యోగ సంఘాలు, ఇటు ప్రతిపక్ష నేతలూ పెదవి విరిచేశారు. నిజంగానే రైల్వే బడ్జట్‌ దారుణంగా సాగిందా?   జాతీయ ఆదాయంలో రైల్వేలది ముఖ్యపాత్రగా భావించి 1924 నుంచే రైల్వేలకు ప్రత్యేక బడ్జట్‌ను అమలుచేయడం మొదలుపెట్టారు. లాల్‌బహదూర్‌ శాస్ర్తి, జగ్‌జీవన్‌రాం వంటి ప్రముఖులెందరో రైల్వే బడ్జట్‌లను ప్రవేశపెట్టినా వాటిగురించి సామాన్యులు అంతగా పట్టించుకునేవారు కాదు. 1999లో మమతా బెనర్జీ రైల్వే మంత్రి కావడంతో రైల్వేలలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. మమతా బెనర్జీ తరువాత నితీశ్‌, లాలూలు రైల్వే మంత్రులుగా సాగడంతో రైల్వే బడ్జట్‌కు జనాకర్షణ తోడైంది. ప్రపంచీకరణ వల్లనైతేనేం, మారుతున్న జీవనశైలి వల్లనైతేనేం.... దేశప్రజలంతా రైల్వేల గురించీ, రైల్వే బడ్జట్ల గురించీ ఆసక్తి కనబరచడం మొదలుపెట్టారు.   ఏటా రైల్వే బడ్జట్‌ను ప్రవేశపెట్టిన ప్రతిసారీ ఈసారి కొత్తగా ఎన్ని రైళ్లు వేశారు? వాటిలో మన రాష్ట్రానికి ఎన్ని దక్కాయి? ఏ రాష్ట్రానికి ఏఏ ప్రాజెక్టులు లభించాయి? అనే పత్రికలు చూసేవారు. కానీ గత బడ్జట్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ప్రాజెక్టులు ఏ దశకు చేరుకున్నాయి? అని ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. దానికి అనుగుణంగానే రైల్వే మంత్రులంతా కూడా ప్రజాకర్షక బడ్జట్లను రూపొందించేందుకు ప్రయత్నించేవారు. పనిలో పనిగా నిర్మొహమాటంగా తన రాష్ట్రానికి వీలైనన్ని రైళ్లు, అదే చేత్తో కావల్సినన్ని ప్రజెక్టులు కేటాయించేవారు. సమీపంలో ఎక్కడన్నా ఎన్నికలు జరుగుతుంటే ఆ రాష్ట్రంవారిని కాస్త బుజ్జగించేందుకు అక్కడ కూడా కొన్ని వరాలను విదిల్చేవారు. సురేష్ ప్రభు ఇలాంటి వరాల జోలికి పోలేదు. తన స్వరాష్ట్రమైన మహారాష్ట్రకి పెద్దపీటా వేయలేదు. త్వరలోనే అయిదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నప్పటికీ తొందరపడలేదు.   రైల్వేలను పునర్‌వ్యవస్థీకరించడానికీ; రైల్వేలలో ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడానికీ; యువతకు చేరువకావడానికీ; స్త్రీలకు, వృద్ధులక అధిక సౌకర్యాలు కల్పించడానికే మంత్రి పెద్దపీట వేశారు. అన్నింటికీ మించి పేరుకుపోతున్న ప్రాజెక్టులను పూర్తిచేయడమే తన లక్ష్యం అని స్పష్టం చేశారు. కాస్త జాగ్రత్తగా గమనిస్తే తెలుగురాష్ట్రాలలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు వందలాది కోట్లను కేటాయించినట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల- ఎర్రగుంట్ల మార్గాన్ని పూర్తిచేసేందుకు 100 కోట్లు, తెలంగాణలో జగ్గయ్యపేట-జానపహాడ్ మార్గాన్ని పూర్తిచేసేందుకు 110 కోట్లు కేటాయించడం ఒక ఉదాహరణ మాత్రమే!   అలాగని సురేష్ ప్రభు బడ్జట్‌ అద్భుతంగా ఉందనీ చెప్పుకోవడానికి లేదు. విశాఖను ప్రత్యేక జోన్‌గా ప్రకటించాలని, కాజీపేటకు డివిజన్‌ హోదాను కల్పించాలనీ... రైల్వే మంత్రికి అందించిన వినతులన్నింటినీ కూడా తుంగలో తొక్కినట్లు కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఖర్చుని భరించేందుకు ముందుకు వచ్చిన ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టుకి మాత్రమే బడ్జట్ ఆమోదం తెలిపింది. కొత్త రైళ్ల సంగతి అటుంచితే తెలుగు రాష్ట్రాలు ఎప్పటినుంచో అడుగుతున్న వ్యాగన్‌ వర్కషాప్‌, కోచ్‌ ఫ్యాక్టరీ వంటివి ఏవీ కూడా ఈసారి మనకు దక్కలేదు.  మంత్రివర్యులు సెలవిచ్చినట్లుగా ఈ బడ్జెట్‌ దీర్ఘకాలికంగా లాభాలను చేకూర్చనుంది కాబట్టి అందుకోసం మిగతా రాష్ట్రాలతో పాటు మనం కూడా త్యాగం చేయవలసి వచ్చినట్లుంది.

రాజుకుంటున్న రిజర్వేషన్ల చిచ్చు!

  - ఈ ఏడాది తునిలో మొదలైన రిజర్వేషన్ల గొడవ నెల నెలా గడిచేసరికి యావత్‌ భారతదేశాన్నే కమ్ముకుంటున్నట్లు ఉంది.   - గత వారం రోజులుగా హర్యానాలో తగలబడుతున్న ప్రభుత్వ ఆస్తుల సాక్షిగా, పాలకోసం అలమటిస్తున్న పసిపిల్లల సాక్షిగా రిజర్వేషన్ల చిచ్చు మళ్లీ రగులుకున్నట్లే కనిపిస్తోంది.   - అటు హర్యానాలో జాట్‌ వర్గం ఆందోళన చేస్తోందో లేదో ఇటు గుజరాత్‌లోనూ పటేల్‌ కులస్తులకు రిజర్వేషన్‌ కావాలంటూ హడావిడి మొదలైంది. పటేల్‌ వర్గ నాయకుడు హార్ధిక్‌ పటేల్‌ జైల్లోంచే తన నిరసన గళాన్ని వినిపించడం మొదలుపెట్టాడు.   - ఇక రాజస్తాన్‌లోని గుజ్జర్‌ వర్గ నేతలు కూడా మరోసారి మైకుల ముందుకి వచ్చారు. ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో కనుక తమకు రిజర్వేషన్లకు కల్పించే విధంగా తగిన చట్టాలను రూపొందించకపోతే తిరిగి తమ ఉద్యమాన్ని మొదలుపెడతాం అంటూ హెచ్చరించారు.   రిజర్వేషన్లు కావాలంటే వేర్వేరు వర్గాలవారు ఆందోళనలకి దిగుతుంటే, అడిగినవారందరికీ కోటాను విస్తరిస్తూ పోతుంటే తాము అన్యాయం అయిపోతామంటూ పోటీ మాటలు వినిపిస్తున్నాయి. తెలంగాణకు చెందిన బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య ఇప్పటికే కొత్త రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరుని మొదలుపెట్టారు. ఇందుకోసం దిల్లీలో భారీ సభలను నిర్వహిస్తామనీ, పార్లమెంటుదాకా తమ ఆందోళనని విస్తరిస్తామనీ చెబుతున్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆర్‌.కృష్ణయ్య ఒంటరివారని అనుకోవడానికి లేదు. కురుక్షేత్ర నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ రోజ్‌ కుమార్‌ సయానీ సైతం జాట్ వర్గానికి రిజర్వేషన్లను కల్పించడం గురించి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘విధ్వంసానికి పాల్పడే ప్రతి వర్గానికీ రిజర్వేషన్లను అమలుచేస్తూ పోతే హర్యానాలో ఉన్న 36 కులాలకీ రిజర్వేషన్ కల్పించాల్సి వస్తుందన్నారు’.   రాజ్ కుమార్ మాటలు ఆవేశంగా కనిపించవచ్చు. కానీ అది కొట్టివేయదగ్గ వాదనేం కాదు. ప్రభుత్వం దిగివచ్చే దాకా విశృంఖలంగా ఆందోళలను చేపట్టడం, ప్రజాజీవితాన్ని అస్తవ్యస్తం చేయడం అన్న వ్యూహానికి ప్రస్తుతం తిరుగులేకుండా పోతోంది. ఆందోళనల సందర్భంగా జరుగుతున్న విధ్వంసానికి సుప్రీంకోర్టు సైతం ముక్కునవేలేసుకునే పరిస్థితి వచ్చింది. ఉద్యమం ముసుగులో ప్రభుత్వ లేదా పౌరుల ఆస్తులకు నష్టం కలిగించేవారిని శిక్షించేందుకు కఠినమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందంటూ నిన్న సుప్రీం కోర్టు పేర్కొంది. న్యాయస్థానాల నుంచి ఇలాంటి మొట్టికాయలు పడతాయనే ఉద్యమకారులు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం తన హామీలను అమలుపరచడంతో పాటుగా, ఉద్యమం సందర్భంగా పెట్టిన కేసులను ఎత్తివేస్తేనే ఆందోళనలను విరమిస్తాం అంటూ కొత్త కోరిక కోరుతున్నారు.   ఏది ఏమైనా రోజురోజుకీ పెరిగిపోతున్న గొడవలకి సంబంధించి కేంద్రప్రభుత్వమూ న్యాయవ్యవస్థా ఒక కార్యాచరణను రూపొందించాల్సిన అవసరం వచ్చింది. రిజర్వేషన్ల కోసం కులాలను తిరిగి విభజించడమా లేకపోతే కొత్తగా వస్తున్న వాదనలన్నింటినీ ఒకేసారి ఆలకించేందుకు ఏదన్నా సంఘాన్ని ఏర్పాటు చేయడమా అన్నది ప్రభుత్వం చూడాలి. అన్నింటికీ మంచి ఒక వర్గానికి నూతనంగా రిజర్వేషన్‌ కల్పించడం అనే విధానానికి ఒక ప్రాతిపదిక ఉండాలి. మరో మాటలో చెప్పాలంటే రిజర్వేషన్‌ కల్పించేస్తామంటూ ఒక రాజకీయ పార్టీ హడావుడిగా ప్రకటించేంత తేలికగా కానీ, మేం ఆందోళనకు దిగితే రిజర్వేషన్‌ వచ్చేస్తుందన్న భ్రమలో వివిధ వర్గాలు కానీ ఉండకుండా... పారదర్శకమైన, కఠినమైన విధివిధానాలకు అనుగుణంగా రిజర్వేషన్లలో మార్పులు జరగాలి.

రైల్వే బడ్జెట్‌ గమ్యానికి చేరుతుందా!

  దేశమంతా ఎదురుచూసే రైల్వే బడ్జట్‌ రేపు అవిష్కృతం కాబోతోంది. రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభు తన బడ్జట్‌ ప్రసంగంలో ఏం చెప్పబోతున్నారా అని సామాన్యులంతా ఆసక్తిగా ఉన్నారు. ఈసారి రైల్వే బడ్జట్‌లో కూడా ప్రయాణికుల మీద పెద్దగా భారాన్ని మోపబోమంటూ ముందుగానే సంకేతాలు అందించారు సురేష్‌ ప్రభు. అయితే మరి వేలకోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్న రైల్వేలని ఎలా గట్టెక్కిస్తారన్నది ఓ ముఖ్య సందేహం!   రైల్వేలు దేశానికి జవసత్వాలందించే వ్యవస్థలు. ప్రయాణాలు సాగాలన్నా, వ్యాపారం వృద్ధి చెందాలన్నా రైల్వేల అవసరం అంతా ఇంతా కాదు. అందుకే బ్రిటిష్‌వారు మన దేశం మీద అధికారాన్ని విస్తరించుకునేందుకు చేసిన మొట్టమొదటి పని రైల్వేలను విస్తరించడం. దురదృష్టవశాత్తూ అప్పట్లో వారు నిర్మించిన వంతెనలనే ఇప్పటికీ చాలాచోట్ల వాడుతున్నాం. ఎందుకంటే ఇప్పటివరకూ వచ్చిన రైల్వే బడ్జట్లు చాలావరకు మౌలిక సదుపాయాల మీద శ్రద్ధ పెట్టలేదు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునో, తమ రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకునో రూపకల్పన చేసినవే ఎక్కువ. తన పుట్టింటి నుంచి అత్తవారింటికి రైలు వేసుకున్న ఘనులు కూడా ఉన్నారు.   రైల్వే బడ్జెట్లో ఒక ప్రాజెక్టుని కానీ, కొత్త రైలుని కానీ, డబ్లింగ్ వంటి ఆధునీకరణ పనులను కానీ చేపట్టేటప్పుడు అది ఆర్థికంగా నష్టమా, లాభమా అన్న మాటను అటుంచితే... కనీసం వీలైనంత ఎక్కువ జనాభాకి ఉపయోగమా లేదా అని కూడా ఆలోచించకుండా ప్రతిపాదలను చేయడం సర్వసాధారణంగా మారింది. అలా తూతూమంత్రంగా మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఏళ్లతరబడి సాగుతూ కాంట్రక్టర్లను పోషించాయే కానీ ప్రజలకి ఉపయోగం లేకుండా పోయాయి. పోనీ ఉన్న రైళ్లనన్నా సక్రమంగా నర్వహిస్తున్నారా అంటే ఆ దాఖలా కూడా కనిపించడం లేదు. స్వాతంత్ర్యం వచ్చి అరవై ఏళ్లు దాటిపోయినా మన రైళ్లు ఆలస్యానికీ, అపరిశుభ్రతకు, రద్దీకి మారుపేరుగానే ఉన్నాయి. వీటన్నింటికీ తోడు ఏటికేడు పెరిగిపోతున్న ఖర్చులు కూడా రైల్వేలకు పెనుభారంగా మారిపోతున్నాయి. పెండింగ్‌ ప్రాజెక్టుల వల్లా, కాలం చెల్లిన యంత్రాల వల్లా, ఇంధనంలో వృధా వల్లా.... ఇలా రైల్వేల కుంటినడకకి వేల కారణాలు కనిపిస్తాయి. వీటికి తోడు ఇప్పడు 7వ వేతన కమీషన్‌ సిఫార్సులను కనుక అమలు చేస్తే ఉద్యోగులకు చెల్లించవలసిన జీతాల వల్ల రైల్వేల మీద 32,000 కోట్ల అదనపు భారం పడనున్నదని అంచనా! పోనీ ఆ మేరకు ఆదాయం పెరుగుతోందా అంటే అదీ కనుచూపు మేరలో లేదు.   పైన పేర్కొన్న విషయాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిగారు ఈసారి బడ్జెట్‌ను రూపొందించినట్లు సమాచారం. ప్రయాణికుల మీద పెనుభారం మోపకుండానే ఆదాయవనరులను పెంచుకోవాలనీ, రైల్వేలకు పునరుత్తేజం తీసుకురావాలనీ ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రవాణా మీద ఈసారి ఎక్కువ దృష్టిని పెట్టబోతున్నారట. రైల్వేలకు ముఖ్య ఆదాయవనరైన రవాణాలో తగిన వృద్ధిని ఇప్పటివరకూ సాధించలేకపోయారు. గత ఏడాదితో పోలిస్తే కేవలం ఒక్క శాతం మాత్రమే రవాణా నుంచి ఆదాయం పెరిగింది. ఈ పరిస్థితిలో మార్పు రావల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఇక కొత్త ప్రాజెక్టుల సంగతి అలా ఉంచి, ఇప్పటివరకూ ప్రతిపాదించిన ప్రాజెక్టులను వీలైనంతగా పూర్తిచేయడం కూడా మంచిది. ఇంధనాన్ని పొదుపుగా వాడేందుకు కూడా కొన్ని నిర్దుష్ట చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉంది. ఇవే కాకుండా రైల్వేలకు ఇతర ఆదాయ వనరులైన ప్రకటనలు, క్యాటరింగ్, పర్యాటకం... వంటి రంగాల అభివృద్ధి మీద మరింత శ్రద్ధ చూపాల్సిన సమయం వచ్చింది. అన్నింటికీ మించి ప్రయాణికులకు యాత్ర సాఫీగా సాగిపోయేలా... ఆహారం మొదలుకొని పరిశుభ్రత వరకూ మౌలికమైన సదుపాయాలని కల్పించే దిశగా ఈ రైల్వే బడ్జట్‌ కృషి చేస్తుందన్నది సగటు ప్రయాణికుడి ఆశ. మరి ఆ ఆశ ఎంతవేరకు నెరవేరనుందో తెలుసుకోవాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే! – శుభయాత్ర!

ఇక గుజరాత్‌ వంతు?

ఒకపక్క హర్యానాలో జాట్ వర్గం తమను వెనుకబడిన తరగతుల్లో చేర్చుకుని తగిన రిజర్వేషన్లను కల్పించమంటూ ఆందోళన చేస్తోంది. ఈ ఆందోళనలు హింసాత్మకరంగా మారి 10 మందికి పైగా మృత్యువాత పడ్డారు. జాట్‌ల ఉద్యమంతో హర్యానా అగ్నిగుండంగా మారిపోయింది. రవాణా సంగతి దేవుడెరుగు... దేశ రాజధాని దిల్లీకే ఈ ఉద్యమం వల్ల మంచినీరు సైతం దక్కని దుస్థితి వచ్చింది. పరిస్థితి చేయిదాటిపోవడంతో ఎట్టకేళకు కేంద్రప్రభుత్వం కూడా దిగివచ్చి వారి ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందిస్తామంటూ హామీ ఇవ్వవల్సి వచ్చింది.     హర్యానాలో జరుగుతున్న హడావుడి చూసి ఉత్తేజం పొందాడో ఏమోగానీ గుజరాత్‌లోని హార్ధిక్‌ పటేల్‌ తన గొంతుని పెంచడం మొదలుపెట్టాడు. గత గురువారం నుంచీ హార్ధిక్‌ జైల్లోనే ఆమరణ నిరాహారదీక్షను మొదలుపెట్టాడు. హార్ధిక్‌ దీక్షకు మద్దతుగా గుజరాత్లో ఆందోళనలు మొదలయ్యాయి. అక్కడక్కడా బస్సులను ధ్వంసం చేసిన వార్తలు వినవస్తున్నాయి. పట్టుమని పాతికేళ్లు కూడా లేని హార్ధిక్‌ పటేల్‌ తన వర్గానికి రిజర్వేషన్లను కల్పించమంటూ చాలా రోజుల నుంచీ పోరాడుతున్నాడు. అందుకోసం ‘పాటిదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి’ అంటూ 2015లో సంఘాన్ని సైతం ఏర్పాటుచేశాడు. ఆ సంఘం తరఫున గత ఏడాదికాలంగా హార్ధిక్‌ సాగించిన ఆందోళన కేంద్రప్రభుత్వాన్నే వణికించింది. సాక్షాత్తూ ప్రధానమంత్రి మోదీ స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లోనే ఆయనను ఇబ్బంది పెట్టింది. హార్ధిక్‌ను చిన్నాచితకా కేసుల కింద అరెస్టు చేసి జైల్లో తోసారు పోలీసులు. ప్రస్తుతానికైతే ప్రభుత్వం కొన్ని పటేల్‌ వర్గం వారికోస రాయితీలను, స్కాలర్‌షిప్‌లనూ ప్రకటించి ఉద్యమాన్ని శాంతింపచేసింది. కానీ హార్ధిక్‌ చర్యలను గమనిస్తుంటే ఉద్యమం మళ్లీ ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి.     పటేల్‌ వర్గంవారు వ్యాపారానికి పెట్టింది పేరు. లేదా వ్యవసాయం మీదన్నా ఆధారపడేవారు. ప్రభుత్వ ఉద్యోగాల మీద వారికి ముందునుంచీ శ్రద్ధ తక్కువే. కానీ ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యాపారమూ, వ్యవసాయమూ వారిని నష్టాల్లోకి నెట్టసాగాయి. ఆన్‌లైన్ వ్యాపారంతోనూ, సూపర్‌ మార్కెట్ల ప్రభంజనంలోనూ వారి వ్యాపారాలు దివాళా తీయడం మొదలుపెట్టాయి. పైగా గుజరాత్‌లో కులాల ఓటుబ్యాంకుకి సంబంధించి ఒక ఘోరమైన ప్రయోగం జరిగింది. మాధవరావ్‌ సోలంకీ అనే పెద్దమనిషి ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు 1980వ దశకంలో KHAM అనే ఒక పద్ధతిని కనిపెట్టాడు. KHAM అంటే క్షత్రియులు, హరిజనులు, ఆదివాసీలు, ముస్లింలు అన్నమాట!     గుజరాత్ జనాభాలో అత్యధికంగా ఉన్న ఈ నాలుగు వర్గాలనూ చేరదీసి వారి సహకారంతో గెలుపుని సాధించడమే మాధవరావ్‌గారి లక్ష్యంగా సాగింది. ఈ ప్రయోగం మాధవరావ్‌ను నేరుగా ముఖ్యమంత్రి కుర్చీ వద్దకు తీసుకువెళ్లింది. కానీ పటేళ్లను శాశ్వతంగా అధికారానికి దూరం చేసింది. సర్దార్‌ వల్లభాయ్ పటేల్ కాలం నుంచీ కాంగ్రెస్‌కు అండగా నిలబడిన పటేల్ వర్గం పార్టీలవారీగా చీలిపోయింది. ఇటు వ్యాపారాలు సరిగా లేక, అటు వ్యవసాయం లాభసాటి కాక, రాజకీయాలలోనూ ఇమడలేక... పటేళ్లలో అంతకంతకూ పెరుగుతున్న ఆందోళనకు హార్ధిక్‌ పటేల్‌ గొంతుకలా నిలిచాడు. రాష్ట్ర జనాభాలో 15 శాతం ఉన్న తమని పట్టించుకోకపోతే ఊరుకునేది లేదంటూ హెచ్చరికలు మొదలుపెట్టాడు. మరి ఆ హెచ్చరికలు ఎంత దూరం వెళ్తాయో, వాటి పరిణామాలు ఎలా ఉంటాయో రాబోయే రోజులలో చూడాల్సిందే!

జాట్‌ ఉద్యమం... ఎందుకు!

  పచ్చగా ఉండే హర్యానా రాష్ట్రం ఇప్పుడు రావణ కాష్టంలా రగులుతోంది. తమకోసం రిజర్వేషన్లను కేటాయిస్తారా లేదా అంటూ జాట్ వర్గం మొదలుపెట్టిన ఆందోళన నిజంగానే ఆందోళనకరంగా మారింది. సాక్షాత్తూ రాష్ట్రమంత్రి ఇంటినే తగులబెట్టే స్థాయికి ఉద్యమం చేరుకుంది. ఎన్నికల కోసమో, తాత్కాలికంగా వివిధ వర్గాలను శాంతింపచేయడానికో రిజర్వేషన్లను ఇష్టానుసారంగా ఇచ్చిపడేస్తే ఏం జరుగుతుందో హర్యానాని చూస్తే తెలిసిపోతుంది.   ఉత్తరాదిన అధికసంఖ్యలో కనిపించే జాట్‌ వర్గంవారు ఎక్కువగా పొలంపనుల మీద ఆధారపడే ప్రజలు. దైర్యసాహసాలలో కూడా వీరికి సాటిలేకపోవడంతో, తరచూ వీరిని క్షత్రియులతో సమానంగా భావించడం జరుగుతుంది. జాట్‌లు హర్యానాలో అధికంగా కనిపిస్తారు. ఈ రాష్ట్రంలో వీరి జనాభా దాదాపు 30 శాతం వరకూ ఉంటుంది. 1991లో రిజర్వేషన్లకు సంబంధించి మండల్ కమీషన్‌ చిచ్చు రగులుకోవడంతో తమను కూడా వెనుకబడిన వర్గాలలోకి చేర్చి, రిజర్వేషన్లను కల్పించమంటూ వీరి ఆందోళన మొదలైంది. తమను ‘OBC’ కోటాలో చేర్చమంటూ వీరు చేసుకున్న విజ్ఞప్తులన్నింటినీ సంబంధిత కమీషన్లు కొట్టపారేశాయి. సామాజికంగా పరిశీలిస్తే జాట్ వర్గంవారు వెనుకబడినట్లు కనిపించడం లేదన్నది సదరు కమీషన్ల వాదన.   కాంగ్రెస్‌కు చెందిన ముఖ్యనేత ‘భూపిందర్‌ సింగ్‌ హుడా’కు జాట్‌ ఆందోళన తనకి కలిసివచ్చేదిలా తోచింది. రాష్ట్ర జనాభాలో 30 శాతం ఉన్న వారి మనసులని చూరగొంటే ముఖ్యమంత్రి కావడం సులువు అని ఆయనకు అనిపిచింది. ‘మేం కనుక అధికారంలోకి వస్తే మీకు రిజర్వేషన్లను కల్పించి తీరతామంటూ’ ఆయన 2005 ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు చేశారు. అలా జాట్ల మద్దతుతో 2005లో హుడా హర్యానాకి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అదే వాగ్దానాన్ని పొడిగిస్తూ ఆయన 2009లో కూడా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. కానీ ఈసారి జాట్‌ వర్గీయులు ఊరుకోలేదు. 2010 నుంచి తమ ఆందోళనలను ఉధృతం చేస్తూ ఎలాగైనా సరే తమకు రిజర్వేషన్లకి కల్పించమంటూ ప్రభుత్వాన్ని నిలదీయడం మొదలుపెట్టారు. దాంతో హుడా వారికి ‘ప్రత్యేకంగా’ వెనుకబడిన వర్గం అంటూ ఓ పది శాతం రిజర్వేషన్లను కల్పించారు. ఆ తరువాత వారిని ‘OBC’లలో చేర్చేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు.   జాట్ వర్గంవారి ఉద్యమాన్ని శాంతింపచేసేందుకు హడావుడిగా తీసుకున్న ఈ నిర్ణయాలు రెండూ కూడా న్యాయస్థానాల ముందర తేలిపోయాయి. జాట్‌లు నిజంగా వెనుకబడిన తరగతులుగా తమకు తోచడం లేదంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేస్తే, వారికి రిజర్వేషన్లను కల్పించడం ద్వారా 50% పరిమితి దాటిపోయిందంటూ హర్యానా న్యాయస్థానం మండిపడింది. దాంతో ఉద్యమం మళ్లీ మొదటికి వచ్చింది. అందుకనే ఈసారి ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కింద మీకు ఎంతోకొంత రిజర్వేషన్లను కల్పిస్తామంటూ హర్యానా ప్రభుత్వం ప్రకటించినా... తమను ‘మిగతా వెనుకబడిన కులాలు(OBC)’ జాబితాలో చేర్చేవరకూ ఊరుకునేది లేదంటూ జాట్‌ పెద్దలు చెబుతున్నారు. ఇందుకోసం కొనసాగుతున్న ఉద్యమంలో కనీవినీ ఎరుగని విధంగా విధ్వంసం జరుగుతోంది. ఆందోళనకారులు, లేదా వారి ముసుగులో ఉన్న సంఘవిద్రోహశక్తులు కనిపించిన ప్రతి భవంతికీ నిప్పు పెడుతున్నారు. రోడ్లన్నీ స్మశానాలను తలపిస్తున్నాయి. వందలాది రైళ్లు ఆగిపోయాయి. రవాణా అంతా స్తంభించిపోయింది. పసిపిల్లలకు పాలు సైతం దొరకని పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఆందోళనకారులు ఏకంగా ఒక రైల్వేస్టేషన్నే తగలబెట్టిన వార్తలు వచ్చాయి. హర్యానాలో పరిస్థితిని చక్కదిద్దేందుకు హెలీకాఫ్టర్ల సాయంతో సైన్యం అక్కడికి చేరుకుంటోందంటే... పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది.   ఒక వర్గం ఓట్లను కూడగట్టుకునేందుకు ముందూవెనుకా ఆలోచించకుండా ఏవేవో హామీలను గుప్పించడం; అధికారంలోకి వచ్చిన తరువాత నిర్దిష్ట ప్రణాళిక లేకుండా కంటితుడుపు చర్యలను చేపట్టడం; ప్రతిపక్షంలో ఉన్నవారేమో ఇదే అదనుగా సంబంధిత వర్గాలను రెచ్చగొట్టడం... ఇదంతా రాజకీయ చదరంగంలో ఓ అలవాటైన ఆటగా మారిపోయింది. కానీ ఇందులో పావులుగా మిగిలిపోతుంది మాత్రం సామన్య జనమే!

ఎంతమాటా! ఎంతమాటా!

- ‘ఆత్మహత్యలు చేసుకోవడం రైతులకి ఓ ఫ్యాషన్ అయిపోయింది. వారికి నష్టపరిహారాలు చెల్లించేందుకు ప్రభుత్వాలు పోటీపడుతున్నాయి’ రైతుల ఆత్మహత్యల గురించి గోపాల్‌ అనే పార్లమెంటు సభ్యుని వ్యాఖ్య. - ‘నక్క ఎంత రంగుని పులుముకున్నా, దాని స్వభావాన్ని మార్చుకోలేదు. మిగతా నక్కలు ఊళలు వేసినప్పుడు, అది కూడా ఊళ వేసి తీరుతుంది’ఒక న్యాయమూర్తి మీద కేరళ రాష్ట్ర మంత్రి జోసెఫ్‌ అక్కసు. - ‘రాహుల్‌గాంధి ఓ దేశద్రోహి. అలాంటివాడిని ఉరితీయాలి. కాల్చిపారేయాలి’ ఒక రాజస్థాన్‌ శాసనసభ్యుని ఉవాచ. యాదృచ్ఛికమో మరోటో కానీ ఈ మూడు వ్యాఖ్యలూ ఒకేరోజు వార్తల్లో నిలిచాయి. గౌరవనీయులైన మన రాజకీయ నాయకులు ఎంత తిన్నగా ఆలోచిస్తున్నారో, మరెంత హుందాగా ప్రతిస్పందిస్తున్నారో ఈ వ్యాఖ్యలే చెబుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో కనీవినీ ఎరుగని కరువు రాజ్యమేలుతోంది. అధికారిక లెక్కల ప్రకారం చూసుకున్నా రోజుకి ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వరుసగా మూడో సంవత్సరం అక్కడ పంటలు ఎండిపోయాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి కాస్త దూరంలోనే ఇదంతా జరుగుతోంది. అయినా ప్రభుత్వం కిమ్మనకుండా ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ న్యాయస్థానమే రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తోంది. ఇలాంటి సందర్భంలో ఒక బాధ్యతాయుతమైన పార్లమెంటు సభ్యుడు అన్నమాటలని మనం తొలి పంక్తిలోనే చూశాం. మనిషన్నాక మాట ఆవేశం సహజం. ఆ ఆవేశంలో మాట తూలడమూ సహజమే! కాకపోతే ప్రజాజీవితంలో ఉండే నాయకులు కాస్త సంయమనం పాటిస్తారనీ, వివపరీత వ్యాఖ్యల జోలికి పోరనీ ఆశించడం తప్పేమీ కాదు. ఒకప్పుడు ప్రతిపక్షాలు ఒకరిమీద వేరొకరు ఎలాంటి ఆరోపణలు చేసుకున్నా అవి సైద్ధాంతింకంగా ఉండేవి. రాన్రానూ అవి వ్యక్తిగత స్థాయిలోకి దిగజారిపోయాయి. ఇక చంపుతాను, నరుకుతాను అని హెచ్చరించుకోవడం తాజా పరిణామంగా భావించాలేమో! మీడియా కూడా దీన్ని ఒక సంచలన ప్రకటనగానే భావించడం, ప్రజలు కూడా చూసీచూడనట్లు ఊరుకోవడం కూడా ఇలాంటి వ్యాఖ్యలకు ఊతమిస్తోంది. ఒకవేళ ఖర్మకాలి ఎవరన్నా ‘మీ మాట తప్పు. దానికి క్షమాపణ చెప్పండి’ అంటే సంజాయిషీ ఇవ్వడానికి కూడా నిరాకరించే బరితెగింపు నేటి నేతలలో కనిపిస్తోంది. ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని, వారివారి పార్టీలు కూడా వెనకేసుకు రావడం మరో ఘోర పరిణామం. విశాఖ ఎమ్మల్యే గిడ్డి ఈశ్వరి ‘చంద్రబాబు తల నరుకుతాను’ అని వదరడం, ఆంధ్రప్రదేశ శాసనసభలో రోజా సాటి మహిల గురించి అసభ్యంగా మాట్లాడటం... వాటికి వారివారి పార్టీ పెద్దలు మద్దతు పలకడం చూస్తుంటే ఇదెంత నిజమో అర్థమవుతుంది. ఈ ధోరణి కేవలం మన రాష్ట్రానికో, దేశానికో పరిమితం కాదు. అమెరికాకి భావి అధ్యక్షునిగా భావింపబడుతున్న డొనాల్డ్ ట్రంప్‌ మహాశయుల మాటలని ఓసారి వింటే, పెద్దన్నగారి వాక్చాతుర్యానికి ముక్కునవేలేసుకోక తప్పదు. ‘చైనా ఓ దొంగ; నేరస్తులని హింసించడంలో తప్పులేదు; అమెరికాలో మసీదులని మూసిపారేయాలి; మెక్సికోకీ, అమెరికాకి మధ్య గోడలు కట్టేయాలి....’ ఇలా సాగుతుంటాయి ఆయన ప్రసంగాలు. సమాజం ఒక్కో అడుగూ ముందుకు వేస్తున్న కొద్దీ సాటి మనిషి పట్ట సహృద్భావం, సమాజం పట్ల బాధ్యతా మరింతగా పెరగాలి. కానీ ప్రస్తుత పరిస్థితులన్నీ దానికి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. మనిషిలో వ్యక్తిగత స్వార్థం, అసహనం పెరిగిపోతున్నాయి. సంస్కారపు విలువలు దిగజారిపోతున్నాయి. మరి మన రాజకీయ నేతలు కూడా వీటికి అతీతం కాదని సరిపుచ్చుకోవాలేమో!

అసలైన నిందితుడు జారుకుంటున్నాడా!

జేఎన్‌యూలో గత వారం జరిగిన సంఘటన గురించి దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నప్పుడు ఉమర్ ఖాలిద్ అనే వ్యక్తి విద్యార్థుల తరఫున మాట్లాడేందుకు పలు టీవీ ఛానళ్ల ముందుకు వచ్చాడు. అమాయకంగా నవ్వుతూ కనిపించే ఉమర్‌ ఖాలిద్ ఎవరో సాధారణమైన విద్యార్థి నాయకుడు అయిఉంటాడనీ ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఉమర్‌ గురించి ఒక్కొక్కటిగా వెలికివస్తున్న నిజం, అతని నైజం ఎంత ప్రమాదకరమైనదో తెలియచేస్తోంది. ఉమర్‌ నాయకత్వం వహిస్తున్న DSU అనే విద్యార్థి సంఘం ఆది నుంచి వివాదాలకు నెలవుగా ఉండింది. 2010లో దంతెవాడలో 70కి పైగా సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను మావోయిస్టులు తుదముట్టించినప్పుడు, DSF విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కశ్మీర్‌ వేర్పాటవాదులను క్యాంపస్‌కు పిలిపించి సకల మర్యాదలు చేయడం, ఆవుమాంసం కోసం క్యాంపస్‌ మెస్‌లో గొడవపడటం, హిందూ దేవతల నగ్న రూపాలను క్యాంపస్‌ గోడల మీద అతికించడం.... ఇలాంటి వివాదాస్పద కార్యకలాపాలకు DSU పెట్టింది పేరు.   నిజానికి ఫిబ్రవరి 9వ తేదీన జేఎన్‌యూలో జరిగిని వివాదాస్పద కార్యక్రమానికి ముఖ్య కర్త కూడా ఉమర్‌ ఖాలిదే అని తెలుస్తోంది. ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామంటూ అనుమతిని తీసుకుని అందులో అఫ్జల్ గురుని కీర్తించడం మొదలుపెట్టారు DSU కార్యకర్తలు. ఈ సమయంలో అక్కడే ఉన్న AISF నాయకుడు కన్నయా కుమార్‌మీదే నింద అంతా పడింది. పోలీసులు సరిగా విచారణ చేయకుండానే కన్నయాను అరెస్టుచేసి పారేశారు. కన్నయా కుమార్‌ వామపక్షాలకు అనుబంధంగా ఉన్న సంఘానికి నాయకుడు కావడంతో, వామపక్షాలన్నీ ఒక్కసారిగా ప్రభుత్వం మీద విరుచుకుపడ్డాయి. ఉమర్‌ మాత్రం తనదైన శైలిలో నవ్వుకుంటూ జారిపోయాడు. నిజానికి ఇలాంటి సమావేశాలను దేశవ్యాప్తంగా నిర్వహించాలని ఉమర్‌ భావించినట్లు సమాచారం. ఉమర్‌ వంటి ఆలోచనా ధోరణి ఉన్న మరి కొందరు తరచూ జేఎన్‌యూలోకి ప్రవేశించేవారనీ, వీరంతా కలిసి విద్యార్థులలో భారతదేశం మీద ద్వేషం కలిగేలా బ్రెయిన్‌వాష్‌ చేసేవారనీ తెలుస్తోంది.   జేఎన్‌యూలో తీవ్రవాదులకు అనుకూలంగా సమావేశం జరిగినప్పుడు పోలీసులు తొందరపాటుగా వ్యవహరించడం వెనక్కి తీసుకోలేని తప్పుగా మిగిలిపోనుంది. ఎందుకంటే కన్నయాకుమార్‌ను పొరపాటున అరెస్టు చేశాం అని ఒప్పుకోవడానికి పోలీసులు నామోషీ పడుతున్నారు. అందుకోసం కన్నయాకుమార్‌ నిందితుడు అని రుజువు చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నకొద్దీ, విద్యార్థి నాయకుల పట్ల ప్రజల సానుభూతి పెరిగిపోతూ ఉంటుంది. దీనికి తోడు రాజకీయపక్షాలన్నీ కూడా ఈ వివాదం నుంచి తమదైన శైలిలో లాభాన్ని పొందాలని చూడటంతో ఉమర్ ఖాలిద్‌ మీద చెయ్యి వేయలేని పరిస్థితి వచ్చేసింది.   ముందుముందు ప్రభుత్వం ఉమర్ మీద ఎలాంటి ఆరోపణ చేసిన విద్యార్థులు దాన్ని నమ్మే స్థితిని ఇప్పటికే దాటిపోయారు. సోషల్‌ మీడియాలో ఉమర్‌కు పెరిగిపోతున్న ఆదరణే ఇందుకు సాక్ష్యం. ‘నీకు తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని రక్షణవర్గాలు చెబుతున్నాయి. నీ మీద ఇలాంటి ఎన్ని ఆరోపణలు వచ్చినా మేం నమ్మం.’ అంటూ ఉమర్ ఖాలిద్‌ పేర ఉత్తరాలు వెలుస్తున్నాయి. ప్రభుత్వం ఇకనైనా మేల్కొని జేఎన్‌యూలో చెలరేగిన వివాదానికి కారణం ఎవరో ప్రజలకి తెలియచేసి, తదనుగుణమైన చర్యలు తీసుకోవలసి ఉంది.

124A- ఓ వివాదాస్పద చట్టం

ఈ వ్యవహారం ఈనాటిది కాదు. దేశద్రోహం పేరుతో ఎవరినైనా జీవితకాలం పాటు జైలులో ఉంచగల 124A ఎప్పుడో బ్రిటిష్ పాలన నాటిది. దేశ స్వాతంత్ర్య సంగ్రామం ఉధృతంగా జరుగుతున్న రోజులలో ఈ చట్టం కిందనే బాలగంగాధర్‌ తిలక్‌ ఏళ్లతరబడి జైలు శిక్షను అనుభవించారు. మహాత్మా గాంధి, భగత్‌సింగ్ వంటి పోరాట యోధులనూ ఈ చట్టం కిందనే ఆనాటి బ్రిటిష్‌ ప్రభుత్వం హింసించింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆ చట్టాన్ని కొనసాగించకూడదంటూ ఎందరో పెద్దలు సూచించినప్పటికీ, ఇంకా అది కొనసాగుతూనే ఉంది. ఇంతకీ ఏమిటీ 124A? ఎందుకని అది అంతగా వివాదాస్పదం?   124A ప్రకారం ఎవరైనా మాటల ద్వారాగానీ, చేతల ద్వారాగానీ, ప్రదర్శనల ద్వారాగానీ... మరే విధంగానైనాగానీ రాజ్యాంగం ప్రకారం ఎన్నుకోబడిన భారతదేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ద్వేషాన్నీ, ధిక్కారాన్నీ, అవిశ్వాసాన్నీ పెంపొందించేందుకు ప్రయత్నిస్తే అలాంటి చర్యలను రాజద్రోహంగా పరిగణించవచ్చు. సదరు వ్యక్తికి జీవితఖైదు కానీ, మూడుసంవత్సరాల పాటు కారాగారవాసాన్ని కానీ శిక్షగా విధించవచ్చు. న్యాయస్థానం అవసరం అనుకుంటే ఈ శిక్షకు అదనంగా జరిమానాను కూడా విధించవచ్చు. అయితే మూడేళ్ల వరకూ లేకపోతే జీవితకాల ఖైదు అన్న నిబంధన కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ చట్టం కింద జీవితకాల ఖైదుకి బదులుగా, ఏడేళ్ల వరకు మాత్రమే గరిష్ట కారాగార శిక్షను విధిస్తే బాగుంటుందని గతంలో వచ్చిన సలహాలను కూడా ప్రభుత్వం ఇంతవరకూ పట్టించుకోలేదు.      ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. అందుకనే న్యాయస్థానాలు కూడా ఈ చట్టం కింద తమ ముందుకి వచ్చిన కేసులను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాయి. ఎవరో ఒకరిద్దరు పనికిమాలిన నినాదాలు చేసినంత మాత్రాన వారిని దేశద్రోహం కింద అరెస్టు చేసి కఠినంగా దండించాల్సిన అవసరం లేదని, వారి వల్ల ప్రభుత్వానికి ముప్పేమీ లేదనీ కోర్టు స్పష్టం చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే అరుంధతీరాయ్‌ వంటి ప్రముఖుల మీద సైతం ఈ చట్టం కింద కేసులు దాఖలు అయినప్పటికీ, కోర్టు వారిపట్ల అంత కఠినంగా వ్యవహరించలేదు.     ప్రస్తుతం జేఎన్‌యూలో జరిగిన గొడవ సందర్భంగా 124A మళ్లీ వార్తలలోకి వచ్చింది. ఈ కేసులో తీవ్రవాది అఫ్జల్ గురుని ప్రస్తుతిస్తూ ఒక సమావేశం ఏర్పాటు అయ్యిందనీ, అందులో భారత వ్యతిరేక నినాదాలు చెలరేగాయన్నది అభియోగం. ఇందుకు బాధ్యుడిగా అక్కడి విద్యార్థి నాయకుడైన కన్నయా కుమార్‌ను అరెస్టు చేసి ఆయన మీద 124Aని మోపారు. జరిగిన దానికి కన్నయా కుమార్‌ ఎంతవరకూ బాధ్యుడన్న విషయాన్ని పూర్తిగా విచారించకుండానే ఆయన మీద ఇంత తీవ్రమైన చట్టాన్ని ప్రయోగించడంతో ఇప్పటి దాకా జేఎన్‌యూ వైపు వస్తున్న విమర్శలు కాస్తా ఇప్పడు ప్రభుత్వం మీదకి మళ్లుతున్నాయి. కన్నయా కుమార్ ఒక్కసారిగా సానుభూతికి కేంద్రంగా మారిపోయాడు.     ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానం ముంగిట్లో ఉండటం వల్ల దీని మీద కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే! కానీ ఈ సందర్భంగా 124Aని ఎలాంటి ఖచ్చితమైన పరిస్థితులలో అమలుచేయాలి, దానిని అమలు చేసే ముందు ఎలాంటి ప్రాథమిక విచారణ జరగాలి అన్నదాని మీద పోలీసు యంత్రాంగం మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం కనిపిస్తోంది. లేకపోతే ప్రభుత్వ వ్యూహం కాస్తా బెడిసికొట్టి పాలకవర్గానికే చెడ్డపేరు వచ్చే ప్రమాదం లేకపోలేదు. అప్పడు ప్రజల్లో నిజంగానే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది!

ఖేడ్‌లో ఖేల్‌ ఖతం!

    ఖేడ్‌ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. 53 వేల భారీ మెజారటీతో తెరాస అభ్యర్థి ఎం.భూపాల్ రెడ్డి ఖేడ్‌ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో సిట్టింగ్‌ స్థానాన్ని సైతం దక్కించుకోలేని పరిస్థితులలో తెలంగాణ ప్రతిపక్షాలు ఉన్నాయన్న విషయం తెలిసివస్తోంది. అధికార పక్షాన్ని కాదని తెలంగాణ వాసులు రిస్క్‌ తీసుకునేందుకు సిద్ధంగా లేరన్న సందర్భమూ స్పష్టమవుతోంది. తెలంగాణలో ప్రస్తుతం తెరాసకి తిరుగులేదన్న విషయం మొన్నటి గ్రేటర్‌ ఎన్నికలలోనే తేలిపోయింది. అలాంటి సందర్భంలో ఖేడ్ ఉప ఎన్నికల విషయంలో కాంగ్రెస్ మరింత పోరాడి ఉంటే బాగుండేదన్నది సర్వత్రా వినిపిస్తున్న అభిప్రాయం. తమ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతితో ఏర్పడిన ఖాళీతో జరుగుతున్న ఉప ఎన్నికలలో ఆది నుంచీ కాంగ్రెస్‌ వెనుకంజలోనే ఉండిపోయింది.   కిష్టారెడ్డి వర్గానికి స్థానికంగా మంచి పట్టే ఉంది. పంచాయితీ స్థాయి నుంచి ప్రజాపద్దుల సంఘం చైర్మన్‌ వరకూ ఆయన యాత్ర అప్రతిహతంగా సాగింది. ఇదే నారాయణఖేడ్‌ నియోజకవర్గం నుంచీ ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాంటి కిష్టారెడ్డి మరణం తరువాత ఆయన వారసునిగా సంజీవరెడ్డిని తమ అభ్యర్థగా నిలిపింది కాంగ్రెస్. అంతటితో తమ బాధ్యత ముగిసిపోయినట్లు కాంగ్రెస్ నేతలు భావించినట్లు కనిపిస్తోంది. సానుభూతి పవనాలతో ప్రజలే కావల్సినంత మెజారటీని అందిస్తారన్న ఆశతో మిన్నకుండిపోయారు.       సరిగ్గా ఇలాంటి పరిస్థితే తెరాసకు కలిసివచ్చింది. ఏకగ్రీవంగా ఎన్నిక జరిగే ఇలాంటి సందర్భాలలో సైతం తన అభ్యర్థిని నిలిపి విస్తరణ కాంక్షను చాటుకుంది. తెరాస ముఖ్య నేత హరీశ్‌ రావు ఖేడ్ ఉప ఎన్నికల బాధ్యతను అందిపుచ్చుకున్నారు. గ్రేటర్ ఎన్నికలలో కేటీఆర్‌ వెలిగిపోవడంతో తన ప్రాముఖ్యతను కూడా నిరూపించుకోవాల్సిన అవసరం హరీశ్‌కు ఏర్పడింది. ఒక పక్క ఖేడ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహిస్తూనే ఇటు తెదెపా వంటి నాయకులు తెరాసలో చేరేందుకు హరీశ్‌ తగిన యుక్తులన్నీ పన్నారు. మరోవైపు కాంగ్రెస్‌, తెదెపా నాయకులు మాత్రం గ్రేటర్‌ ఎన్నికల గురించి వాదవివాదాలలో మునిగిపోయారు. ఫలితం! ప్రతిపక్షాలకి మరో సీటు తగ్గింది. ఆ సీటు తెరాస ఖాతాలోకి చేరింది.   దీంతో తమ పరాజయాల పరంపర ముగిసిపోయినట్లే అని కాంగ్రెస్‌ ఊపిరి పీల్చుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే... ఇప్పటిదాకా తెదెపా నుంచి వలస కార్యక్రమం ఇప్పుడు కాంగ్రెస్‌ని తాకుతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు దిల్లీలో కానీ, ఇటు తెలంగాణలో కానీ కాంగ్రెస్‌కు సరైన నాయకత్వం కానీ... ఆ నాయకత్వాన్ని బలపరిచే క్యాడర్‌ కానీ లోపించడంతో ఇప్పడు కాంగ్రెస్ నుంచి కొందరు ఎమ్మెల్యేల చూపు తెరాస వైపు నిలుస్తోంది. దీనికి తోడు నిలదొక్కుకుని నిలబడాల్సిన ప్రతి పరిస్థితిలోనూ మరోసారి ఓడిపోవడంతో తమ భవిష్యత్తు గురించి కాంగ్రెస్‌ నేతలలో ఆందోళన మొదలైంది. కీలక నేతలు సైతం పార్టీ బాధ్యతల నుంచి నిదానంగా తప్పుకుంటున్నారు. తెలంగాణను విభజించిన తరువాత అటు ఆంధ్రప్రదేశ్‌లో ఎలాగూ కాంగ్రెస్‌ కోట బీటలు వారిపోయింది. మరి తెలంగాణలో ఏం జరగబోతోంది. తెరాస ధాటికి కాంగ్రెస్ గడీ నిలుస్తుందా!  

JNU- పరిస్థితి చేయి దాటిపోతోందా!

  దేశ రాజధానిలోని జవహర్‌లాల్‌ విశ్వవిద్యాలయం రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతోందే కానీ, సమస్య సామరస్యంగా ముగిసే పరిస్థితి కనిపించడం లేదు. దేశంలోని పార్టీలు, మేధావులు అంతా రెండుగా చీలిపోయి వివాదానికి ఏదో ఒక వైపున నిల్చొన్న వైరభావం కనిపిస్తోంది. సహనంతో మెలగాల్సిన వారు, పెద్దమనుషులుగా బుద్ధి చెప్పాల్సినవారూ... తాము కూడా తలా ఓ రాయి తీసుకుని బయల్దేరుతున్నారు. ఈ వివాదంలో చివరికి నష్టపోయేది ఎవరో చెప్పనవసరం లేదు. దేశవ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే సహించాల్సిన పని లేదంటూనే రాహుల్ గాంధి హుటాహుటిన విశ్వవిద్యాలయానికి వెళ్లిన తీరు ఆశ్చర్యం కలిగించక మానదు. స్వాతంత్ర్యంనాటి నుంచీ కూడా రాజకీయంలో ఎంతటి శత్రుపక్షాలైనా ఒకప్పుడు సున్నితమైన సందర్భాలలో ఆచితూచి స్పందించేవి. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు కూడా చర్చ వినదగ్గదిగా ఉండేది. కానీ... భావోద్వేగాలతో కూడుకున్న వివాదాలలో రాహుల్‌ గాంధి ప్రవర్తిస్తున్న తీరు కాంగ్రెస్‌ పండితులను సైతం ఆశ్చర్యం కలిగించక మానదు.     రాహుల్‌ గాంధికి పరిణతి లేదనీ, తనదైన అభిప్రాయాలు ఉండవనీ వచ్చే విమర్శలను తిప్పికొట్టేందుకు ఆయన కావాలని ఇలాంటి వివాదాలలో స్వయంగా పాల్గొంటున్నట్లు తోస్తోంది. లేదా బీజేపీని వ్యతిరేకించే శక్తులన్నింటినీ కాంగ్రెస్ వైపు మళ్లించేందుకన్నా ఆయన ప్రయత్నాలు సాగుతూ ఉండవచ్చు. కారణం ఏదైనా రాహుల్ ఒక కొత్త పంథాకు దారితీశారనే చెప్పవచ్చు. దీని వల్ల మున్ముందు నిజంగానే కాంగ్రెస్‌ లాభపడినా ఆశ్చర్యపడనవసరం లేదు. జేఎన్‌యూ వివాదంలోకి చేరేందుకు వామపక్షాలు కూడా ఉత్సాహపడుతున్నాయి. సీతారాం ఏచూరి, సురవరం, డి.రాజా... హుటాహుటిన రాజధానికి చేరుకుని విద్యార్థి సంఘాలకు తమ నైతిక మద్దతుని అందించారు. విద్యార్థుల గొంతు నొక్కేస్తున్నారంటూ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు.   విచిత్రం ఏమిటంటే ఎవరూ జరిగినదాని గురించి నిజానిజాలు వెలికితీసేంతవరకూ వేచి చూసేందుకు సిద్ధంగా లేరు. చట్టం తన పని తాను చేసుకుపోయేలోపే, బరిలోకి దిగి బాహాబాహీ తలపడేందుకే మొగ్గుచూపుతున్నారు. జేఎన్‌యూలో అసలు ఏం జరిగింది? పాకిస్తాన్‌కు అనుకూలమైన నినాదాలు చేశారా లేరా? తీవ్రవాదులను శ్లాఘిస్తూ సభని నిర్వహించారా లేదా? ఈ మొత్తం సంఘటనలో ఎవరి బాధ్యత ఎంత?... వంటి ప్రశ్నలను ఎవరూ పట్టించుకుంటున్నట్లు లేదు.   మరోవైపు కొందరు బీజేపీ నేతలు కూడా ఓరిమిలేకుండా వివాదాన్ని రగులుస్తున్నారు. సాక్షాత్తూ హోం మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పూర్వాపరాలను ఆలోచించకుండా, జేఎన్‌యూ వెనుక ‘హఫీజ్‌ సయీద్’ అనే అంతర్జాతీయ తీవ్రవాది హస్తం ఉందని ప్రకటించడాన్ని ఎలా జీర్ణించుకోగలం! తరువాత అదేదో తప్పుడు వార్త అంటూ తన నాలుకను కరుచుకోవడంతో ఇప్పడు విమర్శలకు మరింత బలాన్ని అందించినట్లైంది. నిజంగానే ఇప్పుడు హఫీజ్‌ సయీద్ ఈ ఘటన గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇక బీజేపీ అనుకూల సంస్థలైన ABVP, RSSలు కూడా ఆనాటి విద్యార్థుల గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో ఇది ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న యుద్ధంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ వివాదం న్యాయస్థానాలకు చేరుకుంది కాబట్టి, కనీసం మన న్యాయవ్యవస్థ అయినా ఈ సమస్యను పరిష్కరిస్తుందనీ, మున్ముందు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుందనీ ఆశిద్దాం!  

మేయర్‌గారికి లేఖ!

బొంతు రామ్మోహన్‌గారికి, మేయర్‌ పదవిని అందుకున్న ఈ సందర్భంలో ఈ సామాన్యుడి అభినందనలు అందుకోండి. నాలాంటి మరో 30 లక్షల మంది సామాన్యులు ఓటేసి నిర్ణయించిన గ్రేటర్‌ పీఠానికి, మీరు సారధిగా ఎన్నికవడం సంతోషకరమే! తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఆ సందర్భంగా చర్లపల్లి జైలుకి వెళ్లిన మీరు, ఇప్పడు అదే చర్లపల్లి వార్డు నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికకావడం గొప్ప విషయమే! కానీ రానున్న రోజులలో మేయర్‌గా మీరు సాధించే విజయాలే మా జీవితాలని ప్రభావితం చేయనున్నాయి. హైదరాబాద్ అంటే అంతో మినీ భారతదేశం అన్న ఊహ కలుగుతుంది. ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయని ఉద్యోగం కోసం వచ్చినవారు కొందరైతే, పనిదొరకకపోతుందా అని పొట్ట చేతపట్టుకుని వచ్చినవారు మరికొందరు. ఆర్భాటాలే కాదు... ఇక్కడ ఆకలి కేకలు కూడా వినిపిస్తాయి. విశాలమైన రోడ్లే కాదు... వాటి పక్కనే పడుకుని ఉండే పేదరికం కూడా కనిపిస్తుంది. దాదాపు కోటి మంది జనం నిత్యం సమస్యలతో, పోరాటాలతో అలసిపోయి మీ వంక ఆశగా చూస్తున్నారు. మీరు ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లు ఎవరికన్నా ఏదన్నా ఉచితంగా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. కానీ ఏమిచ్చినా ఇవ్వకున్నా మౌలిక సదుపాయాలను మాత్రం దయచేసి కల్పించండి. ఎందుకంటే ఇప్పడు హైదరాబాదులో చిన్నచిన్న సదుపాయాలు కూడా సామాన్యుడిని వెక్కిరించేంత దూరంలో ఉన్నాయి. ఎండాకాలం వస్తోందంటే చాలు, హైదరాబాదు గుండెలు ఎండిపోతాయి. అక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి, ఇక్కడ నుంచి నీళ్లు తెప్పిస్తున్నాం అన్న మాటలు వినిపిస్తాయే కానీ పంపుల్లోంచి గాలి తప్ప నీరు రాదు. నగరాన్ని నీటి ఎద్దడి నుంచి కాపాడేందుకు ఇప్పటివరకూ ఏ ప్రభుత్వమూ శాశ్వతమమైన చర్యలేవీ తీసుకున్నట్లు కనిపించదు. ఈ ఎండాకాలం ఎలాగొలా గడిపేస్తే ప్రజలు మర్చిపోతారు కదా అన్నది పాలకుల భావన కావచ్చు. మీరైనా ఈ నగరానికి గుక్కెడు నీళ్లు దక్కే భాగ్యం కల్పిస్తారని ఆశిస్తున్నాను. గొంతు తడుపుకునేందుకు మినరల్ వాటర్‌ తప్ప మరో దిక్కు లేని రోజులు పోవాలన్నది నగరప్రజల తరఫున నా కోరిక. ఎండలు తగ్గి మన రోడ్ల మీద నాలుగు చినుకులు పడగానే వేరే సమస్య మొదలు. అదేంటోగానీ వర్షం కురిసిన తరువాత మన హైదరాబాదు అచ్చు వెనిస్‌ నగరంలా ఉంటుంది. నీటి మధ్య ఇళ్లు కట్టుకున్నామన్న భావన కలుగుతుంది. కాకపోతే ఏది రోడ్డో, ఏది మురికి కాలువో అర్థం కాదు అంతే! దయచేసి ఈ అయోమయం నుంచి మమ్మల్ని తప్పించగలరు. రోడ్లంటే గుర్తుకువచ్చింది. ఒక దేశానికి రోడ్లే రక్తనాళాలు అంటారు. అదే నిజమైతే మన హైదరాబాద్‌‌లో రోడ్లకి చాలా జబ్బులే ఉన్నట్లు కనిపిస్తాయి. రోడ్ల నిండా గతుకులే గతుకులు! రోడ్ల పక్కన డ్రైనేజీలు కరువు. పోనీ ప్రయాణమన్నా వేగంగా ఉంటుందా అంటో ఒకో కిలోమీటరు, ఆటోమీటరు కంటే నిదానంగా కదులుతుంది. ట్రాఫిక్, డ్రైనేజ్‌, గతుకులు, కాలుష్యం... ఓహ్‌! హైదరాబాదు రోడ్ల మీద ప్రయాణం... జీవితకాలపు అనుభవంగా మిగిలిపోతుంది. మీ ఉచితాల సంగతి నాకు తెలియదు. మీ ఎన్నికల హామీల గురించీ నేను పదే పదే అడగను. కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తే సంతోషం, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చినా సంతోషమే... కానీ నాకు కావల్సిందల్లా నగరజీవనం సుఖంగా ఎలాంటి అడ్డంకీ లేకుండా సాగిపోవడమే! ఇంట్లో నిరంతర విద్యుత్తు, ఇంటి బయట మంచి రోడ్లు, ఇంటికీ రోడ్లకీ మధ్యన చక్కటి డ్రైనేజి... ఇవే నాకు కావాలి. కాలుష్యం లేని గాలి, కాల్పులు వినిపించని ఊరు, కావల్సినంత నీరు... ఇవే నాకు కావాలి. ఇట్లు, మీ క్షేమం, మా క్షేమం కోరుకునే... ఓ సామాన్యుడు.

కాపుని కరివేపాకు ...గా చూస్తున్నారు..

కాపు ఉద్యమం మరోసారి వార్తల లోకి వచ్చింది . తమ సామాజిక వర్గాన్ని బిసి లలో చేర్చాలని డిమాండ్ మొదలయ్యింది. ఇప్పుడు జస్టిస్ మంజునాథ్ కమిషన్ కోర్ట్ లో వుంది బంతి. అయితే అసలు కాపులను బిసి లలో చేర్చాలనే డిమాండ్ ఈనాటిది కాదు. 1. అందరికి తెలియని మరో విషయం ఒకప్పుడు వీరు బిసిలే. 1919 రిఫార్మ్స్ లో వారిని బిసిలుగా గుర్తించారు. అంబేద్కర్, కాకా కాలేకర్ కమిటి కూడా వారిని బిసిలుగా గుర్తించింది . 2. 1956 వరకు వారు బిసి లుగా వున్న కాపు సామాజిక వర్గం , అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మూలం గా బిసి ల నుంచి ఒసి  లగా మారిపోయారు. అప్పుడు ముఖ్య మంత్రి నీలం సంజీవ రెడ్డి . 3. 1961 లో మళ్ళి అప్పటి ముఖ్య మంత్రి దామోదరం సంజీవయ్య కాపులను బిసి లలో చేరుస్తూ GO 3250  జారిచేశారు . 4. 1966 లో తిరిగి కాపులకు బిసి గుర్తింపును రద్దు చేసారు . 5. అప్పటినుంచి కాపు సామాజిక వర్గం ఓసి లుగా పరిగణింప బడుతోంది . 6. అయితే కాపు సామాజిక వర్గం లోని మున్నూరు కాపు , తూర్పు కాపు వర్గాల వారు మాత్రం ఇప్పటికి బిసి లగానే చెలామణి అవుతున్నారు . కోస్తా ప్రాంతానికి చెందిన కాపు సామాజిక వర్గం మాత్రం ఓసి లుగా వున్నారు . 7. 1993 లో ముద్రగడ కాపులను బిసి లలో చేర్చాలంటూ నిరవదిక నిరాహార దీక్ష కు దిగినప్పుడు అప్పటి ముఖ్య మంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి,  కాపులను బిసి లలో చేరుస్తూ GO 30 ని  జారి చేసారు . 8. అయితే ఆ జివో ని ఇంప్లిమెంట్ చేయటానికి రెండు ఇబ్బందులు వున్నాయి . * ఒకటి ఆ జివో ..తెలగ, బలిజ, ఒంటరి ,కాపు సామాజిక వర్గాలు బిసి లలోని A, B, C, D కేటగిరి లలో ఎందులో చేర్చాలో స్పష్టం.రెండు * బిసి సంక్షేమ కమిటి న్యాయ స్తానాన్ని ఆశ్రయించటం తో ...ఆ జివో న్యాయ పరమైన చిక్కుల్లో ఇరుక్కుంది     ఎన్నో ఏళ్లుగా కాపు సామాజిక వర్గం తో కాంగ్రెస్స్ ముఖ్య మంత్రులు ఆడుకుంటున్నారు అన్నది సుస్పష్టం. కాపులను అవసరానికి బుజ్జగిస్తూ, ఆ తర్వాత కరివేపాకులా తీసిపారేస్తూ వున్నారు. చిత్త శుద్ది లేని జివో ను జారిచేయటం ద్వారా వారిని మరింత మోసం చేసారని చెప్పచ్చు. ఎందుకంటే ఏ విధంగా చూసినా ఒక్క జివో తో కాపులను బిసి లలో చేర్చటం సాద్యం కాదు .  అందుకు ఒక విధి విధానాలను మన రాజ్యాంగం స్పష్టం గా పేర్కొంది .    1. ఉమ్మిడి  ఆంధ్ర రాష్ట్రం లో 2004 నుంచి 2011 వరకు బిసి కమిషన్ అధికారిగా వున్న జస్టిస్ దాల్వ సుబ్రహ్మణ్యం గారి అభిప్రాయం లో పూర్తి స్తాయి సామాజిక , ఆర్దిక సర్వే ద్వారా  ఆ సామాజిక వర్గ  ఆర్దిక స్థితి గతుల విశ్లేషణ జరిగిన తర్వాత మాత్రమె వారికి ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలి అన్నది నిర్ణయించగలరు. 2. ఈ పద్దతిలోనే తమిళ నాడు ప్రభుత్వం 69 శాతం రిజర్వేషన్లు కల్పించింది . 3. ఒక సమగ్ర సర్వే తర్వాత మాత్రమే కాపు సామాజిక వర్గాన్ని బిసి లలో చేర్చవచ్చా లేదా అన్న నిర్ణయం , అలాగే చేర్చ వలసి వస్తే ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలి , అలాగే రిజర్వేషన్ పొందే అర్హతని   ఎంత మేరకు విస్తరించవచ్చు వంటి నిర్ణయాలు తీసుకోగలుగు తారు . 4. కాపు సామాజిక వర్గాన్ని బిసి లలో చేర్చే విషయమై ప్రస్తుత బిసి కమిషన్ జస్టిస్ మంజునాథ ఆద్వర్యం లో ఆ సామాజిక వర్గానికి సంబంధించి , ఒక సమగ్ర సామజిక , ఆర్దిక  సర్వే చేయాలి.  అది సమర్పించే గణాంకాలు రాజ్యంగా బద్దంగా నిర్ణయించబడ్డ విధానంలో వుండాలి.  ఆ తర్వాత మాత్రమె చంద్రబాబు అయినా, అతని ప్రభుత్వ మయినా ఆ తర్వాతి అడుగు వేయగలిగేది. అప్పుడు మాత్రమే మరోసారి మోసపోకుండా, రాజకీయపు ఆటలో అరటిపండులా మిగిలిపోకుండా కాపు సామాజిక వర్గం బిసిలుగా శాశ్వత గుర్తింపును పొందగలిగేది. చంద్రబాబు పదే, పదే చెబుతోంది అదే. కంటి తుడుపుగా ఏదో ఒక ప్రకటన చేయటం వలన కాపులకు న్యాయం జరగదు. రాజ్యాంగ బద్దంగా ఆ విధి, విధానాలను పాటిస్తూ వారికి న్యాయం జరిగేలా చూడాలి అని.   నిజానిజాలుని ప్రజలకి తెలియనీయకుండా, ఆవేశ పరిచే ప్రసంగాలు చేస్తూ, రెచ్చగొట్టే ప్రకటలను చేస్తూ ...కొంతమంది కేవలం ఈ అంశం ద్వారా అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టి , తమ రాజకీయ స్వలాభాలను పొందాలని చూస్తున్నారు తప్ప , నిజంగా ఆ సామాజిక వర్గానికి కొన్ని ఏళ్లుగా జరుగుతున్న అన్యాయానికి తెరపడి ఇప్పటికి అయినా వారు కోరుకున్నది దక్కేలా చూడాలన్న ఉద్దేశ్యం ఏ కోశానా కనబడటం లేదు అన్నది స్పష్టం అవుతోంది ఈ మద్య జరిగిన సంఘటనలని చూస్తుంటే

గోడ దూకేస్తున్న ప్రజాప్రతినిధులు..

ఓ నాలుగు పార్టీలు ఎన్నికలలో పాల్గొంటే వాటిలో తమకు నచ్చిన పార్టీకి, నచ్చిన అభ్యర్థికి ఓటేసి గెలిపించడం ప్రజల అభిమతం. ఓటర్లు కేవలం ఒక అభ్యర్థిని చూసి మాత్రమే కాదు, అతనికి అండగా ఉన్న పార్టీని చూసి కూడా ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటారు. మరి ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన అభ్యర్థి, ఎన్నికల తరువాత తన పార్టీని మార్చేస్తే... ముందుముందు ఎవరిని నమ్మాలి? ప్రతిపక్షంలో కూర్చునే ఓపిక లేకుండా అధికారపక్షంలోకి మారిపోతే, ప్రజల తరఫున పాలకులని నిలదీసేదెవ్వరు? బహుశా అందుకేనేమో ప్రజలు కూడా ఏకపక్షంగా మారిపోతున్నారు. ప్రతిపక్షాలు తమ తరఫున పోరాడేంత చిత్తశుద్ధితో లేవనీ... ఒకవేళ అధికార పక్షాన్ని కాదని మరీ మిగతా పార్టీలను గెలిపిస్తే, ఏళ్లు గడవకముందే వాళ్లు పార్టీ మారిపోతారనీ ప్రజలకి కూడా అర్థమైపోయినట్లుంది. మొన్నటికి మొన్న గ్రేటర్‌ ఎన్నికలలో ప్రజలు అందించిన తీర్పే దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి తెదెపా శాసనసభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి కూడా తెరాసలోకి చేరిపోవడం ఒక అనూహ్య పరిణామం. ఎర్రబెల్లి చేరికతో తెదెపాకి మొదట ఉన్న 15మంది శాసనసభ్యులలో, ప్రస్తుతం 6గురు మాత్రమే మిగిలినట్లయింది. తెలంగాణలో తెదెపా తరఫున బలమైన నేతగా ఉన్న ఎర్రబెల్లి, తెరాస కార్యకర్తగా మారిపోవడానికి కారణం ఏమై ఉంటుంది. గ్రేటర్ ఎన్నికలలో తనకు తగినంత ప్రాధాన్యత లభించలేదనీ, పార్టీ పట్ల ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారనీ ఎర్రబెల్లి చెబుతున్నారు. కానీ ఎర్రబెల్లి తెరాసలో చేరేందుకు గ్రేటర్‌ ఎన్నికలు కేవలం ఒక సాకుగా మాత్రమే కనిపిస్తోంది. తెరాసలో ఎప్పుడెప్పుడు చేరదామా అని ఎర్రబెల్లి ఉవ్విల్లూరుతున్న పరిస్థితి ఎప్పటినుంచో ఉంది. కొద్ది నెలల క్రితం సీఎం కేసీఆర్‌ను ఎర్రబెల్లి ఆర్ధరాత్రి పూట రహస్యంగా కలుసుకున్నప్పుడే ఎర్రబెల్లి మనసులో ఏముందో ప్రజలకు తెలిసిపోయింది. ఆ సంఘటన గురించి ఎర్రబెల్లి పొంతన లేని జవాబులు చెప్పినా, రానున్న రోజులలో ఏం జరగబోతోందో అందరికీ ఒక స్పష్టత వచ్చేసింది. తెరాసలో తనకు ఎలాంటి ప్రధాన్యత లభిస్తుంది? ఇప్పటికే తెరాసలో ఉన్న తన బద్ధ శత్రువులు కడియం శ్రీహరి, కొండా మురళిలతో కలిసి ఎలా పనిచేయాలి?... వంటి సందేహాలతో ఎర్రబెల్లి కొంత జాప్యం చేసి ఉండవచ్చు. కానీ ఎర్రబెల్లి సందేహాలను తీర్చేందుకు  తెరాస ముఖ్యనేత హరీష్‌రరావు స్వయంగా రంగంలోకి దిగడంతో... తెరాసలో ఆయన చేరిక ఖాయమైపోయింది. మరి ఈ వలస ఇక్కడితో ఆగుతుందా అన్నది అనుమానమే! 2014లో తెలంగాణ శాసనసభకు తొలి ఎన్నికలు జరిగినప్పడు తెరాస 63 స్థానాలను గెల్చుకుంది. మిగతా 50కి పైగా స్థానాలు ప్రతిపక్షాల చెంతనే ఉన్నాయి. కానీ రెండేళ్లు తిరిగేసరికి 17మంది ప్రతిపక్ష సభ్యులు తెరాస తీర్థం పుచ్చేసుకున్నారు. అంటే దాదాపు మూడోవంతు ప్రతిపక్షం ఇప్పడు బలహీనమైపోయింది. ఇలాంటి పరిస్థితులలో అధికార పక్షం ప్రవేశపెట్టే తీర్మానాలను అడ్డుకోవాలన్నా, ప్రజల తరఫున ఏదన్నా సమస్యను బలంగా లేవనెత్తాలన్నా... ప్రతిపక్షాలకి తగినంత బలం లేదన్నది పైన పేర్కొన్న అంకెలే చెబుతున్నాయి. శాసనసభ సంగతి అలా ఉంచితే తెలంగాణలో తెదెపా పార్టీ పరిస్థితి ఏంటన్నది మరో సమస్య! లోకేష్ తెలంగాణ వ్యవహారాలు చూస్తున్నంత మాత్రాన తెలంగాణలో తెదెపా పట్టు నిలుస్తుందన్న భ్రమలు మొన్నటి గ్రేటర్‌ ఎన్నికలతోనే చెదిరిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సమస్యలని చక్కబెట్టడంలోనే తలమునకలైపోతున్న చంద్రబాబు మరి తెలంగాణని ఏం చేయబోతున్నారు. తెదెపా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్టీ అన్న అపప్రధని ఎలా పోగొడతారు అన్నదే ఇప్పడు ఆయన ముందున్న సవాలు. తెదెపాకి తెలంగాణలో మిగిలిన శాసనసభ్యులలో ఆర్.కృష్ణయ్య ఇప్పటికే నిరసన గళమెత్తి ఉన్నారు. తెదెపా తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి నిలిచిన కృష్ణయ్య ఇప్పడు బి.సీ.లకి సంబంధించి జరుగుతున్న చర్చలో చంద్రబాబుకి వ్యతిరేకంగా కత్తులు దూస్తున్నారు. ఇక మిగిలిన అయిదుగురు ఎమ్మెల్యేలైనా తెదెపాకి కష్టకాలంలో అండగా నిలబడతారా? రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రతిపక్షాలుగా ప్రభుత్వానికి ఎదురొడ్డుతారా? అన్నది రానున్న కాలమే చెబుతుంది. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బలం కాదు గళం కావాలి అన్న నిజం ఇప్పటికైనా ప్రతిపక్షాలకి అర్థమైతే, ప్రజలకి న్యాయం చేకూర్చడంలో ప్రతిపక్షాలదే ముఖ్యపాత్ర అన్న నైజం పట్టుబడితే.... ప్రజల తీర్పుని గౌరవించే ప్రతినిధులు ఇంకా మిగిలి ఉంటారు. లేకపోతే ప్రజలు కూడా గ్రేటర్‌ ఎన్నికలలో ఇచ్చిన తీర్పునే పదే పదే వెలువరిస్తుంటారు.