కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడానికి యువరాజా వారు వచ్చేశారు

  సుమారు రెండు నెలలుగా అదృశ్యమయిపోయిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎట్టకేలకు తిరిగి వచ్చేరు. పార్టీని ఏవిధంగా ముందుకు నడిపించాలి? అందుకు ఎటువంటి విధానాలు అవలంభించాలి? వంటి ముఖ్యమయిన విషయాల గురించి ఆలోచించేందుకు ఆయన రెండు వారాలు ‘రాజకీయాలకు శలవు’ తీసుకొని వెళ్ళారని కాంగ్రెస్ అధిష్టానం చెప్పుకొంది. పార్టీ ఉపాధ్యక్షుడుగా రాహుల్ గాంధీ ఒకవేళ పార్టీ గురించి ఆలోచించదలిస్తే పార్టీలో ముఖ్య నేతలతో కలిసి కూర్చొని ఆలోచించాలి. కానీ ఆయన ఉరుగ్వే, మయన్మార్, తాయ్ ల్యాండ్ దేశాలలో ఒంటరిగా చక్కర్లు కొట్టి వచ్చేరు. దానితో ఇంతకాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు, ప్రతిపక్షాలకు ఆయన శలవు గురించి కాకమ్మ కధలు చెప్పిందని స్పష్టమయింది.   ఆయన డిల్లీకి తిరిగి రాక ముందే కాంగ్రెస్ నేతల మాటలలోనే అసలు విషయం బయటపడింది. పార్టీలో సీనియర్ల వైఖరి, వారు (తనను పక్కనబెట్టి) పార్టీని నడిపిస్తున్నతీరు చూసి అలిగి శలవు తీసుకొన్నారని కాంగ్రెస్ నేతలే పరోక్షంగా చెప్పుకొన్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఆయనకీ మధ్య కూడా అనేక విషయాలలో భేదాభిప్రాయాలు ఉన్నాయనే సంగతి వారే చెప్పుకొన్నారు. అయితే అది కేవలం తరాల అంతరం (జనరేషన్ గ్యాప్) మాత్రమేనని మళ్ళీ వారే కలరింగ్ ఇచ్చుకొన్నారు.   అదే విధంగా ఆయన శలవు మీద వెళ్లినప్పటి నుండి తిరిగి వచ్చేవరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ఆయన నాయకత్వ లక్షణాలు, సమర్ధత గురించే చర్చ జరగడం చూస్తే ఆ పార్టీకి ప్రధాన సమస్య రాహుల్ గాంధీయేనని వారు భావిస్తున్నట్లు అర్ధమవుతుంది. ఆ కారణంగానే కొందరు సోనియాగాంధీ గ్రూపుగా మరికొందరు రాహుల్ గాంధీ గ్రూపుగా తయారయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ముఠాలు కట్టడం కొత్తేమీ కాదు. కానీ ఏకంగా పార్టీని నడిపిస్తున్న ఆ తల్లి కొడుకులకే రెండు ముఠాలు తయారవడం విచిత్రం. ఇటువంటి విచిత్రం మరే పార్టీలో కనబడదు.   ఏమయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అత్యంత దయనీయ స్థితిలో ఉన్నప్పుడు ఆ పార్టీకి ఉపాధ్యక్షుడుగా ఉన్న రాహుల్ గాంధీ, తన పార్టీని ఏవిధంగా బ్రతికించుకోవాలా...అని ఆలోచించే బదులు, ఏవిధంగా పార్టీని తన అదుపులోకి తీసుకోవాలా...అని ఆలోచించడమే వింత. ఆయన తన నాయకత్వ లక్షణాలు, సమర్ధతను నిరూపించుకోగలిగి ఉండి ఉంటే ఆయన పార్టీ మీద పట్టు సాధించేందుకు ఈవిధంగా శలవు తీసుకోవలసిన అవసరం ఉండేది కాదు.   ఒకప్పుడు మారుమూల గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ, అరవై ఏళ్లగా సాధించలేని తెలంగాణాను కేవలం పదేళ్ళలో సాధించిన కేసీఆర్, పదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి కూడా మళ్ళీ అధికారంలోకి రాగలిగిన చంద్రబాబు నాయుడు, పార్టీ పెట్టిన తొమ్మిది నెలలలోనే ముఖ్యమంత్రి అయిన స్వర్గీయ యన్టీఆర్, రెండు దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని పరిపాలించిన కమ్యూనిష్టుల కంచుకోటను బ్రద్దలు కొట్టిన వీర నారీమణి మమతా బెనర్జీ, కొమ్ములు తిరిగిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను మట్టి కరిపించిన అరవింద్ కేజ్రీవాల్ వంటి వారందరూ తమ నాయకత్వ లక్షాణాల వలననే పార్టీపై పూర్తి పట్టు సాధించారు తప్ప రాహుల్ గాంధీలాగ ఎక్కడికో పారిపోయి పార్టీపై పట్టు సాధించాలనుకోలేదు.   మోడీ, చంద్రబాబు, కేసీఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటివారందరూ తీవ్ర వ్యతిరేక పరిస్థితులలో సైతం ఏ మాత్రం నిబ్బరం కోల్పోకుండా పార్టీని ఒక్క త్రాటిపై ముందుకు నడిపించి విజయం సాధించిన సంగతి అందరికీ తెలుసు. కానీ రాహుల్ గాంధీకి ఆయన తల్లి సోనియా గాంధీ అన్నీ విస్తర్లో వడ్డించి అందజేసినా అందుకోలేకపోయారు. చివరికి డా. మన్మోహన్ సింగ్ అంతటివాడి చేత ఆయన కోసం ప్రధానమంత్రి కుర్చీ ఖాళీ చేయించడానికి కూడా ఆమె సిద్దపడినా రాహుల్ గాంధీ అందులో కూర్చోవడానికి భయపడ్డారు.   ఈరోజు పార్టీ పగ్గాలు తనకే దక్కాలని కోరుకొంటున్న రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికలకు ముందు ధైర్యంగా ముందుకు వచ్చి పార్టీ పగ్గాలు అందుకొని ఉండి ఉంటే, పార్టీ ఓడిపోయినా అందరూ ఆయన వెంటే ఉండేవారు. కనీసం లోక్ సభలో పార్టీకి నాయకత్వం వహించడానికి కూడా ఆయన దైర్యం చేయలేక హాయిగా వెనుక బెంచీలలో కునుకు తీసారు. అటువంటి వ్యక్తిపై ప్రజలకే కాదు పార్టీలో నేతలకయినా ఎందుకు నమ్మకం కలుగుతుంది? అయితే ఆయన నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీలో నేతలు వ్యతిరేకించవచ్చునేమో గానీ బీజేపీతో సహా దేశంలో మరే ఇతర పార్టీ వ్యతిరేకించదు. ఎందుకంటే తమ పార్టీలు పదికాలాలపాటు చల్లగా అధికారంలో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి ఆయనే నాయకుడిగా ఉండాలని వారు ఆశపడటం సహజమే.   నెహ్రు కుటుంబంలో పుట్టడం ఒక్కటే తనకున్న ఏకైక అదనపు అర్హత అని రాహుల్ గాంధీయే ఒకప్పుడు స్వయంగా చెప్పుకొన్నారు. మరి ఇప్పుడు ఆయన అదే ప్రత్యేక అర్హతతోనే కాంగ్రెస్ పార్టీపై పెత్తనం చేయాలని ఎందుకు భావిస్తున్నట్లు? గత పదేళ్ళుగా కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని కుర్చీలో, పార్టీ అధ్యక్ష కుర్చీలో కూర్చోవడానికి తనకు తగిన అర్హత లేదని జంకిన వ్యక్తి, ఇప్పుడు హటాత్తుగా పార్టీకి సారధ్యం వహించాలని ఎందుకు ఉబలాటపడుతున్నారు? ఆయన నాయకత్వ లక్షణాలను సమర్ధతను పార్టీలో నేతలే ప్రశ్నిస్తున్నప్పుడు, తను మిగిలిన సీనియర్ల కంటే ఏవిధంగా సమర్ధుడని ఆయన భావిస్తున్నారు? ఈ ప్రశ్నలు అడుగుతున్నది ప్రజలు కాదు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలే అడుగుతున్నారు. ఏమయినప్పటికీ ఇన్ని అవకాశాలు వచ్చినా తన సమర్ధతను నిరూపించుకోలేక రాజకీయాలకు శలవు పెట్టిన వ్యక్తి చేతిలో కాంగ్రెస్ పార్టీని పెడితే ఏమవుతుందో ఆ పార్టీ నేతలే ఆలోచించుకోవలసి ఉంటుంది.

పోలవరం కోసం ఇంత ఆవేదన...మరెవరికీ లేదేమో

  ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రజలను చైతన్యవంతం చేసేందుకు తన పార్టీ యం.యల్యే.లతో కలిసి మూడు రోజుల బస్సు యాత్రకు బయలుదేరారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం జరిగే ప్రాంతంలో పర్యటించిన తరువాత జగన్మోహన్ రెడ్డి అక్కడి ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై ఏడాదికి రూ.4000 కోట్లు ఖర్చు చేయగలిగితే చాలు...నాలుగేళ్ళలో ప్రాజెక్టును పూర్తి చేయవచ్చును. కానీ ఈ పది నెలల కాలంలో ప్రభుత్వం దానిమీద కనీసం రూ.100 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టును మొదలుపెట్టేందుకే పోలవరం ప్రాజెక్టుని పక్కనబెట్టారు,” అని విమర్శించారు.   గత పదేళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రాన్ని పరిపాలించింది. అందులో ఐదేళ్ళపాటు రాజశేఖర్ రెడ్డే స్వయంగా రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. ఆయనకు కేంద్రం వద్ద మంచి పలుకుబడి ఉండేది కూడా. అయినా ఆయన పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింపజేయలేకపోయారు. జలయజ్ఞం పేరిట వేల కోట్ల రూపాయలు ఆయన హయంలోనే ఖర్చు చేసారు. కానీ పోలవరం ప్రాజెక్టుతో సహా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేకపోయారు.   పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏడాదికి రూ.4,000 కోట్లు ఖర్చు చేయగలిగితే చాలు...నాలుగేళ్ళలో ప్రాజెక్టును పూర్తి చేయవచ్చునని జగన్మోహన్ రెడ్డి అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నప్పుడు మరి అదే విషయం తన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి చెప్పి ఆయన హయాంలోనే పూర్తి చేయించి ఉండవచ్చును. లేదా ఆయన తరువాత పరిపాలించిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు కూడా అశ్రద్ధ వహిస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి భావించి ఉండి ఉంటే అప్పుడూ ఇదేవిధంగా బస్సు యాత్రలు, ధర్నాలు చేసి వారిపై ఒత్తిడి చేసి ఉండవచ్చును. కానీ అప్పుడు ఓదార్పు యాత్రలతో కాలక్షేపం చేసి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు గురించి తెగ ఆవేదన పడిపోవడమే విచిత్రంగా ఉంది. పైగా వచ్చే ఎన్నికలలోగా ఈ ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితులలో పూర్తి చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెపుతున్నప్పటికీ, దానిని రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టిందని విమర్శలు గుప్పించడం ఎందుకు? ఒకవేళ వచ్చే ఎన్నికల నాటికి పోలవరం ప్రాజెక్టుని పూర్తిచేయలేకపోతే అప్పుడు నిలదీసినా అర్ధం ఉంటుంది. కానీ పోలవరం ప్రాజెక్టుని పూర్తిచేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చురుకుగా చర్యలు చేపడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈవిధంగా ఆరోపణలు గుప్పించడం కేవలం రాజకీయ లబ్ది కోసమేనని భావించవలసి ఉంటుంది.   పదేళ్ళ పాటు రాష్ట్రాన్ని దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయలేనప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం చేప్పట్టి ఇంకా ఏడాది కూడా పూర్తికాక ముందే ప్రాజెక్టుని ఇంకా ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించడం అవివేకం.   పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.100 కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఆయన చేస్తున్న ఆరోపణలు కూడా అవాస్తమే. అదే నిజమయితే ఆ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన వందల కోట్ల సొమ్ముని కేంద్ర ప్రభుత్వం ఎందుకు రీ-ఇంబర్స్ చేస్తోంది?   కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పోయిన తరువాత నుండే ఈ పోలవరం గురించి చర్చ మొదలయ్యింది. పనులు కూడా వేగవంతం అయ్యాయనే విషయం ప్రజలందరికీ తెలుసు. ప్రభుత్వాలు మారిన తరువాతనే రాష్ట్రాభివృద్ధి గురించి అనేక ఆలోచనలు, ప్రణాళికలు, కార్యక్రమాలు, నిధులు మంజూరు అవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలో అనేక ఇతర అబివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఇవేవీ కనిపించకపోవడం విచిత్రమే.   జగన్ తన పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి, ఈ అంశం ద్వారా రాజకీయ లబ్ది పొందేందుకే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నట్లున్నారు తప్ప పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలనే తపన మాత్రం ఆయనలో కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పట్టిసీమపై జగన్ పోరాటం దేనికో?

  రాయలసీమ జిల్లాలకు నీరందించేందుకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన పట్టిసీమ ప్రాజెక్టును రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా వ్యతిరేకిస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ముందుకే సాగాలనుకోవడంతో, జగన్మోహన్ రెడ్డి తన యంపీలను వెంటబెట్టుకొని డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోడీని, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిసి పిర్యాదు చేసారు. అయితే వారు కూడా సానుకూలంగా స్పందించకపోవడంతో, నేటి నుండి మూడు రోజుల పాటు కృష్ణా, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో బస్సుయాత్రకి బయలుదేరారు. ఈ పట్టిసీమ ప్రాజెక్టు వలన రైతాంగం తీవ్రంగా నష్టపోతారని వారికి నచ్చజెప్పి వారి మద్దతు కూడగట్టి దీనిపై ఉద్యమించేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్దమవుతున్నారు. ఒకవేళ ఈ పట్టిసీమ ప్రాజెక్టు వలన రాష్ట్రానికి నష్టం తప్ప ఎటువంటి లాభం ఉండదని కేంద్రం భావిస్తే దానిని నిలిపివేయించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ నిలిపి వేయలేదంటే అర్ధం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి డిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వంపై పిర్యాదులు చేయడం వలన ఆయన అధికార తెదేపాను రాజకీయంగా దెబ్బతీయలనుకొని ఉండవచ్చును. కానీ ఆ కారణంగా కేంద్రం రాష్ట్రానికి రావలసిన నిధులను త్రొక్కిపెడితే రాష్ట్రం నష్టపోతుందనే ఆలోచన ఆయనకు లేకపోవడం చాలా దురదృష్టకరం.   కానీ తెదేపా వాదన మరొకలా ఉంది. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయినట్లయితే వైకాపాకు మంచి పట్టు ఉన్న రాయలసీమ జిల్లాలలో పొలాలకి నీరు అందుతుంది కనుక, అక్కడి రైతాంగం తమకు నీళ్ళు అందించిన తెదేపా వైపు మళ్ళిపోయినట్లయితే ఇక తమ పార్టీ ఉనికి కోల్పోతుందనే భయంతోనే ఈ ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారని వాదిస్తోంది. రాష్ట్రంలో ఒక్క వైకాపా మాత్రమే దీనిని ఎందుకు ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆలోచిస్తే మాత్రం తెదేపా చేస్తున్న వాదనను నమ్మవలసి వస్తోంది. వచ్చే ఏడాదిలోగా ఎట్టి పరిస్థితులలో కూడా ఈ పట్టిసీమ ప్రాజెక్టు ద్వారానే రాయలసీమకు నీళ్ళు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చాలా దృడంగా చెపుతున్నప్పుడు వైకాపా వాదనలు అర్ధరహితం అవుతాయి.   వైకాపా వాదిస్తున్నట్లు ఒకవేళ ఈ ప్రాజెక్టు వలన రాయలసీమకు ఎటువంటి ప్రయోజనమూ కలుగకపోయినా లేదా దీనివలన కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల రైతులకు తీవ్ర నష్టం కలిగినా లేదా ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయినా దాని వలన మొట్టమొదట తెదేపా పార్టీకే ఎదురుదెబ్బ తగిలవచ్చును. ఈ ప్రాజెక్టు విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా వచ్చే ఎన్నికలలో అందుకు తెదేపా మూల్యం చెల్లించక తప్పదు. ఈ సంగతి తెదేపా అధిష్టానానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదనుకోలేము. అంటే ఈ ప్రాజెక్టు వలన రాయలసీమ జిల్లాలకు నీళ్ళు అందించగలమనే పూర్తి నమ్మకం ఉన్నందునే రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకు వేసిందని స్పష్టమవుతోంది. అంటే వైకాపా విషయంలో తెదేపా చేస్తున్న వాదనలు కూడా నిజమేనని భావించవలసి ఉంటుంది.   ఇక వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇదివరకు రాజధాని ప్రాంత రైతులకు అండగా నిలబడతానని, వారి తరపున తమ పార్టీ ప్రభుత్వంతో అవసరమయితే కోర్టులలో న్యాయపోరాటాలకి కూడా సిద్దమేనని హామీ ఇచ్చేరు. కానీ ఇప్పుడు ఆయన ఆ ఊసే ఎత్తడం లేదు. వచ్చే ఎన్నికలలో తమ పార్టీ గెలిచి తను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్లయితే వారి భూములు వారికిచ్చేస్తానని చిన్న మెలిక పెట్టడంతో రైతులు కూడా ఆయనపై నమ్మకం కోల్పోయారు. మళ్ళీ ఇప్పుడు పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ రైతుల తరపున ప్రభుత్వంతో పోరాడుతానని జగన్మోహన్ రెడ్డి మరో కొత్త హామీ ఇస్తున్నారు.   అయితే రైతన్నల కోసం అంటూ ఆయన చేస్తున్న ఈ పోరాటాలన్నీ తన పార్టీ ఉనికిని కాపాడుకోవడానికేనని అర్ధమవుతున్నప్పటికీ ఆయన అంత నిర్భయంగా ప్రజలకు నమ్మబలకడం గొప్ప విషయమే. తన పార్టీ ఉనికిని, ప్రయోజనాలను కాపాడుకొనేందుకు ఆయన ఈవిధంగా ఆటంకాలు కల్పించేందుకు పూనుకోవడం శోచనీయం. పట్టిసీమ ప్రాజెక్టు వలన రాయలసీమలో వైకాపా ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి కలగవచ్చని తెదేపా నేతలు చేస్తున్న వాదనలు నిజమనుకొన్నట్లయితే, ఇంతకు ముందు హుదూద్ తుఫాను, తరువాత పంట రుణాల మాఫీ, ఆ తరువాత రాజధాని భూములపై పోరాటం చేసి మధ్యలోనే విడిచిపెట్టేసిన జగన్మోహన్ రెడ్డి ఈ పోరాటాన్ని మాత్రం ఆపకుండా కొనసాగించవచ్చును.

ఏటికి ఎదురీదుతున్న తెదేపా, బీజేపీలు

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా బలహీనంగా ఉన్న బీజేపీ అక్కడ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని కోరుకొంటుంటే, తెలంగాణా రాష్ట్రంలో బలహీనపడిన తెలుగుదేశం పార్టీ మళ్ళీ అక్కడ బలపడాలని అంతే గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే రెండు పార్టీలకు రెండు విభిన్నమయిన సమస్యలున్నాయి.   రాష్ట్ర విభజన సమయంలో ఎదురయిన సవాళ్ళను తట్టుకొని తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో బలంగా నిలబడగలిగింది. కానీ ఎన్నికలలో ఓడిపోవడంతో బాగా డీలాపడిపోయింది. అదే అదునుగా తెరాస పార్టీ అనేకమంది తెదేపా నేతలను, యం.యల్యేలను, కార్యకర్తలను పార్టీలోకి ఆకర్షించడంతో మరింత డీలాపడింది. ఇప్పటికే పదేళ్ళపాటు ప్రతిపక్షంలో ఉండిపోయిన తెదేపా నేతలు మరో ఐదేళ్ళపాటు అధికారానికి దూరంగా ఉండవలసి వస్తోంది. మరో నాలుగున్నరేళ్ళ తరువాత వచ్చే ఎన్నికల ఏ పార్టీలు ఎవరితో పొత్తులు పెట్టుకొంటాయో, విడిపోతాయో, దాని వలన రాజకీయ పరిస్థితులు ఏవిధంగా మారుతాయో, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియదు కనుక తెదేపా నేతలలో ఆందోళన నెలకొని ఉండటం సహజమే.   ఇదంతా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి తెలియదనుకోలేము. కానీ ఆయన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత, తెలంగాణావైపు తొంగి చూసేందుకు కూడా క్షణం తీరిక ఉండటం లేదు. అయినప్పటికీ గత రెండు మూడు నెలలుగా తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇంతకుముందు వరంగల్, కరీంనగర్ లో చంద్రబాబు పర్యటించి అక్కడ పార్టీ సభలు నిర్వహించారు. మళ్ళీ ఈనెల 23వ తేదీన మహబూబ్‌నగర్ పట్టణంలో పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పార్టీ నేతలలో, కార్యకర్తలలో కూడా కొత్త ఉత్సాహం కలిగే అవకాశం ఉంటుంది.   ఇక బీజేపీ విషయానికి వస్తే ఇప్పటికీ ఆ పార్టీ ఆంధ్రాలో బలహీనంగానే కనబడుతోంది. అందుకు రెండు ప్రధాన కారణాలు కనబడుతున్నాయి. సీనియర్ నేతల ఉదాసీన వైఖరి, మిత్రపక్షమయిన తెదేపాను విమర్శించలేని బలహీనత.   పార్టీని బలోపేతం చేసుకోవడానికి పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ చాలా కీలకమయింది. అదేవిధంగా తమ ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి చేసింది? ఇంకా ఏమేమి చేయబోతోందనే విషయాన్ని ప్రజలకు చెప్పుకోవడం కూడా చాలా అవసరం. కానీ పార్టీలో సీనియర్ నేతలు ఈ రెండు అంశాలపై చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నందు వలన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ మందకోడిగా సాగుతోంది, ప్రజలలో పార్టీ పట్ల అపోహలు నెలకొన్నాయి.   కాస్త నోరు విప్పి మాట్లాడగల బీజేపీ నేతలు ఎంతసేపు తెదేపా మిత్రధర్మం పాటించడం లేదని ఆరోపించడానికే పరిమితమవుతున్నారు. నిజానికి తెదేపా నేతలు కేంద్ర ప్రభుత్వం చేసిన విమర్శల కంటే, బీజేపీ నేతల ఉదాసీనత కారణంగానే ఆ పార్టీకి ఎక్కువ నష్టం కలుగుతోందని చెప్పవచ్చును. వారు తమ పార్టీ గురించి, తమ ప్రభుత్వం గురించి, రాష్ట్రానికి మంజూరు చేసిన నిధులు, పధకాలు, ప్రాజెక్టుల గురించి చెప్పుకోలేకపోవడంతో పార్టీ పట్ల, కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజలలో అపోహలు ఏర్పడి నష్టం జరుగుతోంది. ప్రజల అపోహలు దూరం చేసేందుకు వారు ఎటువంటి కృషి చేయకుండా, ఇతరులను ఆడిపోసుకోవడం వలన ఏమి ప్రయోజనం?   మిత్రధర్మం కారణంగానే తెదేపా ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించలేకపోతున్నామని వారు సమర్ధించుకోవచ్చును. కానీ కనీసం ఇతర పార్టీల నేతలు తమ ప్రభుత్వాన్ని పార్టీని నిందిస్తున్నప్పుడయినా ఎందుకు స్పందించలేకపోతున్నారో బీజేపీ నేతలో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరం ఉంది. ఏది ఏమయినప్పటికీ పార్టీలో సీనియర్ నేతలు నిద్రావస్థలో ఉన్నప్పుడు పార్టీలో చైతన్యం ఆశించడం కష్టమే.   తెలంగాణాలో తెదేపా ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులతో పోల్చి చూసుకొన్నట్లయితే ఆంధ్రాలో బీజేపీ పరిస్థితి చాలా మెరుగుగానే ఉన్నట్లు భావించవచ్చును. కానీ తెలంగాణాలో తెదేపా ఏటికి ఎదురీది మరీ బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంటే, ఎటువంటి సమస్యలు లేకపోయినా బీజేపీ నేతలు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోలేకపోవడం చాలా విచిత్రమే.   పార్టీ బలంగా ఉన్నప్పుడే అందులో నాయకులకి రాజకీయాలలో ఒక గుర్తింపు ఉంటుందనే చిన్న విషయాన్ని బీజేపీ నేతలు కూడా గుర్తుంచుకొంటే మంచిది. కనుక పార్టీ కోసం కాకపోయినా వారు తమ ఉనికిని, రాజకీయ భవిష్యత్ కాపాడుకోవడానికయినా సమిష్టిగా కృషి చేయాల్సి ఉంటుంది. లేకుంటే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడం మాట అటుంచి వచ్చే ఎన్నికల నాటికి వారి పరిస్థితి, పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉంటుందో వారే ఊహించుకోవచ్చును.  

ఏపీలో కమల వికాసానికి నాలుగేళ్ళు సరిపోతుందా?

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడాలనే విషయంలో తమకు ఎటువంటి సందేహాలు, సందిగ్ధం లేదనే సంగతిని నిన్న వైజాగ్ లో జరిగిన బీజేపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో తేటతెల్లమయింది. రాష్ట్ర వ్యవహారాల శాఖ ఇన్-చార్జ్ మరియు కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి జేపీ. నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర బీజేపీ అగ్రనేతలందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాక్యాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. తెలంగాణాతో పోలిస్తే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ శూన్యత నెలకొని ఉంది గనుక రాష్ట్రంలో బలపడటానికి పార్టీకి ఎక్కువ అవకాశాలున్నాయని అన్నారు. కనుక ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా పార్టీకి గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల మాదిరిగా కంచుకోటలా తయారుచేయాలని కోరారు. దేశంలో మరే ఇతర రాష్ట్రానికి ఇవ్వనంతగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా నిధులు, ప్రాజెక్టులు తమ ప్రభుత్వం మంజూరుచేస్తోందని, అదే విషయాన్ని రాష్ట్రంలో గట్టిగా ప్రచారం చేసుకొని ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేయాలని ఆయన సూచించారు. అందుకోసం త్వరలో ‘జన్ మహా సంపర్క్ అభియాన్’ అనే కార్యక్రమాన్ని చేప్పట్టి వరుసగా మూడు నెలల పాటు కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేసిన, చేస్తున్న నిధులు, మంజూరు చేసిన ప్రాజెక్టుల గురించి ప్రచారం చేయాలని ఆయన సూచించారు. ఈ ప్రచార కార్యక్రమానికి డి. పురందేశ్వరిని కన్వీనర్ గా నియమించారు.   తెలంగాణాతో పోలిస్తే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే బీజేపీ బలపడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని ఆయన భావించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజానికి ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణాలోనే బీజేపీ బలపడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఆంధ్రాలో తెదేపాతో అంటూ కట్టిన తరువాత, కేంద్రంలో మోడీ నాయకత్వంలో బలమయిన కేంద్రప్రభుత్వం ఏర్పడిన తరువాత నుండే బీజేపీకి రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. లేకుంటే నేడు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి వేరేలా ఉండేది.   రాష్ట్ర విభజన కారణంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం, దాని భవిష్యత్ అగమ్యగోచరంగా ఉండటం వలన రాజకీయ శూన్యత ఏర్పడిందని బీజేపీ భావిస్తున్నట్లుంది. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెదేపా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైకాపాలు చాలా బలంగా ఉన్నప్పుడు రాజకీయ శూన్యతకి చోటేలేదు. కానీ ఉందని బీజేపీ భావిస్తోంది. ఆ భ్రమలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో బలపడాలంటే ముందుగా ఆ పార్టీ నేతలు చురుకుదనం ప్రదర్శించాలి. కానీ వారిలో రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, పురందేశ్వరి వంటి నాయకులు తప్ప మరెవరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు, పధకాలు, ప్రాజెక్టుల గురించి చెప్పుకొన్న దాఖలాలు లేవు. అందుకే బీజేపీ ఇప్పుడు పనిగట్టుకొని ‘జన్ మహా సంపర్క్ అభియాన్’ వంటి ప్రచార కార్యక్రమాలను చేప్పట్టవలసివస్తోంది. కానీ మళ్ళీ అక్కడా మరో పొరపాటు చేస్తోంది. తెలుగు రాష్ట్రంలో బలపడాలనుకొంటున్న బీజేపీ తన ప్రచార కార్యక్రమానికి అచ్చమయిన తెలుగుపేరు పెట్టుకోకుండా హిందీ పేరు పెట్టుకొంటే అది ఎంతగా ప్రచారం చేసుకొన్నప్పటికీ ప్రజలకి పరాయిపార్టీగానే కనిపిస్తుంది.   రాష్ట్రంలో బీజేపీ బలపడాలంటే వేగంగా రాష్ట్రాభివృద్ధి జరిగేందుకు తోడ్పడాలి. ఆ విషయంలో బీజేపీ చిత్తశుద్ధిని శంఖించనవసరం లేదని స్పష్టమవుతోంది. కానీ తెదేపా ప్రభుత్వం కూడా రాష్ట్రాభివృద్ధి చేసి ప్రజలను మెప్పించి వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్ళీ అధికారంలోకి రావాలనుకొంటోంది కనుక బీజేపీ ఆ క్రెడిట్ మొత్తాన్ని తన పద్దులోనే వ్రాసేసుకోవడానికి వీలుపడదు. ఒకవేళ వచ్చేఎన్నికలలో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఇదే అంశం వారికి వరంగా మారుతుంది. అలాకాక బీజేపీ వేరేగా పోటీ చేయదలిస్తే అది ఎంతగా ప్రచారం చేసుకొన్నప్పటికీ ప్రజలు స్థానిక పార్టీ అయిన తెదేపావైపే మొగ్గు చూపవచ్చును.   బహుశః దీనిని దృష్టిలో పెట్టుకొనే బీజేపీ కాంగ్రెస్, వైకాపాలకు చెందిన నేతలను పార్టీలోకి ఆకర్షించడం ద్వారా ‘స్థానిక ముద్ర’ పొందాలని ప్రయత్నిస్తోందేమో? క్రిందటి సారి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటనకి వచ్చినప్పుడు రాష్ట్రంలో పార్టీ బలపడేందుకు దిశానిర్దేశం చేసారు. కానీ ఆనాడు ఆయన చేసిన సూచనలలో ఎన్నిటిని రాష్ట్ర నాయకులు తూచా తప్పకుండా ఆచరించారో ఒకసారి ఆలోచించుకొంటే, లోపం ఎక్కడ ఉందో అర్ధమవుతుంది. రాష్ట్ర నాయకులు ఇంత నిర్లిప్తత ప్రదర్శిస్తున్నప్పుడు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల మాదిరిగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీజేపీ బలపడాలంటే ఈ నాలుగేళ్ల సమయం సరిపోకపోవచ్చును.

మహానీయులను రచ్చకీడ్చనేల?

  దేవుళ్ళని, స్వాతంత్ర సమరయోధులని కూడా కులాలు, మతాలు, ప్రాంతాలవారీగా పంచుకొన్న ఘనత మనకే ఉంది. ఇంతకాలంగా కాంగ్రెస్ పార్టీ గాంధీ, నెహ్రూలను మాత్రమే భుజానికెత్తుకొని వారికి మాత్రమే చాలా ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. కానీ మోడీ ప్రభుత్వ పగ్గాలు చెప్పట్టగానే గాంధీ నెహ్రులను పక్కనబెట్టి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కి ప్రాధాన్యం ఈయడం మొదలుపెట్టారు. ఏ పార్టీ గుర్తించినా గుర్తించకపోయినా ఆ మహనీయుల ప్రాధాన్యం ఎన్నడూ తగ్గదు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆ మహనీయులను ఎవరూ తొలగించలేరనే సంగతి విస్మరించి ఒక్కో రాజకీయపార్టీ ఒక్కో మహనీయుడిని భుజానికెత్తుకొని ఆయనపై ‘పేటెంట్ హక్కులు’ కేవలం తమ పార్టీకి మాత్రమే ఉన్నాయన్నట్లు మాట్లాడుతూ ఆయనని తామే లోకానికి కొత్తగా పరిచయం చేశామనే భ్రమలో ఉండటం చూసి దేశప్రజలు వారి అజ్ఞానానికి నవ్వుకోకుండా ఉండలేరు.   స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుబాష్ చంద్రబోస్ సోదరుని కుమారులపై నెహ్రూ ప్రభుత్వం 20 ఏళ్ళపాటు నిఘాపెట్టిందనే వార్తలు ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీల మధ్య మరో కొత్త యుద్దానికి కారణమయ్యాయి.   విమాన ప్రమాదంలో చనిపోయారనుకొన్న నేతాజీ దాని నుండి తప్పించుకొని బయటపడినట్లు నాటి ప్రధాని నెహ్రుకి అనుమానం కలగడంతో మళ్ళీ ఆయన తిరిగివచ్చి తన చేతిలో నుండి ఎక్కడ అధికారాన్ని లాక్కొంటారనో అనే అనుమానం, భయంతోనే నేతాజీ కుటుంబ సభ్యులపై నెహ్రూ ప్రభుత్వం నిఘా పెట్టినట్లుందని బీజేపీ అధికార ప్రతినిధి నళిని కోహ్లీ విమర్శించారు.   కాంగ్రెస్ రక్తంలోనే గూడచర్యమనే ఈ అవలక్షణం ఇమిడి ఉందని, అది నాటి నుండి నిన్న మొన్నటి వరకు కూడా కొనసాగిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. నెహ్రు ప్రభుత్వం నేతాజీ కుటుంబం మీద గూడచర్యానికి పాల్పడితే, ఆయన కుమార్తె స్వర్గీయ ఇందిరా గాంధీ తన కోడలు మీదే నిఘా పెట్టించారని, ఆ తరువాత అధికారం చేప్పట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ కూడా ఆ ఆచారానని తూచా తప్పకుండా పాటించాయని ఆమె విమర్శించారు.   అందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ధీటుగానే బదులిచ్చింది. “బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగానే ప్రముఖ నేతల మీద బురద జల్లుతోంది. దాని వెనుక ఆర్.యస్.యస్. ఉంది. వారు ఉద్దేశ్యపూర్వకంగానే కొన్ని లేఖలలో, పత్రాలలో ఉన్న కొన్ని అంశాలను మాత్రమే మీడియాకు ఈవిధంగా లీక్ చేస్తూ నెహ్రూ అంతటివాడిని కూడా దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నెహ్రూ ప్రభుత్వంలో లాల్ బహద్దూ శాస్త్రి, సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్, సి. రాజగోపాలాచారి వంటి హేమాహేమీలు హోం మంత్రులుగా బాధ్యతలు నిర్వహించారనే సంగతి బీజేపీ నేతలు మరిచిపోయి నెహ్రు మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ నేతాజీ కుటుంబ సభ్యులపై నెహ్రూ ప్రభుత్వం అటువంటి నిఘా పెట్టి ఉండి ఉంటే, ఆ విషయం ఆయనకంటే ముందుగా హోం మంత్రులుగా చేసినవారందరికీ తెలుస్తుంది. అంటే వారిని కూడా దోషులని బీజేపీ భావిస్తోందా?” అని ప్రశ్నించారు.   కాంగ్రెస్, బీజేపీలు ఒకదానిమీద మరొకటి పై చెయ్యి సాధించేందుకు ఎప్పుడో జరిగిపోయిన విషయాలను త్రవ్విపోసుకొంటూ, ఆ ప్రయత్నంలో ఈవిధంగా మహనీయులను కూడా రచ్చకీడ్చడాన్ని ఎవరూ హర్షించరు. ఒకవేళ వారిపై ఆ రెండు పార్టీలకి అంతగా అభిమానం గౌరవం ఉంటే వారు చూపిన మార్గంలో నడుస్తూ దేశాభివృద్ధికి కృషి చేస్తే అందరూ హర్షిస్తారు. కానీ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం, ఎన్నికల కోసం మహనీయులను కించపరిస్తే అందుకు వారే భారీ మూల్యం చెల్లించక తప్పదు.

రాజకీయ ప్రయోజనాల కోసం నేరస్తులను వెనకేసుకు వస్తే...

    తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉంది కనుక రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అదొక మంచి ఆయుధంగా దొరికింది. ఈ అంశాన్ని పట్టుకొని తమిళనాడులో రాజకీయపార్టీలు కూడా రాజకీయాలు సాగిస్తున్నాయి. అధికార అన్నాడీఎంకే పార్టీ కంటే ముందుగా కరుణానిధికి చెందిన డీయంకె పార్టీ ఈ అంశం మీద స్పందించుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించింది. తమ రాష్ట్రానికి చెందిన అమాయకులయిన కూలీలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు పొట్టనబెట్టుకొన్నారని ఘాటుగా విమర్శలు చేసింది. అంతే కాదు చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.2లక్షల పరిహారం కూడా అందజేసింది.   ఇది చూసి అధికార పార్టీ కూడా వారికి నష్టపరిహారం చెల్లించకతప్పలేదు. రాష్ట్ర మంత్రులు, యం.యల్యే.ల ద్వారా భాదిత కుటుంబాలకు చెక్కులు అందజేసింది. అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకొని జైలుకి వెళ్లివచ్చిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కూడా మీడియా ముందుకు వచ్చి ఈ ఎన్కౌంటర్ ని ఖండిస్తూ మాట్లాడవలసివచ్చింది. “మీడియాలో వచ్చిన ఫోటోలను చూస్తే ఈ ఎన్కౌంటర్ పై అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ చనిపోయిన వారందరూ స్మగ్లర్లే అనుకొన్నప్పటికీ వారిపై అంతమంది పోలీసులు దాడి చేయడం చాలా అనుమానాలను రేకెత్తిస్తోంది,” అని ఆమె అన్నారు. తమిళనాట మిగిలిన చిన్నా చితకా రాజకీయ పార్టీలు కూడా ఈ అంశంపై చేయగలిగినంతా హడావుడి చేసాయి.   ఈ ఎన్కౌంటర్ లో మానవ హక్కుల ఉల్లంఘన అనే అంశాన్ని వేరుగా చూసినట్లయితే, ఎర్రచందనం స్మగిలింగ్ వ్యవహారం చట్ట విరుద్దమయిన పని అందరూ అంగీకరించకమానరు. చట్ట విరుద్దమయిన అటువంటి పనులను అరికట్టవలసిన బాధ్యత ఉన్నందునే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం దానిని అరికట్టేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నమే చేసింది. కానీ ఈసారి ఆ ప్రయత్నంలో 20మంది చనిపోవడంతో రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీలు, తమిళనాడులో అధికార ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నాయి. కానీ అటువంటి పనులకు పాల్పడినవారిని రాజకీయ పార్టీలు సమర్ధించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.   ఒక ప్రభుత్వానికి చట్ట విరుద్దమయినది మరొక ప్రభుత్వానికి ఆమోదయోగ్యంగా భావించడం ఎలా సాధ్యమో దానికే తెలియాలి. రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఇటువంటి చట్టవిరుద్దమయిన పనులకు పాల్పడిన వారికి మద్దతు ఇవ్వడం, వారి కుటుంబాలకు పోటాపోటీలుగా నష్టపరిహారాలు చెల్లించడం వలన, అటువంటి పనులకు పాల్పడటం తప్పు కాదని చెపుతున్నట్లుంది. ఇదంతా చూసి మరింత మంది అటువంటి చట్ట విరుద్దమయిన పనులకు పాల్పడే అవకాశం కూడా ఉంది.   ఇప్పుడు ఈ సంఘటన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది కనుక తమిళనాడు ప్రభుత్వం, రాజకీయ పార్టీలు వారినందరినీ వెనకేసుకు రావచ్చును. కానీ రేపు ఇదే పని తమిళనాడు రాష్ట్రంలోనే చేసినట్లయితే అప్పుడు కూడా రాజకీయ పార్టీలు వారిని ఇదేవిధంగా వెనకేసుకు రాగలరా? అప్పుడు కూడా ఇదేవిధంగా వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించగలరా?   ఇటువంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడిన వారి కుటుంబాలకు ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించడమే ఒక కొత్త సంప్రదాయం సృష్టిస్తే, వికారుద్దీన్ వంటి ఉగ్రవాదుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించవలసిన అగత్యం ఏర్పడినా ఆశ్చర్యం లేదు. ఆ తరువాత క్రమంగా రకరకాల నేరస్తుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించవలసివచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. చట్టవిరుద్దమయిన పనులకు పాల్పడినందుకు రామలింగ రాజు అంతటివాడినే జైలుకి పంపారు తప్ప ఈవిధంగా జాలి చూపలేదు. కానీ ఆంద్ర, తెలంగాణాలలో ప్రతిపక్ష పార్టీలు, తమిళనాట అధికార ప్రతిపక్ష పార్టీలు మాత్రం అటువంటి వారిని వెనకేసుకురావడం చాలా శోచనీయం. రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఇటువంటి నేరస్తులకు మద్దతు పలకడం, ప్రభుత్వాలపై ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసమో వారూ ఆలోచించుకోవాలి.

కాంగ్రెస్ టైటానిక్ షిప్పులోకి అందరికీ స్వాగతం

    నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీలుగా మసులుకొన్న రకరకాల ప్రాంతీయ జనతా పార్టీలన్నీ ఇప్పుడు ‘జనతా పరివార్’ అనే గొడుగు క్రింద ఒకే పార్టీగా అవతరించేందుకు సన్నాహాలు ప్రారంభించాయి. అందుకు అనేక కారణాలు కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం కోల్పోయిన తరువాత వరుసపెట్టి అనేక రాష్ట్రాలలో అధికారం కోల్పోతుండటంతో మునిగిపోతున్న ఆ కాంగ్రెస్ నావలో పయనిస్తే తాము కూడా మునిగిపోయే ప్రమాదం ఉందనే భయం వలన కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీతో ఇంకా అంటకాగితే నరేంద్రుడి ఆగ్రహానికి గురవుతామనే భయం కావచ్చు లేదా అనేక అవినీతి కేసులు ఎదుర్కొంటున్న తామంతా ఇంకా విడివిడిగా ఉంటే, మోడీ తమతో కూడా కబడీ ఆడేసుకొంటారు కనుక అందరూ కట్టకట్టుకొని గట్టిగా నిలబడితే ఆయన ఇక తమ జోలికిరాకపోవచ్చుననే దూరాలోచన కావచ్చును లేదా కాంగ్రెస్ పంచనో లేదా బీజేపీ పంచనో చేరినా జీవితంలో ఒక్కసారయినా ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని దేశాన్ని ఏలేయాలనే జనతా నేతలందరి కోరిక నేరవేరదనే ఆలోచనవల్ల కావచ్చును. ఒకే కుంపటి పెట్టుకొని వండుకొని తినడమే మంచిదనే ఆలోచనతో ‘జనతా పరివార్’ గొడుగు క్రిందకు అందరూ చేరుతున్నారు.   ఇంతవరకు ఆ జనతా నేతల చేతులు సీబీఐ చేత మేలేయిస్తూ వారి మద్దతుతో దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వారందరూ వేరు కుంపటి పెట్టుకోవడంతో ఒంటరయిపోయింది. పైగా త్వరలో కాంగ్రెస్ పార్టీకి ‘రాహు కాలం’ మొదలవబోతోందని ఆ పార్టీ నేతలే స్వయంగా చెప్పుకొంటున్నారు. ఇటువంటి పరిస్థితిలో మధ్యప్రదేశ్ కి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత అజిత్ జోగీ గొప్ప ప్రతిపాదన చేసారు. రాహుల్ గాంధీకి కాకుండా వేరెవరికో పట్టం కట్టమని చెప్పలేదు కానీ కాంగ్రెస్ టైటానిక్ షిప్పులో నుండి బయటకు దూకేసి ‘ప్రాంతీయ లైఫ్ బోట్లు’ ఏర్పాటుచేసుకొని చల్లగా, చాలా సుఖంగా బ్రతికేస్తున్న రకరకాల పిల్ల కాంగ్రెస్ పార్టీలను అన్నిటినీ మళ్ళీ తమ టైటానిక్ షిప్పులోకి ఎక్కించుకోవాలని సూచించారు.   కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి రెండు రాష్ట్రాలలో పార్టీకి మంగళ హారతి పాడిన ఘనుడు దిగ్విజయ్ సింగ్ కూడా వై.యస్సార్ కాంగ్రెస్ (జగన్మోహన్ రెడ్డి), తృణమూల్ కాంగ్రెస్ (మమతా బెనర్జీ, పశ్చిమబెంగాల్), నేషనలిస్ట్ కాంగ్రెస్ (శరద్ పవార్, మహారాష్ట్ర) పార్టీలు వచ్చి కాంగ్రెస్ టైటానిక్ షిప్పులో ఎక్కి సేదతీరవలసిందిగా ఆహ్వానిస్తున్నారు.   ఇంతకు ముందు వారు ముగ్గురూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారే. కానీ వేరువేరు కారణాలతో వారు బయటకు వెళ్లి పోయి దర్జాగా బ్రతుకుతున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని ‘జస్ట్ మిస్’ అయ్యానని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి, మహారాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పుతున్న శరద్ పవార్ ముగ్గురూ మునిగిపోతున్న కాంగ్రెస్ నావ ఎందుకు ఎక్కాలో మాత్రం దిగ్గీ రాజా చెప్పలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దయనీయమయిన పరిస్థితిలో ఉంది కనుకనే వారందరూ వచ్చి తనను బలోపేతం చేయాలని అడుగుతోంది. కానీ వారు వచ్చి చేరినా పెత్తనం మాత్రం రాహుల్ గాంధీయే చేస్తారు. అంటే వారు ఆయనకి సలాములు కొట్టవలసి ఉంటుందన్నమాట! అటువంటి ఖర్మ తమకేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.   కాంగ్రెస్ పార్టీ నాయకత్వ మార్పుకి సిద్దపడితే తప్ప ఈ గడ్డు పరిస్థితుల నుండి బయటపడలేదు. కానీ ఆ దిశలో ఆలోచించకుండా “గాంధీ నెహ్రు సిద్ధాంతాలను (వారసులను) ఇష్టపడేవారెవరికయినా తమ పార్టీ ఆహ్వానం పలుకుతుందని” ప్రకటిస్తే ఎవరు మాత్రం పట్టించుకొంటారు. అయినా కాంగ్రెస్ టైటానిక్ షిప్పుని రాహుల్ గాంధీ నడిపించేందుకు దూసుకు వచ్చేస్తున్నప్పుడు ఇంకా ఇలాగ ప్రాంతీయపార్టీలని దేబిరించవలసిన ఖర్మ ఏమిటో?

ఉగ్రవాదులను స్మగ్లర్లను ప్రభుత్వాలు ఉపేక్షించాలా?

  తెలుగు రాష్ట్రాలు రెండూ ఒకేసారి ఇంచుమించు ఒకే రకమయిన పరిస్థితులను ఎదుర్కోవలసి రావడం చాలా విచిత్రమే. తిరుపతి సమీపంలో శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ కారణంగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపక్షాల నుండి విమర్శలు ఎదుర్కొంటుంటే, జనగామలో జరిగిన ఎన్కౌంటర్ లో ఉగ్రవాది వికారుద్దీన్ ముఠాని పోలీసులు మట్టుబెట్టడాన్ని తెలంగాణాలో మజ్లీస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. అయితే రెండు రాష్ట్రాలలో జరిగిన ఎన్కౌంటర్లలో చనిపోయినవారు తీవ్ర నేరానికి పాల్పడిన వారు లేదా పాల్పడుతున్నవారే.   శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగిలింగ్ ఈరోజు కొత్తగా మొదలయిందేమీ కాదు. అనేక ఏళ్లుగా కొందరు రాజకీయ నాయకులు, పలుకుబడిగల వ్యక్తుల అండదండలతో సాగుతూనే ఉంది. వారిలో రాష్ట్రానికి చెందినా కొందరు రాజకీయ ప్రముఖుల హస్తం ఉందని వార్తలు వచ్చేయి. అయితే ఇంతవరకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత కటినంగా వ్యవహరించకపోవడం వలన ఎర్రచందనం స్మగిలింగ్ యదేచ్చగా కొనసాగుతోంది.   రాష్ట్ర అటవీ శాఖ లేదా అధీకృత వ్యక్తులు ఇంతవరకు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికిన దాఖలాలు లేవు. కానీ స్మగ్లర్లు మాత్రం నిత్యం ఎర్రచందనం చెట్లను నరికి స్మగిలింగ్ చేస్తూనే ఉన్నారు. అటవీ శాఖ అధికారులు, పోలీసులు ఎన్నిసార్లు పట్టుకొన్నప్పటికీ రాజకీయ పలుకుబడి గల స్మగ్లర్లు తమిళనాడు నుండి కూలీలను తీసుకువచ్చి మరీ లారీలలో ఎర్రచందనం తరలించగలుగుతున్నారంటే వారు ఎంత బరి తెగించిపోయారో అర్ధమవుతుంది. అంతేగాక తమను అడ్డుకొన్న అటవీ శాఖ సిబ్బందిపై దాడులు చేసి అధికారులను చంపిన సంఘటనలు కూడా గతంలో జరిగాయి. కానీ అప్పుడు ఏ మానవ హక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా స్పందించిన దాఖలాలు లేవు.   తమ రాష్ట్రానికి చెందిన కూలీలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిత్యం అరెస్టులు చేస్తున్నప్పుడు కూడా తమిళనాడు ప్రభుత్వం ఈ వ్యవహారంతో తమ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధమూ లేదన్నట్లు వ్యవహరించింది తప్ప వారికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు ఎన్నడూ చేయలేదు. కానీ ఇప్పుడు అమాయకులయిన తమ కూలీలను ఆంధ్రా పోలీసులు కిరాతకంగా చంపారని తమిళనాడులో రాజకీయ పార్టీలు, తమిళనాడు ప్రభుత్వం, మానవ హక్కుల సంఘాలు, రాష్ట్రంలో ప్రతిపక్షాలు మూకుమ్మడిగా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.   కానీ వారిలో ఏ ఒక్కరూ కూడా ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సుపై నెల్లూరు సరిహద్దులో దుండగులు దాడి చేయడాని కానీ, బస్సులోకి పెట్రోల్ బాంబు విసరడాన్ని కానీ తప్పు పట్టడం లేదు. కనీసం దాని గురించి మాట్లాడలేదు కూడా. మానవ హక్కులు గురించి గొంతు చించుకొని అరుస్తున్న వారు బస్సులో ఉన్న ప్రయాణికులపై పెట్రోల్ బాంబు విసరడాన్ని ఎందుకు తప్పుపట్టడం లేదు అంటే బస్సులో ప్రయాణికులు ఎవరూ చనిపోలేదు గనుక అని సరిపెట్టుకోవలసి ఉంటుందేమో?   ఈ ఎన్కౌంటర్లో కూలీలే మరణించి ఉండవచ్చును. కానీ ఇటువంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్నప్పుడు ఇటువంటి పరిణామాలే ఎదురయ్యే ప్రమాదం ఉందని తెలిసే వచ్చేరు. ఒకవేళ వారు తమ స్వంత రాష్ట్రంలోనే ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడితే అప్పుడు తమిళనాడు ప్రభుత్వం వారిని ఉపేక్షిస్తుందని ఎవరూ భావించారు. కానీ అంతమాత్రాన్న వారిని పోలీసులు ఎన్కౌంటర్ చేయడం న్యాయమణి సమర్ధించలేము కూడా. కానీ పోలీసులు హెచ్చరించినప్పుడు వారు లొంగిపోయుంటే షరా మామూలుగా వారినందరినీ అరెస్ట్ చేసి ఇంతకు ముందులాగే జైలుకి తరలించేవారు. అప్పుడు ఆ వార్త షరా మామూలుగానే మీడియాలో కనబడేది. కానీ ఈసారి వారు తెగించి ప్రతిదాడులకి పాల్పడటం వలననే తాము ఆత్మరక్షణ కోసం వారిపై కాల్పులు జరపవలసి వచ్చిందని పోలీస్ అధికారులు చెపుతున్న మాట వాస్తవమని నమ్మక తప్పదు.   కనుక ఈ సంఘటన నుండి తమిళనాడు ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోవలసి ఉంది. ఇప్పటికయినా మేల్కొని తమ రాష్ట్ర కూలీలను ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన కుండా కట్టుదిట్టమయిన చర్యలు చేప్పట్టవలసి ఉంది. ఇక పోలీసులు కూడా రాష్ట్రానికి, ప్రజలకి, ప్రభుత్వానికి భద్రత కల్పించడానికే పరిమితమవ్వాలి తప్ప వారి వలన రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త సమస్యలు సృష్టించకూడదు. సున్నితమయిన ఇటువంటి వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరమని ఈ సంఘటన, దాని విపరీత పరిణామాలు తెలియజేస్తున్నాయి.   ఇక తెలంగాణా రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన కరుడుగట్టిన తీవ్రవాది అనేక నేరాలకు పాల్పడిన వికారుద్దీన్ అతని అనుచరుల ఎన్కౌంటర్ పై కూడా తెలంగాణాలో మజ్లీస్ పార్టీ యంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించడం విస్మయం కలిగిస్తోంది. అటువంటి సంఘ విద్రోహ వ్యక్తులు తప్పించుకొని పారిపోతుంటే పోలీసులు చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చొని ఉంటే వారు హైదరాబాదులోనే మరొక చోటనో బాంబు ప్రేలుళ్ళకు పాల్పడి అమాయకులయిన ప్రజల ప్రాణాలు బలిగొనకుండా ఊరుకోరని అందరికీ తెలుసు. అందుకే వారి చావుకి ప్రజలెవ్వరూ కించిత్ విచారం వ్యక్తం చేయడం లేదు. కానీ వారు ముస్లిములనే ఏకైక కారణంతో వారిని వెనకేసుకు వస్తే అంతకంటే అవివేకమ మరొకటి ఉండబోదు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా వంటి పూర్తి ముస్లిం దేశాలలో ప్రజలణి అభం శుభం తెలియని చిన్నారులను పొట్టనబెట్టుకొంటున్న ఉగ్రవాదులు ఎవరినీ ఉపేక్షించరనే సంగతి తెలిసిన తరువాత కూడా అటువంటి వారికి మతం పేరిట వంతపాడటం అవివేకం.

‘రియల్’ జోరుతో ఏపీ ఆదాయం అదరహో...

  రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి చాలా దయనీయంగా మారింది. క్రిందటి నెలాఖరు రోజున కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి నిధులు విడుదల చేయకపోయుంటే ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొనేందుకు సిద్దమయిందంటే పరిస్థితి ఎంత తీవ్రత అర్ధమవుతుంది. అలాగని ఈ 10 నెలల్లో రాష్ట్ర ఆర్ధికపరిస్థితి మెరుగవలేదనుకోవడానికీ లేదు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో కేవలం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ల మీద వచ్చిన ఆదాయం 6 నుండి 126 శాతం పెరిగింది. రాష్ట్రంలో 13జిల్లాలలో రిజిస్ట్రేషన్ల ఆదాయం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ. 792.51 కోట్లు పెరిగింది.   శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 6.4 శాతం వృద్ధి నమోదు కాగా గుంటూరు జిల్లాలో అత్యధికంగా 126 శాతం వృద్ధి నమోదు అయింది. ఆ తరువాత వరుసగా కృష్ణా, తూర్పు పశ్చిమ గోదావరి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మంచి అభివృద్ధి కనబడింది. కడప, కర్నూలు, విజయనగరం, జిల్లాలలో రిజిస్ట్రేషన్ల ఆదాయంలో కూడా మంచి అభివృద్దే కనబడింది. కానీ అనంతపురం జిల్లాలో మాత్రం గతేడాది ఇదేసమయానికి రిజిస్ట్రేషన్ల శాఖ రూ. 240.47కోట్లు ఆదాయం ఆర్జించగా ఈ ఏడాది ఇంతవరకు కేవలం 108.35కోట్లు మాత్రమే వసూలయింది. బహుశః రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల దృష్టి ప్రధానంగా రాజధాని ప్రాంతంపై ఆ తరువాత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్న కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, విశాఖ, చిత్తూరు, నెల్లూరు జిల్లాలపైనే ఉన్నందునే మిగిలిన జిల్లాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇంకా అంత పుంజుకోలేదేమో? రాయలసీమ మరియు ఉత్తరాంద్రాలో వెనుకబడిన అనంతపురం, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలలో పరిశ్రమల స్థాపన మొదలయితే అక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోవచ్చును. 

రాహుల్ గాంధీ అసమర్థతే వారికి ప్రేరణ?

  దేశాన్ని ఎప్పుడూ కాంగ్రెస్, బీజేపీలే తప్ప మరో పార్టీకి అధికారం చేప్పట్టే అవకాశం ఉండకపోతే ఎలా? అని మధనపడిపోయేవారికి కొదవలేదు. అటువంటి వారందరూ కలిసి ఎన్నికల ముందు థర్డ్ ఫ్రంటు స్థాపించే ప్రయత్నాలు చేస్తుంటారు. గతేడాది ఎన్నికల ముందు కూడా ఎర్ర పార్టీలు, లాలూలు, ములాయములు, అమ్మలు అక్కలు అందరూ కలిసి అటువంటి ప్రయత్నమే చేసారు. కానీ షరా మామూలుగానే ఎన్నికల ముందు పుట్టిన థర్డ్ ఫ్రంటు ఎన్నికల ముగిసే సమయానికి కనబడకుండా పోయింది.   అయితే జీవితంలో ఎప్పటికయినా దేశానికి ప్రధానమంత్రి కావాలని తపించే ములాయం సింగ్, లాలూప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ వంటి వారు, కాంగ్రెస్, బీజేపీలున్నంత కాలం తమకి ఆ అవకాశం రాదని గ్రహించి, ‘జనతా’ తోకలు తగిలించుకొన్న రకరకాల పార్టీలన్నిటినీ ఒక్క త్రాటిపైకి తీసుకువచ్చి ‘జనతా పరివార్’ అనే మరో కొత్త ప్రయోగం మొదలుపెట్టారు. దానికి సమాజ్ వాదీ అధినేత ములాయం సింగ్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. దేశంలో లౌకికవాద పార్టీలను అన్నిటినీ కూడగట్టి కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా తమ కూటమిని తీర్చిదిద్దుతామని ప్రకటించారు.   అయితే ఇదే లాలూ, ములాయం సింగ్ లు నిన్నమొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి తోకలుగానే వ్యవహరించారు. కానీ ఇప్పుడు డానికే తామె౩ దానికి ప్రత్యామ్నాయమవుతామని చెప్పుకొంటున్నారు. వారి ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో తెలియదు కానీ వారు ఇప్పుడే ఎందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారంటే అందుకు చాలా బలమయిన కారణమే ఉంది.   ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది కానీ దానికి ఏకైక ప్రత్యామ్నాయంగా కనబడుతున్న కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ‘రాహుకాలం’ దానివలన పార్టీకి మరింత క్షీణదశ మొదలయినట్లేనని భావిస్తున్నందునే వారికి ఈ జనతా ప్రేరేపణ కలిగించి ఉండవచ్చును. కాంగ్రెస్ బలహీనత కారణంగా ఏర్పడుతున్న ఈ రాజకీయ శూన్యతను కొమ్ములు తిరిగిన తమ వంటి నేతలు మాత్రమే నింపగలమనే నమ్మకం వారికి కలిగితే ఆశ్చర్యం లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ కాకుండా సమర్ధుడు, అనుభవజ్ఞుడు అయిన నేత మరొకరెవరయినా నేతృత్వం వహించి ఉంటే బహుశః ఈ లాలూలకి, ములాయములకి ఈ ‘జనతా ఆలోచన’ వచ్చేది కాదేమో? అంటే రాహుల్ గాంధీ అసమర్ధతమీద వారికంత నమ్మకం ఉందన్నమాట! అంటే వారి జనతా పరివార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యమ్నాయమే గానీ బీజేపీకి, ఎన్డీయేకి కాదని అర్ధమవుతోంది.   కానీ కనీసం కాంగ్రెస్ పార్టీకయినా ప్రత్యామ్నాయం కాగలదా? అంటే అనుమానమే. ఎందుకంటే ఇంతకాలం కాంగ్రెస్ పార్టీకి తోకలుగా ఉన్న జనతా పార్టీలు ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకొంటునప్పటికీ, దేశ ప్రజలు వారిని విశ్వసించబోరు. పైగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, జైలుకి వెళ్లి వచ్చినవారు వారివారి రాష్ట్రాలలో ఎలాగో అధికారంలోకి రావచ్చును. కానీ అటువంటి వారందరూ చేతులు కలిపితే అదొక ‘జనతా అవినీతి పరివార్’గా మరింత ప్రస్పుటంగా కనబడుతుంది. కనుక ప్రజలు తిరస్కరించే అవకాశాలున్నాయి.   జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలే ఎంత శ్రమపడినా దక్షిణాది రాష్ట్రాలపై ఇంతవరకు పట్టు సాధించలేకపోతున్నాయి. అటువంటప్పుడు ఉత్తరాదిన కేవలం రెండు మూడు రాష్ట్రాలకు పరిమితమయిన ఓ మూడు నాలుగు ప్రాంతీయ పార్టీలు కలిసి ‘జనతా పరివార్’ పేరు పెట్టుకొని దక్షిణాది ప్రజలను మెప్పించగలగడం అసంభవం. అయినా ఎటువంటి సిద్దాంతాలు లేకుండా కేంద్రంలో అధికారం సాధించడం, ప్రధానమంత్రి పదవే పరమావధిగా ఏర్పడుతున్న జనతా పరివార్ ని దక్షినాది ప్రజలు అసలు పట్టించుకోబోరని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఒకవేళ వారు ఏర్పాటు చేసుకొంటున్న ఈ జనతా గొడుగు క్రింద కొంత కాలం సాగినప్పటికీ, ఎన్నికల సమయానికి మళ్ళీ విచ్చినం అయిపోవచ్చును.

ప్రవేశపన్నుపై భిన్న వాదనలు

  ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణాలోకి ప్రవేశిస్తున్న ఆంధ్రా వాహనాలపై తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపన్ను విధించడంతో రెండు రాష్ట్రాల మధ్య మళ్ళీ కొత్త సమస్య మొదలయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనిపై అభ్యంతరం తెలుపుతోంది. దీనిపై ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషనుపై దాఖలయింది కనుక హైకోర్టు తీర్పు వెలువడిన తరువాత తదుపరి చర్యలు చేప్పట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణా ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని సమర్ధించుకొంటోంది.   తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత కూడా ఇంకా ఈ షరతులు, ఆంక్షలు విధిస్తుంటే ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేసి ఏమి ప్రయోజనం? తమ రాష్ట్ర ప్రయోజనాలను, హక్కులను కాపాడుకొనే హక్కు తమ ప్రభుత్వానికి లేదా?తమ రాష్ట్ర అవసరాలకు, అభివృద్ధికి అనుగుణంగా చట్టాలు చేసుకొనే హక్కు తమకు లేదా? అని తెలంగాణా ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత కూడా దేశంలో మరే ఇతర రాష్ట్రాలకు లేని ఆంక్షలు తమకే ఎందుకని తెలంగాణా ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఆ వాదనలు, ఆవేదన సహేతుకమే. కానీ అటువంటి పరిస్థితి ఎందుకు కలిగిందో తెలంగాణా ప్రభుత్వానికి, దానిని నడుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి కూడా తెలుసు.   సార్వత్రిక ఎన్నికలలోగా  రాష్ట్ర విభజన జరిగితే చాలన్నట్లు తెరాస పార్టీ వ్యవహరించింది.తెరాస ఒత్తిడి కారణంగా, తరుముకొస్తున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని యూపీఏ ప్రభుత్వం చాలా సంక్లిష్టమయిన రాష్ట్ర విభజనను తూతూ మంత్రంలా హడావుడిగా పూర్తి చేసి చేతులు దులుపుకోనేందుకే ప్రయత్నించింది తప్ప అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏకరువు పెడుతున్న ఏ ఒక్క సమస్యను కూడా పట్టించుకోలేదు.    అయితే గత పదేళ్ళుగా తెలంగాణా కోసం ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఏదో ఒకరోజు రాష్ట్రవిభజన చేయక తప్పదని కాంగ్రెస్ పార్టీకి తెలిసి ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాలకు అందుకు తగ్గట్లుగా ముందస్తు ఏర్పాట్లు చేయలేదు. ముందస్తు ఏర్పాట్లు చేసిన తరువాత తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసి ఉండి ఉంటే ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అయ్యేవి కావు.   దేశంలో మిగిలిన రాష్ట్రాల నుండి తెలంగాణాలో ప్రవేశించే వాహనాలపై ప్రవేశపన్ను విధించడంలో ఎవరూ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదనే విషయం గమనిస్తే, ఈ సమస్య కేవలం ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు మాత్రమే పరిమితమని, రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాల మధ్య ఉమ్మడి రాజధాని బంధం ఉన్నందునే ఈ సమస్య ఉత్పన్నం అవుతోందనే సంగతి స్పష్టం అవుతోంది. కనుక ఇది తెలంగాణా రాష్ట్ర హక్కులకు, ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న సమస్యగా చూడటం సమంజసం కాదు. రెండు రాష్ట్రాలకు మరో తొమ్మిదేళ్ళపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటునప్పుడు ఆంధ్రప్రదేశ్ వాహనాలు తమ రాజధానికి వెళ్ళాలంటే ప్రవేశపన్ను చెల్లించాలని తెలంగాణా ప్రభుత్వం కోరడం సహేతుకం కాదు.   ఆంధ్రప్రదేశ్ వాహనాలపై తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపన్ను విధిస్తే అందుకు బదులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణా నుండి వచ్చే వాహనాలపై పన్ను విధించడం మొదలుపెడితే ముందుగా నష్టపోయేది ప్రజలే. కనుక కనీసం ఈ ఉమ్మడి బంధం కొనసాగినంత కాలం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి అంశాలపై పరస్పరం చర్చించుకొని నిర్ణయాలు తీసుకొంటే ఇటువంటి సమస్యలను నివారించవచ్చును. ఈ అంశంపై హైకోర్టు ఎలాగూ తన తీర్పు వెల్లడించబోతోంది. కనుక ఎవరికి ఎటువంటి అభిప్రాయాలున్నప్పటికీ కోర్టు తీర్పు కోసం వేచి చూడటమే మంచిది.

మంచివాళ్ళకే కష్టాలన్నీనూ....

  మన రాష్ట్ర రాజకీయ నాయకులలో నీతి నిజాయితీలతో ఎక్కువగా కనెక్ట్ అయ్యుండేవారిలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఒకరు. పాపం ఆయన నీతి నిజాయితీలకు కట్టుబడి ఉండాలనుకొన్న కారణంగానే ఎన్నికలలో ఓడిపోయానని తరచూ చెప్పుకొంటుంటారు. అంతమాత్రాన్న ఆయన కవచ కుండలాల వంటి తన నీతి నిజాయితీలను విడిచిపెట్టేయలేదు. అటువంటి వ్యక్తి మీద కాంగ్రెస్ పార్టీ కుట్రపన్ని అన్యాయంగా సీబీఐ కేసులు బనాయించింది. కానీ తన మీద అన్యాయంగా కేసులు బనాయించిన కాంగ్రెస్ అధిష్టానం చలవతోనే ఆయన బెయిలు మీద జైలు నుండి బయటకు రాగలిగారని మీడియాలో అప్పుడెప్పుడో గుప్పుగుప్పున వార్తలు వస్తే ‘నిప్పు లేనిదే పొగ రాదు కదా’ అని ఆయన ప్రత్యర్ధులు కూడా వంత పాడారు.   అయితే చార్జ్ షీట్లు పడినంత మాత్రాన్నఎవరూ దోషి అయిపోరు...బెయిలు దొరికిన వాళ్ళు చట్ట సభలలో న్యాయం ధర్మం ప్రజా సంక్షేమం గురించి మాట్లాడకూడదని ఎక్కడా రూలు లేదు కనుక జగన్మోహన్ రెడ్డి కూడా శాసనసభలో అధికార పార్టీ అవినీతికి పాల్పడుతోందని చాలా కోప్పడిపోయారు. ఆ తరువాత ఆయన శ్రమ అనుకోకుండా డిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిసి రాష్ట్రంలో జరిగిపోతున్న అన్యాయాలను, అక్రమాలను ఏకరువు పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే ఆయన ఇంగ్లీషులో బాగా మాట్లాడగలరు కనుక ఆ నోటితోనే డిల్లీలో ఉండే ఇంగ్లీషు మీడియా వాళ్ళకి కూడా అన్నీ వివరించేరు కూడా.   రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల గురించి మాట్లాడుతానని డిల్లీ వెళ్ళిన పెద్దమనిషి పట్టిసీమ ప్రాజెక్టు గురించే ఎక్కువ మాట్లాడారు. అందుకే తెదేపా నేతలు కూడా ఆయన తన సీబీఐ కేసులలో నుండి బయటపడేందుకే పనిగట్టుకొని డిల్లీ వెళ్ళారని ప్రత్యారోపణలు చేసారు. ఆయన డిల్లీ వెళ్ళినంత మాత్రాన్న 'అదే పని మీద' వెళ్ళినట్లేనా? అంటూ రోజమ్మగారు తిరిగి ప్రశ్నించారు. “మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డికి అందరి కాళ్ళు పట్టుకొనే అలవాటు లేదని” ఆమె తేల్చి చెప్పారు.   మరి జగన్ తన కేసుల గురించి మోడీజీతో మాట్లాడేరో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ కూడా అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డిపై నాంపల్లి కోర్టులో మొట్ట మొదటి చార్జ్ షీట్ దాఖలు చేసారు. అదే చేత్తో ఆయనకు చెందిన జగతీ పబ్లికేషన్స్, విజయసాయి రెడ్డిల పేర్లను కూడా ఆ చార్జ్ షీట్లో చేర్చారు. ఏ సంస్థ అయిన లాభాలు ఆర్జిస్తుంటే దానిలో మదుపరులు పెట్టుబడులు పెడుతుంటారు. కానీ జగతీ పబ్లికేషన్స్ (సాక్షి మీడియా) ఇంకా స్థాపించకముందే డెల్లాయిత్స్ ఆడిటింగ్ సంస్థ చేత జగతీ పబ్లికేషన్స్ సంస్థ విలువను రూ. 3050 కోట్లుగా (అధికంగా చేసి) చూపించి, దాని షేర్ విలువను రూ.350గా నిర్ధారించి, వివిధ పారిశ్రామికవేత్తలను జగతీలో పెట్టుబడులు పెట్టించేరని, అందుకు ప్రతిగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ద్వారా సదరు పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వ భూములను మిఠాయిలు పంచిపెట్టినట్లు అప్పనంగా పంచి పెట్టేరని ఈడీ అధికారులు వాదన.   ఏమిటో కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్లు నీతి నిజాయితీకి కట్టుబడిపోయిన జగన్మోహన్ రెడ్డి మీదనే ఈ ఆరోపణలన్నీనూ. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం ఏమిటయ్యా అంటే పాపం ఆయన ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఓదార్పు యాత్రలు చేయడమే. అందుకే ఆయనకీ కష్టాలన్నీ...అని చెప్పుకొంటారు. నమ్మిన వాళ్ళు నమ్ముతారు లేని వాళ్ళు లేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా సీబీఐ, ఈడీ అధికారులు మాత్రం ఆయన మాటలను నమ్మకపోవడం ఏమనుకోవాలి? అసలు ఓదార్పుయాత్రలు చేసుకొనే హక్కు కూడా లేకపోతే ఎవరిని మాత్రం ఎవరు ఓదార్చగలరు?   కాంగ్రెస్ పార్టీ కక్ష గట్టి కేసులు బనాయించిందని అని బాధపడుతున్న జగన్మోహన్ రెడ్డికి ఆ కాంగ్రెస్ పోయి ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చినా కష్టాలు తప్పడం లేదేమిటో? మోడీతో కష్టసుఖాలు చెప్పుకొన్న తరువాత కూడా ఈడీ అధికారులు ఈవిధంగా కక్ష కట్టి చార్జ్ షీట్ పెట్టడం చూస్తుంటే ఇక వైకాపాలో తప్ప మరెక్కడా మంచితనానికి, నీతికి నిజాయితీకి స్థానం లేకుండా పోయిందనుకోక తప్పదు.  

రాష్ట్రం ఆర్ధికంగా నిలద్రొక్కుకొంటే కేంద్రానికి కూడా మేలే కదా

  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత తొమ్మిది నెలలుగా డిల్లీ చుట్టూ చేస్తున్న ప్రదక్షిణాలకు ఫలితం దక్కింది. మార్చి 31న ఆర్ధిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వివిధ పద్దుల క్రింద సోమవారం నుండి బుధవారం వరకు మొత్తం రూ. 8, 375కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమా అయ్యాయి. వాటిలో రెవెన్యూ లోటు పూడ్చేందుకు రూ.1,800 కోట్లు, రాజధాని నిర్మాణం కోసం రూ.1,500 కోట్లు, అమ్మకం పన్ను పరిహారం క్రింద రూ.544 కోట్లు, పుష్కరాల కోసం రూ.100 కోట్లు, వివిధ పద్దుల క్రింద మరో రూ.25-30కోట్లు రాష్ట్ర ఖజానాలో జమా అయ్యాయి. ఇవికాక 13వ మరియు 14వ ఆర్ధిక సంఘాల సిఫార్సుల మేరకు (2014-15; 2015-16 సం.లకి) కేంద్ర పన్నులలో వాటాగా మొత్తం రూ. 3, 080 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమా అయ్యాయి.   ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి కూడా ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ కేంద్రం నుండి నిధులు రాకపోతే ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా డబ్బు ఏర్పాటు చేసుకొనేందుకు సిద్దపడింది. కానీ కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లే మార్చి 31వ తేదీ అర్ధరాత్రిలోగా రాష్ట్రానికి భారీగా నిధులు విడుదల చేసింది. నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుండటం, కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదల చేస్తుండటమనేది ఒక నిరంతర ప్రక్రియగా మారిపోయింది. ఆ కారణంగా తెదేపా, బీజేపీల మధ్య భేదాభిప్రాయాలు కూడా వస్తున్నాయి.   రాష్ట్రానికి సరయిన ఆర్ధికవనరులు ఏర్పాటు చేయకుండా కాంగ్రెస్ పార్టీ తన స్వీయ రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకొని హడావుడిగా రాష్ట్ర విభజన చేయడం వలననే ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుకి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శిక్ష అనుభవిస్తున్నాయి. కానీ ఇప్పుడు జరిగిపోయిన దానిని తలుచుకొని చింతిస్తూ, కాంగెస్ పార్టీని నిందిస్తూ కూర్చోవడం వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండదు.   కనుక ఈ సమస్యను అధిగమించాలంటే రాష్ట్రంలో వేగంగా పారిశ్రామిక అభివృద్ధి జరిగడమే తగిన పరిష్కారం కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రానికి కొన్ని చిన్నా,పెద్ద  పరిశ్రమలను రప్పించగలిగారు. మరికొన్ని త్వరలో రాబోతున్నాయి. కానీ ఇంతవరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వలన అనేకమంది పారిశ్రామికవేత్తలు వేచిచూస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే సూచనలేవీ కనిపించకపోవడంతో, రాష్ట్ర ప్రభుత్వమే నూతన పారిశ్రామిక విధానం ప్రకటించి పరిశ్రమలకు భారీ రాయితీలు కల్పించి వారిని కూడా రాష్ట్రానికి రప్పించేందుకు గట్టిగా కృషి చేస్తోంది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తన ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరుచుకొనేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ పరిశ్రమలు స్థాపన జరిగి, వాటి ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరడానికి కనీసం ఒకటి రెండు సం.లు పట్టవచ్చును. అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఆధారపడక తప్పదు.   కనుక కేంద్ర ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేస్తున్నప్పటికీ, వీలయినంత త్వరగా ఈ భారాన్ని తగ్గించుకోవడం కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా అది వీలుపడదనుకొంటే అందుకు సరిసమానంగా రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక రాయితీలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించవలసి ఉంటుంది. రాష్ట్రం ఆర్ధికంగా నిలద్రొక్కుకొనేందుకు కేంద్రప్రభుత్వం అవసరమయిన సహాయ సహకారాలు అందించగలిగితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఈ సమస్య నుండి త్వరగా బయటపడగలవు. లేకుంటే వచ్చే ఎన్నికల వరకు వాటి మధ్య ఇదే తంతు కొనసాగడం తధ్యం. దాని వలన తెదేపా, బీజేపీల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడం తధ్యం. ఆ కారణంగా రెండు పార్టీలు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. కనుక దీనిని కేవలం రాష్ట్ర ప్రభుత్వ సమస్యగా మాత్రమే చూడకుండా కేంద్రం కూడా పూర్తి బాధ్యత స్వీకరించవలసి ఉంటుంది.

రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వంత ప్రయోజనాలే ముఖ్యమా?

  ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన పట్టిసీమ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంఖుస్థాపన చేస్తున్నప్పుడే దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జగన్మోహన్ రెడ్డి డిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసి పిర్యాదు చేసారు. ఆ తరువాత ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిసి ఆయనకు కూడా ఈ పట్టిసీమ ప్రాజెక్టు గురించి పిర్యాదు చేసారుముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏదో విధంగా నిధులు రాబట్టేందుకు గట్టిగా కృషి చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని డిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వంపై పిర్యాదులు చేస్తున్నారు. కేంద్రం విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఈవిధంగా దుర్వినియోగం చేస్తోందని జగన్మోహన్ రెడ్డి కేంద్రప్రభుత్వానికి నచ్చజెప్పుతున్నట్లుంది. ఒకవేళ ప్రధానమంత్రి, ఆర్ధికమంత్రి జగన్మోహన్ రెడ్డి చెపుతున్న మాటలు నమ్మి రాష్ట్రానికి విడుదల కావలసిన నిధులలో కోత పెట్టినట్లయితే రాష్ట్రానికి తీరని నష్టం జరిగే ప్రమాదం ఉంది.   జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ శత్రువు తెదేపాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని దెబ్బతీసేందుకు ఈవిధంగా రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం చాలా తప్పు. ఒకవేళ పట్టిసీమ ప్రాజెక్టు వలన రాష్ట్రానికి నష్టం కలుగుతుందని ఆయన దృడంగా విశ్వసిస్తున్నట్లయితే దానిని అడ్డుకొనేందుకు ఆయన కోర్టులను ఆశ్రయించవచ్చును. ఈ అంశంతో కూడా ఆయన తన పార్టీకి రాజకీయ లబ్ది కలగాలని భావిస్తే అందుకోసం రాష్ట్రంలో ధర్నాలు, ర్యాలీలు చేసుకోవచ్చును. కానీ ఈవిధంగా రాష్ట్ర ప్రభుత్వంపై, అది చేపడుతున్న ప్రాజెక్టులపై డిల్లీ వెళ్లి కేంద్రానికి పిర్యాదులు చేయడం వలన రాష్ట్రానికి తీరని నష్టం జరిగే ప్రమాదం ఉంది.   ఇంతకు ముందు పంట రుణాల మాఫీపై ధర్నాలు, మహాధర్నాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ తరువాత రాజధాని నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేసారు. కానీ ఇప్పుడు ఆయన వాటి గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే వాటి వలన ఇక తన పార్టీకి ఎటువంటి రాజకీయ లబ్ది కలగదని గ్రహించడం వలన కావచ్చును. అందుకే ఆయన ఇప్పుడు పట్టిసీమ ప్రాజెక్టును పట్టుకొని రాద్ధాంతం చేస్తున్నారు. బహుశః దీని తరువాత మరొక సరికొత్త అంశం ఏదో అందిపుచ్చుకొని హడావుడి చేయవచ్చును. కానీ ఆయన తన పార్టీ ప్రయోజనాల కోసం, రాజకీయ కక్షల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టాలనుకొంటే మాత్రం ప్రజలు సహించబోరనే సంగతి గ్రహించాలి.

ఆంధ్ర, తెలంగాణల్లో బీజేపీ బలపడగలదా?

  ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కోరుకొంటున్నారు. అందుకోసం ముందుగా ఆంధ్రాకు చెందిన పార్టీ నేతలతో మోన్న డిల్లీలో సమావేశమయ్యి వారికి అవసరమయిన సూచనలు, సలహాలు ఇచ్చేరు. తెలంగాణా నేతలతో సమావేశమయ్యేందుకు ఆయన త్వరలోనే హైదరాబాద్ కి రాబోతున్నారు. కానీ వచ్చే ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి చాలా అవరోధాలున్నాయి. రెండు రాష్ట్రాలలో నేతలందరూ గట్టి ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో బీజేపీ బలంగా ఉన్నట్లే కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ప్రస్తుతం తెరాస పార్టీ తెలంగాణాలో అధికారంలో ఉంది గనుక మిగిలిన పార్టీలకంటే చాలా బలంగా ఉంది. ఇంతవరకు తెలంగాణాకోసం పోరాడి విజయం సాధించిన తెరాస, ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణం చేయబోతున్నట్లు ప్రకటించి ఆ దిశలో అడుగులు వేయడం మొదలుపెట్టింది. కనుక మిగిలిన ఈ నాలుగేళ్లలో తెలంగాణా రాష్ట్రాభివృద్ధి చేసి చూపించగలిగితే ప్రజలు దానివైపే మొగ్గు చూపవచ్చును లేకుంటే ఇతర రాజకీయ పార్టీలవైపు చూడవచ్చును.   ఒకవేళ అప్పటికి మోడీ ప్రభుత్వం దేశ ఆర్ధిక, పారిశ్రామిక వ్యవస్థలను గాడిన పెట్టగలిగితే, అది తెలంగాణాలో బీజేపీకి సానుకూలాంశంగా మారగలదు. అదేవిధంగా వచ్చే ఎన్నికల నాటికి తెదేపా, బీజేపీలు కలిసి పనిచేస్తాయా లేదా? అనే అంశం కూడా బీజేపీపై ప్రభావం చూపవచ్చును. తెలంగాణాలో బీజేపీకి ఉన్న మరో సౌకర్యం ఏమిటంటే అక్కడ అధికార తెరాసతో ఎటువంటి పొత్తులు లేకపోవడం. కనుక తెలంగాణా బీజేపీ నేతలు నిర్మొహమాటంగా అధికార తెరాస ప్రభుత్వాన్ని విమర్శించుతూ ప్రభుత్వంతో పోరాడవచ్చును. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పినట్లుగా మిగిలిన ఈ నాలుగేళ్ల సమయంలో తెలంగాణాలో బీజేపీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసుకోగలిగినట్లయితే తెరాసను ఎదుర్కోగలదు.   ఇక ఆంధ్రాలో బీజేపీ పరిస్థితి అంత గొప్పగాలేదని, తెదేపా, వైకాపాలు మాత్రమే చాలా బలంగా ఉన్నాయనే సంగతి బీజేపీ నేతలు కూడా అంగీకరిస్తారు. పైగా బీజేపీ, తెదేపాలు మిత్రపక్షంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా సాగుతున్నాయి. కనుక ఒకరినొకరు విమర్శించుకోవడం కష్టం. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో బీజేపీ బలపడాలంటే ముందుగా పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసుకోవలసి ఉంటుంది. ఆ ప్రయత్నంలో మిత్రపక్షమయిన తెదేపాకు ఎటువంటి అభ్యంతరాలు, ఇబ్బందులు కలుగకుండా చూసుకొంటూ ఆచితూచి అడుగులు వేయవలసి ఉంటుంది.   బీజేపీ వ్యూహాన్ని నిశితంగా గమనించినట్లయితే ఆ పార్టీ అధిష్టానం ఒకపక్క జగన్మోహన్ రెడ్డిని మంచిచేసుకొంటూ మరోవైపు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయడం ద్వారా తను బలపడాలని భావిస్తున్నట్లుంది. కానీ రాష్ట్రాభివృద్ధి కోసం తెదేపా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు బీజేపీ తన వంతు సహాయసహకారాలు అందించి తోడ్పడే బదులు, వైకాపాతో చేతులు కలిపి తెదేపాను ఎదుర్కోవాలనుకొంటే బీజేపీకి లాభం కలుగకపోగా ప్రజలలో వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంటుంది. కానీ రాష్ట్రంలో తెదేపాతో కలిసి సాగినంత కాలం బీజేపీ ఎటువంటి గుర్తింపుకి నోచుకోదు. కనుక రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ తన ప్రయత్నాలు, వ్యూహాలు సిద్దం చేసుకోక తప్పదు. బహుశః అందుకే జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ అపాయింటుమెంటు దొరికిందేమో?

అప్పుడు అడగని జగన్ ఇప్పుడు డిల్లీ ఎందుకు బయలుదేరుతున్నట్లో

  కేంద్ర బడ్జెట్ లో ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడంతో ప్రజలు, ప్రతిపక్షాలు చివరికి బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న తెదేపా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. కానీ వైకాపా నేతలు వారి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గానీ పెదవి విప్పలేదు. తెదేపా నేతలు నిలదీసినప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు చాలా ఆశ్చర్యం కలిగించింది. పార్లమెంటులో తమ యంపీ సోమయాజులు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు గనుక తను ఈ విషయంపై స్పందించనవసరం లేదని చెప్పారు. అంటే ఏదో ప్రశ్నించాలి గాబట్టి ప్రశ్నిస్తున్నాము తప్ప తమకి ఆ ఉద్దేశ్యం లేదని చెప్పకనే చెప్పారు. పైగా “కేంద్రం నిధులు విడుదల చేయనప్పుడు తెదేపా తక్షణమే బీజేపీతో, ఎన్డీయే ప్రభుత్వంతో ఎందుకు తెగతెంపులు చేసుకోవడం లేదు?” అని జగన్మోహన్ రెడ్డి ఎదురు ప్రశ్నించారు.   “ఒకవేళ తెదేపా బీజేపీతో తెగతెంపులు చేసుకొని, ఎన్డీయే ప్రభుత్వం నుండి బయటకు వచ్చేసినట్లయితే, వైకాపా ఆ స్థానంలోకి ప్రవేశించాలనుకొంటోందేమో?” అని బీజేపీ నేత వెంకయ్యనాయుడే స్వయంగా అనుమానం వ్యక్తం చేసారు. తెదేపా నేతలు కూడా అటువంటి అనుమానమే వ్యక్తం చేసినా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖండించకపోవడాన్ని గమనిస్తే వారి అనుమానాలు నిజమేనని అనిపించక తప్పదు.   ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు విడుదల చేయకపోతే దానితో తెగతెంపులు చేసుకోమని సలహా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పనిగట్టుకొని డిల్లీ వెళ్లి ప్రధానిని వెళ్ళడం చూస్తే ఆయనకి రాష్ట్ర ప్రయోజనాల కంటే తన స్వంత పార్టీ ప్రయోజనాలే ఎక్కువని స్పష్టమవుతోంది. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి నిధులు విడుదల చేయనప్పుడు ఆ అంశంపై మాట్లాడేందుకు కూడా ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పనిగట్టుకొని అదేపని మీద డిల్లీ బయలుదేరడం అనుమానం కలిగిండం సహజమే.   ఇక ఈ వ్యవహరాని మరో కోణం నుండి కూడా చూడవలసి ఉంటుంది. తెదేపాకు రాజకీయ శత్రువయిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఇతర కేంద్రమంత్రులు అడగగానే అపాయింటుమెంటు ఇవ్వడం చూస్తే, బీజేపీ అధిష్టానం కూడా రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయ అవసరాలాను దృష్టిలో ఉంచుకొని వైకాపాతో సఖ్యత పాటిస్తున్నట్లుంది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత కనుకనే ఆయనకి ప్రధాని అంత త్వరగా అడిగినవెంటనే అపాయింటుమెంటు ఇస్తున్నారని బీజేపీ సర్ది చెప్పుకోవచ్చును. కానీ దాని వలన రాష్ట్ర ప్రజలకు, తన పార్టీ క్యాడర్ కి కూడా తప్పుడు సంకేతాలు వెళుతున్నాయనే సంగతి బీజేపీ అధిష్టానం విస్మరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.   ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనుకొంటోంది గనుకనే పార్టీ వ్యూహాలను, దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని వైకాపాతో కూడా బీజేపీ అధిష్టానం స్నేహం చేస్తోందనే భావన ప్రజలలో ఏర్పడుతోంది. దాని వలన బీజేపీకి లాభమో నష్టమో స్వయంగా బేరీజు వేసుకోవలసి ఉంటుంది.

ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస ఓటమికి అదే కారణమా?

  యం.యల్.సి.ఎన్నికలలో అధికార తెరాస పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన తెలంగాణా ఎన్జీవో సంఘాల నాయకుడు దేవీ ప్రసాదరావు ప్రజలకి చాలా సుపరిచితుడయినప్పటికీ బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావు చేతిలో ఓడిపోవడం ప్రతిపక్షపార్టీలనే కాక, తెరాసకు కూడా చాలా విస్మయం కలిగించింది. రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్ష నేతలు అందుకు రకరకాల కారణాలు చెపుతున్నారు.  దేవీ ప్రసాద్ ని ఓడించడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన ప్రభుత్వంపై తెలంగాణా ప్రజలు తమ ఆగ్రహం వెళ్ళబుచ్చారని తెదేపా శాసనసభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒంటెత్తు పోకడలు, నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ప్రజలు తెరాస అభ్యర్ధిని ఓడించారని ఆయన అన్నారు. యం.యల్సీ. ఎన్నికలలో ఘోరపరాజయం పొందిన తెలంగాణా కాంగ్రెస్ నేతలు కూడా ఇంచుమించు అటువంటి అభిప్రాయాలే వ్యక్తం చేసారు. అయితే తెలంగాణా ఇచ్చింది తెచ్చింది తామేనని చెప్పుకొనే కాంగ్రెస్ నేతలు తమ పార్టీ ఎందుకు ఓడిపోయిందో కారణాలు చెప్పడానికి ఇష్టపడటం లేదు.   తమ పార్టీకి సంస్థాత నిర్మాణం లేనందునే ఓటమి పాలయ్యామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ సమర్ధ పాలనకు మెచ్చే ప్రజలు తమ అభ్యర్ధి రామచంద్రరావుని గెలిపించారని బీజేపీ నేతలు చెపుతున్నారు. ఒకవేళ తెరాస అభ్యర్ధి ఓటమికి తెదేపా, కాంగ్రెస్ నేతలు చెపుతున్న కారణాలు నిజమనుకొంటే, అప్పుడు తెరాస అభ్యర్ధి పల్లా రాజేశ్వర రెడ్డి కూడా గెలిచి ఉండకూడదు. కానీ గెలిచారంటే వారు చెపుతున్న కారణం సహేతుకంగా లేదని అర్ధమవుతోంది.   ఈ యం.యల్సీ. ఎన్నికల ఫలితాలపై పార్టీల బలాబలాల ప్రభావం ఉందనే విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండదు. కానీ అంతకంటే ఎక్కువగా అభ్యర్ధుల వ్యక్తిగత బలాబలాలు ఈ ఎన్నికలలో ఎక్కువ ప్రభావం చూపాయని వెలువడిన ఫలితాలు తెలియజేస్తున్నాయి. తెలంగాణా ఎన్జీవో సంఘాల నాయకుడు దేవీ ప్రసాద్ ప్రజలకు సుపరిచితుడే. కానీ బీజేపీ అభ్యర్ధి రామచంద్ర రావుతో పోల్చి చూసినట్లయితే ఆయనకు రాజకీయ అనుభవం లేదు. ఒకవేళ కేసీఆర్ ఆయనను రాజకీయాలలోకి రప్పించాలనుకొని ఉంటే, ఆయనకు సురక్షితమయిన యం.యల్యే.కోటాలో జరిగే యం.యల్సీ. ఎన్నికలలో అభ్యర్ధిగా ప్రకటించి ఉంటే ఇటువంటి పరిస్థితి ఎదురయ్యేది కాదు. కానీ ఆయనని తెరాస అభ్యర్ధిగా పట్టభద్రుల యం.యల్సీ. ఎన్నికలలో ఆఖరు నిమిషంలో పోటీకి దింపడం తప్పు నిర్ణయమేనని చెప్పక తప్పదు. బహుశః ఆయన ఓటమికి ఇది కూడా ఒక కారణమని భావించవచ్చును.   బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన రామచంద్ర రావుకి ఆయన స్వంత పార్టీ క్యాడర్ మాత్రమే కాకుండా, తెదేపా క్యాడర్ కూడా అండగా నిలబడటం కూడా కలిసి వచ్చింది. అయితే దేవీ ప్రసాద్ ఓటమితో తెరాసకే ఎదురుదెబ్బ తగిలినట్లు ఎందుకు భావిస్తున్నారంటే ఆ పార్టీ తమ గెలుపై చాలా ధీమా, అతివిశ్వాసం ప్రదర్శించినందునే. పైగా త్వరలో జి.హెచ్.యం.సి. ఎన్నికలు కూడా ముంచుకు వచ్చేస్తున్నాయి. ఈ ఎన్నికల ప్రభావం వాటిపై ఎక్కడ పడుతుందో అని తెరాస కంగారుపడుతుంటే, అది చూసి ప్రతిపక్షాలు కూడా తెరాస అభ్యర్ధి ఓటమిని ప్రజాతీర్పుగా అభివర్ణిస్తున్నాయి. కానీ కర్ణుడి ఓటమికి వెయ్యి కారణాలన్నట్లు దేవీ ప్రసాద్ ఓటమికి కూడా అనేక కారణాలు కనబడుతున్నాయి.

హైకోర్టు విభజనపై ప్రధాన న్యాయమూర్తుల భిన్నాభిప్రాయం

  తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు కోసం తెలంగాణా ప్రభుత్వం ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ కూడా సానుకూలంగా స్పందిస్తూ, తెలంగాణా ప్రభుత్వం హైకోర్టు కి అవసరమయిన భవనాలు, ఇతర సదుపాయాలూ కల్పించినట్లయితే రెండు నెలలలోగానే హైకోర్టు ఏర్పాటయ్యేలా చేస్తానని హామీ ఇచ్చేరు. తెలంగాణా ప్రభుత్వం కూడా తక్షణమే స్పందిస్తూ గచ్చిబౌలీ వద్ద 1.09 లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం గల భవనం సిద్దంగా ఉందని కేంద్రమంత్రికి లిఖిత పూర్వకంగా తెలియజేసింది. తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటుచేయమని కోరుతూ తాను త్వరలోనే సుప్రీంకోర్టుకి లేఖవ్రాస్తానని సదానంద గౌడ రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చేరు.   కానీ సరిగ్గా అదే సమయంలో ఒక పిటిషనుపై స్పందిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే హైకోర్టు ఏర్పాటు చేయవలసి ఉంది గానీ తెలంగాణాకి కాదని, ఒకవేళ అలాగా చేయదలచుకొంటే అది చట్ట విరుద్దం అవుతుంది కనుక చట్టంలో సెక్షన్ 31ని సవరించవలసి ఉంటుందని తేల్చి చెప్పింది. అంతేకాక కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ హైకోర్టు విభజన చేస్తానని తెలంగాణా ప్రభుత్వానికి హామీ ఇవ్వడాన్ని కూడా తప్పు పట్టింది. అంతేకాక వారి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను అన్నిటినీ తన ముందు ఉంచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. హైకోర్టు విభజన కోరుతూ న్యాయవాదులు ఆందోళనలు చేయరాదని హితవు పలుకుతూనే చట్టాన్ని ఉల్లంఘించే వారిని ఎంత మాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించింది కూడా.   కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్.యల్. దత్తు తనను కలిసిన తెలంగాణా జేయేసీ నేతలతో మాట్లాడుతూ, తెలంగాణా ప్రభుత్వం హైకోర్టు కోసం భవనాలు, అవసరమయిన ఇతర మౌలిక వసతులు అన్నీ కల్పించినట్లయితే ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా సాగుతున్న ప్రస్తుత హైకోర్టును విభజించి తెలంగాణా రాష్ట్రానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసేందుకు అవసరమయిన ప్రక్రియ ఆరంభిస్తామని హామీ ఇచ్చేరు.   ఈవిధంగా హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటుపై పరస్పర విరుద్దంగా స్పందించడం చూస్తే ఈ ప్రక్రియ ఏవిధంగా ముగుస్తుందోననిపిస్తుంది. అయితే హైకోర్టు ధర్మాసనం పేర్కొన్నవిధంగా తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేసేందుకు విభజన చట్టంలో ఉన్న అవరోధాలను తొలగించేందుకు చట్ట సవరణలు చేయవలసి ఉంటుందేమో?