మద్రాసు హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తుల మధ్య ముసలం

  దేశంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని వింత సమస్య ఒకటి మద్రాసు హైకోర్టు ఇప్పుడు ఎదుర్కొంటోంది. మద్రాస్ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న చీఫ్ జస్టిస్ సంజె కె. కౌల్ పై కోర్టు ధిక్కారం క్రింద చర్యలు చేప్పట్టడంతో బాటు తనను వేదిస్తున్నందుకు యస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని అదే కోర్టులో న్యాయమూర్తిగా చేస్తున్న జస్టిస్ సి.యస్. కర్ణన్ హెచ్చరించారు. దానితో ఆయన ఈ విషయం గురించి సుప్రీం కోర్టుకి తెలియజేసి క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు జస్టిస్ కర్ణన్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.   అసలు ఈ సమస్య ఎలా మొదలయింది అంటే సివిల్ జడ్జీల నియామకం కొరకు చీఫ్ జస్టిస్ సంజె కె. కౌల్ ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ఒక కమిటినీ ఏర్పాటు చేసారు. వారిలో జస్టిస్ వి. దానపలన్, జస్టిస్ ఆర్.సుధాకర్, జస్టిస్ డి. హరి పరందామన్, జస్టిస్ కిరుబకరాన్ మరియు జస్టిస్ ఆర్. మాల సభ్యులుగా నియమింపబడ్డారు. వారితో బాటు తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ మరి కొందరు అధికారులు కూడా ఈ నియామక కమిటీలో సభ్యులుగా నియమింపబడ్డారు. క్రిందటి నెల 15వ తేదీ నుండి 21 వరకు వారు జడ్జీ అభ్యర్ధులకు ఇంటర్వ్యూలు నిర్వహించవలసి ఉంది.   కానీ జస్టిస్ కర్ణన్ ఇంటర్వ్యూలు మొదలయిన మరునాడు అంటే ఏప్రిల్ 16న కమిటీ సభ్యుల నియామకాలు చెల్లవని, కనుక ఇంటర్వ్యూలు తక్షణమే నిలిపివేయామని ఆదేశాలు జరీ చేసారు. దీనిని తను సుమోటు కేసుగా స్వీకరించి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కమిటీలో సభ్యుడిగా నియమితులయిన జస్టిస్ ధనపలన్ నకిలీ విద్యార్హతల సర్టిఫికేట్ కలిగి ఉన్నారనే పిర్యాదులున్నాయని, చట్ట ప్రకారం నియామక కమిటీలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం ఒకే వర్గానికి చెందిన ముగ్గురిని నియమించబడ్డారని కనుక ఆ కమిటీ నియామకం చెల్లదని కనుక జడ్జీల ఇంటర్వ్యూలు చేయరాదని ఆదేశిస్తూ తీర్పు చెప్పారు.   ఈ వ్యవహారం మళ్ళీ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజె కె. కౌల్ తో కూడిన ధర్మాసనం ముందుకి వచ్చినప్పుడు జస్టిస్ కర్ణన్ ఉత్తర్వులపై స్టే విధించారు. దానితో ఆగ్రహం చెందిన కర్ణన్ ప్రధాన న్యాయమూర్తి తన పరిదిలో ఉన్న కోర్టు వ్యవహారాలలో ప్రధాన న్యాయమూర్తి అనవసరంగా వేలు పెడుతున్నారని, అందుకు ఆయనపై కోర్టు ధిక్కార నేరం క్రింద చర్యలు తీసుకోవలసివస్తుందని హెచ్చరించారు. అంతే కాకుండా దళితుడినయినా తనను వేధిస్తునందున ఆయనపై చర్యలు తీసుకోవలసిందిగా జాతీయ యస్సీ ఎస్టీ కమీషన్ ను ఆదేశించవలసి వస్తుందని ఆయన ప్రధాన న్యాయమూర్తిని హెచ్చరించారు.   దీనితో ఆయనకు ఏమి చేయాలో పాలుపోక ఈ జస్టిస్ కర్ణన్ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళి ఆయనపై తగు చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. రేపు అనగా సోమవారంనాడు ఈ కేసును చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హెచ్.యల్. దత్తుతో కూడిన ధర్మాసనం విచారణ చేపడుతుంది.

పాపం...కాంగ్రెస్ పార్టీ!

  కాంగ్రెస్ పార్టీని ఏవిధంగా ముందుకు నడపాలనే విషయం గురించి రెండు నెలల పాటు విదేశాలలో ఒంటరిగా మేధో మధనం చేసి వచ్చిన రాహుల్ గాంధీ తను స్వయంగా పాదయత్రాలు చేయడం ద్వారా దానిని ‘ఇస్ట్రాంగ్’ చేసుకోవచ్చని ఫిక్స్ అయిపోయి చకచకా నడవడం మొదలుపెట్టారు. మోడీ ప్రభుత్వం భూసేకరణ చట్టానికి చేసిన సవరణల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రచారం చేస్తూ, అదే సమయంలో ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాలను పరామర్శిస్తూ ముందుకు సాగినట్లయితే ఒకవైపు మోడీ ప్రభుత్వాన్ని దెబ్బ కొడుతూనే మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న రైతులను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవచ్చని ఆయన ఉద్దేశ్యం కావచ్చును. లేదా ప్రజల, మీడియా దృష్టిని ఆకట్టుకోగలిగితే తన నాయకత్వ లక్షణాలను ప్రశ్నిస్తున్న తన పార్టీ నేతల నోళ్ళనును తాత్కాలికంగా అయినా మూయించవచ్చనే ఆలోచన కావచ్చును. కానీ ఆయన మొదలుపెట్టిన పాదయాత్రల వలన పార్టీకి లాభం కలగడం మాటేమో కానీ కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నారు.   ఆయన డిల్లీలో భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎన్ని సభలు నిర్వహించుకొన్నా ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేసేవారు కాదు. కానీ ఆయన పనిగట్టుకొని వివిధ పార్టీలు అధికారంలో ఉన్న వివిధ రాష్ట్రాలలో పాదయాత్రలు చేస్తూ, ఆ రాష్ట్రాలలో ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాలను పరామర్శించడానికి పూనుకోగానే, ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలు ఆయనపై, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.   తెలంగాణాలో ఆదిలాబాద్ జిల్లాలో ఆయన ఈనెల 12న పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రకటించగానే అధికార తెరాస కంటే ముందుగా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. గత పదేళ్ళ పాలనలో ఒక్క తెలంగాణా రాష్ట్రంలోనే సుమారు 22,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని, అప్పుడు అధికారంలో ఉన్న రాహుల్ గాంధీ వారిని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు? కిషన్ రెడ్డి రాహుల్ గాంధీకి ఘాటుగా ఒక లేఖ కూడా వ్రాసారు. రైతుల ఈ దుస్థితికి నాటి కాంగ్రెస్ పాలకులే కారణమని తెరాస వాదిస్తోంది.   రాహుల్ గాంధీ ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించబోయే ఒక్క రోజు పాదయాత్రలో 5 గ్రామాలలో పర్యటించి ఆత్మహత్యలు చేసుకొన్న 12 మంది రైతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, స్థానిక కాంగ్రెస్ నేతల తరపున ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు పరిహారం ఇవ్వబోతున్నట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటున్నారు. దానితో జిల్లాలో మిగిలిన ప్రాంతాలలో ఆత్మహత్యలు చేసుకొన్న అనేక మంది రైతుల కుటుంబ సభ్యులు రాహుల్ గాంధీని విమర్శించడం మొదలుపెట్టారు. మొక్కుబడిగా ఓ పదిమంది రైతు కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సహాయం అందించి, రాహుల్ గాంధీ తమను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకొన్న వేలాది రైతుల కుటుంబాలను స్వయంగా పరామర్శించి వారందరికీ ఆర్ధిక సహాయం అందించడం సాధ్యం కాదు కనుక రాహుల్ గాంధీ కేవలం కొందరిని మాత్రమే కలుస్తున్నారు. అయితే దాని వలన మిగిలిన రైతులలో అసంతృప్తి, ఆగ్రహం కలిగిస్తున్నట్లయింది.   రాహుల్ గాంధీ పాదయాత్ర చేయబోయే ఆదిలాబాద్ జిల్లాలోనే 2004-2014 మధ్య కాలంలో  610 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని అధికారిక లెక్కలున్నాయి. వారి ఒక్కో కుటుంబానికి రూ.50,000 రుణమాఫీతో కలిపి మొత్తం రూ.1.5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వమే జి.ఓ. నెంబర్: 421 ను జారీ చేసిందని, కానీ వారిలో  ఏ కొద్దిమందికి తప్ప చాల మందికి నేటికీ ప్రభుత్వం ప్రకటించిన ఆ పరిహారం అందలేదని జిల్లాకు చెందిన బోరన్న అనే రైతు సంఘం నేత చెపుతున్నారు.    అసలు గత పదేళ్ళ కాంగ్రెస్ పాలనలోనే దేశ వ్యాప్తంగా వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారనే విషయాన్ని రాహుల్ గాంధీయే స్వయంగా తన పాదయాత్రలతో బయటపెట్టుకొన్నట్లయింది. మోడీ ప్రభుత్వాన్ని దెబ్బ తీయడం పార్టీని బలపరుచుకోవడం మాటెలా ఉన్నా, రాహుల్ గాంధీ తన పాదయాత్రల ద్వారా గత పదేళ్ళ కాంగ్రెస్ నిర్వాకాన్ని ఆయనే స్వయంగా లోకానికి చాటి చెపుతున్నట్లయింది.   తెలంగాణాతో సహా వివిధ రాష్ట్రాలలో రైతుల ఆత్మహత్యల లెక్కలు ఇప్పుడు బయటకి వస్తున్నాయంటే అది రాహుల్ గాంధీ పాదయత్రల పుణ్యమేనని చెప్పక తప్పదు. దీని వలన కాంగ్రెస్ పార్టీకి ఏమయినా మేలు జరుగుతుందో లేక మరింత నష్టం జరుగుతుందో కాంగ్రెస్ నేతలకే తెలియాలి.   ఆరు నెలలు గరిడి సాము చేసి ఏమి చేశావయ్యా అంటే మూలనున్న ముసలమ్మని ఒక్క దెబ్బతో పైకి పంపించేసానన్నాడుట వెనుకటికొకడు. రెండు నెలలు విదేశాలలో ఏదో మధనం చేసిన రాహుల్ గాంధీ పని కూడా అచ్చు అలాగే ఉంది. ఇప్పటికే జీవచ్చవంలా మారిన కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ తన పాదయాత్రలతో మళ్ళీ పైకి లేవకుండా శాస్వితంగా భూస్థాపితం చేసేస్తారేమో? పాపం కాంగ్రెస్ పార్టీ!

బాలనేరస్థుల చట్ట సవరణతో నేరాలు ఆగిపోతాయా?

  డిల్లీలో నిర్భయ ఉదంతం జరిగినప్పుడు యావత్ దేశం చాలా తీవ్రంగా స్పందించింది. అయితే ఆనాటి నుండే మహిళలు, వృద్ద మహిళలు, బాలికలు చివరికి పసిపిల్లలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నా ప్రజలలో కానీ ప్రభుత్వంలో గానీ అటువంటి స్పందన కనబడకపోవడం చాలా దురదృష్టకరం. నిర్భయ ఉదంతం జరిగిన తరువాత అప్పటి యూపీఏ ప్రభుత్వం హడావుడిగా బాల నేరస్తుల చట్టానికి కొన్ని సవరణలు చేసింది. నిర్భయ కేసును విచారించేందుకు ‘ఫాస్ట్ ట్రాక్’ కోర్టుని కూడా ఏర్పాటు చేసింది. కానీ ఇంతవరకు ఆ హేయమయిన నేరానికి పాల్పడినవారెవరికీ శిక్షలు పడలేదు. వారిలో ఒకరు పోటీ పరీక్షలకు హాజరయ్యేందుకు జైలులోనే ప్రభుత్వ ఖర్చులతో శిక్షణ పొందినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చేయి. ఇక వారిలో ఒకడు బాలనేరస్తుడు కావడంతో అంత హేయమయిన నేరం చేసినప్పటికీ కేవలం మూడేళ్ళ జైలు శిక్షతో బయటపడే అవకాశం పొందాడు.   అంత తీవ్రమయిన నేరం చేసినప్పటికీ కోర్టులు ఏమీ చేయలేవని కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలుగా నిర్భయ కేసులో దోషులు కనబడుతుంటే, దేశంలో నానాటికీ అత్యాచారాలు పెరిగిపోకుండా ఉంటాయా? ఇక చాలా ఆందోళనకరమయిన విషయం ఏమిటంటే, నిర్భయ ఉదంతం తరువాత 2013లో అటువంటి హేయమయిన నేరాలకు పాల్పడిన వారిలో 3,887మంది బాల నేరస్తులేనని జాతీయ నేర రికార్డుల బ్యూరో ప్రకటించింది. దానిని మొన్న మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి మేనకా గాంధీ కూడా ద్రువీకరించారు.   అందుకే మోడీ ప్రభుత్వం బాల నేరస్తుల చట్టంలో మళ్ళీ కొన్ని సవరణలు చేసింది. వాటి ప్రకారం ఇకపై 16ఏళ్లకు పైబడి వయసున్న బాలనేరస్థులను పెద్దవారిగానే (మేజర్లు) పరిగణించి, వారు చేసిన నేరాల స్థాయిని బట్టి శిక్షలు విధిస్తారు. వారిలో చిన్న నేరాలు, తీవ్రమయిన నేరాలు, అత్యాచారాలు, హత్యలు వాటి క్రూరమయిన నేరాలు చేసినవారికి విడివిడిగా శిక్షలు విధించేలా చట్టంలో ఏర్పాటు చేసారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ సవరణలను లోక్ సభ ఆమోదించింది. అయితే దాని వలన చిన్న పిల్లల హక్కులకు భంగం కలుగుతుందని, ఆ చట్టాన్ని అడ్డుపెట్టుకొని నిరుపేదలు, గిరిజనుల పిల్లలపై అన్యాయంగా కేసులు నమోదు అయ్యే ప్రమాదం ఉందని ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేసారు. కానీ వారి హక్కుల కాపాడటానికి చట్టంలో కొన్ని ప్రతిపాదనలు చేసామని మంత్రి మేనకా గాంధీ వారి అభ్యంతరాలను త్రోసిపుచ్చారు.   ఈ చట్ట సవరణ చేయడం వరకు బాగానే ఉంది. కానీ ఎన్ని చట్టాలున్నా సమాజంలో నేరాలు ఆగడం లేదు. అంటే వాటిని చూసి ఎవరూ భయపడటం లేదనే సంగతి స్పష్టం అవుతోంది. నిర్భయ నిందితుల తరపున ఎవరూ వాదించమని, ఒకవేళ ఎవరయినా లాయరు ఆ కేసును స్వీకరిస్తే వారిని బార్ కౌన్సిల్ నుండి బహిష్కరిస్తామని మొదట అందరూ బింకాలు పలికారు. కానీ మూడేళ్ళుగా ఆ కేసు కొనసాగుతూనే ఉందంటే అందుకు ఎవరిని నిందించాలి?   రెండు మూడు నెలలలోనే తేల్చవలసిన ‘హిట్-అండ్-రన్’ కేసును బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఏకంగా 13 ఏళ్ళు సాగదీయగలిగాడంటే ఎవరిని నిందించాలి? అనేక చార్జ్ షీట్లలో కేసులు ఎదుర్కొంటున్న వారు, జైలు శిక్షలు ఖరారయిన లాలూ ప్రసాద్, జయలలితవంటి వాళ్ళు అందరూ చట్ట సభలలో ప్రవేశించడమే కాకుండా రాజ్యాధికారం కూడా ఆశించగలుగుతున్నారంటే ఎవరిని నిందించాలి? అటువంటి వారిని గుడ్డిగా ఆరాధిస్తున్న వారిని ఏమనుకోవాలి? అని ప్రశ్నించుకొంటే లోపం ఎక్కడో లేదు సమాజంలోనే ఉందని అర్ధమవుతుంది. అందుకే ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేస్తున్నా అవి సమర్ధంగా ఆచరణకు నోచుకోవడం లేదు. కానీ నేరాలను, నేరస్తులను నియంత్రించేందుకు ఏదో ఒక అంకుశం అవసరం కనుక ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి.   అయితే అందరూ వాటిలో లొసుగులను కనిపెట్టేందుకు చూపిస్తున్న శ్రద్ధ వాటిని పటిష్టంగా అమలుచేయడంలో చూపకపోవడం వలననే దేశంలో నేరాలు ఆగడం లేదని చెప్పవచ్చును. అందుకే కొందరు ఆ చట్టాలను అధిగమించగలుగు తుంటే ఆ శక్తిలేని వారికి మాత్రమే శిక్షలు పడుతున్నాయి. మనం ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుందనే పెద్దల మాటను పట్టించుకొన్నపుడే ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. లేకుంటే చట్టం కొందరికి చుట్టంగా, మరికొందరికి ఆదాయ మార్గంగానే మిగిలిపోతుంది.

ప్రతిపక్షాలకు ఆయుధంగా మారిన ప్రత్యేక హోదా

  నటుడు శివాజీ తన నిరాహార దీక్షతో ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో మళ్ళీ వేడి పుట్టించారు. అయితే ప్రత్యేక హోదా కోరుతూ డిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసిన జగన్మోహన్ రెడ్డి కానీ, ప్రత్యేక హోదా కోసం గుంటూరులో ఒక్కరోజు దీక్ష చేప్పట్టిన కాంగ్రెస్ నేతలు గానీ వచ్చి శివాజీ దీక్షకి మద్దతు తెలియజేయకపోవడం గమనిస్తే ఈ విషయంలో వారి చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధమవుతోంది.   అది ప్రత్యేక హోదా కావచ్చు లేదా రాజధాని కోసం భూసేకరణ కావచ్చు లేదా రైతుల ఆత్మహత్యలు కావచ్చు లేదా మరొక సమస్య కావచ్చు...ఎవరి పోరాటాలు వారివే. రాష్ట్ర, దేశ ప్రజల శ్రేయస్సే తమకు చాలా ముఖ్యం అన్నట్లు అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నప్పటికీ అవి ఏనాడూ కలిసి పనిచేయలేవు. చేయవు కూడా. కారణం వారి పోరాటాలు, ఆరాటాలు అన్నీ కూడా ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టి తమ పార్టీలను బలపరుచుకొని అధికారంలోకి రావాడానికే. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఒక రాజకీయ పార్టీ ఏదయినా ఒక అంశం అందిపుచ్చుకొని పోరాటం మొదలుపెడితే ఆ క్రెడిట్ పూర్తిగా తనకే దక్కాలనుకొంటుంది తప్ప వేరే పార్టీలతో పంచుకోవాలనుకోదు. ఆ విషయం శివాజీ నిరాహార దీక్షతో మరోమారు రుజువయింది.   దేశాన్ని పదేళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం అనేక రాష్ట్రాలలో జరుగుతున్న పోరాటాలు, ఇరుగుపొరుగు రాష్ట్రాల అభ్యంతరాల గురించి అన్నీ తెలిసి ఉన్నప్పటికీ, సాధ్యాసాధ్యాలు ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో ప్రకటించి చేతులు దులుపుకొంది. ఇప్పుడు ఎలాగు ఆ పార్టీ అధికారం లేదు కనుక ఈ అంశాన్ని ఆయుధంగా చేసుకొని ఎన్డీయే ప్రభుత్వంపై దానిని సందిస్తోంది.   ఇక ఈ విషయంలో వైకాపా చాలా గుంబనంగా వ్యవహరిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఏదో మొక్కుబడిగా డిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసి వచ్చేరు తప్ప ఆయన కానీ వైకాపా నేతలు గానీ ఎవరూ ఈ అంశం మీద గట్టిగా మాట్లాడిన దాఖలాలు లేవు. కారణం ఒకవేళ బీజేపీ రాష్ట్రంలో తెదేపాతో తెగ తెంపులు చేసుకొనే మాటాయితే ఆ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలనే ఆలోచన కావచ్చును. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా వైకాపా చేస్తున్న ఆ ఆలోచనను బయటపెట్టి వైకాపాతో పొత్తులు పెట్టుకొనే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. అయినా కేంద్రాన్ని ఇబ్బంది పెట్టగల అనేక అంశాల మీద వైకాపా మౌనం వహించడం గమనిస్తే ఆ పార్టీ బీజేపీతో పొత్తుల కోసం ఇంకా ఆశగా ఎదురు చూస్తూనే ఉందని అర్ధమవుతోంది. అందుకే ఆ పార్టీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదేమో? అంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే తన పార్టీ ప్రయోజనాలకే ఆ పార్టీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు భావించవలసి ఉంటుంది.   ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ చాలా ఇబ్బంది పడుతోంది గనుక తమ పార్టీకి మరింత ఇబ్బంది కలిగిస్తున్న తమ పార్టీ నేత శివాజీని తమవాడు కాదు పొమ్మంది. బీజేపీకి మిత్రపక్షంగా, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా కొనసాగుతున్నందున తెదేపా కూడా శివాజీ దీక్షకు దూరంగా ఉంది. అయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి త్వరగా మెరుగుపడాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా చాలా అవసరం కనుక తెదేపా కూడా అందుకోసం బీజేపీ మీద నిరంతరం ఒత్తిడి చేస్తూనే ఉంది. ఆ విషయం బీజేపీ నేతలే ఒప్పుకొంటున్నారు.   మిగిలిన అనేక అంశాల మాదిరిగానే ఈ అంశం కూడా రాష్ట్రంలో రాజకీయ పార్టీలకి ఒక ఆయుధంగా అందివచ్చింది. కనుక దీనిని మరింత కాలం నాన్చడం వలన అంతిమంగా బీజేపీకే నష్టం కలిగే ప్రమాదం ఉంది. ఒకవేళ ఏదోవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లేయితే అందుకు అది ఎటువంటి ప్రయత్నాలు చేస్తోందో...అది ఎప్పటిలోగా సాధ్యపడుతుందనే విషయాన్ని ప్రజలకి వివరిస్తే మంచిది. ఒకవేళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని భావిస్తున్నట్లయితే అదే విషయాన్ని ఇప్పుడే రాష్ట్రంలో రాజకీయ పార్టీలకి, ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేయడం మంచిది. ఎన్నికల వరకు రాష్ట్ర విభజన సమస్యను నాన్చిన కాంగ్రెస్ పార్టీ చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొంది. ఇప్పుడు బీజేపీ కూడా ఈ ప్రత్యేక హోదా అంశాన్ని వచ్చే ఎన్నికల వరకు నాన్చినట్లయితే అప్పుడు బీజేపీ కూడా ఇదే పరిస్థితి ఎదురవవచ్చును. కనుక ఈ సమస్యను వీలయినంత త్వరగా పరిష్కరించే ప్రయత్నం చేయడం మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.    

ఆర్టీసీ చక్రాలకు యాజమాన్యమే బ్రేకులు వేస్తోందా?

  నిన్న మొన్నటి వరకు ఆర్టీసీ విభజన కోసం పోరాడుకొన్న ఆంద్ర, తెలంగాణా ఉద్యోగ సంఘాలన్నీ ఏకమై రెండు రాష్ట్రాలలో సమ్మెకు దిగాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకూ 43శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని వారి ప్రధాన డిమాండ్. ఆర్టీసీ తీవ్ర నష్టాలలోకూరుకొని పోయుంది కనుక అంత పెంచలేమని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చి చెప్పడంతో రెండు రాష్ట్రాలలో ఆర్టీసీ ఉద్యోగులు ఈరోజు ఉదయం నుండి నిరవదిక సమ్మెకు దిగారు.   ఆర్టీసీ చార్జీలు పెంచవలసిన ప్రతీసారి, ఉద్యోగులు జీతాలు పెంచమని అడిగినప్పుడల్లా ఆర్టీసీ నష్టాలలో ఉందనే చిలకపలుకులు పలకడం రాష్ట్ర ప్రభుత్వాలకు అలవాటే. అయితే ఆర్టీసీ నష్టాలతో నడుస్తున్నప్పటికీ అందుకు కారణాలను, కారకులను కనుగొని చర్యలు చేప్పట్టకుండా ప్రభుత్వం మరియు ఆర్టీసీ యాజమాన్యం రెండూ కూడా తీవ్ర నిర్లిప్తత వహిస్తున్నట్లు వారి చిలక పలుకులే దృవీకరిస్తున్నాయి.   సాధారణ ప్రజలు ప్రధానంగా ఆధారపడే ఆర్టీసీ బస్సులకు ఆక్యుపెన్సీ సమస్య లేనేలేదు. రెండు రాష్ట్రాలలో ఎన్ని బస్సులు తిరుగుతున్నా అన్ని కూడా ఎప్పుడూ ప్రయాణికులతో కిటకిటలాడుతూనే ఉంటాయి. ఇక పండగ, పెళ్ళిళ్ళ సీజన్లలో పరిస్థితి చెప్పనక్కరలేదు. రోడ్లమీద తిరగడానికి పనికిరావని పక్కన పడేసిన డొక్కు బస్సులను కూడా ఆ సమయంలో మళ్ళీ బయటకు తీసి ప్రత్యేక బస్సులుగా తిప్పుతూ ప్రయాణికులను నిలువు దోపిడీ చేయడం ఆర్టీసీకి పరిపాటే. ఆర్టీసీ డిపోలలో షాపుల నుండి, బస్సులపై వాణిజ్య ప్రకటనల ద్వారా ఆర్టీసీకి భారీగా అద్దెలు వసూలవుతుంటాయి. ఇక ప్రధాన నగరాలలో ప్రధాన ప్రాంతాలలో ఆర్టీసీకి ఉన్న భూములను, భవనాలను ప్రైవేట్ సంస్థలకు, వ్యక్తులకు లీజు మీద ఇవ్వడం ద్వారా భారీ ఆదాయం పొందుతోంది. ఇంకా అనేక మార్గాల ద్వారా ఆర్టీసీకి ఆదాయం సమకూరుతోంది. అయినా ఆర్టీసీ ఎప్పుడూ నష్టాలలోనే ఎందుకు ఉంటుంది? నష్టాలలో ఉన్నా ప్రభుత్వాలు, ఆర్టీసీ యాజమాన్యం దానిని నివారించే ప్రయత్నాలు ఎందుకు చేయలేవు? అని ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు.   ఆర్టీసీలో నష్టాలకి యాజమాన్యం, ప్రభుత్వ తప్పుడు విధానాలే కారణమని ఉద్యోగులు ఆరోపిస్తుంటే, ఆపరేటింగ్ నష్టాలే ఎక్కువని ఆర్టీసీ యాజమాన్యం తన ఉద్యోగులను నిందిస్తోంది. డీజిల్, వాహన విడిభాగాలు ధరల పెరుగుదల, గతుకుల రోడ్లలో ప్రయాణించడం వలన తరచూ వాహనాలకు మరమత్తులు అవసరంపడటం, బంద్ లు జరిగినప్పుడు అందరూ ముందుగా ఆర్టీసీ బస్సులపైనే తమ ప్రతాపం ప్రదర్శించడం, బస్సులలో ప్రయాణికులు లేకపోయినా ఖాళీగా తిరగే బస్సులు, వాటి కోసం పడిగాపులు కాసే ప్రయాణికుల కోసం రూల్స్ పేరిట ఆపకుండా దూసుకుపోవడం వంటివి కంటికి కనబడుతున్న సమస్యలు.   దేశ వ్యాప్తంగా తిరుగుతున్నలక్షలాది ప్రైవేట్ బస్సులు ఏ ప్రభుత్వ అండదండలు లేకపోయినా లాభాలు ఆర్జించగలుగుతున్నప్పుడు, ప్రభుత్వ అండదండలున్న ఆర్టీసీ ఎందుకు ఎప్పుడు నష్టాలలోనే ఉంటోంది అంటే ఖచ్చితంగా యాజమాన్యనే తప్పు పట్టవలసి ఉంటుంది. ఆర్టీసీ కార్మికులలో కొందరు యూనియన్ల పేరిట సమస్యలు సృష్టింస్తుండవచ్చును. కానీ మిగిలిన లక్షలాది ఉద్యోగులు అందరూ రేయింబవళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. అటువంటప్పుడు వారిని తప్పు పట్టడానికి లేదు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వోద్యోగులను ఒక రకంగా ఆర్టీసీ ఉద్యోగులను మరొకరకంగా చూడటం కూడా భావ్యం కాదు. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ శాఖలతో పోలిస్తే ఆర్టీసీయే ప్రజలకు చేరువగా ఉంది. కనుక ఆర్టీసీ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు సవతి ప్రేమ చూపడం సరికాదు. లక్షలాది ప్రభుత్వోద్యోగులకు 43శాతం ఫిట్ మెంట్ ఇవ్వగలిగినప్పుడు, ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వారితో సమానంగా వేతనాలు ఇవ్వవలసి వచ్చినప్పుడు నష్టాలని, ఆర్ధిక సమస్యలని సాకుగా చూపడం కూడా సరికాదు.   ప్రభుత్వంలో అనేకమంది నిజాయితీపరులు, మంచి సమర్ధులు, అందరినీ కలుపుకుపోగల నేర్పుగల అధికారులున్నారు. అటువంటి వారి చేతిలో ఆర్టీసీని పెట్టి ఉండి ఉంటే నేడు ఆర్టీసీకి ఈ దుస్థితి వచ్చేదే కాదు. కానీ ఆర్టీసీ సమస్యల గురించి ఎటువంటి అవగాహన లేని స్వార్ధ రాజకీయ నాయకుల చేతిలో సంస్థను పెట్టడం వలననే ఆర్టీసీ నష్టాలలో కూరుకొనిపోతోంది. ఈవిషయం ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ తెలుసు. కనుక ఇప్పుడు జీతాల కోసం తమ యాజమాన్యంతో పోరాడుతున్నట్లే ఆర్టీసీని కాపాడుకోవడానికి కూడా పోరాడవలసి ఉంటుంది.    ఆర్టీసీని కాపాడుకొని లాభాల బాటలో తీసుకువెళ్లేందుకు అందులో ఉద్యోగులు, యాజమాన్యం కలిసి కట్టుగా కృషి చేయాలి. అప్పుడే వారికీ జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడే వారి సంస్థకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. లేకుంటే ఏదో ఒకనాడు ఆర్టీసి మూతపడటం, ఉద్యోగులు రోడ్డున పడటం తధ్యం.

ఇంతకీ శివాజీ దీక్ష ప్రత్యేక హోదా కోసమేనా?

  రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతున్న తెలుగు సినీ నటుడు శివాజీ ఆదివారం నుండి గుంటూరులో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరాహార దీక్షకు కూర్చొన్నారు. మొదట ఆయన కేవలం మూడు రోజులు మాత్రమే నిరాహార దీక్ష చేస్తారని ప్రకటించినప్పటికీ ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన్నట్లు తెలుస్తోంది. ఆయన తను బీజేపీకి చెందిన వాడినని చెప్పుకొంటుంటే, పురందేశ్వరి, మంత్రి కామినేని వంటి బీజేపీ నేతలు మాత్రం అతనితో తమ పార్టీకి ఎటువంటి సబంధమూ లేదని చెప్పడం చాలా ఆసక్తికరంగా ఉంది.   బహుశః అతను పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నాడు కనుకనే వారు ఆవిధంగా అంటున్నట్లయితే, బీజేపీని, ఎన్డీయే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకొన్నవారెవరో శివాజీని వెనుక నుండి ప్రోత్సహిస్తున్నారేమోననే అనుమానం కలగడం సహజం. కనుక ముందుగా శివాజీ తను బీజేపీ సభ్యుడిగా ఉన్నాడో లేదో తేల్చి చెప్పాక తన దీక్షలు కొనసాగించుకొంటే ఎవరికీ ఇటువంటి అనుమానం రాదు.   అదేవిధంగా శివాజీ నిత్యం పవన్ కళ్యాణ్ పేరు కూడా ప్రస్తావించడం కొంచెం ఆలోచింపజేసే విషయమే. ప్రధాని నరేంద్ర మోడీతో సత్సంబంధాలు గల పవన్ కళ్యాణ్ వచ్చి తనతో చేతులు కలిపినట్లయితే మోడీ తప్పకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేస్తారని శివాజీ వాదన. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం అంత సులువయితే, శివాజీ ఆమరణ నిరాహార దీక్ష చేసేవరకో లేకపోతే పవన్ కళ్యాణ్ వచ్చి నచ్చజెప్పెవరకో ప్రధాని నరేంద్ర మోడీ వేచి చూసేవారే కాదని అతను గ్రహించితే మంచిది.   మోడీ తమ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చి ఉండవచ్చును. కానీ ఆ హామీని అమలుచేయడంలో అనేక సమస్యలు, అడ్డంకులు ఎదురవుతున్న కారణంగానే ఆయన తన హామీని నిలబెట్టుకోలేకపోతున్నారనే సంగతి అందరికీ తెలుసు. ఈ సంగతి మొన్న ఒక్కరోజు దీక్ష చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలకీ, ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తున్న శివాజీకి తెలియదనుకోలేము. రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకొనేందుకే ప్రత్యేక హోదా వంకతో కొంచెం హడావుడి చేసిందని అందరూ సర్ది చెప్పుకొన్నారు. కానీ ప్రత్యేక హోదా ఇవ్వడంలో ఎదురవుతున్న ఇబ్బందులు, అవరోధాల గురించి ఎరిగి ఉన్నప్పటికీ బీజేపీకి చెందిన శివాజీ ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నట్లు? దానికి ఆయన సరయిన సమాధానం చెప్పలేకపోతే ప్రత్యేక హోదా విషయంలో చాలా ఇబ్బంది పడుతున్న బీజీపీని మరింత ఇబ్బంది పెట్టి ప్రజలలో అప్రదిష్టపాలుజేసేందుకు బీజేపీ శత్రువులెవరో శివాజీని వెనుకనుండి ప్రోత్సహిస్తున్నారా అనే అనుమానం కలుగక మానదు.   అదేవిధంగా ఆయన ప్రతీసారి పవన్ కళ్యాణ్ పేరును ఎందుకు ప్రస్తావిస్తున్నారు? అనే ప్రశ్నకు కూడా జవాబు చెప్పవలసి ఉంటుంది. చెప్పలేకపోతే పవన్ కళ్యాణ్ ని వ్యతిరేకిస్తున్న వారో లేకపోతే పవన్ కళ్యాణ్-తెదేపా-బీజేపీల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్న వారెవరో శివాజీని వెనుక నుండి ప్రోత్సహిస్తున్నారనే అనుమానం కలుగక మానదు. ఒకవేళ శివాజీ నిజంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసమే పోరాటం మొదలుపెట్టి ఉంటే ఆయన ముందుగా బీజేపీకి రాజీనామా చేసి, తరువాత కేవలం ప్రత్యేక హోదాకు సంబందించిన విషయాలు, సమస్యల గురించి మాత్రమే మాట్లాడితే మంచిది. అలాకాక ఆయన బీజేపీలో కొనసాగుతూ తన పార్టీ అనుమతి లేకుండా నిరాహార దీక్షలు చేస్తూ తను దేనికోసం నిరాహార దీక్ష చేస్తున్నాడో దాని గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే ఆయన చిత్తశుద్ధిని అనుమానించవలసి వస్తుంది.

అయిష్టంగానే కాంగ్రెస్ పార్టీతో కాపురానికి సీపీయం సిద్దం

  దేశంలో వామపక్షాలు చాలా ఏళ్లుగా తమ ఉనికిని చాటుకోగలుతున్నాయి. కానీ ఎప్పుడూ ఏదో ఒక జాతీయ పార్టీకో లేక ప్రాంతీయ పార్టీకో తోక పార్టీలుగా ఉండిపోవడంతో వాటంతట అవి ఏ రాష్ట్రంలోను ప్రభుత్వాలు ఏర్పాటు చేసే స్థాయికి మాత్రం ఎదగలేకపోయాయి. క్రమంగా అన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరుగుతుండటంతో  తమ చేతిలో ఉన్న రెండు మూడు రాష్ట్రాలపై కూడా వామపక్షాలు తమ పట్టును నిలుపుకోలేకపోతున్నాయి.   ఇటువంటి పరిస్థితిలో తెలుగువాడయిన సీతారం ఏచూరి సి.పి.యం. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై, దేశ, రాష్ట్ర రాజకీయాలపై మంచి అవగాహన ఉన్న ఆయన నేతృత్వంలో సి.పి.యం. పార్టీని కొత్త పుంతలు త్రొక్కిస్తారని ఆశించినప్పటికీ ఆయన కూడా తన పార్టీని మూస పద్దతిలోనే ముందుకు తీసుకు వెళ్ళబోతున్నట్లు స్పష్టమయిన సూచనలు ఇచ్చేరు. ఇంతకు ముందు కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడిన ఆయన ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో పార్లమెంటులో చేతులు కలిపి అంశాలు వారిగా పోరాడేందుకు సిద్దమని ప్రకటించి రాజకీయ వర్గాలు సైతం ఆశ్చర్యంపోయేలా చేశారు.   భూసేకరణ బిల్లు, లౌకికత్వం తదితర అంశాల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్డీయే ప్రభుత్వంతో పోరాడేందుకు తమ పార్టీ సిద్దమని ప్రకటించారు. కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడం మాత్రం సాధ్యం కాదని స్పష్టం చేసారు. ఎందుకంటే ఆ పార్టీపై తమకు పూర్తి విశ్వాసం లేదని అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం లేనప్పుడు, మళ్ళీ అదే పార్టీతో అంశాల వారిగా కలిసి పోరాడాలనుకోవడం వల్ల సి.పి.యం.కూడా తన విశ్వసనీయత కోల్పోవడం తధ్యం.   నిజానికి వామపక్షాలు తెలుగు రాష్ట్రాలలో మిగిలిన మరే ఇతర రాజకీయ పార్టీ చేయనంతగా నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాడుతుంటాయి. రెండు రాష్ట్రాలలో వామపక్షాలకు పటిష్టమయిన క్యాడర్ కూడా ఉంది. కానీ ఐదేళ్ళ పాటు వివిధ ప్రజాసమస్యల మీద అలుపెరుగని పోరాటాలు చేసే వామపక్షాలు ఎన్నికల సమయం వచ్చినప్పుడు, తమ స్వంత కాళ్ళ మీద నిలబడి ఎన్నికలను ఎదుర్కొనే ప్రయత్నం చేయడం మాని ఏదో ఒక పార్టీకి తోక పార్టీగా ఓ ఐదో పదో సీట్లు సాధించుకోవడానికే మొగ్గుచూపుతుంటాయి. బహుశః అందుకే అవి ఎన్నడూ ఏ రాష్ట్రంలో కూడా అధికారం సాధించలేకపోయాయని చెప్పవచ్చును.   ఇంతకు ముందు కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీని వామపక్షాలు తమ శత్రువుగా భావించేవి. ఇప్పుడు మోడీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో అదే కాంగ్రెస్ పార్టీతో జత కట్టి బీజేపీ మతతత్వాని ఎదుర్కోవాలని సి.పీయం భావిస్తోంది. ఈ విధంగా ఒక స్థిరమయిన విధానం లేకుండా ముందుకు సాగుతుండటం వలననే వామపక్షాలు ఎన్ని పోరాటాలు చేసినా ఎన్నడూ ప్రజలను మెప్పించలేకపోతున్నాయని చెప్పవచ్చును.

భూసేకరణతో రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కులు

  రాజధాని నిర్మాణం కోసం, విమానాశ్రయాలు, పరిశ్రమలు, ఉన్నత విద్యావైద్య సంస్థల నిర్మాణం కోసం తెదేపా ప్రభుత్వం పెద్ద ఎత్తున భూసేకరణ చేస్తోంది. అవి ప్రభుత్వ భూములో లేక నిరుపయోగమయిన భూములో అయితే ఎవరూ అభ్యంతరం చెప్పేవారు కాదు. కానీ అవి చాలా విలువయిన పంట భూములు కావడంతో సహజంగానే రైతులు, కొందరు ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నారు. రాజధాని కోసం తుళ్ళూరు మండలంలో సుమారు 30,000 ఎకరాలు, విమానాశ్రయం కోసం గన్నవరం వద్ద సుమారు 500 ఎకరాలు, వైజాగ్-శ్రీకాకుళం మధ్యలో ఉన్న భోగాపురం వద్ద విమానాశ్రయం, విమానాల రిపేరింగ్ మరియు విమాన శిక్షణ సంస్థల ఏర్పాటు చేసేందుకు 15, 000 ఎకరాల పంట భూములను ప్రభుత్వం సేకరిస్తోంది. అయితే వీటిల్లో ఎక్కడా కూడా అధికార, ప్రతిపక్షాలకు చెందిన ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఒక్క అంగుళం భూమి కూడా కోల్పోవడం లేదు. కనుక సహజంగానే రైతులలో ఈ భూసేకరణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   రాజధాని కోసం భూములిస్తామని ప్రభుత్వానికి అంగీకార పత్రాలిచ్చిన 500మంది రైతులు హైకోర్టుని ఆశ్రయించి ఉపశమనం పొందారు. వారి భూములలో వ్యవసాయ పనులు చేసుకోవడానికి ఎటువంటి ఆటంకం కల్పించవద్దని హైకోర్టు రాష్ర్ట ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నేడోరేపో రాజధాని మాష్టర్ ప్లాన్ చేతికి అందగానే భూమిపూజ చేసి రాజధాని నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెడదామని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది నిజంగా అగ్నిపరీక్ష వంటిదే.   ఒకవేళ రైతులు ల్యాండ్ పూలింగ్ పద్ధతి ద్వారా రాజధాని కోసం భూములిచ్చేందుకు అంగీకరించకపోతే భూసేకరణ చట్టం ప్రయోగించయినా భూసేకరణ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు చెప్పడంతో రైతులలో, కలకలం మొదలయింది. ప్రతిపక్షాలకు ఆయన ప్రకటన గొప్ప ఆయుధాన్ని అందించినట్లయింది. చివరికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి పార్ట్ టైం రాజకీయనాయకులు సైతం రైతుల తరపున ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్దమని ప్రకటిస్తున్నారంటే అందుకు వారిని నిందించి ప్రయోజనం లేదు. రాజధాని నిర్మాణం కోసం తుళ్ళూరు మండలాన్ని ఎంచుకోకమునుపే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి పర్యవసానాలను ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ అన్నీ తెలిసి ముందుకు వెళ్ళింది అంటే అందుకు సిద్దపడే అడుగు ముందుకు వేసిందని భావించాల్సి ఉంటుంది. కనుక ప్రస్తుత పరిణామాలను ఎదుర్కొని, వాటి చేదు పర్యవసానాలను స్వీకరించక తప్పదు.   మొదట చాలా మంది రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వారితో మాట్లాడిన తరువాత తిరిగి వారిలో చాలామంది భూములు ఇచ్చేందుకు అంగీకార పత్రాలు ఇచ్చేరు. కానీ వైకాపా నేతల ప్రోద్భలంతో మళ్ళీ కొందరు రైతులు హైకోర్టుని ఆశ్రయించి, తమ భూములలో వ్యవసాయం చేసుకొనేందుకు అనుమతి పొందడంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఒకవేళ మంత్రి పుల్లారావు చెపుతున్నట్లు ప్రభుత్వం రైతులపై భూసేకరణ చట్టం ప్రయోగిస్తే దాని వలన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. అలాగని భూసేకరణ చేయకపోయినట్లయితే రాజధాని నిర్మాణం చేయడం అసాధ్యం. రైతుల మనోభావాలతో ముడిపడున్న సున్నితమయిన ఈ సమస్యను ప్రభుత్వం ఏవిధంగా అధిగమిస్తుందో తెలియదు కానీ ఏవిధంగా చూసినా ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పకపోవచ్చును.   రాజధాని కాకుండా రాష్ట్రంలో ఇంకా పోలవరం, పట్టిసీమ, మెట్రో రైల్ ప్రాజెక్టులు, గిరిజన, పెట్రో విశ్వవిద్యాలయాలు, ఐ.ఐ.యం, ఐఐటి, ఐఐఐటి, ఎయిమ్స్, వంటి ఉన్నత విద్యా వైద్యసంస్థలు, అనేక పరిశ్రమలు, ఐటి సంస్థలు, విమానాశ్రయాలు వగైరాలన్నీ రానున్న నాలుగేళ్లలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇవి కాక వైజాగ్ నుండి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చి ఉంది. రాష్ట్ర విభజన సందర్భంగా విభజన బిల్లులో హామీలే ఇవ్వన్నీ. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించి ఆ హామీలనన్నిటినీ కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలుచేయాలని కాంగ్రెస్ పార్టీతో సహా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ నిరసన దీక్షలు, ధర్నాలు చేయడం ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం వాటిని అమలుచేయడానికి పూనుకోగానే మళ్ళీ వారే భూసేకరణకు అడ్డుపడుతూ రైతుల తరపున పోరాడుతున్నట్లు నటిస్తూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను ఇరకాటంలో పెడుతూ ప్రజల మెప్పు పొందే ప్రయత్నాలు చేస్తున్నారు.   తుళ్ళూరులో రాజధాని నిర్మాణం చేస్తే తమకు ఎటువంటి అభ్యంతరమూ లేదని చెపుతున్న వైకాపా నేతలు రైతులను రెచ్చగొట్టి కోర్టులకు వెళ్ళమని ప్రోత్సహిస్తున్నారని అధికార పార్టీకి చెందిన నేతలు కొందరు విమర్శిస్తున్నారు. పోనీ వైకాపా నేతలు రైతుల తరపున నిలబడి నిజాయితీగా పోరాడుతారా...అంటే అదీ లేదు. ఇప్పుడు ప్రభుత్వం రైతుల భూములు తీసుకొన్నప్పటికీ,  తను ముఖ్యమంత్రి అయిన తరువాత ఎవరి భూములు వారికిచ్చేస్తానని రైతులతో వెటకారమాడటం జగన్మోహన్ రెడ్డికే చెల్లు. రైతుల కోసం నిరాహార దీక్షలు, న్యాయ పోరాటాలు చేస్తానని హామీలు గుప్పించిన మెగా బ్రదర్స్ ఇరువురూ తమ సినిమా నిర్మాణ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. మధ్యలో తీరిక దొరికినప్పుడు వచ్చి హడావుడి చేసి వెళ్లిపోతుంటారు.   ఈవిధంగా సున్నితమయిన సమస్యలను అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరించి వేగంగా రాష్ట్రాభివృద్ధి జరిగేందుకు రాజకీయ పార్టీలు కృషి చేయకుండా ఆ సమస్యలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని చూడటం చాలా దారుణం. ఈ ఐదేళ్ళలో రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని కేంద్రప్రభుత్వం పదేపదే చెపుతోంది. చెప్పడమే కాకుండా దానిని ఆచరించి చూపిస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెదేపా కూడా వీలయినంత త్వరగా రాష్ట్రాభివృద్ధి చేసి ప్రజలను మెప్పించి వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్ళీ అధికారంలోకి రావాలని భావిస్తోంది. దాని ఉద్దేశ్యాలు ఎవయినప్పటికీ ఈ నాలుదేల్లలో రాష్ట్రాభివృద్ధి చేయాలనే దాని చిత్తశుద్ధిని శంఖించనవసరం లేదు. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవలసిన ఈ సమయంలో రాజకీయ పార్టీలు అడుగడుగునా రాష్ట్రాభివృద్ధికి ఆడుతగిలినట్లయితే వారికి ప్రజలే తగిన బుద్ధి చెపుతారు.  

ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ధర్నా..హవ్వ!

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభిప్రాయాలని, మనోభావాలను లెక్క చేయకుండా రాష్ట్రాన్ని విభజించినందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో గట్టిగా బుద్ధి చెప్పారు. కొందరు తెలివయిన కాంగ్రెస్ నేతలు మునిగిపోతున్న తమ కాంగ్రెస్ నావలో నుంచి ఎన్నికలకు ముందే బయటకు దూకేసి తమ రాజకీయ భవిష్యత్ కాపాడుకోగా మరి కొందరు ఎన్నికల తరువాత ‘బ్రతుకే జీవుడా’ అనుకొంటూ ఇతర పార్టీలలోకి వలస వెళ్ళిపోతున్నారు. వివిద కారణాల వల్ల ఏ పార్టీలోకి వెళ్ళలేకపోయిన వారు మాత్రం వీర విదేయుల్లా ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. వారిలో ఆనం రామినారాయన రెడ్డి, డొక్కా మాణిక్యవర ప్రసాద్, శైలజానాద్, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి వంటి, పల్లం రాజు వంటి అనేకమంది కాంగ్రెస్ నేతలు ప్రజలకు కనబడి చాలా కాలమే అయింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒకవెలుగు వెలిగి రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పిన చిరంజీవి తన 150వ సినిమా నిర్మాణంపై దృష్టి లగ్నం చేయగా, బొత్స సత్యనారాయణ వైకాపాలో చేరేందుకు మూట ముల్లె సర్దుకొని ఎదుచూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పి.సి.సి.అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఒక్కరే కాస్త హడావుడి చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటే ప్రయత్నం చేస్తున్నారు.   బహుశః ఆ ప్రయత్నంలో భాగంగానే రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం అంటూ ఇదివరకు కోటి సంతకాల కార్యక్రమం, మళ్ళీ ఈరోజు గుంటూరులో ధర్నా చేయబోతున్నారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు రఘువీరారెడ్డి, చిరంజీవి, కేవీపీ రామచంద్ర రావు, పనబాక తదితరులు హాజరవుతారని సమాచారం. ఒకవేళ దీనికి బొత్స సత్యనారాయణ హాజరు కానట్లయితే ఆయన వైకాపాలో చేరడం ఖాయమని భావించవచ్చును.   కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హడావుడిగా రాష్ట్ర విభజన చేస్తూ, ఎలాగూ తమ పార్టీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో, కేంద్రంలో కూడా ఓడిపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయనే సంగతి పసిగట్టి సాధ్యాసాధ్యాలు గమనించకుండానే చివరి ప్రయత్నంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు హడావుడిగా పార్లమెంటులో ప్రకటించి చేతులు దులుపుకొంది. ఊహించినట్లే ఆ పార్టీ ఎన్నికలలో ఓడిపోయింది. రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే చిత్తశుద్ధి నిజంగా ఉండి ఉంటే ఆ అంశాన్ని కూడా విభజన బిల్లులో చేర్చి ఉండేది. కానీ చేర్చలేదంటే దాని చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధమవుతుంది. మరి ఆ పార్టీ నేతలు ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఈ హడావుడిని ఎవరు నమ్ముతారు?   కాంగ్రెస్ పార్టీ పోతూపోతూ ప్రత్యేక హోదా ఉచ్చును బీజేపీ మెడకు చుట్టి పోయింది. కనుక ఇప్పుడు దానిని బిగిస్తూ మోడీ ప్రభుత్వాన్ని, దానితో కలిసి పనిచేస్తున్న తెదేపా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఒకే దెబ్బకు నాలుగు పిట్టలన్నట్లుగా ఈ ప్రత్యేక హోదా అంశంపై పోరాడితే అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టవచ్చు. రాష్ట్రంలో తన ఉనికిని చాటుకోవచ్చు. ప్రజలను మళ్ళీ మభ్యపెట్టవచ్చు. అగమ్యగోచరంగా ఉన్న పార్టీ పరిస్థితి చూసి డీలా పడిపోయిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఇతర పార్టీలలోకి జంప్ అయిపోకుండా కాపాడుకోవచ్చుననే ‘మల్టీ పర్పస్-యాక్షన్ ప్లాన్’ తో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం అంటూ హడావుడి చేస్తోంది. కానీ ఎంత హడావుడి చేసినా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మనంతవరకు దాని పరిస్థితిలో మార్పేమీ రాబోదనే సంగతి గ్రహించాలి.   తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకొంటూ ప్రజాభిప్రాయాన్ని, వారి మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్ర విభజన చేసి చేతులు దులుపుకొన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతోందంటే ఎవరు నమ్మబోరు. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు తమ ఉనికిని, రాజకీయ భవిష్యత్తుని కాపాడుకొనేందుకు ఈ మాత్రం కష్టపడక తప్పదు. అందుకే వారు ఈవిధంగా ఆపసోపాలు పడుతున్నారని సరిపెట్టుకోవలసి ఉంటుంది.

రాహుల్ గాంధీ కోసమే కాంగ్రెస్ పార్టీ ఉందా?

  రెండు నెలల పాటు విదేశాలలో సేద తీరి స్వదేశానికి తిరిగివచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ‘రాజు వెడలె రవి తేజములరియగా, కుడి ఎడమల్ డాల్ కత్తులు మెరియగా’ అన్నట్లు చుట్టూ ఓ వందమంది సెక్యురిటీ సిబ్బంది, వెనక మరో వందో యాబయ్యో వాహనాలు ఫాలో అవుతుంటే పాపం రైతుల కోసమని ఎండల్లో పాదయాత్రలు చేస్తున్నారు. ఉత్తరభారతంలో పాదయాత్రల పర్వం ముగించుకొన్న తరువాత తెలంగాణా రాష్ట్రంలో అదిలాబాద్ జిల్లా నిర్మల్ లో ఈ నెల 11న పాదయాత్రలు చేసి ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలను పరామర్శిస్తారుట.   రాహుల్ గాంధీ ఈవిధంగా పాదయాత్రలు, పరామర్శ యాత్రలు, ఓదార్పు యాత్రలు చేయడం చూస్తుంటే ఎవరికయినా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే మొదట గుర్తుకు రావడం సహజం. అయితే గత పదేళ్ళుగా ప్రధాన మంత్రి కుర్చీని రిజర్వు చేసి ఉంచినప్పటికీ అందులో కూర్చోవడానికి భయపడిన రాహుల్ గాంధీ, ఇప్పుడు కనీసం పార్టీ అధ్యక్ష పదవినయినా చెపట్టాలని ఆత్రుత పడుతుంటే, ఆయన దానికీ అర్హుడు కాడని పార్టీ వర్గాలే చెవులు కోరుకోవడం చూసి పార్టీ మీద అలిగి రెండు నెలల పాటు విదేశాలకు వెళ్లిపోయారు. మళ్ళీ తిరిగి వచ్చి పాదయాత్రలు మొదలుపెట్టారు.   జగన్మోహన్ రెడ్డికి కూడా ముఖ్యమంత్రి కుర్చీలో ఒక్కసారయినా కూర్చొని రాష్ట్రాన్ని పాలించాలని తపిస్తున్నారు. అయితే ఆయనకి రాహుల్ గాంధీలాగ వడ్డించిన విస్తరి దొరకలేదు. దొరికి ఉండి ఉంటే ఏవిధంగా ఉండేదో తెలియదు కానీ ఆయన తన లక్ష్యసాధన కోసం గత ఐదారేళ్ళుగా చాలా గట్టిగానే కృషి చేస్తున్నారు. ఆయనే స్వయంగా ఒక పార్టీని స్థాపించుకొని, తన నాయకత్వంలోనే ఎన్నికలను ఎదుర్కొని చాలా మంచి ఫలితాలనే రాబట్టగలిగారు. ఆవిధంగా చూసినట్లయితే రాహుల్ గాంధీ కంటే జగన్మోహన్ రెడ్డికే మంచి నాయకత్వ లక్షణాలున్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడయిన జగన్మోహన్ రెడ్డితోనే రాహుల్ గాంధీ సరితూగలేనప్పుడు ఇక అన్ని విధాల సమర్ధుడు, మంచి పరిపాలనాదక్షుడు, రాజకీయ అనుభవజ్ఞుడు అయిన ప్రధాని నరేంద్ర మోడీతో ఏవిధంగా సరితూగ గలడు?   యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే నరేంద్ర మోడీని డ్డీ కొనలేక చతికిల పడిన రాహుల్ గాంధీ, ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీని, సమర్దుడయిన ప్రధానిగా నిరూపించుకొని మరింత శక్తివంతుడిగా ఎదిగిన నరేంద్ర మోడీని ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ కేంద్రంలో అధికారం సాధించిపెట్టగలరని అనుకోవడం అత్యాశే అవుతుంది. ఈ సంగతి తెలిసినప్పటికీ, కాంగ్రెస్ నేతలు చాలా మంది రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాల గురించి సందేహాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆయనే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చెప్పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగినట్లయితే దాని వలన కాంగ్రెస్ పార్టీకే తీరని నష్టం కలగవచ్చును.   నిజానికి రాహుల్ గాంధీ నెహ్రు కుటుంబానికి వారసుడనే ఏకైక అర్హత తప్ప గత పదేళ్ళలో తన నాయకత్వ లక్షణాలు ప్రదర్శించుకొని తనకంటూ పార్టీలో ఒక ప్రత్యక గుర్తింపు సాధించలేకపోయారనే చెప్పవచ్చును. ఇప్పుడు పార్టీలో చాలా మంది తన నాయకత్వ లక్షణాలను ప్రశ్నిస్తున్నారు కనుక లోక్ సభలో నరేంద్ర మోడీ గురించి ఏవో నాలుగు విమర్శలు గుప్పించేసి, ఏదో నాలుగు ఊళ్లు తిరిగేసినంత మాత్రాన్న ఆయన పార్టీ పగ్గాలు చేప్పట్టేందుకు అర్హుడయిపోలేరు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకొనేందుకు రాహుల్ గాంధీ కృషి చేస్తునట్లయితే పరువాలేదు. కానీ రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్ కాపాడటం కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేయడం మొదలుపెడితే దాని వలన చివరికి నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ...దానినే నమ్ముకొన్న వేలాది నేతలు...లక్షలాది కార్యకర్తలే.

రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీని క్షమించండి!

  ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ నేటికీ రెండు నాల్కలతో మాట్లాడటం మానలేదు. తెలంగాణా సాధన కోసం ఎన్నో ఏళ్లుగా అనేక ఉద్యమాలు చేసినా తెలంగాణా ఏర్పడలేదని కానీ సోనియా గాంధీ దయతలచి తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసారని, అందుకు తెలంగాణా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సర్వదా రుణపడి ఉండాలని తెలంగాణా కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం అందరికీ తెలుసు. కానీ అదే కాంగ్రెస్ పార్టీకి నేతలు “రాష్ట్ర విభజన చేసినందుకు ఏ.ఐ.సి.సి. తరపున విచారం వ్యక్తం చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు క్షమించాలని” కోరుతున్నారు. ఈ మాటలు అన్నది ఎవరో గల్లీ స్థాయి నేతలు కాదు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్-చార్జ్ మరియు ఏ.ఐ.సి.సి. కార్యదర్శి అయిన సూరజ్ హెగ్డే బుధవారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో యువజన కాంగ్రెస్ నిర్వహించిన యువ శంఖారావం సదస్సులో ఈ మాటలు అన్నారు. అంటే రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ అధిష్టానం నిజంగా పశ్చాతాపపడుతోందనుకోవాలా? లేక ప్రజాభిప్రాయాన్ని మన్నించకుండా రాష్ట్ర విభజన చేసినందున రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది కనుక మళ్ళీ రాష్ట్ర ప్రజలను ప్రసన్నం చేసుకోనేందుకే ఇటువంటి మాటాలు మాట్లాడుతోందనుకోవాలా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిజంగా పశ్చాతాపపడితే అదే ముక్కని తెలంగాణా రాష్ట్రంలో కూడా అనే సాహాసం చేయగలదా? ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం అనేక దశాబ్దాలుగా ఉద్యమాలు జరుగుతున్నా, వేలమంది యువకులు బలిదానాలు చేసుకొన్నా ఏనాడు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. కానీ సార్వత్రిక ఎన్నికలలో తన విజయావకాశాలు పెంచుకొని మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావాలనే ఆలోచనతోనే ఎన్నికలకు ముందు హడావుడిగా రాష్ట్ర విభజన చేసి చేతులు దులుపుకొన్న సంగతి అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన సమయంలో ఎంత దుర్మార్గంగా ఆలోచించిదంటే తను ఎన్నికలలో గెలిచేందుకు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలా లేక మూడు ముక్కలు చేయాలా ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలుగా విడదీస్తే తనకు లాభమా లేకపోతే ఆంధ్రా రాయల తెలంగాణా రాష్ట్రాలుగా విడదీస్తే తనకి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందా అని ఆలోచించిందే తప్ప ఆంద్ర, తెలంగాణా ప్రజల మనోభావాలను పట్టించుకోలేదు. అదే విధంగా తెలంగాణాలో తెరాసను విలీనం చేసేసుకొని తెలంగాణా రాష్ట్రంలో నూటికి నూరు శాతం ఓట్లు సంపాదించుకోవాలని దురాశకు పోయింది. కానీ కాంగ్రెస్ ప్రదర్శించిన ఆ అతితెలివికి చివరికి అదే బలయిపోయింది. రెండు రాష్ట్రాలలోనే కాకుండా కేంద్రంలో కూడా అధికారంలోకి రాలేకపోయింది.   అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకొని తన తప్పులను సవరించుకోకపోగా నేటికీ ప్రజలను ఈవిధంగా మభ్యపెట్టి మళ్ళీ రాష్ట్రంలో తన పట్టు పెంచుకోవాలని ప్రయత్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్ర విభజన చేసినందుకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిజంగా పశ్చాతాపపడి ఉండి ఉంటే, ఎన్నికల సమయంలోనే లెంపలు వేసుకొని అప్పుడే ఈ నాలుగు ముక్కలు చెప్పుకొని ఉండి ఉంటే బహుశః ఒకటో రెండో సీట్లయినా గెలుచుకోనేదేమో. కానీ అప్పుడు రాష్ట్ర విభజన చేసి తెలంగాణా ఏర్పాటు చేసిన ఖ్యాతి మొత్తం తనకే దక్కాలని తెలంగాణాలోచెప్పుకొంటూ,  ప్రాంతీయ పార్టీలు ఇచ్చిన లేఖలు, వాటి ఒత్తిళ్ళ కారణంగానే రాష్ట్ర విభజన చేయవలసి వచ్చిందని ఆంద్రప్రదేశ్ ప్రజలకు చెప్పుకొని ఓట్లు సంపాదించుకోవాలని ప్రయత్నించి భంగపడింది. ఇంత జరిగినా నేటికీ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి మార్పు, పశ్చాతాపం రాలేదని సూరజ్ హెగ్డే మాటలతో స్పష్టమయింది.   ఆంద్ర, తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని ఉద్యమాలు చేసినా, గత పదేళ్ళ అవినీతి, అసమర్ధ కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిపోయున్నరెండు రాష్ట్రాలలో ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారనే నమ్మకం లేదు. అలాగని కాంగ్రెస్ పార్టీ చేతులు ముడుచుకొని కూర్చొన్నట్లయితే రెండు రాష్ట్రాలలో పార్టీ పూర్తిగా అదృశ్యమయిపోవడం ఖాయం గనుక కాంగ్రెస్ నేతలు తమ పార్టీ ఉనికిని, తద్వారా తమ ఉనికిని కాపాడుకొనేందుకు ఇటువంటి మాటలేవో చెప్పుకోకతప్పదని ప్రజలు కూడా సరిపెట్టుకోవలసి ఉంటుంది.

రాహుల్ గాంధీ పోరాటం ఎవరి కోసం?

  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తనను తాను రీ-చార్జ్ చేసుకొనేందుకు దాదాపు రెండు నెలలు శలవు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. రీచార్జ్ అయినందున ఇంతకు ముందులాగ లోక్ సభ వెనుక బెంచీలలో కూర్చొని కునుకు తీయకుండా అనర్గళంగా మాట్లాడేసి కాంగ్రెస్ పార్టీ సభ్యుల చేత చప్పట్లు చరిపించుకొన్నారు. ఆ తరువాత నిన్న సాయంత్రం సాధారణ ప్రయాణికులతో కలిసి జనరల్ కంపార్ట్ మెంటులో పంజాబ్-హర్యానా సరిహద్దులోగల అంభాలా పట్టణానికి ప్రయాణించి మరో మారు మీడియా దృష్టిని ఆకర్షించగలిగారు.   తమ యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టాన్ని ఎన్డీయే ప్రభుత్వం సవరించి ఆర్డినెన్స్ జారీ చేసిన తరువాత దేశ వ్యాప్తంగా రైతులకు తీవ్ర నష్టం కలుగుతోందని, వారి బాధలను కళ్ళార చూసేందుకే బయలుదేరుతున్నానని ఆయన చెప్పారు. త్వరలోనే ఇదే పనిమీద అయన దేశంలో పలు రాష్ట్రాలలో పాదయాత్రలు చేప్పట్టబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ దృవీకరించింది. భూసేకరణ బిల్లుకి సవరణలు చేయడం వలన రైతుల ప్రయోజనాలు దెబ్బ తింటాయని కాంగ్రెస్ పార్టీతో సహా చాలా పార్టీలు దానిని వ్యతిరేకిస్తున్నాయి. వాటిలో చాలా పార్టీలు తమతమ రాష్ట్రాలలో నిరసన సభలు, ధర్నాలు కూడా నిర్వహించాయి. కానీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే దానిపై సకాలంలో స్పందించలేదు.   బహుశః ఆ అంశంపై పోరాటం చేసే అవకాశం రాహుల్ గాంధీకి విడిచిపెట్టాలనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం పెద్దగా స్పందించలేదేమో? రాహుల్ గాంధీ శలవు నుండి తిరిగి వచ్చిన తరువాతనే డిల్లీలో భూసేకరణ చట్టాన్ని సవరించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసన సభ నిర్వహించడం గమనిస్తే ఈ అనుమానం నిజమేననిపిస్తుంది. రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ అంశం గురించి పోరాటం మొదలుపెట్టేశారు గనుక ఇక దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందేమో?అంటే భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ మొదలుపెట్టిన ఈ పోరాటం రైతుల కోసమా లేకపోతే ఆయన పరపతి పెంచుకొనేందుకా? అనే ధర్మసందేహం కలుగుతోంది.   రాహుల్ గాంధీ తన నాయకత్వ లక్షణాలు నిరూపించుకోవడానికి గతంలో చాలా అవకాశాలు వచ్చేయి. కానీ అప్పుడు చొరవ చూపకపోవడం వలన ఆయనకి బొత్తిగా నాయకత్వలక్షణాలు లేవనే అపవాదొకటి ఏర్పడింది. కనుక తనకు పెద్దగా ఇబ్బంది కలిగించని ఈ అంశాన్ని అందిపుచ్చుకొని పోరాటం చేయడం ద్వారా ఆ అపవాదుని వదిలించుకోవచ్చునని, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చెప్పట్టాలని భావిస్తున్నారేమో? ఇటువంటి దురాలోచనలు చేయడం వలననే దేశంలో కాంగ్రెస్ పార్టీతో సహా అనేకరాజకీయ పార్టీలను ప్రజలు త్రిప్పి కొడుతున్నారు. అయినా అవి తమ తీరు మార్చుకోకుండా ఇటువంటి నాటకాలతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించడం విస్మయం కలిగిస్తోంది.

ఏపీకి ప్రత్యేక హోదాపై రాజకీయాలు అవసరమా?

  ‘ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా’ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. “రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తాము కానీ ఎప్పుడిస్తామో ఖచ్చితంగా చెప్పలేమని” కేంద్రమంత్రులు చెపుతున్నారు. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ‘ప్రత్యేకహోదా’ కోసం నిరాహార దీక్షకు సిద్దమవుతున్నారు. ఆయనకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని రాష్ట్ర మంత్రులు వాదిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడుతామని చాలా మంది రాష్ట్ర మంత్రులు చెపుతున్నారు. ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రయోజనాల కంటే చాలా ఎక్కువ ప్రయోజనాలు రాష్ట్రానికి సాధిస్తామని మంత్రి పల్లె రఘునాధ రెడ్డి హామీ ఇస్తున్నారు. అధికార ప్రతిపక్షాల, కేంద్ర రాష్ట్ర మంత్రుల ఈ మాటలన్నీ వింటుంటే వారి పోరాటాలు, ఆరాటాలు అన్నీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసమా లేక పార్టీల రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసమా? అనే అనుమానం కలుగక మానదు.   ఈ అంశం గురించి మాట్లాడుతున్న వారందరికీ కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో ఎటువంటి ఇబ్బందులు, అవరోధాలు ఉన్నాయో స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ ఎవరూ కూడా ఆ సమస్యల పరిష్కారం గురించి మాట్లాడకుండా కేవలం ప్రత్యేక హోదా గురించి మాత్రమే మాట్లాడటం గమనిస్తే వారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలనే తపన కంటే ఈ విషయంలో కేవలం తమకి మాత్రమే చాలా చిత్తశుద్ధి ఉందని ప్రజలకు చెప్పుకొని ప్రజల మెప్పు పొందాలనే తపనే ఎక్కువగా కనబడుతోంది. ప్రతిపక్ష పార్టీలయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలనే తపన కంటే ఈ అంశాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకొని ఈ విషయంలో తడబడుతున్న కేంద్రప్రభుత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది.   రాష్ట్ర విభజన సమయంలో, ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ నేతలు హామీలు గుప్పించినందున ఇప్పుడు ఆ మాట వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సముఖంగా ఉన్నప్పటికీ, అందరికీ తెలిసిన అనేక అడ్డంకులు, సాంకేతిక సమస్యల కారణంగా అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇంతకు ముందు ఓసారి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కొంచెం దైర్యం చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కష్టమని చెప్పారు. కానీ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల విమర్శలకు భయపడి మళ్ళీ ఆ మాట వెనక్కి తీసుకోవలసి వచ్చింది.   కానీ వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదనే సంగతి అర్ధమవుతుంది. ఇంతకు ముందు రాష్ట్ర విభజన జరగడం అనివార్యమనే సంగతి అన్ని రాజకీయ పార్టీలకీ తెలిసి ఉన్నప్పటికీ, ప్రజలకు ఆగ్రహం కలిగించడం కంటే వారి అబిప్రాయలకు అనుగుణంగా మాట్లాడుతూ వారిని మెప్పించడం కోసమే ప్రయత్నించాయి. అందువల్ల అంతిమంగా రాష్ట్ర ప్రజలే తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో రాజకీయ పార్టీలన్నీ కూడా అదేవిధంగా వ్యవహరిస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో మళ్ళీ నష్టపోయేది రాష్ట్ర ప్రజలే.   ఒకవేళ కేంద్రప్రభుత్వం నిర్దిష్ట సమయంలోగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వగలనని ప్రకటించగలిగితే అంతకంటే సంతోషకరమయిన విషయం మరొకటి ఉండబోదు. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని తెలిసి ఉన్నప్పుడు కూడా ఇంకా దాని కోసం వృధా పోరాటాలు చేస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతుంది. రాజకీయ పార్టీలు వాటి ప్రయోజనాలను మాత్రమే చూసుకొంటూ ఈ అంశం పట్టుకొని ఉద్యమిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. దాని వలన వాటికి ఎటువంటి నష్టమూ జరుగదు. కానీ అంతిమంగా రాష్ట్రం, రాష్ట్ర ప్రజలే నష్టపోతారు. కనుక ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టుకొని కూర్చొనే కంటే కేంద్రం ఇస్తానంటున్న స్పెషల్ ఆర్ధిక ప్యాకేజీ, సబ్సిడీలు ఇతర ప్రయోజనాలను తీసుకోవడమే మంచిదని చెప్పవచ్చును.

వాడిన మల్లికి సెల్యూట్

ప్రపంచంలోని అనేక పర్వత శిఖరాల మీద పరిమళించిన భారతీయ మల్లి వాడిపోయింది. భారతీయ పరిమళాన్ని పరాయి దేశపు పర్వతాన్ని ఎక్కి వెదజల్లాలని ప్రయత్నించిన ఆ మల్లి ఆ పర్వతం మీదే రాలిపోయింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు చివరికి నెల్లూరు జిల్లాలోని తన సొంత గ్రామం గాంధీ జన సంగంలో శాశ్వత విశ్రాంతి తీసుకున్నాడు. శనివారం నాడు జరిగిన ఆయన అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ మంత్రులతోపాటు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా హాజరై మస్తాన్‌బాబుకు నివాళులు అర్పించారు. అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిపించారు. మల్లి మస్తాన్ బాబు మరణించాక ఆయనకు ఈ స్థాయి గౌరవం దక్కింది.. అయితే ఆయన జీవించి వున్నంత వరకు ఆయన్ని పట్టించుకున్నవారు ఎవరైనా వున్నారా? ప్రభుత్వాలు పట్టించుకున్నాయా? మీడియా పట్టించుకుందా? ఏసీ గదిలో కూర్చుని లక్షల రూపాయల జీతం తీసుకునే ఉద్యోగం పొందే విద్యార్హతలు ఎన్నో ఉన్నప్పటికీ, పర్వతారోహణ అనే విలక్షణ మార్గాన్ని ఎంచుకున్న మల్లి మస్తాన్ బాబు... ఏ దేశంలో ఏ పర్వత శిఖరాన్ని అధిరోహించినా తన వెంట భారత జాతీయ పతాకాన్ని వెంట తీసుకుని వెళ్ళేవాడు. పర్వత శిఖరాన్ని చేరుకున్న తర్వాత త్రివర్ణ పతకాన్ని ఆ శిఖరం మీద రెపరెపలాడించి, చిరునవ్వుతో ఆ పతాకానికి సెల్యూట్ చేసేవాడు.  ఆదాయం గురించి ఎంత మాత్రం ఆలోచించకుండా, తాను తడికలతో కట్టిన ఇంట్లో వుంటూనే, దేశాన్ని ప్రపంచం ముందు తలెత్తుకునేలా చేశాడు. అనేక దేశాల్లో పర్వత శిఖరాల మీద రెపరెపలాడుతున్న భారత జాతీయ పతాకాన్ని అందరూ తలెత్తి చూసేలా చేశాడు. ఇంత చేసినా ఏమీ ఆశించని మస్తాన్ బాబు త్యాగాన్ని ఆయన జీవించినంతవరకూ గుర్తించినవారు ఎవరైనా వున్నారా? ఈ దేశ దౌర్భాగ్యం క్రికెట్ తప్ప మరొకటి క్రీడే కాదు... క్రికెటర్ తప్ప మరొకడు మనిషే కాదు. ఒక తెడ్డు పుచ్చుకుని బంతిని కొట్టి వ్యక్తిగత ప్రతిష్ఠను, ఆదాయాన్ని పెంచుకునే వ్యక్తులకు  ఎన్ని ఉన్నత అవార్డులైనా ఇస్తారు. ఫిక్సింగ్ చేసిన ఓ పెద్దమనిషిని కూడా ఎంపీగా పార్లమెంట్‌కి పంపించిన పెద్దమనసులు మనవి. క్రికెట్ పేరు చెబితే ప్రేమ పొంగిపొర్లే మన జనాలకి మిగతా క్రీడలు, మిగతా సాహసాలను గుర్తించే తీరిక ఓపిక లేకపోవడం బాధాకరం. మల్లి మస్తాన్ బాబు పర్వతారోహకుడిగా చేసిన సాహసాలు తక్కువేమీ కాదు... చాలామంది ఊహించడానికి కూడా భయపడే సాహసాలను ఆయన చేశాడు. సాహసిగానే తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. పర్వతారోహకుడిగా ప్రాణాలు పోగొట్టుకుంటే తాను చాలా సంతోషిస్తానని చెప్పే ఆయన చివరికి తాను కోరుకున్నట్టే వెళ్ళిపోయాడు. మస్తాన్ బాబు ప్రాణాలు మాత్రమే పోయాయి... ఆయన ఇచ్చిన స్ఫూర్తికి మాత్రం ఎప్పటికీ మరణం లేదు. ఇప్పుడు మల్లి మస్తాన్ బాబుకి అవార్డులు ఇవ్వాలని, ఆయన పేరిట స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయాలని... ఇలా రకరకాల ఆకాంక్షలు వ్యక్తమవుతున్నాయి.  వద్దు... ఎవరికి పడితే వాళ్ళకి, పైరవీలు చేసుకుంటే అడ్డమైనవాళ్ళకి కూడా  ఇచ్చే ఇలాంటి అవార్డులు, స్మారక చిహ్నాలతో ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేయకండి... ఇప్పటికే ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలు ఎక్కేశాడు. ఇప్పుడు ఆయనకు ఇలాంటి అవార్డులు ఇచ్చి, ఆయన్ని ఆ శిఖరాల మీద నుంచి కిందకి దించకండి.. ప్లీజ్... మల్లి మస్తాన్ బాబు జీవించినంతకాలం ఎవరి నుంచీ ఏమీ ఆశించకుండా పేరుకు తగ్గట్టుగానే మల్లెపూవులా స్వచ్ఛంగా బతికాడు. ‘మల్లి’ వాడిపోయినా, రాలిపోయినా, ఆయన దేశంకోసం చేసిన త్యాగం తెలుగువారి మనసులలో పరిమళాలను వెదజల్లుతూనే వుంది. అదే ఆయనకు అసలైన నివాళి. మల్లి మస్తాన్ బాబుకు ఈ దేశ ప్రజల తరఫున ‘తెలుగువన్’ సెల్యూట్ చేస్తోంది.

ఈ 150 గోల ఏంటయ్యా చిరూ!

మాజీ మెగాస్టార్ చిరంజీవి గారికి నమస్కరించి రాయునది. మీరు గతంలో మెగాస్టార్‌గా వుండేవారు. ఒప్పుకుంటాం.  ఆ మెగాస్టార్ ఇమేజ్ చూసుకునే మీరు రాజకీయాల్లోకి వెళ్ళారు. ఇక్కడ సూపర్ హిట్టయిన మీరు అక్కడ అట్టర్ ఫ్లాపయ్యారు. రాజకీయాల్లో ఇక మీ టాలెంట్ ఎందుకూ పనికిరాదని అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ మీ దృష్టి సినిమా ఇండస్ట్రీ మీద పడింది. ఆ లెక్కలూ ఈ లెక్కలూ వేసి మీరు  ఇప్పటి వరకూ 149 సినిమాలు చేశారని, ఇప్పుడు 150వ సినిమా చేయాలని అనుకుంటున్నానని ప్రకటించారు. కథ కోసం, దర్శకుడి కోసం వెతుకుతున్నామని చెప్పుకొచ్చారు. మీరు 150వ సినిమా చేస్తున్నారని తెలుసుకుని మీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఓకే... మీరు తీస్తే 150వ సినిమా తీసుకోండి.. ఇంకా వీలుంటే 1500వ సినిమా కూడా తీసుకోండి మాకేం అభ్యంతరం లేదు. కానీ 150వ సినిమా పేరు చెప్పి మీరు చేస్తున్న హడావిడి మాత్రం పద్ధతిగా లేదు. ఏ దుర్ముహూర్తాన మీరు 150వ సినిమాలో నటిస్తున్నానని ప్రకటించారో అప్పటి నుంచి నానా గందరగోళం. అంతకుముందు వేరే గందరగోళం వుండేది... చిరంజీవి 150వ సినిమాలో నటిస్తాడా.. నటించడా.. నటిస్తే ఆ సినిమా ఎలా వుంటుంది.. ఇలా వుంటుందా అలా వుంటుందా. ఆయన నటిస్తానంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒప్పుకుంటుందా.... ఇలాంటి ఎన్నో అంచనాలు మీరు, మీ ఫ్యాన్స్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత మీరు 150వ సినిమాలో నటించబోతున్నానని ప్రకటించారు. ఇటు స్టేట్‌లో, అటు సెంటర్లో మీ పార్టీ మటాషైపోయింది కాబట్టి మీక్కూడా తీరిక దొరికింది. దాంతో 150 సినిమా చేయడానికి రెడీ అయిపోయారు. అంతవరకూ ఓకే... కానీ అప్పటి నుంచి మీ 150వ సినిమా పేరుతో జరిగిన తిరణాల చూడటానికి రెండు కళ్ళు, వినడానికి రెండు చెవులు చాలడం లేదు. ఈ సినిమాకి కథ ఎవరిస్తారు? దర్శకుడెవరు? ఫలానా దర్శకుడా? చిరంజీవే డైరెక్ట్ చేస్తాడా? హీరోయిన్ ఎవరు? తమన్నా నటిస్తుందా? శ్రీదేవి నటిస్తుందా?... ఎన్నో ఊహాగానాలు, ఎన్నో లీకులు... గోలగోల. ఇలాంటి ఊహాగానాలు, లీకుల వెనుక మీరు లేరని మేము భావించం. ఎందుకంటే, ఈ తరహా వ్యూహాలను మీరు గతంలో కూడా ఎన్నోసార్లు ప్రయోగించారు. చిరంజీవి పార్టీ పెడతాడా, పెట్టడా అనే ప్రచారాన్ని మీరు ఎంత పకడ్బందీగా నిర్వహించారో మాకు తెలియనిది కాదు. అదే వ్యూహాన్ని ఇప్పుడు మీరు మీ 150వ సినిమా విషయంలో కూడా ఫాలో అవుతున్నారని జనం నమ్ముతున్నారు. మీరు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత మీ ‘మెగాస్టార్’ పోస్టు ఊడిపోయింది. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి వస్తే జనం చూస్తారా లేదా అనే భయం మీలో వుంది. అందుకే జనాన్ని ప్రిపేర్ చేయడం కోసం, మీకు క్రేజ్ పెంచుకోవడం కోసం ఇలాంటి ప్రచారం ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారని జనం విశ్వసిస్తున్నారు. 150వ సినిమాలో నటిస్తే నటించేయండి... మధ్యలో ఇదంతా అవసరమంటారా? మీరు ఇప్పటికే 149 సినిమాల్లో నటించారు. త్వరలో 150వ సినిమాలో కూడా నటిస్తారు. ఇందులో వెరైటీ ఏముంది? సినిమా రంగంలో ఎవరూ సాధించని ఘనతేమీ కాదు కదా...! ఓహో.. తమరు రాజకీయాల్లోకి వెళ్ళి తిరిగొచ్చేసిన తర్వాత తీస్తున్న సినిమా కాబట్టి మీరు, మీ అభిమానులు దాన్ని వెరైటీగా భావిస్తూ వుండొచ్చు. తీసే సినిమాలో వెరైటీ వుండాలిగానీ, అంకెలో ఏముంది? మీరు నటిస్తున్న 150వ సినిమా అయితే ప్రేక్షకులకు ఏంటంట? బాగుంటే హిట్ చేస్తారు.. బాగాలేకపోతే ఫట్ చేస్తారు. మీరు గతంలో ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ సినిమాలకి ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇచ్చినా ఆ సినిమాలో వున్న మేటర్నిబట్టి ఇచ్చారే తప్ప  ఆ సినిమా తాలూకు నంబర్ని చూసి కాదు కదా... అలాంటప్పుడు మీ 150వ సినిమా విషయంలో ఎందుకు అంత హడావిడి చేయడం. మీరు నటిస్తున్న సినిమా 150వ సినిమా కాబట్టి దాన్ని తప్పకుండా హిట్ చేయాలన్న ఉద్దేశం ప్రేక్షకులకు ఎంతమాత్రం వుండదని మీకు తెలుసని అనుకుంటున్నాం. అలాగే ఇది మీ 150వ సినిమా కాబట్టి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. మీరు ఈ సినిమాకి మాత్రమే కాదు.. మీరు గతంలో నటించిన అన్ని సినిమాలకీ ఇన్నే జాగ్రత్తలు తీసుకున్నారు. మరి వాటిలో కొన్ని హిట్టయ్యాయి. కొన్ని ఫట్టయ్యాయి. దీన్నిబట్టి అర్థమయ్యేది ఏమిటంటే, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా హిట్టు, ఫట్టు అనేది మనచేతుల్లో వుండదు. అలాంటప్పుడు ఈ హడావిడి అంతా ఎందుకంటారు?

వీళ్ళు అభ్యుదయ రైతులా? ద్యేవ్‌డా!

అసలు అభ్యుదయ రైతులు అంటే ఎవరు? తమ పొలంలో వ్యవసాయం చేసి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదురొడ్డి, మంచి ఫలసాయం సాధించి దేశాభివృద్ధికి సహకరిస్తూ, ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచిన వారిని అభ్యుదయ రైతులు అంటారు. మన తెలంగాణ రాష్ట్రంలో అలాంటి అభ్యుదయ రైతులకు కొదువే లేదు. నీరు, విద్యుత్, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పనివాళ్ళు... ఇలాంటి సమస్యలు ఎన్ని వున్నా, ఆ సమస్యలను సవాళ్ళుగా తీసుకుని భూముల్లో బంగారం పండిస్తున్న రైతన్నలు ఎంతోమంది వున్నారు. భూమిని అమ్మేస్తే లక్షలకు లక్షలు వచ్చే అవకాశం వున్నా... నేల తల్లినే నమ్ముకుని, నలుగురికీ పట్టెడన్నం పెట్టాలన్న సదుద్దేశంతో వున్న ఆదర్శ రైతులు, అభ్యుదయ రైతులు ఎంతోమంది వున్నారు. మరి విదేశాలకు మన తరఫున అభ్యుదయ రైతులుగా పంపించాలంటే ఎవర్ని పంపించాలి... ఇలాంటి వారినే పంపించాలి. కానీ, తెలంగాణ ప్రభుత్వం అందుకు వ్యతిరేకమైన పని చేసింది. అది ఇప్పుడు వివాదాస్పదమైంది. నలుగురూ నవ్వుకునే టాపిక్‌లా మారింది.  ఆదర్శ రైతులంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల పుత్రరత్నాలేనన్న అర్థం వచ్చేలా ప్రభుత్వం ఆదర్శ రైతులను ఎంపిక చేసింది. ఇలాంటి వ్యవహారాల్లో కొత్త తరహా ‘ఆదర్శానికి’ తెర తీసింది. ఇజ్రాయిల్ దేశంలో ఈనెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఒక అంతర్జాతీయ స్థాయి వ్యవసాయ ఎగ్జిబిషన్ జరగబోతోంది. ఈ ప్రదర్శనకు మీ రాష్ట్రంలోని ఆదర్శ రైతులను పంపించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం అందింది. దాంతో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఇజ్రాయిల్ వెళ్ళడానికి ఒక ‘అభ్యుదయ రైతు’ ప్రతినిధి బృందం సిద్ధమైపోయింది. ఈ ప్రతినిధి బృందంలో ఎవరెవరు ఉన్నారయ్యా అంటే... ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్లు, పలువురు అధికారులతోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, గంగుల కమలాకర్, దాసరి మనోహర్ రెడ్డి వున్నారు. వీరితోపాటు కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేల పుత్రరత్నాలు కూడా వీరితోపాటు ఇజ్రాయిల్‌కి వెళ్ళబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వ్యవసాయవిశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు, అధికారుల వరకు ఓకే.. కానీ, ‘అభ్యుదయ రైతులు’ అనే హోదాలో వెళ్ళబోతున్న అధికార పార్టీ నాయకులను చూసి చాలామంది ముక్కున వేలేసుకుంటున్నారు. ఇజ్రాయిల్ ప్రభుత్వం అభ్యుదయ రైతుల్ని పంపమంటే ఎమ్మెల్యేలను పంపడమేంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఎమ్మెల్యేలు కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అసలు అభ్యుదయ రైతులే లేరా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎమ్మెల్యేలు ఇజ్రాయిల్‌కి టూర్‌ వెళ్ళాలని ముచ్చట పడుతూ వుంటే ఓకే... వారితోపాటు ఒకరిద్దరు నిజమైన ఆదర్శ  రైతులను పంపొచ్చుకదా అని అంటున్నారు.  ప్రభుత్వం ఇప్పటికైనా ఇజ్రాయిల్‌కి పంపే ప్రతినిధి బృందంలో సభ్యుల విషయంలో తన నిర్ణయాన్ని పునః పరిశీలించుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఒకవేళ తెలంగాణ మొత్తంలో అభ్యుదయ రైతులు ఎవరూ అందుబాటులో లేకపోతే, ఎకరానికి కోట్ల రూపాయల పంట పండిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా ఈ ప్రతినిధి బృందంతో ఇజ్రాయిల్‌కి వెళ్ళొచ్చుకదా అంటున్నారు.

విశాఖలో అక్షరధామ్ ఆలయం!?

  అక్షర్‌ధామ్ ఆలయాల గురించి, ఆ ఆలయాల అందం గురించి, ఆ ఆలయాల వైభవం గురించి అందరికీ తెలిసిందే. శ్రీ అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థానం ట్రస్ట్ ఈ ఆలయాలను నిర్మించింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో, దేశ రాజధాని ఢిల్లీలో అక్షర్‌ధామ్ ఆలయాలు వున్నాయి. ఈ ఆలయాలు ఒకే తరహాలో వుంటాయి. వీటిని చూడటానికి రెండు కళ్ళూ చాలవన్నట్టుగా వుంటాయి. ఈ ఆలయాలను దర్శించడానికి భారీ సంఖ్యలో యాత్రికులు వస్తూవుంటారు. హిందూ ధర్మ వైభవానికి ప్రతీకలుగా నిలిచే ఆలయాలివి. ఇప్పుడు ఇలాంటి అక్షర్‌ధామ్ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో కూడా ఏర్పాటు చేయాలని శ్రీ అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థానం ట్రస్ట్ భావిస్తోంది. వైజాగ్‌లో ఆలయాన్ని నిర్మించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు విశాఖపట్టణం సమీపంలోని సింహాచలం పరిసరాల్లో ఆలయ నిర్మాణానికి అవసరమైన భూమిని గుర్తించే పనుల్లో వున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. శ్రీ అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థానం ట్రస్ట్ వైజాగ్ సమీపంలో అక్షరధామ్ ఆలయాన్ని నిర్మించాన్న ప్రతిపాదనను సూత్రప్రాయంగా తమ దగ్గర వ్యక్తం చేసిందని ఆయన తెలిపారు. ఏపీ ప్రభుత్వం కూడా అందుకు పూర్తి సుముఖంగానే వుందని, స్వామినారాయణ్ ట్రస్ట్ నుంచి పూర్తి సమాచారం వచ్చిన అనంతరం, ప్రభుత్వం కూడా ఈ దిశగా మరింత ముందడుగు వేస్తుందని ఆయన తెలిపారు. విశాఖపట్నం పరిసరాలను టూరిస్ట్ ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ప్రణాళికలను రూపొందిస్తోందని, ఇప్పుడు ఈ ప్రాంతంలో అక్షరధామ్ ఆలయ నిర్మాణం జరిగితే, విశాఖ ప్రాంతం జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను మరింతగా ఆకర్షించే అవకాశం వుందని ఆయన చెబుతున్నారు. ఇప్పటికే నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో అంతర్జాతీయ ప్రతిష్ఠాత్మక సంస్థలు వస్తున్నాయి.  ఇక అక్షరధామ్ ఆలయ నిర్మాణం కూడా జరిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అది మరో ముందడుగు అవడం ఖాయం.

క్రికెట్ ఆదాయం క్లీన్‌బౌల్డ్

ఆంగ్ల రచయిత బెర్నార్డ్ షా చచ్చి ఏ లోకాన వున్నాడోగానీ, ఆయన బతికున్నప్పుడు క్రికెట్ గురించి బంగారం లాంటి మాట చెప్పాడు. 11 మంది ఫూల్స్ ఆడుతుంటే, 11 వేల మంది ఫూల్స్ చూసే ఆట క్రికెట్ అని స్టంపింగ్ చేసినట్టు క్లియర్‌గా చెప్పేశారాయన. ఈ మాట చాలామంది క్రికెట్ పిచ్చోళ్ళని హర్ట్ చేయొచ్చేమోగానీ, అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ క్రికెట్ రంగంలో వున్న అనేక అనారోగ్యకర ధోరణులను చూస్తూ వుంటే జార్జ్ బెర్నాడ్ షా చెప్పింది అక్షర సత్యం అని అనిపిస్తూ వుంటుంది. మానసికోల్లాసం కోసమంటూ ప్రారంభమైన ఈ క్రీడ  ఇప్పుడు ‘మనీ’సికోల్లాసం కోసం అన్నట్టుగా తయారైంది. ఆ కప్పు, ఈ కప్పు, ఆ టోర్నీ, ఈ టోర్నీ అంటూ రకరకాలుగా క్రికెట్ మ్యాచ్‌లు ఏర్పాటు చేసి స్పాన్సర్ షిప్పులు, ఈ షిప్పులు, ఆ షిప్పులు అంటూ బాగా డబ్బు దండుకోవడం క్రికెట్ సంస్థలకు షరా మామూలు అయిపోయింది.   క్రికెటర్లు మైదానంలో ప్రవహించజేసే పరుగుల సంగతేమోగానీ, క్రికెట్ పేరుతో జరుగుతున్న డబ్బు ప్రవాహాన్ని చూస్తే మాత్రం కళ్ళు తిరుగుతాయి, క్రికెట్ పేరుతో జనాల జేబులకు పెడుతున్న చిల్లులు చూస్తుంటే గుండెలు అదురుతాయి. అయితే క్రికెట్‌లో డబ్బు ప్రవాహం అనేది మొన్నామధ్య వరకూ టూమచ్‌గా వుండేది. ఈమధ్యకాలంలో ఆ ప్రవాహం బాగా తగ్గిపోయిందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. క్రికెట్ నుంచి భారీగా ఆదాయం పొందడానికి రకరకాలుగా ప్రయత్నించే మన ఇండియాకి చెందిన బీసీసీఐ బొచ్చెలో ఈమధ్యకాలంలో పెద్దపెద్ద రాళ్ళు పడ్డాయి. దాంతో ఇండియాలో క్రికెట్‌ మానియాతోపాటు, క్రికెట్ మనీ కూడా తగ్గిపోతోందని బీసీసీఐ పెద్దలకి అర్థమైపోయింది. ఈమధ్య బీసీసీఐ వాళ్ళు తమ ఆదాయం లెక్కలు వేసుకుని కళ్ళు తేలేశారు. వాళ్ళకి తక్కువ ఆదాయం రావడంతో ఆటగాళ్ళకు వెళ్ళే వాటా కూడా బాగా తగ్గిపోయింది. 2012 - 13 సంవత్సరంలో వచ్చిన ఆదాయంలో 49 కోట్ల రూపాయలను బీసీసీఐ ఆటగాళ్ళకు పంచింది. అదే 2013 - 14 సంవత్సరంలో కేవలం 11 కోట్ల రూపాయలను మాత్రమే ఇవ్వగలిగింది. ఏడాది ఏడాదికి పెరుగుతూ వెళ్ళాల్సిన ఆదాయం ఇలా ఒక్కసారిగా దఢేల్మని కింద పడిపోవడంతో బీసీసీఐ బుర్ర వాచి బొప్పి కట్టింది. బీసీసీఐ ఆదాయం తగ్గడంతో భారత క్రికెటర్లకు దక్కే సొమ్ము కూడా భారీగా తగ్గిపోయింది. ఇలా ఆదాయం తగ్గడానికి ప్రధాన కారణం ఇండియాలో క్రికెట్ మ్యాచ్‌లు చూసేవాళ్ళ సంఖ్య బాగా తగ్గడమే. క్రికెట్ చూసేవాళ్ళ సంఖ్య తగ్గడంతో టీవీల్లో ప్రసారమయ్యే క్రికెట్ మ్యాచ్‌ల గ్రాస్ రేటింగ్ పాయింట్స్ (జీఆర్పీ) కూడా భారీగా తగ్గిపోయింది. ఈ ఒక్క ఏడాదిలోనే 40 శాతం జీఆర్పీ పడిపోయింది. దాంతో టీవీల్లో ప్రసారమయ్యే మ్యాచ్‌లకు వచ్చే స్పాన్సరర్లు బాగా తగ్గిపోయారు. ఫలితం... బీసీసీఐ ఆదాయానికి భారీగా గండి పడింది. ఇలా టీవీల్లో మ్యాచ్‌లు చూసేవారి సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెట్ దిగ్గజాలు ఇప్పుడు భారత జట్టులో లేకపోవడం, ఎప్పటికప్పుడు కొత్త కుర్రాళ్ళు టీమ్‌లోకి వస్తూ వుండటం, వారిని అభిమానించేవారు ఎక్కువగా లేకపోవడమేనని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. అయితే అసలు కారణాలు వేరే వున్నాయని పరిశీలకులు అంటున్నారు. క్రికెట్ అనేది ఫూల్స్‌ గేమ్ అనేది నేటి యువతరంలో చాలామందికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఈ ఫూల్స్ గేమ్ చూసే ఫూల్స్ జాబితాలో తాము కూడా వుండటం ఎందుకని చాలామంది క్రికెట్ మీద ఆసక్తికి గుడ్ బై చెప్పేస్తున్నారు. దీంతోపాటు చాలామంది యూత్ కెరీర్ ఓరియెంటెడ్ అయిపోయారు. ఎవరో ఆడితే, ఎవరో గెలిస్తే నాకేంటి... నా కెరీర్ సంగతి నేను చూసుకుంటాననే సీరియస్ ధోరణి కూడా ఇటీవలి కాలంలో పెరుగుతూ వుండటంతో క్రికెట్‌కి ఆదరణ తగ్గుతోంది. వీటితోపాటు క్రికెట్ రంగంలో పెరిగిపోయిన ఫిక్సింగ్ లాంటి అడ్డదారులు, బెట్టింగ్ లాంటి చెడ్డదారులు ఈ గేమ్ మీద వున్న క్రేజ్‌ని తగ్గిపోయేలా చేస్తున్నాయి. బెట్టింగ్స్ పుణ్యమా అని ఇప్పటికే దేశంలో ఎన్నో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సగటు లెక్కల ప్రకారం ఇండియాలో గతంలో క్రికెట్ ప్రియులు వారానికి 29 గంటలు క్రికెట్ చూసేవారు. 2014 సంవత్సరానికి అది 16 గంటలకు తగ్గిపోయింది.  భవిష్యత్తులో అది మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.  శుభం.

పాముకు పాలు పోసినా కాటేస్తుంది

  ప్రపంచంలో భారతదేశంతో సహా అనేక దేశాలు ఉగ్రవాదానికి బలవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ పాకిస్తాన్ వంటి దేశాలు భయంకరమయిన విషసర్పాల వంటి ఉగ్రవాదులను పెంచి పోషిస్తునే ఉన్నాయి. పాము తన పిల్లలను తానే చంపి తిన్నట్లుగా వారు పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు చివరికి వారి పిల్లలను, ప్రజలనే అతి కిరాతకంగా చంపుతున్నారు. అయినా పాక్ ప్రభుత్వానికి కనువిప్పు కలగకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. పాకిస్తాన్ చేస్తున్న ఈ నిర్వాకానికి భారత్ కూడా మూల్యం చెల్లించవలసిరావడం ప్రతీ భారతీయుడికి చాలా కష్టం అనిపిస్తుంది.   పాకిస్తాన్ నిర్వాకం ఎలా ఉన్నా రెండు నెలల క్రితం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కూడా సరిగా అటువంటి నిర్వాకమే చేస్తూ భారత్ కు మరిన్ని కొత్త సమస్యలు, సవాళ్ళు, కష్టాలు తెచ్చిపెడుతున్నారిప్పుడు.   కాశ్మీర్ వేర్పాటు వాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ పై దయ తలచబట్టే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహించుకోగలిగామని ప్రకటించిన ఆయన అందుకు వారికి ధన్యవాదాలు కూడా తెలుపుకొన్నారు. అధికారం చేప్పట్టి నెల తిరుగక ముందే మసరత్ ఆలం అనే కరడుగట్టిన వేర్పాటువాదిని మూడో కంటికి తెలియకుండా జైలు నుండి విడుదల చేసి చేతులు దులుపుకొన్నారు.   అతను నాలుగు రోజుల క్రితం శ్రీనగర్ లో ఒక భారీ ర్యాలీ, బహిరంగ సభను ఏర్పాటు చేసి అందులో పాకిస్తాన్ జెండాను ప్రదర్శించారు. అంతకు ముందు రోజే ఆయన ఆక్రమిత కాశ్మీర్ నుండి ప్రసారమవుతున్న ఒక రేడియో చానల్ ద్వారా భారత వ్యతిరేక ప్రసంగం చేసారు కూడా.   కాశ్మీర్ వేర్పాటువాదిగా పేరుమోసిన సయీద్ గిలానీ డిల్లీలో ఒక ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని శ్రీనగర్ తిరిగి వస్తున సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు మసరత్ ఆలం ఆ భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించడం, అందులో పాకిస్తాన్ జెండాలను ఎగురవేసినా ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కు అందులో ఎటువంటి తప్పు కనిపించలేదు. చివరికి నిరసనకారులు భారత జెండాను బహిరంగంగా తగులబెట్టినా ఆయనకు అందులో తప్పేమీ కనబడలేదు. అది విభిన్న వ్యక్తుల భిన్నాభిప్రాయాలకు ప్రతీక అని సర్దిచెప్పుకొన్నారు.   కానీ ఆయన తన తీరు మార్చుకోకపోతే ఆయన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తామని బీజేపీ గట్టిగా హెచ్చరించడం, కేంద్ర హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ స్వయంగా ఫోన్ చేసి గట్టిగా మందలించిన తరువాతనే ఆయన భారత్ కు వ్యతిరేకం గా వ్యవహరిస్తున్న మసరత్ ఆలం, గిలానీలని అరెస్ట్ చేయించారు. కానీ వారిలో గిలానిని మాత్రం జైలుకి తరలించకుండా గృహ నిర్బంధంలోనే ఉంచారు. అంటే ఆయనకి ఇప్పటికీ స్వేచ్చ ఉన్నట్లే భావించవచ్చును.   మసరత్ ఆలంని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకు వెళుతున్నప్పుడు ఆయన మీడియాతో మాట్లాడుతూ కాశ్మీర్ ప్రజలు వేర్పాటువాద సంస్థ హురియత్ నేతృత్వంలో తమ పోరాటాలు కొనసాగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.   శ్రీనగర్ కి సుమారు 50కిమీ దూరంలో పుల్వామా జిల్లాలోగల ట్రాల్ పట్టణంలో వారం రోజుల క్రితం భద్రత దళాలకి ఉగ్రవాదులకి మధ్య చిన్నపాటి యుద్దమే జరిగింది. అందులో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. కానీ చనిపోయిన వారిరురువూ సామాన్య పౌరులేనని, కనుక వారిని ఎన్కౌంటర్ చేసిన భద్రతా దళాలపై కేసు నమోదు చేయాలని, కాశ్మీర్ లోయ నుండి భారత భద్రతా దళాలను తక్షణమే ఉపసంహరించాలని మసరత్ ఆలం ఆయన అనుచరులు డిమాండ్ చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. గత మూడు నాలుగు రోజులుగా నౌహట్ట మరియు ట్రాల్ ప్రాంతాలలో ప్రజలు నిరసన ర్యాలీలు నిర్వహిస్తూ తమను అడ్డుకొంటున్న భద్రత దళాలపై రాళ్ళు రువ్వుతున్నారు. వారి దాడిలో భద్రత దళాలకు చెందిన 29 మంది గాయపడ్డారు. గత నాలుగయిదు రోజులుగా నిరసనకారులు భద్రతా దళాలపై రాళ్ళు రువ్వడం, వారిని నిలువరించేందుకు భద్రతా దళాలు తిరిగి వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించడంతో శ్రీనగర్ ప్రాంతం అట్టుడుకుతోంది.   క్రమంగా జమ్మూ కాశ్మీర్ లోయలో తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని భావిస్తున్న తరుణంలో మళ్ళీ తిరుగుబాటు, అల్లర్లు, హింస మోదలయ్యాయి. దీనికంతటికీ కారణం ఎవరు? ఏమిటి? అని ప్రశ్నించుకొంటే ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్, అయన చేసిన నిర్వాకమేనని చెప్పక తప్పదు. అతనిని విడుదల చేయడం వలన రాష్ర్టంలో ప్రశాంత పరిస్థితులు ఏర్పడుతాయని ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని సమర్ధించుకొన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి? గతంలో అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి కారకుడయిన మసరత్ ఆలంని జైలు నుండి విడుదల చేసిన తరువాతనే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఈ సమస్యలు మొదలయ్యాయి.   భారత గడ్డపై ఉగ్రవాదులకు ఊతం ఇస్తున్న అటువంటి ముఖ్యమంత్రికి, అయన ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఇవ్వడం ఆ ప్రభుత్వంలో అధికారం పంచుకోవడం ఎంతవరకు సమంజసమో బీజేపీయే ఆలోచించుకోవాలి. దాని వలన మున్ముందు జరుగరానిది ఏదయినా జరిగినట్లయితే అందరూ బీజేపీనే నిందించకమానరు. చేతులు కాలే వరకు వేచి చూడటం కంటే, అటువంటి ప్రమాదం పొంచి ఉందని తెలిసి ఉన్నప్పుడు ముందే దానిని నివారించే ప్రయత్నం చేస్తే మంచిది కదా.