అభివృద్ధి మంత్రం పఠిస్తున్న తెలుగు రాష్ట్రాలు

  ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు ఏర్పడి రేపటికి ఒక సంవత్సరం పూర్తవుతుంది. రేపటి నుండి వారం రోజులపాటు రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించుకొనేందుకు తెరాస ప్రభుత్వం సిద్దపడుతుంటే, ప్రజల అభీష్టానికి విరుద్దంగా రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఏర్పడిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ముందు ఉన్న అనేక సవాళ్ళను ఎదుర్కొనేందుకు ప్రజలందరినీ రాష్ట్రాభివృద్ధి కోసం కార్యోన్ముకులను చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుండి వారం రోజుల పాటు నవ నిర్మాణ దీక్ష చేప్పట్టబోతోంది. రెండు ప్రభుత్వాలు ఎంచుకొన్న మార్గాలు వేరయినా వాటి అంతిమ లక్ష్యం మాత్రం రాష్ట్రాల పునర్నిర్మాణమే. రెండు రాష్ట్రాలకు ప్రత్యేకమయిన సమస్యలు, వనరులు ఉన్నాయి.   ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణా రాష్ట్రం ఆర్ధికంగా చాలా బలంగా ఉంది. అదేవిధంగా ఆ రాష్ట్రానికి అపారమయిన మానవ వనరులు కూడా ఉన్నాయి. అన్ని విధాల అభివృద్ధి చెంది రాష్ట్రానికి అక్షయపాత్ర వంటి హైదరాబాద్ నగరం రాజధానిగా ఉంది. కానీ తీవ్ర విద్యుత్ లోటు, వ్యవసాయానికి తగినంత నీటి వసతి లేకపోవడం, రాష్ట్రంలో మిగిలిన జిల్లాలు వెనుకబడి ఉండటం వంటి కొన్ని తీవ్ర సమస్యలు కూడా ఉన్నాయి. వాటిని అధిగమించేందుకు తెలంగాణా ప్రభుత్వం చాలా తీవ్రంగా కృషి చేస్తోంది. బహుశః రానున్న నాలుగేళ్లలో ఈ సమస్యలకు పరిష్కారం లభించవచ్చును. తెరాస ఏడాది పాలనకు ప్రతిపక్షాలు అత్తెసరు మార్కులేసినప్పటికీ తెలంగాణా ప్రజలు మంచి మార్కులే వేస్తున్నారు. కనుక అది సరయిన దిశలోనే పయనిస్తోందని భావించవచ్చును.   ఇక ఆంద్రప్రదేశ్ రాష్ట్రం తను చేయని నేరానికి బలయిపోయిందని చెప్పవచ్చును. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చేయడాన్ని ఎవరూ తప్పుపట్టకపోయినా, ఆకారణంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి కలగడం ప్రజలెవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. తీవ్ర ఆర్ధిక సమస్యలు ఒక పక్క పీడిస్తున్నప్పటికీ వేల కోట్లు వ్యయమయ్యే రాజాధానిని అత్యవసరంగా నిర్మించుకోవలసివస్తోంది. కానీ రాష్ట్రానికి మంచి సారవంతమయిన నీటి సౌకర్యం కలిగిన పంట భూములు విస్తారంగా ఉండటం, అదే విధంగా సువిశాలమయిన సముద్ర తీరం, అపారమయిన మానవ వనరులు, విశాఖ, విజయవాడ, నెల్లూరు, తిరుపతి వంటి అభివృద్ధి చెందిన నగరాలు కలిగి ఉండటం కూడా రాష్ట్రానికి చాలా కలిసి వచ్చే అంశమేనని చెప్పవచ్చును.   కనుక వీలయినంత త్వరగా రాజధాని నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ధి జరిగినట్లయితే మరొక మూడు నాలుగేళ్లలోనే రాష్ట్రం పూర్తిగా కోలుకొనే అవకాశం ఉంటుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ రెంటిమీదే ప్రధానంగా తన దృష్టి కేంద్రీకరిస్తోందని చెప్పవచ్చును. కానీ రాజధాని నిర్మాణానికి నిధుల కొరత కంటే ప్రతిపక్షాలు సృష్టిస్తున్న అవరోధాలే పెద్ద సమస్యగా మారింది. అదేవిధంగా ఏడాది కాలం గడిచిపోయినా రాష్ట్రానికి ఇంతవరకు ప్రత్యేక హోదా మంజూరు చేయకపోవడం వలన రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో విలువయిన ఒక ఏడాది సమయం చేజారిపోయింది. కానీ త్వరలోనే ప్రత్యేక హోదాపై ఒక ప్రకటన చేస్తానని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న తాజా హామీ మళ్ళీ ఆశలు చిగురింపజేస్తోంది. ప్రత్యేక హోదా మంజూరు చేసినట్లయితే చాలా వేగంగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృధి జరిగి తద్వారా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపడవచ్చును.   రాష్ట్ర అభివృద్ధి కోసం తెదేపా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రజల నుండి కూడా మంచి స్పందనే వస్తోంది. బహుశః రెండు తెలుగు రాష్ట్రాలు వచ్చే నాలుగేళ్లలో ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించి, మంచి అభివృద్ధి సాధించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.

ప్రత్యేక హోదా కల త్వరలోనే సాకారం కాబోతోందా?

  కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాద్ సింగ్ నిన్న డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయం గురించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకొంటామని తెలిపారు. “ప్రత్యేక హోదాతో సహా రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలను తమ ప్రభుత్వం ఖచ్చితంగా అమలుచేస్తుందని, ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని” బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ప్రకటించడం గమనిస్తే త్వరలోనే కేంద్రం ఖచ్చితంగా ఒక నిర్దిష్టమయిన ప్రకటన చేస్తుందనే నమ్మకం కలుగుతోంది.   ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ‘ప్రత్యేక హోదా’ ఇవ్వాలని కోరుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు పోరాటాలు చేస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర విభజనతో రాష్ట్రంలో కోలుకోలేని విధంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రత్యేక హోదా అంశం పట్టుకొని పోరాడుతూ మళ్ళీ రాష్ట్రంలో బలం పుంజుకోవాలని చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ అది చేస్తున్న పోరాటాలు నిజమయినవి కావని, కాంగ్రెస్ ఉనికిని, ఆ పార్టీ నేతల రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే చేస్తున్నవని ప్రజలందరికీ తెలిసినందునే దానిని పట్టించుకోవడం లేదు.   కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆలశ్యం చేసినట్లయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ బలపడే అవకాశం ఉంటుంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని కలలుగంటున్న బీజేపీ అప్పుడు మిగిలిన పార్టీలతో బాటు కాంగ్రెస్ పార్టీని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ఒకవేళ మోడీ ప్రభుత్వం త్వరలోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినా కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్టును పట్టుకొని కేంద్రంపై తన పోరాటం కొనసాగించవచ్చును.   ఇక ఏదో ఒకనాడు బీజేపీతో జతకట్టాలనే ఆలోచనతోనే వైకాపా ఈ ప్రత్యేక హోదా, మిగిలిన హామీల గురించి గట్టిగా మాట్లాడటం లేదనే విషయం పెద్ద రహస్యమేమీ కాదు. కానీ బీజేపీతో తమ పార్టీతో జత కట్టే అవకాశం లేదని గ్రహించిన మరుక్షణం వైకాపా కూడా ప్రత్యేక హోదాతో సహా రాష్టానికి ఇచ్చిన అన్ని హామీలపై కూడా ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీయడం ఖాయం. అప్పుడు ప్రజలలో బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వాలపై వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంటుంది.   ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంటూ బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న కారణంగా తెదేపా ప్రతిపక్షాలతో కలిసి పోరాటాలు చేయలేదు కనుక నేరుగా కేంద్ర ప్రభుత్వంపై చాలా ఒత్తిడి తెస్తోంది. ఈ విషయంలో జరుగుతున్నఆలశ్యం వలన అధికార తెదేపాపై కూడా క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది. ఆ కారణంగానే అది కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోంది. ఒకవేళ ఇంకా ఆలశ్యం జరిగినట్లయితే తెదేపా, బీజేపీలు రెండు కూడా ప్రజలకు జవాబు చెప్పుకోవడం చాలా కష్టమవుతుంది. కానీ ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం కనుక తెదేపా కంటే బీజేపీకే ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం ఉంది. బహుశః అందుకే ఇంతవరకు ప్రత్యేక హోదాపై కొంచెం ఊగిసలాడిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాని గురించి సానుకూలంగా మాట్లాడుతోంది.   కానీ ప్రత్యేక హోదా కోసం  అనేక రాష్ట్రాలు అనేక ఏళ్లుగా పోరాడుతున్నాయి. తమిళనాడు, ఓడిషా,కర్నాటక వంటి ఇరుగుపొరుగు రాష్ట్రాలు ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని కేంద్రాన్ని గట్టిగా కోరుతున్నాయి. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అవసరమయిన అర్హతలు రాష్ట్రానికి లేవని 14వ ఆర్ధిక సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకారం తెలపవలసి ఉంటుంది. వారివారి రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొందరు అభ్యంతరం చెప్పవచ్చు లేదా తమకీ ఇమ్మని మెలిక పెట్టవచ్చును. ఎన్డీయే ప్రభుత్వం ఈ సమస్యలను అన్నిటినీ అధిగమించగలిగితే తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు. కనుక ప్రత్యేక హోదా ఇస్తానని ఖచ్చితంగా ప్రకటించకుండా త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకొంటామని చెపుతోంది.   ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకానట్లయితే అందుకు ప్రతిగా రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి భారీ ఆర్ధిక ప్యాకేజీ, రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి అవసరమయిన సబ్సీడీలు, ఆకర్షణీయమయిన ప్రోత్సాహకాలు ప్రకటింస్తుందేమో? ఇంకా ఈ అంశాన్ని నాన్చడం వలన తమకే నష్టం జరిగే ప్రమాదం ఉందనే ఆలోచనతోనే ఇక ఏదోవిధంగా ఈ సమస్యను పరిష్కరించాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించుకొని ఉండవచ్చును. ఇప్పటికే విలువయిన ఒక సంవత్సర కాలం గడిచిపోయింది. కనుక ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాకు తీసిపోని విధంగా ఏదయినా ప్రకటిస్తే దానిని వ్యతిరేకించకుండా స్వీకరించడమే రాష్ట్రానికి మేలు చేకూర్చుతుంది.

జాతీయపార్టీగా ఎదిగేందుకు తెదేపా ముందున్న సవాళ్లు

  మహానాడు సమావేశాలలో పార్టీ జాతీయ కమిటీ ఏర్పాటు, దానికి అధ్యక్ష ఎన్నికల ప్రక్రియతో తెలుగుదేశం పార్టీని జాతీయపార్టీగా మార్చేందుకు శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీని చుట్టుపక్కల అన్ని రాష్ట్రాలలోకి విస్తరించాలని నిర్ణయం జరిగింది.. జాతీయ కమిటీని ఏర్పాటు చేసుకోవడం వరకు పార్టీకి ఎటువంటి సమస్యలు ఉండకపోవచ్చును. కానీ పార్టీని జాతీయ పార్టీగా మార్చి ఇరుగు పొరుగు రాష్ట్రాలలో విస్తరించాలంటే అనేక సమస్యలను అధిగమించాల్సి ఉంటుంది.   అన్నిటి కంటే ముందుగా పార్టీ పేరుతో ఒక చిక్కు ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పేరుతో పార్టీ కొనసాగడానికి ఎటువంటి సమస్యా ఉండబోదు. కానీ తమిళనాడు, కర్నాటక, ఓడిశా, మహారాష్ట్ర, అండమాన్, నికోబార్ దీవులలో పార్టీని విస్తరించాలనుకొంటున్న తెలుగుదేశం అదే పేరుతో తనను తాను అక్కడి ప్రజలకు పరిచయం చేసుకోవడం చాలా కష్టం. మరాఠీ, ఒడియా,కన్నడ, తమిళ్ బాషలు మాట్లాడే ప్రజలను తెలుగుదేశం పేరుతో ఒప్పించడం చాలా కష్టం. అలాగని వారి కోసం పార్టీ పేరును మార్చుకోలేదు. బహుశః ఈ సమస్యను మొదటే గుర్తించిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్టీఆర్ చాలా దూరదృష్టితో ఆలోచించి తెదేపా బదులు ‘భారతదేశం పార్టీ’ అని పేరు పెట్టాలని ఆలోచించారేమో? ఏమయినప్పటికీ ముందుగా ఈ పేరు సమస్యను తెదేపా పరిష్కరించుకోవలసి ఉంటుంది.   ఇక పొరుగు రాష్ట్రాలలో ఇప్పటికే అనేక ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా నిలద్రోక్కుకొని ఉన్నాయి. కనుక తమకు పోటీగా వస్తున్న తెదేపాను ఆ పార్టీలు వ్యతిరేకించవచ్చును. ఉదాహరణకి తమిళనాడులో అధికార అన్నాడీయంకె, ప్రధాన ప్రతిపక్షమయిన డీయంకెలతో బలంగా నిలద్రోక్కుకొని ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీలతో సహా మరొక అరడజను పార్టీలు కూడా ఉన్నాయి. అవ్వన్నీ కూడా ప్రతీ ఎన్నికలలో స్థానిక తెలుగు ప్రజల ఓట్లను పొందుతున్నాయి. ఇప్పుడు తెదేపా ప్రవేశిస్తే వాటికి ఆ ఓట్లన్నీ పోయే అవకాశం ఉంది. కనుక వాటి నుండి వ్యతిరేకత ఎదుర్కోవలసి రావచ్చును. కానీ ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో మాదిరిగానే ఆ రాష్ట్రాలలో కూడా బీజేపీతో కానీ లేదా ఎన్డీయే కూటమిలో ఉన్న పార్టీలతో గానీ లేదా ఏదో ఒక స్థానిక పార్టీతో గానీ పొత్తులు పెట్టుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చును. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో కూడా కొనసాగాలనే ఉద్దేశ్యంతోనే తెదేపా జాతీయస్థాయికి ‘అప్ గ్రేడ్’ అవ్వాలనుకొంటోంది తప్ప ఆయా రాష్ట్రాలలో ప్రధాన పార్టీలతో పోటీపడి అధికారం కైవసం చేసుకొనే ఆలోచనలేదనే చెప్పవచ్చును. కనుక ఆయా రాష్ట్రాలలో ఏదో ఒక పార్టీతో పొత్తులు పెట్టుకొన్నట్లయితే తెదేపా పెద్దగా ఇబ్బంది లేకుండానే ఇతర రాష్ట్రాలకు విస్తరించగలదు.   ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన పూర్తి సమయం కేటాయించలేకపొతున్నారు. అటువంటప్పుడు మరిన్ని రాష్ట్రాలకు పార్టీని విస్తరించేమాటయితే వాటికీ తగినంత సమయం కేటాయించగలరా? లేకుంటే అక్కడ పార్టీలను ఏవిధంగా బలోపేతం చేసుకోవాలి? ఎటువంటి వ్యూహాలు అమలుచేయాలి? ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించాలి? వివిధ రాష్ట్రాలలో పార్టీ శాఖలను, నేతలను పార్టీతో ఏవిధంగా అనుసదానించాలి? వంటి వాటి గురించి కూడా పార్టీ అధిష్టానం ముందుగానే ఆలోచించుకోవలసి ఉంటుంది. అందుకు జాతీయపార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలు అమలుచేస్తున్న విధానాలను పరిశీలిస్తే మంచిది.   తెదేపాను ఇతర రాష్ట్రాలకు విస్తరించినప్పుడు ఆయా రాష్ట్రాలలో స్థానిక నేతలతోనే పార్టీని నిర్మించుకోవడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు అధిగమించగలదు. కనుక ముందుగా తను విస్తరించాలనుకొంటున్న రాష్ట్రాలలో అటువంటి బలమయిన వ్యక్తులను, పార్టీ పట్ల అభిమానం ఉన్నవారినీ గుర్తించి వారితోనే పార్టీ నిర్మాణ కార్యక్రమం ప్రారంభించాల్సి ఉంటుంది. త్వరలోనే కర్నాటక, తమిళనాడు,మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ ద్వీపాలలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఆరంభించేందుకు తెదేపా కమిటీలను, వాటికి నేతృత్వం వహించేవారిని ఏర్పాటుచేసుకొంది. ఇరుగు పొరుగు రాష్ట్రాలలో తెదేపా మొదలుపెట్టబోయే సభ్యత్వ నమోదు ప్రక్రియకు వచ్చే స్పందనను బట్టి ఏ ఏ రాష్ట్రాలలో తెదేపా త్వరగా విస్తరించే అవకాశం ఉందనే విషయంపై ఒక అవగాహన ఏర్పడుతుంది.   ప్రస్తుతానికి తెదేపా విస్తరించాలనుకొంటున్న రాష్ట్రాలలో ఏ రాజకీయ పార్టీకి తెదేపా ఎన్నికల చిహ్నమయిన ‘సైకిల్’ గుర్తు లేదు కనుక వాటి నుండి ఈ విషయంలో అభ్యంతరం ఉండకపోవచ్చును. కానీ ఉత్తరాదికి విస్తరించాలనుకొంటే మాత్రం సమాజ్ వాదీ పార్టీకి కూడా సైకిల్ ఎనికల గుర్తుగా ఉంది కనుక అక్కడ ఆ పార్టీతో సమస్య ఎదురవవచ్చును. ఇటువంటి అనేక సాంకేతిక, రాజకీయ సమస్యల గురించి అధ్యయనం చేసి నివేదిక సమర్పించడానికి మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసారు. ఆ కమిటీ ఇంకా తన నివేదిక ఈయవలసి ఉంది. దాని ద్వారా మరికొన్ని ఇటువంటి సమస్యలు బయటపడవచ్చును. వాటన్నిటికీ తెదేపా పరిష్కారాలు కనుగొనవలసి ఉంటుంది. అప్పుడే జాతీయస్థాయిలో సైకిల్ సవారీ సజావుగా సాగుతుంది.

అమరావతి నిర్మాణంతో ప్రతిపక్షాలకు కష్టకాలం?

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యాధునిక రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి జరుగుతున్న సన్నాహాలు, దాని విశేషాలు వింటుంటే అది ఎప్పుడు తమ కళ్ళముందు సాక్షాత్కారిస్తుందా...అని ఆంద్రప్రదేశ్ ప్రజలందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం అత్యాధునిక విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని, యంత్రాలను ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నందున బహుశః మరొక రెండు మూడేళ్ళలోనే ప్రధాన రాజధాని నగరానికి కొంత రూపురేఖలు వచ్చే అవకాశాలున్నాయి. అదే జరిగితే అన్ని విధాల అభివృద్ధి చేసుకొన్న హైదరాబాద్ నగరాన్ని కోల్పోయామనే రాష్ట్ర ప్రజల బాధ కూడా మరిపిస్తుంది.   అమరావతిని అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా నిర్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నారు. ఆర్ధిక, సాంకేతిక, రాజకీయ అవరోధాలను ఒకటొకటిగా అధిగమించుకొంటూ, విమర్శలు, ప్రసంశలు అందుకొంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. రాజధాని మొదటి దశ నిర్మాణం పూర్తయ్యేవరకు కూడా ప్రభుత్వానికి ఆర్ధిక, రాజకీయ సమస్యలు, అగ్ని పరీక్షలు ఎదుర్కోక తప్పక పోవచ్చును. కానీ ఒకసారి అది పూర్తయితే మాత్రం ఇక రాజధాని తరువాత దశల నిర్మాణం, అభివృద్ధి చాలా వేగవంతం అవడం తధ్యం.   ఏ రాష్ట్రానికయినా రాజధానే గుండె కాయ వంటిది. అందుకు మంచి ఉదాహరణ హైదరాబాద్ నగరమే. అన్ని విధాల అభివృద్ధి చెందిన ఆ నగరమే తెలంగాణా రాష్ట్రానికి అక్షయ పాత్రగా మారింది. అందుకు చంద్రబాబు నాయుడు చేసిన కృషిని తెరాస అంగీకరించకపోవచ్చును. కానీ తెరాస అంగీకరించినా, అంగీకరించకపోయినా హైదరాబాద్ కి ఐ.టి. పరిశ్రమలను రప్పించి దానిని అక్షయపాత్రగా మలిచింది మాత్రం ఆయనేనని అందరికీ తెలుసు. అదే విషయాన్ని ఆయన మళ్ళీ రాజధాని అమరావతిని నిర్మించి చూపడం ద్వారా మరొకమారు రుజువు చేసి చూపించబోతున్నారు. కనుక ఇప్పుడు ఆయనను తీవ్రంగా విమర్శిస్తున్న తెరాస, వైకాపా, కాంగ్రెస్, వామపక్షాల పార్టీల నేతలందరూ, హైదరాబాద్ కంటే అత్యాధునికంగా, ఆర్ధికంగా పటిష్టంగా ఉండేవిధంగా అమరావతిని నిర్మించి చూపించిన తరువాతయినా ఆయన గొప్పదనాన్ని, కార్యదీక్షతను అంగీకరించక తప్పదు.   మిగిలిన ఈ నాలుగేళ్లలో అమరావతికి రూపురేఖలు తీసుకురాగలిగితే, మిగిలిన నిర్మాణ కార్యక్రమం కూడా సజావుగా సాగేందుకు ప్రజలు మళ్ళీ ఆయనకే పట్టం కట్టవచ్చును. ప్రతిపక్షాలకు లోలోపల బహుశః ఆ భయం ఉన్నందునే రాజధాని నిర్మాణానికి ఎన్ని అవరోధాలు సృష్టించగలవో అన్నీ సృష్టిస్తూ దాని నిర్మాణం ఆపలేకపోయినా కనీసం ఆలశ్యం జరిగితే చాలానే విధంగా ప్రయత్నిస్తున్నాయని స్పష్టమవుతోంది. కానీ అవి తమ రాజకీయ లబ్ది కోసం సృష్టిస్తున్న ఈ అవరోధాల వలన రాజధాని నిర్మాణంలో ఆలశ్యం జరిగితే, రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం కలిగే ప్రమాదం ఏర్పడుతుందనే విషయాన్ని కూడా అవి పట్టించుకొకపోవడం చాలా శోచనీయం. కానీ అవిప్పుడు సృష్టిస్తున్న అవరోధాలన్నిటినీ ఎదుర్కొంటూ ముందుకే సాగుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వాటి వలన మరింత లాభమే జరుగుతుందని చెప్పవచ్చును. అవి పెట్టిన అన్ని అగ్ని పరీక్షలను ఎదుర్కొని రాజధానికి రూపురేఖలు తెచ్చినప్పుడు ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో, ఎవరిని దండిస్తారో చాలా తేలికగానే ఊహించవచ్చును.

రాహుల్ ఆలోచనా పరిమితికి అదే గొప్ప ఉదాహరణ

  పదేళ్ళు దేశాన్ని, సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎన్నికల తరువాత మరింత దయనీయంగా మారింది. అటు కేంద్రంలో కానీ ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలోగానీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడటం లేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల నుండి పార్టీని బయటపడేయాలంటే అందుకు మంచి సమర్దుడయిన నాయకుడిని ఎన్నుకోవలసి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని నడిపించడంలో చాలా ఘోరంగా విఫలమయిన సోనియాగాంధీ, పార్టీ భవిష్యత్ కంటే కొడుకు రాజకీయ భవిష్యత్తే చాలా ముఖ్యమని భావిన్నారేమో తెలియదు. పుత్రవాత్సల్యంతో ఆమె తన కొడుకుకే పార్టీ పగ్గాలు కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ప్రాంతీయ పార్టీ అధినేతకుండే నాయకత్వ లక్షణాలు, రాజకీయ చతురత కూడా లేని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేప్పట్టాలని ఉవ్విళ్ళూరుతున్నారు. అందుకు ఆయనకున్న ఏకైక అర్హత ఏమిటంటే నెహ్రు కుటుంబ వారసత్వమే. ఆ విషయం గురించి ఇదివరకు ఆయనే స్వయంగా చెప్పుకొన్నారు కూడా. పార్టీలో కొందరు సీనియర్ నేతలు రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలను చేప్పట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, ‘రాహుల్ గాంధీ ఈ ఏడాదిలోనే పార్టీ పగ్గాలు చేపడతారని’ జైరామ్ రమేష్ వంటి సీనియర్ నేతలు ద్రువీకరిస్తున్నారు.   పార్టీ పగ్గాలు చేప్పట్టాలని ఉవ్విళ్ళూరుతున్న రాహుల్ గాంధీ అందుకు అవరోధాలు ఎదురవుతుంటే, వాటిని ఎదుర్కొని పరిష్కరించుకొని తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకొనే ప్రయత్నం చేసి ఉండి ఉంటే అందరూ హర్షించేవారు.నరేంద్ర మోడీ కూడా ఒకప్పుడు సరిగ్గా ఇటువంటి పరిస్థితులనే ఎదుర్కొని దైర్యంగా నిలబడి పోరాడి పార్టీపై పట్టు సాధించారు. నిజం చెప్పాలంటే ఆయన ఇప్పుడు రాహుల్ ఎదుర్కొంటున్న దాని కంటే చాలా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొని, విజయం సాధించి తన నాయకత్వ లక్షణాలను, సమర్ధతను చాటుకొన్నారు. కానీ రాహుల్ గాంధీ అటువంటి ప్రయత్నాలేవీ చేయకుండా పార్టీ మీద అలిగి రెండు నెలల పాటు విదేశాలలో చక్కర్లు కొట్టివచ్చేరు. అప్పుడు మీడియా అడిగే ప్రశ్నలకు, ప్రతిపక్షాల అవహేళనతో కాంగ్రెస్ పార్టీ తలదించుకోవలసి వచ్చింది. అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించేందుకు తనను తాను సిద్దం చేసుకొనేందుకు, కాంగ్రెస్ పార్టీకి దిశా నిర్దేశం చేసేందుకు అవసరమయిన భవిష్యత్ ప్రణాళికలు సిద్దం చేసుకొనేందుకే శలవు తీసుకొన్నారని పాపం సమర్దించుకోవలసివచ్చింది.   అదే నిజమనుకొన్నా ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరులో, అధికార బీజేపీపై చేస్తున్న విమర్శలలో కాంగ్రెస్ ట్రేడ్ మార్క్ కొట్టవచ్చినట్లు కనబడుతోంది తప్ప ఆయన రెండు నెలలు విదేశాలలో కొత్తగా నేర్చుకొని వచ్చిందేమీ కనబడటం లేదు. కాంగ్రెస్ పార్టీని సంస్కరించాలనుకొంటున్న ఆయన అది సాధ్యం కాదని గ్రహించారో ఏమో తెలియదు కానీ ఇప్పుడు తనే కాంగ్రెస్ స్టైల్ కి మారిపోయారు. ఆయన ప్రతీ మాటలో ఇప్పుడు అచ్చమయిన కాంగ్రెస్ ట్రేడ్ మార్క్ విస్పష్టంగా కనిపిస్తోంది. కానీ నేటికీ పార్టీలో చాలా మంది సీనియర్లు ఆయనకు ఇంకా దూరంగా ఉండటం గమనిస్తే వారికి ఆయన నాయకత్వంపై ఏమాత్రం నమ్మకం ఏర్పడలేదనే విషయం అర్ధమవుతుంది.   అయినా రాహుల్ గాంధీ ఇదేమీ గమనించనట్లు పాదయాత్రలు చేసుకొంటూపోతున్నారు. ఆయన విదేశాల నుండి తిరిగి రాగానే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తన కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసి, పార్టీకి జవజీవాలు కల్పించే ప్రయత్నాలు చేసి ఉండి ఉంటే, ప్రజలలో, పార్టీ శ్రేణులలో ఆయనపై కొంచెం గురి కుదిరి ఉండేదేమో. కానీ ఆయన మోడీ సూటుపై తను చేసిన వ్యాఖ్యలు బాగా ప్రేలడంతో, దేశంలో మరే సమస్యలు లేవన్నట్లుగా  పదేపదే దాని గురించే ప్రస్తావిస్తూ తన అసమర్ధతను, ఆలోచనా పరిమితులను స్వయంగా చాటుకొంటున్నారు. మోడీ ఆ సూటును విడిచి చాలా కాలమే అయినప్పటికీ రాహుల్ గాంధీ మాత్రం ఇంకా దానినే పట్టుకొని వ్రేలాడుతున్నారని రాజకీయ నాయకులు ముసిముసి నవ్వులు నవ్వుకొంటున్నారు.    ఒక ప్రాంతీయ పార్టీ అధినేతతో కూడా సరితూగలేని వ్యక్తి, తన సమర్ధతను నిరూపించుకొని అఖండ మెజార్టీతో కేంద్రంలో అధికారం చేప్పట్టి సువిశాలమయిన భారతదేశాన్ని ప్రగతి పధం వైపు నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి సున్నా మార్కులు వేస్తున్నట్లు గొప్పగా ప్రకటించినప్పుడు, ‘జీరో వాల్యూ ఉన్నవాళ్ళు జీరోలనే గుర్తించగలరు తప్ప అంతకంటే పెద్ద సంఖ్యలను గుర్తించలేరని’ వెంకయ్యనాయుడు చమత్కారంగా చెప్పిన చిన్న జవాబుతో మరింత నవ్వులపాలయ్యారు. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ రక్షిస్తారని ఎవరూ అత్యాశకు పోవడంలేదు. కానీ ఆయనని రక్షించేందుకు కాంగ్రెస్ పార్టీని, దానిపైనే ఆధారపడిన లక్షలాది కార్యకర్తలను, నేతల జీవితాలను పణంగా పెట్టాల్సిన అవసరం ఉందా? అని కాంగ్రెస్ పార్టీయే ఆలోచించుకోవాలి.

మోడీ శకంలో తొలి కుంభకోణ రహిత సంవత్సరం

  నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా నిన్న గుజరాత్ లోని మధుర పట్టణంలో ఒక భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో దేశ ప్రజలకు మంచి రోజులు వచ్చేయని కానీ గత 60 ఏళ్ళుగా దేశాన్ని దోచుకు తిన్న వాళ్ళకి చెడ్డ రోజులు మొదలయ్యాయని అన్నారు. గత పదేళ్ళుగా దేశంలో జరిగిన అనేక కుంభకోణాల గురించి వార్తలు వినబడేవని కానీ ఈ ఏడాది కాలంలో ఎటువంటి కుంభకోణాలు జరుగలేదని అదే తమ పారదర్శకమయిన పాలనకు నిదర్శనమని అన్నారు.   తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డిల్లీలో పాతుకుపోయిన శక్తివంతమయిన అవినీతి కేంద్రాలను ఏరి పారేశామని తెలిపారు. తాను ఈ దేశానికి ప్రధాన సేవకుడిని, ప్రధాన ధర్మ కర్తనని మోడీ తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బొగ్గు గనుల వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మొత్తం ఖజానాలో జమా చేసామని తెలిపారు. ఇదివరకు కేంద్రప్రభుత్వం రూపాయి విడుదల చేస్తే అందులో కేవలం 15పైసలు మాత్రమే పేదప్రజలకు చేరేదని స్వయంగా మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అన్నారని కానీ తమ ప్రభుత్వం నూటికి నూరు పైసలు కూడా పేద వాడికే అందేలా ఏర్పాట్లు చేసిందని తెలిపారు.   ప్రధాని మోడీ చెప్పిన మాటలు నూటికి నూరు శాతం వాస్తవమేనని ప్రజలు కూడా అంగీకరిస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో ప్రతీ నెలకీ రెండు నెలలకీ ఓమారు ఓ భారీ కుంభకోణం బయటపడుతుండేది. వాటిని కనిపెట్టి దోషులను కోర్టు ముందు ఉంచవలసిన సీబీఐ మాజీ డైరక్టర్ రంజిత్ సిన్హా కాంగ్రెస్ సేవలో తరించిపోవడం, అందుకు సుప్రీంకోర్టు ఆయనకు మొట్టికాయలు వేయడం అందరికీ తెలిసిందే. విమానాలు, హెలికాఫ్టర్లు కాంట్రాక్టులు సంపాదించుకొనేందుకు, డిల్లీలో కొంతమంది పెద్ద తలకాయలకు ముడుపులు చెల్లించామని విదేశీ సంస్థలు గొప్పగా చెప్పుకొన్నాయంటే డిల్లీలో అవినీతి ఎంతగా మేటలు వేసిందో అర్ధమవుతుంది.   అటువంటి అవినీతి సామ్రాజ్యాన్ని పునాదులతో సహా పెకలించడం కష్టమే. కానీ వాటిపై మోడీ ప్రభుత్వం ఉక్కు పాదం మోపినందునే అవిప్పుడు కనబడకుండా పోయాయి. అందుకే మోడీ ఏడాది పరిపాలనలో ఇంతవరకు ఒక్క కుంభకోణం కూడా జరగకుండా నిలువరించగలిగారు. మోడీ అధికారం చేప్పట్టిన ఏడాది కాలంలోనే ప్రపంచ దేశాలలో భారత్ కు ఒక ప్రత్యేక గుర్తింపును తేగలిగారు. అందుకు ఆయన ప్రభుత్వం అవలంభిస్తున్న ఆర్ధిక, పారిశ్రామిక, విదేశీ విధానాలే కారణమని చెప్పవచ్చును. చాలా వేగంగా తనదయిన శైలిలో దూసుకుపోతున్న మోడీ ప్రభుత్వ పని తీరు వలన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్, దానితో బాటు రాహుల్ గాంధీ భవిష్యత్ కూడా చాలా అగమ్యగోచరంగా, ప్రశ్నార్ధకంగా మారుతోంది. అందుకే తీవ్ర అభద్రతా భావంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ మోడీ ధరించిన సూటు గురించి, ఆయన చేస్తున్న విదేశీ పర్యటనల గురించి మాట్లాడుతూ సామాన్య ప్రజలను త్రప్పు ద్రోవ పట్టించేందుకు చవకబారు ప్రయత్నాలు చేస్తోంది. కానీ దేశ ప్రజల నమ్మాకాన్ని వమ్ము చేసిన కాంగ్రెస్ పార్టీ మాటలను ప్రజలు నమ్మేందుకు సిద్దంగా లేరు.   దేశాభివృద్ధి జరిగేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎవరూ తప్పు పట్టలేరు. కానీ భూసేకరణ చట్టానికి చేసిన సవరణల విషయంలో కాంగ్రెస్ వేస్తున్న ప్రశ్నలకు మోడీ ప్రభుత్వం సరయిన సమాధానం చెప్పలేకపోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బహుశః పారిశ్రామికీకరణ వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతోనే భూసేకరణ చట్టానికి సవరణలు చేసి ఉండవచ్చును. కానీ నేటికీ దేశంలో అత్యధిక శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు కనుక వ్యవసాయ అభివృద్ధికి కూడా మోడీ ప్రభుత్వం అంతే ప్రాధాన్యత ఇచ్చి ఉండవలసిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.   గత పదేళ్ళ కాంగ్రెస్ పాలనతో పోలిస్తే మోడీ పాలన చాలా సమర్ధంగా, వేగంగా, పారదర్శకంగా సాగుతోందని ప్రజలు కూడా అంగీకరిస్తున్నారు. కానీ అభివృద్ధి ఫలాలు సామాన్యుడికి లభించి, వారి జీవన ప్రమాణాలు మెరుగవడమే ఎవరి పాలనకయినా గీటురాయిగా నిలుస్తుంది. మోడీ ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న చర్యల వలన సత్ఫలితాలు మున్ముందు విస్పష్టంగా కనబడే అవకాశం ఉంది.

అధికారమే పరమావధిగా రాజకీయాలు

  డిల్లీ, బీహార్, తమిళనాడులలో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. డిల్లీలో అఖండ మెజార్టీతో గెలిచిన ఆమాద్మీ పార్టీ తన ఉనికిని కాపాడుకోవడం కోసం విశ్వప్రయత్నాలు చేయవలసివస్తోంది. ప్రధాన కార్యదర్శి తాత్కాలిక నియామకంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కు మొదలయిన యుద్ధం, ఎన్డీయే ప్రభుత్వం గవర్నర్ కే పూర్తి అధికారాలున్నాయని నోటిఫికేషన్ జారీ చేయడంతో, ఇప్పుడది అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి, ఎన్డీయే ప్రభుత్వానికి మధ్య యుద్ధంగా మారింది. దీనిపై చర్చించేందుకు 26, 27 తేదీలలో అత్యవసరంగా అసెంబ్లీని సమావేశపరుస్తున్నారు. కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి రాష్ట్రపతికి పంపాలని ఆమాద్మీ ప్రభుత్వం భావిస్తోంది.   “ఇది రాజకీయ సమస్య ఎంత మాత్రం కాదని, రాజ్యాంగ సమస్య గనుకనే తాము కలుగజేసుకొని వివరణ ఇచ్చేమని, తద్వారా ఇకపై డిల్లీ ప్రభుత్వం సజావుగా పరిపాలన చేసుకోవచ్చని” ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. కానీ అది తన ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేయడమేనని కేజ్రీవాల్ వాదన. ప్రస్తుతం తనకు జవాబుదారిగా ఉన్న అవినీతి నిరోధక శాఖను త్వరలోనే గవర్నర్ తన చేతుల్లోకి తీసుకొనే ఆలోచనలో ఉన్నట్లు వినిపిస్తున్న వార్తలపై కేజ్రీవాల్ స్పందిస్తూ “అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న మా ప్రభుత్వాన్ని గవర్నర్ ద్వారా నియంత్రించాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని” ఆరోపించారు.   ప్రభుత్వంలో వివిధ వ్యవస్థలను నడిపించే ఉన్నతాధికారులపై గవర్నర్ కి అధికారాలుంటాయా? లేక ప్రజలెన్నుకొన్న ప్రభుత్వానికా? అనేది రాజ్యాంగ నిపుణులు తేల్చాల్సిన విషయం. కానీ దాని కోసం అఖండ మెజార్టీతో ప్రజలెన్నుకొన్న మోడీ ప్రభుత్వం, ఆమాద్మీ ప్రభుత్వం పోరాడుకోవడం చాలా బాధాకరం.   ఇక ఈ ఏడాది చివరిలో జరుగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆరు జనతా పార్టీలు విలీనం అయ్యేయి. కానీ అధికారం కోసం తహతహలాడిపోతున్న లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ కారణంగా ఇంతవరకు విలీన ప్రక్రియ పూర్తి కాలేదు. పైగా వారిప్పుడు మెల్లగా విమర్శలు గుప్పించుకోవడం మొదలుపెట్టారు కూడా.   ప్రధానమంత్రి అయ్యేందుకు తనకు అర్హత లేదని పైకి చెప్పుకొనే నితీష్ కుమార్, అందుకోసం ఇదివరకు కూడా ఇటువంటి ప్రయోగాలకు సిద్దపడ్డారు. కానీ అవేవీ ఫలించకపోవడంతో ఇదివరకు తను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిన జితన్ రామ్ మంజీని బలవంతంగా దింపేసి తను ఆ కుర్చీ ఎక్కారు. తమ జె.డి.యు. పార్టీని జనతా పరివార్ లో విలీనం చేయడానికి అంగీకరించినప్పటికీ తననే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని పట్టుబట్టడంతో, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని తహతహలాడిపోతున్న లాలూ ప్రసాద్ యాదవ్ కూడా తన ఆర్.జే.డి.ని ఆ పేరులేని కొత్త పార్టీలో విలీనం చేయకుండా బిగుసుకు కూర్చొన్నారు. వారిద్దరూ చేస్తున్న రాజకీయాలతో కొత్త పార్టీని పుట్టక ముందే చంపేశారు.   ఇక అక్రమాస్తుల కేసులో ప్రత్యేక కోర్టు జయలలితను దోషిగా ప్రకటించినప్పటి నుండి మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన పన్నీర్ సెల్వం, తన చేతిలో పూర్తి అధికారాలున్నప్పటికీ కేవలం సాధారణ పరిపాలనకే పరిమితమయ్యారు తప్ప ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదు. ఒకవేళ ఏదయినా కీలక నిర్ణయం తీసుకొన్నట్లయితే అది అమ్మ (జయలలిత) అధికారాలను ప్రశ్నించడం, ఆమెను ధిక్కరించడం, ఆమె పట్ల అవిధేయత ప్రదర్శించినట్లేననే భావన అధికార అన్నాడీయంకే పార్టీలో బలంగా నెలకొని ఉంది. అందుకే ప్రతిపక్ష పార్టీలు ఎంతగా విమర్శిస్తున్నా పట్టించుకోకుండా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో సహా మంత్రులు అందరూ కూడా జయలలిత నామ స్మరణంలోనే గత 8 నెలలూ గడిపేశారు. వారందరికీ అందుకు తగ్గ ప్రతిఫలం దక్కింది కూడా. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన జయలలిత వారందరినీ తన మంత్రివర్గంలోకి మళ్ళీ తీసుకొన్నారు. ఇంతకాలంగా జయలలిత కోసం ఆయన పక్కన పెట్టి ఉంచిన అన్ని ఫైళ్ళ మీద ఆమె చకచకా సంతకాలు చేసేసారు.   మంత్రిగా చేసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎదగడం సర్వసాధారణమయిన విషయమే. కానీ ఇంతకాలం ముఖ్యమంత్రిగా చేసిన పన్నీర్ సెల్వం ఇప్పుడు ఆర్దికమంత్రిగా చేయవలసిరావడం...అందుకు ఆయన ఏ మాత్రం సిగ్గుపడకపోవడం రెండూ కూడా విచిత్రమే. ఈ మూడు చోట్ల జరుగుతున్న రాజకీయ పరిణామాలు పైకి వేర్వేరుగా కనిపిస్తున్నప్పటికీ వాటి అంతిమ గమ్యం మాత్రం అధికారం కోసం జరుగుతున్న ఆరాటం...పోరాటాలేనని చెప్పవచ్చును.

తెలంగాణా యం.యల్సీ. ఎన్నికలలో అరాచకం

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యం.యల్యే కోటా క్రింద జరిగే నాలుగు యం.యల్సీ. స్థానాలకు తెదేపా తరపున ముగ్గురు, వైకాపా తరపున ఒక్కరు నామినేట్ చేయబడటంతో వారి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కానీ తెలంగాణాలో ఆరు యం.యల్సీ. స్థానాలకు ఏడుగురు అభ్యర్ధులు బరిలో దిగడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి.   ఒక్కో యం.యల్సీ. అభ్యర్ధి గెలుపుకి కనీసం 18 మంది యం.యల్యేల మద్దతు అవసరం ఉంటుంది. కాంగ్రెస్, తెదేపాల నుండి వచ్చిన వారితో కలిపి చూసుకొంటే తెరాసకు మొత్తం 75 మంది యం.యల్యేలున్నారు. వారిలో 72మంది మద్దతుతో నలుగురు యం.యల్సీ.లను తెరాస అవలీలగా గెలిపించుకోగలదు. కానీ తెరాస ఐదవ అభ్యర్ధిని కూడా పోటీలో నిలిపింది. తనకున్న మిగిలిన ముగ్గురు యం.యల్యేలు కాకుండా మరొక 15 మంది యం.యల్యేల మద్దతు అవసరం ఉందన్న మాట. తెరాసకు మిత్రపక్షంగా ఉన్న మజ్లీస్ పార్టీకి ఏడుగురు యం.యల్యేలున్నారు. బహుశః మజ్లీస్ పార్టీ మద్దతు ఇస్తానని హామీ ఇచ్చినందునే తెరాస ఐదవ అభ్యర్ధిని బరిలో దించిందని భావించినా, దానికి ఇంకా మరో 8 మంది యం.యల్యేల మద్దతు అవసరం ఉంటుంది. తెలంగాణాలో వైకాపా, సీపీయం. సీపీఐ పార్టీలకు ఒక్కో యం.యల్యే. ఉన్నారు. వాటిలో సీపీయం పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. కనుక మిగిలిన వైకాపా, సీపీఐ పార్టీలు తెరాసకు మద్దతు కూడా కీలకం కానుంది.   ఒకవేళ ఆ రెండు పార్టీలు కూడా తెరాస ఐదవ అభ్యర్ధికి మద్దతు ఇచ్చేందుకు సిద్దపడినా ఇంకా మరో ఆరుగురు యం.యల్యేల మద్దతు అవసరం ఉంది. అంటే కాంగ్రెస్(18), తెదేపా(11), బీజేపీ(5) పార్టీలకున్న యం.యల్యేలలో కొందరు క్రాస్ ఓటింగ్ చేస్తే తప్ప తెరాస అభ్యర్ధి గెలుపు కష్టమని అర్ధమవుతోంది. కానీ తమ ఐదవ అభ్యర్ధి కూడా ఖచ్చితంగా గెలుస్తారని తెరాస బల్ల గుద్ది మరీ చెపుతోంది. అంటే ఆ మూడు పార్టీలలో ఎవరో కొందరు యం.యల్యేలకు ఎర విసరబోతోందని స్పష్టమవుతోంది. అందుకే ఆ మూడు పార్టీలు తెరాస మీద తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి.   అవి తమ పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవాలని అవి తాపత్రయపడుతుంటే, తెరాస ఆ పార్టీల యం.యల్యేలను క్రాస్ ఓటింగ్ చేసేందుకు ప్రోత్సహించడం జీర్ణించుకోలేకపోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు యం.యల్యేలు, తెదేపాకు చెందిన నలుగురు యం.యల్యేలు క్రాస్ ఓటింగ్ చేసేందుకు తెరాస ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆ రెండు పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేయవచ్చును. కానీ వారు పార్టీ ఫిరాయించడానికి సిద్దపడితేనే క్రాస్ ఓటింగ్ చేసేందుకు దైర్యం చేస్తారు కనుక పార్టీలు విప్ జారీ చేసినా ఏమీ ప్రయోజనం ఉండబోదు.   తెదేపా-బీజేపీ కూటమి తరపున వేమ్ నరేందర్ రెడ్డి యం.యల్సీ. అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. ఆయన గెలుపుకి మరొక ఇద్దరు యం.యల్యేల మద్దతు అవసరం ఉంది. తెదేపా కూడా వామపక్షాల మద్దతు మీదే ఆశలు పెట్టుకొంది. కానీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించిన సీపీయం పార్టీని ముందు ఒప్పించి దాని మద్దతు పొందవలసి ఉంటుంది. కానీ ఒకవేళ తెదేపాకు చెందిన ఏ ఒక్క యం.యల్యేని తెరాస తనవైపు తిప్పుకొన్నా, వామపక్షాలు మద్దతు ఇచ్చినప్పటికీ ప్రయోజనం ఉండబోదు.   కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. ఆపార్టీకి చెందిన పువ్వాడ అజయకుమార్ ఏదో స్వంత పనిమీద అమెరికా వెళ్ళారు. ఆయన జూన్ 1న ఎన్నికలు జరిగే సమయానికల్లా తిరిగి హైదరాబాద్ చేరుకోనట్లయితే కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపు కూడా కష్టమే. ఇక పార్టీ కార్యక్రమాలకి చాలా కాలంగా దూరంగా ఉంటున్న మాజీమంత్రి కోమటి రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధి ఆకుల లలితకు మద్దతు ఇస్తారో లేదో చివరి నిమిషం వరకు అనుమానమే. ఇటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి చెందిన యం.యల్యేలను కొందరిని తెరాస తనవైపు త్రిప్పుకోవాలని ప్రయత్నిస్తుండటంతో ఆ పార్టీ కూడా తెరాసపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఏది ఏమయినప్పటికీ మరొక రెండు రోజుల్లో తెరాస తన ఐదవ అభ్యర్ధిని బరిలో నుండి వెనక్కు తీసుకోకపోయినట్లయితే అది ఏదో ఒక పార్టీకి ఎసరు పెట్టేందుకు రంగం సిద్దం అయినట్లే భావించవచ్చును.

మోడీ పాలనపై కాంగ్రెస్ విమర్శలా?

  గత పదేళ్ళ కాలంలో అవినీతికి, అసమర్ధతకు మారుపేరుగా సాగిన కాంగ్రెస్ పాలనను చూసి దేశప్రజలందరూ ఆ పార్టీని తిరస్కరించారు. అయినా ఆ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకొన్నట్లు కనబడటం లేదు. అందుకే ఆ పార్టీ నేతలలో నేటికీ ఎటువంటి పశ్చాతాపం కనబడటం లేదు. ప్రజలు తమ పార్టీని ఎందుకు తిరస్కరించారని ఆలోచించకుండా, అఖండ మెజార్టీతో ప్రజలు పట్టం కట్టిన మోడీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు విమర్శించడం చూస్తుంటే వారు కనీసం తమ వ్యవహార శైలిని కూడా మార్చుకోలేకపోయారని అర్ధమవుతోంది.   ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేతల ప్రధాన ఆరోపణ ఏమిటంటే ఆయన నియంతృత్వంగా వ్యవహరిస్తూ, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని. కానీ నిజమేమిటంటే ఆయన అధికారం చేప్పట్టిన తరువాతనే మళ్ళీ అన్ని వ్యవస్థలను ప్రక్షాళనం చేసి వాటికి జవజీవాలు కల్పించారు. ప్రభుత్వానికి భారంగా తయారయిన అనేక సంస్థలను, కమిటీలను,చివరికి మంత్రిత్వ శాఖలను కూడా రద్దు చేసి పరిపాలనలో సంస్కరణలు తద్వారా వేగాన్ని తీసుకువచ్చారు. ఒకప్పుడు ప్రణాళికా సంఘం అంటే అది ఎవరికీ అంతుపట్టని, ఎవరికీ సంబంధం లేని ఒక ‘బ్రహ్మ పదార్ధం’ గా భావించేవారు అందరూ. కానీ మోడీ దానిని సమూలంగా ప్రక్షాళన చేసి అందులో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించారు.   కేంద్ర మంత్రులకు, ఉన్నతాధికారులకు పూర్తి స్వేచ్చ కల్పిస్తూనే వారినే తమపనులకు జవాబుదారీగా చేస్తున్నారు. ఆయన ప్రభుత్వం చేప్పట్టిన అనేక చర్యల వలన ఇప్పుడు దేశ ఆర్ధిక వ్యవస్థ మళ్ళీ మెల్లగా గాడిన పడుతోంది. ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు భారత్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. ఈ మార్పులన్నీ కేవలం మోడీ సమర్ధత, నాయకత్వ లక్షణాల కారణంగానే సాధ్యమవుతున్నాయి. దానినే కాంగ్రెస్ నేతలు నియంతృత్వం అని ఏక వ్యక్తి పరిపాలన అని వర్ణిస్తున్నారు. అదే నియంతృత్వం అయితే, దాని వలననే దేశానికి మేలు జరుగుతుంటే అందుకు బాధపడటం ఎందుకు? మోడీ ప్రదర్శితున్న ఈ సమర్ధత వలన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎన్నడూ అధికారంలోకి రాలేదనే భయం, అభద్రతాభావంతో ఉంది. బహుశః అందుకే అది మోడీని చూసి ఉలికి పడుతోందేమో?     ఒకవేళ దానినే కాంగ్రెస్ పార్టీ నియంతృత్వంగా భావిస్తే, ఇదివరకు డా. మన్మోహన్ సింగ్ ని డమ్మీ ప్రధానమంత్రిగా చేసి ఏ అధికారమూ లేని సోనియా, రాహుల్ గాంధీలు చేసిన పరిపాలనను ఏమనాలి? ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వమూ పరిష్కరించవలసిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాన్ని ఎటువంటి అధికారమూ లేని సోనియా గాంధీ ఎందుకు తన చేతిలోకి తీసుకొన్నారు? అని ప్రశ్నిస్తే ఆమె తెర వెనుక నుండి దేశాన్ని ఏవిధంగా పరిపాలించారో అర్ధమవుతుంది. కానీ ప్రజామోదంతో ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన నరేంద్ర మోడీ ప్రదర్శిస్తున్న నాయకత్వ లక్షణాలను, సమర్ధతను నియంతృత్వమని కాంగ్రెస్ అభివర్ణిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గత పదేళ్ళలో చేయలేని అనేక పనులను మోడీ చేసి చూపిస్తుంటే అందుకు ఆయనను మెచ్చుకోకపోగా, సహజసిద్ధమయిన తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ ఇటువంటి మాటలతో ప్రజలను తప్పు ద్రోవ పట్టించే ప్రయత్నాలు చేస్తోంది.   కానీ దేశంలో అభివృద్ధి జరుగుతోందా లేదా? దేశానికి ఎవరు మేలు చేస్తున్నారు? ఎవరు కీడు చేస్తున్నారు? అనే విషయాలు గ్రహించలేనంత తెలివి తక్కువ వాళ్ళు కాదు భారతీయులు. అందుకే వారు దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టారు. బీజేపీకి అఖండ మెజార్టీతో పట్టం కట్టారు. మోడీ పరిపాలన గురించి కాంగ్రెస్ పార్టీ ఏమనుకొంటోంది? అనేది అప్రస్తుతం. దేశ ప్రజలు ఏమనుకొంటున్నారనేదే ముఖ్యం. మోడీ అధికారం చేప్పట్టిన తరువాత నుండే పాలనలో వేగం, పారదర్శకత కనబడుతోంది. ఏడాది పాలనలో ఒక్క కుంభకోణం కూడా జరగలేదు. దేశ వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబడ్డాయి. ఈ సంగతి ప్రజలందరికీ స్పష్టంగా కనబడుతూనే ఉన్నాయి ఒక్క కాంగ్రెస్ కి తప్ప. కనుక కాంగ్రెస్ పార్టీ తనను మభ్యపెట్టుకొంటూ ప్రజలను కూడా మభ్య పెట్టేందుకు ఎన్ని కబుర్లు అయినా చెప్పుకోవచ్చును. దాని మాటలకు ప్రజల దృష్టిలో ఎటువంటి విలువ ప్రాధాన్యత లేదు. ఉండబోదు కూడా.

ప్రత్యేక హోదాపై నిప్పు రాజేస్తున్న కాంగ్రెస్ నేతలు

  ‘ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవద్దంటూ’ నల్గొండ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రధాని మోడీకి వ్రాసిన లేఖపై ఆంధ్రా, తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఊహించినట్లే యుద్ధం మొదలుపెట్టారు. మాజీ కేంద్రమంత్రి జైరామ్ రమేష్ గుత్తా లేఖను తప్పు పట్టారు. కానీ అది ఆయన వ్యక్తిగతమని చెప్పి ఈ వ్యవహారంలో గుత్తా ఏవిధంగా స్పందించాలో చెప్పకనే చెప్పారు. జైరామ్ రమేష్ అందించిన ఆ ‘హింట్’ ని గుత్తా వెంటనే క్యాచ్ చేసి, ఆ లేఖ పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేయజేస్తోందే తప్ప దానితో పార్టీకి ఎటువంటి సంబంధమూ లేదని ప్రకటించేశారు. ఒక్క రాజధాని మినహా ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల స్థితిగతులలో ఎటువంటి తేడా లేదని, తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలోనే అభివృద్ధి బాగా జరిగిందని కనుక ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణాలో ఉన్న పరిశ్రమలు కూడా అక్కడికి తరలిపోతాయనే ఆలోచనతోనే వ్యతిరేకించాను తప్ప తనకి వేరే ఉద్దేశ్యం లేదని చెప్పారు. ఒకవేళ ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చేమాటయితే తెలంగాణాకు కూడా ఇవ్వాలని కోరానని ఆయన చెప్పారు. అవ్వ పేరే బామ్మ బామ్మ పేరే అవ్వ అన్నట్లుగా ఉంది ఆయన మాటలు వింటుంటే. ఆంద్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వవద్దని కోరినా లేక తెలంగాణకు కూడా ఇవ్వాలని కోరినా దాని వలన అంతిమంగా నష్టం జరిగేది మాత్రం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికే. పార్లమెంటులో ప్రధాని హామీ ఇచ్చిన తరువాత కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేని పరిస్థితి నెలకొని ఉన్నప్పుడు, తెలంగాణాకు కూడా ఇస్తే తప్ప ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వరాదనే కొత్త మెలిక పెడితే ఇక అది సాధ్యమయ్యే పనేనా?   గుత్తాది వ్యక్తిగత అభిప్రాయామని సాక్షాత్ కాంగ్రెస్ అధిష్టానానికి ప్రతినిధి అయిన జైరామ్ రమేషే తేల్చిపడేసిన తరువాత ఇంకా దానిపై చర్చ అనవసరమనే అనుకోవాలి. కానీ మాజీ మంత్రి కొండ్రు మురళి మోహన్ ఈ వ్యవహారంపై యుద్ధం కొనసాగిస్తూ, “ఇంతకాలం ఎంతో బలంగా ఉన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుత్తా వంటి కాంగ్రెస్ నేతల కారణంగానే రెండుగా విడిపోయింది. సోనియా గాంధీ అటువంటి వారి మాటలు నమ్మి రాష్ట్రాన్ని విడదీసినందుకు కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలలో సర్వ నాశనమయింది. ఇప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ పార్టీని బ్రతికించుకోవాలని మేము విశ్వప్రయత్నాలు చేస్తుంటే గుత్తా వంటివారు మధ్యలో ఇటువంటి పుల్లలు పెట్టి పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారు” అని ఆరోపించారు.   బహుశః గుత్తా, ఆయనతో బాటు మరి కొందరు తెలంగాణా కాంగ్రెస్ నేతలు కూడా కలిసి ఆయనకు ధీటుగా జవాబు చెప్పవచ్చును. ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణాకు కూడా తప్పనిసరిగా ఇవ్వాలని వాదన తెర పైకి తెచ్చినా ఆశ్చర్యం లేదు. దానికి మళ్ళీ ఆంధ్రా కాంగ్రెస్ నేతలు ఏదో చెప్పవచ్చును. కానీ వారిరువురి వాదోపవాదనల వలన హానీ జరిగేది మాత్రం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికే! కాంగ్రెస్ నేతలు కేవలం తమ పార్టీని ఏవిధంగా బ్రతికించుకోవాలనే ఆలోచిస్తున్నారు తప్ప రాష్ట్ర విభజనతో ఘోరంగా దెబ్బ తిన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏవిధంగా నిలబెట్టుకోవాలనే ఆలోచన మాత్రం చేయకపోవడం చాలా దురదృష్టకరం. “రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకొనేందుకు తామంతా కష్టపడుతుంటే...”అనే కొండ్రు మురళి మాటలే ప్రత్యేక హోదా అంశాన్ని వారు ఎందుకు, ఏవిధంగా ఉపయోగించుకొంటున్నారో తెలియజేస్తోంది. దానికి గుత్తా వంటి నేతలు ఆజ్యం పోసి మంట రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు.   ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం చాలా నిజాయితీగా పోరాడుతున్నామని చెప్పుకొంటున్న కాంగ్రెస్ అధిష్టానం దీనిపై తన స్వంత పార్టీ నేతలే కొత్త సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తుంటే, తక్షణమే స్పందించకుండా నిర్లిప్త వైఖరి ప్రదర్శించడాన్ని ఏమని భావించాలి?

ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ నిజంగానే పోరాడుతోందా?

  రాష్ట్ర విభజన కారణంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మళ్ళీ నిలద్రోక్కుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కాంగ్రెస్ నేతలు బహిరంగంగా అంగీకరించకపోయినా, ఆ కారణంగానే వారు ఇన్నాళ్ళుగా తమ కలుగులలోనుండి బయటకు రావడానికి సాహసించలేదనే విషయం అందరికీ తెలుసు. ఎన్నికలయిన ఓ ఆరు నెలల తరువాత వారి ఆగ్రహం కొచెం చల్లారి ఉండవచ్చుననే ఆలోచనతోనే బయటకు వచ్చి, ప్రజా సమస్యల మీద పోరాటాలు అంటూ ప్రజలను ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు. ప్రత్యేక హోదా కోసం వారు చేస్తున్న ఉత్తుత్తి పోరాటాలు ప్రజలను మళ్ళీ బుట్టలో వేసుకోవడానికేననే సంగతి వారికీ తెలుసు, ప్రజలకి కూడా తెలుసు. వారికి ఈ విషయంలో చిత్తశుద్ధి ఉన్నా లేకపోయినా వారు చేస్తున్న ఈ పోరాటం వలన కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడిపెరిగి రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయకపోదా? అనే ఆశతో ప్రజలు కూడా వారి పోరాటానికి మద్దతు తెలుపకపోయినా అభ్యంతరం మాత్రం చెప్పడం లేదు.   ప్రత్యేక హోదా కోసం తాము చేస్తున్న పోరాటానికి ప్రజల నుండి ఆశించిన మద్దతు రాకపోవడంతో కాంగ్రెస్ నేతలు చాలా నిరాశకు గురయ్యారనే చెప్పవచ్చును. తమపై ఆగ్రహంగా ఉన్న రాష్ట్ర ప్రజలను ఏవిధంగా ప్రసన్నం చేసుకొని మళ్ళీ రాష్ట్రంలో నిలద్రోక్కుకోవాలా...అని వారు మదనపడుతున్నప్పుడు, తెలంగాణా నుండి కాంగ్రెస్ పార్టీకే చెందిన నల్గొండ యంపి గుత్తా సుఖేందర్ రెడ్డి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవద్దంటూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ వ్రాయడంతో, వారికి అది తమ నిజాయితీని నిరూపించుకొనేందుకు ఒక గొప్ప అవకాశంగా కనబడింది. తక్షణమే స్పందించిన పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, సుఖేందర్ రెడ్డి ప్రధాని మోడీకి లేఖ వ్రాయడాన్ని తప్పుపడుతూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి, పార్టీ అధిష్టానంలో పెద్దలందరికీ లేఖలు వ్రాసిపడేశారు.   కాంగ్రెస్ అధిష్టానమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నిర్ణయించినప్పుడు, దాని కోసమే రాష్ట్రంలో తామంతా పోరాడుతున్నప్పుడు, దానికి స్వయంగా కాంగ్రెస్ అధిష్టానం కూడా మద్దతు ఇస్తున్నప్పుడు, తమ పార్టీకే చెందిన ఒక యంపీ అభ్యంతరం చెప్పడం, పైగా ప్రధాన మంత్రికి లేఖ కూడా వ్రాయడాన్ని తాము అంతా ఖండిస్తున్నామని ఆయన అన్నారు.   కానీ రఘువీరా రెడ్డి చెపుతున్న ఈ విషయాలేవీ గుత్తా సుఖేందర్ రెడ్డికి తెలియవనుకోలేము. అయినా ప్రధానికి లేఖ వ్రాసారంటే ఇది కూడా కాంగ్రెస్ మొదలుపెట్టిన సరికొత్త డ్రామాగానే భావించకతప్పదు. ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే అనేక చిక్కుముడులున్నాయి. వాటిని విప్పడానికే కేంద్రప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. ఇప్పుడు గుత్తా వ్రాసిన లేఖతో బహుశః ఆంధ్రా, తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఒట్టొట్టి యుద్ధం మొదలుపెట్టవచ్చును. దాని వలన మరిన్ని కొత్త సమస్యలు ఏర్పడితే, ఇక ఎన్నటికీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవచ్చును. బహుశః కాంగ్రెస్ పార్టీ కూడా అదే కోరుకొంటోందేమో? రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనంతవరకే మోడీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడగలదు. అందుకే అది ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు నటిస్తూనే మరోపక్క ఈవిధంగా ఆటంకాలు సృష్టిస్తోందేమో? అనే అనుమానాలు కలుగుతున్నాయి.   ఇక కాంగ్రెస్ మొదలుపెట్టిన ఈ సరి కొత్త డ్రామా వలన మరొక ప్రయోజనం ఏమిటంటే, ప్రత్యేక హోదా గురించి తాము చేస్తున్న పోరాటం నిజమేనని రాష్ట్ర ప్రజలను నమ్మించ వచ్చును. ఏవిధంగా అంటే, ఆంద్రాలో తమ కాంగ్రెస్ పార్టీని పణంగా పెట్టుకొని మరీ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసామని తెలంగాణా కాంగ్రెస్ నేతలు గొప్పగా చెప్పుకోవడం అందరికీ తెలుసు. ఇప్పుడు ఆంధ్రా కాంగ్రెస్ నేతలు కూడా ప్రత్యేక హోదా కోసం తెలంగాణాలో తమ స్వంతపార్టీ నేతలతోనే పోరాడుతున్నామని చెప్పుకొని రాష్ట్ర ప్రజలను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేస్తారేమో?   కానీ ఒకవేళ వారు ఈ అంశంపై నిజంగానే యుద్ధం మొదలుపెడితే, దానిని కాంగ్రెస్ అధిష్టానం ఉపేక్షించినట్లయితే, కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యపూర్వకంగానే ఈ సరికొత్త డ్రామా మొదలుపెట్టిందని భావించాల్సి ఉంటుంది. కనుక రఘువీరారెడ్డి వ్రాసిన లేఖపై కాంగ్రెస్ అధిష్టానం స్పందనను బట్టి ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు ఏమిటో, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలనే కోరిక, పట్టుదల దానికి నిజంగానే ఉన్నాయా లేవా? అనేది అంచనా వేయవచ్చును.   ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం రఘువీరా రెడ్డి లేఖపై తక్షణమే స్పందించి, సుఖేందర్ రెడ్డితో సహా తెలంగాణాలో తన పార్టీ నేతలందరికీ ఈ అంశం మీద మాట్లాడవద్దని గట్టిగా హెచ్చరికలు చేసినట్లయితే, సుఖేందర్ రెడ్డి ప్రధానికి లేఖ వ్రాయడం వెనుక ‘కాంగ్రెస్ హస్తం’ ఏమీ లేదని నమ్మవచ్చును. కానీ ఉపేక్షిస్తే మాత్రం కాంగ్రెస్ అధిష్టానమే ఆయన చేత మోడీకి లేఖ వ్రాయించి ఈ సరికొత్త నాటకానికి తెర తీసిందని అనుమానించవలసి వస్తుంది. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇరు రాష్ర్టాల ప్రజలతో చెలగాటమాడినందుకే రెండు రాష్ట్రాలలో ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారు. ఇప్పుడు మళ్ళీ అటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీ తన వేలుతో తన కంటినే పొడుచుకొన్నట్లవుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చును.

కాంగ్రెస్ పార్టీయే రాహుల్ గాంధీకి దిశానిర్దేశం చేయాలేమో?

  రాహుల్ గాంధీ భూసేకరణ చట్టానికి సవరణలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్నారు. కానీ ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే ఆయన చేస్తున్న ఈ పోరాటాల గురించి పార్టీలో సీనియర్ నేతలెవరూ అసలు పెదవి విప్పడం లేదు. ప్రతిపక్ష నేతలు ఎవరయినా ఆయనని విమర్శిస్తే అప్పుడు మాత్రం ఏదో మొక్కుబడిగా వాటిని ఖండిస్తున్నారు. అంటే ఆయన చేస్తున్న పోరాటానికి వారి మద్దతు లేదనే విషయం స్పష్టం అవుతోంది.   కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పుపై అంతర్గతంగా సాగుతున్న చర్చను, పార్టీ శ్రేణులపై దాని ప్రభావాన్ని పూర్తిగా అరికట్టేందుకే రాహుల్ గాంధీ ఇంత శ్రమపడుతున్నారేమో? బహుశః అందుకే ఆయన ప్రతీ సమస్యకు ప్రధాని నరేంద్ర మోడీయే బాధ్యుడని నిందిస్తున్నారేమో? ఇప్పుడు దేశ విదేశాలలో మోడీ పేరు మారుమ్రోగిపోతోంది. అటువంటి వ్యక్తిని ఎదిరించడం ద్వారా రాహుల్ గాంధీ తనకూ ఆయనను డ్డీ కొట్టే సాహసం ఉందని నిరూపించుకొని తన పార్టీ నేతలను, కార్యకర్తలను ఆకట్టుకోవాలని చూస్తున్నారేమో?   “రైతుల విషయంలో మోడీ అనుసరిస్తున్న విధానాలకి తను సున్నా మార్కులు వేస్తానని, కానీ కార్పోరేట్ సంస్థలు, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు సహాయం పడటంలో నూటికి నూరు మార్కులు వేస్తానని” రాహుల్ గాంధీ చెప్పడం చూస్తే తను మోడీకే మార్కులు వేసేంత గొప్పవాడినని చెప్పుకొని తన రాజకీయ అపరిపక్వత చాటుకొన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   ఇక రాహుల్ గాంధీ చేస్తున్న ఫ్లయింగ్ పాదయాత్రల వలన ఆ పార్టీకి ఏ ప్రయోజనమూ చేకూర్చలేకపోయినా, పాదయాత్రలు చేసిన ప్రతీ చోట విమర్శల మాత్రం మూటగట్టుకొని వెళుతున్నారు. ఇంతవరకు భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రాహుల్ గాంధీ, ఇప్పుడు తన నియోజక వర్గమయిన అమేధీలో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు గురించి పోరాటం చేస్తానని ప్రకటించడాన్ని గమనిస్తే ఆయన పోరాటం ప్రజల కోసమా లేక తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికేనా? అనే అనుమానం కలుగకమానదు.   అక్కడ ఫుడ్ పార్క్ ఏర్పాటుకి తమ యూపీఏ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తే, తనపై రాజకీయ కక్షతోనే దానిని మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని, కానీ దానిని తిరిగి సాధించేవరకు తన పోరాటం ఆగదని రాహుల్ గాంధీ ప్రకటించారు. కానీ అక్కడ 2010 సం.లో ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు యూపీఏ ప్రభుత్వమే అనుమతించిందని, కానీ 2012 సం.వరకు అక్కడ పనులు మొదలుపెట్టకపోవడంతో మళ్ళీ యూపీఏ ప్రభుత్వమే సదరు ప్రమోటర్లకు స్థలం, లైసెన్స్ రద్దు చేసేందుకు నోటీసులు జారీ చేసిందని కేంద్ర మంత్రి హరిసిమ్రత్ కౌర్ మీడియాకు తెలిపారు. రాహుల్ గాంధీ ఉద్దేశ్యపూర్వకంగానే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆమె ఘాటుగా విమర్శించారు జవాబిచ్చారు.   ఫుడ్ పార్క్ ఏర్పాటు విషయంలో ఎవరి వాదనలు వారికుండవచ్చును. కానీ 2010లోనే అక్కడ ఫుడ్ పార్కో లేక విద్యుత్ ఉత్పత్తి కేంద్రమో ఏర్పాటు చేసేందుకు యూపీఏ ప్రభుత్వమే అనుమతులు మంజూరు చేసినప్పుడు, దానిని యూపీఏ హాయంలోనే నిర్మాణం పూర్తి చేసేందుకు రాహుల్ గాంధీ ఎందుకు చొరవ తీసుకోలేదు. ఐదేళ్ళ తరువాత కూడా నిర్మాణం కాని సంస్థ గురించి ఆయన ఇప్పుడు ఎందుకు పోరాటం మొదలుపెట్టారు? అని ఆలోచిస్తే ఆయన మొదలుపెట్టిన ఈ పోరాటం దేనికో అర్ధమవుతుంది.   కాంగ్రెస్ పార్టీలో తనకు ఎదురవుతున్న సవాళ్ళను అధిగమించలేకనే రాహుల్ గాంధీ రెండు నెలలు శలవు అంటూ విదేశాలకు వెళ్ళిపోయారు. తిరిగివచ్చిన తరువాతయినా ముందుగా ఆ సమస్యలను పరిష్కరించుకొనే ప్రయత్నం చేసి, ఆ తరువాత ఆయన ఎటువంటి పోరాటాలు చేసినా పార్టీ కూడా ఆయనకు మద్దతుగా నిలిచేది. కానీ ఇంటిని చక్క దిద్దుకోకుండా దేశాన్ని చక్క దిద్దేందుకు బయలుదేరితే అప్పుడు ఇంట్లో ఈగల మోత బయట పల్లకీ మోత అన్నట్లు ఉంటుంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి దిశా నిర్దేశం చేయగలరో లేదో తెలియదు కానీ ప్రస్తుతం అగమ్యంగా తిరుగుతున్న ఆయనకే పార్టీ దిశానిర్దేశం చేయవలసిన అవసరం ఉన్నట్లు కనబడుతోంది.

వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకి రంగం సిద్దం

  వైజాగ్ నుండి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు క్రమంగా మార్గం సుగమం అవుతోంది. దాని ఏర్పాటు కోసం ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి ఫలించింది. వైజాగ్-చెన్నై మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు అవసరమయిన ఆర్ధిక సహాయం రుణంగా అందిస్తామని ముందుకు వచ్చిన ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలవంతం అవ్వడంతో, రాష్ట్ర ప్రభుత్వానికి 900 మిలయన్ అమెరికన్ డాలర్ల ఋణం అందించేందుకు ఏడీబీ అంగీకరించింది. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదనకు సూచన ప్రాయంగా ఆమోదం తెలపడంతో వైజాగ్-చెన్నై మధ్య ఈ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు మార్గం సుగమం అయినట్లే భావించవచ్చును.   ఏడీబీ రాష్ట్ర ప్రభుత్వానికి 900 మిలయన్ డాలర్ల ఋణం అందిస్తే, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా మరో 100 మిలియన్ డాలర్లను జత చేస్తుంది. ఆ మొత్తంతో వైజాగ్-చెన్నై చెన్నైమధ్య ఈ పారిశ్రామిక కారిడార్ పరిధిలోకి వచ్చే అన్ని నగరాలు, పట్టణాలలో, పల్లెల్లో కొత్తగా అనేక పరిశ్రమలు, వాటి కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తుంది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ముమ్ముర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు నిర్మాణ దశలో ఉండగా మరికొన్ని సంస్థలు త్వరలోనే ఉత్పత్తి కార్యక్రమాలు కూడా మొదలుపెట్టబోతున్నాయి. ఇప్పుడు ఏడీబీ ఇస్తున్న ఈ భారీ ఋణంతో రాష్ట్రంలో పారిశ్రామిక, మౌలికవసతుల అభివృద్ధి మరింత వేగవంతం కావచ్చును.   రాష్ర్టంలో వేగంగా మౌలికవసతుల అభివృద్ధి జరిగినట్లయితే, పారిశ్రామిక అభివృద్ధి కూడా వేగం పుంజుకొంటుంది. పారిశ్రామిక అభివృద్ధితో రాష్ర్టంలో ఉపాధి అవకాశాలు, దానితో బాటు ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి. పరిశ్రమలు వస్తే రోడ్డు రవాణా, రియల్ ఎస్టేట్, హోటల్, వర్తక వాణిజ్య ఉన్నత విద్యాలయాలు వంటివనేకం అభివృద్ధి చెందుతాయి. కనుక ఏడీబీ ఇవ్వబోతున్న ఈ భారీ ఋణం రాష్ట్రానికి ఒక గొప్పవరం వాటిదేనని భావించవచ్చును.   ఏడీబీ నుండి ఈ ఋణం పొందేందుకు కేంద్రం నుండి అవసరమయిన అనుమతులు పొందేందుకు తగిన ప్రతిపాదనలు సిద్దం చేయమని ముఖ్యమంత్రి ఆర్ధిక శాఖ అధికారులను ఆదేశించారు. పనిలోపనిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ వ్రాయవలసిందిగా ఆయన ఆర్ధిక శాఖ అధికారులను ఆదేశించారు. ఒకవేళ ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే, ఇప్పుడు ఏడీబీ నుండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న ఈ ఋణంలో చాలా వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే గ్రాంటుగా మార్చబడుతుంది కనుక రాష్ట్రంపై రుణభారం కూడా ఉండబోదు.   గత ఏడాది కాలంగా నానుతున్న ఈ ప్రత్యేక హోదా అంశం గురించి వచ్చే నెలాఖరులోగా తేలిపోతుందని కేంద్రమంత్రి సుజనా చౌదరి నిన్ననే ప్రకటించారు. ఈ భారీ ఋణంతో బాటు ఒకవేళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా మంజూరు అయినట్లయితే ఇక ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఈ భారీ అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు రానున్న నాలుగయిదేళ్ళలో స్పష్టంగా కనబడవచ్చును.

మోడీపై రాహుల్ గాంధీ విమర్శలా?

  భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నిన్న మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీయే అనేక దశాబ్దాలుగా దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించింది. ఇన్ని దశాబ్దాలలో ఏ దేశమయినా గణనీయమయిన అభివృద్ధి సాధించగలదు. కానీ దేశానికి అపారమయిన ఖనిజ సంపదలు, నీటి వనరులు, మానవ వనరులు, సువిశాలమయిన భూమి అన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా దేశంలో కోట్లాది ప్రజలు నేటికీ పస్తులు ఉంటూనే ఉన్నారు...అన్నదాతలు అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకొంటూనే ఉన్నారు...అందుబాటులో లేని విద్యా వైద్యం కోసం ఉన్నదంతా ఊడ్చిపెట్టుకొని సామాన్య ప్రజలు రోడ్ల మీద పడుతూనే ఉన్నారు. అలాగని ఈ ఆరు దశాబ్దాల కాలంలో దేశంలో అభివృద్ధి జరగలేదని చెప్పలేము కానీ, అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన కృషి మాత్రం నామమాత్రమేనని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఇన్ని దశాబ్దాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశాన్ని అభివృద్ధి చేయలేన్నప్పుడు, మోడీ ప్రభుత్వం అధికారం చేప్పట్టిన ఏడాది కాలంలోనే ఎలా సాధ్యం?   ఎన్నికల సమయంలో తెలంగాణాలో పర్యటించిన రాహుల్ గాంధీ, ‘మేడ్ ఇన్ తెలంగాణా’ పేరుతో వస్తువులు ఉత్పత్తి చేయడమే తమ పార్టీ ద్యేయమని చెప్పుకొని జనాల చేత చప్పట్లు కొట్టించుకొన్నారు. కానీ గత పదేళ్లుగా సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీయే పరిపాలించినప్పుడు అప్పుడే ఆ పని చేసి ఉండవచ్చు కదా? కానీ అప్పుడు ఎందుకు చేయలేదు? పదేళ్ళలో చేయని పనిని ఎన్నికలలో గెలిస్తే చేస్తామని హామీ ఇవ్వడం ప్రజలను మభ్యపెట్టడం కాదా? తను ఆ నాడు ఎన్నికల సభలో చెప్పిన మాటనే ఇప్పుడు మోడీ ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ పేరుతో అమలుచేస్తుంటే, అందుకు ఆయనని అభినందించడానికి బదులు ఎందుకు విమర్శిస్తున్నారు?   ఇక తమ యూపీఏ ప్రభుత్వం రైతుల హక్కులను, వారి ప్రయోజనాలను కాపాడేందుకు తెచ్చిన భూసేకరణ బిల్లును మోడీ ప్రభుత్వం కొంతమంది బడా పారిశ్రామిక వేత్తల కోసం సవరణలు చేసి రైతులకు అన్యాయం చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. కానీ కేవలం కాంగ్రెస్ పాలనలోనే దేశంలో వేల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకొన్నారు? పోనీ యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టంతోనే రైతుల సమస్యలన్నీ తీరిపోతాయా? అంటే తీరవని అందరికీ తెలుసు.   రాహుల్ గాంధీ నిజంగానే రైతుల సంక్షేమం కోరుకొని ఉంటే వారు ఎల్లకాలం సుఖంగా వ్యవసాయం చేసుకొనేందుకు తోడ్పడే చట్టాలను తీసుకువచ్చే ప్రయత్నం చేసి ఉండాలి. కానీ మున్ముందు రైతులు భూములు అమ్ముకొంటే దాని వలన వారికి లాభం రావాలనే ఉద్దేశ్యంతోనే ఈ భూసేకరణ బిల్లుని తీసుకు వచ్చినట్లు ఆయనే నిన్న స్వయంగా చెప్పుకొన్నారు. వ్యవసాయం చేసుకోవలసిన రైతులు తమ భూములు అమ్ముకోవాలని రాహుల్ గాంధీ ఎందుకు అనుకొంటున్నారు? రైతులు విరివిగా పంటలు పండించి లాభాలు కళ్ళ జూసేందుకు రైతులకు తోడ్పడే చట్టాలను ఏమయినా కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రవేశపెట్టి ఉండి ఉంటే దాని గురించి ఎంతయినా చెప్పుకోవచ్చును. కానీ భూసేకరణ చట్టం గురించి మాట్లాడటం దేనికంటే మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికే తప్ప నిజంగా రైతుల మీద ఉన్న ప్రేమతో మాత్రం కాదనే చెప్పవచ్చును.   రాహుల్ గాంధీకి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపే శక్తే ఉన్నట్లయితే, ఆపని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే చేసి చూపిస్తే అందరూ హర్షించేవారు. కానీ ఆయనకు కనీసం తన కాంగ్రెస్ పార్టీని నడిపించే శక్తి, అర్హత రెండూ లేనందునే కాంగ్రెస్ పార్టీ నేతలే ఆయన నాయకత్వ లక్షణాలు, పటిమ గురించి ప్రశ్నిస్తున్నారనే కోపంతోనే ఆయన రెండు నెలలు శలవు అంటూ విదేశాలలో తిరిగి వచ్చారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపించేందుకు గట్టిగా కృషి చేస్తున్న ప్రధాని మోడీని, ఆయన ప్రభుత్వ పనితీరును ఎందుకు విమర్శిస్తున్నారు? అంటే ఆయనను విమర్శించడం ద్వారా తను ఆయనకి ఏ మాత్రం తీసిపోనని నిరూపించుకోవడానికే అనుకోవలసి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని, దాని పద్దతులను అన్నిటినీ సమూలంగా ప్రక్షాన చేసేయలనుకొంటున్న రాహుల్ గాంధీ తను మాత్రం ఇంకా ఆ కాంగ్రెస్ పార్టీ మూస పద్దతుల నుండి బయటపడలేక పోతున్నారు.

ఇప్పుడు రాజధాని నిర్మించుకోలేకపోతే...

  ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతికి వచ్చే నెల 6వ తేదీని శంఖుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడంతో అందుకోసం వేగంగా చర్యలు చేపడుతోంది. అన్నిటికంటే ముందుగా ఈ పనికి అవరోధంగా నిలుస్తున్న భూసేకరణ సమస్యను పరిష్కరించేందుకు నడుం బిగించింది. రాజధాని కోసం భూములు ఇవ్వడానికి అయిష్టత చూపుతున్న ఉండవల్లి మరియు పెనుమాక గ్రామాలలో రైతులకు వారి సర్వే నెంబర్లు ఆధారంగా ఈరోజు జిల్లా కలెక్టర్ భూసేకరణ కోసం నోటీసులు అందజేయబోతున్నారు. అదేవిధంగా ఇంతకు ముందు ప్రభుత్వానికి అంగీకార పత్రాలు ఇచ్చి తరువాత హైకోర్టులో పిటిషన్లు వేసిన రైతులకి కూడా నోటీసులు జారీ చేయబోతున్నారు. వారి భూములు రాజధాని నిర్మాణం చేయాలనుకొంటున్న ప్రాంతానికి మధ్యలో ఉన్నందునే తప్పనిసరిగా భూసేకరణ చేయవలసి వస్తోందని అధికారులు చెపుతున్నారు.   ప్రభుత్వం రైతులపై భూసేకరణ చట్టం ప్రయోగించినట్లయితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని రైతులు, ప్రతిపక్షాలు కూడా హెచ్చరిస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుకే సాగాలని నిశ్చయించుకొంది. కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చట్టానికి సవరణలు చేయడం ద్వారా ఇటువంటి ప్రజాపయోగమయిన పనులకోసం రైతుల నుండి భూమిని సేకరించేందుకు ప్రభుత్వాలకి అధికారం కల్పించింది కనుక ఈ విషయంలో కోర్టులలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆటంకాలు ఎదురవకపోవచ్చును. కానీ, నోటీసులు అందుకొన్న రైతులు మళ్ళీ కోర్టులను ఆశ్రయించడం తధ్యం కనుక ప్రభుత్వానికి తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు కలగవచ్చును. కానీ ప్రతిపక్ష పార్టీలు ఈ భూసేకరణను వ్యతిరేకిస్తున్నాయి కనుక ప్రభుత్వానికి న్యాయపరమయిన ఇబ్బందుల కంటే రాజకీయపరమయిన సమస్యలే అగ్ని పరీక్షగా మారే అవకాశం ఉంది.   రాష్ట్ర ప్రజలలో మంచి ఆదరణ కలిగి ఉన్న సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా వారికి తోడయితో ఇక అగ్నికి ఆజ్యం పోసినట్లే అవుతుంది. కానీ ఇంతవరకు ఆయన ఈ విషయంపై ఇంతవరకు స్పందించలేదు. మరి ఆ మౌనం అర్ధాంగీకారం అనుకోవాలో లేకపోతే మళ్ళీ అకస్మాత్తుగా తుళ్ళూరుకి బయలుదేరిపోయి హడావుడి చేస్తారో తెలియదు. ఏది ఏమయినప్పటికీ ఈ భూసేకరణ ఆఖరు అధ్యాయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా చాలా సవాళ్ళను ఎదుర్కోక తప్పేలా లేదు.   ఇప్పుడు ఉద్యమిస్తున్న ప్రతిపక్షాలన్నిటికీ కూడా రాష్ట్రానికి రాజధాని లేదనే విషయం, అత్యవసరంగా దానిని నిర్మించుకోవాలనే విషయం తెలుసు. కానీ రాష్ట్రంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు రైతులు తరపున ఉద్యమిస్తామని చెపుతున్నప్పటికీ, వారి పోరాటాల వెనుక ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికున్నాయి. రాష్ట్ర విభజన తరువాత చెల్లచెదురయిపోయిన కాంగ్రెస్ నేతలను అందరినీ ఒక్క త్రాటిపైకి తీసుకువచ్చి ఈ సమస్య మీద పోరాడి మళ్ళీ ప్రజలకు చేరువయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించవచ్చును. వైకాపా కూడా ఇంచుమించి అదే ఉద్దేశ్యంతో పోరాటానికి సిద్దం కావచ్చును. నిరంతరం ఏదో ఒక ప్రజాసమస్యలపై పోరాడే వామపక్ష పార్టీలు కూడా భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టాయి గనుక అవి కూడా ఇందులో పాల్గొనవచ్చును. కనుక ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒంటరిపోరాటం చేయక తప్పదు. అయితే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ముందే ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. అటువంటప్పుడు ప్రభుత్వం ముందు నుంచే ఇందుకోసం రాష్ట్ర ప్రజలందరి మద్దతు కూడగట్టినా లేక ఈ విషయం గురించి ముందుగానే ప్రతిపక్షాలతో కూడా చర్చించి వాటి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని ఉన్నా బహుశః సమస్య తీవ్రత ఇంతగా ఉండేది కాదేమో?   ఇప్పుడు ఉద్యమిస్తున్న ప్రతిపక్షాలన్నిటికీ కూడా రాష్ట్రానికి రాజధాని లేదనే విషయం, అత్యవసరంగా దానిని నిర్మించుకోవాలనే విషయం తెలుసు. తెదేపా-బీజేపీల మధ్య మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉండి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా ఉన్నందున, కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం పూర్తి సహాయసహకారాలు అందించేందుకు సిద్దంగా ఉంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వీలయినంత త్వరగా రాజధాని నిర్మించుకోవలసింది పోయి, ఈవిధంగా ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డుతగులుతున్నట్లయితే, ఒకవేళ మిగిలిన ఈ నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం చేసుకోలేకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటి? అప్పుడు ప్రజలు ఎవరిని నిందించాలి? రాజధాని నిర్మాణం కోసం సహాయం చేస్తానన్న కేంద్ర ప్రభుత్వాన్నా? లేక ఈ అవరోధాల కారణంగా రాజధాని నిర్మించలేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించాలా? లేక తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే రాజధాని నిర్మాణానికి అవరోధాలు సృష్టిస్తున్న ప్రతిపక్షాలనా? దీనికి ఇప్పుడు ఎవరు ఎటువంటి సమాధానమయినా చెప్పుకోవచ్చును. కానీ అందుకు బాధ్యులను ప్రజలే గుర్తించి వారిని శిక్షించకుండా విడిచిపెట్టరని అన్ని పార్టీలు గుర్తుంచుకోవడం మంచిది.  

మనకీ మంచి రోజులు తప్పకుండా వస్తాయి అంటే...

    ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ‘రైతు భరోసా యాత్ర’ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి జిల్లాలో ఆర్ధిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలను ఓదార్చుతున్నారు. ఆయన చేసేది ఓదార్పు యాత్రాలే అయినా అవి రాజకీయ సభలకు ఏమాత్రం తీసిపోకుండా సాగుతున్నాయి. ఎప్పటిలాగే ప్రజలకు ఏ సమస్య ఎదురయినా, ఏ కష్టం వచ్చినా అందుకు అధికారంలో ఉన్న తెదేపా ప్రభుత్వానిదే తప్పు అని విమర్శలు గుప్పించిన తరువాత ఆ సమస్యలన్నిటికీ తన వద్ద ఉన్న ఏకైక పరిష్కారం తను ముఖ్యమంత్రి అవడమేనని కుండబ్రద్దలు కొట్టినట్లు కాకపోయినా ఇంచుమించు అలాగే చెపుతుంటారు. అంతవరకు ప్రజలు ఓపికపట్టాలని, మనకీ మంచి రోజులు తప్పకుండా వస్తాయని జగన్మోహన్ రెడ్డి చెపుతుంటారు. ఈరోజు కూడా ఆయన మళ్ళీ అవే మాటలు ఎక్కడా పొల్లుపోకుండా చెప్పారు.   ఆయనపై సీబీఐ కేసులు నమోదు చేసి జైలుకి పంపినప్పుడు, ఆయనకి చెడ్డ రోజులు నడుస్తున్నాయని, కానీ పైనున్న ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ తనకు మంచి రోజులు వస్తాయని చెప్పుకొనేవారు. ఆయన కోరుకొన్నట్లే బెయిలు మీద బయటపడటమే కాకుండా ఎన్నికలలో పోటీ చేసి చట్ట సభలలో కూడా ప్రవేశించగలిగారు. అంటే ఆయనకి మంచి రోజులు వచ్చాయనే అనుకోవలసి ఉంటుంది. కానీ తను ముఖ్యమంత్రి అయిననాడే ప్రజలకు మంచి రోజులు మొదలవుతాయని ఆయన చెప్పడమే వెటకారం.   ఆయన కాంగ్రెస్ పార్టీని చాలా ఆచి తూచి విమర్శిస్తారు. ఎందుకంటే ఆయన పార్టీ మూలాలు ఎప్పటికీ అందులోనే ఉంటాయి. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో రైతుల ఆత్మహత్యలు చేసుకొన్నారంటే అందుకు కారణం గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ చేసిన అసమర్ధ పాలనే అనే విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహాలు లేవు. అందులో ఐదేళ్ళపాటు ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆయన జలయజ్ఞం పేరుతో అనేక ప్రాజెక్టులు మొదలుపెట్టేసి వేల కోట్లు ఖర్చు చేసారు. కానీ అంత ఖర్చు చేసినా రెండు రాష్ట్రాలలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు. కానీ ఆయన పోయిన తరువాత మంత్రులు, ఐ.ఏ.యస్. అధికారులు, వ్యాపారస్తులు చివరికి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డితో సహా అనేకమంది అవినీతి కేసులలో జైలుకి వెళ్ళవలసి వచ్చింది.   వేల కోట్లు ఖర్చు పెట్టి జలయజ్ఞం చేసినా రైతుల పొలాలకు నీళ్ళు అందించలేకపోయారు. ఆ కారణంగా వారు బోర్లు వేయించుకోవడానికి అప్పులు చేయవలసి వచ్చింది. బోర్లు వేయించుకొన్నా భూగర్భ జలాలు అడుగంటిపోవడం వలన వాటిలో నీళ్ళు వచ్చేవి కావు ..వచ్చినా నీళ్ళు తోడేందుకు కరెంటు ఉండదు. కానీ అన్నదాతలు చేసిన అప్పులు మాత్రం వారిని ప్రాణాలు తీసుకొనే వరకు వెంటాడుతూనే ఉంటాయి. వారి ఈ కష్టాలన్నిటికీ కాంగ్రెస్ పార్టీదే బాధ్యత కాదా? అటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డి, రాహుల్ గాంధీ మళ్ళీ ఇప్పుడు రైతుల కుటుంబాలను ఓదార్చేందుకు బయలుదేరడం, మళ్ళీ తాము అధికారంలోకి వస్తే “అటువంటి మంచి రోజులు’ మళ్ళీ వస్తాయని చెప్పుకోవడం చూస్తుంటే వారికి ప్రజల పట్ల, వారి ఆలోచనా శక్తి పట్ల ఎంత చులకన భావం ఉందో అర్ధమవుతోంది. ఎంతసేపు తాము అధికారంలోకి రావాలని తపించిపోవడమే తప్ప నిజంగా ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల పట్ల వారికి ఏమాత్రం సానుభూతి మాత్రం ఉన్నట్లు కనబడటం లేదు. ఒకవేళ ఉంటే పరామర్శ యాత్రల కోసం ఇంత హడావుడి, అట్టహాసం చేసే వారే కాదు. వారి ఈ ప్రయత్నాలన్నీ ప్రజలను ఆకట్టుకొని తమ పార్టీని బలపరుచుకోవడానికే తప్ప మరొకందుకు కాదు.కనుక వారు చెప్పే మంచిరోజులు అంటే వారిరువురికీ అధికారం వచ్చిన రోజని ప్రజలు సర్దిచెప్పుకోవలసి ఉంటుంది.

రాజధాని నిర్మాణానికి అది మంచి ఆలోచనే

  ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 6వ తేదీన రాజధాని అమరావతి నిర్మాణానికి శంఖుస్థాపన చేయాలని ముహూర్తం ఖరారు చేసింది. అక్టోబరు 22వ తేదీన విజయదశమి పండుగ రోజు నుండి రాజధాని నిర్మాణ పనులు మొదలుపెట్టాలని నిర్ణయించుకొంది. ఈలోగా రాజధానికి భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న కొంత మంది రైతులను కలిసి మరో మారు ఒప్పించే ప్రయత్నాలు చేసిన తరువాత అప్పటికీ వారు నిరాకరించినట్లయితే, భూసేకరణ చట్టం ప్రయోగించి వారి నుండి భూములు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన రాజధాని నగరంలో కేవలం అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్, హైకోర్టు, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, వారికి నివాస సముదాయాల నిర్మాణానికి, రాజధానిలో మౌలికవసతుల కల్పనకి మాత్రమే అవసరమయిన నిధులు మంజూరు చేస్తుంది. విజయవాడ, గుంటూరు నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ప్రకటించి ఉన్నందున ఆ పధకం క్రింద రాజధాని నగరానికి మరికొన్ని అధనపు నిధులు సమకూరవచ్చును. కానీ దాని చుట్టూ విస్తరించబోయే ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా నిధులు సమకూర్చుకోవలసి ఉంటుంది.   ప్రధాన రాజధాని నగరమయిన అమరావతిని 3,705 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసేందుకు సింగపూర్ సంస్థలు మాష్టర్ ప్లాన్ సిద్దం చేస్తున్నాయి. మొదటి దశ రాజధాని నిర్మాణానికి సుమారు రూ.6,000-9,000 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేయబడింది. రాష్ట్ర ప్రభుత్వం ఊహిస్తున్న విధంగా అత్యాధునిక రాజధాని పూర్తయ్యేందుకు ఏడాదికి సుమారు రూ.6,000 కోట్ల చొప్పున 15ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టవలసి ఉంటుందని అంచనా వేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికున్న ఆర్ధిక పరిమితుల కారణంగా అత్యాధునిక రాజధాని నిర్మించే విషయంలో ఏమాత్రం రాజీపడకూడదనే పట్టుదలతో ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అందుకే ఆయన స్విస్ ఛాలెంజ్ పద్దతిలో ప్రధాన రాజధాని నగరాన్ని అభివృద్ధి చేసేందుకు నిశ్చయించుకొన్నారు.   ఈ విధానంలో రాజధాని నిర్మించేందుకు అవసరమయిన ముందుకు వచ్చే నిర్మాణ సంస్థే అందుకు అవసరమయిన పెట్టుబడిని స్వయంగా సమకూర్చుకోవలసి ఉంటుంది. ఆ సంస్థ మాష్టర్ ప్లాన్ లో సూచించిన విధంగా అన్ని హంగులతో రాజధాని నిర్మాణం పూర్తిచేసి ప్రభుత్వానికి అప్పగించవలసి ఉంటుంది. అందుకు ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వం రాజధాని పరిధిలో సేకరించిన 7,000 ఎకరాలలో తన అవసరాలకు వినియోగించుకోగా మిగిలిన భూమిలో వ్యాపార సంస్థలకు, పరిశ్రమల ప్రధాన కార్యాలయాలు వగైరా సంస్థలకు లీజు మీద ఇచ్చి దాని నుండి వచ్చే ఆదాయాన్ని సదరు నిర్మాణ సంస్థకు ఫీజుగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆవిధంగా చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వంపై ఎటువంటి అదనపు భారం పడకుండా ఉంటుంది. అంతే కాక తరచూ మారిపోయే రాజకీయ పరిస్థితుల వల్ల కానీ, ఆర్ధిక సమయాల వలన గానీ రాజధాని నిర్మాణానికి ఎటువంటి ఆటంకం ఏర్పడకుండా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.   రాజధానికి మాష్టర్ ప్లాన్ అందిస్తున్న సింగపూర్ ప్రభుత్వం ఇందుకోసం సింగ్ బ్రిడ్జ్, సెంబ్ కార్ప్,అసేండాన్ అనే మూడు సంస్థల పేర్లను సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం వీటిలో ఏదో ఒక సంస్థను లేదా వేరే ఇతర సంస్థను కానీ ఎంచుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఇంత సుదీర్ఘకాలం పాటు అంత భారీ పెట్టుబడులు పెట్టడం కష్టం కనుక ఎవరి మీద భార వేయకుండా ఈ విధానం ద్వారా రాజధాని నిర్మించుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను మెచ్చుకోవలసిందే.

రాష్ట్ర పునర్నిర్మాణంలో వైకాపా పాత్ర ఏమయినా ఉందా?

    ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అధికారికంగా ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయిన జూన్ 2వ తేదీని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నవ నిర్మాణ దినంగా అదే రోజును రాష్ట్ర అవతరణ దినంగా ప్రకటించింది. ఆ రోజు నుండి వారం రోజుల పాటు నవనిర్మాణ దీక్ష పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జూన్ 9వ తేదీన రాష్ట్రంలో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదంతా రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా చేస్తున్న కార్యక్రమాలే అయినా, జూన్ 9నాటికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేప్పట్టి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది కనుక ఆరోజు ప్రభుత్వం నిర్వహించబోయే బహిరంగ సభకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అది తెదేపా ప్రభుత్వ విజయోత్సవ సభగా నిర్వహించే అవకాశాలే ఎక్కువ.   ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పని తలపెట్టినా దానిని వ్యతిరేకించడమే తన పార్టీ సిద్దాంతంగా మార్చుకొన్న జగన్మోహన్ రెడ్డి జూన్ 5,6 తేదీలలో రెండు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు దీక్ష చేయాలని నిర్ణయించుకొన్నారు. తెదేపా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకొన్నసందర్భంగా ఎంతో అట్టహాసంగా విజయోత్సవ సభను నిర్వహించుకోవాలని భావిస్తుంటే, దానికి పోటీగా మూడు రోజుల ముందే జగన్ దీక్షకు కూర్చోవాలని నిశ్చయించుకోవడం ప్రభుత్వం పట్ల, దానిని నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల ఆయనకున్న అక్కసుని ప్రదర్శిస్తున్నట్లుంది తప్ప వేరే ఏ ప్రయోజనమూ కనబడటం లేదు.   ఇదివరకు ఆయన అనేక అంశాలను తీసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. కానీ అది ఎంతవరకు అంటే మరో సరికొత్త అంశం దొరికేవరకే. మొన్నటి వరకు రాజధాని భూసేకరణకు వ్యతిరేకిస్తూ పోరాడిన ఆయన ఆ తరువాత పట్టిసీమ ప్రాజెక్టుకి కూల్ గా షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు ఆ పట్టిసీమను కూడా పక్కనబెట్టి మళ్ళీ రైతు భరోసా యాత్రలు మొదలుపెట్టారు. ఆయన రైతులకు భరోసా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ వంకతో రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతుంటారు.   రాష్ట్ర పునర్నిర్మాణంలో ఆయన పోషిస్తున్న పాత్ర ఏమయినా ఉందా? అని ప్రశ్నిస్తే లేదనే జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. రాష్ట్రానికి నిధులు విడుదల చేయమని, ప్రత్యేక హోదా ఇమ్మని ఏదో మొక్కుబడిగా అడగడమే తప్ప వాటి కోసం ఆయన ఎన్నడూ గట్టిగా పోరాడింది లేదు. కనీసం తన పార్టీ నేతలయినా అందుకు అనుమతించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టే ప్రతీ పనిని ప్రశ్నించే జగన్, మోడీ ప్రభుత్వాన్ని మాత్రం ఎన్నడూ ప్రశ్నించరు. ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు గట్టిగా నిలదీయడంలేదని తెదేపాను ప్రశ్నించే ఆయన తను మాత్రం ఆ విషయం గురించి ఎన్నడూ గట్టిగా మాట్లాడిన దాఖలాలు లేవు. మిగిలిన హామీల విషయంలో కూడా ఆయన కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లు చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఏదో ఒకనాడు తెదేపా-బీజేపీలు తెగతెంపులు చేసుకోకపోవా? బీజేపీతో తన పార్టీతో పొత్తులు పెట్టుకోకపోదా? అనే చిన్న ఆశ వలనే కావచ్చును.   ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన్న రాష్ట్రాభివృద్ధికి కృషి చేయకూడదనే నియమం ఎక్కడా లేదు కనుక రాష్ట్ర విభజన తరువాత అత్యంత దయనీయమయిన స్థితిలో ఉన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి తన పరపతిని ఉపయోగించి అనేక పరిశ్రమలు రప్పించవచ్చును, లేదా రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించవచ్చును. తనకున్న యంపీల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావచ్చును. కానీ అటువంటి పనులేవీ ఆయన చేకుండా భరోసా యాత్రలు, దీక్షలు చేయడం దేనికి? ఎవరి ప్రయోజనం కోసం? రాష్ట్ర పునర్నిర్మాణంలో వైకాపా పోషించిన పాత్ర ఏమిటని వచ్చే ఎన్నికలలో ప్రజలు ప్రశ్నిస్తే దానికి ఆ పార్టీ వద్ద సరయిన సమాధానం ఉంటే పరువాలేదు. లేకపోతే మళ్ళీ నష్టపోయేది వారేనని గుర్తుంచుకోవాలి.

హైకోర్టు తీర్పుతో తమిళనాట రాజకీయాలలో అనిశ్చితితి తొలగినట్లే

  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక హైకోర్టు చాలా ఊరటనిచ్చింది. అక్రమాస్తుల కేసులో స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ఆర్. కుమారస్వామి కొట్టివేశారు. ఆమెపై మోపబడిన అన్ని అభియోగాలను కూడా కొట్టివేశారు. ఈ తీర్పుతో గత 18 ఏళ్లుగా సాగిన అక్రమాస్తుల కేసులో జయలలిత నిర్దోషిగా బయటపడ్డారు. కనుక ఆమె త్వరలోనే మళ్ళీ తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేప్పట్టే అవకాశం ఉంది.   గతేడాది సెప్టెంబరులో ప్రత్యేక న్యాయస్థానం ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసేవరకు వారం రోజుల పాటు ఆమె బెంగళూరులో అగ్రహారం జైలులో గడపవలసి వచ్చింది కూడా. ప్రత్యేక కోర్టు తీర్పుతో ఆమె ప్రజా ప్రాతినిధ్య చట్ట ప్రకారం ఎన్నికలలో పోటీ చేసే అర్హత కూడా కోల్పోవడంతో ఆమె రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఆ కారణంగా తమిళనాడులో ఒకరకమయిన రాజకీయ అనిశ్చితి కూడా ఏర్పడింది. ప్రధాన ప్రతిపక్షమయిన డీ.యం.కె., కాంగ్రెస్, బీజేపీ మరియు మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఆయాచితంగా దొరికిన ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్రంలో అధికార ఏ.ఐ.ఏ.డి.యం.కె. పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని చురుకుగా పావులు కదిపాయి. కుష్భూ వంటి కొందరు రాజకీయ నేతలు చకచకా పార్టీలు మారి రాష్ట్ర రాజకీయాలలో జయలలిత స్థానాన్ని భర్తీ చేయాలని కలలు కన్నారు. కానీ వారి ఆశలన్నీ కర్ణాటక హైకోర్టు తీర్పుతో అడియాసలయ్యాయి.   కోర్టు తీర్పు ఆమెకు, ఆమె ఏ.ఐ.ఏ.డి.యం.కె. పార్టీకి కూడా వెయ్యేనుగుల బలం కలిగించేదిగా ఉంది. నిర్దోషిగా బయటపడిన జయలలిత రెట్టించిన శక్తి, ఉత్సాహంతో రాష్ట్ర రాజకీయాలను శాశించవచ్చును. ఆమె మళ్ళీ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేప్పట్టగానే ముందుగా తను వారం రోజులు జైలులో ఉన్నప్పుడు చెన్నైలో ఒక స్టార్ హోటల్లో పండగ చేసుకొన్న తన మంత్రులందరికీ ఉద్వాసన పలుకవచ్చును. పనిలోపనిగా మంత్రివర్గ ప్రక్షాళన చేయవచ్చు కూడా. కర్ణాటక హైకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పుతో తమిళనాట రాజకీయాలలో ఏర్పడిన సందిగ్దత పూర్తిగా తొలగిపోయినట్లేనని చెప్పవచ్చును. ప్రజలలో కూడా ఆమె పట్ల సానుభూతి ఏర్పడుతుంది కనుక ఇకపై ఆమెకు రాష్ట్రంలో తిరుగు ఉండకపోవచ్చును.