మ్యాగీ తప్ప దేశంలో అన్నీ సురక్షితమయినవేనా?
సంప్రదాయ ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడే భారతీయులు గత మూడు దశాబ్దాలుగా క్రమంగా తమ ఆహారపు అలవాట్లను మార్చుకొన్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు విచ్చినం అయ్యి వాటి స్థానంలో చిన్న కుటుంబాలు ఏర్పడటం, ఆ కారణంగా భార్యాభర్తలు ఇరువురు ఉద్యోగాలు చేయవలసి రావడం, జీవన ప్రమాణాలు పెరగడం, యాంత్రిక జీవనం, సమాజ ఆలోచన విధానంలో పెను మార్పులు చోటు చేసుకోవడం వంటి అనేక కారణాల వలన భారతీయుల ఆహారపుటలవాట్లు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఈ కారణంగానే మ్యాగీలు, బర్గర్లు, పిజ్జాలు, కూల్ డ్రింక్స్, చిప్స్ కుర్ కురేలు వంటి నోరూరించే విదేశీ ఆహార ఉత్పత్తులు భారతదేశంలో ప్రవేశించగలిగాయి.
తమ ఆకర్షణీయమయిన వాణిజ్య ప్రకటనలతో క్రమంగా భారతీయలను వశపరుచుకొని ఏటా వేల కోట్లు వ్యాపారం చేస్తున్నాయి. ప్రజలు కూడా ఆహార ఉత్పత్తులకు బాగా అలవాటుపడిపోయారు కనుక వారి వ్యాపారాలు మూడు పూవులు ఆరు కాయలు అన్నట్లు సాగిపోతోంది. కానీ దేశంలో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ అమితంగా ఇష్టపడి తినే మ్యాగీ నూడిల్స్ లో పరిమితికి మించి సీసం, మోనో సోడియం గ్లుటామేట్ అనే రసాయనం కూడా ఉన్నట్లు పరీక్షలలో తేలడంతో ప్రజలు నివ్వెరపోవలసివచ్చింది. దానితో కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఒక్కో రాష్ట్రం మ్యాగీపై నిషేధం విధించడం మొదలుపెట్టాయి. ఒక్క మ్యాగీపైనే కాకుండా సన్ఫీస్ట్, యప్పీ వంటి అనేక బ్రాండ్లపై కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించడం మొదలుపెట్టాయి. తాజాగా ఈరోజు నుండి తెలంగాణా రాష్ట్రం కూడా మ్యాగీపై నిషేధం విధించింది.
అయితే కేవలం వివిధ కంపెనీలు తయారుచేసే నూడుల్స్ లో మాత్రమే హానికరమయిన రసాయనాలున్నాయనట్లు మిగిలిన ఆహార ఉత్పత్తులన్నీ చాలా స్వచ్చమయినవి, ఆరోగ్యానికి చాలా మేలు చేసేవి అన్నట్లుంది ప్రభుత్వాల వ్యవహారం చూస్తుంటే. చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు అందరూ అధికంగా తినే, త్రాగే చిప్స్ ప్యాకెట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ వంటి అనేక రకాల ఆహార పదార్దాలలోనే కాకుండా కాఫీ, టీ, వంట నూనెలు, టూత్ పేస్టులు, మహిళలు అధికంగా వాడే మేకప్ క్రీములు, పౌడర్ల వరకు ప్రతీ దానిని ఇంతే క్షుణంగా పరిశీలిస్తున్నారా? అంటే లేదనే సమాధానం వస్తుంది.
ఇక దేశంలో ఉన్న లక్షలాది చిన్న పెద్ద హోటళ్ళలో ఆహార పదార్ధాల నాణ్యత గురించి పట్టించుకొనే నాధుడే లేడు. ఇక రోడ్ల మీద దుమ్ము దూళి, మురికి కాలువలు పక్కన తయారు చేసే పానీ పూరీలు, నూడుల్స్, ఛాట్, జిలేబీ వంటి ఆహారపదార్ధాలు తిని దేశంలో ఎన్ని వేలమంది అనారోగ్యానికి గురవుతున్నారో ఎవరికీ తెలియదు.
డిల్లీలో గాలి ఎంతగా కలుషితమయిపోయింది అంటే అది పీల్చడానికి కూడా పనికిరాదని ఇటీవల ఒక నివేదిక వెలువడింది. ఒక్క డిల్లీలోనేకాదు దేశ వ్యాప్తంగా పల్లె పట్టణం నగరం అనే తేడా లేకుండా పీల్చే గాలి, త్రాగే నీళ్ళు , నివసించే భూమి అన్నీ కలుషితం చేసుకొంటున్నాము. వీటన్నిటినీ అరికట్టడానికే అనేక చట్టాలున్నాయి. కానీ అవన్నీ కొంతమందికి ఉద్యోగాలు సృష్టించేందుకే ఏర్పటు చేసుకొనట్లున్నాయి తప్ప వాటి వలన మరే ప్రయోజనం కనబడటం లేదు. అందుకే లక్షల కోట్లు ఖర్చు చేసి హుస్సేన్ సాగర్ ని, గంగానదిని ప్రక్షాళన చేసుకోవలసిన దుస్థితి ఏర్పడింది. వేల రూపాయలు ఖర్చు చేసి ఇంట్లోనే బోర్లు వేసుకొన్నా ప్రజలు దైర్యంగా ఆ నీళ్ళు కూడా త్రాగలేక కొనుకొని త్రాగవలసిన దుస్థితి నెలకొంది.
దేశంలో ఇంతగా ఆహారం, నీళ్ళు, గాలి, భూమి, వాతావరణం అన్నీ చాల వేగంగా కలుషితమయిపోతున్నా పట్టించుకొనే నాధుడే లేదు. కానీ మ్యాగీలో హానికర రసాయనాలున్నాయంటూ ఒక ప్రభుత్వాన్ని చూసి మరొకటి మ్యాగీపై నిషేధం విధిస్తూ చాలా హడావుడి చేస్తున్నాయి. మ్యాగీలో హానికర రసాయనాలున్నట్లయితే మరి గత మూడు దశాబ్దాలుగా దానిని ప్రభుత్వాలు ఎందుకు అనుమతించాయి? ఒకవేళ ఇప్పుడు తాజాగా ప్రవేశపెట్టిన మ్యాగీ ఉత్పత్తిలోనే అటువంటి హానికర పదార్ధాలున్నట్లు కనుగొని ఉంటే, దేశంలో వివిధ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న ఆహార పదార్ధాలన్నీ ప్రజలు ఉపయోగించేందుకు యోగ్యమయినవేనా? అనే ప్రశ్నకు ఎవరూ బదులు చెప్పలేరు.
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మార్కెట్ గా అవతరించిన భారతదేశంపై అనేక అంతర్జాతీయ కంపెనీలు కన్ను వేశాయనే సంగతి పెద్ద రహస్య విషయమీ కాదు. ఆ కార్పోరేట్ సంస్థల మధ్య తెర వెనుక జరుగుతున్న పోరాటాల కారణంగానే మ్యాగీకి ఈపరిస్థితి ఎదురయి ఉండవచ్చును తప్ప అందులో హానికరమయిన రసాయనాలున్న కారణంగా మాత్రం దానిపై ఈ అత్యవసర యుద్ద ప్రకటన జరిగి ఉండకపోవచ్చుననే అనుమానాలున్నాయి. కనుక వాటి మధ్య రాజీ కుదిరిననాడు, ఈ కార్చిచ్చు ఎంతవేగంగా ఎగిసిపడిందో అంతకంటే వేగంగానే చల్లారిపోవచ్చును. అప్పుడు మళ్ళీ “మ్యాగీ చాలా రుచికరమయినదే కాదు చాలా ఆరోగ్యకరం కూడా” అనే టీవీలలో ప్రకటనలు చూస్తూ అందరూ మ్యాగీని తింటారని ఖచ్చితంగా చెప్పవచ్చును.