వ్యాపం కుంభకోణంలో సీబీఐ ముందడుగు

  దేశంలో కలకలం సృష్టిస్తున్న వ్యాపం కుంభకోణంపై దర్యాఫు చేసేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ, దర్యాప్తు మొదలుపెట్టిన మూడవ రోజే దీనితో సంబంధం ఉందని అనుమానిస్తున్న 8మందిపై రెండు కేసులు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తుకి సీబీఐ ఏకంగా 40మంది అధికారులను కేటాయించింది. వారందరూ 3రోజుల క్రితమే డిల్లీ నుండి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ చేరుకోగానే తమ దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కుంభకోణంపై దర్యాప్తుకి ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ మరియు స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులతో వారు మాట్లాడి ఈ కుంభకోణంపై వారు చేసిన దర్యాప్తు గురించి వివరాలు సేకరించారు. అదేవిధంగా వారి నుండి ఈ కుంభకోణానికి సంబంధించిన అనేక కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకొన్నారు. 2010-11లో జరిగిన ప్రీ-పోస్ట్ గ్రాడ్యుయేట్ల మెడికల్ ప్రవేశ పరీక్షలలో 21మంది అభ్యర్ధుల దగ్గర నుండి లంచాలు తీసుకొన్నట్లు అనుమానిస్తున్న మొత్తం 8మందిపై సీబీఐ అధికారులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేసారు. త్వరలోనే రాష్ట్రంలో గ్వాలియర్, ఇండోర్ తదితర పట్టణాలకు కూడా వెళ్లి తమ దర్యాప్తుని ముమ్మరం చేస్తారని సమాచారం.   ఇంతకు ముందు ఈ కుంభకోణంపై దర్యాప్తు చేసిన సిట్ అధికారులు దీనిలో రాష్ట్ర గవర్నర్ రాం నరేష్ యాదవ్ కూడా నిందితుడేనని కనుక ఆయనని ప్రశ్నించేందుకు అనుమతించమని హైకోర్టుని కోరారు. కానీ ఆయన రాష్ట్ర గవర్నర్ గా తనకున్న రాజ్యాంగ రక్షణని వాడుకొంటూ మినహాయింపు పొందారు. మరో ఆసక్తికరమయిన విషయం ఏమిటంటే ఈ కుంభకోణంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న గవర్నర్ కుమారుడు శైలేష్ యాదవ్ కూడా అనుమాన స్పద స్థితిలో మరణించడం. ఇదంతా చూస్తుంటే ఈ కుంభకోణంలో ఎంత పెద్ద స్థాయిలో జరుగుతోందో అర్ధమవుతుంది.   ఒకవైపు సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తుండగానే, ఇంతవరకు ఈ కుంభకోణాన్ని దర్యాప్తు చేసిన సిట్ అధికారులు ఈ కేసులో నిందితులుగా పేర్కొంటున్న వారిపై చార్జ్ షీట్లు దాఖలు చేసేందుకు అనుమతి కోరుతూ గురువారంనాడు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసారు. ఈ వ్యాపం కుంభకోణంలో సిట్ అధికారులు ఇంత వరకు మొత్తం 185 కేసులు నమోదు చేసారు. వారిలో చాలా మందిని అరెస్ట్ చేసారు. ఈ కేసులన్నీ సీబీఐకి బదలాయించడానికి చాలా సమయం పడుతుంది. అంతవరకు నిందితులపై అభియోగాలు నమోదు చేయకపోయినట్లయితే వారందరూ బెయిలు పొందడానికి అర్హులవుతారు కనుక దర్యాప్తు పూర్తయిన కేసులలో అభియోగాలు నమోదు చేసేందుకు తమను అనుమతించమని సిట్ అధికారులు చేసిన విజ్ఞప్తిపై ఈనెల 20వ తేదీన విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.యల్.దత్తు తెలిపారు.   ఇంచుమించుగా రెండు దశాబ్దాలుగా ఈ కుంభకోణం, అనుమానాస్పద మరణాలు, దర్యాప్తు, అరెస్టులు సాగుతున్నాయి. కానీ ఇంతవరకు ఎవరూ కూడా దాని మూలాలలోకి వెళ్ళలేకపోయారంటే దర్యాప్తు చేస్తున్న అధికారులపై కూడా తీవ్రమయిన రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నట్లు స్పష్టం అవుతోంది. అందుకే ఈసారి దర్యాప్తులో సీబీఐ అధికారులపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళు పడకుండా నివారించాలనే ఆలోచనతో సుప్రీంకోర్టు ధర్మాసనం తనే స్వయంగా పర్యవేక్షించాలని నిర్ణయించుకొంది. మరి సీబీఐ అధికారులయినా ఈ మిష్టరీని చేధిస్తారో లేదో చూడాలి.

ప్రధాని మోడీ సమావేశానికి వారిద్దరూ డుమ్మా?

  నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన డిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశానికి అనేక ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాకుండా ఆంధ్రా, తెలంగాణా ముఖ్యమంతరులు కూడా డుమ్మా కొట్టారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రిని కలిసే ఎటువంటి అవకాశాన్ని సాధారణంగా వదులుకోరు. కనుక ఆయన డిల్లీ వెళ్ళాలనే అనుకొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పుష్కరాలలో మొదటిరోజే త్రొక్కిసలాటలో ఏకంగా 27మంది మరణించడంతో ఆయన తనకి బదులు ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణా రావుని డిల్లీకి పంపారు. పుష్కరాలలో జరిగిన దుర్ఘటన గురించి ప్రధాన మంత్రి స్వయంగా చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడారు కనుక ఆయన రాలేకపోవడాన్ని అర్ధం చేసుకోగలరు.  కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీకి వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ వెళ్ళకపోవడం రకరకాల ఊహాగానాలకు తావిస్తోంది.   ఓటుకి నోటు కేసులో తన ప్రభుత్వాన్ని అడుగు ముందుకు వేయలేకపోవడం, ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో బీజేపీ నేతలని మాట్లాడనీయకుండా చేయడం, సెక్షన్: 8ని అమలుచేయబోతున్నట్లు సంకేతాలు పంపడం, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణకు అరకొర నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేస్తుండటం వంటి కారణాల చేతనే కేసీఆర్ కూడా పుష్కరాల వంక పెట్టుకొని ఈ సమావేశానికి డుమ్మా కొట్టి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తూన్నారు.   ఓటుకి నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, సెక్షన్: 8పై రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భీకర యుద్ధం నడుస్తున్న సమయంలో కేసీఆర్ తన కుమారుడు మరియు రాష్ట్ర ఐ.టి.శాఖ మంత్రి కె.తారక రామారావుని డిల్లీ పంపించారు. కానీ రాష్ట్రాలకు నిధులు కేటాయించే మఖ్యమయిన అంశంపై ప్రధానమంత్రి స్వయంగా నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ డుమ్మా కొట్టడం విశేషం. బహుశః ఆయన ఆ విధంగా కేంద్రానికి తన అసమ్మతిని తెలియజేయాలనుకొన్నారేమో? కానీ ఏవో కారణాల చేత ఇటువంటి కీలక సమావేశానికి కేసీఆర్ వెళ్ళకపోవడం వలన రాష్ట్రానికి నష్టం కలిగే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రులకి కేంద్రంపై ఎటువంటి అభిప్రాయాలున్నప్పటికీ, కేంద్రంతో ఎల్లప్పుడూ సత్సంబంధాలు నిలుపుకొన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.

పుష్కరాలపై శవారాజకీయాలేల?

  గోదావరి పుష్కరాల తొలిరోజే ఏకంగా 27మంది భక్తులు త్రొక్కిసలాటలో మృత్యువాత పడటం అందరినీ కలచివేస్తోంది. ఎంత విపత్కర పరిస్థితుల్లో నయినా ఎంతో నిబ్బరంగా వ్యవహరించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంట తడిపెట్టి, తన వల్లే ఈ తప్పు జరిగిందని ప్రజలు భావిస్తే క్షమించమని పుష్కర యాత్రికులని కోరడం గమనిస్తే జరిగిన దానికి ఆయన ఎంత బాధ పడుతున్నారో అర్ధం అవుతుంది. ఈ పుష్కరాలకు రాబోయే ప్రజలకి వీలయినంత సౌకర్యంగా, ఆహ్లాదంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడే వాతావరణం కల్పించి పుష్కరాలను ఎంతో గొప్పగా జయప్రదంగా నిర్వహించాలని ఆయన గత నెలరోజులుగా అహర్నిశలు పనిచేస్తూ అధికారులను, మంత్రులను కూడా పరుగులెత్తిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇదంతా ఆయన తన వ్యక్తిగత ప్రచారం కోసమే చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకవేళ ఆయన ఈ పుష్కరాల ఏర్పాట్ల బాధ్యతలను వేరొకరికి అప్పగించి ఉంటే, అప్పుడు కూడా ప్రతిపక్షాలు ఆయన చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని నిందించకమానవు.   ఈ ప్రమాదంలో మృతి చెందినవారి ఒక్కొక్క కుటుంబానికి ఆయన రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తే, మనుషుల ప్రాణాలకు ఆయన వెలకడుతున్నరంటూ దానినీ వారు తప్పుపడుతున్నారు. మళ్ళీ వాళ్ళే కనీసం రూ.25లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన దీనిపై న్యాయ విచారణకు ఆదేశిస్తే జగన్మోహన్ రెడ్డి దానినీ తప్పు పడుతున్నారు. ఒకవేళ వేయకపోయుంటే అప్పుడూ ఆయన తప్పుపట్టేవారే. ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూసే ప్రతిపక్షాలు ఈ దుర్ఘటనకు ఆయనే బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరుతున్నాయి. కానీ ఇటువంటి కీలక సమయంలో పుష్కరాలకు తరలివస్తున్న ప్రజలకు దైర్యం కల్పించి వారికి అండగా నిలువవలసిన ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేయడం శోచనీయమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.   పుష్కర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం వలననే ఈ దుర్ఘటన జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పుష్కర ఘడియలు ఆరంభం కాక మునుపే ఆయన కుటుంబ సమేతంగా పుష్కర స్నానం చేయడం వలననే ఈ దుర్ఘటన జరిగిందని వైకాపా నేతల వాదన. చంద్రబాబు వి.ఐ.పి. ఘాట్ లో పుష్కర స్నానం చేయకుండా కోటగుమ్మం ఘాట్ లో స్నానం చేయడం వలననే ఈ దుర్ఘటన జరిగిందని జగన్ వాదిస్తున్నారు. ఈ విధంగా ప్రతిపక్ష నేతలు తమ మేధాశక్తికి పదునుబెట్టి రకరకాల కారణాలు వెతికిపట్టుకొని చెప్పడం చూస్తుంటే బోడి గుండుకి మోకాలుకీ ముడేసినట్లుగా ఉంది తప్ప ఈ సమస్యకు అసలు కారణాలను వివరిస్తున్నట్లు లేదు. వారు తమ ఈ మేధాశక్తిని, తర్కాన్ని పుష్కరాలు ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేందుకు ఉపయోగించి ఉండి ఉంటే అందరూ హర్షించేవారు.   అధికార, ప్రతిపక్ష రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ, లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలను నియంత్రించడంలో పోలీసులు, పుష్కర నిర్వాహకులు విఫలమయ్యారు కనుకనే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం అవుతోంది. కానీ అందుకు పూర్తిగా వారినే బాధ్యులని చేయడం కూడా సరికాదు. ఎందుకంటే పుష్కరాలు మొదలయిన మొదటిరోజే రాజమండ్రిలోకి ఏకంగా 10 లక్షల మందికి పైగా ప్రజలు ప్రవేశించారు. అంటే అప్పటికే నిండుగా ఉన్న ఆ పట్టణంలోకి మరో పట్టణానికి సరిపోయేంత మంది ప్రజలు ఒకేసారి ప్రవేశించినట్లయింది. మొదటిరోజే అంతమంది వస్తారని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఊహించ లేకపోయింది. కనుకనే విఫలమయింది. కానీ ఈ దుర్ఘటన జరిగిన తరువాత పుష్కర నిర్వాహకులు, ప్రభుత్వం చేతులెత్తేయకుండా తక్షణమే మరింత విస్త్రుతమయిన ఏర్పాట్లు చేయడంతో రెండవరోజున కూడా ఇంచుమించు అంతే మంది ప్రజలు వచ్చినా పుష్కరాలు చాలా సజావుగా సాగిపోతున్నాయి. కనుక ఈ పుష్కరాలు పూర్తయ్యే వరకు ప్రతిపక్షాలు ప్రజలలో ఎటువంటి ఆందోళన రేకెత్తించకుండా ప్రశాంతంగా జరిగేందుకు సహకరిస్తే బాగుంటుంది. ఆ తరువాత వారు అధికార పార్టీతో, ప్రభుత్వంతో ఎన్ని రాజకీయ చదరంగాలు ఆడుకొన్నా ఎవరికీ అభ్యంతరం ఉండబోదు.

రాజకీయాలలో దుస్సంప్రదాయలు నెలకొల్పితే

  తెదేపా ఎమ్మేల్యే సండ్ర వెంకట వీరయ్యకు మంగళవారం నాడు ఎసిబి కోర్టు బెయిలు మంజూరు చేయగానే, ఎసిబి అధికారులు మళ్ళీ మరొకరికి నోటీసులు జారీ చేయడం ఆశ్చర్యం కలిగించినా అది ఊహించిన పరిణామమేనని చెప్పవచ్చును. ఇంతకు ముందు తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్ధి వేం నరేందర్ రెడ్డికి నోటీసులు జారీ చేసి ప్రశ్నించిన ఎసిబి అధికారులు ఈసారి బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆయన కుమారుడు కృష్ణ కీర్తన్ కి నోటీసులు జారీ చేసారు. అది కూడా 24గంటలలోగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఆయన పేరు కూడా పోన్ కాల్స్ జాబితాలో ఉంది కనుక ప్రశ్నించడానికి పిలుస్తున్నట్లు సమాచారం.   పైకి ఇది కేసుకి సంబంధించి జరుగుతున్న విచారణగా కనిపిస్తున్నప్పటికీ, ఇది ముమ్మాటికీ తెలంగాణా తెదేపా నేతల మనోదైర్యాన్ని దెబ్బ తీయడానికేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తికి ఎసిబి అధికారులు నోటీసులు పంపి విచారణకి పిలవడం, అది కూడా కేవలం 24గంటల వ్యవధిలో తమ ముందు హాజరు కావాలని కోరడం ద్వారా వేం నరేందర్ రెడ్డి కుటుంబంపై తీవ్ర ఒత్తిడి సృష్టించేందుకేనని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదివరకు తెదేపా ఎమ్మేల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తరువాత, ఆయన ఇంట్లో ఎసిబి అధికారులు శోదాలు చేయడం, ఆయన భార్యని కూడా ప్రశ్నించడం వంటివన్నీ అందులో భాగంగా చేస్తున్నావేనని వారు అభిప్రాయ పడుతున్నారు.   ఈవిధంగా కేసుకి సంబంధం ఉందనే ఏదో ఒక మిషతో తెదేపాతో సంబంధం ఉన్న వారందరికీ నోటీసులు పంపుతూ ఒత్తిడికి గురిచేయడం ద్వారా వారిని తెరాసలోకి ఆకర్షించడమే తెరాస ప్రభుత్వ లక్ష్యంగా కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే నిజమయితే ఈ నోటీసుల తంతు ఇక నిరంతర ప్రక్రియగా కొనసాగే అవకాశం ఉందని భావించవచ్చును. పాములతో ఆడుకొనేవాడు పాము కాటుకి బలయినట్లు, కత్తులు, తుపాకులు, బాంబులతో ఆడుకొనేవాడు చివరికి వాటికే బలయినట్లుగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఇటువంటి దుస్సంప్రదాయాలకు శ్రీకారం చుడితే మళ్ళీ ఏదో ఒకనాడు వారు కూడా వాటికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తమిళనాడులో రాజకీయాలను గమనిస్తే అర్ధమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మున్సిపల్ కార్మికులు లేకుండా ప్రజా ప్రతినిధులు స్వచ్చ భారత్ అమలుచేయగలరా?

  ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు అమలుచేస్తున్నాయి. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట దానిని అంతగా పట్టించుకోకపోయినా తరువాత మరేమయిందో కానీ చంద్రబాబు నాయుడు కంటే ఆయనే ఎక్కువ హడావుడి చేసారు. హైదరాబాద్ లో మురికివాడలన్నీ స్వయంగా పరిశీలించి స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని అమలుచేయించారు. కానీ గత వారం రోజులుగా జరుగుతున్న మునిసిపల్ కార్మికుల సమ్మెతో అదంతా బూడిదలో పోసిన పన్నీరయిపోయింది.   మునిసిపల్ శాఖని స్వయంగా ముఖ్యమంత్రే చూస్తున్నప్పటికీ, సమస్య ఇంతవరకు రావడాన్ని రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ తప్పు పడుతున్నాయి. ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వంలో మంత్రులు అందరూ పుష్కరాల పైనే దృష్టి పెడుతున్నారు తప్ప అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలే ఈ వర్షాకాలం సమయంలో రాష్ట్ర రాజధానిలో నానాటికి పేరుకుపోతున్న చెత్తను తొలగించేందుకు ఎటువంటి చర్యలు చేప్పట్టడంలేదని విమర్శిస్తున్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధికి, పుష్కరాల నిర్వహణకు వందల కోట్లు వెచ్చిస్తున్న తెలంగాణా ప్రభుత్వం మునిసిపల్ కార్మికుల వేతనాలు పెంచడానికి ఎందుకు వెనుకాడుతోందని వామపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.   ప్రభుత్వోద్యోగులు సమ్మె చేస్తే వారికి అడిగిన దానికంటే మరొక్క శాతం ఎక్కువే జీతాలు పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్, మునిసిపల్ కార్మికుల పట్ల ఎందుకు కటినంగా వ్యవహరిస్తున్నారు? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. వారు కూడా తెలంగాణా రాష్ట్ర సాధనలో ఉద్యమించిన సంగతిని కేసీఆర్ గుర్తుంచుకొని వారి న్యాయమయిన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన సూచించారు.   ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా మునిసిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం వారితో చర్చలు జరుపుతోంది. కానీ ఇంకా సమస్య అలాగే ఉంది. స్వచ్చ భారత్ కార్యక్రమంలో సినీ తారలు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు, మంత్రులు చాలా మందే పాల్గొని ఉండవచ్చును. కానీ ఆ కార్యక్రమం విజయవంతంగా అమలు కావాలంటే మొట్ట మొదట మునిసిపల్ కార్మికుల చేయిపడాలి. రెండు రాష్ట్రాలలో మునిసిపల్ శాఖలలో పనిచేస్తున్న మహిళా కార్మికులు సైతం రేయింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు కనుకనే రెండు రాష్ట్రాలలో చెత్త ఎప్పటికప్పుడు తొలగింపబడుతోందనే సంగతి చాలా మంది ప్రజలకి తెలియక పోవచ్చునేమో కానీ ప్రభుత్వాలకు తెలుసు. అటువంటప్పుడు వారి సేవలకు తగినంత ప్రతిఫలం ఇవ్వడానికి ప్రభుత్వాలు ఎందుకు జంకుతున్నాయో తెలియదు.   మునిసిపల్ కార్మికులు పనిచేయడం మానివేస్తే అంటూ వ్యాధులు ప్రబలితే దానిని అరికట్టలేక మంత్రులు పదవులే కోల్పోయిన సంఘటనలు చూసారు. కనుక స్వచ్చ భారత్ అంటూ ప్రజాప్రతినిధులు హడావుడి చేయడం కంటే ముందు మునిసిపల్ కార్మికులకు అండగా నిలబడితో స్వచ్చ భారత్ చేసినట్లే!

ముందు ఇంటిని చక్కదిద్దుకోకుండా పాదయాత్రలేల?

  కాంగ్రెస్ పార్టీని ఏవిధంగా ఉద్దరించాలని ఆలోచించేందుకు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు నెలలపాటు విదేశాలలో తిరిగివచ్చేరు. ఆ తరువాత ప్రధాని మోడీని, ఎన్డీయే ప్రభుత్వాన్ని ఆయన దైర్యంగా ఎడాపెడా విమర్శించేస్తుండటంతో కాంగ్రెస్ నేతలు చాలా ఆశ్చర్యపోయారు, సంతోషించేరు కూడా. కానీ రెండు నెలలు స్వదేశంలో తిరిగేసరికి ఆయన పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చేసినట్లుంది. గత పదేళ్ళలో ఆయన పార్టీపై ఎటువంటి ప్రభావం చూపలేకపోయినా ఇప్పుడయినా చూపుతారనుకొంటే అటువంటి సూచనలేవీ కనబడటం లేదు. జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో గానీ కాంగ్రెస్ పార్టీని బలపరిచేందుకు ఈ రెండు నెలల్లో ఆయన చేసిన ప్రయత్నం ఏమీ కనబడలేదు. ఆయన విదేశాల నుండి తిరిగి వచ్చిన తరువాత భూసేకరణ చట్టానికి మోడీ ప్రభుత్వం చేసిన సవరణలను వ్యతిరేకిస్తూ ప్రసంగాలు, పాదయాత్రలు చేయడం తప్ప మరేమీ చేయలేదు.   ఇంతకు ముందు ఆయన తెలంగాణాలో పర్యటించినందువలన కాంగ్రెస్ పార్టీకి ఏమి ప్రయోజనం కలిగిందో ఎవరికీ తెలియదు. కానీ పార్టీలో నుండి బయటకు పోయేవారు పోతూనే ఉన్నారు. ఈనెల 24వ తేదీన ఆయన అనంతపురం జిల్లా కేంద్రం నుండి కొండకర్ల గ్రామం వరకు పాదయాత్ర చేస్తారని ఏపి పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలిపారు. షరా మామూలుగానే రాహుల్ గాంధీ ఉరుకుల పరుగుల మీద తన పాదయాత్ర పూర్తిచేసుకొని , పనిలోపనిగా తెదేపా ప్రభుత్వం కొన్ని విమర్శలు చేసిపోతారు. కానీ దాని వలన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేమిటి? అంటే ఏమీ ఉండదనే చెప్పవచ్చును.   ఇప్పటికే రాష్ట్రంలో సగం మంది కాంగ్రెస్ నేతలు రాష్ట్ర విభజన దెబ్బకి రాజకీయ సన్యాసం తీసుకోగా, మరికొంత మంది వేరే పార్టీలలోకి వెళ్లిపోతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తప్ప పార్టీలో మిగిలినవారు ప్రజలకు మొహాలు చూపించి చాలా కాలమే అయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నప్పుడు దానిని మళ్ళీ పునర్జీవింపజేసుకొనే ప్రయత్నాలు చేయకుండా రాహుల్ గాంధీ తన స్వంత ప్రచారం కోసం పాదయాత్రలు చేస్తుండటం గమనిస్తే ఆయన ఒక దశ దిశా లేకుండా ముందుకు సాగుతున్నట్లుంది. మరి రెండు నెలలపాటు విదేశాలలో తిరిగి ఆయన కనుగొన్నదేమిటో ఆయనకే తెలియాలి.   ఇంతవరకు సోనియా గాంధీయే పార్టీకి నాయకత్వం వహిస్తున్నారనే భావన ప్రజలలో, పార్టీ నేతలలో, కార్యకర్తలలో నెలకొని ఉండేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరి నేతృత్వంలో ముందుకు సాగుతోందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. మాజీ పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, డి. శ్రీనివాస్ వంటి సీనియర్ నేతలు పార్టీని వీడిపోతుంటే వారిని ఎవరూ ఆపకపోవడం గమనిస్తే రాహుల్ గాంధీ పెత్తనం చేస్తున్నట్లు కనబడుతుంది. కానీ దశదిశా లేకుండా ముందుకు సాగుతున్న రాహుల్ గాంధీని గమనిస్తే నేటికీ సోనియా గాంధీయే వెనుక నుండి పార్టీని నడిపిస్తున్నట్లనిపిస్తుంది. కనుక సోనియా, రాహుల్ గాంధీలలో ఎవరు పార్టీకి నాయకత్వం వహించాలనే విషయంపై ఒక స్పష్టతకు వచ్చిన తరువాత పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకొనేందుకు అవసరమయిన చర్యలు చెప్పట్టడం వలన కాంగ్రెస్ పార్టీకి ఏమయినా ప్రయోజనం ఉంటుంది తప్ప రాహుల్ గాంధీ ఇటువంటి ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రయోజనం ఉండదు.

రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి షేమ్ టు షేమ్!

  రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ఆంద్రప్రదేశ్ లో క్రమంగా తుడిచిపెట్టుకుపోతోంది. ఎన్నికలకు ముందే ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇతర పార్టీలలోకి వెళ్లిపోగా, ఉండవల్లి, లగడపాటి, హర్షకుమార్ వంటి మరి కొంతమంది తమ పార్టీ అధిష్టానం కొట్టిన దెబ్బకి రాజకీయ సన్యాసం తీసుకోవలసి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మాత్రమే ప్రధానంగా కనబడుతున్నారు. ఇక మిగిలిన వారు ఎక్కడున్నారో...ఏమి చేస్తున్నారో...అసలు పార్టీలోనే ఉన్నారో లేదో...అనే విషయం ఎవరికీ తెలియదు. పదేళ్ళ పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని ఏకచత్రాధిపత్యంగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి అకస్మాత్తుగా ఇటువంటి దుస్థితి కలగడం ఆశ్చర్యంగానే ఉన్నా అది స్వయంకృతాపరాధమే కనుక ఎవరినీ నిందించవలసిన అవసరం లేదు. దానికి ఆ అవకాశం లేదు కూడా.   అగమ్యగోచరంగా ఉన్న తమ పార్టీ పరిస్థితి చూసి మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అంతటివాడు పార్టీలో నుండి బయటకి దూకేసి వైకాపాలో చేరిపోతే ఇక మిగిలిన నేతల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చును. ఆయన తరువాత తాజాగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. ఆయన సోమవారం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరబోతున్నట్లు తాజా సమాచారం. బొత్స సత్యనారాయణ వైకాపాలో చేరడాన్ని ఆ పార్టీలో నేతలు చాలా మంది వ్యతిరేకించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ వ్యతిరేకతని అధిగమించడానికే కాంగ్రెస్ పార్టీలో తనకు సన్నిహితులుగా ఉన్నవారిని వైకాపాలో చేర్చేందుకు ఆయన గట్టిగా ప్రయత్నించవచ్చును. బహుశః ఆ ప్రయత్నంలో భాగంగానే డొక్కాను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించారేమో కూడా. అదే నిజమయితే బహుశః ఇక మున్ముందు కాంగ్రెస్ పార్టీ నుండి వైకాపాలోకి వలసలు జోరందుకొంటాయేమో?   ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా ఉన్నందున కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీలలోకి వెళ్లిపోతుంటే, తెలంగాణా రాష్ట్రంలో తెరాస ధాటిని తట్టుకొని నిలబడలేమనే నిశ్చితాభిప్రాయంతోనో లేక తెరాస వేస్తున్న ఎరలకు ఆశపడో కాంగ్రెస్ నేతలు తెరాసలోకి వెళ్లిపోతున్నారు. ఇంతకు ముందు చాలా మంది కాంగ్రెస్ నేతలు తెరాసలోకి వెళ్లిపోయారు. తాజాగా మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వెళ్లిపోవడంతో రెండు రాష్ట్రాలలో పీసీసీ అధ్యక్షులే స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టడానికి నడుం బిగించినట్లయింది.   కాంగ్రెస్ పార్టీ దేశానికి, రాష్ట్రానికి చాలా నష్టం, అపకారం కలిగించి ఉండవచ్చును. కానీ ఆ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం తన పార్టీ నేతలకి అపారమయిన స్వేచ్చ, పదవులు, అధికారం, సమాజంలో గౌరవం కల్పించింది. అందుకు బదులుగా రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ నేతలు పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు చేయకపోగా పార్టీని విడిచి వేరే పార్టీలలోకి తరలివెళ్లిపోతున్నారు. అందుకు కూడా కాంగ్రెస్ అధిష్టానం తనను తానే నిందించుకోవలసి ఉంటుంది. బహుశః రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఎన్నికలు అయ్యేవరకు వాయిదా వేసి ఉండి ఉంటే రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పరిస్థితి మరోలా ఉండేదేమో? అంతేకాక రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా, తెలంగాణా కాంగ్రెస్ నేతలను పక్కనబెట్టి వేరేవరినో చంకనెక్కించుకోవడం చేతనే వారి నమ్మకాన్ని కోల్పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బయటకి పోతున్ననేతలు, వారిని కాంగ్రెస్ పార్టీ నిందించుకొంటున్నాయి. కానీ తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి పై నుండి క్రింద వరకు అందరూ బాధ్యులేనని చెప్పక తప్పదు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో? కానీ ఇప్పటికయినా కాంగ్రెస్ అధిష్టానం (రాహుల్? సోనియా?) మేల్కొని పార్టీని కాపాడుకొనే ప్రయత్నాలు చేయకపోతే వచ్చే ఎన్నికల నాటికి రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ కనబడకుండాపోవడం తధ్యం.

భారత్ వ్యతిరేకతే పాక్ ప్రభుత్వానికి శ్రీరామ రక్ష?

  పాకిస్తాన్ తో భారత్ రాజీకి ప్రయత్నించిన ప్రతీసారి ఆ దేశ నేతలు చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటారు. అంతేకాదు మరిచిపోకుండా సరిహద్దుల వద్ద భారత సైనికులపై కాల్పులకు కూడా తెగబడుతుంటారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ తన రష్యా పర్యటనలో రేపు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో సమావేశం అవ్వబోతున్నారు కనుక మళ్ళీ అటువంటి కవ్వింపు చర్యలే ఎదురయ్యాయి.   పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ మీడియాతో మాట్లాడుతూ “అణు బాంబులు కేవలం ప్రదర్శన కోసం మా వద్ద ఉంచుకోలేదు. మమ్మల్ని మేము రక్షించుకొనేందుకు అవసరమయితే వాటినీ ప్రయోగించడానికి సైతం వెనుకాడబోము. కానీ వాటిని ప్రయోగించే అవసరం రాకూడదనే మేము భగవంతుడిని ప్రార్ధిస్తున్నాము,” అని అన్నారు. సరిగ్గా ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర సరిహద్దు బారాముల్లా సెక్టార్ లో పాక్ సైనికులు అకస్మాత్తుగా భారత సైనికులపై కాల్పులు జరపడంతో ఒక భారత జవాను మరణించాడు. భారత సైనికులు వారి కాల్పులను సమర్ధంగా బదులిచ్చారు.   భారత్ తో తాము ఎల్లప్పుడూ శాంతినే కోరుకొంటామని చెప్పే పాకిస్తాన్, భారత, పాక్ ప్రధానులు సమావేశమయ్యే సమయంలో ఈ విధంగా సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడటం, అవసరమయితే అణుబాంబు ప్రయోగిస్తామని పాక్ రక్షణ మంత్రి బెదిరించడం చూస్తే పాక్ ప్రభుత్వ మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన ఉండదని స్పష్టమవుతోంది. అటువంటప్పుడు ప్రధానమంత్రులు ఇరువురూ ఎన్ని సార్లు సమావేశామయినా ప్రయోజనం ఏముంటుంది? కానీ పాకిస్తాన్ ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తోందంటే బహుశః వాపును చూసి బలుపు అని భ్రమిస్తూ యుద్దవాంఛతో రగిలిపోతున్న పాక్ సైన్యాధికారులు, ఐ.యస్.ఐ. అధికారులు పాక్ ప్రభుత్వంపై కర్ర పెత్తనం చేస్తునందునే కావచ్చును. వారి మాటను కాదని పాక్ ప్రధాని భారత్ తో సఖ్యత కోరుకొన్న మరుక్షణం అతను లేదా ఆమె తన పదవిని, ప్రాణాలని కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది.   భారత సేనలు ప్రధాని కనుసైగతో శత్రుసేనలను డ్డీ కొనేందుకు సిద్దంగా ఉంటే, పాక్ సేనలు మాత్రం తమ ప్రధాని నుదుటనే తుపాకి పెట్టి భారత్ తో సంధి ప్రయత్నాలు జరుగకుండా అడ్డుపడుతున్నాయి. భారత్, పాక్ దేశాలు రెండూ ఒకేసారి స్వాతంత్ర్యం పొందినా, పాక్ లో మాత్రం ప్రజా ప్రభుత్వాలు ఎన్నడూ సజావుగా సాగలేదు. అక్కడ పేరుకి ప్రజాప్రభుత్వాలున్నా వాటిని నియంత్రించేది మాత్రం పాక్ సైన్యాధికారులే! కనుక పాక్ లో ప్రజాస్వామ్యం నేతి బీరకాయలో నెయ్యి వంటిదేనని చెప్పవచ్చును. పాక్ చరిత్ర చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. పాక్ లో పరోక్షంగా సైనిక పాలన సాగుతున్నప్పుడు, వారిని కాదని పాక్ ప్రభుత్వాలు భారత్ తో సత్సంబంధాలు పెట్టుకోవడం అసంభవమే. అందుకే భారత్ వ్యతిరేకతే పాక్ ప్రభుత్వ విధానంగా పాటించక తప్పడం లేదు. అందుకే భారత్ ఎన్ని సార్లు ప్రయత్నించినా పాక్ తో సత్సంబంధాలు మాత్రం సాధ్యం కావడం లేదని చెప్పవచ్చును. కానీ పిచ్చోడి చేతిలో రాయిలా పాక్ యుద్దోన్మాదుల చేతిలో అణుబాంబులున్నప్పుడు భారత్ ఎల్లప్పుడూ తన జాగ్రత్తలో తాను ఉండటమే మంచిదని పాక్ రక్షణ మంత్రి మాటలే సూచిస్తున్నాయి.

తెరాస బలపడితే తెలంగాణా బలపడినట్లేనా?

  తెలంగాణాలో తెరాస బలపడితే తెలంగాణా బలపడినట్లేనని తెరాస అధినేత కేసీఆర్ ఒక సరికొత్త సిద్దాంతం ఆవిష్కరించారు. తెలంగాణా ప్రజలను, తెలంగాణా (రాజకీయ) శక్తులను కలిపే నాయకత్వం ఉంటే తెలంగాణా సమాజం అంతా ఒక్కటవుతుందని తను గతంలోనే చెప్పానని అదే ఇప్పుడు క్రమంగా నిజమవుతోందని కేసీఆర్ అన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తెరాసలో చేరిన సందర్భంగా కేసీఆర్ ఈవిధంగా చెప్పడం గమనిస్తే ఆయన అంతర్యం ఏమిటో అర్ధమవుతోంది. తెలంగాణాలో కేవలం తెరాస పార్టీ మాత్రమే ఉండాలని ఆయన చెప్పకనే చెపుతున్నారు. తెలంగాణా (రాజకీయ) శక్తులన్నీ ఏకం కావడం అంటే అన్ని పార్టీలలో నేతలు వచ్చి తెరాసలో చేరడమేనని చెప్పవచ్చును. వారిని కలిపే బలమయిన నాయకత్వం అంటే తన నాయకత్వమేనని వేరేగా చెప్పనవసరం లేదు. అన్నిశక్తులు తెరాసలో చేరిపోతే ఇక ఆ పార్టీకి రాష్ట్రంలో పోటీయే ఉండదు. అందుకే తెలంగాణాలో శక్తులు (?) అన్నీ ఏకమవ్వాలని ఆయన కోరుకొంటున్నట్లు అర్ధమవుతోంది.     ఒక్క తెరాస తప్ప మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కూడా తెలంగాణా రాష్ట్రానికి, ప్రజలకి పరాయివేనని చెపుతున్నట్లుంది. అంటే తెలంగాణాలో ఉన్న కాంగ్రెస్, తెదేపా, బీజేపీ, వామపక్ష పార్టీలు తెలంగాణా ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకొనే శక్తి కానీ, రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత గానీ లేదని చెపుతున్నట్లుంది.కనుక దీనికి ఏకైక పరిష్కారంఆ పార్టీలన్నీ వచ్చి తెరాసలో విలీనమయిపోవడమే. తెలంగాణా రాష్ట్రం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కూడా సరిగ్గా ఇటువంటి షరతే ఆయనకీ పెట్టింది. కానీ ఆయన దానికి అంగీకరించలేదు. కనీసం కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు ఆయన అన్ని శక్తులు (?) తెరాసలో కలవాలని ఆశిస్తున్నారు!   తెలంగాణాలో తెరాస తప్ప మరొక రాజకీయ పార్టీయే ఉండకూడదనే తన బలమయిన కోరికను ఆయన చాలా లౌక్యంగా, చాలా అందంగా చెపుతున్నారు. ఒకవేళ తెలంగాణాలో తెరాస పార్టీ ఒక్కటే ఉండాలనుకొంటున్నట్లయితే, ఇంక తెలంగాణాలో ఎన్నికలు కూడా అవసరం లేదనే చెప్పవచ్చును. చాలా గొప్ప ఆలోచనే! కానీ మన ప్రజాస్వామ్య దేశంలో అటువంటి గొంతెమ్మ కోరికలు ఎన్నటికీ తీరే అవకాశమే లేదని ఆయనకీ తెలుసు. అలాగని ప్రయత్నా లోపం ఉండకూడదు కనుకనే ఆయన ఇతర పార్టీలకు చెందిన నేతలని ఏదోవిధంగా తెరాసలోకి ఆకర్షిస్తున్నారనుకోవలసి ఉంటుంది. దానికే ఆయన తెలంగాణా శక్తుల ఏకీకరణ అనే అందమయిన పదం తగిలించి చెపుతున్నారు.   ఇదివరకు మనదేశంలో చాలా మంది రాజకీయ నాయకులు ఇటువంటి ఆలోచనలే చేసారు. కానీ ఎవరూ ఇంతవరకు సఫలం కాలేదు. ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరాగాంధీ సైతం తన నిరంకుశ ధోరణితో కొంత కాలమే రాజకీయాలను శాసించగలిగారు. కానీ అదే ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యానికి బద్దురాలయి ఉన్నంత కాలం నిరాటంకంగా రాజ్యం ఏలగలిగారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న గొప్ప లక్షణం అదే. కనుక కేసీఆర్ కావచ్చు లేదా మరొకరు కావచ్చు ఈ చిన్న సూత్రాన్ని ఆకళింపు చేసుకొని ప్రజాస్వామ్య వ్యవస్థని గౌరవించి, అంగీకరించి ప్రజలను మెప్పించే పరిపాలన, వారి జీవన ప్రమాణాలు పెంచే విధంగా రాష్ట్రభివృద్ధి చేసి చూపగలిగితే ఎదురు లేకుండా పరిపాలించుకోవచ్చును.   కానీ కేవలం తమ పార్టీ మాత్రమే ప్రజల ఆకాంక్షలకి అద్దం పట్టగలదని, తమ పార్టీయే రాష్ట్రానికి ప్రతిరూపమని కనుక అది బలపడితే రాష్ట్రం కూడా బలపడుతుందని భావిస్తే అంతకంటే పొరపాటు మరొకటి ఉండబోదు. రాజకీయపార్టీలు ఏవయినా సరే దేశంలో అంతర్భాగమే తప్ప అవే దేశానికో ఒక జాతికో ప్రతిరూపం కాలేవు. ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు మాత్రమే దేశంలో లేదా రాష్ట్రంలో ఆ పార్టీ జెండాలు రెపరెపలాడవచ్చును. ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తోంది కనుక పరిపాలన చేయవచ్చును. తన ఆలోచనలను, సిద్దాంతాలను, వ్యూహాలను అమలు చేయవచ్చును. అవి ప్రజలకి నచ్చినట్లయితే మళ్ళీ అధికారం కట్టబెడతారు. లేదంటే   రేపు మరొక పార్టీకి అధికారం కట్టబెడతారు. అప్పుడు మళ్ళీ జెండాలు, ఆలోచనలు, సిద్దాంతాలు మారిపోతాయి. ఇది అందరూ కళ్ళారా చూస్తున్నదే. తెరాస, తెదేపాలపై ప్రజలు నమ్మకం ఉంచి అధికారం కట్టబెట్టారు. కనుక అవి ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి లోబడి రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో ముందుకు తీసుకుపోగలిగితే అనూహ్యమయిన ఇటువంటి సిద్ధాంతాలు ప్రతిపాదించనవసరం ఉండదు.      

పవన్ కళ్యాణ్ ప్రసంగంపై విమర్శల వర్షం

  ఏడాదికో...ఆర్నెల్లకో...ఓసారి రాజకీయాల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్, మాట్లాడిన ప్రతీసారి విమర్శలు మూటగట్టుకొంటూనే ఉన్నారు. మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలపై రెండు రాష్ట్రాలకి చెందిన నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. చివరికి మిత్రపక్షమయిన తెదేపా నేతల నుండి కూడా విమర్శలు ఎదుర్కోక తప్పలేదు. తెలంగాణా నేతలు, ఆయన చంద్రబాబు నాయుడుని వెనకేసుకు వచ్చేరని విమర్శిస్తుంటే, ఆంధ్రా నేతలు ఆయన హైదరాబాద్ లో తన ఆస్తులను కాపాడుకొనేందుకే సెక్షన్: 8ని వ్యతిరేకిస్తూ కేసీఆర్ ని ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నించారని విమర్శిస్తున్నారు.   వ్యాపారవేత్తలు రాజకీయాలలోకి రాకూడదని రాజ్యాంగంలో ఎక్కడా వ్రాసి లేదని అన్నారు కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి. ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్నామా లేదా? అనేదే ముఖ్యం కానీ తము వ్యాపారాలు చేసుకొంటున్నామా? లేదా అనేది ముఖ్యం కాదని అన్నారు. పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవికి కూడా చాలా వ్యాపారాలున్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసారు. (ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే 150వ సినిమా చేసుకొంటున్నారిప్పుడు.)   హైదరాబాద్ లో ఆంద్ర ప్రజల పట్ల తెలంగాణా ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్ష పవన్ కళ్యాణ్ కళ్ళకి కనబడటం లేదా? అని తెదేపా ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ప్రశ్నించారు. ఏపీ ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేయించడం తప్పుగా కనబడలేదా అని తెదేపా యంపీ కొనకళ్ళ నారాయణ ప్రశ్నించారు.   ఏడాదికోసారి నిద్రలేచే ఆయనకి తామేమి చేస్తున్నామో ఎలా తెలుస్తుందని తెదేపా ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. ఇలాగ తమని విమర్శించే బదులు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి పనిచేసి చూపించమని ఆయన సవాలు విసిరారు. తామందరం పార్లమెంటులో ఏ ఏ అంశాల గురించి ఎప్పుడెప్పుడు ఎన్నిసార్లు మాట్లాడామో తెలియకపోతే పార్లమెంటు వెబ్ సైట్ ని చూడమని ఆయన సలహా ఇచ్చేరు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయలేదని తమను విమర్శిస్తున్న పవన్ కళ్యాణ్ ఆ విషయం గురించి ఈ ఏడాది కాలంలో ఒక్కసారయినా మాట్లాడారా? అని కేశినేని నాని ప్రశ్నించారు. (తోటి నటుడు శివాజీ నిరవధిక నిరాహార దీక్ష చేసినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పోరాడేందుకు ముందుకు వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం తప్పకుండా దిగి వస్తుందని శివాజీ పదేపదే విజ్ఞప్తి చేసినా పవన్ కళ్యాణ్ స్పందించలేదు?)   అశోక్‌ గజపతి రాజు విజయవాడ విమానాశ్రయానికి రూ.250 కోట్లు, వైజాగ్‌, తిరుపతి విమానాశ్రయాల అభివృద్ధికిభారీగా నిధులు విడుదల చేసారని మచిలీపట్నం పార్లమెంట్‌ సభ్యులు కొణకళ్ళ నారాయణ రావు అన్నారు. దేని గురించయినా మాట్లడదలచుకొంటే బాధ్యాతయుతంగా మాట్లాడాలని కానీ ఇలా అర్ధం పర్ధం లేని విమర్శలు మానుకోవాలని ఆయన సూచించారు.   పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఏడాదికోసారి రిలీజ్ అయ్యే సినిమావంటిదని అంతకంటే దానికి ఎటువంటి ప్రాధాన్యం లేదని తెలంగాణా మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ప్రసంగంపై స్పందించడం అంటే తన స్థాయిని దిగజార్చుకోవడమేనని మంత్రి హరీష్ రావు అన్నారు.   పవన్ కళ్యాణ్ తను చాలా బాధ్యతగా మాట్లాడుతానని చెప్పుకొన్నారు. కానీ ఆయన మాట్లాడిన మాటలని రెండు రాష్ట్రాలలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు సమర్ధించకపోవడం చూస్తే ఆయన పని రెంటికీ చెడిన రేవడిలా మారినట్లుంది. ఆయన ఈవిదంగా రాజకీయ అభిప్రాయాలు వ్యక్తం చేసి అభాసు పాలవడం కంటే వాటికి దూరంగా ఉండటం మంచిది లేదా కేశినేని నాని సూచించినట్లు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి ప్రజలను మెప్పించినా మంచిదే.

తెలంగాణా తెదేపా నేతలని అలా లొంగదీస్తుందేమో?

  రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎసిబి వేసిన పిటిషన్ న్ని హైకోర్టు, ఆ తరువాత సుప్రీంకోర్టు కూడా తిరస్కరించడంతో ఎసిబికి ఎదురుదెబ్బ తగిలింది. కానీ ఈ కేసు విషయంలో తెలంగాణా ప్రభుత్వం మొదటి నుండి అత్యుత్సాహం చూపుతునందున, ఎసిబి కంటే దానికే ఎదురు దెబ్బ తగిలినట్లుగా అందరూ భావిస్తున్నారు. ఇంతవరకు ఈ కేసులో తెరాస ప్రభుత్వానిదే పైచేయిగా కనబడింది. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టులో రెండు సార్లు వరుసగా ఎదురు దెబ్బలు తగిలిన తరువాత దీనిపై తెలంగాణా ప్రభుత్వం తన పట్టుకోల్పోయిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అసలు ఎసిబి అభ్యర్ధనని హైకోర్టు త్రోసిపుచ్చినప్పుడే తెలంగాణా ప్రభుత్వం వెనక్కి తగ్గి ఉండి ఉంటే ప్రజలలో ఇటువంటి భావన ఏర్పడేది కాదు. కానీ అనవసరమయిన పంతానికి పోయి సుప్రీంకోర్టుకి వెళ్లి భంగపడినట్లయింది.   కనుక ఆ పరాభవం నుండి బయటపడి తిరిగి తన ప్రత్యర్ధులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తుందని అందరూ భావించారు. ఊహించినట్లే ఎసిబి అధికారులు తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకి, ఖమ్మం జిల్లా తెదేపా యువత సభ్యుడు జిమ్మీ అనే వ్యక్తికి విచారణకు హాజరు కమ్మని కోరుతూ నోటీసులు జారీ చేసారు. కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇంతకు ముందు సెక్షన్: 160 క్రింద నోటీసులు జారీ చేయగా ఈసారి సెక్షన్: 41(ఎ) క్రింద నోటీసులు జారీ చేసారు. ఈ సెక్షన్ క్రింద నోటీసులు అందుకొన్న వారిని ఎటువంటి అరెస్ట్ వారెంట్ ఇవ్వకుండానే ఎసిబి అధికారులు అరెస్ట్ చేసే వీలు ఉంటుంది. అంటే ఎసిబి అధికారులు వారిరువురూ విచారణకు హాజరయినప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉందని స్పష్టం అవుతోంది.   వారిని కనుక అరెస్ట్ చేసినట్లయితే, ఇంతకు ముందు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు తెదేపా నేతలు, మంత్రులు ఏవిధంగా ఆందోళన చెంది, ఒత్తిడికి గురయ్యారో ఇప్పుడూ అదేవిధంగా ఇబ్బందిపడటం ఖాయం. అప్పుడు తిరిగి తనదే పైచేయి అవుతుందని తెరాస ప్రభుత్వం భావిస్తోందేమో? అదే దాని వ్యూహమయితే సండ్ర వెంకట వీరయ్య, జిమ్మీల అరెస్ట్ అనివార్యమని భావించవచ్చును. అప్పుడు మళ్ళీ తెదేపా, తెరాస నేతల మధ్య మాటల యుద్ధం మొదలవవచ్చును.   ఇక మరో ముఖ్యమయిన విషయం ఏమిటంటే, ఇంతకు ముందు రేవంత్ రెడ్డి అరెస్టయినప్పుడు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా నేతలందరూ రేవంత్ రెడ్డికి, ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. ఇప్పుడు సండ్ర వెంకట వీరయ్య, జిమ్మీలకి కూడా అదేవిధంగా అండగా నిలబడాల్సి ఉంటుంది. ఈ విషయంలో తెదేపా ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సండ్ర వెంకట వీరయ్యని తెరాస తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేయవచ్చును. అదే కనుక జరిగితే ఈ కేసు కొత్తమలుపు తిరుగవచ్చును.   రేవంత్ రెడ్డి తను జైల్లో ఉన్నప్పుడు కూడా అధికారిక పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు తనను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేసారని చెప్పినట్లు వార్తలు వచ్చేయి. అదే నిజమయితే సండ్ర వెంకట వీరయ్యని కూడా నయాన్నో భయాన్నో లొంగదీసుకొనేందుకు ప్రయత్నాలు జరుగవచ్చును. ఒకవేళ ఈ వ్యూహం ఫలించినట్లయితే మున్ముందు తెదేపా తెలంగాణా నేతలందరి మీద తెరాస ప్రభుత్వం ఇదే అస్త్రం ప్రయోగించినా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఏడాది కూడా జి.హెచ్.యం.సి ఎన్నికలు లేనట్లేనా?

  గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ (జి.హెచ్.యం.సి) బోర్డు కాలపరిమితి గతేడాది డిశంబర్ 3వ తేదీనే ముగిసిపోయింది. తెలంగాణా ప్రభుత్వానికి హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కూడా ఇంతవరకు దానికి ఎన్నికలు నిర్వహించలేదు. చివరికి ఈ ఏడాది డిసెంబర్ 15 లోగా తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గడువు విధించింది.   హైదరాబాద్ లో పెరిగిన జనాభా ప్రాతిపదికన వార్డుల పునర్విభజన చేయవలసి ఉంది గనుకనే ఆలస్యం జరుగుతోందని తెలంగాణా ప్రభుత్వ వాదన. కానీ ఆంధ్రాకి చెందిన ప్రజలు ఎక్కువగా స్థిరపడున్న హైదరాబాద్ లో పోటీ చేసి గెలవలేమనే భయంతోనే తెలంగాణా ప్రభుత్వం జి.హెచ్.యం.సి.కి ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. వాటి ఆరోపణలకు బలం చేకూర్చుతున్నట్లుగానే ఈ ఏడాది కూడా ఎన్నికలు నిర్వహించలేకపోవచ్చునన్నట్లు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంకేతం ఇచ్చేరు.   ఆయన మీడియాతో మాట్లాడుతూ, “వార్డుల పునర్విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. వీలయినంత త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు కృషిచేస్తున్నారు. ఒకవేళ డిసెంబర్ లోగా ఆ ప్రక్రియ పూర్తి కాకపోయినట్లయితే మేము మళ్ళీ హైకోర్టుని మరికొంత గడువు కోరుతాము. ఒకవేళ హైకోర్టు అందుకు అంగీకరించకపోయినట్లయితే అవసరమయితే సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చును,” అని అన్నారు.   వార్డుల పునర్విభజనలో ఆలస్యం కారణంగానే జి.హెచ్.యం.సి ఎన్నికలు నిర్వహించడంలో ఆలస్యం జరుగుతోందా లేక తెరాస తనకు రాజకీయంగా అనుకూల పరిస్థితులు ఏర్పడేవరకూ ఎదురుచూస్తూ ఎన్నికలని వాయిదా వేస్తోందా అనే విషయాన్ని పక్కనబెడితే, జి.హెచ్.యం.సి ఎన్నికలకు నిర్వహించక పోవడం వలన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని ‘స్మార్ట్ సిటీ’ గా మలిచేందుకు ఏటా విడుదల చేయబోయే రూ.100 కోట్లు వదులుకోవలసి ఉంటుంది. ఎన్నికలు నిర్వహించబడని స్థానిక సంస్థలకి నిధులు విడుదల చేయకూడదనే నిబంధన ఉన్నందున, ఈ ఏడాదిలో హైదరాబాద్ కోసం కేటాయించిన రూ.100 కోట్లు, ఒకవేళ ఎన్నికలను వచ్చే మార్చి నెలాఖరులోగా నిర్వహించలేకపోతే వచ్చే ఏడాదికి మంజూరయ్యే మరో రూ. 100 కోట్లు కూడా కోల్పోకతప్పదు.   ఇదికాక కేంద్ర ప్రభుత్వం వివిధ పధకాల క్రింద స్థానిక సంస్థలకు ఏటా మంజూరు చేసే నిధులు కూడా కోల్పోవలసి ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.100 కోట్ల కంటే తెరాస జి.హెచ్.యం.సి ఎన్నికలలో గెలవడమే ముఖ్యం అని తెలంగాణా ప్రభుత్వం భావించినట్లయితే, మంత్రిగారు చెపుతున్నట్లు మళ్ళీ గడువు కోరుతూ హైకోర్టుకి, అది ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చును. ఛాయిస్ రాష్ట్ర ప్రభుత్వానిదే!

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మళ్ళీ తలెత్తుతున్న వేర్పాటువాదం

  జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో క్రమంగా వేర్పాటువాదం బలం పుంజుకొంటున్న సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయిప్పుడు. ఇంతకు ముందు ఎప్పుడో ఏదో సందర్భంగా భారత వ్యతిరేక నినాదాలు వినిపించేవి. కానీ ఇప్పుడు చాలా తరచుగా శ్రీనగర్ లో వేర్పాటువాదులు భారత వ్యతిరేక బహిరంగసభలు నిర్వహిస్తూ, పాకిస్తాన్ జెండాలను ప్రదర్శిస్తున్నారు. హురియత్ కాన్ఫరెన్స్ వంటి కొన్ని వేర్పాటువాద సంస్థలు రాష్ట్ర యువతలో భారత వ్యతిరేక భావాలు నాటేందుకు చేస్తున్న కృషి ఫలిస్తోందని హురియత్ సభలకు, ర్యాలీలకు నానాటికీ పెరుగుతున్న ఆదరణ చూస్తుంటే అర్ధమవుతుంది. కానీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే ప్రేక్షక పాత్ర పోషిస్తుంటే ఏదో ఒకనాడు పరిస్థితి చెయ్యి దాటిపోయే సూచనలు కనబడుతున్నాయి.   రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, పర్యాటక రంగానికి మరింత ప్రోత్శాహం కల్పించడం, సామాన్య ప్రజలకు లబ్ది కలిగేవిధంగా సంక్షేమ పధకాలను రూపొందించి వాటిని పటిష్టంగా అమలుచేయడం వంటి కొన్ని చర్యలతో పాటు వేర్పాటువాదుల పట్ల చాలా కటినంగా వ్యవహరించగలిగితే మళ్ళీ పరిస్థితులు సాధారణ స్థితికి రావచ్చును. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఈ వేర్పాటువాదాన్ని మట్టుబెట్టవచ్చును.   కానీ అంతకంటే చాలా భయంకరమయిన సమస్య భారత్ కి సవాలు విసరబోతోంది. జనరల్ ఆఫీసర్ కమాండింగ్, 16 కార్పస్, లెఫ్టినెంట్ జనరల్ కె.హెచ్. సింగ్ మీడియాతో మాట్లాడుతూ “మాకు అందుతున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో 200-225 మంది ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు మకాం వేసినట్లు తెలుస్తోంది. పీర్ పించల్ అనే ప్రాంతంలో మొత్తం 36 క్యాంపులున్నట్లు మాకు సమాచారం అందుతోంది. వారు వీలువెంబడి భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించవచ్చును,” అని తెలిపారు.   ఇరాక్, సిరియా తదితర దేశాలలో ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు ఎంత కిరాతకంగా సామూహిక హత్యలు, అత్యాచారాలు చేస్తున్నారో నిత్యం అందరూ చూస్తూనే ఉన్నారు. అటువంటి భయంకరమయిన కరడుగట్టిన ఉగ్రవాదులు ఇప్పుడు మన గుమ్మం వరకు వచ్చేసారని వింటేనే భయంతో ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఇంతవరకు భారత ప్రభుత్వం వేర్పాటువాదులపట్ల, పాకిస్తాన్ తీవ్రవాదులపట్ల చాలా సహనంగా వ్యవహరించింది. కానీ ఇకపై చాలా గట్టిగా స్పందించవలసిన సమయం ఆసన్నమయినట్లు కనబడుతోంది. ఇటీవల భారత కమెండోలు పొరుగునున్న మయన్మార్ దేశంలోకి ప్రవేశించి నాగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లే ఇప్పుడు భారత్ లోకి ప్రవేశించేందుకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి తిష్ట వేసుకొని ఎదురు చూస్తున్న ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులను మట్టుబెట్టవలసి ఉంటుందేమో. లేకుంటే వారే భారత్ లోకి ప్రవేశించి అదును చూసి భయంకర విద్వంసానికి పాల్పడే ప్రమాదం ఉంది.

కాంగ్రెస్ పార్టీకి అభయహస్తం ఇవ్వగల నాయకుడే లేడా?

  రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రెంటికీ చెడిన రేవడి చందంగా మారింది. ఆంధ్రాలో పార్టీని, తన నేతల రాజకీయ భవిష్యత్ ని, చివరికి కోట్లాది ఆంద్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను అన్నిటినీ పణంగా పెట్టి ఆడిన ఎన్నికల జూదంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో కూడా ఘోరంగా ఓడిపోయింది. ఆంద్రప్రదేశ్ లో తమ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని ఆ పార్టీ అధిష్టానానికి చాలా ఖచ్చితంగా ముందే తెలుసు కనుక అంతగా బాధపడి ఉండకపోవచ్చును. కానీ తెలంగాణా ఇచ్చినా గెలవడం మాట అటుంచి కనీసం అక్కడయినా పార్టీ బ్రతికి బట్టకడితే చాలానే స్థితికి చేరుకోవడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశః వచ్చే ఎన్నికల నాటికి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాక తెలంగాణా నుండి కూడా కాంగ్రెస్ పార్టీ మాయం అయిపోయినా ఆశ్చర్యం లేదు.   బంగారు పళ్ళేనికయినా గోడ చేర్పు ఉంటేనే అందం అన్నట్లుగా ఏ రాజకీయ నాయకుడికయినా ఏదో ఒక పార్టీ అండ ఉన్నంత కాలమే అతనికి సమాజంలో విలువ, గుర్తింపు ఉంటుంది. ఆ విషయం మరిచిపోయిన కాంగ్రెస్ నేతలు తమ శక్తిని అతిగా ఊహించేసుకొని తమ వల్లనే పార్టీ బ్రతుకుతోందనే భ్రమలో పార్టీని నిర్లక్ష్యం చేయడం వలననే ఇటువంటి దుస్థితి ఏర్పడిందని చెప్పవచ్చును. నిజమే...కాంగ్రెస్ పార్టీ మహా సముద్రం వంటిది అందులోకి అనేక మంది వచ్చి పోతూనే ఉంటారు. నిజమే...కాంగ్రెస్ పార్టీ పచ్చగడ్డి వంటిదే. నీళ్ళు లేనప్పుడు అది పూర్తిగా నశించిపోయినట్లు పైకి కనబడినా ఏమాత్రం తడి తగిలినా మళ్ళీ మొలకెత్తే గొప్ప లక్షణం ఉన్న పచ్చగడ్డిలాంటిదే కాంగ్రెస్ పార్టీ కూడా. అందుకే అది ఎన్ని ఆటుపోటులెదురయినా తట్టుకొని మళ్ళీ లేచి నిలబడుతుంటుంది. కానీ అందుకోసం రాష్ట్ర నేతలో లేదా కాంగ్రెస్ అధిష్టానమో చాలా బలమయిన ప్రయత్నాలు చేసినందునే ఆ పార్టీ పచ్చగడ్డిలా చిగురిస్తుండేది.   ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందనుకొన్నప్పుడు ఇందిరా గాంధీ, పీవీ నరసింహ రావు వచ్చి దానిని నిలబెట్టారు. రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితి ఎదురయినప్పుడు రాజశేఖర్ రెడ్డి వచ్చి దానిని నిలబెట్టారు. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కానీ కేంద్రంలో గానీ కాంగ్రెస్ పార్టీకి పునర్జన్మ ప్రసాదించగల గొప్ప నాయకులు ఎవరూ కనబడటం లేదు. ఆంద్ర, తెలంగాణాలలో అటు పార్టీ నేతలకి, ఇటు ప్రజలందరికీ ఆమోదయోగ్యుడయిన నాయకుడు ఒక్కడు కనబడటం లేదు.   ఇక కేంద్రంలో పరిస్థితి సరేసరి! ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ నడిపిస్తున్నారా? లేకపోతే రాహుల్ గాంధీ నడిపిస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది. రెండు నెలలు విదేశాలలో తపసు చేసి జ్ఞానోదయం పొందారని చెప్పుకొంటున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతున్న సంగతి ఇంకా గ్రహించారో లేదో తెలియదు కానీ తాను ప్రధాని మోడీకి ఏమాత్రం తీసిపోనని రుజువు చేసుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. యధారాజా తధా ప్రజా అన్నట్లుగా ఒక దశదిశా లేకుండా కాంగ్రెస్ అధిష్టానం సాగుతుంటే, రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీలు కూడా అలాగే సాగుతున్నాయి.   ముందే చెప్పుకొన్నట్లుగా గల్లీ నుండి డిల్లీ వరకు ఉండే ఏ రాజకీయ నాయకుడికయినా పార్టీ యొక్క అండాదండా ఉంటేనే సమాజంలో ఒక విలువ, గుర్తింపు ఉంటుంది. కనుక కాంగ్రెస్ పార్టీలో కూడా అందరూ కలిసి ముందుగా తమ పార్టీని బ్రతికించుకొనే ప్రయత్నం చేయాలి. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఎవరి గోల వారిదే అన్నట్లు తయారయింది. ఎవరూ ఎవరి మాట వినే పరిస్థితి లేదు. (దానినే వారు ప్రజాస్వామ్యం గొప్పగా చెప్పుకొంటుంటారు!) మునిగిపోతున్న కాంగ్రెస్ టైటానిక్ షిప్పులో నుండి నేతలు ఒకరొకరుగా బయటకి దూకేస్తున్నా కూడా కెప్టెన్ రాహుల్ గాంధీ ఇంకా మేలుకోకపోవడం విచిత్రమే. కనుక మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పని అయిపోయినట్లే కనబడుతోంది. కనుక ముందే చెప్పుకొన్నట్లు మళ్ళీ ఎవరో ఒక గొప్ప నాయకత్వ లక్షణాలున్న వ్యక్తి పార్టీలో పుట్టుకొచ్చేవరకు, నీటి చుక్క కోసం ఎదురుచూసే ఎండుగడ్డిలా కాంగ్రెస్ పార్టీ ఎదురుచూడక తప్పదు.

ఎదుటవాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి

  రాష్ట్ర విభజన చేసినట్లయితే తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయించి తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేలా చేస్తామని సోనియా గాంధీకి హామీ ఇచ్చిన టీ-కాంగ్రెస్ నేతల్లో డి.శ్రీనివాస్ కూడా ఒకరు. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులుగా పేర్కొనబడే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్ వంటి అనేకమంది రాష్ట్ర విభజన చేస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తిగాతుడిచిపెట్టుకుపోతుందని ఆమెను హెచ్చరించినా ఆమె వారి మాటలను పెడచెవిన పెట్టి, శ్రీనివాస్ వంటి నేతలను గుడ్డిగా నమ్మి హడావుడిగా రాష్ట్ర విభజన చేసేసి ఇప్పుడు చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్లు విచారిస్తున్నారు. వారందరూ ఆంధ్రాకి చెందిన నేతలు కనుకనే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారని సోనియా గాంధీ భావించారు తప్ప పార్టీ హితవు కోరి చెపుతున్నారని అనుకోలేదు. చివరికి వారు చెప్పినట్లే రెండు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకుపోతోంది.   తెలంగాణా ప్రజల ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేయడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ అదే పని గత పదేళ్లలో ఒక పద్ధతి ప్రకారం శాస్త్రీయంగా చేసి ఉంటే ఎవరికీ అభ్యంతరం కానీ నష్టం గానీ జరిగి ఉండేది కాదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసినప్పటికీ తెలంగాణా ప్రజలు ఆ పార్టీని తిరస్కరించడానికి గల అనేక కారణాల గురించి అందరికీ తెలుసు. కనుక మళ్ళీ వాటినిప్పుడు నెమరు వేసుకోనవసరం లేదు.   కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు హోదా అనుభవించిన డి. శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నేతలు ఇప్పుడు తమ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు దానికి అండగా నిలిచి పార్టీ ఋణం తీర్చుకోవలసింది పోయి తమకు ఈ హోదా, ప్రజలలో ఈ గుర్తింపు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే నిందిస్తూ కుంటి సాకులు చెప్పి కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు దూకేస్తున్నారు. నిత్యం ప్రజలకు, ప్రత్యర్ధ రాజకీయ పార్టీలకు నీతులు, ధర్మపన్నాలు వల్లించే రాజకీయ నాయకులు అధికారం కోసం ఇంతగా తహతహలాడిపోవడం చూసి ప్రజలు కూడా విస్మయం చెందుతున్నారు.   సాధారణంగా ఎన్నికలకు ముందు,ఆ తరువాత మాత్రమే ఇటువంటి రాజకీయ వలసలు చూస్తుంటాము. కానీ తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన తరువాత కూడా ఇతర పార్టీల నేతలని తెరాసలోకి ఆకర్షించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను చూస్తుంటే, తెలంగాణాలో అసలు ప్రతిపక్షమన్నదే ఉండకూడదని తెరాస కోరుకొంటోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమని నమ్మవలసివస్తోంది. తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నామినేటడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ని ప్రలోభపెట్టడం చాలా హేయమయిన చర్య, ప్రజాస్వామ్యాన్ని, దాని విలువలని ఖూనీ చేయడమేనని, అటువంటి వ్యక్తి క్షమార్హుడు కాదని వాదిస్తూ ధర్మపన్నాలు వల్లిస్తున్న అధికార పార్టీ ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? అని ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు రాజకీయ పార్టీలన్నీ ప్రశ్నిస్తున్నాయి.   ఇప్పుడు తెరాస చర్యలను తెలంగాణా వాదులు చాలా గట్టిగా సమర్ధించుకోవచ్చును. కానీ ఏదో ఒకనాడు రాష్ట్రంలో ప్రతిపక్షాలే లేకుండా పోయిననాడు ప్రజాస్వామ్యం స్థానంలో నిరంకుశ పాలన మొదలయితే అప్పుడు తాపీగా వగచక తప్పదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

పవన్ కల్యాణ్ తో వైకాపా మైండ్ గేమ్?

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సమస్యల గురించి కానీ, ఆంద్రప్రదేశ్ పట్ల తెలంగాణా ప్రభుత్వ అనుసరిస్తున్న వైఖరి గురించి గానీ ఎన్నడూ మాట్లాడదు. ఒకవేళ మాట్లాడినా తెలంగాణా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతుందే తప్ప ఎన్నడూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ప్రజలని సమర్ధించిన దాఖలాలు లేవు. కారణాలు అందరికీ తెలిసినవే. ఇప్పుడు ఆ పార్టీ నేతలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెదేపాకు అమ్ముడుపోయాడని విమర్శలు గుప్పిస్తున్నారు.   ఆయన త్వరలోనే అన్ని అంశాల మీద స్పందిస్తానన్న మాటను పట్టుకొని, “ఈ వ్యవహారాలలో ఏవిధంగా మాట్లాడాలో తెదేపా, బీజేపీ నేతల వద్ద శిక్షణ తీసుకోనేందుకే ఆయన వారం రోజులు సమయం తీసుకొంటున్నారని” వైకాపా నేత నారాయణ స్వామి ఆరోపించారు. “ప్రశ్నిస్తానన్న పెద్దమనిషి ఇంత జరుగుతున్నా ఎందుకు ప్రశ్నించడం లేదు? ఆయన అధికార పార్టీకి అమ్ముడుపోయారా? లేక ప్రశ్నించడం చేతగాక మౌనం వహిస్తున్నారా? మీకు చేతకాకపోతే మేము ప్రశ్నలు అందిస్తాము. మీరే వాటిని సంధించి ప్రభుత్వాం నుండి సమాధానాలు రాబట్టాలని” ఆయన అన్నారు.   ఆంద్రప్రదేశ్ లో తెరాస తరపున వఖల్తా తీసుకొని మాట్లాడుతూ, ఆ పార్టీకి రాష్ట్రంలో అనధికార ప్రతినిధిలాగ వ్యవహరిస్తున్న వైకాపా, అసలు ఇంతవరకు పార్టీనే నిర్మించుకోకుండా రాజకీయ అపరిపక్వమయిన మాటలతో, చేతలతో జనాలను రంజింపజేస్తున్న పవన్ కళ్యాణ్ న్ని పట్టుకొని అధికారపార్టీకి అమ్ముడుపోయారా? అని నిలదీయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. పైగా తాము ఇచ్చే ప్రశ్నావళిని ఆయనని డైలాగులు చదివినట్లు చదవమని కోరడం, తమ పార్టీ వ్యూహాలను వేరొక పార్టీ నాయకుడు అమలుచేయాలని కోరుకోవడం అహంకారమేననుకోవలసి ఉంటుంది. ఇదివరకు సమైక్య రాష్ట్ర ఉద్యమాలు చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తెదేపాతో సహా అన్ని పార్టీలను తన వెనుక నడవమని కోరడం గుర్తుకు తెచ్చుకొంటే అది అర్ధమవుతుంది. అయినా 60 మందికి పైగా ఎమ్మెల్యేలు కలిగి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైకాపా కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పవన్ కళ్యాణ్ న్ని కూడా తన రాజకీయ చదరంగంలో పావుగా వాడుకోవాలనుకోవడం దివాలాకోరుతనమే.   పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కొనసాగుతారా...లేదా? ఆయన తెదేపాకు మద్దతు ఇస్తున్నారా...లేదా? అనే విషయాలను పక్కనబెడితే ఆయన రాజకీయ అపరిపక్వత కారణంగానే మొదటి నుండి నేటివరకు కూడా తప్పటడుగులు వేస్తున్నారని అందరికీ తెలుసు. అయితే ఆయన సినీ రంగంలో చాలా పేరున్న హీరో గనుకనే అందరి దృష్టి ఆయనపై ఉంది. అదే ఏ సాధారణ రాజకీయ నాయకుడో ఈ విధంగా వ్యవహరించినా లేదా ఈ వ్యవహారాలపై స్పందిస్తానని చెప్పినా రాజకీయ పార్టీలే కాదు జనాలు కూడా పెద్దగా పట్టించుకోరని అందరికీ తెలుసు. కానీ ఆయన తెదేపాకి పావుగా మారిపోయారని ఆరోపిస్తున్న వైకాపాయే ఆయన రాజకీయ అపరిపక్వతను తెలివిగా ఉపయోగించుకొని ఈ రాజకీయ చదరంగంలో ఆయనను పావుగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుంది. వైకాపాకి తెదేపాతో సమస్యలుంటే వారే నేరుగా ఆ పార్టీని డ్డీకొంటే బాగుంటుంది కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ న్ని పావుగా వాడుకోవాలనుకోవడం రాజకీయ దివాళాకోరుతనమే.

రాజకీయనాయకులకి అగ్ని పరీక్షలు..స్వయంకృతాపరాధమే

  రాష్ట్ర విభజన ఉద్యమాలు ఉదృతం అయిననాటి నుండి నేటి వరకు కూడా రెండు రాష్ట్రాలలో పార్టీలున్న రాజకీయనాయకులు ఒక విచిత్రమయిన సమస్య ఎదుర్కోవలసి వస్తోంది. రాష్ట్రానికి చెందిన ఏదో ఒక సమస్య లేదా ప్రయోజనం విషయంలో సదరు పార్టీ వైఖరి ఏమిటని నిలదీయడమనే సరికొత్త పద్దతిని రాజకీయ పార్టీలు ప్రవేశపెట్టాయి. రాష్ట్ర విభజన తరువాత రెండు ప్రభుత్వాల మధ్య తలెత్తుతున్న సమస్యలు, వివాదాలలో ప్రత్యర్ధి పార్టీని నిలదీసేందుకు ఇది ఒక గొప్ప ఆయుధంగా మారిందిప్పుడు. కానీ కేవలం తెలంగాణా రాష్ట్రానికే పరిమితమయిన తెరాసకు అదే ఒక వరంగా మారింది.   రెండు రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ, తెదేపా, వైకాపాలకు నిత్యం ఈ గడ్డు సమస్య ఎదురవుతూనే ఉంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంతో కొనసాగుతున్న విద్యుత్, జల వివాదాలలో తెలంగాణా తెదేపా నేతల వైఖరి ఏమిటో తెలపాలని తెరాస నిలదీస్తుంటుంది. సెక్షన్: 8ని అమలుచేయాలని ఏపీ తెదేపా నేతలు డిమాండ్ చేస్తుంటే, తెలంగాణా తెదేపా నేతలు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నిస్తున్న తెరాస, దానిపై మీ వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకంపై కూడా వారి వైఖరి తెలియజేయాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేసారు.   ఆంద్రప్రదేశ్ లో తెరాస ప్రభుత్వానికి అనధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కూడా తరచూ ఇటువంటి అగ్నిపరీక్షలే ఎదురవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు మొదలు సెక్షన్: 8 అమలు వరకు వైకాపా ఎందుకు స్పందించడం లేదు? అని తెదేపా నేతలు విమర్శిస్తుంటే, ఆయన తెలివిగా ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వగైరా అంశాల మీద కేంద్ర ప్రభుత్వాన్ని తెదేపా ఎందుకు నిలదీయడం లేదు? కేంద్ర ప్రభుత్వంలో మీ మంత్రులను ఎందుకు రాజీనామా చేయించడం లేదు? అని ఎదురు ప్రశ్నిస్తుంటారు.   అధికార తెదేపా, తెరాసలు కానీ వైకాపా గానీ ఈ గొడవలోకి కాంగ్రెస్ పార్టీని లాగాలని చూడకపోవడం చాలా ఆశ్చర్యమే. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ‘వైఖరి’ ప్రకటన రొచ్చులో ఇరుకోక్కుండా చాలా తెలివిగా కాలక్షేపం చేసేస్తోంది. వివిధ అంశాలు సమస్యలు ఎదురయినప్పుడల్లా రెండు రాష్ట్రాలలో పార్టీలున్న రాజకీయ నాయకులకి ఈ అగ్నిపరీక్షలు ఎదుర్కోవలసి వస్తోంది. బహుశః ఇది శాశ్విత సమస్యే అని చెప్పవచ్చును. పరిపాలనలో రాజకీయాలను మిళితం చేయాలని చూస్తే ఇటువంటి సమస్యలే ఎదుర్కోవలసి వస్తుంది. రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్ధులను దెబ్బ తీసేందుకు సృష్టించుకొన్న ఈ విషవలయంలో చివరికి వారే చిక్కుకొంటున్నారు.

సెక్షన్: 8కి వక్రబాష్యాలేల?

  గవర్నర్ నరసింహన్ కేంద్ర హోంమంత్రి రాజ్ నాద్ సింగ్ తో డిల్లీలో సమావేశమయి తిరిగి వచ్చిన తరువాత సెక్షన్: 8 అమలు చేస్తారా లేదా? అని అందరూ చాలా ఉత్కంటతో ఎదురుచూస్తున్నారు. కానీ ఆయన హైదరాబాద్ తిరిగివచ్చి రెండు రోజులయినా ఇంతవరకు దాని గురించి ఎటువంటి సంకేతం ఇవ్వలేదు.   సెక్షన్: 8కి ఓటుకి నోటు కేసుతో ఎటువంటి సంబంధమూ లేదని కాంగ్రెస్, తెరాస నేతలు చేస్తున్న వాదనలు సహేతుకమయినవే. కానీ తెలంగాణా ట్రాన్స్ కో సంస్థలో పనిచేస్తున్న 1,200 మంది ఆంద్రా ఉద్యోగులను బలవంతంగా బయటకి సాగనంపడం, షెడ్యూల్: 10 క్రింద ఉండే సంస్థలని, ఉద్యోగులను, వాటి స్థిర చరాస్తులన్నిటినీ తెలంగాణా ప్రభుత్వం ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం, ఆ సంస్థలలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులను కూడా తొలగించేందుకు తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేయడం వంటి చర్యలన్నీ కూడా సెక్షన్: 8 అమలుకి ప్రేరేపించేవిగానే ఉన్నాయి.   హైదరాబాద్ లో నివసిస్తున్న ప్రజలందరూ శాంతియుతంగా జీవిస్తున్నారని తెరాస నేతలు చేస్తున్న వాదనలు కూడా సహేతుకంగానే ఉన్నాయి. కానీ ప్రభుత్వం తీసుకొంటున్న ఇటువంటి నిర్ణయాల వలన, హైదరాబాద్ లో స్థిరపడ్డ ఆంద్ర ప్రజల పట్ల చూపుతున్న వివక్ష కారణంగా వారిలో ఒకరకమయిన అభద్రతా భావం ఏర్పడిందని, ప్రభుత్వాధినేతల మాటల కారణంగా శాంతియుతంగా జీవిస్తున్న ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతోందని కనుక సెక్షన్: 8 అమలు తెలంగాణా ప్రభుత్వ స్వయం కృతాపరాధమే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   ఓటుకి నోటుకి కేసు నుండి బయటపడేందుకే ఆంద్రప్రదేశ్ మంత్రులు సెక్షన్: 8ని అమలుచేయాలని కోరుతున్నారని తెరాస, కాంగ్రెస్, వైకాపా నేతల వాదిస్తున్నారు. దాని అమలుకి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎంచుకొన్న ఈ సమయం కారణంగానే వారికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు అవకాశం కలిగిందని చెప్పవచ్చును. కానీ సెక్షన్: 8 అమలు చేసినంత మాత్రాన్న గవర్నర్ ఎసిబి మరియు ఎపి సిఐడి చేతుల్లో నుండి ఈ ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులను తన చేతిలోకి తీసుకొని వాటిని అటకెక్కిస్తారని భావించలేము. అలాగని చూస్తూ చూస్తూ రాజ్యాంగ సంక్షోభం ఏర్పడనిస్తారని భావించలేము. కనుక ఒకవేళ ఆయన సెక్షన్: 8ని అమలుచేసినట్లయితే ఈ కేసుల విషయంలో కూడా ఆయన తన విచక్షాణాధికారాలను ఉపయోగించుకొని తగిన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఆయన చట్టాన్ని కాదని రాజకీయ నిర్ణయాలు తీసుకోలేరు. తీసుకొన్నట్లయితే ఆయనకే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక కేవలం ఈ రెండు కేసుల కోసమే ఆయన సెక్షన్: 8ని అమలుచేస్తారనుకోవడం అవివేకమే. అంతకంటే కూడా చాలా గంభీరమయిన సమస్యలు ఉత్పన్నం అయ్యే పరిస్థితులున్నట్లు గవర్నర్ భావిస్తే అప్పుడు సెక్షన్: 8ని ఆయన తప్పకుండా అమలుచేయవచ్చును.   ఈ సెక్షన్: 8ని అమలు చేసేందుకు ఆయనకు హక్కు ఉందా లేదా? దాని ద్వారా ఆయనకు ఎటువంటి విశేషాధికారాలు పొందుతారు? ఏఏ విషయాలలో ఆయన దఖలు చేసుకోవచ్చును? తెరాస నేత కేశవరావు చెపుతున్నట్లుగా ఆయనకి ఈ సెక్షన్: 8 ద్వారా కేవలం బాధ్యతలే తప్ప ఎటువంటి అధికారాలు ఉంటాయా ఉండవా? అనే చట్టపరమయిన విషయాల గురించి కేవలం కోర్టులకు మాత్రమే నిర్వచించే హక్కు ఉంది తప్ప ఏదో ఒక రాష్ట్రానికి చెందిన రాజకీయనాయకులు మాత్రం కాదు. అయినప్పటికీ ఈ సెక్షన్: 8 గురించి అందరూ తమకు నచ్చినట్లుగా అన్వయించుకొంటూ రకరకాల బాష్యాలు చెపుతున్నారు. నిజానికి సెక్షన్: 8అమలు కంటే రాజకీయ నాయకులు దాని గురించి మాట్లాడుతున్న మాటలే చాలా ప్రమాదకరంగా కనబడుతున్నాయి. కనుక గవర్నర్ లేదా కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఈ సెక్షన్: 8 అమలు గురించి స్పష్థత ఇస్తే బాగుటుందని సామాన్య ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

షెడ్యూల్: 10 సంస్థల విభజనకు కేంద్రం జోక్యం అనివార్యం

  ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మధ్య నిత్యం ఏదో ఒక వివాదం చెలరేగడం ఇప్పుడు సర్వసాధారణమయిన విషయం అయిపోయింది. కొత్తగా షెడ్యూల్: 10 క్రిందకు వచ్చే సంస్థలన్నీ హైదరాబాద్ లో ఉన్నాయి గనుక అవన్నీ తమకే స్వంతమని తెలంగాణా ప్రభుత్వం ప్రకటించడంతో రెండు రాష్ట్రాల మధ్య మరో యుద్ద బీజం పడింది. రాష్ట్ర విభజనజరిగిన తరువాత చాలా సంస్థలను రెండు రాష్ట్రాల మధ్య పంపకాలు చేసినప్పటికీ కొన్ని సంస్థల విభజన చాలా సంక్లిష్టంగా ఉన్న కారణంగా వాటిని విభజన చట్టంలో షెడ్యూల్: 9 మరియు 10ల క్రిందకు చేర్చి వాటన్నిటినీ రాష్ట్ర విభజన జరిగిన ఏడాదిలోగా అంటే జూన్ 2వ తేదీలోగా ఇరు రాష్ట్రాల మధ్య విభజించాలని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొనబడింది.   కానీ ఏడాది గడిచినా షెడ్యూల్: 10లో సంస్థల విభజన ఇంకా పూర్తికాకపోవడంతో ఆ గడువు ముగిసిపోయింది కనుక తమ రాష్ట్రంలో ఉన్న ఆ సంస్థలన్నీ తమకే చెందుతాయంటూ తెలంగాణా ప్రభుత్వం ప్రకటించింది. వాటి స్థిర, చర ఆస్తులు, ఆదాయం, ఉద్యోగులు అన్నీ తమకే చెందుతాయని పేర్కొంది. అందులో పనిచేసే ఆంధ్రా ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో తెలంగాణా ఉద్యోగులను నియమించాలని, ఆ సంస్థలకు వివిధ బ్యాంకులలో ఉన్న నగదు నిలువలు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకుపోకుండా అన్ని అకౌంట్లను తక్షణమే స్తంబింపజేయాలని బ్యాంకులకు లేఖలు వ్రాయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ షెడ్యూల్ క్రిందకు వచ్చే ఆంద్రప్రదేశ్ ఉన్నత విద్యామండలిపై యాజమాన్య హక్కులను తెలంగాణాకే చెందుతాయని ఇదివరకు హైకోర్టు తీర్పు ఇచ్చింది కనుక అదే ప్రాతిపదికన ఆ షెడ్యూల్లో మిగిలిన అన్ని సంస్థలు కూడా తమకే చెందుతాయని తెలంగాణా ప్రభుత్వ వాదన.   ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పోటీగా కొన్ని సంస్థలకు ఉన్నతాధికారులను నియమించింది. కానీ పరిస్థితి చెయ్యి దాటుతున్నట్లు గమనించగానే దీని గురించి కేంద్రానికి పిర్యాదు చేసి తక్షణమే జోక్యం చేసుకోవలసిందిగా కోరింది. దానిపై స్పందించిన కేంద్రం ఈ సంస్థల విభజన గడువును మరి కొన్ని నెలలకు పొడిగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు తాజా సమాచారం. ఈ సంస్థల విభజనకు ప్రత్యేకంగా కొన్ని టాస్క్ కమిటీలను కూడా ఏర్పాటు చేయబోతోందని సమాచారం.   కానీ “ఈ సంస్థల పంపకానికి తాము అంగీకరించబోమని తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ చెప్పారు. రాష్ట్ర పునర్విభజన చట్టప్రకారం ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకొనేందుకు అవకాశముంటే అందుకు మేము అంగీకరిస్తాము కానీ గడువు ముగిసిన తరువాత ఇంకా ఆ సంస్థలను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పంచుకొనేందుకు మేము సిద్దంగాలేమని” ఆయన తెలిపారు. ఉమ్మడి ఆస్తులయిన ఈ సంస్థలన్నిటినీ తెలంగాణా ప్రభుత్వం ఏకపక్షంగా స్వంతం చేసుకొనేందుకు తాము కూడా అంగీకరించబోమని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కనుక ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం అనివార్యమవుతుంది.