రాహుల్ గాంధీ మద్దతు లేకపోతే టీ-కాంగ్రెస్ మనలేదా?

  రాష్ట్ర విభజన చేసి తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకొన్నట్లయితే, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో ఓడిపోయినప్పటికీ తెలంగాణాలో ఖచ్చితంగా గెలవవచ్చని కాంగ్రెస్ అధిష్టానం కలలుకంది. కానీ హస్తం గుర్తున్న కాంగ్రెస్ పార్టీకే కేసీఆర్ హ్యాండివ్వడంతో కాంగ్రెస్ అంచనాలు తారుమారయ్యాయి. కానీ అందుకు కేసీఆర్ ని నిందించడం కంటే కాంగ్రెస్ నేతలు తమను తామే నిందించుకోవలసి ఉంటుంది. ఎందుకంటే టీ-కాంగ్రెస్ నేతలందరూ తమ బంధువులకి, కుటుంబ సభ్యులకి, స్నేహితులకి పార్టీ టికెట్లు సంపాదించుకోవడం మీద కనబరిచిన శ్రద్ద తమ పార్టీయే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసిందనే విషయం గురించి గట్టిగా ప్రచారం చేసుకోవడంలో చూపలేదు. తెలంగాణాలో అధికారంలోకి వచ్చేందుకే కాంగ్రెస్ అధిష్టానం ఎన్నో సవాళ్ళని, ఒత్తిళ్ళని, తీవ్ర ప్రతిఘటనని ఎదుర్కొని మరీ తెలంగాణా ఏర్పాటు చేసింది. కానీ ఆ విషయాన్నీ ప్రజలకు గట్టిగా చెప్పుకోవడంలో విఫలమవడం వలననో లేదా నిర్లక్ష్యం వహించడం వలననో వ్రతం చెడ్డా ఫలం దక్కకుండా పోయింది. నిజానికి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో అప్పుడున్నంత అనుకూలమయిన పరిస్థితులు మరెప్పుడూ కనబడలేదనే చెప్పవచ్చును. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ గొప్ప అవకాశాన్ని సద్వినియోగించుకోలేక చతికిలపడింది.   చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొంటున్నట్లుగా ఇప్పుడు రాహుల్ గాంధీ తెలంగాణా మీద ప్రత్యేకశ్రద్ద కనబరుస్తున్నారు. ఆయన మే నెలలో ఆదిలాబాద్ లో ఒకసారి పాదయాత్ర చేసారు. ఆ తరువాత మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పార్టీని వదిలి తెరాసలోకి వెళ్ళిపోయారు. మరో ఇద్దరు సీనియర్ నేతలు కె.జానారెడ్డి, దానం నాగేందర్ కూడా తెరాస వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి రాహుల్ గాంధీ వచ్చి సాధించిందేమిటో ఆయనకే తెలియాలి. రాహుల్ గాంధీ మళ్ళీ ఈనెల 27, 28 తేదీలలో హైదరాబాద్, వరంగల్ జిల్లాలో భూపాలపల్లి, హన్మకొండ ప్రాంతాలలో పర్యటిస్తారని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి తెలిపారు.   వరంగల్ లోక్ సభ నియోజక వర్గానికి త్వరలో జరుగబోయే ఉపఎన్నికలు, వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఆయనను రప్పిస్తున్నారనే విషయం బహిరంగ రహస్యమే. కానీ ఒక లోక్ సభ స్థానం, మున్సిపల్ ఎన్నికలలో గెలుపు కోసం రాహుల్ గాంధీ స్వయంగా పూనుకోవలసి వస్తోంది అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేటికీ ఇంకా బలహీనంగానే ఉందని స్పష్టమవుతోంది. వరంగల్ నుండి లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ని బరిలో దింపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెకు జిల్లాతో కానీ రాష్ట్రంతో గానీ ఏమాత్రం సంబంధం లేదు. పైగా ఆమెకు జిల్లా సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదు. ఒకవేళ ఆమె ఎన్నికలలో గెలిచినా మళ్ళీ జిల్లా ముఖం చూస్తారనే నమ్మకం కూడా లేదు. అటువంటి వ్యక్తిని పార్టీ అభ్యర్ధిగా నిలబెట్టాలనుకొంటే కాంగ్రెస్ అపజయం ఖరారు అయిపోయినట్లే భావించవచ్చును. అప్పుడు రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి ప్రచారం చేసినా ఏమీ ప్రయోజనం ఉండదు. పైగా ఆయన ప్రచారం చేసిన తరువాత కూడా ఆమె ఓడిపోతే అది ఆయనకే అవమానం, అప్రదిష్ట అవుతుంది.   ప్రస్తుతం తెలంగాణాలో అధికారంలో ఉన్న తెరాస చాలా బలంగా ఉంది. ముఖ్యంగా వరంగల్లో ఆ పార్టీ ఇప్పుడు చాలా బలపడింది. కనుక ఉప ఎన్నికలలో అవలీలగా గెలవగలమని భావిస్తోంది. మరోవైపు, ఓటుకి నోటు వ్యవహారంలో తమను అప్రదిష్ట పాలుచేసి, తమ పార్టీని, ప్రభుత్వాన్ని కూడా ఘోరంగా దెబ్బ తీయాలని తెరాస ప్రయత్నించినందుకు, ఈ వరంగల్ ఉపఎన్నికలలో ప్రతీకారం తీర్చుకోవాలని తెదేపా చాలా పట్టుదలగా ఉంది. అందుకు అవసరమయితే బీజేపీ అభ్యర్ధికి మద్దతు ఇచ్చయినా సరే వరంగల్ సీటును తెరాసకు దక్కకుండా చేయాలనే పట్టుదలతో ఉంది.   ఇటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ చేసే పర్యటనల వలన కాంగ్రెస్ అభ్యర్ధి గెలుస్తారని ఎవరూ భావించలేరు. కనుక ఆయనని ఈ ఎన్నికల ప్రచారానికి రప్పించాలనుకోవడమే ఒక పొరపాటు. టీ-కాంగ్రెస్ లో కొమ్ములు తిరిగిన నేతలున్నారు. వారందరూ కలిసి తమ పార్టీ అభ్యర్ధిని గెలిపించుకొని చూపిస్తే అది వారికీ గౌరవంగా ఉంటుంది...తెరాసకు తమ సత్తా ఏమిటో రుచి చూపినట్లవుతుంది. కానీ నేటికీ వారిలో ఐక్యత, పార్టీని బలపరుచుకోవాలనే పట్టుదల, ఎన్నికలలో గెలవాలనే కసి కనబడటం లేదు. అందుకే రాహుల్ గాంధీ మద్దతు కోరుతున్నారు. కానీ ఆయన రావడం వలన ఒరిగేదేమీ ఉండదు, పైగా ముందు చెప్పుకొన్నట్లుగా పార్టీ అభ్యర్ధి ఓడిపోయినట్లయితే అది అందరికీ అవమానంగానే మిగులుతుంది.

ప్రత్యేకహోదాపై కేంద్రం ఇంకా ఆలశ్యం చేసినట్లయితే...

  ఏపీలో ప్రత్యేకహోదాపై మళ్ళీ వేడి రాజుకొంది. దానికోసమే ప్రత్యేకంగా నటుడు శివాజీ అధ్యక్షతన ప్రత్యేకహోదా సాధన సమితి ఏర్పడింది. సిపిఐరాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు బస్సు యాత్రలు, ఆ సందర్భంగా ఆంధ్రా మేధావుల ఫోరం నేతృత్వంలో జిల్లాలలో సమావేశాలు, ఊరేగింపులు చాలా జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు వారి బస్సు యాత్రలు, సమావేశాలు కొనసాగించి, అప్పటికీ కేంద్రం ప్రత్యేకహోదాపై నిర్దిష్ట ప్రకటన చేయకపోతే, ఈనెల 11న ఆంద్ర ప్రదేశ్ బంద్ కి పిలుపునిస్తామని వారు హెచ్చరిస్తున్నారు.   మరోవైపు వైకాపా కూడా దీని కోసం రాష్ట్రంలో పోరాటాలు మొదలుపెట్టింది. ఆపార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈనెల 10న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా త్వరలో తిరుపతిలో దీని కోసం ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయబోతోంది. తెదేపా, వైకాపా ఎంపీలు పార్లమెంటులో కేంద్రప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.   ఈ పోరాటాల వలన కేంద్రం మీద ఇప్పుడు ఒత్తిడి ఇంకా పెరిగింది. దీని వలన రాష్ట్రానికి, పరిశ్రమలకి కలిగే మేలు సంగతి ఎలా ఉన్నప్పటికీ, దీనివలన రాజకీయ పార్టీలకి ప్రజలలో ఆదరణ పెరిగి తమ బలం మరింత పెంచుకొనే అవకాశం ఉంటుంది కనుక అన్ని పార్టీలు కూడా ఈ అంశంపై తమ పోరాటాలను మున్ముందు మరింత ఉదృతం చేసే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. మోడీ ప్రభుత్వం కూడా ఈ విషయం గ్రహించే ఉంటుంది. కనుక ఇంకా దీనిని సాగదీయకుండా వీలయినంత త్వరగా దీనిపై ఒక నిర్ణయం తీసుకొంటే మంచిది. కానీ ఇంకా జాప్యం చేసినట్లయితే ఇంతవరకు ప్రత్యేకహోదా కోసం పోరాటాలు చేస్తున్న రాజకీయ పార్టీలు, కొత్తగా ఏర్పడిన సంఘాలు అన్నీ కూడా రైల్వేజోన్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు వంటి ఇతర హామీల అమలుకు కోసం తమ పోరాటాలను పొడిగించవచ్చును.    కేంద్రప్రభుత్వం గత 14 నెలల్లో ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా విధాలుగా సహాయం చేసింది. కానీ రాష్ట్ర బీజేపీ నేతలు వాటి గురించి గట్టిగా ప్రచారం చేసుకొనేందుకు ఆసక్తి కనబరచక పోవడంవలన, మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ చేయలేదనే అపవాదు మూటగట్టుకోవలసివస్తోంది. పైగా ప్రత్యేకహోదా మంజూరు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోందనే మరో అపవాదుని కూడా భరించాల్సివస్తోంది. దీని వలన రాష్ట్రంలో తెదేపా-బీజేపీలకి తీవ్ర నష్టం జరుగుతోంది. ఇప్పుడు మొదలయిన పోరాటాల వలన ఒకవేళ కేంద్రం ప్రత్యేకహోదా మంజూరు చేసినప్పటికీ బీజేపీ-తెదేపా, రాష్ట్ర బీజేపీలకి దక్కవలసిన ఖ్యాతి వివిధ రాజకీయ పార్టీలు, కొత్తగా ఏర్పడిన సంఘాలకే దక్కుతుంది. తమ పోరాటాల కారణంగానే కేంద్రం దిగివచ్చి ప్రత్యేకహోదా ఇవ్వవలసి వచ్చిందని అవి చెప్పుకొనే అవకాశం కేంద్రం వాటికి కల్పించినట్లయింది. కనుక ఇప్పటికయినా ఆ ప్రయోజనం, మంచిపేరు బీజేపీ-తెదేపాలకు దక్కలనుకొంటే ప్రత్యేకహోదా గురించి కేంద్రం తక్షణమే ఒక నిర్దిష్టమయిన ప్రకటన చేయడం మంచిది. లేకుంటే వ్రతం చెడ్డా ఫలం దక్కకుండాపోతుంది.

రైల్వేలలో భద్రత ఎప్పుడూ ప్రశ్నార్ధకమే!

  నిన్న రాత్రి మధ్యప్రదేశ్ లో ఒకేచోట, ఒకేసమయంలో జరిగిన రెండు ఘోర రైలు ప్రమాదాలలో ఇప్పటి వరకు 31 మంది ప్రయాణికులు చనిపోయినట్లు తెలుస్తోంది. అనేక వందలమంది తీవ్రంగా గాయపడ్డారు. ఖిర్కియా-హర్దా స్టేషన్ల మధ్య మాచక్ నది సమీపంలోగా గల ఒక కల్వర్టుపై ఈ రైళ్ళు ప్రయాణిస్తుండగా పట్టాలు తప్పాయి. మొదట ముంబై నుండి వారణాశి వెళుతున్న కామయాని ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. మరికొద్ది నిమిషాలలోనే జబల్ పూర్ నుండి ముంబై వెళుతున్న జనతా ఎక్స్ ప్రెస్ కూడా సరిగ్గా అక్కడే పట్టాలు తప్పింది.   రైల్వే బోగీలు నదిలో పడిపోయాయని వార్తలు నిజం కాదని, కల్వర్టు వద్ద రెండు రైళ్ళు పట్టాలు తప్పి బోగీలు చెల్లా చెదురుగా పడిపోవడంతో కల్వర్టు క్రిందన ఉన్న నీళ్ళు బోగీలలోకి రావడంతో రైలు బోగీలు నదిలో పడిపోయినట్లు వార్తలు వెలువడ్డాయని రైల్వే శాఖ చైర్మన్ ఏ.కె మిట్టల్ చెప్పారు. కానీ ఈ ఘోర ప్రమాదం జరగడానికి ఆయన చెప్పిన సంజాయిషీ చాలా హాస్యాస్పదంగా ఉంది. కామయాని ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురికాక ముందు 10 నిమిషాల వరకు కల్వర్టు మీద ఉన్న రైల్వే ట్రాక్ బాగానే ఉంది. కానీ హటాత్తుగా మాచక్ నదికి వరద ఉదృతి పెరగడంతో నీళ్ళు ట్రాక్ మీదకు వచ్చి పట్టాల క్రింద ఉన్న మట్టి, కంకర అన్ని కొట్టుకుపోవడం చేతనే రైళ్ళు అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. అంటే స్థానిక రైల్వే సిబ్బంది తప్పిదం లేదని చెపుతున్నట్లుంది.   కానీ మాచక్ నది చాలా ఉదృతంగా ప్రవహిస్తోందని తెలిసి ఉన్నప్పుడు దానిపై ఉన్న కల్వర్టుని, పట్టాల పరిస్థితిని నిరంతరం గమనించాల్సిన బాధ్యత స్థానిక రైల్వే స్టాఫ్ మరియు అధికారులదే. జోరుగా వానలు కురుస్తున్నప్పుడు వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. కానీ అదేమీ పట్టించుకోకుండా ఒకవైపు ఖిర్కియా స్టేషన్ నుండి అదే సమయంలో మరోవైపునున్న హర్దా స్టేషన్ నుండి ఒకేసారి రెండు రైళ్ళను అనుమతించారంటే రైల్వే సిబ్బంది, అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్ధమవుతోంది. రైల్వే అధికారులు దీనిని ప్రకృతి విప్పత్తుగా చూపిస్తున్నప్పటికీ ఇది ఖచ్చితంగా మానవ తప్పిదమేనని చెప్పక తప్పదు. అదే ఆ రెండు స్టేషన్లలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ తమ విధులను సక్రమంగా నిర్వర్తించి ఉండి ఉంటే అసలు ఆ రైళ్ళను ముందుకు వెళ్లేందుకు అనుమతించేవారే కాదు.   ప్రమాదం జరిగిన తరువాత అనేక రైళ్ళను వేరే ఇతర మార్గాలలోకి మళ్ళించామని రైల్వే అధికారులు ప్రకటించారు. కానీ అదే నిర్ణయం ముందే తీసుకొని ఉండి ఉంటే ఇంతమంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయేవారు కాదు కదా? ఇటువంటివి ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా రైల్వేశాఖలో నిర్లక్ష్య వైఖరి విడనాడటం లేదు. ఇటువంటి ఘోర మానవ తప్పిదాలను అరికట్టడం రైల్వేశాఖ తన వల్ల కాదనుకొంటే, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్నానయినా సమర్ధంగా ఉపయోగించుకొనే ప్రయత్నాలు చేస్తే ఇటువంటి ప్రమాదాలను చాలా వరకు అరికట్టవచ్చును. కానీ పార్లమెంటులో రైల్వే బడ్జెట్ ని ప్రవేశపెట్టే సమయంలో మాత్రమే ‘రైల్వేలలో భద్రత’ గురించి ఏవో కొన్ని మాటలు వినిపిస్తుంటాయి తప్ప అవి ఆచరణకు నోచుకోవడం లేదని ఇటువంటి ఘోర ప్రమాదాలు నిరూపిస్తుంటాయి. ఎన్నేళ్ళు గడిచినా ఇటువంటి ఘోర ప్రమాదాలను, రైల్వే లెవెల్ క్రాసింగ్స్ వద్ద మనుషులు, జంతువులు ప్రాణాలు కోల్పోవడం, రైళ్ళలో దొంగతనాలను అరికట్టలేకపోతున్నారు.   రైల్వేశాఖ ఆధునీకీకరణ పేరిట ప్రయాణికుల నుండి ప్రతీ ఏటా ముక్కుపిండి అదనపు చార్జీలు వసూలు చేస్తారు. కానీ ఇటువంటి ఘోర ప్రమాదాలను చూసినప్పుడు రైల్వేల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా కనబడుతుంది. రైల్వేశాఖ బుల్లెట్ రైళ్ళ గురించి కలలుకనే బదులు ముందుగా ప్రయాణికుల భద్రతపై, పట్టాలపై దృష్టి పెడితే బాగుంటుంది. లేకుంటే ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లుంటుంది.

ప్రజాస్వామ్యాన్ని ఎవరు ఖూనీ చేస్తున్నారు?

  పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు అధ్యక్షతన నిన్న పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన అఖిలపక్ష ఎంపీల సమావేశంలో ఎన్డీయే ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించేంతవరకు కూడా పార్లమెంటు సమావేశాలను సజావుగా సాగనీయబోమని కాంగ్రెస్ పార్టీ తేల్చిచెప్పడమే కాక దానిని అమలు చేసి చూపించింది కూడా. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీకి చెందిన 25మంది ఎంపీలను స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్ సభ నుండి ఐదురోజుల పాటు సస్పెండ్ చేసారు.   సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వాన్ని పార్లమెంటులో గట్టిగా డ్డీ కొనలేకపోతోంది కనుకనే రాహుల్ గాంధీ ఆలోచనను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నట్లుంది. తద్వారా ప్రధాని మోడీకి తన తడాకా చూపించాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లుంది. కానీ ఈ విధంగా వ్యవహరిస్తూ దేశ ప్రజల దృష్టిలో మరింత చులకన అవుతున్నాననే విషయం కాంగ్రెస్ పార్టీ కానీ, దానిని ముందుండి నడిపిస్తున్న రాహుల్ గాంధీ గానీ గ్రహించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. రాహుల్ గాంధీ తన శక్తి ప్రదర్శన కోసం పార్లమెంటు సమావేశాలనే పణంగా పెట్టాలనుకోవడాన్ని ప్రజాస్వమ్యవాదులెవ్వరూ కూడా హర్షించలేరు. కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయిన తరువాత సోనియా, రాహుల్ గాంధీలు మీడియాతో మాట్లాడుతూ తాము ప్రతిపక్ష పార్టీగా ‘ఎన్డీయే ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం’ అందిస్తామని చెప్పారు. వారు సహకారం అందించకపోయినా పరువాలేదు కానీ  ఈవిధంగా పార్లమెంటుని స్తంభింపజేయకుండా ఉంటే చాలని ప్రజలు కోరుకొంటున్నారు.   లోక్ సభ నుండి తమను బహిష్కరించి మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని సోనియా, రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. కానీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇద్దరు ముఖ్యమంత్రులను, ఒక విదేశాంగ మంత్రిని రాజీనామా చేయాలని పట్టుబడుతూ పార్లమెంటులో ప్రజాసమస్యలపై చర్చ జరగకుండా అడ్డుపడుతూ కాంగ్రెస్ పార్టీయే ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమను సభ నుండి సస్పెండ్ చేసిందుకు ఎన్డీయేని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నిటినీ కూడగట్టుకొని  మరింత రాద్ధాంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతోంది.   కాంగ్రెస్ పార్టీని, వాటి విధానాలను సమూలంగా ప్రక్షాళన చేయవలసి ఉందని దృడంగా నమ్మే రాహుల్ గాంధీ స్వయంగా ఇటువంటి నీచ రాజకీయాలతో పార్లమెంటు సమావేశాలని అడ్డుకోవడం చూస్తుంటే అతను కాంగ్రెస్ పార్టీని మార్చడం కాదు, కాంగ్రెస్ పార్టీయే అతనిని, ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చివేసినట్లుంది. అందుకే ఇప్పుడు అతను కూడా కాంగ్రెస్ పార్టీకి అలవాటయిన మూస పద్దతులలోనే ముందుకు సాగుతున్నారు. కానీ ఆ మూసపద్దతుల కారణంగానే కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు పక్కనబెట్టారనే సంగతి కూడా ఆయన గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.   కొన్ని రోజుల క్రితం పంజాబ్ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు అక్కడ భారత సైనిక దళాలు ఉగ్రవాదులతో పోరాడుతుంటే, కేంద్రప్రభుత్వానికి అండగా నిలబడి పూర్తి సహకారం అందించాల్సిన కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు, కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సభలో నానా రాద్ధాంతం చేసాయి. ఈ రెండు సంఘటనలను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజా సమస్యల పట్ల కానీ దేశభద్రత విషయంలో గానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోంది. ఉండి ఉంటే పార్లమెంటులో ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించేదే కాదని చెప్పవచ్చును.

ఆంద్రప్రదేశ్ పై అప్పుడు లేని ప్రేమ ఇప్పుడేల?

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ దుస్థితి కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని రాష్ట్ర ప్రజలు భావించినందునే ఆ పార్టీని ఎన్నికలలో మట్టి కరిపించారు. అటువంటపుడు ఆ పార్టీ పశ్చాతాపం ప్రకటించి ఉండి ఉంటే ప్రజలు మళ్ళీ దానిని ఆదరించేవారేమో? కానీ తన తప్పును ఒప్పుకోకపోగా రాష్ట్ర విభజన వలన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి లాభమే జరిగిందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పడం ప్రజలను మరింత రెచ్చగొట్టినట్లయింది. లక్షలాదిమంది రాష్ట్ర ప్రజలు రోడ్లమీదకు వచ్చి రాష్ట్ర విభజనని వ్యతిరేకించినా ఆనాడు నోరు విప్పని రాహుల్ గాంధీ ఇప్పుడు రాష్ట్ర ప్రజల తరపున కేంద్రంతో ప్రత్యేకహోదా గురించి పోరాటం చేస్తారుట! తన యూపీఏ ప్రభుత్వమే స్వయంగా తయారుచేసి ఆమోదించిన ఆర్డినెన్స్ ని నాలిక గీసుకోవడానికి కూడా పనికిరాదని చెప్పి వాపసు తీసుకొనేలా చేశారు. కానీ అనేక దశాబ్దాలపాటు తన కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకొని ఆదరించిన ఆంద్రప్రదేశ్ ప్రజల పట్ల నిజంగానే రాహుల్ గాంధీకి అభిమానం ఉండి ఉంటే మరి ఆనాడు తన తల్లి సోనియా గాంధీ రాష్ట్రాన్ని బలవంతంగా విడగొడుతున్నప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? ఆనాడు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకించలేదు? కనీసం ఎన్నికలు పూర్తయ్యేవరకయినా ఎందుకు వాయిదా వేయించలేదు? అని ఆలోచిస్తే అప్పుడు ఆయన తన పార్టీ ప్రయోజనాల గురించి మాత్రమే మిన్నకుండిపోయారని అర్ధమవుతోంది.   ఇప్పుడు ఆయన రాష్ట్రంలో పాదయాత్రలు, భరోసా యాత్రలు చేసి ప్రజల అభిప్రాయాలు తెలుసుకొంటున్నారు. కానీ ఆ సమయంలో ఒకసారి కూడా రాష్ట్రానికి వచ్చి ప్రజల అభిప్రాయంతెలుసుకొనే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్నామనే అహంకారం. ఇప్పుడు ప్రజలని మంచి చేసుకొని మళ్ళీ రాష్ట్రంలో పార్టీని బలపరుచుకోవాలనే తపన అంతే! అందుకే ఇప్పుడు ఆయన కూడా ప్రత్యేకహోదా గురించి పార్లమెంటులో పోరాడేందుకు సిద్దమయిపోతున్నారు. కానీ ఇప్పుడయినా నిజాయితీగా పోరాడుతున్నారా? అంటే లేదనే అర్ధమవుతోంది.   ఈ ప్రత్యేకహోదా సాకుతో రాష్ట్రప్రజలను మళ్ళీ ఆకట్టుకోవాలనే తపన, ఈ విషయంలో ఇబ్బందిపడుతున్న తన రాజకీయ ప్రత్యర్ధులయిన తెదేపా, బీజేపీలను దెబ్బ తీయాలనే ఆలోచనతోనే రాహుల్ గాంధీ ఇదంతా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఆయన ఏమి చేసినా కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బ్రతికించుకోవడం అసంభవమనే చెప్పవచ్చును. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కోలుకొంటుందని భావిస్తే బొత్స సత్యనారాయణ వంటి నేతలు పార్టీని వీడేవారే కాదు. ఒకవేళ రాహుల్ గాంధీకి రాష్ట్రంలో తన పార్టీని మళ్ళీ బ్రతికించుకోవాలంటే రాష్ట్ర విభజన చేసినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పుకొంటే ఏమయినా ఫలితం ఉండవచ్చును. కానీ ఆంధ్రప్రదేశ్ లో తన పార్టీని (రాష్ట్రాన్ని, ప్రజలని) పణంగా పెట్టి మరీ తెలంగాణా ఇచ్చామని అక్కడ గొప్పగా చెప్పుకొంటున్నప్పుడు, అందుకు పశ్చాత్తాపం ప్రకటించలేరు. అలాగా చేస్తే తెలంగాణాలో కూడా కాంగ్రెస్ పార్టీ దెబ్బయిపోతుంది. కనుకనే రాష్ట్ర కాంగ్రెస్ నేతలెవరూ పైకి ఆమాట చెప్పుకోలేకపోతున్నారు.   ఆ సంగతి ప్రజలూ అర్ధం చేసుకోగలరు. ఆమాట చెప్పకపోయినా పరువాలేదు కానీ “రాష్ట్ర విభజన వలన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి నష్టం జరుగలేదు అంతా లాభమే జరిగిందని” చెపుతూ ఇటువంటి పోరాటాలు ఎన్ని చేసినా కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు నమ్మబోరు, క్షమించబోరని రాహుల్ గాంధీ గ్రహిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రత్యేకహోదా రాష్ట్రం కోసమా లేక రాజకీయ పార్టీల కోసమా?

  రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇచ్చే విషయం గురించి కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ నిన్న లోక్ సభలో చెప్పిన సమాధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కలకలం సృష్టించింది. “ప్రస్తుతం ఏ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే ఆలోచన కేంద్రానికి లేదు. అటువంటి ప్రతిపాదనలేవీ మా పరిశీలనలో లేవు. అందుకు ఎటువంటి విధానమూ కూడా లేదు,” అని కుండ బ్రద్దలు కొట్టినట్లుగా ఆయన ప్రకటించారు.   రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చేందుకు ఇదివరకు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలు రెండూ కూడా అంగీకరించినప్పటికీ, ఇప్పటికే అందరికీ తెలిసిన కొన్ని కారణాల వలన ఇవ్వడం సాధ్యం కావడం లేదు. అదే మాట కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కొన్ని నెలల క్రితం చెప్పినప్పుడు అందరూ ఆయనపై విరుచుకుపడ్డారు. అప్పటి నుండి ఈ ప్రత్యేకహోదా అనేది ప్రజలకు, రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే అంశంగా కాక, ప్రతిపక్ష పార్టీలకి అధికార తెదేపా, బీజేపీలపై ప్రయోగించేందుకు ఒక మంచి అస్త్రంగానే ఎక్కువ ఉపయోగపడుతోందనే చేదు నిజం ప్రజలు కూడా గ్రహించే ఉంటారు.   ఈ రాజకీయాల సంగతి ఎలా ఉన్నా, తెదేపా మంత్రులు కేంద్రంపై నిరంతరంగా దీనికోసం ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. తమ ప్రయత్నాలు కొంత వరకు ఫలించాయని, త్వరలోనే కేంద్రం దీనిపై ఒక ప్రకటన చేస్తుందని కేంద్రమంత్రి సుజానా చౌదరి ప్రకటించారు. కానీ ఊహించని విధంగా, ఇంద్రజిత్ సింగ్ లోక్ సభలో నిన్న ఈ ప్రకటన చేయడంతో రాష్ట్రంలో తెదేపా, బీజేపీలు రెండూ కూడా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసివస్తోంది. కానీ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడే హామీ ఇచ్చి ఉన్నందున, ఇంద్రజిత్ సింగ్ నిన్న లోక్ సభలో చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తించకపోవచ్చును. కనుక దీని తెదేపా ఎంపీలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు దీనిపై త్వరలోనే కేంద్రం చేతనే వివరణ ఇప్పించవచ్చును. అప్పుడు కూడా కేంద్రం ఇంద్రజిత్ సింగ్ చెప్పినదానికే కట్టుబడి ఉంటే ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదనే భావించవచ్చును.   కానీ ఈ అంశాన్ని ఉపయోగించుకొని ప్రతిపక్షాలు చేస్తున్న హడావుడి దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకహోదా అంశాన్ని రాజకీయ పార్టీల చేతిలో పెట్టి వాటికి రాజకీయ లబ్ది కలిగించాలా లేక ప్రత్యేకహోదాకి సమానంగా కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తానంటున్న ప్రత్యేక ప్యాకేజీని స్వీకరించడం మంచిదా? అని ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది.   ప్రజలు గమనించాల్సిన మరొక్క విషయం ఏమిటంటే ఒకవేళ రాష్ట్రానికి ఈ ప్రత్యేకహోదా మంజూరు చేసినా అది యావత్ రాష్ట్రానికి వర్తించదని ఇదివరకు యూపీఏ ప్రభుత్వమే తేల్చిచెప్పింది. రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంద్రా జిల్లాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అదికూడా పారిశ్రామిక అభివృద్ధి కోసమే ఉద్దేశించబడింది తప్ప అన్ని పనులకు భారీగా నిధులు మంజూరు చేసేందుకు కాదు. ఈ విషయం గురించి చెప్పకుండా ‘రాష్ట్రమంతటికీ ప్రత్యేకహోదా వస్తుంది...ప్రత్యేకహోదా వస్తే రాష్ట్రానికి నిధుల వరద మొదలయిపోతుంది’ అన్నట్లుగా ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నాయి.   ఈ విషయాల గురించి తెదేపా, బీజేపీలు ప్రజలకు వివరించడంలో అశ్రద్ధ చేసినందునే ఈ సమస్య మరింత తీవ్రం అయిందని చెప్పవచ్చును. ఇప్పటికే 14నెలలు పూర్తయిపోయాయి. కానీ ప్రత్యేకహోదా రాలేదు. ఇంకా ఎప్పటికి వస్తుందో తెలియదు. కారణాలు అందరికీ తెలిసినవే. అటువంటప్పుడు పుణ్యకాలం పూర్తికాక ముందే అందుబాటులో ఉన్న అవకాశాలని ఉపయోగించుకొని రాష్ట్రాభివృద్ధి చేసుకోవడం మంచిదా? లేక ఇంకా ఈ భ్రమలలోనే జీవిస్తూ రాజకీయ పార్టీలకి లబ్ది కలిగించేందుకు పోరాటాలు కొనసాగించడం మంచిదా? అని ప్రజలు కూడా ఆలోచించుకోవాలి.   మరొక్క ఏడాదో రెండేళ్ళ తరువాతనో రాష్ట్రానికి ప్రత్యేకహోదా వచ్చినా అప్పటి వరకు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడుతుంది. పారిశ్రామిక అభివృద్ధి జరగకపోతే రాష్ట్ర ఆర్ధికపరిస్థితి కూడా మారదు. కనుక తెదేపా, బీజేపీలు కూడా ఈ ప్రత్యేకహోదా అంశాన్ని ఇంకా నాన్చకుండా అది సాధ్యమో కాదో విస్పష్టంగా ప్రకటించి, వీలుకాకపోతే ప్రత్యామ్నాయంగా రాష్ట్రాని మంచి ఆర్ధిక ప్యాకీజీ సాధించే ప్రయత్నాలు చేయడం మంచిది. తద్వారా ఆ రెండు పార్టీలు విమర్శలను ఎదుర్కొనే బాదా తప్పుతుంది, రాష్ట్రానికి ఇంకా నష్టం జరుగకుండా నివారించవచ్చును కూడా. ఈ అంశంలో తెదేపా, బీజేపీలు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ముందుకు సాగినట్లయితే ప్రతిపక్షాలు కూడా చల్లబడే అవకాశం ఉంటుంది.

ఫోన్ ట్యాపింగ్ వాస్తవమే...కానీ నేరం కాదా?

  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు నిజమేనని తెలంగాణా ప్రభుత్వమే స్వయంగా హైకోర్టులో అంగీకరించిందని మంత్రి రఘునాధరెడ్డి అన్నారు. తమ ప్రభుత్వాన్ని ఎవరయినా అస్థిరపరుస్తున్నట్లు అనుమానం కలిగితే అటువంటి వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేసే అధికారం తమకు ఉందని తెలంగాణా ప్రభుత్వం తరపున ప్రముఖ న్యాయవాది రామ్ జెట్మలానీ హైకోర్టులో వాదించారు. తెలంగాణాకు సంబంధించిన మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు రికార్డు చేసిన ఆ కాల్-డాటాను ఇవ్వమని విజయవాడ కోర్టు ఆదేశించలేదని, కనుక ఆ కోర్టు ఆదేశాలపై స్టే విధించాలని ఆయన వాదించారు. మొదట “అసలు ట్యాపింగ్ చేయాల్సిన ఖర్మ తమకేమిటి?” అని  ఎదురు ప్రశ్నించిన తెలంగాణా మంత్రులు ఆ తరువాత ట్యాపింగ్ కాదు కేవలం సంభాషణల రికార్డింగ్ మాత్రమే చేశామన్నారు. కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించడమే కాకుండా, ఆవిధంగా చేసేందుకు తమకు అధికారం కూడా ఉందని వాదిస్తున్నారు.   నిజానికి కేంద్రప్రభుత్వం అనుమతి లేనిదే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు. ఇదివరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నప్పుడు సరిహద్దు రాష్ట్రమయిన గుజరాత్ లో ఉగ్రవాదాన్ని అడ్డుకొనేందుకు రాష్ట్ర పోలీసులకు ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు అనుమతించాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పమిపితే దానిని రాష్ట్రపతి అబ్దుల్ కలాం వెనక్కి త్రిప్పి పంపారు. అంతకు ముందు ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా ఒకసారి వెనక్కి త్రిప్పి పంపారు. ఒకప్పుడు ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నప్పటికీ కేంద్రప్రభుత్వం ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. అంటే దీనిని బట్టి కేంద్రం అనుమతి లేనిదే రాష్ట్ర ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేయకూడదని అర్ధమవుతోంది.   కానీ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5(2) క్రింద సర్వీస్ ప్రొవైడర్ల నుంచి తమకు అవసరమయిన సమాచారం కోరే హక్కు తెలంగాణా ప్రభుత్వానికి ఉందని అదనపు సొలిసిటర్ జనరల్ కే.ఎం.నటరాజన్ కోర్టుకి తెలియజేసారు. అంతే కాదు తెలంగాణా ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించిందని కూడా ఆయన కోర్టుకి తెలియజేసారు. విజయవాడ కోర్టు కోరుతున్న కాల్-డాటా ప్రస్తుతం సర్వీస్ ప్రొవైడర్ల వద్ద లేదని, అదిప్పుడు సంబంధిత అధికారుల వద్ద మాత్రమే ఉందని, సర్వీస్ ప్రొవైడర్ల వద్ద తెలంగాణా ప్రభుత్వం వ్రాసిన లేఖలు మాత్రమే ఉన్నాయని, ఇండియన్ ఎవిడెన్స్ ఏక్ట్ లో సెక్షన్ 123,124 ప్రకారం ఆ లేఖలను బయటపెట్టనవసరం లేదని తెలంగాణా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణా రెడ్డి కోర్టుకి తెలియజేసారు. ఆంద్ర ప్రదేశ్ పోలీసులు ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదు చేయడమే తెలంగాణా ప్రభుత్వ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడమేనని జెట్మలానీ వాదించారు.   వారి వాదోపవాదాలు, అందులో న్యాయపరమయిన అంశాల సంగతిని పక్కనబెడితే, తెలంగాణా ప్రభుత్వం ట్యాపింగ్ కి పాల్పడిందనే విషయం స్పష్టం అవుతోంది. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలను అడ్డుకోనేందుకే ఫోన్ ట్యాపింగ్ చేసామని వాదిస్తున్న తెలంగాణా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా అస్థిరపరిచే ప్రయత్నాలు చేసిందని ఏపీ ప్రభుత్వ వాదనకు జవాబు ఏమిటి? తెలంగాణా ప్రభుత్వం సుమారు 250 ఫోన్లను ట్యాపింగ్ చేయిందని ఒక మంత్రి ఆరోపిస్తున్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం మరొక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫోన్లను ఇంత విచ్చలవిడిగా ట్యాపింగ్ చేయడం నేరం కాదా? దాని సార్వభౌమత్వాన్ని సవాలు చేయడం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం గురించి ఇదివరకే తాము కేంద్రానికి పిర్యాదు చేశామని, మళ్ళీ మరొక్కమారు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు చేప్పట్టవలసిందిగా కోరుతామని తెదేపా నేతలు చెపుతున్నారు.

ఉగ్రవాదులకు మనం ఎటువంటి సంకేతాలు పంపుతున్నాము?

  యాకుబ్ మీమన్ ముస్లిం అయినందునే అతనిని ఉరి తీస్తున్నారని కొందరు వితండవాదం చేసారు. చివరికి సల్మాన్ ఖాన్ వంటి వ్యక్తి కూడా అతనిని సమర్దిస్తూ ట్వీట్ చేసాడు. కానీ యాకుబ్ మీమన్ 257 మంది ప్రజల మరణానికి, 650 మంది గాయపడటానికి కారకుడనే విషయం విస్మరించడం విస్మయం కలిగిస్తోంది. సుమారు దశాబ్దంపాటు సాగిన సుదీర్ఘమయిన న్యాయవిచారణలో అతను దోషిగా దృవీకరించిన తరువాతనే అతని కోర్టులు మరణశిక్ష వేసాయి. అన్నేళ్లపాటు కోర్టులో న్యాయపోరాటం చేయగలిగిన అతనికి అన్యాయం జరిగిందని వాదించడం అర్ధరహితమే. అసలు అతనికి అన్నేళ్లపాటు పోరాడేందుకు అవకాశం కల్పించడం ద్వారానే అతని పట్ల మన న్యాయవ్యవస్థలు ఎటువంటి వివక్ష చూపలేదని స్పష్టం అవుతోంది.   అతనికి అండగా నిలబడ్డవారు న్యాయం కోరుతూ మళ్ళీ నిన్న అర్దరాత్రి సుప్రీంకోర్టు తలుపులు తడితే సుప్రీంకోర్టు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈరోజు తెల్లవారు జామున 3.00-4.30 గంటల వరకు సుప్రీం త్రిసభ్య ధర్మాసనం వారి వాదనలను వింది. అటువంటప్పుడు అతనికి అన్యాయం జరిగిందని ఏవిధంగా అనగలరు. సుప్రీంకోర్టు అతనికి మరణ శిక్ష ఖరారు చేసిన తరువాత, రాష్ట్రపతి అతని క్షమాభ్క్ష పిటిషన్ని తిరస్కరించిన తరువాత కూడా మళ్ళీ అతని కేసుని సుప్రీం కోర్టు రెండుసార్లు పునర్విచారించింది. మళ్ళీ రాష్ట్రపతి అతని క్షమాభిక్ష పిటిషన్ని పునః పరిశీలించారు. సుప్రీం ధర్మాసనం, రాష్ట్రపతి రెండవసారి కూడా అతనికి ఈ కేసులో మరణశిక్షకి అర్హుడేనని భావించిన తరువాతనే అతనికి మరణ శిక్ష అమలుచేసారు.   నిజానికి భారత పౌరులను బలిగొన్న ఒక నేరస్తుడు ఈకేసు కోసం భారత రాష్ట్రపతిని అర్దరాత్రి వరకు, సుప్రీంకోర్టుని తెల్లవారుజాము వరకు కూడా పనిచేయించగలిగాడంటే అతను ఎంత శక్తివంతుడో, అతనికి ఎంత అంగబలం, అర్ధబలం, పలుకుబడి ఉందో స్పష్టమవుతోంది. అటువంటి శిక్షలు పడిన సాధారణ ఖైదీలెవ్వరికీ ఇటువంటివి సాధ్యం కాదు. కానీ యాకుబ్ మీమన్ వెనుక అసాధారణమయిన బలం, చాలా పలుకుబడి గల శక్తులు ఉన్నందునే అతను చివరి నిమిషం వరకు న్యాయపోరాటం చేయగలిగాడని స్పష్టం అవుతోంది.   కానీ మన న్యాయస్థానాలు ఎంతటి ఉగ్రవాదికయినా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొనేందుకే చివరి వరకు అన్ని అవకాశాలు కల్పిస్తే దానినే మన మేధావులు తప్పుపడుతున్నారు. అతని తరపున అంతపోరాటం జరిగిన తరువాత కూడా అతనిని ఉరి తీయడం అన్యాయం అని అంటే అంతకంటే అన్యాయం మరొకటి ఉండదు. అతనిని ఉరి తీసిన తరువాత కూడా అతనివల్ల భారత్ చాలా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్దపడవలసివస్తోంది అంటే భారత వ్యతిరేక శక్తులు దేశంలో ఎంతగా వ్రేళ్ళూనుకొని ఉన్నాయో అర్ధమవుతోంది.   భారతదేశంపై దాడులకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని భారత ప్రభుత్వం, మన న్యాయవ్యవస్థలు ఉగ్రవాదులకు బలమయిన సందేశం ఇవ్వాలని భావిస్తే, అటువంటి ఉగ్రవాదులను విద్యావంతులు, మనవ హక్కుల సంఘాల నేతలు, న్యాయవాదులు, మత పెద్దలు, రాజకీయనాయకులు సమర్ధించడం ఉగ్రవాదులకు మరింత దైర్యం కల్పిస్తోంది. తమకు భారత్ లో మద్దతు ఇచ్చేవారు చాలా మందే ఉన్నారని, కనుక భారత్ పై దాడులు చేసేందుకు ఏ మాత్రం సంకోచించనవసరంలేదని వారు భావించేలా చేస్తోంది.   మొన్న పంజాబ్ లో పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు దాడి చేసి తొమ్మిది మందిని చంపారు. అంతకంటే ముందుగా వారు పఠాన్ కోట్ రైల్వే ట్రాక్ పై ఐదు బాంబులు కూడా అమర్చారు. ఒకవేళ అవి ప్రేలి ఉంటే వందలాది మంది ప్రయాణికులు మరణించేవారు. అటువంటి చర్యలను ఖండించడానికి మన మేధావులు, మత పెద్దలు, మనవ హక్కుల సంఘాలు ముందుకు రావు. కానీ ఉగ్రవాదులు ఎవరయినా పట్టుబడి ఈవిధంగా ఉరిశిక్షకు గురయితే మాత్రం చాలా ఆందోళనపడిపోతారు. తమ శక్తి యుక్తులన్నిటినీ వినియోగించి అటువంటి వారిని కాపాడేందుకు చివరి నిమిషం వరకు కూడా పోరాడుతారు. అందుకు అవసరమయితే మన రాష్ట్రపతిని, న్యాయవ్యవస్థలను కూడా రేయింబవళ్ళు పనిచేయించగల సమర్ధులు. ఈ విదంగా వ్యవహరిస్తూ మన దేశంపై దాడులు చేసి ప్రజల ప్రాణాలు హరిస్తున్న ఉగ్రవాదులకు ఇంతకీ మనం ఏమి చెప్పదలచుకొన్నాము? అని అందరూ ఆలోచించవలసిన సమయమిది.

విజయవాడకు ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు సాధ్యమేనా?

  రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలు, ప్రభుత్వాలు ఏర్పడి అప్పుడే ఏడాది గడిచిపోయింది. కానీ నేటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలన హైదరాబాద్ నుండే కొనసాగుతోంది. మరొక తొమ్మిదేళ్ళవరకు కూడా అక్కడి నుండే పరిపాలించుకొనే వెసులుబాటుంది. కానీ దాని వలన ఊహించని అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. రాష్ట్రం ఒకచోట...పరిపాలనా కేంద్రం మరొక చోట ఉన్నందున ప్రభుత్వానికి వ్యయప్రయాసలే కాకుండా పరిపాలనపై కూడా ఆ దుష్ప్రభావం పడుతోంది.   గోదావరి పుష్కరాల సమయంలో ఈ లోపం చాలా స్పష్టంగా కనబడింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుష్కారాలలో కలియతిరుగుతూ పనులను చక్కబెట్టవలసి వచ్చింది. అదే ఉద్యోగులు, అధికారులు అందరూ విజయవాడకి తరలి వచ్చి ఉండి ఉంటే గోదావరి పుష్కరాలు మరింత అద్భుతంగా నిర్వహించి ఉండేవారేమో?   రాష్ట్రప్రభుత్వం త్వరలోనే రాజధాని అమరావతి నిర్మాణం కూడా మొదలుపెట్టాలని భావిస్తునందున, ఆ పనులను సంబందిత అధికారులు స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ వారందరూ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నందున, అప్పుడప్పుడు వచ్చిపోగలరు. ఇంత భారీ నిర్మాణ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఉద్యోగుల పాత్ర, అధికారుల పర్యవేక్షణ చాలా అవసరం ఉంటుంది. రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టుపై మొదటి నుండే సరయిన పర్యవేక్షణ లేకపోతే ఆనక ప్రజలు, ప్రతిపక్షాల నుండి రాష్ట్రప్రభుత్వమే విమర్శలు ఎదుర్కోవలసి ఉంటుంది.   బహుశః అందుకే పంచాయితీ రాజ్, రోడ్లు భవనాలు, రెవెన్యూ, విద్యా, వైద్యం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, ఆర్ధిక, కార్మిక శాఖలకు చెందిన అన్ని విభాగాలను వీలయినంత త్వరగా విజయవాడకు తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందుకోసం ఐదుగురు ఐ.ఏ.యస్. అధికారులతో కూడిన ఒక కమిటినీ నియమించారు. ఆ కమిటీలో శ్యాం బాబ్, లవ్ అగర్వాల్,జవహార్ రెడ్డి, హేమ ముని వెంకటప్ప, జయలక్ష్మి సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్ నుండి ప్రభుత్వ కార్యాలయాను, వాటితో బాటే ఉద్యోగులను, ఉన్నతాధికారులను తరలించేందుకు అవసరమయిన ఏర్పాట్లు చేయవలసిందిగా ఆ కమిటీని ఆదేశించారు. విజయవాడ, గుంటూరు, సి.ఆర్.డి.ఏ. పరిధిలో ఉన్న రాజధాని ప్రాంతాలలో భవనసముదాయాలను, ఇళ్ళను అద్దెకు తీసుకొని వాటిలో ప్రభుత్వ కార్యాలయాలను ఉద్యోగులు, ఉన్నతాధికారులకు నివాసాలను ఏర్పాటు చేయవలసిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. కానీ ఇంతకు ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ శాఖలను, ఉద్యోగులను విజయవాడకు తరలించేందుకు ప్రయత్నించి విఫలమయింది. కారణాలు అందరికీ తెలిసినవే. కనుక మళ్ళీ ఇప్పుడు అదే సమస్య ఎదురవవచ్చును.   కనుక ప్రభుత్వం ముందుగా ఉద్యోగ సంఘాలనేతలతో, ఉన్నతాధికారులతో చర్చించి అడుగు ముందుకు వేస్తే మంచిది. లేకుంటే మళ్ళీ వారు నిరాకరిస్తే అది వారికీ, ప్రభుత్వానికీ కూడా గౌరవప్రదంగా ఉండదు. హైదరాబాద్ నుండి ఒకేసారి సుమారు 30-40వేల మంది ఉద్యోగులను, డజన్ల కొద్దీ ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను తరలించే ముందు అక్కడ అవసరమయిన ఇళ్ళు, భవన సముదాయాలు అద్దెకు దొరుకుతాయా లేదా? ఒకవేళ దొరికినా ప్రస్తుత పరిస్థితుల్లో వాటన్నిటికీ ప్రభుత్వం అద్దెలు చెల్లించగలదా లేదా? ఆ ఆర్దికభారాన్ని ఎంతకాలం భరించగలదు? వంటి అనేక సందేహాలను నివృత్తి చేసుకొన్నాక రంగంలోకి దిగితే మంచేదేమో? ఆలోచించాలి.

కష్టాలలో కూడా అనుభవం, అవకాశాలనే చూసిన కలాం!

  జీవితంలో చాలా చిన్న చిన్న పరిచయాలు, సంఘటనలు, అవకాశాలు, అనుభవాల నుండే ఆయన పాఠాలు నేర్చుకొంటూ సమున్నత శిఖరాలు అధిరోహించడమే కాకుండా విద్యార్ధులను, ప్రజలను కూడా ఆయన నిత్యం ప్రేపించేవారు. మొదట తండ్రి జైనులాబ్దీన్ దగ్గర అన్ని మతాలను గౌరవించడం నేర్చుకొన్నారు. జీవితంలో కష్టసుఖాలను ఒకే దృష్టితో ఏవిధంగా స్వీకరించాలో తల్లి హాజీ అమ్మాళ్ వద్ద నేర్చుకొన్నారు. కలాం తన బావగారు అహ్మద్ జలాలుద్దీన్ ప్రోత్సాహంతో ఇంగ్లీషు నేర్చుకొన్నారు. రోజూ న్యూస్ పేపర్లు వేసే తన దగ్గర బందువు షంషుద్దీన్ తో కలిసి కలాం కూడా పేపర్లు పంచుతూ వాటి నుండి లోక జ్ఞానం సంపాదించుకొన్నారు.   రామేశ్వరం ఆలయంలో ప్రధాన అర్చకుడు లక్షణ శాస్త్రి కుటుంబంతో తన తండ్రికున్న అనుబందం వలన హిందూ మతం గొప్పదనం గురించి తెలుసుకొన్నారు. ఆయన కుమారుడు రామనాధ శాస్త్రి, మరో ఇద్దరు చిన్ననాటి స్నేహితుల వలన హిందూ పురాణాలు, భగవద్గీత గురించి తెలుసుకొన్నారు. ఆయనకి అత్యంత ఇష్టమయిన గ్రందాలు భగవద్గీత, తిరుక్కురళ్.   కళాశాలలో చదువుకొంటున్నప్పుడు అబ్దుల కలాంలో దాగిఉన్న ప్రతిభని గుర్తించిన సైన్స్ ఉపాద్యాయుడు శివసుబ్రహ్మణ్యం అయ్యర్ అబ్దుల్ కలాం ని ఎంతగానో ప్రోత్సహించేవారు. నిజానికి ఆయన ప్రేరణ కారణంగానే కలాంలో సైంటిస్ట్ కావాలనే తపన రగిలింది. ఆ తరువాత కలాం అదృష్టం కొద్దీ హైస్కూలులో కూడా ఆయనను ప్రోత్సహించే గురువే దొరికారు. రామనాధపురం స్కూల్లో ఇయడురై సోలమన్ అనే ఉపాద్యాయుడు ఇచ్చిన ప్రోత్సాహం, ప్రేఅరణ కలాం జీవితాంతం గుర్తుపెట్టుకోవడమే కాకుండా ఆయన చెప్పిన మాట “ఆత్మ విశ్వాసం ఉంటే నువ్వు నీ విధి వ్రాతను కూడా తిరిగి రాయగలవు,” విద్యార్ధులకు కూడా చెపుతుండేవారు.   మద్రాస్ ఐ.ఐ.టి.లో చేరేందుకు ఆయన వద్ద డబ్బులు లేకపోతే ఆయన సోదరి జోహారా తనకున్న కొద్దిపాటి బంగారు నగలను తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి ఆయనకిచ్చి ప్రోత్సహించింది. కలాం తనకు అత్యంత ఇష్టమయిన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ని ఎంచుకొన్నారు. మళ్ళీ అక్కడా నరసింగరావు, కెఏవి పండల, స్పాండర్ అనే ముగ్గురు గురువులు ఆయనలో వైమానిక రంగంలో ఉన్న అభిరుచిని గుర్తించి ఆయనకి ఆ రంగంలో నిష్ణాతుడిగా ఎదిగేందుకు చక్కటి మార్గదర్శనం చేసారు. ఆవిధంగా ఆయన భారతదేశం గర్వించదగ్గ గొప్ప సైంటిస్ట్ గా ఎదిగారు.   ఈ ప్రపంచంలో మనుషులు అందరికీ సమస్యలు ఉంటాయి..కష్టాలు ఉంటాయి వాటితో బాటే అవకాశాలు కూడా ఉంటాయి. సమస్యలను చూసి భయపడిపోకుండా వాటి నుండే జీవిత పాఠాలు నేర్చుకోవాలని, వాటినే సోపానాలుగా మార్చుకొని జీవితంలో పైకి ఎదగాలని, అందరికీ ప్రేరణగా నిలవాలని అబ్దుల్ కలాం నిరూపించి చూపారు. నేడు ఎంతో మంది తల్లితండ్రులు తమ పిల్లలకి వడ్డించిన విస్తరిలాంటి జీవితాన్ని అందిస్తున్నప్పటికీ ఇంకా ఏదో తక్కువయిందని, ఇంకా ఏదోలేదని నిరాశ నిస్పృహలతో బ్రతుకుతున్నారు. అటువంటి వారికి కలాం జీవితచరిత్ర చదివితే తమ జీవితాలు ఎంత గొప్పగా ఉన్నాయో ఇంకా ఎంత ఎత్తుకు ఎదగవచ్చో తెలుసుకోవచ్చును.

అది సుప్రీం తీర్పుని ప్రశ్నించడమే!

  ముంబై ప్రేలుళ్ళ కేసులో ప్రధాన పాత్రధారి యాకుబ్ మీమన్ కి ఈనెల 30న నాగపూర్ జైల్లో ఉరిశిక్ష అమలు చేయబోతున్నట్లు వార్త వెలువడగానే దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లిం నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా “అతనిని ఉరి తీయవద్దు, ఆ నేరానికి పాల్పడిన అతని సోదరుడు టైగర్ మీమన్ని ఉరి తీయండి” అని ఒక ట్వీట్ మెసేజ్ పెట్టారు.   ఊహించినట్లే దానిపై సర్వత్రా నిరసనలు వెలువెత్తాయి. దానితో ఆయన మళ్ళీ మరొక ట్వీట్ మెసేజ్ లో, “యాకూబ్ మెమన్ నిర్దోషి అని నేను కూడా భావించడం లేదు. కానీ అన్నకి బదులుగా తమ్ముడు ఉరికంబం ఎక్కుతున్నాడనే ఉద్దేశ్యంతో మానవతా దృక్పదంతోనే అతనిని ఉరి తీయవద్దని కోరాను తప్ప వేరే ఉద్దేశ్యం లేదు. మన న్యాయవ్యవస్థల పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది. ముంబై బాంబు ప్రేలుళ్ళలో అనేకమంది అమాయకులయిన ప్రజలు చనిపోయారు. ఒక్క మనిషి ప్రాణం పోయినా అది మానవత్వానికి మచ్చ వంటిదేనని ఇది వరకు చాలాసార్లు చెప్పాను. ఆ ఉద్దేశ్యంతోనే యాకుబ్ కి ఉరి వద్దన్నాను. కానీ ఉద్దేశ్యపూర్వకంగా ఆవిధంగా అనలేదు. ఒకవేళ నా అభిప్రాయలు ఎవరి మనసులనయినా నొప్పించి ఉంటే వారందరికీ బేషరతుగా క్షమాపణలు చెపుతున్నాను,” అని అన్నారు.   రాజకీయాలలో ఉన్న అసదుద్దీన్ వంటి నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం దీనినొక అవకాశంగా వాడుకోవడం సహజం. కేవలం హైదరాబాద్ పాతబస్తీకే పరిమితమయిన తన మజ్లీస్ పార్టీని యావత్ రాష్ట్రంలో ఇంకా వీలయితే యావత్ భారతదేశంలో విస్తరించాలని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ చాలా కాలంగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే ఆయన ముస్లిం ప్రజలను ఆకట్టుకొనేందుకు యాకుబ్ మీమన్ ఉరి శిక్షని వ్యతిరేకిస్తూ గట్టిగా వాదిస్తుండవచ్చును. కానీ ప్రజలు, రాజకీయ పార్టీలు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యల పట్ల స్పందించినట్లుగా అసదుద్దీన్ వ్యాఖ్యలపై ప్రతిస్పందించడం లేదనే విషయాన్ని అందరూ గమనించాల్సి ఉంది. అందుకు కారణం అసదుద్దీన్ రాజకీయాలలో ఉండటం సల్మాన్ సినీ పరిశ్రమలో ఉండటమే. ఒకవేళ సల్మాన్ ఖాన్ కి ఎదురయిన పరిస్థితే అసదుద్దీన్ ఓవైసీకి కూడా ఎదురయి ఉండి ఉంటే అప్పుడు ఆయన సల్మాన్ ఖాన్ లాగ క్షమాపణలు చెప్పే బదులు దానిని కూడా మరొక రాజకీయ అవకాశంగా మలుచుకొనేందుకు తప్పకుండా ప్రయత్నించేవారని చెప్పవచ్చును.   రాజకీయ నేతలకీ, సినీ హీరోలకి ఉన్న చిన్న తేడా అదే! ఆ విషయం తెలుసుకోకుండా నటుడు సల్మాన్ ఖాన్ అనవసరంగా ఇటువంటి వ్యాఖ్యలు చేసి కోరుండి సమస్యలు కొని తెచ్చుకొన్నారు. కానీ ఆయన వంటి ప్రముఖులు కూడా భారతీయ న్యాయవ్యవస్థ తీర్పుపై ఈవిధంగా అనుమానాలు వ్యక్తం చేయడం సబబు కాదు. భారతీయ న్యాయవ్యవస్థలో ఎన్నో లోపాలు, చట్టాలలో ఎన్నో లొసుగులు ఉండవచ్చు గాక. కానీ వందలాది ప్రజలను అతి కిరాతకంగా కాల్చి చంపిన అజ్మల్ కసాబ్ లేదా పార్లమెంటుపై దాడికి కుట్ర పన్నిన అఫ్జల్ గురు లేదా ముంబై వరుస ప్రేలుళ్ళలో సుమారు 250 మంది ప్రజల ప్రాణాలు బలిగొన్న యాకుబ్ మీమన్ కావచ్చు...ఎంత కరుడు గట్టిన నేరస్థుడికయినా తను నిర్దోషి అని నిరూపించుకొనేందుకు మన న్యాయ వ్యవస్థ అవకాశం ఇస్తుంది.   అందుకే దేశంలో కోట్లాది మంది పసి పిల్లలు, వృద్దులు, ఆనాధలు తిండి, గుడ్డ, గూడు, విద్య, వైద్యం లేక రోడ్లపైనే బ్రతుకుతున్నా కసాబ్, అఫ్జల్ గురు, యాకుబ్ మీమన్ వంటి కరడుగట్టిన ఉగ్రవాదులు శిక్ష అమలయ్యే వరకు కూడా సమస్త రాజభోగాలు అనుభవించగలుగుతున్నారు. రెండు మూడు నెలల్లో తేలవలసిన కేసులని రెండు మూడు దశాబ్దాలపాటు పొడిగించ గలుగుతున్నారు. వందలాది మంది ప్రజల ప్రాణాలను హరించిన అటువంటి కిరాతకులని ఉరి తీస్తే అది మానవత్వానికే మచ్చ అని సల్మాన్ ఖాన్ వంటి వ్యక్తి చెప్పడం చాలా తప్పు. అది ఖచ్చితంగా మన న్యాయవ్యవస్థల తీర్పులను అవమానించడమే.

రాహుల్ దెబ్బకి జగన్ విలవిలా!

  అత్త కొట్టినందుకు కాదుకానీ తోడికోడలు నవ్వినందుకే ఏడ్చానన్నట్లుంది జగన్మోహన్ రెడ్డి తీరని రాజకీయ నేతలు ముసిముసి నవ్వులు నవ్వుకొంటున్నారు. రాహుల్ గాంధీ అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా “అసలు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఉందా లేదా? ఇంతవరకు కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఏమి చేస్తోంది? ప్రధాని మోడీని ఎందుకు నిలదీయలేకపోతోంది? మోడీకి భయపడే వైకాపా నోరు మెదపడంలేదేమో” అని ఘాటుగా విమర్శించారు.   ఇంతవరకు అధికార తెదేపా నేతలు తనని రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నావని ఎన్ని విమర్శలు చేసినా జగన్మోహన్ రెడ్డి భరించారు, కానీ రాహుల్ గాంధీ వచ్చి తమ పార్టీ ఏమి చేయడం లేదనేసరికి ఆయన తట్టుకోలేకపోయారు. “గత ఐదేళ్ళుగా కాళ్ళకు చక్రాలు కట్టుకొని ఈకొస నుండి ఆకొస వరకు రాష్ట్రమంతటా కలియ తిరుగుతూ, ఓదార్పు యాత్రలు, ధర్నాలతో ఇంత హడావుడి చేస్తుంటే అదేమీ రాహుల్ గాంధీకి కనబడలేదా?” అని జగన్ ప్రశ్నించారు. అయినా ప్రధాన ప్రతిపక్షంగా తమ పార్టీ ప్రదర్శిస్తున్న చురుకుదనం చూసే రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చేరని జగన్మోహన్ రెడ్డి తీర్మానించేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా అందరి కంటే ముందుగా స్పందించేది తామేనని చెప్పారు.   వారి విమర్శలు, ప్రతి విమర్శల సంగతి ఎలా ఉన్నప్పటికీ వారు చేసే ఈ పాదయాత్రలు, పరామర్శ యాత్రలు, భరోసా యాత్రలు అన్నీ తమ పార్టీలని బలోపేతం చేసుకోవడానికేనని అందరికీ తెలుసు. లేకుంటే చనిపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళుతున్నప్పుడు కూడా వారు ఇంత హడావుడి, ప్రచారం చేసుకోకూడదు.   మరొక విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గత ఐదారేళ్ళుగా ఓదార్పు యాత్రలు చేసినా ఎన్నికలలో గెలవలవలేకపోయారు. అటువంటప్పుడు రాహుల్ గాంధీ హడావుడిగా ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో ఒక్కరోజు పాదయాత్రలు చేసి వెళ్ళిపోతే ఏమయినా ఫలితం ఉంటుందా? అంటే ఉండదనే అర్ధమవుతోంది. ఈ సంగతి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలకి కూడా తెలుసు కానీ వారు కూడా ఈ విషయంలో ఏమీ చేయలేరు ఆపసోపాలు పడుతూ ఆయన వెనుక పరుగులు పెట్టడం తప్ప.   కానీ రాహుల్ గాంధీ ప్రత్యేకహోదా విషయంలో వైకాపాపై చేసిన విమర్శలు సహేతుకమయినవేనని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ అంశం గురించి జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ నేతలెవ్వరూ కూడా గట్టిగా మాట్లాడిన దాఖలాలు లేవు. అందుకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంజాయిషీ మరీ విడ్డూరంగా ఉంది. ప్రత్యేక హోదా గురించి తమ ఎంపీలు పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తున్నారని కనుక దాని గురించి తాము రాష్ట్రంలో పోరాటాలు చేయనవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. “అయినా ప్రతీ అంశం మీద కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వయంగా స్పందించడం ఎప్పుడయినా చూసారా? అలాగే నేను కూడా ప్రతీ అంశంపై స్వయంగా స్పందించానవసరం లేదు,” అని సమర్ధించుకొన్నారు.   కేంద్ర ప్రభుత్వం పరిష్కరించవలసిన ప్రత్యేకహోదా, రైల్వే జోన్, పోలవరం ఇత్యాది అంశాల గురించి ఆయనెప్పుడు గట్టిగా మాట్లాడకపోయినా, రాష్ట్రంలో రైతుల రుణమాఫీ, రాజధాని భూసేకరణ, పట్టిసీమ, పుష్కారాలు వగైరా అంశాల మీద మాత్రం చాలా తీవ్రంగానే స్పందిస్తుంటారు. కారణం ఏదో ఒకనాడు తెదేపా-బీజేపీలు తెగ తెంపులు చేసుకోవా? అప్పుడు తమకి బీజేపీతో పొత్తులు పెట్టుకొనే అవకాశం రాకపోదా? అనే ఆలోచనయినా కావచ్చు లేదా కేంద్రంతో పెట్టుకొంటే మళ్ళీ తనపై ఈడి, సీబీఐ కేసులు ఊపందుకొంటాయనే భయంవల్ల కావచ్చును. అందుకే రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడినంత ధాటిగా ప్రత్యేకహోదా వంటి అంశాల గురించి ఆయన మాట్లాడారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అంతర్ రాష్ట్ర వివాదాలలో ఉద్యోగులు బలవుతున్నారా?

  గత ఏడాది కాలంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న అనేక వివాదాస్పద నిర్ణయాలను, జి.ఓ.లను కోర్టులు పదేపదే తప్పుపడుతున్నప్పటికీ ప్రభుత్వం మళ్ళీ అటువంటి అవమానకరమయిన పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడలేదు. పైగా మళ్ళీ మళ్ళీ అటువంటి పరిస్థితే కోరి తెచ్చుకొంటోంది. తెలంగాణా ట్రాన్స్ కో, తెలంగాణా జెన్ కో, తెలంగాణా విద్యుత్ పంపిణీ వ్యవస్థలలో పనిచేస్తున్న ఆంధ్రా ప్రాంతాలకి చెందిన 1250 మంది ఉద్యోగులనుక్రిందటి నెల 3వ తేదీన విధులలో నుండి తప్పించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించే ప్రయత్నం చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ ఉద్యోగులు అందరూ హైకోర్టులో ఒక పిటిషన్ వేసారు. దానిపై స్పందించిన హైకోర్టు తొలగించిన ఉద్యోగులందరినీ తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణా విద్యుత్ సంస్థలను ఆదేశించింది.   దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి పిర్యాదు చేసింది. కేవలం ఆంధ్రా ప్రాంతానికి చెందినవారనే కారణంతో ఉద్యోగులను బయటకి పంపడం రాష్ట్ర విభజన చట్టానికి విరుద్దంగా ఉందని కనుక తక్షణమే ఆ ఉద్యోగులు అందరినీ మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని, మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకుండా కేంద్రప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దాని వాదనతో ఏకీభవించిన కేంద్రప్రభుత్వం రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకి యదాతధ స్థితి కొనసాగించమని ఆదేశిస్తూ లేఖలు వ్రాసింది. ఆ లేఖలో కేంద్ర హోంశాఖ డైరెక్టర్ అశుతోష్ జైన్ ఈ సమస్యని పరిష్కరించేందుకు మూడు ప్రతిపాదనలు చేసారు.   1. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకొని ఉద్యోగుల విభజన ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలి. 2. లేదా దీని కోసమే కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమలనాధన్ కమిటీ సూచించిన మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల విభజన చేసుకోవాలి. ఈ విషయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మళ్ళీ వివాదాలు తలెత్తినట్లయితే కమల్ నాధన్ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. 3. పై రెండు ప్రతిపాదనలు సాధ్యం కాకపోతే కేంద్రప్రభుత్వమే జోక్యం చేసుకొని ఉద్యోగుల విభజన ప్రక్రియను మళ్ళీ కమల్ నాధన్ కమిటీ లేదా షీలా బిడే కమిటీకిగానీ అప్పగిస్తుంది. ఈ మూడు ప్రతిపాదనలపై ఇరు రాష్ట్రాలు శనివారంలోగా తమ అభిప్రాయాలు తెలపాలని కేంద్రహోం శాఖ డైరెక్టర్ అశుతోష్ జైన్ ఆదేశించారు.   స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగాలనే తెలంగాణా ప్రభుత్వ వాదన సమంజసంగానే ఉన్నప్పటికీ, గత మూడు నాలుగు దశాబ్దాలుగా తెలంగాణాలోనే స్థిరపడి, అక్కడి ప్రభుత్వ శాఖలలోనే పనిచేస్తున్న ఆంధ్రా ప్రాంత ఉద్యోగులను, వారి ఆంధ్రా మూలాల కారణంగానే తొలగించాలనుకోవడం సమంజసం కాదని కోర్టులు కూడా అభిప్రాయమ వ్యక్తం చేసాయి. కానీ తెలంగాణా ప్రభుత్వం కోర్టుల అభిప్రాయాలను పట్టించుకోకుండా ముందుకు సాగుతుండటంతో ఈ సమస్య పునరావృతం అవుతోంది. ఇటీవల షెడ్యూల్:10 క్రింద వచ్చే సంస్థలన్నిటినీ కూడా ఏకపక్షంగా స్వాధీనం చేసుకొన్న తెలంగాణా ప్రభుత్వం వాటిల్లో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో తెలంగాణాకు చెందిన ఉద్యోగులను నియమించాలని ఆదేశించింది. బహుశః మున్ముందు ఇటువంటి సమస్యలు తలెత్తుతూనే ఉండవచ్చును.   రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని కేవలం ఒక సమస్యగానో లేక వివాదంగానో రాజకీయకోణంలో నుండి చూస్తున్నాయి. కానీ ఇది వేలాది మంది ఉద్యోగుల, వారిపై ఆధారపడిన కుటుంబాలకు తీవ్ర ఆందోళన కలిగించే విషయం. వారి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసే జీవన్మరణ సమస్య ఇది. కనుక రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, కమిటీలు, ఉద్యోగ సంఘాలు అందరూ కలిసి ఈ సమస్యను వీలయినంత త్వరగా ఉద్యోగులకు ఏ మాత్రం నష్టం జరగకుండా పరిష్కరించవలసిన బాధ్యత ఉంది.

రాహుల్ గాంధీ పాదయాత్రతో ఏపీలో కాంగ్రెస్ కోలుకొంటుందా?

  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కొద్ది సేపటి క్రితమే అనంతపురం జిల్లాలో ఓబులదేవర చెరువు నుండి పాదయాత్ర ప్రారంభించారు. జిల్లాలో ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాలను పరామర్శించడానికే ఆయన పాదయాత్ర చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటున్నారు. కానీ రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా తుడిచిపెట్టుకుపోతున్న కాంగ్రెస్ పార్టీని కాపాడుకొని తిరిగి బలోపేతం చేసేందుకే ఆయన పాదయాత్ర చేస్తున్నారని అందరికీ తెలుసు. అందుకే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆయన పాదయత్రని ఎన్నికల ప్రచారసభలాగా చాలా అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు సోనియా గాంధీ కూడా అదే జిల్లాలో ఎన్నికల ప్రచారం ప్రారంభించినపుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విజయం సాధించింది కనుకనే రాహుల్ గాంధీ కూడా తన పర్యటనకు అనంతపురం జిల్లాని ఎంచుకొన్నారు తప్ప అక్కడి రైతులను ఓదార్చడానికని ఎవరూ భ్రమపడనవసరం లేదని తెదేపా నేతలు వాదిస్తున్నారు. కానీ రాష్ట్ర విభజనకు మూలకారకుడయిన రాహుల్ గాంధీ చేసే ఈ పాదయాత్రతో రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని అక్కున చేర్చేసుకొంటారనే భ్రమ కూడా అనవసరమేనని చెప్పక తప్పదు.   ఎందుకంటే ఆయన చేస్తున్న ఈ పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగకపోగా ఇప్పుడిప్పుడే మానుతున్న గాయాన్ని మళ్ళీ కెలికినట్లవుతుంది. రాష్ట్ర విభజన వల్ల ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో...ఎన్ని ఆర్ధిక సమస్యలు..పొరుగు రాష్ట్రంతో వివాదాలు, యుద్దాలు చేయవలసివస్తోందో, ఆ కారణంగా ప్రజలు, ఉద్యోగులు, విద్యార్ధులు కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అందరూ ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు. ఈ సమస్యలన్నిటికీ కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండానే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హడావుడిగా రాష్ట్ర విభజన చేయడమేనని ప్రతీ ఒక్కరికీ తెలుసు. అందుకు కారకుడయిన రాహుల్ గాంధీ ఈ రోజు రాష్ట్రంలో పాదయాత్ర చేయడాన్నే ప్రజలు నిరసిస్తుంటే, ఆయన ఈరోజు తన పాదయాత్ర ముగింపు సమయంలో  కొండకమర్ల గ్రామంలో నిర్వహించే బహిరంగ సభలో రాష్ట్ర విభజన గురించి మాట్లాడబోతున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన వలన రాష్ట్రానికి ఎటువంటి నష్టమూ జరగలేదని పైగా అంతా మంచే జరిగిందని ఆయన ఈ సభలో ప్రజలకి నచ్చచెప్పబోతున్నట్లు సమాచారం.   అదే నిజమయితే రాష్ట్రంలో జీవచ్చవంలా మిగిలున్న కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీయే స్వయంగా భూస్థాపితం చేసిపోయేందుకే ఆయన వచ్చారని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి, పల్లె, పరిటాల, ఎమ్మెల్సీ ముద్దు కృష్ణంనాయుడు చేస్తున్న వాదనలు నిజమని నమ్మక తప్పదు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు సిద్దపడగానే చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు రాజకీయ సన్యాసం తీసుకొన్నారు. మరికొందరు ఎన్నికలకు ముందు, తరువాత ఇతర పార్టీలలోకి వెళ్లిపోయారు. ఇంకా చాలా మంది కాంగ్రెస్ నేతలు త్వరలో వేరే పార్టీలలోకి వెళ్లిపోయేందుకు సిద్దంగా ఉన్నారు. ఉదాహారణకి కొన్ని రోజుల క్రితమే మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వైకాపాలోకి వెళ్ళబోతూ ఆఖరి నిమిషంలో ఆగిపోయారు. అటువంటివారు కాంగ్రెస్ పార్టీలో ఇంకా చాలా మందే ఉన్నారు. బహుశః రాహుల్ గాంధీ పాదయాత్ర ఎఫెక్ట్ తో పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేసేసి వేరే పార్టీలోకి వెళ్లిపోవచ్చునని తెదేపా నేతలు అభిప్రాయ పడుతున్నారు.   రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోందని తెలిసినప్పటికీ, త్వరలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేప్పట్టబోతున్న రాహుల్ గాంధీ తక్షణమే చొరవచూపి పార్టీలో మిగిలిన నేతలయినా విడిచిపెట్టిపోకుండా కాపాడుకొనేందుకు, పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకొనేందుకు ప్రయత్నాలు చేయకుండా అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఇటువంటి పాదయాత్రలు చేస్తుండటం ఆ పార్టీ దురదృష్టమేనని చెప్పక తప్పదు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో పురోగతి

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు ఉన్నతాధికారుల ఫోన్లను తెలంగాణా ప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందనే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ అధికారులు, ట్యాప్ చేయబడినట్లు అనుమానిస్తున్న కొన్నిఫోన్ల కాల్ డాటాను మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ల నుండి తమకు ఇప్పించవలసిందిగా కోరుతూ కొన్ని రోజుల క్రితం విజయవాడ కోర్టులో ఒక మెమో దాఖలు చేసారు. కానీ ఆ వివరాలు ఎవరికయినా ఇస్తే తమను ప్రాసిక్యూట్ చేస్తామని తెలంగాణా ప్రభుత్వం హెచ్చరించిందని వారు కోర్టుకి తెలియజేసారు. కానీ ఈ నెల 24వ తేదీలోగా ఆ వివరాలను తమకు ఇవ్వకపోతే కోర్టు ధిక్కారనేరం క్రింద వారిపై చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించడంతో వారి పని మున్ధునుయ్యిఒ వెనుక గొయ్యి అన్నట్లుగా తయారయింది. దానితో వారు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.   వారి పిటిషన్ని ఇవాళ్ళ విచారణకు చేప్పట్టిన సుప్రీంకోర్టు, ఆ కాల్ డాటాని ఒక సీల్డ్ కవర్లో ఉంచి వారం రోజుల్లోగా విజయవాడ కోర్టుకి సమర్పించామని ఆదేశించింది. కానీ దానిని మూడు వారాల తరువాత మాత్రమే తెరిచి చూడాలని, నాలుగు వారాల తరువాత మాత్రమే దానిపై దర్యాప్తు చేయడానికి అనుమతించమని విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుని ఆదేశించింది. ఇంతవరకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు చేస్తోంది. కానీ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు కాల్ డాటా ఇవ్వకపోవడంతో ఆధారాలు బయటపెట్టలేకపోతోంది. ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా అనుమతించింది కనుక ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారుల చేతికి చిక్కే అవకాశం ఉంది. ఇంతవరకు ఓటుకి నోటు కేసులో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అనైతిక చర్యలకి పాల్పడిందని వాదిస్తున్న తెలంగాణా ప్రభుత్వానికి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రమేయం ఉన్నట్లు తేలితే అంతకంటే అవమానకరమయిన పరిస్థితులు ఎదుర్కోకతప్పదు.

వైయస్స్ కోసం కాంగ్రెస్, వైకాపాలు మళ్ళీ పోటీ?

  సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్, వైకాపాల మధ్య లోపాయికారిగా ఒప్పందం కుదిరినందునే, జగన్ అక్రమాస్తుల కేసులలో ఏకంగా 11 చార్జ్ షీట్లు దాఖలు చేసిన సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి నారాయణ హటాత్తుగా మహారాష్ట్రాకి బదిలీ అయిపోవడం, వెంటనే జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదలవడం జరిగిందని చాలా మంది దృడంగా నమ్ముతున్నారు. ఒకవేళ కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా ఎన్నికలలో గెలిచి ఉండి ఉంటే బహుశః ఆ రెండు పార్టీలు మళ్ళీ అంటు కట్టి ఉండేవేమో? అందుకే తెదేపా నేతలు కాంగ్రెస్, వైకాపా తల్లి పిల్లా కాంగ్రెస్ పార్టీలని అభివర్ణిస్తుంటారు.   తమ పార్టీల పట్ల ప్రజలకున్న ఈ బలమయిన నమ్మకాన్ని వమ్ము చేయడం ఇష్టంలేకనో లేక మున్ముందు అవసరాలను దృష్టిలో పెట్టుకోనో ఆ రెండు పార్టీలు ఎన్నడూ కూడా ఒకదాని జోలికి మరొకటి పోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. అవి ప్రతిపక్షంలో ఉన్నందున ఒకదానినొకటి విమర్శించుకోకపోయినా ప్రజలు కూడా వాటిని పెద్దగా పట్టించుకోలేదు. మళ్ళీ చాలా రోజుల తరువాత వైకాపా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తోంది. కానీ దానికి కారణం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.   ఈనెల 24వ తేదీన అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించినప్పుడు దారిలో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఆయన పూలమాల వేస్తారని కాంగ్రెస్ నేతలు ప్రకటించగానే కాంగ్రెస్ పార్టీపై వైకాపా విమర్శలు గుప్పిస్తోంది.  జగన్ పై అక్రమాస్తుల కేసులు పెట్టి వేధించుతూ, వైయస్స్ రాజశేఖర్ రెడ్డి పేరుని యఫ్.ఐ.ఆర్.లో చేర్చి కాంగ్రెస్ పార్టీ అవమానించిందని వైకాపా అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. మరిప్పుడు రాహుల్ గాంధీ ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఆయన విగ్రహానికి పూలదండ వేస్తారని ఆమె ప్రశ్నించారు.   ఆమె ప్రశ్న ఆలోచించదగ్గదే! ఎందుకంటే వైయస్స్ నేరం చేసారని కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మినందునే ఆయన పేరును యఫ్.ఐ.ఆర్.లో చేర్చినట్లయితే, ఇప్పుడు అదే వ్యక్తి విగ్రహానికి రాహుల్ గాంధీ పూలమాల ఎందుకు వేయాలనుకొంటున్నట్లు? మళ్ళీ వైకాపాకి దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నమా అది? లేకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా వైకాపాలాగే రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకోవాలనే ఆలోచన చేస్తోందా? అనే అనుమానాలు కలగడం సహజం. బహుశః అందుకే ఆమె ముందు జాగ్రత్తగా రాజశేఖర్ రెడ్డి తమ పార్టీకే స్వంతమని ప్రకటించుకొంటున్నారేమో?    రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత ఆయనపై హక్కుల కోసం ఆ రెండు పార్టీల నేతలు వాదోపవాదాలు చేసుకొన్న సందర్భాలు ఉన్నాయి. కానీ తెలంగాణా అంశంతో తెలంగాణాలో లబ్ది పొందలని కాంగ్రెస్ పార్టీ నిశ్చయించుకొన్న తరువాత ఆయనని వైకాపాకే విడిచిపెట్టేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు సైతం ఆయన పేరును వాడుకొనేందుకు జంకారు. కారణం అందరికీ తెలిసిందే. కానీ మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత రాహుల్ గాంధీ ఆయన విగ్రహానికి దండ వేయాలనుకొంటే వైకాపాకి అటువంటి అనుమానాలు కలగడం సహజమే. అందుకే ఈ విషయంపై వైకాపా ఇంత చురుకుగా స్పందించినట్లుంది.

అమరావతికి పక్కా వాస్తు.. రాజధానికి అద్భుత అవకాశం

  ఏపీ క్యాపిటల్ అమరావతి నిర్మాణానికి వాస్తు100 శాతం బావుందని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. ఇప్పటికే ఏపీ సీడ్ క్యాపిటల్ కు సంబంధించిన ఫోటోలు విడుదలవడంతో ప్రపంచ దేశాలను తలదన్నేల ఏపీ రాజధాని ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్‌ ఏపీ సీడ్‌ క్యాపిటల్‌ ప్రణాళికను కూడా అందజేశారు. ముఖ్యంగా పర్యావరణానికి పెద్ద పీట వేసిన ఏపీ రాజధానికి అన్ని వాస్తు ప్రమాణికలు బాగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ రాజధాని నమూనాను కృష్ణానది ఆధారంగా చేసుకొని నిర్మించడం జరిగింది. ఉత్తరాన కృష్ణానది ఉండడంతో నీటి ప్రవాహం ఉత్తరం నుంచి తూర్పు ఈశాన్యం గుండా పారుతున్న క్రమంలో వాస్తు నియమాల ప్రకారం తూర్పు దిశగా అందునా ఉత్తరం నుంచి నీరు తూర్పుకు ఈశాన్యాన ఏటవాలుగా ప్రయాణించడాన్ని అత్యంత ఉత్కృష్టంగా భావిస్తారు. ఇప్పుడు ఏపీ రాజధానికి అలాంటి అద్భుత అవకాశం లభించింది. మరోవైపు దక్షిణ భాగంలో కొండ ప్రాంతం ఉండడం కూడా రాజధానికి వాస్తు పరంగా కలిసిరానుంది. ఇది పరిశ్రమలకు అనువైన స్థలంగా నిపుణులు చెపుతున్నారు. ఈ పరిశ్రమల నిర్మాణానికి కూడా వాస్తు కలిసిరావడం గమనార్హం.   ఒకరకంగా ఏపీ రాజధానికి ఇలా వాస్తు కలిసిరావడం ఓ రకంగా అదృష్టంగానే భావించవచ్చు. అసలు ఏపీ రాజధాని నిర్మాణానికి ఎంత సమయం పడుతుందో తెలియదుకాని రాజధాని అయిన అమరావతి మీద మాత్రం చాలా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి అనేక సింగపూర్, జపాన్ వంటి దేశాలలో పర్యటించి అనేక పెట్టుబడిదారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు సీఎం చంద్రబాబు. ఆ పెట్టుబడి దారులందరూ అనుకున్నట్టుగానే ఏపీలో పెట్టుబడులు పెడితే నిజంగానే ఏపీ రాజధాని ప్రపంచ దేశాలను తలదన్నే రాజధాని అవుతుందనడంలో సందేహం లేదు. కానీ దానికి కొంత సమయం పడుతుండొచ్చు. కాగా ఏపీ సీడ్ క్యాపిటల్ సంబంధించి శనివారం ఫోటోలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

తలసానీ! నైతిక విలువలంటే ఇవేనా?

  తలసాని శ్రీనివాస్ యాదవ్ తెదేపాను వీడి తెరాసలో చేరే ముందు, తెదేపా ప్రాధమిక సభ్యత్వానికి, తన ఎమ్మేల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నాట్లు ప్రకటించారు. రాజకీయాలలో నైతిక విలువలకు కట్టుబడి ఉండేవాడిని గనుకనే పార్టీని వీడగానే ఆ పార్టీ ద్వారా తను గెలుచుకొన్న ఎమ్మేల్యే పదవిని కూడా త్యజిస్తున్నట్లు గొప్పలు చెప్పుకొన్నారు. ఆయన రాజీనామా చేశారని భావించిన గవర్నర్ నరసింహన్ ఆయన చేత తెలంగాణా వాణిజ్యపన్నుల శాఖ మంత్రిగా పదవీ ప్రమాణం చేయించారు. కానీ నాటి నుండి నేటి వరకు ఆయన రాజీనామా ఆమోదం పొందనే లేదు. తను రాజీనామా చేసినప్పటికీ స్పీకర్ దానిని ఆమోదించకబోతే తానేమి చేయగలనని ఆయన ప్రశ్నించేవారు.   ఆయనతో సహా తెదేపా, కాంగ్రెస్ పార్టీల నుండి వచ్చి తెరాసలో చేరిన ఎమ్మేల్యేలందరి రాజీనామాలు ఆమోదించమని ప్రతిపక్షాలు స్పీకర్ కి వినతి పత్రాలు ఇచ్చినా ఇంతవరకు ఆయన వాటిని పట్టించుకోలేదు. వారందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రతిపక్షాలు హైకోర్టుని ఆశ్రయించినపుడు ‘ఇంకా ఎంత సమయం తీసుకొంటారు?’ అంటూ కోర్టు కూడా మందలించింది. అంటే ప్రతిపక్షాలు, గవర్నర్, హైకోర్టు అందరూ కూడా తలసానితో సహా అందరి రాజీనామా లేఖలు స్పీకర్ వద్ద ఉన్నాయని భావిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తన రాజీనామా లేఖను ఇంతవరకు తమకు పంపలేదని తెలంగాణా అసెంబ్లీ డిప్యూటీ సెక్రెటరి డా. నరసింహాచార్యులు సమాచార హక్కు క్రింద కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణా రెడ్డికి తెలియజేసారు.   ఈనెల 8న ఆయన గండ్రకు వ్రాసిన లేఖలో “ఎమ్మేల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా లేఖ మాకు అందలేదు,” అని విస్పష్టంగా పేర్కొన్నారు.   ఇంతవరకు చాలా మంది రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు పార్టీలు మారారు. కానీ వారిలో ఒక్క తలసాని శ్రీనివాస్ యాదవ్ తప్ప మరెవరూ కూడా తమ మాతృ పార్టీల ద్వారా గెలుచుకొన్నఎమ్మేల్యే పదవులకి రాజీనామాలు చేయలేదు. అలాగే నైతిక విలువల గురించి కూడా ఎవరూ మాట్లాడలేదు. ఎందుకంటే, ఎమ్మేల్యే పదవులకి రాజీనామాలు చేసే ఉద్దేశ్యం వారికి లేదు కనుక నైతిక విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా తమకి లేదని వారందరికీ తెలుసు. అందుకే మౌనం వహించారు. కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం గతేడాది డిశంబర్ 16న మీడియా సమావేశం పెట్టి మరీ తను నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేస్తున్నట్లు గొప్పగా ప్రకటించుకొన్నారు. కానీ తాజాగా బయటపడిన ఈ సమాచారంతో నైతికంగా అందరికంటే ఎక్కువ దిగజారిపోయారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.   ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయానికి పంపకుండానే పంపినట్లు అబద్దం చెప్పడమే కాకుండా, రాజీనామా చేసానని చెప్పి గవర్నర్ నరసింహన్ కూడా మభ్యపెట్టి ఆయన చేతనే ప్రమాణ స్వీకారం కూడా చేయించుకొని మరో పెద్ద తప్పు చేసారని ఆరోపిస్తున్నాయి. అదేవిధంగా తెరాస ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని ఇంతకాలం దాచిపుచ్చి గవర్నర్ని, హైకోర్టుని, శాసనసభని, ప్రజలను కూడా మభ్యపెట్టిందని ఆరోపిస్తున్నారు. నైతిక విలువల గురించి నిత్యం ప్రతిపక్షాలకు నీతులు చెప్పే అధికార తెరాస పార్టీ అందరినీ వచించించిదని ఎద్దేవా చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం గవర్నర్ కి, న్యాయవ్యవస్థకి సంజాయిషీ చెప్పుకోక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.   తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సహా కాంగ్రెస్, తెదేపా ఎమ్మేల్యేల రాజీనామా లేఖలను ఆమోదించమని ఆ రెండు పార్టీల నేతలు స్పీకర్ కి రెండు మూడు సార్లు విజ్ఞప్తి చేసారు. కానీ ఆయన కూడా వారికి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా లేఖ తనకు అందలేదని చెప్పకుండా మౌనం వహించారు. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే ఆ విషయం దాచిపెట్టినట్లు అర్ధమవుతోంది. ఆ తరువాత వారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కూడా పిర్యాదు చేసారు. ఈ వ్యవహారం రాష్ట్రపతి వరకు వెళ్లిందని తెలిసినా కూడా తెలంగాణా ప్రభుత్వం తలసాని చేత రాజీనామా చేయించకుండా ఎటువంటి జంకు గొంకూ లేకుండా చాలా నిబ్బరంగా ఉండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.   ఈరోజు కాంగ్రెస్, తెదేపా నేతలు గవర్నర్ నరసింహన్ని కలిసి, డిప్యూటీ సెక్రెటరీ వ్రాసిన లేఖ ప్రతిని అందజేసి తలసానిపై,తెరాస ప్రభుత్వంపై కూడా పిర్యాదు చేయబోతున్నారు. ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ చేత ప్రమాణ స్వీకారం చేయించినందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న గవర్నర్ నరసింహన్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. అదేవిధంగా తెదేపా, కాంగ్రెస్ ఎమ్మేల్యేలల అనర్హత పిటిషన్లని విచారిస్తున్న హైకోర్టు ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

పవన్ కళ్యాణ్ కి తెదేపా అలా జవాబు చెప్పింది

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేసేందుకు ఉన్న అవరోధాలన్నిటినీ ఒక్కొక్కటిగా తొలగించుకొంటూ వస్తున్నామని, దీనికి సంబందించిన పనులు దాదాపు 60 శాతం వరకు పూర్తయ్యాయని మరొకటి రెండు నెలల్లో అన్ని అవరోధాలు తొలగిపోయి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉందని కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి తెలిపారు. అదే విధంగా రాష్ట్రానికి రైల్వే జోన్ మంజూరు చేసే విషయంలో కొన్ని ఆర్ధిక సమస్యల కారణంగా ఆలస్యం జరుగుతోందని కానీ వచ్చే పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే కేంద్రమంత్రి వర్గం సమావేశమయ్యి రాష్ట్రానికి రైల్వే జోన్ మంజూరు చేసే అవకాశాలున్నాయని తెలిపారు. తామందరం వీటితో సహా ఇంకా అనేక ఇతర హామీల అమలు కోసం కేంద్రం ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. సెక్షన్: 8 అమలు కోసం కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా షెడ్యుల్: 10 క్రిందకు వచ్చే సంస్థలను తెలంగాణా ప్రభుత్వం ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడంపై కేంద్రానికి పిర్యాదు చేసి తమకు న్యాయం చేయవలసిందిగా కోరినట్లు తెలిపారు. ఈ అంశాలపై తాము పూర్తి శ్రద్ధ పెట్టడం లేదంటూ పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను మిత్రపక్షం ఇస్తున్న సలహాగానే తాము స్వీకరిస్తున్నామని తెలిపారు. కానీ ప్రత్యేక హోదా అంశంపై పవన్ కళ్యాణ్ వేసిన ప్రశ్నలకు సుజనా చౌదరి ఈ విధంగా జవాబులు చెప్పినట్లు భావించవచ్చును.   తెదేపాకి మిత్రుడిగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ చేసిన ఘాటు విమర్శల వలన తెదేపా ఎంపీలపై, కేంద్ర మంత్రులపై ప్రజలలో వ్యతిరేకభావం ఏర్పడేందుకు అవకాశం ఏర్పడింది. బహుశః అందుకే ఆయన ఈవిధంగా సవివరంగా సమాధానం చెప్పి ఉండవచ్చును. పవన్ కళ్యాణ్ తమ మిత్రుడు కనుక ఆయనపై తాము ప్రతివిమర్శలు చేయమని చెపుతూనే, ఆయన ఆరోపించినట్లుగా తామేమీ చేతులు ముడుచుకొని కూర్చోలేదని ప్రయత్నలోపం లేకుండా తాము కృషి చేస్తూనే ఉన్నామని ధీటుగా జవాబు చెప్పినట్లయింది. పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను పట్టుకొని తమపై చెలరేగిపోయిన కాంగ్రెస్, వైకాపాలకు దీనితోనే జవాబు చెప్పినట్లు భావించవచ్చును. కానీ ఈ ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు ఈ మూడింటినీ తెదేపా సాధించినప్పుడే వారు భుజాలు చరుచుకోవచ్చును. లేకుంటే అప్పుడప్పుడు ప్రతిపక్షాలతో బాటు జనసేన వంటి మిత్ర పక్షాల నుండి కూడా ఇటువంటి విమర్శలు ఎదుర్కోక తప్పదు.