తెలంగాణాలో కాంగ్రెస్ మళ్ళీ యాక్టివ్ అవుతోందా?

  కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా రాష్ర్టం ఏర్పాటు చేసినప్పటికీ ఎన్నికలలో పరాజయం పొందింది. ఆ తరువాత తెరాసలోకి పార్టీ నేతల వలసలతో కుదేలయింది. ఇక తెలంగాణాలో కూడా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని అందరూ అనుకొంటున్న సమయంలో ఊహించని విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అందరూ కేసీఆర్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి తమ పోరాటపటిమని అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు.   ఉస్మానియా విశ్వద్యాలయ భూములలో పేదలకు ఇళ్ళు కట్టించాలనే కేసీఆర్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదలుపెట్టిన పోరాటంతో వారు తెరాస ప్రభుత్వంపై మొట్టమొదటి విజయం సాధించారు. ఆ తరువాత మళ్ళీ ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేయాలనే కేసీఆర్ నిర్ణయాన్ని నిలువరించగలిగారు. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చీప్ లిక్కర్ అంశంపై తమ పూర్తి శక్తి సామర్ధ్యాలను కూడగట్టుకొని యుద్ధం చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పునరాలోచనలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకొనేలా చేయగలిగితే ఇక తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ లేచి నిలబడినట్లే. ఇంకా వారు తమ పోరాటాలను కొనసాగించేందుకు చేవెళ్ళ-ప్రాణహిత డిజైన్ మార్పు అంశం, విద్యుత్ ఉద్యోగుల సమస్య, కేసీఆర్ ఎన్నికల హామీలు వంటి అనేక అస్త్రశాస్త్రాలు వారి చేతిలో సిద్దంగా ఉన్నాయి. వాటిపై కాంగ్రెస్ నేతలు విజ్రుంభిస్తే, తెలంగాణా కాంగ్రెస్ నేతల శక్తి సామర్ధ్యాలు ఏమిటో కేసీఆర్ ప్రభుత్వం రుచి చూసే అవకాశం కలుగుతుంది. ఇంతవరకు ఆయన కాంగ్రెస్ పార్టీతో ఆడుకొన్నారు. బహుశః ఇకపై వారు ఆయన ప్రభుత్వంతో కబడీ ఆడుకొంటారేమో?   కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఈ నెల 31, వచ్చేనెల 1న రెండు రోజుల పాటు తెలంగాణాలో పర్యటనకు రాబోతున్నట్లు ఆ పార్టీ తెలంగాణా కార్య నిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఆ తరువాత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తెలంగాణాలో మళ్ళీ మరో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బహుశః ఇక అప్పటి నుండి తెలంగాణా కాంగ్రెస్ నేతలు తమ పోరాటాలను మరింత ఉదృతం చేస్తారేమో? తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఇదే పోరాటపటిమను కొనసాగించగలిగితే తెలంగాణాలో రాజకీయ బలాబలాలు సమీకరణలు మారడం తధ్యమని చెప్పవచ్చును.   వారు ఇదే పోరాటపటిమను సార్వత్రిక ఎన్నికలలో ప్రదర్శించి ఉండి ఉంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించి ఉండేది. కానీ అప్పుడు వారందరూ తమ బంధువులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పార్టీ టికెట్లు సాధించుకోవడం, పీసీసీ అధ్యక్షుడు పొన్నాలను దింపి ఆ కుర్చీలో తాము కూర్చోవాలనే ప్రయత్నాలు చేసారు తప్ప కాంగ్రెస్ పార్టీయే తెలంగాణాను ఇచ్చిందని గట్టిగా ప్రచారం చేసుకొని ఎలాగయినా పార్టీని గెలిపించుకోవాలని గట్టిగా ప్రయత్నించలేదు. చేతులు కాలిన తరువాత ఇప్పుడు ఆకులు పట్టుకొంటున్నట్లుగా ఇప్పుడు అందరూ ఐక్యంగా పోరాటాలు చేయడం ఆరంభించారు. ఏమయినప్పటికీ మిగిలిన ఈ నాలుగేళ్ల వ్యవధిలో అధికార తెరాసని డ్డీ కొంటూ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెలంగాణాలో లేచి నిలబడుతుందో లేక ఆలోగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వివీర్యం చేస్తారో చూడాలి.

హోదా ముఖ్యమా అభివృద్ధి ముఖ్యమా?

  ఏపీకి ప్రత్యేక హోదా రాదనే విషయం ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ మాటలతో దాదాపు స్పష్టమయిపోయింది. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అంతకంటే ఎక్కువే నిధులు ఇస్తామని ఆయన అన్నారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి రూ. రూ. 2, 25, 486 కోట్ల ఆర్ధిక ప్యాకేజి కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి ఒక నివేదిక ఇవ్వడం కూడా అదే సూచిస్తోంది. కనుక ఇక బంతి ప్రతిపక్షాల, రాష్ట్ర ప్రజల కోర్టులో పడినట్లుగానే భావించాలి. ప్రత్యేక హోదా కోసం పోరాడి సాధించుకోవాలా? లేకపోతే కేంద్రప్రభుత్వం ఇవ్వబోయే ఆర్ధిక ప్యాకేజీని తీసుకొని తృప్తి పడటమా? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి.   దీనిపై ప్రజలు భిన్నాభిప్రాయాలు కలిగి ఉండవచ్చును. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు, తమ పార్టీ క్యాడర్లను చైతన్యంగా ఉంచుతూ, పార్టీలను బలపరుచుకొని ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రతిపక్ష పార్టీలకు ఇది చాలా చక్కటి అవకాశం కల్పిస్తోంది. కనుక వారు దీనిపై పోరాటానికే మొగ్గు చూపవచ్చును. కనుక ప్రజలే విజ్ఞతతో ఆలోచించి ఏవిధంగా వ్యవహరిస్తే రాష్ట్రానికి తమకు ఎక్కువ మేలు జరుగుతుందో ఆలోచించుకోవలసి ఉంటుంది.   ఇంతకు ముందు, రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసీ కూడా రాష్ర్టంలో రాజకీయ పార్టీలు ప్రజలను ఉద్యమబాట పట్టించాయి. కానీ రాష్ట్రానికి న్యాయంగా దక్కవలసిన హక్కులు, హామీలు, నిధులు, ప్రయోజనాల కోసం అవి పోరాడలేదు. ఆ కారణంగానే నేడు రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. ఆనాడు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఒక్కరే రాష్ట్ర విభజన అనివార్యమనే సంగతి దైర్యంగా ప్రజలకు చెప్పి, రెండు రాష్ట్రాల ప్రజలకి పూర్తి న్యాయం జరగాలని కోరారు. ఆయన రాష్ట్రం విడిపోవాలని కోరుకొంటున్నారని, రెండు కళ్ళ సిద్దాంతం అని అర్ధం పర్ధం లేని మాటలు చెపుతున్నారని ఆరోపిస్తూ మిగిలిన పార్టీలు ప్రజలను త్రప్పు ద్రోవ పట్టించాయి. కానీ అప్పుడే రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ విభజన తరువాత రాష్ట్రానికి దక్కవలసిన ప్రయోజనాల గురించి గట్టిగా పోరాడి ఉండి ఉంటే బహుశః నేడు రాష్ర్టంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉండేవి కావేమో? ప్రత్యేక హోదా అంశాన్ని కూడా విభజన చట్టంలో చేర్చి ఉండవచ్చును. రాష్ట్రానికి విడుదల చేయవలసిన నిధులు, వాటి విడుదలకు నిర్దిష్ట గడువులు విభజన చట్టంలోనే వ్రాసుకొనే అవకాశం ఉండేదేమో? కానీ ఆనాడు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలను త్రప్పు ద్రోవ పట్టించాయే తప్ప రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం చేయలేదు.   ఆ కారణంగానే విభజన తరువాత రాష్ట్రం తీవ్రంగా నష్టపోవలసి వచ్చింది. మళ్ళీ అవిప్పుడు ప్రత్యేక హోదా అనే అంశాన్ని కూడా తమ రాజకీయ లబ్ది కోసమే ఉపయోగించుకోవాలేనే ఉద్దేశ్యంతోనే ప్రజలలో సెంటిమెంటు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. భూసేకరణ, ప్రత్యేక హోదాపై పోరాడుతున్నానని చెప్పు కొంటున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ తరువాత ప్రభుత్వం పడిపోతుందని, అప్పుడు తనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకోవడమే ఇందుకు చక్కటి నిదర్శనం.   ఇప్పటికే ఏడాదిన్నర విలువయిన సమయం గడిచిపోయింది. ప్రత్యేక హోదా కోసం పోరాటాలు మొదలుపెడితే ప్రత్యేక హోదా వస్తుందో రాదో తెలియదు కానీ ఇప్పటికే దయనీయంగా ఉన్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఈ బందులు, ధర్నాలు, ర్యాలీల కారణంగా మరింత దీనస్థితికి దిగజారే ప్రమాదం ఉంది. ఇప్పటికే రాష్ట్ర పరిస్థితులు చూసి పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టేందుకు వెనుకాడుతున్నవాళ్ళు పక్క రాష్ట్రాలకి తరలిపోయే ప్రమాదం ఉంది. దాని వలన ప్రతిపక్షాలకి ఎటువంటి నష్టమూ ఉండదు కానీ, రాష్ట్ర ప్రజలే దానికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా చాలా అవసరమే. కానీ దాని కోసమే పోరాడుతూ ఇంకా సమయం వృదా చేసుకోవడం అవసరమా కాదా అని ఆలోచించాల్సిన సమయమిది.   ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినందుకు కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రజల ముందు తలదించుకొని ఉంది. దానికి ప్రాయశ్చితం చేసుకొనేందుకు సిద్దంగా ఉంది. రాష్ట్రానికి అవసరమయిన నిధులు, సబ్సీడీలు, పన్ను రాయితీలు, ప్రాజెక్టులు అన్నీ సమకూర్చుతామని అరుణ్ జైట్లీ విస్పష్టంగా ప్రకటించారు. కనుక వాటిని స్వీకరించి వీలయినంత వేగంగా రాష్ట్రాభివృద్ధి చేసుకోవడమే మంచిది. ఒకవేళ ఇప్పుడు కూడా కేంద్రప్రభుత్వం సకాలంలో తగినన్ని నిధులు విడుదల చేయకుండా ఆలస్యం చేస్తున్నట్లయితే దానిపై తప్పకుండా రాష్ట్ర ప్రజలందరూ ఉద్యమించవలసిందే. కానీ ఈ అంశంపై ప్రతిపక్షాల వాదనలను నమ్మి ఉద్యమాలు, బందులు చేసుకొంటూపోతే చివరికి ప్రజలే నష్టపోవలసివస్తుంది,మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కనుక ప్రజలే తమ విజ్ఞత ప్రదర్శించి తగిన విధంగా స్పందించడం మంచిది.

తెలుగు ప్రజలంటే అందరికీ అంత చులకన ఎందుకో?

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రమంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వానికయినా ఎందుకు చిన్నచూపు, అలుసో తెలియదు కానీ సమైక్యంగా ఉన్నప్పుడు, విడిపోయిన తరువాత కూడా రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే ఉంది. ఇంతకు ముందు సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి దక్షిణాదిన కంచుకోటలాగా ఉండేది. అనేక ఏళ్లబాటు తెలుగు ప్రజలు కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకొని మోశారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్ళపాటు కేంద్రంలో, రాష్ట్రంలో ఏకధాటిగా అధికారం చెలాయించగలిగింది అంటే అందుకు తెలుగు ప్రజలు ఆపార్టీ పట్ల చూపిన ఆధారణే కారణం.   కానీ తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం పదేళ్ళపాటు ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎంతమంది బలిదానాలు చేసుకొన్నా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. తనకు నచ్చినప్పుడు తనకు నచ్చినట్లు రాష్ట్ర విభజన చేసి చేతులు దులుపుకొంది. తెలుగు ప్రజలంటే ఆ పార్టీకి ఎంత చులకన అంటే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తే తనకు ప్రయోజనం కలుగుతుందా...లేకపోతే మూడు ముక్కలు చేస్తే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందా...అని ఆలోచించిందే తప్ప, తన ఆలోచనలతో తెలుగు ప్రజల మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయో పట్టించుకోలేదు. అదేవిధంగా రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తూ లక్షలాది ఆంద్ర ప్రజలు రెండున్నర నెలలపాటు ఉద్యమాలు చేసినప్పుడు అవన్నీ సిల్లీ ఉద్యమాలు అంటూ కొట్టిపడేసింది.   చివరికి రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేస్తున్నప్పుడు కూడా ఎంత అప్రజాస్వామ్యంగా వ్యవహరించిందో అందరూ చూసారు. ఆంధ్రా ప్రజల పట్లే కాదు చివరికి తన ఆంధ్రా ఎంపీలను కూడా పూచికపుల్లలాగ తీసి పడేసింది. ఇన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకొని మోసినందుకు రాష్ట్ర ప్రజలపట్ల కృతజ్ఞత చూపకపోగా వారి అభిప్రాయాలతో మనోభావాలతో సంబంధం లేకుండా రాష్ట్రాన్ని తనకు నచ్చినట్లు విడదీసి చేతులు దులుపుకొంది. రాష్ట్ర విభజన చేసి తెలంగాణా ఏర్పాటు చేసినప్పటికీ ఆ రాష్ట్రానికి కూడా చాలా అన్యాయం చేసింది. అందుకే రెండు రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో పక్కనపడేశారు.   కాంగ్రెస్ పోయింది. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. తెదేపా, బీజేపీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అవి భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. వాటి మధ్య చాలా చక్కటి సత్సంబంధాలున్నాయి. ఆ కారణంగానే రాష్ట్రానికి అనేక ఉన్నత విద్యా సంస్థలు, నిధులు వగైరా మంజూరు అవుతున్నాయని భావించవచ్చును. కానీ ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఇప్పుడు తాజాగా  విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల విషయంలో కేంద్రప్రభుత్వం ప్రతీ దానికి ఒక్కో కారణం చెపుతూ రాష్ట్రానికి మొండి చెయ్యి చూపడాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్ధిక, రాజకీయ పరిస్థితుల గురించి మోడీకి మళ్ళీ నిన్న మరొక్కమారు వివరించారు. కనుక కనీసం ఇకనుండయినా కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఉదారంగా సహాయం చేస్తుందని ఆశిద్దాము.

ఆ ఒక్కట్టీ తప్ప ఏదయినా ఒకే!

  ఎన్నాళ్ళుగానో అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్న ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు నాయుడు సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. కీలకమయిన ఈ సమావేశంలో కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ, రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్ర ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పివి రమేష్ కూడా పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబుతో కలిసి అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ సమావేశ వివరాలు తెలియజేసారు. విభజన చట్టంలో ఉన్న అన్ని హామీల అమలు చేయడానికి అవసరమయిన రోడ్ మ్యాప్ తయారు చేయాలని  నీతి ఆయోగ్ (ప్రణాళికా సంఘం) అధికారులను ప్రధాని ఆదేశించారని తెలిపారు. రాష్ట్రంలో పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులకి అవసరమయిన నిధులు మంజూరు చేసేందుకు ప్రధాని అంగీకరించారని తెలిపారు. నీతి ఆయోగ్ మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కలిసి ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తారని ఆర్ధికమంత్రి జైట్లీ అన్నారు. ప్రత్యేక హోదా గురించి కూడా ఈ సమావేశంలో ప్రధానితో చర్చించామని, దానికి సంబంధించి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొంటామని తెలిపారు.   విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలను తప్పకుండా అమలుచేస్తామని కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, అరుణ్ జైట్లీ తదితరులు చాలా కాలంగానే చెపుతున్నారు. కనుక ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ అదే విషయం మళ్ళీ కొత్తగా చెప్పడం అందరికీ చాలా నిరాశ కలిగించింది. రాష్ట్ర ప్రజలు ఆయన నుండి ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజిలపై ఒక నిర్దిష్టమయిన ప్రకటన ఆశించారు. కానీ ఆయన ఆ రెంటి గురించి ఎటువంటి నిర్దిష్టమయిన హామీని ఇవ్వలేదని స్పష్టం అయ్యింది. ఆర్ధిక ప్యాకేజీ ప్రకటనకు మరికొంత సమయం తీసుకొన్నా కనీసం ప్రత్యేక హోదా అంశంపై నిర్దిష్టమయిన ప్రకటన చేస్తారని అందరూ ఆశించారు. కానీ ఈరోజు కూడా ప్రత్యేక హోదా సంబంధించి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొంటామని ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పడం ద్వారా ఏపీతో సహా ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన లేదని కేంద్ర ప్రణాళిక శాఖా మంత్రి ఇంద్రజిత్ సింగ్ కొన్ని రోజుల క్రితం పార్లమెంటులో చేసిన ప్రకటనని దృవీకరిస్తున్నట్లుంది.   మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పైనే అయింది. రాష్ట్ర విభజన వలన ఆంద్రప్రదేశ్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో, దానికి ఎటువంటి సహాయం అవసరముందో ఆయనకీ తెలుసు. కానీ ఏడాదిన్నర గడిచిన తరువాత కూడా రాష్ట్రానికి ఏమేమీ చేయవలసి ఉందో నిర్ణయించేందుకు ఇంకా రోడ్డు మ్యాపు తయారు చేయాలని అనడం ప్రజలని విస్మయానికి గురి చేసింది. కేంద్రప్రభుత్వం తరపున ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ తను చెప్పవలసింది కాస్త చెప్పేశారు కనుక ఇక రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడుపై విమర్శల వర్షం కురిపించడానికి సిద్దం అయ్యే ఉంటాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా ఈనెల 29న ఏపీ బంద్ కి పిలుపునిచ్చింది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు దానికి మద్దతు ప్రకటించడం తధ్యం. ప్రత్యేక హోదా గురించి పవన్ కళ్యాణ్ కూడా గట్టిగానే మాట్లాడారు కనుక ఇప్పుడు ఆయన కూడా ఘాటుగానే స్పందించవచ్చును.

రాజధాని భూసేకరణ సమస్యకి పరిష్కారమే లేదా?

  పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం రాజధాని ప్రాంతంలో ఉండవల్లి, పెనుమాక తదితర గ్రామాల రైతులని వెళ్లి కలిసి భూసేకరణ గురించి వారి అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలుసుకొన్నారు. ఆయన స్వయంగా అక్కడ పంటభూములను, నీటి వసతిని పరిశీలించిన తరువాత పెనుమకలో రైతులతో సమావేశమయ్యారు. వారిచ్చిన వినతి పత్రాలను స్వీకరించి, వారి సమస్యలని సావధానంగా విన్నారు. ఆయనను కలిసేందుకు వచ్చిన రైతులు ఏడాదికి మూడు పంటలు పండే తమ భూములను రాజధాని కోసం ఇవ్వడం ఇష్టం లేదని తెలిపారు. ఉండవల్లి తదితర గ్రామాల రైతులు ఆయనని తమ తరపున ప్రభుత్వంతో పోరాడవలసిందిగా కోరారు.   ఆ తరువాత ఆయన వారినుద్దేశ్యించి ప్రసంగిస్తూ, వారి భూములను స్వాధీనం చేసుకొనేందుకు భూసేకరణ చట్టం ప్రయోగించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. రైతుల సమస్య గురించి తను మాట్లాడితే కొందరు మంత్రులు చాల బాధ్యతారహితంగా సమాధానం చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆనాడు తను తెదేపా-బీజేపీలకు మద్దతు ఇచ్చానని, అందుకోసం తండ్రివంటి అన్నయ్య చిరంజీవిని కూడా వ్యతిరేకించానని చెప్పారు. తెదేపాకి తను మిత్రపక్షంగా కొనసాగుతున్నంత మాత్రాన్న తను ఆ పార్టీకి, ప్రభుత్వానికి తను బానిసని కానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. రైతుల సమస్య గురించి మాట్లాడితే తను రాజధాని నిర్మాణానికి అడ్డుతగులుతున్నానని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఆరోపించడాన్ని ఆయన తప్పు పట్టారు.   హూద్ హూద్ తుఫాను సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేప్పట్టిన సహాయ చర్యలకు తను మద్దతు ఇవ్వడమే కాకుండా రూ.50 లక్షలు విరాళం కూడా ఇచ్చానని తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నంత కాలం తన మద్దతు ఉంటుందని కానీ ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగినప్పుడు తను తప్పక ప్రజల పక్షాన్న నిలబడి పోరాడుతానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక క్లిష్టమయిన సమస్యలను పరిష్కరించారని, కనుక ఈ సమస్యని కూడా సామరస్యంగా పరిష్కరించుకోమని, అందుకోసం అవసరమయితే ఈ సమస్య గురించి మంచి అవగాహన కలిగిన జయప్రకాష్ నారాయణ్ వంటి మేధావులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. ఈ సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.   రైతుల నుండి బలవంతంగా భూములు తీసుకోవద్దని, వారిని ఒప్పించి, వారు ఇస్తేనే తీసుకోమని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. ఒకవేళ ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకుండా ముందుకు వెళ్ళినట్లయితే తను వారి తరపున నిలబడి పోరాడుతానని హెచ్చరించారు. రైతుల నుండి తను స్వీకరించిన వినతి పత్రాలను ముఖ్యమంత్రికి అందజేసి ఆయన ప్రతిస్పందన కనుగొన్న తరువాత తన భవిష్య కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రకటిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ విషయంలో తను వెనక్కి తగ్గేది లేదని అలాగే ఎక్కడికి పారిపోనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు.   ఉండవల్లి, పెనుమాక, బేతపూడి గ్రామాల రైతులు తమ పంట భూములను ప్రభుత్వానికి ఈయబోమని చాలా విస్పష్టంగా చెప్పారు. కానీ రాజధాని నిర్మాణం కోసం ఆ భూములు కూడా అవసరమని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. కనుక వీలయితే ఈ సమస్యకు ఆయననే సరయిన పరిష్కారం చూపమని మంత్రులు రావెల, ప్రతిప్పాటి, నారాయణ తదితరులు కోరారు. కానీ ఈ సమస్యను సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించేందుకు ఒక కమిటీని వేయమని ఆయన తిరిగి ప్రభుత్వానికే విజ్ఞప్తి చేసారు. అంటే ఈ సమస్యను పరిష్కరించడం అంత తేలికకాదని ఆయనకి అర్ధం అయినట్లే భావించవచ్చును. కానీ ఆయన మంచి సూచనే చేసారు కనుక ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం కోసం నిపుణులు, మేధావులు, స్థానిక రైతు సంఘం నేతలతో కూడిన ఒక కమిటీని ఏర్పాటుచేస్తే మంచిది. కానీ మొండిగా ముందుకు వెళితే స్థానిక రైతులు, ప్రతిపక్షాలు, మిత్రుడు పవన్ కళ్యాణ్ నుండి కూడా ప్రతిఘటన ఎదుర్కోవలసి వస్తే దాని వలన ఊహించని అనేక కొత్త సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.   ఈ సమస్య కేవలం ప్రభుత్వానిదో, రైతులదో, కొన్ని రాజకీయ పార్టీలదో కానే కాదు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ సంబందించిన సమస్య. కనుక దీనిపై రాజకీయాలు చేయడం కంటే విజ్ఞతతో పరిష్కారించుకోవడమే అందరికీ మేలు.

భారత్-పాక్ సమావేశం రద్దయినట్లే?

  భారత్-పాక్ దేశాల జాతీయ భద్రత సలహాదారుల డిల్లీలో సోమవారం జరగవలసిన సమావేశం రద్దయినట్లే భావించవచ్చును. ఆ సమావేశానికి ముందు పాక్ జాతీయ భద్రత సలహాదారు సర్తాజ్ అజీజ్ కాశ్మీరీ వేర్పాటువాద సంస్థ హురియత్ నేతలతో డిల్లీలో సమావేశం అవుతారని పాక్ ప్రకటించడంతో భారత్ అందుకు తీవ్ర అభ్యంతరం తెలిపింది. రష్యాలో ఉఫా అజెండా ప్రకారం ఉభయ దేశాల జాతీయ భద్రత సలహాదారులు కేవలం ఉగ్రవాదంపై చర్చించేందుకు మాత్రమే డిల్లీలో సమావేశమవ్వాలని భారత్-పాక్ ప్రధానులు అంగీకరించగా, ఇప్పుడు పాక్ హురియత్ నేతలతో సమావేశం అవుతామని చెప్పడం ఆ ఉఫా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని భారత్ వాదిస్తోంది. ఇది భారత్-పాక్ చర్చల మధ్య మూడవ వర్గాన్ని కూడా చేర్చడమేనని, అందుకు తాము అంగీకరించబోమని భారత్ తేల్చి చెప్పింది. ఒకవేళ భారత్-పాక్ దేశాల జాతీయ భద్రత సలహాదారుల సమావేశం జరగాలని పాకిస్తాన్ నిజంగా కోరుకొంటున్నట్లయితే హురియత్ నేతలతో సమావేశమావ్వాలనే ఆలోచనని విరమించుకోమని భారత్ సూచించింది.   కానీ భారత్ చేసిన ఆ సూచనను పాక్ నిర్ద్వందంగా త్రోసిపుచ్చింది. కాశ్మీర్ అంశం లేకపోతే ఈ సమావేశం నిర్వహించడం వృధా అని తేల్చి చెప్పింది. పైగా భారత్ నిఘా వర్గాలు బెలూచిస్తాన్ లో పాకిస్తాన్ వ్యతిరేక చర్యలకు ప్రయత్నిస్తున్నాయని కొత్త ఆరోపణ చేసింది. తన వాదనను సమర్ధించుకొనేందుకు పాక్ మూడు నివేదికలు కూడా సిద్దం చేసుకొంది. ఒకవేళ ఇరు దేశాల జాతీయ భద్రత సలహాదారుల సమావేశం జరిగితే అందులో దానిని భారత్ ముందు పెట్టి సంజాయిషీ కోరుతామని తెలిపింది.   రష్యాలో ఇరుదేశాల ప్రధానులు ఈ సమావేశం నిర్వహించడానికి అంగీకరిస్తూ ప్రకటన చేసినప్పటికీ, భారత్-పాక్ సరిహద్దుల వద్ద తుపాకుల మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. వీలు చిక్కినప్పుడల్లా పాక్ ఉగ్రవాదులు భారత్ పై దాడులు చేస్తూనే ఉన్నారు. ఒకవేళ పాకిస్తాన్ నిజంగా శాంతి కోరుకొంటున్నట్లయితే సమావేశానికి ముందు ఇటువంటి వాతావరణం, ఇటువంటి కొత్త మెలికలు, కొత్త ఆరోపణలు చేసేదే కాదు. కానీ దానికి ఈ సమావేశంలో హాజరు కావడం ఎంత మాత్రం ఇష్టం లేదు కనుకనే సమావేశ సమయం దగ్గిర పడుతున్నకొద్దీ రెచ్చిపోతోంది. కానీ పాక్ ఈ సమావేశం జరగకూడదని కోరుకొంటోంది? అని ప్రశ్నించుకొంటే దానికి చాలా బలమయిన కారణమే కనిపిస్తుంది.   ఇటీవల జమ్మూ లోని ఉదంపూర్ వద్ద పాక్ ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ సజీవంగా పట్టుబడటంతో ఆ దాడుల్లో పాక్ హస్తం, ప్రోత్సాహం ఉందని నిరూపించేందుకు భారత్ కు చాల బలమయిన ఆధారం లభించింది. ఇటువంటి పరిస్థితుల్లో సమావేశంలో పాల్గొనాలంటే పాకిస్తాన్ చాలా ఇబ్బందికరమయిన ప్రశ్నలకు జవాబులు చెప్పవలసి ఉంటుంది. అందుకే ఈ సమావేశం చెడగొట్టేందుకు మధ్యలో హురియత్ నేతలతో సమావేశం అంటు తెలివిగా మెలికపెట్టి తప్పించుకొంటోంది. కశ్మీరీ అంశంపై చర్చ జరగాలని పట్టుబట్టడం, భారత్ నిఘా వర్గాలపై లేనిపోని నిందలు వేస్తూ విమర్శలు ఎదుర్కోవలసిన తరుణంలో ప్రతివిమర్శలు చేస్తూ చాలా అతితెలివి ప్రదర్శిస్తోంది.   కానీ ఉఫా అజెండా ప్రకారం ఈ సమావేశం జరపడమా లేక రద్దు చేసుకోవడమో పాకిస్తాన్నే తేల్చుకోమని చెప్పడం ద్వారా భారత్ తనపై నిందపడకుండా తెలివిగా తప్పించుకొంటూ అదే సమయంలో పాకిస్తాన్ని అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టగలిగింది. ఇరు దేశాలు తమ వైఖరికి గట్టిగా కట్టుబడి ఉన్నందున ఇక ఈ సమావేశం జరిగే అవకాశం లేదనే భావించవచ్చును. ఒకవేళ ఇటువంటి వాతావరణంలో సమావేశం జరిగినా అది పరస్పరం నిందించుకోవడానికి, విమర్శలకే పరిమితం అవవచ్చును.

మెగాస్టార్ చిరంజీవి 60 నాటవుట్...

  ఈరోజు మెగాస్టార్ చిరంజీవి జన్మదినం. నవ యువకుడిలా కనిపిస్తున్న ఆయనకి 60సం.లంటే ఎవరికీ నమ్మలేకపొతున్నారు. ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకయిన కొణిదెల శివ శంకర ప్రసాద్ మెగాస్టార్ గా ఎదిగేందుకు చాలా కృషి చేసారు. సినీపరిశ్రమలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన తరువాత, ఆ సినీ పరిశ్రమను విడిచిపెట్టి రాజకీయాలలోకి ప్రవేశించారు. సినీ పరిశ్రమలో పైకి ఎదగడానికి ఆయన చాలా ఒడిడుకులు ఎదుర్కొన్నారు. కానీ తన స్వల్ప రాజకీయ జీవితంలో అంతకంటే చాలా ఎక్కువే ఒడిడుకులు ఎదుర్కోవలసి వచ్చింది.   రాజకీయాలలో చేరిన తరువాత ఆయనకు మూడుసార్లు అగ్నిపరీక్షలు ఎదుర్కోవలసి వచ్చింది. మొదటిసారి ఆయన సమైక్యాంధ్ర, తెలంగాణా పట్ల తన వైఖరిని ప్రకటించవలసి వచ్చినప్పుడు సందిగ్ధంలో పడ్డారు. చివరికి సమైక్యాంధ్రకే మొగ్గు చూపారు కానీ పెద్దగా ఫలితం లేకపోయింది.   తరువాత తను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఎన్నికలలో ఓడిపోయినప్పుడు మళ్ళీ సందిగ్దంలో పడ్డారు. ఎన్నో ఆశలు, ఆశయాలతో స్థాపించిన పార్టీ బోర్లా పడటంతో రాజకీయాలలోకి ప్రవేశించి తప్పు చేశానా? అని మధనపడవలసి వచ్చింది. ఆ పరిస్థితులను అధిగమించి కాంగ్రెస్ లో చేరి రాజకీయాలలో రాణిస్తున్న సమయంలో రాష్ట్ర విభజన అంశం ఆయనకు మరో అగ్నిపరీక్షగా మారింది.   కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకోవడం, ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలనుకోవడంతో కాంగ్రెస్ పార్టీతో బాటు ఆయన కూడా ప్రజలనుండి వ్యతిరేకత ఎదుర్కోవలసి వచ్చింది. పైగా అదే సమయంలో ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో రాజకీయాలలోకి ప్రవేశించడం, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకిస్తూ తెదేపా, బీజేపీలతో చేతులు కలపడంతో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో స్వయంగా చిరంజీవే సారధ్యం వహించినప్పటికీ ఎన్నికలలో ఆ పార్టీ ఘోరపరాజయం పాలయింది. మళ్ళీ ఇప్పుడప్పుడే కోలుకొనే పరిస్థితి కనబడకపోవడంతో ఆయన మళ్ళీ సినిమాలలోకి వచ్చినట్లున్నారు.   ఆయన ఇప్పుడు తన 150వ సినిమా తీయడానికి సంసిద్ధం అవుతున్నారు. రాజకీయాలలో మంచిపేరు సంపాదించుకోవడం ఎంతటివారికయినా కష్టమేనని చిరంజీవి రాజకీయ జీవితం చూస్తే అర్ధమవుతుంది. కానీ అదేకష్టం సినిమాలలో పెడితే చాలా ఉన్నత శిఖరాలకు చేరవచ్చునని ఆయన సినీ జీవితం చూస్తే అర్ధమవుతుంది. తనకు ఎనలేని పేరు ప్రతిష్టలు, ప్రజాధారణ తెచ్చిపెట్టిన సినీ పరిశ్రమకి తిరిగి వచ్చారు కనుక ఆయన సెకండ్ ఇన్నింగ్స్ చాలా విజయవంతంగా సాగుతుందని అందరికీ తెలుసు. కానీ ఆయన ఎప్పటికీ సినీ పరిశ్రమలోనే ఉండాలని ఆయన అభిమానులు కోరుకొంటున్నారు. మరి ఆయన వారి చిరు కోరికని మన్నిస్తారో లేక ఇంకా రెండు పడవలలో కాళ్ళు పెట్టి సాగుతారో వేచి చూడాలి. తెలుగు ప్రజలందరి తరపున తెలుగు ఒన్ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

ఏపీ కోసం నిజాయితీగా పనిచేస్తున్నదెవరు?

  రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుకి ఏపీ ప్రజలే కాదు తెలంగాణా ప్రజలు, రాజకీయ పార్టీలు కూడా అసంతృప్తిగా ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలలో ఘోర పరాజయం పొందింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హడావుడిగా చేసిన రాష్ట్ర విభజన కారణంగా ఏడాదిన్నర కాలం గడుస్తున్నా ఇంకా రెండు రాష్ట్రాలు గొడవలు పడుతూనే ఉన్నాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం సమస్యల సుడిగుండంలో తిరుగుతూనే ఉంది.   “కాంగ్రెస్ చేసిన ఈ పనివల్ల ఇక రాష్ట్రంలో పార్టీకి భవిష్యత్ లేదని, ఎన్ని ఉద్యమాలు చేస్తున్నా పార్టీని ప్రజలు పట్టించుకోవడం మానేశారని” కాంగ్రెస్ నేతలే స్వయంగా చెప్పుకొంటూ పార్టీని విడిచిపెట్టి ఇతర పార్టీలలోకి వెళ్ళిపోతున్నారు. ఇందంతా చూస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పశ్చాతాపం కనబరచకపోగా నేటికీ రాష్ట్ర విభజన చేయడమేదో గొప్ప ఘనకార్యంలా చెప్పుకొంటోంది. అందుకే ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి మరింత వేగంగా క్షీణిస్తోంది. కాంగ్రెస్ ఎలాగ పోయినా ఎవరూ బాధపడేవాళ్ళు లేరు. కానీ రాష్ట్రానికి ఈ దుస్థితి కల్పించి మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం మొసలి కన్నీళ్లు కార్చుతూ ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేయడాన్ని అందరూ తప్పు పడుతున్నారు.   కాంగ్రెస్, వైకాపాలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని పైకి చెప్పుకొంటున్నప్పటికీ, అవి తమ పార్టీల ఉనికిని కాపాడుకొని బలోపేతం చేసుకోవడానికి, తమ రాజకీయ ప్రత్యర్దులయిన తెదేపా, బీజేపీలను ఇరుకునపెట్టి అప్రదిష్టపాలు చేయడానికే ఈ అంశాన్ని వాడుకొంటున్నాయని అందరికీ తెలుసు. ఆ ప్రయత్నంలో అవి కేంద్రప్రభుత్వాన్ని, తనను తరచూ నిందింస్తుండటంతో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నిన్న వాటికి చాలా ఘాటుగా జవాబిచ్చారు.   రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ అధిష్టానం పార్లమెంటులో ఏవిధంగా వ్యవహరించిందో ఆయన మళ్ళీ గుర్తు చేసి, ఆనాడు సభలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రం కోసం గట్టిగా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలేవయినా ఉంటే అవన్నీ తన ఒత్తిడి వల్లనే ఇచ్చిందని అన్నారు. అధికారం, ఓట్లు, సీట్ల కోసం రాజకీయాలు చేసే కాంగ్రెస్ నేతలా...తనను ప్రశ్నించేది? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ వలన రాష్ట్రానికి అరిష్టమే తప్ప ఎటువంటి లాభం జరగదని, కానీ తను రాష్ట్రం నుండి ఎన్నిక కాకపోయినా రాష్ట్రం కోసం చాలా కష్టపడుతున్నాని అన్నారు. తాను రాష్ట్రానికి వచ్చిన ప్రతీసారి ఒక కొత్త ప్రాజెక్టు తీసుకు వస్తున్నానని కానీ కాంగ్రెస్ రాష్ట్రానికి ఏమి చేసిందని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్ మొదలయిన అంశాల మీద కేంద్రంపై తను నిరంతరం ఒత్తిడి చేస్తున్నానని, వాటిపై కేంద్రప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు.   ప్రత్యేక హోదా గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు, ఆనాడు రాజ్యసభలో కాంగ్రెస్ ఐదేళ్ళు ఇస్తానంటే ఐదేళ్ళు కాదు కనీసం పది లేదా పదిహేనేళ్ళయినా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని వెంకయ్య నాయుడు ప్రాదేయపడ్డారు. ప్రతిపక్షాలు అదే విషయాన్ని మరో కోణంలో నుండి చూపిస్తూ ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నాయి తప్ప ఆనాడు ఆయన ఒక్కడే గట్టిగా మాట్లాడారన్న విషయాన్నీ అంగీకరించడం లేదు. వెంకయ్య నాయుడు అదే విషయాన్ని నిన్న గట్టిగా చెప్పి తనను విమర్శిస్తున్న ప్రతిపక్షాల నోళ్ళు మూయించే ప్రయత్నం చేసారు.   ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య నాయుడు మధ్యలో కొంత సందిగ్దత కనబరిచినప్పటికీ, కేంద్రమంత్రిగా ఉన్న ఆయనే ఆ రెండు పార్టీల కంటే నిజాయితీగా దాని కోసం కృషి చేస్తున్నారు. ఆయనకే ఆ అవకాశం కూడా ఉందని చెప్పవచ్చును. రాష్ట్రానికి ఏదో విధంగా వీలయినంత మేలు చేయాలని ఆయన ఆరాటపడుతుంటే, రాష్ట్రానికి మేలు చేయడం కోసమే తాము ఉద్యమాలు చేస్తున్నామని చెపుతూ కాంగ్రెస్, వైకాపాలు తమ రాజకీయ లబ్ది కోసం పోరాడుతున్నాయి. కానీ ప్రత్యేక హోదా విషయంలో ఇంకా జాప్యం జరుగుతున్నందున వారిదిప్పుడు ఆయనపై పైచెయ్యి సాధించినట్లు కనబడుతోంది. అందుకే రాష్ట్రం కోసం నిజాయితీగా కృషి చేస్తున్న వెంకయ్య నాయుడు వారికి సంజాయిషీలు చెప్పుకోవలసి వస్తోంది. కానీ ఎల్లకాలం ఈ పరిస్థితి ఇలాగే ఉండబోదనే సంగతి కాంగ్రెస్, వైకాపాలకి కూడా తెలుసు. అందుకే అవకాశం దొరికినప్పుడే దానిని సద్వినియోగపరచుకోవలాని ఆరాటపడుతున్నాయి. కానీ అవి తమ పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్రం కోసమే నిజాయితీగా పోరాడితే వారికి నిజంగానే ఆ ప్రయోజనం, ప్రజలలో ఆదరణ దక్కేవి.

పాకిస్తాన్ తీరు ఎన్నటికీ మారదేమో?

  భారత్-పాక్ దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకొనేందుకు నెహ్రూ నుండి మోడీ వరకు అందరూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఎవరూ సఫలం కాలేకపోతున్నారు. అందుకు వారి ప్రయత్నలోపం ఏమీ లేదు. వారు ఎంత చిత్తశుద్దిగా ప్రయత్నిస్తున్నా సైన్యం, ఉగ్రవాదులు పాక్ ప్రభుత్వంపై పరోక్షంగా పెత్తనం చేస్తున్న కారణంగా పాక్ ప్రభుత్వం భారత్ కు సహకరించడం లేదనేది పదేపదే రుజువవుతూనే ఉంది. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత భారత్-పాక్ సంబంధాలను పునరుద్దరించేందుకు మళ్ళీ ప్రయత్నాలు చేసారు. కానీ పాక్ ని మార్చడం ఆయన వల్ల కూడా కాలేదు. అయినప్పటికీ పాక్ తో సంబంధాలు మెరుగు పరుచుకోవడానికి తన ప్రయత్నాలు మానుకోలేదు. అందుకే కొన్నిరోజుల క్రితం రష్యాలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో భేటీ అయ్యారు. మోడీ ప్రయత్నం కొంత ఫలించడంతో త్వరలో ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల డిల్లీలో సమావేశం జరుగబోతోంది. కానీ పాక్ ప్రభుత్వం తన తీరు ఎన్నటికీ మారబోదని మరోమారు స్పష్టం చేస్తోంది.   పంజాబ్, జమ్మూలలో ఉగ్రవాదుల దాడులు, కాశ్మీర్ సరిహద్దు గ్రామాల ప్రజలపై గత రెండు వారాలుగా పాక్ దళాలు బాంబుల వర్షం కురిపిస్తుండటం, పాక్ స్వాతంత్ర దినోత్సవ సనదర్భంగా ఆగస్ట్ 14న డిల్లీలో పాక్ హైకమీషనర్ అబ్దుల్ బాసిత్ కాశ్మీర్ గురించి అసందర్భ ప్రేలాపనలు వంటివెన్నో యధాప్రకారం జరిగిపోతూనే ఉన్నాయి. పైగా భారత్ దళాలే 78సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ పాక్ సరిహద్దు భద్రతా దళాలపై, గ్రామాలపై దాడులు చేస్తున్నాయని అబ్దుల్ బాసిత్ ప్రకటించడం మొగుడ్ని కొట్టి బజారు కెక్కినట్లుంది. ఒకవైపు శాంతి, ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పరుచుకొనేందుకు చర్చలకు సిద్దం అంటూనే మరో వైపు ఈవిధంగా వ్యవహరించడం కేవలం పాక్ కే చెల్లు. అయినప్పటికీ భారత్ చాలా సహనంతోవ్యవహరిస్తూ డిల్లీలో జరుగబోయే జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి సిద్దపడుతోంది.   పాక్ ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ ఇటీవల సజీవంగా పట్టుబడటం, పంజాబ్, ఉదంపూర్ లలో ఉగ్రవాదుల దాడులు, సరిహద్దుల వద్ద కాల్పులకు ఈ సమావేశంలో పాక్ జాతీయ భద్రతా సలహాదారు తప్పనిసరిగా భారత్ కు జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. అది చాలా కష్టం అని పాక్ కూడా తెలుసు. అందుకే భారత్ ఈ సమావేశాన్ని కూడా తనంతట తాను ఏకపక్షంగా రద్దు చేసుకొనేలా తనకు అలవాటయిన వ్యూహాలను అమలు చేస్తోంది.   ఇంతకు ముందు భారత ప్రభుత్వం వారిస్తున్నా లెక్క జేయకుండా పాక్ హై కమీషనర్ అబ్దుల్ బాసిత్ కాశ్మీరీ వేర్పాటువాదులయిన హురియత్ నేతలను డిల్లీకి ఆహ్వానించి వారితో సమావేశమయ్యారు. అందుకు నిరసనగా గతేడాది ఇస్లామాబాద్ లో జరగవలసిన భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేసుకొంది. కనుక కీలకమయిన ఈ సమావేశం రద్దు చేసేందుకు మళ్ళీ పాక్ హైకమీషనర్ అదే ఎత్తు వేస్తున్నారు. వచ్చే సోమవారంనాడు పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో డిల్లీలో సమావేశం కానున్నారు. దానికి ఒక్కరోజు ముందు అంటే ఆదివారంనాడు సర్తాజ్ అజీజ్ డిల్లీ చేరుకొంటారు. ఆరోజు రాత్రి ఆయనతో కాశ్మీరీ వేర్పాటు హురియత్ నేతలు సయీద్ అలీ షా గిలానీ తదితరుల విందు సమావేశం ఏర్పాటు చేసారు. ఇది భారత్ ని రెచ్చగొట్టే ప్రయత్నమేనని అర్ధమవుతోంది.   ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగబోతున్న సమయంలో హురియత్ వేర్పాటువాద నేతలను డిల్లీకి ఆహ్వానించడమే పెద్ద తప్పు. మళ్ళీ వారికి పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ తో విందు సమావేశం ఏర్పాటు చేయడం దానికి ఆయన అంగీకరించడం అన్నీ ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న తప్పులే. ఆ విధంగా భారత్ ని మళ్ళీ రెచ్చ గొట్ట గలిగితే ఈ సమావేశాన్ని భారత్ రద్దు చేసుకొంటుందని పాక్ వ్యూహంగా కనబడుతోంది. తద్వారా భారత్ అడగబోయే ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన ఇబ్బందికరమయిన పరిస్థితులను తప్పించుకోవడమే కాకుండా, శాంతి ప్రయత్నాలకు తమ ప్రభుత్వం ముందుకు వస్తున్నప్పటికీ భారత్ కుంటిసాకులు చెప్పి తప్పించుకొంటోందని భారత్ ని అంతర్జాతీయ వేదికల మీద నిందించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే పాక్ ఈ కీలకమయిన సమావేశాన్ని రద్దు చేసేందుకు ఆఖరి నిమిషం వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉండవచ్చును.   పాక్ తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశ్యంతోనే భారత్ ఈ సమావేశానికి సిద్దపడుతుంటే, అంతర్జాతీయ సమాజం ముందు తను దోషిగా నిలబడకూదదనే ఉద్దేశ్యంతోనే పాక్ ఈ సమావేశానికి అంగీకరించింది. కానీ దానిని ఏదోవిధంగా చెడగొట్టి భారత్ పైనే ఆ నింద వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కనుక ఈ సమావేశం జరిగేలోగా సరిహద్దులలో దాడులు మరింత ఉదృతం చేయవచ్చును. లేదా భారత్ లో జొరబడిన పాక్ ఉగ్రవాదులు ఎక్కడయినా బాంబులు పేల్చ వచ్చును. లేదా సరిహద్దులలో మళ్ళీ పాక్ ఉగ్రవాదులు దాడులు చేయవచ్చును. జమ్మూలో పాక్, ఐ.యస్. జెండాలు రెపరెపలాడించవచ్చును. హురియత్ నేతలు భారత్ వ్యతిరేక ప్రసంగాలు చేయవచ్చును.   పాక్ సృష్టించబోయే ఇన్ని సవాళ్ళను ఎదుర్కొని ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. భారత్-పాక్ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరిచి వాటిని దృడ పరచాల్సిన గురుతరమయిన బాధ్యత పాక్ హై కమీషనర్ అబ్దుల్ బాసిత్ మీద ఉంది. కానీ ఆయన వాటిని మరింత చెడగొట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పాక్ ప్రభుత్వం ఆదేశాలు, సిద్దాంతాల ప్రకారమే ఆయన ఆపని చేస్తున్నాడని వేరేగా చెప్పనవసరం లేదు. అటువంటప్పుడు ఈ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశాలు నిర్వహించడం కూడా వ్యర్ధమే. ఒకవేళ ఈ సమావేశం జరిగినా దానిలో భారత్-పాక్ ఒకదానినొకటి నిందించుకోవడం తప్ప మరేమీ చేయలేవు. ఎందుకంటే కడుపులో లేనిదీ కావలించుకొంటే రాదని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. 

నరేంద్ర మోడీ మంచి అవకాశమే ఇచ్చారు

  ఈ నెల 20న ప్రధాని మోడీతో చంద్రబాబు నాయుడు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి ఇచ్చిన ఇతర హామీల అమలుతో బాటు ప్రత్యేక హోదా మంజూరు చేయడం గురించి ప్రధానంగా వారు చర్చించబోతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్, బీజేపీలు రెండూ హామీ ఇచ్చినప్పటికీ అందరికీ తెలిసున్న కొన్ని కారణాల వలన ఇంతవరకు ప్రత్యేక హోదా మంజూరు కాలేదు. కానీ రాష్ట్ర విభజన తరువాత తీవ్రంగా నష్టపోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే ఎక్కువ లబ్ది కలిగించే ఆర్ధిక ప్యాకేజి ఇస్తామని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. కానీ అది ఇంచుమించు ఎంత ఉండవచ్చునో ఆయన చెప్పలేదు.   బీహార్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఇంతకు ముందు ఎటువంటి హామీలు ఇవ్వలేదు. అదేవిధంగా బీహార్ పరిస్థితి మరీ ఆంద్రప్రదేశ్ అంత దారుణంగా లేదిప్పుడు. కానీ ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ రాష్ట్రానికి ఏకంగా రూ.1.65 లక్షల కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కనుక రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఇదే అంశం లేవనెత్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి ఇవ్వమని గట్టిగా అడగడానికి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీయే ఒక మంచి అవకాశం కల్పించారు. కానీ ఆ సమావేశానికి తనతో బాటు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న కాంగ్రెస్, వైకాపా, సీపీఐ మరియు ప్రజా సంఘాలను కూడా వెంట తీసుకొని వెళ్ళి అందరూ కలిసి ఆయనపై ఒత్తిడి చేసినట్లయితే ప్రత్యేక హోదా విషయంలో తక్షణమే ఏదో ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేసినట్లయితే, ఇక తెదేపాను నిందించడానికి ప్రతిపక్షాలకు అవకాశం ఉండదు కూడా. కానీ అఖిలపక్షాన్ని కలవడానికి మోడీ ఇష్టపడతారా లేదా అనేది కూడా ముఖ్యమే. ఒకవేళ ఆయన అందుకు అంగీకరించరనుకొంటే చంద్రబాబు నాయుడు కనీసం తన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలని వెంటపెట్టుకొని వెళ్లినా ఆయనపై ఎంతో కొంత ప్రభావం చూపవచ్చును.   ఏది ఏమయినప్పటికీ, ఈ సమావేశంలో ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు వంటి అనేక హామీలపై ప్రధాని నరేంద్ర మోడీ నుండి విస్పష్టమయిన ప్రకటన చేయించడం అత్యవసరం. లేకుంటే తెదేపా మీద మరింత ఒత్తిడి పెరగవచ్చును. ఆ ప్రభావం తెదేపా-బీజేపీల స్నేహంపై పడినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాకపోయినా ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ ప్రజలకు ఈరోజు ఇచ్చిన హామీవంటి భారీ నిధులనయినా రాబట్టుకోగలిగితే రాష్ట్రం ఒడ్డున పడుతుంది.

మోడీ ప్రసంగానికి దుబాయ్ సలాం

  దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం అందరినీ సమ్మోహితుల్ని చేసింది. ఆయన తన ప్రసంగంలో ప్రధానంగా ఉగ్రవాదం గురించే మాట్లాడటం విశేషం. ఉగ్రవాదులలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అంటూ వేరే ఉండరని అన్నారు. ఇదివరకు పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఒక మిలటరీ స్కూలు మీద దాడి చేసి 140 మంది పిల్లలను అతి కిరాతకంగా కాల్చి చంపినప్పుడు తీవ్రంగా చలించిపోయిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ మాట అన్నారు. మోడీ అదే మాటని మళ్ళీ నిన్న ప్రసంగంలో ప్రస్తావించడం ద్వారా పాక్ ప్రభుత్వానికి, ప్రధానికి వారు ఉగ్రవాదులను ఉపేక్షిస్తున్న సంగతిని మరొక్కమారు గుర్తు చేసినట్లయింది. ఉగ్రవాదంపై పోరులో పాక్ ప్రభుత్వం తమతో కలిసి వస్తుందో లేదో ఆ దేశమే తేల్చుకోవాలని చెప్పారు.   భారత్ కి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నాగా ల్యాండ్ రాష్ట్రంలో నాగా వేర్పాటువాదులు సమస్యలు సృష్టిస్తూనే ఉన్నారు. ఇన్నేళ్ళుగా ఏ ప్రభుత్వం పరిష్కరించని ఆ సమస్యని తమ ప్రభుత్వం శాశ్వితంగా పరిష్కరించి వారిని కూడా భారత్ తో అనుసంధానం చేయగలిగామని మోడీ తెలిపారు. కొందరు పదేళ్ళు పోరాడుతారు..మరికొందరు 20 ఏళ్ళు, ఇంకొందరు 40ఏళ్ళు పోరాడవచ్చును..కానీ చివరికి చర్చల ద్వారానే వారి సమస్యకి పరిష్కారం లభిస్తుంది. నాగాల విషయంలో అది మరొకమారు రుజువయిందని ఆయన చెప్పినప్పుడు సభకి హాజరయిన ప్రవాస భారతీయులు అందరూ చప్పట్లుకొడుతూ తమ హర్షం ప్రకటించారు.   ఒక్క నాగాలే కాదు ఉగ్రవాదులయినా, వేర్పాటువాదులయినా తమ హింసావాదాన్ని వీడి మానవతావాదంతో జనజీవన స్రవంతిలో కలిసినప్పుడే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ తో బాటు, జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలో వేర్పాటువాదులకు ఆయన ఈ సూచన చేశారని అర్ధమవుతోంది.   మోడీ ప్రసంగంలో విశేషం ఏమిటంటే ఆయన సగటు రాజకీయ నాయకుడులాగ ఊక దంపుడు ఉపన్యాసాలు చేయకుండా తను చెప్పదలచుకొన్న విషయాన్ని ప్రజల మనసులలోకి చొచ్చుకుపోయేలా చెప్పగలరు. అఫ్ఘనిస్తాన్ తిరిగి తన కాళ్ళ మీద తను నిలబడేందుకు ఆ దేశానికి భారత్ ఎల్లపుడు సహాయపడుతూనే ఉందని ఆయన చెప్పారు. కానీ దానికి ఆయన జోడించిన చిన్న సెంటి మెంటు సభకు వచ్చినవారిని మంత్రం ముగ్ధులను చేసింది. ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన ‘కాబూలీవాలా’ తో మనకున్న ఆత్మీయ అనుబంధమే ఆ దేశాన్ని మనకి దగ్గరకి చేసింది. కష్టాలలో ఉన్న మన ఆ కాబూలీవాలా స్నేహితుడిని ఆదుకోవడం మన ధర్మం. అందుకే ఆదుకొంటున్నాము,” అని చెప్పినప్పుడు సభలో ఉన్నవారు చప్పట్లతో ఆయనను అభినందించారు.   అదేవిధంగా “భారత్-దుబాయ్ ల మధ్య 700 విమానాలు తిరుగుతున్నాయని, కానీ ఒక భారత ప్రధాని దుబాయ్ రావడానికి 54సం.లు పట్టిందని, అయినప్పటికీ దుబాయ్ రాజుగారు తమని చాలా ఆదరించారని, భారత్ లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు కూడా అంగీకరించారని అందుకు ఆయనకు చాలా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నామని చెప్పినప్పుడు సభకు వచ్చిన భారతీయులందరూ హర్షాతిరేకాలతో చప్పట్లు కొట్టారు.   ఆయన తన ప్రసంగం ముగించే ముందు ఆయన అన్న మాటలు వింటే ఆయన ఎంత గొప్ప వక్తో అర్ధమవుతుంది. “ప్రపంచంలో చాలా దేశాలలో భారతీయులు పనిచేస్తున్నారు. వారిని నేను కలుస్తున్నప్పుడు వారి పాస్ పోర్ట్ రంగు చూడను...వారి ప్రాంతం, మతం నేను చూడను. మనందరిలో ప్రవహించేది ఒకే రక్తం...అది చాలు వాళ్ళు మనవాళ్ళే అని గుర్తించడానికి,” అని ఆయన అన్నప్పుడు ప్రవాస భారతీయులలో ఎంత గొప్ప అనుభూతి కలుగుతుందో ఊహించవచ్చును.   ఇరుగు పొరుగు దేశాలన్నిటితో భారత్ ఎప్పుడూ స్నేహమే కోరుకొంటుందని కానీ పాకిస్తాన్ మాత్రం అందుకు సహకరించకుండా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆయన అన్నారు. పాకిస్తాన్ కలిసి రానంత మాత్రాన్న శాంతి స్థాపనకు, అభివృద్ధికి తను చేస్తున్న ప్రయత్నాలు విరమించబోనని, ఇప్పటికే నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ లతో భారత్ అనేక ఒప్పందాలు కుదుర్చుకొని నాలుగు దేశాల మధ్య బంధాలు బలపరుచుకొందని మున్ముందు సార్క్ దేశాలన్నిటితో తమ స్నేహ సంబంధాలను పటిష్టం చేసుకొంటూ సార్క్ దేశాల మధ్య కనెక్టివిటీ పెంచేందుకు తను గట్టిగా కృషి చేస్తున్నానని మోడీ తెలిపారు. ఇదంతా చూస్తూ కూడా పాక్ ఇంకా ఉగ్రవాదాన్నే అంటిపెట్టుకొని ఉండిపోతుందో లేక తన దేశాభివృద్ధి కోసం తమతో చేయిచేయి కలిపి పనిచేయడానికి ముందుకు వస్తుందో పాక్ పాలకులే తేల్చుకోవాలని చెప్పారు. త్వరలో భారత్ ఒక శాటిలైట్ అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుందని, దాని సేవలను సార్క్ దేశాలన్నీ ఉచితంగా వినియోగించుకోవచ్చని మోడీ ప్రకటించారు. ఇప్పుడు ప్రపంచదేశాలన్నీ భారత్ పట్ల ఆసక్తి, ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయని, అందివచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని భారత్ వేగంగా అభివృద్ధి చెందాలని తమ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తోందని మోడీ తెలిపారు.   మోడీ తన ప్రసంగంలో ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి ప్రస్తావించి వాటికి తనదయిన శైలిలో చేప్పట్టిన పరిష్కారాల గురించి వివరిస్తున్నప్పుడు అందరూ చప్పట్లతో తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు. గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్నవారు అనేక సమస్యలు ఎదుర్కొంటుంటారు. అటువంటప్పుడు వారు సహాయం కోసం భారత ఎంబసీకి వెళ్లి అధికారులను కలుస్తుంటారు. కానీ సామాన్య కార్మికులు ఎక్కడో ఉన్న భారత ఎంబసీకి వెళ్ళడం దాదాపు అసాధ్యమే. కనుక నెలకో, రెండు నెలలకో ఒకమారు ఎంబసీ అధికారులే భారతీయులు ఎక్కువగా నివసించే ప్రాంతాలకు స్వయంగా వెళ్లి వారి సమస్యలని అడిగి తెలుసుకొని పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేసినట్లు మోడీ చెప్పినప్పుడు అందరూ చాలా ఆనందం వ్యక్తం చేసారు. ఈవిధంగా సమస్య చిన్నదయినా పెద్దదయినా అది తన దృష్టికి వస్తే దానిని తప్పకుండా పరిష్కరించడం తధ్యమని ఆయన మరొక్కమారు నిరూపించారు.

ప్రత్యేక హోదాపై మళ్ళీ కొత్తగా హామీలేల?

  ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అవసరమయిన, అర్హతలు, లక్షణాలు లేని కారణంగానే 14వ ఆర్ధిక సంఘం అభ్యంతరం చెపుతోందని, అందుకు ప్రత్యమ్నాయంగా రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలలో పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేకప్యాకేజి ఇవ్వడానికి ఆర్దికశాఖ యోచిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ ఉపకార్యదర్శి ఆశిష్ దత్త వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి వ్రాసిన ఒక లేఖలో తెలిపారు. రెండు నెలల క్రితం ప్రత్యేక హోదా గురించి ప్రధాని నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డి వ్రాసిన లేఖకు జవాబిస్తూ ఆశిష్ దత్త ఈ లేఖ వ్రాసారని వైకాపా ఎంపీ మిదున్ రెడ్డి తెలిపారు. అదే నిజమయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని స్పష్టం అవుతోంది.   కానీ ప్రత్యేక హోదా అంశంపై ఉద్దేశ్య పూర్వకంగానే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని తెదేపా అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు ఆరోపించారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని డిల్లీకి రమ్మని ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారని, అటువంటప్పుడు ప్రత్యేక హోదా రాదని వైకాపా ముందే ఎందుకు దుష్ప్రచారం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. తన రాజకీయ లబ్ది కోసమే ప్రత్యేక హోదా కోసం డిల్లీలో ధర్నా చేసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ రాష్ట్రానికి వచ్చి ప్రత్యేక హోదా రాదని ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా తప్పకుండా సాధిస్తామని ఆయన అన్నారు.   ప్రత్యేక హోదా విషయంలో వైకాపా, దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అభిప్రాయాలు, ఆలోచనలు, వ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకాదనే విషయాన్ని కేంద్రప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు తెలియజేసింది. కనుక ఆశిష్ మిత్రా వ్రాసిన లేఖ కూడా అదే విషయాన్ని మరోమారు దృవీకరిస్తున్నట్లు భావించవచ్చును. అటువంటప్పుడు వైకాపాని విమర్శించే ప్రయత్నంలో జూపూడి ప్రభాకరరావు ప్రత్యేక హోదా తప్పకుండా సాధిస్తామని మళ్ళీ కొత్తగా హామీ ఇచ్చి ఒకవేళ సాధించలేకపోతే దాని వలన ఏపీ ప్రభుత్వం, తెదేపాయే మరింత ఇబ్బందిపడవలసి ఉంటుందని గ్రహించాలి.   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 20న ప్రధాని నరేంద్ర మోడీతో దీని గురించే ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదాతో బాటు రాష్ట్రాభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజి కూడా అడగాలని ఆయన భావిస్తున్నారు. కానీ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా రాష్ట్రంలో రాజకీయ సవాళ్ళను, విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగని ఈ వ్యవహారాన్ని ఇంకా నాన్చడం వలన రెండు పార్టీలు మరింత నష్టపోవలసి వస్తుంది. కనుక ప్రధాని నరేంద్ర మోడీ-చంద్రబాబు నాయుడుల మధ్య త్వరలో జరుగబోయే సమావేశంలో దీనిపై ఒక ఖచ్చితమయిన నిర్ణయం తీసుకోవడం అత్యవసరం. లేకుంటే ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి లాభం కలగడం సంగతి ఎలా ఉన్నా దానిని ఒక రాజకీయ అంశంగా మలుచుకొన్న రాష్ట్రంలో ప్రతిపక్షాలకు అది చాలా లబ్ది చేకూర్చడం ఖాయం.

మోడీ ప్రసంగంలో కాంగ్రెస్ కి తప్పులే దొరకలేదా?

  ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న ఎర్రకోటపై నుండి ప్రసంగిస్తున్నప్పుడు, ఆయన తన ప్రసంగాన్ని రాజకీయ కాటాలో తూచి చూడవద్దని మీడియా, రాజకీయ పండితులకు, ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసారు. అంటే ప్రధాని తన ప్రసంగంలో ఆనవాయితీగా కొన్ని సంక్షేమ, అభివృద్ధి పధకాలను ప్రకటించడం, దేశ ప్రజలను మెప్పించేందుకు కొన్ని వరాలు ప్రకటించడం, ఇంతవరకు ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, ఇక ముందు చేయబోయే వాటి గురించి ఆయన చెప్పుకొంటే వాటిపై మీడియా, రాజకీయ పండితులు రాజకీయ విశ్లేషణలు చేయడం, ప్రతిపక్షాలు ప్రధాని ప్రసంగంలో పస లేదని తేల్చి పడేయడం సర్వసాధారణమయిన విషయమే. అందుకే ఆయన తన ప్రసంగాన్ని ఆ రాజకీయ కాటాలో తూచి చూడవద్దని విజ్ఞప్తి చేసారు. కానీ అంతమాత్రన్న ఆయన ప్రసంగాన్ని విశ్లేషించకుండా, విమర్శలు గుప్పించకుండా ఎవరూ విడిచిపెట్టబోరు.   కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇద్దరూ ఆయన ప్రసంగంపై ప్రతిస్పందించేందుకు నిరాకరించడం విశేషం. బహుశః మోడీ ప్రసంగంలో తప్పులు ఏరిపెట్టడానికి వారి రాజకీయ సలహాదారులు మరికొంత సమయం కోరారేమో? కానీ మాజీ కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ మోడీ ప్రసంగంలో ఒక తప్పుని వెతికిపట్టుకొని విమర్శలు గుప్పించారు. మాజీ సైనికులకి ఒక ర్యాంక్-ఒక పెన్షన్ అమలు గురించి ఆయన ఎటువంటి హామీ ఇవ్వలేకపోయారని విమర్శించారు.   కానీ ఈ సమస్య గత అనేక ఏళ్లుగా నలుగుతోంది. ఇంతవరకు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కారించకుండా నిర్లక్ష్యం వహించింది. కానీ ప్రధాని నరేంద్ర మోడీ నిన్న తన ప్రసంగంలో ఈ సమస్యని శాస్వితంగా పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం గట్టి కసరత్తే చేస్తోందని, త్వరలోనే దీనిని పరిష్కరించి తమ హామీని నిలబెట్టుకొంటామని, మువ్వన్నెల జెండా సాక్షిగా ప్రమాణం చేసి చెపుతున్నానని అన్నారు. కొన్ని సాంకేతిక అవరోధాల కారణంగా ఈ సమస్య పరిష్కారంలో జాప్యం జరుగోతోందని కేంద్రరక్షణ మంత్రి మనోహర్ పారేకర్ తెలిపారు.   గత పదేళ్ళలో ఈ సమస్యని పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించిన కాంగ్రెస్ పార్టీ, ఈ సమస్యని మోడీ ప్రభుత్వం మంత్రదండం త్రిప్పి పరిష్కరించేయాలని ఆశించడం విడ్డూరం. డిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీని కోసం ధర్నా చేస్తున్న మాజీ సైనికులను పరామర్శించేందుకు రాహుల్ గాంధీ వెళ్ళినప్పుడు వారు అందుకే ‘రాహుల్ గాంధీ గో-బ్యాక్’ అంటూ నినాదాలు చేసారు. ఆయనకి జరిగిన ఈ అవమానం గురించి దాచిపెట్టుకొని, కోడి గుడ్డుకి ఈకలు పీకుతున్నట్లు ఈ సమస్య గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి హామీ ఇవ్వలేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కానీ మోడీ తన ప్రసంగంలో దీని గురించి చాలా స్పష్టమయిన హామీ ఇచ్చారనే భావించవచ్చును. అయినప్పటికీ ఆయన ప్రసంగంలో ఏవో తప్పులు వెతికి పట్టుకొని విమర్శించాలి కనుక కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నట్లుంది.

వినూత్న ఆలోచనలు, విధానాలతో ముందుకు సాగుతున్న మోడీ

  ప్రధాని నరేంద్ర మోడీ డిల్లీలో ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశంలో పేరుకుపోయిన అవినీతిని, అనేక సమస్యలను తమ ప్రభుత్వం ఏవిధంగా పరిష్కరించుకొంటూ వస్తోందో సవివరంగా తెలిపారు. అనేక దశాబ్దాలుగా పేరుకుపోయున్న ఈ సమస్యలకు సాంప్రదాయ పద్దతులలో పరిష్కారించాలంటే అవి ఇంకా నానాటికీ పెరుగుతూనే ఉంటాయి తప్ప ఎన్నటికీ పరిష్కారానికి నోచుకోవని గుర్తించి, తమ ప్రభుత్వం వాటిని వాస్తవిక దృక్పధంతో ఎదుర్కొని ఏవిధంగా పరిష్కరిస్తున్నదీ ఆయన ఉదాహారణలతో సహా వివరించారు.   ఉదాహరణకి ఇన్ని దశాబ్దాలుగా గ్యాస్ సబ్సిడీని సామాన్యులే కాకుండా దేశంలో ఉన్నత, అధికాదాయ వర్గాల ప్రజలు కూడా వినియోగించుకొంటున్నారు. కానీ ఆ సంగతి ఇంతవరకు ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అటువంటి వారందరూ సామాన్య ప్రజల కోసం గ్యాస్ సబ్సీడీని వదులుకోమని ఇచ్చిన పిలుపుకి ఇంతవరకు సుమారు 20 లక్షల మంది తమ సబ్సీడీని స్వచ్చందంగా వదులుకొన్నారని, ఆ విధంగా ఏడాదికి రూ.15, 000 కోట్లు మిగులుతుందని ఆ సొమ్మునంతా సామాన్య ప్రజల కోసమే వినియోగిస్తామని మోడీ తెలిపారు.   ఇంతవరకు బొగ్గు గనులను, స్పెక్ట్రం వగైరా లైసెన్సులను కేంద్రప్రభుత్వం పెద్ద పెద్ద సంస్థలకు, వ్యక్తులకు నామ మాత్ర ధరలకే కేటాయించేవని కానీ తమ ప్రభుత్వం వాటన్నిటినీ వేలం ద్వారా కేటాయించడం ద్వారా ప్రభుత్వ ఖజనాలో రూ.3 లక్షల కోట్లు జామా అయ్యాయని మోడీ తెలిపారు. బొగ్గు గనులనే కాక ఎఫ్.ఎం. రేడియో లైసెన్సులను కూడా వేలం వేస్తూ ప్రభుత్వానికి అదనపు ఆదాయ మార్గాలను సృష్టించుకొంటున్నామని తెలిపారు.   అదేవిధంగా ఇంతవరకు దేశంలో వివిధ రాష్ట్రాలలో గనుల నుండి వెలికి తీస్తున్న బొగ్గుని, విదేశాలలో నుండి దిగుమతి చేసుకొంటున్న బొగ్గును సుదూర ప్రాంతాలకు తరలించేవారని, తద్వారా మధ్య దళారులు, బడా సంస్థలు లాభపడుతుంటే ప్రభుత్వాలు, ప్రజలు ఆ నష్టాన్ని భరించవలసి వచ్చేదని, తమ ప్రభుత్వం ఆ పద్దతిని మార్చి ఎక్కడి బొగ్గును అక్కడి పరిసర ప్రాంతాలకు, సమీప రాష్ట్రాలు వినియోగించుకొనే విధంగా పద్దతులు, నియమనిబంధనలలో మార్పులు చేసామని, ఆ విధంగా కూడా ప్రభుత్వంపై భారం, నష్టాలు తగ్గించుకోగలిగామని తెలిపారు.   ఈ విధంగా సమకూర్చుకొంటున్న భారీ మొత్తాలతో దేశంలో అన్ని రాష్ట్రాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు మొదలుపెట్టిందని తెలిపారు. వాటిలో అనేక తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న ఈశాన్య రాష్ట్రాలకి గ్యాస్ పైప్ లైన్లు వేయడం, రోడ్లు, విద్యుదీకరణ తదితర మౌలికవసతుల కల్పనకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 69సం.లు అయినప్పటికీ అనేక రాష్ట్రాలలో మొత్తం 18,500 గ్రామాలు విద్యుత్ సదుపాయం లేక నేటికీ చీకటిలో మ్రగ్గుతున్నాయని, ఆ గ్రామాలన్నిటికీ మిగిలిన ఈ నాలుగేళ్ల కాలంలో తప్పకుండా విద్యుత్ సదుపాయం కల్పించి తీరుతామని మోడీ తెలిపారు.   భారత సైన్యంలో ఒకే ర్యాంక్, ఒకే పెన్షన్ విధానం ప్రవేశపెట్టమని గత 52 సం.లుగా సైనికులు కోరుతున్నారని కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వమూ ఈ సమస్యను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించలేదని కానీ తమ ప్రభుత్వం ఈ సమస్యను ఏవిధంగానయినా పరిష్కరించేందుకు చాలా గట్టి ప్రయత్నాలు చేస్తోందని కనుక మువ్వన్నెల జెండా సాక్షిగా ఈ సమస్యను వీలయినంత త్వరలోనే పరిష్కరిస్తానని మోడీ హామీ ఇచ్చారు.   నల్లదనం గురించి కూడా మోడీ తన ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, వాటి ఫలితాల గురించి తెలియజేసారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశాలలో పడిఉన్న నల్లదనం వెనక్కి రప్పించేందుకు వివిధ శాఖలకు చెందిన నిపుణులతో కూడిన ‘సిట్’ ఏర్పాటు చేసిందని, తమ ప్రభుత్వం నల్లదనాన్ని ఇంకా వెనక్కి రప్పించలేకపోయినా చాలా పటిష్టమయిన చట్టాలు తీసుకువచ్చి దేశంలో నుండి నల్లదనం బయటకి పోకుండా ఆపగలిగామని తెలిపారు. నల్ల కుభేరులకు తమ ప్రభుత్వం ఇచ్చిన గడువులో ఇప్పటికే చాలామంది ప్రభుత్వానికి తమ నల్లదనం వివరాలను తెలిపి దానికి జరిమానాలు చెల్లించడం మొదలుపెట్టినట్లు తెలిపారు.   దేశంలో చీడపురుగులా పేరుకుపోయిన అవినీతిని నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం చేపడుతున్న అనేక చర్యల గురించి, వాటి ఫలితాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో సవివరంగా తెలిపారు. ఏడాదిన్నర పాలనలో తమ ప్రభుత్వం మీద ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాకపోవడమే తమ నీతి నిజాయితీలకు, పారదర్శకతకు ఉదారణలని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ఏమి చేసినా దేశంలో సామాన్యుడి జీవన ప్రమాణాలు పెంచి సుఖంగా బ్రతికేందుకు అవకాశం కల్పించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. రోగం ముదిరిపోయినప్పుడు బలమయిన మందులు, ఇంజక్షన్లు తీసుకొన్నప్పుడు దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని అలాగే తమ ప్రభుత్వం చేపడుతున్న ఈ అవినీతి నిర్మూలన చర్యల వలన కూడా తమ ప్రభుత్వం అనేక సవాళ్ళను, ప్రతికూలతను ఎదుర్కోవలసివస్తోందని కానీ ఏమాత్రం జంకకుండా ముందుకు సాగుతున్నామని తెలిపారు.   వచ్చే నాలుగేళ్ళలో దేశం సర్వతో ముఖాభివృద్ధి సాధించడం తధ్యమని మోడీ దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు. రాజకీయ పార్టీలు, విశ్లేషకులు తన ప్రసంగాన్ని రాజకీయ దృక్కోణం నుంచి చూస్తూ విమర్శలు చేయవచ్చని కానీ తను చెపుతున్న ఈ మాటలలో వాస్తవాలను గ్రహించాలని ఆయన కోరారు.

పోరాడలేనప్పుడు ప్రశ్నించడం దేనికో?

  అధికారం కోసం కాదు ప్రశ్నించడానికే పార్టీ పెట్టి ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చేనని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందే చెప్పుకొన్నారు. కానీ ఆయననే ప్రజలు, ప్రతిపక్షాలు కూడా నిలాదీసేవరకు కూడా ఆయన ప్రశ్నించలేదు. అది కూడా ఎప్పుడో ట్వీటర్లోనో మరీ తప్పనిసరయితే ప్రెస్ మీట్ పెట్టో అందరినీ కడిగిపారేసి మళ్ళీ మాయమయిపోతుంటారు. ఆయన తనంతట తాను ప్రత్యక్షమవ్వాలే తప్ప ఎవరూ ఆయనను కలవలేరు, పట్టుకోలేరనే నిశ్చితాభిప్రాయం ప్రజలలో, రాజకీయ వర్గాలలో ఏర్పడిపోయింది. ఆయన ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనలేనప్పుడు, నేరుగా ప్రజా సమస్యలపై పోరాడలేనప్పుడు, వాటి గురించి పనిచేస్తున్న రాజకీయ నేతలని, ప్రభుత్వాలని విమర్శించడం కూడా అనవసరం. ఒక పౌరుడుగా ఆయన తన అభిప్రాయలు నిర్మొహమాటంగా వ్యక్తం చేయవచ్చును కానీ ఒక రాజకీయ పార్టీకి నేతగా ఉన్నప్పుడు అభిప్రాయలు, సూచనలు, సలహాలు, విమర్శలు చేసేముందు తను కూడా వాటి పరిష్కారానికి ఎంతో కొంత కృషి చేసి ఉంటే, ఆయన ఈవిధంగా సలహాలు చెప్పినా విమర్శలు చేసినా అర్ధం ఉంటుంది.కానీ తను ఎటువంటి చొరవ చూపకుండా సినిమాలు చేసుకొంటూ తీరికున్నప్పుడు ట్వీట్ మెసేజులు, ప్రెస్ మీటలు పెట్టి పని చేతున్న వారిని విమర్శించడం సబబు కాదు.      ఆయన తెదేపా-బీజేపీలకి మద్దతు ఇస్తున్నప్పుడు ప్రత్యేక హోదా వస్తుందా...రాదా? రాకపోతే ఎందుకు రాదు? వంటి వివరాలను అడిగి తెలుసుకోవచ్చును. అవసరమనుకొంటే ఆయనే స్వయంగా ప్రధాని మోడీతో నేరుగా దీని గురించి మాట్లాడి ఉండవచ్చును. ఆవిధంగా చేసి ఉండి ఉంటే ఆయన అభిమానులే కాదు యావత్ రాష్ట్ర ప్రజలందరూ హర్షించేవారు. కానీ అటువంటి ప్రయత్నాలేవీ చేయకుండా ఆయన దాని కోసం పోరాడుతున్న ఎంపీలపై తీవ్ర విమర్శలు గుప్పించినందుకు తిరిగి విమర్శలు మూటగట్టుకోవలసి వచ్చింది.   రాజధాని కోసం భూసేకరణ విషయంలో కూడా ఆయన మళ్ళీ అలాగే వ్యవహరిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి కొందరు రైతులు తమ భూములను ఇవ్వడానికి సముఖంగా లేరని తెలుసుకొని ఆయన స్వయంగా అక్కడికి వెళ్లి రైతులతో మాట్లాడి వారి తరపున పోరాడుతానని హామీ ఇచ్చివచ్చారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ దాని ఊసే ఎత్తలేదు!   రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రాజధాని నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టాలనుకొంటోంది. ఈ సమయంలో కొందరు రైతులు తమ భూములు ఇవ్వడానికి అభ్యంతరం చెపుతున్నారు కనుక  రాజధానిని వేరే చోటికి మార్చలేదు. అందుకే వేరే గత్యంతరం లేకనే ఈ సమస్యను అధిగమించేందుకు భూసేకరణ చట్టాన్ని ప్రయోగించవలసి వస్తోంది. కానీ చివరి నిమిషం వరకు కూడా ప్రభుత్వం రైతులను ఒప్పించి వారి దగ్గర నుండి కూడా ల్యాండ్ పూలింగ్ పద్ధతి ద్వారానే సేకరించేందుకు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి ఈవిధంగా హెచ్చరికలు చేయడం సమంజసం కాదు.   ఇప్పటికే కాంగ్రెస్, వైకాపాలు రాజధాని నిర్మాణానికి చాలా అడ్డంకులు సృష్టిస్తున్నాయి. తెదేపా ప్రభుత్వం వచ్చే ఎన్నికలలోగా రాజధాని  మొదటి దశ నిర్మాణం పూర్తి చేసినా వాటి అడ్డ్రస్సులు గల్లంతవుతాయనే భయంతోనే అడ్డు పడుతున్నాయి తప్ప రైతుల మీద ప్రేమతో కాదనే చెప్పవచ్చును. లేకుంటే  అవి మధ్యలో తమ పోరాటాన్ని పక్కనపడేసి, ప్రత్యేక హోదా వంటి ఇతర అంశాల మీదకు మల్లిపోఎవే కావు. ఈ సమస్యలన్నిటినీ ఒకతోటిగా అధిగమించుకొంటూ ప్రభుత్వం పట్టుదలగా ముందుకు సాగుతోంది. ఎందుకంటే ఇంత అనుకూలమయిన పరిస్థితులున్నప్పుడు కూడా రాజధాని నిర్మించుకోలేకపోతే మరెప్పుడూ నిర్మించుకోలేమనే తపనతోనే.   కానీ, తెదేపా,బీజేపీలకు మిత్రుడుగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ ఇవన్నీ ఆలోచించకుండా ప్రభుత్వానికి ఉచిత సలహాలు, హెచ్చరికలు చేయడం సబబు కాదు. ఆయన ప్రభుత్వానికి ఈవిధంగా ట్వీట్ మెసేజులు పెట్టే బదులు, తన సినిమాలలో ఇటువంటి క్లిష్టమయిన సమస్యలను ఆయన ఏవిధంగా అవలీలగా పరిష్కరించి చూపుతారో అదేవిధంగా ఈ సమస్యలన్నిటినీ కూడా ఆయనే స్వయంగా చొరవ తీసుకొని పరిష్కరించి చూపినట్లయితే అప్పుడు ఆయన సినిమాలలోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోగానే ప్రజలు గుర్తిస్తారు. లేకుంటే విమర్శలు మూటగట్టుకొంటూనే ఉండవలసి వస్తుంది.

వైకాపా పోరాటం ప్రత్యేక హోదాకోసమా దాని క్రెడిట్ కోసమా?

  ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఈనెల 11వ తేదీన సీపీఐ పార్టీ పిలుపు మేరకు ఏపీ బంద్ జరిగింది. అంతకు ముందు రోజే మునికోటి మృతికి సంతాపంగా తిరుపతి బంద్ జరిగింది. మళ్ళీ ఈనెల 29న ప్రత్యేక హోదా కోసం ఏపీ బంద్ నిర్వహించాలని వైకాపా సిద్దం అవుతోంది. సీపీఐ పార్టీ ఇచ్చిన రాష్ట్ర బంద్ కార్యక్రమానికి కాంగ్రెస్, వైకాపాలు కూడా మద్దతు పలికాయి. అటువంటప్పుడు వైకాపా మళ్ళీ తను కూడా మరొకమారు రాష్ట్ర బంద్ నిర్వహించాలనుకోవడం చూస్తే ఆ పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకే పోరాడుతోందా లేకపోతే ఈ ప్రత్యేక హోదా క్రెడిట్ దక్కించుకొనేందుకే పోరాడుతోందా? అనే అనుమానం కలుగుతోంది.   ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అద్వర్యంలో డిల్లీలో జంతర్ మంతర్ వద్ద కేవలం 5గంటల దీక్ష కోసం ఆ పార్టీ చేసుకొన్న ప్రచారం, హడావుడి చూస్తే ఆ అనుమానం నిజమేననిపిస్తుంది. ఆ సమయంలో పార్లమెంటులో సమావేశాలు జరుగుతున్నాయని, భద్రతా కారణాల దృష్ట్యా అక్కడికి ఎవరినీ అనుమతించరనే సంగతి తెలిసి ఉన్నప్పటికీ, ధర్నా ముగిసిన తరువాత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలను, కార్యకర్తలను వెంటబెట్టుకొని పార్లమెంటు వద్దకు పాదయాత్ర చేయడం, అక్కడ పోలీసులతో ఘర్షణ పడటం, ఆ కారణంగా అరెస్ట్ అవడం వంటివన్నీ కూడా జాతీయ మీడియాను, రాష్ట్ర ప్రజలను ఆకట్టుకోవాలనే తాపత్రయంతో చేసినట్లుగానే కనిపిస్తుంది తప్ప ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు అనిపించడం లేదు.   ఇదివరకు సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆయన చేసిన సమైక్యాంధ్ర పోరాటాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకొన్నట్లయితే ఇప్పుడు కూడా ఆయన ఈ ప్రత్యేక హోదాపై పోరాడుతున్న వ్యక్తిగా దాని పూర్తి క్రెడిట్ సంపాదించుకొనేందుకే రాష్ట్ర బంద్ కి పిలుపునిస్తున్నారనే అనుమానం కలగడం సహజం. రాష్ట్ర విభజనతో దెబ్బ తిన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే వేగంగా రాష్ట్రాభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే దాని కోసం తాము పోరాడుతున్నామని చెప్పుకొంటున్న వైకాపా మరి ఇంత కాలం ఎందుకు దాని గురించి ఈవిధంగా పోరాటాలు చేయలేదు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పదు. గత ఏడాది కాలంగా వైకాపా స్థానిక అంశాల మీద అంటే పంట రుణాల మాఫీ, రాజధాని భూములు, హూద్ హూద్ పరిహారం, పట్టిసీమ వంటి అంశాల మీద మాత్రమే పోరాటాలు చేసింది తప్ప ఏనాడు పోలవరం, రైల్వే జోన్, రాష్ట్రానికి నిధులు, ప్రత్యేక హోదా, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, ఉన్నత విద్యా, వైద్య సంస్థల ఏర్పాటు, మెట్రో రైల్ ప్రాజెక్టులు వంటి కేంద్రం పరిధిలో ఉన్న అంశాల గురించి గట్టిగా పోరాడింది లేదు. కారణం ఏమిటో అందరికీ తెలుసు.   పోనీ రాష్ట్రంలో ప్రజాసమస్యలపైనయినా నిలకడగా పోరాడిందా? అంటే అదీ లేదు. కొన్ని రోజులు పంట రుణాల మాఫీ గురించి దీక్షలు ధర్నాలు అంటూ హడావుడి చేసి, దానిని పక్కనబెట్టి రాజధాని భూములు అంటూ మంగళగిరిలో ధర్నాలు చేసారు. ఆ తరువాత దానిని కూడా పక్కనబెట్టి ఓటుకి నోటు కేసు పట్టుకొంది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికెత్తుకొంది. దీని తరువాత దేని గురించి పోరాడుతుందో ఆ పార్టీకే తెలియాలి. కానీ తను చేస్తున్న ఈ పోరాటాలను మధ్యలోనే అటకెక్కిస్తున్నప్పుడు మరి వాటి గురించి ఎందుకు అంతగా పోరాడుతోంది? అని ప్రశ్నించుకొంటే తన పోరాటాలతో ప్రజల దృష్టిని ఆకర్షించి పార్టీని బలోపేతం చేసుకోవడానికి, తన పార్టీ నేతలు, కార్యకర్తలు బీజేపీ వైపు చూడకుండా ఉంచేందుకేనని చెప్పవచ్చును.   ఇప్పటికే సుమారు నాలుగేళ్ళుగా వైకాపా ప్రతిపక్షంలో ఉంది. మరో నాలుగేళ్ళు ప్రతిపక్షంలోనే ఉండకతప్పదు. అప్పటివరకు పార్టీ క్యాడర్, నేతలు చెదిరిపోకుండా పట్టి ఉంచాలంటే ఇటువంటి హడావుడి ఏదో ఒకటి చేయక తప్పదు. అందుకే ఈ ధర్నాలు, బంద్ లు హడావుడి. ధర్నా చేస్తే ప్రజల మీద, ప్రభుత్వం మీద దాని ప్రభావం పరిమితంగా ఉంటుంది. అదే రాష్ట్ర బంద్ చేస్తే తమ పార్టీ బలం ఏమిటో నిరూపించుకొనే అవకాశం ఉంటుంది. దాని వలన పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో కూడా చైతన్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. జాతీయ మీడియా, రాష్ట్ర ప్రజల దృష్టిని కూడా ఆకర్షించవచ్చును. బహుశః అందుకే వైకాపా తను కూడా మళ్ళీ మరొకమారు రాష్ట్ర బంద్ నిర్వహించడానికి సిద్దం అవుతున్నట్లుంది. ప్రతిపక్షంలో ఉన్నాము గనుక ప్రజా సమస్యల పోరాడవలసిన బాధ్యత తమకు ఉందని చెప్పుకొనే వెసులుబాటు ఎలాగు ఉంది కనుక ఎవరూ దానిని తప్పు పట్టడానికి సాహసించలేరు.

ఇప్పటికయినా ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా?

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా సీపీఐ నేడు ఏపీ బంద్ నిర్వహిస్తోంది. దానికి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు తెలుపుతున్నాయి. వివిధ ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు కూడా బంద్ కు మద్దతు తెలుపుతున్నాయి. రాష్ట్రంలో తెదేపా, బీజేపీలు కూడా ప్రత్యేక హోదా కోరుకొంటునప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అధికారంలో ఉన్నందున వారు ఈ బంద్ లో పాల్గొనడం లేదు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేప్పట్టినప్పటి నుండి తెదేపా ప్రభుత్వం ప్రత్యేక హోదాతో సహా రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీల అమలుకోసం కేంద్రం మీద నిరంతరం ఒత్తిడి తెస్తూనే ఉంది. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా తమ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. ఆ కారణంగానే రాష్ట్రానికి అనేక ఉన్నత విద్యాసంస్థలు, నిధులు మంజూరు అవుతున్నాయి.   కానీ ప్రత్యేక హోదా విషయంలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. కారణాలు అందరికీ తెలిసినవే. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో హామీ ఇవ్వబడింది కనుక తప్పనిసరిగా ఆ హామీని అమలు చేయవలసి ఉంటుంది. దానికి ఎదురవుతున్న ఇటువంటి ఇబ్బందులను ఏవిధంగా అధిగమించాలనేది కేంద్ర ప్రభుత్వ సమస్య. కేంద్రం అధీనంలో ఉన్న ఆర్ధిక సంఘం తదితర రాజ్యాంగ వ్యవస్థలన్నిటినీ ఒప్పించడం కేంద్రానికి పెద్ద కష్టం కాకపోవచ్చును కానీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి అభ్యంతరం చెపుతున్న తమిళనాడు, ఓడిశా వంటి రాష్ట్రాలను ఒప్పించడమే కష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం చొరవ తీసుకొంటే అదీ పెద్ద కష్టం కాకపోవచ్చును. కానీ వాటిని ఒప్పించేందుకు కేంద్రం మళ్ళీ వాటికి కూడా కొత్తగా హామీలు ఇవ్వవలసి ఉంటుంది. వాటికిస్తే మిగిలిన రాష్ట్రాలు డిమాండ్ చేయవచ్చును. బహుశః అందుకే మోడీ ప్రభుత్వం వెనుకంజ వేస్తున్నట్లుంది.   ‘ప్రత్యేక హోదా ఆంద్రప్రదేశ్ హక్కు’ రాష్ట్రానికి తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇవ్వవలసిందేనని రాహుల్ గాంధీ గట్టిగా చెపుతున్నారు. అయితే దేశంలో ఏడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అంగీకరిస్తాయా లేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తాయా? అనే విషయాన్ని ఆయనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే పొరుగునే ఉన్న కాంగ్రెస్ పాలిత కర్నాటక రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఆ కారణంగానే తమిళనాడు, ఓడిశా ప్రభుత్వాలు చాలా ముందు నుండే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నాయి. కనుక ముందుగా కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సమ్మతిస్తుందా లేదా అనే విషయం రాహుల్ గాంధీయే తేల్చి చెపితే బాగుంటుంది.   రాష్ట్ర ప్రజల అభ్యంతరాలను ఏ మాత్రం లెక్క చేయకుండా తన రాజకీయ ప్రయోజనాల కొరకు రాష్ట్ర విభజన చేసి, రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి కల్పించిన కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితిని చూసి మొసలి కన్నీళ్లు కార్చుతూ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రం ఇంకా నష్టపోవలసి వస్తుందని వాదిస్తూ ఉద్యమాలు మొదలుపెట్టడం చాలా విడ్డూరంగా ఉంది. అది ఎందుకు ఉద్యమిస్తోందో ప్రజలందరికీ తెలుసు. కానీ అది చేస్తున్న పోరాటం వలన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందనే ఆశతోనే ప్రజలు దాని పోరాటానికి మద్దతు ఇస్తున్నారు. కొన్ని ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు, ప్రత్యేక హోదా సాధన సమితి, సీపీఐ కూడా నడుం బిగించడంతో రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు ఊపందుకొన్నాయి.   బహుశః అది గమనించిన తరువాతనే వైకాపా కూడా ఇప్పుడు హటాత్తుగా బరిలోకి దిగిపోయినట్లుంది. ఈ ఉద్యమం చేయడంలో రాజకీయ పార్టీల ఉద్దేశ్యాలు, ప్రయోజనాలు ఏవయినప్పటికీ అవి చేస్తున్న ఈ పోరాటాల కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉంది గనుక ప్రజలు కూడా వాటి ఉద్యమాలకి మద్దతు ఇస్తున్నారు. మరి ఈ ఒత్తిడికి తలొగ్గి మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందో లేక ప్రత్యమ్నాయ పరిష్కార మార్గం కనుగొని ఈ సమస్య నుండి బయటపడే ప్రయత్నం చేస్తుందో వేచి చూడాలి.

ఏపీ కోసం ప్రత్యేక కన్నీళ్లు కార్చుతున్న కాంగ్రెస్ పార్టీ

  ఆనాడు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ లక్షలాది ఆంద్రప్రదేశ్ ప్రజలు రోడ్ల మీదకు వచ్చి సుమారు రెండున్నర నెలలపాటు ఏకధాటిగా ఉద్యమించినా పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కనందుకు మొసలి కన్నీళ్లు కార్చుతూ ఉద్యమిస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రానికి తీరని నష్టం కలుగుతోందని వాదిస్తున్న కాంగ్రెస్ నేతలు అసలు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తమ పార్టీ రాష్ట్రవిభజన ఎందుకు చేసింది? ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా తెదేపాకి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులు తమ పదవులకు తక్షణమే రాజీనామాలు చేయమని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఆనాడు ఎందుకు రాజీనామాలు చేయలేదు? చేసినా వాటిని ఎందుకు ఆమోదింపజేసుకోలేదు?అనే ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు.   కాంగ్రెస్ పార్టీ కేవలం తన రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకొంది తప్పకోట్లాది ప్రజల మనోభావాలను, అభీష్టాన్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రజల కోసం తెగ బాధపడిపోతూ మొసలి కన్నీళ్లు కార్చుతోంది! అసలు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఎందుకు ప్రకటించింది అంటే దానికి రెండు కారణాలు కనబడుతున్నాయి.   1. రాష్ట్ర విభజన కారణంగా తమ పార్టీపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న ఆంద్రప్రదేశ్ ప్రజలను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నంలోనే ఆఖరు నిమిషంలో ఈ ప్రత్యేక హోదా హామీని ప్రకటించింది. 2. ఎన్నికల తరువాత తమ పార్టీ ఎలాగూ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రాదని ముందే పసిగట్టి, తరువాత అధికారంలోకి రాబోయే బీజేపీని ఇరుకున పెట్టవచ్చనే దురాలోచనతోనే సాధ్యాసాధ్యాలు తెలిసీకూడా అవేవీ పట్టించుకోకుండా పార్లమెంటులో హామీ ఇచ్చింది.   కాంగ్రెస్ అధిష్టానానికి నిజంగా చిత్తశుద్ది ఉండి ఉంటే ఈ ప్రత్యేక హోదా అంశాన్ని కూడా విభజన చట్టంలో చేర్పించి ఉండేది. కానీ చేర్చలేదు. రాష్ట్రవిభజన చేసేటప్పుడు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు, ఏర్పాట్లు చేయకపోయినా, ఎన్నికల తరువాత కేంద్రంలో అధికారంలోకి రాబోయే బీజేపీని ఇరుకునపెట్టడానికే ఆనాడు నోటిమాటగా హామీ ఇచ్చి ఉండవచ్చును. కానీ అది ఊహించినట్లుగానే ఆంద్రప్రదేశ్ ప్రజలు ఆ హామీని నమ్మి దానికి ఓటేయలేదు. కానీ అది ఆశించిన రెండవ ప్రయోజనం మాత్రం ఇప్పుడు నేరవేరుతోంది. ఆనాడు చాలా ముందు చూపుతో పార్లమెంటులో ఈ ప్రత్యేక హోదా హామీ ఇచ్చినప్పుడు దానికి వెంకయ్య నాయుడు చేతనే సమర్ధింపజేయించుకొనేలా జాగ్రత్త పడింది. ఇప్పుడు దానినే ఒక అస్త్రంగా మలుచుకొని బీజేపీ మీద ప్రయోగిస్తోంది.   దేశాన్ని పదేళ్ళపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాలకు కొత్తగా ప్రత్యేక హోదా ఇవ్వడంలో ఎదురయ్యే సమస్యలు, వాటి సాధ్యాసాధ్యాలు తెలియవని అనుకోలేము. అందుకే అది ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్న ఏడు రాష్ట్రాల అభ్యర్ధనలను పట్టించుకోలేదు. కానీ ఒక్క ఆంద్రప్రదేశ్ కి మాత్రం చాలా ఉదారంగా హామీ ఇచ్చేసింది. ఇప్పుడు తను ఎలాగూ అధికారంలో లేదు కనుక ఆ హామీని అమలుచేయమని ఉద్యమిస్తూ తెదేపా, బీజేపీలను రాజకీయంగా దెబ్బ తీయాలని ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ఈ ప్రత్యేక హోదా అంశంతో రాష్ట్రంలో జీవచ్చవంలా పడి ఉన్న తన కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకొనే ప్రయత్నం చేస్తోంది.   ఆనాడు తెలంగాణా కోసం తెలంగాణా యువకులు బలిదానాలు చేసుకొనేందుకు కారణమయిన కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ నేడు ఆంధ్రాలో యువకుల బలిదానాలకు కారణమవుతోంది. కానీ ఇప్పుడు ఆ నింద రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెదేపాపైనా, కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వంపైనే పడుతుంది. కనుక ఆవిధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రెండు పార్టీలపై పైచేయి సాధించే అవకాశం ఉంది. కనుకనే ఆనాడు రాష్ట్రాన్ని, ప్రజలని పట్టించుకొని కాంగ్రెస్ నేతలు, వారి అధిష్టానం మళ్ళీ ప్రత్యేక హోదా పేరు చెప్పుకొని ఉద్యమాలు మొదలుపెట్టారు. వారి ఉద్యమానికి అప్పుడే ఒక వ్యక్తి బలయిపోయాడు. తిరుపతిలో నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం నిర్వహించిన బహిరంగ సభలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసిన మునికోటి అనే వ్యక్తి ఈ రోజు మధ్యాహ్నం వెల్లూరు ఆసుపత్రిలో మరణించాడు.   ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత సుమారు ఆరేడు నెలలు కలుగుల్లో దాకొన్న కాంగ్రెస్ నేతలందరూ బిలబిలమంటూ బయటకువచ్చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ హడావుడి చేస్తున్నారు. కానీ వారి పోరాటం, ఆరాటం అంతా రాష్ట్రంలో తమ పార్టీని బ్రతికించుకోవడానికి, తద్వారా తమ రాజకీయ మనుగడని కాపాడుకోవడానికే తప్ప రాష్ట్రానికి ఏదో నష్టం జరిగిపోతోందనీ కాదు...ప్రత్యేక హోదా కోసం అంతకంటే కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును. కనుక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రజలపైకి విసురుతున్న ఈ ప్రత్యేక వలలో పడకుండా జాగ్రత్తపడవలసిన అవసరం ఉంది.

ఇదంతా రాహుల్ గాంధీ బలప్రదర్శన కోసమేనేమో?

  లలిత్ మోడీ వ్యవహారంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుందర రాజే, వ్యాపం కుంభకోణంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజినామాలకి పట్టుబడుతూ పార్లమెంటుని స్తంభింపజేసి కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుకొనే ప్రయత్నం చేసింది. నిజానికది రాహుల్ గాంధీ చేసిన బలప్రదర్శనగానే భావించవచ్చును. ఇంతకు మునుపు అతనికి నాయకత్వ లక్షణాలు బొత్తిగా లేవు...స్వంత పార్టీని కూడా ముందుండి నడిపించలేనివాడు...ప్రధాని మోడీ ముందు ఎందుకు పనికిరాడు...వంటి అనేక విమర్శలు ఎదుర్కోవలసి వచ్చేది. ఆ విమర్శలకు ఆయన ధీటుగా జవాబు చెప్పలేక పార్లమెంటు వెనుక బెంచీలలో కునుకు తీసేవారు. కానీ రెండు నెలలు విదేశాలలో చార్జింగ్ చేసుకొని వచ్చిన తరువాత “తనొక బలమయిన నాయకుడు, పార్టీని ముందుండి నడిపించగలను మోడీని కూడా ధీటుగా ఎదుర్కోగలను...”అని నిరూపించే ప్రయత్నంలోనే కాంగ్రెస్ ఎంపీల చేత ఈ బలప్రదర్శన చేయిస్తున్నారని చెప్పవచ్చును. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ అధ్యక్షుడిగా పట్టాభిషేకం చేసుకోవడానికి పార్టీలో అంతర్గతంగా సీనియర్ల నుండి ఎదురవుతున్న అభ్యంతరాలను అధిగమించడానికి కూడా ఈ హడావుడి పనికి వస్తుందని చెప్పవచ్చును.   ఏమయినప్పటికీ అతను ఇప్పుడు అసలు సిసలయిన కాంగ్రెస్ నాయకుడిలాగే వ్యవహరిస్తుండటం చూసి సోనియమ్మ సైతం మురిసిపోతోంది. రెండు నెలలు విదేశాలలో తిరిగి వస్తే ఇంత మార్పు ఎలా సాధ్యమో ఆమెకీ అర్ధం కావడం లేదు కానీ ఆ వెళ్ళేదేదో పదేళ్ళ క్రితమే వెళ్లివచ్చి ఉంటే నేడు ఇటువంటి దుస్థితి వచ్చేది కాదు కదా అని మనసులో అనుకొంటూ ఉండవచ్చును.   కాంగ్రెస్ పార్టీ ఊహించినట్లుగానే 25మంది ఎంపీలను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ నుండి 5రోజుల పాటు సస్పెండ్ చేసారు. బహుశః అలాగ జరగాలనే కాంగ్రెస్ సభ్యులు సభను నడవనీయకుండా అడ్డుపడ్డారేమో? ఆ తరువాత వాళ్ళందరూ కలిసి మరో సరికొత్త ఇమ్మోషనల్ డ్రామాకు తెర తీసారు. ఎన్నడూ రోడ్డు మీద నిలబడని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పదేళ్ళ పాటు దేశాన్ని ఏలిన మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ తదితరులు అందరూ పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నిలబడి నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. తమని సభలో నుండి సస్పెండ్ చేసినందుకే వారు ధర్నా చేస్తున్నట్లు చెప్పుకొంటున్నప్పటికీ వారి ఉద్దేశ్యం మాత్రం దేశ ప్రజల సానుభూతిని పొందేందుకేనని చెప్పవచ్చును. పార్లమెంటు సమావేశాలను సజావుగా సాగానిస్తామని హామీ ఇస్తే వారిపై నిషేధం ఎత్తివేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు పదేపదే విజ్ఞప్తి చేసినా వారు తమ ధర్నాని అందుకే కొనసాగిస్తున్నారు.   కానీ వెంకయ్య నాయుడు ఆవిధంగా ప్రకటన చేయడం ద్వారా బీజేపీపై కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించినట్లయింది. పార్లమెంటును స్తంభింపజేసి మోడీ ప్రభుత్వానికి తన సత్తా చాటానని రాహుల్ గాంధీ భావిస్తుండవచ్చును. కానీ అతను ఈవిధంగా బలప్రదర్శన చేసేందుకు, ప్రజా సమస్యలపై పార్లమెంటులో చర్చ జరగకుండా అడ్డుకొన్నందుకు దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని తప్పు పడుతున్నారనే సంగతి గ్రహించడం లేదు. అదే విధంగా వారిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తామన్నా కూడా సభలోకి వెళ్ళకుండా బయట నిలబడి ఇటువంటి డ్రామాలు చేయడం వలన కూడా ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీ పట్ల మరింత వ్యతిరేకత పెరుగుతోందనే సంగతి కూడా వారు గుర్తించలేకపొతున్నారు.   ఈ డ్రామాలు సరిపోవన్నట్లుగా ఈరోజు యువజన కాంగ్రెస్ వర్కర్ల చేత అర్ధనగ్నంగా నిరసనలు తెలియజేయించడంతో ఇంతవరకు పడిన శ్రమ అంతా వృదా అయినట్లయింది. కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ నిర్ణయాన్ని నిరసిస్తూ గాంధీ విగ్రహం వద్ద నినాదాలు చేస్తూ ధర్నా చేస్తున్నప్పుడు వారిపై సానుభూతి చూపినవారు కూడా ఇప్పుడు యువజన కాంగ్రెస్ వర్కర్లు చేసిన అర్ధ నగ్న ప్రదర్శనని చూసి కాంగ్రెస్ పార్టీని తప్పుపడుతున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా నిరసనలు చేయవచ్చు కానీ ఇలాగ పార్లమెంటు ఆవరణలో ఇలాంటి వికృత చేష్టలు చేయడాన్ని అందరూ విమర్శిస్తున్నారు.   “ఇదేనా రాహుల్ గాంధీ తన పార్టీకి నేర్పిస్తున్న పద్దతి? ఇదేనా కాంగ్రెస్ సంస్కారం, సంస్కృతి?” అని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కాంగ్రెస్ పార్టీని కడిగిపారేశారు. కాంగ్రెస్ పార్టీ అనుకొన్నది ఒకటి జరిగినది మరొకటి. ఇదంతా నిశితంగా గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు “కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేస్తానని శపధాలు చేసిన రాహుల్ గాంధీ చివరికి తనే కాంగ్రెస్ పద్ధతులకు అలవాటు పడిపోయినట్లున్నారు”, అని అభిప్రాయపడుతున్నారు.