తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలి...మాటలలో కాదు!
దేశంలో వ్యాపారానికి అనువయిన రాష్ట్రాలలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ స్థానం, తెలంగాణాకు 13వ స్థానం ప్రపంచ బ్యాంక్ ఇవ్వడంపై మొదట చాలా ఆచితూచి మాట్లాడిన తెలంగాణా ఐటి మంత్రి కె. తారక రామారావు, నిన్న ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తన అక్కసునంత వెళ్ళగ్రక్కారు.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి, చంద్రబాబు నాయుడుకి నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని కేటీఆర్ అన్నారు. తమ ప్రభుత్వం అనేక సమస్యలను సవాళ్ళను అధిగమించి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమాంతరంగా నడిపిస్తోందని కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ‘బిల్డప్ ఎక్కువ పని తక్కువ’ అని ఎద్దేవా చేసారు. తెరాస ప్రభుత్వం అధికారం చేప్పట్టిన ఏడాదిన్నర కాలంలోనే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నుండి బయటపడేశామని అన్నారు. రైతుల ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు అనవసరమయిన రాద్దాంతం చేస్తూ శవ రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోకెల్లా అత్యంత నాణ్యమయిన పరిపాలన అందిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఒకవేళ కేటీఆర్ చెప్పిందే నిజమనుకొంటే ప్రపంచ బ్యాంక్ తెలంగాణాకే 2వ స్థానం, ఆంద్రప్రదేశ్ కి 13వ స్థానం ఇచ్చి ఉండేది. కానీ అన్ని విధాల అభివృద్ధి చెందిన హైదరాబాద్ రాజధానిగా కలిగి దేశంలో రెండవ ధనిక రాష్ట్రమయిన తెలంగాణా కంటే అసలు రాజధానే లేని, ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రమే వ్యాపారానికి చాలా అనువయినదని ప్రకటించింది. కేటీఆర్ బాషలోనే చెప్పాలంటే ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ర్యాంకింగ్ లో రెండు రాష్ట్రాలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా కనబడుతోంది.
చంద్రబాబు నాయుడు పరిపాలనకు అదే గీటురాయి వంటిది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక సమస్యలు, సవాళ్లు, రాజకీయ కుట్రలు, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. అయినా వాటన్నిటినీ ఒకటొకటిగా అధిగమిస్తూ చాలా దైర్యంగా, చాలా ఆత్మవిశ్వాసంతో ముందుకి సాగుతోంది. తెరాసకి వడ్డించిన విస్తరి వంటి ధనిక రాష్ట్రం దక్కినప్పటికీ మంత్రి కేటీఆర్ తమ ప్రభుత్వం అనేక సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో ముందుకు నడిపిస్తోందని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదం.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ పని తక్కువని కేటీఆర్ అన్న మాటలు నిజానికి తమ తెరాస ప్రభుత్వానికే అన్వయించుకోవాలి ఉంటుంది. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, దాని చుట్టూ ఆకాశ హర్మ్యాల నిర్మాణం, వినాయక్ సాగర్ నిర్మాణం, దాని పక్కన మరో పెద్ద ఆకాశ హర్మ్య నిర్మాణం, ఎడ్యుకేషన్ సిటీ, ఎంటర్టెయిన్మెంట్ సిటీ, స్పోర్ట్స్ సిటీల నిర్మాణం, సచివాలయ నిర్మాణం, ఉస్మానియా విశ్వద్యాలయంలో పేదలకు ఇళ్ళ నిర్మాణం, తెలంగాణా రాష్ట్రాలను డల్లాస్, కాలిఫోర్నియా, సింగపూర్ వంటి ప్రపంచ నగరాల స్థాయికి అభివృద్ధి చెందేలా తీర్చిద్దిడం వంటి అనేక రంగుల కలలను ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రజలకు చూపించారు. కానీ వాటిలో ఏ ఒక్క పనీ ఇంతవరకు మొదలుపెట్టలేదు కూడా. హడావుడిగా మొదలుపెట్టిన హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది.
ఈ ఏడాదిన్నర కాలంలో పొరుగు రాష్ట్రంతో, కేంద్రప్రభుత్వంతో నిత్యం తగువులు, నిత్యం దేనికో దానికి కోర్టులో మొట్టికాయలు వేయించుకోవడం, పదవులు ఎర వేసి ప్రతిపక్ష నేతలను తెరాసలోకి ఆకర్షించడం, లేకుంటే స్టింగ్ ఆపరేషన్లు, ఫోన్ ట్యాపింగులు చేయడం, చారిత్రక ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేత, ఎర్రగడ్డ ఆసుపత్రుల కూల్చివేత, తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా కల్లు, చీప్ లిక్కర్, బీర్ వెండింగ్ మిషన్ల ఏర్పాటు వంటి అనేక వివాదస్పద నిర్ణయాలతోనే పుణ్యకాలం గడిచిపోయింది.
రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలలో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొని ఉండేది. ఆ సమస్యను చంద్రబాబు నాయుడు కేవలం3నెలల్లోనే తీర్చగా, తెలంగాణా ప్రభుత్వానికి 15నెలలు పట్టిందని మంత్రి కేటీఆర్ స్వయంగా చెప్పుకొంటూ మళ్ళీ చంద్రబాబు నాయుడుని విమర్శించడం హాస్యాస్పదం.
తెరాస ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని కేటీఆర్ చాలా గొప్పగా చెప్పుకొన్నారు. కానీ దేశంలో ఆంద్రప్రదేశ్ తో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే పనిచేస్తుంటాయి. ఒకవేళ చేయకపోతే ప్రతిపక్షాలు ఎలాగూ నిలదీస్తాయి. దేశంలో కెల్లా చాలా నాణ్యమయిన పరిపాలన అందిస్తున్నామని చెప్పుకొన్న కేటీఆర్, ఏడాదిన్నర గడుస్తున్నా ఇంకా తెలంగాణా రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నందుకు సిగ్గుపడకపోగా, రైతుల ఆత్మహత్యల గురించి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, తీవ్రమయిన ఈ సమస్యని పరిష్కరించేందుకు వారి సలహాలు సూచనలు కూడా అడిగి ఉంటే బాగుండేది. కానీ ప్రతిపక్షాలు ఈ విషయంపై అనవసరంగా రాద్దాంతం చేస్తూ శవ రాజకీయాలు చేస్తున్నారని తిరిగి వారినే విమర్శించడం సిగ్గుచేటు. పైగా 60 ఏళ్ల గబ్బు 15నెలల్లో ఎలాగ వదిలించగలము? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రజలలో తెలంగాణా సెంటిమెంటు రెచ్చగొడుతూ, రైతుల ఆత్మహత్యల ప్రస్తావన వచ్చినప్పుడల్లా గత ప్రభుత్వాలను నిందిస్తూ ఇంకా ఎంతకాలం కాలక్షేపం చేస్తారో? చూడాలి. మిగిలిన మూడున్నరేళ్ళ సమయంలో తెదేపా, తెరాస ప్రభుత్వాలలో ఏది ఎంత అభివృద్ధి సాధించింది అనే విషయం ఎన్నికల సమయంలో ప్రజలే తేల్చి చెపుతారు. కనుక ఇటువంటి మాటలతో కాలక్షేపం చేయకుండా రాష్ట్రాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తే అందరికీ మంచిది.