మహారాష్ట్ర ప్రభుత్వానికి శివసేన మద్దతు ఉపసంహరణ

  మహారాష్ట్రలో బీజేపీ-శివసేనలు మిత్ర పక్షాలుగా ఉన్నాయి. శివసేన మద్దతుతో కొనసాగుతున్న దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో శివసేనకు చెందినవారు మంత్రులుగా ఉన్నారు. కానీ రెండు రోజుల క్రితం ముంబైలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంతో మొదలయిన వివాదం ఆ రెండు పార్టీల మధ్య విభేదానికి దారి తీసింది. దానితో ఫడ్నవీస్ ప్రభుత్వం నుంచి తన మంత్రులను వెనక్కి తీసుకొని, దానికి తమ మద్దతు ఉపసంహరించుకోవాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ టాక్రే సిద్దం అవుతున్నట్లు తాజా సమాచారం.   పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షిద్ మమ్మూద్ కసౌరి వ్రాసిన “నైదర్ ఏ హాక్ నార్ ఏ డోవ్” అనే పుస్తకాన్ని ముంబైలో ఆవిష్కరించాలనుకొనప్పుడు అందుకు శివసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకపక్క భారత్ పై దాడులు చేస్తూ మరోపక్క దేశం నడిబొడ్డున ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతించబోమని విస్పష్టంగా చెప్పింది. ఒకవేళ పుస్తకావిష్కరణకు ప్రయత్నిస్తే తప్పకుండా అడ్డుకొంటామని హెచ్చరించింది. కానీ ఆ కార్యక్రమానికి తమ ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భరోసా ఇవ్వడంతో రెండు రోజుల క్రితం ముంబైలో ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కానీ చెప్పినట్లుగానే శివసేన కార్యకర్తలు కొందరు పోలీస్ భద్రతావలయాన్ని దాటుకొనివచ్చి ఆ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న భారత మాజీ దౌత్యవేత్త సుధీంద్ర కులకర్ణి మొహం మీద నల్ల రంగు పోశారు. అయినప్పటికీ ఆయన వెనుకంజ వేయకుండా మొహానికి ఉన్న ఆ నల్లరంగు కడుగుకోకుండానే పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని పూర్తి చేసారు.   శివసేన చేసినపనికి దేశ వ్యాప్తంగా నిరసనలు, తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. ఈ వ్యవహారంపై శివసేన-రాష్ట్ర బీజేపీ నేతల మధ్య తీవ్ర వాదోపవాదాలు, విమర్శలు ప్రతివిమర్శలు జరిగాయి. తమ మద్దతుతో నడుస్తున్న ప్రభుత్వం తమ అభిప్రాయాలకు గౌరవం ఇవ్వకపోగా తిరిగి విమర్శిస్తున్నందుకు నిరసనగా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొనేందుకు శివసేన సిద్దం అవుతోంది. ముందుగా మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేస్తున్నవారి చేత రాజీనామాలు చేయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ టాక్రే తన పార్టీ ముఖ నేతలతో, మంత్రులతో ఈరోజు సమావేశమవుతారు. వారితో చర్చించిన తరువాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఒకవేళ శివసేన తన మద్దతు ఉపసంహరించుకొంటే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది.   బహుశః బీజేపీ అధిష్టానం శివసేనను బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టి ఉండవచ్చును. కానీ అందుకు శివసేన లొంగుతుందా లేదా? అనే సంగతిని పక్కనబెడితే ఈ వ్యవహారంలో అనేక కోణాలు కనబడుతున్నాయి. శివసేన చేసిన ఈ పొరపాటుకి బీజేపీ మూల్యం చెల్లించుకోవలసి వస్తోంది. ఒక్క మహారాష్ట్రలోనే కాకుండా బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కూడా మజ్లీస్ వంటి మతతత్వ పార్టీలకు ఇది ఒక గొప్ప ఆయుధంగా అందించినట్లయింది. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, జనతా పరివార్ వంటి కుహానా లౌకికవాద పార్టీలు కూడా దీనిని ఆయుధంగా వాడుకొని బీజేపీపై ప్రయోగించవచ్చును. ఈ వ్యవహారంలో శివసేనదే తప్పయినా అది బీజేపీ ప్రభుత్వాన్ని బలితీసుకోవాలనుకొని బయటపడాలనుకోవడం చాలా దురదృష్టకరం.   భారత్ పై దాడులు చేసేందుకు ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల వద్ద నిత్యం కాల్పులు జరుపుతూ భారత జవాన్లను పొట్టన పెట్టుకొంటున్న పాకిస్తాన్ ఈవిధంగా కూడా భారతదేశంలో ప్రభుత్వాలను అస్థిరపరచగలదని నిరూపితం అవుతోంది. కానీ అందుకు పాకిస్తాన్ని నిందించడం కంటే మనల్ని మనమే నిందించుకోవాలి. ఎందుకంటే ఇటువంటి చిన్న విషయానికి కూడా కూలిపోయేంత బలహీనంగా మన ప్రభుత్వాలు ఉన్నందుకు. బహుశః ఇది పాకిస్తాన్ ఉద్దేశ్యపూర్వకంగా చేసిన ప్రయత్నం కానప్పటికీ, ఇప్పుడు మన ఈ బలహీనతని పాకిస్తాన్ కూడా బాగా గుర్తించేలా చేయగలిగాము కనుక భవిష్యత్ లో అది ఇటువంటి ప్రయత్నాలు తప్పకుండా చేయవచ్చును.   ఇప్పటికే భారత్ కాశ్మీరులో మనవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందంటూ అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ పనిగట్టుకొని ప్రచారం చేస్తోంది. ఇప్పుడు ఈ సంఘటనను కూడా అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ప్రస్తావించక మానదు. భారత్ ఆత్మాభిమానం కోసమే ఈ పని చేసామని శివసేన వాదిస్తోంది. కానీ అది చేసిన ఈ దుందుడుకు పని వలన యావత్ ప్రపంచ దేశాల ముందు భారత్ తలవంచుకొనే పరిస్థితి ఏర్పడింది.

నితీష్ వ్యూహం బెడిసి కొట్టిందా?

  బీహార్ అసెంబ్లీకి మొదటి దశ ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో పోటీ ప్రధానంగా ఎన్డీయే, జనతా పరివార్ కూటముల మధ్యే ఉండబోతోందని ఇప్పటికే స్పష్టమయింది కనుక ఆ రెండు కూటములు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేవలం బీజీపీని ఎదుర్కొనేందుకే లాలూ ప్రసాద్ అవినీతి చరిత్ర, ప్రజలలో ఆయనకున్న చెడ్డపేరు గురించి తెలిసీ కూడా ఆయనతో చేతులు కలిపారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే లాలూతో చేతులు కలిపినందుకే ఆయన తీవ్రంగా నష్టపోయేలాగ ఉన్నారు. మరో విధంగా చెప్పాలంటే వారిద్దరూ బీజేపీని ఓడించేందుకే చేతులు కలిపితే, ఇప్పుడు బీజేపీకి అదే ఊహించని వరంగా మారింది. కనుక ఎన్నికలు ముగిసేలోగా వారు విడిపోకూడదని బీజేపీ ఆ దేవుడిని ప్రార్ధించడం మంచిది.   ఒకవేళ నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్ తో చేతులు కలపకుండా ఉండి ఉంటే, బీహార్ లో ఆయనని ఎదుర్కోవడానికి బీజేపీ చాలా కష్టపడవలసి వచ్చేది. కానీ నితీష్ కుమార్ లాలూతో చేతులు కలిపి బీజేపీ పని సులువు చేసిపెట్టారని చెప్పక తప్పదు. నితీష్ కుమార్ కి బీహార్ ప్రజలలో ఎంత మంచిపేరున్నపటికీ, ప్రజలు వద్దనుకొంటున్న లాలూని తన ప్రభుత్వంలో భాగస్వామిగా చేసుకోవాలని నిర్ణయించుకొన్నందున, తప్పనిసరిగా ప్రజలు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారని భావించవచ్చును.   లాలూ ప్రసాద్ యాదవ్ నేరుగా నితీష్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం లేనప్పటికీ, ఇదివరకు అయన జైలుకి వెళ్ళవలసి వచ్చినపుడు తన భార్య రబ్రీదేవిని తన ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టి జైల్లో నుంచే బీహార్ రాష్ట్రాన్ని ఏవిధంగా పరిపాలించారో ఇప్పుడు కూడా తన ఎమ్మెల్యేల ద్వారా నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేయడం తధ్యం. ప్రధాని నరేంద్ర మోడీ మోడీ తన ఎన్నికల ప్రచార సభలలో ఇదే పాయింటుని బాగా హైలైట్ చేసి చూపిస్తూ పరిస్థితులని బీజేపీకి అనుకూలంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతవరకు వెలువడిన సర్వే రిపోర్టులు చూసినట్లయితే ఆయన ప్రయత్నం ఫలించినట్లే కనబడుతోంది.   బీహార్ లో ఎన్నికల ప్రచారం మొదలయినప్పటి నుండి లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతున్న మాటలు, వరుసగా చేస్తున్న తప్పుల కారణంగా ఆయన ‘పాపులారిటీ గ్రాఫ్’ చాలా వేగంగా పడిపోతోంది. లాలూ పార్టీ అభ్యర్ధుల మీద ఆ ప్రభావం ఎలాగు ఉంటుంది. కానీ ఆ దుష్ప్రభావం నితీష్ కుమార్ మీద కూడా పడుతోంది. మరి ఈ సమస్యను నితీష్ కుమార్ అధిగమిస్తారో వేచి చూడాల్సిందే. ఈ ఎన్నికలలో వామపక్ష కూటమి, ములాయం సింగ్ కి చెందిన సమాజ్ వాదీ పార్టీ, బీ.యస్.పీ., ఎం.ఐ.ఎం. తదితర అనేక పార్టీలు స్వతంత్ర అభ్యర్ధులు కూడా బరిలో ఉన్నారు కనుక వారందరి మధ్య ఓట్లు చీలిపోయే అవకాశం కూడా ఉంది. అదే కనుక జరిగితే బీజేపీ నష్టపోవచ్చును. కానీ ఈసారి ఎన్నికలలో బీహార్ ప్రజలపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.   బీజేపీకి అధికారం కట్టబెడితే బీహార్ లో సుస్థిరమయిన ప్రభుత్వ ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేస్తామని నరేంద్ర మోడి చెపుతున్న మాటలు రాష్ట్ర ప్రజలను బాగా ఆకట్టుకొంటున్నాయి. కనుకనే నేటికీ ప్రజలు నితీష్ కుమార్ నే ఇష్టపడుతునప్పటికీ, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని భావించవలసి ఉంటుంది. నవంబర్ 8వ తేదీన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. కానీ ఈ ఎన్నికలు ఐదు దశలలో సాగుతున్నందున ఈలోగానే బీహార్ లో ఏ కూటమి అధికారంలోకి రాబోతుందనే దానిపై స్పష్టత ఏర్పడవచ్చును.

జగన్ పోరాటం చంద్రబాబుపైనా లేక ప్రత్యేక హోదా కోసమా?

  జగన్మోహన్ రెడ్డి తను ప్రత్యేక హోదా కోసమే నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నానని చెపుతున్నారు. కానీ ఇంతకు ముందు నటుడు శివాజీ ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేసినప్పుడు అన్ని రాజకీయ పార్టీలని తన పోరాటానికి మద్దతు ఇమ్మని వేడుకొన్నారు. కానీ అప్పుడు జగన్ కనీసం స్పందించలేదు. కానీ ఇప్పుడు తెదేపాతో సహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్ధి సంఘాలు అందరూ తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. జగన్ నిజంగానే ప్రత్యేక హోదా కోరుకొంటున్నట్లయితే ఆనాడు శివాజీకి ఎందుకు మద్దతు ఈయలేదు? అప్పుడు మౌనంగా ఊరుకొని ఇప్పుడు ఎందుకు పోరాటాలు చేస్తున్నారు? అని ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు.   ఆ ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పకపోయినా తను ఇప్పుడు ప్రత్యేక హోదా కోసమే పోరాడుతున్నాని నొక్కి చెపుతున్నారు. కానీ ఆయనతో సహా ఆ వేదిక మీద నుండి మాట్లాడుతున్న వైకాపా నేతలందరూ చంద్రబాబు నాయుడునే లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ప్రత్యేక హోదా మంజూరు చేయవలసిన అసలు వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు? ఇవ్వకపోతే తెదేపాను బంగాళాఖాతంలో కలిపేస్తామని బెదిరిస్తున్నట్లే బీజేపీని కూడా కలిపేస్తామని ఎందుకు హెచ్చరించడం లేదు? కనీసం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని దైర్యంగా ప్రశ్నించడం లేదు. అంటే వైకాపా చేస్తున్న ఈ పోరాటం అంతా చంద్రబాబు నాయుడు మీదే తప్ప నరేంద్ర మోడి మీదో లేక ప్రత్యేక హోదా కోసమో కాదనే అభిప్రాయం వైకాపా నేతలే కలిగిస్తున్నారు.   చంద్రబాబు నాయుడు తన ఇద్దరు కేంద్రమంత్రుల చేత రాజీనామాలు చేయిస్తే ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందని బోడి గుండికి మోకాలుకి ముడి వేసినట్లు వాదిస్తున్నారు. కానీ మోడీ ప్రభుత్వం ఎవరి మద్దతుపై ఆధారపడిలేదనే సంగతి వారికీ తెలుసు. కేవలం తెదేపాతో ఉన్న మిత్రత్వం కారణంగానే ఆ పార్టీకి చెందిన ఇద్దరికి మోడీ మంత్రి పదవులు ఇచ్చారు తప్ప తన ప్రభుత్వానికి తెదేపా ఎంపీల మద్దతు అవసరమయి కాదు. అటువంటప్పుడు వారిద్దరూ రాజీనామా చేస్తే ఏమవుతుంది? మోడీ ప్రభుత్వం పడిపోదు కానీ తెదేపా-బీజేపీల మధ్య స్నేహ బందం చెడిపోతుంది. బహుశః వైకాపా అదే కోరుకొంటోంది కనుకనే పదేపదే ఇద్దరు కేంద్రమంత్రుల రాజీనామాకు పట్టుబడుతోంది. అప్పుడు బీజేపీ అంగీకరిస్తే దానితో పొత్తులు పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన కావచ్చును.   కానీ ‘అవినీతి పరుడయిన జగన్మోహన్ రెడ్డితో తమ పార్టీ ఎన్నటికీ పొత్తులు పెట్టుకొబోదని’ డా. కామినేని శ్రీనివాస రావు నిన్ననే విస్పష్టంగా చెప్పారు. ఇంతకు ముందు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా అదే ముక్క చెప్పారు. అయినా జగన్ ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నానని చెపుతున్న జగన్ ఇటువంటి రాజకీయాలు చేస్తున్నందునే ఆయన చేస్తున్న పోరాటాన్ని ప్రజలు విశ్వసించడం లేదని చెప్పవచ్చును.   జగన్మోహన్ రెడ్డి నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడుతున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకొని నేరుగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించే ప్రయత్నం చేస్తే అందరూ ఆయనకి సహకరిస్తారు. కానీ ప్రత్యేక హోదా సాధించడం కోసం కాకుండా చంద్రబాబు నాయుడు సాధించడం కోసమే పోరాటాలు చేస్తే దానిని వైకాపా-తెదేపాల మధ్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్య పోరుగానే ప్రజలు చూస్తారు. ప్రజల, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా ఆధిపత్యపోరుకి పూనుకొంటే ఎన్నటికీ ప్రజల మద్దతు పొందలేరని జగన్ గ్రహిస్తే మంచిది.

తెలంగాణా బంద్ కి వైకాపా మద్దతు..ఒక్క దెబ్బకి రెండు పిట్టలు

  రైతుల ఆత్మహత్యలపై తెరాస ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఇవ్వాళ్ళ రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చాయి. అందులో పెద్దగా ఆశ్చర్యపోవలసినదేమీ లేదు. కానీ ఆ ప్రతిపక్షాలలో తెరాసకు రహస్య మిత్రుడు వైకాపా కూడా ఉండటమే ఆశ్చర్యకరమయిన విషయం. తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలన్నీ రైతుల ఆత్మహత్యలపై తెరాస ప్రభుత్వంతో చాలా కాలంగా పోరాడుతున్నాయి. కానీ వైకాపా ఇంతవరకు ఒక్కసారి కూడా రైతుల ఆత్మహత్యల గురించి బహిరంగంగా మాట్లాడలేదు.   ఎప్పుడో ఆరేళ్ళ క్రితం రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు, అ బాధ తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పనిగట్టుకొని ఓదార్చుతున్న షర్మిల అదే నియోజక వర్గంలో ఆత్మహత్యలు చేసుకొన్న రైతన్నల కుటుంబాలను మాత్రం పరామర్శించడం లేదు. తెరాసకు ఇబ్బంది, ఆగ్రహం కలిగించకూడదనే ఉద్దేశ్యంతోనే ఆమె వారిని పరామర్శించడం లేదని భావించక తప్పదు. అందుకే తెలంగాణాలో ప్రతిపక్షాలన్నీ ఈ సమస్యపై పోరాడుతున్నప్పటికీ వైకాపా నేతలు మౌనంగా చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోవలసి వచ్చింది. కానీ రేపు జరుగబోయే రాష్ట్ర బంద్ కి తమ పార్టీ కూడా మద్దతు ఇస్తుందని తెలంగాణా రాష్ట్ర వైకాపా అధ్యక్షుడు పి. శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. తమ పార్టీ కూడా రైతుల తరపున పోరాడుతుందని ఆయన తెలిపారు. రేపటి బంద్ ని విజయవంతం చేయడానికి రాష్ట్రంలో వైకాపా కార్యకర్తలు అందరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.   కానీ తెరాసకు రహస్య మిత్రపక్షంగా కొనసాగుతున్న వైకాపా కూడా రేపటి బంద్ లో పాల్గొంటే తెరాసకు ఆగ్రహం కలగదా? అంటే కలగదనే చెప్పవచ్చును. ఎందుకంటే రేపు ఎలాగూ ప్రతిపక్ష పార్టీలన్నీ రాష్ట్ర బంద్ చేస్తున్నాయి, కనుక దానికి వైకాపా మద్దతు ఇచ్చినంత మాత్రాన్న తెరాస ప్రభుత్వానికి కొత్తగా వచ్చే నష్టం లేదు. అది నలుగురితో నారాయణ అయిపోతుంది. బహుశః ఇటువంటి ఆలోచనలను చూసే “గాలికి పోయే పేలాలు కృష్ణార్పణం!” అనే మాట పుట్టుకొచ్చి ఉండాలి. వైకాపా నేతలు రైతుల సమస్యలపై ఎప్పుడూ నోరు విప్పకపోయినా ఈ బంద్ లో పాల్గొంటే రైతుల సమస్యలపై పోరాడుతున్నట్లు గొప్పగా చెప్పుకోవచ్చును.   ఈ బంద్ లో పాల్గొనడం ద్వారా వైకాపాకు మరో ప్రయోజనం కూడా ఉంటుంది. రాష్ట్రంలో మిగిలిన ప్రతిపక్ష పార్టీలలాగే తమ పార్టీ కూడా తెరాసను ప్రత్యర్ధిగా భావిస్తున్నట్లు చాటి చెప్పుకొన్నట్లవుతుంది. అయినా ఇప్పుడు కూడా దూరంగా ఉండిపోతే అందుకు కూడా తెదేపా నుండి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే నలుగురితో నారాయణ అంటోంది వైకాపా.

రైతన్నల ఆత్మహత్యలపై స్పందించే తీరు ఇదా

  తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలు రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వానికి తన బాధ్యత గుర్తు చేస్తుంటే, అవి ముఖ్యమంత్రి కేసీఆర్ కి అనవసర రాద్దాంతంగా కనిపించడం విస్మయం కలిగిస్తుంది. సమస్య తీవ్రతను గుర్తించి తక్షణమే దాని నివారణ చర్యలు చేపట్టవలసిన ప్రభుత్వం, ప్రతిపక్షాలు చేస్తున్న ఆ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పి కొట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ నేతలమి, మంత్రులని కోరడం మరీ ఆశ్చర్యం కలిగిస్తుంది.   రైతుల ఆత్మహత్యల గురించి ప్రతిపక్షాలు ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుందనో మాట్లాడటం మానేసినా అవి దాచిపెడితే దాగేవి కావు. అదే విధంగా సున్నితమయిన ఆ సమస్యపై ప్రతిపక్షాలు శవ రాజకీయాలు చేస్తున్నాయనే వాదన చాలా తప్పు. రాష్ట్రంలో నిత్యం రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతుంటే ప్రభుత్వమూ పట్టించుకోక ప్రతిపక్షాలు పట్టించుకోకపోతే మరెవరు వారిని పట్టించుకొంటారు? ఈ సమస్యను రాజకీయ కోణంలో నుండి చూడటం మానుకొని మానవీయ కోణంలో చూడవలసిన అవసరం ఉంది.   ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం ఏదో ఒక భారీ వ్యయం అయ్యే ప్రాజెక్టులను ప్రకటిస్తూనే ఉన్నారు. హుస్సేన్ సాగర్ పక్కన 150 అంతస్తుల భవనం నిర్మించకపోయినా ఎవరూ వేలెత్తి చూపరు. కానీ నిత్యం రైతులు ఆత్మహత్యలు చేసుకొంటే తప్పకుండా అందరూ వేలెత్తి చూపుతారు. నిలదీసి అడుగుతారు. దానిని అనవసర రాద్దాంతం అనుకొంటే అందుకు ఏదో ఒకనాడు రైతులకు జవాబు చెప్పుకోక తప్పదు. తెలంగాణా సిగ్నేచర్ టవర్స్ నిర్మాణానికి వందల కోట్లు వెచ్చించడానికి సిద్దపడుతున్నపుడు, రైతులకు హామీ ఇచ్చిన విధంగా ఒకేసారి రుణమాఫీ చేయకపోతే ప్రతిపక్షాలే కాదు ప్రజలు కూడా నిలదీయవచ్చును.   అయినా తెలంగాణా ధనిక రాష్ట్రమని, ఆర్ధికంగా దేశంలో ఏ-1 గ్రేడ్ గల రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గర్వంగా చెప్పుకొంటునప్పుడు రైతులను ఎందుకు ఆదుకోవడం లేదు? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దానికి నేరుగా సమాధానం చెపితే సరిపోయేది. ఈ సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి వివరించి ఇంకా ఏమేమీ చేయవచ్చో ప్రతిపక్షాలను సలహా అడిగి ఉండి ఉంటే సమస్య పరిష్కారం అయ్యి ఉండేది. అందరూ హర్షించేవారు. కానీ ఈ సమస్య గురించి మాట్లాడినందుకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసి, బయట కూడా వారిని దీటుగా ఎదుర్కోమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా సూచించడం గర్హనీయం.   సమస్య ఎదురయితే దానిని పరిష్కరించేందుకు అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలి. కానీ ఏడాదిన్నర పాలన చేసిన తరువాత కూడా ఇంకా ఈ పాపం గత ప్రభుత్వాలదేనని తప్పించుకోవాలని చూడటం సరికాదు. తెరాస ప్రస్తుతం అధికారంలో ఉంది కనుక ఇప్పుడు అది ఏవిధంగా వాదించినా చెల్లుతుంది. కానీ తీవ్రమయిన ఈ సమస్యను ఇలాగే విస్మరిస్తే మిగిలిన మూడున్నరేళ్ళలో ఇంకా అనేక అమంది రైతన్నలు ప్రాణాలు తీసుకొనే ప్రమాదం ఉంది. అప్పుడు ఈ ఐదేళ్ళకి తెరాసయే లెక్క చెప్పుకోవలసివస్తుంది. రైతన్నల ఉసురు ఎవరికీ మంచిది కాదు. కనుక ప్రతిపక్షాలను గట్టిగా ఎదుర్కొనే ఆలోచన చేయడం కంటే వాళ్ళతో కలిసి ఈ సమస్యను ఏవిధంగా నివారించవచ్చో ఆలోచిస్తే బాగుంటుంది.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మజ్లీస్ మార్క్ రాజకీయాలు షురూ

  మరొక ఐదు రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. కనుక రాజకీయ పార్టీల మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకొంది. కనుక అన్ని పార్టీలు ప్రజల భావోద్వేగాలతో తెగ ఆడేసుకొంటున్నాయి. ఇంతవరకు హైదరాబాద్ పాత బస్తీకే పరిమితమయిన మజ్లీస్ పార్టీ మొట్ట మొదటిసారిగా బీహార్ లో అడుగు పెడుతోంది. సహజంగానే అది ముస్లిం ప్రజలందరినీ తనవైపు తిప్పుకొనేందుకు ఏమేమీ చేయవచ్చునో అవన్నీ చేస్తోంది. కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లో దాద్రి అనే ప్రాంతంలో ఆవుదూడను చంపి దాని మాంసం తిన్నాడనే అనుమానంతో మొహమ్మద్ ఇఖ్ లఖ్ అనే వ్యక్తిని కొంతమంది కొట్టి చంపారు. అటువంటి సంఘటనలు జరగడం చాలా విచారకరం. ఆ నేరానికి పాల్పడిన వారిని కటినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, పోలీసులదే. చట్టపరంగా చేపట్టవలసిన చర్యల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. కానీ బీహార్ లో అన్ని పార్టీలు దానిని ఒక రాజకీయ అస్త్రంగా మలుచుకొని ఎన్నికలలో లబ్ది పొందేందుకు తెగ ప్రయాసపడుతున్నాయి. బీహార్ లో మొదటిసారి అడుగుపెడుతున్న మజ్లీస్ పార్టీకి అది ఊహించని ఒక గొప్ప ఆయుధంగా అందివచ్చింది.   ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ బీహార్ ఎన్నికలలో పోటీ చేస్తోంది. దానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ అధినేత. ఇంతవరకు ముస్లిం ప్రజలకు తానే శ్రేయోభిలాషి అన్నట్లుగా వ్యవహరిస్తూ తనను తాను ములాయం ఖాన్ అని గొప్పగా చెప్పుకొంటూ ముస్లింల ఓట్లను కొల్లగొడుతున్నారు. కనుక ఆయననే మజ్లీస్ తన ప్రధాన ప్రత్యర్ధిగా భావించడం సహజం. కనుక అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సమాజ్ వాదీ పార్టీపై ఓవైసీ సోదరులు విమర్శలు గుప్పిస్తున్నారు.   మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ “ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ ప్రభుత్వం ముస్లిం ప్రజలకు రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఉంది. పైగా ఆ పార్టీకే చెందిన ఆజం ఖాన్ అనే మంత్రి ఈ సంఘటనపై ఐక్యరాజ్యసమితికి పిర్యాదు చేస్తానని గొప్పగా చెప్పుకోవడం మరీ సిగ్గుచేటు. అంటే ఆయనకి తమ ప్రభుత్వంపైన, కేంద్రప్రభుత్వం మీద నమ్మకం లేదని అర్ధం అవుతోంది. ఈ సమస్య మన దేశ అంతర్గత సమస్య. దేశంలో ముస్లింల పోరాటం రాజకీయ పార్టీలతో, ప్రభుత్వాలతోనే కానీ దేశంతో కాదు. ఈ సమస్య గురించి ఐక్యరాజ్యసమితికి పిర్యాదు చేస్తానని అజాం ఖాన్ చెపుతుంటే ఆ పార్టీకి చెందిన నేతలెవరూ ఖండించడం లేదు. ఆయన మాటలను ములాయం సింగ్ సమర్దిస్తారో లేదో చెపితే బాగుంటుంది. ఒకవేళ మంత్రి మాటలను ఆయన సమర్దిస్తున్నట్లయితే తక్షణమే అధికారంలో నుండి దిగిపోయి, తమ ప్రభుత్వాన్ని రద్దు చేయమని ఆయనే కేంద్రాన్ని కోరాలి. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయింది. అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రజలకు రక్షణ కల్పించలేనప్పుడు తక్షణమే అధికారంలో నుండి దిగిపోవడం మంచిది. కేంద్రప్రభుత్వం అక్కడి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలి."   "బీహార్ లో ముస్లింల పరిస్థితి కూడా ఏమీ గొప్పగా లేదు. ముఖ్యంగా సీమాంచల్ ప్రాంతంలో పూర్ణియా చాలా వెనుకబడి ఉంది. కానీ అక్కడి ప్రజలకు త్రాగునీరు, విద్యా, వైద్యం, విద్యుత్ వంటి సదుపాయాలు కల్పించడం గురించి మాట్లాడకుండా రాజకీయ పార్టీలన్నీ గోవధపై నిషేధం విదించాలా వద్దా? అని చర్చిస్తున్నాయి. ఆశా భోస్లే కుమారుడు చనిపోగానే ట్వీటర్లో సానుభూతి తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ, మొహమ్మద్ ఇఖ్ లఖ్ కుటుంబానికి సానుభూతి చెప్పడానికి వెనకాడుతున్నారు. ప్రపంచంలో అన్ని సమస్యల గురించి అనర్ఘళంగా మాట్లాడే నరేంద్ర మోడి దాద్రీ సంఘటనపై మాత్రం నోరు విప్పి మాట్లాడటం లేదు,” అని అన్నారు.   ఒక మంత్రి అవివేకంతో ప్రజలను ఆకట్టుకోవడానికి ఏదో నోటికి వచ్చినట్లు మాట్లాడితే బోడి గుండుకీ మోకాలుకీ ముడేస్తునట్లు ఆ మాటలను పట్టుకొని బీహార్ ఎన్నికలలో లబ్ది పొందాలని అసదుద్దీన్ ప్రయత్నిస్తున్నారు. తమకేదో గొప్ప దేశభక్తి ఉన్నట్లు మాట్లాడుతున్న ఓవైసీ సోదరులు బీహార్ లో అడుగు పెట్టగానే అక్కడి ముస్లిం ప్రజలను ఆకట్టుకోవడానికి మత విద్వేషాలు రెచ్చగొట్టె విధంగా ప్రసంగాలు చేసారు. అందుకు అక్బరుద్దీన్ ఓవైసీపై పోలీసులు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసారు.   పూర్ణియాలో ముస్లిం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి మాట్లాడకుండా రాజకీయ పార్టీలు ప్రజలను ఆకట్టుకొని వారి ఓట్లు పొందేందుకు గోవధ నిషేధం గురించి మాట్లాడుతున్నాయని ఒవైసీ సోదరులు విమర్శిస్తున్నారు. కానీ వారు కూడా భిన్నంగా వ్యవహరిస్తున్నారా? అంటే లేదనే స్పష్టం అవుతోంది. ఆటువంటప్పుడు ఇతరులను నిందించడం దేనికి? బీహార్ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ ప్రస్తావన ఎందుకు చేస్తున్నారు? హైదరాబాద్ లో కూర్చొని బీహార్, ఉత్తరప్రదేశ్ లో ముస్లిం ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నవారు రేపు ఎన్నికలలో గెలిస్తే మాత్రం అక్కడి ముస్లిం ప్రజలకు మేలు చేస్తారని నమ్మకం ఏమిటి? అని బీహార్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉంది.

బీహార్ ఎన్నికలలో బీజేపీకే విజయావకాశాలు?

  బీహార్ అసెంబ్లీకి ఈ నెల 12 నుండి ఐదు దశలలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికలలో ప్రజలపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభావం చాలా అధికంగా ఉంటుందని ముందే పసిగట్టిన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ మోడీని ఎదుర్కొనేందుకే జనతా పరివార్ ఏర్పాటు చేసుకొన్నారు. ఆ రెండు కూటములే కాక బీహార్ శాసనసభ ఎన్నికల బరిలో వామపక్ష కూటమి, ములాయం సింగ్ నేతృత్వంలో సమాజ్ వాదీ పార్టీ, బీహార్ లో కొత్తగా అడుగుపెట్టిన మజ్లీస్ పార్టీ, అనేక చిన్నాచితకా పార్టీలు, వందల మంది స్వతంత్ర అభ్యర్ధులు బరిలో ఉన్నారు.   వారిలో ములాయం సింగ్ జనతా పరివార్ నుండి ప్రస్తుతానికి వేరుపడినప్పటికీ ఎన్నికల తరువాత అవసరమయితే మళ్ళీ జనతా పరివార్ తో జతకట్టడానికి వెనుకాడరు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ములాయం సింగ్ ని దువ్వి తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కనుక ఎన్నికల తరువాత ఎవరికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటే వారికే ఆయన మద్దతు తెలుపవచ్చును. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే మజ్లీస్ పార్టీ, వామపక్షాలు కూడా జనతా పరివార్ కే మద్దతు తెలుపవచ్చును. కాంగ్రెస్ పార్టీ ఎలాగూ జనతా పరివార్ తోనే కలిసి సాగుతోంది కనుక దాని మద్దతు కూడా జనతా పరివార్ కే ఉంటుంది. కనుక ఈ ఎన్నికలలో ఎన్డీయే (బీజేపీ) కూటమి ఒకటీ ఒక్కవైపు, పొత్తులు పెట్టుకోకపోయినా మిగిలిన పార్టీలన్నీ మరొకవైపు ఉన్నట్లు స్పష్టమవుతోంది.   కానీ ఈ ఎన్నికలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మధ్యే ప్రధానంగా జరుగుతున్నట్లు చెప్పుకోవచ్చును. ఎందుకంటే ఎన్డీయే, జనతా పరివార్ కూటములు రెండూ కూడా వారి పరిపాలన, సమర్ధత, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించే గట్టిగా ప్రచారం చేసుకొంటూ ప్రజలను ఓట్లు అడుగుతున్నాయి. బరిలో ఉన్న మిగిలిన పార్టీలన్నీ కూడా మోడీ, నితీష్ లనే లక్ష్యంగా చేసుకొని యుద్ధం చేస్తుండటంతో. ఈ ఎన్నికలలో వారిద్దరే ప్రధాన ఆకర్షణగా నిలిచినట్లు అర్ధమవుతోంది.   వారిరువురి ప్రభావంతో బాటు డబ్బు, మద్యం, కులమతాలు వంటి అనేక అంశాలు ఈ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయవచ్చును. ఈ మధ్య కాలంలో బీహార్ లో రెండు సర్వేలు నిర్వహించబడ్డాయి. ఒకటి జీ న్యూస్ నిర్వహించగా మరొకటి చంద్రగుప్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్, పాట్నా నిర్వహించింది.   జీ న్యూస్ సర్వేలో ఎన్డీయే కూటమి 147 సీట్లు, జనతా పరివార్ కూటమికి 64, ఇతరులు 32 సీట్లు దక్కవచ్చని అంచనా వేసింది. మొత్తం 243 మంది సభ్యులుండే బీహార్ శాసనసభలో ప్రభుత్వ ఏర్పాటుకి కనీసం 117 మంది సభ్యుల మద్దతు ఉండాలి. కానీ ఎన్డీయే కూటమికి 147 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు సర్వే చెపుతోంది. ఆ సర్వేలో పేర్కొన్న విధంగా ఎన్డీయే కూటమి 147 సీట్లు గెలుచుకోలేకపోయినా, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమయిన 117 సీట్లను తప్పనిసరిగా గెలుచుకోవలసి ఉంటుంది. లేకుంటే మిగిలిన పార్టీలన్నీ జనతా పరివార్ కి మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొంటాయి.   ఇక రెండో సర్వే ప్రకారం బీహార్ ప్రజలలో 80 శాతం మంది రాజకీయ పార్టీల నుండి డబ్బు తీసుకొని ఓట్లు వేయడం తప్పుకాదనే అభిప్రాయం వ్యక్తం చేసారు. అంటే ఈ ఎన్నికలలో డబ్బు ఎంత కీలకమయినదో ముందే స్పష్టం అవుతోంది. ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్న అన్ని రాజకీయ పార్టీల వద్ద, నేతల వద్ద అది చాలా పుష్కలంగా ఉంది కనుక డబ్బు పంచడం వారికి పెద్ద సమస్య కాబోదు. కానీ డబ్బు పంచినా రాష్ట్రాభివృద్ధి, సుస్థిర పరిపాలన వంటి కొన్ని అంశాలకు కూడా చాలా ప్రాధాన్యం ఉంటుంది కనుక చుట్టూ తిరిగి మళ్ళీ మోడీ, నితీష్ కుమార్ వద్దకే వస్తాయి. వారిద్దరిలో ప్రజలు ఎవరికీ ఓటేయాలనుకొంటే వారి కూటమి అధికారంలోకి వస్తుంది. నవంబర్ 8వ తేదీన బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. అంతవరకు అందరూ వేచి చూడవలసిందే.

ప్రజాస్వామ్యంలో నిరంకుశ విధానాలు అమలు సాధ్యమేనా?

  తెలంగాణా అసెంబ్లీ నుండి ప్రతిపక్ష సభ్యులు అందరినీ ప్రస్తుత సమావేశాలు పూర్తయ్యేంత వరకు తెరాస ప్రభుత్వం బహిష్కరించి అందరి నుండి విమర్శలు ఎదుర్కొంటోంది. రైతుల ఆత్మహత్యలతో సహా రాష్ట్రంలో అన్ని సమస్యలపై సావధానంగా చర్చించేందుకు ప్రతిపక్షాలు ఎన్ని రోజులు కోరితే అన్ని రోజులు శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని గొప్పగా చెప్పుకొన్న ముఖ్యమంత్రి కేసీఆర్, సమావేశాలు మొదలయినాలుగు రోజులు గడవక ముందే మొత్తం ప్రతిపక్ష సభ్యులు అందరినీ సభ నుండి సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నారు. మధ్యలో శనివారం నాడు ఏ కారణం లేకుండానే సభను సోమవారానికి వాయిదా వేసి పదిరోజుల సమావేశాలలో మరొకరోజు కట్టిరించేసారు.   రైతుల సమస్యలపై మాట్లాడేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని కేసీఆర్ చెప్పుకొన్నారు. కానీ చర్చ మొదలయిన మూడవ రోజునే దానిని ముగించారు. ప్రతిపక్షాలు దానిపై చర్చకు పట్టుబట్టడంతో అందరినీ బయటకు పంపించేసారు. రాష్ట్రంలో 32 అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు లేకుండానే సమావేశాలు నడిపించేస్తున్నారు. ఇక సభలో తమను ప్రశ్నించేవారే లేరు కనుక స్వోత్కర్ష, పరనిందలతో కులాసాగా మిగిలిన రోజులు గడిపేయవచ్చును.   కానీ కేసీఆర్ యొక్క ఈ నిరంకుశ పోకడలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారనే సంగతి మరిచిపోయినట్లున్నారు. అధికారం చేపట్టినప్పటి నుండి నేటి వరకు ఆయన నిరంకుశంగానే వ్యవహరిస్తున్నారు. మొదట మీడియాపై తన ప్రతాపం చూపిన కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షాలపై తన ప్రతాపం చూపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈవిధంగా నిరంకుశ విధానాలు అమలుచేయడం ఎంత గొప్పవారికయినా సాధ్యం కాలేదనే సంగతి చరిత్ర తిరగేస్తే అర్ధమవుతుంది.   రాష్ట్రంలో నానాటికి పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలను నివారించడంలో విఫలమయిన తెరాస ప్రభుత్వం, కనీసం ఆ సమస్య పరిష్కారానికి ప్రతిపక్షాలు ఇస్తున్న సలహాలు, సూచనలను వినేందుకు కూడా ఇష్టపడకుండా అందరినీ సభ నుండి బయటకు సాగనంపింది. ఆ విధంగాచేసి మరింత అప్రదిష్ట మూటగట్టుకొంది. రైతుల ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలదే బాధ్యత అని మళ్ళీ మళ్ళీ అదే పాట పాడుతుండటంతో రైతులు కూడా తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను, సీనియర్ నేతలకు పదవులు ఎరవేసి ఆకర్షిండం ద్వారా ఏ ప్రతిపక్ష పార్టీలను కేసీఆర్ బలహీనపరచాలనుకొన్నారో ఇప్పుడు వారి మధ్య చక్కటి ఐఖ్యత ఏర్పడింది. అందరూ కలిసి ఈనెల 10వ తేదీన బంద్ కి పిలుపు నివ్వడమే అందుకు ఉదాహరణ. అంతేకాదు ప్రతిపక్ష నేతలు అందరూ ఇప్పుడు నేరుగా రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలపై తెరాస ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో వివరించి చెప్పబోతున్నారు. ఆయనను నమ్మి ప్రజలు అధికారం కట్టబెట్టినప్పుడు వారి నమ్మకాన్ని నిలబెట్టుకొనే ప్రయత్నాలు చేయాలి. కానీ ఇటువంటి నిరంకుశ పోకడలతో అందరి గొంతులు అణచివేయాలని ప్రయత్నిస్తే అంతిమంగా తెరాసయే దానికి మూల్యం చెల్లించవలసి వస్తుంది.

దేశంలో తెలంగాణా ఏ-1 ఆర్ధిక శక్తి: ఇక్రా

  మీడియా లేదా వివిధ సంస్థలు వెల్లడించే విషయాలు తమకు అనుకూలంగా ఉంటే వాటి గురించి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు చాలా గొప్పగా చెప్పుకొంటాయి. కానీ అదే వ్యతిరేకంగా వచ్చే వార్తలను, విమర్శలను అర్ధరహితమయినవని కొట్టిపడేస్తుంటాయి. మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి గుజరాత్ తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత అనుకూలమయినదని, ఈ విషయంలో తెలంగాణా రాష్ట్రం 13వ స్థానంలో ఉందని కొన్ని వారాల క్రితం ప్రపంచ బ్యాంక్ పేర్కొన్నప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం దానిని హైలైట్ చేసి గొప్పలు చెప్పుకోగా, తెలంగాణా ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేసింది. చంద్రబాబు నాయుడు, మోడీ ఇరువురు ప్రపంచ బ్యాంక్ పై ఒత్తిడి తెచ్చి బీజేపీ పాలిత రాష్ట్రాలకు, ఆంద్రప్రదేశ్ కు మంచి ర్యాంకింగ్ ఇప్పించుకొన్నారని కొందరు విమర్శలు చేసారు.   ఇండియా క్రెడిట్ రేటింగ్ ఏజన్సీ (ఇక్రా) తెలంగాణా రాష్ట్రానికి ‘ఏ కేటగిరీ ఆర్ధిక శక్తి’ గా గుర్తించినట్లు తెలంగాణా ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. కనుక ఇప్పుడు తెలంగాణాకు ఇక్రా ఇచ్చిన ఈ రేటింగ్ పైన కూడా  ఆంద్రప్రదేశ్ నేతలు, తెలంగాణాలో ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేయవచ్చును. ఇక్రా ఇచ్చిన ఈ రేటింగ్ గురించి తెలంగాణా ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే ప్రయత్నం చేయడం ఎంత సహజమో ప్రతిపక్షాలు దానిని విమర్శించడం అంతే సహజం.  ఇది ఇక్రా ఇచ్చిన నివేదికలా కాకుండా తెరాస తన ప్రభుత్వం గురించి తయారు చేసుకొన్నా స్వంత నివేదికలా ఉందని ప్రతిపక్షాలు అఆరోపించవచ్చును.   రాష్ట్రాల ఆర్ధిక స్థితిగతులను, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థల సామర్ధ్యాన్ని అధ్యయనం చేసి ప్రతీ ఏటా ఇక్రా నివేదిక ప్రకటిస్తుంటుంది. దాని ఆధారంగా దేశ విదేశాలకు చెందిన ఆర్ధిక సంస్థలు ఆయా రాష్ట్రాలకి ఏ మేరకు రుణాలు మంజూరు చేయవచ్చనే సంగతి నిర్దారించుకొంటాయి. ఇక్రా ప్రకటించిన తాజా నివేదికలో తెలంగాణా రాష్ట్రానికి ఏ-కేటగిరీ ఆర్ధికశక్తిగా ప్రకటించింది. దేశ తలసరి ఆదాయం రూ.74,380 కాగా తెలంగాణా రాష్ట్ర తలసరి ఆదాయం రూ.95361 అని పేర్కొంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే పెట్టుబడి వ్యయంలో తెలంగాణా రాష్ట్ర రుణవాటా తక్కువగా ఉందని తెలియజేసింది.   రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన టి.యస్.ఐ.పాస్. వలన రాష్ట్రానికి గణనీయంగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం సరయిన దిశలోనే నిధులను వినియోగిస్తున్నందున రాష్ట్రంలో ఆస్తుల సృష్టికి అవి దోహదపడతాయని పేర్కొంది. నీటి పారుదల పనులకు భారీగా నిధులు వెచ్చిస్తున్నందున రానున్న రోజుల్లో రాష్ట్రంలో వ్యవసాయంలో గణనీయమయిన అభివృద్ధి జరుగుతుందని పేర్కొంది. ఇక్రా ఇచ్చిన ఈ ఏ-1 రేటింగ్ వలన తెలంగాణా ప్రభుత్వ రుణ పరపతి పెరుగుతుంది. ఇటువంటి సానుకూల నివేదిక వలన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ సంస్థలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది.    దేశంలో గుజరాత్ తరువాత తెలంగాణా ధనిక రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. కానీ తెలంగాణాలో ఆర్ధిక సమస్యల కారణంగా నిత్యం రైతులు ఆత్మహత్యలు చేసుకొంటూనే ఉన్నారు. ఎన్నికల సమయంలో అన్ని రకాల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన తెరాస అధికారంలోకి వచ్చి 14నెలలు అవుతున్నా ఇంతవరకు రైతుల రుణాలు మాఫీ చేయలేకపోవడం చేతనే రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకొంటున్నప్పుడు రైతుల రుణాలను ఒకే సారి ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలకు తెరాస ప్రభుత్వం జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉంది. రుణాలన్నీ ఒకేసారి చెల్లించేందుకు తమ వద్ద డబ్బులు నింపిన సూట్ కేసుల ఏవీ లేవని చెపుతోంది. ఇప్పుడు ఇక్రా సంస్థ కూడా తెలంగాణా తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే చాలా ఎక్కువ అని ప్రకటించింది. ఈ నేపధ్యంలో ఇక్రా ఇచ్చిన నివేదిక గురించి తెలంగాణా ప్రభుత్వం గొప్పగా చెప్పుకోవడానికి కష్టం అవుతుంది. చెప్పుకొనే ప్రయత్నం చేస్తే అది రైతుల పుండు మీద కారం చెల్లినట్లవుతుంది.  ఏది ఏమయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పధంలోనే ముందుకు సాగుతున్నట్లు ప్రపంచ బ్యాంక్, ఇక్రా గుర్తించడం చాల శుభపరిణామం.

పాక్ వైఖరితో నష్టపోతున్నది ఎవరు?

  ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్, పాక్ దేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతోందిపుడు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పాకిస్తాన్ మానుకొంటే ఇరుదేశాల మధ్య చర్చలకు ఆస్కారం కలుగుతుందని భారత్ వాదిస్తుంటే, ఉగ్రవాదం పేరుతో భారత్ శాంతి చర్చలు జరగకుండా కుట్రలు పన్నుతోందని పాకిస్తాన్ వాదిస్తోంది. ఇరుదేశాల మధ్య ఎప్పుడు చర్చలు జరగాలన్నా కాశ్మీర్ అంశమే కీలకంగా ఉంటుందని పాక్ వాదిస్తోంది.   ఇంతవరకు అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ కాశ్మీర్ అంశం లేవనెత్తినప్పుడల్లా, అది భారత్ లో అంతర్భాగమని దానిపై చర్చలలో మూడో పక్షం తలదూర్చదానికి తాము అంగీకరించబోమని భారత్ వాదిస్తుండేది. కానీ ఇప్పుడు కేంద్రంలో మోడీ అధికారం చేపట్టాక భారత్ వాదనలో మరింత పదును పెరిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి పాక్ వైదొలగాలని గట్టిగా డిమాండ్ చేయడమే కాకుండా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తోందని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పడం మొదలుపెట్టింది. అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశం గురించి గట్టిగా మాట్లాడుతూ భారత్ కి ఇంతవరకు ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్న పాకిస్తాన్, భారత్ వైఖరిలో వచ్చిన అనూహ్యమయిన ఈ మార్పుతో ఐక్యరాజ్యసమితిలో తడబడుతూ ప్రపంచ దేశాల ముందు తలదించుకొనే పరిస్థితి ఏర్పడింది.   పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న సంగతి అమెరికాతో సహా అన్ని దేశాలకి తెలుసు. కానీ ఐక్యరాజ్యసమితిలో దాని గురించి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి ప్రశ్నించకపోవడంతో పాక్ పెట్రేగిపోతోంది. కానీ ఇప్పుడు భారత్ సూటిగా ప్రశ్నించడంతో నేరుగా జవాబు చెప్పలేక ఈ గండం గట్టేక్కేందుకు తమ దేశంలో భారత్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందని దానికి సంబంధించి కొన్ని ఆధారాలను ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రెటరీ బాన్-కి-మూన్ కి ఇచ్చామని ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నిస్తోంది.   ఇరుగు పొరుగు దేశాలలో అశాంతి, అరాచకం, ఉగ్రవాదం నెలకొని ఉంటే అది అందరికీ చేటు కలిగిస్తుందనే సంగతి పాకిస్తాన్ కి అర్ధం కాకపోయుండవచ్చునేమో కానీ భారత్ కి తెలియదనుకోలేము. అందుకే నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, చివరికి ఆఫ్ఘనిస్తాన్ వంటి చాలా దేశాలలో శాంతి స్థాపనకు, అభివృద్ధికి భారత్ యధాశక్తిన తన సహాయ సహకారాలు అందిస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం గత నాలుగు దశాబ్దాలుగా తన ఉగ్రవాదాన్ని భారత్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి ఇరుగు పొరుగు దేశాలకు ఎగుమతి చేస్తోంది. శ్రీనగర్ లో వేర్పాటువాదులు భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ, పాకిస్తాన్, ఐ.యస్.ఐ.యస్. జెండాలను బహిరంగంగా ప్రదర్శిస్తుండటమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చును.   అందుకే ముందు ఆ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోమని భారత్ పాకిస్తాన్ కి సూచిస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం తను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లు వాదిస్తోంది. పాకిస్తాన్ భారత్ తో ఎటువంటి వైఖరి అవలంభించినప్పటికీ, అపుడప్పుడు ఉగ్రవాదుల దాడులను ఎదుర్కోవలసి రావడం తప్ప భారత్ కి వచ్చే నష్టం ఏమీ ఉండబోదు. కానీ భారత్, పాక్ సంబంధాలను పక్కనబెట్టి ఒకసారి ఆలోచిస్తే పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరి వలన భారత్ కంటే పాకిస్తాన్, దాని ప్రజలే చాలా ఎక్కువగా నష్టపోతున్నారని చెప్పక తప్పదు. రెండు దేశాల ఆర్ధిక, రాజకీయ, పారిశ్రామిక అభివృద్ధిని పోల్చి చూసినట్లయితే ఆ విషయం కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. ఈ వాదనను పాకిస్తాన్ అంగీకరించినా అంగీకరించకపోయినా ఆ దేశంలో నానాటికీ క్షీణిస్తున్న పరిస్థితులే అది తప్పుడు వైఖరి అవలంభిస్తోందని రుజువు చేస్తున్నాయి.   అటువంటప్పుడు పాకిస్తాన్ తన సమస్యల నుండి బయటపడి భారత్ తో పోటీ పడేవిధంగా ఎదిగేందుకు ఏమి చేయాలో ఆలోచించకుండా, తమ సమస్యలని కప్పి పుచ్చుకొంటూ, వాటి నుండి ప్రజల దృష్టిని మళ్ళించడానికి ఇటువంటి వైఖరి అవలంభిస్తోంది. దాని వలన అంతిమంగా నష్టపోయేది ఆ దేశమే కానీ భారత్ కాదు. ఈ చేదు నిజాన్ని గత నాలుగు దశాబ్దాలుగా పాకిస్తాన్ గుర్తించలేకపోయింది. ఎప్పటికయినా గుర్తిస్తుందో లేదో కూడా తెలియదు. కానీ దూరదృష్టి లేని అటువంటి పాలకులు కలిగి ఉండటం పాక్ ప్రజల దురదృష్టమే.

బతుకమ్మ కోసమో...జి.హెచ్.యం.సి. ఎన్నికల కోసమో?

  వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి తెరాసతో ఉన్న రహస్య అనుబంధం మరోమారు నిన్న బయటపడింది. మే నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస అభ్యర్ధికి మద్దతు తెలపడం ద్వారా తమ రెండు పార్టీల మధ్య రహస్య అనుబంధం కొనసాగుతోందని జగన్మోహన్ రెడ్డి స్వయంగా దృవీకరించినట్లయింది. తెరాస అధినేత కేసీఆర్ కుమార్తె మరియు ఎంపీ కవిత నిన్న హైదరాబాద్ లో లోటస్ పాండ్ నివాసానికి వెళ్లి జగన్మోహన్ రెడ్డితో మంతనాలు సాగించారు. కానీ జగన్ భార్య భారతిని బతుకమ్మ పండుగలో పాల్గొనమని ఆహ్వానించేందుకే ఆమె వచ్చేరని వైకాపా చెప్పుకొంటోంది.   ఆంధ్రా నేతలు, పార్టీలు తెలంగాణా రాష్ట్రాన్ని దోచుకు తిన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సార్లు ఆరోపించడం అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రా నేతలను, పార్టీలనే కాదు...సాక్షాత్ జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా తెలంగాణాని దోచుకొన్నారని తెరాస నేతలు ఆరోపిస్తునే ఉన్నారు. మరి అటువంటప్పుడు తమని దోచుకొన్న అదే నేత కొడుకు ఇంటికి తెరాస ఎంపీ కవిత వెళ్లి అతని భార్యని  బతుకమ్మ ఆడుదామని ఎందుకు పిలుస్తున్నట్లు? దాని అంతర్యం ఏమిటి? అనే సందేహాలు కలుగక మానవు.   ఎన్నికలలో ప్రజల సెంటిమెంటును రెచ్చగొట్టవలసి వచ్చినప్పుడు మాత్రమే ఆంధ్రా నేతలు దోపిడీ గురించి, ఇంకా అవసరమయితే రాజశేఖర్ రెడ్డి తెలంగాణాకు చేసిన అన్యాయం, ద్రోహం  గురించి తెరాస నేతలు గట్టిగా మాట్లాడుతుంటారు. రాజశేఖర్ రెడ్డి తెలంగాణాకు అన్యాయం చేసారు కానీ తెరాసకు కాదు కనుక మిగిలిన సమయంలో మాత్రం తమ తమ రాజకీయ అవసరాల నిమిత్తం వైకాపాతో స్నేహంగా ఉంటారు. వైకాపా అధినేత జగన్ ఇంటికి వెళ్లి ఆయన భార్య భారతిని మాత్రమే బతుకమ్మ ఆడేందుకు పిలవడంలో అంతర్యం కూడా అదే అయిఉండవచ్చును. లేకుంటే చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా ఆమె వెళ్లి ఆహ్వానించేవారు.   కానీ మళ్ళీ అక్కడే చాలా తెలివిగా తెదేపాను ‘ఫిల్టరింగ్’ చేసేసారు. కవిత వెళ్ళింది సాక్షి మీడియా చైర్ పర్సన్ భారతిని కలవడానికి కానీ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కాదని చెప్పడం చూస్తే “ఆహా! ఏమి తెలివితేటలు? అని అందరూ ఆశ్చర్యపోక తప్పదు. సాక్షి మీడియా చైర్ పర్శన్ భారతిని ఆహ్వానించారు కనుక మిగిలిన మీడియా అధినేతల అందరి ఇళ్ళకు వెళ్లి వారి భార్యలను కూడా కవిత ఆహ్వానిస్తారనుకోలేము. ఎందుకంటే వారందరికీ రాజకీయ పార్టీలు లేవు. అయితే ఇంతకీ కవిత లోటస్ పాండ్ కి ఎందుకు వెళ్ళినట్లు? అని ఆలోచిస్తే వరంగల్ లోక్ సభ స్థానానికి ఉపఎన్నికలలో, జి.హెచ్.యం.సి. ఎన్నికలలో వైకాపా మద్దతు లేదా సహకారం కోరడానికే అయ్యుండవచ్చును.   వరంగల్ పట్టణంలో కూడా ఆంధ్రాకు చెందినవారు చాలా మందే స్థిరపడి ఉన్నారు. కనుక వాళ్ళకి గాలం వేయాలంటే వైకాపా ఉండాల్సిందే. ఇక జి.హెచ్.యం.సి. వార్డుల పునర్విభజన నిలిపివేస్తున్నట్లు ఈ మధ్యనే తెరాస ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జి.హెచ్.యం.సి.పరిధిలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లను ఏరివేసే ప్రక్రియ కూడా ఒక కొలిక్కి వస్తోంది. జి.హెచ్.యం.సి. ఎన్నికల షెడ్యుల్ ప్రకటించడానికి హైకోర్టు ఇచ్చిన గడువు కూడా దగ్గర పడుతోంది. కనుక ఈ ఏడాది చివర్లోగా జి.హెచ్.యం.సి. ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.   హైదరాబాద్ లో ఆంధ్రా ఓటర్ల ఏరివేయడం, విద్యుత్ సంస్థల నుండి 1239 మంది ఉద్యోగులను తొలగించడం వంటి అనేక కారణాల వలన ఆంధ్రా ప్రజల నుండి తెరాస తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకొంది. కనుక ఈ ఎన్నికలలో మిగిలిన ఆంధ్రా ఓటర్లకు గాలం వేయాలంటే వారికి 'ఆంధ్రా గాలాన్నే' ఉపయోగించవలసి ఉంటుంది. అందుకే బతుకమ్మ పండుగకి భారతిని ఆహ్వానించే సాకుతో తెరాస, వైకాపా నేతలిద్దరూ లోటస్ పాండ్ లో మంతనాలు సాగించి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాసకి మద్దతు తెలిపిన జగన్, ఈ ఎన్నికలలో మాత్రం దానికి మద్దతు, సహకారం ఇవ్వకుండా ఉంటారనుకోలేము.  

దేశానికి భరోసా ఇవ్వవలసిన యువత కుల పోరాటాలు చేస్తుంటే...

  ప్రపంచ దేశాలతో పోల్చి చూసినట్లయితే భారతదేశానికి బాగా కలిసివచ్చే అంశం ఏమిటంటే మంచి నైపుణ్యం కలిగిన యువత అధిక సంఖ్యలో కలిగి ఉండటమే. ఇదే విషయం ప్రధాని నరేంద్ర మోడీ మొన్న తన అమెరికా పర్యటనలో కూడా చెప్పారు. కానీ హార్దిక్ పటేల్ వంటి యువకులు తమ నాయకత్వ లక్షణాలను, శక్తి యుక్తులను దేశాభివృద్ధి కోసం వినియోగించకుండా విచ్చినకర పనులకు ఉపయోగించడం చాలా శోచనీయం. పటేల్ కులస్తులకు రిజర్వేషన్ల కోసం అతను మొదలుపెట్టిన పోరాటం వలన దేశంలో అగ్రగామిగా ఉన్న గుజరాత్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోంది. ఆ ఉద్యమం వలన రాష్ట్రంలో కోట్లాది రూపాయల విలువ గల ఆస్తులు బుగ్గి పాలయ్యాయి . ఇంతవరకు 8మంది ప్రాణాలు కోల్పోయారు.   హార్దిక్ పటేల్ రాజేసిన ఈ కులచిచ్చు వలన ఒక్క గుజరాత్ రాష్ట్రం నష్టపోవడమే కాకుండా అదిప్పుడు దేశమంతటా క్రమంగా విస్తరిస్తోంది. ఇంతవరకు గుజరాత్ రాష్ట్రానికే పరిమితమయిన తన కుల పోరాటాన్ని ఇప్పుడు దేశమంతా విస్తరించాలనే ఉద్దేశ్యంతో హార్దిక్ పటేల్ ‘అఖిల భారతీయ పటేల్ నవనిర్మాన్ సేన’ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నాడు. కూర్మి, గుజ్జర్లు, మారాఠ, పటేల్ కులస్తులను తన ఉద్యమంలో భాగస్తులుగా చేసుకొని తన ఉద్యమాన్ని రాజస్థాన్, మహారాష్ట్రాలకు కూడా విస్తరించాలని ఆలోచిస్తున్నాడు. తమ సంస్థ యువత, రైతులు, కార్మికుల సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేస్తుందని హార్దిక్ పటేల్ తెలిపాడు.   భారతదేశం వేగంగా అభివృద్ధి చెంది అగ్రరాజ్యాల సరసన నిలబడాలని ప్రయత్నాలు చేస్తుంటే హార్దిక్ పటేల్ వంటివారు తాము రాజకీయంగా ఎదిగేందుకు ప్రజల బలహీనతలను ఈవిధంగా వాడుకొని పైకి ఎదగాలని ప్రయత్నిస్తుండటం చాలా విచారకరం. హార్దిక్ పటేల్ తనకున్న గొప్ప నాయకత్వా లక్షణాలను, శక్తి యుక్తులను ఇటువంటి విచ్చినకరమయిన పనులకు ఉపయోగించే బదులు దేశాభివృద్ధికి ఉపయోగించి ఉండి ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది. అతను ఒక గొప్ప నాయకుడుగా దేశ ప్రజల దృష్టిలో ఎంతో గౌరవం పొందగలిగేవాడు. కానీ షార్ట్ కట్ పద్ధతిలో ఉన్నత స్థాయికి ఎదగడానికి తన శక్తి యుక్తులను ఉపయోగిస్తుండటం చాలా దురదృష్టకరం.   భారతదేశంలో ఇప్పటికే సవాలక్ష సమస్యలతో సతమతమవుతోంది. లోపలనుండి బయట నుండి నిత్యం అనేక సవాళ్లు ఎదుర్కోవలసి వస్తోంది. అనేక సమస్యలను ఎదుర్కొంటూనే అభివృద్ధి పధంలో ముందుకు సాగిపోతోంది. ఇటువంటి సమయంలో దేశానికి వెన్నెముకగా ఉండవలసిన యువతని హార్దిక్ పటేల్ కులం పేరుతో రెచ్చగొట్టి విచ్చిన్నకర, వినాశకర ఉద్యమాలకు ప్రేరేపించడం చాలా అవివేకం. దేశ ప్రజలందరూ తమకి చాలా దేశ భక్తి ఉందనే దృడంగా విశ్వసిస్తుంటారు. బహుశః హార్దిక్ పటేల్ కూడా అలాగే భావిస్తున్నాడేమో? కానీ అతను రాజేసిన చిచ్చుని దేశమంతటా విస్తరించాలని ప్రయత్నిస్తున్నాడు. దేశానికి ఎవరూ ఏ మేలు చేయక పోయినా పరువాలేదు కానీ నష్టం చేయకుండా ఉంటే చాలు.   పటేల్ కులస్థులకు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న హార్దిక్ పటేల్, దేశంలో కనీసం ఒక్క పూట తిండికి బట్టకి కూడా నోచుకొని కటిక దరిద్రం అనుభవిస్తున్న నిరుపేదలు, చిన్నారులు కోట్ల మంది ఉన్నారనే సంగతి గ్రహిస్తే ఇటువంటి పోరాటాల గురించి ఆలోచించే వాడు కాదు. రైతుల కోసం పోరాడుతామని చెప్పుకొంటున్న హార్దిక్ పటేల్ దేశ వ్యాప్తంగా వేలాది మంది రైతులు ఆర్ధిక బాధలు తాళలేక ఆత్మహత్యలు చేసుకొంటున్నారని గ్రహిస్తే, కులం కోసం కాక రైతుల కోసం పోరాడి ఉండేవాడు. కానీ తన ఉద్యమాలతో దేశానికి ఇంకా సమస్యలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాడు.   అగ్గి పుల్లతో దీపం వెలిగించి వెలుగులు పంచవచ్చును. అదే అగ్గిపుల్లతో కొంపకి నిప్పు పెట్టవచ్చును. అగ్గిపుల్ల వంటి హార్దిక్ పటేల్ ఇప్పుడు కొంపకు నిప్పుపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. కుల,మత, ప్రాంత, బాషా సంకుచిత బేధాల నుండి భారతావనికి విముక్తి కలిగించి భారతీయులు అందరినీ ఒక్క త్రాటిపైకి తెచ్చి దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపించవలసిన ఈ తరుణంలో హార్దిక్ పటేల్ వంటి యువకులే కులం పేరుతో ప్రజల మధ్య అడ్డుగోడలు కడుతుండటం చాలా దురదృష్టకరం.

రైల్వే జోన్ హామీ కూడా కేంద్రం గట్టున పెట్టబోతోందా?

  రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీలు రెండూ అంగీకరించినప్పటికీ అందరికీ తెలిసిన అనేక కారణాల వలన రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయలేకపోయింది. ఇంతకాలం దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను మభ్య పెట్టాయని రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కానీ కేంద్రప్రభుత్వం చెపుతున్న కారణాలు సహేతుకంగా ఉండటం, ప్రత్యేక హోదాకి తీసిపోని విధంగా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ, పరిశ్రమలకు రాయితీలు మంజూరు చేస్తానని కేంద్రప్రభుత్వం గట్టిగా హామీ ఇస్తుండటంతో ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలు సర్దుకుపోక తప్పడం లేదు.   ఆ తరువాత విజయవాడలో తగినంత జనాభా లేనందున అక్కడ మెట్రో రైల్ నడపడం లాభసాటి కాదు కనుక దానికి నిధులు అందించలేమని కేంద్రప్రభుత్వం నెల రోజుల క్రితమే తెలియజేసింది. ఈ విషయంలో కూడా కేంద్రం ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంతో ఆ ప్రాజెక్టును జపాన్ కు చెందిన జైకా అనే సంస్థ అందించే నిధులతో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిశ్చయించుకొన్నారు.   ప్రత్యేక హోదా, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల తరువాత ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ వంతు వచ్చినట్లుంది. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని రైల్వే బోర్డ్ చైర్మన్ ఎ.కె.మిట్టల్ నిన్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావుకి తెలియజేసారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే ఓడిశాలోని భువనేశ్వర్ జోన్ ఆదాయం కోల్పోయి నష్టపోతుందని, కనుక ఓడిశా ప్రభుత్వం విశాఖలో ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని కృష్ణారావుకి తెలిపారు. అయినా విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు సాంకేతికంగా వీలుపడదని, అది ఆర్ధికంగా లాభసాటి కాదని రైల్వే బోర్డు చైర్మన్ తెలిపారు.   రైల్వే బోర్డ్ చైర్మన్ ఎకె.మిట్టల్ చెప్పిన ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృవీకరిస్తూ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ 14నెలలు గడిచిపోయినా ఇంతవరకు విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయకపోవడం, దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసలు మాట్లాడేందుకు ఇష్టపడకపోవడం, ప్రత్యేక హోదా, విజయవాడ మెట్రో ప్రాజెక్టు హామీలపై కేంద్రప్రభుత్వం ‘యూ టర్న్’ తీసుకోవడంవంటివన్నీ గమనించినట్లయితే కేంద్రప్రభుత్వం మనసులో మాటనే రైల్వే బోర్డ్ చైర్మన్ ఎకె.మిట్టల్ నోటితో చెప్పిస్తున్నట్లుందనే అనుమానం కలుగుతోంది.   ఓడిశా ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదాని, రైల్వే జోన్ని అడ్డుకోగలిగింది. పోలవరం ప్రాజెక్టుపై కూడా అది తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది కనుక మున్ముందు దానిని కూడా అడ్డుకోవచ్చును. అపుడు కేంద్రం దానిని కూడా పక్కన పెట్టేయవచ్చును. కేంద్రంతో కానీ, బీజేపీతో గానీ ఎటువంటి మిత్రత్వం లేని ఓడిశా ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేసి రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తుంటే, కేంద్రంలో భాగస్వామిగా, బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్న తెదేపా ఏమి చేస్తోంది? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు గట్టిగా ఎందుకు పోరాడలేకపోతోంది?   ప్రత్యేక హోదా రాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడో తెలుసని, అందుకే ఆర్ధిక ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నారని తెదేపా ఎంపీ జేసి దివాకర్ రెడ్డి చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న ఒక్కో హామీని కేంద్రప్రభుత్వం ఏదో ఒక సాకుతో పక్కన పెట్టేస్తుంటే దానిని గట్టిగా నిలదీసి ప్రశ్నించవలసిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తనకు తెలిసిన ఆ విషయాలను దాచిపెడుతోంది? ఇప్పటికే ప్రత్యేక హోదా అంశం రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఒక బలమయిన ఆయుధంగా మారాయి. ఇప్పుడు వాటికి రైల్వే జోన్ అనే మరో బలమయిన అస్త్రం అందించితే ఏమవుతుందో తేలికగానే ఊహించవచ్చును. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ప్రజలను మభ్యపెడుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకవేళ రైల్వే జోన్ హామీని కేంద్రప్రభుత్వం నిజంగానే పక్కనబెడితే, రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అడిగి దానిని సాధించలేకపోతే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమని నమ్మక తప్పదు. అప్పుడు నష్టపోయేది తెదేపా, బీజేపీలేనని గుర్తుంచుకోవాలి.

జి.హెచ్.యం.సి. డివిజన్ల పునర్విభజనకు బ్రేక్.. త్వరలో ఎన్నికలు?

  గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ (జి.హెచ్.యం.సి.) బోర్డు పదవీ కాలం గత డిశంబర్ 3తోనే ముగిసింది. కానీ నగరంలో పెరిగిన జనాభాకి అనుగుణంగా డివిజన్ల పునర్విభజన చేయాలంటూ ఇంతకాలం తెలంగాణా ప్రభుత్వం జి.హెచ్.యం.సి. ఎన్నికలు జరుపకుండా వాయిదా వేస్తూ 10 నెలలు కాలక్షేపం చేసింది. కానీ ఇప్పుడు డివిజన్ల పునర్విభజన చేసి వాటి సంఖ్యని పెంచడం వలన పరిపాలనాపరమయిన ఇబ్బందులు ఎదురవుతాయని జి.హెచ్.యం.సి. కమీషనర్ సోమశేఖర్ ప్రభుత్వానికి ఒక లేఖ వ్రాయడంతో డివిజన్ల పునర్విభజన ప్రక్రియను నిలిపివేస్తూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం జి.హెచ్.యం.సి.లో ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లు యదాతధంగా కొనసాగుతాయి.   ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జి.హెచ్.యం.సి. డివిజన్లను 200కి పెంచుతూ తెరాస ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయవలసిందిగా అధికారులను ఆదేశించింది. కానీ మళ్ళీ ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకొంటూ మళ్ళీ కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది. హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలు ఎదురయిన తరువాత వాటిని ఉపసంహరించుకోవడం తెలంగాణా ప్రభుత్వానికి సర్వ సాధారణమయిపోయింది.   కానీ జి.హెచ్.యం.సి. బోర్డుకి ఎన్నికలు నిర్వహించే విషయంలో మాత్రం అదొక సాకు మాత్రమేనని చెప్పకతప్పదు. ఎందుకంటే ఆంద్ర ప్రజలు ఎక్కువగా స్థిరపడిన జి.హెచ్.యం.సి. పరిధిలో తెరాస ఎన్నికలలో గెలవడం చాల కష్టం. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్న సమయంలో, ఆ తరువాత తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తెరాస నేతలు తమ మాటలతో చేతలతో హైదరాబాద్ జంట నగరాలలో నివసిస్తున్న ఆంద్ర ప్రజలలో తీవ్ర అభద్రతాభావం కల్పించారు. ఇటీవల ఆంధ్రాకు చెందిన 1200 మంది విద్యుత్ ఉద్యోగులను అకస్మాత్తుగా విధులలో నుండి తప్పించి ఆంధ్రాకు అప్పగించడమే అందుకు ఒక సజీవ ఉదాహరణగా చెప్పుకోవచ్చును.   ఇటువంటి కారణాల వలన హైదరాబాద్ జంట నగరాలలో పోటీ చేసి తెరాస విజయం సాధించడం దాదాపు అసంభవం అని గ్రహించడంతో తెరాస ప్రభుత్వం డివిజనల పునర్విభజన సాకుతో జి.హెచ్.యం.సి. ఎన్నికలను ఇంతవరకు వాయిదా వేసి దాని పరిధిలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లను ఏరివేయడం మొదలుపెట్టింది. అదేవిధంగా ప్రతిపక్షాలకు మంచి పట్టు ఉన్న డివిజన్లను కుదించి, తనకు పట్టు ఉన్న డివిజన్ల సంఖ్యను పెచుకోవడం ద్వారా తన విజయావకాశాలను మెరుగు పరుచుకోవాలని చూసింది. కానీ ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి పిర్యాదులు చేయడంతో డివిజన్ల పునర్విభజనలో భౌగోళిక సరిహద్దులు సక్రమంగా రావట్లేదనే సాకుతో ఆ ప్రయత్నాలను కూడా విరమించుకోక తప్పలేదు.   బహుశః అందుకే ఇక చేసేదేమీలేక ఇప్పుడు డివిజన్ల పునర్విభజన ప్రక్రియను నిలిపి వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసి ఉండవచ్చును. తెరాస తన రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ జి.హెచ్.యం.సి. బోర్డుకి ఎన్నికలు నిర్వహించకపోవడం వలన కేంద్రం నుండి జి.హెచ్.యం.సి.కి అందవలసిన వందల కోట్లు నిధులు వెనక్కి మళ్ళి పోయాయి. ఇంకా ఆలశ్యం చేసినట్లయితే వచ్చే ఏడాది కోసం మంజూరు అయ్యే నిధులు కూడా వెనక్కి మళ్ళిపోవచ్చును. కనుక ఇప్పటికయినా జి.హెచ్.యం.సి.కి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని ప్రజలు, ప్రతిపక్షాలు కూడా కోరుకొంటున్నారు.

ప్రజా రాజధాని అమరావతిలో కార్పోరేట్ సంస్థలకే చోటు?

  రాజధాని అమరావతిని జీవకళ ఉట్టిపడేలా ప్రజారాజధానిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెపుతుంటారు. కానీ వాస్తవానికి అందులో ప్రజల భాగస్వామ్యం ఏమీ కనబడటం లేదు. కనీసం స్వదేశీ సంస్థలు, రైతులు, యువతకి కూడా చోటు ఉన్నట్లు కనబడటం లేదు. రాజధాని మాష్టర్ ప్లాన్ తయారీ నుండి రాజధాని నిర్మాణం వరకు అంతా సింగపూర్, జపాన్ తదితర దేశాలకు పూర్తి పెత్తనం అప్పగించబోతున్నట్లు స్పష్టం అవుతోంది.   రాజధానిలో శాసనసభ, సచివాలయం, హైకోర్టు, మంత్రులు, ముఖ్యమంత్రి నివాసాలు, మౌలిక సదుపాయాల కల్పనకు మాత్రమే కేంద్రప్రభుత్వం నిధులు మంజూరు చేయబోతోంది కనుక రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి అంచనా వేసిన రూ.1.25 లక్షల కోట్లలో సింహ భాగం విదేశీ సంస్థల నుండే పొందవలసి ఉంటుంది. కనుక రాజధాని నిర్మాణంలో విదేశీ సంస్థల పెత్తనం అనివార్యంగా కనబడుతోంది. తనకున్న పలుకుబడిని చూసే విదేశీ సంస్థలు రాజధాని నిర్మాణానికి ముందుకు వస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకొంటున్నప్పటికీ లాభాపేక్ష లేనిదే ఏ విదేశీ వ్యాపార, పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులు పెట్టవు కనుక అవి ఏదో ఓ రూపంలో తమ పెట్టుబడులకు పూర్తి ప్రతిఫలాలు తీసుకోవడం తధ్యం.   రాష్ట్ర విభజన కారణంగా రాజధాని కూడా లేకుండా పోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తుంటే అందరికీ సంతోషమే. కానీ దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే వేల కోట్ల రుణభారాన్ని రాష్ట్ర ప్రజలే మోయక తప్పదు. అదే విధంగా అత్యాధునిక రాజధాని నగరంలో కల్పించబడే సకల సౌకర్యాలకు అక్కడ నివసించే ప్రజలే మూల్యం చెల్లించవలసి ఉంటుంది. ఒకవేళ ఆ భారం మరీ అధికంగా ఉన్నట్లయితే దానిని కూడా రాష్ట్ర ప్రజలందరూ భరించవలసి వచ్చినా ఆశ్చర్యంలేదు. ఆ కారణంగా బహుశః అమరావతిలో నివసించాలంటే సామాన్య ప్రజలెవరికీ సాధ్యం కాకపోవచ్చును. రాష్ట్రంలో సామాన్య ప్రజలందరికీ అదొక పర్యాటక ప్రాంతంగానే తయారవుతుందేమో? రాజధాని నిర్మాణం తొలిదశ పూర్తయ్యే సమయానికి అక్కడి పరిస్థితులపై స్పష్టత రావచ్చును.   రాజధానిలో అనేక దేశ విదేశీ కార్పోరేట్ సంస్థలు రాబోతున్నాయి. కనుక అమరావతి ప్రజారాజధానిగా కాకుండా కార్పోరేట్ రాజధానిగానే అవతరించవచ్చును. రాజధాని నిర్మాణంలో రాష్ట్రంలో యువతకు, కార్మికులు, సాంకేతిక నిపుణులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించవచ్చును. కానీ రాజధాని కోసం భూములను ఇచ్చిన రైతుల పరిస్థితే అయోమయంగా మారుతుందేమో? ఎందుకంటే వారికి వ్యవసాయం తప్ప మరొక విద్య తెలియదు. కనుక అన్నదాతలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికలు సిద్దం చేసిందో వేచి చూడాలి.   ఇక రాజధాని నిర్మాణం పూర్తిగా తెదేపా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారంగానే సాగుతోంది తప్ప అందులో ప్రజల, ప్రతిపక్షాల అభిప్రాయాలకి, సూచనలకి ఎక్కడా అవకాశం ఉన్నట్లు కబడటం లేదు. రాజధాని ప్రాంతాన్ని ఎంపిక నుండి భూమి పూజ కార్యక్రమం వరకు ప్రజలకి, ప్రతిపక్షాలకి ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. కానీ రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రజలందరూ తమవంతు సహకారం అందించాలని కోరుతోంది. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం విరాళాలు కూడా సేకరిస్తోంది. వచ్చేనెల 22న రాజధాని శంఖుస్థాపన కార్యక్రమాన్ని కోట్లు ఖర్చు చేసి చాలా అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని చెపుతూనే మళ్ళీ ఉన్న డబ్బుని ఆవిధంగా విచ్చలవిడిగా ఖర్చు చేయడాన్ని ఎవరూ హర్షించరు. రాజధాని నిర్మాణం కోసం విదేశీ సంస్థల నుండి అప్పులు తీసుకొంటున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరింత పొదుపుగా, ఆచితూచి డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. లేకుంటే ఆ భారాన్ని కూడా మళ్ళీ రాష్ట్ర ప్రజల నెత్తినే పడుతుంది. ఈ శంఖుస్థాపన కార్యక్రమానికి దేశ విదేశీ నేతలను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు చెప్పుతున్నారు. కానీ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు దానిలో పాల్గొనేందుకు ఆహ్వానం, అనుమతి ఉంటాయో లేదో చూడాలి.

పోలవరంపై ఏపీ, తెలంగాణా కాంగ్రెస్ నేతల ద్వంద వైఖరి

  రాష్ట్ర విభజన అంశాలపై కాంగ్రెస్ పార్టీ తన ద్వంద వైఖరిని మళ్ళీ మరొక్కమారు తనే స్వయంగా బయటపెట్టుకోబోతోంది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది కాంగ్రే పార్టీయే. ఆ ప్రాజెక్టు క్రింద ముంపుకి గురయ్యే ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను ఆంధ్రాలో కలపాలని నిర్ణయించింది కూడా ఆ పార్టీయే. ప్రత్యేక హోదాలాగ పోలవరం గురించి పార్లమెంటులో ఏదో నోటిమాటగా చెప్పకుండా దానిని రాష్ట్ర విభజన బిల్లులో కూడా చేర్చి పార్లమెంటు చేత ఆమోదింపజేసింది కూడా ఆ పార్టీయే. కానీ ఇప్పుడు తెలంగాణా కాంగ్రెస్ నేతలు పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత డిజైన్ తోనే నిర్మించినట్లయితే దానివలన అక్కడ నివసిస్తున్న నివసిస్తున్న గిరిజనులకు తీవ్ర నష్టం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. కనుక పోలవరం నిర్మాణం, దాని పర్యవసానాల గురించి తెలంగాణా శాసనసభలో చర్చించేందుకు తెరాస ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా ఈ విషయంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్రప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ముంపు గ్రామాలలో గిరిజనుల తరపున నిలబడి పోరాటాలు చేయాలని నిర్ణయించారు.   గతేడాది మోడీ ప్రభుత్వం అధికారం చేప్పట్టిన వెంటంటే ఖమ్మం జిల్లాలో ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని తెరాస నిరసించినప్పుడు ఖమ్మం జిల్లాతో సహా తెలంగాణా కాంగ్రెస్ నేతలు అందరూ మౌనం వహించారు. ఎందుకంటే తమ పార్టీయే ఆ ప్రతిపాదనని విభజన బిల్లులో చేర్చించి కనుక. కానీ ఏడాదిన్నర తరువాత ఇప్పుడు అకస్మాత్తుగా ముంపు ప్రాంతాలలో గిరిజనులపై ప్రేమ పుట్టుకు వచ్చింది.   ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ నేతలు పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింపజేసిన ఘనత తమదేనని కానీ తెదేపా ప్రభుత్వం పోలవరాన్ని పక్కనబెట్టేసి పట్టిసీమ ప్రాజెక్టును మొదలుపెడుతోందని విమర్శిస్తున్నారు. తమ యూపీఏ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా మోడీ ప్రభుత్వం దానికి తగినన్ని నిధులు విడుదల చేయడం లేదని విమర్శిస్తున్నారు. అంటే పోలవరం పనులను వేగవంతం చేసి ఆ ప్రాజెక్టుని పూర్తి చేయాలని వారు కోరుకొంటున్నట్లు భావించవలసి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ హయంలోనే పోలవరం ప్రాజెక్టు (ఇందిరా సాగర్) పనులు మొదలయ్యాయి. అప్పటి నుండి కాంగ్రెస్ తో సహా అన్ని ప్రభుత్వాలు దానిపై వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి కూడా. కానీ దశాబ్దాల తరబడి సాగుతున్నా ఇంతవరకు ఆ ప్రాజెక్టు పూర్తి కానేలేదు. అది కాంట్రాక్టర్లకు ఉపాధి కల్పించే ప్రాజెక్టుగా మారిందే తప్ప దాని నుండి నీటి చుక్క బయటకు రాలేదు.   దాని గురించి కాంగ్రెస్ నేతలెవరూ కూడా ఇన్నేళ్ళలో ఈవిధంగా మాట్లాడలేదు. ఇంత శ్రద్ద కనబరచలేదు. కానీ కేంద్రంలో, రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారేసరికి ఆంధ్రా, తెలంగాణా కాంగ్రెస్ నేతలకి ఇప్పుడు హటాత్తుగా పోలవరం గుర్తుకు వచ్చేసింది. ఆంధ్రా కాంగ్రెస్ నేతలు పోలవరం నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తుంటే, తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఆ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా పోరాటాలకి సిద్దం అవుతున్నారు. ఆంధ్రాలో ప్రజలకు దగ్గరవడానికి కాంగ్రెస్ నేతలు పోలవరం గురించి మాట్లాడుతుంటే, తెలంగాణాలో కాంగ్రెస్ నేతలు కూడా దానిని వ్యతిరేకించడం ద్వారా తెలంగాణా ప్రజలకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారు.   ఈవిధంగా ఒకే అంశంపై రెండు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు ఇంత ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు వారు ఆడుతున్న ఈ కపట నాటకాలను ప్రజలు తెలుసుకోలేరనే ఉద్దేశ్యంతోనే బహుశః ఈ విధంగా ప్రవర్తిస్తున్నరేమో? రాష్ట్ర విభజన సమయంలో ఇలాగే కపట నాటకాలు ఆడినందుకే రెండు రాష్ట్రాలలో ప్రజలు ఆ పార్టీని ఎన్నికలలో తిరస్కరించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తన పద్దతులను అంత త్వరగా మార్చుకోవడం లేదు.

ఈ ఓదార్పు యాత్రలు ఇంకెన్నేళ్ళు చేస్తారో...ఏమి సాధిస్తారో?

  మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చనిపోయి ఆరేళ్ళయింది. కానీ నేటికీ ఆయన పేరుతో తెలంగాణాలో వైకాపా ఓదార్పు యాత్రలు కొనసాగిస్తోంది. సాధారణంగా మనిషి చనిపోయిన వెంటనే ఎవరయినా వెళ్లి ఓదార్చి వస్తుంటారు. కానీ ఈవిధంగా ఆరేళ్ళ తరువాత షర్మిల వెళ్లి ఓదార్చడం చాలా విడ్డూరంగా ఉంది. మరణించిన వారి కుటుంబ సభ్యులే ఆ బాధ నుండి బయటపడి తమ నిత్యజీవిత కార్యక్రమాలలో కొనసాగిపోతుంటే వారికి చనిపోయిన వ్యక్తిని గుర్తు చేసి మరీ ఓదార్చడం కేవలం వైకాపాకే సాధ్యం. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోనే ఉంటున్నప్పటికీ ఇంతవరకు స్వయంగా తెలంగాణా జిల్లాలలో అడుగుపెట్టలేదు. ఆయన తరపున పార్టీలో ఏ పదవిలో లేని షర్మిల తెలంగాణాలో ఓదార్పు యాత్రలు నిర్వహిస్తున్నారు.   తెలంగాణాలో ప్రస్తుతం తను చేస్తున్న ఓదార్పు యాత్రలు వ్యక్తిగతమయినవే తప్ప రాజకీయ ఉద్దేశ్యంతో చేస్తున్నవి కావని షర్మిల చెపుతుంటారు. కానీ ఆమె ఓదార్పు యాత్రలకి వైకాపా రూట్ మ్యాప్, షెడ్యూల్, ప్రచారం చేసి ఆమె కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలకి పిలుపునిస్తుంటుంది. మరి దాని అర్ధం ఏమిటో ఆమే చెప్పాలి. బాధలో ఉన్న ఒక కుటుంబాన్ని ఓదార్చడానికి బయలుదేరుతున్నప్పుడు అదేదో ఘనకార్యం చేయడానికి బయలుదేరుతున్నట్లు ఇంతగా ప్రచారం చేసుకొనవసరం లేదు. ఇంత ఆర్భాటంగా బయలుదేరనవసరం లేదు. చనిపోయినవారి కుటుంబాలను ఓదార్చడానికి బయలుదేరుతూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని, రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు తరలిరావాలని కోరడం చాలా పెద్ద తప్పు.   ఆమె ఏఏ నియోజక వర్గాలలో ఎన్ని వందల కి.మీ. పర్యటించి ఎన్ని కుటుంబాలను కలిసి ఓదార్చారో మీడియాలో గొప్పగా గణాంకాలు ప్రకటించుకోవలసిన అవసరం అంతకంటే లేదు. కానీ వైకాపా చేసుకొంటోంది. అంటే రాజకీయ ప్రయోజనాలను ఆశించే ఆపని చేస్తోందని స్పష్టం అవుతోంది. కానీ ఆ విషయంలో కూడా దానికి ఎటువంటి స్పష్టత ఉన్నట్లు లేదు. అసలు తెలంగాణా రాష్ట్రంలో ఆ పార్టీ ఏమి సాధిద్దామనుకొంటోంది...ఆ పార్టీ భవిష్య ప్రణాళికలు ఏమిటి...తమ రాజకీయ భవిష్యత్ ఏవిధంగా ఉండబోతోంది? అనే విషయాల గురించి కనీసం ఆ పార్టీ నేతలకయినా తెలుసో తెలియదో అనుమానమే. ఎందుకంటే ఒకవేళ తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసుకోదలిస్తే, రాష్ట్రంలో మిగిలిన రాజకీయ పార్టీలలాగే వైకాపా కూడా చాలా చురుకుగా ప్రజా సమస్యలపై పోరాడాలి. కానీ కనీసం తన ఉనికిని చాటుకొనే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. అదే ఆంధ్రాలో వైకాపా నిత్యం ఏదో ఒక సమస్య, అంశం తీసుకొని ధర్నాలు, దీక్షలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, బందులు చేస్తూ అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో వైకాపా వ్యవహరిస్తున్న తీరులో కనిపిస్తున్న ఈ తేడాను గమనించినట్లయితే, తెలంగాణాపై ఆ పార్టీకి పెద్దగా ఆసక్తి లేదని స్పష్టం అవుతోంది. అటువంటప్పుడు ఇంత శ్రమపడి ఈ ఓదార్పు యాత్రలు చేయడం దేనికో వారికే తెలియాలి.   అక్టోబర్ మూడు నుండి ఆరు వరకు మూడు రోజుల పాటు అదిలాబాద్ జిల్లాలో మొత్తం తొమ్మిది మండలాలలో 10కుటుంబాలను ఓదార్చుతారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ తెలిపారు. ఈ మూడు రోజుల యాత్రలో షర్మిల మొత్తం 1100 కి.మీ. పర్యటింస్తారని తెలిపారు. పార్టీ నాయకులూ, కార్యకర్తలు, రాజశేఖర్ రెడ్డి అభిమానులు అందరూ ఆమెకి స్వాగతం పలికేందుకు తరలిరాలని ఆయన పిలుపునిచ్చారు!!!

అభివృద్ధికి అడ్డుపడుతూ అభివృద్ధి కోసం పోరాటాలు చేస్తున్న ప్రతిపక్షాలు

  రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ పునాది నుండి నిర్మించుకోవలసివస్తోంది. అంతకంటే వేరేమార్గం లేదు కూడా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు చేప్పడుతున్నాయి. వాటిలో ప్రధానంగా రాజధాని నిర్మాణం, దానికోసమే ప్రత్యేకంగా విజయవాడ వద్ద కొత్తగా 800 మెగావాట్స్ సామర్ధ్యంగల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, గన్నవరం విమానాశ్రయ విస్తరణ, భోగాపురంలో విమానాశ్రయం ఏర్పాటు, బందరులో కొత్తగా పోర్టు నిర్మాణం, విజయవాడ, విశాఖ నగరాలలో మెట్రో రైల్ నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, ఉన్నత విద్యా, వైద్య సంస్థలు, అనంతపురంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, కృష్ణపట్నంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, చిత్తూరులో పారిశ్రామిక సంస్థలు ఇలాగా చాలా పెద్ద లిస్టే ఉంది. గత ఐదారు దశాబ్దాల కాలంలో ఎన్నడూ కూడా రాష్ట్రంలో ఒకేసారి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేప్పట్టబడలేదు. కానీ రాష్ట్ర విభజన తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అభివృద్ధి మంత్రం జపిస్తూ ఒకేబాటలో సాగిపోతున్నందునే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి.   కానీ రాష్ట్ర ప్రజల మనోభావాలను, అభిప్రాయాలను పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ, అధికారం కోసం పరితపించిపోతున్న వైకాపా రెండూ కూడా ఒకవైపు ఈ అభివృద్ధి కార్యక్రమాలకు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూనే మరోవైపు రాష్ట్రాభివృద్ధి జరగాలంటే తప్పనిసరిగా ప్రత్యేక హోదా రావాలని అందుకోసం పోరాడాలని ప్రజలను, విద్యార్ధులను రెచ్చగొడుతున్నాయి. రాష్ట్ర విభజన తరువాత అనేక సమస్యలలో కొట్టుమిట్టాడుతున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే మెల్లగా తేరుకొని ముందుకి అడుగులు వేస్తున్నప్పుడు కాంగ్రెస్, వైకాపాలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా పేరుతో రాష్ట్రంలో బందులు, ధర్నాలు, ర్యాలీలు అంటూ అరాచక పరిస్థితులు సృష్టిస్తే, ప్రత్యేక హోదా వస్తుందో లేదో తెలియదు కానీ వారు చేస్తున్న ఈ నిర్వాకానికి ప్రత్యేక హోదా వచ్చినా కూడా కోలుకోలేనంతగా రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉంది.   రాష్ట్రాభివృద్ధి కోసం ప్రతిపక్ష నేతలు నిజంగా అంత పరితపించిపోతున్నట్లయితే ఈవిధంగా అభివృద్ధి నిరోధకులుగా నిలబడేబదులు, వారు కూడా తమకున్న పరపతిని ఉపయోగించి రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు వచ్చేలా కృషి చేయాలి. ఆ బాధ్యత కేవలం రాష్ట్ర ప్రభుత్వానిదే అని చేతులు దులుపుకోకుండా రాష్ట్రాభివృద్ధి కోసం తమవంతు సహాయ సహకారాలు కూడా అందిస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. ఒకవేళ అటువంటి బాధ్యత తీసుకోదలచుకోకపోయినా పరువాలేదు, కానీ మిగిలిన ఈ మూడున్నరేళ్ళ కొద్దిపాటి సమయంలో రాష్ట్రంలో మొదలయిన ఈ అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడకుండా ఉంటే అంతే చాలు. ప్రజలు చాలా సంతోషిస్తారు.   వచ్చే ఎన్నికల నాటికి దేశంలో, రాష్ట్రంలో రాజకీయాలు ఏవిధంగా ఉంటాయో ఎవరికీ తెలియదు. కనుక దీపం ఉండగానే ఇళ్ళు చక్కబెట్టుకోవాలన్నట్లు వీలయినంత వేగంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలు అడుగడుగునా అడ్డుపడకుండా ఉంటే చాలు. ఒకవేళ వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందితే ప్రజలు మళ్ళీ తెదేపా వైపే మొగ్గు చూపుతారనే భయంతో ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడినట్లయితే అందుకు మళ్ళీ అవే భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని గుర్తుంచుకోవాలి.   ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోనందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేశారు. రాష్ట్ర విభజన తరువాత అన్ని విధాల చితికిపోయిన రాష్ట్రాన్ని వీలయినంత త్వరగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకొంటున్నారు. దాని కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కృషి చేస్తున్నప్పుడు, ప్రతిపక్షాలు అడ్డుపడినట్లయితే వచ్చే ఎన్నికలలో వారికి ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని గుర్తుంచుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేస్తే వాటిని ఎత్తి చూపించి ప్రభుత్వాన్ని విమర్శించవచ్చును. కానీ ఏదో ఒక సాకుతో అభివృద్ధి కార్యక్రమాలకి అడ్డుపడటం సరయినది కాదు.

ఏపీకి న్యాయం చేయడానికి మీనమేషాలు లెక్కించడం ఎందుకో?

  ఏపీకి ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రధానికి వ్రాసిన లేఖకు కేంద్రం నుండి జవాబు వచ్చింది. దానిలో ప్రత్యేక హోదా పొందడానికి అవసరమయిన అర్హతలు, లక్షణాలు, దేశంలో వివిధ రాష్ట్రాల డిమాండ్లు, అభ్యంతరాల గురించి వివరించి ఏపీకి ప్రత్యేక హోదా మంజూరు చేయలేమని తెలియజేసినట్లు సమాచారం.   ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమనే విషయాన్ని కేంద్రప్రభుత్వం చాలా నెలల క్రితమే స్పష్టం చేసింది. కానీ రాష్ట్ర ప్రజలకి ఆ ముక్కని దైర్యంగా సూటిగా చెప్పేలేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేజేతులా సమస్యలు కొనితెచ్చుకొంటున్నాయి. దీని గురించి కేంద్రాన్ని నిలదీయాల్సిన కాంగ్రెస్, వైకాపాలు తమ పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే నిలదీస్తుండటంతో అవి విసురుతున్న సవాళ్ళను ఎదుర్కొంటూ తెదేపా వాటికీ జవాబులు, సంజాయిషీలు చెప్పుకొంటూ తనని తాను కాచుకోవలసివస్తోంది.   ఈ విషయం గురించి కాంగ్రెస్, వైకాపాలు రాష్ట్ర బీజేపీ నేతలను కూడా ప్రశ్నించకుండా కేవలం తెదేపానే లక్ష్యంగా చేసుకొని పోరాడటం గమనిస్తే వారి చిత్తశుద్ధి ఏపాటిదో, వారు ఏ ఉద్దేశ్యంతో పోరాడుతున్నారో అర్ధం అవుతుంది. ప్రత్యేక హోదా వలన రాష్ట్రానికి జరిగే మేలు కంటే అది దక్కకపోవడం వలన ఆ రెండు పార్టీలు మంచి రాజకీయ లబ్ది పొందగలుగుతున్నాయి. మిగిలిన ఏవిషయంలోను అధికార పార్టీపై పైచెయ్యి సాధించలేకపోతున్న వైకాపా ఈ ఒక్క విషయంలోనూ తెదేపా ప్రభుత్వం పైచెయ్యి సాధించి దానితో చెలగాటం ఆడుకోగలుగుతోంది.   ఇదే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి చాలాసార్లు వివరించి సమస్య పరిష్కారానికి సహకరించవలసిందిగా అభ్యర్దిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయలేమని కేంద్రప్రభుత్వం స్పష్టం చేస్తునప్పుడు, కనీసం ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి అయినా మంజూరు చేసి ఉండి ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే ప్రజలకు ఏదో విధంగా నచ్చజెప్పుకొనే ప్రయాత్నాలు చేసి ఉండేది. కానీ కేంద్రం చేస్తున్న జాప్యం వలన రాష్ట్రంలో ప్రతిపక్షాలకి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేందుకు, సమస్యలు సృష్టించేందుకు మంచి అవకాశం లభిస్తోంది.   రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ క్రిందటి నెల రాష్ట్ర బంద్ చేసిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈనెల 26నుండి గుంటూరులో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ఇప్పటికే ఆరుగురు వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకొన్నారనే సంగతి తెలిసి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న తన పోరాటంలో విజయం సాధించేందుకు జగన్ విద్యార్ధులను రెచ్చగొడుతున్నారు. ఒకవేళ విద్యార్ధులు రంగంలోకి దిగితే ఈ సమస్య మరింత జటిలమవుతుంది. అప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ చింతించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.   బీహార్ రాష్ట్రానికి ఎటువంటి హామీ ఇవ్వనప్పటికీ రూ.1.25లక్షల కోట్లు మంజూరు చేయగలిగినప్పుడు, విభజన చట్టంలో లికిత పూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కేంద్రం వెనకాడితే దానికే నష్టం. అవి తెదేపా, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రజలను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది. కనుక కేంద్రం ఇంకా మీనమేషాలు లెక్కపెడుతూ కాలక్షేపం చేయకుండా వీలయినంత త్వరగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి న్యాయం చేయాలి.