ఆ పాదయాత్రలు కాంగ్రెస్ కి మళ్ళీ అధికారం తెచ్చి పెడతాయా?

  కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయినప్పుడు దానికి తామే పూర్తి బాధ్యత వహిస్తున్నామని, ఆత్మపరిశీలన చేసుకొని తమ పార్టీ ఓటమికి కారణాలు తెలుసుకొని తమ తప్పులు సరిదిద్దుకొంటామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మీడియాతో అన్నారు. కానీ ఆ తరువాత వివిధ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలవడం గమనిస్తే వారిద్దరూ ఆత్మపరిశీలన చేసుకోలేదని అర్ధమవుతోంది. అంతే కాదు తమ ఆలోచనా విధానంలో కూడా ఎటువంటి మార్పు చేసుకోలేదని రు నిన్న డిల్లీలో చేసిన పాదయాత్రతో మరొకమారు రుజువు చేసుకొన్నారు.   మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశంలో మత అసహనం పెరుగుతోందని, రచయితలపై హిందూ మతోన్మాదుల దాడులు పెరుగుతున్నాయని ఆరోపిస్తూ అందుకు నిరసనగా డిల్లీలో సోనియా గాంధీతో సహా కాంగ్రెస్ పెద్దలు అందరూ పార్లమెంటు భవనం నుండి రాష్ట్రపతి భవన్ వరకు పాదయాత్ర చేసారు. తరువాత సోనియా గాంధీ మరి కొందరు నేతలు రాష్ట్రపతిని కలిసి ఒక విజ్ఞప్తి పత్రం ఇచ్చేరు.   ఇంతకాలం చేతిలో ఎటువంటి అధికారం లేకపోయినా తల్లి కొడుకులు ఇద్దరూ దేశాన్ని పరోక్షంగా పరిపాలించారు. వారి పరిపాలన అవినీతికి, కుంభకోణాలకి ప్రసిద్ధం అయిపోయింది. కాంగ్రెస్ అంటే అవినీతి, కుంభకోణాలు అన్నంతగా పేరు సంపాదించుకొంది. అందుకు కాంగ్రెస్ పార్టీని నిందించనవసరం లేదు. రౌతును బట్టే గుర్రం పరిగెడుతుంది. అయినప్పటికీ రాహుల్ గాంధీ స్వచ్చమయిన పరిపాలన, దేశాభివృద్ధి, నిరుపేదలు, మహిళల సంక్షేమం అంటూ ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు. దేశాన్ని, ప్రభుత్వాన్ని, పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసేస్తానని ఉత్తర కుమార శపధాలు చేసేవారు. కానీ తన పార్టీలో సంస్కరణలు చేయలేకపోయారు. 120కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశానికి ప్రధాని అయిపోవాలని కలలు కన్న రాహుల్ కనీసం నేటికీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కూడా కాలేకపోయారు. అవుదామని ప్రయత్నిస్తే పార్టీలో నేతలే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.   జాతీయ పార్టీగా ఒకవెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీని తల్లి కొడుకులిద్దరూ కలిసి ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి చేర్చారు. బిహార్ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయలేక అవినీతిపరుడయిన, జైలుకి వెళ్ళివచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్, తమను ఇంతకాలం తిట్టిపోసిన నితీష్ కుమార్ చెయ్యి పట్టుకోవడం గమనిస్తే కాంగ్రెస్ పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్ధమవుతుంది. లాలూ చెయ్యి పట్టుకొన్నా బిహార్ ఎన్నికలలో 40 స్థానాలలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కనీసం 10స్తానలయిన గెలుస్తుందనే నమ్మకం లేదు.   ఒకపక్క కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతుంటే, మరోపక్క నరేంద్ర మోడీ పేరు దేశవిదేశాలలో మారుమ్రోగిపోతోంది. కాంగ్రెస్ ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నిటి నుంచి దేశ ప్రజల, పార్టీలో నేతలు, కార్యకర్తల దృష్టిని మళ్ళించడానికే కాంగ్రెస్ అధినేత్రి మళ్ళీ రోడ్డు ఎక్కాల్సివచ్చిందని భావించవచ్చును. ఒకప్పుడు తన కంటి సైగతో దేశాన్ని ఏలిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక సామాన్య రాజకీయ నాయకురాలులాగ పాదయాత్ర చేస్తున్నారంటే సహజంగానే మీడియా, దేశ ప్రజలు ఆసక్తి చూపిస్తారు. కనుక దేశ ప్రజల దృష్టిని ఆకర్షించడానికే వారు ఈ పాదయాత్ర చేప్పటినట్లు భావించవచ్చును. అయితే ఈ పాదయాత్రలతో వారు మళ్ళీ అధికార పీఠాన్ని సంపాదించుకోగలరా? వారిరువురూ పార్టీని సరయిన మార్గంలోనే నడిపిస్తున్నారా? అని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలే ఆలోచించుకోవలసిన అవసరం ఉంది.

ఇద్దరూ సేమ్ టు సేమ్ పగటి కలలు కంటున్నారు

  ఏపిలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తరచూ “త్వరలోనే ఈ ప్రభుత్వం కూలిపోతుంది..మేము అధికారంలోకి వస్తాము..ప్రజల కష్టాలన్నీ తీరిపోతాయని” చెపుతుంటారు. ప్రజల కష్టాలు తీరడం ముఖ్యమని భావిస్తున్నారో లేక తను అధికారంలోకి రావడమే ముఖ్యమని ఆయన భావిస్తున్నారో తెలియదు కానీ నిత్యం అదే పాట పాడుతుంటారు. కలలు కనమని మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం చెప్పారు కనుక జగన్ పగటి కలలు కంటే ఎవరూ కాదనలేరు. అధికార తెదేపా నేతలు కూడా ఆయనకు ‘అదో తుత్తి’ అని నవ్వుకొంటారు.   ఇంచుమించు జగన్ పరిస్థితిలోనే ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయిపోతున్నట్లున్నారు. జగన్ బాటలో ఓదార్పు యాత్రలు చేసాక ఇప్పుడు జగన్ మాదిరిగానే రాహుల్ కూడా మోడీ ప్రభుత్వం అధికారం కోల్పోతుందని, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెపుతున్నారు.   బిహార్ లోని అరారియాలో ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ “మోడీ ప్రభుత్వం అన్ని రంగాలలో పూర్తిగా విఫలమయింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పారు. ధరలు నియంత్రిస్తామని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధి చేస్తామని చెప్పారు కానీ ఏ ఒక్క హామీ నిర్వహించలేకపోయారు. యూపీఏ హయాంలో కేజీ రూ.70 ఉండే కంది పప్పు ధర ఇప్పుడు కేజీ రూ.200కి చేరుకొంది. అయినా మోడీ ప్రభుత్వం ధరల నియంత్రణకి ఎటువంటి చర్యలు చేప్పట్టడం లేదు. ప్రధాని మోడి కేవలం ఏడాదిన్నర తిరక్కుండానే అన్ని వ్యవస్థలపై నియంత్రణ కోల్పోయి ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇదేవిధంగా మోడీ పరిపాలన సాగించినట్లయితే, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఆయనే అవకాశం కల్పించడం తధ్యం. మోడీ పాలన త్వరగా ముగిసిపోయి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ప్రజలు కూడా అదే కోరుకొంటున్నారు,” అని అన్నారు.   ఏపీలో తెదేపా ప్రభుత్వం కూలిపోయి తను ముఖ్యమంత్రి అవ్వాలని జగన్ కోరుకొంటున్నారు. మోడీ ప్రభుత్వం పోయి తను ప్రధానమంత్రి అవ్వాలని రాహుల్ గాంధీ కలలుగంటున్నారు. ఒకరు రాష్ట్ర స్థాయిలో మరొకరు జాతీయ స్థాయిలో పగటి కలలు కంటున్నారు. అంతే తేడా. జగన్ పంచాంగం ప్రకారం ఏపీలో మరో ఒకటి రెండేళ్లలో ప్రభుత్వం కూలిపోయే అవకాశాలున్నట్లు అనుకోవాలి. రాహుల్ గాంధీ మాత్రం మోడీకి మిగిలిన మూడున్నరేళ్ళు అధికారంలో కంటిన్యూ అయ్యేందుకు అనుమతించినట్లున్నారు. కనుక వారిద్దరి జోస్యం ఫలించి వారి పగటి కలలు నిజమవుతాయో లేదో తెలుసుకోవాలంటే అంతవరకు ఆగవలసిందే మరి.

మోడీ పాలనపై భిన్నాభిప్రాయలకు కారణం ఏమిటి?

  మోడీ ప్రభుత్వం ప్రస్తుతం చాలా విచిత్రమయిన పరిస్థితులు ఎదుర్కొంటోంది. ప్రపంచ దేశాలన్నీ మోడీ నామస్మరణ చేస్తుంటే, దేశంలో కొందరు మేధావులు మోడీ అధికారంలోకి వచ్చేక భావ ప్రకటన స్వేచ్చకు భంగం కలుగుతోందని, దేశంలో మత అసహనం పెరిగిపోతోందని ఆరోపిస్తూ తమ అవార్డులను వెనక్కి తిరిగి ఇచ్చేస్తున్నారు. దేశంలో చాలా మంది ప్రజలు, విదేశాలలో ఉన్న ప్రవాస భారతీయులు మోడీ నేతృత్వంలో భారత్ చాలా వేగంగా అభివృద్ధి పధంలో దూసుకుపోతోందని దృడంగా విశ్వసిస్తుంటే, దేశంలో కొంతమంది ప్రజలు మోడీ ప్రభుత్వం దేశాభివృద్ధి కంటే అభివృద్ధి జరిగిపోతున్నట్లు గట్టిగా ప్రచారం చేసుకోవడానికే పరిమితం అయిందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.   సార్వత్రిక ఎన్నికలు మొదలు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల వరకు బీజేపీ విజయపధంలో సాగిపోతుండటం గమనిస్తే మోడీ పరిపాలన పట్ల ప్రజలలో సదాభిప్రాయమే ఉందని అర్ధమవుతుంది. ప్రస్తుతం జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మొదటి రెండు దశలలో ‘అభివృద్ధి’ ప్రదానాంశంగా మారడానికి కారణం కూడా అదేనని చెప్పుకోవచ్చును.   బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వామ పక్షాలు, కాంగ్రెస్ తదితర పార్టీలు ఇంతకు ముందు భూసేకరణ చట్టంతో మోడీ ప్రభుత్వాన్ని చావు దెబ్బతీయాలని ప్రయత్నించి భంగపడ్డాయి. బీజేపీని ఇటువంటి రాజ్యాంగ, సాంకేతిక, ఆర్ధిక, పరిపాలనా పరమయిన అంశాలతో ఎదుర్కోవడం కష్టమని గ్రహించిన కాంగ్రెస్ దాని మద్దతుదారులు బీజేపీకి ఉన్న మతతత్వ ముద్రనే హైలైట్ చేస్తూ దానితోనే మోడీ ప్రభుత్వాన్ని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. అందుకే దేశంలో ఎక్కడ హిందుమతోన్మాదులు పేట్రేగిపోయినా దానిని మోడీ ప్రభుత్వానికి లింక్ చేస్తూ అందరూ కలిసికట్టుగా గట్టిగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. కొందరు సాధువులు, ఆర్.ఎస్.ఎస్. నేతల వివాదాస్పద వ్యాఖ్యలు, ముంబాయిలో శివసేన ఆగడాలు చాలా శృతి మించిపోవడంతో మోడీ ప్రభుత్వ వ్యతిరేకులు చేస్తున్న వాదనలకు మరింత బలం చేకూరినట్లయింది.   ఇదివరకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా దేశంలో చాలాసార్లు మత ఘర్షణలు జరిగాయి. ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలు చాలాసార్లు జరిగాయి కానీ వాటిని కాంగ్రెస్ (యూపిఏ) ప్రభుత్వానికి ఆపాదించబడలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి సెక్యులర్ ముద్ర సంపాదించుకొంది కనుకనే అని చెప్పక తప్పదు. కానీ కాంగ్రెస్ పాలనలో కూడా లెక్కలేనన్ని కుంభకోణాలు జరిగాయి. అవినీతి సర్వత్రా వ్యాప్తి చెందింది. మహిళలపై సామూహిక అత్యాచార ఘటనలు జరిగాయి. ప్రపంచ దేశాల దృష్టిలో భారత్ పరువు ప్రతిష్టలు మంటగలవడం అప్పటి నుంచే మొదలయింది. కాంగ్రెస్ పార్టీని “మత స్వేచ్చ-కుహానా సెక్యులరిజం” కారణంగానే  ఇంత కాలం దేశ ప్రజలు భరిస్తూ వచ్చేరు. కానీ దాని వలన వినాశనమే తప్ప అభివృద్ధి జరుగలేదనే సంగతి రుజువవడంతో అభివృద్ధిని కాంక్షిస్తూ దేశ ప్రజలు మోడీకి పట్టం కట్టారు.   ఆయన పరిపాలనలో కూడా కొన్ని తప్పులు ఉండవచ్చును లేదా జరుగుతుండవచ్చును కానీ కాంగ్రెస్ పాలనతో పోలిస్తే మోడీ పాలన వంద రెట్లు మెరుగయినదని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఎప్పటికప్పుడు దేశ అవసరాలకి తగ్గట్లుగా అనేక సంస్కరణలు చేస్తూ పాలనలో చురుకుదనం తెచ్చారు. బంగ్లాదేశ్ తో దశాబ్దాలుగా ఉన్న సరిహద్దు సమస్యలను పరిష్కరించారు. భారత్ సైనికులు దశాబ్దాలుగా అడుగుతున్న 'ఒకే హోదా-ఒకే పెన్షన్' డిమాండ్ ని నెరవేర్చారు. అనేక రాష్ట్రాలలో ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో మారుమూల ప్రాంతాలకు విద్యుత్, రోడ్లు తదితర ప్రాధమిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆదాయంలో వాత పెంచి ఇచ్చారు. ఆర్ధిక, పారిశ్రామిక ప్రగతిలో అభివృద్ధి సాధిస్తున్నారు. ప్రపంచ దేశాలలో వ్యాపారానికి అనుకూలమయిన దేశాలలో భారత్ స్థానం 140 నుండి 132కి చేరుకోవడమే దేశ పరిస్థితుల్లో మార్పు మొదలయిందని, దానిని యావత్ ప్రపంచం గుర్తించిందని విస్పష్టంగా తెలియజేస్తోంది.   ఒకవేళ మోడీ ప్రభుత్వం ఇదే వేగంగా దేశాభివృద్ధి సాగించినట్లయితే వచ్చే ఎన్నికల సమయానికి వాటి ఫలితాలు ప్రజలకు ప్రత్యక్షంగా కనబడతాయి. అప్పుడు ఇక బీజేపీని, మోడీని గద్దె దించడం అసంభవం కనుకనే దేశంలో ఇతర సమస్యల గురించి, మాట్లాడకుండా...పోరాడకుండా కేవలం “మత స్వేచ్చ-కుహానా సెక్యులరిజం” అనే అంశాలకి హైప్ క్రియేట్ చేస్తున్నారు. గురించి మాత్రమే మాట్లాడుతున్నారని భావించవచ్చును. ఒకవేళ మోడీ ప్రభుత్వం నిజంగానే ప్రజల మత స్వేచ్చను, భావ ప్రకటన స్వేచ్చను హరించే ప్రయత్నం చేస్తే దానిని ఏవిధంగా రక్షించుకోవాలో దేశప్రజలకు బాగా తెలుసు. దేశంలో జరిగే చెదురుముదురు సంఘటనలను, బీజేపీ అనుబంధ పార్టీలు, నేతలు చేసే వివాదాస్పద వ్యాఖ్యలను, తప్పులను హైలైట్ చేసి చూపిస్తూ దేశంలో పెద్ద అనర్ధం జరిగిపోతోందన్నట్లు, పెద్ద ఉపద్రవం ముంచుకు వస్తున్నట్లు కాంగ్రెస్ దానికి మద్దతు పలికే కొందరు మేధావులు దేశ ప్రజలను తప్పు ద్రోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు.   మోడీ ప్రభుత్వాన్ని దెబ్బ తీయాలని వారు చేస్తున్న ఈ ప్రయత్నాల వలన, ప్రపంచ దేశాలలో భారత్ పట్ల మళ్ళీ ఒక దురాభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉందనే సంగతి ‘సో కాల్డ్ మేధావులు’ విస్మరించడం చాలా శోచనీయం. వారి దుష్ప్రచారాన్ని నమ్ముతున్నవారు దేశంలో నిజంగానే అటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయా? లేక తమ చుట్టూ ఏమయినా అభివృద్ధి పనులు జరుగుతున్నాయా లేదా? అని స్వయంగా పరిశీలించి చూసుకొన్న తరువాతనే మోడీ ప్రభుత్వం గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవడం మంచిది.

పాపం సోమేశ్...

  గత ఏడాది డిశంబర్ 3న జి.హెచ్.ఎం.సి. బోర్డు పదవీ కాలం ముగిసినప్పటి నుంచి నిన్నటి వరకు సోమేశ్ కుమార్ మునిసిపల్ కమీషనర్ గా పనిచేసారు. శుక్రవారం రాత్రి ఆయనను గిరిజన శాఖ బదిలీ చేస్తూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతో బాటు మరో 21 మంది ఐ.ఏ.ఎస్. అధికారులను కూడా బదిలీ చేసింది. అయితే సోమేశ్ కుమార్ బదిలీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.   ఆంధ్రా ఓటర్లు అధికంగా ఉన్న జంట నగరాలలో తెరాస పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉండదనే భయంతోనే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలను వాయిదా వేసిందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. వాటి ఆరోపణల నిజమని నిరూపిస్తున్నట్లుగానే జంట నగరాలలో ఓటర్ల జాబితాల సవరణ పేరిట సుమారు 6.3 లక్షల మంది ఆంధ్రా ఓటర్లను సోమేశ్ కుమార్ ఏరివేశారు. అయితే అటువంటి నిర్ణయాలు ఆయన స్వంతంగా తీసుకోలేరని అందరికి తెలుసు. మరోలా చెప్పాలంటే తెరాస ప్రభుత్వ ఆదేశాల మేరకే ఆయన ఆ పనికి ఉపక్రమించారని చెప్పక తప్పదు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో గెలవాలనే కోరిక తెరాసకు ఉండటం తప్పు కాదు కానీ అందుకోసం ఆంధ్రా ఓటర్లను ఏరిపారేయాలనుకోవడమే పెద్ద తప్పు.   కేంద్ర ఎన్నికల కమీషన్ కి ప్రతిపక్షాలు పిర్యాదులు చేయడంతో నిజానిజాలు తెలుసుకొనేందుకు 14మందితో కూడిన ఒక బృందాన్ని పంపింది. వారు క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు చాలా మంది ఓటర్లకు అసలు నోటీసులే ఇవ్వకుండా వారి పేర్లను ఓటర్ల జాబితాలో నుంచి తొలగించినట్లు కనుగొన్నారని తెలుస్తోంది. అందుకు జి.హెచ్.ఎం.సి.కమీషనర్ సోమేశ్ కుమారే బాధ్యత వహించాల్సి వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఆయన నడుచుకొన్నప్పటికీ అందరి దృష్టిలో ఆయన దోషిగా నిలబడవలసి వచ్చింది. అది సరిపోదన్నట్లుగా ప్రభుత్వం ఆయనని చాలా అప్రధాన్య గిరిజన శాఖకు బదిలీ చేయడం ద్వారా మళ్ళీ శిక్షించినట్లయింది.   కానీ ఆయన చాలా హుందాగా స్పందించారు. అధికారులకు బదిలీలు మామూలు విషయమేనని, తానేమీ అసంతృప్తిగా లేనని, ప్రభుత్వం తనకు ఏ బాధ్యతలు అప్పగిస్తే అది నిర్వరిస్తానని అన్నారు. తనకు అన్ని శాఖలు ఒకటేనని అన్నారు. ఇదివరకు కూడా తాను గిరిజన శాఖలో పనిచేసి ఉన్నందున, ఆ శాఖలో పనిచేయడానికి ఎటువంటి ఇబ్బందీ లేదని అన్నారు. తెరాస ప్రభుత్వం తను తీసుకొన్న నిర్ణయానికి ఆయన మూల్యం చెల్లించేలా చేసిందని అందరూ అభిప్రాయపడుతున్నారు.   ఇదివరకు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై దర్యాప్తు చేసి, జగన్ తదితరులపై ఏకంగా 11 చార్జ్ షీట్లు దాఖలు చేసిన సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణకు కూడా చివరికి ఇటువంటి అవమానకర పరిస్థితులే ఎదురయ్యాయి. దేశానికి సేవ చేయాలనే తపనతో ఎంతో కష్టపడి ఐ.ఏ.ఎస్. పూర్తి చేసి బాధ్యతలు చేపడితే, చివరికి వారు రాజకీయ నాయకుల చేతుల్లో పడి నలిగిపోతున్నారు. వారి పరిస్థితి చూస్తుంటే ముల్లు వచ్చి అరిటాకు మీద పడినా...అరిటాకు వచ్చి ముల్లు మీద పడినా నష్టపోయేది అరిటాకే అన్నట్లుంది.

రాజకీయాలు చేసుకోవడానికే ప్రత్యేక హోదా పనికొస్తోందా?

  ప్రత్యేక హోదా అంశంపై బీజేపీ నేతల మాటల మధ్యే పొంతన కనబడటం లేదు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆ ప్రతిపాదన ఇంకా నీతి ఆయోగ్ పరిశీలనలో ఉందని చెపుతుంటే, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఇక ఏ రాష్ట్రానికి కూడా కొత్తగా ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని విస్పష్టంగా చెప్పారు. ఆయన బీహార్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నప్పుడు ఈ విషయం ప్రకటించారు. సాధారణంగా ఎన్నికల సమయంలో ఏ రాజకీయ నాయకుడు పార్టీ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపించే ఇటువంటి ప్రకటనలు చేయరు. కానీ బీహార్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడి ఇప్పటికే రూ.1.65లక్షల కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి ఉన్నారు కనుక ఆ దైర్యంతోనే అరుణ్ జైట్లీ ఆ మాట చెప్పగలిగారని భావించవచ్చును. కనుక ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని భావించవచ్చును.   ప్రత్యేక హోదా ఖచ్చితంగా రాదని కాంగ్రెస్, వైకాపాలు దృడంగా నమ్ముతున్నందునే తమ రాజకీయ లబ్ది కోసం దాని కోసం పోరాటాలు చేస్తున్నాయి. గత 15నెలలుగా బీజేపీ నేతలు పరస్పర విరుద్దంగా చెపుతున్న ఇటువంటి మాటలను విని రాష్ట్ర ప్రజలు కూడా ఇక ప్రత్యేక హోదా రాదని మానసికంగా సిద్దపడ్డారు. అందుకే వారు ఆ రెండు పార్టీలు చేస్తున్న పోరాటాల పట్ల నిరాసక్తిగా ఉన్నారని భావించవచ్చును. ప్రత్యేక హోదా రాకపోయినా కనీసం బీహార్ రాష్ట్రానికి ఇచ్చినట్లుగా భారీ ఆర్ధిక ప్యాకేజీ ఇవ్వాలని రాష్ట్ర ప్రజలు కోరుకొంటున్నారు. కాంగ్రెస్, వైకాపాలు ఆ విషయం గ్రహించి కేవలం ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ కోసం పోరాటాలు చేస్తుంటే బహుశః అప్పుడు ప్రజలు వాటికి మద్దతు పలికేవారేమో? బీహార్ ఎన్నికలు పూర్తికాగానే మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించవచ్చని తెదేపా నేతలు చెపుతున్నారు. ఒకవేళ కేంద్రప్రభుత్వం బిహార్ ఎన్నికల తరువాత నిజంగానే రాష్ట్రానికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించినట్లయితే ఇక కాంగ్రెస్, వైకాపాలు ప్రత్యేక హోదా కోసం పోరాడినా ప్రజలు పట్టించుకోకపోవచ్చును.   అప్పుడు ఆ రెండు పార్టీలు ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అనే అంశాలని భుజానికెత్తుకొంటాయేమో? ఎందుకంటే ఆ రెండు హామీల అమలులో చాలా జాప్యం జరుగుతోంది. పోలవరం నిర్మాణానికి ఇంకా చాలా ఏళ్ళు పట్టవచ్చును కనుక ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు గురించి ప్రతిపక్ష పార్టీలు పోరాటం మొదలుపెట్టవచ్చును. బిహార్ ఎన్నికల తరువాత కూడా కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించకపోతే, అప్పుడు ప్రజలు ప్రతిపక్ష పార్టీల పోరాటాలకి మద్దతు పలుకవచ్చును.   ప్రత్యేక హోదా విషయంలో ఇంతవరకు ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు, నిరాహార దీక్షలు, రాష్ట్ర బందులు చేసినా రాష్ట్ర బీజేపీ నేతలు గట్టిగా స్పందించలేదు. అదేదో తెదేపా అంతర్గత సమస్య అన్నట్లుగా పట్టించుకోకుండా ఊరుకొన్నారు. కానీ తెదేపా నేతలు గల్లా జయదేవ్, నందమూరి బాలకృష్ణ ప్రత్యేక హోదా విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయగానే బీజేపీ నేతలు సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాక వెంకటసత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు తదితరులు మిత్రపక్షమని కూడా చూడకుండా తెదేపా ప్రభుత్వంపై విరుచుకుపడటం గమనార్హం.   రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజి కావాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా అందరూ కోరుకొంటున్నారు. ఇప్పటికే ఏడాదిన్నర సమయం గడిచిపోయింది. అయినా కేంద్రప్రభుత్వం ఇంకా ఆ విషయం పరిశీలనలోనే ఉందని చెపుతూ కాలక్షేపం చేస్తుంటే, దాని కోసం రాష్ర్టంలో అధికార, ప్రతిపక్ష, మిత్రపక్ష రాజకీయ పార్టీలన్నీ కలిసి కృషి చేయకుండా, ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంశాలను రాజకీయ ఆయుధాలుగా చేసుకొని ఒకదానితో మరొకటి యుద్దాలు చేస్తూ రాష్ర్ట ప్రజలను మభ్యపెడుతూ రోజులు దొర్లించేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు లేవు కనుక రాజకీయపార్టీలు ప్రజలకు జవాబు చెప్పుకోవలసిన అవసరం లేదు. కనుక ప్రత్యేక హోదా, ప్యాకేజీ గురించి ఏవిధంగానయినా మాట్లాడవచ్చును...కాలక్షేపం చేయవచ్చును. కానీ వచ్చే ఎన్నికలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ప్రజలకు ప్రత్యేక హోదా గురించి సంజాయిషీ చెప్పుకోక తప్పదు.

తెలంగాణాలో వైకాపాని ఎందుకు కొనసాగిస్తున్నట్లో?

  తెలంగాణా రాష్ట్రంలో కూడా వైకాపా ఉండీ లేనట్లే ఉంది. అక్కడ ఏదో ఒక ప్రత్యేక కారణం వలనో లేక ఏదో ఒక ప్రత్యేక ప్రయోజనం ఆశించో పార్టీని కొనసాగిస్తునట్లుంది తప్ప మిగిలిన రాజకీయ పార్టీలలాగ ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలను ఆకట్టుకోవాలి...ఎన్నికలలో పోటీ చేసి ఎప్పటికయినా అధికారంలోకి రావాలి...అనే ఉద్దేశ్యం వైకాపాకి ఉన్నట్లు కబడటం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో ఆ పార్టీ వ్యవహార శైలిని చూస్తే ఆ తేడా మరింత స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. బహుశః తెరాసతో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఉన్న రహస్య అనుబంధం కారణంగానే తెలంగాణాలో వైకాపా నేతలు చేతులు ముడుచుకొని కూర్చోవలసి వస్తోందనే అనుమానాలున్నాయి. అలాగని తెరాస ప్రభుత్వానికి వైకాపా బహిరంగంగా మద్దతు తెలపలేకపోతోంది. అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీపై దుష్ప్రభావం చూపవచ్చుననే భయంతోనే దూరంగా ఉండవలసి వస్తోంది.   ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో తెదేపా, తెరాసలు అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిన్న మొన్నటి వరకు కూడా తెరాస ప్రభుత్వం ఏదో ఒక అంశం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో యుద్దాలు చేస్తూనే ఉంది. ఆ కారణంగా అది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో నెలకొని ఉంది. అటువంటి పార్టీతో బహిరంగంగా చేతులు కలిపినట్లయితే ఆంధ్రాలో వైకాపాపై ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుందనే భయంతోనే తెరాసకి దూరంగా ఉండవలసి వస్తోందని భావించవచ్చును. కానీ ఆ రెండు పార్టీల మధ్య ఉన్న రహస్య అనుబందం అప్పుడప్పుడు ఏదో రూపంగా బయటపడుతూనే ఉంటుంది. మే నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస అభ్యర్ధికి మద్దతు ఇవ్వడం, ఓటుకి నోటు కేసులో తెరాస ప్రభుత్వానికి అనుకూలంగా, తెదేపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించడం వంటివన్నీ అందుకు చక్కటి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చును.   ఇటువంటి వ్యవహారాలన్నీ నిశితంగా గమనించినట్లయితే, తెరాసకు అండగా నిలుస్తూ తమ ఉమ్మడి శత్రువు తెదేపాను తెలంగాణాలో ఎదగకుండా నిలువరించడానికే అక్కడ వైకాపాను కొనసాగిస్తున్నట్లు అనుమానం కలుగుతోంది. తెలంగాణాలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లు తెరాసకు ఓటు వేయకపోవచ్చును. వారి ఓట్లు వేరే ఇతర పార్టీలకో లేక గంపగుత్తగా తెదేపాకు పడకూడదనుకొంటే, తప్పనిసరిగా ఆంధ్రాకు చెందిన వైకాపా ఉండాలి. అప్పుడు వారి ఓట్లు ఆ రెండు పార్టీల మధ్య చీలిపోతుంటాయి. దాని వలన వైకాపాకి ఒరిగేదేమీ ఉండకపోయినా, తెదేపాను దెబ్బ తీస్తూ పరోక్షంగా తెరాసకు సహాయపడినట్లవుతుంది. అందుకే తెలంగాణాలో వైకాపాని సజీవంగా ఉంచినట్లు అనుమానం కలుగుతోంది.   ఆ అనుమానాలని ద్రువీకరిస్తునట్లుగా వరంగల్ ఉప ఎన్నికలలో వైకాపా కూడా పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఇంతకు ముందు ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాసకు బహిరంగంగా మద్దతు ప్రకటించినందుకు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చింది. అందుకే ఈసారి తెరాసకు మద్దతు పలకకుండా ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లుంది. ప్రజల ఓట్లు చీలితే దాని వలన తెరాసకే లాభం చేకూరుతుంది కనుక పరోక్షంగా తెరాసకు సహాయపడినట్లునట్లు ఉంటుంది. తెదేపా ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణం నాయుడు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసారు.   వరంగల్ ఉప ఎన్నికలలో వైకాపా పోటీ చేయడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు..అభ్యంతరం చెప్పడం సబబు కాదు. కానీ తెలంగాణాలో వైకాపాని సజీవంగా ఎందుకు ఉంచుతున్నారనే విషయం దీని ద్వారా అర్ధం అవుతోంది. తెదేపాని దెబ్బ తీయాలని వైకాపా ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో తెదేపా నష్టపోతుందో లేదో తెలియదు కానీ తెలంగాణాలో వైకాపాని నమ్ముకొన్న నేతలు, కార్యకర్తలు మాత్రం పావులుగా మారి నష్టపోవడం తధ్యమని చెప్పవచ్చును.

నిరంతరం పోరాడుతున్నా ప్రజాధారణ దక్కడం లేదు!

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిత్యం ఏదో ఒక సమస్యపై ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటారు. సాధారణ సమస్యలపై దీర్ఘకాల పోరాటాలు చేయనవసరం లేదు కానీ పంట రుణాల మాఫీ, రైతుల ఆత్మహత్యలు, రాజధాని తదితర ప్రాజెక్టుల కోసం భూసేకరణ, ప్రత్యేక హోదా వంటి అంశాల మీద ప్రభుత్వం దిగి వచ్చేవరకు పోరాటం కొనసాగించగలిగి ఉండి ఉంటే, జగన్ చెప్పుకొంటున్న విశ్వసనీయత, మడమ తిప్పని పోరాటం వంటి మాటలకు అర్ధం ఉండేవి. తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పంట రుణాలను ఒకేసారి మాఫీ చేయడం కోసం చేసిన పోరాటంతో తెరాస ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అయితే ఇంతవరకు జగన్ చేసిన ఏ ఒక్క పోరాటం కూడా ఇలాగ విజయవంతం కాలేదు. ఎందుకంటే ఏ సమస్యపై నిలకడగా పోరాటం చేయకపోవడమే కారణమని చెప్పవచ్చును. ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి ఎంత అకస్మాత్తుగా పోరాటం మొదలుపెట్టారో అంతే అకస్మాత్తుగా దానిని పక్కనబెట్టడం గమనిస్తే అది అర్ధమవుతుంది.   ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటంలో ఆయనతో కలిసి పోరాడేందుకు సిద్దంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ విస్పష్టంగా చెప్పింది. ప్రధాని నరేంద్ర మోడి అమరావతికి వచ్చినప్పుడు ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి గురించి ఎటువంటి ప్రకటన చేయకపోవడం వలన జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యేక పోరాటం కొనసాగించేందుకు చాలా మంచి అవకాశం లభించింది. ఇంత సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకో తన ప్రత్యేక పోరాటాలని అర్ధాంతరంగా నిలిపివేశారు. అందుకు కారణాలేమిటో ఇదమిద్దంగా తెలియదు. బహుశః ప్రత్యేక హోదా కోసం చేప్పట్టిన నిరవధిక నిరాహార దీక్ష అత్యంత అవమానకర పరిస్థితుల్లో ముగించవలసి రావడం, దానికి ప్రజల నుంచి ఆశించినంతగా స్పందన కొరవడటం వంటి కారణాలు జగన్మోహన్ రెడ్డిని తీవ్ర నిరుత్సాహపరిచి ఉండవచ్చును. అందుకే ఆయన దృష్టి మళ్ళీ రాజధాని భూసేకరణపైకి మళ్లినట్లుంది.   రెండు రోజుల క్రితం జగన్ రాజధాని ప్రాంతంలో పర్యటించి భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులు న్యాయపోరాటం చేయదలిస్తే వారికి వైకాపా అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చివచ్చేరు. ఇంతకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి అదే మాట చెప్పారు. భూసేకరణకు వ్యతిరేకిస్తూ రెండు రోజులు ధర్నా కూడా చేసారు. కానీ ఆ తరువాత వారి సమస్యని పక్కన పెట్టి ప్రత్యేక హోదా అంశం భుజానికెత్తుకొన్నారు. మళ్ళీ దానిని పక్కన పడేసి రాజధాని భూసమీకరణకు వ్యతిరేకంగా పోరాటం అంటున్నారిప్పుడు. ప్రత్యేక హోదా వచ్చేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పిన వైకాపా నేతలు, మోడీ వచ్చే వరకు కొంచెం హడావుడి చేశారు. ఆ తరువాత వాళ్ళు కూడా ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం తగ్గించి, రాజధాని భూసేకరణ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు ఈ అంశంపై వైకాపా నేతలు ఎన్ని రోజులు పోరాడుతారో.. ఆ తరువాత మళ్ళీ ఏ అంశాన్ని భుజానికెత్తుకొంటారో వారికే తెలియాలి.   జగన్మోహన్ రెడ్డి నిరంతరంగా చేస్తున్న ఈ పోరాటాల వలన నిజానికి ఆయనకి, వైకాపాకి ప్రజలలో చాలా మంచి ఆదరణ లభించి ఉండాలి కానీ వాటి వలననే ఆయన విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారుతోంది. నిలకడ లేకపోవడం, చేసే పనిలో చిత్తశుద్ధి లోపించడం, హడావుడిగా నిర్ణయాలు తీసుకొని దుందుడుకుగా వ్యవహరించడం వంటి లోపాలు వైకాపాకు విశ్వసనీయతకు ప్రశ్నార్ధకంగా మార్చుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రత్యేక హోదా వస్తే నష్టపోయేదెవరు?

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ప్రతిపక్ష పార్టీలన్నీ ఉద్యమిస్తున్నాయి. కాంగ్రెస్, ప్రజా సంఘాలు, వామపక్షాల మద్దతుతో నటుడు శివాజీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. కానీ అందరి కంటే ఆలశ్యంగా రంగ ప్రవేశం చేసిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి “లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తాను...ఎప్పుడు వచ్చేమన్నది కాదు పాయింటు...”అంటూ దూసుకుపోతున్నారు. మిగిలిన పార్టీలన్నీ కేంద్రప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నిస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం కేవలం చంద్రబాబు నాయుడునే ప్రశ్నిస్తున్నారు...నిందిస్తున్నారు.   అయితే ప్రత్యేక హోదా ఇస్తామంటే చంద్రబాబు నాయుడు ఎందుకు కాదంటారు? ప్రత్యేక హోదా వస్తే ఆయనకి ఏమయినా నష్టం కలుగుతుందా? అని ఆలోచిస్తే జగన్ చేస్తున్న వాదనలు ఎంత అర్ధరహితమో అర్ధమవుతుంది. ఒకవేళ ప్రత్యేక హోదా మంజూరు అయితే దాని వలన ఆయనకే ఖ్యాతి, పూర్తి ప్రయోజనం దక్కుతాయి. కనుక ఆయన దాని కోసం గట్టిగా ప్రయత్నించడం లేదనే జగన్ వాదనలలో పసలేదు.   రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు టి.జి. వెంకటేష్ దీనిపై చాలా ఆసక్తికరమయిన వ్యాఖ్య చేసారు. అదేమంటే ఒకవేళ కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా మంజూరు చేసినట్లయితే వచ్చే ఎన్నికలలో వైకాపాతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు తుడిచిపెట్టుకొని పోతాయని అన్నారు. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే చంద్రబాబు నాయుడుకి, తెదేపా, బీజేపీలకే ఆ క్రెడిట్ మొత్తం దక్కుతుంది. విభజన చట్టంలో పేర్కొన్న హామీలే కాకుండా అందులో పేర్కొనబడని ప్రత్యేక హోదా హామీని కూడా నెరవేర్చినందుకు ప్రజలు మళ్ళీ తెదేపా-బీజేపీలకే పట్టం కట్టవచ్చును.   ప్రత్యేక హోదా మంజూరయినట్లయితే ఏమవుతుంది? అంటే జగన్మోహన్ రెడ్డి చెపుతున్నట్లుగానే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆ తరువాత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది. దాని వలన రాష్ట్రాభివృద్ధి వేగం పుంజుకొంటుంది. నిజానికి ఈ పనులన్నిటినీ కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలరనే ఉద్దేశ్యంతోనే ప్రజలు తెదేపాకు ఓటేసి ఆయనకు అధికారం కట్టబెట్టారు. ఒకవేళ ప్రత్యేక హోదా రాకపోయినట్లయితే ఈ పనులన్నీ పూర్తిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు మరింత శ్రమపడాల్సి ఉంటుంది. కనుక ప్రత్యేక హోదా వస్తే తన పని మరింత తేలికవుతుందనే ఆయన కూడా ఆశపడుతుండవచ్చును. కనుక ఆయనకు ప్రత్యేక హోదా రావడం ఇష్టం లేదనే జగన్మోహన్ రెడ్డి వాదన అర్ధరహితమే. ఒకవేళ ప్రత్యేక హోదా వస్తే టి.జి. వెంకటేష్ చెప్పినట్లు నష్టపోయేది కాంగ్రెస్, వైకాపాలేనని స్పష్టం అవుతోంది.   మరి ఈ సంగతి ఆ రెండు పార్టీలకు తెలియదా? అంటే తెలుసనే భావించాలి. అయితే ప్రత్యేక హోదా కోసం అవి ఎందుకు పోరాడుతున్నాయి అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని ఇంచుమించుగా తేల్చి చెప్పింది కనుకనేనని భావించాల్సి ఉంటుంది. అందుకే సాధ్యం కాని ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికెత్తుకొని ఆ రెండు పార్టీలు నిర్భయంగా పోరాడుతూ తద్వారా రాష్ట్రంలో ప్రజలను ఆకట్టుకొని తమ తమ పార్టీలను బలోపేతం చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాయని చెప్పవచ్చును. ఎలాగూ ప్రత్యేక హోదా రాదనే ధీమా ఉంది కనుక దాని కోసం పోరాడుతూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుని, కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీని రాజకీయంగా ఇరుకున పెట్టి దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాయి. ఒకవేళ మోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చినా తమ పోరాటాలకు తలొగ్గే ఇచ్చిందని చెప్పుకొనే వెసులుబాటు వాటికి ఉంటుంది.   ఎటువంటి అంశం చేప్పట్టినా కూడా దానికి సంబందించి నూటికి 95శాతం ‘హోం వర్క్’ పూర్తయ్యేవరకు బయటపెట్టే అలవాటులేని నరేంద్ర మోడీ, ఒకవేళ ప్రత్యేక హోదాపై చేస్తున్న కసరత్తు కూడా పూర్తవగానే సమయం చూసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేస్తున్నట్లు ప్రకటిస్తే, ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా రాదనే ధీమాతో పోరాటాలు చేస్తున్న ఆ రెండు పార్టీలు దెబ్బయిపోవడం ఖాయం.

జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి మళ్ళిస్తుంది ఎవరు?

  సార్వత్రిక ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాలలో, జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకొని పోవడంతో జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ బాధ వదిలిందనుకొన్నారు. కానీ నేటికీ కాంగ్రెస్ పార్టీ నక్షత్రకుడిలాగ జగన్ వెంటపడుతూనే ఉంది. అందుకు చాలా బలమయిన కారణం ఉంది.   ప్రజాభీష్టానికి విరుద్దంగా రాష్ట్ర విభజన చేసినందుకు ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన తరువాత నుండి రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి రాన్రాను చాలా దయనీయంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకోవడానికి ఎంతగా ప్రయాసపడుతున్నప్పటికీ దానిని ప్రజలు ఆదరించడం లేదు అసలు పట్టించుకోవడం లేదు. ఈమాట ఎవరో అనలేదు. మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. అగమ్యగోచరంగా తయారయిన పార్టీ పరిస్థితి చూసి ఇక విధిలేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పార్టీని వీడి వైకాపాలో చేరుతున్నట్లు అయన తెలిపారంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధమవుతోంది.   అందుకే ఈ విధిలేని పరిస్థితుల్లో పార్టీని మళ్ళీ బ్రతికించుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి వెంటపడుతోంది. ఆయన అంగీకరిస్తే ప్రత్యేక హోదా కోసం వైకాపాతో కలిసి కాంగ్రెస్ పార్టీ పోరాడేందుకు సిద్దంగా ఉందని రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ సింగ్, పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రకటించారు.   ప్రస్తుతం వైకాపాలో మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చాలా ముఖ్యనాయకుడిగా ఎదిగారు కనుక ఆయన కూడా జగన్మోహన్ రెడ్డిని అందుకు ఒప్పించే ప్రయత్నం చేయవచ్చును. జగన్మోహన్ రెడ్డి మనసు మార్చి మళ్ళీ అతనిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం కోసమే కాంగ్రెస్ అధిష్టానమే ఆయనని వైకాపాలోకి ప్రవేశపెట్టి ఉన్నా ఆశ్చర్యం లేదు. ఆయన వైకాపాలో చేరిన కొన్ని రోజులకే రాహుల్ గాంధీ అనంతపురం పర్యటన సందర్భంగా ప్రత్యేక హోదాపై పోరాటాలు చేయమని సూచించడం, వెంటనే జగన్ డిల్లీ వెళ్లి జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడం..ఆ తరువాత దాని కోసం ఆయన వరుసపెట్టి చేస్తున్న దీక్షలు, బందులు ధర్నాలు, అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి కాంగ్రెస్, వైకపాలు రెండూ బాయ్ కాట్ చేయడం, ఇప్పుడు జగన్ తో కలిసి పనిచేస్తామని కాంగ్రెస్ చెపుతుండటం అన్నీ నిశితంగా గమనించినట్లయితే కాంగ్రెస్, వైకాపాలు మళ్ళీ దగ్గరయ్యే ప్రయత్నాలు ముమ్మురమయినట్లు స్పష్టం అవుతోంది.   బహుశః వైకాపాలో ఉన్న (కాంగ్రెస్ ప్రతినిధి?) బొత్స సత్యనారాయణ ముందు పార్టీలో పట్టు సాధించి, జగన్మోహన్ రెడ్డికి చేరువయ్యి మెల్లగా ఇప్పుడు ఆయనని కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళించే ప్రయత్నాలు చేస్తున్నారేమో? బహుశః రెండు పార్టీలను మళ్ళీ కలిపేందుకు ‘ప్రత్యేక హోదా అంశం’ ఒక మంచి అవకాశంగా కాంగ్రెస్ ఉపయోగించుకోవాలనుకొంటున్నట్లుంది. తెదేపా-బీజేపీల స్నేహం మరింత బలపదేవిధంగా గట్టిగా కృషి చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటించడంతో ఇక బీజేపీతో పొత్తులు పెట్టుకోవాలనే జగన్ ఆశ అడియాస అయింది.   కనుక ఇదే అదునుగా ఆయనను తమ వైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ అధిష్టానం పావులు కదపడం మొదలుపెట్టినట్లుంది. కాంగ్రెస్ చేస్తున్న ప్రతిపాదనలకు జగన్మోహన్ రెడ్డి అంగీకరిస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వైకాపాను విలీనం చేసేసి, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడుగా జగన్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అందుకోవచ్చును. దానివలన రాష్ట్రంలో అధికార తెదేపాను మరింత బలంగా డ్డీ కొనేందుకు జగన్మోహన్ రెడ్డికి బలమయిన కాంగ్రెస్ క్యాడర్ అందదండలు దొరుకుతాయి. అలాగే జీవచ్చవంలా మారిన కాంగ్రెస్ పార్టీకి పునర్జన్మ దక్కుతుంది. అంటే జగన్ నిర్ణయం పైనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉందని భావించవచ్చును. మరి జగన్ ఏమంటారో..కాదంటే బొత్స ఆయనని ఒప్పించగలరో లేదో వేచి చూడాల్సిందే.

వైకాపాకు నిరాశ మిగిల్చిన అమరావతి కార్యక్రమం

  ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం చంద్రబాబు నాయుడుకి ఆయన ప్రభుత్వానికి మరింత పేరు ప్రతిష్టలు తెచ్చిపెడితే, వైకాపాకి పైకి కనబడని కంకు దెబ్బలని మిగిల్చిపోయిందని చెప్పవచ్చును. రాష్ట్రానికి చెందిన ఈ అతి ముఖ్యమయిన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ‘బాయ్ కాట్’ చేయాలనుకోవడం అన్నిటికంటే పెద్ద తప్పు. దానిని బాయ్ కాట్ చేసి జగన్ విమర్శలు మూటగట్టుకొంటే, దానికి హాజరయ్యి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంద్ర ప్రజల చేత జేజేలు పలికించుకొని వెళ్ళారు. పైగా అమరావతి శిలాఫలకంపై ఆయన పేరు కూడా శాస్వితంగా నిలిచిపోతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కూడా హాజరయి ఉండి ఉంటే ఆయన పేరు కూడా శిలాఫలకంలో చేర్చి ఉండేవారేమో? కనుక ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేసి చాలా పెద్ద తప్పు చేసారని చెప్పవచ్చును.   జగన్మోహన్ రెడ్డికి నిరాశ కలిగించే విషయం మరొకటి కూడా ఉంది. అదేమిటంటే ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో తెదేపా-బీజేపీల స్నేహం మరింత పటిష్టంగా కొనసాగించాలనే ఆకాంక్ష వెలిబుచ్చారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా, ప్యాకేజి గురించి ఆయన ఎటువంటి హామీ ఇవ్వకపోయినా రాజధాని నిర్మాణానికి, రాష్ట్రాభివృద్ధికి అన్నివిధాల సహాయసహకారాలు అందిస్తానని మోడీ విస్పష్టంగా చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ గురించి మాట్లాడకుండా నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రజలను ఎంతగా నిరాశపరిచారో, తెదేపాతో తమ స్నేహం కొనసాగుతుందని, చంద్రబాబు నాయుడుకి అన్నివిధాల అండగా ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అంతకంటే ఎక్కువగానే నిరాశపరిచారు.   ఏదో ఒకనాడు తెదేపా-బీజేపీల మధ్య చెడితే అప్పుడు బీజేపీతో జత కట్టాలని జగన్మోహన్ రెడ్డి ఇంతకాలంగా చాలా ఓపికగా ఎదురు చూశారు. కానీ మోడీ చెప్పిన మాటలు విన్న తరువాత ఇప్పుడప్పుడే వైకాపాకు అటువంటి అవకాశం కలగదని జగన్మోహన్ రెడ్డి గ్రహించి ఉండాలి. ఆయన మాటలలో ఆ నిరాశ నిస్పృహలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. చంద్రబాబు నాయుడు తన కేసుల నుండి బయటపడేందుకే మోడీని ప్రత్యేక హోదా గురించి గట్టిగా నిలదీయలేదని ఆరోపిస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించినట్లుగా ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించడానికి సాహసించడం లేదు. ఎందుకంటే సీబీఐ కేసుల భయంతోనేనని చెప్పవచ్చును.   జగన్మోహన్ రెడ్డి ఇంకా నిరాశ కలిగించే మరో విషయం ఏమిటంటే ఇంత కాలం బద్ధశత్రువులుగా ఉన్న చంద్రబాబు నాయుడు, కేసీఆర్ అకస్మాత్తుగా మిత్రులుగా మారిపోవడం. వారిరువురూ కలిసి పనిచేస్తూ రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ హితవు పలకడమే కాకుండా చివర్లో వారిరువురుతో కలిసి ప్రజలకు అభివాదం చేసారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు తనకు ఇచ్చిన అపూర్వమయిన గౌరవ మర్యాదలను చూసి కేసీఆర్ చాలా సంతోషించి ఉంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బహుశః అందుకే ఆయన తెలంగాణా విద్యుత్ సంస్థలలో నుండి తొలగించిన 1253 మంది ఆంధ్రా ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకొంటూ ఉత్తర్వులు జారీ చేసారు. ఒకవేళ ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య ఈ సఖ్యత ఇలాగే కొనసాగినట్లయితే తెలంగాణాలో కూడా వైకాపా ఒంటరిదయిపోతుంది. కనుక ప్రత్యామ్నాయంగా కనబడుతున్న కాంగ్రెస్ పార్టీతోనే మళ్ళీ చేతులు కలపడానికి జగన్మోహన్ రెడ్డి సిద్దపడతారేమో?   ఈ మొత్తం కార్యక్రమంలో వైకాపాకు కలిసివచ్చే అంశం ఒకే ఒక్కటి కనబడుతోంది. అదే... ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీపై ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి ప్రకటన చేయకపోవడం. దానిని పట్టుకొని ఆయన చంద్రబాబు నాయుడుతో తన పోరాటాలని యధాప్రకారం కొనసాగించుకోవచ్చును.

అమరావతి శంఖుస్థాపన ద్వారా ఆశించిన లక్ష్యాలు నెరవేరాయా?

  అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం ఎటువంటి అవాంతరాలు లేకుండా చాలా దిగ్విజయంగా ముగిసింది. అయితే అది ఏ మేరకు విజయవంతం అయింది, ఆశించిన ఫలితాలు సాధించగలిగిందా లేదా..అనే విశ్లేషణలు చాలా జోరుగా సాగుతున్నాయి. ఆ కార్యక్రమాన్ని అంత అట్టహాసంగా నిర్వహించడం వెనుక ప్రదానోదేశ్యం యావత్ ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించడమే. ఈ కార్యక్రమానికి అనేక దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు వచ్చేరు కనుక ఆయా దేశాలలో ఈ కార్యక్రమం గురించి బాగానే మీడియా కవరేజ్ లభించింది కనుక ఈ విషయంలో సఫలమయినట్లే చెప్పవచ్చును.   జపాన్, సింగపూర్ దేశాలు రెండూ రాజధాని నిర్మాణంలో పెట్టుబడులు పెట్టి పాలుపంచుకొనేందుకు సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేసాయి. ఈ కార్యక్రమం ద్వారా సాధించిన ప్రయోజనాల్లో అదీ చాలా ముఖ్యమయినదని చెప్పవచ్చును. అదీ సఫలమయిందని స్పష్టం అయ్యింది.   కేంద్రప్రభుత్వం పరిమితంగా నిధులు ఇస్తున్నప్పుడు ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం జరగాలంటే ఇటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోక తప్పదు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాజధానికి ఇంత “హైప్ క్రియేట్” చేసి యావత్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసారని భావించవచ్చును. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూసి ఇంకా ఇతర దేశాలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినట్లయితే, వాటిని కేవలం రాజధాని కోసమే కాకుండా యావత్ రాష్ట్ర అభివృద్ధి కోసం మరలించే అవకాశం కలుగుతుంది. ఈ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందనే విషయం రానున్న రోజుల్లో తెలుస్తుంది.   ఇక ఈ చారిత్రిక శుభకార్యాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిపించడం ద్వారా ఆయనను భావోద్వేగపరిచి ఆయన చేత రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ప్రకటింపజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నించారు కానీ మోడీ కూడా ఆయనపై అదే ఐడియా ప్రయోగించి తెలివిగా తప్పించుకొన్నారు. డిల్లీ నుంచి నీరు మట్టి తీసుకువచ్చి ఆయన చేతిలో పెట్టి, మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం కావ్యం నుంచి ‘నేను సైతం...’ అనే కవితని పలికి మోడీ చాలా తెలివిగా తప్పించుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదా, ప్యాకేజీ కోరుకొంటుంటే అయన ‘ఒట్టి మట్టి-నీళ్ళు’ ఇచ్చి వెళ్లిపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటికి సమాధానాలు, సంజాయిషీలు చెప్పుకొనే పని తెదేపా మెడకు చుట్టుకొందిపుడు.   మోడీ చేత రాజధానికి శంఖుస్థాపన చేయించడం వెనుక మరో బలమయిన కారణం కూడా ఉంది. తను శంఖుస్థాపన చేసిన రాజధాని నిర్మాణం వేగంగా పూర్తయ్యేందుకు ఆయన వ్యక్తిగతంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొనేలా చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచన కావచ్చును. సాక్షాత్ దేశ ప్రధాని అమరావతికి శంఖుస్థాపన చేసినందున రాజధాని నిర్మాణంలో పాలుపంచుకోదలచినవారికి భారత ప్రభుత్వం సహాయసహకారాలు లభిస్తాయని ప్రపంచ దేశాలకు తెలియజేసినట్లయింది.   ఇక ఈ కార్యక్రమం ద్వారా ఊహించని మరో మంచి పని కూడా జరిగింది. అదే...ఇంతకాలంగా కత్తులు దూసుకొంటున్న ఆంధ్రా, తెలంగాణా ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఏర్పడటం. ఇరువురు ముఖ్యమంత్రులు ఇంత సఖ్యతగా ఉండటం ఇదే మొదటిసారి. రాజధాని నిర్మాణం కోసం తెలంగాణా రాష్ట్రం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా భారీ ఆర్ధిక సహాయం ప్రకటించాలనుకొన్నట్లుగా తెలుస్తోంది. కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఏమి చెపుతారో చూసిన తరువాతనే తన మనసులో మాటని బయటపెట్టడం మంచిదనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ ఆఖరి నిమిషంలో వెనక్కి తగ్గారని సమాచారం. అదే నిజమయితే ఇది చాలా శుభపరిణామంగా చెప్పవచ్చును. ఇక నుండి రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకొన్నట్లయితే రెండు రాష్ట్రాలా ప్రజలు హర్షిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా, ప్యాకేజీలపై ఎటువంటి ప్రకటన చేయకపోవడం వలన ఆశాభంగం కలిగినప్పటికీ, ఈ కార్యక్రమం ద్వారా ఆశించిన, ఆశించని ఫలితాలు కూడా దక్కాయి కనుక ఈ శంఖుస్థాపన కార్యక్రమం నూటికి నూరు శాతం విజయవంతం అయినట్లే భావించవచ్చును.

ఆ ఒక్కటీ అడక్కు!

  ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపన జరగడం చాలా సంతోషం. ఆయన శంఖుస్థాపన కోసం పార్లమెంటు వద్ద నుండి పుట్టమన్ను, యమునా నది నుండి నీళ్ళు గుర్తుకు పెట్టుకొని తీసుకువచ్చినందుకు ఇంకా సంతోషం. అయితే రాష్ట్ర ప్రజలు ఆయన నుంచి ఆశిస్తున్నది రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజి. ఆ రెండు ముక్కలు ఆయన నోట వినాలని ప్రజలు ఆశ పడ్డారు. ఒకవేళ ఆయనకి ఆ విషయం గుర్తుందో లేదో...అనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో ఇదివరకు తిరుపతి వెంకన్న సాక్షిగా ఆయన ఇచ్చిన హామీని గుర్తు చేసారు. అయినప్పటికీ ఆ రెండింటి గురించి తప్ప మిగిలిన అన్ని విషయాల గురించి ఆయన చాలా అనర్గళంగా ప్రసంగించారు.   ప్రత్యేక హోదా రాదనే సంగతి ఇప్పటికే స్పష్టం అయింది కనుక ప్రజలు అందుకు నిరాశపడి ఉండకపోవచ్చును. బీహార్ రాష్ట్రానికి ఇస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీని ప్రకటిస్తారని ప్రజలు చాలా ఆశగా ఎదురుచూసారు కానీ ప్రధాని మోడీ ఆ ఊసే ఎత్తకపోవడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర నిరాశ చెందారు. రాజధాని నిర్మాణానికి, రాష్ట్రాభివృద్ధి అన్నివిధాలా సహాయ సహకారాలు అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు కానీ రాష్ట్రానికి ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించడానికి ఆయన ఎందుకు వెనుకాడుతున్నారో అర్ధం కావడం లేదు.   గత ప్రభుత్వం రాష్ట్రాలను చాలా చిన్న చూపు చూసేదని మోడీ ఆరోపించారు. నిజమే... కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాల పట్ల, ముఖ్యంగా తనను దశాబ్దాలుగా నెత్తిన పెట్టుకొని మోసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పట్ల చాలా చిన్న చూపు ఉండేది. అందుకు అది తగిన ఫలితం అనుభవిస్తోంది. అయితే బీహార్ రాష్ట్రానికి అడగకుండానే రూ.1.65 లక్షల కోట్లు మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు అందరూ ముక్త కంఠంతో రాష్ట్రానికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ, హోదా కావాలని ఎంతగా బ్రతిమాలుతున్నా ఎందుకు ఇవ్వడం లేదు? కనీసం వాటి గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆయన కూడా ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? అని ప్రజలు అడుగుతున్నారు.   కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని అభివృద్ధి చేయడానికి కృత నిశ్చయంతో ఉండి ఉండవచ్చును. అయితే ఇటువంటి విషయాలలో మౌనం వహించడం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలని, మనోభావాలని పట్టించుకోవడం లేదనే ఒక దురాభిప్రాయం ప్రజలలో ఏర్పడుతుంది. ప్రజలలో ఏర్పడిన ఈ అసంతృప్తిని కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేయడం తధ్యం. ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇవ్వకపోవడం వలన రాష్ట్రానికి నష్టం జరుగుతుందో లేదో తెలియదు కానీ ఒకవేళ రాష్ట్ర ప్రజలు ఆ రెండు పార్టీల వైపు ఆకర్షితులయితే దాని వలన తెదేపా, బీజేపీలకే ఎక్కువ నష్టం కలుగుతుంది. అప్పుడు వచ్చే ఎన్నికలలో మళ్ళీ ఎటువంటి వాగ్దానాలు చేసినా రాష్ట్ర ప్రజలు నమ్మకపోవచ్చును. అంటే అప్పుడు ప్రజలను మెప్పించి వారి ఓట్లు పొందడం ఇంకా కష్టం అవుతుందన్న మాట. అపార రాజకీయ అనుభవం ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ప్రధాని నరేంద్ర మోడీకి ఈవిషయం తెలియదనుకోలేము. అయినా ప్రజాభీష్టాన్ని, రాష్ట్రంలో ప్రతిపక్షాల ప్రయత్నాలని ఎందుకు పట్టించుకోవడం లేదో వారికే తెలియాలి.

రామోజీ ఫిలిం సిటీలో ఏమి జరుగుతోంది?

  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అకస్మాత్తుగా ఈనాడు మీడియా సంస్థల అధినేతకు ప్రాముఖ్యత పెరిగిపోయింది. ఆయనకు బద్ధ విరోధులు అనుకొన్న వాళ్ళు అందరూ వరుసగా ఆయన ఇంటి ముందు క్యూ కట్టి మరీ ఆయన దర్శనాలు చేసుకొంటున్నారు. తెరాస పార్టీ అధికారంలోకి వస్తే రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్లను పెట్టి దున్నించేసి చదును చేసేస్తానని శపధాలు చేసిన కేసీఆర్, ముఖ్యమంత్రి అయిన తరువాత స్వయంగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీ దర్శనం చేసుకొని వచ్చేరు. జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాలో రామోజీరావుకి వ్యతిరేకంగా పుంఖానుపుఖాలుగా ప్రచురింపబడిన కధనాలు, కార్టూన్ల గురించి అందరికీ తెలుసు. కానీ కొన్ని రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి కూడా అకస్మాత్తుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీ దర్శనం చేసుకొని వచ్చేరు.   ఆ తరువాత మొన్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావుకి అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించి వచ్చేరు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ వంతు వచ్చినట్లుందిపుడు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్, తెలంగాణా రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రామోజీ ఫిలిం సిటీకి నిన్న వెళ్లి రామోజీరావు దర్శనం చేసుకొని వచ్చేరు.   ఈ సమావేశాలలో కామన్ గా కనిపిస్తున్న వ్యక్తి రామోజీరావు అయితే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, దిగ్విజయ్ సింగ్ ముగ్గురూ చంద్రబాబు నాయుడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారే కావడం గమనార్హం. అంటే రామోజీరావు తెదేపా ప్రభుత్వానికి వ్యతిరేక శక్తులన్నిటినీ అనుసంధాన పరుస్తున్నారా...?అనే అనుమానం కలుగుతోంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడుని అధికారంలోకి వచ్చేందుకు రామోజీరావు ఈవిధంగానే చాలా మందిని అనుసంధానం చేశారని గుర్తుకు తెచ్చుకొంటే ఈ అనుమానం నిజమేననిపిస్తుంది.   మరో ఆసక్తికర పరిణామం ఏమిటంటే రాష్ట్రంలో కాంగ్రెస్, వైకాపాలు మళ్ళీ దగ్గరవుతున్న సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయిప్పుడు. రాహుల్ గాంధీ సూచన మేరకు జగన్ ప్రత్యేక హోదాపై పోరాటాలు మొదలుపెట్టడం, దాని కోసం జగన్ నిరాహార దీక్ష చేస్తే ఆయనకి దిగ్విజయ్ సింగ్ మద్దతు ప్రకటించడం, వైకాపాతో కలిసి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక పోరాటాలు చేయడానికి సిద్దమని ఆయన ప్రకటించడం, అమరాతి శంఖుస్థాపన కార్యక్రమాన్ని జగన్ ‘బాయ్ కాట్’ చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత కాంగ్రెస్ పార్టీ కూడా బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించడం వంటివన్నీ అందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చును.   జగన్ నిరాహార దీక్షకు కూర్చొనే ముందు రామోజీరావుతో తనకున్న శత్రుత్వాన్ని పక్కనబెట్టి రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీ దర్శనం చేసుకొని వచ్చేరు. ఆయన దీక్షకి, పోరాతలకి మద్దతు ఇస్తున్నామని ప్రకటించిన దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు ఫిలిం సిటీకి వెళ్లి రామోజీని కలవడం చూస్తుంటే రామోజీ ఫిలిం సిటీలో మామూలు సినిమాలే కాకుండా ఏదో సరికొత్త రాజకీయ సినిమాకి స్క్రీన్ ప్లే సిద్దం అవుతున్నట్లు అనుమానం కలుగుతోంది. అదే నిజమయితే ఈ కొత్త సినిమా 2018ఎన్నికలకి సిద్దం అవుతుందేమో.. లేకపోతే జగన్ జోశ్యం చెపుతున్నట్లుగా ఇంకా ముందే రిలీజ్ అవుతుందేమో?

అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి శరవేగంగా ఏర్పాట్లు

  ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. నిజానికి ఈరోజు నిన్న సాయంత్రానికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసి శంఖుస్థాపన కార్యక్రమం జరిగే ప్రాంతాన్ని ప్రధాని భద్రతా సిబ్బందికి అప్పగించవలసి ఉంది. కానీ కొన్ని పనులు ఇంకా పూర్తవకపోవడంతో అప్పగించలేకపోయారు. ఇవ్వాళ్ళ సాయంత్రానికల్లా అన్ని పనులు పూర్తయిపోతాయని అధికారులు తెలిపారు.   రాజధాని నిర్మాణం నిర్విఘ్నంగా పూర్తవ్వాలని కోరుతూ శంఖుస్థాపనకు ముందు హోమం చేస్తారు. దాని కోసం తెలుగుదనం ఉట్టిపడేలా ఒక యాగశాలను నిర్మిస్తున్నారు. శంఖుస్థాపన జరిగే ప్రదేశం పక్కనే శిలాఫలకం, దాని ఎదురుగా యాగశాల, దాని చుట్టూ వేదికలు నిర్మిస్తున్నారు. ప్రధాన వేదికకు ఇరు వైపులా మరో రెండు వేదికలు నిర్మిస్తున్నారు. వాటిల్లో దేశ విదేశాల నుంచి వచ్చే వి.వి.ఐ.పి. మరియు వి.ఐ.పి.లు కూర్చోంటారు. ఆ పక్కనే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల కోసం మరో వేదిక నిర్మిస్తున్నారు. ప్రధాన వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ, సింగపూర్, జపాన్ ప్రధానమంత్రులు, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికొందరు కేంద్రమంత్రులు మాత్రమే కూర్చోంటారు.   ఈ కార్యక్రమానికి మొత్తం 12 దేశాల నుంచి రాయబారులు, పారిశ్రామికవేత్తలు వస్తున్నట్లు సమాచారం. దేశ విదేశాల నుంచి గన్నవరం విమానాశ్రయంలో దిగే ఆ ప్రత్యేక అతిధులను హెలికాఫ్టర్స్ లో శంఖుస్థాపన జరిగే ప్రాంతానికి తీసుకువస్తారు. ప్రత్యేక అతిధుల కోసం ప్రత్యేక భద్రతా సిబ్బంది, హెలికాఫ్టర్లు, ఎస్కార్ట్స్ వాహనాలు, విశ్రాంతి మందిరాలు అన్నీ సిద్దం చేస్తున్నారు. శంఖుస్థాపన జరిగే ప్రదేశానికి కొద్ది దూరంలోనే వేదికల వెనుక భాగాన్న రెండు హెలీ ప్యాడ్స్ నిర్మిస్తున్నారు. రోడ్డుమార్గం గుండా వచ్చే రాజకీయ నేతలు, ప్రముఖులు కోసం శంఖుస్థాపన జరిగే ప్రాంతం వరకు కొత్తగా రోడ్లు నిర్మించారు. ఆ ప్రాంతానికి సమీపంలోనే వేర్వేరు ప్రాంతాలలో వారి వాహనాలు పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేసారు. ప్రధానితో సహా ప్రముఖులు అందరికీ భద్రత కల్పించేందుకు ప్రత్యేకంగా వెయ్యి మంది మెరికల్లాంటి పోలీసులను ఎంపిక చేసి సిద్దంగా ఉంచారు. రేపు ఎస్కార్ట్ సిబ్బంది గన్నవరం విమానాశ్రయం నుండి వేదిక వరకు ట్రయల్ రన్స్ నిర్వహిస్తారు.   ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి కనీసం లక్షమందికి పైగా ప్రజలు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 12.45 గంటలకి ప్రధాని శంఖుస్థాపన చేస్తారు. కానీ ఉదయం నుండే భారిగా జనాలు తరలి రావడం మొదలుపెడతారు కనుక వారి కోసం నీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, అరటిపండ్లు ప్యాక్డ్ ఆహారం వగైరా అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. వారిని అలరించేందుకు సుమారు మూడు గంటల పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. డైలాగ్ కింగ్ గా పేరు పొందిన ప్రముఖ నటుడు సాయి కుమార్ మరియు గాయని సునీత ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించబోతున్నారు. ప్రముఖ డ్రమ్ మాష్టర్ శివమణి కూడా ఈ సందర్భంగా తన డ్రమ్ బీట్స్ తో ప్రజలను అలరించబోతున్నారు.   ఈ శంఖుస్థాపన కార్యక్రమంలో రాజకీయ నేతల ప్రసంగాలు చాలా క్లుప్తంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వారాల జల్లు కురిపించే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో విచిత్ర వాతావరణం

  ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి సమయం దగ్గరపడుతుండటంతో ఏర్పాట్లన్నీ చాలా చాలా వేగంగా చేస్తున్నారు. శంఖుస్థాపన జరిగే ప్రదేశంలో యాగం చేయడానికి యాగశాల నిర్మాణం, వి.వి.ఐ.పీ.ల కోసం వేర్వేరుగా వేదికల నిర్మాణం, వాటి సమీపంలో హెలీ ప్యాడ్ల నిర్మాణం, సామాన్య ప్రజలు, రైతులు, రాజకీయ నాయకులు, వేదికలు గ్యాలరీలు నిర్మాణం వంటి పనులు దాదాపు పూర్తయిపోయాయి. ఒకవైపు అక్కడ ఆ ఏర్పాట్లు చకచకా జరుగుతుంటే, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరికీ ఆహ్వానపత్రాలు ఇస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, దేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయపార్టీల నేతలను, సినీ, పారిశ్రామిక, వ్యాపార మరియు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించడం పూర్తయింది. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస మంత్రులు, నేతలు, తెలంగాణాలో మజ్లీస్, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల నేతలను ఆహ్వానించడం పూర్తయింది. వారిలో ఒక్క సీపీఎం పార్టీ నేతలు తప్ప మిగిలినవారు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతామని తెలిపారు.   ఈ శంఖుస్థాపన కార్యక్రమం కోసం ప్రభుత్వం అన్ని గ్రామాల నుంచి మట్టి నీరు సేకరించే కార్యక్రమం కూడా పెట్టుకోవడంతో అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు అదే పనిమీద దృష్టి పెట్టడంతో అన్ని జిల్లాలలో సమస్యలు పేరుకుపోతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దసరా పండుగ దగ్గర పడుతున్న సమయంలో కందిపప్పు ధర రూ.200 దాటేయడం, ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం మిగిలిన పప్పొప్పులు, కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయని, అయినా ఎవరూ పట్టించుకొనేవారే లేరని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారులు అందరూ ఇదే పని మీద ఉండటంతో రాష్ట్రంలో పరిపాలన దాదాపు స్తంభించిపోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే వివిధ శాఖలకు చెందిన సుమారు 19,000 ఫైళ్ళు పేరుకుపోయాయని సమాచారం.   ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి ముమ్ముర ప్రయత్నాలు సాగిస్తుంటే, మరో పక్క రాయలసీమకు చెందిన కొందరు నేతలు, రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రాంతాన్ని పట్టించు కోకుండా అభివృద్ధి మొత్తం కృష్ణా, గుంటూరు జిల్లాలలోనే కేంద్రీకరిస్తున్నందుకు నిరసనగా ఈ శంఖుస్థాపన కార్యక్రమాన్ని బహిష్కరించే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. తెదేపా నేత టీజీ. వెంకటేష్ కూడా వారికి నేతృత్వం వహిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.   రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ పోరాడుతున్న సీపీఐ కర్నూలు నుండి అమరావతికి 22వ తేదీకి చేరుకొనే విధంగా ఒక నిరసన ర్యాలీ చేప్పట్టబోతున్నట్లు సమాచారం. వైకాపా కూడా 21వరకు రకరకాలుగా నిరసన కార్యక్రమాలు చేయాలనుకొంటున్నప్పటికీ ప్రస్తుతం ప్రజలందరి దృష్టి అమరావతి, దసరా పండుగపైనే ఉండటంతో ప్రజల నుండి ఆశించినంతగా స్పందన కనబడకపోవడంతో చాలా నిరాశ చెందుతోంది.   రాష్ట్రంలో ఒకవైపు ఈ శంఖు స్థాపన హడావుడి, దసరా పండుగ హడావుడి, అదే సమయంలో ప్రతిపక్షాల నిరసనలు, ధరలు పెరిగిపోతున్నందుకు సామాన్య ప్రజల రుసరుసలు...ఇలాగ పరస్పర విరుద్దమయిన పరిణామాలు, ప్రయత్నాలు, హడావుడి అన్నిటినీ చూస్తుంటే రాష్ట్రంలో ఇంతకు ముందు ఎన్నడూ కనీవినీ ఎరుగని ఒక విచిత్రమయిన వాతావరణం నెలకొన్నట్లు అనిపిస్తోంది. బహుశః అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం తరువాత మళ్ళీ క్రమంగా పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని భావించవచ్చును.

జగన్ చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నారా?

  ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం నాయకుడు జగన్మోహన్ రెడ్డి రానని చెప్పడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన చంటిపిల్లాడిలాగ వ్యవహరిస్తూ తనకీ, తన పార్టీకి కూడా ప్రజలలో దురాభిప్రాయం ఏర్పడేలా చేస్తున్నారని ప్రజలే అనుకొంటున్నారు. రాజకీయాలలో ఉన్నవారు ఎంతో బ్యాలన్స్ గా ఉండాలి. ప్రతీ దానికి వెంటనే ఆవేశంగా స్పందించడం, దుందుడుకు నిర్ణయాలు తీసుకోవడం అసలే తగదు. అటువంటివాళ్ళు ప్రజల నోళ్ళలో, మీడియాలో బాగానే నానుతారు కానీ రాజకీయాలలో మాత్రం ఎన్నడూ రాణించలేరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు మాజీ మంత్రి శంకర్ రావు వంటివాళ్ళు అనేకమంది సజీవ సాక్ష్యాలుగా కళ్ళముందే ఉన్నారు.   ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని జగన్మోహన్ రెడ్డి చాల విపరీతంగా ద్వేషిస్తున్నారు కనుక ఆయన, ప్రభుత్వం ఏమి చేసినా దానిని వ్యతిరేకించడమే “వైకాపా పాలసీ”గా మార్చుకొని ముందుకు సాగుతున్నట్లు స్పష్టంగానే కనబడుతోంది. ఆ కారణంగా  ఆయన చేస్తున్న పోరాటాలు ఎన్నడూ విజయవంతం కాలేకపోతున్నాయని చెప్పవచ్చును. ఆయన ప్రజల తరపున నిలబడి పోరాడుతున్నప్పటికీ వారి మద్దతు పొందలేకపోతున్నారు. ఆ విషయం ఆయన ఇంతవరకు గ్రహించక పోవడం విచిత్రమే.    రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చి రాష్ట్రాభివృద్ధి జరిగి యువతకు ఉపాధి దొరకాలంటే తప్పకుండా ప్రత్యేక హోదా కావలసిందేనని వాదిస్తూ నిరాహార దీక్ష చేసారు. ఆయన నిజంగానే ప్రత్యేక హోదా కోసమే నిరాహార దీక్షకు కూర్చొని ఉండి ఉంటే రాష్ట్ర ప్రజలు అందరూ ఆయనకి తప్పకుండా మద్దతు పలికేవారు. కానీ రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడేందుకు మరే ఇతర సమస్య కనబడకపోవడంతో ఈ సమస్యని అందుకొని దీక్షకి కూర్చొన్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎలాగూ రాష్ట్ర ప్రభుత్వం దానిపై హామీ ఇచ్చే పరిస్థితి ఉండదు కనుకనే దానిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలనే ఏకైక ఉద్దేశ్యంతోనే ఆయన దీక్ష చేసారని చెప్పవచ్చును. అందుకే తన దీక్షలో చంద్రబాబు నాయుడుని ఆయన ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తూ యుద్ధం చేసారు తప్ప ప్రత్యేక హోదా ఏవిధంగా సాధించుకోవాలని ఆలోచనలు చేయలేదు.   అమరావతి శంఖుస్థాపనకి సమయం దగ్గర పడుతుండటంతో ప్రభుత్వం ముమ్మురంగా అందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో రాష్ట్ర ప్రజల దృష్టి వాటిపైకి మళ్లడంతో జగన్ దీక్షకు ఆశించినంతగా స్పందన రాకపోవడం, చివరికి తమ దీక్షను పోలీసులచేత భగ్నం చేయించమని ప్రాధేయపడవలసిన పరిస్థితులు ఎదురవడంతో జగన్ అండ్ కో చంద్రబాబు నాయుడుపై, ఆయన ప్రభుత్వంపై చాలా పగతో రగిలిపోవడం సహజం. బహుశః అందుకే ముందు వెనుకా ఆలోచించకుండా శంఖుస్థాపన కార్యక్రమానికి పిలిచినా రానని జగన్ ప్రకటించేశారు. అయితే తన కోడి కూయకపోతే లోకానికి తెల్లారదని వెనకటికి ఎవరో అనుకొన్నట్లే, తను వెళ్ళకపోతే శంఖుస్థాపన కార్యక్రమానికి జరగదనే భ్రమలో జగన్ ఉన్నట్లున్నారు. కానీ రాష్ట్రానికి చెందిన ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా ప్రజలకి తన గురించి ఎటువంటి అభిప్రాయం కలిగిస్తున్నారో గ్రహించడం లేదు. ఇటువంటి దుందుడుకు వ్యక్తికి  రాష్ట్రాన్ని అప్పగిస్తే ఏమవుతుందో..అనే ఆలోచన ప్రజలలో ఆయనే స్వయంగా రేకెత్తించగలిగారు. ప్రజలు తాము చంద్రబాబు నాయుడిని ఎన్నుకొని పొరపాటు చేయలేదని గ్రహించేలా జగన్ చేసారు.   జగన్మోహన్ రెడ్డి ఆ ప్రకటన చేసిన 24 గంటల వరకు వైకాపా నేతలు ఎవ్వరూ మీడియా ముందుకు వచ్చి తమ అధినేతను సమర్ధిస్తూ మాట్లాడకపోవడం గమనించినట్లయితే ఆయన తన నిర్ణయం ప్రకటించే ముందు తన పార్టీలో సీనియర్ నేతలెవ్వరినీ సంప్రదించలేదని స్పష్టం అవుతోంది. పార్టీ అంటే కేవలం తనే అనే అభిప్రాయం ఉన్నవాళ్ళే ఈవిధంగా వ్యహరిస్తుంటారు. అటువంటివాళ్ళు ఇంకా చాల మందే ఉన్నారు. కానీ వాళ్ళ చేతిలో అధికారం ఉంది కనుక ఏమి మాట్లాడినా ఏమి చేసినా చెల్లుతుంది. కానీ ప్రతిపక్షంలో కూర్చొని పార్టీకి ఈవిధంగా శల్య సారధ్యం చేస్తుంటే చివరికి ఆయన నడుపుతున్న వైకాపా రధం ఎన్నికల యుద్దరంగం చేరేనాటికి అందులో ఎవరూ ఉండకపోవచ్చును. అందరూ అవతలవైపు నిలబడి ఆయనతోనే యుద్ధం చేయడానికి నిలబడి ఉండే అవకాశం ఉంటుంది.

జగన్ కూర్చొన్న కొమ్మనే నరుకొంటున్నారా?

  సినిమాలలో హీరోలని డేరింగ్ అండ్ డాషింగ్ గా చూపిస్తారు. అప్పుడే సినిమాలు హిట్ అవుతుంటాయి. కానీ నిజ జీవితంలో అందునా రాజకీయాలలో ఆ దూకుడు మరీ ఎక్కువయితే మొదటికే మోసం వస్తుంది.   జగన్మోహన్ రెడ్డికి ఆ దూకుడు అవసరమయిన దానికంటే చాలా ఎక్కువని మళ్ళీ ఇవ్వాళ్ళ మరొకమారు నిరూపించారు. రాజధాని శంఖుస్థాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించవద్దని, ఆహ్వానించినా తను రానని కుండబద్దలు కొట్టినట్లు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇవ్వాళ ఆయన ఒక బహిరంగ లేఖ వ్రాసారు. అంటే అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసినట్లే రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమయిన కార్యక్రమాన్ని కూడా ఆయన బాయ్ కాట్ చేస్తున్నారన్నమాట. అందుకు ఆయన ఎనిమిది కారణాలు పేర్కొని, ప్రభుత్వానికి తన నిరసన తెలియజేసేందుకే ఈ కార్యక్రమానికి హాజరు కాదలచుకోలేదని తెలిపారు.   ఓటుకి నోటు-ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఆంద్రప్రదేశ్-తెలంగాణా ప్రభుత్వాలు రెండూ దాదాపు ప్రత్యక్ష యుద్దానికి దిగిన విషయాన్ని కూడా పక్కనబెట్టి చంద్రబాబు నాయుడు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని స్వయంగా ఆహ్వానిస్తానని చెపితే అందరూ హర్షించారు. ఆయన ఆహ్వానిస్తే తప్పకుండా హాజరవుతామని కేసీఆర్ కుమారుడు కేటీఆర్ చెప్పినప్పుడు కూడా ఇరు రాష్ట్రాల ప్రజలు చాలా హర్షించారు. తెదేపాను, చంద్రబాబు నాయుడును, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బద్ద శత్రువులుగా భావిస్తున్న తెరాస మంత్రులు సంప్రదాయం పాటిస్తూ ఈ కార్యక్రమానికి హాజరవుతుంటే రాష్ట్రానికే చెందిన జగన్మోహన్ రెడ్డి దానిని బాయ్ కాట్ చేయాలనుకోవడం చాలా విస్మయం కలిగిస్తుంది. దేశ విదేశాల నుండి ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎందరో ప్రముకులు తరలి వస్తుంటే, రాష్ట్రంలో క్యాబినెట్ హోదా గల ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏవో కారణాలు చూపిస్తూ ఈ కార్యక్రమానికి బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే రాజధాని నిర్మాణం జరగడం తనకి ఏమాత్రం ఇష్టం లేదని లిఖితపూర్వకంగా ప్రకటించుకొన్నట్లయింది.   సారవంతమయిన పంట భూముల మీద రాజధాని నిర్మించడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. కానీ రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సర్దిచెప్పుకొని రాజధాని నిర్మాణం వేగంగా జరగాలని కోరుకొంటున్నారు ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి రేపు అదే రాజధానిలో అడుగుపెట్టకుండా ఉండగలరా? తన పార్టీ ప్రధాన కార్యాలయం, కంపెనీలు, వ్యాపార సంస్థల కార్యాలయాలు అన్నిటినీ అక్కడే ఏర్పాటు చేసుకోకుండా ఉండగలరా? అంటే ఉండలేరనే చెప్పవచ్చును. మరి అప్పుడు ఏ మొహం పెట్టుకొని రాజధానిలో తనకు స్థలం కావాలని అడగగలరు?   ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి చెపుతున్న కారణాలు సహేతుకంగానే ఉండవచ్చును. కానీ అసలు కారణం మాత్రం ఆయన చంద్రబాబు నాయుడుని చాలా ద్వేషిస్తున్నందునే ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని చెప్పవచ్చును. జగన్ కంటే కేసీఆర్ తదితర తెరాస నేతలు చంద్రబాబు నాయుడుని ఇంకా ఎక్కువగానే ద్వేషిస్తున్నారు. కానీ సంప్రదాయాన్ని, ఈ కార్యక్రమ విశిష్టతని దృష్టిలో పెట్టుకొని ఈ చారిత్రిక శుభ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతామని తెలిపి అందరి మన్ననలు పొందారు. జగన్ తన ధర్నాలు, దీక్షలతో రాష్ట్ర ప్రజలను ఆకట్టుకొని అధికారంలోకి రావాలని తహతహలాడుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన చేసిన ఒకే ఒక్క ప్రకటనతో రాష్ట్ర ప్రజలలో వ్యతిరేకత మూటగట్టుకొన్నారు. అతను ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికే చెందినవాడయినా రాష్ట్రానికి వ్యతిరేకి అనే ముద్ర వేసుకొన్నారు. ఇటువంటి దుందుడుకు, అనాలోచిత నిర్ణయాల వలన ఇంతవరకు చాలాసార్లు భంగపడ్డారు. అయినా జగన్ తన తీరు మార్చుకోకుండా ముందుకు సాగుతూ రాష్ట్రానికి, తన పార్టీకి కూడా సమస్యలు సృష్టిస్తున్నారు.

బెడిసికొడుతున్న జగన్ వ్యూహాలు

  ప్రత్యేక హోదా కోసం అంటూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన దీక్షతో ఏమి సాధించారు...అంటే రాష్ట్రంలో తన పార్టీ శ్రేణులను ఉత్తేజపరచగలిగారని చెప్పుకోవచ్చును. ఆయన ఈ దీక్ష ద్వారా మరో ప్రయోజనం కూడా ఆశించి ఉండవచ్చును. తెదేపా-బీజేపీల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో తనకున్న ప్రజాధారణను నరేంద్ర మోడికి ప్రదర్శించడం ద్వారా బీజేపీకి దగ్గరవ్వాలనే ఆలోచన ఇందులో ఇమిడి ఉండవచ్చుననిపిస్తోంది.   జగన్ తో సహా దీక్షా వేదిక నుండి మాట్లాడినవారందరూ మోడీ ప్రభుత్వంలో తెదేపాకు చెందిన ఇద్దరు కేంద్రమంత్రుల రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం, అదే సమయంలో జగన్ దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా శ్రేణులు ధర్నాలు, ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలు చేపట్టడం గమనిస్తే జగన్ అదే వ్యూహం అమలుచేస్తున్నారేమో? ఆ వ్యూహానికి కొనసాగింపుగానే అక్టోబర్ 21 వరకు పార్టీ శ్రేణులతో రకరకాల నిరసన కార్యక్రమాలు కొనసాగించిన తరువాత, రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడి వచ్చినప్పుడు ఆయనను కలిసి తన దీక్ష గురించి, దానికి వచ్చిన ప్రజాస్పందన గురించి తెలియజేసేందుకే ప్రధాని అపాయింట్ మెంట్ కోరుతున్నరనుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రధాని దృష్టిని ఆకర్షించి, బీజేపీకి దగ్గరయ్యేందుకే జగన్ ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది.   ఒకవేళ ప్రధాని నరేంద్ర మోడీ తమ పార్టీ రాష్ట్రంలో తెదేపాతో తెగతెంపులు చేసుకొని వైకాపాతో చేతులు కలిపేందుకు సిద్దపడితే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం తన పోరాటం కొనసాగిస్తారా? అనే సందేహం కలుగుతుంది. జగన్ ఉద్దేశ్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఏదోవిధంగా అధికారంలో నుండి దింపి తను ముఖ్యమంత్రి అవడమే తప్ప ప్రత్యేక హోదా కోసం కేంద్రప్రభుత్వంతో యుద్ధం చేయడం కాదు. అందుకే తన ఆరు రోజుల దీక్షలో కేంద్రప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేయలేదు.   కానీ ప్రత్యేక హోదా విషయంలో చాలా ఇబ్బందిపడుతున్న కేంద్రప్రభుత్వాన్ని తన దీక్షలు, ర్యాలీలు, ధర్నాలతో ఇంకా ఇబ్బంది పెడుతున్న జగన్మోహన్ రెడ్డిని ప్రధాని నరేంద్ర మోడీ ఆదరించవలసిన అవసరం ఏమిటి? అని ఆలోచిస్తే జగన్ వ్యూహం ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్ధం అవుతుంది. మరో విధంగా చెప్పాలంటే తెదేపాతో తెగతెంపులు చేసుకొని తమ పార్టీతో చేతులు కలపకపోతే కేంద్రానికి, రాష్ట్రంలో బీజేపీకి తన ప్రత్యేక దీక్షలతో ఇబ్బంది కలిగిస్తూనే ఉంటానని జగన్ హెచ్చరిస్తున్నట్లుంది.   జగన్ ఇటువంటి ఆలోచనలతో, వ్యూహాలతో ముందుకు సాగడం వలన ఆయన విశ్వసనీయత ఇంకా ప్రశ్నార్ధకం అవుతుంది. బీజేపీని తనవైపు తిప్పుకొనే ప్రయత్నంలో దానితో జగన్ ఈ విధంగా చెలగాటమాడితే చివరికి ఆయనే నష్టపోవచ్చును. అప్పుడు జగన్ ఇమేజ్ పైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్న వైకాపా కూడా తీవ్రంగా నష్టపోవచ్చును. తమ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుందని గ్రహిస్తే రాజకీయ నేతలు ఏమి చేస్తారో తెలుసుకొనేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మన కళ్ళ ముందే సజీవ సాక్ష్యంగా నిలిచి ఉంది. జగన్ ప్రత్యేక హోదా కోసమే పోరాడుతున్నారో లేదో తెలియదు కానీ తన అసంబద్ద, అనాలోచిత వ్యూహాలతో చివరికి తన పార్టీకి కూడా అటువంటి పరిస్థితి ఎదురవకుండా జాగ్రత్త పడితే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాజధాని శంఖుస్థాపనకి ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నట్లు?

    ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఇవ్వాళ్ళ డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి రాజ్ నాద్ సింగ్, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి వారికి అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించబోతున్నారు. ఇప్పటికే ఒకసారి వారిని ఆహ్వానించినప్పటికీ ఇవ్వాళ్ళ వారికి ఆహ్వాన పత్రికలు అందించి మరోసారి ఆహ్వానించబోతున్నారు. అయితే రాజధాని నిర్మాణానికి భూమిపూజ చేసిన చంద్రబాబు నాయుడు, శంఖుస్థాపన కార్యక్రమాన్ని కూడా తనే స్వయంగా చేసుకొనే అవకాశం ఉన్నపటికీ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిపించాలనుకోవడం ఆయన దూరదృష్టికి అద్దం పడుతోంది. పైకి ఇది చాలా మామూలు విషయంగానే కనబడుతునప్పటికీ అందుకు చాలా కారణాలు కనబడుతున్నాయి.   గత ఏడాది ఎన్నికల ప్రచార సమయంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే డిల్లీ కంటే గొప్ప రాజధాని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తానని నరేంద్ర మోడి హామీ ఇచ్చారు. ఆ సమయంలో ఆయన ఇంకా చాలా హామీలు ఇచ్చారు. ఇప్పుడు రాజధానికి ఆయన చేతే శంఖుస్థాపన చేయించడం ద్వారా అది వేగంగా నిర్మాణం జరిపించే బాధ్యతని ఆయనకే అప్పగిస్తున్నట్లవుతుంది. ప్రదాని స్వయంగా శంఖుస్థాపన చేసిన ఒక ప్రాజెక్టుకి కేంద్రప్రభుత్వంలో ఏ శాఖలు అవరోధాలు సృష్టించే సాహసం చేయలేవు.   ఎన్నికల ప్రచార సమయంలో నరేంద్ర మోడి ఇచ్చిన అనేక హామీలలో ప్రత్యేక హోదా కూడా ఒకటి. కానీ అదిప్పుడు ఇచ్చే పరిస్థితిలో లేదు. రాష్ట్రంలో దాని కోసం జగన్ వంటివారు దీక్షలు చేస్తూ ఉద్యమాన్ని రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ అందుకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రానికి ఇస్తామని చెపుతున్న ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉందని తెదేపా వర్గాలు చెపుతున్నాయి.   సింగపూర్, జపాన్ దేశాల ప్రధానులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఆ రెండు దేశాల సంస్థలు రాజధాని నిర్మాణ కార్యక్రమం చేపట్టబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా అమరావతికి శంఖుస్థాపన చేయడం వలన, రాజధాని నిర్మాణానికి కేంద్రప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తోందనే సంకేతం, దానికి కేంద్ర సహకారం ఉంటుందనే విషయం వారిరువురికి తెలియజేసినట్లవుతుంది. కనుక వారు కూడా సంకోచించకుండా రాజధాని నిర్మాణం కోసం భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావచ్చును.   ఏదయినా ఒక వస్తువును అమ్ముకోవాలంటే దానిని అందంగా, గొప్పగా ప్రెజంట్ చేయడం అవసరం. ఆవిధంగానే అమరావతికి కూడా మొదటి నుండే ఒక ప్రత్యేక గుర్తింపు, బ్రాండ్ ఇమేజ్ సృష్టించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నట్లు కనబడుతోంది. భారత్, సింగపూర్, జపాన్ దేశ ప్రధానులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పేరుమోసిన పారిశ్రామికవేత్తలు హాజరవుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రపంచ దేశాలన్నీ వీక్షిస్తాయి. అందుకే ఈ కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా నిర్వహించాలని చంద్రబాబు నాయుడు సంకల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా యావత్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకట్టుకోగలిగితే తద్వారా రాష్ట్రానికి దేశ విదేశాల నుండి భారీ పెట్టుబడులు ఆకర్షించాలని చంద్రబాబు నాయుడు ఆలోచన కావచ్చును.   రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ, ముఖ్యంగా స్థానిక రైతులని కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనేలా చేయడం ద్వారా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా రాజధాని నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకించడం లేదనే సంకేతం కేంద్రానికి ఇవ్వడమే కాక రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రజల బలమయిన ఆకాంక్షని కూడా ప్రధాని మోడీకి తెలియజేసినట్లవుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు ఇంత హడావుడి చేస్తున్నారని భావించవచ్చును. దాని ఫలితాలు ఏవిధంగా ఉంటాయో మున్ముందు తెలుస్తాయి.