ఏపీలో బీజేపీ బలపడేందుకు అవరోధాలు ఏమిటి?

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నేతలు ఇవ్వాళ్ళ విజయవాడలో సమావేశమయ్యి మండల, జిల్లా స్థాయి పార్టీ అధ్యక్షుల నియామకాలపై చర్చించబోతున్నారు. ఈ సమావేశంలో వారు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిని సమీక్షించి, పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టవలసిన చర్యల గురించి చర్చించని సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడు కె. హరిబాబు పదవీ కాలం ముగుస్తుండటంతో ఆయన స్థానంలో మరొకరిని ఎంపిక చేసే విషయం గురించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని ఆశిస్తోంది. అయితే దానికి రాష్ట్రంలో కొంత ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. అందుకు కారణాలు అందరికీ తెలిసినవే.   వాటిలో ప్రధానంగా ఆర్ధిక లోటును భర్తీ చేస్తూ నిధుల విడుదల, ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ, ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ-చెన్నై నగరాల మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు వంటి వాటిపై మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం వలన ప్రజలలో చాలా అసంతృప్తి నెలకొని ఉంది. బిహార్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకి అడగకపోయినా భారీ ఆర్ధిక ప్యాకేజీలను ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడి, మిత్రపక్షంగా, భాగస్వామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవన్నీ కేంద్రం పరిధిలో ఉన్న అంశాలు కనుక దానికి రాష్ట్ర బీజేపీ నేతలు సంతృప్తికరమయిన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆ కారణంగానే రాష్ట్రంలో బీజేపీని బలపరుచుకోవడం కష్టమవుతోందని భావించవచ్చును. బీజేపీ చేపట్టిన సభ్యత్వ నమోదు ప్రక్రియకు ప్రజల నుండి ఆశించినంతగా స్పందన రాకపోవడం గమనిస్తే అది అర్ధమవుతుంది.   బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడిలలో కనిపించే పోరాట స్ఫూర్తి, పార్టీని బలపరుచుకోవాలనే తపన, పట్టుదల రాష్ట్ర నేతలలో లోపించడం కూడా పార్టీ ఎదుగుదలకు ప్రధాన అవరోధంగా కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపరుతున్నారు. రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకొని పార్టీ బలపరుచుకోవాలంటే, తాము భాగస్వామిగా ఉన్న తెదేపా ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఒక అపోహ వారిలో నెలకొని ఉన్నట్లు కనబడుతోంది. తద్వారా తెదేపాకు తామే ఏకైక ప్రత్యామ్నాయం అనే సంకేతం ప్రజలకు పంపించాలని వారు భావిస్తున్నారేమో? కానీ అటువంటి ప్రయత్నాల వలన రాష్ట్రంలో పార్టీ బలపడకపోగా ఇంకా నష్టపోయే ప్రమాదం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపరుతున్నారు. పురందేశ్వరి, సోము వీర్రాజు, కన్నా లక్ష్మి నారాయణ, కావూరి సాంభశివరావు వంటి నేతలు కొన్ని వ్యక్తిగత, రాజకీయ కారణాల చేత తెదేపాను విమర్శిస్తున్నారని అందరికీ తెలుసు.   కేంద్రం మంజూరు చేస్తున్న నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను, సంక్షేమ పధకాలను తమ స్వంతవిగా తెదేపా ప్రచారం చేసుకొంటున్నారని, అలాగే వాటిలో రాష్ట్ర బీజేపీ నేతలకు, మంత్రులకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని వారి ప్రధాన ఆరోపణ. అది చాలా సహేతుకమయినదే కనుక తెదేపా అధిష్టానం కూడా వారికి తగు ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం ఉంది. తెదేపా-బీజేపీ నేతల మధ్య సమన్వయం సాధించి, వారి మధ్య సహృద్భావ వాతావరణం నెలకొల్పేందుకు వచ్చే నెల 5వ తేదీన రెండు పార్టీల నేతలు సమావేశం కానున్నారు. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా అధ్యక్షత వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం పై తరచూ తీవ్ర విమర్శలు గుప్పించే బీజేపీ నేత సోము వీర్రాజు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. కనుక ఈ సమావేశంలో బీజేపీ నేతలు తమ అభ్యంతరాలని, ఆరోపణలని నేరుగా చంద్రబాబు నాయుడుతోనే మాట్లాడి అభిప్రాయభేదాలను పరిష్కరించుకోవడం మంచిది.   తెదేపాతో దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో వ్యక్తిగత, రాజకీయ విభేదాల కారణంతో తాము భాగస్వామిగా ఉన్న తెదేపా ప్రభుత్వంపై కత్తులు దూస్తూ, బలపడే ప్రయత్నంలో నష్టపోవడం కంటే దానితో ఏర్పడిన భేదాభిప్రాయాలను తొలగించుకొని తమ సంబంధాలు బలపరుచుకోవడం ద్వారా రాష్ట్రంలో బీజేపీని బలపరుచుకోవడం అన్ని విధాల అందరికీ మంచిది. అలాగే రాష్ట్రంలో బీజేపీ బలపడటానికి ఉన్న అవరోధాలను, తమ ప్రయత్నలోపాలను గుర్తించి వాటిని సరిచేసుకొని ముందుకు వెళ్ళడం చాలా అవసరం. ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణాలో బీజేపీ చాలా బలంగా ఉందనే ఒక నిశ్చితాభిప్రాయం నెలకొని ఉంది. కానీ మొన్న జరిగిన వరంగల్ ఉప ఎన్నికలలో నిలబెట్టేందుకు పార్టీ తరపున బలమయిన అభ్యర్ధి లేకపోవడంతో బీజేపీ ఘోర పరాజయం పాలయింది. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని కూడా బీజేపీ నేతలు నిజాయితీగా సమీక్షించుకొని, తదనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవడం మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుత ఇసుక విధానంపై ఏపీ ప్రభుత్వం పునరాలోచన

  ఆంధ్రప్రదేశ్ లో తెదేపా అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. అంతవరకు ఇసుక క్వారీలను వేలం వేసే పద్దతికి స్వస్తి చెప్పి స్థానిక మహిళా, రైతు సాధికార సంఘాల ద్వారా ఇసుక తవ్వకాలు జరిపించి ప్రజలకు అందించడం మొదలుపెట్టింది. తద్వారా ఇసుక దళారులను అరికట్టడం, తక్కువ ధరకే వినియోగదారులకు నాణ్యమయిన ఇసుక అందించడం, ఇసుక తవ్వకాల ద్వారా మహిళా, రైతు సాధికార సంఘాలకు ఆదాయ వనరును ఏర్పాటు చేయడం వంటి ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం భావించింది. ఇసుక అవసరమయిన ప్రజలు దాని కోసం దళారులు చుట్టూ తిరిగే అవసరం లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుండయినా ఆన్ లైన్ ద్వారా ఇసుకను బుక్ చేసుకొనే సదుపాయం కల్పించబడింది.   ప్రభుత్వం ఉద్దేశ్యం చాలా మంచిదే అయినప్పటికీ, ఈ ప్రయోగంలో కొన్ని లోటు పాట్లు ఎదురవడంతో అది ఆశించిన ఫలితాలు సాధించకపోగా, రాష్ట్రంలో తీవ్ర ఇసుక కొరత ఏర్పడింది. తత్ఫలితంగా ఇసుక ధరలు చాలా బారీగా పెరిగిపోయాయి. ప్రభుత్వం ఏ దళారీ వ్యవస్థను తొలగిద్దామనుకొందో, అదే వ్యవస్థ ఇంకా బలపడి సామాన్య ప్రజలకు, రియల్ ఎస్టేట్ రంగానికి చుక్కలు చూపిస్తోంది. ఇదంతా గమనించిన ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా ఈ ఇసుక తవ్వకాలు, సరఫరా, అమ్మకాలు, ప్రస్తుత అమలు చేస్తున్న విధానంలో తపొప్పులను సర్వే చేయించి నివేదిక తెప్పించుకొంది. ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రస్తుత ఇసుక సరఫరా విధానంలో చాలా లోపాలు బయటపడ్డాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుక సరఫరా విధానంపై నిన్న ఒక శ్వేతపత్రం విడుదల చేసారు. అందులో నిజాయితీగా ఈ లోపాలను కూడా పేర్కొని వాటన్నిటినీ సవరించి 2016, జనవరి 1వ తేదీ నుండి సరికొత్త ఇసుక సరఫరా విధానాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చేరు.   ప్రస్తుత ఇసుక విధానం ద్వారా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 517.36 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ ఇసుక తవ్వకాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా, రైతు సాధికార సంఘాలకు ఆ ఆదాయంలో నుండి చెరో 25 శాతం కేటాయిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తెలిపారు. జనవరి 1 నుండి అమలు చేసే కొత్త విధానంలో కూడా మహిళా, రైతు సాధికార సంఘాలకు అదే నిష్పత్తిలో ఆదాయంలో వాటా పంచి ఇస్తామని తెలిపారు.   ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అమలుచేస్తున్న విధానంలో కొన్ని లోపాలు కనుగొన్నందున, తెలంగాణా, కర్నాటక, ఓడిశా రాష్ట్రాలలో అమలులో ఉన్న వేర్వేరు ఇసుక విధానాలను కూడా అధ్యయనం చేసి వాటిలో అన్నిటికంటే అత్యుత్తమయిన విధానం అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చేరు. ఈ ఇసుక విధానంపై అధ్యయనం చేసేందుకు ముగ్గురు మంత్రులతో ఒక కమిటీని వేసి ప్రజాభిప్రాయ సేకరణ చేసి వారి సూచనలు, సలాహాలను కూడా పరిగణనలోకి తీసుకొంటామని ముఖ్యమంత్రి తెలిపారు. మహిళా, రైతు సాధికార సంఘాలకు దీని ద్వారా ఉపాధి కల్పిస్తూనే, ప్రజలకు వీలయినంత తక్కువ ధరలో నాణ్యమయిన ఇసుకను సకాలంలో అందించాలనేదే తమ ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.   ప్రజలకు మేలు చేకూర్చేందుకు ప్రభుత్వం ఇటువంటి నూతన ఆలోచనలు చేయడం ఎంత అవసరమో, దానిలో తప్పొపులను సమీక్షించుకొని సవరించుకోవడం కూడా అంతే ముఖ్యం. అప్పుడే ఏ ఆలోచన అయినా ఫలిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఇసుక విధానంపై సరయిన దిశలోనే పయనిస్తోందని అర్ధమవుతోంది.

తెలంగాణా అభివృద్ధికి భవిష్య ప్రణాళికలు ప్రకటించిన కేసీఆర్

  వరంగల్ ఉప ఎన్నికలలో ఘన విజయం సాధించిన తరువాత తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ నేతలతో మాట్లాడుతూ, “ఈ విజయంతో మనకి మరింత బాధ్యత పెరిగింది. ఈ విజయంతో మనం ప్రజల పట్ల మరింత వినమ్రతతో మెలగాలి తప్ప గర్వం, అహం ప్రదర్శించరాదు. తెలంగాణా ప్రజలకు తెరాస కార్యకర్తలు ఒక రక్షణ కవచంలా ఉండాలి. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును చూసిన తరువాత అయినా ప్రతిపక్షాలు ప్రభుత్వం పట్ల ప్రదర్శిస్తున్న అసహనాన్ని తగ్గించుకొని, ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వాలి, అని అన్నారు. ఆ తరువాత పార్టీ కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేసారు.   తమ ప్రభుత్వం త్వరలో ఎదుర్కోవలసిన మూడు ప్రధాన సవాళ్ళను ఆయన వారికి వివరించారు. 1. నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికలు 2. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు. 3 రాష్   ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం. అలాగే అయన తన భవిష్య ప్రణాళికలను కూడా వారికి వివరించారు. త్వరలో తను రాష్ట్రంలో బస్సు యాత్ర చేపట్టి, కనీసం వారం రోజుల పాటు అన్ని జిల్లాలలో పర్యటించి మారుమూల గ్రామాలలో ఉన్న పార్టీ నేతలను, కార్యకర్తలను కలుస్తానని తెలిపారు. ఆ సందర్భంగా ఆయా జిల్లాలలో నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టుల సమీపంలోనే తను బస చేసి వాటి పురోగతిని సమీక్షిస్తానని తెలిపారు. వచ్చే నాలుగేళ్ళలో అన్ని ప్రాజెక్టుల నుండి నీళ్ళు తరలించేందుకు అవసరమయిన వ్యవస్థలు ఏర్పాటు అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు.   త్వరలోనే డి.ఎస్.స్సీ. పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ కళాశాలలో 15,000-20,000 మంది టీచర్ల నియామకం పూర్తి చేస్తామని తెలిపారు. అదేవిధంగా డి.ఎస్.స్సీ-98 బ్యాచ్ లో అర్హులయిన 1,500 మందిని ఉద్యోగాలలోకి తీసుకొంటామని తెలిపారు. రెండు నెలల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించి పర్మనెంట్ చేస్తామని తెలిపారు.   ఎన్నికల హామీల అమలులో భాగంగా ఈ ఏడాదిలో 60,000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను, వచ్చే ఏడాది చివరికి లక్ష ఇళ్ళను నిర్మిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కొత్త ప్రతిపాదన చేసారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులలో ఏడాదికి రూ.6 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారందరికీ ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను కేటాయించాలనుకొంటున్నట్లు తెలిపారు. అందుకోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడుతో మాట్లాడి కేంద్రప్రభుత్వం తరపున మరిన్ని ఇళ్ళు తెలంగాణా రాష్ట్రానికి కేటాయించవలసిందిగా కోరుతానని తెలిపారు. తద్వారా ఒక్కో ఇంటికి కేంద్రం తరపున 2 లక్షల సబ్సీడీ లభిస్తుందని అన్నారు.   ప్రభుత్వం చేపడుతున్న అనేక చర్యల కారణంగా 2018 నాటికి తెలంగాణా రాష్ట్రం మిగిలు విద్యుత్ రాష్ట్రంగా అవతరిస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది నుండి ఖరీఫ్ సాగుకు పగలు 9గంటల పాటు విద్యుత్ అందిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికలలోగా ప్రతీ ఇంటికి త్రాగు నీరు అందించలేకపోయినట్లయితే తాము ప్రజలను ఓట్లు అడగబోమని మళ్ళీ మరో మారు ప్రకటించారు.   కళ్యాణ లక్ష్మి పధకం క్రింద ఎస్సీ, ఎస్టీ ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం ఇస్తున్న రూ. 51,000 ఆర్దికసహాయాన్ని వచ్చే మార్చి నుండి రాష్ట్రంలో నిరుపేదలందరికీ అందించబోతున్నట్లు ప్రకటించారు. మంత్రులు తమ తమ నియోజక వర్గాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం చెల్లింపులు చేసేందుకు వచ్చే ఏడాది బడ్జెట్ లో స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ క్రింద ఒక్కో మంత్రికి రూ.25 కోట్లు కేటాయిస్తామని తెలిపారు.

మోడీని నేరుగా డ్డీకొనలేకనే బీజేపీ బలహీనతపై కాంగ్రెస్ దెబ్బ కొడుతోందా?

  ఒక అబద్దాన్ని వందసార్లు నిజమని గట్టిగా నొక్కి చెప్పినట్లయితే, ఆ అబద్దం కూడా నిజమని నమ్మే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు మన పురాణ కాలం నుండి వర్తమాన రాజకీయాల వరకు అనేక ఉదాహరణలున్నాయి. మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత దేశంలో మత అసహనం పెరిగిపోతోందని కాంగ్రెస్ పనిగట్టుకొని చేస్తున్న విష ప్రచారం కూడా నిజమని నమ్మే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానిని నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రజలు నమ్మేరంటే అర్ధం ఉంది కానీ దేశంలో కొందరు మేధావులు, అమీర్ ఖాన్, షారూక్ ఖాన్, ఏఆర్ రహమాన్ వంటి గొప్ప కళాకారులు కూడా నమ్మడం చాలా విస్మయం కలిగిస్తోంది.   అటువంటివారందరూ బీజేపీని, ప్రధాని నరేంద్ర మోడిని తీవ్రంగా వ్యతిరేకిస్తే అందుకు వారిని ఎవరూ తప్పు పట్టరు. ఎందుకంటే దేశంలో ప్రజలందరికీ తమకు నచ్చిన రాజకీయపార్టీకి, నేతలకు మద్దతు పలికే అధికారం స్వేచ్చా స్వాతంత్ర్యాలు ఉన్నాయి. కానీ తమకు ఒక రాజకీయ పార్టీ, దాని నేతలు నచ్చకపోయినంత మాత్రాన్న ప్రపంచ దేశాల దృష్టిలో దేశ ప్రతిష్టకు భంగం కలిగించే ఇటువంటి భావనలు వ్యాపింపజేయడం చాలా తప్పు.   గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది. ఆ సమయంలో దేశంలో అనేక ప్రాంతాలలో మత ఘర్షణలు, అల్లర్లు జరిగాయి. కానీ అప్పుడు ఈ మేధావులు, కళాకారులు ఎవరూ కూడా దేశంలో మత అసహనం పెరిగిపోతోందని భావించలేదు. కానీ ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా కాంగ్రెస్ పార్టీ, దానికి మద్దతు ఇస్తున్నవారు దానిని భూతద్దంలో చూస్తూ, చూపిస్తూ ప్రజలను తప్పు ద్రోవ పట్టిస్తున్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసారు.   “కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో జరిగిన ఘటనలను, కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షమయిన సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘటనలను కూడా మోడీ ప్రభుత్వమే కారణమని వాదించడం గమనిస్తే, వారు ఏ ఉద్దేశ్యంతో ఇటువంటి విషప్రచారం చేస్తున్నారో అర్ధం అవుతోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడి దృష్టి దేశాన్ని వేగంగా అభివృద్ధి చేయడంపైనే పెట్టారు. తత్ఫలితంగా కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే దేశం అన్ని విధాల బలపడుతోంది. ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు భారత్ లో పరిస్థితులు చాలా మారాయని గుర్తించి దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. కానీ కొందరు పనిగట్టుకొని చేస్తున్న ఈ విషప్రచారం వలన భారత్ పట్ల ప్రపంచ దేశాలకు ఎటువంటి దురాభిప్రాయం ఏర్పడుతుందో దాని వలన దేశానికి ఎంత నష్టం, అప్రదిష్ట కలుగుతుందో ఆలోచించడం లేదు,” అని వెంకయ్య నాయుడు అన్నారు.   ఆయన వాదన సహేతుకంగా ఉందని అందరూ అంగీకరిస్తారు. గత పదేళ్లుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎందుకు తిరస్కరించారో దానికీ తెలుసు. దేశంలో అవినీతిని సర్వత్రా వ్యాపింపజేసి, భారత్ అవినీతికి మారుపేరు అనే భావన ప్రపంచదేశాలకు కలిగించింది. కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిపోయిన దేశప్రజలు దానిని సార్వత్రిక ఎన్నికలలో తిరస్కరించారు. ఆ తరువాత వరుసగా జరిగిన అనేక రాష్ట్రాల ఎన్నికలలో కూడా తిరస్కరిస్తూనే ఉన్నారు. అయినా కాంగ్రెస్ అధిష్టానం ఆత్మవిమర్శ చేసుకొని, తన తప్పులను సరిదిద్దుకొని, పార్టీని సమూలంగా ప్రక్షాళనం చేసుకొని దేశ ప్రజల ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయకుండా ఈ విషప్రచారం మొదలుపెట్టింది. దానికి కాంగ్రెస్ అనుకూలురు, బీజేపీ, మోడీ వ్యతిరేకులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్నారు.   మోడీ ప్రభుత్వం అధికారం చేప్పటిన తరువాత దేశంలో వివిధ రాష్ట్రాలలో ఒక ఊపుగా మొదలయిన ఆర్ధిక, పారిశ్రామిక రంగాలలో జరుగుతున్న అభివృద్ధిని, ప్రపంచ దేశాల దృష్టిలో పెరుగుతున్న భారత్ గౌరవం గురించి కాంగ్రెస్ మాట్లాడలేకపోతోంది. అలాగే మోడీ ప్రభుత్వంలో వేలెత్తి చూపడానికి అవినీతి కూడా కనబడటం లేదు. కనుక మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీని దాని బలహీనతపై దెబ్బ తీసేందుకే కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు ఈ విష ప్రచారం మొదలు పెట్టాయని అనుమానించక తప్పదు. కానీ ఆ ప్రయత్నంలో దేశానికి జరుగుతున్న కనబడని నష్టం గురించి వాళ్ళెవరూ పట్టించుకోకపోవడం చూస్తుంటే వాళ్ళకి దేశ ప్రయోజనాల కంటే తమ పార్టీ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయాలన్నీ ‘సో కాల్డ్ మేధావులకు’ తెలియవనుకోలేము. అయినా వారు కూడా ఈ విష ప్రచారంలో పాలు పంచుకొంటున్నారంటే అటువంటి వారిని నెత్తిన పెట్టుకొని మోస్తున్న దేశ ప్రజల దౌర్భాగ్యం అనుకోవాలి.

వరంగల్ ఉప ఎన్నికలలో తెరాసకే విజయం?

  వరంగల్ ఉప ఎన్నికలలో తెరాస విజయం సాధించబోతున్నట్లు స్పష్టమయిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంతవరకు జరిగిన ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపులో తెరాస అభ్యర్ది పసునూరి దయాకర్ 1,82,368 ఓట్ల ఆధిక్యతతో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి సర్వే సత్యనారాయణకి 37,422 ఓట్లు, బీజేపీ అభ్యర్ధి డా. దేవయ్యకి 26,964, వైకాపా అభ్యర్ధి నల్లా సూర్యప్రకాష్ కి 3, 857 ఓట్లు పడ్డాయి.   ఈ ఉప ఎన్నికలలో తెరాస ప్రభుత్వం ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుందని మొదట భయపడినా, ఆ తరువాత జరిగిన అనేక సంఘటనలు తెరాస విజయావకాశాలను మెరుగుపరిచాయి. కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎంపికయిన సిరిసిల్ల రాజయ్య ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన కోడలు సారిక ఆమె ముగ్గురు పిల్లలు సజీవ దహనం అవడం, ఆ కారణంగా రాజయ్యతో సహా ఆయన భార్య, కొడుకు, అతని రెండవ భార్య సనలను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంతో కాంగ్రెస్ పార్టీ ఆయన స్థానంలో సర్వే సత్యనారాయణను పోటీలో దించవలసి వచ్చింది. ఈ కారణాల వలన కాంగ్రెస్ చాలా నష్టపోతే అది తెరాసకు కలిసి వచ్చిందని చెప్పవచ్చును.   ఇక తెదేపా-బీజేపీ ఉమ్మడి అభ్యర్ధిగా మంచి రాజకీయ అనుభవం, అంగబలం, అర్ధబలం అన్నీ ఉన్న అభ్యర్ధిని నిలబెట్టకుండా, ఎవరికీ పెద్దగా పరిచయంలేని ఎన్.ఆర్.ఐ. డా. దేవయ్యను బీజేపీ అభ్యర్ధిగా నిలబెట్టడం కూడా తెరాసకు బాగా కలిసివచ్చింది. ఎన్డీయే అభ్యర్ధిగా పోటీ చేయాలని ఉబలాటపడిన తెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డిని ఒకవేళ పోటీలో నిలబెట్టి ఉండి ఉంటే, ఆయన తెరాసకు గట్టి సవాలే విసిరి ఉండేవారు. ఇక ఈ ఉప ఎన్నికలలో వైకాపా ప్రవేశం వలన కూడా ప్రతిపక్షాలకు పడవలసిన ఓట్లు చీలిపోయాయి.   చిన్న పామునయినా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లు, ఈ ఉప ఎన్నికలలో భారీ మెజార్టీతో విజయం సాధించాలానే పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ లోక్ సభ పరిధిలో ఉన్న ఏడు నియోజక వర్గాలలో తన మంత్రులను, పార్టీ సీనియర్ నేతలను దింపి ఎక్కడికక్కడ పట్టు సాధించేందుకు గట్టి ప్రయత్నాలు చేసారు. వారి సమిష్టి కృషి, పైన పేర్కొన్న కారణాల చేత ఊహించినట్లే తెరాస ఈ ఉప ఎన్నికలలో పూర్తి ఆధిక్యతతో దూసుకుపోతోంది.

కేసీఆర్ తో సఖ్యత కోసం తెలంగాణా-తెదేపా నష్టపోనవసరం లేదు

  అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ల మధ్య కొంత సయోధ్య ఏర్పడింది. ఇటువంటి సానుకూల వాతావరణం వలన రెండు ప్రభుత్వాల మధ్య ఘర్షణలు కూడా తగ్గుతాయి కనుక రెండు ప్రభుత్వాలు పరిపాలన, రాష్ట్రాభివృద్ధిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించగలుగుతాయి. ఈ సహృద్భావ వాతావరణం చెదిరిపోకుండా ఉండేందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరంగల్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్ళలేదని భావించవచ్చును. అందుకు ఇతరత్రా అనేక కారణాలు కూడా ఉండి ఉండవచ్చును కానీ ప్రధాన కారణం మాత్రమే ఇదేనని భావించవచ్చును.   ఇదే కారణంగా ఇక ముందు కూడా ఆయన తెలంగాణా రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చేయి. ఒకవేళ ఆ వార్తలు నిజమనుకొంటే చంద్రబాబు నాయుడు తీసుకొన్న ఆ నిర్ణయం వలన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సయోధ్య పెరగవచ్చును కానీ తెలంగాణాలో తెదేపా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.   గత పన్నెండేళ్లుగా తెలంగాణా తెదేపా నేతలు ప్రతిపక్ష బెంచీలలో కాలం వెళ్లదీస్తున్నారు. ఇంకా మరో మూడున్నరేళ్ళు వెళ్లదీయవలసి ఉంది. కనీసం వచ్చే ఎన్నికలలో అయినా విజయం సాధించి అధికారంలోకి రావాలంటే ఇప్పటి వరకు వారు ప్రజా సమస్యలపై ఏవిధంగా తెరాస ప్రభుత్వంతో గట్టిగా పోరాడుతున్నారో అదేవిధంగా ఇక ముందు కూడా పోరాడవలసి ఉంటుంది. అప్పుడే వారి ఉనికిని చాటుకోగలుతారు, వచ్చే ఎన్నికలలో ప్రజలను ఓట్లు అడుగగలుగుతారు. కానీ ఇరువురు ముఖ్యమంత్రులు, ప్రభుత్వాల మధ్య ఏర్పడిన సహృద్భావ వాతావరణం అలాగే నిలిపి ఉంచేందుకు తెరాస ప్రభుత్వంపట్ల తెలంగాణా తెదేపా నేతలు మెతకవైఖరి అవలంభించినట్లయితే, అది కాంగ్రెస్ పార్టీకి గొప్ప వరంగా మారుతుంది.   ఇంతవరకు తెలంగాణాలో తెదేపా కూడా ఒక బలమయిన రాజకీయ శక్తిగా గుర్తింపు కలిగి ఉంది. కానీ ఇప్పుడది వెనక్కి తగ్గినట్లయితే దాని స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఆక్రమిస్తుంది. తెరాస ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాడగల ఏకైక పార్టీగా, తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయంగా అవతరిస్తుంది. ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడలేకపోతే చివరికి నష్టపోయేది సదరు పార్టీ నేతలే తప్ప ప్రజలు కాదు. తెలంగాణాలో వైకాపా పరిస్థితిని చూసినట్లయితే ఆ విషయం అర్ధం అవుతుంది.   రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య నిలిపి ఉంచుతూనే, తెలంగాణాలో తెదేపా లాభపడే మార్గం ఒకటుంది. తెరాస ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేని పరిస్థితిలో ఉండి నష్టపోవడం కంటే, తెరాస-తెదేపా-బీజేపీలు చేతులు కలిపినట్లయితే తెలంగాణాలో తిరుగులేని మహాశక్తిగా అవతరించవచ్చును. అంతే కాదు దాని వలన తెలంగాణాలో తెదేపా, బీజేపీ నేతలకు అధికారం అవకాశం దక్కవచ్చును. తెలంగాణా రాష్ట్రాభివృద్ధికి కేంద్రప్రభుత్వ సహాయసహకారాలు పుష్కలంగా లభిస్తాయి. కాంగ్రెస్ నేతలు జోస్యం నిజం చేస్తూ తెరాస కూడా ఎన్డీయే కూటమిలో చేరి కవితమ్మ కలలు సాకారం చేసుకోవచ్చును. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, ప్రజల మధ్య ఇంకా సహృద్భావం పెరిగి, విభజన సమస్యలన్నీ సమసిపోవచును. రెండు తెలుగు రాష్ట్రాలు ఒకదానికొకటి సహకరించుకొంటూ పోటాపోటీగా అభివృద్ధి సాధించవచ్చును.   ఈవిధంగా చేయగలిగినట్లయితే తెలంగాణాలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో వైకాపా ఒంటరి అయిపోతాయి. బహుశః అప్పుడు ఆ రెండు పార్టీలు చేతులు కలుపవచ్చును కానీ దాని వలన బలీయమయిన శక్తిగా అవతరించే తెరాస, తెదేపా, బీజేపీలపై ఎటువంటి ప్రభావం ఉండబోదు. చంద్రబాబు నాయుడు తెలంగాణా రాజకీయాలకు దూరంగా ఉండి తన పార్టీని నష్టపరుచుకోవడం కంటే, ఎలాగు కేసీఆర్ తో సఖ్యత కోరుకొంటున్నారు కనుక తెరాసతో చేతులు కలిపి తన పార్టీని కాపాడుకొంటూనే తన తెలంగాణా నేతల రాజకీయ భవిష్యత్ కి కూడా భరోసా కల్పించినట్లయితే వారు సంతోషిస్తారు. పైగా దానివలన ఇన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా.

మావోయిస్ట్ అజెండా అమలు చేసే తెరాస నేతలనే మావోయిస్టులు ఎత్తుకుపోతే

  తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే మావోయిష్టుల సమస్య పెరుగుతుందని కేంద్ర నిఘావర్గాలు యూపిఏ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు విభజన సమయంలో వార్తలు వినిపించాయి. కానీ గత ఎడాదిన్నర సమయంలో అటువంటి పరిస్థితులు కనబడకపోవడంతో అందరూ తేలికగా ఊపిరి తీసుకొన్నారు. తెరాస అధ్యక్షుడు కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే తమ ప్రభుత్వం మావోయిష్టుల అజెండానే అమలు చేస్తుందని ప్రకటించారు. కానీ ఆయన పాలనలోనే మావోయిష్టులపై ఎన్కౌంటర్ జరిగింది. అప్పటి నుండే మళ్ళీ మావోయిష్టులు తమ ఉనికి చాటుకొంటున్నారు.   వరంగల్ ఉప ఎన్నికలలో తెరాసను ఓడించి దానికి గుణపాఠం చెప్పాలని మావోయిష్టు అధికార ప్రతినిధి జగన్ కూడా వరంగల్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈసారి తెరాస పార్టీకి చెందిన మానె రామకృష్ణ, పటేల్ వేంకటేశ్వరులు,సత్యనారయణ, జనార్ధన్, సురేష్, రామకృష్ణలని మావోయిష్టులు బుదవారం సాయంత్రం ఎత్తుకుపోయారు. మావోయిష్టు అజెండాను అమలు చేస్తున్నామని చెప్పుకొనే తెరాస పార్టీ నేతలనే మావోయిస్టులు ఎత్తుకుపోవడం చాలా సంచలనం సృష్టిస్తోంది.   ముఖ్యమంత్రి కేసీఆర్ పేరిట మావోయిష్టు అధికార ప్రతినిధి జగన్ వ్రాసిన బహిరంగ లేఖలో బూటకపు ఎన్కౌంటర్లు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, ఖమ్మం జిల్లా నుండి ఆదిలాబాద్ వరకు నిర్వహిస్తున్న పోలీసుల కూంబింగ్ ఆపరేషన్స్ తక్షణమే నిలిపివేయాలని లేకుంటే తెరాస నేతలపై భౌతిక దాడులు చేస్తామని హెచ్చరించారు.   భూటకపు ఎన్కౌంటర్లను ప్రజలు కూడా సమర్ధించరు..హర్షించరు. కానీ ప్రజాస్వామ్యంలో నిరంకుశపోకడలను అందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలు, మీడియా పట్ల ప్రదర్శిస్తున్న కటినమయిన వైఖరిని, ఇప్పుడు మవోయిష్టులను ఎదుర్కోవడంలో కూడా చూపించగలిగితే ప్రజలు హర్షిస్తారు. ప్రభుత్వానికి మావోయిష్టులు సవాలు విసురుతున్నపుడు చాలా కటినంగా వ్యవహరించడం అవసరమని చెప్పకతప్పదు. లేకుంటే రాష్ట్రంలో మావోయిష్టులు సమాంతర ప్రభుత్వం నడిపే ప్రమాదం ఉంది. కానీ అదే సమయంలో గత ఏడాదిన్నర కాలంగా నిద్రాణ స్థితిలో ఉన్న మావోయిస్టులు ఇంత అకస్మాత్తుగా తమ ప్రభుత్వానికి ఎందుకు ఈవిధంగా సవాళ్ళు విసురుతున్నారు? అని కూడా తెరాస ప్రభుత్వం ఆలోచించవలసి ఉంది.   సమర్ధంగా పరిపాలన చేయడానికి ముఖ్యమంత్రి కొన్ని విషయాలలో కటువుగా ఉండటం చాలా అవసరమే కానీ తనను ఎవరూ ప్రశ్నించకూడదు...తప్పులను ఎత్తి చూపించి విమర్శించకూడదనే ధోరణి వ్యక్తపరిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో అది నిరంకుశత్వంగా పరిగణించబడుతుంది. తమకు రహస్య మిత్రపక్షంగా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డితో సహా ప్రతిపక్షాలన్నీ, చివరికి మావోయిష్టులు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశత్వ ధోరణిని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలని, రైతుల ఆత్మహత్యలు వంటి తీవ్ర సమస్యల విషయంలో ఆయన ప్రభుత్వం చూపిన తీవ్ర అలసత్వాన్ని ఈ ఉప ఎన్నికల సందర్భంగా గట్టిగా ప్రశ్నించాయి. కనుక తన ప్రభుత్వంలో ప్రతిపక్షాలు ఎత్తి చూపిస్తున్న ఇటువంటి లోపాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సవరించుకొని ముందుకు వెళ్ళగలిగితే, సమస్యలు వాటంతట అవే సమసిపోతుంటాయి.

ఇంకా ఎన్నాళ్ళు తెలంగాణా సాధన పేరిట ఓట్లు అడుగుతారో?

  తెలంగాణాలో ఎన్నికలు వచ్చినపుడల్లా కాంగ్రెస్, తెరాస పార్టీలు మరిచిపోకుండా మాట్లాడే విషయం తెలంగాణా రాష్ట్రం సాధన గురించి. ప్రజా సమస్యలు, అభివృద్ధివంటి అనేక ఇతర అంశాలతో పాటు ఇది కూడా ఒక శాశ్విత అంశంగా మారిపోయింది వాటికి. వరంగల్ ఉప ఎన్నికలలో కూడా ఆ రెండు పార్టీలు తెలంగాణా సాధనలో తాము పోషించిన పాత్ర గురించి చెప్పుకొంటూనే కేవలం ఎదుటపార్టీ ఒక్కటే ఆ క్రెడిట్ తీసుకోవడానికి వీల్లేదని వాదిస్తున్నాయి. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి సుమారు 16నెలలు అయినా కాంగ్రెస్, తెరాసలు ఆ క్రెడిట్ కోసం ఇంకా కోట్లాడుకోవడం చూస్తుంటే చాలా కొంచెం ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ ముందే చెప్పుకొన్నట్లు అది కూడా ఎన్నికలలో ప్రస్తావించుకోవలసిన ఒక అంశంగా మారిపోయింది కనుకనే తాము ప్రస్తావించకపోతే ఆ క్రెడిట్ ని ఎదుట పార్టీ క్లెయిం చేసుకొంటుందనే భయంతోనో లేకపోతే ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయోగిస్తున్న అన్ని అస్త్రాలలో దీనిని కూడా ఒకటిగా భావిస్తున్నందుననో ప్రతీ ఎన్నికలలో మరిచిపోకుండా “తెలంగాణా మావల్లే వచ్చిందంటే...కాదు మా వల్లే వచ్చిందని” కాంగ్రెస్, తెరాసలు చెప్పుకొంటుంటాయి.   కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కనుక అది తనకున్న ఈ ఆఖరి అస్త్రాన్ని కూడా ఉపయోగించుకొంటోందని అర్ధం చేసుకోవచ్చును. కానీ అధికారంలో ఉన్న తెరాస తన 16 నెలల పరిపాలనలో సాధించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి గట్టిగా ప్రచారం చేసుకొని ప్రజలను ఓట్లు అడిగే బదులు, అది కూడా ఇంకా తెలంగాణా సెంటిమెంటు, తెలంగాణా సాధన క్రెడిట్ గురించి చెప్పుకొని ఓట్లు కోరవలసి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.   ఈ ఎన్నికలలో తాము ఎంత మెజార్టీ సాధిస్తామని మాత్రమే ఆలోచిస్తున్నాము తప్ప గెలుస్తామా లేదా? అని ఎన్నడూ ఆలోచించలేదని తెరాస నేతలు చెప్పుకొంటూనే, మళ్ళీ ప్రతిపక్షాల ఓట్లు చీల్చడానికి వైకాపాను దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని మధ్యలోకి రప్పించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు చేస్తున్న ఈ ఆరోపణలను ఆ రెండు పార్టీలు అంగీకరించనప్పటికీ, వాటి మధ్య ఉన్న రహస్య అవగాహన గురించి తెలిసినవారు అందరూ కూడా ఎన్నడూ తెలంగాణా సమస్యల గురించి మాట్లాడని, ఎన్నడూ తెలంగాణా గడ్డపై అడుగుపెట్టని జగన్మోహన్ రెడ్డి, కేవలం తెరాసను గెలిపించడం కోసమే స్వయంగా నడుం బిగించి వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని భావిస్తున్నారు. తమ అభివృద్దే తమకు ఘన విజయం అందిస్తుందని నమ్మకంగా చెపుతున్న తెరాస, చివరికి జగన్మోహన్ రెడ్డి సహాయం కూడా తీసుకోవడం చూస్తుంటే, తెరాస ఎంత మెజార్టీ వస్తుందని కాక ఈ ఉప ఎన్నికలో ఏదో విధంగా గట్టెక్కితే చాలానే భావనతో ఉన్నట్లు అనిపిస్తోంది.   ఒకవేళ ఈ ఉప ఎన్నికలలో తెరాస పార్టీ ఓడిపోయినా దానికి ఏమీ నష్టం ఉండదు. తెరాస పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగిందని ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేసుకోవడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. అధికారంలో ఉన్న ఏ పార్టీకయినా ఎన్నికలలో ఇటువంటి భయాందోళనలు ఎదుర్కోకూడదు...ఎవరి సహకారం లేకుండా ధీమాగా ఎన్నికలకు వెళ్ళాలంటే దానికి ఒకే ఒక మార్గం ఉంది. అదే ప్రజాభీష్టానికి అనుగుణంగా పారదర్శకమయిన పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని అన్నివిధాల అభివృద్ధి చేయడమే.   ఈ రహస్యం అన్ని రాజకీయ పార్టీలకి కూడా తెలుసు. కానీ నిత్యం అంత కష్టం పడటం కంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో ఒకటి చేసి ఎలాగో ఒకలాగ గెలిచేద్దామనుకొంటుంటాయి. అందుకే ఈ సెంటిమెంటులు, క్రెడిట్లు, పరోక్ష సహాయ సహకారాలు అవసరం పడుతుంటాయి. కానీ ప్రజలు ఇప్పుడు రాజకీయంగా చాలా చైతన్యంగ ఉన్నారనే సంగతి గ్రహించలేకపోతున్నాయి..లేదా గ్రహించనట్లు ఆత్మవంచన చేసుకొంటూ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ దాని వలన చివరికి తామే నష్టపోతాయని గ్రహిస్తే చాలు.

మళ్ళీ నోరు జారిన మణి శంకర్ అయ్యర్

  పారిస్ నగరంపై ఐసిస్ ఉగ్రవాదులు దాడి చేసి అనేకమంది ప్రజలను అతి క్రూరంగా హతమార్చినందుకు యావత్ ప్రపంచం కంట కన్నీరు చిందుతుంటే, సీనియర్ కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ మాత్రం “యూరోప్ దేశాలలో నానాటికి పెరుగుతున్న ముస్లిం వ్యతిరేకతను అరికట్టాల్సి ఉంది. అలాగే ఫ్రాన్స్ దేశ ముస్లిం పౌరులకు వారు కూడా మిగిలిన పౌరులతో సమానమనే నమ్మకం కల్పించాలి. అసలు ఉగ్రవాదులు పారిస్ నగరంపై ఎందుకు దాడులు చేసారో అందరూ ఆలోచించాలి,” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు మూటగట్టుకొన్నారు.   మళ్ళీ నిన్న పాకిస్తాన్ కి చెందిన ‘దునియా టీవీ’ నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మణి శంకర్ అయ్యర్ ని “భారత్-పాక్ దేశాల మధ్య మళ్ళీ సంబంధాలు మెరుగుపడాలంటే ఏమి చేయవలసి ఉంటుంది?” అని ప్రశ్నించినప్పుడు “అన్నిటి కంటే ముందుగా భారత ప్రధాని నరేంద్ర మోడిని పదవిలో నుండి తప్పించవలసి ఉంటుంది. అప్పుడే ముందుకు వెళ్ళగలుగుతాము. కానీ అందుకోసం మరో నాలుగేళ్ళు వేచి చూడవలసి ఉంటుంది. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్న కొందరు మోడీ సాబ్ అధికారంలో ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళగలమని అనుకొంటున్నారు. కానీ నేను అలాగా భావించడం లేదు. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి. అప్పుడే మళ్ళీ ఇరు దేశాల మధ్య చర్చలు మొదలవుతాయి. దీనికి అంతకంటే వేరే పరిష్కార మార్గం లేదు. మోడీ ప్రభుత్వాన్ని మేము అధికారంలో నుండి దించగలము. కానీ పాకిస్తాన్ అంతవరకు ఓపికగా వేచి ఉండాలి,” అని మణి శంకర్ అయ్యర్ జవాబిచ్చారు.   మణి శంకర్ అయ్యర్ వంటి పరిణతి చెందిన రాజకీయ నాయకుడు భారత్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పాకిస్తాన్ కి చెందిన ఒక మీడియా ఈవిధంగా మాట్లాడటం చాలా విస్మయం కలిగిస్తోంది. భారత్ తో తాము శాంతినే కోరుకొంటున్నప్పటికీ, భారత్ వైఖరి కారణంగానే శాంతి చర్చలలో ప్రతిష్టంభన ఏర్పడిందని పాక్ అంతర్జాతీయ వేదికలపై ప్రచారం చేస్తోంది. ఇప్పుడు మణి శంకర్ అయ్యర్ మాట్లాడిన ఈ మాటలు పాక్ వాదనలను బలపరిచేవిగా ఉన్నాయి. భారత్-పాక్ చర్చలకు మోడీయే ప్రధాన అవరోధంగా ఉన్నారని, ఆయనని గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని అందుకు పాక్ ప్రభుత్వం కూడా సహకరించాలని మణి శంకర్ అయ్యర్ చెపుతున్నట్లుంది.   దేశంలో రాజకీయ పార్టీలు, నేతలు ఒకరితో మరొకరు ఎంతగా అయినా విభేధించుకోవవచ్చును కానీ విదేశాలతో ముఖ్యంగా భారత్ ని శత్రుదేశంగా భావిస్తూ, పరోక్ష యుద్ధం చేస్తున్న పాకిస్తాన్ తో మాట్లాడేటప్పుడు చాలా ఆచి తూచి మాట్లాడవలసి ఉంటుంది. మణి శంకర్ అయ్యర్ ఒక కాంగ్రెస్ నేతగానో లేక ఒక రాజకీయ నాయకుడిగానో కాకుండా ఒక భారతీయుడిలాగ మాట్లాడాలి. కానీ ఆయన తన దేశ ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్నట్లున్నారు.   మణి శంకర్ అయ్యర్ వివాదాస్పద మాటలపై కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ స్పందిస్తూ “మణి శంకర్ అయ్యర్ కి వృద్దాప్యం వలన మతి స్థిమితం కోల్పోయినట్లున్నారు. లేకుంటే ఒక పాకిస్తానీ టీవీ ఛానల్ తో ఆవిధంగా మాట్లాడి ఉండేవారు కాదు. ఆయన మాట్లాడిన మాటలు కేవలం భారత ప్రధాని నరేంద్ర మోడినే కాదు యావత్ దేశ ప్రజలను అవమానిస్తున్నట్లుంది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం తక్షణమే స్పందించాలి,” అని అన్నారు. ఆయన మాట్లాడిన ఈ వివాదస్పద మాటలపై బీజేపీతో సహా అనేక పార్టీలు విమర్శలు గుప్పించడం మొదలుపెట్టగానే, తను ఆవిధంగా మాట్లాడలేదని మణి శంకర్ అయ్యర్ బుకాయించారు. ఆయన మాటలను ఖండించకపోగా కాంగ్రెస్ పార్టీ ఆయననే వెనకేసుకు వస్తోంది.   ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రెండు మూడు రోజుల క్రితం అన్న మాటలను గుర్తు చేసుకోక తప్పదు. “రాజకీయ నాయకులు ఒక వయసు రాగానే స్వచ్చందంగా రాజకీయాల నుండి తప్పుకొని, సమాజసేవ, మానవసేవ కార్యక్రమాలలో పాల్గొంటే బాగుంటుంది,” అని అన్నారు. మణి శంకర్ అయ్యర్ మాటలు వింటే అది నిజమేననిపిస్తుంది. రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో వృద్ధ నేతల స్థానంలో యువతను తీసుకు రావాలని భావిస్తున్నారు కనుక ఇటువంటి వృద్ద నేతలను అందరినీ పక్కనపెడితేనే కాంగ్రెస్ పార్టీకి కూడా మేలు జరుగుతుంది.

వైకాపాకు తెలంగాణా ప్రజలు మళ్ళీ గుర్తుకొస్తున్నారే!

  గత 16నెలల్లో ఏనాడూ కూడా తెరాస ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి పల్లెత్తు మాట అనడానికి ఇష్టపడని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వరంగల్ ఉప ఎన్నికలు ప్రచారసభలో మొదటిరోజే ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు కురిపించారు. గత గత 16నెలల్లో ఏనాడూ కూడా ప్రజా సమస్యలపై స్పందించని వైకాపా అధినేత జగన్ నిన్న ఒక్కరోజునే మొత్తం అన్ని సమస్యలను ఏకరువు పెట్టి, కేసీఆర్ ప్రభుత్వాన్ని కడిగేసారు. గత 16నెలల్లో తెలంగాణాలో వందలాది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా కనీసం స్పందించని జగన్మోహన్ రెడ్డి, వరంగల్ జిల్లాలో 150 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని ఆవేదన వ్యక్తం చేసారు.   ఇన్నాళ్ళుగా తను స్పందించకపోయి ఉండవచ్చును. తెలంగాణాలో పరామర్శ యాత్రలు చేసిన షర్మిల కూడా స్పందించకపోయుండవచ్చును. కానీ కనీసం తెలంగాణాలో వైకాపా నేతలు కూడా ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడలేదు..కనీసం స్పందించలేదు. మరి వైకాపా అధినేత జగన్ కి ఇప్పుడు హటాత్తుగా తెలంగాణా ప్రజలు, వారి సమస్యలు గుర్తుకుచేసుకొని ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? అంటే వైకాపా వరంగల్ ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్నందునే. కానీ ఏనాడూ ప్రజాసమస్యలపై స్పందించని వైకాపా ఈ ఎన్నికలలో ఎందుకు పోటీ చేస్తోంది? అంటే దానికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. 1.తెరాస-వైకాపాల ఉమ్మడి శత్రువు తెదేపాకు నష్టం కలిగించడానికి. 2. తమ ఉమ్మడి శత్రువు అయిన చంద్రబాబుకి కేసీఆర్ దగ్గరవుతున్నరనే దుగ్ధతో కావచ్చును. ఈ రెండు కారణాలు కూడా పూర్తిగా పరస్పర విరుద్దమయినవే..జగన్ ఆలోచనల లాగ!   తెరాస-వైకాపాల మధ్య ఉన్న రహస్య అవగాహన ఎవరికీ తెలియనిది కాదు. ఇంతకుముందు జరిగిన శాసనమండలి ఎన్నికలలో వైకాపా తెరాస అభ్యర్ధికి మద్దతు ఇచ్చింది. అది ఆ రెండు పార్టీల మధ్య ఉన్న అనుబంధానికి చక్కగా అద్దం పట్టింది.ఏ ఎన్నికలలో అయినా ఎన్ని పార్టీలు పోటీ చేస్తే అంతగా ప్రజల ఓట్లు చీలిపోయే అవకాశాలు ఉంటాయని అందరికీ తెలుసు. ఈ ఉప ఎన్నికలలో వైకాపా పోటీ చేయడానికి కారణం అదేనని చెప్పవచ్చును. తెరాస ఓట్లు తెరాసకు ఎలాగు పడతాయి కానీ మిగిలిన ఓట్లను ఎంతగా చీల్చగలిగితే అంత తెరాసకు లాభం చేకూరుతుంది. తమ ఉమ్మడి శత్రువు అయిన తెదేపా బలపరిచిన బీజేపీ అభ్యర్ధికి, కాంగ్రెస్ మరియు ఈ ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న ఇతర పార్టీలకి అంత నష్టం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి తెరాసపై యుద్ధం చేస్తూనే తెరాసకు పరోక్షంగా సహాయం పడుతున్నారని భావించవచ్చును.   ఇక అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం జరిగినప్పటి నుండి ఇంతవరకు కత్తులు దూసుకొంటున్న చంద్రబాబు నాయుడు, కేసీఆర్ మిత్రులుగా మారడం లేదా మరే ప్రయత్నాలు చేస్తుండటం జగన్ జీర్ణించుకోవడం కష్టమే. ఒకవేళ కేసీఆర్ నిజంగానే చంద్రబాబు నాయుడుకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తే అప్పుడు తెలంగాణా తన పార్టీ వైఖరి ఏవిధంగా ఉండబోతోందో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కి తన ఎన్నికల ప్రచార సభలో రుచి చూపిస్తునట్లున్నారు. ఒకవేళ తేదేపాకు తెరాస దగ్గరయితే వైకాపా దూరం అవుతుందని జగన్ చాలా స్పష్టంగానే చెపుతున్నట్లుంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా ఒకేసారి రెండు మూడు పిట్టలు కొట్టాలని ప్రయత్నిస్తుంటారు. కానీ ఎప్పుడూ అది బ్యాక్ ఫైర్ అవుతూనే ఉండటం విశేషమయితే, బ్యాక్ ఫైర్ అవుతున్నా కూడా పట్టువదలని విక్రమార్కుడులాగ మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేస్తుండటం కేవలం జగన్మోహన్ రెడ్డికే చెల్లు. ఈ ఉప ఎన్నికలలో వైకాపా పోటీ చేయడం తప్పో ఒప్పో మున్ముందు పరిణామాలను బట్టి తెలుసుకోవచ్చును.

పారిస్ ఘటన తరువాత అయినా ప్రభుత్వాలు మేల్కొంటాయా?

  ఒకప్పుడు తాలిబాన్ ఉగ్రవాదులు ప్రపంచదేశాలను గడగడలాడిస్తే, ఇప్పుడు వారి కంటే భయంకరమయిన కర్కోటక నరరూప రాక్షసుల వంటి ఐసిస్ ఉగ్రవాదులు పుట్టుకొచ్చేరు. తాలిబన్లు కేవలం కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం అయితే ఐసిస్ ఉగ్రవాదులు ప్రపంచ దేశాలన్నిటికీ వ్యాపిస్తున్నారు. భారత్ తో పోలిస్తే ఫ్రాన్స్ దేశంలో చాలా కట్టుదిట్టమయిన, అత్యాధునికమయిన భద్రతా వ్యవస్థలున్నాయి. అయినా కూడా ఆ దేశానికి గుండెకాయ వంటి పారిస్ నగరం నడిబొడ్డున ఐసిస్ ఉగ్రవాదులు నరమేధం చేసారు. అది చూసి యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ఈ దాడులను చూసి అమెరికా, కెనడా, బ్రిటన్ తదితర దేశాలు మరింత అప్రమత్తమయ్యాయి. కానీ భారత్ మాత్రం ఈ దాడులను చూసి జంకు గొంకు కనబరచకపోవడం విశేషం. పారిస్ దాడులను ముంబైలోని తాజ్ హోటల్ పై దాడులతో పోల్చి చూసుకొంటూ సంతాప, దిగ్బ్రాంతి సందేశాలు ప్రకటించడం తప్ప, అటువంటి దాడులు జరుగకుండా అడ్డుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేప్పట్టాయో, అసలు చేప్పట్టాయో లేదోకూడా తెలియదు.   భారత్ పై ఇప్పటికే అనేకసార్లు పాక్ ఉగ్రవాదులు దాడులు చేసి వందలాది మంది ప్రజలను బలి తీసుకొన్నారు. అనేక వందల మంది శాశ్విత అంగ వైకల్యం పొంది తీరని వేదన అనుభవిస్తున్నారు. ఇంతవరకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి బలవుతున్న భారత్ ఇప్పుడు ఈ ఐసిస్ ఉగ్రవాదుల బెడదను కూడా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండక తప్పదు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో తరచూ పాక్ జెండాలు రెపరెపలాడుతూ కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వాటితో బాటు ఐసిస్ జెండాలు కూడా రెపరెపలాడుతూ కనిపిస్తుంటే ఐసిస్ ఉగ్రవాదులు భారత్ గడప వరకు వచ్చేసారని తెలిసి దేశ ప్రజల వెన్నులో వణుకు పుడుతోంది. పైగా వారికి దేశంలో చాలా చోట్ల సానుభూతిపరులు పుట్టుకు రావడం ఇంకా కలవరం కలిగిస్తోంది.   భారత్ లో వివిధ రాష్ట్రాల నుండి సుమారు 80 మంది వరకు ఈ ఐసిస్ ఉగ్రవాదుల సంస్థలలో చేరేందుకు బయలుదేరితే, భారత్ నిఘావర్గాలు సకాలంలో గుర్తించి వారిని అడ్డుకోగలిగాయని, ఆనాటి నుండి వారందరిపై నిరంతర నిఘా పెట్టినట్లు వార్తలు వచ్చేయి. కానీ 125 కోట్ల జనాభా గల సువిశాలమయిన భారతదేశంలో ఎంతమందిని ఈవిధంగా సకాలంలో గుర్తించగలరు? ఎంతమందిని అడ్డుకోగలరు? అని ఆలోచిస్తే ఈ సమస్య మూలాల వరకు వెళ్లి వాటికి ఇంతకంటే బలమయిన పరిష్కారాలు కనుగొనవలసి ఉందని అర్ధం అవుతోంది. ఈ సమస్యను ఒక సామాజిక సమస్యగా పరిగణించి పరిష్కారాలు కనుగొనే ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు ఈ సమస్యను అధిగమించడానికి ఐరోపా దేశాలు ఎటువంటి చర్యలు చేపడుతున్నాయి? ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఎటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకొన్నాయి? ఎటువంటి శిక్షణ ఇస్తున్నాయి?ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నాయి? వంటివి ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ తదనుగుణంగా చర్యలు చేప్పట్టాలి. లేకుంటే భిన్న జాతులు, మతాలు, బాషలు కలిగిన భారత్ వంటి సువిశాలమయిన దేశంలో ఐసిస్ ఉగ్రవాదులు అడుగుపెట్టకుండా నిలువరించడం చాలా కష్టం. ముంబై దాడుల నుండి గుణపాఠం ఏమీ నేర్చుకోకపోయినా కనీసం ఇప్పటికయినా మేల్కొని పారిస్ దాడుల నుండి గుణపాఠం నేర్చుకొవడం అత్యావశ్యకం. లేకుంటే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొని ఏమీ ప్రయోజనం ఉండదు.

వరంగల్ ఉప ఎన్నికలలో తెరాసకు సవాలు విసురుతున్న కాంగ్రెస్

  వరంగల్ ఉప ఎన్నికల ప్రకటన జారీ అవగానే “తమ పార్టీ కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని” తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించేశారు. అప్పటికి పార్టీ అభ్యర్ధి పేరు కూడా ఖరారు కాలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన అనేక విపరీత పరిణామాల గురించి అందరికీ తెలుసు. అవన్నీ కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను గండి కొట్టేవేనని భావించవచ్చును. కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నపటికీ తెలంగాణా నేతలందరూ చాలా తక్కువ సమయంలోనే కూడబలుకొని, కలిసి కట్టుగా నిలబడి చాలా ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తూ ఉప ఎన్నికలలో అధికార తెరాసను ఎదుర్కొనేందుకు సిద్దమవడం విశేషం. ఇంతకు ముందు కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రకటించబడిన సిరిసిల్ల రాజయ్య జైలుకి వెళ్ళడంతో ఆయన స్థానంలో సర్వే సత్యనారాయణని బరిలోకి దింపి కాంగ్రెస్ నేతలందరూ చాలా ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.   ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో జరిగిన పరిణామాలను చూసి తెరాస తన గెలుపుపై చాలా ధీమా వ్యక్తం చేసింది. తమ పార్టీ ఎన్నికలలో గెలవడం తధ్యమే కానీ మెజార్టీ తగ్గకుండా చూసుకోవడమే తమకు ముఖ్యమని చెప్పుకొనేది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంత త్వరగా తేరుకొని మళ్ళీ తమతో తలపడగలదని ఊహించలేకపోవడంతో ఇప్పుడు తెరాస నేతల్లో ఆందోళన మొదలయింది. అందుకే మళ్ళీ తెరాస నేతలు తమకు బాగా అచ్చివచ్చిన ‘ఆంధ్రా పార్టీలు, ఆంధ్రా మీడియా, స్థానికత’ వంటి ఆయుధాలను బయటకు తీసి ప్రయోగించడం మొదలుపెట్టవలసి వచ్చింది. వరంగల్ ఉప ఎన్నికలలో తెరాస అభ్యర్ధిగా పోటీ చేస్తున్న దయాకర్ తరపున ప్రచారం చేస్తున్న మంత్రి కేటీఆర్ “వరంగల్ లో ఓటు హక్కు లేని వాళ్ళు ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారని” ప్రశ్నిస్తున్నారు. స్థానికుడయిన తెరాస అభ్యర్ధి దయాకర్ కే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.   కేటీఆర్ స్థానికత అంశం లేవనెత్తగా, మరో మంత్రి హరీష్ రావు “ఒక రాజకీయ పార్టీ, మీడియాలో ఒక వర్గం పనిగట్టుకొని తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా విషప్రచారం చేస్తూ వరంగల్ ఉప ఎన్నికలలో ప్రజలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కనుక తెరాస శ్రేణులు మన అభ్యర్ధి విజయానికి ఇంకా గట్టిగా కృషి చేయాలి,” అని పిలుపునిచ్చారు.   కాంగ్రెస్ నేతలు మాత్రం ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా పూర్తి సమరోత్సాహంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అలవాటు ప్రకారం తెరాస ప్రభుత్వానికి 50 ప్రశ్నలతో కూడిన ఒక కరపత్రాన్ని విడుదల చేసి వాటికి సమాధానం చెప్పమని నిలదీస్తున్నారు. “ఈ ఉప ఎన్నికలలో ఓడిపోతే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారా? అని మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీకి విసిరిన సవాలును వారు స్వీకరిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు ప్రకటించడం విశేషం. అది వారి ఆత్మవిశ్వాసానికి అద్దం పడుతోంది.   తెరాస విసిరిన ఆ సవాలును తాము స్వీకరిస్తున్నామని, అలాగే ఒకవేళ ఈ ఎన్నికలలో తెరాస అభ్యర్ధి దయాకర్ ఓడిపోయినట్లయితే ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు బాధ్యత వహించి రాజీనామా చేసి ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా? అని శాసనమండలి కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ తెరాసకు ప్రతి సవాలు విసిరారు. ఈ సవాళ్లు ప్రతిసవాళ్ళ సంగతి ఎలా ఉన్నప్పటికీ కాంగ్రెస్ జోరు చూస్తుంటే ఈ ఎన్నికలు కాంగ్రెస్-తెరాసల మధ్యనే సాగేట్లు ఉన్నాయి. ఇంత తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ తేరుకొని మళ్ళీ పోరాటానికి సిద్దం అవగలగడం, అధికార పార్టీని ఓడించగలనని ఆత్మవిశ్వాసం ప్రదర్శించడం చాలా మెచ్చుకోవలసిన విషయమే.

కాంగ్రెస్ ఉచ్చులో నుండి బయటపడ్డ జగన్?

  ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన పోరాటాలకి ప్రజల నుండి ఆశించినంతగా స్పందన రాకపోవడంతో చాలా నిరాశ చెందారు. అందుకే తన పోరాటాలను అర్దాంతరంగా నిలిపివేశారని భావించాల్సి ఉంటుంది. కేవలం ఆయనే కాదు ఆయనపైనే చాలా ఆశలు పెట్టుకొన్న కాంగ్రెస్ పార్టీ కూడా నిరాశ చెందిందని చెప్పవచ్చును. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని డ్డీ కొనడానికే మొదట ప్రాధాన్యతనిస్తుంది. ఆ తరువాతే రాష్ట్ర ప్రభుత్వం.   ఒకే దెబ్బకి రెండు పిట్టలు కొట్టవచ్చనే ఉద్దేశ్యంతోనే అది ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికెత్తుకొంది. కానీ కాంగ్రెస్ అధిష్టానానికి దాని కంటే ఇంకా ఎక్కువ ప్రయోజనం కలిగించే అంశాలు చేతిలో ఉండటం చేత ప్రత్యేక హోదాపై పోరాడేందుకు అది అంతగా శ్రద్ద చూపలేదు. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్ మొదలుపెట్టిన ఈ ప్రత్యేక పోరాటాలని నమ్మలేదు. అప్పుడే కాంగ్రెస్ నేతల దృష్టి జగన్ మోహన్ రెడ్డిపై పడింది. ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేయమని రెచ్చగొట్టింది. ఆయన చేస్తున్న పోరాటాలకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని దిగ్విజయ్ సింగ్, రఘువీరా రెడ్డి ఇద్దరూ విస్పష్టంగా ప్రకటించారు. ఒకవేళ జగన్ అంగీకరిస్తే వైకాపాను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకొని జగన్ సహాయంతో రాష్ట్రంలో మళ్ళీ నిలద్రొక్కుకోవాలని కాంగ్రెస్ ఆశపడి ఉండవచ్చును. కానీ తన స్వశక్తితో పార్టీని నిలబెట్టుకొన్న జగన్, రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీలో చేరవలసిన అవసరం అగత్యం లేదు కనుక కాంగ్రెస్ మద్దతును స్వీకరించడానికి ఇష్టపడలేదని భావించవచ్చును.   కాంగ్రెస్ విసిరిన గాలానికి చిక్కుకొన్న జగన్ అకస్మాత్తుగా ప్రత్యేక హోదా కోసం పోరాటాలు మొదలు పెట్టేసారు. కానీ జగన్ అసలు లక్ష్యం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అవడమే తప్ప కేంద్రంతో పోరాటాలు చేయడం కాదు. అందుకోసం ఆయన స్థానిక సమస్యలపై పోరాడితేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది తప్ప సామాన్య ప్రజలకు అర్ధం కాని , వారి జీవితాలపై ఏమాత్రం ప్రభావం చూపని ప్రత్యేక హోదా అంశం మీద కాదు. పైగా అది కేంద్రం పరిధిలో ఉన్న అంశమే తప్ప రాష్ట్రం పరిధిలో ఉన్నది కాదు. ఒకవేళ ఈ అంశంతో కేంద్రాన్ని మరీ ఇబ్బందిపెట్టినట్లయితే ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. అందుకే మోడీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనకుండా తన రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడుని, ఆయన ప్రభుత్వాన్ని ఈ ప్రత్యేక హోదా అంశంతో చావు దెబ్బ తీయాలని ప్రయత్నించి చివరికి తనే నవ్వులపాలయ్యారు. కాంగ్రెస్ విసిరిన ఆ ప్రత్యేక ఉచ్చులో పడి భంగపడిన తరువాత జగన్ తన తప్పు తెలుసుకొన్నందునే వాటిని అర్దాంతరంగా నిలిపివేశారని అనుమానం కలుగుతోంది.   జగన్ తన ప్రత్యేక పోరాటాలను అర్దాంతరంగా నిలిపివేయడంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరాశకు గురవడం చాలా సహజమే. రాష్ట్రంలో పార్టీని బ్రతికించుకొనేందుకు మొదలుపెట్టిన ప్రత్యేక హోదా పోరాటాలు ఫలించలేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి దాని కోసం పోరాటాలు చేస్తుంటే ఆ విధంగానయినా రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బ్రతికించుకోవచ్చని కాంగ్రెస్ ఆశపడింది కానీ నిరాశ తప్పలేదు. బహుశః  అందుకే పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి జగన్ పై చాలా ఆగ్రహం వ్యక్తం చేసారనుకోవచ్చును. జగన్ తన సీబీఐ కేసులకు భయపడే వెనక్కు తగ్గారని ఆయన విమర్శించారు. ఇంతకీ చివరికి ఏమి జరిగిందంటే కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ పార్టీ వేసిన పాచిక పారలేదు. అలాగే దాని ఉచ్చులో చిక్కుకొని బయటపడిన జగన్మోహన్ రెడ్డి నవ్వులపాలయ్యారు. రెండు పార్టీల పరిస్థితి కూడా మళ్ళీ మొదటికొచ్చిన్నట్లయింది.

ప్రధాని నరేంద్ర మోడి విదేశీ పర్యటనలపై విమర్శలా?

  ప్రధాని నరేంద్ర మోడి తరచూ విదేశీయాత్రలు చేయడంపై ప్రత్యర్ధ రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ ఈరోజు నుంచి మూడు రోజుల పాటు బ్రిటన్ లో పర్యటించేందుకు ఆయన బయలుదేరారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు, రాజకీయ విశ్లేషకులు సరికొత్త వాదనలు వినిపిస్తున్నారు. బిహార్ లో పరాజయం కారణంగా వస్తున్న విమర్శల బారి నుంచి తప్పించుకొనేందుకే ఆయన బ్రిటన్ పర్యటన పెట్టుకొన్నారని కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు ఎద్దేవా చేస్తుంటే, బిహార్ లో పోగొట్టుకొన్న ప్రతిష్టని బ్రిటన్ లో తిరిగి సంపాదించుకొనే ప్రయత్నం చేస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు వాదనలను లోతుగా పరిశీలిస్తే వాటిలో డొల్లతనం అర్ధం అవుతుంది.   ప్రధాని నరేంద్ర మోడి విదేశీ పర్యటనలు అప్పటికప్పుడు ఖరారు అయ్యేవేమీ కాదు. వాటి కోసం ఇరుదేశాల విదేశాంగ శాఖల అధికారులు కనీసం ఒకటి రెండు నెలల ముందు నుంచే చాలా కసరత్తు చేయవలసి ఉంటుంది. అలాగే ప్రధాని విదేశీ పర్యటనలో భాగంగా ఆయన కార్యక్రమాల అజెండాను కూడా చాలా ముందుగానే ఖరారు చేసి, అందుకు అవసరమయిన ముందస్తు ఏర్పాట్లు చేస్తుంటారు.   ఈసారి మోడీ బ్రిటన్ పర్యటనలో వెంబ్లే స్టేడియంలో సుమారు 60, 000 మంది ప్రవాస భారతీయులు హాజరవ్వబోయే సభలో ప్రసంగిస్తారు. బ్రిటన్ లో జాగ్వార్-ల్యాండ్ రోవర్ కర్మాగారాన్ని సందర్శిస్తారు. బ్రిటన్ పార్లమెంటు ఉభయసభలని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాని నరేంద్ర మోడి పర్యటనలో రెండు దేశాల మధ్య కొన్ని కీలక ఒప్పందాలు జరుగుతాయి. ప్రధాని పర్యటన షెడ్యూల్, అందులో ఆయన పాల్గొనబోయే ఈ కార్యక్రమాలన్నిటికీ చాలా ముందు నుంచే ఏర్పాట్లు చేయబడ్డాయి తప్ప బిహార్ ఎన్నికలలో బీజేపీ ఓడిపోయినా మరునాడు చేసినవి కావు. ఒకవేళ బిహార్ లో బీజేపీ ఘన విజయం సాధించినా కూడా ఆయన తప్పకుండా బ్రిటన్ వెళ్ళేవారు..ఈ కార్యక్రమాలన్నిటిలో పాల్గొనేవారు. అటువంటప్పుడు బిహార్ పరాజయం కారణంగా తనపై వస్తున్న విమర్శల నుండి తప్పించుకోనేందుకే ఆయన విదేశీ పర్యటన పెట్టుకొన్నారని వాదించడం ఎంత అవివేకమో అర్ధమవుతుంది.   ఇక బిహార్ లో పోయిన ప్రతిష్టను బ్రిటన్ లో తిరిగి సంపాదించుకోవడమనే వాదన కూడా అర్ధరహితమే. మోడీ ఇంతకు ముందు చాలాసార్లు విదేశీ పర్యటనలు చేసారు, ఇక ముందు కూడా చేస్తారు. ఆ సందర్భంగా ఆయన అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశ్యించి చాలా ఉత్తేజపూర్వకమయిన ప్రసంగాలు చేసేవారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. అందులో కొత్తగా చేస్తున్నదేమి లేదు. కనుక బిహార్ ఎన్నికల పరాజయానికి ఆయన విదేశీ పర్యటనలకి ముడిపెట్టి చూడటం చాలా అవివేకం అర్ధరహితమే. ప్రధాని నరేంద్ర మోడి తరచూ విదేశీ పర్యటనలు చేయడంపై చాలా విమర్శలు వస్తున్నాయి. ఆయన స్వదేశంలో తక్కువ విదేశాలలో ఎక్కువగా పర్యటనలు చేస్తుండటం వలననే ఇటువంటి విమర్శలు ఎదుర్కోవలసి వస్తోందని చెప్పవచ్చును. కనుక బీజేపీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పవచ్చును.   ఇంతకు ముందు యూపియే హయాంలో జరిగిన అనేక కుంభకోణాలు, అవినీతి కారణంగా ప్రపంచ దేశాల దృష్టిలో భారత్ కోల్పోయిన పరువు ప్రతిష్టలను, మోడీ చేస్తున్న విదేశీ పర్యటనల వలన పునరుద్దరించబడుతోంది. అంతర్జాతీయంగా భారత్ పలుకుబడి పెరుగుతోంది. అలాగే భారత్ శక్తి సామర్ధ్యాలను, దేశంలో విస్తృతంగా ఉన్న వ్యాపార అవకాశాలను ప్రపంచ దేశాలు గుర్తించడం మొదలుపెట్టాయి. భారత్ లో ప్రభుత్వ పనితీరులో కూడా పారదర్శకత, వేగం పెరిగి అవినీతి అదుపులోకి వస్తున్న సంగతిని విదేశీ పెట్టుబడుదారులు సైతం అంగీకరిస్తున్నారు. వ్యాపారానికి అనుకూలమయిన దేశాలకు ప్రపంచ బ్యాంక్ ప్రతీ ఏట ఇచ్చే ర్యాకింగ్ లో భారత్ 140 స్థానం నుంచి కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే 132వ స్థానానికి చేరుకోవడమే అందుకు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చును. అందుకే విదేశీ సంస్థలు భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ విషయాలు మోడీని విమర్శిస్తున్న వారితో సహా అందరికీ తెలుసు. అయినా ఏదో ఒక వంకతో విమర్శించడం కోసమే విమర్శిస్తున్నారని భావించవలసి ఉంటుంది.

బిహార్ ఎన్నికలు నేర్పుతున్న గుణపాఠం ఏమిటంటే...

  దేశ ప్రజలపై ప్రధాని నరేంద్ర మోడి ప్రభావాన్ని, ప్రజలలో ఆయనకున్న పాపులారిటీని ఉపయోగించుకొని బిహార్ ఎన్నికలలో విజయం సాధించాలని బీజేపీ ప్రయత్నించడమే ఒక పెద్ద పొరపాటని ఇప్పుడు స్పష్టం అవుతోంది. ఒకవేళ ఈ ఎన్నికలలో బీజేపీ ‘మోడీ-కార్డు’ వాడకుండా రాష్ట్ర బీజేపీ నేతల స్వశక్తితో పోరాడి ఓడిపోయినా ఎటువంటి నష్టమూ జరిగి ఉండేది కాదు. కానీ మోడీని ‘పణంగా’ పెట్టి ఎన్నికలకు వెళ్లి ఓడిపోవడంతో బిహార్ లో బీజేపీ ఓటమిని మోడీ ఓటమిగా, మోడీకి వ్యతిరేకంగా యావత్ దేశ ప్రజలు ఇచ్చిన తీర్పుగా ప్రతిపక్షాలు అభివర్ణించడం మొదలుపెట్టాయి. కానీ అది నిజమయిన కారణం కాదని, కేవలం దేశ ప్రజలను తప్పుద్రోవ పట్టించేందుకే బీజేపీ వ్యతిరేక శక్తులు దీనిని మోడీ ఓటమిగా ప్రచారం చేస్తున్నాయని చెప్పవచ్చును.   ఈ బిహార్ ఎన్నికల ద్వారా మూడు విషయాలు తెలిసివచ్చేయి. 1. ప్రతీ ఎన్నికలలో మోడీని పణంగా పెట్టకూడదు. 2. రాష్ట్రాలలో బీజేపీ బలోపేతం చేసుకొని స్వశక్తితోనే ఎన్నికలను ఎదుర్కొనే శక్తి సంపాదించుకోవాలి. 3. ప్రాంతీయ పార్టీలను తక్కువ అంచనా వేయకూడదు.   వీటిలో 1వ పాయింటును వరంగల్ ఉప ఎన్నికలకి వర్తిస్తుంది. 2, 3 పాయింట్ల గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ నేతలు గట్టిగా ఆలోచించడం మంచిది. వచ్చే ఎన్నికల నాటికి రెండు రాష్ట్రాలలో బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దిశానిర్దేశం చేసి వెళ్ళారు. కానీ దాని కోసం ఆ పార్టీ నేతలు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనబడటం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెదేపాకు మిత్రపక్షంగా ఉంటూ, ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా ఉంటూ దానిపై కత్తులు దూస్తూ తమ అధిష్టానం వద్ద, ప్రజలలో గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్నారు తప్ప రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నాలు చేయడంలేదనే చెప్పాలి. ఒకవేళ వాళ్ళు ఇదే ధోరణిలో మిగిలిన మూడున్నరేళ్ళు కాలక్షేపం చేస్తూ, రాష్ట్రంలో మిత్రపక్షమయిన తెదేపాను కూడా దూరం చేసుకొన్నట్లయితే అప్పుడు ఎన్నికలలో మళ్ళీ మోడీని పణంగా పెట్టవలసి రావచ్చును... మళ్ళీ అప్పుడు కూడా ఇవే పరిస్థితులు పునరావృతం అయినా ఆశ్చర్యం లేదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలో అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పాతుకుపోయుంది. అయినా దానిని కూడా ప్రజలు ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. కారణం ప్రాంతీయ పార్టీల ప్రభావమే. అటువంటప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం ఐదేళ్ళ సమయంలో ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా చాలా బలంగా ఉన్న తెదేపా, తెరాస, వైకాపాల వంటి ప్రాంతీయ పార్టీలను ఓడించి అధికారం చేజిక్కించుకోవడం సాధ్యమేనా? సాధ్యం కాదనుకొన్నట్లయితే రాష్ట్ర బీజేపీ నేతలు వాటితో వ్యవహరిస్తున్న తీరు సరయినదేనా? అని ఆలోచించుకోవడం మంచిది.

బిహారీ సెంటిమెంటుతోనే మహాకూటమి విజయం?

  బిహార్ ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోడీ, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ల పరిపాలన ప్రధాన అజెండాగా నిలిచిందని అందరికీ తెలుసు. అందుకే పోటీ వారిద్దరి మధ్యే అన్నట్లు అందరూ భావించారు. ఆ పోటీలో నితీష్ కుమార్ విజయం సాధించారు. కొద్ది సేపటి క్రితం నితీష్ కుమార్-లాలూ ప్రసాద్ యాదవ్ కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో నితీష్ కుమార్ మాట్లాడుతూ ఈ ఎన్నికలు అహంభావానికి బీహార్ ఆత్మగౌరవానికి మధ్య జరిగినవని అందులో బిహారీ ప్రజల ఆత్మగౌరవం నెగ్గిందని చెప్పడం గమనార్హం.   కీలకమయిన మూడవ దశ ఎన్నికల ప్రచార సభలలో ప్రధాని నరేంద్ర మోడి నితీష్, లాలూ, కాంగ్రెస్ పార్టీలను కలిపి ‘త్రీ ఈడియేట్స్’ అనడం బిహారీల మనసులను చాలా గాయపరిచి ఉండవచ్చును. “మోడీ-అమిత్ షాలిద్దరూ కూడా బాహరీ ఆద్మీ (బయటి వ్యక్తులు). వారు మనల్ని అవమానిస్తున్నారు...ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం," అని లాలూ-నితీష్ కుమార్ గట్టిగా ప్రచారంతో చేసి బిహారీలను తమవైపు తిప్పుకోగలిగారని భావించవచ్చును.   ‘రాష్ట్రంలో బీజేపీ ఓడిపోతే పాకిస్తాన్ లో మిటాయిలు పంచుకొంటారని” బీజేపీ జాతీయ అద్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కూడా బిహార్ లోని ముస్లిం ప్రజల మనసులను గాయపరిచి ఉండవచ్చును. ఆకారణంగా వారు సెక్యులర్ ముద్ర కలిగి మహా కూటమితో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి ఉండవచ్చును. లేకుంటే వారి ఓట్లు ఎన్డీయే కూటమికి పడకపోయినా వేరే ఇతర పార్టీలకి పడి ఉండేవేమో. అందుకే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 40 స్థానాలకి పోటీ చేస్తే వాటిలో ఏకంగా 27స్థానాలలో విజయం సాధించగలిగిందని చెప్పవచ్చును.   ఇదివరకు ఎన్టీఆర్ కూడా తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడుకోవాలని పిలుపునిచ్చి ఎన్నికలలో విజయం సాధించారు. ఆ తరువాత  తెలంగాణాలో ఎన్నికలు జరిగినప్పుడల్లా కేసీఆర్ తెలంగాణా సెంటిమెంటును తట్టిలేపి, తన ప్రత్యర్ధులపై విజయం సాధించేవారు. తెరాసకు బలమయిన రాజకీయ ప్రత్యర్ధి అయిన తెదేపాను అడ్డుకొనేందుకు కేసీఆర్ దానికి "ఆంధ్రా పార్"టీ అని ముద్రవేసి దానిపై పైచేయి సాధించేవారు. ఇప్పుడు  బిహార్ ఎన్నికలలో లాలూ-నితీష్ కుమార్ తమ ప్రధాన ప్రత్యర్దులయిన మోడీ-అమిత్ షాలను 'బాహరీ ఆద్మీ" (బయట వ్యక్తులు) అని ప్రజల మనస్సులో నాటుకొనేలా ప్రచారం చేసారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులు బిహారీలను “త్రీ ఈడియట్స్” అని అవమానించారని లాలూ ప్రసాద్ యాదవ్-నితీష్ కుమార్ ఇరువురూ గట్టిగా ప్రచారం చేసి వారిలో బిహారీ సెంటిమెంటుని తట్టిలేపి తమకు అనుకూలంగా మలుచుకోగలిగారు. వారి విజయానికి ఇంకా అనేక కారణాలు ఉండవచ్చును కానీ ఇది కూడా ఒక ప్రధాన కారణమేనని చెప్పవచ్చును. అందుకే ఈ ఎన్నికలు బీజేపీ అహంభావానికి బీహార్ ఆత్మగౌరవానికి మధ్య జరిగినవని, అందులో బిహారీ ప్రజల ఆత్మగౌరవం నెగ్గిందని నితీష్ కుమార్ చెప్పారని భావించాల్సిఉంటుంది.

కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాష్ర్ట విభజనకు ఆలోచిస్తోందా?

  విజయవాడలో జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మాట్లాడుతూ, "తెదేపా అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు బాగా పెరిగిపోయాయి. అలాగే సామాజిక వర్గాల మధ్య అసమానతలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి అభివృద్దిని, అధికారాన్ని అంతా ఒకే చోట కేంద్రీకరిస్తున్న కారణంగానే ప్రాంతీయ అసమానతలు పెరుగుతున్నాయి. కానీ ఆయన ఎవరి మాట వినే పరిస్థితిలో లేరిప్పుడు. ప్రభుత్వంలో అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడంతో సామాజిక అసమానతలు, కొన్ని వర్గాల మధ్య సమతుల్యత దెబ్బ తింటోంది,” అని అన్నారు.   కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, సమైక్య రాష్ట్రాన్ని ఏకధాటిగా పదేళ్ళపాటు పరిపాలించింది. తెలంగాణా తీవ్ర నిర్లక్ష్యానికి గురయిందని కాంగ్రెస్ హయాంలోనే ఉద్యమాలు ఊపందుకొని చివరికి కాంగ్రెస్ స్వహస్తాలతోనే రాష్ట్ర విభజన చేయవలసివచ్చింది. ఇప్పుడు ప్రాంతీయ అసమానతల గురించి మాట్లాడుతున్న రఘువీరా రెడ్డి, అప్పుడు మంత్రిగా ఉండేవారు. కానీ ఆయన అప్పుడు వాటి గురించి మాట్లాడలేదు? అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒకటి రెండు సామాజిక వర్గాలతో కూడిన ప్రభుత్వమేనని అందరికీ తెలుసు. రఘువీరా రెడ్డికి అప్పుడు ఈ సామాజిక అసమానతలు గుర్తుకు రాలేదు?   అధికారంలో ఉంటే ఒకలాగ, లేకపోతే మరొకలాగ మాట్లాడటం రాజకీయ నేతలందరికీ అలవాటే. కాకపోతే కాంగ్రెస్ నేతలకి మరికొంచెం ఎక్కువ అలవాటు. ఎందుకంటే వారికి పదవులు, అధికారం వాటి కోసం రాజకీయాలు చేయడంపై ఉన్న శ్రద్ద, రాష్ట్రాభివృద్ధిపై లేదు. తమ రాజకీయ అవసరాలను చూసుకొనే రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు మరోమారు అదే తప్పు చేయడానికి సిద్దపడుతున్నట్లుంది. అందుకే ప్రాంతీయ అసమానతలు, సామాజిక సమతుల్యత గురించి మాట్లాడుతూ ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   దేశంలో రాజధాని లేకుండా ఉన్న రాష్ట్రం కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వ శక్తికి మించిన పనే అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందుతున్నందున ఈ అవకాశాన్ని, సమయాన్ని సద్వినియోగపరుచుకొని శరవేగంగా రాజధాని నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు తాపత్రయపడుతున్నారు. ఒకవేళ ఈ మూడేళ్ళలో రాజధానికి రూపురేఖలు తీసుకురాలేకపోయినట్లయితే ఆ తరువాత రాజకీయ పరిణామాలు, సమీకరణాలు ఎలాగా ఉంటాయో ఎవరికీ తెలియదు కనుక రాజధాని నిర్మాణం దశాబ్దాల తరబడి సాగవచ్చును. ఏ రాష్ట్రాభివృద్ధి అయినా దాని రాజధానికి ఉన్న ఆర్ధిక చోదక శక్తి మీదే ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్ ని గమనిస్తే అది అర్ధమవుతుంది. తెలంగాణా ఆర్దికశక్తికి, అభివృద్ధికి హైదరాబాద్ గుండెకాయ వంటిది. కానీ ఏపీకి అసలు ఎప్పటికీ రాజధానే లేకపోతే?   రాజధాని ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతం అవుతున్న మాట వాస్తవమే. అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఈ 15నెలల కాలంలోనే అనేక పారిశ్రామిక, ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం చాలా కృషి చేస్తోంది. వాటిలో కొన్నిటికి అప్పుడే నిర్మాణపనులు మొదలవగా, మరికొన్ని వివిధ దశలలో ఉన్నాయి. ఐ.ఐ.టి.,ట్రిపుల్ ఐ.టి., ఐ.ఐ.ఎం. వంటి ఉన్నత విద్యా సంస్థలకు భవన నిర్మాణాలు మొదలుకాక మునుపే తాత్కాలికంగా ఆ జిల్లాలోనే వేరే కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో శిక్షణా తరగతులు కూడా మొదలయిపోయాయి.   కాంగ్రెస్ పార్టీ గత పదేళ్ళలో చేయలేని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మోడీ, చంద్రబాబు నాయుడు కలిసి కేవలం 15నెలలో చేసి చూపిస్తోంది. వారు ఇదే స్పీడుతో దూసుకుపోతే ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ కోలుకోలేదనే భయంతోనే రఘువీరా రెడ్డి ఈవిధంగా మాట్లాడుతున్నారని భావించవచ్చును.

మిత్రపక్షమా..ప్రతిపక్షమా?

  ప్రస్తుతం ఏపీలో తెదేపా-బీజేపీ నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ద్వారా బీజేపీ నేత సోము వీర్రాజు రాష్ట్ర ప్రజల దృష్టిని అలాగే తన అధిష్టానం దృష్టిని బాగానే ఆకర్షించగలుగుతున్నారు. బహుశః అదే ఉద్దేశ్యంతోనే ఆయన తెదేపా మిత్రపక్షమని చూడకుండా చాలా తీవ్ర విమర్శలు చేస్తున్నట్లున్నారు. ఒకవేళ సోము వీర్రాజు ఆరోపిస్తున్నట్లు తెదేపా తప్పులు చేస్తున్నట్లయితే తెదేపా ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఇద్దరు బీజేపీ నేతలు డా. కామినేని శ్రీనివాస్ మరియు పి.మాణిక్యాల రావు కూడా ప్రభుత్వ తీరును తప్పు పట్టి ఉండాలి లేదా ప్రభుత్వం నుంచి తప్పుకొని ఉండాలి కానీ వాళ్ళిద్దరూ ఏపీ ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయడం లేదు. ఈ సందర్భంగా తెదేపా నేత బుద్దా వెంకన్న సోము వీర్రాజుపై చేసిన విమర్శలను గమనించవలసి ఉంటుంది. మంత్రి పదవి ఆశించిన సోము వీర్రాజు అది దక్కకపోవడం చేతనే ఈవిధంగా తమ ప్రభుత్వంపై అక్కసు వెళ్ళగ్రక్కుతున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు.   రాష్ట్రంలో తెదేపా-బీజేపీల ప్రభుత్వం ఏర్పడేవరకు కూడా అసలు సోము వీర్రాజు పేరు పెద్దగా వినబడలేదు. బీజేపీలో చేరిన పురందేశ్వరి, కావూరి సాంభశివరావు, కన్నా లక్ష్మినారాయణ ముగ్గురూ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు కనుక వారి పేర్లు, మొహాలు అందరికీ సుపరిచితం. కానీ వారిలో కావూరి, కన్నా బీజేపీలో చేరి సుమారు ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఎన్నడూ తేదేపాకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు లేవు. వారిరువురూ కనీసం రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి ప్రయత్నించినట్లు దాఖలాలు కూడా లేవు. వారిరువురూ బీజేపీలో చేరక మునుపు తెదేపాలోకి రావాలనుకొన్నారు కానీ స్థానిక తెదేపా నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో బీజేపీలో చేరారు. బహుశః తెదేపాలో చేరేందుకు ఇంకా అవకాశం ఉందేమోననే ఆలోచనతోనే ఇంతకాలం వారిరువురు తొందరపడి నోరు జారకుండా జాగ్రత్త పడినట్లున్నారు. కానీ ఆ అవకాశం లేదని నిర్ధారించుకొన్న తరువాత సోము వీర్రాజుతో కలిసి తెదేపాకు వ్యతిరేకంగా కోరస్ పాడటం మొదలుపెట్టినట్లున్నారు.   పురందేశ్వరి స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె అయినప్పటికీ ఆమె మొదటి నుంచి తెదేపాకు దూరంగా ఉంటూ దానిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కనుక ఆమె బీజేపీలో చేరిన తరువాత కూడా అదే ధోరణిలో సాగిపోతున్నారు. అయితే ఈ నలుగురు బీజేపీ నేతలు రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకొనేందుకు, రాష్ట్ర ప్రజల, తమ అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకు చేస్తున్న వేర్వేరు వ్యక్తిగత, రాజకీయ కారణాలతో చేస్తున్న ఈ ప్రయత్నాల వలన రెండు పార్టీలకు ఇబ్బందికర పరిస్థితులను చేజేతులా సృష్టించుకొని, నష్టం కలిగిస్తున్నారని చెప్పకతప్పదు.   “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఉన్న ఏ అవకాశాన్ని కూడా తను వదులుకోనని” సోము వీర్రాజు చెప్పడం హర్షించదగ్గదే. దానిని ఎవరూ కూడా తప్పు పట్టలేరు. కానీ అందుకోసం అవసరమయిన ఎటువంటి పార్టీ కార్యక్రమాలు చేపట్టకుండా, మిత్రపక్షమయిన తెదేపా మీద, తెదేపా ప్రభుత్వం మీద యుద్ధం చేయడం ద్వారా బీజేపీ బలపడుతుందని భావించడం అవివేకమే అవుతుంది. అటువంటి ఆలోచనలు ప్రతిపక్ష పార్టీలయిన కాంగ్రెస్, వైకాపాలు చేస్తుంటే అర్ధం చేసుకోవచ్చును కానీ తెదేపాకు మిత్రపక్షంగా ఉంటూ, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ దానిపై కత్తులు దూస్తుంటే, వారి ధోరణిని తప్పుపట్టక తప్పదు, అనుమానించక తప్పదు.   వారు చేస్తున్న ఈ యుద్ధం, ప్రభుత్వంపై గుప్పిస్తున్న విమర్శల వలన కేంద్రప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. అలాగే కేంద్రరాష్ట్ర సంబంధాలు, తెదేపా-బీజేపీల సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రతిపక్షాలకు కూడా తమను విమర్శించే అవకాశం స్వయంగా కల్పిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు తమ పార్టీని బలపరుచుకోవాలనుకొంటే అందుకు తగ్గట్లుగా తమ కార్యక్రమాలు రూపొందించుకోవడం మంచిది. కానీ ఆ పని చేయకుండా తెదేపాను, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ దానితో యుద్ధం చేస్తుంటే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది.

ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం మైసూరా నేతృత్వంలో త్వరలో ఉద్యమాలు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి ఏడాదిన్నర తిరక్కుండానే మళ్ళీ మరోసారి రాష్ట్ర విభజనకి రాయలసీమకు చెందిన కొందరు నేతలు ఉద్యమాలు మొదలుపెట్టడానికి సిద్దం అవుతున్నారు. వైకాపా నేత మైసూరా రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక రాయలసీమ డిమాండ్ తో ఈనెల 21వ తేదీన “రాయలసీమ రాష్ట్ర సాధన సమితి”ని ఏర్పాటు చేయబోతున్నారు. అందుకోసం మైసూరా రెడ్డి వైకాపాకు రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. ఇవ్వాళ్ళ సాయంత్రం రాయలసీమకు చెందిన కాంగ్రెస్, వైకాపా నేతలు తమ భవిష్య కార్యాచరణ గురించి చర్చించేందుకు కర్నూలులో సమావేశమయినట్లు సమాచారం. రాయలసీమ రాష్ట్ర సాధన సమితి ఏర్పాటు చేసిన తరువాత రాష్ట్రంలో అన్ని పార్టీలలో సీమకు చెందిన నేతలను తమ పోరాటాలలో పాలుపంచుకొనేందుకు ఆహ్వానించాలని వారు నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది.   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా, గుంటూరు జిల్లాలనే అభివృద్ధి చేస్తూ రాయలసీమ జిల్లాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని వారి ప్రధాన ఆరోపణ. రాజధాని నిర్మాణం పూర్తయితే అప్పుడు ఇంతకు ముందు తమని హైదరాబాద్ నుంచి ఏవిధంగా బలవంతంగా బయటకు వెళ్ళగొట్టారో మళ్ళీ అదే విధంగా అమరావతి నుంచి కూడా తమను బయటకు వెళ్ళగొడతారని కనుక అటువంటి పరిస్థితి దాపురించకముందే ఆంధ్రప్రదేశ్ నుంచి రాయలసీమను విడగొట్టి ఏడు జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేయబోతున్నారు.   ఈ ఉద్యమానికి కాంగ్రెస్, వైకాపా నేతలు చేతులు కలుపుతుండటం గమనిస్తే వారు రాయలసీమ కోసం కాక ఆ రెండు పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసమే చేతులు కలుపుతున్నట్లున్నారు. వారిలో కాంగ్రెస్ నేతల రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా ఉండటం చేత మళ్ళీ రాష్ర్ట విభజనకి ‘సై’ అంటున్నట్లు అనుమానం కలుగుతోంది. అధికార తెదేపాను కేవలం తమ రాజకీయ ప్రత్యర్ధి పార్టీగా కాక దానిని తమ ఆగర్భ శత్రువులా వైకాపా భావిస్తుండటం చేత వైకాపా నేతలు ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి సిద్దమవుతున్నట్లు ఉంది.   మూడు నెలల క్రితం రాహుల్ గాంధీ అనంతపురం పర్యటనకి వచ్చినప్పటి నుంచి రాష్ర్టంలో కాంగ్రెస్ వైకాపాలు క్రమంగా దగ్గరవడం మొదలయింది. అందుకు ప్రత్యేక హోదా అంశం వాటికి ఒక మంచి అవకాశం కల్పించింది. కానీ ప్రత్యేక హోదాపై అవి చేస్తున్న పోరాటాలకి ప్రజల నుంచి ఆశించినంతగా స్పందన రాకపోవడంతో ఇప్పుడు ఈ వేర్పాటు ఉద్యమానికి సిద్దం అవుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయనాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించాలని కోరుకోవడం చాలా శోచనీయం. వారు రాయలసీమ ప్రజలలో నెలకొన్న అసంతృప్తిని రెచ్చగొట్టి రాష్ట్రాన్ని మళ్ళీ అగ్నిగుండంగా చేయక మునుపే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని తగు చర్యలు చేపడితే మంచిది. లేకుంటే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదు.