వైకాపా అందుకే ఇంత హడావుడి చేసిందేమో?

  వైకాపా నగరి ఎమ్మెల్యే రోజా నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల అనుచితంగా మాట్లాడటంతో స్పీకర్ కోడెల ఆమెను ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. అయితే అప్పుడు రోజా కానీ జగన్మోహన్ రెడ్డి గానీ పెద్దగా నిరసనలు, అభ్యంతరాలు తెలియజేయలేదు. పైగా తనను సభ నుంచి సస్పెండ్ చేసినందుకు బాధపడటం లేదని, చేసిన విధానానికే ఎక్కువ బాధపడుతున్నానని రోజా స్వయంగా మీడియాతో చెప్పారు. ఇక నుండి ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతుంటానని చెప్పారు. ఆమె చెప్పిన ఈ మాటలను బట్టి సభ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ అయినందుకు ఆమె ఏ మాత్రం బాధపడటంలేదని స్పష్టం అవుతోంది. ఒకవేళ తనను సభ నుంచి సస్పెండ్ చేయడం అన్యాయమని ఆమె భావించి ఉండి ఉంటే, నిన్ననే ఆమె స్పీకర్ ని క్షమాపణలు కోరి సస్పెన్షన్ వేటు పడకుండా తప్పించుకొనేది. లేదా కనీసం ఇవ్వాళ్ళ ఆయనను కలిసి తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయమని కోరుతాననో లేకపోతే ఆయన నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తాననో చెప్పి ఉండాలి. కానీ నిన్న ఆమె అటువంటి మాటలేవీ చెప్పకుండా ఇక నుండి ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతుంటానని చెప్పారు. అంటే తనను సస్పెండ్ చేసినందుకు బాధపదలేదని ఆమె నిజంగానే చెప్పారని అర్ధమవుతోంది.   సాధారణంగా ఎమ్మెల్యేలని కొన్ని రోజులపాటు సస్పెండ్ చేసినా చాలామంది తీవ్ర మనస్తాపానికి గురవుతుంటారు. కానీ రోజాని ఏకంగా ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేసినా ఆమె కించిత్ బాధపడలేదు. అదే ముక్క ఆమె చాలా దైర్యంగా చెప్పారు కూడా. మరి అటువంటప్పుడు మళ్ళీ ఆమె అసెంబ్లీకి వచ్చి హడావుడి చేయడం, పోలీసులతో ఘర్షణ పడటం, స్పృహ తప్పి పడిపోవడం, నిమ్స్ ఆసుపత్రిలో చేరడం, జగన్ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని వెళ్లి ఆమెను పరామర్శించడం, ఆమె ఆరోగ్యం గురించి మీడియాకి బ్రీఫింగ్ చేయడం అంతా చాలా నాటకీయంగా ఉంది. రోజా అసెంబ్లీ బయట హడావుడి చేస్తే, జగన్మోహన్ రెడ్డి, వైకాపా సభ్యులు సభ లోపల ఆమెపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ సభా కార్యక్రమాలను స్తంభింపజేసి, సభను వాయిదా పడేలా చేసి ఆ డ్రామాను మరింత రక్తి కట్టించారు. ఒకవేళ ఆమెకి సభకి రావాలనే ఆసక్తి ఉన్నా లేకపోయినా, ఆమెను సభ నుంచి అంత సుదీర్ఘ కాలానికి సస్పెండ్ చేస్తునప్పుడు తక్షణమే జగన్మోహన్ రెడ్డి అందుకు అభ్యంతరం చెప్పి ఉండి ఉంటే నేడు ఆయన వాదనకు అర్ధం ఉండేది. నిన్న ఆమె సస్పెండ్ అయిన తరువాత జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ సభ్యులు అసలు ఏమీ జరగనట్లుగా సభా కార్యక్రమాలలో పాల్గొన్నారు. కానీ ఈరోజు ఆమె సస్పెన్షన్ ఎత్తివేయాలని సభను స్తంభింపజేయడం చాలా విడ్డూరంగా ఉంది. తనను సభ నుంచి సస్పెండ్ చేసినందుకు బాధపడటం లేదని రోజా నోరు జారినందుకు, మీడియాలో జబర్దస్త్ కామెంట్లు వినిపించాయి. బహుశః ఆ కారణంగానే వారు ఇంత హడావుడి చేయవలసి వచ్చిందేమో?   ఆమెకు సభకు తిరిగి రావాలనే ఉద్దేశ్యమే ఉండి ఉంటే, ఆమె స్పీకర్ కోడెల శివప్రసాద రావుని కలిసి, నిన్న ముఖ్యమంత్రితో తన అనుచిత ప్రవర్తనకు క్షమాపణలు చెప్పుకొని, తనపై సస్పెన్షన్ ఎత్తివేయవలసిందిగా కోరవచ్చును. లేదా ఆమెకు ఆ అవకాశం లేకపోతే తన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ద్వారా సభలో క్షమాపణలు కోరి, సస్పెన్షన్ ఎత్తివేయించుకోవచ్చును. ఆమె తన తీరు మార్చుకొనేందుకు అంగీకరించినట్లయితే ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేయడం గురించి ఆలోచిస్తామని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అంటే ఆమెపై విధించిన సస్పెన్షన్ తొలగించుకొనేందుకు ఇంకా అవకాశం ఉందని స్పష్టమవుతోంది. కానీ రోజా, జగన్మోహన్ రెడ్డి, వైకాపా సభ్యులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకోవడం లేదనే విషయం ఈరోజు వారు సభలో వ్యవహరించిన తీరుతో అర్ధమవుతోంది. ఒక ఎమ్మెల్యేని ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేయడం సముచితమా కాదా? అనే చర్చను పక్కనబెట్టి ఆలోచిస్తే, స్పీకర్ కి క్షమాపణలు చెప్పి సస్పెన్షన్ ఎత్తివేయించుకొనే అవకాశం ఉన్నా దానిని వైకాపా ఎందుకు వినియోగించుకోవడానికి ఇష్టపడలేదు? ఇష్టం లేకపోయినా మళ్ళీ ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఎందుకు పట్టుబడుతున్నారు? అనే సందేహాలు కలగడం సహజం. సస్పెన్షన్ గురించి రోజా మాట్లాడిన మాటల వలన ప్రజలలో దురభిప్రాయం ఏర్పడి ఉండవచ్చును. దానిని తొలగించి తిరిగి రాష్ట్ర ప్రభుత్వమే నిరంకుశ పాలన సాగిస్తోందని రుజువు చేసేందుకే వైకాపా సభ్యులు ఈవిధంగా వ్యవహరించి ఉండవచ్చును. వైకాపా ఆలోచనలకు జగన్మోహన్ రెడ్డి మాటలు అందుకు అద్దం పడుతున్నాయి.

ముఖ్యమంత్రిని తప్పు పట్టడమే పార్టీ విధానంగా మార్చుకొన్న వైకాపా?

  రాజకీయ పార్టీల మధ్య స్నేహాలు, శత్రుత్వాలు సర్వసాధారణమయిన విషయమే. మిత్రులుగా ఉన్నప్పుడు తప్పులు సమస్యలను పట్టించుకోకపోవడం, శత్రువులుగా ఉన్నప్పుడు విమర్శించుకోవడం కూడా సహజమే. ఒక స్థాయి వరకు మాత్రమే విమర్శలు చేసుకొంటే పరువాలేదు. కానీ తమ మధ్య ఉన్న శత్రుత్వం కారణంగా వ్యక్తిగత దూషణలకు, బెదిరింపులకి దిగుతూ రాజకీయాలను ఇంకా నీచ స్థాయికి దిగజార్చితే అంతిమంగా దాని విషపరిణామాలను ఎదుర్కోవలసింది..నష్టపోయేది కూడా ఆ రాజకీయ పార్టీలు, వాటి నేతలే తప్ప ప్రజలు కాదు.   రాజశేఖర్ రెడ్డి మరణించినప్పటి నుండి ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్ రెడ్డి ఎంతగా పరితపించిపోతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ తనకు ఆ అవకాశం దక్కకపోవడానికి చంద్రబాబు నాయుడే కారకుడని దృడంగా విశ్వసిస్తున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఏమి చేసినప్పటికీ దానిలో తప్పులు ఎంచుతూ విమర్శించడమే తన పార్టీ విధానంగా మార్చేసుకొన్నారు.   అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయం చంద్రబాబు నాయుడుకి గౌరవ డాక్టరేట్ ఇస్తున్నట్లు ప్రకటించగానే దానిపై కూడా వైకాపా ఎమ్మెల్యే రోజా చాలా అనుచితంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడుకి చికాగో విశ్వవిద్యాలయాన్ని ‘మేనేజ్’ చేసి డాక్టరేట్ సంపాదించుకొంటున్నారని రోజా ఆరోపించారు. ఆయనకు డాక్టరేట్ ఇచ్చి చికాగో విశ్వవిద్యాలయం తన స్థాయిని దిగజార్చుకొందని విమర్శించారు. అయితే చంద్రబాబు నాయుడుకి ఈ డాక్టరేట్ వచ్చినా రాకపోయినా కొత్తగా వచ్చే లాభమూ లేదు... నష్టమూ లేదని అందరికీ తెలుసు. అది కేవలం ఒక గుర్తింపు మాత్రమే. దాని కోసం ఆయన అర్రులు చాచవలసిన అవసరం లేదని అందరికీ తెలుసు. ఒకవేళ చికాగో విశ్వవిద్యాలయంలో నిజంగా ఎవరయినా ‘మేనేజ్’ చేసి డాక్టరేట్ డిగ్రీలు ఇప్పించుకొనే అవకాశమే ఉండి ఉంటే అదిచ్చే డాక్టరేట్లను ఎవరూ స్వీకరించి ఉండేవారే కాదు.   చంద్రబాబు నాయుడుని ఏదో ఒకవిధంగా అవమానించాలి. ప్రజలలో ఆయనపట్ల అపోహలు, అనుమానాలు సృష్టించాలి. అప్రదిష్ట పాలు చేయాలనే తపన వైకాపా చేస్తున్న ప్రతీ ఆరోపణలో ప్రస్పుటంగా కనిపిస్తుంటుంది. దేశంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ స్థానంలో ఉందని ప్రపంచ బ్యాంక్ ప్రకటిస్తే, అందుకు రాష్ట్ర ప్రజలందరూ చాలా సంతోషించారు కానీ వైకాపా నేతలు చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ ని కూడా ‘మేనేజ్’ చేసి ఆ ప్రకటన ఇప్పించుకొన్నారని విమర్శించారు.   ప్రపంచ బ్యాంక్ చేసిన ఆ ప్రకటన వలన రాష్ట్రానికి ఎంతో కొంత లాభమే తప్ప నష్టం జరగదని అందరికీ తెలుసు. కానీ తెదేపాను వ్యతిరేకించడమే పార్టీ విధానంగా మార్చుకొన్న వైకాపా నేతలు రాష్ట్రానికి మేలు చేకూరేవాటిని కూడా వ్యతిరేకిస్తారని అది స్పష్టం చేస్తోంది. తెదేపా ప్రభుత్వం తప్పులు చేస్తే తప్పకుండా వేలెత్తి చూపవలసిందే. తెదేపాకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా దాని తప్పులను వేలెత్తి చూపుతూ ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దుకోనేలాగ వారు చేస్తుంటారు తప్ప వైకాపా నేతల్లాగ ఉచితానుచితాలు మరిచి నిత్యం వ్యక్తిగత దూషణలకి, విమర్శలకి దిగరు.   ఇదివరకు నిత్యం రామోజీరావుని, ఆయన రాజకీయ విధానాలని విమర్శిస్తూ, అవహేళన చేస్తూ సాక్షి మీడియాలో కధనాలు, కార్టూన్లు ప్రచురించేవారు. కానీ ఒకానొకరోజున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆయన వద్దకే వెళ్లి చేతులు జోడించి మాట్లాడవలసి వచ్చింది. దానివలన రామోజీరావు గౌరవం మరింత పెరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రజలలో మరింత పలుచబడ్డారు. ఒక స్థాయికి మించి విమర్శలకు, దూషణలకు పాల్పడితే చివరికి ఏమవుతుందో తెలుసుకోవడానికి అదే ఒక చక్కటి ఉదారణగా నిలుస్తోంది.   తన బద్ధ శత్రువయిన రామోజీరావు ముందు చేతులు జోడించి నిలబడవలసిన పరిస్థితి ఎందుకు కలిగింది? అని ఆలోచించి మళ్ళీ అటువంటి పరిస్థితులు చేజేతులా కల్పించుకోకుండా జాగ్రత్తపడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి యధాప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తొమిదేళ్ళుగా రాజకీయాలలో ఉన్నప్పటికీ ఇంకా రాజకీయ అపరిపక్వత ప్రదర్శిస్తూ, చిన్న పిల్లాడిలా ముఖ్యమంత్రి అంతటివాడికి రకరకాల పేర్లు పెడుతూ అవహేళన చేస్తున్నారు. ఎక్కడో అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయం మన ముఖ్యమంత్రిని డాక్టరేట్ ఇచ్చి గౌరవిస్తుంటే, రాష్ట్రానికి చెందిన వైకాపా నేతలు ఆయన పట్ల చాలా అనుచితంగా మాట్లాడుతున్నారు.   యదా రాజ తదా ప్రజా అన్నట్లుగా తమ పార్టీ అధ్యక్షుడే ముఖ్యమంత్రి పట్ల అనుచితంగా మాట్లాడుతుంటే, వైకాపా ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, రోజా వంటివారు వేరేలా మాట్లాడుతారని ఎవరూ ఆశించలేరు. కానీ అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు దేనికీ ‘అతి’ పనికి రాదని పెద్దలు చెపుతుంటారు. తమిళనాడు రాష్ట్రంలో డిఎంకె, అన్నా డిఎంకె పార్టీలు రెండూ పోటాపోటీగా ఆ రాష్ట్ర రాజకీయాలను అత్యంత నీచస్థాయికి తీసుకువెళ్ళిపోయాయి. చివరికి ఆ రెండు పార్టీలే అవి ప్రదర్శించిన ఆ ‘అతి’కి మూల్యం చెల్లించడం అందరూ కళ్ళారా చూసారు. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వైకాపా ఆ స్థాయికి రాజకీయాలు దిగజార్చాలని ప్రయత్నిస్తే చివరికి తమిళనాడు పరిస్థితులే ఇక్కడా పునరావృతం కాక తప్పదని గ్రహించాలి.

వైకాపా వ్యూహం మళ్ళీ బెడిసి కొట్టబోతోందా?

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈరోజు మొదలయిన వెంటనే ప్రధాన ప్రతిపక్షమయిన వైకాపా కాల్ మనీ వ్యవహరంపై తక్షణమే సభలో చర్చకు అనుమతించాలని పట్టుబడుతూ సభా కార్యక్రమాలను స్తంభింపజేస్తోంది. రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న కాల్ మనీ వ్యవహారం, ఆ కారణంగా రాష్ట్రంలో అనేకమంది మహిళలు కాల్ మనీ గూండాల చేతిలో దౌర్జన్యానికి గురవడం చాలా తీవ్రమయిన విషయమే. ఉభయసభలలో దానిపై లోతుగా చర్చించి, ఈ సమస్యకు పరిష్కారం కనుగొనవలసిన అవసరం ఉంది. కానీ అధికార తెదేపాని అసెంబ్లీలో గట్టిగా ఎదుర్కోవాలనే తాపత్రయంలో వైకాపా సభ్యులు చేస్తున్న ఆందోళన కారణంగానే దానిపై సభలో ఎటువంటి చర్చ జరగకుండాపోయే ప్రమాదం కనబడుతోంది.   ఈ వ్యవహారంపై సభలో రేపు చర్చిద్దామని సభాపతి డా.కోడెల శివప్రసాద రావు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా వినకుండా వైకాపా నేతలు సభాకార్యక్రమాలను స్తంభింపజేస్తుండటంతో చాలా తీవ్రమయిన ఈ సమస్యపై సభలో ఎటువంటి చర్చ జరగకుండా అధికార ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై మరొకరు వ్యక్తిగత స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసుకోవడానికే సభా సమయం సరిపోతోంది. కేవలం కాల్ మనీ వ్యవహారం గురించి మాత్రమే కాకుండా ఇంకా కల్తీ మద్యం వ్యవహారం, రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేయడం, విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తదితర అనేక సమస్యల గురించి సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైకాపా నిన్ననే ప్రకటించింది. కానీ కాల్ మనీ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతూ తను లేవనెత్తాలనుకొన్న ఈ సమస్యలపై కూడా సభలో ఎటువంటి చర్చ జరగకుండా చేసుకొంటోంది.   శాసనసభలో ప్రభుత్వంపై ఎంత ధాటిగా విరుచుకుపడితే అంత గొప్ప అన్నట్లు వైకాపా వ్యవహరిస్తోంది తప్ప, తను అమలు చేస్తున్న ఈ వ్యూహంలో తనే స్వయంగా ఇరుక్కొందని గుర్తించలేకపోతోంది. ఆ కారణంగా ప్రభుత్వం ఈ వ్యవహారాలలో సభలో ఎటువంటి సంజాయిషీలు చెప్పుకొనే అవసరం లేకుండా చేస్తోంది. అలాగే ఈ సమస్యలపై సభలో చర్చించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉన్నప్పటికీ, వైకాపాయే సభా కార్యక్రమాలు జరుగకుండా అడ్డుపడుతూ వాటిపై చర్చజరగకుండా అడ్డుపడుతోందనే అభిప్రాయం ప్రజలకు కలిగేలా చేస్తోంది. సభా కార్యక్రమాలను జరుగకుండా అడ్డుపడటం వలన అధికార పార్టీకి ఎటువంటి నష్టమూ ఉండబోదనే సంగతి ప్రధాన ప్రతిపక్షమయిన వైకాపాకు తెలియక పోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.   మిగిలిన నాలుగు రోజులు కూడా వైకాపా సభ్యులు ఇదేవిధంగా సభా కార్యక్రమాలను అడ్డుకొన్నట్లయితే ప్రభుత్వం ఎవరికీ ఎటువంటి సమాధానం చెప్పుకోనవసరం లేకుండానే బయటపడగలదని గ్రహిస్తే ఈవిధంగా వ్యవహరించి ఉండేదే కాదు. ఇంత చిన్న విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవడం విచిత్రంగానే ఉంది. కనీసం ఆ పార్టీలో సీనియర్ నేతలయినా ఆయనకు చెప్పి ఉండాల్సింది. ఒకవేళ ఈ సమస్యలన్నిటిపై చర్చ జరుగకుండా అసెంబ్లీ సమావేశాలు ముగిసినట్లయితే, సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉండిపోతుంది.

విషప్రచారంతో అమరావతి ప్రతిష్టను దెబ్బ తీస్తున్న ప్రతిపక్షాలు

  ఒక నగరానికి లేదా దేశానికి మంచి పేరు సంపాదించుకోవడానికి అనేక దశాబ్దాలు పట్టవచ్చును. కానీ చెడ్డ పేరు సంపాదించుకోవడానికి కొన్ని రోజుల సమయం చాలు. కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ‘మత అసహనం’ అనే విష ప్రచారం వలన ప్రపంచ దేశాలు మళ్ళీ భారత్ ని అనుమానంగా చూస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడి కొన్ని వారాల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడి మీడియా ప్రతినిధులు భారత్ లో మత అసహనం గురించి ఆయనను ప్రశ్నించడమే అందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చును. దేశంలో రాజకీయ పార్టీలు ఒకదానినొకటి దెబ్బ తీసుకొనేందుకు మొదలుపెడుతున్న ఇటువంటి విష ప్రచారాల వలన దేశానికి, రాష్ట్రాలకి ఎంత చెడ్డపేరు కలుగుతుందో అర్ధం చేసుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చును.   ఇప్పుడు విజయవాడలో కల్తీ మద్యం, కాల్ మనీ వ్యవహారం బయటపడిన తరువాత ‘విజయవాడ మాఫియా రాజధాని’, 'ఆంధ్రప్రదేశ్ రాజధాని 'ఒక నేర సామ్రాజ్యానికి రాజధాని’ అంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా జోరుగా ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారంతో వైకాపా తన రాజకీయ శత్రువు అయిన తెదేపాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని రాజకీయంగా దెబ్బ తీయాలని ప్రయత్నిస్తోంది. కానీ అది చేస్తున్న ఈ విషప్రచారం వలన అమరావతికి చెడ్డపేరు వస్తుందనే విషయం పట్టించుకోవడం లేదు.   నిజానికి అమరావతి నిర్మాణం మొదలుకాక మునుపు నుండే దానికి ప్రపంచ వ్యాప్తంగా ఒక మంచి పేరును సంపాదించిపెట్టాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంఖుస్థాపన కార్యక్రమాన్ని అంత అట్టహాసంగా నిర్వహించారు. తద్వారా ప్రపంచ దేశాల నుండి రాష్ట్రానికి బారీగా పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని, తద్వారా రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన కలలు కన్నారు. కానీ రాష్ట్రం, రాజధాని పరువు ఏమయినా పరువాలేదు తెదేపా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని దెబ్బ తీయగలిగితే చాలు అన్నట్లు వైకాపా ‘విజయవాడ మాఫియా రాజధాని’ అంటూ విషప్రచారం చేస్తున్నారు. దాని వలన రాష్ట్రానికి, రాజధానికి, ప్రభుత్వానికి ఎంత నష్టం, అప్రదిష్ట కలుగుతుందో ఎవరూ ఊహించలేరు.   ప్రపంచంలో ఎంత చిన్న, పెద్ద, బీద, గొప్ప దేశాలు, నగరాలలోనయినా ఏదో ఒకస్థాయిలో ఇటువంటి నేరాలు జరుగుతూనే ఉంటాయి. అమెరికాలో పట్టపగలే కాల్పులు జరుగుతుంటాయి. వాటిలో అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటారు. అంత మాత్రాన్న అమెరికాని తప్పు పట్టడం అవివేకమే అవుతుంది. అలాగే బ్యాంకాక్, హాంగ్ కాంగ్ వంటి నగరాలలో అనేక ఘోరమయిన నేరాలు జరుగుతుంటాయి. కనుక వాటిని చెడ్డ నగరాలనలేము.   ప్రతీ చోట నేరాలు ఏదో ఒక స్థాయిలో జరుగుతూనే ఉంటాయి. వాటిని నియంత్రించడానికే ప్రభుత్వం, పోలీస్, న్యాయ వ్యవస్థలు ఉంటాయి. విజయవాడలో బయటపడుతున్న నేరాలను కూడా అదే విధంగా నియంత్రించవలసి ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం, పోలీసులు ఆ పనిలోనే ఉన్నారు. ఒకవేళ ప్రతిపక్షాలకు రాష్ట్ర ప్రభుత్వంపై, పోలీసులపై నమ్మకం లేకపోయినట్లయితే, ప్రభుత్వమే నేరస్తులను వెనకేసుకొని వస్తోందని అవి భావిస్తున్నట్లయితే దానిని సరిచేసేందుకు వారు న్యాయ వ్యవస్థను ఆశ్రయించవచ్చును. కానీ ప్రతిపక్షాలు తమ రాజకీయ పగలు, కక్షల కోసం రాష్ట్రం, రాజధాని పేరు ప్రతిష్టలకు భంగం కలిగించడాన్ని ఎవరూ సహించరు.

నిర్భయ కేసులో బాలనేరస్తుడిని విడుదల చేయాలా...వద్దా?

  సరిగ్గా మూడేళ్ళ క్రితం డిల్లీలో జరిగిన నిర్భయ కేసులో దోషిగా నిర్ధారించబడిన బాల నేరస్థుడికి బాల నేరస్తుల చట్ట ప్రకారం మూడేళ్ళ నిర్బంధం విధించబడింది. అతను ఈ మూడేళ్ళ కాలం డిల్లీలో బాల నేరస్తుల సంరక్షణా కేంద్రంలో గడిపాడు. అతనికి విధించిన శిక్ష కాలం ఈనెల 20వ తేదీతో పూర్తవుతుంది. కనుక అతనిని విడుదల చేయవలసి ఉంది. అతనికిప్పుడు 20 ఏళ్ళు నిండాయి. కనుక అతను మళ్ళీ నేరాలు చేయకుండా సాధారణ జీవితం జీవించేందుకు డిల్లీ ప్రభుత్వం అతనికి రూ. 10,000 నగదు, ఒక కుట్టు మిషను అందించడానికి సిద్దపడింది. అతని తల్లి తండ్రులను స్వగ్రామం నుండి కారులో రప్పించి, అతనిని వారికి అప్పగించి మళ్ళీ కారులో వారిని స్వగ్రామంలో దింపి వచ్చేందుకు కూడా డిల్లీ ప్రభుత్వం సిద్దపడింది.   అటువంటి దారుణమయిన నేరం చేసిన వ్యక్తికి ప్రభుత్వమే ఆర్ధిక సహాయం చేయడాన్ని చాలా మంది తప్పు పడుతున్నారు. నేరం చేసినవాడిని కటినంగా శిక్షించలేకపోగా మళ్ళీ అతనికి ఇటువంటి బహుమానాలు ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. “అతనికి డిల్లీ ప్రభుత్వమే ఇల్లు కట్టించి పెళ్లి చేసి ఉద్యోగం కూడా ఇస్తే బాగుండేది కదా? ఇంక మళ్ళీ అటువంటి నేరాలు చేయడు..”అని డిల్లీ ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.   నేరస్తులను శిక్షించడం కంటే సంస్కరించడమే మేలని అందరూ అంగీకరిస్తారు. ఈ మూడేళ్ళ కాలంలో బాల నేరస్తుల సంరక్షణా కేంద్రంలో అతనిని సంస్కరించి సన్మార్గం వైపు మళ్ళించే ప్రయత్నాలు జరిగాయో లేదో తెలియదు కానీ అతను డిల్లీ హైకోర్టు బాంబు ప్రేలుడు కేసులో నిర్బంధించబడిన మరో బాల నేరస్తుడితో స్నేహం చేస్తున్నట్లు నిఘా వర్గాలు కనుగొన్నారు. అతను ఉగ్రవాదంపై ఆసక్తి పెంచుకొన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కనుక అతని మానసిక పరిస్థితి ఏవిధంగా ఉందో తెలుసుకోకుండా అతనిని బయటకు పంపినట్లయితే అతని వలన సమాజానికి ఇంకా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, కనుక అతని విడుదలను మరికొంత కాలం పాటు పొడిగించాలని కేంద్రప్రభుత్వం డిల్లీ హైకోర్టుని అభ్యర్ధించింది.   బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా అతని విడుదల కాకుండా నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో ఒక పిటిషను వేశారు. ఒకవేళ అతనిని విడిచిపెట్టదలిస్తే, అతనిపై నిరంతర నిఘా ఉంచవలసిందిగా నిర్భయ తల్లి తండ్రులు హైకోర్టుని, కేంద్ర హోంమంత్రి రాజ్ నాద్ సింగ్ ని కోరారు. ఆ విధంగా చేసినట్లయితే మళ్ళీ అతని వలన సమాజానికి ప్రమాదం కలగకుండా నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన డిల్లీ హైకోర్టు, దీనిపై తీర్పు చెప్పే ముందు ఈ విషయాలన్నిటినీ పరిగణనలోకి తీసుకొంటామని చెప్పింది కానీ ఇంకా తీర్పు చెప్పలేదు.   ఇటువంటి హేయమయిన నేరాలకి పాల్పడిన 16-18 ఏళ్ల వయసుగల బాల నేరస్తులను మేజర్లుగానే పరిగణించి వారికి చట్ట ప్రకారం శిక్ష వేసేందుకు కేంద్ర ప్రభుత్వం బాల నేరస్తుల చట్టానికి సవరణ చేసి పార్లమెంటులో ప్రవేశపెట్టింది. లోక్ సభ దానికి ఆమోదం తెలిపినప్పటికీ అధికార, విపక్షాల మధ్య పార్లమెంటులో జరుగుతున్న రాద్దాంతం కారణంగా అది రాజ్యసభ ఆమోదానికి నోచుకోలేదు. కనుక నేటికీ పాత చట్టమే అమలులో ఉంది. కనుక ఈ నిర్భయ కేసులో బాలనేరస్తుడు ఇప్పుడు మేజర్ అయినప్పటికీ అతనిని శిక్షించే అవకాశం లేదు.   అనేక నేరాలు చేసి జైలు శిక్ష అనుభవించిన వారిని సత్ప్రవర్తన కారణంగా జైలు నుండి విడిచిపెడుతుంటారు. కానీ ఈ నిర్భయ నేరస్థుడు తన శిక్ష కాలం పూర్తి చేసిన్నపటికీ అతని విషయంలో ఇంకా ఇంత చర్చ, అనుమానాలు రేకెత్తుతున్నాయి అంటే కారణం అంత చిన్న వయసులోనే అంత తీవ్రమయిన నేరానికి పాల్పడినందుకేనని భావించవచ్చును. మూడేళ్ళపాటు బాలనేరస్థుల సంరక్షణా కేంద్రంలో ఉంచినపుడు అతనిని సంస్కరించలేకపోతే అది వారి వైఫల్యంగానే భావించవచ్చును. లేదా అతను సంస్కరించలేనంత కరుడుగట్టిన నేరస్తుడిగా మారి ఉండవచ్చునని అనుకోవాలి. అయితే ఆ కారణంగా అతను శిక్ష పూర్తి చేసుకొన్న తరువాత కూడా ఇంకా నిర్బంధించి ఉంచడం కూడా చట్ట ప్రకారం తప్పే అవుతుంది. కానీ సమాజానికి అతని వలన హాని కలుగుతుందని భావిస్తున్నట్లయితే అతనిని జైలుకి తరలించక తప్పదు. లేదా నిర్భయ తల్లి తండ్రులు సూచిస్తున్నట్లుగా అతను విడుదలయిన తరువాత అతనిపై నిరంతర నిఘా పెట్టవలసి ఉంటుంది. డిల్లీ హైకోర్టు ఈ విషయంలో తగిన నిర్ణయమే తీసుకొంటుందని ఆశిద్దాము.

దేశానికి బలమయిన నాయకత్వం అవసరమే కదా?

  జాతీయ పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో వ్యక్తిపూజ బాగా ఎక్కువయిపోయిందని ఎస్.సి.పి అధినేత శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ, బీజేపీలో ప్రధాని నరేంద్ర మోడీల చుట్టూనే ఆ పార్టీల రాజకీయాలు నడుస్తున్నాయని, అలాగే అధికారం అంతా వారి చేతుల్లోనే కేంద్రీకృతం అయి ఉందని, అది మంచి పద్ధతి కాదని శరద్ పవర్ తన ఆత్మకధలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తి ఆరాధన ఇవ్వాళ్ళ కొత్తగా మొదలయిందేమీ కాదు. ఇందిరా గాంధీ హయాంలోనే అది పరాకాష్టకు చేరుకొంది. నాటి నుండి నేటి వరకు అది కొనసాగుతూనే ఉంది. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ తన స్వశక్తి, పార్టీ సిద్దాంతాల కంటే గాంధీ, నెహ్రూ కుటుంబం పేరు మీద, ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే తన రాజకీయ మనుగడ సాగిస్తోందని చెప్పక తప్పదు. అందుకే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి తనే అర్హుడనని భావించగలుగుతున్నారు. కానీ ఆయన తన నాయకత్వ లక్షణాలు నిరూపించుకోలేకపోవడం, పార్టీలో సమర్దులయిన వేరెవరికీ పార్టీ పగ్గాలు కట్టబెట్టే ఆలోచన చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతోంది. ఒక వ్యక్తి మీద ఆధారపడి పార్టీ లేదా సంస్థ నడవడం వలన ఎటువంటి నష్టం జరుగవచ్చో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూసినట్లయితే అర్ధమవుతుంది.   బీజేపీలో ఏనాడూ ఇటువంటి వ్యక్తి ఆరాధన చూడలేదు. ఒకప్పుడు బీజేపీ అనగానే అటల్ బిహారీ వాజ్ పేయి, లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, యశ్వంత్ సిన్హా వంటి అనేకమంది ప్రముఖుల పేర్లు మదిలో మెదిలేవి. కానీ ప్రస్తుతం ఆ పార్టీ మోడీ నామస్మరణలో మునిగిపోయిందని, అధికారం అంతా ఆయన చేతిలోనే కేంద్రీకృతం అయిందని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. దేశంలో చాలా మంది అదే అభిప్రాయంతో ఉన్నారు.   ఆ అభిప్రాయం సహేతుకంగానే కనిపిస్తునప్పటికీ, ఒక్కోసారి అటువంటి విధానం కూడా అవసరం అవుతుంటుంది. గత పదేళ్ళ యూపీఏ పాలనలో పరిపాలనా వ్యవస్థలన్నీ అదుపు తప్పాయి. తత్ఫలితంగా దేశంలో అవినీతి, ఆరాచకం పెరిగిపోయి ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ పరిస్థితులను చక్కదిద్ది మన వ్యవస్థలను మళ్ళీ గాడినపెట్టాలంటే దేశానికి చాలా దృడమయిన నాయకత్వం అవసరం. అది మోడీలో ఉందని దేశ ప్రజలు భావించబట్టే ఆయనకు అధికారం కట్టబెట్టారు. అందుకే ఆ పార్టీలో అందరూ ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన వెంటనే ఆ గాడి తప్పిన వ్యవస్థలన్నిటినీ మళ్ళీ గాడిన పెట్టడం మొదలుపెట్టారు. అవినీతి, కుంభకోణాలకు తావులేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. అంతర్జాతీయంగా దేశ పేరు ప్రతిష్టలు, విదేశాలతో భారత్ సంబంధాలు మెరుగుపరచగలిగారు.   ఇంతకు ముందు కేంద్రంలో దీనికి పూర్తి భిన్నమయిన పరిస్థితులు నెలకొని ఉండేవి. దేశంలో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి గొప్ప పేరు సంపాదించుకొన్న డా. మన్మోహన్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అంతకు పదింతలు చెడ్డపేరు మూటగట్టుకట్టుకొన్నారు. ఆయన మచ్చ లేని నాయకుడయినప్పటికీ బొగ్గు కుంభకోణం కేసులో నిందితుడుగా కూడా పేర్కొనబడ్డారు. అందుకు కారణం ఆయన దృడంగా వ్యవహరించలేకపోవడమే. ఆయన పేరుకి ప్రధాని అయినప్పటికీ పెత్తనమంతా సోనియా గాంధీ చేసారు. కేంద్రంలో రెండు సమాంతర అధికార కేంద్రాలు ఏర్పడటం వలన దేశంలో వ్యవస్థలన్నీ గాడి తప్పాయి. దానిని మోడీ సరిచేస్తున్నారు. అందువలన అధికారం అంతా అయన చేతిలోనే ఉన్నట్లు పైకి కనబడుతున్నప్పటికీ లేదా అలాగ ప్రచారం జరుగుతున్నప్పటికీ అది పూర్తిగా వాస్తవం కాదని చెప్పవచ్చును.   ఉదాహరణకి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారి ఇటీవల విజయవాడలో ఫ్లై ఓవర్ కి శంఖుస్థాపన చేయడానికి వచ్చినపుడు రాష్ట్రంలో హైవే ప్రాజెక్టుల నిర్మాణానికి ఏకంగా రూ. 65,000 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే కేంద్రమానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ రాష్ట్రంలో ఐదు ఉన్నత విద్యాసంస్థలకు శంఖుస్థాపన చేసి, శిక్షణా తరగతులు ప్రారంభించడానికి అనుమతులు కూడా మంజూరు చేసారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు రాజధాని నిర్మాణం మొదలుకాక మునుపే రాష్ట్రానికి రూ.1850 కోట్ల నిధులు తన శాఖ నుండి విడుదల చేసారు. ఇంకా డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, బెల్ వంటి అనేక ఇతర ప్రాజెక్టులు మంజూరు అయ్యేయి.   ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే కాకుండా దేశంలో వివిధ రాష్ట్రాలకు గత ఎదాదిన్నర కాలంలో అనేక ప్రాజెక్టులు, నిధులు మంజూరు అవుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మంత్రులు, అధికారులు అందరూ కలిసికట్టుగా చేస్తున్న సమిష్టి కృషి కారణంగానే ఇవన్నీ సాధ్యం అవుతాయి తప్ప కేవలం మోడీయే స్వయంగా చేయలేరని అందరికీ తెలుసు. అయితే ఈ వ్యవస్థలన్నీ సక్రమంగా, సమర్ధంగా పనిచేస్తున్నాయంటే ప్రధాని నరేంద్ర మోడి దృడమయిన నాయకత్వం ప్రధాన కారణమని చెప్పక తప్పదు. దానిని ఎవరు ఏ విధంగా భావిస్తే ఆవిధంగా ఊహించుకోవచ్చును. కానీ దేశాభివృద్ధికి అటువంటి బలమయిన నాయకత్వం అవసరమనే విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు ఉండవనే భావించవచ్చును.

భయం కారణంగా మన విలువలను వదులుకోకూడదు: సుందర్ పిచాయ్

  భారత్ లో అసహనం పెరిగిపోతోందని కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతోంది. ఆ అసహనం జబ్బు ఇప్పుడు అమెరికాకి కూడా పాకిపోయింది. వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేయబోతున్న డోనాల్డ్ ట్రంప్ అమెరికాలోకి ముస్లింలను అనుమతించకూడదని, ఇప్పటికే స్థిరపడిన వారి పూర్తి వివరాలు సర్వే చేసి సేకరించాలని చెప్పడంతో అమెరికాలో కూడా మత అసహనంపై చర్చ మొదలయిపోయిందిపుడు. అమెరికాలో ఎక్కువ శాతం మంది ప్రజలు ఆయన అభిప్రాయాన్ని తప్పు పట్టారు. చివరికి ఫేస్ బుక్, గుగూల్ సీ.ఈ.ఓ.లు మార్క్ జూకర్ బెర్గ్, సుందర్ పిచాయ్ లు కూడా ఆయనతో విభేదించారు. సుందర్ పిచాయ్ ‘మీడియం’ అనే బ్లాగులో ఈ మత అసహనంపై తన అభిప్రాయాలు ఇలాగ వ్యక్తం చేసారు.   “కేవలం భయం కారణంగా మనం మన విలువలని కోల్పోకూడదు. నేను అమెరికాలో స్థిరపడి 22సం.లు అయింది. నా స్వదేశమయిన భారత్ లో నివసిస్తున్నప్పుడు నాకు దాని పట్ల ఎటువంటి భావన ఉండేదో, అటువంటి భావనే అమెరికా పట్ల నేను పొందుతున్నాను. ఈ దేశం కూడా నా స్వంత దేశమనే భావన పొందుతున్నాను. అమెరికా ఎప్పుడూ స్వేచ్చా స్వాతంత్ర్యాలకి ప్రతీకగా నిలుస్తూనే ఉంది. ఇక్కడ సంకుచితత్వానికి తావు లేదు. ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా అందరికీ తమ కలలను సాకారం చేసుకొనేందుకు సమానావకాశాలు కల్పిస్తుంది. నిజానికి అమెరికా అంటే ఒక వలసవాదుల దేశం. ఇప్పుడు మీడియాలో మత అసహనం గురించి కొందరు చెపుతున్న మాటలు వింటునప్పుడు మనసుకి కష్టం అనిపిస్తోంది. ఒక దేశం లేదా ఒక మతానికి చెందిన ప్రజల అభిప్రాయాలను, వారి తెలివితేటలను, దేశాభివృద్ధిలో వారి పాత్రని విస్మరించి వారి మతాన్ని మాత్రమే చూడటం చాలా బాధ కలిగిస్తుంది.”   “మా గూగుల్ సంస్థలో వివిధ దేశాలు, మతాలు, విభిన్నాభిప్రాయాలు, భిన్నమయిన ఆలోచన దృక్పధాలు కలిగిన వారు అనేక మంది ఉన్నారు. ప్రతీ ఒక్కరికి ప్రత్యేకత ఉంటుంది. కానీ అందరం కలిసి పనిచేస్తున్నాము. ఈ భిన్నత్వమే మా సంస్థకు ఒక ప్రత్యేకతను సంతరించిపెట్టింది. ఆ భిన్నమయిన ఆలోచనా విధానం కారణంగానే అందరం కలిసి ఎన్నో గొప్ప లక్ష్యాలు సాధించగలిగాము. విభిన్నమయిన లక్ష్యాలుగా నిర్దేశించుకొని ముందుకు సాగిపోగలుగుతున్నాము.”   “ ఒక సంస్థ అయినా దేశమయినా అభివృద్ధి చెందాలంటే భిన్నాభిప్రాయాలు, విభిన్నమయిన ఆలోచనలను, లోతయిన చర్చలను స్వాగతించవలసి ఉంటుంది. అప్పుడే అత్యుత్తమ నిర్ణయాలు, అత్యుత్తమయిన ఫలితాలు వస్తాయి. అవే అభివృద్ధికి బాటలు పరుస్తుంది.” “మత అసహనం పెరిగినపుడు అందరూ కలిసికట్టుగా దానిని అడ్డుకోవాలి. మెజార్టీ వర్గం చెప్పినదే వేదం అని భావించినట్లయితే, మైనార్టీ వర్గం గొంతు వినపడకుండా అణచివేసినట్లవుతుంది. ప్రపంచంలో అందరికీ భావ వ్యక్తీకరణ స్వేచ్చ కలిగి ఉండాలి,” అని అభిప్రాయ పడ్డారు సుందర్ పిచాయ్.

మాట మార్చిన కాంగ్రెస్ పార్టీ

  సోనియా, రాహుల్ గాంధీలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సమావేశాలను హైజాక్ చేస్తోందని, సామాన్య ప్రజలకు మేలు చేకూర్చే కొన్ని బిల్లులు ఆమోదం పొందకుండా అడ్డుపడుతోందని బీజేపీ ఎదురు దాడికి దిగడంతో కాంగ్రెస్ పార్టీ కంగు తింది. నేషనల్ హెరాల్డ్ కేసు ఎప్పుడు ఏవిధంగా మొదలయిందో, అందులో సోనియా, రాహుల్ గాంధీల పాత్రలు, దానిపై ఇంతవరకు సాగిన కోర్టు కేసు మొదలయిన అన్ని అంశాలను వివరంగా తెలియజేసే ఒక చిన్న పుస్తకాన్ని బీజేపీ నిన్న విడుదల చేసింది. ఆ పుస్తకాన్ని పార్లమెంటు సభ్యులందరికీ పంచిపెడుతోంది.   ఊహించని ఈ పరిణామంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జరిగిన పొరపాటును సరిదిద్దుకొనే ప్రయత్నం చేసింది. తాము నేషనల్ హెరాల్డ్ కేసు కారణంగా పార్లమెంటును స్తంభింపజేయడం లేదని, వ్యాపం కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ రాజినామా కోసం, లలిత్ మోడీ కేసులో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే మరియు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రాజీనామాల కోసం, దళితులపై అభ్యంతరకరమయిన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి వి.కె. సింగ్ రాజీనామాల కోసం పట్టుబడుతూ పార్లమెంటును స్తంభిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మాట మార్చింది. అయితే ఈ సమావేశాలు మొదలయినపుడు కాంగ్రెస్ పార్టీ మంత్రి వికె. సింగ్ రాజీనామా చేయాలని ఆందోళన చేసింది కానీ మిగిలిన వారి గురించి అది ఉభయ సభలలో అసలు ప్రస్తావించనే లేదు. కానీ సోనియా, రాహుల్ గాంధీల వ్యక్తిగత సమస్యలయిన నేషనల్ హెరాల్డ్ కేసు పరిష్కారం కోసం పార్లమెంటు సమావేశాలు జరుగకుండా అడ్డుపడుతున్నారని బీజేపీ ఎదురు దాడి చేయడంతో, దాని వలన యావత్ దేశ ప్రజలకు తమ పార్టీపై వ్యతిరేకత ఏర్పడుతుందని గ్రహించి కాంగ్రెస్ పార్టీ మాట మార్చింది. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు గురించి కాంగ్రెస్ పార్టీ సభ్యులు పార్లమెంటులో ప్రస్తావించకుండా వేరే ఇతర సాకులతో పార్లమెంటు సమావేశాలు జరుగకుండా అడ్డుపడేందుకు సిద్ధం అవుతున్నారు.   పార్లమెంటు సమావేశాలు మొదలయిన ప్రతీసారి కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక వంకతో ఉభయసభలలో కార్యక్రమాలు జరుగకుండా అడ్డుపడుతోంది. ఈసారి కూడా మొదట నేషనల్ హెరాల్డ్ కేసు అంశం లేవనెత్తి సభా కార్యక్రమాలు సాగకుండా అడ్డుపడింది. కానీ ఆ అంశంతో సభను స్థంభింపజేస్తే దేశ ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందనే సంగతి చాలా ఆలస్యంగా గ్రహించి మాట మార్చింది. కానీ అదే సమయంలో తన వైఖరిలో ఎటువంటి మార్పు లేదనే విషయం స్పష్టం చేస్తోంది.   రోజువారి జీతాలకు పనిచేసే కూలీలు, కార్మికుల జీతాలు పెంచేందుకు కేంద్రప్రభుత్వం ఒక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కానీ సోనియా, రాహుల్ గాంధీలను కాపాడుకోవడం కోసం ఆ బిల్లు ఆమోదం పొందకుండా కాంగ్రెస్ పార్టీ సభ్యులు అడ్డుపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడి విమర్శించారు. దానిపై సోనియా గాంధీ ప్రతిస్పందిస్తూ “ఆయన ఏమి మాట్లాడాలనుకొంటే అది మాట్లాడనివ్వండి,” అని జవాబు చెప్పారు. అంటే ఎవరు ఏమనుకొన్నా మేము చేయవలసింది చేస్తామని చెపుతున్నట్లుంది. ప్రజా సమస్యల పరిష్కారం కంటే తన స్వంత సమస్యల పరిష్కారమే ఆమెకు ముఖ్యం అన్నట్లుంది.

పాపం... కాంగ్రెస్ పార్టీ!

  సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న తీరు శల్యసారధ్యాన్ని తలపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలలో ఆ పార్టీ ఘోర పరాజయానికి పూర్తి బాధ్యులు వారిరువురే. ఆ మాట బయటవాళ్ళు ఎవరో అనలేదు కాంగ్రెస్ పార్టీ నేతలే అన్నారు. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ వాళ్ళిద్దరినీ పదవులలో తప్పుకొని సమర్దులయిన వారి చేతికి పార్టీ పగ్గాలు అప్పగించమని కొందరు కోరారు. వాళ్ళిద్దరూ తప్పుకోలేదు కానీ అలాగ అడిగిన వారిని మెల్లగా పక్కకు తప్పించేసారు. ఆ తరువాత వరుసపెట్టి నాలుగు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అయినా పార్టీని చక్కదిద్దుకొనే ప్రయత్నం చేయలేదు. తమ పొరపాట్లను, బలహీనతలను గుర్తించడానికి కూడా ఇష్టపడలేదు. కనీసం తమ ఆలోచనా విధానాన్ని కూడా మార్చుకొనేందుకు ఇష్టపడలేదు. నేషనల్ హెరాల్డ్ కేసులో అది మళ్ళీ మరొకమారు స్పష్టం అవుతోంది.   ఈ కేసులో నిందితులుగా ఉన్న సోనియా, రాహుల్ గాంధీలను కోర్టుకు హాజరు కావలసిందేనని డిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అది తమపై కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తూ నిన్న పార్లమెంటును స్తంభింపజేశారు. సామాన్య ప్రజలు ఎవరయినా పోలీస్ స్టేషన్ లేదా కోర్టు గుమ్మం తొక్కవలసివస్తే దానిని చాలా అవమానకరంగా భావిస్తారు. ఆ విషయం ఎవరికయినా తెలుస్తుందేమోనని సిగ్గుతో, బాధతో తమలోతామే కుమిలిపోతారు. కానీ ఒక నేరంలో విచారణకు హాజరవుతున్న సోనియా, రాహుల్ గాంధీలు అదేదో చాలా ఘన కార్యమన్నట్లుగా తమ పార్టీ ఎంపీలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పిసిసి అధ్యక్షులు, పార్టీలో సీనియర్ నేతలు అందరితో కలిసి పాదయాత్ర చేస్తూ ఊరేగింపుగా డిల్లీలోని పాటియాలా కోర్టుకు చేరుకోవాలని ఆలోచిస్తున్నట్లు తాజా సమాచారం. తద్వారా మీడియా, దేశ ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చని వారి ఆలోచన. కాంగ్రెస్ ఆలోచనా విధానం ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవడానికి ఇది ఒక మచ్చు తునక మాత్రమే.   ఇంతకంటే గొప్ప విషయం మరొకటి వినబడుతోంది. అదేమిటంటే ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు కోర్టు జైలు శిక్ష విధించవచ్చని తెలుస్తోంది. సాధారణంగా అటువంటప్పుడు బెయిలు తీసుకొని జైలుకి వెళ్ళకుండా తప్పించుకొంటారు. కానీ ఈ కేసులో ఒకవేళ కోర్టు జైలు శిక్ష విదించినట్లయితే, సోనియాగాంధీ మాత్రమే బెయిలు తీసుకోవాలని, రాహుల్ గాంధి బెయిలు కోసం దరఖాస్తు చేసుకోకుండా జైలుకి వెళ్ళాలని నిశ్చయించుకొన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే జైలుకి వెళ్ళినట్లయితే దేశ ప్రజల సానుభూతి పొందవచ్చుననిట! అంతే కాదు..మోడీ ప్రభుత్వం తమపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ప్రజలకు చాటి చెప్పుకోవడానికి వీలుపడుతుంది. రాహుల్ జైలులో ఉన్నంత కాలం యావత్ దేశంలో ఇదే చర్చ జరుగుతుంది కనుక కాంగ్రెస్ పార్టీ ఉచిత ప్రచారం, ప్రజలలో సానుభూతి దొరుకుతుంది. కనుక రాహుల్ జైలుకి వెళ్లేందుకే సిద్దం అవుతున్నట్లు సమాచారం. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, ప్రజల సానుభూతిని పొందడానికి కోర్టు వరకు పాదయాత్రలు చేయాలనుకోవడం, జైలుకి వెళ్ళాలనుకోవడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానంలో ఎటువంటి మార్పు రాలేదని, ‘కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు’ చేయకుండా అది ఎన్నడూ మానుకోలేదని అర్ధమవుతోంది.   ఇంతకీ ఇదంతా కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడం కోసమే జరుగుతున్నట్లయితే ప్రజలు అర్ధం చేసుకొనేవారు. కానీ ఆ పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలలో ఉన్న సోనియా, రాహుల్ గాంధీలపై మోపబడిన తీవ్ర అభియోగాల నుండి ప్రజల దృష్టిని మళ్ళిస్తూ, పనిలోపనిగా మోడీ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడానికే ఇటువంటి చవకబారు పనులకు పూనుకోవడం చూస్తుంటే “అయ్యో!కాంగ్రెస్ పార్టీ మరీ ఇంతకు దిగజారిపోయిందా” అని అనుకోకుండా ఉండలేరు.   కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవలసిన వారిద్దరూ తమను తాము కాపాడుకోవడం కోసం పార్టీ పరువు ప్రతిష్టలను బజారు కీడ్చడానికి కూడా వెనకాడక పోవడం చాలా విచారకరం. పార్టీని కాపాడవలసినవారే దాని పాలిట శత్రువులుగా మారడం మళ్ళీ వారిని కాంగ్రెస్ పార్టీయే కాపాడుకోవలసి రావడం ఆ పార్టీ దురదృష్టమే తప్ప మరొకటి కాదు. తల్లీ కొడుకులు కలిసి కాంగ్రెస్ పార్టీకి శల్యసారధ్యం చేస్తుంటే పార్టీలో సీనియర్ నేతలు అందరూ కిమ్మనకుండా వారి వెనుక నడుస్తున్నారు. ఇవన్నీ చూస్తూ "పాపం...కాంగ్రెస్ పార్టీ!" అనుకోకుండా ఉండలేము.

వ్యక్తిగత సమస్యలను పార్లమెంటుపై రుద్దుతున్న సోనియా, రాహుల్ గాంధీలు

  కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఇప్పటి వరకు మూడు సార్లు పార్లమెంటు సమావేశాలు జరుగకుండా అడ్డుపడ్డాయి. భూసేకరణ చట్టానికి మోడీ ప్రభుత్వం చేసిన సవరణలను వ్యతిరేకిస్తూ మొదట అడ్డుపడ్డాయి. ఆ తరువాత లలిత్ మోడీ వ్యవహారంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేలను, వ్యాపం కుంభకోణం కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామాలకు పట్టుబడుతూ పార్లమెంటు వర్షాకాల సమావేశాలను జరగకుండా అడ్డుపడింది. ఈసారి నేషనల్ హెరాల్డ్ కేసులో మోడీ ప్రభుత్వం తమను వేదిస్తోందని ఆరోపిస్తూ సమావేశాలను జరగకుండా అడ్డుపడుతోంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతీసారి పార్లమెంటు సమావేశాలు జరగకుండా అడ్డుపడుతుండటంతో కీలకమయిన అనేక బిల్లులు నిలిచిపోయాయి.   మోడీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రియల్ ఎస్టేట్ బిల్లు ద్వారా దేశంలో నిర్మాణ రంగం వేగం పుంజుకొంటుందని ఆశిస్తోంది. అలాగే దేశంలో నానాటికీ పెరిగిపోతున్న నేరాలలో 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు చాలా మంది నేరస్తులుగా ఉంటున్నారు. వారిని కట్టడి చేసేందుకు మోడీ ప్రభుత్వం సంబంధిత చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తోంది. అన్నిటికంటే ముఖ్యమయిన ‘జనరల్ సర్వీస్ గూడ్స్ టాక్స్’ బిల్లుని క్రిందటి సమావేశాలలోనే ప్రవేశపెట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీ వైఖరి కారణంగా అది కూడా ఆమోదానికి నోచుకోలేదు. ఇటువంటివి చిన్నా పెద్ద బిల్లులు కలిపి మొత్తం 36 బిల్లులు పార్లమెంటు ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాద్ధాంతం కారణంగా ఆ బిల్లులు అన్నీ ఆమోదానికి నోచుకోలేకపోతున్నాయి.   మోడీ ప్రభుత్వం భూసేకరణ చట్టానికి చేసిన సవరణల వలన దేశంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ప్రతిపక్ష పార్టీలన్నీ భావించడంతో దానిని ముక్త కంఠంతో వ్యతిరేకించాయి. అది ప్రజలకు సంబంధించిన సమస్య కనుక ప్రతిపక్షాల వైఖరిని ప్రజలు కూడా తప్పు పట్టలేదు. కానీ నేషనల్ హెరాల్డ్ కేసు ఒక పత్రిక యాజమాన్యానికి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధి మరో ఏడుగురు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినవ్యక్తిగత వ్యవహారం. దానిని దేశ ప్రజల సమస్య అన్నట్లుగా రాహుల్ గాంధితో సహా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించడం ఒక పొరపాటయితే, దాని కోసం దేశ భవిష్యత్ ని నిర్దేశించే అనేక ముఖ్యమయిన బిల్లులను అడ్డుకోవడం మరో పెద్ద పొరపాటు.   తమకు న్యాయవ్యవస్థపై 100 శాతం నమ్మకం ఉందని చెపుతూనే, మళ్ళీ తమకు అన్యాయం జరిగిపోతోందని పార్లమెంటులో గగ్గోలు పెట్టడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే న్యాయవ్యవస్థలను మోడీ ప్రభుత్వం ప్రభావితం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లుంది. కేంద్రప్రభుత్వంపై ఇటువంటి ఆరోపణలు చేస్తు దానిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తద్వారా న్యాయవ్యవస్థపై పరోక్షంగా ఒత్తిడి చేస్తోంది.   తమకు న్యాయవ్యవస్థపై 100 శాతం నమ్మకం ఉందని రాహుల్ గాంధి చెప్పుకొంటున్నారు. అలాగే ఇందిరా గాంధీ కోడలినయిన తను ఇటువంటి కేసులను చూసి భయపడబోనని సోనియా గాంధీ గొప్పగా చెప్పుకొన్నారు. మరి అటువంటప్పుడు వారిరువురూ ధైర్యంగా కోర్టులో ఆ కేసును ఎదుర్కొని తమ నిజాయితీని నిరూపించుకొనే ప్రయత్నం చేస్తే అందరూ హర్షించేవారు. కానీ తమ వ్యక్తిగత సమస్యలను ఈవిధంగా పార్లమెంటుపై బలవంతంగా రుద్దుతున్నారు.    కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసేస్తానని ఒకప్పుడు రాహుల్ గాంధి గొప్పలు చెప్పుకొన్నారు. కనీ ఆయన కూడా ఇప్పుడు దాని పద్ధతులకే అలవాటు పడిపోయినట్లున్నారు. అందుకే “కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు” చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ఎందుకు తిరస్కరించారో తెలుసు. ఆ తరువాత అయినా కాంగ్రెస్ పార్టీ మారుతుందని అందరూ ఆశించారు. కానీ దాని వైఖరిలో ఎటువంటి మార్పు కనబడకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

అవి రాజకీయ కక్ష సాధింపు చర్యలేనట!

  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్ళు ప్రతిపక్షాలపై సీబీఐని ఉసిగొల్పుతూ వారిని కట్టడి చేసే ప్రయత్నాలు చేసింది. చివరికి తమకు మద్దతు ఇస్తున్న సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ, ఆర్.జే.డీ. పార్టీలపై కూడా సీబీఐని ప్రయోగించడానికి వెనకాడలేదు. అప్పుడు వారందరూ ఎంతగా ఆక్రోశించినా, అభ్యంతరాలు వ్యక్తం చేసినా కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఇక నరేంద్ర మోడీని కట్టడి చేయడానికి ఎంతగా ప్రయత్నించిందో దేశప్రజలు అందరూ చూసారు. ఆయనని బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించిన తరువాత యూపీఏ ప్రభుత్వం ఆయనని అడ్డుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. కానీ దాని ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆయన ఏటికి ఎదురీది తన నాయకత్వ లక్షణాలు నిరూపించుకొని దేశానికి ప్రధాని కాగలిగారు.   నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను నిందితులుగా పేర్కొనడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తప్పుగా కనిపిస్తోంది. తమపై మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, కానీ దానిని తాము దైర్యంగా ఎదుర్కొంటామని వారు గొప్పగా చెప్పుకొంటున్నారు. తాను ఇందిరా గాంధీ కోడలునని ఎవరికీ భయపడే మనిషిని కానని సోనియా గాంధీ చెప్పుకొన్నారు. మళ్ళీ చాలా రోజుల తరువాత ఆమె నోట ఇందిరా గాంధీ పేరు వినపడటం అందరినీ ఆశ్చర్యపరిచింది.   ఒక రాజకీయ పార్టీ మీడియాకు అప్పు ఇవ్వడం ఎన్నడూ వినలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ పత్రికకు రూ.90 కోట్లు అప్పు ఇచ్చింది! సహజంగానే అది అనుమానాలకు తావిస్తుంది. ఆ తరువాత కొన్ని నెలలకే ఆ సంస్థ మూతపడటం, దాని నుండి రావలసిన బాకీని వసూలు చేసుకొనే హక్కును కాంగ్రెస్ పార్టీ రూ.50 లక్షలకే యంగ్ ఇండియా సంస్థకు కట్టబెట్టడం మరింత అనుమానాలు రేకెత్తించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ సొమ్ముని ఒక పద్ధతి ప్రకారం సోనియా గాంధీ, రాహుల్ గాంధి ఖాతాలలోకి మళ్ళించుకోవడానికే ఈ పధకం పన్నారని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపిస్తూ వారిరువురితోబాటు మోతీలాల్ ఓరా, శ్యాం పిట్రోడా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే, అసోసియేటడ్ జర్నల్స్ లిమిటెడ్, నేషనల్ హెరాల్డ్ మరియు యంగ్ ఇండియాలను ప్రతివాదులుగా పేర్కొంటూ కోర్టులో కేసు వేశారు.   ఆయన చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ అధిష్టానం సంతృప్తికరమయిన సమాధానం చెప్పకపోగా, మోడీ ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, దానిని నిర్భయంగా ఎదుర్కొంటామని చెప్పుకోవడం సిగ్గు చేటు. ఇటువంటి ప్రత్యారోపణలు చేయడం వలన వారు నిజాయితీ పరులు అయిపోలేరు. కనుక సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు తమపై వచ్చిన ఆరోపణలను కోర్టులో ఎదుర్కొని తమ నిజాయితీని నిరూపించుకోగలిగితే బాగుంటుంది.

భారత్-పాక్ మధ్య సంబంధాలు మెరుగుపరిచే ప్రయత్నం కూడా తప్పేనా?

  భారత్-పాక్ మధ్య సంబంధాలు ఎప్పుడూ అంతంత మాత్రంగానే ఉన్నాయనే సంగతి అందరికీ తెలుసు. భారత్ లో ప్రభుత్వాలు మారినప్పటికీ పాకిస్తాన్ తో తన సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి భారత్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంది. నరేంద్ర మోడీ కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల మధ్య డిల్లీలో జరుగవలసిన సమావేశం పాక్ మొండి వైఖరి వలన రద్దయిన తరువాత పరిస్థితులు మళ్ళీ మొదటికొచ్చేయి. కానీ ప్రధాని నరేంద్ర మోడి నిరాశ చెందకుండా మళ్ళీ ఇటీవల పారిస్ లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని కలిసి మాట్లాడి, మళ్ళీ ఇరు దేశాల మధ్య చర్చలు మొదలయ్యేందుకు మార్గం సుగమం చేసారు.   డిల్లీలో జరుగవలసిన ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం బ్యాంకాక్ విమానాశ్రయంలో ఉన్న ఒక స్టార్ హోటల్లో జరిగింది. మోడీ చొరవ కారణంగా జరుగుతున్న ఆ సమావేశాన్ని స్వాగతించవలసిన ప్రతిపక్షాలు ఆయనపై విరుచుకు పడటం చాలా విస్మయం కలిగిస్తోంది. ప్రజలకు, ప్రతిపక్షాలకు తెలియకుండా అంత రహస్యంగా సమావేశం ఎందుకు నిర్వహించవలసి వచ్చిందని ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఒకవైపు పాక్ సైనికులు, పాక్ ఉగ్రవాదులు సరిహద్దులలో భారత్ సైనికులపై, గ్రామ ప్రజలపై కాల్పులకు తెగబడుతుంటే, మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ తో అంత హడావుడిగా, రహస్యంగా చర్చలు ఎందుకు జరుపవలసి వచ్చిందని ప్రశ్నిస్తున్నాయి. అయితే వారడుగుతున్న ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వారికి కూడా బాగా తెలుసు.   పాకిస్తాన్ వలన భారత్ ఎన్ని సమస్యలు ఎదుర్కొంటునప్పటికీ, గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా దానితో స్నేహసంబంధాలు మెరుగుపరుచుకోవాలని ప్రయత్నించింది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా అదే ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నంలోనే మళ్ళీ చర్చలకు మార్గం సుగమం చేసారు. నిజానికి డిల్లీ లేదా ఇస్లామాబాద్ లలో తప్ప వేరే చోట సమావేశం అవడానికి పాక్ చాలా కాలంగా నిరాకరిస్తోంది. కానీ హురియత్ నేతల కారణంగా డిల్లీలో, జమైతే-ఉద్-దవా వంటి ఉగ్రవాద సంస్థల కారణంగా ఇస్లామాబాద్ లో ఇరుదేశాల మధ్య చర్చలు జరిగేవాతావరణం లేకపోవడంతో బ్యాంకాక్ లో ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని మోడీ ఒప్పించగలిగారు. అందుకు మోడీని అభినందించాలి. కానీ మన ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇది వరకు హురియత్ నేతలతో మాట్లాడితే తప్ప డిల్లీలో ఇటువంటి సమావేశానికి హాజరుకామని తెగేసి చెప్పిన పాక్ ఇప్పుడు ఆ షరతు విధించకుండా సమావేశానికి అంగీకరించడం మోడీ సాధించిన విజయమే కదా? అందుకు ఆయనను మెచ్చుకోకపోగా పాకిస్తాన్ తో ఆయన ఏదో రహస్య ఒప్పందం చేసేసుకొన్నట్లు ప్రతిపక్షాలు రభస చేయడం హాస్యాస్పదంగా ఉంది.   ఆ సమావేశంలో ఇంతవరకు ఇరు దేశాలు చర్చిస్తున్న ఉగ్రవాదం, సరిహద్దులలో కాల్పులు వంటి అంశాలపై చర్చించారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. ఈ సమావేశం గురించి తమకు ముందుగా తెలియజేయనందుకే ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి తప్ప వేరే బలమయిన కారణాలేవీ కనిపించడం లేదు. ఈ సమావేశం జరుగుతున్నట్లు ఒకవేళ ముందుగా ప్రకటించినట్లయితే పాక్ ఉగ్రవాదులో లేదా హురియత్ నేతలో దానికి తప్పకుండా ఆటంకం కలిగించే ప్రయత్నాలు చేసి ఉండేవారు. ఇక్కడ భారత్ లో ప్రతిపక్షాలు ఏవిధంగా మోడీని విమర్శిస్తున్నాయో అదే విధంగా మోడీతో మాట్లాడినందుకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను అక్కడి ఉగ్రవాదులతో సహా ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శిస్తున్నాయి. కానీ ఇద్దరు ప్రధానులు ఒక మంచి ప్రయత్నం చేస్తునప్పుడు కూడా ఈవిధంగా వారిపై విమర్శలు గుప్పించడం సబబు కాదు. అదే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏమి చేసినా దానిని వ్యతిరేకించడమే రాజకీయమనుకొంటే అంతకంటే అవివేకం ఉండదు. 

న్యాయవ్యవస్థ ఉన్నంత వరకు ప్రజలకు భయం లేదు: జస్టిస్ టాకూర్

  కాంగ్రెస్ పార్టీ కనిపెట్టిన ‘మత అసహనం’ అనే పదం ఇప్పుడు ఎక్కువగా వినబడుతోంది. ఊహజనితమయిన ఈ అంశంపై చర్చించడం కోసం అతి ముఖ్యమయిన అనేక బిల్లులను, ప్రజా సమస్యలపై చర్చలను పార్లమెంటు పక్కన పెట్టడం చూస్తుంటే అందుకు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. ఇటీవల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ టి.ఎస్. టాకూర్ మత అసహనం గురించి చాలా చక్కటి మాట చెప్పారు.   "కొందరు రాజకీయ నాయకులు దానితో రాజకీయాలు చేసుకొంటున్నారు. కానీ మన న్యాయవ్యవస్థ ఇదే విధంగా స్వతంత్ర ప్రతిపతితో నడుస్తున్నంత కాలం, మన దేశంలో ప్రజలు ఏ మతానికి, ప్రాంతానికి చెందిన వారయినప్పటికీ  వారికి మత స్వేచ్చతో సహా రాజ్యాంగం ప్రసాదించిన అన్ని హక్కులను అది కాపాడుతుంది. వారికి అండగా నిలబడుతుంది. కనుక ప్రజలు మత అసహనం గురించి చింతించనవసరం లేదు," అని అన్నారు.   "మన దేశంలో మత సహనం ఉంది కనుకనే విభిన్న మతాల ప్రజలు కలిసికట్టుగా జీవించగలుగుతున్నారనే విషయం మనం మరిచిపోకూడదు. ఇంతవరకు మన దేశంలో ఎన్ని మతాలువారు ప్రవేశించినా వారినందరినీ తనలో ఇముడ్చుకొంది. అదే మన దేశం యొక్క గొప్పదనం. మన దేశానికి వస్తున్న విదేశీయులకి కూడా మన న్యాయ వ్యవస్థలు చట్ట ప్రకారం రక్షణ కల్పిస్తునప్పుడు భారతీయులకు కల్పించలేవా? దేశంలో ఎవరికి అన్యాయం జరిగినా వారు మన న్యాయవ్యవస్థలను ఆశ్రయించినట్లయితే, వారికి చట్ట ప్రకారం పూర్తి న్యాయం జరిగేలా చూడవలసిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉంది. రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయడంలో మన న్యాయవ్యవస్థలు ఎన్నడూ తమ బాధ్యతను ఎన్నడూ విస్మరించలేదు. ఇక ముందు కూడా మన న్యాయవ్యవస్థలు ఇదే నిబద్దతతో పనిచేస్తుంటాయి. కనుక దేశ ప్రజలు మత అసహనం గురించి అనవసరంగా చింతించనవసరం లేదు,” అని అన్నారు.   రచయితలు దాబోల్కర్, కులబుర్గీల హత్యలపై జస్టిస్ టి.ఎస్. టాకూర్ స్పందిస్తూ “సుప్రీం కోర్టు ఆదేశించినంత మాత్రాన్న దేశంలో నేరాలు ఆగిపోవు. సమాజంలో మంచి పౌరులతో బాటు నేర ప్రవృతి కలిగినవారు కూడా ఉంటారు. అటువంటివారి వలన నేరాలు జరుగుతుంటాయి. అవి జరగకుండా అరికట్టడానికి, ఒకవేళ జరిగితే దోషులను శిక్షించడానికి మనం బలమయిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకొన్నాము. అవి చట్టప్రకారం దేశ ప్రజలందరికీ అండగా నిలబడి న్యాయం చేస్తుంటాయి. కనుక బాష, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా భారతీయులు అందరికీ మన న్యాయవ్యస్థలు రక్షణ కల్పిస్తూనే ఉంటుంది,” అని అన్నారు.   స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నేటి దేశంలో చాలా మత ఘర్షణలు జరిగాయి. అయినా దేశంలో ప్రజలందరూ కలిసికట్టుగానే జీవిస్తున్నారు. కారణం ప్రజలలో మత సహనం కలిగి ఉండటమే. అడపా దడపా నేర ప్రవృతి కలిగిన వాళ్ళు లేదా స్వార్ధ రాజకీయ నాయకుల కారణంగా దేశంలో మత ఘర్షణలు తలెత్తుతుంటాయి. కానీ ప్రజలు వారంతట వారుగా మత ఘర్షణలకు పూనుకొన్న సందర్భాలు చాలా అరుదు. భారత న్యాయవ్యవస్థలో అత్యునత స్థానంలో ఉన్న జస్టిస్ టి.ఎస్. టాకూర్ చెప్పిన ఈ మాటలు మత అసహనం గురించి తెగ మాట్లాడేస్తున్న మన రాజకీయనాయకులకు కనువిప్పు కలిగించగలిగితే బాగుండును.

ఒంటరిగా సాగిపోతున్న రఘువీరుడు!

  పాపం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పరిస్థితిని చూసి జాలిపడాలో, నవ్వుకోవాలో తెలియడం లేదు ప్రజలకి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఆయనొక్కరే కనబడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల తరువాత కనబడకుండా మాయమయిపోయిన కాంగ్రెస్ నేతలు అందరూ ఆ మధ్యన కొన్ని రోజులు ప్రత్యేక హోదా అంటూ మీడియా ముందుకు వచ్చి హడావుడి చేసారు. వారు చేసిన హడావుడికి తిరుపతిలో ఒక కాంగ్రెస్ కార్యకర్త బలయిపోయాడు కూడా. ఆ తరువాత తమ ప్రత్యేక పోరాటాన్ని జగన్మోహన్ రెడ్డికి హ్యండోవర్ చేసేసి కాంగ్రెస్ నేతలు వెనక్కి తగ్గారు. జగన్మోహన్ రెడ్డికి కూడా చివరికి ఆయాసం, నీరసమే మిగిలింది. ప్రజల నుండి ఆశించినట్లుగా స్పందన రాకపోవడంతో ప్రత్యేక హోదా అంశాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రిటర్న్ ఇచ్చేసారు.   కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గల్లీ గల్లీలోను కాంగ్రెస్ నేతలు ముందు వెనుకా పదేసి ఎస్కార్టు కార్లను వేసుకొని చాలా హడావుడిగా తిరుగుతూ కనిపించేవారు. నిత్యం మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతుండేవారు. కానీ ఇప్పుడు తమ పార్టీని బ్రతికించుకోవడానికి పాపం...రఘువీరా రెడ్డి ఒక్కరే ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికెత్తుకొని తిరుగుతుంటే ప్రజలు గుర్తించగల ఒక్క కాంగ్రెస్ నేత అయన వెనుక కనబడటం లేదు. అయినా పిసిసి కాడి భుజానికెత్తుకొన్న పాపానికో... పుణ్యానికో..రఘువీరా రెడ్డికి మాత్రం దానిని మోయక తప్పడం లేదు. ఒయాసిస్సులో నీళ్ళు దొరకవచ్చునేమో కానీ పార్టీలో నేతల నుండి, రాష్ట్రంలో ప్రజల నుండి బొత్తిగా స్పందన కనబడటం లేదు. పైగా ఆయన ముందుకు నడుస్తుంటే వెనుక నుంచి పార్టీ ఖాళీ అయిపోతోంది. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చరిత్ర వ్రాసుకొనేమాటయితే, అన్ని పేజీలలో రామకోటి వ్రాసినట్లు రఘువీరా రెడ్డి పేరు మాత్రమే వ్రాసుకోవలసివస్తుంది.   మొదట్లో పార్టీలో నుండి వెళ్ళిపోతున్న వారిని ఆయన ఆపే ప్రయత్నాలు చేసేవారు. ఇప్పుడు ఎవరు వెళ్లి పోతున్నా...ఎందరు వెళ్ళిపోతున్నా ఏమాత్రం చలించకుండా వెనక్కి తిరిగి చూడకుండా, రఘువీరా రెడ్డి మౌనంగా ‘ప్రత్యేక హోదా’ని భుజాన్ని మోసుకొని వెళ్లిపోతున్నారు. ఇక స్వంత పార్టీ నేతలను నమ్ముకొంటే పని కాదని భావించిన రఘువీరా రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని దువ్వడం మొదలుపెట్టారు. ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీలన్నిటినీ డిల్లీ తీసుకొని వెళ్లి ప్రధాని నరేంద్ర మోడితో ‘ప్రత్యేక సమావేశం’ ఏర్పాటు చేయించాలని కోరుతున్నారు.   ఈ సందర్భంగా తమ యూపీఏ ప్రభుత్వం విభజన సమయంలో రాష్ట్రానికి ఏమేమీ హామీలు ఇచ్చిందో, ప్రత్యేక హోదా అమలు చేయాలని ఎంతగా పరితపించిపోయిందో మళ్ళీ పూస గుచ్చినట్లు వివరించారు. కానీ వినే వాళ్ళే లేరు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదనే సంగతి ఖచ్చితంగా తెలుసు గనుకనే ఆయన దాని కోసం ఒత్తిడి చేస్తున్నారు తప్ప నిజంగా వస్తుందని తెలిస్తే దాని ఊసు ఎత్తేవారే కాదు. ఎందుకంటే ఆ ఖ్యాతి చంద్రబాబు నాయుడుకి, నరేంద్ర మోడీకి వారి పార్టీలకి, ప్రభుత్వాలకే దక్కుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ దక్కదు. ప్రజాభీష్టానికి విరుద్దంగా రాష్ట్రాన్ని విభజించి, ప్రత్యేక హోదా ఇచ్చేము కదా! అంటే ప్రజలు వినరు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి ఇంతకంటే మరే అంశం లేదు కనుక రఘువీరా రెడ్డి దానితోనే కంటిన్యూ అయిపోతున్నారనుకోవాలి.   ఆయన పడుతున్న శ్రమ చూస్తుంటే ఇంతకాలం పదవులు, అధికారం అనుభవించిన కాంగ్రెస్ నేతలు మొహం చాటేస్తున్నందుకు కొంచెం బాధ కూడా కలుగుతోంది. కానీ ఎవరి లెక్కలు వారికి ఉంటాయి... ఎవరి ప్రయత్నాలలో వారున్నారనుకోవాలి అంతే. రఘువీరా రెడ్డే సర్దుకుపోతున్నప్పుడు ప్రజలు కూడా ఆ మాత్రం సర్దుకుపోలేరా...ఏమిటి?

వారి దయాదాక్షిణ్యాల వలననే హిందూ మతం సజీవంగా ఉందిట!

  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ‘ద హిందు’ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతదేశంలో హిందువులు జనాభా పరంగా అభివృద్ధి చెందడానికి ఒకప్పుడు దేశాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తుల ఔదార్యమే కారణమని అన్నారు. దేశాన్ని సుమారు 500 ఏళ్ళపాటు పరిపాలించిన మొఘల్ చక్రవర్తులు తలచుకొంటే దేశాన్ని పూర్తిగా ముస్లిం దేశంగా మార్చగలిగేవారని, కానీ వారు ఔదార్యం చూపి హిందువులను, వారి మతాన్ని గౌరవించారని అందుకే నేడు దేశంలో హిందూమతం సజీవంగా ఉందని అన్నారు. అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో ఉన్న హిందువులను గమనిస్తే మొఘల్ చక్రవర్తుల మత సహనం ఎంత గొప్పదో అర్ధమవుతుందని దిగ్విజయ్ సింగ్ అన్నారు.   "ఒకప్పుడు భారతదేశానికి ముస్లింలు వచ్చేరు. ఆ తరువాత క్రీష్టియన్లు వచ్చేరు. వారందరినీ భారతదేశం తనలో కలుపుకొంది. అన్ని మతాల వారిని భారత్ సమానంగా ఆదరిస్తుంది. అదే భారతదేశానికి ఉన్న గొప్ప లక్షణం. కానీ అదిప్పుడు దెబ్బ తింటోంది. దేశంలో మత అసహనం పెరిగిపోతోంది. ఒకప్పుడు పాకిస్తాన్ జియా ఉల్-హైకోర్టు చేసిన పొరపాటునే ప్రస్తుత ప్రభుత్వం కూడా చేస్తున్నట్లు కనిపిస్తోంది. నేడు పాకిస్తాన్ ఈ దుస్థితిలో ఉండటానికి కారణం మత చంధసవాదులయిన జమ్మత్-ఏ.ఇస్లామీ నేతలను ప్రభుత్వంలోకి తీసుకోవడమే!"   "మోడీ ప్రభుత్వం కూడా దేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ది పొందాలని భావిస్తోంది. కానీ మతం అనేది ఒక భూతం వంటిది. దానిని ఒకసారి బయటకు రప్పిస్తే మళ్ళీ బందించడం చాలా కష్టం. దానిని అప్పుడు ఎవరూ నియంత్రించలేరు. అదే ప్రభుత్వాలని శాసించడం మొదలుపెడుతుంది. మైనార్టీ వర్గాల మతతత్వం కంటే మెజార్టీ వర్గాల మతతత్వమే దేశానికి చాలా ప్రమాదమని పండిట్ జవహార్ లాల్ నెహ్రూ ఆనాడే చెప్పారు. అది అక్షరాల నేటికీ వర్తిస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏదో ఒక మత ఆధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మత సహనం కలిగి ఉండటమే మన దేశానికి అన్ని విధాల మంచిది,” అని అన్నారు.   దిగ్విజయ్ సింగ్ వంటి రాజకీయ నాయకులు, దేశంలో మేధావులు ప్రజలు, ప్రభుత్వం ఒక సక్రమమయిన మార్గంలో నడిపించేందుకే తమ మేధస్సును, వాక్చాతుర్యాన్ని ఉపయోగిస్తే అందరూ హర్షిస్తారు. కానీ తమ మేధస్సు, తమకున్న లోక జ్ఞానంతో ప్రజలను తప్పు మార్గం పట్టించడాన్ని ఎవరూ హర్షించలేరు.   మోడీ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసమే దేశంలో ప్రజల మధ్య మత భేదాలు సృష్టిస్తోందని వాదిస్తున్న దిగ్విజయ్ సింగ్ వంటి కాంగ్రెస్ నేతలు అందరూ కూడా తమ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికే “ఊహాజనితమయిన మత అసహనం” అనే పదాన్ని సృష్టించి దానికి విస్తృతంగా ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తూ ప్రశాంతంగా జీవిస్తున్న భిన్న మతాల ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో జరిగిన సంఘటనకి కాంగ్రెస్ బాధ్యత వహించాలి. కానీ దానికీ మోడీ ప్రభుత్వానిదే బాధ్యత అని కాంగ్రెస్ వాదించడం గమనించినట్లయితే అది ఉదేశ్యపూర్వకంగానే ఈ విష ప్రచారం చేస్తోందని అర్ధమవుతోంది. అందుకోసం దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు చరిత్రను కూడా వక్రీకరించడానికి వెనుకాడక పోవడం చాలా శోచనీయం.   భారతదేశంపైకి అధికారం చెలాయించిన మొఘలులు ఉదారంగా వ్యహరించడం వలననే హిందువులు, వారి సంస్కృతి ఇంకా బ్రతికి ఉందని దిగ్విజయ్ సింగ్ చెప్పడం చాలా అవమానకరంగా ఉంది. భారతదేశంపై, దేశ సంస్కృతీ సంప్రదాయాలపై విదేశీయులు చేసిన దాడులు ఆయన కళ్ళకి కనబడలేదు. గజనీలు, ఘోరీలు గుళ్ళు గోపురాలను ద్వంసం చేయడం, నలందా వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయంలో అమూల్యమయిన గ్రంధాలను తగులపెట్టడం, దేశ సంపదను దశాబ్దాల తరబడి దోపిడీ చేసి తమ దేశాలకు తరలించుకుపోవడం వంటి అనేక అకృత్యాలు భారతీయుడయిన దిగ్విజయ్ సింగ్ కళ్ళకి కనబడకపోవడం చాలా విచిత్రమే.   కానీ తమ పార్టీ వాదనలకు పనికివచ్చే వారిలో మంచిని మాత్రం ఆయన స్వీకరించి చరిత్రను కూడా వక్రీకరిస్తున్నారు. మొఘలులు లేదా బ్రిటిష్ వాళ్ళ బారి నుండి దేశాన్ని కాపాడుకోవడానికి ఎన్ని లక్షల మంది ప్రజలు, సైనికులు, వీరులు, రాజులు తమ ప్రాణాలను తృణప్రాయంగా బలిచేసారో ఆయన చెప్పకపోవచ్చును కానీ ప్రజలకు ఆ సంగతి తెలుసు. అలనాడు మహా రాణా ప్రతాప్, చత్రపతి శివాజీ మొదలుకొని తరువాత కాలంలో సుబాష్ చంద్రబోస్, గాంధీ, నెహ్రు, అల్లూరి సీతారామరాజు వరకు ఎందరో మహనీయులు, అనామక ప్రజలు కలిసి చేసిన ఎన్నో పోరాటాల కారణంగానే భారతదేశం, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడబడ్డాయి తప్ప ఎవరో దయాదర్మాల వలన కాదనే సంగతి బ్రిటిష్ పాలకులను దేశం నుండి తరిమికొట్టిన కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న దిగ్విజయ్ సింగ్ వంటి సీనియర్ నేతకు తెలియదనుకోవాలా లేక తెలిసీ ఈవిధంగా మాట్లాడుతున్నారు అంటే తమ పార్టీ ప్రయోజనాల కోసం అవసరం లేని చరిత్రను తవ్వి తీసి చరిత్రను కూడా వక్రీకరిస్తున్నారనుకోవాలా?   నిజానికి మత అసహనం పేరిట బీజేపీని, మోడీ ప్రభుత్వాన్ని రాజకీయంగా దెబ్బ తీసి మళ్ళీ దేశంలో తమ పార్టీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాల వలననే దేశానికి ఎక్కువ నష్టం జరుగుతోంది. ఒకప్పుడు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన మనుగడ కోసం, తన వారసుడి రాజకీయ భవిష్యత్ ని కాపాడుకోవడం కోసమే ఈ పోరాటం మొదలుపెట్టిందని అందరికీ తెలుసు. కానీ వారు చేస్తున్న ఈ దుష్ప్రచారం వలన ప్రపంచ దేశాలు భారత్ ని అనుమానంగా చూసే పరిస్థితి కలిపిస్తున్నారని దాని వలన అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట దెబ్బ తింటుందని గ్రహిస్తే బాగుంటుంది. భారత్ కంటే కాంగ్రెస్ పార్టీకి తమ ప్రయోజనాలే ముఖ్యమనుకొంటే అటువంటి పార్టీ భారత్ కి అవసరం లేదని ప్రజలు మరొకమారు తప్పక రుజువు చేస్తారు.

వికృత సంస్క్రతిని పోషిస్తే దానికి సమాజమే బలవక తప్పదు

  సమాజం ఏదయినా వికృత విధానాలని లేదా ఆచారాలని లేదా పద్దతులనుఅవలంభించినా లేదా ప్రోత్సహించినా దాని దుష్పలితాలు అదే సమాజంపై ఎంత తీవ్రంగా ప్రభావం చూపిస్తాయో తెలుసుకోవాలంటే నాటి సతీసహగమనం దురాచారాల నుండి నేటి ఐసిస్ ఉగ్రవాదులు...అమెరికాలో నెలకొని ఉన్న గన్ కల్చర్ వరకు అనేక సజీవ ఉదహారణలు కనబడుతున్నాయి. ఒక తప్పుచేయడం, దానినే సమాజ విధానంగా పాటించడం లేదా సమాజంపై బలవంతంగా రుద్దడం, అనేక కారణాల చేత ఆ తప్పులను సరిదిద్దలేని ప్రభుత్వాల బలహీనతల కారణంగా యావత్ ప్రపంచంలో ఏదో ఒక రూపంలో అశాంతి నెలకొని ఉండటం అందరూ గమనిస్తూనే ఉన్నారు.   అమెరికాలో “గన్ కల్చర్ సంస్కృతి” అని ఒబామా ప్రభుత్వం చట్ట సవరణల ద్వారా నిర్మూలించాలని ప్రయత్నించినపుడు దానికి చాలా వ్యతిరేకత ఎదురయింది. తత్ఫలితంగా అడపాదడపా అమెరికాలో విచ్చలవిడిగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అనేకమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. హార్వర్డ్ విశావిద్యాలయ విద్యార్ధులు చేసిన ఒక తాజా సర్వేలో అమెరికాలో సుమారు 34 శాతం మంది మారణాయుదాలను కలిగిఉన్నట్లు తెలిసింది. కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే ఇంతవరకు 355సార్లు కాల్పులు జరిగాయి. ఆ కాల్పులలో అనేక వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్న కాలిఫోర్నియాలోని సాన్ బెర్నార్డినో నగరంలో 14 మంది మరణించారు.   ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్ట్ లెక్కల ప్రకారం అమెరికాలో 18 నుండి 29 సం.ల వయసులోపు వారిలో 26 శాతం మంది వద్ద, 30-49 సం.ల వారిలో 32 శాతం, 50-64సం.ల వారిలో 40శాతం, 65 సం.ల పైబడి ఉన్నవారిలో 40 శాతం మంది తుపాకులు లేదా రివాల్వర్ లేదా ఏదో ఒక రకమయిన మారణాయుధాలు కలిగి ఉన్నారని చెపుతోంది. అంటే భారత్ లో ఇప్పుడు ప్రజలు సిమ్ కార్డులు ఏవిధంగా కొంటున్నారో అదే విధంగా అమెరికాలో ప్రజలు తుపాకులు కొనుకొంటున్నారన్నమాట.   అమెరికాలో నెలకొన్న ఈ గన్ సంస్కృతి ఏవిధంగా అక్కడి ప్రజలపై దుష్ప్రభావం చూపుతోందో అలాగే భారత్ లో నానాటికి పెరుగుతున్న “మొబైల్ సంస్కృతి” కూడా సమాజం మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. అక్కడి విష సంస్కృతి వలన మనుషులు ప్రాణాలు కోల్పోతుంటే, భారత్ లో వ్యాపిస్తున్న ఈ విష సంస్కృతి సమాజంలో వికృత పరిణామాలకు దారి తీస్తోంది. ఈ వాదనను నేటి యువతరం అంగీకరించకపోవచ్చును. కానీ మొబైల్ కి ముందు మొబైల్ ప్రవేశం తరువాత భారత్ లో సామాజిక సమస్యలు, నేరాలను పోల్చి చూసినట్లయితే ఈ వాదనను అంగీకరించక తప్పదు.   ప్రస్తుతం ప్రపంచం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దానితో సమాంతరంగా రకరకాల విష సంస్కృతులు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. వాటినీ అభివృద్ధిలో భాగంగానే చూస్తున్నారు తప్ప వాటిలో తపొప్పుల గురించి ఎవరికీ ఆలోచించే తీరిక, ఆసక్తి లేకపోవడంతో సామాజిక సమస్యలు-అభివృద్ధి రెండూ చెట్టపట్టాలు వేసుకొని ముందుకు సాగిపోతున్నాయి. డిల్లీలో నిర్భయ ఉదంతం జరిగిన తరువాత కేంద్రప్రభుత్వం చట్టాన్ని మరింత కటినం చేసింది. మంచిదే. కానీ దాని వలన దేశంలో నేరాలు ఏమాత్రం తగ్గలేదు ఇంకా పెరిగిపోయాయి.   సమాజ ఆలోచనా విధానంలో మార్పులు రావాలంటే అది తల్లి ఒడిలో, బడిలో నుండే మొదలవ్వాలనే నిజాన్ని మన ప్రభుత్వాలు ఇంకా గుర్తించలేదు. మన దేశంలో ఇంతకు ముందు ఎన్నడూ కనీవినని ఇటువంటి ఘోర నేరాలు, వింత పోకడలు, విచిత్రమయిన ఆలోచనా విధానాలు, అలాగే అభివృద్ధి కళ్ళకు కట్టినట్లు కనబడుతున్నాయి. మన ఆలోచనా విధానాలు అభివృద్ధికి, శాంతి సౌభాగ్యాలను కల్పిస్తే దానిని తప్పకుండా స్వాగతించవలసిందే. కానీ మన చిన్న జీవితాలని అవి అతలాకుతలం చేస్తున్నా కూడా మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మనుగడ సాగించవలసి రావడమే చాలా దురదృష్టకరం.

ఆర్ధికమంత్రిగా చేస్తే చట్టం నుండి మినహాయింపు ఇవ్వాలా?

  కేంద్ర ఆర్ధికమంత్రిగా అనేక ఏళ్ళపాటు పనిచేసిన చిదంబరంకి ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ మరియు ఆదాయపన్ను శాఖలు ఏవిధంగా పనిచేస్తాయో అందరికంటే బాగా తెలిసి ఉంటుంది. కానీ ఆయన తన కొడుకు కార్తి సంస్థలకు వాటి నుండి మినహాయింపు ఆశిస్తుండటం విశేషం. చెన్నైలో కార్తి, అతని స్నేహితుల సంస్థలపై ఇవ్వాళ్ళ ఆ రెండు శాఖల అధికారులు దాడులు చేసారు. వారు తన కొడుకు అతని స్నేహితుల సంస్థలపై దాడులు చేయడాన్ని పి.చిదంబరం తప్పుపట్టారు.   రాజకీయాలలో ఉన్న కారణంగా ఇటువంటి వేధింపులు ఎదుర్కోక తప్పదని మాకు తెలుసు. అందుకు మేము సిద్దంగానే ఉన్నాము. కానీ మా కుటుంబంతో పరిచయమున్న వాళ్ళని అందరినీ వేధించడం సరికాదు. ఆ సంస్థలన్నీ చట్టబద్దంగా వ్యాపారాలు నిర్వహించుకొంటూ, తమ రాబడిపై ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నాయి. ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ లో పనిచేస్తున్న ఒక ఉన్నతాధికారికి నేను ఆర్దికమంత్రిగా ఉన్నపుడు సహాయపడనందుకు, ఇప్పుడు ఆయన మాపై ఈవిధంగా వేధింపులకి పాల్పడుతున్నారు. కానీ నా కొడుకు కార్తి, అతని స్నేహితులు చట్టబద్దంగా వ్యాపారాలు చేసుకొంటునప్పుడు మేము ఎవరికీ భయపడనవసరం లేదు. కానీ వారిని వేధించే బదులు మోడీ ప్రభుత్వం నేరుగా నన్నే టార్గెట్ చేసుకొంటే ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నాను,” అని అన్నారు.   చిదంబరం చాలా చక్కగా వాదించారు. ఆయన వాదన ప్రకారం కేవలం తమను వేధించేందుకే మోడీ ప్రభుత్వం తమ సంస్థలపై దాడులు చేయిస్తోందని చాలా చక్కగా చెప్పారు. అందుకోసం ఆయన తను మాజీ ఆర్ధికమంత్రిననే విషయాన్ని చాలా తెలివిగా వాడుకొంటున్నట్లు అర్ధమవుతోంది. తను ఆర్ధికమంత్రి కనుక తన సంబంధీకుల సంస్థలలో ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ మరియు ఆదాయపన్ను శాఖ అధికారులు తణికీలు చేయరాదని, చేసినట్లయితే అది రాజకీయ వేధింపులేనని ఆయన సూత్రీకరిస్తున్నట్లుంది. అంటే చట్టం నుండి తమ సంస్థలకి పూర్తి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరుకొంటున్నట్లుంది.   ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ మరియు ఆదాయపన్ను శాఖ అధికారులు నిత్యం దేశంలో అనేక సంస్థలపై దాడులు చేస్తుంటారు. ఆ సంస్థలన్నీ కూడా ఇలాగే ఏదో ఒక రాజకీయ లింకు వెలికి తీసి వాదించడం మొదలుపెడితే అప్పుడు దేశంలో ఉండే అన్ని సంస్థలకి చట్టం నుండి మినహాయింపు ఇవ్వవలసి ఉంటుంది. తమ సంస్థలన్నీ చట్ట బద్దంగా వ్యాపారాలు చేస్తూ, రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తూ, సక్రమంగా పన్నులు చెల్లిస్తున్నాయని చిదంబరం, కార్తి ఇద్దరూ గట్టిగా వాదిస్తున్నారు. అటువంటప్పుడు ఇక ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ మరియు ఆదాయపన్ను శాఖ అధికారుల తణికీలకి, అడిగే ప్రశ్నలకి భయపడటం దేనికి? వాటిని వేధింపులని చెప్పుకోవడం దేనికి?   దేశ ఆర్ధిక మంత్రిగా చేసిన చిదంబరం వంటి వారు చట్టాలు తమకు వర్తింపజేయడం అంటే వేధింపులే అని వక్ర బాష్యం చెప్పడం చాలా శోచనీయం. ఒకప్పుడు తన హయంలో ఏవిధంగా ఆ రెండు సంస్థల అధికారులు పనిచేసారో ఆయనకి తెలుసు. వాళ్ళు ఇప్పుడు అలాగే తమ పని తాము చేసుకుపోతున్నారు. కనుక ఆయనే స్వయంగా అధికారులను స్వాగతించి ఉండి ఉంటే తమ సంస్థల నిజాయితీని నిరూపించుకొనే అవకాశం దక్కేది. ప్రజలు కూడా ఆయన నీతి నిజాయితీని హర్షించేవారు.

భారత్-పాక్ చర్చలు మొదలవక మునుపే ఆగిపోయే అవకాశం?

  పర్యావరణ కాలుష్య నియంత్రణపై చర్చించేందుకు పారిస్ లో జరుగుతున్నఅంతర్జాతీయ సమావేశంలో భారత్-పాక్ ప్రధానులు నరేంద్ర మోడీ, నవాజ్ షరీఫ్ ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడంతో మళ్ళీ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు మొదలవుతాయని అందరూ ఆశిస్తున్నారు. కానీ వాటికి బ్రేక్ వేసే సంఘటన జరిగింది.   జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో రాజౌలీ జిల్లాకు చెందిన ఖైఫతుల్లా ఖాన్ అనే పాకిస్తానీ ఏజెంట్, అతనికి సహకరిస్తున్న అబ్దుల్ రషీద్ అనే ఒక బి.ఎస్.ఫ్.జవానును మొన్న డిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు జమ్ములో అరెస్ట్ చేసారు. వారి వద్ద నుండి బి.ఎస్.ఫ్. నిఘా వర్గానికి చెందిన కొన్ని రహస్య పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. సరిహద్దులలో భారత్ దళాల కదలికలకు సంబంధించి వ్యూహాలు, సరిహద్దులలో 126,163 ఆర్మీ రెజిమెంట్ల బలం, అవి మొహరించి ఉన్న ప్రాంతం వివరాలు, రాజోరి, పూంచ్ మరియు మెందాన్ ప్రాంతాలలో బీ.ఎస్.ఎఫ్. బలాలు వాటి మొహరింపుల వివరాలు, శ్రీనగర్ లో ఉన్న భారత్ వాయుసేన యుద్ద విమానాల వివరాలు, వాటి సంఖ్య వంటి అనేక అత్యంత రహస్య సమాచారాన్ని బి.ఎస్.ఫ్. నిఘావర్గంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అబ్దుల్ రషీద్ సేకరించి ఖైఫతుల్లా ఖాన్ అందిస్తుంటే, అతను ఆ వివరాలను వైబర్, వాట్స్ అప్, ఈ-మెయిల్ ద్వారా పాకిస్తానీ గూడచార సంస్థ ఐ.ఎస్.ఐ.కు పంపేవాడు. బాగా రద్దీగా ఉన్న మార్కెట్ ప్రదేశాలలో లేదా బస్సులలో ఆ రహస్య పత్రాలు చేతులు మారేవని ఖైఫతుల్లా ఖాన్ తెలిపాడు.   కధ ఇంతవరకు మాత్రమే సాగి ఉండి ఉంటే, భారత్ ఏమీ చేయలేకపోయేదని చెప్పవచ్చును. భారత్ లో పాక్ గూడచర్యం చేయడాన్ని భారత విదేశాంగ శాఖ నిరసించి ఉండేది. దానిని పాక్ ఖండించి ఉండేది. కానీ ఖైఫతుల్లా ఖాన్ ఈ కధకి ఊహించని ట్విస్ట్ ఇచ్చేడు. తను అందిస్తున్న ఈ రహస్యాల గురించి చర్చించేందుకు ఐ.ఎస్.ఐ. అధికారులు తనను పాకిస్తాన్ రమ్మని పిలిచారని కానీ తన వీసా గడువు ముగుసిపోయిందని చెప్పగా వారు డిల్లీలోని పాకిస్తాన్ హైకమీషన్ లోని తమ సంస్థ తరపున పనిచేస్తున్న ఒక వ్యక్తిని కలవమని చెప్పారని, ఖైఫతుల్లా ఖాన్ పోలీసులకు వివరించాడు. అతనిని కలిసినట్లయితే పాకిస్తాన్ రావడానికి వీసా ఏర్పాటు చేస్తాడని ఐ.ఎస్.ఐ. అధికారులు తనకు చెప్పారని పోలీసులకు తెలిపాడు.   డిల్లీలో పాక్ హైకమీషన్ కాశ్మీరీ వేర్పాటువాదులతో అపుడప్పుడు సమావేశం అవడం అందరికీ తెలుసు. కానీ భారత్ లో ఈవిధంగా గూడచర్య చర్యలకు అండగా నిలుస్తోందనే విషయం ఇప్పుడే బయటపడింది. పాక్ హైకమీషన్ ఖైఫతుల్లా ఖాన్ కి సహకరించే వ్యక్తి ఎవరో డిల్లీ క్రైం బ్రాంచ్ బయటపెట్టలేదు. కానీ ఆ వ్యక్తిని ప్రశ్నించడానికి అరెస్ట్ చేయవలసి ఉంటుంది. కానీ అతనిని అరెస్ట్ చేయడానికి పాకిస్తాన్ అంగీకరించదు. అంగీకరిస్తే పాకిస్తాన్ హైకమీషన్ భారత్ లో గూడచర్యానికి సహకరిస్తోందని అంగీకరించినట్లవుతుంది. కనుక భారత్ అటువంటి ప్రయత్నం చేయగానే పాక్ యధాప్రకారం ఎదురుదాడికి దిగుతుంది. కనుక రెండు దేశాలు శాంతి చర్చల ఆలోచన ఏదయినా చేస్తున్నట్లయితే మళ్ళీ అది అటకెక్కుతుంది. దానికి బదులు పరస్పరం విమర్శలు మొదలవవచ్చును.   ఈ చర్చలు, పరస్పర విమర్శలు ఎప్పుడూ ఉండేవే. పాకిస్తాన్ గూడచర్యానికి పాల్పడటంలో ఆశ్చర్యమేమీ లేదు కానీ బి.ఎస్.ఎఫ్.లో ఇంకా చాలా మంది భారత్ ఆర్మీకి సంబంధించిన రహస్యాలను పాకిస్తాన్ కి చేరవేయడంలో సహకరిస్తున్నారనే విషయం చాలా ఆందోళన కలిగిస్తోంది.

భారత్-పాక్ సంబంధాలు ఎందుకు మెరుగుపడటం లేదు?

  భారత్ ఎప్పుడూ ఇరుగుపొరుగు దేశాలన్నిటితో శాంతి, బలమయిన స్నేహ సంబందాలే కోరుకొంది తప్ప ఏనాడూ కయ్యానికి కాలు దువ్వాలని ప్రయత్నించలేదు. కానీ గత ఆరు దశాబ్దాలుగా భారత్ ఎంతగా ప్రయత్నించినా పాకిస్తాన్ తో మాత్రం సఖ్యత కుదరడం లేదు. ఒకవేళ కుదిరినా అది తాత్కాలికమే అవుతోంది. అందుకు ఇరుదేశాలు ఒక దానిని మరొకటి నిందించుకొంటున్నాయి. ఎవరి వాదనలు, కారణాలు వారికి ఉన్నాయి. ఈ వాదోపవాదాలు, ఉద్రిక్తతల మధ్యనే ఇరు దేశాలు అప్పుడప్పుడు శాంతి చర్చలు జరుపుకొంటూ మళ్ళీ గొడవపడుతూ దశాబ్దాలు దొర్లించేస్తున్నాయి. మిగిలిన ఇరుగు పొరుగు దేశాలతో భారత్ సంబంధాలు చాలా వరకు బాగానే ఉన్నప్పటికీ ఒక్క పాకిస్తాన్ తో మాత్రమే ఎందుకు సయోధ్య కుదరడం లేదు? అనే సందేహం కలగడం చాలా సహజం. అందుకు ఇరు దేశాలు చెపుతున్న కారణాలే కాక ఇంకో బలమయిన కారణం కూడా ఉంది. అదే పాకిస్తాన్ అంతర్గత పరిస్థితులు!   భారత్, పాక్ రెండూ ఒకేసారి స్వాతంత్ర్యం పొందాయి. అప్పటి నుండి భారత్ లో ప్రజాస్వామ్యం నెలకొని ఉంటే, పాకిస్తాన్ లో చాలాసార్లు సైనిక పాలన సాగింది. అపుడప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ వాటిపై సైనిక పెత్తనం తప్పడం లేదు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో అధికారం చెలాయిస్తున్న పాక్ సైనికాధికారుల యుద్దపిపాస కారణంగా ఈ ఆరు దశాబ్దాల సుదీర్ఘ కాలంలో పాకిస్తాన్ ఆశించినంత అభివృద్ధికి నోచుకోలేదు. సైనికాధికారుల కర్ర పెత్తనం వలన ప్రభుత్వాలు దేశాభివృద్ధి కంటే భారత్ పైనే ఎక్కువ దృష్టిపెట్టవలసి వస్తోంది. తత్ఫలితంగా దేశంలో అవినీతి, నిరుద్యోగం, దారిద్యం పెరిగాయి. భారత్ లో కూడా ఈ సమస్యలన్నీ ఉన్నాయి. కానీ ప్రజాస్వామ్యం నెలకొని ఉండటం వలన నిరంతర అభివృద్ధి జరుగుతోంది. కనుక పరిస్థితులు ఏనాడు అదుపు తప్పలేదు.   ప్రభుత్వ విధానాలు, వైఖరిని బట్టే ఆ దేశంలో లేదా రాష్ట్రంలో పరిస్థితులుంటాయి. చైనాలో కమ్యూనిస్ట్ పాలన సాగుతోంది. వారికీ యుద్ద కాంక్ష చాలా ఎక్కువే. కానీ దానికంటే వారు దేశాభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే అగ్రరాజ్యాలతో సమానంగా చైనా అభివృద్ధి చెందుతోంది. కానీ పాక్ అనుసరిస్తున్న తప్పుడు వైఖరి కారణంగా పాక్ పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. ఒకవేళ పాక్ ప్రభుత్వంపై కర్ర పెత్తనం చేస్తున్న సైనికాధికారులు కూడా దేశాభివృద్ధికే ప్రాధాన్యతనిచ్చి ఉండి ఉంటే నేడు పాక్ పరిస్థితి వేరేలా ఉండేది. కానీ వారు దేశాభివృద్దిపై దృష్టి పెట్టకుండా భారత్ తో ప్రత్యక్ష, పరోక్ష యుద్ధం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత నిచ్చారు. తత్ఫలితంగానే పాకిస్తాన్ లో మతోన్మాదం, ఉగ్రవాదం పెరిగిపోయింది.   శాంతికాముక దేశమయిన భారత్ ఏనాడూ యుద్ధం గురించి ఆలోచించలేదు. కానీ యుద్ధోన్మాదంతో రగిలిపోతున్న పాక్ సైనిక పాలకులు, సైనికాధికారులే భారత్ తమపై యుద్ధానికి వస్తుందని ఊహించేసుకొంటూ, ప్రభుత్వాన్ని, ప్రజలను కూడా ఆ ఊహాజనితమయిన యుద్దవాతవరణంలో ఉంచుతున్నారు. అలాగ ఉంచినంత కాలం వారు ప్రభుత్వాలపై కర్ర పెత్తనం చేయగలరు. వారి కనుసన్నలలో ప్రభుత్వాలు నడుస్తున్నంత కాలం, అవి దైర్యంగా, స్వేచ్చగా నిర్ణయాలు తీసుకోలేవు. భారత్ అందిస్తున్న స్నేహహస్తం అందుకోలేవు. అందుకే ఇరుదేశాల మధ్య సంబంధాలు బలపడటంలేదు. అయినప్పటికీ నాడు జవహార్ లాల్ నెహ్రూ మొదలుకొని నేడు నరేంద్ర మోడీ వరకు అందరూ పాకిస్తాన్ కి స్నేహ హస్తం అందిస్తూనే ఉన్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించడం లేదు.   భారత్-పాక్ ల మధ్య సంబంధాలు బలపడాలంటే, ముందుగా పాక్ లో నెలకొన్న ఈ పరిస్థితులు మారాలి. కానీ అది అసంభవం. కనుక భారత్-పాక్ దేశాల మధ్య స్నేహ సంబంధాలు మెరుగుపడటం కూడా దాదాపు అసంభవమేనని భావించవచ్చును. బహుశః భారత్-పాక్ సంబంధాలు ఎప్పటికీ ఇలాగే ఉండవచ్చును లేదా ఇంకా అద్వానంగా మారినా ఆశ్చర్యం లేదు. భారత్ తో బేషరతుగా చర్చలలో పాల్గొనటానికి తాము సిద్దంగా ఉన్నామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మొన్న ప్రకటించారు. కానీ భారత్ పట్ల పాక్ దృకోణం, దాని వైఖరి మారనంతవరకు ఎన్ని సార్లు చర్చించినా దాని వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదని చెప్పవచ్చును.