ముఖ్యమంత్రి తన మతాచారాలను అమలుచేసుకోవచ్చా?
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా అట్టహాసంగా చేస్తున్న ఆయుత చండీయాగానికి అయ్యే మొత్తం ఖర్చు అంత తనే భరిస్తున్నట్లు చెప్పుకొన్నారు. ఈ యాగానికి సుమారు ఏడు కోట్లు వరకు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కానీ దాని కోసం ఏర్పాటు చేసిన భారీ పోలీస్ బందోబస్తు, యాగం జరుగుతున్న ఎర్రవల్లి గ్రామం వరకు దారి పొడవునా రోడ్లు, కాలువల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, యాగశాల నిర్మాణం, రుత్విక్కుల బారీ ఫీజులు, యాగానికి వచ్చిన వారందరికీ భోజనవసతి సదుపాయాలు వంటి ఏర్పాట్లకు, వి.ఐ.పి.ల కోసం హెలికాఫ్టర్లు, అవి దిగేందుకు హెలీప్యాడ్ల నిర్మాణం, రాష్ట్రపతి మొదలు పీటాదిపతుల వరకు అందరినీ స్వయంగా ఆహ్వానించడం కోసం కేసీఆర్ విమాన, హెలికాఫ్టర్ ఖర్చులను కలిపి చూసినట్లయితే కనీసం వంద కోట్లు వరకు ఉండవచ్చని ప్రతిపక్షాలు లెక్క కట్టాయి.
దేశం, రాష్ట్ర శ్రేయస్సు కోరే ఈ చండీయాగం చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పుకోవడాన్ని కూడా ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. ఒకవైపు తెలంగాణాలో రైతులు ఆర్ధిక సమస్యలతో సతమతమవుతూ ఆత్మహత్యలు చేసుకొంటుంటే, దేశ, రాష్ట్ర శ్రేయస్సు కోసం అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఈవిధంగా ఖర్చు చేయడాన్ని వారు తప్పు పడుతున్నారు. అసలు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిపడుతోందని వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ యాగానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధమూ లేదని అనుకోలేము. దీనికోసం ప్రభుత్వంలో చాలా శాఖలు రేయింబవళ్ళు పనిచేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఉదారణకి పోలీస్ శాఖ ఒకటే చాలు. అటువంటివి ఇంకా చాలా శాఖలకు చెందిన ఉద్యోగులు ఈ యాగం కోసం పనిచేస్తున్నారు. ఇక మంత్రులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా యాగశాలకే అంకితమయిపోయారు. మరి ఈ యాగం వలన ప్రభుత్వం దాదాపు స్తంభించిపోయింది. అటువంటప్పుడు ప్రభుత్వంతో దానికి లేదని ఏవిధంగా అనగలము? కేసీఆర్ ఇంత అట్టహాసంగా యాగం చేస్తుండటంతో, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక సాధారణ పౌరుడిలాగ యజ్ఞాలు, యాగాలు చేసుకోవచ్చా? అని ప్రశ్నిస్తున్నారు.
కేసీఆర్ అధికారం లేనప్పుడు వ్యక్తిగత హోదాలో ఇటువంటి యాగాలు, యజ్ఞాలు ఎన్ని చేసుకొన్నా ఎవరూ ఆయనను అభ్యంతరం పెట్టలేరు. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తన వ్యక్తిగత మతాభిప్రాయలకు అనుగుణంగా ఈ విధంగా యాగాలు చేయడమే తప్పు అని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. దేశంలో, రాష్ట్రంలో హిందువులు అధికశాతం ఉన్నారు కనుక ఆయన యాగం చేయడాన్ని ఎవరూ తప్పుగా భావించకపోవచ్చును. కానీ ఒకవేళ అదే ఒక ఇతర మతస్తుడు ముఖ్యమంత్రిగా అయినప్పుడు, అతను తన మతాచారాల ప్రకారం ఇటువంటి కార్యక్రమమేదో చేసేందుకు పూనుకొంటే అప్పుడు కూడా అందరూ ఇలాగే స్వాగతించగలరా? ఎవరూ వేలెత్తి చూపకుండా ఉండగలరా? అనే ప్రశ్న తలెత్తుతోంది.