ఏపీలో నాలుగు స్థంభాలాట
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నాలుగు ప్రధాన రాజకీయపార్టీలకీ నాలుగు రకాల సమస్యలున్నాయి. అధికార తెదేపాకు మిత్రపక్షమయిన బీజేపీ రాష్ట్రంలో బలపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు చాలా ఆందోళన కలిగించడం సహజం.
ఇక తెదేపాను నొప్పించకుండా దానితో సఖ్యతగా ఉంటూనే రాష్ట్రంలో బలపడటం బీజేపీకి కత్తిమీద సాము వంటిదే. ఎందువలన అంటే కేవలం తెదేపాతో పొత్తుల కారణంగానే రాష్ట్రంలో బీజేపీ వెలుగులోకి వచ్చింది తప్ప తన స్వశక్తితో కాదు. ఒకవేళ ఇప్పుడు తెదేపాతో తెగతెంపులు చేసుకొన్నాకూడా దానిపట్ల ప్రజలలో విముఖత ఏర్పడటం సహజం. పైగా ప్రజలు వద్దనుకొన్న కాంగ్రెస్ నేతలను ఆ పార్టీలోకి ఆకర్షించడం ద్వారా బలపడాలని చూస్తున్నందున, బీజేపీ పట్ల వ్యతిరేకత చూపే అవకాశం ఉంది.ఈ నాలున్నరేళ్ళలో ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి ఏమేరకు సహాయపడుతుందనే అంశం కూడా ఆ పార్టీపై ప్రభావం చూపనుంది. అయితే బీజేపీ రాష్ట్ర నేతలు ఈ విషయం గ్రహించారో లేదో తెలియదు కానీ వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తామని అప్పుడే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అంతే కాదు కేంద్రంలో తమ పార్టీయే అధికారంలో ఉన్నందున మిత్రపక్షమయిన తెదేపాను చిన్నచూపు చూస్తున్నారు కూడా. కానీ రాష్ట్రంలో తమ పార్టీ బలపడాలంటే తెదేపాతో స్నేహం చాలా అవసరమనే విషయం బీజేపీ అధిష్టానం గ్రహించినట్లే ఉంది. అందుకే కేంద్రమంత్రులు తెదేపాతో చాలా గౌరవంగా వ్యవహరిస్తున్నారు.
ఇక కాంగ్రెస్, వైకాపాల పరిస్థితి ఇంచుమించు ఒక్కలాగే ఉందని చెప్పవచ్చును. తెదేపా, బీజేపీలు రెండూ తమ పార్టీ సీనియర్ నేతలను, యం.యల్యే.లు, యంపీలను ఆకర్షిస్తుంటే వారిని కాపాడుకోవడం చాలా కష్టమయిపోతోంది వాటికి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికిని గుర్తుచేసేందుకు ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాత్రమే కనబడుతున్నారు. హేమాహేమీలనదగ్గ కాంగ్రెస్ నేతలు అందరూ అధిష్టానం, ప్రజలు కలిపి కొట్టిన దెబ్బకి పత్తా లేకుండా పోయారు. కాంగ్రెస్ పార్టీకి జాతీయ, రాష్ట్ర స్థాయిలో భవిష్యత్ అంతా అంధకారంగా కనిపిస్తుండటంతో, రాష్ట్రంలో తమ అండతో బలపడాలనుకొంటున్న బీజేపీలో చేరడం ద్వారా కాంగ్రెస్ నేతలు తమ రాజకీయ భవిష్యత్ ను కాపాడుకోవాలనుకోవడం చాలా సహజం. అయితే వారు బీజేపీలోకి తరలి వెళ్లిపోతుంటే వారిని ఆగమని కోరేవారు కూడా పార్టీలో లేకుండా పోయారు. బహుశః వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొని ఉంది.
ఇక వైకాపా నేతలను, యం.యల్యే.లు, యంపీలను తెదేపా, బీజేపీలు తమ పార్టీలలోకి ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్న సంగతి చూస్తూ కూడా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వారితో చాలా అహంభావంగా వ్యవహరిస్తూ చేజేతులా వారిని ఇతర పార్టీలలోకి సాగనంపుకొంటున్నారు.
ఈ మధ్య కాలంలో కొణతాల, దాడి, గండి బాబ్జీ, చొక్కాకుల వెంకట్రావు అదే కారణంతో పార్టీని వీడగా, త్వరలో ప్రకాశం జిల్లా అద్దంకి యం.యల్యే. గొట్టిపాటి రవి కుమార్, నెల్లూరు మరియు కర్నూలు నుండి ఒక్కో యం.యల్యే. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి ముగ్గురు యం.యల్యే.లు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వారే కాక త్వరలో వైకాపా సీనియర్ నేత మైసూరా రెడ్డి, జమ్మలమడుగు వైకాపా యం.యల్యే. ఆదినారాయణ రెడ్డి, నెల్లూరు యంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు కూడా జగన్ విచిత్ర వైఖరి కారణంగానే పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
గత ఐదేళ్ళుగా ప్రతిపక్షంలో ఉన్న వైకాపా మరో నాలుగున్నరేళ్లు ప్రతిపక్షంలో ఉండవలసినప్పుడు ఎంతో అప్రమత్తతో వ్యవహరిస్తూ పార్టీ నేతలను కాపాడుకోవలసి ఉంటుంది. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పదేళ్ళపాటు తమ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తెలంగాణా అంశంతో చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా పార్టీని జాగ్రత్తగా కాపాడుకొచ్చిన తీరు గమనిస్తే, వైకాపా ఈ విషయంలో ఎంత అలసత్వం ప్రదర్శిస్తోందో కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. బహుశః జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా వ్యవహరిస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఆ పార్టీ మాయమయిపోయినా ఆశ్చర్యంలేదు.
రాష్ట్రం నుండి కాంగ్రెస్, వైకాపాలు మాయమయిపోతే, ఇక మిగిలేవి తెదేపా, బీజేపీలే కనుక అప్పుడు వాటి మధ్య పోటీ అనివార్యం అవవచ్చును. అయితే ఈ మిగిలిన నాలుగున్నరేళ్ళలో రాష్ట్రాభివృద్ధి చేసి ప్రజలను మెప్పించి ఓట్లు కోరాలని తపిస్తున్న తెదేపాను అక్కున జేర్చుకొంటారా? లేక ప్రజలు వద్దనుకొన్న కాంగ్రెస్ నేతలందరినీ పార్టీలో జేర్చుకొని మరో కాషాయ కాంగ్రెస్ పార్టీగా అవతరించే బీజేపీని, మోడీ మొహం చూసి అక్కునచేర్చుకొంటారా? అనే సంగతి తెలుసుకోవడానికి మరి కొంత సమయం పడుతుంది.