డిల్లీ ఎన్నికల ఫలితాలు మోడీ పనితీరుకు గీటురాయా?

  గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల తరువాత ఇంతవరకు జరిగిన అన్నిరాష్ట్రాల ఎన్నికలలో విజయపధంలో దూసుకుపోతున్న బీజేపీకి మొట్టమొదటిసారిగా డిల్లీలో ఎదురు దెబ్బ తగలబోతోంది. అది మోడీ ప్రభుత్వం పట్ల ప్రజలలో పెరుగుతున్న వ్యతిరేకతకు సంకేతం అని కొంత మంది రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. కానీ ఆ వాదన నిజమని భావించలేము. ఈ ఎన్నికలలో బీజేపీ గెలిచినా ఓడినా కూడా అవి మోడీ పరిపాలనపై డిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావించలేము. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కూడా గెలవాలనుకోవడంలో పెద్ద విచిత్రం ఏమీ లేదు. అదేవిధంగా ఒకసారి అధికారం చేజార్చుకొన్న అరవింద్ కేజ్రీవాల్ ఈసారి ఎలాగయినా గెలిచి మళ్ళీ అధికారం చేజిక్కించుకోవాలనుకోవడం కూడా సహజమే. వారి ఆ ప్రయత్నాలలో భాగంగా ఈ ఎన్నికలలో విజయం సాధించేందుకు ఆ రెండు పార్టీలు అనుసరించిన వ్యూహాలు, వేసిన ఎత్తులు పై ఎత్తులకు వచ్చిన అంతిమ ఫలితమే ఇవి, అంతే తప్ప ఈ ఫలితాలు మోడీ పాలనకు గీటురాయని చెప్పడానికి లేదు.   మొదట్లో బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీని ముందుకు తీసుకురావడం చేత ఈ ఎన్నికలు మోడీకి, అరవింద్ కేజ్రీవాల్ కి మధ్య జరుగుతున్న పోరాటంగా తప్పుడు సంకేతాలు వెళ్ళాయి. ఒకవేళ కడదాక ఆయననే ముందు ఉంచుకొని బీజేపీ పోరాడి ఉండి ఉంటే నిజంగానే ఆవిధంగా భావించవచ్చును. కానీ బీజేపీ మధ్యలో తన వ్యూహాన్ని మార్చుకొని ఆయనను వెనక్కు తీసుకొని హటాత్తుగా కిరణ్ బేడీని పార్టీలో చేర్చుకొని ఆమెను పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడంతో పార్టీ కార్యకర్తలలో కొంచెం అయోమయ స్థితి, ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న పార్టీ నేతలలో కొంచెం అసంతృప్తి నెలకొంది.   ఆయాచితంగా అందివచ్చిన ఈ అవకాశాన్ని ఆమాద్మీ పార్టీ చక్కగా వినియోగించుకొని లాభపడింది. ఇదేపని బీజేపీ ముందే చేసి ఉండి ఉంటే ఆమె వలన తప్పకుండా పార్టీకి ప్రయోజనం దక్కేదేమో? కానీ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకొంటున్న తరుణంలో బీజేపీ వ్యూహంలో జరిగిన ఈ మార్పు వలన ఊహించని నష్టం జరిగింది. ఆమాద్మీ పార్టీ ఎన్నికలకు ఇంకా ఏడూ నెలల సమయం ఉండగానే అప్పటి నుంచే 12 మందితో కూడిన ఒక ఎన్నికల ప్రచార, సమన్వయ కమిటీని నియమించుకొంది. ఆ తరువాత ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తన అభ్యర్ధులను ఎంపిక చేసుకొంది. కమిటీ సభ్యులు స్వయంగా ఆయా నియోజక వర్గాలలో పర్యటించి అక్కడి సమస్యలను గుర్తించి వాటిని తమ మ్యానిఫెస్టోలో జోడించారు. అంతే కాకుండా ఆ సమస్యల గురించి, వాటిని తమ పార్టీ ఏవిధంగా పరిష్కారం చేయబోతోందనే విషయంపైన తమ అభ్యర్ధులకు పూర్తి అవగాహన కల్పించారు. అదే విషయాన్ని వారు తమ ప్రసంగాలలో పదేపదే పేర్కొనేలా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈవిధంగా ఏ నియోజక వర్గానికి సంబందించిన సమస్యలను ఆ నియోజక వర్గంలో ప్రస్తావిస్తూ ఆమాద్మీ పార్టీ డిల్లీలో దాదాపు 60 శాతం పైగా ఉన్న సామాన్య, మధ్య తరగతి ప్రజలకు చేరువకాగలిగింది.   అరవింద్ కేజ్రీవాల్ ఉన్న ఈ ప్రత్యేకతను కాంగ్రెస్, బీజేపీలు గతంలోనే గుర్తించినప్పటికీ,అందుకు అనుగుణంగా తమ ప్రచార వ్యూహాలను రచించుకోవడంలో అశ్రద్ధ చూపుతూ షరా మామూలుగానే తమదయినా శైలిలో భారీ సభలు, ర్యాలీలు నిర్వహించుకొని వాపును చూసి బలుపు అనుకోని మురిసిపోతూ కాలక్షేపం చేసాయి. అంటే ఈ ఫలితాలు ఆమాద్మీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అనుసరించిన వ్యూహాలకు వచ్చిన అంతిమ ఫలితమే తప్ప ఇందులో మోడీ ప్రభావం, మోడీ ప్రభుత్వ పనితీరుతో ఎటువంటి సంబందమూ లేదని స్పష్టం అవుతోంది.

కాంగ్రెస్ పోరాటాలు ఎవరి కోసం?

  ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో కాంగ్రెస్ నేతలు కూడబలుకొన్నట్లుగా ఒక్కసారిగా రోడ్ల మీదకు వచ్చి హడావుడి చేయడం మొదలుపెట్టారు. రాష్ట్ర విభజన చేసి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ దుస్థితి కల్పించిన కాంగ్రెస్ నేతలు దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడం లేదు అంటూ తమ యూపీయే ప్రభుత్వం ఎంతో ఉదారంగా రాష్ట్రానికి అనేక హామీలు ఇచ్చినా వాటిలో ఏ ఒక్కటీ కూడా మోడీ ప్రభుత్వం అమలుచేయడం లేదంటూ మొసలి కన్నీళ్లు కారుస్తూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తాము కేంద్రంతో పోరాడుతామని శపధాలు చేస్తున్నారు.   ఇంతకాలం తెలంగాణా పీసీసీ అధ్యక్ష పదవి కోసం కీచులాడుకొన్న టీ-కాంగ్రెస్ నేతలందరూ దిగ్విజయ్ సింగ్ గట్టిగా క్లాసు పీకడంతో తెరాస ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎదుర్కొని పోరాడేందుకు అంటూ వారు కూడా రోడ్డెక్కారు. కానీ ఈ కాంగ్రెస్ నేతల ఈ తాపత్రాయం అంతా దేనికో అందరికీ తెలుసు. ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో తమ పార్టీని బ్రతికించుకోకపోతే నష్టపోయేది తామేనని గ్రహించినందునే వారు ప్రజల కోసం పోరాటాలు అనే టైటిల్ పెట్టుకొని రోడ్లెక్కుతున్నారు. లేకుంటే వారు తమ ఏసీ గదులో నుండి బయటకు వచ్చేవారే కాదు. అయితే వారి కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరే అయ్యే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి.   ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన తెదేపా, తెరాసలు రెండూ కూడా చాలా నిష్టగా అభివృద్ధి మంత్రం జపిస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో ఏనాడూ ఊహించలేని అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయి. వాటిని చూపించే వచ్చే ఎన్నికలలో విజయం సాధించాలని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఈలోగా రెండు రాష్ట్రాలలో బీజేపీ కూడా బలపడాలని భావిస్తోంది. అందుకోసం కాంగ్రెస్, వైకాపాలకు చెందిన నేతలను తమ పార్టీలోకి ఆకర్షించాలని భావిస్తోంది. అధికారంలో ఉన్న తెదేపా, తెరాసలు కూడా మిగిలిన ఈ నాలుగున్నరేళ్ళలో మరింత బలపడేందుకు కృషి చేస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకోవాలంటే ఇటువంటి హడావుడి ఏదో ఒకటి చేయక తప్పదు.   ఇక కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. ఉంటుందేమో కూడా. డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ పరిస్థితి చూస్తే ఆ సంగతి అర్ధమవుతుంది. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ అనేక సంస్కరణలు చేపడుతూ యావత్ దేశాన్ని అభివృద్ధి పధంలో ముందుకు తీసుకుపోయేందుకు చాలా భారీ ప్రణాళికలు రచిస్తున్నారు. ఆకారణంగా అంతర్జాతీయ వేదికల మీద కూడా మోడీ పేరు మారు మ్రోగిపోతోంది. ఆయన అభివృద్ధి మంత్రం పటిస్తుంటే, మరోవైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమ పార్టీని బలోపేతం చేసుకొనేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నారు.   సోనియాగాంధీ తన ముద్దుల కుమారుడు రాహుల్ గాంధీ కోసం గత పదేళ్ళుగా ప్రధానమంత్రి కుర్చీని రిజర్వు చేసి ఉంచినప్పటికీ ఆయన అందులో కూర్చొనే సాహసం చేయలేకపోయారు. తమ హవా నడుస్తున్నప్పుడే అధికారం చేప్పట్టేందుకు వెనుకాడిన రాహుల్ గాంధీ, మరో ఐదేళ్ళపాటు విపక్షంలో కూర్చోన్నాక, అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ, బీజేపీ మరింత బలపడిన తరువాత తమ పార్టీకి విజయం సాధించగలరా? అని ప్రశ్నించుకొంటే ఏమి సమాధానం వస్తుందో అందరికీ తెలుసు. ఒకవేళ అప్పటికి సోనియాగాంధీ అనారోగ్య కారణాల చేత రాజకీయాల నుండి తప్పుకొంటే, ఆమె కొంగు పట్టుకొని నడిచే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తారా? లేక పార్టీయే ఆయనను నడిపిస్తుందా? లేక ఏకంగా పక్కన పెడుతుందా? అని ఆలోచించుకొంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏవిధంగా ఉండబోతోందో కళ్ళకి కట్టినట్లు కనబడుతోంది.   అలాగని కాంగ్రెస్ నేతలు చేతులు ముడుచుకొని కూర్చోలేరు. కనుకనే ఇలాగ ఏవో తమకు అలవాటయిన పద్దతులలో ఆపసోపాలు పడుతున్నారు. దాని వలన వారి భవిష్యత్ బాగుపడుతుందో లేదో తెలియదు గానీ వారు చేస్తున్న హడావుడి వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం అప్రమత్తంగా పనిచేస్తుంటాయని చెప్పవచ్చును. మరక మంచిదేనంటే ఇదేనేమో!

రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతల పోరాటమా? హవ్వ!

  మళ్ళీ చాలా కాలం తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కలుగుల్లో నుండి ఎలకల్లా బిలబిలా బయటకు వచ్చి కోటి సంతకాల కార్యక్రమం అంటూ హడావుడి చేయడం మొదలుపెట్టారు. ఇంతకాలం రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఒక్కరే పార్టీ ఉనికిని చాటేందుకు నానా తిప్పలు పడుతుంటే ఏనాడూ కనబడని బొత్స సత్యనారాయణ, చిరంజీవి, పనబాక లక్ష్మి, కేవీపీ రామచంద్ర రావు వంటి అనేకమంది కాంగ్రెస్ నేతలు మళ్ళీ బయటకి వచ్చి హడావుడి చేస్తున్నారు. తమ యూపీయే ప్రభుత్వం విభజన సందర్భంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో సహా ఇచ్చిన అన్ని హామీలను ఇంతవరకు అమలుచేయకుండా బీజేపీ మోసం చేస్తుంటే, దానికి మిత్రపక్షమయిన తెదేపా పట్టనట్లు ఊరుకోందని, కానీ అన్ని హామీలను అమలుచేసే వరకు తాము వాటిని వదిలిపెట్టబోమని ప్రకటించారు.   తెలంగాణా రాష్ట్రంలో గెలిచేందుకే ఏపీలో తమ పార్టీని పణంగా పెట్టి మరీ రాష్ట్ర విభజన చేసామని టీ-కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటున్నారు. అంటే తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విడదీయడానికి, చివరికి తమ స్వంత పార్టీ నేతల భవిష్యత్ ని పణంగా పెట్టడానికి కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకాడదని వారే చాటుకొంటున్నారు. అటువంటప్పుడు ఎన్నికలలో గెలిచేందుకే యూపీయే ప్రభుత్వం అనేక భూటకపు వాగ్దానాలు చేసిందని వేరేగా చెప్పనవసరం లేదు.   రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆమోదం అవసరమని, ఒక రాష్ట్రానికి ఇస్తే దాని కోసం చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న మిగిలిన 8 రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోరుతాయి కనుక అది అసాధ్యమనే సంగతి కాంగ్రెస్ అధిష్టానికి తెలియదనుకోలేము. అయినా కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది అంటే అది ప్రజలను మభ్యపెట్టి వారి ఓట్లు పొందేందుకేనని అర్ధం అవుతోంది.   ఇప్పుడు ఎలాగూ తమ పార్టీ అధికారంలో లేదు కనుక రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎన్ని డిమాండ్లయినా చేయగలరు. కానీ రాజ్యసభలో ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ యంపీ జై రామ్ రమేష్ ఒక్కరే ఎన్డీయే ప్రభుత్వంతో పోరాడుతున్నప్పుడు చిరంజీవి, కేవీపీ తదితరులు ఆయనతో ఎందుకు గొంతుకలపలేదు? అనే ప్రశ్నకు వారు జవాబు చెపితే బాగుంటుంది.   ఇక చంద్రబాబు నాయుడు కేంద్రంపై నిధుల కోసం, ప్రాజెక్టుల అనుమతుల కోసం ఒత్తిడి చేయడంలేదనే వాదన అర్ధరహితం. ఆయన ముఖ్యమంత్రి గా బాధ్యతలు చెప్పట్టక ముందు నుండి నేటి వరకు కూడా అనేకమార్లు డిల్లీకి వెళ్లి ప్రధానితో సహా కేంద్రమంత్రులు అందరినీ కలిసి వారిపై ఒత్తిడి చేస్తున్నారు. మళ్ళీ రేపు కూడా మరోమారు అదే పనిమీద డిల్లీ వెళుతున్నారు. ఆయన ఇందుకోసమే ప్రత్యేకంగా డిల్లీలో రాష్ట్రం తరపున ప్రత్యక ప్రతినిధిగా కంబంపాటి రామ్మోహన్ రావును నియమించిన సంగతి అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కేంద్రంపై నిరంతరం ఒత్తిడి చేస్తుండటమే కాకుండా, రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు, యంపీల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే అన్నీ రాత్రికి రాత్రే సాధ్యం కాదు కనుక క్రమంగా ఒకొక్క హామీని నెరవేర్చుకొంటూ వస్తున్నారు.   తెదేపా-బీజేపీలు మిత్రపక్షాలుగా ఉన్నంత మాత్రాన్న ఈ ఆర్ధిక, సాంకేతిక సమస్యలన్నిటినీ పక్కనబెట్టి మోడీ ప్రభుత్వం రాష్ట్రంపై నిధుల వర్షం కురిపించేయలేదు. ఒకవేళ మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చినా తను చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలుచేయలేదని అందరికీ తెలుసు. ఎందుకంటే గత పదేళ్ళుగా కేంద్రంలో, తనకు కంచుకోట వంటి అవిభాజ్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఏమీ విదిలించలేదు. పైగా తన రాజకీయ ప్రయోజనాల కోసం బలమయిన రాష్ట్రాన్ని హడావుడిగా రెండు ముక్కలు చేసి చేతులు దులుపుకొని వెళ్లిపోయింది. అందుకు ఆంద్ర ప్రజలు భారీ మూల్యం చెల్లిస్తున్నారిప్పుడు.   రాష్ట్ర ప్రభుత్వం చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితిలో లక్షల కోట్లు ఖర్చుచేసి రాజధాని నిర్మించుకోవలసి వస్తోంది. కాంగ్రెస్ హయాంలో ఏనాడు వినబడని మెట్రో రైల్ నిర్మాణం, రైల్వే జోన్ ఏర్పాటు, ఐ.ఐ.టి. ఐ.ఐ.యం. ఎయిమ్స్ వంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఇప్పుడు తెదేపా-బీజేపీలు అధికారంలోకి వచ్చేకనే ఆచరణ సాధ్యం కాబోతున్నాయి వాటి మధ్య ఉన్న సఖ్యత కారణంగానే ఇవ్వన్నీ సాధ్యం అవుతున్నాయి.   రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినా అంతకు ఏ మాత్రం తీసిపోని విధంగా అన్ని విధాల సహాయం చేస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పదేపదే చెపుతున్నారు. మొన్న విడుదల చేసిన ఆర్ధిక సహాయం కేవలం ఆరంభం మాత్రమేనని విస్పష్టంగా చెపుతున్నారు. తమ పార్టీ కూడా రాష్ట్రంలో బలపడాలని భావిస్తున్నప్పుడు ఆయన ప్రజలను మభ్యపెట్టే సాహసం చేస్తారని ఎవరూ అనుకోరు.   కేంద్ర సహాయం అందడంలో కొంత జాప్యం అవుతున్న మాట వాస్తవమే. కానీ దానర్ధం కేంద్రం ఇక సహాయం చేయదని కాదు. రాష్ట్ర ప్రజలందరూ ఇవ్వన్నీ గమనిస్తూనే ఉన్నారు. కానీ కాంగ్రెస్ నేతలే గమనించనట్లు నటిస్తూ దీనిని కూడా తమ రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని హడావుడి చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు వారికి ఎన్నికలలో తగిన గుణపాటం నేర్పించినా వారు మారలేదు, మారబోరని మరోమారు రుజువు చేస్తున్నరిప్పుడు. చేసిన తప్పులను ఒప్పుకోకుండా రాష్ట్రానికి సహాయం చేస్తున్న బీజేపీని, దానిని అభివృద్ధి చేయాలని తపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే నష్టపోయేది కాంగ్రెస్ నేతలేనని గ్రహిస్తే మంచిది.

తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు పండగ

  తెలంగాణా రాష్ట్రం ఏర్పడి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ప్రత్యేక బోనస్, ఇంక్రిమెంట్లు, హెల్త్ కార్డులు, వేతన సవరణ అన్నీ ఇస్తానని ఆనాడు తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. వారికి ఇచ్చిన మాటను నిలుపుకొంటూ ఆయన ఒక్కొకటి వరుసగా అమలుచేసి చూపిస్తున్నారు. నిన్న సాయంత్రం సచివాలయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమయిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి ఏకంగా 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తున్నట్లు ప్రకటించి వారినందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు.   సాధారణంగా వేతన సవరణ అనగానే ఉద్యోగ సంఘాలకి, ప్రభుత్వానికి మధ్య పీచుబేరాలు, అలకలు, బుజ్జగింపులు వంటివి తప్పవు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఉద్యోగులు ఊహించిన, ఆశించిన దానికంటే ఎక్కువగా 43 శాతం ఫిట్‌మెంట్‌ మంజూరు చేయడంతో ఉద్యోగుల ఆనందానికి అంతులేదు. ఈ వేతన సవరణ తెలంగాణా రాష్ట్ర ఆవిర్భవించిన నాటి నుండి అంటే 2014 జూన్‌ 2వ తేదీ నుండే అమలు చేయబోతున్నట్లు ప్రకటించి కేసీఆర్ ఉద్యోగులకు మరింత సంతోషం కలిగించారు. ఇంతవరకు 9 పీఆర్సీలు అమలు చేసినా వాటిలో ఏ ఒక్కటికీ కూడా ఇంత సంతృప్తికరంగా లేదని కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఈ పదవ పీఆర్సీ తమకు చాలా ఆనందం కలిగించిందని ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు.   ఫిబ్రవరి వరకు ఉన్న బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాలో జమ చేసి, ఈ నెల జీతం నుండి పెంచిన జీతాలు తెలంగాణా ప్రభుత్వం చెల్లించబోతోంది. ఈ పెంపు వలన ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.6500 కోట్ల మేరకు అదనపు భారం పడుతుందని కేసీఆర్ తెలిపారు. కానీ ప్రభుత్వం ఆ మాత్రం భారం భరించగల పరిస్తితిలోనే ఉందని తెలిపారు. తెలంగాణా ప్రభుత్వానికి ఆర్ధికంగా కొంత వెసులుబాటు ఉంది కనుక ఇది పెద్ద భారం కాబోదు. అటువంటప్పుడు వారిని నిరాశపరిచి వారి ఆగ్రహానికి గురయ్యే కంటే, ఈవిధంగా వారికి సంతృప్తి కలిగించే ఒక మంచి వేతన సవరణ ఇవ్వడం ద్వారా తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి చేసేందుకు వారి సహకారం కూడా పొందవచ్చునని కేసీఆర్ భావించిఉండవచ్చును. ఆయన ఊహించినట్లే వేతన సవరణ విషయం ప్రకటించగానే ఇకపై ఉద్యోగులు అందరూ రోజు ఒక గంట ఎక్కువసేపు పనిచేసి తెలంగాణా అభివృద్ధిలో పాలుపంచుకొంటామని ఉద్యోగసంఘాల నేతలు అక్కడికక్కడే ప్రకటించేరు.   అయితే ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్లుగా ఆర్ధికంగా బలంగా ఉన్న తెలంగాణా ప్రభుత్వం తన ఉద్యోగులకు ప్రకటించిన 43 శాతం ఫిట్‌మెంట్‌ ప్రభావం తప్పకుండా ఆంధ్రా ఉద్యోగులపై కూడా పడవచ్చును. ఒకవేళ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ సంఘాలు తమకు కూడా అటువంటి వేతన సవరణ ఇవ్వాలని పట్టుబట్టినట్లయితే, ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందని చెపుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి వారిని సముదాయించడం చాలా కష్టం కావచ్చును.   చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 సం.ల నుండి 60 సం.లకి పెంచినప్పుడు కేసీఆర్ కూడా తెలంగాణా ఉద్యోగుల నుండి ఈవిధంగానే ఒత్తిడి ఎదుర్కొన్నారు. ఆ తరువాత ఆయన కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులను క్రమబద్దీకరించినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ ప్రకటించిన వేతన సవరణ వలన చంద్రబాబు నాయుడు తన ఉద్యోగుల నుండి తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవలసి రాచ్చును. ఒకవేళ అదే పరిస్థితి ఎదురయితే ఆయన వారిని ఏవిధంగా సముదాయిస్తారో వేచి చూడాలి.

కేంద్రానికి రెండు కళ్ళు సమానమే

  ఎట్టకేలకు కేంద్రం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.850కోట్ల నిధులు మంజూరు చేసింది. దీనిలో రాష్ట్ర బడ్జెట్ లో ఆర్ధికలోటు భర్తీకి గాను రూ.500 కోట్లు, రాయలసీమ మరియు ఉత్తరాంధ్రాలో వెనుకబడిన ఏడు జిల్లాల అభివృద్ధికి రూ.350 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర బడ్జెట్ లోటు రూ. 16,000 కోట్లని ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించింది. దానిలో రూ.500కోట్లు అంటే చాలా చిన్న మొత్తమే. కానీ అది తాత్కాలిక సహాయం క్రిందే పరిగణించాలని కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అంచనా వేసేందుకు కేంద్ర మంత్రులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని కేంద్రం నియమించింది. ఆ కమిటీ నివేదికను బట్టి రాష్ట్రానికి అవసరమయినంతా ఆర్ధిక సహాయం చేస్తానని కేంద్రం హామీ ఇవ్వడం ద్వారా తను కాంగ్రెస్ పార్టీలా చేతులు దులుపుకొని వెళ్ళిపోవడం లేదని చాలా విస్పష్టంగా తెలియజేసింది.   ఇక ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురవడంతో దానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఏడూ జిల్లాలకు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ మరియు ఆ ప్రాంతాలలో పరిశ్రమల స్థాపనకు కొన్ని పన్ను రాయితీలు కూడా ప్రకటించింది. కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శిస్తోందనే తెరాస వాదనలు అర్ధరహితమని నిరూపిస్తూ, తెలంగాణాలో వెనుకబడిన జిల్లాలలో పారిశ్రామిక అభివృద్ధికి కూడా ఇవే రాయితీలను వర్తింపజేసింది.   విభజన చట్టంలో హామీ ఇచ్చిన విధంగానే ఆంద్రప్రదేశ్, తెలంగాణా రెండు రాష్ట్రాలకు పూర్తి న్యాయం చేస్తానని కేంద్రం పదేపదే చెపుతున్నప్పటికీ, రెండు రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలు కేంద్రం మీద విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. వాటి విమర్శలకు నిన్న ప్రకటించిన ఈ భారీ నిధులు, రాయితీలతో కేంద్రం సరయిన సమాధానం చెప్పింది. అంతే కాదు తెలంగాణాలో ఎయిమ్స్ ఆసుపత్రి స్థాపించేందుకుకు తను పంపించిన ప్రతిపాదనలపై తెలంగాణా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించడం గమనిస్తే కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానదృష్టితోనే చూస్తోందని అర్ధమవుతోంది.   ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి హామీ ఇచ్చిన విధంగా ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినప్పటికీ, అంతకు ఏ మాత్రం తీసిపోని విధంగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి మున్ముందు అనేక రాయితీలను, ప్రోత్సాహకాలను ఇవ్వబోతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈనెల పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే రైల్వే బడ్జెట్ లో ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఇదివరకే కేంద్రం ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలియజేసింది. అదేవిధంగా రాష్ట్ర రాజధానిలో ప్రధాన ప్రాంత నిర్మాణానికి కేంద్రం నిధులు విడుదల చేసేందుకు సిద్దంగా ఉందని కేంద్రమంత్రి సుజన చౌదరి కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు.   ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిమ్స్ ఆసుపత్రి, ఐ.ఐ.యం. మరియు ఐ.ఐ.టి.లకు కేంద్రం ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఇంతకాలం నిధుల విడుదలలో జాప్యం వలన ప్రతిపక్షాల నుండి కొన్ని విమర్శలు మూటగట్టుకోవలసి వచ్చింది. అయితే ఆంద్ర, తెలంగాణా రాష్ట్రలలో బీజేపీ నేతలు చొరవ తీసుకొని ప్రజలలో నెలకొన్న అపోహలు దూరం చేసి ఉంటే విమర్శలకు అవకాశం ఉండేది కాదు. కొంచెం ఆలశ్యం అయినప్పటికీ కేంద్రం తెలుగు రాష్ట్రాలకు ఈవిధంగా చేయూతనీయడం హర్షణీయమే.

ఉద్యోగులూ ఓ చెయ్యి వేయాలి

  రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకపోవడంతో హైదరాబాద్ నుండే పరిపాలన కొనసాగించవలసి వస్తోంది. చట్ట ప్రకారం మరో తొమిద్దినరేళ్ళపాటు అక్కడి నుండే పరిపాలించుకొనే వెసులుబాటు కూడా ఉంది. కానీ ప్రభుత్వం, పరిపాలనా, శాసనసభ సమావేశాలు అన్నీ కూడా పొరుగు రాష్ట్రం నుండే నిర్వహించడం పట్ల రాష్ట్ర ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. తమ ప్రభుత్వం తమకు అందుబాటులో లేదనే భావన వారిలో నెలకొని ఉంది. కానీ పరిస్థితులను చూసి ప్రజలు కూడా ఏమీ అనలేకపోతున్నారు. ప్రజలలో నెలకొన్న ఈ అసంతృప్తిని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారానికి రెండు రోజుల చొప్పున అన్ని జిల్లాల పర్యటనలు చేయవలసి వచ్చింది. కానీ అది ఈ సమస్యకు శాశ్వితపరిష్కారం కాదని ఆయనకీ తెలుసు. అందుకే ఆయన అమరావతి వద్ద తాత్కాలిక రాజధాని నిర్మించుకొని జూన్-జూలై నెలాఖరులోగా హైదరాబాద్ లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వప్రధాన కార్యాలయాలను అక్కడికి తరలించాలని భావిస్తున్నారు.   పొరుగు రాష్ట్రంలో ఉంటూ పరిపాలన చేయడంలో ఉండే పరిపాలనాపరమయిన సమస్యలు, ఇబ్బందులు అందరికీ తెలుసు. ముఖ్యంగా ఆంద్ర, తెలంగాణా ఉద్యోగుల మధ్య నిత్యం ఏదో ఒక విషయంలో ఘర్షణలు జరుగుతుండటంతో ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ దుస్థితి నుండి బయటపడాలంటే విజయవాడకు తరలిరావడం ఒక్కటే పరిష్కారం. తెలంగాణా ప్రభుత్వం త్వరలో సెక్రటరియేట్ భవనాన్ని ఎర్రగడ్డ వద్ద నిర్మించబోయే కొత్త భవనంలోకి తరలించాలని భావిస్తోంది. అదే జరిగితే ఆంద్ర ఉద్యోగులు ఇంకా ఇబ్బందులు పడవవచ్చును. ఆ కారణంగా ఉద్యోగుల మధ్య, ప్రభుత్వాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం ఏర్పడవచ్చును.   కానీ పూర్తి ఏర్పాట్లు, సౌకర్యాలు లేకుండా ఒకేసారి వేలాదిమంది ఉద్యోగులను, ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలిక రాజధానికి తరలిస్తే కూడా ఊహించని అనేక కొత్త ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చును. మళ్ళీ అంతా సర్ధుకొనే వరకు పరిపాలనకు కూడా కొంత ఇబ్బంది కలగవచ్చును. ముఖ్యంగా హైదరాబాద్ లో చిరకాలంగా స్థిరపడిన ఉద్యోగులు అకస్మాత్తుగా విజయవాడకు తరలిరావాలంటే చాలా ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే ఎన్జీవో సంఘాల నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేసారు. తమపై ఒత్తిడి చేస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారితో నిన్న రాత్రి సమావేశమయ్యి వారి సమస్యలన్నిటినీ వారం రోజుల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తాత్కాలిక రాజధాని ప్రాంతంలోనే 3000 మంది ఉద్యోగులు, అధికారులకు గృహ సముదాయాలు నిర్మిస్తామని చెప్పారు. పొరుగు రాష్ట్రం నుండి పరిపాలన చేయడంలో ఇబ్బందులను వారికి వివరించి, ప్రభుత్వంతో సహకరించవలసిందిగా కోరారు. వారు ఆయనకి స్పష్టమయిన హామీ ఇవ్వనప్పటికీ, ఆయన వారికి ఇచ్చిన హామీని నిలబెట్టుకొంటే సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. కనుక జూన్ నెలాఖరుకల్లా తాత్కాలిక రాజధానికి ప్రభుత్వం తరలివచ్చే అవకాశాలున్నాయని భావించవచ్చును.   రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రభుత్వోద్యోగులు రెండున్నర నెలల పాటు చేసిన అనన్య సామాన్యమయిన పోరాటంలో వారు అనేక త్యాగాలు చేసారు. దానిని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరు. రాష్ట్ర పునర్నిర్మాణం కూడా వారి చేతుల మీదుగానే జరుగవలసి ఉంది. వారి సహకారం లేనిదే ఈ పరిస్థితుల నుండి రాష్ట్రం తేరుకోలేదు. రాజధాని నిర్మాణం కోసం తుళ్ళూరు మండలంలో రైతులు తమ జీవనాధారమయిన వ్యవసాయ భూములను ప్రభుత్వానికి అప్పగించి అపూర్వమయిన త్యాగాలు చేస్తున్నారు. కనుక ఉద్యోగులు కూడా రాష్ట్ర హితాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత త్యాగాలు చేయక తప్పదు. వారు తాత్కాలికంగా ఒకటి రెండేళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చునేమో గానీ వారిప్పుడు ప్రభుత్వానికి సహకరిస్తే వేగంగా రాజధాని నిర్మాణం పూర్తవుతుంది. అప్పుడు అందరి కంటే ముందుగా ప్రయోజనం పొందేది వారే.   ప్రభుత్వానికి అందులో పనిచేసే ఉద్యోగులకి మధ్య చక్కటి సమన్వయము ఉన్నప్పుడే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది. వేగంగా రాష్ట్రాభివృద్ధి జరిగితేనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అప్పుడే ప్రభుత్వం కూడా వారి జీతభత్యాలు పెంచగలదు. ఇవ్వన్నీ ఉద్యోగులకు తెలియని విషయాలు కాదు.   ఇది చంద్రబాబుకో లేక రాష్ట్ర ప్రభుత్వానికో తెదేపాకో చెందిన సమస్య కాదిది. ఉద్యోగులతో సహా రాష్ట్ర ప్రజలందరికీ సంబందించిన సమస్య. రాజధాని లేకుండా, రాష్ట్రం ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే అది ఎవరికీ గౌరవంగా ఉండదు. కనుక ఉద్యోగులు కూడా తమ వ్యక్తిగత సమస్యల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమనే దృక్పధంతో ఉడతాభక్తిగా తమవంతు కర్తవ్యం, బాధ్యతలు నెరవేర్చవలసి ఉంటుంది. ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి సహకరించి రాష్ట్ర పునర్నిర్మాణంలో కీలక పాత్ర వహిస్తే అది వారికీ ఎంతో గౌరవంగా, గర్వంగా ఉంటుంది. రాష్ట్ర ప్రజలు కూడా హర్షిస్తారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల సమస్యలను, ఈవిషయంలో వారి సలహాలను కూడా పరిగణనలోకి తీసుకొని ఎవరికీ ఇబ్బంది కలగని విధంగా మధ్యే మార్గంలో అడుగులు ముందుకు వేసినట్లయితే వారు కూడా చాలా సంతోషిస్తారు.

రాహుల్‌కి పగ్గాలు.. పార్టీకి రాహుకాలమా?

  కాంగ్రెస్ పార్టీ తన 123సం.ల ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులను తట్టుకొని నిలబడగలిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మహాసాగరం. అందులో అసంతృప్తి కెరటాలు ఎంత సహజమో, దేశ వ్యాప్తంగా పుట్టే అనేక చిన్నా చితకా పార్టీలు చివరికి ఆ మహాసాగరంలోనే కలిసిపోవడం కూడా అంతే సహజం. కానీ ఇప్పుడు ఆ మహాసాగరం క్రమంగా కుచించుకుపోయి చిన్న సెలయేరులా తయారయింది. అందుకు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలనే తప్పు పట్టవలసి ఉంటుంది. పార్టీ బ్రతికి ఉంటేనే అందులో ఉండే ఏ వ్యక్తికయినా సమాజంలో ఒక హోదా, గౌరవం దక్కుతుంది. పార్టీ ఎన్నికలలో గెలిస్తేనే పదవులు, అధికారం వంటివన్నీ దక్కుతాయి. కానీ అది మరిచిపోయి పార్టీ కంటే తమ ప్రయోజనాలే ముఖ్యం అని భావిస్తే ఏమవుతుందో తెలుసుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ సజీవ ఉదాహరణగా నిలిచి ఉంది.   కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకొంది. అది సరిపోదన్నట్లు పార్టీ అధ్యక్షురాలు పుత్రవాత్సల్యంతో కొడుకుని ప్రధానమంత్రిని చేయాలనే ఏకైక లక్ష్యంతోనే పార్టీని నడిపించారు.   గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించిన నరేంద్ర మోడీ, తన స్వంత పార్టీలోను, బయటా కూడా అనేక పెను సవాళ్ళను ఎదుర్కొని సమర్దుడయిన నేతగా ప్రజల ముందుకు వచ్చినప్పుడయినా సోనియాగాంధీ మేల్కోలేదు. అపార రాజకీయ అనుభవజ్ఞుడు, పరిపాలనాదక్షుడు, గొప్ప నాయకత్వ లక్షణాలు గల నరేంద్ర మోడీకి ఏ మాత్రం సరితూగలేని రాహుల్ గాంధీని నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళడం రాజకీయ ఆత్మహత్య వంటిదే. కానీ ఆ సంగతి సోనియాగాంధీకి తెలియదా? ఆమెకు తెలియకపోతే పార్టీలో హేమాహేమీలయిన కాంగ్రెస్ నేతలకయినా తెలియదా? అంటే అలా అనుకోలేము.   అప్పటి కాంగ్రెస్ పరిస్థితిని నిండు సభలో ద్రౌపదీ వస్త్రాపహరణంతో పోల్చవచ్చును. అందరికీ జరుగుతున్నది ఘోర తప్పిదమని తెలుసు. కానీ ఎవరూ దైర్యంగా నోరువిప్పి చెప్పలేని పరిస్థితి. మహాసాద్వి ద్రౌపదిని శ్రీకృష్ణుడు కాపాడాడు. కానీ కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకు ఏ కృష్ణుడు రాలేదు, లేడు కూడా. అందుకే కాంగ్రెస్ చరిత్రలోనే ఈ దుస్థితికి చేరుకొంది.   కానీ ఏనాడు ఆత్మవిమర్శ చేసుకొని పార్టీని బ్రతికించుకొనేందుకు ప్రయత్నాలు చేయడం లేదు, పైగా రాహుల్ గాంధీని దెబ్బ తీసేందుకే పార్టీలోపల, బయటా కొంతమంది వ్యక్తులు, పార్టీలు కుట్రలు పన్నుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత అనిల్ శాస్త్రి ఆరోపించారు. అటువంటివారిని పార్టీ ఉపేక్షించరాదని ఆయన సలహా ఇచ్చారు. కానీ ఈ విషయాన్నీ కూడా ఎవరో ఒకరు కనిపెట్టి చెపితే తప్ప గ్రహించలేని పరిస్థితిలో ఉంటే, ఇక రాహుల్ గాంధీ పార్టీని ఏవిధంగా నడిపించగలరు? ఇటువంటి సమస్య దేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీకే కాదు అన్ని రాజకీయపార్టీలకీ ఉన్నాయి. కానీ వాటికి సారధ్యం వహిస్తున్నవారే ఆ సమస్యలను స్వయంగా గుర్తించి, వాటిని ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.   కానీ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీపై ఈగ వాలకుండా జాగ్రత్తగా కాపాడుకొంటూ, ఆయన తరపున వారే పోరాడుతుంటారు. యుద్ధంలో సైన్యాధక్షుడు సేనలను ముందు ఉండి నడిపించాలి. కానీ సేనలే సైన్యాద్యక్షుడిని కాపాడుకోవలసి వస్తుంటే...ఇక ఆ యుద్ధం ఏవిధంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. గతపదేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలతో చెలగాటం ఆడుకొంది. రాష్ట్ర విభజన సమయంలో ఆ పార్టీ ఏవిధంగా వ్యవహరించిందో గుర్తుకు తెచ్చుకొంటే అది అర్ధమవుతుంది.   కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ పేరు ప్రతిష్టలను దెబ్బతీసి, ఆయన పార్టీ అధ్యక్షపదవి చేప్పట్టలేని పరిస్థితులను కల్పించాలని కొందరు కుట్రలు చేస్తున్నారని గగ్గోలు పెడుతోంది. ఆ పార్టీలో నేతలు ఎవరయినా కుట్రలు చేస్తుంటే దానిని నడిపిస్తున్న ఆ తల్లికొడుకులే స్వయంగా చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకు ఇతరులను నిందించి ప్రయోజనం లేదు. కానీ అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పగ్గాలు చేపడితే, దేశంలో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే అన్ని పార్టీలు తప్పకుండా స్వాగతించవచ్చు. ఎందుకంటే బలహీనుడయిన అటువంటి ప్రత్యర్ధి ఉంటే వారికి లాభమే తప్ప నష్టం, ఇబ్బంది ఉండవు. కనుక అటువంటి వ్యక్తి చేతిలో తమ పార్టీని పెట్టాలా వద్దా? అనేది కాంగ్రెస్ నేతలే ఆలోచించుకొంటే మంచిది. ఎందుకంటే పార్టీ బ్రతికి ఉంటేనే వారికీ భవిష్యత్ ఉంటుంది. వ్యక్తి ముఖ్యమా లేక పార్టీ ముఖ్యమా? అనే ప్రశ్నకు వారు నిజాయితీగా సమాధానం చెప్పుకోగలిగితే చాలు. వారి సమాధానంపైనే వారి భవిష్యత్, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.

త్వరలో విశాఖ కేంద్రంగా ఏపీకి కొత్త రైల్వే జోన్ ఏర్పాటు

  త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రైల్వే జోన్ మంజూరు చేయబోతున్నట్లు కేంద్రప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలియజేసింది. ఆయన ఈ విషయాన్ని ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు.   ఇంతవరకు భువనేశ్వర్ కేంద్రంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ క్రింద వాల్తేర్ రైల్వే డివిజన్ ఉండేది. అదేవిధంగా విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ క్రింద ఉండేవి. ఇప్పుడు నాలుగు డివిజన్లతో విశాఖపట్టణం కేంద్రంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రైల్వే జోన్ ఏర్పాటవబోతోంది.   ఇంతవరకు ఇవన్నీ దక్షిణ మధ్య మరియు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ల క్రింద ఉన్నందున ఈ డివిజన్లపై వచ్చే భారీ ఆదాయం, వాటి నిర్వహణ అన్నీ కూడా పొరుగు రాష్ట్రాల చేతిలో ఉండేవి. ముఖ్యంగా వాల్తేర్ డివిజన్ వైజాగ్ నౌకాశ్రయానికి చాలా దగ్గరలోనే ఉన్నందున దేశ విదేశాల నుండి వచ్చే ముడిసరుకును దేశంలో ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు, అదేవిధంగా ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్ ఘర్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి ఐరన్ ఓర్ వంటి ఖనిజాలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఈ డివిజన్ ద్వారానే సరుకు రవాణా అవుతోంది. కనుక మిగిలిన డివిజన్ల కంటే దీని ఆదాయం చాలా భారీగా ఉంటుంది. అయితే ఇంతవరకు అదంతా ఈస్ట్ కోస్ట్ రైల్వే ఖాతాలోకి వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ ఏర్పడితే ఆ ఆదాయం అంతా రాష్ట్రానికే మిగులుతుంది కనుక రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధి మరింత వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 17రైల్వే జోన్లు ఉన్నాయి. విశాఖలో కొత్త జోన్ ఏర్పడితే ఆ సంఖ్య 18కి చేరుతుంది.

అన్నాహజారే దీక్షలతో అవినీతి అంతం సాధ్యమేనా?

  ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మళ్ళీ మరోమారు ఉద్యమానికి సిద్దం అవుతున్నారు. ఇదివరకు జనలోక్ పాల్ బిల్లు కోసం డిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేసి యూపీఏ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన ఆయన, ఈసారి జనలోక్ పాల్ బిల్లుతో బాటు విదేశాలలో ఉన్న నల్లధనం వెనక్కి రప్పించే అంశం కూడా జోడించి మోడీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించబోతున్నారు.   క్రిందటిసారి ఆయన డిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేసినప్పుడు యూపీఏ ప్రభుత్వం దిగివచ్చి ఆయనతో చర్చలు జరిపి లోక్ పాల్ బిల్లు ఆమోదించింది. కానీ అది అవినీతిని అరికట్టేవిధంగా లేదని, చాలా లోప భూయిష్టంగా ఉందని, ఆయన దానిని తిరస్కరించారు. కానీ ఎందువలనో అయన మళ్ళీ వెంటనే ఉద్యమించలేదు. తన ఉద్యమాన్ని దేశమంతా వ్యాపింపజేస్తానంటూ ఆయన దేశాటన చేసారు. నిజానికి ఆయన డిల్లీలో కూర్చొని నిరాహార దీక్ష చేసినప్పుడే యావత్ దేశంలో ఒక చైతన్యం ఏర్పడింది. ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం కూడా ఏర్పడింది. కానీ అంత గొప్ప ఉద్యమం సృష్టించిన తరువాత ఆయన తన లక్ష్యం నెరవేరే వరకు కొనసాగించకుండా మధ్యలోనే నిలిపివేసి దేశాటనకి బయలుదేరడంతో ఆ ఉద్యమం దేశమంతా విస్తరించకపోగా చప్పున చల్లారిపోయింది. కారణం ఆయన చేస్తున్న ఉద్యమానికి ఒక దశాదిశా లేదని ప్రజలు భావించడం వలననే కావచ్చును.   తనతో ఉద్యమించేవారు రాజకీయాలకు, పదవులు, అధికారానికి దూరంగా ఉండాలనేది ఆయన నిశ్చితాభిప్రాయం. ఆ కారణంగానే ఆయన తన ఉద్యమం ద్వారా వచ్చిన గుర్తింపుని ఎన్నికలలో పోటీ చేసి సొమ్ము చేసుకోవాలనుకోలేదు. ఆయన ఆలోచనలు, ఆశయాలు చాలా గొప్పవి కావచ్చు, కానీ అవి నేటి పరిస్థితులకి సరిపోవు. వాస్తవిక పరిస్థితులని, వర్తమాన రాజకీయ తీరు తెన్నులని బట్టి ఆయన కూడా తన ఉద్యమ తీరుతెన్నులు మార్చుకొని ముందుకు సాగుతూ అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ వంటి నిజాయితీపరులయిన వారిని ఎన్నికలలో నిలబెట్టి వారిద్వారా తన అంతిమ లక్ష్యమయిన అవినీతి నిర్మూలన చేసి ఉండి ఉంటే ఈరోజు దేశ రాజకీయాలు మరొకలా ఉండేవేమో? కానీ ఆయన అందుకు నిరాకరించడంతో ఆయన శిష్యులు చాలా మంది ఆయనకు దూరమయ్యారు. ఎన్నికలలో పాల్గొని ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చేరు కూడా. పైగా కిరణ్ బేడీ ఆయన వ్యతిరేకిస్తున్న బీజేపీలోనే చేరారు కూడా.   అయితే అందుకు వారిని కాక ఆయననే నిందించవలసి ఉంటుంది. ప్రజాస్వామ్య పద్దతిలో రాజ్యాంగబద్దంగా అధికారం చేప్పట్టి అవినీతిని నిర్మూలించే అవకాశం ఉన్నప్పటికీ, అది చాలా నేరం అన్నట్లుగా ఆయన భావించడం, తన ఆలోచనలను తన శిష్యులపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయడం వలననే వారు ఆయనకు దూరమయ్యారు. అడవుల్లో ఉండే మావోయిష్టులు సాయుధపోరాటాల ద్వారా సమాజంలో మార్పు సాధిస్తామని చెపుతుంటారు. కానీ దశాబ్దాలుగా పోరాడుతున్నా వారు సాధించింది ఏమీ లేదు. అన్నా హజారే చేప్పట్టిన ఉద్యమం సాగుతున్న తీరు కూడా ఇంచుమించు అలాగే ఒక దశాదిశా లేకుండా సాగుతోంది.   ఆయన మళ్ళీ ఇప్పుడు డిల్లీలో నిరాహారదీక్షలు చేసి మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్దమవుతున్నారు. కానీ ఈ పని ఇన్ని నెలలుగా ఎందుకు చేయలేదు? ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? అనే ప్రశ్నలకు ఆయన జవాబు చెప్పవలసి ఉంటుంది. త్వరలో డిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆయన మాజీ శిష్యులు అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ ఇరువురిలో ఎవరో ఒకరు దానిలో గెలిచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. కనుక ఆయన డిల్లీలో దీక్షలు చేసినట్లయితే వారికి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించిన వారవుతారు. కనుక అందుకే మళ్ళీ డిల్లీలో దీక్షలకు కూర్చోంటున్నారనే తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది తప్ప ఆయన కొత్తగా సాధించేదేమీ ఉండకపోవచ్చును. ఎందుకంటే ఈసారి దేశప్రజలు ఆయన ఉద్యమాన్ని ఇంతకు ముందులాగ పట్టించుకోకపోవచ్చును. ఒకవేళ పట్టించుకొన్నా మోడీ ప్రభుత్వం తనకు ఇబ్బంది లేకుండా నేర్పుగా వ్యవహరించి ముగింపజేయవచ్చును.   పదేపదే లక్ష్య సాధన చేయలేని ఉద్యమాలు చేయడం వలన ప్రజలకు వాటి మీద నమ్మకం పోతుంది. నల్లధనం, జన లోక్ పాల్ బిల్లు అంశాలు రెండూ కూడా చాలా సంక్లిష్టమయిన వ్యవహరాలు. వాటిని అన్నా హజారే ఉద్యమాల ద్వారా సాధించగలనని భావించడం సరికాదు.  

ఆంద్ర, తెలంగాణాల మధ్య మరో వివాదం

  ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాల మధ్య కీచులాటలకు అంతే లేకుండా పోతోంది. తెలంగాణా ప్రభుత్వ అభ్యర్ధన మేరకు ఆంద్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలికి చెందిన రూ.120 కోట్ల నిధులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్తంభింపజేసింది. హైదరాబాద్ లోని వివిధ శాఖలలో రూ.50 కోట్లు ఫిక్సడ్ డిపాజిట్ల రూపంలో, ఉద్యోగుల సంక్షేమ నిధి, మెడికల్, లోన్స్, పెన్షన్స్ కోసం మరో 60 కోట్లు నిలువచేయబడి ఉంది. మిగిలిన 10 కోట్లు రోజువారి ఖర్చుల కోసం వేర్వేరు శాఖలలో నిలువ చేయబడింది. ఈ నిధులన్నిటినీ బ్యాంక్ స్తంభింపజేసిన తరువాత అదే విషయం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేసింది.   ఈ విషయం తెలుసుకొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తమకు తెలియజేయకుండా ఖాతాలను స్తంబింపజేసినందుకు బ్యాంకుపై పరువు నష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారు. సోమవారం నాడు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ విషయం గురించి చర్చించి తగిన నిర్ణయం తీసుకొంటామని తెలిపారు.   రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారం రెండు రాష్ట్రాలలో ఉన్నత విద్యా విధానాలు, ప్రవేశ పరీక్షలు, నియమాకాలు వంటివన్నీ మరో 10 ఏళ్ల వరకు యధాతధంగా జరగవలసి ఉంది. కానీ తెలంగాణా ప్రభుత్వం తమ రాష్ట్రానికి వేరేగా తెలంగాణా ఉన్నత విద్యామండలిని ఏర్పాటు చేసుకొంది. కనుక ఆంద్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి బ్యాంకు ఖాతాలలో రెండు రాష్ట్రాలకు ఉమ్మడి నిధిగా ఉన్న ఆ సొమ్మును స్తంభింపజేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్స్ 8,9,10 క్రింద వచ్చే అన్ని విద్యాసంస్థల తాలూకు ఉమ్మడి నిధులను స్తంభింపజేయమని తెలంగాణా ప్రభుత్వం గత ఏడాది అక్టోబరులోనే బ్యాంకులను కోరింది. కానీ ఆ విజ్ఞప్తిని బ్యాంకులు పట్టించుకోకపోవడం ఇటువంటి సంక్షోభం తప్పిపోయింది. కానీ తెలంగాణా రాష్ట్రానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్యాంక్ ‘నోడల్ బ్యాంకు’గా ఉన్నందున తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను బ్యాంకు పాటించవలసి ఉండవచ్చును.   దీని గురించి తెలంగాణా రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన కడియం శ్రీహరితో తను స్వయంగా మాట్లాడుతానని గంటా శ్రీనివాసరావు చెప్పారు. అయితే అందుకు తెలంగాణా ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇదివరకు ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల కార్మిక శాఖకు చెందిన రూ.609 కోట్ల నిధులను తెలంగాణా ప్రభుత్వానికి తెలియజేయకుండా మురళీ సాగర్ అనే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాధికారి విజయవాడలో ఒక బ్యాంకుకు తరలించిన విషయాన్ని గుర్తు చేసి ప్రతివాదనలు చేయవచ్చును. కనుక ఈ విషయంపై మరో పెద్ద వివాదంగా మారినా ఆశ్చర్యం లేదు.  

కమ్యూనిష్ఠూరాలు మానుకోవాలి

  అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాను భారత్ పర్యటనకు ఆహ్వానించడం ద్వారా భారత్ అమెరికాకు సలాం కొట్టేందుకు సిద్దంగా ఉందని ప్రపంచ దేశాలకు భారత్ సందేశం ఇచ్చినట్లయిందని సీపీఐ (యం) నేత సీతారామ్ ఏచూరి అన్నారు. భారత్ చిరకాలంగా అనుసరిస్తూ వచ్చిన విదేశీవిదానాన్ని మోడీ ప్రభుత్వం పక్కనబెట్టి అగ్రరాజ్యంకి వంతపాడటం మంచిది కాదని హెచ్చరించారు. ఇరురుగుపొరుగు దేశాలతో సత్సంభందాలు, అన్ని దేశాలకు సమాన దూరం పాటించాలనే విదేశీ విధానమే భారత్ కి బాగా నప్పుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి చాలా నిష్టగా పాటిస్తున్న మన విదేశీవిధానం వలన భారత్ కి ఏమయినా మేలు జరిగిందా? అని ప్రశ్నించుకొంటే లేదనే సమాధానం వస్తుంది. కాశ్మీరులో కొంత భూభాగాన్ని పాకిస్తాన్ దురాక్రమణ చేస్తే భారత్ దానిని కాపాడుకొనే ప్రయత్నం చేయకుండా ఐక్య రాజ్యసమితికి వెళ్లి మొరపెట్టుకొంది. ఆకారణంగానే నేటికీ ఆ భూభాగం పాకిస్తాన్ ఆధీనంలోనే ఉండిపోయింది. అంతేకాదు అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఆ భూభాగం ద్వారా రోడ్లు, రైలు మార్గాలు వేసుకొనేందుకు చైనాకు ధారాదత్తం చేస్తోంది కూడా. అంతేకాదు మొగుడిని కొట్టి బజారు కెక్కినట్లుగా పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపై భారత్ నే దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. గత మూడు దశాబ్దాలుగా చైనా, పాకిస్తాన్ దేశాలు భారత్ కి పక్కలు బల్లెంలా తయారయ్యాయి అంటే అందుకు మన బలహీనమయిన విదేశీ విధానాలే కారణమని చెప్పకతప్పదు. భారత్ ఏనాడూ కూడా తనంతట తానుగా  ఇరుగుపొరుగు దేశాల మీద యుద్దానికి బయలుదేరలేదు. కానీ పాకిస్తాన్ గత ముప్పై ఏళ్ళుగా భారత్ మీద పరోక్ష యుద్ధం చేస్తూనే ఉంది. చైనా దేశం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తన భూభాగమేనని దైర్యంగా చూపుకొంటోంది. అంతే కాదు అనేకసార్లు భారత భూభాగంలో చొరబడి అది మాదేనని దైర్యంగా వాదించగలిగింది. అయినా భారత్ వారిని ఏమీ చేయలేక నిస్సహాయంగా శాంతి మంత్రం జపిస్తూనే ఉండిపోవడానికి కారణం లోపభూయిష్టమయిన మన విదేశీ విధానాలే. వాటి వలన భారత్ అంటే ప్రపంచ దేశాలకు ఒకరకమయిన చిన్న చూపు ఏర్పడింది. భారత్ చాలా బలహీనమయిన దేశమని, దైర్యంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదనే అభిప్రాయం ఏర్పడింది. అందుకే అతి చిన్న దేశమయిన శ్రీ లంక సైతం తనకు కష్టకాలంలో సహాయం చేసిన భారత్ ని కాదని దురాక్రమణదారుగా పేరుమోసిన  చైనాకు దగ్గరవుతోంది. భారతజాలర్లను జైల్లో వేస్తూ, భారత్ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చైనాకు చెందిన అణుబాంబులు ప్రయోగించే సామర్ధ్యం ఉన్న రెండు సబ్-మెరయిన్లను తన పోర్టులో నిలిపిఉంచుకొనేందుకు అనుమతించింది. శ్రీలంక యల్.టీ.టీ.ఈ ఉగ్రవాదులతో నానా ఇబ్బందులు పడుతునప్పుడు, దానికి సహాయపడేందుకు భారత్ తన సేనలను పంపించింది. ఆ కారణంగానే భారత్ తన ప్రధాని రాజీవ్ గాంధీని కోల్పోయింది. ఇటువంటి లోపభూయిష్టమయిన విదేశీ విధానాలను నిఖచ్చిగా అమలు చేయాలని సీతారామ్ ఏచూరి వంటి రాజకీయ మేధావి కోరితే అంత కంటే పొరపాటు మరొకటి ఉండబోదు. ఆయన వామపక్ష పార్టీలకు చెందిన వారు కనుక పెట్టుబడిదారు దేశమయిన అమెరికాను దానితో స్నేహాన్ని వ్యతిరేకించడం సహజమే. కానీ ఆయన చైనా దేశం మన దేశం పట్ల వ్యవహరిస్తున్న తీరును కూడా ఇంతే గట్టిగా ఖండించి ఉంటే, ఆయన మాటలకు విలువ ఉండేది. నిజమే! అమెరికాతో స్నేహం లేదా యుద్ధం చేసిన ఏ దేశమయినా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. కానీ అలాగని మన చిరకాల మిత్ర దేశమయిన రష్యాకు కూడా మనం దూరం అయ్యి చాలా కాలమే అయ్యింది. మనకు సరయిన విదేశీ విధానం లేకపోవడం, నిర్దిష్టమయిన అభిప్రాయాలు, అవసరమయినప్పుడు బలమయిన, కటినమయిన  నిర్ణయాలు తీసుకొనే తెగువ లేకపోవడం చేతనే చిన్నచిన్నదేశాలకి సైతం మనం చులకనయిపోయాము. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటివరకు ఇన్ని అనర్ధాలు జరుగుతున్నా, లోపభూయిష్టమయిన విదేశీ విధానానికే గుడ్డిగా అనుసరితున్నాము. కానీ నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన వెంటనే ప్రపంచ దేశాలకు భారత్ సత్తా చాటే విధంగా సరికొత్త విదేశీ విధానాలను అవలంభిస్తుంటే దానిని మెచ్చుకోకపోగా కొందరు విమర్శించడం చాలా విచారకరం. ఆయన అధికారం చేప్పట్టిన వెంటనే అమెరికా వెళ్ళలేదు. మనకి చిరకాలంగా మిత్రదేశాలుగా ఉన్న భూటాన్, నేపాల్, జపాన్ దేశాలకు వెళ్ళారు. ఒకప్పుడు తనకు వీసా నిరాకరించిన అమెరికా చేతనే ఆహ్వానింపజేసుకొన్న తరువాతనే ఆయన అమెరికాలో కాలు పెట్టారు. భారతదేశాన్ని వేగంగా అభివృద్ధి పదంలో పరుగులు తీయించాలంటే అగ్రరాజ్యమయిన అమెరికా సహాయసహకారాలు కూడా చాలా అవసరమని గ్రహించినందునే, ఆయన అమెరికా అధ్యక్షుడిని భారత్ కి ఆహ్వానించారు. ఒబామా కూడా పాత పద్దతులు, సంప్రదాయాలు పక్కనబెట్టి, తను భారత్ రాబోతున్నట్లు తక్షణమే ప్రకటించేరు. మోడీ అనుసరిస్తున్న నూతన విదేశీ విధానం వలన, అది ప్రపంచ దేశాలకు ఇస్తున్న బలమయిన సంకేతాల కారణంగానేఇది సాధ్యమయిందని చెప్పవచ్చును. అమెరికా అధ్యక్షుడు భారత్ పర్యటన వలన భారత్ కి అనేక ప్రయోజనాలు చేకూరాయి. ఒకవేళ మోడీ అనుసరిస్తున్న ఈ విదేశీ విధానాలలో ఏమయినా లోపాలు ఉన్నట్లయితే, వాటిని ఆయనకు దృష్టికి తీసుకువచ్చి అప్రమత్తం చేయవలసిన బాధ్యత ప్రతిపక్షల మీదే ఉంది. కానీ గుడ్డిగా విమర్శించడం మాత్రం మంచిది కాదు. భారత ప్రధానిగా ఆయన దేశ భవిష్యత్తుకి ఏది మంచిదో అదే చేయాలనుకొంటారు తప్ప ఎవరినో ప్రసన్నం చేసుకొనేందుకు భారత్ ప్రయోజనాలను నష్టపరుచుకోవాలనుకోరు అనే సంగతిని సీతారామ్ ఏచూరి వంటివారు కూడా గుర్తుంచుకోవాలి.               

పరిశ్రమలు రావాలంటే రవాణా వ్యవస్థ మెరుగు పడాలి

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు, రైల్ మరియు జల రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మరియు పోర్టుల అభివృద్ధిపై దృష్టి పెడుతుంటే, కేంద్రం అంతర్గత జలరవాణ మరియు రైల్ రవాణా వ్యవస్థల అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమలు, పెట్టుబడులు అవసరమయితే వాటి అభివృద్ధికి చక్కటి రవాణా వ్యవస్థలు కూడా అంతే అవసరం. మంచి రవాణా వ్యవస్థ ఉన్నచోటికే పరిశ్రమలు కూడా తరలివచ్చేందుకు ఆసక్తి చూపుతాయి.   అయితే ఇంతవరకు అన్ని ప్రభుత్వాలు కూడా పరిశ్రమల కోసం ప్రత్యేక పాలసీలు ప్రకటించాయే తప్ప రవాణా వ్యవస్థ కోసం నిర్దిష్టమయిన పాలసీలు ఏవీ ఏర్పాటు చేసుకోలేదు. ఆ కారణంగానే నేటికీ దేశంలో ఎక్కడా సరయిన రవాణా వ్యవస్థ లేకుండా పోయింది. భారతదేశంలో కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు నిత్యం లక్షలాది లారీలు, ట్రక్కులు, కంటెయినర్లలో భారీగా సరుకు రవాణా జరుగుతోంటుంది. కానీ దేశంలో ఎక్కడా సరయిన రోడ్లు ఉండవు. ఇన్ని దశాభ్దాలుగా ఆ గతుకుల రోడ్లపైనే వాహనాలనీ ప్రయాణిస్తూ సరుకు రవాణా చేస్తున్నాయి.   ఇక రోడ్డు రవాణా తరువాత దేశంలో విరివిగా వాడకంలో ఉన్నది రైల్ రవాణా వ్యవస్థ. దాని ద్వారా సరుకు రవాణా చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు అశ్రద్ధ కారణంగా నేటికీ అది కొన్ని పరిమితులకు లోబడే రవాణా చేస్తోంది. దేశంలో ఒక చోట నుండి మరొకచోటికి అత్యంత తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో అతి సురక్షితంగా సరుకు రవాణా చేయగల ఈ వ్యవస్థని మరింత అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తోంది.   భారతీయ రైల్వేలో ప్రత్యేకంగా కార్గో రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. కానీ కొత్తగా రైల్వే ట్రాకులు వేయనంత వరకు మిగిలిన వ్యవస్థలను ఎంత కట్టుదిట్టం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండబోదు. కనుకనే రైల్వేలలో కూడా విదేశీపెట్టుబడులను కేంద్రప్రభుత్వం అనుమతిస్తోంది. దాదాపు 125కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో రైల్ (సరుకు) రవాణా కోసం ప్రత్యేకంగా రైల్వే ట్రాకులు ఏర్పాటు చేసేందుకు దేశ, విదేశీ సంస్థలు ముందుకు వచ్చినట్లయితే అందుకు తగిన ప్రతిపలం వారు తప్పకుండా పొందే అవకాశం ఉంటుంది.   ఇక దేశంలో అంతర్గత జల రవాణా వ్యవస్థ నామ మాత్రంగా కనబడుతుంది. ఏవో కొన్ని రాష్ట్రాలు, జిల్లాలో మాత్రమే కనబడుతుంది. ఈ మూడు రవాణా వ్యవస్థలకు కలిపి లేదా విడివిడిగా ప్రత్యేకమయిన పాలసీలు, వాటి అభివృద్ధికి కృషి చేసే ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసుకొన్నట్లయితే వాటి పరిస్థితి మెరుగుపడుతుంది.   ఆంద్రప్రదేశ్ విషయం తీసుకొన్నట్లయితే రోడ్డు రవాణా వ్యవస్థ కొంచెం మెరుగుగానే కనిపిస్తున్నపటికీ, వాటిని మరింత మెరుగుపరిచి వాటిని సమీప పోర్టులతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సరుకు రవాణా కోసమే ప్రత్యేకంగా రోడ్లు నిర్మించే ఆలోచనలు కూడా చేస్తోంది. కానీ అది చాలా భారీ వ్యయంతో కూడుకొన్నది. కానీ రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న జనాభా మరియు వాహనాల కారణంగా రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. కనుక అంచెలంచెలుగా అయినా సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా రోడ్లు నిర్మించగలిగితే అది తప్పకుండా చాలా మంచి ఫలితాలే ఇస్తుంది. సరుకు రవాణా వాహనాలకు అవసరమయిన అన్ని రకాల అనుమతులు అవి బయలుదేరిన చోటే ఇచ్చే విధంగా ఏర్పాటు చేసినట్లయితే దానివలన తమకు చాలా సమయం కలిసి వస్తుందని ఒక ప్రముఖ రవాణా వ్యవస్థ యజమాని సత్య బోలిశెట్టి అన్నారు. ఈ రంగాన్ని కూడా శాస్త్రీయంగా అధ్యయనం చేసి అభివృద్ధి చేసినట్లయితే దీనిలో కూడా యువతకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అయితే అన్నిటికంటే ముందు వీటి కోసం ప్రత్యేకంగా యంత్రాంగం ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది.   కేంద్రప్రభుత్వం కాకినాడ నుండి చెన్నై వరకు ఇదివరకున్న అంతర్గత జలరవాణ వ్యవస్థను మళ్ళీ ఉపయోగంలోకి తీసుకువచ్చేందుకు, కొందరు ఉన్నతాధికారులను నియమించింది. విజయవాడలో ప్రత్యేకంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేసింది. వారు ప్రస్తుతం మిగిలి ఉన్న జల రవాణా వ్యవస్థను అధ్యయనం చేస్తున్నారు. అది పూర్తయితే వారి సూచనలు, ప్రతిపాదనల మేరకు ఆ వ్యవస్థను చక్కదిద్దే పనులు మొదలవుతాయి.   ఇక రాష్ట్రంలో కొత్తగా మరో పది పోర్టులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అవి ఏర్పాటు చేయగలిగినట్లయితే, దేశ విదేశాలకు భారీగా సరుకు ఎగుమతులు, దిగుమతులు చేసుకొనే అవకాశం కలుగుతుంది. కానీ ఇది కూడా చాలా ఖర్చుతో కూడుకొన్న వ్యవహారమే కనుక వీటి అభివృద్ధికి కేంద్ర సహకారం చాలా అవసరం.

కలసి ఉంటే కలదు సుఖం

  తెలంగాణా రాష్ట్ర సాధన కోసం తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ఆంధ్రా పాలకులు, ప్రజల పట్ల తమ ప్రజలలో విద్వేషం రగిల్చిన మాట వాస్తవం. కానీ తన లక్ష్యం నెరవేరి తనే స్వయంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా అదే రకమయిన వైఖరి, భావనలు వ్యక్తం చేస్తుండటం వలన రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గొడవలు అనివార్యమయ్యాయి. ఒకప్పుడు కలిసి పనిచేసిన తెదేపాతో దాని అధ్యక్షుడు చంద్రబాబుతో ఆయనకున్నరాజకీయ వైరం, వ్యక్తిగత అభిప్రాయల కారణంగానే, చర్చలతో పరిష్కరించుకోదగ్గ అనేక సమస్యలు కోర్టుల వరకు వెళ్ళిపోతున్నాయి. దానివలన నష్టమే తప్ప ఇరు రాష్ట్రాలకు, ప్రభుత్వాలకు, ప్రజలకు, పార్టీలకి కూడా ఏమాత్రం మేలు చేయదు.   ఇంతకాలం “మేమందరం తెలుగు వాళ్లమని సగర్వంగా చెప్పుకొనే పరిస్థితి పోయి, ఇప్పుడు మేము ఆంధ్రా వాళ్ళము, మేము తెలంగాణా వాళ్ళము” అని చెప్పుకొనే దుస్థితి కలగడం చాల దురదృష్టకరం. కనుక ఇప్పటికయినా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు, పార్టీలు తమ తమ విభేదాలు, భేషజాలు అన్నిటినీ పక్కన పెట్టి రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా అభివృద్దే లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలని గవర్నర్ నరసింహన్ ఇరువురు ముఖ్యమంత్రులను కోరారు. అందుకు వారిరువురూ అంగీకరించారు కూడా.   ఇరు ప్రభుత్వాల ముఖ్యకార్యదర్శుల స్థాయిలో తరచూ సమావేశాలు నిర్వహించుకొంటూ, అవసరమయినప్పుడల్లా ముఖ్యమంత్రులు కూడా సమావేశమవుతూ ఎప్పటికప్పుడు అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని అని గవర్నరు కోరికను వారిరువురు మన్నించడం అభినందనీయం. వారిరువురి మధ్య తను స్వయంగా సమన్వయకర్త వ్యవహరించేందుకు సిద్దమని గవర్నర్ నరసింహన్ ముందుకు రావడం కూడా చాలా హర్షణీయం.   ఎటువంటి సమస్యనయినా చర్చల ద్వారా తప్ప మరేవిధంగాను పరిష్కరించే అవకాశం లేదని తెలిసి ఉన్నప్పుడు కూడా పంతాలకు, పట్టుదలలకు పోయినట్లయితే నష్టపోయేది మనమేనని ఇరు ప్రభుత్వాధినేతలకీ కూడా తెలుసు. కనుక ఇకనయినా ఒకరికొకరు సహకరించుకొంటూ ఇరు రాష్ట్రాల అభివృద్ధికి కలిసి కృషి చేస్తే, ప్రజలు కూడా హర్షిస్తారు. రెండు రాష్ట్రాలలో ఒకటి ఎక్కువ అభివృద్ధి చెంది మరొకటి ఈసురోమంటుంటే అది తెలుగుజాతికే అవమానం. అదే ఒకదానితో మరొకటి పోటీపడి అభివృద్ధి చెందితే తెలుగుజాతికే గర్వకారణంగా నిలుస్తుంది.

స్వైన్ ఫ్లూకి రాజయ్య బలయ్యారా?

  స్వైన్ ఫ్లూ జ్వరాల కారణంగా చాలా మంది ప్రజలు చనిపోయారు. నేటికీ అనేక వందల మంది ఆసుపత్రుల్లో చేరి చికిత్సలు పొందుతున్నారు. చివరికి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత కూడా ఈ స్వైన్ ఫ్లూ భారినపడినట్లు వార్తలు వచ్చేయి. ఈ స్వైన్ ఫ్లూ దెబ్బకి ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న టి.రాజయ్య పదవి కూడా ఊడిపోయింది. అది కూడా చాలా అవమానకరంగా జరిగింది.   ఇంత నష్టం, కష్టం తెచ్చిన ఈ స్వైన్ ఫ్లూ ఒక్కరికి మాత్రం ఊహించని అదృష్టం తెచ్చిపెట్టింది. యంపీ కడియం శ్రీహరి మెడలో ఉపముఖ్యమంత్రి హారం వేసిపోయింది. తంతే బూరెల గంపలో పడినట్లు యంపీగా ఉన్న ఆయన తీసుకువచ్చి ఉపముఖ్యమంత్రి కుర్చీలో కూర్చేబెట్టారు.   అందుకు ఆయన చాలా సంతోషపడి ఉండవచ్చును. కానీ మొదటి నుండి తెరాసలో ఉంటూ కేసీఆర్ నే అంటిపెట్టుకొని తిరగిన దళితుడయిన రాజయ్యని అసమర్ధుడు అనే ముద్ర వేసి పదవిలో నుండి తొలగించి ఆ స్థానంలో యంపీగా ఉన్న కడియం శ్రీహరిని నియమించడం తెరాస నేతలకు, పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా రాజయ్యకు జీర్ణించుకోవడం చాలా కష్టమే. తెరాసలో అనేకమంది సమర్దులయిన సీనియర్ నేతలు, యం.యల్యేలు చాలా కాలంగా మంత్రి పదవులకు ఆశగా ఎదురుచూస్తుంటే వారినందరినీ కాదని తెదేపా నుండి వచ్చి యంపీగా ఎన్నికయిన కడియం శ్రీహరిని మంత్రి వర్గంలోకి తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది.   కానీ ఒకసారి పార్టీలో చేరిన తరువాత పాతవాళ్లు కొత్తవాళ్ళు అంటూ విడదీసి చూడలేమని, అందరూ కూడా సమాన హోదా ఉన్న పార్టీ కార్యకర్తలే అవుతారని ఆయన సర్ది చెప్పుకొన్నారు. గోదావరిలో కలిసే అనేక ఉప నదులను ఏవిధంగా వేరు చేసి చూడాలేమో అదేవిధంగా ఎవరయినా ఒకసారి ఒక పార్టీలో చేరిన తరువాత అందరితో సమాన హోదా పొందుతారని, సందర్భాన్ని బట్టి అవకాశాలు, సమీకరణలు మారుతుంటాయని, ఇది రాజకీయాలలో చాలా సహజమయిన విషయం గనుక అందరూ లైట్ తీసుకోవాలని సర్దిచెప్పారు. కొన్ని పొరపాట్లను సవరించుకోనేందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకొన్నారని ఆయన కేసీఆర్ ని వెనకేసుకు వచ్చేరు.   ఆయనకు మంత్రి పదవి వచ్చింది కనుక ఆయన ఎన్ని మాటలయినా చెప్పగలరు. కానీ ముఖ్యమంత్రి తరువాత స్థానంలో ఉన్న రాజయ్యను అసమర్ధుడు అంటూ చాలా అవమానకరంగా తొలగించిన తరువాత ఆయనను ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టినట్లయింది. తద్వారా ఆయన రాజకీయ జీవితం కూడా దెబ్బ తినే ప్రమాదం ఏర్పడింది. ఇదివరకు కూడా ఆయన వరంగల్ పట్టణంలో ఆరోగ్య విశ్వవిద్యాలయం స్థాపిస్తామని ప్రజలకు చెపుతున్నారని కేసీఆర్ ఆయనను నలుగురి ముందూ మందలించి అవమానించారు. ఇప్పుడు అంతకంటే ఘోరంగా అవమానించి బయటకు గెంటారు.   ఈ వ్యవహారాన్ని మరికొంత లోతుగా పరిశీలించి చూసినట్లయితే ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ కి కూడా సమాన బాధ్యత ఉంటుందని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని పొరపాట్లు సవరించుకోనేందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకొన్నారని కడియం చెప్పడం గమనిస్తే, రాజయ్యకి అంత కీలకమయిన పదవులు కట్టబెట్టి కేసీఆర్ కూడా పొరపాటు చేసారని చెప్పకనే చెపుతున్నట్లుంది. కేసీఆర్ చేసినది పొరపాటు అనుకొంటే అందుకు ప్రజలు చాల భారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది. కానీ కేసీఆర్ చేసిన ఆ పొరపాటుకు దళితుడయిన రాజయ్య శిక్షించబడ్డారు.   సాధారణంగా సమర్ధత, అనుభవం ప్రాతిపదికన యం.యల్యేలకు మంత్రిత్వ శాఖలు కేటాయిస్తుంటారు. ఒకవేళ రాజయ్య అంత సమర్దుడు కాడని కేసీఆర్ భావించి ఉంటే ఆయనకి ముందే ఏదో ఒక అప్రధాన్యమయిన శాఖ కేటాయించి ఉండి ఉంటే ఇటువంటి పరిస్థితిని నివారించి ఉండవచ్చును. కానీ తెలంగాణా ఏర్పడితే మొట్ట మొదటగా ఒక దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని హామీ ఇచ్చి, ఆ హామీని గట్టునపెట్టి, ఆ కుర్చీలో కేసీఆర్ సెటిల్ అయిపోయిన తరువాత ప్రజలు, ప్రతిపక్షాలు, స్వంత పార్టీలో నుండి విమర్శలను తప్పించుకోవడానికే రాజయ్యకు కీలకమయిన పదవులు కట్టబెట్టారని అందరికీ తెలిసిన విషయమే. కానీ దాని వలన ఎంత అనర్ధం జరిగిందో అందరూ చూసారు.   తెలంగాణా రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ జ్వరాలు రాత్రికి రాత్రే ఏమీ వ్యాపించలేదు. కానీ పరిస్థితులు పూర్తిగా చెయ్యి దాటిపోతున్నాయని గ్రహించి, నివారణ చర్యలు చేప్పట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఇంత సమయం తీసుకొన్నారు. ఆయన ముందే రాజయ్యను హెచ్చరించి ఉంటే నేడు ఈ పరిస్థితీ వచ్చేది కాదు. ఇదంతా చూస్తుంటే తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి వేసినట్లుంది. పాపం రాజయ్య అనుకోవడం కంటే ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి.

ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ మంజూరు

  ఎన్నికలకు ముందు హడావుడిగా రాష్ట్ర విభజన చేసేసిన యూపీయే ప్రభుత్వం, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కూడా ప్రకటించేసింది. “అయినా తను ఎన్నికలలో గెలిచినప్పుడు సంగతి కదా...అప్పుడు చూసుకొందాములే...”అనుకొందేమో తెలియదు గానీ దాని సాధ్యాసాధ్యాల గురించి మాత్రం ఆలోచించనట్లు లేదు. కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తానని చెపుతున్నప్పుడు మేము ఇవ్వలేమని చెపితే ఓట్లు రాలవని భావించిందో ఏమో..తెలియదు గానీ “మేము కూడా ప్రత్యేక హోదా ఇచ్చేస్తామని బీజేపీ కూడా వంత పాడింది. పైగా “మేమే కాంగ్రెస్ చెవి మెలేసి ప్రత్యేక హోదా ఇస్తామని దాని చేత ఒట్టేయించామని” బాకా ఊదుకొన్నారు కూడా. కానీ ఎనిమిది నెలలు ప్రత్యేకం అంటూ ఊరించిన తరువాత, ‘పొరుగు రాష్ట్రాలు అభ్యంతరం చెపుతున్నాయి. మరో అరడజను రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోసం బృంద గానం చేస్తున్నాయి. పైగా అన్ని రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు ఒకే చేసే పరిస్థితి కూడా లేదు. అందువల్ల ప్రత్యేక హోదా ఇవ్వలేమని’ ఎన్డీయే ప్రభుత్వం తేల్చిచెప్పేసింది. కాకపోతే కాంగ్రెస్ పార్టీలా హ్యాండ్ ఇవ్వకుండా అందుకు బదులుగా రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చేందుకు అంగీకరించింది.   చంద్రబాబు నాయుడు ఒత్తిడి కారణంగా కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులతో గత మూడు రోజులుగా చర్చించిన తరువాత రాష్ట్రానికి మూడు ప్రత్యేక ప్యాకేజీలు ఆమోదించారు.   వాటిలో మొదటిది: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ జిల్లాలలో పారిశ్రామిక అభివృద్ధి కోసం వచ్చే బడ్జెట్టులో వెయ్యి కోట్ల మూలధనంతో కేంద్రం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి నిధి (ఏపీ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఫండ్)ని ఏర్పాటు చేస్తుంది. దానిలో దేశంలో పెద్ద పెద్ద పరిశ్రమలను, వ్యాపార సంస్థలను పెట్టుబడులు పెట్టేందుకు కూడా ప్రోత్సహిస్తుంది. ఆ నిధులను రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలలో పరిశ్రమల అభివృద్ధికి వినియోగిస్తారు.   రెండవ ప్యాకేజీలో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలకి 3 శాతం పన్ను రాయితీ ఇస్తుంది. దానిని కేంద్రమే పూర్తిగా భరిస్తుంది.   మూడవ ప్యాకేజీలో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలకి ‘క్యాపిటల్ అలవెన్స్’ రూపంలో ఆదాయపన్నులో రాయితీ ఇస్తుంది.   ఈ మూడు ప్యాకేజీలకు ఆర్ధికమంత్రి ఆమోదముద్ర వేశారు. కనుక వారం పదిరోజుల్లోనే అధికారికంగా ప్రకటిస్తుందని ఆర్దికమంత్రితో చర్చించిన రాష్ట్ర ఉన్నతాధికారులు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేసి ఉండి ఉంటే ఇంకా మంచి ప్యాకేజీ లభించి ఉండేది. కానీ అది సాధ్యం కాదని తేలిపోయింది కనుక ఈ మూడు ప్యాకేజీలతో సర్దుకోక తప్పదు. ఇప్పటికయినా ఈ అంశంపై స్పష్టత వచ్చింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు అనేక రాయితీలు, ప్రోత్సహకాలు ప్రకటించింది కనుక ఇకపై రాష్ట్రానికి అనేక కొత్త పరిశ్రమలు రావచ్చును.   విభజన చట్టం ప్రకారం రూ.16,000 కోట్ల రాష్ట్ర ఆర్ధిక లోటును పూడ్చేందుకు కేంద్రం నిధులు విడుదల చేయవలసి ఉంది. కానీ దానికి బదులు ‘ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ యండ్ బడ్జెట్ మేనేజిమెంట్’ చట్టాన్ని సవరించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దేశ విదేశాలలో సంస్థల నుండి భారీగా రుణాలు తీసుకొనే వెసులుబాటు కల్పించాలని నిశ్చయించింది. ప్రస్తుతం రాష్ట్ర జీ.డీ.పీ.లో మూడు శాతం వరకు రుణాలు తీసుకొనే వెసులుబాటు ఉంటుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్ చెప్పారు.

భారత్ పట్ల అమెరికా వైఖరి మారిందా?

  అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా రేపు అంటే ఆదివారం నాడు భారతదేశానికి వస్తున్నారు. ఏ రోటి కాడ ఆ పాటే పాడాలన్నట్లుగా ఆయన అమెరికా నుండి బయలుదేరే ముందు భారత ప్రభుత్వాన్ని, ప్రజలను సంతోషపెట్టేందుకు సాంప్రదాయకంగా పాడవలసిన పాటను చాలా చక్కగా పాడారు. ఆయన పాడిన పాట భారత్ లో మారుమ్రోగిపోతోందిపుడు. అల్పసంతోషులయిన భారతీయులు ఆయన మన గురించి చెప్పిన ఆ నాలుగు మంచి ముక్కలకీ చాలా సంతోషపడిపోయారు.   ఆయన అమెరికా నుండి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడుతూ భారత్-అమెరికాలు సహజ భాగస్వాములని, తన పర్యటన ద్వారా ఉభయదేశాల మధ్య బంధాలు మరింత దృడపడేందుకు కృషి చేస్తానని అన్నారు. షరా మామూలుగా భారత్ తో తనకున్న అనుబందం ఒకసారి గుర్తు చేసుకొన్న తరువాత, భారత్ పర్యటనకు బయలుదేరేముందు పాక్ దేశాన్ని హెచ్చరించే ఆనవాయితీని కూడా ఆయన మరిచిపోకుండా పాటించారు. పాకిస్తాన్ లో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడాన్ని తాము సహించబోమని నూట ఒకటవసారి హెచ్చరించారు. పనిలోపనిగా ముంబై దాడులకి బాధ్యులయిన వారిని కటినంగా శిక్షించాలని కూడా పాకిస్తాన్ కి సలహా ఇచ్చారు.   ఆయన అంత గట్టిగా మన గురించి మెచ్చుకొన్నాక, మన శత్రుదేశాన్ని అంత గట్టిగా హెచ్చరించిన తరువాత సంతోషించకుండా లేము.  ఒబామా దంపతులు డిల్లీలో అడుగుపెట్టగానే వారికి ఘన స్వాగతం పలికేందుకు కేంద్ర ప్రభుత్వం సర్వం సిద్దంగా ఉంది. పాకిస్తాన్ దేశం పట్ల అమెరికా ఏవిధంగా వ్యవహరిస్తున్నప్పటికీ, అమెరికా అధ్యక్షుడి భారత్ పర్యటన వల్ల మన దేశానికి ఎంతో కొంత మేలు జరుగుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఇంతకు ముందు యూపీఏ అమెరికా ప్రభుత్వం చెప్పే ఇటువంటి తీయటి కబుర్లకి ఐస్ అయిపోయేది. కానీ మోడీ అటువంటి కబుర్లకి పడిపోయే రకం కాదు. ‘మోడీ అంటే బిజినెస్’ అని ఊరికే అనలేదు. కనుక భారత్ కి ప్రయోజనం కలిగేవిధంగా ఆయన ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకొంటారని నిసందేహంగా చెప్పవచ్చును. అయితే భారత్ పట్ల అమెరికాకు అవ్యాజమయిన ప్రేమ ఏమీ లేదనే సంగతి అందరికీ తెలిసిందే.   ఇదివరకు ప్రపంచ దేశాలన్నిటికీ ‘భారత్ అంటే అనాగరికులయిన వంద కోట్ల జనాభా, దరిద్రం, అవినీతి తప్ప మరొకటి లేదు’ అనే ఒక నిశ్చితమయిన అభిప్రాయం ఉండేది. భారతదేశంలో ఉన్న వంద కోట్ల మంది జనాభా అడ్డు ఆపు లేకుండా తినేస్తునందునే ప్రపంచంలో ఆహార కొరత ఏర్పడుతోందని గత అమెరికా అధ్యక్షుడు చెప్పిన మాటలు వింటే వారికి భారత్ పట్ల ఎంతటి చులకన భావం ఉందో అర్ధం అవుతుంది. కానీ ఇప్పుడు ఆ వంద కోట్ల అనాగరికులే ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మార్కెట్ గా కనిపిస్తున్నారు అందరికీ. అందుకే ప్రపంచ దేశాలన్నీ భారత్ మెప్పు సంపాదించేందుకు తిప్పలు పడుతున్నాయి. అందుకు అమెరికా కూడా ఏమీ అతీతం కాదని ఒబామా తన మాటలతో చెప్పకనే చెప్పారు.   భారత్ లో ఉన్న విస్త్రుతమయిన వ్యాపారావకాశాల గురించి క్యాపిటలిస్ట్ దేశమయిన అమెరికాకు తెలియకపోదు. అయితే మన దేశాభివృద్ధికి విదేశీపెట్టుబడులు, పరిశ్రమలు చాలా అవసరం గనుక వారు మన పట్ల ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నప్పటికీ వారిని సాదరంగా ఆహ్వానించక తప్పదు. ఒకప్పుడు భారతీయులు ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వలసలు పోయేవారు. ఇప్పటికీ పోతున్నారు కూడా. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే రానున్న కాలంలో విదేశీయులే మన దేశానికి వలసలు వచ్చే అవకాశాలున్నట్లు కనబడుతోంది.   ఇండియాకి ప్రధాని నరేంద్ర మోడీ, ఆంద్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు, తెలంగాణకు కేసీఆర్ ‘చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్స్’ వంటివారు. ఈ ఐదేళ్ళలో వారు దేశాన్ని, తమతమ రాష్ట్రాలను వేగంగా అభివృద్ధి చేయాలని ఆరాటపడుతున్నారు. అది చాలా స్పష్టంగానే కనబడుతోంది. ఇప్పుడు అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయి. గనుక అందరూ కలిసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే మంచిది.

ఏపీకి నిధుల విడుదలకు ముహూర్తం ఎప్పుడో!

  దాదాపు 8 నెలలు పూర్తి కావస్తున్నా ఇంతవరకు కేంద్రప్రభుత్వం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులను విడుదల చేయలేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఒకటి అరా ఉన్నత విద్యా సంస్థల స్థాపనకు శంఖు స్థాపనలు చేసింది గానీ మరే ఇతర ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయలేదు. క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టుల విషయంలో కేవలం సాంకేతిక కారణాల చేతనే జాప్యం జరుగుతోందని సమాచారం. కానీ నిధుల విడుదలకు దేశంలో ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న కారణంగానే కేంద్రం వెనకడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కి భారీగా నిధులు విడుదల చేసినట్లయితే మిగిలిన రాష్ట్రాల నుండి కూడా కేంద్రంపై ఒత్తిడి వస్తుంది. విడుదల చేయకపోతే ఆయా రాష్ట్రాలలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు బీజేపీ పక్షపాత వైఖరి అవలంభిస్తోంది అంటూ ప్రచారం చేస్తే బీజేపీకి రాజకీయంగా నష్టంజరిగే ప్రమాదం ఉంటుంది కనుకనే ఆంధ్రప్రదేశ్ కి నిధులు విడుదల చేయడానికి వెనకాడుతోందేమో.   లోటు బడ్జెట్టులో ఉన్న ఆంద్రతో బాటు మిగులు బడ్జెట్టులో ఉన్న తెలంగాణా రాష్ట్రం కూడా వివిధ పధకాలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కొరకు కేంద్రం ఇవ్వవలసిన నిధులను కోరుతోంది. తెలంగాణాకు మంజూరు చేసిన ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణం కోసం కేంద్రం నుండి రూ.820 కోట్లు వస్తాయని తెలంగాణా ప్రభుత్వం ఆశిస్తోంది. కానీ ఇంతవరకు హూద్ హూద్ తుఫాను కోసం ప్రధాని మోడీ ప్రకటించిన రూ.1000 కోట్లే పూర్తిగా ఇవ్వలేదు.   ఇటువంటి పరిస్థితుల్లో తక్షణమే ఆర్ధిక సహాయం చేయాలని లేకుంటే పరిస్థితులు విషమిస్తాయని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని అభ్యర్ధించారు. ప్రధాని మోడీ, ఆర్ధికమంత్రి జైట్లీలను కలిసిన తరువాత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ తను వారిని ఏమేమీ కోరారో వివరంగా చెప్పారు కానీ వారు ఆయనకు ఏమి హామీ ఇచ్చేరో చెప్పకపోవడం గమనిస్తే వారిరువురూ ఆయనకు ఎటువంటి హామీ ఇవ్వలేదనే భావించవలసి వస్తుంది.   తెదేపా,బీజేపీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ కేంద్రం నుండి నిధులు తెచ్చుకోలేకపోతున్నందుకు ప్రతిపక్షాలు కూడా తప్పు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి దాని సమస్యలు దానికి ఉండవచ్చును. కానీ ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొని ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా చెబుతున్నప్పుడు కూడా కేంద్రం ఇంకా ఉదాసీనంగా వ్యవహరించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఎలాగూ ఆర్ధిక ఇబ్బందుల్లో పడుతుంది. దాని వలన రెండు పార్టీల మధ్య దూరం పెరిగే అవకాశం కూడా ఉంది. అంతేకాక దాని వలన బీజేపీ వైఖరిపై ప్రజలకి తప్పుడు సంకేతాలు కూడా వెళ్ళే ప్రమాదం ఉంది.   చంద్రబాబు మాత్రం రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మురంగా చేస్తున్నారు. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న అయన అక్కడ చాలా మంది పారిశ్రామికవేత్తలను, వ్యాపార సంస్థల సి.ఈ.ఓ.లను కలిసి రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించగలిగారు. అవి కాక ఇప్పటికే వైజాగ్, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో అనేక కొత్త పరిశ్రమల స్థాపనకి సన్నాహాలు చురుకుగా సాగుతున్నాయి. కానీ అవన్నీ నిర్మాణాలు పూర్తి చేసుకొని తమ వ్యాపార కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు మరి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అండగా నిలబడితే ఆ తరువాత రాష్ట్రం నుండే కేంద్రానికి కూడా టాక్సుల రూపంలో భారీ ఆదాయం సమకూరుతుంది.   రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తానని కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్ పదేపదే చెపుతున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలిసిన వారిరువురూ ముందుగా నిధులు విడుదలయ్యేలా చేయగలిగితే మిగిలిన అంశాలను తరువాత పరిష్కరించుకోవచ్చును.

స్వైన్-ఫ్లూ నేర్పిన గుణపాఠం ఏమిటంటే...

  బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల హైదరాబాద్ కి వచ్చినప్పుడు తెరాస పార్టీ బలాబలాల గురించి చాలా చక్కగా విశ్లేషించారు. ఆ పార్టీ కేవలం ఒకరిద్దరి వ్యక్తుల సామర్ధ్యం మీదనే ఆధారపడి నడుస్తోందని అభిప్రాయం వ్యక్తం చేసారు. ఆ మాట తెరాసకే కాదు తెలంగాణా ప్రభుత్వానికి కూడా వర్తిస్తుందేమో అనిపిస్తోంది స్వైన్-ఫ్లూపై ప్రభుత్వ స్పందన చూస్తుంటే. తెలంగాణాలో స్వైన్-ఫ్లూ జ్వరాల కారణంగా మనుషులు పిట్టల్లా రాలిపోతుంటే, రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించుకొంటూ తాపీగా కూర్చొన్న నీరో చక్రవర్తిలా తెలంగాణా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. రాజయ్య ఉదాసీనత వహించడంతో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే కలుగజేసుకొని నివారణ చర్యలు చేప్పట్టవలసి వచ్చింది.   సంబంధిత అధికారులు, మంత్రులతో సమీక్షాసమావేశం నిర్వహించి స్వైన్-ఫ్లూ మహమ్మారిని అదుపు చేసేందుకు అవసరమయిన చర్యలు చేప్పట్టవలసిందిగా ఆదేశించారు. అంతేగాక ప్రధాని మోడీ, కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి జేపీ నడ్డాతో కూడా మాట్లాడి కేంద్రం నుండి అవసరమయిన సహాయం పొందుతున్నారు. గత రెండు మూడు వారాలుగా రాష్ట్రంలో స్వైన్-ఫ్లూ జ్వరాలు ప్రబలి నానాటికీ మరణాల సంఖ్య పెరుగుతున్నా అందరికంటే ముందుగా స్పందించవలసిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. రాజయ్య ఏనాడు మీడియా ముందుకు వచ్చి ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేయలేదు.   ప్రజలకు ఏవిధంగా ఉపయోగపడని రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు చేయడానికి నిత్యం మీడియా ముందుకు వచ్చే మంత్రులు, ఇటువంటి అతి ముఖ్యమయిన విషయంపై మాట్లాడేందుకు మీడియా ముందుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. యదా రాజ తదా ప్రజా అన్నట్లుగా ఈ విషయంలో ఆయన మంత్రిత్వ శాఖ కూడా విఫలమయింది. అందువలన ఆ బాధ్యత కూడా ముఖ్యమంత్రి కేసీఆరే స్వీకరించవలసి వచ్చింది. ఆయన మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజలకు దైర్యం చెప్పి స్వైన్-ఫ్లూని అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, దాని బారినపడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ప్రజలకు వివరించారు. నిజానికి ఈ పని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఇంతకు ముందే చేసి ఉండి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత అప్రతిష్ట కలిగేది కాదు. ఇలా ప్రతీ చిన్న వ్యవహారాన్ని కూడా కేసీఆరే చక్కబెట్టవలసిరావడం ఆయనకు చాలా ఇబ్బందికరమే కాకుండా ప్రభుత్వం గురించి ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నట్లవుతుంది.   ఇదే సూత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికీ వర్తిస్తుంది. ఇప్పుడు ఆంధ్రాలో కూడా క్రమంగా స్వైన్-ఫ్లూ విస్తరిస్తోంది. అది ఇంకా విస్తరించకుండా అరికట్టేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. చిన్న పామునయినా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లుగా స్వైన్-ఫ్లూపై యుద్ధ ప్రాతిపాదికన నివారణ చర్యలు చేప్పట్టడానికి ఆయన కూడా తన శాఖలో అధికారులను, వైద్యులను అప్రమత్తం చేసి, మీడియా ద్వారా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విస్తృతంగా ప్రచారం చేయడం అత్యవసరం. లేకుంటే ఆంధ్రాలో కూడా అదే పరిస్థితులు పునరావృతం అయ్యే ప్రమాదం ఉంది.   ఇక ఈ సమస్య కారణంగా అర్ధమవుతున్న మరో విషయం ఏమిటంటే, సమర్దులయిన మంత్రులను ఎంచుకోకపోతే వారి అసమర్ధతకు, వైఫల్యానికి మూల్యం చెల్లించుకోవలసింది ప్రజలేనని. దాని వలన అధికార పార్టీకి, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇదేమీ ఈరోజు కొత్తగా కనుగొన్న విషయం ఏమీ కాదు. కానీ ఇది మరోసారి రుజువయింది. రాజకీయ నేతలు ఎన్నికలలో గెలిచి తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి పదవుల కోసం పోటీపడతారు. కానీ మంత్రి పదవి దక్కిన తరువాత అన్నీ ముఖ్యమంత్రే స్వయంగా చూసుకోవాలన్నట్లు ఈవిధంగా ఉదాసీనంగా వ్యవహరిస్తుంటారు.   వారికి రాజకీయాలపై ఉన్న శ్రద్దాసక్తులు తమ శాఖలను సమర్ధంగా నిర్వహించడంపై ఎందుకు చూపరని ప్రశ్నించుకొంటే, వారిలో చాలా మందికి తమ శాఖల వ్యవహారాల పట్ల సరయిన అవగాహన లేకపోవడం, అధికారుల ముందు ఆ విషయం బయటపెట్టుకోలేక వారికే ఆ బాధ్యతలు అప్పజెప్పేసి తమ వ్యాపారాలు, కాంట్రాక్టులు, రాజకీయాలతో కాలక్షేపం చేస్తుండటం వంటి అనేక కారణాలు కనబడుతుంటాయి. ఆంధ్రా, తెలంగాణా మంత్రులలో కేవలం నలుగురైదుగురు మాత్రమే చురుకుగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. మిగిలినవారు ఏమి పనిచేస్తున్నారో, అసలు పనిచేస్తున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొని ఉంది.   అందుకే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ మంత్రివర్గ సమావేశంలో కూడా మంత్రుల పనితీరుని సమీక్షిస్తున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇకపై ఎప్పటికప్పుడు మంత్రుల పనితీరుని సమీక్షిస్తూ వారికి నిర్దిష్ట లక్ష్యాలు నిర్దేశించి వారి నుండి పని రాబట్టుకోవడం మంచిది. మంత్రులు అంటే కేవలం అధికారులు తీసుకువచ్చిన ఫైళ్ళ మీద సంతకాలు గీకడానికే పరిమితం కాకుండా తమ సామర్ధ్యం నిరూపించుకొనే ప్రయత్నం చేస్తే అటు వారి పార్టీకీ, ప్రభుత్వానికీ మంచి పేరు వస్తుంది. ప్రజలు కూడా సంతోషిస్తారు.

తెరాస, వైకాపాలది సెల్ఫ్‌గోలేనా?

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల ఈరోజు నుండి వారం రోజుల పాటు నల్గొండ జిల్లాలో పరామర్శ యాత్ర చేసేందుకు బయలుదేరారు. ఆమె జిల్లాలో ఏడు నియోజక వర్గాలలో నివసిస్తున్న 30 కుటుంబాలను పరామర్శిస్తారు. ఇదివరకు కూడా ఆమె మెహబూబ్ నగర్ జిల్లాలో పరామర్శ యాత్రలు చేసారు. ఆమె తన యాత్రలకు రాజకీయ ఉద్దేశ్యాలు లేవని చెపుతుంటారు. కానీ తెలంగాణా ప్రభుత్వం ఏ మాత్రం నొచ్చుకోకుండా సుతిమెత్తగా విమర్శలు చేస్తుంటారు. అయినప్పటికీ ఆమె విమర్శలకు, చేస్తున్న యాత్రలపై తెరాస పార్టీ నేతలెవరూ స్పందించరు. కానీ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే నెల వరంగల్లో పర్యటిస్తారని తెలియగానే మంత్రి మహేందర్ రెడ్డి చాలా తీవ్రంగా స్పందించడం గమనార్హం. తెలంగాణకు నీళ్ళు రాకుండా అడ్డుపడుతున్న చంద్రబాబుని అడ్డుకొంటామని ఆయన హెచ్చరించారు. అంటే వైకాపా వల్ల తెరాసకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ తెదేపాతో మాత్రం అభ్యంతరాలున్నాయని స్పష్టం అవుతోంది.   తెరాస, వైకాపాల మధ్య ఉన్న ఈ రహస్య ప్రేమ, అవగాహన దేనికంటే తెలంగాణాలో స్థిరపడిన లక్షలాది ఆంద్ర ప్రజల ఓట్లను తెరాస ఎట్టిపరిస్థితుల్లో పొందే అవకాశం లేదు. కనుక, ఆ అవకాశం ఉన్న వైకాపాను తెరాస ప్రోత్సహిస్తోందనుకోవచ్చును. ఆ విధంగా తమ ఉమ్మడి శత్రువు అయిన తెదేపాను తెలంగాణాలో బలపడకుండా నిలువరించడానికేనని భావించవచ్చును. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే వచ్చిన ఎన్నికల సమయంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకొనే సాహసం చేయలేకపోయాయి. కానీ తెలంగాణాలో తెరాస ఘన విజయం సాధించి పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీకి బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు వైకాపా ముందుకు రావడం, ఇప్పుడు మళ్ళీ పరామర్శ యాత్రల పేరిట వైకాపా తెలంగాణాలో పునః ప్రవేశించడం గమనిస్తే వచ్చే ఎన్నికల నాటికి ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకొనేందుకే ప్రయత్నాలు మొదలు పెట్టాయేమోననే అనుమానాలు కలుగకమానదు.   అయినా కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చిన కేసీఆర్, సమైక్య ఉద్యమాలు చేసి అటు తెలంగాణా, ఇటు ఆంద్ర ప్రజలకు కూడా హ్యాండ్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి హ్యాండ్స్ కలిపినా తమ రాజకీయ ప్రయోజనాలకు నష్టం జరుగుతున్నట్లు ఏమాత్రం అనుమానం కలిగినా ఒకరి హ్యాండ్ మరొకరు నలిపివేయడానికి ఏ మాత్రం వెనుకాడరని చెప్పవచ్చును.   తెలంగాణాలో ప్రజల తరపున పోరాడతామని పదేపదే చెపుతున్న షర్మిల, తెలంగాణా ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఏవిధంగా, ఎవరితో పోరాడాలనుకొంటుందో కూడా వివరిస్తే బాగుండేది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తెలంగాణాలో అడుగుపెట్టేందుకు కూడా సాహసించలేనప్పుడు, మరి తెలంగాణాలో కూడా జగనన్న రాజ్యం స్థాపిస్తాడని షర్మిల ఏవిధంగా ప్రజలకు చెప్పగలుగుతున్నారో వివరిస్తే బాగుండేది. అంటే ప్రస్తుతానికి అవసరార్ధం తెరాసతో సఖ్యతగా మెలుగుతున్నప్పటికీ మున్ముందు దానికి కూడా తమ పార్టీ హ్యాండ్ ఇస్తుందని దాని భావమేమో వైకాపాయే చెప్పాలి.   రాజకీయ నేతలయినా, పార్టీలయినా స్మార్ట్ గా ఉంటే మంచిదే. కానీ ఓవర్ స్మార్ట్ గా ఉంటే నష్టపోతాయని చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీయే ఒక సజీవ ఉదాహరణగా మన కళ్ళెదుట నిలిచి ఉంది. కానీ అది పట్టించుకోకుండా తెరాస, వైకాపాలు ఓవర్ స్మార్ట్ గా వ్యవహరిస్తున్నట్లు కనబడుతున్నాయి. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తెలంగాణాలో దుఖాణం తెరిచేందుకు ప్రయత్నిస్తుంటే కేసీఆర్ ఉపేక్షించడం వలన తెరాసపై ప్రజలలో అనుమానాలు కలగడం సహజం. అదేవిధంగా నిత్యం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంతో యుద్ధం చేస్తున్న తెలంగాణా ప్రభుత్వాన్ని, దాని ముఖ్యమంత్రి కేసీఆర్ ని వెనకేసుకు వస్తునందుకు ఆ పార్టీకి ఆంద్ర ప్రజలు దూరంకావడం తధ్యం.   భిన్న దృవాల వంటి ఆ రెండు పార్టీలు, ఒకే రకమయిన అహంభావం కలిగిన వాటి అధినేతలు తమ ఉమ్మడి శత్రువు అయిన తెదేపాను నిలువరించడానికే చేతులు కలుపుతారో లేదా అనే విషయం పక్కనబెడితే, వారు అనుసరిస్తున్న ఈ రహస్య వ్యూహం బెడిసికొట్టే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చును.