ఏపీ రాజధాని... ప్రస్తుతానికి 500 ఎకరాల్లోనే?

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధాని నగరం నిర్మించాలని ఉవ్విళ్ళూరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆశలపై కేంద్రం నీళ్ళు కుమ్మరించింది. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయిస్తుందని భావిస్తే నయాపైసా కూడా కేటాయించలేదు. మున్ముందు ఏమయినా కేటాయిస్తుందో లేదో కూడా తెలియదు గానీ షరా మామూలుగానే హామీలు మాత్రం ఇస్తోంది. ఈ పరిస్థితిలో కేంద్రాన్ని నమ్ముకొని ముందు అనుకొన్నట్లుగా భారీ ప్రణాళికతో రాజధాని పనులు మొదలుపెట్టేసి మధ్యలో నిధులు లేక నిర్మాణం నిలిపివేసుకొని అప్రదిష్టపాలవడం కంటే, రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అందుకు అవసరమయిన సొమ్ము సమకూర్చుకొని, దానితోనే ముందుగా 500 ఎకరాలలో రాజధాని ప్రధాన నగరం నిర్మించడం మేలనే ఆలోచనలోపడినట్లు తెలుస్తోంది. ఒకవేళ కేంద్రం మున్ముందు నిధులు ఏమయినా విడుదల చేసినట్లయితే రాజధాని చుట్టూ మరో 2,000 ఎకరాలలో మరి కొన్ని ప్రధాన కట్టడాలు నిర్మించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.   రాజధాని నగర మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ కాపీ ఈ వారంలో ప్రభుత్వం చేతికి అందే అవకాశం ఉంది. దాని ఆధారంగా రాజధాని నగరం నిర్మాణానికి నిధులు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు హామీ ఇస్తున్నారు. ఒకవేళ ఆయన తన హామీని నిలబెట్టుకొని నిధులు విడుదల చేసినట్లయితే మంచిదే. లేకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక కేంద్ర సహాయం కోసం ఎదురుచూపులు చూడకుండా తన శక్తి, పరిధి మేరకు రాజధాని నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు సంబంధిత అధికారులు చెపుతున్నారు.   ముందుగా సచివాలయం, శాసనసభ, రాజ్ భవన్, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ మరియు నివాసం, వివిధ ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలు, మంత్రులు, అధికారులు, ఉద్యోగుల కార్యాలయాలు మరియు వారి కోసం గృహ సముదాయాలతో కూడిన ప్రధాన రాజధాని నగరం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దానికయినా కనీసం 20-30వేల కోట్లు అవసరం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధమిక అంచనా వేసి, కేంద్రానికి నివేదిక పంపింది. కానీ కేంద్రం దానిని పట్టించుకోలేదు. కనుక ఒకవేళ కేంద్రం నిధులు విడుదల చేయకపోయినట్లయితే ఇక ఆంద్రప్రదేశ్ ప్రభుత్వమే ఈనెలలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్ లోనే అందుకు తగినన్ని నిధులు కేటాయించే అవకాశం ఉంది.   తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది మోయలేని భారమే అయినప్పటికీ, ఇంకా కేంద్రసహాయం కోసం చకోరపక్షిలా డిల్లీ వైపు చూస్తూ కూర్చొనేకంటే తన స్వశక్తితోనే రాజధాని నిర్మాణం మొదలుపెట్టడమే మేలని భావిస్తోంది. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం బడ్జెట్ లో కేవలం రూ. 100 కోట్లు మాత్రమే కేటాయించడం చూసి ఆగ్రహం చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించుకొంటుందని ఇంతకు ముందు ప్రకటించారు. అయితే రాజధాని నిర్మాణం, పోలవరం రెండూ నిర్మించడం రాష్ట్ర ప్రభుత్వానికి శక్తికి మించిన పని అవుతుంది కనుక ముందుగా రాజధాని నిర్మాణ భారాన్నే భుజానికెత్తుకోవచ్చును. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడింది గనుక కేంద్రమే దానిని పూర్తిచేయవలసి ఉంటుంది. కనుక దానిని పక్కనబెట్టి, 2018లోగా రాజధాని ప్రధాన నగర నిర్మాణం పూర్తిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తన ప్రణాళికలు సిద్దం చేసుకోవచ్చును.   త్వరలోనే చంద్రబాబు నాయుడు డిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసి రాష్ట్రానికి నిధులు విడుదల చేయమని కోరబోతున్నారు. ఆయన ప్రతిస్పందన చూసిన తరువాత, రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని నిర్మాణం విషయంపై ఒక నిర్దిష్ట అవగాహన ఏర్పడుతుంది కనుక తదనుగుణంగా ప్రణాళిక సిద్దం చేసుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు ఒక సంవత్సర కాలం గడిచిపోయింది. మిగిలిన ఈ నాలుగేళ్ల కాలంలో ఎట్టి పరిస్థితులలో రాజధాని నిర్మాణం పూర్తిచేయవలసి ఉంటుంది కనుక కేంద్రం నిధులు విడుదల చేసినా చేయకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏమాత్రం ఆలశ్యం చేయకుండా రాజధాని నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టవచ్చును. రెండు మూడేళ్ళలో రాజధాని ప్రధాన నగరానికి రూపురేఖలు ఇవ్వగలిగితే, దాని ఆధారంగా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది గనుక కేంద్రం సహాయం చేసినా చేయకపోయినా మిగిలిన నిర్మాణ కార్యక్రమాలకి నిధుల కొరత ఉండకపోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.   అయితే నేటికీ కూడా రాజధాని నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం తప్పకుండా నిధులు విడుదల చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆశాభావంతో ఉంది. అవి కూడా అందినట్లయితే రాజధాని నిర్మాణం వేగంగా పూర్తవుతుంది. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం తన తిప్పలు తను పడక తప్పదు.

బీజేపీ వాదన ప్రజలకు నచ్చుతుందా?

  కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించిన బడ్జెట్ పై ఊహించిన దానికంటే చాలా ఎక్కువగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యతిరేకత ఎదురవుతోంది. అధికార తెదేపాతో సహా అన్ని పార్టీలు కూడా బడ్జెట్ లో రాష్ట్రానికి తగినన్ని నిధులు కేటాయించకపోవడాన్ని ముక్తకంటంతో నిరసిస్తున్నాయి. పార్లమెంటులో కాంగ్రెస్, వైకాపా యంపీలు ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నప్పుడు తాము ఎటువంటి వైఖరి అవలంభించాలనే సందిగ్ధంలో ఉన్న తెదేపా యంపీలు ఇప్పుడు ఆ సందిగ్ధంలో నుండి పూర్తిగా బయటపడేందుకు ఈ బడ్జెట్ తోడ్పడిందని చెప్పవచ్చును. కానీ త్వరలో చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీని కలిసి మాట్లాడిన తరువాత, ఆయన ఇచ్చిన హామీలను చూసి, అవి సంతృప్తికరంగా లేకపోయినట్లయితే అప్పుడు వారు కూడా కాంగ్రెస్, వైకాపా సభ్యులతో కలిసి ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీయవచ్చును.   బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూ, కేంద్రంలో భాగస్వామిగా ఉంటూ, రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కేంద్రమంత్రులుగా ఉన్నప్పటికీ తెదేపా ప్రభుత్వం కేంద్రం నుండి తగినన్ని నిధులు రాబట్టుకోవడంలో విఫలమయిందని ప్రతిపక్షాలు దెప్పిపొడుస్తున్నాయి. అదేవిధంగా రాష్ట్ర విభజన బిల్లుని పార్లమెంటులో ఆమోదించే సమయంలో, ఆ తరువాత ఎన్నికల ప్రచారసభలలో బీజేపీ నేతలు అందరూ రాష్ట్రానికి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఈవిధంగా మొండి చెయ్యి చూపడాన్ని రాజకీయ పార్టీలే కాదు ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అధికార, విపక్షాలు, మీడియా, రాజకీయ విశ్లేషకులు, ప్రజలు అందరూ మూకుమ్మడిగా బీజేపీని, ఎన్డీయే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తుంటే వారందరికీ సమాధానాలు, సంజాయిషీలు చెప్పుకోలేక రాష్ట్ర బీజేపీ నేతలు నానా ఇబ్బందులుపడుతున్నారు.   తెదేపా కటినమయిన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ఇప్పటికే స్పష్టం చేస్తోంది, గనుక తెదేపా పట్ల బీజేపీ నేతల వైఖరిలో కూడా క్రమంగా మార్పు కనబడుతోంది. తెదేపా ప్రభుత్వం కేంద్రానికి సరయిన ప్రతిపాదనలు పంపకపోవడం వలననే, కేంద్రం రాష్ట్రానికి నిధులు మంజూరు అవలేదనే వితండ వాదన బీజేపీ నేతలు అందుకొన్నారు. అయినప్పటికీ కేంద్రం రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకు చాలా ఉదారంగా నిధులు విడుదల చేసిందని, కేంద్ర పన్ను ఆదాయంలో నుండి రాష్ట్రానికి పది శాతం అధికంగా నిధులు కేటాయించినందున రానున్న ఐదేళ్ళ కాలంలో రాష్ట్రానికి దాదాపు రెండు లక్షల కోట్లు రాబోతున్నాయని బీజేపీ రాష్ట్ర నేతలు ప్రజలకు, విమర్శకులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ వాదనలు, సంజాయిషీలతో విమర్శల నుండి బీజేపీ నేతలు తమను తాము కాపాడుకోలేక పోతున్నారు. ప్రజలను కూడా సంతృప్తి పరచలేకపోతున్నారనేది సుస్పష్టం.   ఇటువంటి పరిస్థితుల్లో వారు మిత్రపక్షమయిన తెదేపాతో, రాష్ట్రంలో ప్రతిపక్షాలతో, ప్రజలతో పట్లుపడుతూ ప్రయాసపడే బదులు, డిల్లీ వెళ్లి తమ అధిష్టానానికి రాష్ట్రంలో పరిస్థితులు వివరించి, తగిన విధంగా స్పందించమని కోరితే మంచిది. అలాకాక ఇదేవిధంగా వ్యవహరిస్తూ కాలక్షేపం చేసినట్లయితే పార్టీకి వారు ఊహించనంత నష్టం జరిగే అవకాశం ఉంది. పైగా తెదేపా సంబంధాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఏ రాజకీయ పార్టీకయినా మిత్రధర్మం పాటించేందుకు కొన్ని పరిమితులు ఉంటాయి. దానికోసం రాజకీయ పార్టీలు తమ ఉనికిని, మనుగడను పణంగా పెట్టలేవనే సంగతి చాలా సార్లు నిరూపితమయింది. ఇప్పుడు  తెదేపా, బీజేపీలు కూడా అటువంటి పరీక్షనే ఎదుర్కొంటున్నాయి. అయితే ఇప్పటికీ వాటికి ఈ పరీక్షలో నెగ్గేందుకు అవకాశాలున్నాయి. ముందు ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకోవడం వలన రెండు పార్టీలకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది.   ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికున్న ప్రత్యేక సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వానికి, దానిని నడుపుతున్న బీజేపీకి, రాష్ట్ర బీజేపీ నేతలకి అందరికీ కూడా తెలుసు. కనుక ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసే బదులు ఆ సమస్యలను పరిష్కరించేందుకు గట్టిగా ప్రయత్నిస్తే మంచిది. తెదేపా, బీజేపీలు తమ సంబంధాలు కొనసాగించినా తెంచుకొన్నా ప్రజలు పట్టించుకోబోరు. కానీ ఈ ఐదేళ్ళలో జరిగిన రాష్ట్రాభివృద్ధినే కొలమానంగా చేసుకొని వచ్చే ఎన్నికలలో ప్రజలు ఆ రెండు పార్టీలని తూకం వేస్తారనే సంగతి విస్మరించకూడదు.

పవన్ పర్యటిస్తే జగన్‌కెందుకు దడ?

  “అధికారం కోసం కాదు కేవలం ప్రశ్నించడం కోసమే రాజకీయాలలోకి వచ్చేనని” జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందే చెప్పారు. అంతే కాదు తాను తెదేపా, బీజేపీలకు బేషరతుగా మద్దతు ఇచ్చినప్పటికీ అవసరమయితే వాటినీ ప్రజల తరపున నిలబడి నిలదీస్తానని ఆనాడే చెప్పారు. చెప్పినట్లే ఆయన రాజధాని భూసేకరణ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అరకొర బడ్జెట్ కేటాయింపులపై ప్రశ్నించారు. అంతటితో తన పనయిపోయిందని చేతులు దులుపుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఇంటికి వెళ్లి ఆయనని భూసేకరణ గురించి అడిగారు. అయన ఏమని సమాధానం చెప్పారో తెలియదు గానీ తనే స్వయంగా తుళ్ళూరు వెళ్లి భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులను కలిసి వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను తెలుసుకొనేందుకు సిద్దం అయినట్లు సమాచారం.   ఈ సంగతి తెలియగానే అందరి కంటే ముందుగా వైకాపా ఉలికి పడింది. ఆ తరువాత చాలా తీవ్రంగా స్పందించడం మొదలుపెట్టింది. ఆయన పర్యటనకు వక్రభాష్యాలు చెప్పడం మొదలుపెట్టేసింది. అసలు ఇదంతా పెద్ద కుట్రగా అభివర్ణిస్తోంది. ఎందుకంటే రాజధాని భూసేకరణ కార్యక్రమం మొదలయినప్పటి నుండి ఆ పార్టీ స్థానిక రైతులను రెచ్చగొడుతూ ఆ ప్రక్రియకు అవరోధాలు కల్పించేందుకు తను చేయగలిగినంతా చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా భూసమీకరణను అడ్డుకోలేకపోయింది. వైకాపా సృష్టించిన ఆ అవరోధాలన్నిటినీ అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయగలిగింది.   ఇక మిగిలిందల్లా అంగీకార పత్రాలు ఇచ్చిన రైతుల భూములను సర్వే జరిపించి స్వాధీనం చేసుకోవడమే. ఆ కార్యక్రమం మరొక వారం పది రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకొంది. ఈ సమయంలో రైతులు సహజంగానే తీవ్ర భావోద్వేగాలకు లోనయి ఉంటారు. కనుక వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రేపు తుళ్ళూరు మండలంలో పర్యటించి భూసమీకరణ కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు చివరి ప్రయత్నం చేయాలనుకొన్నారు. కానీ ఇదే సమయంలో తెదేపాకు మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ తుళ్ళూరులో పర్యటించేందుకు సిద్దం అవుతున్నారని తెలిసి వైకాపా ఆందోళన చెందడం సహజం. అందుకే పవన్ కళ్యాణ్ తుళ్ళూరు పర్యటన గురించి ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడక ముందే, దాని వెనుక చంద్రబాబు నాయుడు హస్తం ఉందని ప్రచారం మొదలుపెట్టేసింది.   కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని కలవక ముందు రోజు “రైతుల ప్రయోజనాలను, పంట భూములను, పంటలను ప్రభుత్వమే కాపాడాలి. రైతుల ఉసురు తగిలితే అది ఎవరికీ మంచిది కాదు,” అని ట్వీటర్ మెసేజ్ పెట్టారు. అంటే ఆయన కూడా ఈ భూసేకరణ పట్ల అయిష్థత కలిగి ఉన్నారని స్పష్టమవుతోంది. ఆయన ఆ సందేశం పెట్టిన తరువాతనే రెండు గ్రామాల రైతులు జనసేన జెండాలు, బ్యానర్లు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. వారిని పవన్ కళ్యాణే వెనక నుండి ప్రోత్సహించారని వైకాపా ఊహాజనితమయిన కధనాలు ప్రచారం చేయడం చాలా దారుణం. ఈ విధంగా రైతుల ధర్నాల వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడని, అతని వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నరంటూ లేనిపోని ప్రచారం చేస్తోంది. పవన్ కళ్యాణ్ ఉన్నత వ్యక్తిత్వం గురించి తెలిసిన వారెవరూ కూడా ఇటువంటి ఆరోపణలు, కట్టు కధలు జీర్ణించుకోవడం కష్టం.   అసలు ఆయన పర్యటనకు కేవలం వైకాపా మాత్రమే ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తోంది? ఎందుకు కంగారు పడుతోంది? ఆయన అసలు బయలు దేరుతున్నారో లేదో కూడా తెలియక ముందే ఇలా బోడి గుండుకి మొకాలుకి ముదేస్తూ ఎందుకు ప్రచారం చేస్తోంది? ఆయన రైతులను ఒప్పించినా లేక వారితో కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడదలచుకొన్నా వైకాపాకి ఏమిటి అభ్యంతరం? ఏమిటి కష్టం? రైతుల తరపున నిలబడి పోరాడుతున్నాని వైకాపా చెప్పుకొంటున్నప్పుడు, పవన్ కళ్యాణ్ కూడా వచ్చి కలిస్తే ఆయనను ఆహ్వానించకపోగా ఎందుకు ఆందోళన చెందుతోంది? అని ప్రశ్నించుకొంటే ఈ భూసేకరణ అంశాన్ని వైకాపా ఎందుకు ఉపయోగించుకొంటోందో, దాని ఉద్దేశ్యాలు ఏమిటో అర్ధం అవుతాయి.   భూసమీకరణ వల్ల రైతులకు ఎటువంటి నష్టమూ కలగకుండా తను హామీ ఉంటానని పవన్ కళ్యాణ్ రైతులకు నచ్చజెప్పి ఒప్పించేస్తే, అప్పుడు వైకాపా ఇంతకాలంగా చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి. లేదా ఆయన ఆఖరి నిమిషంలో ప్రవేశించి తను మొదలుపెట్టిన ఈ పోరాటాన్ని దొరకబుచ్చుకొని మొత్తం క్రెడిట్ అంతా స్వంతం చేసేసుకొంటారనే భయం వల్ల కావచ్చును. రైతుల తరపున పోరాడుతున్నామని చెపుతూ రైతులను మభ్య పెడుతూ వారికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు దీనినే ఆయుధంగా చేసుకొని తన రాజకీయ ప్రతర్ది అయిన అధికార తెదేపాను అప్రతిష్టపాలు చేయాలని వైకాపా తహతహలాడుతోంది. అందుకే ఇటువంటి సమయంలో అందరూ అభిమానించే పవన్ కళ్యాణ్ తుళ్ళూరులో పర్యటించబోతున్నారనే వార్త వినబడగానే కంగారు పడుతోంది. అందుకే ఆయనకు వ్యతిరేకంగా అప్పుడే చెడు ప్రచారం ఆరంభించేసింది. ఈవిధంగా ప్రతీ అంశాన్ని కూడా రాజకీయం చేయడం వలననే వైకాపా ప్రజల విశ్వాసం పొందలేకపోతోంది. మరి ఈ విషయం ఎప్పటికయినా గ్రహిస్తుందో లేదో?  

టీడీపీ, బీజేపీ భవిష్యత్తు @ ఏపీ అభివృద్ధి

  కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించిన బడ్జెట్ సామాన్య ప్రజలను ఆకట్టుకొనేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. అటువంటి ప్రయత్నాలు చేసి ఉండి ఉంటే దాని వలన ప్రజలు సంతోషించేవారేమో గానీ, అది దేశాభివృద్ధికి ఏమాత్రం దోహదపడదు. రానున్న రెండు మూడేళ్ళలో ద్రవ్యోల్భణాన్ని పూర్తిగా నియత్రించి, ఆర్ధికవృద్ధి రెటు గణనీయంగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తునందున బడ్జెట్ తో ప్రజల మెప్పు పొందే ప్రయత్నాలు చేయలేదు.   ఇక బడ్జెట్ లో మిగిలిన అంశాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, రాష్ట్ర విభజన తరువాత తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి ప్రత్యేక సహాయం అందించకపోవడం సహజంగానే రాష్ట్ర ప్రజలకి, రాజకీయ పార్టీలకి ఆగ్రహం కలిగిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు దీనినొక రాజకీయ ఆయుధంగా మలచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడేందుకు సిద్దం అవుతుంటే, వారి నుండి ఒకపక్క తీవ్ర విమర్శలను ఎదుర్కొంటూ, బీజేపీతో సంబంధాలు దెబ్బ తినకుండా, రాష్ట్రానికి రావలసిన నిధుల కోసం తాము భాగస్వామిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏవిధంగా నిలదీయాలని తెదేపా సందిగ్ధంలో ఉంది.   చంద్రబాబు నాయుడితో సహా తెదేపా నేతలందరూ మీడియా సమక్షంలోనే తమ అసంతృప్తిని తెలియజేసారు. దానిని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఇరువురూ ఖండించారు. అటువంటి విషయాల గురించి బహిరంగం మాట్లాడేకంటే నేరుగా ప్రధానితో మాట్లాడుకొంటే బాగుంటుందని వెంకయ్య నాయుడు సున్నితంగా హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు కోసం మరిన్ని నిధులు కేటాయించవలసి ఉందని ఆయన కూడా అభిప్రాయపడ్డారు. కానీ ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్ ఏర్పాటు వంటి అంశాలపై గత ప్రభుత్వం సరయిన కసరత్తు చేయకుండా హడావుడిగా నిర్ణయాలు తీసుకోన్నందునే ఇటువంటి పరిస్థితి కలిగిందని సర్దిచెప్పే ప్రయత్నం చేసారు. విష్ణు కుమార్ రాజు కూడా బడ్జెట్ పట్ల అసంతృప్తిని వ్యక్తపరుస్తూనే, చంద్రబాబు నాయుడు సరిగ్గా కృషి చేయనందునే నష్టపోవలసి వచ్చిందని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అదుకొంటామని మోడీతో సహా బీజేపీ నేతలందరూ పదేపదే రాష్ట్రప్రజలకు హామీలు ఇచ్చారు. ఇంకా ఇస్తూనే ఉన్నారు కూడా. కానీ అవి ఆచరణలో కనబడకపోవడంతో రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ప్రజలకు సంజాయిషీలు చెప్పుకొనే పరిస్థితి ఎదురవుతోంది.   తెదేపా, బీజేపీల రాజకీయ భవిష్యత్ రాష్ట్రాభివృద్ధి మీదే పూర్తిగా ఆధారపడి ఉంది. ఈ వాస్తవాన్ని తెదేపా ప్రభుత్వం బాగానే గుర్తించింది. అందుకే వచ్చే ఎన్నికలలోగా రాజధాని, పోలవరం, మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం వంటివి పూర్తి చేయాలని ఆరాటపడుతోంది. కానీ బీజేపీ ఇంకా గుర్తించినట్లు లేదు. అందుకే ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలను ప్రత్యేక దృష్టితో చూడకుండా మిగిలిన రాష్ట్రాలతో సమానంగా చూస్తున్నట్లుంది.   దేశాభివృద్ధి కోసం ఆర్ధిక క్రమశిక్షణ పాటించాల్సిందే. కానీ అదే సమయంలో రాష్ట్ర విభజన కారణంగా ఘోరంగా దెబ్బ తిన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవలసిన బాధ్యత కూడా కేంద్రం మీదే ఉంది. తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రానికి ఇటువంటి సమయంలోనే కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా రాష్ట్రానికి ఏదో మొక్కుబడిగా నిధులు విడుదలచేసి చేతులు దులుపు కొన్నట్లయితే, మున్ముందు ఈ సమస్యలు మరింత పెరిగి రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినట్లయితే, అప్పుడు ఆ సమస్యల నుండి రాష్ట్రానికి బయటపడేసేందుకు ఇంతకు పదింతలు ఆర్ధిక సహాయం చేయవలసి వస్తుంది.   కేంద్రం ఇప్పుడు రాష్ట్రానికి అన్ని విధాల సహాయపడినట్లయితే రాష్ట్రం త్వరగా నిలద్రొక్కుకొని తిరిగి ప్రతిఫలాలను కూడా అందించగలదు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహాయపడితే రాష్ట్ర ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు. దాని వలన బీజేపీకే మేలు జరుగుతుంది. అలాకాక రాష్ట్రానికి ఇదేవిధంగా అరకొర నిధులు విదిలిస్తూ హామీలతోనే కాలక్షేపం చేసినట్లయితే ప్రజలు ఏవిధంగా స్పందిస్తారో బీజేపీకి కూడా తెలుసు.

భ్రమలు లేని బడ్జెట్

  ఈరోజు కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ రూ.17,77,477 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దానిలో ప్రణాళికేతర వ్యయం రూ.13,12,200 కోట్లు, ప్రణాళికా వ్యయం రూ.4,65,000 గా పేర్కొన్నారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభూ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లాగే ఇది కూడా చాల సాదాసీదాగా వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తయారు చేసినట్లుంది. ఇంతకు ముందు యూపీఏ ప్రభుత్వ హయంలో ఆచరణలో సాధ్యం కాని, లేదా చేసే ఉద్దేశ్యంలేని అనేక ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలను బడ్జెట్ లో పేర్కొంటూ వాటికి భారీగా కేటాయింపులు జరుపుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసేది. కానీ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో అటువంటి మెరుపులేవీ లేకపోయినా కొన్ని కొత్త ఆలోచనలు ప్రస్పుటంగా కనిపించాయి.   ఈ బడ్జెట్ లో పేద, మధ్య తరగతి ప్రజలు, రైతుల కంటే కార్పోరేట్ సంస్థలకు కొంచెం అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు కనబడుతోంది. కార్పోరేట్ సంస్థలకు ప్రస్తుతం ఉన్న30 శాతం పన్నును 25శాతానికి తగ్గించారు. సంపద పన్ను కూడా రద్దు చేసారు. ఇది పన్ను ఎగవేతలను అరికట్టేందుకేనని ఆర్ధికమంత్రి జైట్లీ చెప్పారు. కానీ విదేశాలలో నల్లదనం కూడబెట్టేవారిపట్ల, విదేశాల నుండి మనీ లాండరింగ్ పాల్పడే వారి పట్ల మరింత కటినంగా వ్యవహరించబోతున్నట్లు ప్రకటించారు. ఏడాదికి కోటి రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారిపై 2 శాతం సర్ చార్జ్ విధించారు. ఉన్నత ఆదాయ వర్గాల వారికి ఇకపై సబ్సీడీ గ్యాస్ ఉండబోదు.   స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అందించే నిధులకు వందశాతం పన్ను మినహాయింపునిచ్చారు. అదేవిధంగా గంగా ప్రక్షాళనకు నిధులు అందించే వారికి పన్ను రాయితీ కల్పించారు. దేశంలో ఉండే కోట్లాదిమంది నిరుపేదలందరికీ జీవిత, ఆరోగ్య, ప్రమాద భీమాలు కల్పించాలనే మంచి ఆలోచనలు చేసారు. అయితే ఆదాయపన్ను పరిమితిని యధాతధంగా ఉంచడంతో మధ్యతరగతి ప్రజలు నిరాశ కలిగింది.   ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను రాయితీని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. సీనియర్ సిటిజన్లకు కొత్తగా సూపర్ సీనియర్ సిటిజన్లు అనే వర్గాన్ని జోడించారు. సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను రాయితీని రూ.10 వేల నుంచి 30 వేలకు పెంచగా, సూపర్ సీనియర్ సిటిజన్లకు అంటే 80 ఏళ్లు పైబడిన వారికి రూ 30 వేల వరకు వైద్య బిల్లులు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. వికలాంగులకు అదనంగా 20 వేల పన్ను రాయితీ ఇచ్చారు. మోడీ ప్రభుత్వం ప్రధానంగా దేశంలో మౌలికవసతుల కల్పన, ఉన్నత విద్య, వైద్య, పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనబడుతోంది. ఇక ఇంతవరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెపుతూ వచ్చిన కేంద్రం అది ఇక ఏ మాత్రం సాధ్యంకాదని కుండబ్రద్దలు కొట్టినట్లు ప్రకటించింది. దానికి ప్రత్యామ్నాయంగా ఆర్ధిక ప్యాకేజి ఇస్తామని ప్రకటించారు. ఈ ఏడాది చివరిలో వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీహార్ రాష్ట్రానికి కూడా ఆర్ధిక ప్యాకేజి ఇస్తామని ప్రకటించారు.   బడ్జెట్ అనగానే కొన్ని టీవీలు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు తదితర వస్తువుల ధరలు హెచ్చుతగ్గులుంటాయని అందరూ ఎదురు చూడటం పరిపాటయిపోయింది. కానీ ఈసారి అటువంటి ప్రత్యేక వరాలేవీ కురిపించకుండానే, అలాగని వారికి కొత్తగా పన్నులేవీ వడ్డించకుండా సర్వో జనాః సుఖినో భవంతు అంటూ అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగం ముగించేశారు. ఈ బడ్జెట్ నేల విడిచి సాము చేయకుండా, ప్రజలకు ఎటువంటి అనవసర ఆశలు, భ్రమలు కల్పించకుండా వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రూపొందించబడినట్లు కనబడుతోంది. కనుక దీర్ఘకాలంలో మంచి పలితాలు ఆశించవచ్చును.

రైల్వే బడ్జెట్ నిరాశ కలిగించింది... అయితే...

  కేంద్ర ప్రభుత్వం గురువారం నాడు వెల్లడించిన రైల్వే బడ్జెట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నిరాశ కలిగించింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు రెండు రాష్ట్రాలకూ ఏవైనా వరాలు ప్రకటిస్తారేమోనని ప్రజలు ఎదురుచూశారు. అయితే రెండు రాష్ట్రాలకూ ఆయన ఎలాంటి వరాలూ ఇవ్వలేదు. గతంలో వున్న చిన్న చిన్న వరాలకు కొద్దికొద్దిగా కేటాయింపులు చేశారు. అయితే ఈ రైల్వే బడ్జెట్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో ఆశలు పెట్టుకుంది. కేంద్రం రైల్వే పరంగా ఏపీని ముందుకు తీసుకెళ్తుందని ఆశించింది. అయితే రైల్వే బడ్జెట్ మాత్రం ప్రస్తుతం కష్టాల్లో ఉన్న ఏపీకి కొంతయినా ఊరట కలిగించేలా లేదు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ఏవైనా వరాలు ఇచ్చి మరో రాష్ట్రానికి ఏమీ ఇవ్వకపోతే లేనిపోని తలనొప్పి అనుకున్నారో ఏమోగానీ, రెండు రాష్ట్రాలకూ మొండిచెయ్యి చూపించారు. అయితే ఈ బడ్జెట్ పట్ల ప్రజలు తమ నిరాశను బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు మాత్రం తమ ఆవేదనను మాటల్లో బయటపెట్టలేకపోతున్నారు. ఇటు ఏపీలో అధికారంలో వున్న తెలుగుదేశం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి మిత్రపక్షం. తెలంగాణలో వున్న టీఆర్ఎస్ కేంద్రంతో సత్సంబంధాలను పెట్టుకోవాలని ఆశిస్తున్న పార్టీ. అందుకే ఈ రెండూ పెద్దగా స్పందించడం లేదు.   అయితే, ఇప్పుడు రెండు రాష్ట్రాలకు ఎలాంటి వరాలు ఇవ్వాలని నిరాశలో కూరుకుపోవలసిన అవసరం లేదు. ఈసారి రైల్వే బడ్జెట్‌లో వడ్డింపులు లేవు కాబట్టి వరాలు కూడా లేకుండా పోయాయి. పైగా ఇది ఎన్డీయే ప్రభుత్వ మొదటి బడ్జెట్ కాబట్టి మనం పెద్దగా ఆగ్రహించాల్సిన అవసరం కూడా లేదని చెప్పొచ్చు. గత పదేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ చేసిన కంగాళీని సరిదిద్దడంలోనే మొదటి ఏడాది పుణ్యకాలం పూర్తవుతుంది. ఆ తర్వాత మోడీ మ్యాజిక్‌ కారణంగా మంచి ఫలితాలు వస్తే రాష్ట్రాలకూ అన్ని విధాలుగా మేలు జరిగే అవకాశం వుందని ఆశావాదంతో వుండాలి. గత పదేళ్ళుగా రాష్ట్రాలు నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చుట్టూ ప్రదక్షిణలు చేసేవి. తాజాగా కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచి మోడీ రాష్ట్రాల నెత్తిన పాలు పోశారు. ఇది ఎవరూ ఊహించని వరం. ఊహించని వరాలు ఇచ్చిన మోడీ, రైల్వే బడ్జెట్ విషయంలో మాత్రం ఊహించిన వరాలు ఇవ్వలేదు. ఇవ్వగలిగితే అడక్కుండానే ఇచ్చేవారన్న సూత్రాన్ని మననం చేసుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాలూ ఒక ఏడాదిపాటు ఓర్పు వహించడమే మంచిదన్న అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ, తెలంగాణ బడ్జెట్ కబుర్లు

  ఆంద్రప్రదేశ్, తెలంగాణా రెండు రాష్ట్రాల శాసనసభ బడ్జెట్ సమావేశాలు కూడా మార్చి 7 నుంచి మొదలవబోతున్నాయి. గవర్నర్ నరసింహన్ మొదట ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉభయసభలను, ఆ తరువాత తెలంగాణా రాష్ట్ర ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.   ఆంద్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మార్చి 12న సభలో ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 13న సమర్పిస్తారు. మార్చి 27 వరకు ఈ సమావేశాలు నిర్వహించవచవచ్చును.   తెలంగాణా రాష్ట్ర బడ్జెట్‌ను ఆ రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి ఈటెల రాజేందర్ మార్చి11న ప్రవేశపెడతారు. మార్చి 13, 14,16 తేదీలలో బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. మార్చి 17న ఆర్ధికమంత్రి బడ్జెట్ పై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెపుతారు. మార్చి25 వరకు నిర్వహించవచ్చును. రెండు రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయాన్ని బిజినస్ అడ్వయిజరీ కమిటీ సమావేశాలలో నిర్ణయిస్తారు.   రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మొట్టమొదటిసారిగా 2015-16సం.లకి గాను పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రూ.1.25 లక్షల కోట్లు, తెలంగాణా బడ్జెట్ సుమారు రూ.1.0 లక్ష కోట్లు ఉండవచ్చని సమాచారం. ఉభయ రాష్ట్రాలకు ప్రత్యేకమయిన సమస్యలు, అవసరాలు, ఆర్ధిక వనరులు కలిగి ఉన్నందున వాటి బడ్జెట్ కేటాయింపులు కూడా అందుకు అనుగుణంగానే ఉంటాయి.   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మౌలికవసతుల, ఐటీ, పారిశ్రామిక అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారిస్తోంది. రాజధాని నిర్మాణం కూడా చేపట్టబోతోంది. వాటి ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెంచుకొనే అవకాశం ఉంది. వాటి ద్వారా యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి. కనుక వాటి కోసం ముందుగా యువతకు ఆయా రంగాలలో సాంకేతిక శిక్షణ (స్కిల్ డెవలప్మెంట్) కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ‘నాలెడ్జ్ హబ్’ గా తయారుచేయాలని భావిస్తున్నారు. కనుక మిగిలిన అన్నిటికంటే ఆ రంగానికే చాలా భారీగా నిధులు కేటాయించవచ్చును.   దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న రాయలసీమ జిల్లాలకు నీటి సౌకర్యం కల్పించేందుకు తమ ప్రభుత్వం నదులు అనుసంధానం చేయాలనుకొంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అలాగే ఎత్తిపోతల పధకాలకు ద్వారా సీమ జిల్లాలకు త్రాగు,సాగు నీరు అందించేందుకు బడ్జెట్ లో భారీ కేటాయింపులు చేయవచ్చును.   తెలంగాణా రాష్ట్రం ప్రధానంగా చెరువుల పునరుద్దరణ ద్వారా పంటలకు నీళ్ళు అందించి తద్వారా రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ కష్టాలను నివారించాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అందుకోసం ముమ్ముర ప్రయత్నాలు మొదలుపెట్టింది. వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ మంచి నీళ్ళు సరఫరా చేస్తామని లేకుంటే ప్రజలను ఓట్లు అడగబోమని కేసీఆర్ పడే పడే చెపుతున్నారు. కనుక ఈ బడ్జెట్ లో ఈ రెండు పధకాల కోసం భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది.   తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి తీవ్ర విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటోంది. కనుక దానిని అధిగామించేందుకు రాష్ట్రంలో పలుచోట్ల థర్మల్, సౌర విద్యుత్ ఉత్పతి కేంద్రాలను స్థాపించేందుకు వీలుగా కేటాయింపులు చేయవచ్చును.   ముఖ్యమంత్రి కేసీఆర్ తన పరిపాలనలో తెలంగాణా రాష్ట్ర సంస్క్రతి, సంప్రదాయాలను, తెలంగాణా రాష్ట్ర ప్రత్యేక ఉనికిని చాటుకొనేందుకు చాలా పట్టుదలగా ఉన్నారు. ఆ ప్రయత్నంలోనే తెలంగాణాకే ప్రత్యేకమయిన బ్రతుకమ్మ, బోనాల పండుగల నిర్వహణ, తిరుపతితో సమానంగా యాదగిరిగుట్ట అభివృద్ధి, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, దాని చుట్టూ ఆకాశ హర్మ్యాల నిర్మాణం, ఎర్రగడ్డ వద్ద కొత్త సచివాలయ నిర్మాణం వంటి భారీ కార్యక్రమాలను భుజాలకెత్తుకొన్నారు. అయితే వీటిలో హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, ఆకాశ హర్మ్యాల నిర్మాణం సాధ్యాసాధ్యాలను ఇంకా పరిశీలించవలసి ఉంది. కనుక మిగిలిన వాటికి భారీ కేటాయింపులు జరుపవచ్చును.   మెట్రో రైల్ మార్గంలో మార్పులు చేర్పులకు అయ్యే అదనపు వ్యయాన్ని తెలంగాణా ప్రభుత్వమే భరిస్తుందని ఇదివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చి ఉన్నారు. దానికి సుమారు రూ.2200 కోట్లు అవసరం ఉంటాయని నివేదిక అందింది. దానికి ఈ బడ్జెట్ లో ఎంతో కొంత కేటాయింపు జరుపవలసి ఉంటుంది. లేకుంటే మళ్ళీ మెట్రో రైలు పట్టాలు తప్పే ప్రమాదం ఉంటుంది.   కనుక రెండు రాష్ట్రాలు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతలకు అద్దం పట్టేవిగా ఉంటాయని స్పష్టం అవుతోంది. అయితే ఆ బడ్జెట్ కేటాయింపులు వాస్తవ అంచనాలకి, పరిస్థితులకి అనుగుణంగా ఉండాలని ప్రజలు కోరుకొంటున్నారు.

ప్రత్యేక హోదా ఏమోగానీ, పుణ్యకాలం పూర్తయ్యేట్టుంది...

  ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ‘ప్రత్యేక హోదా’ కోసం బృందగానం ఆలపిస్తున్నాయి. అయితే ప్రత్యేక హోదా విషయంలో ఉన్న సాంకేతిక ఇబ్బందుల గురించి వెంకయ్యనాయుడు ఇదివరకే ప్రజలకి వివరించి, ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యామ్నాయ ప్యాకేజీలను అందజేస్తామని చెప్పారు. కానీ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒత్తిడి వల్ల ఆయన తన మాటలని ఉపసంహరించుకోవలసి వచ్చింది. ఈ అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలు, పోరాటాలను పక్కనబెట్టి వెంకయ్య నాయుడు చెప్పిన యదార్ధ పరిస్థితులను, సమస్యలను ప్రజలు అర్ధం చేసుకోవలసి ఉంది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను ఒప్పించితే గానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని వెంకయ్యనాయుడు చెప్పిన మాట నూటికి నూరు శాతం వాస్తవం.   ఒకవేళ ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వదలిస్తే తమ రాష్ట్రాలకీ ఇమ్మని అనేక రాష్ట్రాలు డిమాండ్లు చేస్తున్నాయి. రాజస్థాన్, ఓడిషా, బీహార్, ఛత్తీస్ ఘర్ వంటి కొన్ని రాష్ట్రాలయితే చాలా కాలంగా ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే తమ రాష్ట్రంలో పరిశ్రమలు అక్కడికి తరలిపోతాయి గనుక ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని తమిళనాడు, కర్ణాటక, ఓడిషా వంటి ఇరుగుపొరుగు రాష్ట్రాలు అభ్యంతరాలు తెలుపుతున్నాయి. ఈ పరిస్థితులలో వాటినన్నిటినీ ఒప్పించి ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వడం అసాధ్యమని స్పష్టం అవుతోంది. అదే విషయం వెంకయ్య నాయుడు చెప్పారు.   అయితే “సాధ్యం కాదని తెలిసి బీజేపీ ఎందుకు హామీలు ఇచ్చిందని, హామీ ఇచ్చింది గనుక తప్పనిసరిగా ఇవ్వాల్సిందే!” అని పట్టుబట్టి కూర్చొంటే ప్రజల, ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి “అన్ని రాష్ట్రాలను ఒప్పించే ప్రయత్నాలు సా....గుతున్నాయంటూ” ఎన్డీయే ప్రభుత్వం మరికొన్ని నెలలో సంవత్సరాలో దొర్లించేయవచ్చును. ఇప్పటికే తొమ్మిది నెలలు గడిచిపోయాయి. ప్రత్యేక హోదా వచ్చేలోగానే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోయినా ఆశ్చర్యం లేదు. దాని వలన వచ్చే ఎన్నికలలో బీజేపీ నష్టపోవచ్చును. అది వేరే సంగతి. కానీ అంతకంటే ముందుగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రం, ప్రజలు తీవ్రంగా నష్టపోతారు.   రాష్ట్ర విభజన సమయంలో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఏవిధమయిన భావోద్వేగాలకు లోనయ్యారో, ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో కూడా అటువంటి భావోద్వేగాలకే లోనవుతున్నారు. అప్పుడు ఈ భావోద్వేగాల కారణంగానే రాష్ట్ర విభజన అనివార్యమనే చేదు నిజాన్ని అంగీకరించలేక ప్రజలందరూ ఉద్యమబాట పట్టారు. ఆ కారణంగానే యూపీయే ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆగ్రహం చల్లార్చి వారిని ప్రసన్నం చేసుకొని ఓట్లు దండుకొనేందుకు హడావుడిగా పార్లమెంటులో ప్రత్యేక హోదా ప్రకటించి చేతులు దులుపుకొంది తప్ప అందులో ఇమిడి ఉన్న ఈ ఇబ్బందుల గురించి అప్పుడు పట్టించుకోలేదు, ప్రస్తావించలేదు కూడా. ఎందుకంటే ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు మాట కదా...అనే ఆలోచనతో హామీలు గుప్పించి చేతులు దులుపుకొని వెళ్లిపోయింది. కానీ ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో లేదు కనుక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇమ్మని వాదిస్తోంది.   ఒకవేళ కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వగలిగి ఉండేదా..లేదా? ఇవ్వగలిగితే అది ఏవిధంగా సాధ్యమో ఎన్డీయే ప్రభుత్వానికి చెప్పి పుణ్యం కట్టుకోవచ్చును. ఒకవేళ అప్పుడు కూడా ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు వెనుకాడితే, అప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రజలు కూడా ఎన్డీయే ప్రభుత్వంతో పోరాడుతారు. కానీ ఇది ఆచరణ సాధ్యం కాదని తెలిసి కూడా కేవలం ఈ విధంగా ఎన్డీయే ప్రభుత్వాన్ని రాజకీయంగా దెబ్బ తీద్దామనే ఉద్దేశ్యంతోనో లేకపోతే రాష్ట్రంలో ప్రజలను ప్రసన్నం చేసుకొందామనే ఉద్దేశ్యంతోనో ప్రజల భావోద్వేగాలతో చెలగాటమాడుకొంటే ఏమవుతుందో కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందే రుచి చూసింది. అయినా దాని తీరు మారలేదని అర్ధం అవుతోం ది. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రప్రజల మనోభావాలను, ఆకాంక్షలను ఏమాత్రం పట్టించుకోకుండా పదవుల కోసం ప్రాకులాడిన రాష్ట్ర కాంగ్రెస్ యంపీలు, నేతలు ఇప్పుడు పార్లమెంటు వద్ద గాంధీ విగ్రహం వద్ద నిలబడి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ధర్నాలు చేస్తున్నారు. అటువంటి వారి పోరాటాలను నమ్మాలో వద్దో ప్రజలే నిర్ణయించుకోవలసి ఉంటుంది.   రాష్ట్ర విభజన సమయంలో ప్రజలలో నెలకొన్న ఇటువంటి భావోద్వేగాల కారణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయంగా దక్కవలసిన అనేక ప్రయోజనాలు దక్కలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా భావోద్వేగాలకులోనయి రాజకీయ పార్టీలకు ఈ వికృత రాజకీయ క్రీడ ఆడుకొనేందుకు అవకాశం కల్పించి, నష్టపోయిన తరువాత బాధపడటం కంటే వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక హోదాకు ఏ మాత్రం తీసిపోని విధంగా ప్యాకేజీలు, రాయితీలు కేంద్రం నుండి రాబట్టుకోవడమే మంచిది. ఒకవేళ మరో ఆర్నేల్లో ఏడాదో లేకపోతే మరో రెండేళ్ళ తరువాతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేసినప్పటికీ అప్పటికే చాలా పరిశ్రమలు ఇరుగు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉంది. పైగా అప్పటికి రాజాకీయ పరిస్థితులు, సమీకరణాలు మారినా మారవచ్చును. కనుక అధికార, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న ఈ రాజకీయ చదరంగంలో ఆంద్రప్రదేశ్ ప్రజలు తమ రాష్ట్ర ప్రయోజనాలను బలి చేసుకోవడం కంటే, వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక హోదాకి ఏమాత్రం తీసిపోని విధంగా రాష్ట్రానికి మంచి ఆర్ధిక ప్యాకేజి, పరిశ్రమలకు రాయితీలు వంటివన్నీ వీలయినంత వేగంగా మంజూరు చేయించుకోనేందుకు కేంద్రంపై ఒత్తిడి చేసి సాధించుకోవడమే అన్ని విధాల మంచిదని చెప్పవచ్చును. 

కాంగ్రెస్ మొసలి కన్నీరు

  గత తొమ్మిది నెలలుగా మొద్దు నిద్రపోయిన ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ ఇప్పుడు హటాత్తుగా మేల్కొని, రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిపోతోంది... వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గొంతు చించుకొని అరుస్తున్నారు. వారి పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కూడా ఇప్పుడే జ్ఞాపకం వచ్చినట్లుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ హడావుడిగా ప్రధాని మోడీకి ఒక లేఖ కూడా వ్రాసారు. ఇంతకాలం రాష్ట్రం మీద లేని ప్రేమ వారికి ఇప్పుడే మళ్ళీ ఎందుకు పొంగి పొరలిపోతోంది అంటే అందుకు కారణం రేపటి నుండి మొదలవ్వబోయే పార్లమెంటు సమావేశాలేనని చెప్పుకోవచ్చును.   వారికి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని నిజంగా ఆసక్తి, చిత్తశుద్ధి ఉండి ఉంటే ఇంతకు ముందు జరిగిన పార్లమెంటు సమావేశాల్లోనే ఈ విషయాలు ప్రస్తావించేవారు. కానీ అప్పుడు మోడీ ప్రభుత్వంతో యుద్ధం చేయడానికి ఇంతకంటే మంచి అంశాలున్నందున వీటిని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈ అంశాలను సభలో లేవనెత్తి సభలో అల్లరి చేయడం ద్వారా తాము మాత్రమే రాష్ట్రం కోసం పోరాడుతున్నామనే సందేశం రాష్ట్ర ప్రజలకు చేరేలా చేసి తద్వారా రాష్ట్ర ప్రజలను మళ్ళీ మంచి చేసుకోవగలమనే భ్రమలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. వారి ఈ పోరాటం అంతా రాష్ట్రంలో తమ పార్టీ ఉనికిని, తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికే తప్ప రాష్ట్రం కోసం కాదు.   పార్లమెంటులో ఈ అంశాలను లేవనెత్తడం ద్వారా పనిలోపనిగా అధికార తెదేపా పార్టీని రాజకీయంగా దెబ్బ తీయవచ్చని కాంగ్రెస్ నేతలు ఆరాట పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెదేపా ఈ విషయంలో ప్రతిపక్షాలతో కలిసి కేంద్రాన్ని నిలదీయలేదు. కనుక తెదేపాకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధులు, ప్రాజెక్టులు సాధించడంలో ఏమాత్రం శ్రద్ధ లేదని, తమకు మాత్రమే శ్రద్ధ ఉందని కాంగ్రెస్, వైకాపాలు రాష్ట్రంలో ప్రచారం చేసుకోవచ్చనే వెర్రి భ్రమలో ఉన్నాయి.   అయితే కాంగ్రెస్ నేతలు గత తొమ్మిది నెలలుగా మొద్దు నిద్దరపోతున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన యంపీలు, డిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి కంబంపాటి రామ్మోహనరావు కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ వీటి కోసం కేంద్రంపై ఎంతగా ఒత్తిడి చేస్తున్నారో రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. కనుక తెదేపా యంపీలు ఇప్పుడు మిత్ర ధర్మం పాటించి సభలో మోడీ ప్రభుత్వాన్ని నిలదీయనంత మాత్రాన్న రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో వారికి ఆసక్తి లేదనో, కాంగ్రెస్, వైకాపాలు నిలదీస్తున్నాయి గనుక వాటికి మాత్రమే ఆసక్తి ఉందనో వాదిస్తే అంతకంటే అవివేకం ఉండబోదు.   తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకొంటూ నిర్దాక్షిణ్యంగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి చేతులు దులుపుకొన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు పోరాడుతున్నామంటూ మళ్ళీ మరోమారు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడుకొనందుకు ఇప్పటికే ఆ పార్టీ చాలా భారీ మూల్యం చెల్లించింది. అయినా ఏమాత్రం సిగ్గు పడకుండా, బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ ఇప్పుడు ‘రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిపోతోంది’ అంటూ మొసలి కన్నీరు కారుస్తూ ఈ కొత్త నాటకానికి తెర తీసింది. ఇదంతా రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. వారు దాని నాటకాలకి మెచ్చి చప్పట్లే చరుస్తారో లేక మళ్ళీ వీపు చిట్లిపోయేలా చరుస్తారో? దానికీ తెలుసు, వారికీ తెలుసు.

బరి తెగించిన కార్పొరేట్ సంస్థలు

  దేశంలో కార్పోరేట్ సంస్కృతి మొదలయినప్పటి నుండి అవి చిన్న చిన్న విద్యా, వైద్య వ్యాపార సంస్థలను కబళించడం ప్రారంభించాయి. ఆ కారణంగా ఆ సంస్థల యజమానులు రోడ్డున పడ్డారు. దేశంలో విద్యా, వైద్య, వ్యాపార రంగాలలో ఇప్పుడు కార్పోరేట్ సంస్థలే పూర్తి పెత్తనం చెలాయిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సామాన్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే చిన్నచిన్న సంస్థలన్నీ ఒకటొకటిగా మూత పడుతుండటంతో వారు విధిలేని పరిస్థితుల్లో కార్పోరేట్ సంస్థలనే ఆశ్రయించవలసి వస్తోంది. విద్యావైద్యాలకు తమను ఆశ్రయిస్తున్న సామాన్య ప్రజలను అవి పూర్తిగా పీల్చి పెప్పి చేసి వదిలిపెడుతున్నాయి.   మన దేశంలో ప్రతీ ఏటా దాదాపు 3.4 లక్షల మంది ప్రజలు ఈ కారణంగా రోడ్డున పడుతున్నట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. అయినప్పటికీ ఈ కార్పోరేట్ సంస్థల దురాశ తీరలేదు. ప్రభుత్వాలని కూడా తమ చెప్పు చేతలలో ఉంచుకొని దేశ సంపదను యధేచ్చగా దోచుకొంటున్నాయి. అందుకు దశాబ్దాల తరబడి సాగిన లక్షల కోట్ల 2జి స్కాములు, బొగ్గు గనుల దోపిడీలే ఉదాహరణలు. దేశ ప్రజలను, దేశ సంపదలను యదేచ్చగా దోచుకొంటున్నప్పటికీ వారి దాహం తీరలేదు. ప్రభుత్వాలే వారి చెప్పు చేతల్లో నడుస్తున్నప్పటికీ వారు బరి తెగించి ప్రభుత్వ కార్యాలయాలలో నుండి కీలకమయిన రహస్య పత్రాలను కూడా దొంగిలించడం మొదలుపెట్టారు. అయితే ఈ సంగతి ఇప్పుడే బయటకు పొక్కినప్పటికీ చాలా కాలంగా, చాలా మంత్రిత్వ శాఖల కార్యాలయాలలో ఇటువంటి వ్యవహారాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు దొంగలు రెడ్-హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.   దేశంలో పేరుమోసిన ఐదు ప్రముఖ సంస్థలకు చెందిన శైలేశ్ సక్సేనా (రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్- మేనేజర్, కార్పొరేట్ అఫైర్స్), వినయ్ కుమార్ (ఎస్సార్-డీజీఎం), కేకే నాయక్ (కెయిర్న్స్ఇండియా-జీఎం), సుభాశ్ చంద్ర (జూబిలెంట్ ఎనర్జీ-సీనియర్ ఎగ్జిక్యూటివ్), రిషిఆనంద్ (రిలయన్స్ అనిల్‌ ధీరూభాయి అంబానీ గ్రూప్-అడాగ్-డీజీఎం) లను శుక్రవారంసాయంత్రం అరెస్ట్ చేశామని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీంద్ర యాదవ్ తెలిపారు. వారి వద్ద ఢిల్లీలోని శాస్త్రి భవన్‌లో ఉన్న పెట్రోలియం శాఖ ప్రధాన కార్యాలయం నుంచి దొంగిలించ బడిన కీలక రహస్య పత్రాల కాపీలను స్వాధీనం చేసుకొన్నట్లు ప్రకటించారు. దేశ సంపదను యదేచ్చగా దర్జాగా దోచుకొంటున్న కార్పోరేట్ సంస్థలకు, వారికి సహకరిస్తున్న మంత్రులు, రాజకీయ నాయకులు, అధికారులకి గానీ ఎటువంటి శిక్షలు విధించలేని దుస్థితిలో మన ప్రభుత్వాలు, చట్టాలు ఉన్నాయి. పైగా వారికి, వారి సంస్థలకి, ఆస్తులకీ కూడా ప్రజాధనంతోనే రక్షణ కల్పించాల్సిన దుస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే వారే ప్రభుత్వాలను శాసిస్తున్నారు గనుక. ఇదెలా ఉందంటే కుక్క తోకను ఊపడం కాక తోకే కుక్కను ఊపుతున్నట్లుంది.

కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బ్రతికించుకోవడం అంటే...

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకొనేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి రామకోటి రాస్తున్నట్లుగా కోటి సంతకాలు సేకరిస్తున్నారు. అయితే “ఆ ప్రయత్నాలన్నీ చచ్చిపోయిన వ్యక్తిని మళ్ళీ బ్రతికించుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాలువంటివేనని” మాజీ కాంగ్రెస్ యంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. “రాష్ట్ర విభజన తరువాత నుండి ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికలను చూసినట్లయితే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమించలేదని స్పష్టంగా అర్ధమవుతోందని, కనుక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి బ్రతికించుకోవాలనుకోవడం వృధా ప్రయాసే” అని ఆయన అన్నారు.   ఆయన చెప్పినమాట అక్షరాల నిజమని ఒప్పుకోక తప్పదు. కానీ రాష్ట్ర ప్రజలు తమ గురించి, తమ కాంగ్రెస్ పార్టీ గురించి ఏమనుకొంటున్నారో గ్రహించకుండా లేక గ్రహించి కూడా గ్రహించనట్లు నటిస్తూ కాంగ్రెస్ నేతలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కోటి సంతకాల కార్యక్రమం మొదలుపెట్టి మళ్ళీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ వారికి కాంగ్రెస్ పట్ల మరింత ఏహ్యత కలిగేలా చేస్తున్నారు.   రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు, వారి భావోద్వేగాలకు వీసమెత్తు విలువీయకుండా మొండిగా రాష్ట్ర విభజన చేసి చేతులు దులుపుకొన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై యుద్దం మొదలుపెట్టింది. అయితే దాని యుద్ధం తనను తాను కాపాడుకోవడానికే తప్ప ప్రజలను, రాష్ట్రాన్ని కాపాడేందుకుకాదని ప్రజలందరికీ తెలుసు. ఆ విషయం కాంగ్రెస్ నేతలకీ తెలుసు. కానీ తెలియనట్లు నటిస్తున్నారు. తమ యూపీయే ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక వరాలు ఇచ్చిందని కానీ వాటిని అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం అమలుచేయడం లేదని కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు.   రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు తాము డిల్లీ వెళ్లి సోనియాగాంధీతో మాట్లాడి ఆమెను వెంటబెట్టుకొని ప్రధాని మోడీని కలిసి ఆయనపై ఒత్తిడి తెస్తామని డప్పు కొట్టుకొంటున్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను తమ ప్రభుత్వం తప్పకుండా అమలుచేస్తుందని ప్రధాని మోడీతో సహా కేంద్రమంత్రులు అందరూ మీడియా సమక్షంలోనే చెపుతున్నారు. అటువంటప్పుడు వారు ఈ విషయంలో అడుగు వెనక్కి వేయలేరని అందరికీ తెలుసు. ఆ సంగతి గ్రహించిన కాంగ్రెస్ నేతలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తామే రాష్ట్రానికి అన్నీ ఇప్పించామని చెప్పుకోవాలనే దురాలోచనతోనే ఈ సరికొత్త నాటకం మొదలుపెట్టారని భావించవచ్చును.   ఆ నాటకం మరింత రక్తి కట్టించేందుకు ఏప్రిల్ నెలలలో రాష్ట్రంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి దానికి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నట్లు తాజా సమాచారం. ఆమె తన ముద్దుల కొడుకు రాహుల్ గాంధీకి ప్రధానమంత్రిగా పట్టాభిషేకం చేసుకోవాలనే తాపత్రాయంతో తన పార్టీకి కంచుకోటవంటి ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని తన చేతులతో తనే రెండు ముక్కలు చేసారు. పైగా తన స్వంత పార్టీ నేతల జీవితాలను కూడా పణంగా పెట్టారు. ఆ కారణంగా లగడపాటి వంటి వారు అనేకమంది శాస్వితంగా రాజకీయాలకి దూరమయిపోవలసి వచ్చింది.   ఆమె చేసిన ఈ ఘనకార్యం వలన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, చివరికి ఇరు రాష్ట్రాల పోలీసులు కూడా కొట్లాడుకొనే దుస్థితి దాపురించింది. తెలంగాణా రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభంలో కూరుకుపోగా, ఆంద్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. కేంద్రం సహయసహకారాలతో రెండు రాష్ట్రాలు ఈ దుస్థితుల నుండి గట్టెక్కేందుకు కృషి చేస్తుంటే మధ్యలో కాంగ్రెస్ నేతలు దూరడమే కాకుండా, ఈ దుస్థితులకు కారకురాలయిన సోనియాగాంధీని కూడా తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తుండటం గమనిస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆమెను తెలంగాణా ప్రజలు స్వాగతిస్తారేమో, గానీ ఆంద్ర ప్రజలు కూడా స్వాగతిస్తారని కాంగ్రెస్ నేతలు ఊహించడం కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు చేసిన తప్పులనే రాష్ట్ర ప్రజలు ఇంతవరకు క్షమించలేదు. అయినా అదేమీపట్టనట్లుగా వారు ప్రజలను మభ్యపెట్టడం చూస్తుంటే వారంతా కలిసి తమ పార్టీ సమాధి కోసమే గొయ్యి త్రవ్వుకొంటున్నట్లుంది.

కేసీఆర్ అందుకే మోడీని పొగుడుతున్నారా?

  ఇంతకు ముందు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ వెళ్లి ప్రధాని మోడీని, కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు సాధించుకు రాకుండా అహంభావం ప్రదర్శిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించేవి. కానీ ఇప్పుడు అవే ప్రతిపక్షాలు ఆయన తన కుమార్తె కవితకు కేంద్రమంత్రి పదవి ఇప్పించుకొనేందుకే డిల్లీకి వెళ్లి మోడీతో భేటీ అయ్యేరని, అందుకే ఆయన ఇప్పుడు మోడీని, ఆయన ప్రభుత్వాన్ని, పధకాలను కూడా తెగ మెచ్చేసుకొంటున్నారని విమర్శిస్తున్నాయి.   ప్రతిపక్షాల ఆరోపణలను తెరాస ఖండించింది. కానీ ఈ విషయంలో బీజేపీ కొంచెం ఆలస్యంగా స్పందించడంతో ఆ ఆరోపణలకు బలం చేకూరింది. ఈ అంశంపై మీడియాలో వస్తున్న వార్తలు, విశ్లేషణలు, చర్చలు కూడా వారి ఆరోపణలకు మరింత బలం చేకూర్చాయి. తెరాస-బీజేపీలు దగ్గరవుతున్నాయని మీడియాలో వస్తున్న వార్తలు తెదేపాకు చాలా ఆందోళన కలిగించేవే. కానీ ఆ పార్టీ ఈ విషయంలో చాలా సంయమనంగా వ్యవహరించి దానిని మరింత పెద్ద సమస్య కాకుండా నివారించగలిగింది. ఆ తరువాతే తెలంగాణా బీజేపీ నేతలు కూడా మేల్కొని ఈ వార్తలను గట్టిగా ఖండించడం మొదలుపెట్టారు.   ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “తెరాసను మా ఎన్డీయే కూటమిలో చేర్చుకొనే ఆలోచన ఏమీ లేదు. అలాగే ఆ పార్టీ యంపీలను ఎవరినీ మా ప్రభుత్వంలో చేర్చుకొనే ఆలోచన కూడా మాకు లేదు,” అని విస్పష్టంగా ప్రకటించారు. కానీ తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్ రావు వేరేలా చెప్పారు. “ఎన్డీయేలో చేరి కేంద్రమంత్రి పదవి పొందేందుకు తెరాస అధ్యక్షుడు కేసీఆర్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని” అన్నారు.   అంటే అటువంటి ప్రయత్నాలు జరిగినట్లే అర్ధమవుతోంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తెరాసతో జత కట్టడం వలన బీజేపీకి ఒరిగేదేమీ ఉండబోదు, పైగా తెదేపాతో దాని సంబంధాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. కానీ తెరాస మాత్రం దాని వలన పూర్తి లబ్దిపొందగలదని ఖచ్చితంగా చెప్పవచ్చును. కనుక ఒకవేళ బీజేపీ కూడా అటువంటి ఆలోచన చేసినా ప్రస్తుతానికి విరమించుకొని ఉండవచ్చును. కానీ భవిష్యత్తులో ఆ ఆలోచనచేసే అవకాశం ఉందని జరుతున్న ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక తెదేపా కూడా అందుకు మానసికంగా, రాజకీయంగా సంసిద్దమవ్వవలసి ఉంటుంది.   అయితే సమయం కాని సమయంలో ఇటువంటి పరిణామాలు జరగడం, వార్తలు వెలువడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణాలో బలపడాలని ప్రయత్నిస్తున్న తెదేపా నేతలను, కార్యకర్తల మనోస్తయిర్యాన్ని దెబ్బతీసి వారి ప్రయత్నాలను అడ్డుకోనేందుకే కేసీఆర్ ఈవిధమయిన ఎత్తు వేసారా? అందుకే ఆయన మోడీకి దగ్గరవుతున్నట్లు నటిస్తున్నారా? అందుకే ఆయన మోడీని పొగడం మొదలుపెట్టారా? అనే అనుమానాలు కూడా లేకపోలేదు.   ఏదో ఒక ఉద్దేశ్యంతోనొ లేక కారణం చేతనో ఈరోజు మోడీని పొగుడుతున్న కేసీఆర్, రేపు రాష్ట్రానికి నిధులు విడుదల చేయకపోయినా లేదా వివిధ ప్రాజెక్టుల గురించి తను చేసిన డిమాండ్లను కేంద్రం పట్టించుకోకపోయినా, మళ్ళీ అదే నోటితో మోడీకి శాపనార్ధాలు పెట్టినా ఆశ్చర్యం లేదని ఆయన తీరుని నిశితంగా గమనిస్తున్న వారికి తెలుసు. ఏది ఏమయినప్పటికీ ఈ పరిణాలను తెదేపా ఒక హెచ్చరికగా స్వీకరించి తన జాగ్రత్తలో తాను ఉండటమే మంచిదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

ఎన్డీఏ కూటమిలో టీఆర్ఎస్ చేరితే..?

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమార్తె కవితకి కేంద్ర మంత్రి పదవి ఇప్పించుకొనేందుకే ప్రధాని నరేంద్ర మోడీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే ఇప్పుడు ఆయనను కేసీఆర్ తెగ పొగిడేస్తున్నారని టీ-కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. అలాగ నిప్పు పుట్టింది కనుక ఈ అంశంపై మీడియాలో కూడా పొగలు రావడం మొదలయ్యాయి.   కానీ తెరాస నేతలు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు. తాము ఈ విషయం గురించి కేంద్రంలో ఎవరినీ సంప్రదించలేదని, అదేవిధంగా కేంద్రం కూడా తమను సంప్రదించలేదని వారు చెపుతున్నారు. కానీ ఈ వార్తలకు కేంద్రబిందువుగా ఉన్న నిజామాబాద్ యంపి కవిత మాత్రం ఈ వార్తలను నిర్ద్వందంగా ఖండింలేదు. అలాగని సమర్ధించ లేదు కూడా. ఆమె ఒక ప్రముఖ తెలుగు పత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో “తెరాసకు, తెలంగాణా రాష్ట్రానికి ఏది మంచిదో ఏది కాదో నా తండ్రి కేసీఆర్ కి తెలిసినట్లు మరెవరికీ తెలియదు. కనుక మేమందరం కూడా మారు మాట్లాడకుండా ఆయన తీసుకొన్న నిర్ణయాలను అమలుచేస్తాము,” అని చెప్పారు. కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లు ఆమె చెప్పిన ఈ జవాబే సందేహాలను మరింత పెంచుతోంది.   తెరాస-బీజేపీల మధ్య కేవలం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధాలు తప్ప వాటి మధ్య ఎటువంటి పొత్తులు లేవు. అదీగాక కేసీఆర్ నిన్న మొన్నటి వరకు కూడా మోడీకి, ఆయన ప్రభుత్వానికి కూడా తిట్లు, శాపనార్ధాలు పెడుతూనే ఉన్నారు. కనుక సహజంగానే మోడీ మంత్రివర్గంలో కవితకు అవకాశం ఉండబోదు. కానీ ఒకవేళ మోడీ ఆమెను తన మంత్రివర్గంలోకి తీసుకొన్నట్లయితే అది చాలా అసాధారణమయిన విషయమే అవుతుంది. అంతే కాదు అది భవిష్యత్తులో మారబోయే రాజకీయ సమీకరణాలకి మొదటి సంకేతంగా భావించవచ్చును.   ఒకవేళ ఆమెను మంత్రివర్గంలోను, తెరాసను ఎన్డీయే కూటమిలోనూ చేర్చుకొనేందుకు బీజేపీ సిద్దపడినట్లయితే, అప్పుడు తెదేపా-బీజేపీల మధ్య పొత్తుల గురించే మొట్ట మొదట ఆలోచించవలసి వస్తుంది. ఒకవేళ బీజేపీ తెలంగాణా లో తెదేపాతో తెగ తెంపులు చేసుకొని తెరాసతో జత కట్టదలిస్తే, అప్పుడు తెదేపా పరిస్థితి ఏమిటి? అందుకు ప్రతిగా ఆ పార్టీ ఆంధ్రాలో బీజేపీతో తెగ తెంపులు చేసుకొంటుందా? లేకపోతే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బీజేపీతో రాజీపడి మౌనంగా ముందుకు సాగుతుందా? అనేది వేచి చూడాలి.   ప్రధాని మోడీ కవితను తన మంత్రివర్గంలో తీసుకొన్నా తీసుకోకపోయినా బీజేపీ యొక్క భవిష్య ప్రణాళికలు, తెదేపా పట్ల దాని వైఖరిని అర్ధం చేసుకోవడానికి జీ.హెచ్.యం.సి ఎన్నికల వరకు ఆగితే చాలు. ఆ రెండు పార్టీల మధ్య పొత్తులా లేక కత్తులా అనేది తేలిపోతుంది. ఒకవేళ తెలంగాణాలో తెదేపాతో కటిఫ్ చెప్పేసినప్పటికీ, ఆంధ్రాలో మాత్రం ఒకరి అవసరం మరొకరికి ఉంది కనుక ఆ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల వరకు పొత్తులు కొనసాగించవచ్చును.

ఏపీకి కేంద్ర నిధులొచ్చే ఛాన్సుందా?

  తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చాలా దూరదృష్టితో ఆలోచించి బీజేపీతో చేతులు కలిపారు. ఆయన ఊహించినట్లే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి వచ్చేయి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో ఇరు పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి గనుక విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాల సహాయం చేస్తుందని అందరూ ఆశించారు. ఆయన ముఖ్యమంత్రిగా అధికారం చేప్పట్టక ముందు నుండి నేటి వరకు కూడా ఒక పద్ధతి ప్రకారం డిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు కేంద్రం హామీలను అమలుచేస్తామని హామీ ఇవ్వడం మినహా పెద్దగా ఇచ్చింది ఏమీ లేదు. కొన్ని రోజుల క్రితం రూ.850 కోట్లు మంజూరు చేసింది. కానీ అది పుండు మీద కారం చల్లినట్లయింది. దానితో చంద్రబాబు కూడా కొంత ఘాటుగానే మాట్లాడలసి వచ్చింది.   ఆ తరువాతే కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ త్వరలో మరిన్ని నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెపుతూ ఆశపెట్టిన వెంకయ్య నాయుడు అది సాధ్యం కాదని కుండబ్రద్దలు కొట్టారు. గానీ మళ్ళీ ఇప్పుడు ఆ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని మాట మార్చారు.   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి అప్పుడే 9 నెలలు గడిచిపోయాయి. కానీ ఆంధ్రాలో ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. తెదేపా-బీజేపీల మధ్య మంచి సంబందాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో వారు భాగస్వాములుగా ఉన్నప్పటికీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు, ప్రత్యేక హోదా ఇవ్వడంలో ఇంత జాప్యం జరుగుతుండటంతో తెదేపా ప్రభుత్వంపై కూడా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇస్తామని చెపుతున్న ఎన్డీయే ప్రభుత్వం తమ భాగస్వామి అయిన తెదేపా ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడుని మరి ఇన్నిసార్లు డిల్లీ చుట్టూ ఎందుకు త్రిప్పించుకొంటోందో...ఆయన అంతగా తిరుగుతున్నా రాష్ట్రానికి నిధులు ఎందుకు విడుదల చేయడం లేదో తెలియదు.   చంద్రబాబు, కేసీఆర్ ఇరువురు కూడా మళ్ళీ మోడీని వేరువేరుగా కలిసి  మరోమారు ఆయనకి తమ తమ రాష్ట్రాల పరిస్థితులు వివరించి కేంద్ర సహాయం అర్ధించారు. ఇటీవల కాలంలో మోడీ, కేసీఆర్ బాగా దగ్గరవుతున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దానివలన తెలంగాణా రాష్ట్రానికి చాలా మంచి జరుగుతుందని ఆశించవచ్చును. తమతో మంచి సంబంధాలు కలిగి ఉన్న తెదేపా అధినేతని పట్టించుకోని ఎన్డీయే ప్రభుత్వం మరి నిన్న మొన్నటి వరకు తమపై కత్తులు దూసిన కేసీఆర్ అభ్యర్ధనలు మన్నిస్తుందా...లేదా? అనేది త్వరలోనే తేలిపోతుంది. తెదేపా-తెరాస-బీజేపీల మధ్య సంబంధాలలో ఎటువంటి మార్పులు ఏర్పడుతున్నప్పటికీ, రాష్ట్ర విభజన వలన తీవ్రంగా నష్టపోయి తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం ఉదారంగా ఆదుకొంటే ప్రజలు కూడా దానిని గుర్తించి ఆ పార్టీని కూడా అక్కున చేర్చుకొంటారు. అలాకాక ఒకవేళ మోడీ ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇలాగే అరకొరగా నిధులు విదిలిస్తుంటే, ప్రాంతీయ పార్టీ అయిన తెదేపా ఎలాగో ఒకలా ఈ సమస్యల నుండి గట్టెక్కగలదు. కానీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరించాలని తహతహలాడుతున్న బీజేపీ మాత్రం ప్రజాగ్రహానికి గురికావలసి వస్తుంది.   ఈ సంగతి బీజేపీకి తెలియకపోదు. కానీ తెలిసి కూడా ఎందుకు తాత్సారం చేస్తోందో తెలియదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడయిన జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న డిల్లీ వెళ్లి రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల గురించి కేంద్రాన్ని అభ్యర్ధించి వచ్చేరు. కనుక రాష్ట్ర బీజేపీ నేతలు మిత్రపక్షమయిన తెదేపా ప్రభుత్వానికి చురకలు వేసేందుకు చూపుతున్న శ్రద్ధని రాష్ట్రానికి నిధులు తేవడం కోసం తమ అధిష్టానంపై ఒత్తిడి చేసేందుకు చూపితే ప్రజలు కూడా సంతోషిస్తారు.

రెండు రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించాలట!

  మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బీజేపీలో చేరబోతున్నారంటూ నిన్న మొన్నటి వరకు మీడియాలో వార్తలు వచ్చేయి. కానీ ఆయన ఆ వార్తలు నిర్ద్వందంగా ఖండించకుండా “ఎన్నికలలో ఓడిపోయిన నన్ను ఎవరు ఏ పార్టీలో జేర్చుకొంటారు?” అని ఎదురు ప్రశ్నించారు. అంటే ఎవరయినా చేర్చుకొంటే చేరేందుకు సిద్దమనే స్పష్టమయిన సంకేతం ఇచ్చేరు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విజయవాడకు వచ్చినప్పుడే ఆయనతో సహా అనేకమంది సీనియర్ కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరుతారని అందరూ భావించారు. కానీ ఎందువల్లో చేరలేదు.   బీజేపీలోకి ఎంట్రీ దొరకకపోవడంతో అటువంటి నేతలు అందరూ మళ్ళీ కాంగ్రెస్ టోపీలు బయటకు తీసి దుమ్ము దులిపి వాటిని జనాల నెత్తిన పెట్టే ప్రయత్నాలో రాష్ట్రమంతా కలియతిరిగేస్తూ తెగ హడావుడి చేస్తున్నారు. వారిలో బొత్స సత్యనారాయణ కూడా ఒకరు.   తమ యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన తరువాత వచ్చే సమస్యలన్నిటికీ పరిష్కారాలు రాష్ట్ర పునర్విభజన బిల్లులో పొందుపరిచిందని, కానీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాటిని పట్టించుకోకుండా నిత్యం ఏదో ఒక అంశం మీద కయ్యాలకు దిగుతున్నారని, అందువలన ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేంత వరకు రెండు రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేసారు. గవర్నర్ సమక్షంలో అన్ని సమస్యలను పరిష్కరించుకొనే అవకాశం ఉన్నప్పటికీ అందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వాటి ముఖ్యమంత్రులు ప్రయత్నించడంలేదని కనుక రాష్ట్రపతి పాలన విధించడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.   కాంగ్రెస్ అధిష్టానం తన రాజకీయ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని చాలా హడావుడిగా రాష్ట్రవిభజన చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరే వారించారు. ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా హడావుడిగా రాష్ట్ర విభజన చేసినట్లయితే ఇటువంటి సమస్యలు వస్తాయని, పైగా రాష్ట్రంలో పార్టీ తుడిచిపెట్టుకు పోతుందని కూడా ఆయన పదేపదే హెచ్చరించారు. కనుక విభజన తరువాత తలెత్తే అన్ని సమస్యలకు తగిన ఏర్పాట్లు చేసిన తరువాతే రాష్ట్ర విభజన చేయమని ఆయన హితవు పలికారు. బొత్స, చిరంజీవి, ఆనం వంటి కాంగ్రెస్ నేతలందరూ కేవలం ప్రజాగ్రహానికి గురి కాకూడదనే ఆలోచనతోనే ఆనాడు ఆయనతో గొంతు కలిపారు. కానీ ఆ సమయంలో కూడా వారందరూ కూడా ఒకవైపు తమ అధీష్టానాన్ని మంచి చేసుకొని కిరణ్ కుమార్ రెడ్డి స్థానాన్ని ఆక్రమించాలని చూసారు తప్ప రాష్ట్ర విభజనను అడ్డుకొనేందుకు ప్రయత్నించలేదు. ఇల్లు కాలిపోయిందని ఒకడు ఏడుస్తుంటే, చుట్టకు నిప్పు దొరికిందని సంభరపడినట్లు వారందరూ వ్యవహరించారు. అందుకే అపజయమన్నదే ఎన్నడూ ఎరుగని బొత్స సత్యనారాయణ తో సహా కాంగ్రెస్ నేతలందరినీ రాష్ట్ర ప్రజలు చాలా కటినంగా శిక్షించారు. ఆ సంగతి వారికీ తెలుసు.   కానీ వారందరూ తమ పార్టీ చేసిన ఆ పొరపాటుకి ఎటువంటి పశ్చాతాపం వ్యక్తం చేయకపోగా, రాష్ట్ర విభజన చేసి ప్రజలను ఉద్దరించినట్లు నిర్లజ్జగా చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా తమ యూపీఏ ప్రభుత్వం చేసిన అని హామీలను కేంద్రప్రభుత్వం అమలుచేయడం లేదంటూ కోటి సంతకాల కార్యక్రమం ఒకటి మొదలు పెట్టారు కూడా. రెండు రాష్ట్రాలలో కొలువు తీరి ఉన్న ప్రజాప్రభుత్వాలను పక్కను బెట్టి రాష్ట్రపతి పాలన విధించమని డిమాండ్ చేయడం సిగ్గు చేటు.   ఎన్నికలకు ముందు, తరువాత అవకాశం వస్తే ఏ పార్టీలోకి దూకేద్దామాని చూసిన కాంగ్రెస్ నేతలందరూ ఏ పార్టీలోను చేరే అవకాశం లేకపోవడంతో తమ రాజకీయ భవిష్యత్ కాపాడుకొనే ప్రయత్నంలో విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ టోపీలు పెట్టుకొని ఇలా మీడియా ముందుకు హడావుడి చేస్తున్నారు. కానీ వారు ఎంత హడావుడి చేసినా రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం కల్ల. కానీ వేరే మార్గమేదో దొరికేవరకు ఇలా మీడియా ముందుకు వచ్చి హడావుడి చేయకపోతే ప్రజలు కూడా మరిచిపోవచ్చును. లేదా తమ స్థానాన్ని మరొకరెవరయినా ఆక్రమించే ప్రమాదం ఉంది. అందుకే హడావుడి చేస్తున్నారు. ప్రజలు కూడా వారి బాధను సహృదయంతో అర్ధం చేసుకోక తప్పదు మరి.

ప్రజలకు మార్గదర్శనం చేయవలసిన ప్రభుత్వాలే కొట్లాడుకొంటే...

  నాగార్జునసాగర్ డ్యాం వద్ద ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాల పోలీసులు, నీటి పారుదల శాఖ అధికారులకు మధ్య నిన్న చిన్నపాటి యుద్ధమే జరిగిందని చెప్పవచ్చును. ఒకవైపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీటి పారుదల శాఖ మంత్రులు, అధికారులు గవర్నర్ సమక్షంలో రాజ్ భవన్ లో నేడు సమావేశామవుతున్న తరుణంలో కూడా సాగర్ డ్యాం వద్ద మళ్ళీ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.   హడావుడిగా రాష్ట్ర విభజన చేసినట్లయితే నీళ్ళ కోసం, విద్యుత్ కోసం ఇరు రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వాలు కొట్లాడుకొనే రోజు తప్పకుండా వస్తుందని ఆనాడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదేపదే గట్టిగా హెచ్చరించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయన హెచ్చరికలను పెడచెవిన పెట్టి, తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే చూసుకొని ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండానే రాష్ట్ర విభజన చేసి చేతులు దులుపుకొంది. “శత్రు దేశాలయిన చైనా, పాకిస్తాన్ లతోనే నదీ జలాలు పంచుకోగలుగుతున్నప్పుడు, తోటి తెలుగువారితో పంచుకోవడంలో కష్టం ఏముంటుంది?” అని ఆనాడు రాష్ట్ర విభజన కోసం పోరాడిన తెరాస, కాంగ్రెస్ నేతలందరూ ప్రశ్నించారు. కానీ వారందరూ ఇప్పుడు ఈ దురదృష్టకర సంఘటనలు నివారించలేకపోగా అందరూ ఆ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన విషపరిణామాలన్నీ ఇప్పుడు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి.   అయితే ఈ సమస్యలు పరిష్కరించలేనివి మాత్రం కావు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ మధ్య, తమ పార్టీల మధ్య ఉన్న వ్యక్తిగత, రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి ప్రయత్నిస్తే తప్పకుండా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ప్రజలకు మార్గదర్శనం చేసి రాష్ట్రాలను అభివృద్ధి పధంలో నడిపించవలసిన ప్రభుత్వాలే ఈవిధంగా పోరాడుకొంటుంటే యధా రాజ తధా ప్రజా అన్నట్లుగా ఇరు రాష్ట్రాల అధికారులు, చివరికి పోలీసులు కూడా శత్రుదేశాల వలే పోరాడుకోవలసిన దుస్థితి ఏర్పడితే అందుకు ప్రభుత్వాలని, వాటిని నడిపిస్తున్న తెదేపా, తెరాస అధినేతలనే తప్పుపట్టవలసివస్తుంది.   కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకొని రాష్ట్ర విభజన చేసినందుకు ఇరు రాష్ట్రాల ప్రజలు దానిని చాలా నిర్దయగా కటినంగా శిక్షించారు. ఇప్పుడు తెదేపా, తెరాసలు కూడా తమ పార్టీ ప్రయోజనాలను మాత్రమే చూసుకొంటూ ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించడంలో విఫలమయితే అవి కూడా ప్రజాగ్రహానికి గురి కావడం తధ్యం.   కనుక అటువంటి పరిస్థితి చేజేతులా కొనితెచ్చుకోకుండా, ఇరువురు ముఖ్యమంత్రులు తమ పంతాలు, పట్టింపులు, బేషజాలు, రాజకీయ వైరాలను పక్కనబెట్టి కొంత పట్టువిడుపు ధోరణిలో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనే ప్రయత్నాలు చేయడం చాలా అవసరం. అదే వారి పార్టీలకు, ప్రభుత్వాలకి, ప్రజలకీ అందరికీ మంచిది.

రాజధాని భూసేకరణ పూర్తి చేయగలిగితే చాలు

  రాజధాని భూసేకరణకు ఈనెల 14వ తేదీతో గడువు ముగుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 30, 000 ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకొంటే, ఇంతవరకు 19,000 ఎకరాలు సేకరణకు రైతుల నుండి అంగీకర పత్రాలు పొందగలిగింది. కనుక మిగిలిన భూసేకరణకు మరొక రెండు వారాలు గడువు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. తుళ్ళూరు మండలంలో దాదాపు తొమ్మిది గ్రామాలలో రైతులు తమ భూములు ఇచ్చేందుకు అయిష్టత చూపుతున్నందున భూసేకరణ ఆలశ్యమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం బలవంతంగా వారి భూములు స్వాధీనం చేసుకొనే ఆలోచనలో లేదు. వారికి ఏదో విధంగా నచ్చజెప్పి భూసేకరణ ప్రక్రియ సజావుగా పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ అప్పుడు కూడా వారు అంగీకరించకపోయినట్లయితే తప్పనిసరి పరిస్థితుల్లో భూసేకరణ చట్టాన్ని ప్రయోగించవలసి రావచ్చును. కానీ ఒకవేళ ప్రభుత్వం అందుకు పూనుకొంటే తుళ్ళూరు గ్రామాల ప్రజలకు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ అండగా నిలబడి న్యాయపోరాటం చేస్తామని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెపుతున్నాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో చాలా ఆచితూచి అడుగుముందుకు వేయవలసి ఉంటుంది. లేకుంటే రాజధాని నిర్మాణం సంగతి అటుంచి కోర్టు కేసులతోనే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోవచ్చును.   ఒకవేళ ప్రభుత్వం అందుకూ సిద్దపడినా, మరో ప్రమాదం కూడా పొంచి ఉంది. సరిగ్గా ఇటువంటి అవకాశం కోసమే చాలా కాలంగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్, వైకాపాలు రెండూ కూడా ఈ వ్యవహారానికి రాజకీయ రంగులద్ది చంద్రబాబుపై రైతు వ్యతిరేకి ముద్ర వేసే ప్రయత్నాలు చేయవచ్చును. దానివలన ఆయనకు ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం ఏమీ ఉండబోదు కానీ ఎన్నికల సమయంలో ఆ ప్రభావం తప్పక ఉంటుంది.   రాజధాని నిర్మాణానికి అన్నీ ఏర్పాట్లు చేసుకొన్నాక ఇప్పుడు వెనక్కి తగ్గడం కూడా సాధ్యం కాదు. గనుక తప్పనిసరిగా రైతుల నుండి మిగిలిన 11, 000 ఎకరాల భూమిని కూడా సేకరించవలసి ఉంటుంది. అప్పుడే రాజధాని నిర్మాణ పనులు మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. తొమ్మిది గ్రామాలలో రైతులు తమ భూములను ఇచ్చేందుకు వ్యతిరేకిస్తున్నారు కనుక, ఇంతవరకు సేకరించిన 19,000 ఎకరాలలోనే రాజధాని ప్రధాన ప్రాంతం నిర్మించే విధంగా ప్రణాళికలు మార్చుకొనేందుకు ప్రభుత్వం సిద్దపడినా, అప్పుడు భూములు ఇచ్చిన రైతులు కూడా మొరాయించే అవకాశాలుంటాయి. కనుక ఏవిధంగా చూసినా మిగిలిన భూసేకరణలో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పక పోవచ్చును.   ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయని అందరూ ముందే ఊహించారు. కానీ వాటిని చంద్రబాబు ఏవిధంగా పరిష్కరించుకొంటారో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులను ఒప్పించి వారితో ఎటువంటి ఘర్షణ లేకుండా ఈ భూసేకరణ ప్రక్రియను పూర్తిచేయగలిగితే చంద్రబాబు నాయుడు మరిక వెనుతిరిగి చూసుకొనే పనే ఉండదని చెప్పవచ్చును.   రాజధాని ప్రధాన ప్రాంతం అభివృద్ధికి, అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్, మంత్రులు, అధికారుల కార్యాలయాలు, గృహసముదాయాల నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చు తానే భరిస్తానని కేంద్రం ఇప్పటికే హామీ ఇచ్చింది. సింగపూర్ మరియు జపాన్ దేశాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ శరవేగంగా అత్యాధునిక రాజధాని నిర్మాణం చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక్క సమస్యను నేర్పుగా అధిగమించవలసి ఉంటుంది.   వచ్చే ఎన్నికల నాటికి రాజధాని ప్రధాన నగర నిర్మాణం, వైజాగ్, విజయవాడ నగరాలలో మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణం, ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటు, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీని ఉపయోగించుకొని వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రా జిల్లాలలో పారిశ్రామిక అభివృద్ధి చేయగలిగినట్లయితే తెదేపా నిర్భయంగా ప్రజలను ఓట్లు అడగి మళ్ళీ అధికారంలోకి రావచ్చును.

చంద్రబాబు వరంగల్ పర్యటనతో తెరాసకి టెన్షన్ ఎందుకు?

  తెలంగాణా రాష్ట్రంలో మరే ఇతర పార్టీ తనకు పోటీగా ఉండకూడదని, రాష్ట్రాన్ని ఏకచత్రాధిపత్యంగా తానే పరిపాలించుకోవాలనే తెరాస కోరిక పెద్ద రహస్యమేమీ కాదు. అందుకోసం ఒక్కో రాజకీయ పార్టీపై ఒక్కో ముద్ర లేదా ఏదో ఒక ఆరోపణ చేస్తూ ఆకారణంగా అవేవి తెలంగాణాలో అడుగుపెట్టే అర్హత కోల్పోయాని వాదిస్తుంటారు తెరాస నేతలు. వారు మాట్లాడుతున్న మాటలు వింటుంటే తెలంగాణా రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కాక రాజరిక పరిపాలన సాగుతోందా? అనే అనుమానం కలగడం సహజం.   ఈరోజు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వరంగల్ జిల్లాలో తన పార్టీ నేతలతో కార్యకర్తలతో సమావేశమయ్యేందుకు బయలుదేరుతుండటంతో, ఆయన ముందుగా తెలంగాణా రాష్ట్రానికి నీళ్ళు, విద్యుత్ పంపకాలపై తన వైఖరి ఏమిటో స్పష్టం చేసిన తరువాతనే తెలంగాణాలో అడుగుపెట్టాలని తెరాస నేతలు వాదిస్తున్నారు. ఒకవేళ ఆయన నిజంగా నీళ్ళు విద్యుత్ విషయంలో తెలంగాణా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని తెరాస నేతలు భావిస్తున్నట్లయితే, అదే విషయాన్నీ వారు తమ ప్రజలకు చెప్పుకొని ప్రజాస్వామ్యబద్దంగా తెదేపాను ఎన్నికలలో ఎదుర్కొని ఓడించవచ్చును. లేదా తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి వారిని తమవైపుకు త్రిప్పుకోవచ్చును. ఈవిధంగా ఆయనను నిలదీయడం ద్వారా తెదేపా, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పట్ల ప్రజలలో విముఖత కల్పించవచ్చనే అపోహలో తెరాస నేతలున్నట్లున్నారు. కానీ ఒకవిధంగా తెరాస నేతలే చంద్రబాబు నాయుడు పర్యటనకి తాము చాలా ప్రాధాన్యత ఇస్తున్నామని చాటి చెప్పుకొంటున్నట్లుంది తప్ప తెదేపాను రాజకీయంగా ఎదుర్కొంటున్నట్లు లేదు.   చంద్రబాబు నాయుడు తెలంగాణా రాష్ట్రంలో పర్యటిస్తే ఏదో ఉపద్రవం వస్తున్నట్లుగా ఇంతగా భయపడిపోయి తెరాస నేతలు మూకుమ్మడిగా ఆయనపై విమర్శలు గుప్పిస్తూ, ఆయన పర్యటనను అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తే, దాని వలన తెరాస నేతలు చాలా అభద్రతాభావంతో ఉన్నట్లుగా ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయి తప్ప వారు ఆశించిన ప్రయోజనం నెరవేరదు. వైకాపా నేత షర్మిల తెలంగాణాలో తమ పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకొనేందుకు పరామర్శయాత్రలు చేస్తుంటే అసలు పట్టించుకోని తెరాస నేతలు, చంద్రబాబు నాయుడు తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి వస్తుంటే ఇంత తీవ్రంగా స్పందించడం చూస్తుంటే అదే భావం కలుగుతోంది.   ప్రస్తుతం తెరాస పార్టీయే తెలంగాణాలో అధికారంలో ఉంది. మిగిలిన ఈ నాలుగున్నరేళ్ళలో తెలంగాణా రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపించినట్లయితే అప్పుడు ప్రజలు మళ్ళీ తెరాసకే పట్టం కడతారు. ఒకవేళ అది సాధ్యం కాదనుకొంటే తెరాస పార్టీని గ్రామస్థాయి నుండి పటిష్టపరుచుకోగలిగినా ఈవిధంగా ఇతర పార్టీలను చూసి అభద్రతాభావానికిలోను కావలసిన అవసరం ఉండదు. కానీ ఇతర రాజకీయ పార్టీలు ఏవీ తనకు పోటీ ఉండకపోతే తను అధికారం నిలుపుకోవచ్చనే భ్రమలో తెరాస ఉంటే అదే నష్టపోతుంది. ఎందుకంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అది సాధ్యం కాదు కనుక.

ఏపీ బీజేపీకి గుండెదడ

  ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంతో కేంద్రంలో బీజేపీకే గుండెదడ మొదలైంది. ఆత్మ పరిశీలన ప్రారంభమైంది. మొన్నటి వరకూ మోడీ హవా అని అంటున్నవాళ్ళు ఇక ఆ మాట మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. ఢిల్లీలో ఓటమి నరేంద్రమోడీ పరిపాలనకు రెఫరెండం కాదు అని సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఢిల్లీలో ఓటమికి మోడీ కారణం కాదు.. నేనే కారణం అని కిరణ్ బేడీ ఒకటికి నాలుగుసార్లు నేరాన్ని తన నెత్తిమీద వేసుకోవాల్సి వచ్చింది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు... కేంద్రంలోనే బీజేపీకి గుండెదడ మొదలైతే, రాష్ట్రాల్లో వున్న బీజేపీ నాయకత్వానికి గుండె దడ మొదలవకుండా వుంటుందా? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ నాయకత్వానికి ఆల్రెడీ గుండె దడ మొదలైపోయింది.   ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలో భాగస్వామిగా వుంది. కొంతమంది ఎంపీలు, కొంతమంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి వున్నారు. అయితే ఇదంతా రాష్ట్రంలో బీజేపీకి ఉన్న బలానికి నిదర్శనమా అంటే... లేదనే సమాధానం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు ఎంత కారణమో, భారతీయ జనతా పార్టీ కూడా అంతే కారణం. అయితే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీని ఎందుకు ఆదరించారంటే అది బీజేపీ గొప్పతనం కాదు... తెలుగుదేశం పార్టీతో స్నేహం చేయడం వల్ల అబ్బిన పరిమళం.   ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీతో స్నేహం చేస్తూనే బీజేపీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్రంలో బలపడే ప్రయత్నాలు మొదలుపెట్టింది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో కూడా అధికారం కోసం తెలుగుదేశంతో పోటీ పడగలదన్న సంకేతాలు ఇచ్చింది. తెలుగుదేశం మినహా ఇతర పార్టీలకు చెందిన నాయకులను బీజేపీలోకి ముమ్మరంగా చేర్చుకుంది. అయితే బీజేపీ ఏపీలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోందే తప్ప రాష్ట్రానికి కేంద్రం నుంచి రావలసిన నిధుల విషయంలోగానీ, తెలంగాణతో వున్న వివాదాల విషయంలోగానీ, ప్రత్యేక హోదా విషయంలోగానీ సహకరించడం లేదన్న అభిప్రాయం ఏపీ ప్రజల్లో ఏర్పడింది. మొన్న కేంద్రం విదిల్చిన ప్యాకేజీ కూడా ఏపీ ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఫలితాలు వెలువడటం, ఆ ఫలితాలు బీజేపీకి పూర్తి వ్యతిరేకంగా వుండటం బీజేపీ కేంద్ర నాయకత్వంతోపాటు రాష్ట్ర నాయకత్వానికి కూడా షాకిచ్చింది. అతి కొద్దికాలంలోనే బీజేపీ ఢిల్లీ ప్రజలకు ఎలా దూరమైపోయిందో, తమ వ్యవహార శైలిని ఇలాగే కొనసాగిస్తే ఏపీలో కూడా తమ పరిస్థితి ఢిల్లీ తరహాలోనే అయ్యే ప్రమాదం వుందన్న గుండెదడ బీజేపీ ఏపీ నాయకత్వంలో మొదలైంది. గతంలో మాదిరిగా అలసత్వం వహించకుండా ఏపీకి అందాల్సిన ప్రయోజనాల గురించి కాస్త సీరియస్‌గా ఆలోచించాలని కేంద్ర నాయకత్వాన్ని హెచ్చరించాన్న ఆలోచనలో ఏపీ బీజేపీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది.