టి కాంగ్రెస్ గుస్సా

  కేంద్ర మంత్రి వర్గంలో తమకు చోటు దక్కక పోవడం పై తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలు మండిపడుతున్నారు. ముఖ్యంగా మందా జగన్నాదం నాలుగు సార్లు ఎంపిగా తాను గెలిచి నప్పటికీ ఎస్సీకోటాలో అధిష్టానం తనను గుర్తించనందుకు ఆగ్రహంగా ఉన్నారు.  నిజమాబాద్ ఎంపి మధుయాష్కీ కూడా చెప్పుకోవడానికే రాహుల్ గాంధీ తన ప్రెండ్ అని గాని తనకు ఒరిగిందేమి లేదని గుర్రుగా ఉన్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు. హైకమాండ్ విధేయతే గీటు రాయిగా ఉన్నందున తనకు బిసి కోటాలో పదవి ఖాయం లనుకున్నై వి హనుమంతరావు కూడా ఆశపడ్డారు కాని నిరాశే ఎదురయ్యింది. అలాగే నల్గొండ ఎంపి గుత్తా సుఖేందర్రెడ్డి, సికింద్రాబాద్ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ హైకమాండ్ మీద ఆగ్రహంగా ఉన్నట్లు తెలుసింది. కాంగ్రెస్ వర్గాలు మాత్రం తెలంగాణ విషయంలో డిల్లీ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోనందుకే ఇలా జరిగిందని భావిస్తున్నారు. తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించిన కేశవరావు పరిస్థితి కూడా ఇలాగే వుంది. రాజ్యసభ సభ్యుడిగానూ నియమించకుండా సిడబ్లూసీనుండి కూడా తప్పించినట్లు పార్టీ నాయకులు తలపోస్తున్నారు. తెలంగాణ ఇచ్చేది మేమే, తెలంగాణ తెచ్చేది మేమే అని ప్రగల్బాలు పలికిన తెలంగాణ ఎంపిల పై గుక్క తిప్పుకోని వేటు పడింది. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గోన్న వారినెవరినీ అధిష్టానం ఖాతరు చెయ్యలేదు. ఇప్పుడు ప్రజలకు తాము ఏమి చెప్పాలో తెలియక తికమక పడుతున్నారు

రాహుల్ స్ట్రాటజీ

  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేయించిన మంత్రుల్లో ఎక్కువ మంది వారసత్య రాజకీయాలనుండి వచ్చినవారే కనబడ్డారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పాత వారికి పదవులు ఇవ్వకపోవడం పై రాహుల్ ఎదురయ్యే పరిస్దితులను ఏ మాత్రం లక్ష్య పెట్టటం లేదని తెలుస్తుందని రాజకీయ మేధావులు చెబుతున్నారు. ముందు సీనియర్లను శాంత పరచి తర్వాత పదవుల పంపకం జరిగితే బాగుండేదని సీనియర్ నాయకుల ఉవాచ.   అటు తెలంగాణ కు అనుకూలంగా గాని, ఇటు సమైఖ్యాంద్ర ఉద్యమ నాయకులను గాని రాహుల్ మంత్రి పదవిలోకి తీసుకొనే ప్రయత్నం చేయలేదని చెబుతున్నారు. ఈ మద్యకాలంలో కావూరి సమైఖ్యాంద్రలో పాల్గొనడం వల్లే పదవి పొందలేకపోయారని రాజకీయ నాయకులు అంచనా వేస్తున్నారు.   విధేయత కంటే విశ్వాసానికి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చారని రాజకీయ వర్గాల బోగట్టా. స్వంత వ్యాపారాలకు కాకుండా పార్టీకి ఉపయోగ పడతారను కున్న వారికే పదవులు పంచారని చెబుతున్నారు. రాహుల్ ఆంద్రప్రదేశ్ రాజకీయాలకు ఎక్కువ ఫ్రాధాన్యత ఇచ్చినప్పటికే రానున్న ఎన్నికల్లో గెలుపు అంత సులువు కాదని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి.

పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణసంకటం

  ట్రెజరీ ఉద్యోగులు చేపట్టిన పెన్ డౌన్ పేరిట సమ్మె చేస్తూ విదులను బహిష్కరించడం మిగిలిన ప్రభుత్వ శాఖలపై ప్రభావం చూపుతోంది. మరీ ముఖ్యంగా నెలాఖరు దినాల వల్ల ఫస్టుకు జీతం వస్తుందా రాదా అని ప్రభుత్వ ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు.   ట్రెజరీ ఉద్యోగులు మాత్రం ప్రభుత్వ శాఖల్లో పరిపాలన సంస్కరణల పేరుతో ప్రవేటీకరణను ప్రోత్సహిస్తే సహించేదిలేదని తేల్చి చెబుతున్నారు. జివొ963 పేరిట సమగ్ర ఆర్దిక నిర్వహణ వ్యవస్ధ విధానం ప్రవేశ పెడుతూ విదేశీ బహుళజాతి సంస్ధల చేతిలో ట్రెజరీ కార్యకలాపాలను పెట్టే యోచనలో ఉందని ట్రెజరీ ఉద్యోగులు మండి పడుతున్నారు.   పెరిగిన ఉప్పు పప్పు ధరలతో పాటు నిత్యావసర సరుకులు పెట్రోలు కూడా పెరగటంతో సగం నెలలోనే జీతాలయిపోయిన చిరుద్యోగులు జీతం సకాలంలో అందకపోతే పరిస్ధితి ఏంటా అని భయపడుతున్నారు. త్వరగా ట్రెజరీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించబడి విధుల్లోకి రావాలని వేయి దేవుళ్లకు మ్రొక్కుతున్నారు.

కోస్తాంద్ర కాంగ్రెస్ లో రాజుకుంటున్న నిప్పు

  మోస్టు సీనియర్లను కాదని నిన్న మొన్నటి ఎంపిలకు పదవులు కట్టబెట్టటంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ వర్గాల్లో నిప్పురాజుకుంటుంది. అందులో కోస్తాంద్రనుండి ఐదు సార్లు ఎంపిగా ఎన్నికయిన కావూరి ముఖ్యులు అలాగే గుంటూరు నుండి రాయపాటి. తమ సామాజిక వర్గం వారైన ఎన్ టీ రామారావు కావూరిని తన పార్టీలోకి ఆహ్వానించినా కాంగ్రెస్ కు వీరాభిమానిగా ఉన్నారు. అంతే కాకుండా పివి నరహింహారావు ప్రదానిగా ఉన్నప్పుడు కూడా సోనియాకు వీర విధేయులు గా ఉండి ఆమె పార్టీ లోకి రావడానికి తన వంతు కషి సల్పారు.   కోస్తాంధ్రకి చెందిన కావూరి,రాయపాటి, పాలడుగు, పిన్నమనేని, చిట్లూరి, చెన్నుపాటి, దొడ్డపనేని, చిట్టినేని కుటుంబాల వారు తెలుగుదేశం హవాలో కూడా కాంగ్రెస్ పార్టీకి వీర విధేయత చూపినవారే. కాగా పదవుల పంపకాలలో మాత్రం వెనుకబడ్డారు. కావూరికి పదవి దక్కక పోవడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ వర్గీయులంతా ఆయనకు సానుభూతిని తెలుపుతున్నారు.   గుంటూరు, కృష్ణా, ప్రకాశం,పశ్చిమ గోదావరి,జిల్లాలలో 30 శాతం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రతికూల పవనాలు ఎదుర్కొవలసి వుంటుందని సీనియర్లు భయపడుతున్నారు.   మంత్రి దానంనాగేందర్, మర్రి శశిధర్ రెడ్డి తమను పార్టీ సమావేశాలకు పిలవడమే మానుకున్నారని కాని వారి నియోజక వర్గాలలో కమ్మవారే ఎక్కువగా ఉన్నారని రాబోయే ఎన్నికలలో వారి ఓట్లు ఎంతవరకు పడతాయో చూడాలని కావూరి చెబుతున్నారు. దీంతో సీను రివర్స్ అవుతోందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారు.

వర్గాలవారిగా పదవుల పంపకం

  కేంద్రంలో సంకీర్ణం నుండి మమతా బెనర్జీ పార్టీ అయిన టియంసి వైదోలగటం,ఎన్ సిపి, సమాజ్ వాది పార్టీలు బయటనుండే మద్దతు ప్రకటిస్తామనటంతో ఈ సారి రాష్ట్రంలోని ఎక్కువ మంది ఎంపీలకు కేంద్రమంత్రులయ్యే అవకాశం వచ్చిందని సీనియర్లు అంటున్నారు. లేకపోతే 33 మంది ఎంపిలున్నప్పటికీ కేంద్రం ఎప్పుడూ అంత అవకాశాలు ఇవ్వలేదని, అలాగే ఈసారి వర్గాలవారిగా పదవుల పంపకం జరిగిందనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.   ఉత్తర కోస్తాలో జగన్ కు చెందిన వైసిపి పార్టీని, తెలుగుదేశం బిసిలకు ఇస్తున్న ప్రాధాన్యలను దష్టిలో పెట్టుకొనే కిల్లి కృపారాణి మంత్రిపదవి ఇచ్చారని, అలాగే తెలుగుదేశానికి మాదిగలు దగ్గరవుతున్నారని సర్వే సత్యన్నారాయణకు చోటు కల్పించారని నాయకులు చెబుతున్నారు. రాయలసీమలో జగన్ ని కట్టడి చేసి రెడ్లను దూరం చేసుకోకూడదనే కోట్ల సూర్య ప్రకాశ్ కు స్ధానం కల్పించారు. కాపులను నిర్లక్ష్యం చేయట్లేదనటానికి చిరంజీవికి, ఎస్టీలకు చెందిన వారిని దగ్గరకు చేసుకుంటానికి బలరాం నాయక్ కు మంత్రి పదవులను కట్టబెట్టారంటున్నారు.   అయితే వీరంతా సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తే పట్టుమని వంద మందిని కూడా సభలకు తరలించే సత్తా ఉన్నవారు కాదని పార్టీ వర్గాల వారే బాహాటంగా విమర్శిస్తున్నారు. దీంతో పదవులు దక్కించుకున్నందుకు సంతోషంతో ఉన్నా రానున్న ఎన్నికల్లో ఇంత బలహీనమైన మంత్రులతో రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాగలమా అని కాంగ్రెస్ వర్గీయులు మల్లగుల్లాలు పడుతున్నారు.

ఘరానా మేనేజ్‌మెంట్!

  ఎలాంటి గుర్తింపు, నియమనిబంధనలను పాటించకుండా ఘరానాగా మేనేజ్‌మెంట్ విద్యను ఆఫర్ చేస్తున్న 332 కాలేజీలను అఖిల భారత సాంకేతిక విద్యామండలి బ్లాక్‌లిస్టులో పెట్టింది. బ్లాక్‌లిస్టును గత జూలై 16వ తేదీ వరకూ అప్‌డేట్ చేసినా, జాబితాను శుక్రవారం నాడు బహిర్గతం చేసింది. బ్లాక్‌లిస్టులో ఉన్న కాలేజీల్లో ఆంధ్రప్రదేశ్‌వే అత్యధికంగా 43 వరకూ ఉండటం ఒక ప్రత్యేకత అయితే దేశవ్యాప్తంగా రద్దయిన కాలేజీల్లో ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఇక్ఫాయి సంస్థలు అనేకం ఉండటం మరో విశేషం.   ఐఐపిఎం, ఇక్ఫాయి, అమిటీ, నొయిడా ఐఐబిఎస్, రాయ్ బిజినెస్ స్కూల్, ఇక్ఫాయి చెన్నై విద్యాసంస్థలు మరో మూడు, ఐఐపిఎం ముంబై కాలేజీలు మరో రెండు, ఐటిఎం, ముంబైలోని ఇక్ఫాయి బిజినెస్ స్కూళ్లు, ఇక్ఫాయి బెంగళూరు విద్యాసంస్థలు, గూర్గావ్‌లోని ఇక్ఫాయి బిజినెస్ స్కూల్, ఇక్ఫాయి నేషనల్ కాలేజీ (గూర్గాన్), ఇక్ఫాయి బిజినెస్ స్కూల్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధీనంలోని ఐఎస్‌బి, ఇక్ఫాయి బిజినెస్ స్కూల్ (ఛండీఘర్) తోపాటు చాలా బ్లాక్ లిస్టులో చేరాయి. రాష్ట్రంలో గుర్తింపు పొందిన 70 శాతం కాలేజీల్లోనే సౌకర్యాలు లేవని సర్వేలు తేల్చిచెబుతున్న సమయంలో అసలు గుర్తింపులేకుండానే వేలాది మందికి అడ్మిషన్లు ఇచ్చేసి, పెద్ద ఎత్తున డబ్బుసంపాదిస్తున్న విద్యాసంస్థలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడంపై తీవ్రమైన విమర్శలే వస్తున్నాయి.   చాలా కాలంగా అనేక మంది విద్యార్థులు ఫిర్యాదు చేయడంతోపాటు ఈ వ్యవహారాలు రాష్ట్ర హైకోర్టు వరకూ వెళ్లినా ప్రభుత్వ అధికారులు మాత్రం మాకు సంబంధించింది కాదు అన్నట్టు వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కావూరి ఫైర్‌

  కేంద్ర కేబినెట్‌ విస్తరణలో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం లభించడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతా సందడిసందడిగా వుంటే... సీనియర్‌ నాయకుల్లో మాత్రం ఆగ్రహం పెల్లుబుకుతోంది. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌ నాయకులు కస్సుబుస్సు మంటున్నారు. తాను ఇంతకాలం పార్టీకి చూపించిన విధేయతకు, సీనియారిటీకి గుర్తింపు లేకుండా పోతోందని కావూరి సాంబశివరావు గత కేబినెట్‌ విస్తరణలో మొండిచేయి లభించినప్పుడే వాపోయారు. పార్టీలో ఇక కొనసాగడం ఎందుకనే ఆవేదననూ వ్యక్తం చేశారు. ఈసారి కూడా విస్తరణలో కేబినెట్‌ బెర్త్‌ దొరక్కపోవడంతో ఆయన వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేశారు. లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌కు, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాజీనామా లేఖను పంపించారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కావూరిని అహ్మద్‌పటేల్‌, బొత్స సత్యనారాయణ, కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు బుజ్జగించినప్పటికీ ఆయన వినడం లేదు. ఐదుసార్లు ఎంపీగా వున్న తనను కాదని, కొత్త వారిని, వేరే పార్టీలనుంచి వచ్చినవారిని అందలం ఎక్కిస్తున్నారన్న కావూరి ఆవేదన కాంగ్రెస్‌లో అరణ్యరోదనగానే మిగిలిపోతోంది. రాయపాటి సాంబశివరావుది కూడా అదే పరిస్థితి. ఆయన కూడా అంతే ఆవేదనతో వున్నారు. పార్టీలో గుర్తింపు లేకుండా పోవడం పట్ల కొంతకాలంగా అసంతృప్తితో వున్న రాయపాటికి తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ పదవి దక్కుతుందని అందరూ భావించారు. అయితే అది కూడా దక్కలేదు. కేంద్ర కేబినెట్‌లో ఈసారీ చుక్కెదురైంది. అనుభవానికి ప్రాధాన్యం ఇచ్చిన నాడూ తమను దూరంగా వుంచారని, ఇప్పుడేమో కొత్తవారికి ప్రాధాన్యం పేరిట దూరంగా వుంచారని కావూరి, రాయపాటి ఆవేదన చెందుతున్నారు.

రాష్ట్రానికి కేంద్రం బొనాంజా

  రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతా సందడిసందడిగా వుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్‌ పదవుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అధికార భాషా సంఘం ఛైర్మన్‌గా మండలి బుద్ధప్రసాద్‌ నియామకం ఇందులో మొదటిది. మిగిలిన నామినేటెడ్‌ పదవుల భర్తీలో తమకు అవకాశం లభించగలదని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఇకపోతే కేంద్రంలో కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణలో రాష్ట్రానికి అగ్రతాంబూలం లభించింది. ఇప్పటికే కేంద్ర కేబినెట్‌లో మన రాష్ట్రంనుంచి ఐదుగురు వున్నారు. మరో ఐదుగురికి కొత్తగా అవకాశం వచ్చింది. దీంతో కేంద్ర కేబినెట్‌లో మన రాష్ట్రం వాటా గణనీయంగా పెరిగింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంనుంచి అత్యధిక సీట్లను గెలుచుకునే లక్ష్యంతోనే కేబినెట్‌లో రాష్ట్ర ఎంపీలకు ప్రాధాన్యం కల్పించారని చెప్పవచ్చు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడానికి రాష్ట్రంనుంచి అధిక సంఖ్యలో ఎన్నికయిన కాంగ్రెస్‌ ఎంపీలే కారణం. ఇదే ఒరవడి 2014 ఎన్నికల్లోనూ కొనసాగాలనే ఆకాంక్షతోనే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రాష్ట్రంనుంచి ఎక్కువ మందికి కేబినెట్‌లో అవకాశం కల్పించారు. అయితే రాసిలో ఎక్కువగా వుండే ఈ మంత్రులు రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు ఏ మేరకు కృషి చేస్తారన్నదే ప్రశ్నార్థకం.

బాబుకు ఊహించని పరామర్శలు

  మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాలలో సభావేదికపై ప్రమాదంలో వెన్నెముకకు గాయమై  విశ్రాంతి తీసుకుంటున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబును పరామర్శించడానికి వస్తున్న వారిని చూస్తే ఆశ్యర్యం కలుగుతుంది. వైద్యులు, నాయకుల సలహా మేరకు శనివారం పాదయాత్ర చేపట్టకుండా విశ్రాంతి తీసుకున్న చంద్రబాబును జూనియర్‌ ఎన్టీఆర్‌, కొందరు సినీ ప్రముఖులు కలిసి పరామర్శించారు. చంద్రబాబుకు, జూనియర్‌ ఎన్టీఆర్‌కు పొసగడం లేదని కొంతకాలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ కలయికకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడిరది. ఇకపోతే బాలకృష్ణ సతీమణి కూడా బాబును పరామర్శించారు. బాబుకు ప్రమాదం జరిగి ఇరవై నాలుగు గంటలు గడిచినా ప్రభుత్వంనుంచి స్పందన లేదు. అయితే రాష్ట్ర మంత్రి డి.కె. అరుణ భర్త, కాంగ్రెస్‌ నేత డి.కె. భరతసింహారెడ్డి చంద్రబాబును కలిసి పరామర్శించడం విశేషం. తమ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో గాయపడిన మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతను పరామర్శించడం తన బాధ్యత అని భరతసింహారెడ్డి ఈ సందర్భంగా అన్నారు. ఇకపోతే చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నాయకుడు గట్టు భీముడు తదితరులు కూడా బాబును కలిసి, త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.

పంతం నెగ్గించుకున్నడిప్యూటీ సీఎం

  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తన పంతం నెగ్గించుకున్నారు. తను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆందోల్ నియోజకవర్గానికి సింగూరు నుంచి లిఫ్ట్ ద్వారా నీళ్లు తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నంలో విజయం సాధించారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రతిపాదన పెండింగ్‌లో ఉండడం, ముఖ్యమంత్రి నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో మెదక్‌లో జరిగే ఇందిరమ్మ బాటలో పాల్గొనకూడదని దామోదర నిర్ణయించుకున్నారు. దీంతో పార్టీలోని సీనియర్లు సీఎం, డిప్యూటీ సీఎం మధ్య సయోధ్య కుదిర్చేందుకు రంగంలోకి దిగారు. చిన్న పథకంలో బెట్టుచేయడం ఎందుకని సీఎంకి నచ్చజెప్పడంతో, సింగూర్ లిఫ్ట్ ఏర్పాటుకి కిరణ్‌కుమార్‌డ్డి అంగీకరించారు. ఈ మేరకు సదరు ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు జారీ చేయాలని భారీ, మధ్యతరహా నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌డ్డికి సూచించారు. ఇందిరమ్మ బాటలో భాగంగా మెదక్ జిల్లాలో సోమ, మంగళ, బుధ వారాల్లో సీఎం పర్యటిస్తున్నారు. సంగాడ్డి నుంచి యాత్ర మొదలవుతుంది. యాత్రను నిర్ణయించే సమయంలో దామోదరను పిలవకుండానే సీఎం, మెదక్ జిల్లా నాయకులతో తేదీలు ఖరారు చేశారు. దీనిపై దామోదర కొద్ది రోజులుగా అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. డిప్యూటీ ఆగ్రహాన్ని గ్రహించిన పార్టీ నేతలు దామోదరతో చర్చలు ప్రారంభించారు. ఈ చర్చల సందర్భంగా దామోదర సీఎం తీరుపై తీవ్రంగా మండిపడట్లు సమాచారం. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ, ఉప ముఖ్యమంత్రి అన్న గౌరవం కూడా ఇవ్వడం లేదని, స్వయంగా తన శాఖ పరిధిలోనే నిర్ణయాలు తీసుకుంటున్నారని బొత్సకు వెల్లడించినట్లు సమాచారం. దీనిపై బొత్స సీఎంతో కూడా మాట్లాడారు. హైదరాబాద్‌కు తాగునీటితో పాటు.. నిజాం సాగర్, ఘనపురం ప్రాజెక్టులకు నీటి సరఫరా చేసే ప్రాజెక్టుగా మిగిలిపోయిన సింగూరు ప్రాజెక్టు నుంచి.. స్థానిక రైతులకు నీటి వాటా కల్పించడం చాలా కాలంగా ఒక ప్రధాన డిమాండ్‌గా ఉంది. అది క్రమంగా దామోదర ఓట్ల భవిష్యత్తును నిర్దేశించేదిగా మారిపోయింది. ఇంత చిన్న ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల ద్వారా సాగునీరు ఇవ్వటం సాధ్యం కాదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంటున్నారు. దీంతో ఈ వ్యవహారం వివాదాస్పదమైంది.

త్వరలో పదో పీఆర్సీ

  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నట్లుగా త్వరలో పదో పీఆర్సీని ఏర్పాటు చేస్తామని సీఎం కిరణ్‌కుమార్‌డ్డి అన్నారు. ఆర్థికపరిస్థితిని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులందరికీ డీఏను ప్రకటించే విషయాన్ని కూడా పరిశీలిస్తామని ఏపీఎన్జీవో జేఏసీ నాయకులకు కిరణ్‌ హామీ ఇచ్చారు. ఏపీఎన్జీవో జేఏసీ నాయకులు సీఎంను కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం వారితో మాట్లాడుతూ పదో పీఆర్సీ ఫైలు తనవద్దకు వచ్చిందని, ప్రధానకార్యదర్శి సలహాలను, సూచనలను తీసుకొని త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఉద్యోగులకు హెల్త్‌కార్డులు జారీ చేసే ప్రక్రియను ట్రెజరీశాఖకు ఇచ్చే విషయాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. పదో పీఆర్సీపై ఫలితం లేనట్లయితే డిసెంబర్ 12న పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ నిర్వహిస్తామని ఏపీఎన్జీవో జేఏసీ నాయకులు ప్రకటించారు.

బాబు యాత్రకు నేడు విరామం

  వస్తున్నా మీకోసం పేరిట చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర 25రోజులు ముగిసిన తర్వాత శనివారం వాయిదా పడిరది. బాబు ఆరోగ్యం క్షీణించడం దీనికి కారణం. అసలే చంద్రబాబు బాగా అలసటగా వున్నారు. కొంత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినప్పటికీ బాబు పట్టించుకోకుండా యాత్రను కొనసాగించారు. ఆయన శ్రమకు ఫలితం దక్కి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంచి స్పందన లభించింది. ఆ ఉత్సాహంతో మరింత ముందుకు సాగుతున్న బాబు, చిన్న ప్రమాదంలో చిక్కుకున్నారు. గద్వాలలో శుక్రవారం రాత్రి బాబు ప్రసంగ వేదిక కూలడంతో వెన్నెముకకు గాయమైంది. దాంతో తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారు. వారి మాట మన్నించిన చంద్రబాబు శనివారం విశ్రాంతి తీసుకోవడానికి అంగీకరించారు. నిజానికి వెన్నెముకకు గాయమైనప్పటికీ యాత్రను కొనసాగించాలని బాబు పట్టుదలగా వున్నారు. అయితే వైద్యులతో పాటు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వత్తిడి తెచ్చారు. ఇదిలా వుండగా అస్వస్థతకు గురయిన చంద్రబాబును జూనియర్‌ ఎన్టీఆర్‌ కలుసుకొని, పరామర్శించారు. రెండు రోజుల క్రితమే బాబును బాలకృష్ణ పరామర్శించిన విషయం విదితమే.

ఫస్టుకి జీతాలొస్తాయా?

  ట్రెజరీ ఉద్యోగులు సహాయ నిరాకరణ బాట పట్టడంతో నవంబరు ఒకటో తారీఖున తమకు జీతాలు అందుతాయో లేదోననే మీమాంసలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వున్నారు. ట్రెజరీ ఉద్యోగుల ఆందోళన కారణంగా ఇప్పటికే పదమూడు జిల్లాల్లో ప్రభుత్వపరంగా ఆర్థిక లావాదేవీలు స్తంభించిపోయాయి. మిగతా జిల్లాల్లోనూ త్వరలో ఇదే పరిస్థితి నెలకొంటుందని అంచనా వేస్తున్నారు. ట్రెజరీ ఉద్యోగుల ఆందోళనను విరమింపజేయడానికి జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఎన్జీవోల సంఘం నాయకులు శనివారం ఉదయం ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డిని కలిశారు. అయితే అక్కడ కూడా సానుకూల స్పందన రాలేదు. ఆర్థిక మంత్రితో, సంబంధిత శాఖాధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించుకోండని ముఖ్యమంత్రి ఎన్జీవో నేతలకు సూచించారు.

గాలికిపోయే పదవి ‘కృష్ణా’ర్పణం

  ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం నిర్ణయించిన వెంటనే విదేశాంగ మంత్రి ఎస్‌.ఎం.కృష్ణ పదవికి రాజీనామా చేశారు. కర్నాటకలో భూకుంభకోణంపై విచారణ జరుపుతున్న లోకాయుక్త నుంచి పిలుపు రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్టుగా ఎస్‌.ఎం.కృష్ణ బిల్డప్‌ ఇచ్చారు. అయితే గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం అన్న చందంగా వుంది ఆయన రాజీనామా వ్యవహారం. కేబినెట్‌లో ఈసారి జరుగుతున్న మార్పులు చేర్పులన్నీ 2014 ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీని సమాయత్తం చేసేందుకు ఉద్దేశించినవే. కేబినెట్‌ మంత్రులు పలువురిని పదవులనుంచి తొలగించి పార్టీ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో కాంగ్రెస్‌ అధిష్టానం వుంది. ఎస్‌.ఎం.కృష్ణను కూడా అదే విధంగా తొలగించే ఆలోచనతో వుంది. కర్నాటక పిసిసి బాధ్యతలను ఆయనకు అప్పగించే అవకాశం వుంది. బీజేపీకి మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గుడ్‌బై చెప్పి సొంత కుంపటి పెట్టుకుంటుండడంతో ఆయన జోరును తగ్గించడానికి కృష్ణను కర్నాటకకు పంపించాలన్నది హైకమాండ్‌ యోచన. ఇదిలా వుండగా, పార్టీ బాధ్యతలను అప్పగించడానికి అధిష్టానం ఎంపిక చేసిన మరో ఇద్దరు కేంద్ర మంత్రులు అంబికా సోనీ, ముకుల్‌ వాస్నిక్‌లు కూడా రాజీనామా పత్రాలు పట్టుకొని తిరుగుతున్నారు.

కావూరి, రాయపాటి వైసిపి లోకి

  రాష్ట్రంలో సీనియర్ యంపిలుగా  సేవలందిస్తున్న కావూరి సాంబశివరావు,  రాయపాటి సాంబశివరావులకు  ఈ సారి కూడా కేంద్ర క్యాబినెట్ విస్తరణలో చుక్కెదురయ్యింది. పుట్టిన దగ్గరనుండి కాంగ్రెస్ కు సేవ చేస్తూ ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ వర్గానికి చెందిన నాయకుడు తమను పిలిచినా విశ్వాసంగా కాంగ్రెస్ కు పని చేస్తే తమకు మిగిలిందేమిటని వారు వాపోతున్నారు. తమకన్నా వెనుక వచ్చిన వారు కేంద్ర మంత్రులుగా నియమితులవుతుంటే తాము మాత్రం ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోతున్నామని వారు చెబుతున్నారు. చివరిసారిగా అధిష్టానికి వారు తమ వాదన వినిపించడానికి కిరణ్ కుమార్ దగ్గర మంతనాలు జరిపటానికి కావూరి ముఖ్యమంత్రిని కలిసారు. అయితే వారిరువురూ తొందరపడి నిర్ణయాలు తీసుకునే వారు కాదు గనుక ఆచి తూచి అడుగులేస్తున్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు. ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ కు విధేయతగా ఉన్నా, సోనియాగాంధీ దగ్గర ఎంత పలుకుబడి ఉన్నా తమకు ఏ మాత్రం న్యాయం జరగటం లేదని మాత్రం వారు గ్రహించారు. దాంతో వారిద్దరూ కార్యకర్తలతో చర్చించి వైసిపి లోకి మారితే తమ భవష్యత్తుకు ఏంతవరకు భరోసా వుంటుందని ఆలోచిస్తున్నారు. కచ్చితమైన హామీ ఆపార్టీ నుండి వెలువడితే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పటానికి రడీగా వున్నట్లు తెలుస్తుంది. ఒక వేళ వీరిద్దరూ పార్టీ నుండి బయటకు వస్తే ఏలూరుకు అలాగే గుంటూరు కాంగ్రెస్ కు పెద్ద దెబ్బేనని పార్టీ వర్గాలు కలవర పడుతున్నాయి.

చిన్నారి పాప శాన్వీ దారుణ హత్య

    ముద్దులొలికే చిన్నారి శాన్వికి  ఈ ప్రపంచం రక్షణ కల్పించలేక పోయింది. తన ముగ్దంత్వంతో ఈ ప్రపంచాన్ని తాను జయించలేక శాశ్వతంగా నిష్క్రమించింది. క్రూరుల లోకంలో నేనుండ లేనంటూ సెలవు తీసుకుంది. అమానుషాన్ని అడ్డుకుంటానికి మన టెక్నాలజీ ఏ మాత్రం సహకరించలేకపోయింది.  ఒకప్పుడు క్రూరులు సమాజానికి ఆవలి నుండేవారు. ఇప్పుడు మంచి వాడెవ్వరో క్రూరులెవ్వరూ తెలుసుకునేందుకు వీలు లేకుండా మనలోనే సాడిస్టులు ఇరుగు పొరుగు ఇళ్లలోనే ఉంటున్నారు. వారు సూటు బూటు వేసుకొని అత్యున్నతంగా చదువుకొని మనలో ఒకరిగా ఉంటూనే పాశవిక చర్యలకు పాల్పడుతున్నారు. సంస్కారం లేని చదువులతో మానవాళి మనుగడకు పెనుసవాలు విసురుతున్నారు. టెక్నాలజీ పెరిగి మానవత్యం తగ్గిందనటానికి ఇదొక ఉదాహరణ. అనుబంధాలు ఆప్యాయతలకు పుట్టిల్లయిన భారత దేశ పరువును దేశం కాని దేశంలో మట్టు పెట్టి  దేశానికి తలవంపులు తెచ్చాడు కర్కొటకుడు రఘు. తెలుగు వారంత  కలసి మెలసి ఐక్యతా రాగం తీసే కాలనీలోనే మానవత్వాన్ని పెకలించిన  రాక్షసుడున్నాడని తెలిసిన తెలుగువారు వణికి పోతున్నారు. అలాంటి కపటులకు అమెరికన్ చట్టం కఠినమైన శిక్ష విధించి మరెప్పుడూ అలాంటి పాశవికత్యం రిపీట్ అవ్వకుండా బుజ్జి శాన్వికి, తన నానమ్మ ల ఆత్మలకు శాంతి చేకూరుస్తారని ఆశిద్దాం.

రాజ్యాంగబద్దమా.....రాజకీయబద్దమా

  నవంబరు ఫస్టును తెలంగాణ విద్రోహదినంగా పాటించాలని తెలంగాణ నాయకులు హుకం జారీ చేయడంతో ఎమ్మేల్యేలు, మంత్రులు చచ్చే చావొచ్చిందిన వాపోతున్నారు. మంత్రులుగా ఉండి ఆంద్రప్రదేశ్ అవతరణను రాజ్యాంగ బద్దంగా జరపవలసి వుంటుంది. అయితే తెలంగాణ నాయకులు మాత్రం దానికి విరుద్దంగా తెలంగాణ మంత్రులెవరూ దానిలో పాల్గోనరాదని అల్టిమేటం జారీ చేయటంతో ఏం చెయ్యాలో తెలియటం లేదని చెబుతున్నారు. ఒకవేళ వారు విద్రోహ దినంగా దాన్ని ప్రకటించి పాల్గొనకుండా ఉండాలంటే వారు తమ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటే తాము తెలంగాణ వ్యతిరేకులుగా ముద్ర పడతామని అందుకే తాము రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలా లేదా రాజకీయ బద్దంగా వ్యవహరించాలా అని తెలంగాణ మంత్రులు తలలు పట్టుకుంటున్నారు. 

కార్ల బ్లాక్ ఫిల్మ్ తొలంగింపుతో సెలబ్రిటీల గోల

  కార్ల బ్లాక్ ఫిల్మ్ లను తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలతో  రాష్ట్రంలోని ట్రాఫిక్ పోలీసులు 15 రోజులు సమయమిచ్చి ఫిల్మ్ లను తొలగించవలసిందిగా ప్రజలను మీడియా , పాంప్లెట్ల  వాల్ పోస్టర్ల ద్వారా కోరారు. రేపటితో గడువు ముగియనుంది, సోమవారం నుండి ఎవరైన బ్లాక్ ఫిల్మ్  లను తొంలగించ కుండా ఉన్నట్లయితే వారికి 500 రూపాయల ఫైన్ పడుతుందని పోలీసులు చెబుతున్నారు. దాంతో వాహన యజమానులు ఎవరికి వారే బ్లాక్ ఫిల్మ్ లను తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనివల్ల తమకు చాలా ఇబ్బందులకు గురి కావలసి వస్తుందని సెలబ్రిటీలయిన సినిమాయాక్టర్లు, మోడల్స్, పారిశ్రామిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు. అభిమానుల తాకిడితో తమకు అవాంతరాలు వస్తాయని వారు చెబుతున్నారు. అలాగే హిట్ లిస్టులో ఉన్న అధికారులు, మంత్రులు కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే సుప్రీం కోర్టు ఉత్తర్యులననుసరించి దీన్ని కుదించడం కుదరదని ఇది తప్పక పాటించవలసిందేనని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.