వన్‌సైడ్ ప్రేమ పిచ్చ!
నేటి తరం యువకుల ఏకపక్ష ప్రేమలు యువతులకు అనేక అనర్థాలను తెచ్చిపెడుతున్నాయి. ప్రేమిస్తున్నానంటూ వెంటపడి వేధించడం, తిరస్కరణకు గురైతే పగ, ప్రతీకారాలు పెంచుకోవడం నేటి యువతలో ప్రమాదకర పోకడగా మారింది. అమెరికాలో ముక్కుపచ్చలారని పసికందు శాన్వి హత్యకు గురికావడానికి, వరంగల్ జిల్లాలో ఇంటర్ విద్యార్థిని సహచరులే హత్య చేయడానికి, ఇంకా అనేక చోట్ల యాసిడ్ దాడులకు, హత్యలకు కారణమవుతున్నది ఈ ప్రమాదకర పోకడ. నైతిక విలువల పాఠాలు లుప్తమైన విద్యావిధానం ఈ ప్రమాదకర పోకడకు ప్రధాన కారణంగా వుందన్నది నిపుణుల విశ్లేషణ. యువతీ యువకులు పరస్పరం ప్రేమించుకోవడం ఎంత సహజమో, ఏకపక్ష ప్రేమలు కూడా అంతే సహజం. ఏకపక్ష ప్రేమికులు చేయవలసింది అవతలి వ్యక్తిని బలవంతంగా సంసార చట్రంలో ఇరికించడం కాదు. ఆ ప్రయత్నం విఫలమైతే హతమార్చడం కాదు. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. తాను ప్రేమించిన వ్యక్తి ఇష్టానిష్టాలను, మనోభావాలను గ్రహించి, తన ప్రేమోద్వేగాలను త్యాగం చేయడమే నిజమైన ప్రేమ అని యువకులు ఎప్పుడు గ్రహిస్తారో ఏమో? ‘నీ సుఖమే నే కోరుకున్నా... నినువీడి అందుకే వెళుతున్నా’ అని అక్కినేని సినిమాలో వినిపించే పాత పాట యువతకు స్ఫూర్తిదాయకం కావాలి.