ఒబామాను ప్రశంసించిన చంద్రబాబు

  ఒబామాకు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అభినందనలు తెలియజేశారు. అమెరికా ఎన్నికల సమయంలో ఒబామా తీరును చంద్రబాబు ప్రశంసించారు. ఎన్నికల ప్రచారాన్ని కూడా పక్కన పెట్టి ఒబామా శాండీ బాధితులపై దృష్టి పెట్టడం అభినందనీయం అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన బరాక్ ఒబామాకు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల ప్రముఖుల నుంచి అభినందనలు లభిస్తున్నాయి. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ మొదలుకుని, రష్యా, చైనా దేశాధినేతలు నుంచి, మన బాలీవుడ్ స్టార్ల వరకూ అనేక మంది ఒబామాను ప్రశంసల్లో ముంచెత్తారు. మన రాష్ట్రం నుంచి ప్రముఖ రాజకీయ వేత్తలు ఒబామకు అభినందనలు తెలిపారు.

కెసిఆర్‌పై జగ్గారెడ్డి నిప్పులు

  టీఆర్ఎస్ పార్టీ ప్రైవేటు లిమిటెడ్ పార్టీగా పనిచేస్తోందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. రాజకీయంగా ఉనికిని కాపాడుకోడానికే కేసీఆర్ యత్నిస్తున్నారని, తెలంగాణపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా ప్రజలను మోసం చేయడానికి టీఆర్ఎస్ ఓ కొత్త నాటకానికి తెరతీసిందన్నారు. తెలంగాణ పై కాంగ్రెస్ ఎప్పుడూ డెడ్‌లైన్లు పెట్టలేదని, డెడ్ లైన్‌ను పెడుతూ ప్రజలను మభ్యపెడుతుందని టీఆర్ఎస్సే అని మండిపడ్డారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలతో మాట్లాడకుండా తెలంగాణపై నిర్ణయం తీసుకోలేమని ఆయన చెప్పారు.   కేసీఆర్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి పిలుపు రాకుండానే కేసీఆర్ నెల రోజులుగా ఢిల్లీలో మకాం వేసారని, జేఏసీ తలపెట్టిన తెలంగాణ మార్చ్‌లో పాల్గొనకూడదనే ఢిల్లీ వచ్చారన్నారు. కేసీఆర్‌ది రెండు నాల్కల ధోరణి అని ఆగ్రహం వ్యక్తపరిచారు.  తెలంగాణ కోసం ఎంతో పోరాటం జరిపిన కొండా లక్ష్మణ్‌బాపూజీ మరణిస్తే కేసీఆర్ హాజరుకాకపోవడం బాధాకరమని జగ్గారెడ్డి గుర్తుచేశారు. 

జగన్ కోటవైపు దాసరి పయనం

  కాపుల ఓటు బ్యాంక్ ని చీల్చేందుకు జగన్ పార్టీ గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి పెద్దపీట వేయడంతో ఆయనకు దీటుగా ఉండే నాయకుడ్ని తన పార్టీలోకి చేర్చుకునేందుకు జగన్ పావులు కదుపుతున్నారు. దాసరి నారాయణరావు అయితే సరిగ్గా సరిపోతారని జగన్ పార్టీ అంచనా. అందుకే ఆయనకు మంచి ఆఫరిచ్చారు.   దాసరి త్వరలోనే తన అనుచరులతో జగన్ పార్టీలో చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయ్. కొద్ది రోజుల్లోనే ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ నిర్ణయం చంచల్ గూడ జైల్లో జగన్ ని కలిసిన తర్వాతే తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దాసరి, ఈ విషయమై వై.వి. సుబ్బారెడ్డితో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది.   దాసరి పార్టీలో చేరితే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన కాపుల్ని ఆకట్టుకోవచ్చన్నది జగన్ అంచనా. వంగవీటి రాథాకృష్ణనికూడా పార్టీలో చేర్చుకుంటే కృష్ణాజిల్లాలో బలం బాగా పెరుగుతుందన్న ఆలోచనకూడా జగన్ వర్గానికొచ్చింది. పశ్చిమగోదావరి జిల్లానుంచి ఓ ఎంపీ తన తమ్ముణ్ణి జగన్ పార్టీలో చేర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలుకూడా సానుకూలమయ్యేలా కనిపిస్తున్నాయ్.   కెవిపి వియ్యంకుడు రఘురామకృష్ణంరాజుకి జగన్ పార్టీ తరఫున నర్సాపురం స్థానం ఖాయమైనట్టు తెలుస్తోంది. రేపోమాపో కెవిపినికూడా పూర్తిగా పార్టీ వైపుకి తిప్పుకుంటే ఇక రాష్ట్రంలో పూర్తిగా కాపుల్ని తనవైపుకి మళ్లించుకోవచ్చన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.

ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లూ అమ్మేసుకోండి బాబూ..!

  వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టిడిపినేత పి.వి.కృష్ణారావు అసలు పార్టీని వదిలి వెళ్లడానికి కారణం ఏంటి? చాలాకాలంగా టిడిపిని నమ్ముకుని ఉన్న ఆయన ఎందుకు ఉన్నట్టుండి వైకాపాలోకి వెళ్లిపోయారు? అనే ప్రశ్నలకు సమాధానం రాజ్యసభ సీటు. కృష్ణారావు రాజ్యసభ సీటు కావాలని కోరుకున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయమని బాబు కోరినప్పుడు తనకి ఆసక్తి లేదని, రాజ్యసభ సభ్యత్వం ఇప్పించాలని కోరారుకూడా. తప్పకుండా ఇప్పిస్తామని చంద్రబాబు హామీకూడా ఇచ్చారు. కానీ.. తీరా సమయం వచ్చేసరికి సృజనా చౌదరికి ఆ సీటు దక్కింది. సృజనా చౌదరి పార్టీకోసం చాలా డబ్బు ఖర్చుపెట్టారు కాబట్టి ఆయనకి రాజ్యసభ సీటు ఇవ్వాల్సొచ్చిందని చంద్రబాబు కవర్ చేయడంతో కృష్ణారావుకి చిర్రెత్తుకొచ్చింది. ఆవేశం పట్టలేకపోయిన కృష్ణారావు చంద్రబాబుని కలిసినప్పుడు.. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లుకూడా వేలం వేస్తే పోలా అని ఓ సలహాకూడా ఇచ్చారట. టిడిపిలో తనకి రాజ్యసభ సీటు రాలేదు కనకే పార్టీ మారుతున్నానని కృష్ణారావు బాహాటంగానే ప్రకటించారు. అంటే వైకాపాలో చేరితే తప్పకుండా రాజ్యసభ సభ్యత్వం ఇప్పిస్తానని జగన్ ఆయనకి గట్టి హామీ ఇచ్చినట్టేనని అటు టిడిపి నేతలు, ఇటు వైకాపా నేతలు అనుకుంటున్నారు.

నీలం తెచ్చిన జలప్రళయం

    నీలం తుపాను వల్ల కురిసిన కుంభవృష్టి రాష్ట్రంలో జలప్రళయాన్ని తీసుకొచ్చింది. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి జిల్లాలకు జిల్లాలు జలమయమయ్యాయి. ఏలూరు, తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయ్. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయ్.   తూ.గో జిల్లాలో తాండవ నది ప్రవాహ ఉద్ధృతి అంతకంతకీ పెరిగిపోతోంది. తుని చుట్టుపక్కల ప్రాంతాలనుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రహదారులమీద వరదనీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయ్. చాలాజిల్లాల్లో పంటలు నీట మునిగిపోయాయ్. కలెక్టర్లు ప్రత్యేక కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు.   రైల్వేట్రాక్ ల మీద నీళ్లు చేరడంతో రాష్ట్రంలో చాలా మార్గాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయ్. విశాఖ, విజయవాడ మధ్య చాలా సర్వీసులు రద్దయ్యాయ్. దాదాపు 1200 గ్రామాలు పూర్తి అంథకారంలో రాత్రంతా మగ్గాయి. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ లోకి వరదనీరు భారీగా చేరుతోంది. చాలా ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో సహాయచర్యలుకూడా ఆలస్యమవుతున్నాయని జిల్లా కలెక్టర్లు చెబుతున్నారు.  

ఫ్యాన్స్‌ని నిరాశపర్చిన చిర౦జీవి

    మొత్తానికి చిరంజీవి సినిమా రీ ఎంట్రీ పై ఒక క్లారిటీ వచ్చేసినట్టే, ఇకపై ఆయన స్క్రీన్ పై కనబడే అవకాశాలు చాలా చాలా తక్కువ. ఈ విషయాన్ని చిరునే స్వయంగా స్పష్టం చేశాడు. తాను ఇకపై సినిమాల్లో నటించే అవకాశాలు ఉండవని తేల్చిచెప్పాడు. దీనికి ప్రధాన కారణం ఆయన కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించడమే అని చెప్పాల్సినవసరం లేదు. మామూళుగా సహాయ మంత్రులైనా సరే సినిమాల్లో నటించాలంటే ప్రధానమంత్రి అనుమతి తీసుకుని పని కానిస్తుంటారు. ఇప్పుడు చిరంజీవి సినిమాల్లో నటించడానికి మళ్లీ కాంగ్రెస్ అధిష్టానం అనుమతి తీసుకోవాల్సి రావొచ్చు. అందుకే ఆయన మంత్రిగా ఉండే ఒకటిన్నర ఏడాది కాలం అలాంటి ప్రయత్నాలు చేయకపోవచ్చు. ఆ తర్వా త పరిస్థితి ఏంటో చెప్పలేం కానీ ప్రస్తుతానికి మెగా భిమానులకు నిరాశే! ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పై కూడా చిరు అసంతృప్తి వ్యక్తం చేశాడు. రాష్ట్ర కాంగ్రెస్‌లో మరింత సమన్వయం అవసరమని ఆయన వ్యాఖ్యానించాడు. ప్రభుత్వ పథకాలను మరింత పగడ్బందీగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించాడు. కేంద్ర మంత్రి అయినప్పటికీ నెలకు నాలుగైదు రోజులు రాష్ట్రంలోనే ఉండి క్రీయాశీలకంగా వ్యవహరిస్తానని చెప్పుకొచ్చాడు, తెలంగాణ విషయంలో అధిష్టానమాటనే అనుసరిస్తానని స్పష్టం చేశాడు.

తుఫాన్ హెచ్చరికలున్న పట్టించుకోలేదు: చంద్రబాబు

  నీలం తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో రైతులు పంటను నష్టపోయారని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. తుఫాన్ హెచ్చరికలున్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని విమర్శించారు. జిల్లాలో రెండు రోజుల విరామం అన౦తరం పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. ముఖ్యమంత్రికి రాష్ట్ర పరిస్థితిపై అవగాహన లేదని...రాష్ట్రంలో పంటలన్నీ దెబ్బతిన్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయిన లేదని ఎద్దేవా చేశారు. అంతకుముందు చంద్రబాబు పార్టీ నేతలు కడియం శ్రీహరి, ఎర్రబెల్లి తదితర నేతలతో కలిసి ఎర్రన్నాయుడుకి నివాళులు అర్పించారు.

జలదిగ్బంధంలో రాష్ట్రం

  నీలం ప్రభావం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. గోదావరి జిల్లాల్లో వర్షాలు భారీగా పడుతున్నాయి. కుండపోత వర్షం కాకినాడను ముంచేసింది. అన్ని దారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమై, ఇళ్లలోకి నీరు చేరింది. నీలం తుఫాను ప్రభావం 14 జిల్లాలను అతలాకుతలం చేసింది. శారదా నదిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వరదకు కొట్టుకుపోయింది. శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని గజాలాఖానా వంతెన స్వల్పంగా కుంగింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.   జోలావుట్ రిజర్వాయర్‌కు ప్రమాద స్థాయిలో నీటిమట్టం చేరుకుంది. దీని సామర్థ్యం 2750 క్యూసెక్కులు కాగా ఇప్పటికే 2749 క్యూసెక్కుల నీరు చేరింది. అనకాపల్లి ఆర్టీసి బస్సు మోకాళ్ల లోతు నీటిలో మునిగి పోయింది. విజయవాడలో ఇంద్రకీలాద్రి రోడ్డులో కొండచరియలు విరిగి పడటంతో రాకపోకలు స్తంభించాయి. వరదలపై అధికారులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వరదలపై సమీక్షించారు. కలెక్టర్లు, సిఎస్‌తో ఫోన్లో మంతనాలు జరిపారు. వెంటనే సహాయ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లాలో మంత్రులు పళ్లం రాజు, విశ్వరూప్, తోట నరసింహంలు, పశ్చిమ గోదావరి జిల్లాలో వట్టి వసంత్ కుమార్, పితాని సత్యనారాయణలు సమీక్షిస్తున్నారు. విశాఖలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో పలు రైళ్లను రద్దు చేశారు. మరి కొన్నింటిని దారి మళ్లించారు. తునిలో వరదల కారణంగా హైదరాబాద్ నుండి హౌరా వెళ్లాల్సిన ఆరు రైళ్లను దారి మళ్లించారు. వాటిని ఖాజీపేట, నాగపూర్ మీదుగా దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు. తుని రైల్వే స్టేషన్‌లో రాత్రి నుండి పలక్‌నుమా ఎక్సుప్రెస్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అంగరంగ వైభవంగా బొత్స కూతురు పెళ్లి

  పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె సత్యశ్రీ, భరత్ కుమార్‌ల వివాహం విజయనగరంలో అంగరంగ వైభవంగా జరిగింది. పండితులు నిర్ణయించిన శుభముహూర్తం 10.05 గంటలకు ఈ జంట ఒక్కటయింది. వివాహ వేడుకకు విజయనగరంలోని బొత్స నివాసం కల్యాణ వేదికగా నిలిచింది. సినీ ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ పెళ్లి మండపం సెట్ వేశారు. మండపంలో వేంకటేశ్వరుడి నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేశారు. ఆయన పాదాల వద్ద పెళ్లి పీటలను ఏర్పాటు చేశారు. పెళ్లికి బంధువులు, ప్రముఖులు వస్తుండటంతో విజయనగరం రహదారులు ఉదయం నుండే కళకళలాడాయి. బొత్స దంపతులు అందరినీ సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్, డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య, కేంద్రమంత్రులు జైపాల్ రెడ్డి, చిరంజీవి, పళ్లంరాజు, పనబాక లక్ష్మి, పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, యాష్కీ, తెరాస చీఫ్ కూతురు కవిత, బిజెపి నేతలు దత్తాత్రేయ తదితరులు భారీగా హాజరయ్యారు.  

ఎర్రన్నాయుడు మృతి తీరని లోటన్న సోనియా

  టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎర్రనాయుడు మృతి పట్ల ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ సంతాపం ప్రకటించారు. ఎర్రన్నాయుడు మృతి దేశానికి తీరని లోటు అని సోనియా గాంధీ అన్నారు. కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు చేసిన సేవలు ఎంతో గుర్తింపు పొందాయని సోనియా పేర్కొన్నారు.   టీడీపీ నేత ఎర్రన్నాయుడు మృతి పట్ల అనేక మంది ప్రముఖులు సంతాపం ప్రకటించారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, డిప్యూటీసీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి, తమిళనాడు గవర్నర్ రోశయ్య, కేంద్ర మంత్రి పురంధరేశ్వరి, మంత్రులు రఘువీరా, సారయ్య ఏరాసు, టీజీ, ఆనం, బాలరాజు, డీకే అరుణ, గీతారెడ్డి,కన్నా, రాంరెడ్డి, పార్థసారథి, శత్రుచర్ల, ఎంపీలు రాజయ్య, వివేక్ సంతాపం ప్రకటించారు. ఢిల్లీ నుంచి కేంద్రమంత్రులు జైపాల్‌రెడ్డి, పురందేశ్వరి, చిరంజీవి, పనబాక, ఎంపీవీహెచ్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు, కిషన్‌రెడ్డి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నారాయణ, రాఘవులు, జూలకంటి, టీఆర్ఎస్ నేతలు వినోద్, హరీష్‌రావు, ఈటెల, వైఎస్సార్ పార్టీ నేతలు విజయలక్ష్మి, ఎంపీ మేకపాటి తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. రాష్ట్రం ఓ గొప్ప నేతను కోల్పోయిందని గవర్నర్ నరసింహన్ తెలిపారు. ఎర్రన్నాయుడు మృతి దేశానికి తీరని లోటు అని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీతారం ఏచూరి అన్నారు.  

ఎర్రన్నాయుడు మృతి, విషాదంలో చంద్రబాబు

  టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు మృతి బాధాకరమని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తపరిచారు. ఎర్రన్నాయుడు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి చెందిన చంద్రబాబు పార్టీకోసం ఎర్రన్నాయుడు అంకిత భావంతో పనిచేశారని గర్తు చేశారు. ఇలాంటి వార్త వినవలసి వస్తుందని అనుకోలేదన్నారు.   ఎర్రన్నాయుడు నిజాయితీ గల వ్యక్తి అని, ఆయన మృతితో కుడి భుజాన్ని కోల్పోయినట్లయిందని ఆయన చెప్పారు. ఎర్రన్నాయుడు మృతితో ఈ రోజు పాదయాత్రను రద్దు చేస్తున్నామని, రేపటి నుంచి యథాతథంగా పాదయాత్ర జరగనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఎర్రన్నాయుడు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించడానికై చంద్రబాబు శ్రీకాకుళం బయలుదేరివెళ్లారు.

బొత్స కూతురు పెళ్లికి కెసిఆర్ కుమార్తె

                        పిసీసీ అధ్యక్షులు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె వివాహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు పలువురు విజయనగరం వెళుతున్నారు. బొత్స ఆహ్వానంపై కేసీఆర్ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. పార్టీలో చర్చించిన తర్వాత వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. పార్టీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీశ్ రావు, కల్వకుంట్ల తారక రామారావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి హాజరుకానున్నారు. కేసీఆర్ అనారోగ్యానికి గురికావడంతో హాజకలేకపోతున్నారు. బొత్స కూతురు పెళ్లికి కాంగ్రెసు పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్నారు.

దారి మార్చుకున్న కారు

కారు తీరు మారుతోంది. రోజులతరబడి ఢిల్లీలో మకాం వేసి ప్రత్యేక రాష్ట్రంకోసం లాబీయింగే చేశారో లేక ప్రత్యర్ధులు ఆరోపించినట్టుగా సొంతపనులే చూసుకున్నారో తెలీదుగానీ.. డ్రైవర్ పోస్ట్ లో ఉన్న కేసీఆర్ లో మాత్రం చాలా మార్పు కనిపిస్తోంది. పూర్తిగా మట్టి కరుచుకు పోయిన పార్టీకి గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు కేసీఆర్ గట్టి ఏర్పాట్లే చేసుకుంటున్నారు.     అయినవాళ్లనీ, కానివాళ్లనీ, కనిపించినవాళ్లందరినీ కారులో ఎక్కించేసుకుని కలుపుపోయి బలప్రదర్శన చేయాలన్న ఆలోచన ఇప్పుడు కేసీఆర్ మైండ్ ని తెగ తొలిచేస్తోంది. అందుకే చిన్న నేతల్నైనా సరే కలిసి తీరాలన్న పట్టుదలతో సారున్నారని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయ్.   పక్క పార్టీల్లో కనిపిస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన పెద్ద నేతలే ఇప్పుడు టార్గెట్. ఎలాగైనా వలవేసి వాళ్లని ఒడిసిపట్టుకుని, పార్టీలోకి లాగేయాలన్న తలంపుతో బొబ్బిలి దొరవారు గట్టిగా వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. పక్కా ప్లాన్ తో ముందుకెల్తే తప్ప పని కాదని నిర్ణయించుకున్న కేసీఆర్ అందుబాటులో ఉన్న అస్త్రాలన్నీ ప్రయోగించి చూస్తున్నారట.   పరిగి టిడిపి ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డిని ఆల్రెడీ లైన్ లో పెట్టేశారు. నాగం జనార్దన్ రెడ్డిని, వేణుగోపాలాచారిని మెల్లగా దువ్వి లోపలికి లాక్కునేందుకు గట్టి ప్రయత్నమే జరుగుతోంది. తనకున్న వశీకరణ శక్తులన్నింటినీ ప్రయోగించి, ఇకపై అసలు తెలంగాణలో మరో పార్టీయే లేదనిపించేందుకు దొరవారు అహరహం శ్రమిస్తున్నట్టు తెలుస్తోంది.  అసలు మరో పార్టీయే లేకపోతే అంతా మనదేకదా.. అన్న సూత్రాన్ని అందరికీ నూరిపోస్తున్నారటకూడా.  

పాలడుగు వ్యాఖ్యలు సరైనవేనా?

  కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు ఆచి తూచి మాట్లాడతారని చాలామందికి ఓ నమ్మకం. హుందాగా రాజకీయం నడపడం పాలడుగు ప్రత్యేకతని చాలామంది చెప్పుకుంటారుకూడా.. ఎప్పుడూ కాంట్రవర్సీల జోలికిపోయినట్టుకూడా కనిపించిన బాపతు కానే కాదు. కానీ ఉన్నట్టుండి ఆయనో బాంబు పేల్చి కలకలం రేపారు.   వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న నేతలంతా నిజాయతీ లేనోళ్లే అంటూ పాలడుగు చేసిన కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చాలామందికి మింగుడుపడలేదు. కొందరైతే ఔరా.. ఏంటీ పెద్దాయన ఇలా మాట్లాడ్డం మొదలెట్టాడు అని ముక్కున వేలేసుకున్నారుకూడా.. ముందుగా ఈ మాటనాలనుకున్న చాలామంది రాజశేఖర్ రెడ్డిని గుర్తుకు తెచ్చుకుని వెనకడుగువేశారు. పాలడుగు మాత్రం వీరోచితంగా చెప్పదలచుకున్న నాలుగు ముక్కలూ  బైటపెట్టేశారు.   ఐదేళ్లపాటు పాలించమని ప్రజలు అధికారం కట్టబెడితే, నేతలు ప్రలోభాలకు లోనై సొంతపార్టీల్ని వైఎస్సాఆర్ కాంగ్రెస్ కోసం త్యాగం చేస్తున్నాయంటూ పాలడుగు పదునైన విమర్శలు చేశారు. కిందటి ఎన్నికల్లో.. నీతి, నిజాయతీ లేనివాళ్లకు టిక్కెట్లివ్వడంవల్లే ఇప్పుడిలిం పరిస్థితి తలెత్తిందని ఆయనకు నిశ్చితాభిప్రాయం.   రాజకీయాల్లో విలువలు అంతరించిపోతున్నాయని కామెంట్ చేసిన పాలడుగు.. వైకాపాలో చేరిన నేతలంతా ప్రజలకు సంజాయిషీ చెప్పుకోవాల్సిన రోజు త్వరలోనే వస్తుందంటూ జోస్యం చెబుతున్నారు. నిజానికి వై.ఎస్ కుటుంబంతో పాలడుగుకి బీరకాయ పీచు చుట్టురికంకూడా ఉంది. కానీ.. తిట్టిపోయడానికి బంధుత్వం అడ్డురాకూడదన్న భావన ఆయన మాటల్లో వ్యక్తమయ్యింది.

కొత్తనాయకులే కరువా

  అన్ని పార్టీలనుండి వైసిపి లోకి వలసలు, కప్పదాట్లు, గోడదాటటాలు ఎక్కు వయిపోయాయి. తీన్ని చూసిన ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ అధినాయకత్యం కొత్త నాయకులను తయారు చేసికోలేరా అనే సందేహాన్ని సందిస్తున్నారు.   గతంలో ఎన్టీరామారావు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు యువతను ఎంతగానో ఎట్రాక్ట్ చేశారు. ఆయన పేరు చెప్పి ఏ ఎన్నికల్లో ఎవరూ నిలబడినా......ఊరూ పేరు లేని వారుకూడా ఎమ్మేల్యేలుగా ఎంపిలుగా మారారు. రాష్ట్రంలో కొత్తతరానికి చెందినవారు నాయకులుగా మారారు.  యువత రాజకీయాలలోకి రాజబాటలో ప్రయాణించారు.   ఇప్పటికీ యువత నాయకత్వం వహించడానికి సిద్దంగా ఉన్నా గత మూడేళ్లనుండి యువతను పార్టీలోకి తేవడానికి వైయస్సార్ కాంగ్రెస్ ఏ మాత్రం శ్రద్ద చూపకుండా పాతనాయకులనే తమ పార్టీలోకి ఆహ్వానించడం పలువిమర్శలకు తావిస్తుంది. కొత్తపార్టీ కొత్త నాయకత్వం లేకుండా పాత నాయకత్వం తో పనిచేయడం వల్లే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ  ఎన్నికల్లో గెలుపు సాధించ లేక పోయిందని రాజకీయవర్గాలు ఉటంకిస్తున్నాయి.