జగన్ కు షాకిచ్చిన ఎమ్మెల్యేలు.. విప్ జారీ చేసినా అసెంబ్లీకి డుమ్మా..

  వైఎస్ జగన్ వేసిన ఎత్తు ఈసారి కూడా పారేలా కనిపించడంలేదు. ఇప్పటి వరకూ రెండుసార్లు తప్పించుకున్న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను.. మూడోసారి ఎలాగైనా అసెంబ్లీకి రప్పించాలని జగన్ చూశారు. దీనిలో భాగంగానే.. ఎమ్మెల్యేల‌ను ఇరుకున పెట్టేందుకు వైఎస్సార్‌సీపీ మంగళ, బుధవారాల్లో అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని పార్టీ సభ్యులకు విప్‌ జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీకి హాజరుకావాలని.. ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని, లేకుంటే అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జగన్ అంతగా హెచ్చరించినా కూడా పార్టీ మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీకి రాలేదు.. సరికదా వారితో పాటు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు కూడా హాజరుకాలేదు. మరి దీనిపై జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

అసదుద్దీన్‌ నోటి వెంట... హిందుస్తాన్ జిందాబాద్‌!

  పీక మీద కత్తి పెట్టినా, తనతో భారత్‌మాతాకీ జై అన్న నినాదాన్ని పలికించలేరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ మెత్తబడ్డట్లే కనిపించారు. తన మాటలకు సాటి ముస్లిం మేధావుల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ఇప్పుడు కాస్త రూటు మార్చారు. నిన్న లక్నోలో జరిగిన ఓ సమావేశంలో ‘హిందుస్తాన్‌ జిందాబాద్‌’, ‘జైహింద్‌’ అంటూ దేశభక్తి నినాదాలు చేశారు. పైగా తాము దేశభక్తులమంటూ ఎవరి సర్టిఫికెట్టూ అవసరం లేదని, 1857 మొదల్కొని స్వాతంత్ర్యం వరకూ దేశం కోసం ప్రాణాలర్పించిన వర్గం తమదనీ చెప్పుకొచ్చారు.   తమ రక్తంతో ఈ దేశాన్ని పెంచిపోషించామని పేర్కొన్నారు. పనిలో పనిగా ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీని కూడా దుయ్యపట్టారు అసదుద్దీన్‌. రాష్ట్రంలో ముస్లింలను ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నారనీ, ప్రభుత్వం ఏనాడూ వారి బాగోగులను పట్టించుకోలేదని విమర్శించారు. 2017లో ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసదుద్దీన్‌ తన మజ్లిస్ పార్టీని అక్కడ బలపరచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే దళితులను, ముస్లింలను కలుపుకొని పోవాలని చూస్తున్నారు. మరి అసదుద్దీన్‌ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో!

హెచ్‌సీయూ విధ్యార్ధులకు బెయిల్ మంజూరు.. వీసీని తొలగించాలి

  హెచ్‌సీయూ వైస్ చాన్స్‌లర్ వీసీ అప్పారావు యూనివర్శిటీకి రావడంతో విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు వీసీ అప్పారావు ఇంటిపై దాడి చేసి ఫర్నీచర్ కూడా ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు విద్యార్ధులపై లాఠీచార్జీ చేసి 27మంది విద్యార్ధులను అరెస్ట్ చేసి వారిపై కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఇప్పుడు అరెస్టయిన విద్యార్ధులకు రంగారెడ్డి జిల్లా 27వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వరూధిని బెయిల్ మంజూరు చేశారు. రూ. 5వేల రూపాయలు పూచీకత్తు విధించారు. ఈ సందర్భంగా విద్యార్ధులు మాట్లాడుతూ.. వీసీ అప్పారావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీసీ అప్పారావును వెంటనే వైస్ చాన్సలర్ పదవి నుంచి తొలగించాలని, అంతేకాదు  క్యాంపస్‌లో ఉన్న పోలీసు బలగాలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటనపై నిజానిజాలను తేల్చేందుకు, విద్యార్థుల డిమాండ్లను పరిశీలించేందుకు వర్సిటీ రిజిస్ట్రార్ ఏడుగురు ప్రొఫెసర్లతో ఒక కమిటీని ఏర్పాటుచేశారు.

ఫలించిన హర్యానా జాట్ల ఉద్యమం.. జాట్ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం..

  తమకు రిజర్వేషన్లు కల్పించాలని హర్యానాలో జాట్లు గత కొంత కాలంగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో హింసాత్మక ఘటనలకు కూడా పాల్పడ్డారు. అంతేకాదు వచ్చే నెల అంటే ఏప్రిల్ 3 తేదీలోగా జాట్ కోటాపై చట్టం చేయకుంటే మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు కూడా. దీంతో ఇప్పుడు ఎట్టకేలకు హర్యానా ప్రభుత్వం జాట్ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి మనోహర్ ఖట్టర్  అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈనెల 31 తేదీన బడ్జెట్ సమావేశాలు ముగిసే లోగానే జాట్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని.. జాట్‌లతోపాటు మరో నాలుగుకులాలు.. జాట్ సిక్కు, బిష్ణోయి, రోర్లు, త్యాగి కులాలను బీసీల్లో చేర్చి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యారంగంలో 6 నుంచి 10 శాతం ఆరుశాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

పఠాన్‌కోట్‌కు పాకిస్థాన్‌ జిట్ బృందం

  పంజాబ్ పఠాన్‌కోట్ విమానస్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ దాడికి సంబంధించి విచారణ నిర్వహించేందుకు పాకిస్థాన్‌కు చెందిన జిట్ బృంద సభ్యులు పఠాన్ కోట్  రానున్నారు. ఇప్పటికే ఈ బృందం అమృత్‌సర్‌కు చేరుకోగా అక్కడినుండి బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనంలో పఠాన్‌కోట్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఎయిర్‌బేస్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. కాగా ఆ దాడుల్లో పాక్ ఉగ్రవాదుల పాత్ర ఉందని భారత్ ఆ దేశానికి ఆధారాలను సమర్పించగా.. ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆ ఘటనపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

టీడీపీలో మరోసారి బయటపడ్డ విభేధాలు.. మాజీ మంత్రి అనుచరుడిపై దాడి

  కర్నూలు జిల్లా రాజకీయాల్లో వేడి వాతావరణం నెలకొంది. టీడీపీ మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి అనుచరుడు తులసి రెడ్డిపై దాడి జరగడంతో టీడీపీ పార్టీలో ఉన్న విభేధాలు మరోసారి బయటపడ్డాయి. మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు తులసి రెడ్డి న్యాయవాదిగా పని చేస్తున్నాడు. అయితే నిన్న ఆఫీసు నుండి పని ముగించుకొని ఇంటికి వెళుతున్న క్రమంలో కొంత మంది దుండగలు ఆయన కళ్లల్లో కారం చల్లి ఇనుప రాడ్లతో, కత్తులతో దాడి జరిపారు. ఈ దాడిలో తులిసి రెడ్డి తీవ్రంగా గాయపడగా ఆయనను..  కర్నూలు జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తులసిరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. అయితే  ఈ దాడి చేసింది.. భూమా వర్గానికి చెందిన బాలనాగిరెడ్డి, మరికొంత మందని తెలుస్తోంది. అంతేకాదు..  భూమా నాగిరెడ్డి అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని తులసిరెడ్డి వర్గీయులు కేసు నమోదు చేశారు.   ఇదిలా ఉండగా శిల్పా మోహన్ రెడ్డి ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మరోవైపు భూమా నాగిరెడ్డి మాత్రం ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.

భర్తని ‘బండ ఏనుగు’ అని తిట్టినందుకు విడాకులు మంజూరు

  ఇక మీదట భార్యాభర్తలు ఒకరినొకరు తిట్టుకునేటప్పుడు కూడా కాస్త మర్యాదగా తిట్టుకోవాలేమో! ఎందుకంటే దిల్లీ హైకోర్టు ఇలాంటి ఓ కేసుని విచారిస్తూ ‘భర్త లావుగా ఉన్నప్పటికీ భార్య అతడిని ఏనుగు, బండ ఏనుగులాంటి పేర్లతో పిలవడాన్ని అవమానకరంగా’ పేర్కొంది. ఈ ఆరోపణలు పనికిమాలినవనీ, అసలు ఆ మాటలని తాను ఎప్పుడెప్పుడు అన్నానో చెప్పమని భార్య చేసిన వాదనతో కోర్టు ఏకీభవించలేదు. దాంపత్యంలో ఉండే భార్యభర్తలు నోట్ పుస్తకాలు పెట్టుకుని తేదీలు, తిట్లూ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు న్యాయమూర్తి.   ఒక వ్యక్తి ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు ఈ మాటలు చాలునన్నారు. ఈ కేసులోని భార్య, తన భర్తని కొట్టి, ఇంట్లోంచి గెంటివేసే ప్రయత్నం చేయడాన్ని కూడా కోర్టు తీవ్రంగా పరిగణించింది. తాను కనుక ‘మంచి భార్య’గా మసులుకోవాలంటే, యావదాస్తినీ తన పేర రాయాలని ఆమె కోరడాన్ని కూడా కోర్టు తప్పు పట్టింది. ఇవన్నీ కూడా రోజువారీ జరిగే వ్యవహారాలుగా తోచడం లేదనీ, ఈ చర్యలు దాంపత్యానికి తప్పకుండా విఘాతం కలిగిస్తాయనీ కోర్టు పేర్కొంటూ విడాకులను మంజూరు చేసింది.

దేశభక్తి వివాదంలో మెహబూబా ముఫ్తీ

  తండ్రి ముఫ్తీ మహమ్మద్‌ సయీద్‌ మరణం తరువాత కశ్మీర్ ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టనున్న మెహబూబాకు జాతీయవాద సెగ తగులుకుంది. శివసేన నాయకుడు సంజయ్ రానౌత్‌ మెహబూబాను కూడా భారత్‌మాత వివాదంలోకి లాగేందుకు సిద్ధపడుతున్నారు. ‘మెహబూబా ముఫ్తీ భారత్‌ మాతాకీ జై అన్న నినాదాన్ని చేసేందుకు సిద్ధంగా ఉన్నారా?’ అని అడుగుతున్నారు సంజయ్‌. అంతేకాదు! పార్లమెంటు మీద దాడి కేసులో ఉరితీయబడిన అఫ్జల్‌ గురు విషయంలో మెహబూబా అభిప్రాయం ఏమిటో చెప్పాలని పట్టుబడుతున్నారు సంజయ్.   అఫ్జల్ గురు విషయంలో మెహబూబాకు చెందిన పీడీపీ పార్టీ ఇన్నాళ్లూ సౌమ్యంగానే వ్యవహరిస్తూ వస్తోంది. అఫ్జల్‌ గురుని ఉరితీయాల్సింది కాదన్నది ఆ పార్టీ భావన. అలాంటి పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం ఏంటని కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు కూడా ప్రశ్నిస్తున్నాయి. మరి ఇటు మిత్రపక్షమైన శివసేనతో పాటు, అటు ప్రతిపక్షాలకు బీజేపీ ఎలాంటి సమాధానం చెప్పనుందో, ఈ విమర్శలకు మెహబూబా ఏమని జవాబు చెబుతారో చూడాలి!

భారత్‌ నిర్మించిన పార్లమెంటు మీద దాడి... ఆఫ్ఘనిస్తాన్‌లో

  పాకిస్తాన్‌లోని చిన్నారుల మీద తాలిబాన్‌ చేసిన దాడిని ఇంకా మరవనే లేదు. ఈలోగా ఆఫ్ఘన్ పార్లమెంట్ మీద కూడా దాడికి పాల్పడి తమ ఉనికిని చాటుకుంది ఆ సంస్థ. రాకెట్లతో జరిపిన ఈ దాడిలో ఒక రాకెట్‌, భవనానికి అతి సమీపంలోనే పేలినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎవరూ మృత్యువాత పడలేదని తేలడంతో, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పార్లమెంటులో సమావేశం జరుగుతుండగానే ఈ దాడి జరిగడంతో, ప్రజాప్రతినిధులు భయభ్రాంతులకు గురయ్యారు. తాలిబన్‌ మూక నేరుగా పార్లమెంటు మీదే తన పంజా విసరడానికి ఓ కారణం ఉంది.    ప్రపంచంలోనే అందమైన పార్లమెంటు భవనాలలో ఒకటిగా ఈ భవనాన్ని భావిస్తారు. తీవ్రవాద బాధిత దేశమైన ఆఫ్ఘనిస్తాన్‌కు చేయూతగా మన దేశం, ఈ భవంతిని నిర్మించి ఇచ్చింది. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ భవంతికి ప్రారంభోత్సవం చేశారు. ఆది నుంచీ కూడా ఇరుదేశాల మధ్య స్నేహ చిహ్నంగా నిలిచిన ఈ భవంతి అంటే తాలిబన్లకు ఒళ్లు మంటగా ఉండేది. గతంలో కూడా ఈ భవంతిని కూల్చేందుకు ఆ సంస్థ విఫలయత్నం చేసింది ఆ సంస్థ. ఆరు సంవత్సరాలు కష్టపడి కట్టిన భవంతని తృటిలో కూల్చాలని ఉత్సాహపడింది. ఇదిగో... ఇప్పుడు మరో యత్నం!

దిల్లీ మోడల్‌ ప్రియాంక ఆత్మహత్య

  దిల్లీకి చెందిన ప్రముఖ మోడల్‌ ప్రియాంక కపూర్ ఆత్మహత్య చేసుకుంది. తన భర్త పెట్టే హింసని భరించలేకే ఆత్మహత్యను చేసుకుంటున్నానంటూ తన ఆత్మహత్య లేఖలో పేర్కొంది. తాను రాత్రిపూట పార్టీలకు వెళ్లడం గురించి తరచూ భర్తతో వాగ్వాదం జరిగేదని ప్రియాంక తన లేఖలో వెల్లడించింది. 26 ఏళ్ల ప్రియాంకా కపూర్‌ కొన్నాళ్ల క్రితమే నితిన్ చావ్లా అనే 38 ఏళ్ల వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే వివాహం చేసుకున్ననాటి నుంచీ కూడా నితిన్ ఆమెను హింసిస్తూనే ఉండేవాడని ఆరోపిస్తున్నారు ప్రియాంక బంధువులు. అదనపు కట్నం గురించీ, ప్రియాంక పార్టీల గురించీ వారివురి మధ్యా గొడవలు జరుగుతూనే ఉండేవని తెలుస్తోంది. నితిన్‌కు ఇంతకుముందే ఓసారి వివాహం చేసుకుని విడాకులను తీసుకున్నాడనీ, ఆ వివాహం కారణంగా కలిగిన ఒక పదేళ్ల పిల్లవాడు కూడా వారితోనే కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది.   గత శనివారం కూడా నితన్‌, ప్రియాంకల మధ్య గొడవ జరిగిందనీ... ఆ గొడవ తరువాత ప్రియాంకను తన ఇల్లు వదిలి వెళ్లిపొమ్మంటూ నితిన్‌ హెచ్చరించాడనీ సదరు పిల్లవాడి కథనం. ‘నితిన్‌ (ప్రియాంక భర్త) నన్ను ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నాడు. కానీ నేను ఈ ప్రపంచంలోంచే నిష్క్రమిస్తున్నాను’ అంటూ తన లేఖలో పేర్కొంటూ ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడింది. ‘దిక్కులేని పరిస్థితులలో తాను ఈ వివాహాన్ని చేసుకున్నాననీ, వివాహం తరువాత తనకు దుఃఖమే మిగిలిందనీ’ ప్రియాంక తన లేఖలో వాపోయింది. ప్రియాంక లేఖ, ఆమె బంధువుల వాంగ్మూలం ఆధారంగా పోలీసులు నితిన్ చావ్లాను అరెస్టు చేశారు.

విజయ్ మాల్యా విమానాన్ని కొంటారా... కోటి రూపాయలే!

  అటు ప్రభుత్వ సంస్థలకీ, ఇటు ప్రైవేటు వ్యాపారవేత్తలకీ వందలాది కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన విజయ్‌మాల్యా ప్రస్తుతం పరారీలో ఉండవచ్చుగాక. కానీ ఆయన ఇక్కడ విదిలి వెళ్లిన చిన్నాచితకా ఆస్తులని అమ్మైనా తమ నష్టాన్ని పూడ్చుకోవాలని చూస్తున్నాయి సదరు సంస్థలు. ఇందులో భాగంగానే సేవా పన్ను విభాగం, ఆయన వాడిన విమానాన్ని బేరానికి పెట్టింది. మాల్యా తన వ్యక్తిగత సౌకర్యం కోసం వాడిన ఈ విమాన కనీసం ఖరీదుని కోటి రూపాయలుగా నిర్ణయించింది.   ముంబై విమానాశ్రయంలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఈ విమానంలో 25 మంది ప్రయాణించవచ్చునట. ప్రయాణీకుల కోసం ఇందులో సకల సదుపాయాలూ ఉన్నాయని అమ్మకందారులు ఊరిస్తున్నారు. అయితే ఈ విమానం ప్రస్తుతం ఏ స్థితిలో ఉందో ఎవరూ చెప్పడం లేదు. గత ఏడాది ఇలాగే విజయ్ మాల్యాకు చెందిన ఓ విమానాన్ని 22 లక్షలు పెట్టి ఓ తుక్కు వ్యాపారి కొనుగోలు చేశాడు. ఈసారి కూడా విజయ్ మాల్యా విమానాన్ని తుక్కువ్యాపారులే కొనుక్కుంటారా అన్నది వేచి చూడాలి. ఇంతకీ సేవా పన్ను విభాగానికి విజయ్ మాల్యా రుణపడ్డ మొత్తం ఎంతంటే.... 600 కోట్లు! మరి మిగతా 599 కోట్లని వసూలు చేసుకోవడానికి ఆ సంస్థ ఇంకేం అమ్మాల్సి వస్తుందో!

లాహోర్ దాడుల సందర్భంగా... ఫేస్‌బుక్‌ క్షమాపణలు

  లాహోర్‌ దాడుల సందర్భంగా, ఫేస్‌బుక్‌లోని ఒక ఫీచర్‌ సరిగా పనిచేయనందుకు ఆ సంస్ధ క్షమాపణలు తెలియచేసింది. ఫేస్‌బుక్‌లోని ‘సేఫ్టీ చెక్‌’ అనే ఈ ఎంపికద్వారా ఏదన్నా వైపరీత్యంలో చిక్కుకున్నవారు, తాము సురక్షితంగానే ఉన్నట్లు స్నేహితులకు తెలియచేసే అవకాశం ఉంటుంది. 2014లో మొదలైన ఈ ఫీచర్ గత ఏడాది చెన్నైలో ఏర్పడిన వరదల సమయంలో బాగా ప్రచారంలోకి వచ్చింది. అయితే నిన్న లాహోర్‌లోని ఓ పార్కులో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, ఈ ఎంపిక పనిచేయలేదు సరికదా, లాహోర్‌కి దూరదూరంగా ఉన్న ఎవరెవరికో ‘మీరు క్షేమంగా ఉన్న విషయాన్ని, మీ ఆప్తులకు తెలియచేయండి’ అంటూ ప్రకటనలు పంపింది ఫేస్‌బుక్‌. తమ డేటాబేస్‌లో ఏర్పడిన ఓ అవాంతరం వల్ల ఈ పొరపాటు జరిగిందంటూ ఫేస్‌బుక్‌ ప్రకటించింది. ఎవరు పడితే వారికి సంబంధం లేని ప్రకటనలు పంపినందుకు క్షమాపణలను కోరింది.

ఛేజింగ్ మొనగాడు మళ్లీ గెలిపించాడు. ఇండియా సెమీస్ కు..

  నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో టీం ఇండియా గెలిచింది. నిలిచింది. ఛేజింగ్ మొనగాడు కోహ్లీ( 82,51 బంతుల్లో ) జూలు విదిల్చడంతో, మరో ఐదు బంతులు మిగిలుండగానే, టీం ఇండియా సెమీస్ లో ప్రవేశించింది. 161 పరుగులతో బరిలోకి దిగిన టీం ఇండియాకు ఆరంభం చాలా నెమ్మదిగానే సాగింది. ధావన్ సిక్స్, ఫోర్ తో ఊపు మీద కనిపించినా, రోహిత్ మాత్రం బౌలర్లకు మరీ ఎక్కువ గౌరవం ఇచ్చి, బంతులు వృథా చేశాడు. ఈ దశలో ధావన్ క్యాచ్ తో కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. కోహ్లీని చూసిన తర్వాత విజయంపై విశ్వాసం పెరిగినా, యువీ, రైనా ఎలా ఆడతారోనన్న ఆందోళన భారత అభిమానుల్లో ఉంది. దాన్ని నిజం చేస్తే రైనా తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. యువరాజ్ కాలు పట్టేయడంతో ఇబ్బందిగా క్రీజులో కదిలాడు. ఒక సిక్స్ వేసినా, యువరాజ్ ఇన్నింగ్స్ నెమ్మదిగానే సాగింది. యువీ అవుట్ ముందు వరకూ ముందుకు కదలనట్టు కనిపించిన ఛేజింగ్, ధోనీ రాకతో మారిపోయింది. చకచకా స్ట్రైక్ రొటేట్ చేస్తూ, ఇద్దరూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. 18 బంతుల్లో 39 పరుగులు కావాల్సిన స్టేజ్ లో, 18 ఓవర్లో ఫాల్క్ నర్ బౌలింగ్ కు వచ్చాడు. ఈ ఓవర్ నుంచి ఇండియా 19 పరుగులు పిండుకుంది. తర్వాతి ఓవర్లో కౌల్టర్ నైల్ వేసిన పందొమ్మిదో ఓవర్లో మరో 16 పరుగులు కొట్టి, టార్గెట్ ను కరిగించేశారు ధోనీ, కోహ్లీ పెయిర్. లాస్ట్ ఓవర్ కు 4 పరుగులు కావాల్సి ఉండగా, ధోనీ తనకు అలవాటైన రీతిలో విన్నింగ్ రన్స్ గా బౌండరీ కొట్టి ఛేజ్ ను ముగించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా తన కెరీర్లోనే చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు. టీం ఇండియా మార్చి 31న వెస్ట్ ఇండీస్ తో సెమీ ఫైనల్లో తలపడనుంది.

సెమీస్ కు చేరాలంటే టీం ఇండియా టార్గెట్ 161 పరుగులు

  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా మొదటి నాలుగు ఓవర్లలోనే 50 పరుగులు చేసిన జోరు చూస్తే, 200 పరుగులు చేస్తుందేమో అనిపించింది. కానీ టీం ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి, ఆసీస్ ను 160 కే కట్టడి చేశారు. వార్నర్ వికెట్ కోల్పయిన తర్వాత ఆసీస్ మళ్లీ పుంజుకోలేదు. ఇండియా తురుపుముక్క అశ్విన్ ఒకే ఓవర్లో 22 పరుగులు సమర్పించుకోవడం విశేషం. దీంతో యువరాజ్, జడేజాలతోనే ధోనీ స్పిన్ ను లాగించేశాడు. ఆసీస్ 150 లోపే కట్టడి అయ్యేలా కనిపించినా, చివర్లో నెవిల్ 2 బంతుల్లో ఫోర్, సిక్స్ కొట్టడంతో, ఆస్ట్రేలియా స్కోర్ బోర్డ్ 160 పరుగులకు చేరుకుంది. పిచ్ స్లో గా ఉన్నప్పటికీ, హార్ధిక్ పాండ్యా బంతి బ్యాట్ మీదకు బాగా వస్తోందని చెప్పడంతో టీం ఇండియా ఛేజ్ ఇంట్రస్టింగ్ గా మారింది. పాండ్యా రెండు వికెట్లతో రాణించగా, నెహ్రా ఒక్క వికెట్టే తీసినా, అద్భుతంగా పరుగుల్ని నియంత్రించాడు. టోర్నీలో మొదటిసారి బౌలింగ్ వేస్తున్న యువరాజ్ తన మొదటి బంతికే స్టీవ్ స్మిత్ వికెట్ తీయడం విశేషం. ఆస్ట్రేలియా స్కోర్ : 160/6 (ఫించ్-43, మ్యాక్స్ వెల్-31)

వరల్డ్ టి20 : విండీస్ పై పసికూన ఆప్ఘాన్ విజయం

  టోర్నీ అంతా అద్భుతంగా ఆడి ఆకట్టుకున్న ఆప్ఘనిస్థాన్, వెళ్తూ వెళ్తూ ఇప్పటికే సెమీస్ కు చేరుకున్న విండీస్ కు ఝలక్ ఇచ్చింది. కేవలం 123 పరుగులే చేసిన ఆఫ్ఘాన్, విండీస్ ను 117 పరుగులకు కట్టడి చేసింది. ఆప్ఘాన్ బ్యాటింగ్ లో నజీబుల్లా జడ్రాన్ 48 పరుగులతో రాణించాడు. విండీస్ బౌలింగ్ లో బద్రీకి మూడు వికెట్లు దక్కాయి. నామమాత్రమపు మ్యాచ్ కావడంతో విండీస్ క్రిస్ గేల్ కు రెస్ట్ ఇచ్చింది. బ్యాటింగ్ లో బ్రావో(28) ఒక్కడే కాస్త పోరాడాడు. పసికూనగా ఎంటరైనా, వరల్డ్ కప్ టోర్నీ అంతా పోరాటపటిమతో ఆఫ్ఘాన్ ఆకట్టుకుంది. ఇంగ్లాండ్, సౌతాఫ్రికాలాంటి పెద్ద టీంలకు కూడా చెమటలు పట్టించింది. టోర్నీనుంచి నిష్క్రమించే ముందు ఇప్పటి వరకూ ఓటమిలేని విండీస్ ను మట్టికరిపించి గర్వంగా దేశానికి వెళ్లబోతోంది ఆప్ఘాన్ టీం.

టీం ఇండియా టార్గెట్ 115 పరుగులు..!

  మొహాలీలో వెస్టిండీస్ తో టి20 లో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 114 పరుగులకు ఆలౌటైంది. భారత విజయ లక్ష్యం 115 పరుగులు. ఇదేంటి ఆస్ట్రేలియాతో కదా మ్యాచ్ అనుకుంటున్నారా..? ఆ మ్యాచ్ కంటే ముందు, ఇండియా వెస్టిండీస్ ఉమెన్ మ్యాచ్ ఉంది. ఆ స్కోరే ఇది. టీం ఇండియా అమ్మాయిల్లో అనుజా పాటిల్, హర్మన్ ప్రీత్ కౌర్ మూడు వికెట్లతో రాణించారు. కష్టాల్లో ఉన్న వెస్టిండీస్ బాటింగ్ ను కెప్టెన్ టేలర్ 47 పరుగులు చేసి ఆదుకుంది. భారత ఇన్నింగ్స్ కూడా ప్రస్తుతం కష్టాల్లోనే నడుస్తోంది. 11 ఓవర్లు ముగిసేసరికి ఇండియా అమ్మాయిలు మూడు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేశారు. ఇంకో 53 బంతుల్లో      62 పరుగులు చేయాల్సి ఉంది. ఇప్పటికే ఇండియా విమెన్ ఉన్న గ్రూప్ లో ఇంగ్లాండ్ క్వాలిఫై అయిపోయింది. ఈ మ్యాచ్ ఇండియా నెగ్గితే, మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.

ఐసిస్ చెర నుంచి బయటపడ్డ పాల్మైరా

  సిరియాలోని పురాతన నగరం పాల్మైరా ఐసిస్ నుంచి సిరియా చేతిలోకి చేరింది. రష్యా దళాల సాయంతో సిరియా సైన్యం ఈ నగరాన్ని తిరిగి పొందగలిగింది. దీంతో ఐసిస్ పతనమౌతోందన్న అమెరికా వార్తలకు నిజం చేకూరింది. ఇప్పటికే పాల్మైరాలోని పురాతన కట్టడాల్ని ఐసిస్ నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. పురాతన నగరమైన పాల్మైరాను స్వాధీనం చేసుకోవడానికి సిరియా గట్టిగా పోరాడింది. ఈ పోరాటంలో దాదాపు 188 మంది సైనికుల్ని సిరిమా కోల్పోగా, ఐసిస్ లో 400 మంది మరణించారు. కేవలం వారసత్వ కట్టడాలున్న ప్రాంతమే కాక, జనావాసాలున్న ప్రాంతం కూడా పూర్తిగా తమ అధీనంలోకి వచ్చిందని సిరియా ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా ఐసిస్ కిందే ఉన్న మోసూల్ ను కూడా త్వరలోనే విడిపిస్తామని సిరియా ప్రభుత్వం చెబుతోంది.